ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నెహెమ్యా

 1. హకల్యా కుమారుడైన నెహెమ్యా పలుకులు: అర్తహషస్త ప్రభువు పరిపాలనాకాలమున ఇరువదియవయేట కీస్లేవు మాసములో నేను రాజధాని నగరము షూషను కోటలో ఉంటిని.

2. అప్పుడు మా సహోదరులలో ఒకడైన హనానీ మరికొందరు ప్రజలతో యూదా నుండి తిరిగివచ్చెను. ప్రవాసము నుండి తప్పించుకొనిపోయిన యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని వివరములడిగితిని.

3. వారు "ప్రవాసము నుండి వెడలివచ్చి మన నేలపై స్థిరపడినవారు నానాయాతనలు, అవమానములు అనుభవించుచున్నారు. యెరూషలేము ప్రాకారములు నేలమట్టములైయున్నవి. నగర ద్వారములను కాల్చి బుగ్గిచేసిరి” అని పలికిరి.

4. ఆ మాటలు ఆలించి నేను నేలపై చతికిలబడి కన్నీరు కార్చితిని. చాలనాళ్ళు ఉపవాసము చేయుచు విలపించితిని. అపుడు ప్రభువునిట్లు ప్రార్ధించితిని:

5. “ఆకాశమందున్న ప్రభూ! నీవు మహా దేవుడవు. నీవనిన మాకు మిగుల భయము. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించువారితో నీ నిబంధనమును నిలుపుకొందువు. వారిని కరుణతో సాకెదవు.

6. ప్రభూ! నావైపు చూచి నా పలుకులాలింపుము. నీ దాసులు యిస్రాయేలీయులకొరకు రేయింబవళ్ళు నేను చేయు వేడికోలును పెడచెవిన పెట్టకుము. యిస్రాయేలీయులమైన మేము అపరాధములను చేసితిమి. నేను, మా పూర్వులెల్లరము పాపములు చేసితిమి.

7. మేము దుష్కార్యములు చేసితిమి. నీ సేవకుడు మోషే ద్వారా నీవు ప్రసాదించిన ధర్మ విధులను, ఆజ్ఞలను పాటింపమైతిమి.

8. 'మీరు నాకు విశ్వాసద్రోహము చేయుదురేని నేను మిమ్ము ఆయా జాతుల నడుమ చెల్లాచెదరు చేయుదును.

9. కాని మీరు నన్ను శరణువేడి నా యాజ్ఞలను పాటింతురేని మీరు దూరదేశములకు బహిష్కరింపబడియున్నను, నేను నా నామముంచుటకు ఏర్పరచుకొనిన ఆ తావునకు మిమ్ము మరల కొనివత్తును' అని నీవు పూర్వము నీ సేవకుడు మోషే ద్వారా నుడివిన వాక్కును స్మరించుకొనుము.

10. నా దేవుడైన యావే! వీరు నీ ప్రజలు, నీ దాసులు. మహా బలపరాక్రమములతో నీవే వీరిని కాపాడితివి.

11. ప్రభూ! ఇపుడు నా మొర ఆలింపుము. భయభక్తులతో నిన్ను పూజించు భక్తులందరి వేడికోలును నీ వీనులచేర్పుము. నేడు నాకు సమృద్ధిని ప్రసాదింపుము. ఈ రాజుకు నామీద దయపుట్టునట్లు చేయుము." ఆ కాలమున నేను రాజునకు పానీయ వాహకుడుగా ఉండెడివాడను.

 1. అర్తహషస్త పరిపాలనకాలమున ఇరువదియవ యేట నీసాను నెలలో ఒకనాడు రాజు భోజనము చేయుచుండగా నేనతనికి ద్రాక్షసారాయము అందించితిని. అంతకు ముందెన్నడు నేను రాజునెదుట విచారముగా కన్పించి యెరుగను.

2. కనుక అతడు నన్ను చూచి “ఓయి, నీ విచారమునకు కారణమేమి? నీకు వ్యాధియేమియున్నట్లు లేదు. కనుక ఏదియో మనస్తాపము నిన్ను పీడించుచుండవలెను” అనెను. రాజు మాటలకు నేను మిగుల భయపడితిని.

