ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎస్తేరు

1. మహాప్రభువైన అహష్వేరోషు పరిపాలనాకాలము రెండవయేట నీసాను నెల మొదటి దినమున మొర్దెకయికి ఒక కల వచ్చెను. బెన్యామీను తెగకు చెందిన యాయీరు, షిమీ, కీషు క్రమముగా ఇతని వంశకర్తలు.

2. ఇతడు షూషను నగరమున వసించుచున్న యూదుడు, రాజు ఆస్థానమున పెద్ద ఉద్యోగి.

3. పూర్వము బబులోనియా ప్రభువు నెబుకద్నెసరు, యూదా రాజు యెకోన్యాతో పాటు యెరూషలేమునుండి బందీలుగా కొనివచ్చిన వారిలో యితడు ఒకడు. మొర్దెకయి కన్న కల యిది:

4. భూమిమీద ఆర్తనాదము, గందర గోళము, ఉరుములు, భూకంపము, కలవరపాటు గోచరించెను.

5. రెండు మహా సర్పములు యుద్ధమునకు సన్నద్ధమై వచ్చి భయంకరముగా కేకలిడెను.

6. ఆ కేకలు విని నేలమీది జాతులన్ని ప్రోగై ధర్మమును పాటించు జాతిపై యుద్ధమునకు తలపడెను.

7. అది భూమిమీద చీకటి, బాధ, విచారము, పీడనము, కలవరపాటుతో కూడిన దుర్దినము.

8. ఆ ఉపద్రవము చూచి ధర్మ మును పాటించు జాతి మిక్కిలి భయపడి మరణమునకు సిద్ధమయ్యెను.

9. ఆ జాతి ప్రజలు దేవునికి మొరపెట్టిరి. ఆ మొర ఫలితముగా ఒక చిన్న చెలమనుండి వెలువడినదో అన్నట్లు పెద్ద యేరు పుట్టి పొంగిపారెను.

10. అంతట సూర్యుడు ఉదయింపగా వెలుగు కలిగెను. అప్పుడు దీనులైన ధర్మజాతి ప్రజలు ఔన్నత్యము పొంది శక్తిమంతులైన వారిని మ్రింగివేసెను.

11. ప్రభువు సంకల్పమును సూచించు ఇట్టి కల నుండి మేల్కొని మొర్దెకయి నిశితముగా ఆలోచింప మొదలిడెను. దాని భావము ఏమైయుండునా అని దినమంతయు తర్కించిచూచెను.

 1. బిగ్తాను, తేరేషు అను ఇరువురు నపుంసకులు రాజప్రాసాద ప్రాంగణమునకు కావలి కాయుచుండగా మొర్దెకయి వారి దాపున శయనించెను.

2. ఆ నపుంసకులు రాజు మీద కుట్ర పన్నుచుండిరి. మొర్దెకయి ఆ రహస్యమును పసికట్టెను. వారు అహష్వేరోషును హత్యచేయు పన్నాగమున నున్నారని గ్రహించి ఆ సంగతి రాజునకు విన్నవించెను.

3. రాజు ఆ ఇరువురిని బాధలకు గురిచేయగా వారు తమ తప్పిదమును ఒప్పుకొనిరి. అహష్వేరోషు వారిని ఉరి తీయించెను.

4. అతడు ఈ ఉదంతమునెల్ల రాజకార్యముల దస్తావేజున వ్రాయించెను. మొర్దెకయి కూడ ఆ సంగతిని లిఖించి యుంచెను.

5. రాజు మొర్దెకయికి ఆస్థానమున ఉద్యోగమిచ్చి బహుమతులతో సత్కరించెను.

6. అప్పుడు అగారు వంశజుడు హమ్మెదాతా కుమారుడైన హామాను అనువాడు రాజు మన్ననకు పాత్రుడైయుండెను. అతడు మాత్రము ఇరువురు నపుంసకులను చంపించినందులకు గాను మొర్దెకయికి కీడుచేయతల పెట్టెను.

1. అది అహష్వేరోషు రాజు పరిపాలనాకాలము. అతని రాజ్యము నూట యిరువది యేడు రాష్ట్రములతో హిందూదేశమునుండి కూషు వరకు వ్యాపించియుండెను.

2. ఆ రాజు ఘాషను నగరమును తన రాజధానిగా సింహాసనాసీనుడై రాజ్యము చేయు చుండెను.

3. అతడు తన యేలుబడి మూడవయేట గొప్పవిందుచేసి మంత్రులను ఉద్యోగులను ఆహ్వా నించెను. పర్షియా, మాదియా రాజ్యముల సైన్యాధిపతులను రాష్ట్రపాలకులను, ప్రముఖులను విందునకు పిలిపించెను.

4. ఆ విందు ఆరునెలలపాటు కొనసాగెను. ఆ ఉత్సవము నందు రాజు తన సిరిసంపదలను, తన మహావైభవమును ఎల్లరియెదుట ప్రదర్శించెను.

5. అటు తరువాత రాజు తన రాజధాని షూషను నగరమునందలి పౌరులకు, ధనికులకు, పేదలకు మరియొక విందు చేయించెను. ఈ విందు రాజు ఉద్యానవనమున ఏడుదినములపాటు నడచెను.

6. ప్రాసాద ప్రాంగణమును సుందరముగా అలంకరించిరి. నీలపుతెరలు, తెల్లనితెరలు, మేలిమి పట్టుదారములకు కూర్చి వానిని పాలరాతి కంబముల మీది వెండి కడియములనుండి వ్రేలాడగట్టిరి. చలువరాళ్ళను రకరకముల రంగులతో కూడిన విలువగల రాళ్ళను పరచిన నేలమీద వెండిబంగారములు పొదిగిన ఆసన ములు అమర్చిరి.

7. పానీయములు సేవించుటకు పలువిధములైన పానపాత్రములు కొనివచ్చిరి. రాజు హోదాకు తగినట్లుగా ద్రాక్షసారాయమును సమృద్ధిగా సరఫరా చేసిరి.

8. మధువునకు పరిమితియేలేదు. ఎవరికి వలసినంత వారు సేవింపవచ్చునని రాజు ముందుగనే పరిచారకులతో చెప్పెను.

9. అప్పుడు వష్టిరాణి ప్రాసాదము లోపల స్త్రీలకు మరియొక విందు ఏర్పాటు చేసెను.

10. ఏడవనాడు రాజు ద్రాక్ష సారాయము సేవించి సంతుష్టిచెంది తన సేవకులైన ఏడుగురు నపుంసకులను పిలిపించెను. వారి పేర్లు మెహూమాను, బిస్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, సేతారు, కర్కసు.

11. వారందరు వెళ్ళి కిరీటధారిణియైన వష్టిరాణిని తన ఎదుటికి తోడ్కొనిరావలెనని రాజు ఆజ్ఞాపించెను. ఆ రాణి మిగుల సౌందర్యవతి. అతిథులుగా వచ్చిన అధికారులకు, ప్రజలకు, ఆమె సౌందర్యమును చూపింపవలెనని రాజు వేడుకపడెను.

12. కాని సేవకులు వెళ్ళి రాజు ఆనతి ఎరిగింపగా వష్టిరాణి ప్రజలెదుటికి రానొల్లదయ్యెను. కనుక రాజు ఉగ్రుడైపోయెను.

13. అతడు నీతికోవిదులను, సలహా అడిగెను. న్యాయాన్యాయములను విచారించునపుడు న్యాయవేత్తలను సంప్రదించుట అతని ఆచారము.

14. రాజు పిలిపించిన న్యాయవేత్తల పేర్లు: కర్షేనా, షెతారు, అద్మాతా, తార్షీషు, మెరెసు, మర్సేనా, మెమూకాను. రాజు వీరిని తరచుగా సంప్రదించెడివాడు. ఈ ఏడుగురు మాదీయ, పర్షియాలకు అధికారులు, ఆ సామ్రాజ్యమున ఉన్నతపదవులు అలంకరించినవారు.

15. అతడు వారిని చూచి "అహష్వేరోషు ప్రభువు సేవకుల నంపగా వష్టిరాణి అతని ఆజ్ఞను త్రోసిపుచ్చెను. న్యాయశాస్త్రము ప్రకారము ఆమెకెట్టి శిక్ష విధింపవలెను?” అని ప్రశ్నించెను.

16. అప్పుడు రాజు, రాజోద్యోగులు వినుచుండగా మెమూకాను “వష్టిరాణి ప్రభువుల వారికి మాత్రమేగాక రాజకీయోద్యోగులకును, ఈ సామ్రాజ్యమునందలి మగవారికెల్లరకును కూడ తలవంపులు తెచ్చెను.

17. రాణి చరితము విని ఇక ఈ సామ్రాజ్య మునందలి స్త్రీలెల్లరు, తమ భర్తలను నిర్లక్ష్యము చేయుట తథ్యము. అహష్వేరోషు ప్రభువు ఆజ్ఞాపించినను వష్టిరాణి అతని సమ్ముఖమునకు రాలేదట అని ఆడువారెల్లరు గుసగుసలాడుకొందురు.

18. మాదీయ పారశీకరాజ్యముల అధికారుల భార్యలుకూడ తెల్లవారక మునుపే రాణి ధిక్కార వార్తలను విందురు. రేపటినుండి వారును తమ భర్తల ఆజ్ఞలను తిరస్కరింతురు. ఎల్లెడల భార్యలు తమ భర్తలను చులకనచేయగా ఆ భర్తలు తమ భార్యలమీద మండిపడుదురు.

19. కనుక ప్రభువుల వారికి సమ్మతమగునేని వష్టిరాణి మరల ఏలినవారి సమ్ముఖమునకు రాగూడదని శాసనము చేయింపుడు. దీనిని మాదీయ పారశీక శాసనములలో చేర్చి తిరుగులేని దానినిగా చేయింపుడు. దేవరవారు ఆమెకంటె యోగ్యురాలైన వనిత నెన్నుకొని రాణిగా నియమింపుడు.

20. ఈ రాజశాసనమును సువిశాలమైన మన సామ్రాజ్యము అంతట ప్రకటన చేయింపుడు. అప్పుడు స్త్రీలెల్లరు, తమ భర్తలు ధనికులైనను, దరిద్రులైనను వారి చెప్పు చేతలలో ఉందురు” అని పలికెను.

21. రాజునకు, అతని అధికారులకు ఈ ఉపదేశము నచ్చెను. కనుక రాజు మెమూకాను చెప్పినట్లే చేయించెను.

22. అతడు తన రాష్ట్రములకెల్ల లేఖలు పంపించెను. ప్రతి రాష్ట్రమునకు, అచటి భాషలో, లిపిలో జాబులు వ్రాయించెను. ప్రతి భర్త తన యింట సర్వాధికారము నెరపునని తెలియజేయించెను.

 1. ఈ సంగతులు జరిగిన పిమ్మట రాజు కోపముచల్లారెను. అతడు వష్టి అపరాధమును, తాను చేయించిన శాసనమును గూర్చి తలపోయుచుండెను.

2. అప్పుడు రాజు సలహాదారులు “ప్రభువులవారు అందగత్తెలయిన కన్నెలను వెదకింపవలెను.

3. ఈ కార్యమునకుగాను మన రాష్ట్రములన్నిట ఉద్యోగులను నియమింపుడు. వారు సౌందర్యవంతులైన కన్నెలను వెదకి ఈ షూషను రాజధానియందలి అంతఃపురమునకు కొనివత్తురు. స్త్రీల మీద అధికారిగనుండు నపుంసకుడు హేగె అధీనమున వారినెల్ల నుంచుడు. అతడు ఆ యువతులకు అలంకరణ ద్రవ్యములను సరఫరా చేయును.

4. వారిలో ఏలినవారికి నచ్చిన కన్య వష్టికి బదులుగా రాణియగును” అని ఆలోచన చెప్పిరి.ఆ ఉపదేశము రాజునకు నచ్చెను. అతడు వారు చెప్పినట్లే చేయించెను.

5. షూషను దుర్గమున బెన్యామీను తెగకు చెందిన మొర్దెకయి అను యూదుడు కలడు. యాయీరు, షిమీ, కీషు అతని మూలపురుషులు.

6.పూర్వము యెరూషలేము నుండి నెబుకద్నెసరు రాజు కొనివచ్చిన బందీలలో యూదారాజు యెకోన్యాతోపాటు ఇతడును ఒకడు.

7. ఇతని పినతండ్రి కూతురే ఎస్తేరు అను మారుపేరు గల హదస్సా, ఎస్తేరు తల్లిదండ్రులు గతింపగా మొర్దెకయి ఆమెను కుమార్తెగా స్వీకరించి పెంచి పెద్దచేసెను. ఆ యువతి రూపవతి.

8. రాజు శాసనము ప్రకారము చాలమంది యువతులను షూషను దుర్గమునకు కొనివచ్చిరి. ఎస్తేరు కూడ వారిలో నొకతె. ఆమెను కూడ రాజ అంతఃపుర స్త్రీలపై అధికారిగా నున్న హేగె అధీనమున నుంచిరి.

9. అతనికి ఎస్తేరు నచ్చెను. ఆమె అతని మన్నన పొందెను. కనుక అతడు ఆ యువతికి శీఘ్రముగా అలంకరణ ద్రవ్యములు, విశిష్ట భోజనములు పంపించెను. పైగా రాజు దాసీజనమునుండి ఏడుగురు పనికత్తెలనుగూడ ఎస్తేరుకు సేవ చేయుటకు హేగె నియమించెను. అతడు వారిని అందరిని అంతఃపురమున మేలైన విడిదికి తరలించెను.

10. మొర్దెకయి ఆజ్ఞపై ఎస్తేరు తాను యూదుల ఆడుపడుచునని ఎవరికి చెప్పలేదు.

11. అతడు ప్రతిదినము అంతఃపుర ప్రాంగణమున పచార్లు చేయుచు ఎస్తేరు స్థితిగతులను తెలిసి కొనెడివాడు.

12. పండ్రెండు నెలలు కడచిన తరువాత, యువతులందరిని వంతులవారిగా రాజువద్దకు కొనిపోవుదురు. ఆ మధ్యకాలమున సౌందర్యము పెంపొందించు కొనుటకుగాను వారు ఆరు నెలలపాటు గోపరసముతోను, ఆరునెలలపాటు వివిధ సుగంధతైలములతోను దేహ మర్దనము చేయించుకొనెడివారు.

13. అంతఃపురమునుండి రాజప్రాసాదమునకు పోవునపుడు, ప్రతియువతికి ఆమె కోరుకొనిన వస్త్రములు, ఆభరణములు ఒసగెడివారు.

14. ప్రతి యువతి రాత్రి రాజప్రాసాదమునకు పోవును. మరునాటి ప్రొద్దుట ఆమెను మరియొక అంతఃపురమునకు కొనిపోవుదురు. అట రాజు ఉపపత్నులు వసింతురు. అచట అధికారి నపుంసకుడగు షాస్గసు. ఆ రెండవ అంతఃపురము చేరుకొనిన యువతి రాజు మనసుపడి పేరుచెప్పి ప్రత్యే కముగా పిలిపించు కొనిననే తప్ప మరల అతని యొద్దకు వెళ్ళజాలదు.

15. ఇట్లుండగా రాజునొద్దకు వెళ్ళుటకు ఎస్తేరు వంతువచ్చెను. ఆమె అబీహాయిలు పుత్రిక. ఇతని అన్నకుమారుడైన మొర్దెకయి ఎస్తేరును పుత్రికగా స్వీకరించి పెంచెనుగదా! ఎస్తేరును కంటితో చూచిన వారందరు ఆమెను మెచ్చుకొనెడివారు. తనవంతు వచ్చినపుడు ఎస్తేరు అంతఃపురపాలకుడు హేగె యిచ్చిన ఉడుపులు తప్ప మరేమియు ధరింపలేదు.

16. అహష్వేరోషు రాజు పరిపాలనాకాలము ఏడవయేట తెబేతు అను పదియవనెలలో ఎస్తేరును రాజప్రాసాదమునకు కొని వచ్చిరి.

17. యువతులందరి కంటె ఎస్తేరు రాజునకు అధిక ప్రీతి కలిగించెను. ఆమె రాజు మన్నన పొందెను.

18. కనుక అతడు ఎస్తేరు శిరస్సుమీద కిరీటము పెట్టి వష్టి స్థానమున ఆమెను రాణిగా నియమించెను. ఆమె గౌరవార్ధము గొప్పవిందు చేయించి అధిపతులను, ఉద్యోగులను ఆహ్వానించెను. సంస్థానములన్నింటికి సెలవు దినము ప్రకటించెను. తన హోదాకు తగినట్లుగా యోగ్యులకు బహుమతులు ఒసగెను.

19-20. యువతులందరివలెనే ఎస్తేరు కూడ రెండవ అంతఃపురమునకు వెళ్ళెను. కాని ఆమె తాను యూదుల ఆడుపడుచునని అట నెవరికిని తెలియనీయలేదు. అది మొర్దెకయి ఆజ్ఞ. చిన్ననాడు అతని అదుపులో నున్నప్పటివలె అంతఃపురమునకు కూడ ఆమె అతని ఆజ్ఞ పాటించెను.

21. మొర్దెకయి రాజ్య వ్యవహారములను పరిశీలించు ఉద్యోగిగా నియుక్తుడై ప్రాసాదమున పనిచేయుచుండెను. అప్పుడు రాజు నివాసప్రాంగణమునకు కావలికాయు నపుంసకులు బిగ్తాను, తేరేషు రాజుపై ఆగ్రహము చెంది అతనిని హత్య చేయచూచుచుండిరి.

22. మొర్దెకయి ఆ సంగతి పసికట్టి ఎస్తేరునకు తెలుపగా ఆమె రాజునకు విన్నవించెను.

23. రాజు ఆ నపుంసకులను పరీక్షించి చూడగా ఆ ఆరోపణ నిజమేనని తేలెను. కనుక ఆ ఇరువురిని ఉరితీయించిరి. ఆ ఉదంతమును రాజు సమక్షముననే రాజ కార్యముల దస్తావేజున లిఖించిరి.

 1. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు రాజు హామాను అనునతనిని ప్రధానమంత్రిగా నియమించెను. ఇతడు హమ్మెదాతా కుమారుడైన, అగాగు వంశజుడు.

2. ఆస్థానమునందలి ఉద్యోగులెల్లరు హామానునకు మోకరిల్లి దండము పెట్టవలెనని రాజు కట్టడచేసెను. మొర్దెకయి ఒక్కడు తప్ప మిగిలిన రాజోద్యోగులెల్లరు అట్లే చేయుచుండిరి.

3. కనుక వారు “నీవు రాజాజ్ఞ ధిక్కరింతువేల?” అని మొర్దెకయిని అడిగిరి.

4. వారు ప్రతిరోజు మొర్దెకయికి సలహా ఇచ్చుచున్నను, అతడు వారి మాట లెక్క చేసెడి వాడు కాదు. తాను యూదుడను అని మాత్రము బదులు చెప్పెడి వాడు. ఆ ఉద్యోగులు మొర్దెకయి తన పట్టుదలనెట్లు నిలబెట్టుకోగలడో చూతమని ఆ సంగతిని హామానునకు తెలియజేసిరి.

5. మొర్దెకయి తనకు మోకాలు వంచి దండము పెట్టుటలేదని గ్రహించి హామాను మండిపడెను.

6. అతడు మొర్దెకయి యూదజాతికి చెందినవాడని తెలిసికొని అతనినొక్కనినే వధించిన చాలదనియు అహష్వేరోషు సామ్రాజ్యము నుండి ఆ జాతినెల్ల రూపుమాపవలెననియు నిశ్చయించుకొనెను.