3. నేనతనితో “ప్రభువులవారు కలకాలము జీవింతురు గాక! మా పితరులను పాతిపెట్టిన నగరము నేలమట్టమై ఉన్నది. దాని ద్వారములు మంటలో కాలి బుగ్గియైపోయినవి. నాకు విచారముకాక మరియేమి కలుగును?” అంటిని.

4. రాజు “ఇప్పుడు నీ కోరికయేమి?" అని నన్ను ప్రశ్నించెను. నేను ఆకాశమునందున్న ప్రభువును ప్రార్ధించితిని.

5. అటుపిమ్మట రాజుతో “ప్రభువులవారి చిత్తమైనచో, తమకు నా మీద దయపుట్టినచో, నన్ను మా పితరులను పాతిపెట్టిన యూదాసీమకు వెళ్ళిపోనిండు. మా నగరమును పునర్నిర్మించుటకు ఆజ్ఞ ఇండు” అంటిని.

6. అప్పుడు రాణి కూడ రాజు ప్రక్కనే కూర్చుండియుండెను. అతడు “నీ ప్రయాణము ఎన్నాళ్ళు పట్టును? నీవు మరల ఎప్పుడు తిరిగి వత్తువు?” అని నన్ను ప్రశ్నించెను. నేనొక తేదీని నిర్ణయించి చెప్పగా ప్రభువు నా కోరిక అంగీకరించెను.

7. నేను యూదా దేశమునకు ప్రయాణము చేయుటకు అనుమతి ఈయవలసినదని పశ్చిమ యూఫ్రటీసు అధిపతులకు లేఖలు వ్రాసియిండని రాజును వేడుకొంటిని.

8. మరియు రాజు ఆధీనములోని అరణ్యములకు అధిపతియైన ఆసాపునకు కూడ లేఖ నొసగుడని అడిగితిని. దేవాలయము ఎదుటనున్న కోట బురుజులకును, నగరప్రాకారద్వారములకును, నేను వసించు గృహమునకును వలసినంత కలపను ఇప్పింపవలసినదని ఆ లేఖలో వ్రాయించితిని. ప్రభువు నన్ను కరుణించెను గనుక రాజు నేనడిగినదంతయు దయచేసెను.

9. రాజు కొందరు సైనికులను, రౌతులను నాకు రక్షణగా పంపెను. నేను పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రము చేరుకొని అచటి పాలకులకు రాజులేఖలను అందించితిని.

10. కాని హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన తోబియా అను దాసుడును యిస్రాయేలీయులను ఆదుకొనుటకు ఎవరో వచ్చిరని విని బహు దుఃఖాక్రాంతులైరి.

11. నేను యెరూషలేము చేరుకొని మూడు దినములు అట వసించితిని.

12. నేను మధ్యరాత్రి యందు లేచి కొందరు మిత్రులను తోడు తీసికొని బయలుదేరితిని. ప్రభువు ప్రేరణను పొంది యెరూషలేమున నేను చేయదలచిన కార్యములున్నవి. కాని వానిని ఇంకను ఎవరితోను చెప్పనైతిని. నేనెక్కిన గాడిద తప్ప మరి ఏ జంతువు మా వెంటరాలేదు. 

13. అట్లు రాత్రి బయలుదేరి లోయద్వారము గుండ వెడలి, సర్పబావి దాటి, పేడద్వారము చేరితిని. పోవుచు పోవుచు పడిపోయిన యెరూషలేము ప్రాకారములను, కాలిపోయిన ద్వారములను పరిశీలించి చూచితిని.

14. అటుపిమ్మట జలధార ద్వారము వరకును రాజు మడుగు వరకును వెళ్ళితిని. ఆ మీదట నేనెక్కిన గాడిద పోవుటకు దారిలేదు.

15. కనుక ఆ రాత్రి క్రింది లోయలోనికి దిగి గోడను పరిశీలించుచు ముందుకు సాగిపోతిని. ఆ మీదట నేను వచ్చిన త్రోవవెంటనే నడకసాగించి లోయద్వారముగుండనే పట్టణమున ప్రవేశించితిని.

16. నేను ఎక్కడికి వెళ్ళినది ఏమి చేసినది స్థానిక ఉద్యోగులకు తెలియదు. అంతవరకు నేను యూదులతో గాని, యాజకులతో గాని, నాయకులతో గాని, ఉద్యోగులతో గాని, పనిలో పాల్గొను వారితో గాని ఒక్క మాట గూడ చెప్పలేదు.

17. అటు తరువాత నేను వారితో “మీరు మన బాధలను గుర్తించితిరిగదా! యెరూషలేము నేలమట్టమయినది. ప్రాకారద్వారములు అగ్ని జ్వాలలలో ధ్వంసమయినవి. కనుక నగరప్రాకారములు పునర్నిర్మించి మనకు కలిగిన అవమానమును తీర్చుకొందము” అంటిని.

18. మరియు ప్రభువు నాకు బాసటగా నుండెనని, రాజు గూడ నాకు తోడ్పడెనని నేను చెప్పితిని. నా మాటలు విని వారు కూడ “రండి, ప్రాకారములు నిర్మింతము” అనిరి. ఆ రీతిగా వారు గోడమీద పనిచేయుటకు తమను తాము అంకితము చేసికొనిరి.

19. కాని హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన తోబియా అను దాసుడు, అరబ్బీయుడగు గేషెము మా యత్నములను హేళన చేసిరి. మమ్ములను చిన్నచూపు చూచి, “ఈ పనిని తలపెట్టుటలో మీ భావమేమిటి? మీరు రాజుమీద తిరుగుబాటు చేయుటలేదు గదా?"అని వారు అడిగిరి.

20. నేను “ఆకాశమునందున్న దేవుడే మాకు విజయము ప్రసాదించును. ఆయన దాసులమైన మేము ప్రాకారములు నిర్మింప పూనుకొంటిమి. కాని యెరూషలేము పునర్నిర్మాణమున మీకు భాగముగాని, హక్కుగాని ఉండదు. మీ పేరు కూడ స్మరింపబడదు” అని చెప్పితిని.

 1. ప్రధానయాజకుడైన ఎల్యాషిబు, అతని తోటి యాజకులు కలిసి గొఱ్ఱెలద్వారము నిర్మించిరి. వారా ద్వారమునకు ప్రతిష్ఠ చేసి తలుపులు పెట్టిరి. వారు హనన్యేలు గోపురము వరకు ప్రాకారము కట్టిరి.

2. యెరికో నివాసులు దాని ప్రక్కభాగమును కట్టిరి. ఇమ్రీ కుమారుడైన సక్కూరు దాని అవతలి భాగము కట్టెను.

3. హస్సేనా వంశస్థులు మత్స్యద్వారము నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి తలుపులు పెట్టి గడియలు, తాళములు అమర్చిరి.

4. దాని ప్రక్క భాగమును హక్కోసు మనుమడు ఊరియా కుమారుడగు మెరెమోతు నిర్మించెను. దాని అవతలి భాగమును మెషెషబేలు మనుమడును, బెరెకియా కుమారుడనగు మెషూల్లూము నిర్మించెను. దానికానుకొని బానా కుమారుడగు సాదోకు కట్టెను.

5. దాని ప్రక్క భాగమును తెకోవా పౌరులు కట్టిరి. కాని వారి నాయకులు మాత్రము నిర్మాణ కార్యకర్తలు నియమించిన కాయ కష్టము చేయుటకు నిరాకరించిరి.

6. పాసెయా కుమా రుడైన యోయాదా, బెసోద్యా కుమారుడైన మెషుల్లాము పాతద్వారమును పునర్నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి తలుపులు పెట్టి, గడియలు, తాళములు అమర్చిరి.

7. దాని ప్రక్కభాగమును పశ్చిమ యూఫ్రటీసు అధికారి న్యాయపీఠముంచబడు భవనము వరకు నిర్మించినవారు గిబియోనీయుడగు మెలట్యా, మెరోనోతునకు చెందిన యాదోను, గిబ్యోను మిస్పా పట్టణ పౌరులు.