7. అహష్వేరోషు పరిపాలనాకాలము పండ్రెండవయేట నీసాను పేరుగల మొదటినెలలో యూదుల వధకు అనువైన నెలను, తేదీని నిర్ణయించుటకు హామాను చీట్లు ('పూరు' అనగా చీటి) వేయించెను. అదారు పేరుగల పండ్రెండవ నెలలో వచ్చు పదుమూడవ రోజు హత్యకు అనువైన దినమని నిర్ణయించిరి.

8. కనుక హామాను రాజుతో “ప్రభువులవారి సామ్రాజ్యమున, ప్రతి రాష్ట్రమునను చెల్లాచెదరైయున్న ఒకానొక జాతి ప్రజలు కాన్పింతురు. వారి ఆచార వ్యవహారములు ఇతరజాతుల ఆచారముల వంటివికావు. పైగా వారు రాజశాసనములు పాటించుటలేదు. అట్టి వారిని క్షమించుట దేవరవారికి క్షేమము కాదు.

9. ఏలినవారికి సమ్మతగునేని ఈ జాతిని నిర్మూలింపవలెనని శాసనము చేయుడు. వ్యయమునకుగాను నేను పదివేల వెండినాణెములను రాజోద్యోగుల ద్వారా కోశాగారమునకు ముట్టచెప్పెదను” అనెను.

10. ఆ మాటలకు ప్రభువు రాజముద్ర గల తన అంగుళీయకమును తీసి యూదులకు బద్దశత్రువైన హమ్మెదాతా కుమారుడును అగాగు వంశజుడునైన హామానునకు ఇచ్చెను.

11. అతనితో “ఆ ప్రజ, వారి సొత్తుగూడ నీ అధీనముననే యుండును. వారిని నీ ఇష్టము వచ్చి నట్లు చేయుము” అనెను. .

12. మొదటి నెల పదుమూడవ దినమున హామాను రాజ లేఖకులను పిలిపించి వారిచేత రాజ శాసనపు ప్రతులను వ్రాయించెను. ఆ ప్రతులు సామ్రా జ్యమునందలి వివిధ అధిపతులకును, అచటి ముఖ్య ఉద్యోగులకును పంపునవి కనుక వానిని వివిధ రాష్ట్రముల భాషలలోను, లిపులలోను వ్రాయించెను. వానిని రాజు పేరుతోనే వ్రాయించి, అతని అంగుళీయకముతో ముద్రించెను.

13. వేగముగా పరుగెత్తు వార్తావహులు ఆ ప్రతులను వివిధ సంస్థానములకు కొనిపోయిరి. నిర్ణీతదినమున, అనగా అదారు పేరు గల పండ్రెండవ నెలలో పదుమూడవ రోజున పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పిల్లలు అను వ్యత్యాసమును పాటింపక యూదులనెల్ల వధింపవలెననియు, దయాదాక్షిణ్యములు చూపక వారినెల్ల తుదముట్టించి వారి ఆస్తి పాస్తులను స్వాధీనము చేసుకోవలెననియు ఆ తాకీదులలో వ్రాయబడియుండెను.

 1. రాజశాసనమిది: “హిందూ దేశమునుండి కూషు వరకు వ్యాపించియున్న నూట యిరువదియేడు సంస్థానముల పాలకులకును, వారి క్రింది అధికారులకును, మహాప్రభువైన అహష్వేరోషు వ్రాయునది.

2. మేము చాల జాతులకు ప్రభువులమై ప్రపంచమంతటిని యేలు వారము. అయినను అధికార గర్వముతో ఉప్పొంగక న్యాయసమ్మతము గాను, దయాపూర్వకముగాను పరిపాలన చేయగోరెదము. మా ప్రజలెట్టి ఉపద్రవములకు గురికాక, సుఖముగా జీవింపవలెననియు, మా సామ్రాజ్యమున శాంతిభద్రతలు నెలకొనగా జనులెల్లరు ఒక మూల నుండి మరియొక మూలవరకు సురక్షితముగా రాకపోకలు సలుపవలెననియు మా కోరిక. లోకములోని జనులెల్లరు వాంఛించు శాంతి ఈ సామ్రాజ్యమునను నెలకోనవలెననియే మా అభీష్టము.

3. ఈ ఆశయమునెట్లు సాధింపవలెనాయని మా సలహాదారులను అడిగితిమి.వారిలో ఒకని పేరు హామాను. ఇతడు చాల వివేకము, రాజభక్తి, విశ్వసనీయత కలవాడు. అధికారమున మా తరువాత మాయంతటివాడు.

4. ఈ హామాను మా సామ్రాజ్యమునందలి వివిధ జాతులతో కలిసి జీవించు విరోధిజాతి ఒకటి కలదని మాకు విన్నవించెను. మరియు వారి ఆచార వ్యవహారములు ఇతర జాతుల ఆచారవ్యవహారముల కంటె భిన్నముగా నుండుననియు, వారెల్లప్పుడు రాజశాసనములను ధిక్కరించుచుందురనియు, ఈ రాజ్యమును ఏకము చేయవలెనన్న నా సత్సంకల్పమును ఎల్లప్పుడు చెరచుచుందురనియు అతడు తెలిపెను.

5. కనుక ఈ ఒక్కజాతి మా యేలుబడిలోని ఇతర జాతులన్నిటికి విరోధముగా వర్తించుచున్నదనియు, దాని ఆచార వ్యవహారములు దోష దూషితముగానున్నవనియు మేము గుర్తించితిమి. ఈ జాతి మాకు వ్యతిరేకముగా ఘోరమైన అపరాధములు చేయుచున్నదనియు, దీని వలన మా సామ్రాజ్య భద్రతకే ముప్పు వాటిల్లనున్నదనియు మేము గ్రహించితిమి.

6. కనుక మా శ్రేయస్సు నిమిత్తమై మేమే స్వయముగా ఎన్నుకొనగా మాకు ప్రధానోద్యోగియు, రెండవ తండ్రి వంటివాడునగు హామాను వ్రాయించిన ఈ తాకీదులలో పేర్కొనబడిన జాతి జనులందరిని ఎట్టి దయాదాక్షిణ్యములు చూపకుండ, వారి భార్యలను, పిల్లలను కత్తికి ఎరజేయవలెను. ఈ సంవత్సరము వచ్చు అదారు పేరుగల పండ్రెండవ నెలలో పదునాలుగవ దినమున ఈ కార్యమును జరుపవలెను. ఇది మా ఆజ్ఞ,

7. ఈ రీతిగా పూర్వమునుండి మమ్ము ఎదిరించుచు వచ్చిన ఈ దుష్టజాతిపీడ నేటితో విరుగడకాగా, ఇకమీదట మా సామ్రాజ్యము శాశ్వతముగా శాంతి భద్రతలను అనుభవించును గాక!”

14. ఈ శాసనమును ప్రతి రాష్ట్రమున ప్రకటింప వలెననియు నిర్ణయించిరి. అట్లు చేసినచో ప్రతి సంస్థానము నిర్ణీతదినమున యూదులను వధించుటకు సిద్ధముగా ఉండునని వారి తలపు.

15. రాజాజ్ఞపై వార్తావహులు త్వరపెట్టబడి పై శాసనపు తాకీదులను వివిధ సంస్థానములకు కొనిపోయిరి. మొదట రాజధాని షూషను దుర్గముననే రాజశాసనమును ప్రకటించిరి. ఒక ప్రక్క రాజు హామానుతో విందారగించుచు ఆనందించుచుండగా మరియొక ప్రక్క షూషనునగరము ఈవార్త విని గగ్గోలుపడెను.

 1. మొర్దెకయి జరిగిన సంఘటన గూర్చి విని సంతాపముతో బట్టలు చించుకొనెను. గోనె తాల్చి తలమీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చుచు, పురవీధులగుండ నడచివచ్చి ప్రాసాద ప్రవేశద్వారము చేరెను.

2. గోనె తాల్చినవారు రాజప్రాసాదమున అడుగిడరాదను నియమము కలదు కనుక అతడు లోనికి పోలేదు.

3. సామ్రాజ్యపు సంస్థానములలో రాజశాసనమును ప్రకటింపగనే, అచటి యూదులు కూడ భోరున ఏడ్చిరి. వారు ఉపవాసముండి పరితాపముతో శోకించుచు గోనె తాల్చి బూడిద మీద కూర్చుండిరి

4. ఎస్తేరు పనికత్తెలు మరియు నపుంసకులు మొర్దెకయి దుఃఖమును గూర్చి తెలియజేయగా ఆమె మిగుల విచారపడెను. అతడు తొడుగుకొనుటకు కొన్ని బట్టలు పంపెను. కాని అతడు వానిని పుచ్చుకొనలేదు.

5. అప్పుడు ఆమె రాజు తనకు పరిచారకునిగా నియమించిన హతాకు అను నపుంసకుని పిలిచి మొర్దెకయి చెంతకుపోయి అతడెందుకు దుఃఖించుచున్నాడో, యేమి జరిగినదో తెలిసికొనిరమ్మని చెప్పెను.

6. హతాకు వెళ్ళి ప్రాసాదము ప్రవేశద్వారము చెంత నిల్చియున్న మొర్దెకయిని కలిసికొనెను.

7. అతడు తనకు సంభవించిన కష్టము సంగతిని, యూదులను చంపినచో రాజుకోశాగారమునకు సొమ్ము చెల్లింతునన్న హామాను సంగతిని తెలియజెప్పెను.

8. యూదులను తెగటార్చుటకు షూషను దుర్గమున ప్రకటింపబడిన రాజశాసనపు ప్రతిని గూడ హతాకునకు ఇచ్చి ఎస్తేరునకు చూపుమని చెప్పెను. ఆమె రాజు చెంతకు పోయి యూదులను కరుణింపవలసినదిగా మనవి చేయవలెననియు అతనితో నుడివెను. “నీ పూర్వ చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకొనుము. నేను చిన్న నాడు నిన్ను పెంచి పెద్దచేసితిని. ఈ రాజ్యమున రెండవ స్థానమున నున్న హామాను మనలను నాశనము చేయవలెనని రాజునకు విన్నపము చేసెను. కనుక నీ దేవుని ప్రార్ధింపుము. రాజునకు మనవిచేసి, మమ్ము చావునుండి తప్పింపుము” అని చెప్పుమనెను.

9. హతాకు తిరిగివచ్చి మొర్దెకయి పలుకులను ఎస్తేరునకు ఎరిగించెను.

10. ఆమె మొర్దెకయికి ఈ సందేశము పంపించెను:

11. “రాజు పిలువకయే ప్రాసాద అంతర్భాగములోనికి పోయి అతనిని దర్శింప సాహసించు పురుషునికిగాని, స్త్రీకిగాని ఒక్కటే ఒక శిక్ష - మరణము. అట్టి పట్టున రాజు కరుణించి తన బంగారుదండమునెత్తి ఎవరివైపు చూపునో వారిని మాత్రము ప్రాణములతో వదలివేయుదురు. రాజు సలహాదారులు మొదలుకొని అతని రాజ్యములోని సామాన్య ప్రజలవరకు ఎల్లరకును ఈ నియమము తెలియును. మరి కడచిన ముప్పదినాళ్ళనుండియు రాజు నన్ను తనచెంతకు పిలిపించుకోలేదు.”

12. ఎస్తేరు సందేశము మొర్దెకయికి అందెను.

13. అతడు ఈ క్రింది ప్రతి సందేశమును పంపెను: “నీవు సురక్షితముగా రాజసౌధమున ఉన్నంత మాత్రమున యూదులలో నీవు ఒక్కదానవే తప్పించుకో గలవని భావింపవలదు.

14. ఇట్టి తరుణమున నీవు నోరు కదపవేని యూదులకు మరియొక దిశనుండి రక్షణము లభించితీరును. కాని నీవు తప్పకచత్తువు. నీ కుటుంబము పేరును మాసిపోవును. అయినను ఇప్పుడు నీవు రాణివైనది ఇట్టి గడ్డుకాలమున మమ్ము ఆదుకొనుటకేనేమో ఎవరు ఎరుగుదురు?'

15.ఎస్తేరు మొర్దెకయికి మరల ఈ క్రింది సందేశము పంపెను:

16. “నీవు వెళ్ళి షూషను నగరములోని యూదులనెల్ల ప్రోగుచేయుము. మీరెల్లరు ఉపవాస ముండి నా కొరకు ప్రార్థనచేయుడు. మూడునాళ్ళ పాటు రేయింబవళ్లు ఏమి ముట్టుకొనక కటిక ఉపవాసముండుడు. నా దాసీ జనము, నేను అదే రీతిని ఉపవసింతుము. మూడు నాళ్ళు కడచిన పిదప రాజ శాసనమును గూడ ధిక్కరించి నేనతని సన్నిధికి వెళ్లెదను. అందుకుగాను నేను చావ వలసి వచ్చినచోచత్తును.”

17. అంతట మొర్దెకయి వెడలిపోయి ఎస్తేరు చెప్పినట్లే చేసెను.

 1. అప్పుడు మొర్దెకయి ప్రభువు మహాకార్యములను తలంచుకొని ఈ క్రింది రీతిగా ప్రార్ధన చేసెను:

2. "ప్రభూ! నీవు అన్నింటిమీద అధికారము కలవాడవు. ఈ ప్రపంచమెల్ల నీకు లోబడియుండును. నీవు యిస్రాయేలును రక్షింపబూనినచో నీకు అడ్డురాగలవాడెవడు? 

3. నీవు భూమ్యాకాశములను సృజించితివి. నేలమీద విచిత్ర వస్తువులన్నింటిని చేసితివి.

4. అన్నింటికిని నీవే ప్రభుడవు. నిన్నెదిరింపగలవాడెవడు?

5. ప్రభూ! నీవెరుగనిదేమున్నది? నీకన్నియు తెలియును. పొగరుబోతుతనముతోగాని, కీర్తికాంక్షతోగాని గర్వాత్ముడైన హామానునకు నేను నమస్కారములు నిరాకరింపలేదు.

6. యిస్రాయేలు ప్రజలను రక్షించుటకై నేనతని చెప్పులవారును ముద్దిడుటకైన వెనుకాడను.

7. నరుని దేవునికంటె అధికుని చేయనొల్లక నేనిట్టి కార్యమునకు తలపడవలసివచ్చెను. నీకు తప్ప వేరొకనికి నేను నమస్కరింపను. ఇట్లు చేయుట గర్వమువలన కాదుగదా!

8. కనుక అబ్రహాము దేవుడవు, రాజువునైన ప్రభూ! ఇప్పుడు నీ యీ ప్రజలను కాపాడుము. శత్రువులు మమ్ము నాశనము చేయబూనిరి. అనాదినుండి నీవు ఎన్నుకొనిన ప్రజలను సంహరింపబూనిరి.

9. నాడు ఐగుప్తున నీవు విముక్తులను జేసి, నీ వారిగా స్వీకరించిన ఈ ప్రజలను, నేడు అనాదరము చేయుదువా?

10. ప్రభూ! నా మొర విని, నీవు ఈ జనమును కరుణింపుము. మా దుఃఖమును సంతోషముగా మార్చుము. అప్పుడు మేము బ్రతికి బయటపడి నిన్ను కీర్తింతుము. నిన్ను స్తుతించువారిని చావనిచ్చి వారి నోళ్ళు మూయింతువా?”

11. వారి చావు వారి కనులెదుట కన్పింపగా యిస్రాయేలీయులు అందరు మహారోదన చేసిరి.

 1. ఎస్తేరు రాణి కూడ మరణభయము వలన క్రుంగిపోయి ప్రభువును ఆశ్రయించెను.

2. ఆమె తన వైభవోపేతములైన వస్త్రములను తొలగించి, శోకవస్త్రములను తాల్చెను. సుగంధతైలములకు బదులుగా తలమీద బూడిద, పేడ అలముకొనెను. ఆమె దేహము దీనాకృతిని పొందెను. పూర్వము తాను అందముగా అలంకరించుకొనిన అవయవములను ఇప్పుడు విడిపోయిన కురులతో కప్పుకొనెను.

3-4. ఆమె యిస్రాయేలు ప్రభువైన దేవునకిట్లు మనవి చేసెను: “ప్రభూ! నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయకుడెవ్వడు?

5. సకలజనులనుండియు, నీవు యిస్రాయేలీయులనే ఎన్నుకొంటివనియు, సకలజాతుల మూలపురుషుల నుండియు, మా పితరులనే నీ జనముగా, స్వీకరించితివనియు, నీవు చేసిన ప్రమాణములెల్ల నిలబెట్టుకొంటివనియు బాల్యమునందే మావారు నాకు విన్పించిరి.

6-7. కాని మా ప్రజలు నీకు ద్రోహము చేసి అన్యజాతుల దైవములను కొలువగా నీవు మమ్ము ఆ జాతులకు బానిసలుగా చేసితివి. ప్రభూ! నీ శిక్ష సముచితముగనేయున్నది.

8-9. కాని మా శత్రువులు మా దీనదాస్యమువలన సంతృప్తి చెందరైరి. వారు నీ నిర్ణయములను రద్దుచేతుమనియు, నిన్ను స్తుతించు మా నోళ్ళు మూయింతుమనియు, మహిమాన్వితమైన నీ దేవాలయమును, బలిపీఠమును నిర్మూలింతుమనియు, తాము కొలుచు దైవములకు బాసచేసిరి.

10. వ్యర్ధములైన ఆ విగ్రహములను కీర్తింపుడని, వారు అన్యజాతులను పురికొల్పిరి. మానవమాత్రుడైన ఒక రాజును నిరతము సన్నుతించుటకు పాల్పడిరి.

11. ప్రభూ! నీవు మాత్రము ఈ వ్యర్ధములైన విగ్రహములకు నీ పాలితులను లొంగనీయకుము. శత్రువులు మా పతనమును చూచి నవ్వకుందురుగాక! వారు త్రవ్విన గోతిలో వారే పడుదురు గాక! ఈ కుతంత్రము పన్నిన నాయకుడే కూలి పోవునుగాక! 

12. ప్రభూ! మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బలసామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము!

13. సర్వశక్తిమంతుడవు, దేవుడవునైన ప్రభూ! నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో అడుగిడనున్న నాకు సముచితముగా మాట్లాడు శక్తిని దయచేయుము. ఆ రాజు కోపమును మా శత్రువు మీదికే మరల్పుము. ఆ పగతుడును, అతని బలగమును, అణగారిపోవునట్లు చేయుము.

14. ప్రభూ! నీ హస్తబలముతో మా ప్రజను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము.

15. నీవు అన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారములేని అన్యజాతివాని పొందు నాకసహ్యము కలిగించును.

16. పదవీ సూచకముగా రాజదర్బారున నేను ఫాలభాగమున దాల్చు పట్టిక నాకు ఏవగింపు పుట్టించును. మురికిబట్టతో సమానముగా నెంచి ఏకాంతముగా నున్నపుడు నేను దానిని అంటనొల్లను.

17. హామాను చేసిన విందులో నీ దాసురాలనైన నేను పాల్గొనలేదు. రాజు విందును నేనంగీకరింపలేదు. అతడు దేవతలకు అర్పించిన ద్రాక్ష సారాయమును నేను సేవింపలేదు.

18. ఇచటికి వచ్చినప్పటినుండి నేటివరకు అబ్రహాము దేవుడవైన నిన్ను ధ్యానించుటతప్ప నాకు మరియొక ఆనందమే లేదు.

19. ప్రభూ! నీవు అందరికంటె బలవంతుడవు. ఈ దీనుల మొరలు ఆలింపుము. దుష్టాత్ములనుండి మమ్ము కాపాడుము. ఈ భయమును బాపి నన్ను బ్రోవుము.”