8. హర్హయా కుమారుడు స్వర్ణకారుడునైన ఉజ్జీయేలు ఆ మీదటి భాగము కట్టెను. అత్తర్ల పనివాడైన హనన్యా దాని ప్రక్కభాగమును వెడల్పు గోడవరకు కట్టెను.

9. యెరూషలేము అర్ధమండల పాలకుడును, హూరు కుమారుడునగు రెఫాయా ఆ మీదటి భాగము కట్టెను.

10. దానికి ఆవలిగోడను హరూమపు కుమారుడైన యెదాయా తననింటికి ఎదురుగా నిర్మించెను. హషబ్నెయా కుమారుడైన హట్టూషు దాని ప్రక్కభాగమును కట్టెను.

11. దానికి ఆనుకొనియే హారిము కుమారుడైన మల్కియా, పహత్మోవబు కుమారుడగు హష్షూబు కట్టిరి. పొయ్యి ద్వారమును గూడ వారే కట్టిరి.

12. యెరూషలేము రెండవ అర్ధభాగమునకు అధిపతియు, హల్లో హేషు కుమారుడైన షల్లూము దాని ప్రక్కభాగమును కట్టెను. షల్లూము కుమార్తెలునూ పనిలో అతనికి తోడ్పడిరి.

13. హానూను మరియు సనోవా పౌరులు కలిసి లోయద్వారమును నిర్మించిరి. వారు దానికి దూలములు నిలిపి, తలుపులు పెట్టి, గడియలు, తాళములు అమర్చిరి. ప్రాకారమును పెడద్వారమువరకు వెయ్యిమూరల పొడవున మరమ్మతు చేసిరి.

14. బేత్ హక్కేరము మండల పాలకుడును రేకబు కుమారుడునగు మలకియా పెడద్వారమును కట్టెను. అతడు దానికి దూలములు నిలిపి, తలుపులు పెట్టి, గడియలు, తాళములు అమర్చెను.

15. మిస్ఫా మండలాధిపతియు కొల్హోసే కుమారుడునగు షల్లూము జలధారద్వారమును నిర్మించెను. దానికి తలుపులు పెట్టి, గడియయు, తాళమున మర్చెను. షేలా మడుగుచెంత రాజోద్యానవనము ప్రక్కన ప్రాకారము కట్టించెను. ఈ గోడ దావీదు నగరము మెట్లవరకు పోయెను.

16. బేత్సూరు మండల పాలకుడును అస్పూకు కుమారుడునగు నెహెమ్యా దాని ప్రక్కభాగము నిర్మించెను. ఈ గోడ దావీదు సమాధి, కృత్రిమమడుగు, సైనికాశ్రయమువరకు పోయెను.

17. దాని ప్రక్కభాగమున క్రింది లేవీయులు నిర్మించిరి. బానీ కుమారుడగు రెహూము ఆ మీదటి భాగమును కను. కెయిలా మండలములోని అర్ధ భాగమునకు అధిపతియైన హషబ్యా తనమండలము తరపున ఆ తరువాతి భాగమును కట్టెను.

18. కెయిలా మండలములోని అర్ధభాగమునకు అధిపతియు హేనాదాదు కుమారుడునైన బవ్వయి దాని తరువాతి భాగమును కట్టెను.

19. మిస్పా మండలాధిపతియు యేషూవ కుమారుడునైన ఏసేరు ఆ మీది భాగమును కట్టెను. ఆ గోడ ఆయుధాగారము నుండి ప్రాకారము వంపుతిరుగు తావువరకు పోయెను.

20. సబ్బయి కుమారుడగు బారూకు ప్రక్కభాగము కట్టెను. ఆ గోడ ప్రధానయాజకుడగు ఎల్యాషిబు ఇంటివరకు పోయెను.

21. ఆ మీదటి భాగమును హక్కోజు మనుమడును ఊరియా కుమారుడునైన మెరేమోతు నిర్మించెను. ఆ గోడ ప్రధానయాజకుని ఇల్లు మొదలుకొని ఆవలికొన వరకు పోయెను..

22. దాని ప్రక్కభాగమును ఈ క్రింది యాజకులు నిర్మించిరి. యెరూషలేము ప్రాంతపు యాజకులు ఆ మీదటి భాగమును నిర్మించిరి.