 1. మూడవనాడు ఎస్తేరు ప్రార్ధనలను ముగించుకొనెను. సంతాపము వెలిబుచ్చుటకు తాల్చిన బట్టలను తొలగించి జిగేలున మెరయు దుస్తులు ధరించెను.

2. వైభవోపేతముగా అలంకరించుకొనెను. ఎల్లరి చెయిదములను వీక్షించుచు, ఎల్లరిని సంరక్షించు చుండు ప్రభువును స్మరించుకొనెను. ఆమె ఇద్దరు చెలి కత్తెలను వెంటనిడుకొనెను.

3. తాను ఒక చెలికత్తె మీద సుకుమారముగా వ్రాలి నడచుచుండగా, మరియొక చెలికత్తె ఆమె ఉడుపుల అంచులనెత్తి పట్టుకొని వెంట వచ్చుచుండెను.

4. ఎస్తేరు మూర్తీభవించిన సౌందర్య మువలె ఉండెను. ఆమె ముఖములో సంతోషము, ప్రేమ చిందులు తొక్కుచున్నట్లు ఉన్నను, హృదయములో మాత్రము భయము గూడుకట్టుకొనియుండెను.

5. ఆ రీతిగా పయనమై వచ్చి ఎస్తేరు ప్రాసాద ద్వారములన్నీ దాటి రాజుసమ్ముఖమునకు చేరెను. అప్పుడు రాజు ప్రాభవోపేతముగా సింహాసనముపై ఆసీనుడైయుండెను. దేహము నిండ బంగారు నగలు అమూల్య రత్నములు తాల్చి మిలమిల మెరయుచు చూచుటకు భయంకరుడైయుండెను.

6. అతడు రాచఠీవితో ఎస్తేరును తేరిపారజూచి కోపముఖుడయ్యెను. ఆ చూపునకు రాణి గడగడవణకి భీతావహురాలై పడిపోయెను. తెల్లబోయిన మొగముతో మూర్చపోయి తన ముందటనున్న చెలికత్తె మీదికి ఒరిగెను.

7. కాని ప్రభువు రాజు అంతరంగమును మార్చి అతనిని మృదుహృదయుని చేసెను. అతడు సింహాసనము నుండి దిగ్గున లేచి ఎస్తేరును చేతులలోనికి తీసికొనెను. స్పృహకలిగిన వరకు ఆమెను మృదువచనములతో అనునయించెను.

8. “ఎస్తేరూ! ఈ భయమెందుకు? నేను నీ ప్రియనాథుడనుకానా? ధైర్యము తెచ్చుకొనుము.

9. నీకెట్టి అపాయమును కలుగదు. నా శాసనము వర్తించునది సామాన్య ప్రజలకుగాని నీకు కాదు. ఇటు నాదగ్గరకు రమ్ము” అని ఆమెను బుజ్జగించెను.

10. అంతట అతడు తన సువర్ణదండమునెత్తి ఎస్తేరు మెడమీద పెట్టి ఆమెను కౌగలించుకొని “ఇక నాతో మాటాడుము" అని పలికెను.

11. ఎస్తేరు రాజుతో “ప్రభూ! తమరు నా కంటికి దేవదూతవలె కనిపించితిరి. మీ తేజస్సును చూచి నేను భయపడితిని.

12. ప్రభువుల వారు అద్భుతముగానున్నారు. తమ ముఖము వర్చస్సుతో వెలుగుచున్నది” అని అనెను.

13. ఇట్లనుచునే ఆమె సొమ్మసిల్లి పడిపోయెను.

14. రాజు ఎస్తేరును చూచి విచారముచెందెను. అతని పరిచారకులు ఎల్లరు ఆమెకు ఉపచారములు చేసిరి.

 1. అంతట రాజు ఆమెతో "ఎస్తేరు రాణీ! సంగతియేమి? నీ కోర్కెయేమో తెలియ జెప్పుము. నీవు నా రాజ్యమున అర్థభాగము అడిగినను ఇచ్చెదను” అని పలికెను.

2. "ప్రభువుల వారికి సమ్మతియగునేని తమరును, హామానును నేటి రాత్రి నేను సిద్ధముచేయనున్న విందుకు దయచేయుడు” అని విన్నవించెను.

3. అతడు హామానును త్వరగా పిలువుడని సేవకులను ఆజ్ఞాపించెను. అటు పిమ్మట రాజు, హామాను ఎస్తేరు విందునకు వచ్చిరి.

4. విందులో ద్రాక్షాసారాయమును సేవించు పుడు రాజు ఎస్తేరుతో “నీ కోరికఏమో తెలిపిన తప్పక తీర్చెదను. నీవు నా రాజ్యమున అర్ధభాగము అడిగినను ఇచ్చెదను” అనెను.

5. ఎస్తేరు “నా అభిమతమిది.

6. ప్రభువుల వారు నన్ననుగ్రహించి నా కోర్కెను తీర్పగోరెదరేని హామానును, తమరును రేపు నేను సిద్ధము చేయనున్న రెండవవిందుకు గూడ దయచేయుడు. నా మనవిని రేపు విన్నవించుకొందును” అని చెప్పెను.

7. హామాను విందు ముగించుకొని ఆనందముతో చిందులు తొక్కుచు వెళ్ళిపోయెను. కాని, ప్రాసాదద్వారము చెంతనున్న మొర్దెకయి తనను జూచి లేచి నిలబడకపోవుటను, నమస్కారము చేయకపోవుటను గాంచి ఉగ్రుడైపోయెను.

8. అయినను అతడు కోపమును అణచుకొని, ఇల్లు చేరి తన స్నేహితులను పిలిపించెను. తన భార్య సెరేషును చెంతకు రమ్మనెను.

9. హామాను వారితో తన సిరి సంపదల గూర్చి, రాజు తనను ఆస్థానమునందలి ఉద్యోగులు అందరికంటే పెద్దచేసి, ప్రధానమంత్రిని చేయుటగూర్చి గొప్పలు చెప్పుకొనెను.

10. “ఇంకను వినుడు. ఎస్తేరు రాణి విందుచేయించి రాజును, నన్ను మాత్రమే ఆహ్వానించెను. అంతేకాదు ఆమె రేపటి విందుకు కూడ రాజుతోపాటు నన్నును ఆహ్వానించెను.

11. కాని ఆ యూదుడు మొర్దెకయి ప్రాసాదద్వారము చెంత ఆ రీతిగా కూర్చుండి ఉండుటను చూడగా ఈ గౌరవములన్ని ఏపాటివి?” అనెను.

12. అప్పుడు హామాను భార్య, అతని మిత్రులు “నీవు యాబదిమూరల ఎత్తున ఒక ఉరికంబమును నిర్మింపుము. దానిమీద మొర్దెకయిని ఉరి తీయింపుడని రేపు ప్రొద్దున రాజునకు మనవి చేయుము. ఆ మీదట చీకుచింత లేకుండ విందుకు హాజరుకమ్ము” అని సలహా ఇచ్చిరి. ఆ సూచన హామానునకు నచ్చెను. కనుక అతడు ఉరికంబమును సిద్ధము చేయించెను.

 1. ఆ రాత్రి రాజునకు నిద్రపట్టలేదు. కనుక అతడు రాజకార్యముల దస్తావేజును తెప్పించి చదివించుకొనెను.

2. ప్రాసాదమున రాజ నివాసమునకు రక్షకులుగానుండిన నపుంసక సేవకులు బిగ్తానను, తేరేషు అనువారు రాజును హత్యచేయుటకు కుట్ర పన్నగా మొర్దెకయి ఆ కుట్రను బట్టబయలుచేసెనని ఆ గ్రంథమున లిఖింప బడియుండెను.

3. రాజు “ఈ ఉపకారమునకుగాను మొర్దెకయికి ఎట్టి సన్మానము చేసితిమి?” అని ప్రశ్నించెను. పరిచారకులు "అతనికెట్టి సన్మానమును లభింపలేదు” అని జవాబిచ్చిరి.

4. రాజు “ఇపుడు మా కార్యాలయమున ఎవరున్నారు” అని ప్రశ్నించెను. హామాను అప్పుడే ప్రాసాదము వసారా లోనికి వచ్చియుండెను. అతడు తాను సిద్ధము చేయించిన ఉరికంబము మీద మొర్దెకయిని ఉరితీయుటకై రాజు అనుమతిని పొందుటకు వచ్చెను.

5. కనుక పరిచారకులు హామాను వసారాలో వేచియున్నాడని చెప్పిరి. రాజు అతనిని లోనికి కొనిరండనెను.

6. హామాను తన ఎదుటకి రాగానే రాజు “ప్రభువు సన్మానింపగోరిన వానిని ఏ రీతిన సత్కరింపవలెను?” అని ప్రశ్నించెను. రాజు తననుదప్ప మరియెవరిని సన్మానింపబోడని హామాను తలంచెను.

7. కనుక అతడు “ప్రభువులవారు సన్మానింపగోరినవానికి ఇట్లు మర్యాదలు చేయింపుడు.

8. అతడు ధరించుటకు ఏలినవారు తాల్చెడు రాజవస్త్రములను తెప్పింపుడు. ప్రభువులవారు ఎక్కెడు గుఱ్ఱమును గూడ తెప్పించి దాని తలమీద కిరీటమును పెట్టింపుడు.

9. ఆ గుఱ్ఱమును, ఆ ఉడుపులను దేవరవారి కొలువులోని అత్యున్నత అధికారికి ఒప్పజెప్పింపుడు. ఆ అధికారి ప్రభువుల వారు సన్మానింపగోరిన అతనికి ఆ ఉడుపులను కట్టబెట్టవలెను. అతనిని ఆ గుఱ్ఱముమీద ఎక్కించి రాజ వీధిలో త్రిప్పవలెను. తాను అతని ముందుగా నడచుచు 'ప్రభువు సన్మానింపగోరిన వానిని ఈ రీతిగా సత్కరింపవలెను' అని ప్రకటన చేయవలెను” అని చెప్పెను.

10. రాజు హామానుతో “వెంటనే ఆ ఉడుపులను, గుఱ్ఱమును తెప్పింపుము. ప్రాసాదద్వారము చెంత కూర్చుండియున్న యూదుడైన మొర్దెకయికి నీవు చెప్పిన ఈ సత్కార్యములన్నిటిని చేయింపుము. నీవిపుడు పేర్కొనినవానిలో వేనిని వదలిపెట్టరాదు సుమా!” అని పలికెను.

11. హామాను రాజవస్త్రములను గుఱ్ఱమును తెచ్చెను. ఆ ఉడుపులను మొర్దెకయికి తొడిగించెను. అతనిని గుఱ్ఱము మీద ఎక్కించి రాజవీధిలో త్రిప్పెను. తాను ముందు నడచుచు “రాజు సన్మానింపగోరిన వానిని ఈ రీతిగా సత్కరింపవలెను” అని ప్రకటన చేసెను.

12. ఆ పిమ్మట మొర్దెకయి ప్రాసాదద్వారము చేరుకొనెను. హామాను అవమానముతో మొగము కప్పుకొని బిరబిర ఇంటికి వెళ్ళిపోయెను.

13. అతడు జరిగిన సంగతియంతయు భార్యకు, మిత్రులకు తెలియజేసెను. అప్పుడు హామాను భార్య, బుద్ధి కుశలులైన అతని మిత్రులు అతనితో “నీవు మొర్దెకయికి లొంగిపోయితివి. అతడు యూదుడు. నీవు అతనిని గెలువజాలవు. అతడు నిన్ను ఓడించితీరును” అనిరి.

14. వారింకను మాటలాడుచుండగనే నపుంసక సేవకులు వచ్చి హామానును ఎస్తేరు సిద్ధము చేయించిన విందునకు ఆహ్వానించిరి.

 1. కనుక రాజు, హామాను ఎస్తేరు వద్ద విందు ఆరగింపవచ్చిరి.

2. అట ద్రాక్షాసారాయమును సేవించునపుడు రాజుమరల “ఎస్తేరు రాణీ! నీ కోరిక ఏమో తెలిపిన తప్పకతీర్తును. నీవు నా రాజ్యమున అర్ధభాగము అడిగినను ఇత్తును” అనెను.

3. ఎస్తేరు రాణి "నేను ప్రభువుల వారి అనుగ్రహమును నోచుకొంటినేని నా మనవిని ఆలకింపుడు. తమరు నా ప్రాణములను, మా ప్రజల ప్రాణములను కాపాడ వేడెదను.

4. నాకు మా ప్రజలకు చావు దాపురించినది. మేమెల్లరము సర్వనాశనము కానున్నాము. మేము ఏ బానిసలముగానో అమ్ముడుబోయినచో, నేనిపుడు నోరు కదిపెడిదాననుకాను. కాని ఇప్పుడు మాకు పట్టిన దుర్గతివలన ఏలికకు కలుగబోవు నష్టమును మా విరోధికూడ పూరింపజాలడు” అనెను.

5. ఆ మాటలకు రాజు "ఇట్టి సాహసమునకు తలపడిన నరుడె వడు? అతడెచ్చటనున్నాడు?” అని ఎస్తేరును ప్రశ్నించెను.

6. ఆమె “మా శత్రువు, మా హింసకుడు ఎవరో కాదు. ఈ దుష్టాత్ముడైన హామానే” అని బదులు చెప్పెను. అప్పుడు హామాను రాజును రాణిని చూచి గడగడ వణకిపోయెను.

7. రాజు ఆగ్రహముతో లేచి వెలుపలి ఉద్యానవనములోనికి వెళ్ళిపోయెను. హామాను రాజు తన ప్రాణములు తీయునని గమనించి ఎస్తేరు రాణిని ప్రాణభిక్ష వేడుటకుగాను అచటనే నిలిచియుండెను.

8. అతడు ఎస్తేరు పడుకపైబడి, ఆమెను క్షమింపుమని వేడుకొనుచుండగనే రాజు ఉద్యానవనమునుండి విందు జరుగుశాలకు తిరిగివచ్చెను. అతడు ఎస్తేరు శయ్యపైనున్న హామానును చూచి “వీడు నా యింటనే నాయెదుటనే నా రాణిని బలవంతము చేయునాయేమి?" అని పలికెను. రాజు ఇట్లు పలికెనో లేదో, నపుంసక సేవకులు హామాను మొగముమీద ముసుగువేసిరి.

9. అప్పుడా సేవకులలో ఒకడైన హర్బోనా రాజుతో “హామాను తన ఇంటియొద్ద యాబదిమూరల ఎత్తున ఉరికంబముకూడ సిద్ధము చేయించెను. ప్రభువుల వారిని రక్షించిన మొర్దెకయిని దాని మీద ఉరితీయింప వలెనని ఇతని కోరిక” అని చెప్పెను. రాజు “వీనినే దానిమీద ఉరితీయుడు” అనెను.

10. కనుక హామాను మొర్దెకయి కొరకు తయారుచేయించిన ఉరికంబము మీద అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు కోపము చల్లారెను.

 1. ఆ దినమే రాజు యూదుల హింసకుడు హామాను ఆస్తిపాస్తులను ఎస్తేరు వశము చేసెను. ఎస్తేరు మొర్దెకయి తనకు దగ్గరిచుట్టమని తెలుపగా అతడు రాజు సమ్ముఖమునకు రాగలిగెను.

2. రాజు తాను హామానునుండి గైకొనిన ముద్రాంగుళీయకమును తీసి మొర్దెకయికి ఇచ్చెను. హామాను ఆస్తి పాస్తులకు ఎస్తేరు మొర్దెకయి ని అధికారిగా నియ మించెను.

3. అంతట ఎస్తేరు రాజు పాదములపై వ్రాలి కన్నీరుకార్చుచు అతనికి మరల విన్నపము చేసెను. అగారు వంశజుడు హామాను యూదులను నాశనము చేయుటకుగాను పన్నిన పన్నాగమును తొలగింపుమని వేడుకొనెను.

4. రాజు తన బంగారుదండము నెత్తి ఎస్తేరు వైపు చూపగా ఆమె లేచి అతని ఎదుట నిలుచుండి,

5. "నేను ప్రభువుల వారి అనుగ్రహమునకు నోచుకొంటినేని, నేను తమకు ప్రీతికలిగింతునేని, నా మనవి తమకు ఉచితముగా తోచెనేని ఏలినవారు హామాను పంపించిన తాకీదులను రద్దు చేయింపుడు. హమ్మెదాతా కుమారుడు అగాగు వంశజుడు హామాను మన సామ్రాజ్యమున వసించు యూదులందరిని వధింపవలెనని లేఖలు పంపెను గదా!

6. మా ప్రజలు ఈ శిక్షకు గురియైనచో నేనెట్లు భరింపగలను? మా బంధువులు నాశనమైనచో నేనెట్లు సహింప గలను?” అని మనవి చేసెను.

7. అహష్వేరోషు ఎస్తేరు రాణితోను, మొర్దెకయితోను, “యూదులమీద కుట్రపన్నినందులకుగాను హామానును ఉరితీయించితిని. ఎస్తేరూ! అతని ఆస్తి పాస్తులను నీ స్వాధీనము చేసితిని.

8. రాజు పేరుతోను, రాజముద్రతోను అమలుపరచిన శాసనములను రద్దుచేయుట ఎవరికిని సాధ్యముకాదు. అయినను మీరు మీకు ఉచితములని తోచిన సంగతులను యూదులకు వ్రాయవచ్చును. ఆ లేఖను నా పేర వ్రాసి నా ముద్రతో ముద్రింపవచ్చును” అని చెప్పెను.

9. సివాను అను మూడవనెలలో ఇరువది మూడవ దినమున ఈ సంగతి జరిగెను. మొర్దెకయి రాజ లేఖకులను పిలిపించి వారిచేత హిందూదేశమునుండి కూషు వరకు వ్యాపించియున్న నూటఇరువది యేడు సంస్థానముల అధిపతులకును, అధికారులకును ఉద్యో గులకును లేఖలు వ్రాయించెను. ఒక్కొక్క రాష్ట్రమునకు దానిభాషలోను, లిపిలోను వ్రాయించెను. అటులనే యూదులకు వ్రాసిన లేఖలను వారి భాషలోను లిపిలోను లిఖించిరి.

10. లేఖలనెల్ల రాజు పేర వ్రాయించి అతని ముద్రతో ముద్రించిరి. వార్తావహులు రాజు అశ్వశాలనుండి కొనివచ్చిన బీజాశ్వములపై నెక్కి ఆ జాబులను వివిధ రాష్ట్రములకు కొనిపోయిరి.

11. ఆ లేఖలలో రాజు యూదులకిచ్చిన అనుమతులివి: ఏ పట్టణమున వసించు యూదులైనను ఆత్మ సంరక్షణార్ధము తమలో తాము ఏకముకావచ్చును. ఏ సంస్థానముననైనను, ఏ జాతివారైనను సాయుధులై వచ్చి యూదులమీద పడుదురేని, యూదులు వారితో పోరాడి వారిని సర్వనాశనము చేయవచ్చును. వారి భార్యలను, పిల్లలను గూడ మట్టుపెట్టి వారి ఆస్తిపాస్తులను స్వాధీనము చేసికోవచ్చును.

12. యూదులకు మరణశిక్ష ప్రాప్తింపబోవు దినముననే, అనగా అదారు అను పండ్రెండవ నెల పదుమూడవ దినముననే, ఈ శాసనముకూడ అహష్వేరోషు రాజు రాజ్యము నలుమూలల అమలులోనికి వచ్చునని తెలియజేయబడెను.

 1. ఆ లేఖలలోని వృత్తాంతమిది: “హిందూ దేశము నుండి కూషు వరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానముల పాలకులకును, విశ్వాసపాత్రులైన ప్రజలకును శుభములు పలికి మహాప్రభువు అహష్వేరోషు వ్రాయునది.