23. బెన్యామీను, హష్షూబు తమ ఇండ్లకెదురుగా తరువాయి గోడను కట్టిరి. అటు తరువాతి భాగమును అనన్యా మనుమడును, మాసెయా కుమారుడైన అసర్యా తన ఇంటికెదురుగా నిర్మించెను.

24. అటు తరువాత హీనాదాదు కుమారుడైన బిన్నుయి అజర్యా ఇంటినుండి ప్రాకారము మూలవరకు గోడ కట్టెను.

25. ఆ మీదట ఊసయి కుమారుడగు పాలాలు కట్టెను. చెరసాల చెంతగల మీది రాజప్రసాదము చెంతనున్న బురుజు వరకును, ప్రాకారపు మలుపువరకును అతడు కట్టెను.

26. పరోషు కుమారుడైన పెదయా తరువాతి భాగమును కట్టెను. ఆ గోడ జలద్వారము వరకును, దేవాలయ రక్షణ బురుజువరకును పోయెను.

27. తెకోవా పౌరులు తరువాతి భాగమును కట్టిరి. ఆ గోడ దేవాలయము ఎదుటి బురుజునుండి ఓఫేలు గోడవరకు పోయెను.

28. అశ్వద్వారము నుండి యాజకులెవరి ఇంటిముందు వారు గోడకట్టిరి. 

29. ఇమ్మేరు కుమారుడైన సాదోకు తరువాతి భాగమును తన ఇంటికెదురుగా కట్టెను. తూర్పుద్వారమునకు పాలకుడును, షెకన్యా కుమారుడునగు షేమయా తరువాతి గోడను కట్టెను.

30. షెలెమ్యా కుమారుడైన హనన్యా, సాలాపు ఆరవ కుమారుడైన హానూను తరువాతి భాగమును కట్టిరి. బెరాకియా కుమారుడైన మెషుల్లాము తరువాతి గోడను తనింటికెదురుగా కట్టెను.

31. స్వర్ణకారుని కుమారుడైన మల్కియా తరువాతి భాగమును కట్టెను. దేవాలయపు పనివారు, వర్తకులు వాడుకొను భవనము వరకు అతడు కట్టేను. ఈ భవనము దేవాలయ రక్షణద్వారము చెంత ప్రాకారము మీద కట్టబడిన గది దాపున కలదు.

32. ఆ గదియొద్దనుండి గొఱ్ఱెల ద్వారమువరకుగల గోడను స్వర్ణకారులు, వ్యాపారులు కలిసి నిర్మించిరి.

 1. మేము గోడ కట్టుచున్నామని విని సన్బల్లటు ఆగ్రహము చెందెను. మమ్ము గేలిచేసెను.

2. అతడు తన మిత్రులు, సమరియా సైనికులు వినుచుండగా “ఈ వాజమ్మలేమి చేయగలరు? వీరు పట్టణమును పునర్నిర్మింపగలరా? బలులర్పించగలరా? పని ఒక్క రోజులో ముగించగలరా? ఈ మొనగాండ్రు బూడిద కుప్పనుండి రాళ్ళెత్తి భవనములు కట్టుదురా?" అని పరిహసించెను.

3. అప్పుడతని ప్రక్కనే నిలుచుండియున్న అమ్మోనీయుడు తోబియా “వారేమి గోడ కట్టగలరు? గుంటనక్క ఆ గోడమీదికెగిరినచో దాని రాళ్ళు కూలిపడును"అనెను.

4. అప్పుడు నేను "ప్రభూ! వారు మమ్మెట్లు పరిహసించుచున్నారో చూచితివిగదా? వారి వేళాకోళము వారికే చుట్టుకొనునుగాక! శత్రువులు వారిని బందీలను చేసి ప్రవాసమునకు కొనిపోవుదురు గాక!

5. నీవు వారి పాపములను మన్నింపవలదు, విస్మరింపవలదు. మేము గోడను కట్టుకొనుచుండగా వారు మమ్ము ఎగతాళి చేసిరి గదా!" అని ప్రార్ధించితిని.

6. మేము మాత్రము గోడకట్టుచునే యుంటిమి. ప్రజలు ఉత్సాహముతో పనిచేసిరి కనుక అది సగమెత్తువరకు లేచెను.