2. ఉపకారులనుండి పెక్కుమారులు భూరిదానములను స్వీకరించుటవలన చాలమందికి పొగరెక్కును.

3. ఇట్టి పొగరుబోతులు మా ప్రజలకు కీడు తలపెట్టుటయే గాక తమకు లభించిన ఐశ్వర్యమును నిబ్బరముగా నిలుపుకోజాలక తమ్ము సంపన్నులను జేసిన ఆ ఉపకారులమీద గూడ కుట్రలు పన్నుచున్నారు.

4. ఇట్టివారిలో కృతజ్ఞతాభావము లేశమైనను ఉండదు. వారు మంచియనునది యెరుగని నీచుల పొగడ్తలకు ఉబ్బిపోవుదురు. పైగా వారు దుష్టకార్యములను ఏవగించు కొనువాడును, సర్వసాక్షియైన ప్రభువు శిక్షను తప్పించుకోగలమని ఎంచెదరు.

5. రాజులు తమ స్నేహితులైన వారిని నమ్మి వారికి రాజ్యాధికారమును ఒప్పజెప్పగా వారు వంచనతో నిరపరాధుల రక్తము నొలికించిరి. ఆ రాజులను గూడ పాపమున భాగస్వాములను చేసి, తీరని నష్టములు తెచ్చి పెట్టిరి.

6. ఆ దుష్టులు మోసపు ఆలోచనలతో హితబుద్ధులైన తమ పాలకులను పెడత్రోవ పట్టించిరి.

7. ఈ సత్య మును నిరూపింపవలెనన్న పూర్వచరిత్ర లేమియు పరిశీలింప అక్కరలేదు. అయోగ్యులైన అధికారులు మా కన్నులయెదుటనే చేసిన దుష్టకార్యములు పరికించిన చాలును.

8. ఇకమీదట మేము, మా సామ్రాజ్యములోని ప్రజలందరికి శాంతిభద్రతలు చేకూర్చకోరెదము.

9. అందులకుగాను మేము క్రొత్త విధానమును అవలంబింతుము. ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యలనెల్ల న్యాయసమ్మతముగా పరిష్కరింతుము.

10. హమ్మెదాతా కుమారుడును మాసిడోనీయుడైన ఈ హామానునే చూడుడు. అతని దేహములో పారశీకరక్తము ఒక్క బొట్టయిన లేదు. అసలతడు మా దయకు పాత్రుడేకాదు. అయినను అతడు మా ఆశ్రయమును పొందెను.

11. మేమును అన్ని జాతుల ప్రజలకువలెనే అతనికిని ఉపకారము చేసితిమి. అతనికిని మా ఆస్థానమున ప్రధాన అధికారిగా నియమించితిమి. అతడు మా దేశమున, మా తరువాత మాయంతటివాడని గుర్తించి అందరును అన్నివేళల అతనికి నమస్కారములు చేయుచువచ్చిరి.

12. కాని హామాను గర్వముతో పొంగిపోయి మా రాజ్యమును, మా ప్రాణమును గూడ అపహరింపజొచ్చెను.

13. పైగా అతడు మమ్ము రక్షించిన శాశ్వతోపకారి మొర్దెకయిని, నిర్దోషి మా రాణి ఎస్తేరును, యూదాజాతినంతటిని మోసముతోను, కుట్రతోను నాశనము చేయచూచెను.

14. ఇట్లు చేసినచో మా బలము ఉడిగిపోవుననియు, అప్పుడు మా పారశీక సామ్రాజ్యమును మాసిడోనీయుల వశము చేయవచ్చుననియు అతని తలపు.

15. కాని పరమ దుర్మార్గుడైన ఈ హామాను తుదముట్టింపజూచిన యూదులు అసలు దోషులే కాదనియు, వారు న్యాయసమ్మతములైన చట్టముల ప్రకారము జీవించువారనియు మేము తెలిసికొంటిమి.

16. వారు సజీవుడు, మహాబలసంపన్నుడు, మహోన్నతుడైన దేవుని కుమారులు. ఆ ప్రభువు చలువవలన మేమును, మా పూర్వులును ఈ రాజ్యమును వృద్ధి లోనికి తీసికొనిరాగలితిమి.

17. కనుక మీరు హమ్మెదాతా కుమారుడగు హామాను పంపిన తాకీదులను అమలు జరిపింపవలదు.

18. ఈ కుట్రపన్నినందులకు మేము అతనిని, అతని కుటుంబమును షూషను దుర్గద్వారము చెంత ఉరివేయించితిమి. సర్వమును పరిపాలించు దేవుడే సకాలమున అతనికి ఈ ఉచిత శిక్ష విధించెను.

19. కనుక మీరు ఈ లేఖను ఎల్లెడల ప్రకటనచేయుడు. యూదులను వారి విధుల ప్రకా రము జీవింపనిండు.

20. వారిని శిక్షించుటకు నిర్దే శింపబడిన దినమున, అనగా అదారు అను పండ్రెండవ నెల పదుమూడవ దినమున, ఎవరైన వారిమీద కత్తి దూసినచో, మీరు వారిని నిలువరింపుడు.

21. సర్వశక్తి మంతుడైన దేవుడు ఆ రోజును యూదులకు సంతోష దినముగా నిర్ణయించెనుగాని వినాశదినముగా నిర్ణయింపలేదు.

22. యూదులారా! మీ తరపున మీరు ఈ దినమును మీ ఉత్సవములన్నిటిలో మహోత్సవముగా జరుపుకొనుడు.

23. ఇకమీదట మీరును, సహృదయులగు పారశీకులును కూడ ఈ దినమును రక్షణదినముగా స్మరించుకొందురు గాక!

24. ఈ ఆజ్ఞలను పాటింపని పట్టణములును, రాష్ట్రములును మా క్రోధాగ్నికి ఎరయై, ఖడ్గము వలనను, అగ్ని వలనను నాశనమగునుగాక! అవి జననివాసయోగ్యములు కాకుండునుగాక! ఆకాశపక్షులు, వన్యమృగ ములుకూడ ఏనాడును వాని దరిదాపులకైనను రాకుండునుగాక!”

 1. పైతాకీదు రాజశాసనము కానున్నదని ప్రతిరాష్ట్రమునను ప్రకటించిరి. కనుక ఆ దినము వచ్చినపుడు యూదులు తమ శత్రువులకు ప్రతీకారము చేయుటకు వీలుకలిగెను.

2. రాజు ఆజ్ఞపై వార్తావహులు బీజాశ్వములను ఎక్కి ఆ తాకీదులను శీఘ్రముగా కొనిపోయిరి. రాజధాని షూషనులో కూడ ఆ తాకీదు ప్రకటింపబడెను.

3. మొర్దెకయి ఊదా ఎరుపు రంగులుగల రాజవస్త్రములను తాల్చి, ధూమ్రవర్ణపు పట్టు అంగీని తొడుగుకొని, పెద్ద బంగారు కిరీటమును ధరించి, రాజప్రాసాదము వెడలివచ్చెను. షూషను పట్టణము ఆనందముతో కోలాహలము చేసెను.

4. ఆ పట్టణమునందలి యూదులకు ఆనందము, వెలుగు, సంతసము, గౌరవము సిద్ధించెను.

5. రాజు తాకీదులందిన నగరములందును, రాష్ట్రములందును, యూదులు సెలవు దినమును ప్రకటించి, సంతసముతో ఉత్సవము చేసి కొనిరి. ఆ ప్రదేశములలోని ప్రజలు చాలమంది యూదమతమును చేపట్టిరి. యూదులను చూచి ఎల్లరును భయపడజొచ్చిరి.

 1. రాజు తాకీదు అదారు అను పండ్రెండవ నెల పదుమూడవ దినమున అమలులోనికి వచ్చెను. యూదుల శత్రువులు ఆ దినమున వారిని నాశనము చేయవచ్చును గదా అనుకొనిరి. కాని అనుకొనకుండ ఆనాడు యూదులే తమ శత్రువులను అణగదొక్కిరి.

2. ఆయా సంస్థానములోను, పట్టణములలోను వసించు యూదులు ఎక్కడివారు అక్కడే ప్రోగై, తమకు హానితలపెట్టిన వారిమీదపడిరి. ఎల్లరును వారికి భయపడుటచే, ఎవరును వారిని ఎదిరింపజాలరైరి.

3. అధిపతులు, అధికారులు మొదలైన ప్రభుత్వోద్యోగులెల్లరును మొర్దెకయికి జడిసి, యూదులకు సాయపడిరి.

4. రాజప్రాసాదమున మొర్దెకయి పలుకుబడి కలవాడని సంస్థానములందు ఎల్లెడల వెల్లడి ఆయెను. నానాటికి అతని పలుకుబడి హెచ్చుచుండెను.

5. కనుక యూదులు కత్తులు చేపట్టి తమ శత్రువులను చీల్చిచెండాడిరి. విరోధులనెల్ల తమఇష్టము వచ్చినట్లు చేసిరి.

6. ఒక్క షూషను దుర్గముననే ఐదువందల మందిని సంహరించిరి.

7-10. ఆ చచ్చినవారిలో యూదుల శత్రువు హమ్మెదాతా కుమారుడు హామానుని తనయులు పది మంది యుండిరి. వారి పేర్లివి: పర్షందాతా, డల్పోను, అస్పాతా, పోరాతా, అదల్యా, అరీదాతా, పర్మష్టా, అరీసయి, అరీదయి, వైసాతా. అయినను యూదులు శత్రువుల సొమ్మును దోచుకొనలేదు.

11. షూషను దుర్గమున చనిపోయినవారి సంఖ్యను ఆ దినమే రాజునకు తెలియజేసిరి.

12. అతడు ఎస్తేరు రాణితో “ఒక్క షూషను దుర్గముననే యూదులు ఐదువందల మందిని మట్టుబెట్టిరి. హామాను పుత్రులు పదిమందినిగూడ చంపిరి. ఇక వారు మన సంస్థానములలో ఎట్టి కార్యములు చేసిరో! అయినను ఇపుడు నీకేమి కావలయునో చెప్పుము. ఇంకా నీవేమి కోరుకొందువో తెలియజేయుము. నీ కోర్కె తప్పక తీర్చెదను” అనెను.

13. ఎస్తేరు “ప్రభువుల వారికి సమ్మతమగునేని షూషను దుర్గమునందలి యూదులు, నేటి రాజశాసనమును రేపు కూడ అమలులో పెట్టుటకు అనుమతినిండు. హామానుని పదిమంది కొడుకుల శవములను కంబములపై వ్రేలాడదీయింపుడు” అనెను.

14. రాజట్లే జరిగింప ఆజ్ఞ ఇచ్చెను. రాజాజ్ఞను షూషను దుర్గమున ప్రకటించిరి. పదిమంది హామాను కుమారుల శవములను బహిరంగముగా వ్రేలాడదీసిరి.

15. షూషను నందలి యూదులు అదారు నెల పదునాల్గవ దినమున మరల గుమిగూడి మూడువందల మందిని తెగటార్చిరి. అయినను వారు మృతుల ఆస్తిపాస్తులను దోచుకొనలేదు.

16. ఇతర సంస్థానములలోని యూదులు ఎక్కడి వారు అక్కడే ఏకముగా గుమిగూడి ఆత్మరక్షణ చేసికొనిరి. వారు తమ విరోధులను డెబ్బది యైదువేల మందిని చంపి శత్రుపీడనను వదలించుకొనిరి. అయి నను వారు ఆ శత్రువుల సొత్తును దోచుకోలేదు.

17. ఈ సంఘటన అదారు నెల పదుమూడవనాడు జరిగెను. వారు పదునాలుగవనాడు శత్రువులను చంపుట చాలించి ఆనందముతో పండుగ చేసికొనిరి.

18. కాని షూషనునందలి యూదులు మాత్రము పద మూడు, పదునాలుగు తేదీలలో శత్రువులను వధించి పదునైదవ దినమున విశ్రాంతి తీసికొనిరి. ఆనాడు ఆనందముతో ఉత్సవముచేసికొనిరి.

19. కనుకనే అరక్షితములైయున్న చిన్న ఊళ్లలో జీవించు యూదులు అదారు నెల పదునాలుగవ దినమున సెలవు తీసికొని ఆనందముతో ఉత్సవము చేసికొందురు. ఒకరి యింటికొకరు భోజన పదార్దములు పంపుకొందురు. కాని పెద్ద నగరములలో వసించు యూదులు మాత్రము అదారు నెల పదునైదవ దినమున పండుగ చేసికొని ఒకరి యింటికొకరు వంటకములు పంపుకొందురు.

20. మొర్దెకయి జరిగిన సంఘటనలన్నిటిని లిఖించియుంచెను. అహష్వేరోషు రాజుపాలిత ప్రాంతాలలో నివసిస్తున్న యూదులందరికిని, దగ్గరివారికిని దూరపువారికి గూడ లేఖలు పంపెను.

21. అదారు నెలలోని పదునాలుగు, పదునైదవ దినములను ఏటేట సెలవురోజులనుగా నిర్ణయించెను.

22. ఇవి యూదులు శత్రుపీడనను వదిలించుకొనిన దినములు. ఈ నెలలో వారి దుఃఖము సంతోషముగను, వారి విలాపము ఉత్సవముగను మారిపోయెను గదా! కనుక మొర్దెకయి ఈ దినములు ఆనందముతో కూడిన ఉత్సవ దినములు కావలెనని ఆజ్ఞాపించెను. ఈ దినములందు యూదులు ఒకరి ఇంటికొకరు వంటకములు పంపుకోవలెననియు పేదలకు దానధర్మములు చేయవలెననియు అతడు కట్టడ చేసెను.

23. యూదులు మొర్దెకయి లేఖను శిరసావహించి ఈ ఉత్సవమును జరుపుకొను ఆచారమును ప్రారంభించిరి. ఏటేట దానిని కొనసాగించుచువచ్చిరి.

24. అగాగు వంశజుడును హమ్మెదాతా కుమారుడును, యూదుల శత్రువైన హమాను యూదులను మట్టుపెట్టు దినమును నిర్ణయించుటకు ఓట్లు వేసెను కదా! ఆ చీట్లకు “పూరు” అని పేరు.

25. కాని ఎస్తేరు రాజును సందర్శింపగా అతడు లిఖితపూర్వకమైన శాసనమును చేసి హామాను యూదులకొరకు త్రవ్విన గోతిలో తానే పడిపోవునట్లు చేసెను. అతనిని, అతని కుమారులను ఉరి తీయించెను.

26-27. కనుక ఈ ఉత్సవమునకు "పూరీము” అని పేరు వచ్చెను. “పూరు” అనగా చీట్లుకదా! మొర్దెకయి తమకిట్టి జాబు వ్రాయుటవలనను, తమకు జరిగిన ఈ సంఘటనలనెల్ల వారు కన్నులార చూచి అనుభవమునకు తెచ్చుకొనుటవలనను, యూదులు తామును, తమ సంతతియును, తమలో చేరిపోవు అన్యజాతి ప్రజలును, ప్రతియేడును నిర్ణీతకాలమున ఈ రెండు రోజులను ఉత్సవదినములుగా పాటింపవలెనని నిర్ణయము చేసికొనిరి.

28. ప్రతి సంస్థానమున ప్రతి నగరమున, ప్రతి తరమున ప్రతి యుదా కుటుంబమున ఈ పూరీము ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొని, వైభవోపేతముగా కొనియాడవలెననియు, ఆ పండుగను ఏనాడును విస్మరింపరాదనియు నిర్ణయము చేసి కొనిరి.

29. అబీహాయిలు పుత్రిక అయిన ఎస్తేరు రాణికూడ పూరీమును గూర్చి మొర్దెకయి వ్రాసిన లేఖను అధికారపూర్వకముగా సమర్థించుచు ఒక లేఖ వ్రాసెను.

30. ఆమె దానిని పారశీకమునందలి నూట యిరువది ఏడు సంస్థానములలో వసించు యూదులందరికి పంపించెను. ఆ లేఖయందు ఇట్లున్నది: “యూదులకు శాంతిభద్రతలు సిద్ధించునుగాక!

31. మొర్దెకయి ఎస్తేరురాణి ఆజ్ఞాపించినట్లే యూదులును, వారి వంశజులును నిర్ణీత కాలమున, నిర్ణీత పద్దతిలో పూరీము ఉత్సవము చేసికొనవలెను. ఈ ఉత్సవముతోపాటు ఉపవాసములను, విలాపములను గూడ పాటింపవలెను.”

32. ఎస్తేరు చేసిన ఈ ఆజ్ఞ పూరీము విధిని దృఢపరచెను. యూదులు ఆమె ఆజ్ఞను గ్రంథమున లిఖించి భద్రపరచిరి.

 1. అహష్వేరోషు రాజు తన సామ్రాజ్యమునందలి ప్రజలనుండియు, సముద్ర తీరములందలి ప్రజలనుండియు పన్నులు రాబట్టెను.

2. అతడు చేసిన మహా కార్యములు, అతడు మొర్దెకయికి ఉన్నతాధికారము నిచ్చిన తీరు మాదీయ పారశీక ప్రభువుల రాజకార్యముల దస్తావేజులలో లిఖింపబడియేయున్నవి.

3. మొర్దెకయి రాజు తరువాత రెండవస్థానమును ఆక్రమించుకొనెను. యూదులు అతనిని మిగుల గౌరవించి ఆదరాభిమానములతో చూచిరి. అతడు తన జాతి ప్రజల శ్రేయస్సును కోరి, వారి అభివృద్ధి కొరకు కృషిచేసెను.

4. మొర్దెకయి ఇట్లనెను: “ఇదంతయు ప్రభువు చెయిదము. ఈ సంగతి గూర్చి పూర్వము నేను కనిన కల ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నది.

5. ఆ కలలో కన్పించిన సంగతులన్ని నెరవేరినవి.

6. ఆ స్వప్నమున చిన్న నీటిపాయ పెద్దనదిగా మారుటయు, వెలుగును, సూర్యుడును, నీటి పొంగును చూపట్టినవి. ఆ నది ఎస్తేరే. రాజు ఆమెను పరిణయమాడి రాణినిగా నియమించెను.

7. స్వప్నమునందలి రెండు మహా సర్పములు హామాను, నేను.

8. కలలో కన్పించిన ఆ జాతులు యూదులను నాశనము చేయుటకుగాను ప్రోగైవచ్చినవారు.

9. దేవునికి మొరపెట్టిన ఏకైక జాతి మన యిస్రాయేలీయులే. ప్రభువు వారిని రక్షించెను. ఆయన మన ప్రజలను సకలవిపత్తులనుండి కాపాడెను. అన్యజాతులు కనివినియెరుగని అద్భుతకార్యములు ఆ ప్రభువు చేసెను.

10. ఆయన తన ప్రజలకొక్క నిర్ణయమును, అన్యజాతులకు ఇంకొక నిర్ణయమును చేసెను.

11. ఈ రెండు నిర్ణయములను అమలు జరుపు సమయము ఆసన్నమయ్యెను. ఎల్ల ప్రజలును చూచుచుండగా ప్రభువు తాను చేసిన నిర్ణయములను అమలు జరుపుదినము వచ్చెను.

12. అప్పుడాయన తన ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొని, వారికి న్యాయము జరిగించెను.

13. కనుక వారు అదారు నెలలో పదునాలుగు, పదునైదవ దినములందు ఆరాధనకు సమావేశమై మహోత్సాహముతో పండుగ చేసికొందురు. ఎల్లకాలములందు ఎల్లతరములందు యిస్రాయేలీయులలో ఈ ఆచారము కొనసాగును.”