7. సన్బల్లటు, తోబియా, అరబ్బులు, అమ్మోనీయులు, అష్డోదు పౌరులు మేము గోడ కట్టుచున్నామని, గోడలోని బీటలన్నిటిని పూడ్చివేయుచున్నామని విని ఆగ్రహించిరి.

8. కనుక వారందరు ఏకమై వచ్చి యెరూషలేమును ఎదిరించి మా పనికి అంతరాయము కలిగింపవలెనని కుట్రపన్నిరి.

9. కాని మేము ప్రభువును ప్రార్ధించి వారి రాకను గుర్తించుటకై మా ప్రజలను రేయిపగలు కాపు పెట్టితిమి.

10. యూదీయులు “బరువులెత్తువారికి శక్తి రోజు రోజుకు సన్నగిల్లిపోవుచున్నది. తొలగింపవలసిన చెత్త ఇంకను విస్తారముగానున్నది. ఇక ఈ గోడను మనము ముగింపలేము"అనిరి.

11. మా శత్రువులు తాము ఆకస్మికముగా వచ్చి మా మీద పడువరుకు మేము వారిని గుర్తింపలేమనుకొనిరి. మమ్ము చంపి, మా పని ఆపివేయవచ్చునని తలంచిరి.

12. మా శత్రువుల నడుమ వసించు యూదులు వచ్చి నలుదిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలయునని, పదేపదే మమ్ము అర్ధింపగా

13. అందు నిమిత్తము గోడవెనుకనున్న దిగువ స్థలములలోను, ఎగువస్థలములలోను ఉన్న జనులను వారివారి కుటుంబముల ప్రకారము వారి కత్తులు, బల్లెములు, విండ్లు ఇచ్చి కాపుంచితిని.

14. మా జనులు భయపడుచుండిరి. కనుక నేను వారిని, వారి నాయకులను, అధికారులను హెచ్చరించుచు “మీరు శత్రువులను చూచి భయపడవలదు. మన ప్రభువెంత ఘనుడో, ఎంత భయంకరుడో స్మరించుకొనుడు. మీరు మీ తోడి జనము కొరకు, మీ పిల్లల కొరకు, మీ భార్యల కొరకు, మీ నివాసము మీకుండునట్లు పొరాడుడు” అని పలికితిని.

15. మా శత్రువులు మేము వారి పన్నాగములను గుర్తించితిమనియు, ప్రభువు వారి యత్నమును విఫలము చేసెననియు గ్రహించిరి. మేమందరము మరల గోడకట్టుటకు పూనుకొంటిమి.

16. ఆనాటి నుండి మా ప్రజలలో సగము మంది మాత్రమే పనిచేసిరి. మిగిలిన సగము మంది బల్లెములు, డాళ్ళు, విండ్లు, కవచములు తాల్చి, గోడకు కాపు కాచిరి. మా నాయకులు గోడ కట్టువారికి పూర్తిగా మద్దతునిచ్చిరి.

17. గోడ కట్టువారు ఒక చేతపని చేయుచు మరియొకచేత ఆయుధము తాల్చిరి.

18. పనివారందరు నడుమునకు కత్తి వ్రేలాడగట్టుకొనిరి. అపాయమును ఎరిగించుచు బాకానూదువాడు నా ప్రక్కనే ఉండును.

19. నేను ప్రజలతో వారి నాయకులతో అధిపతులతో "మనము చాలదూరమువరకు విస్తరించియున్న గోడమీద పనిచేయుచున్నాము. ఒకరికొకరము చాల ఎడముగ ఉన్నాము.

20. బాకా చప్పుడు విన్పింపగనే ఎక్కడున్నా మీరెల్లరు నా చుట్టు ప్రోగుకండు. మనదేవుడు మన పక్షమున పోరాడును" అని నుడివితిని.

21. ఆ రీతిగా ప్రతిదినము మాలో సగము మంది వేకువజాము నుండి రేయిచుక్కలు కన్పించు వరకు పనిచేసిరి. మిగిలిన సగముమంది బల్లెములు చేపట్టి గోడకు గస్తుతిరిగిరి.

22. నేనింకను ప్రజలతో “మీరెల్లరు మీ మీ సేవకులతో రేయి నగరముననే ఉండిపొండు. మనము పగలెల్ల పనిచేసి రేయి పట్టణమునకు కావలికాయుదము” అని చెప్పితిని. 

23. నేను, నా మిత్రులు, నా సేవకులు అంగరక్షకులు రాత్రి బట్టలు మార్చుకోమైతిమి. నిత్యము ఆయుధములు తాల్చియేయుంటిమి.

 1. యూదయా స్త్రీలు, పురుషులు కూడ వారి సోదరయూదులమీద అభియోగము తెచ్చిరి.

2. కొందరు “మా బిడ్డలను మారకము వేసి, మేము ధాన్యము తెచ్చుకొని తిని బ్రతుకవలసి వచ్చినది” అనిరి.

3. మరికొందరు "మేము ధాన్యము తెచ్చుకొనుటకు మా పొలములు, ద్రాక్షతోటలు ఇండ్లు తాకట్టు పెట్టవలసి వచ్చినది"అని పలికిరి.

4. ఇంకా కొందరు “మా పొలములను, ద్రాక్షతోటలను కుదువబెట్టి డబ్బు అప్పు తీసికొని రాజుగారికి పన్ను కట్టవలసివచ్చినది.

5. మేము మా తోటి యూదులవంటివారముకామా? వారికి అవసరమైనవి మాకు మాత్రము అవసరము కాదా? మా పిల్లలు వారిపిల్లల వంటివారు కారా? అయినను మా బిడ్డలు దాసత్వములో ఉండిరి. మా ఆడుపిల్లలు కొందరిని ఇదివరకే దాసీలుగా అమ్మి వేసితిమి. మా పొలములు, ద్రాక్షతోటలనిదివరకే అన్యులదగ్గర కుదువబెట్టితిమి, గనుక దాసులుగా అమ్ముడుపోయిన పిల్లలను తిరిగి కొనితెచ్చుకోజాలకున్నాము” అని పలికిరి.

6. వారి మొర విని నేను మండిపడితిని.

7. ఆ సంగతి నాకు నేనే ఆలోచించి చూచుకొని ప్రజా నాయకులను, అధిపతులను పిలిపించి చీవాట్లు పెట్టితిని. “మీరు మీ తోడి యూదులను పీడించి వడ్డీ వసూలు చేయుచున్నారు” అని చెప్పితిని. అటు పిమ్మట ప్రజలనందరిని ప్రోగు చేయించితిని.

8. “మేము అన్యజాతి ప్రజలకు దాసులుగా అమ్ముడుపోయిన మన తోడి యూదులను మా శక్తికొలది దాసత్వము నుండి విడిపించుచున్నాము గదా! ఇప్పుడు మీరు మీ సోదర ప్రజలను తోడి యూదులకే దాసులుగా అమ్మివేయుచున్నారు” అని మందలించితిని. ప్రజానాయకులు నా మాటలకు జవాబు చెప్పజాలక మౌనము వహించిరి.

9. నేను మరల “మీరు చేయు పని మంచిదికాదు. మీరు దేవునికి భయపడి ఇట్టి దుష్కార్యములు చేయుట మానుకోవలెను గదా! అప్పుడు గాని మన శత్రువులైన అన్యజాతి ప్రజలు మనలను అవహేళన చేయకుండ ఉండరు.

10. మీవలే నేను కూడ ఈ ప్రజలకు డబ్బును, ధాన్యమును అరువిచ్చితిని. నా స్నేహితులు, నాతో పనిచేయువారును అటులనే చేసిరి. ఇప్పుడు మనమందరము ప్రజలు ఈ అప్పులు తీర్చనక్కర లేదని నిర్ణయించుకొందము.

11. కనుక నేడే ఈ ప్రజల పొలములు, ద్రాక్షతోటలు, ఓలీవు తోటలు, ఇండ్లు ఎవరివి వారికి వదిలివేయుడు. డబ్బు, ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలీవునూనె మొదలైన అప్పులన్నిటిని మన్నించి వదలివేయుడు” అని పలికితిని.

12. ప్రజానాయకులు “మేము నీవు చెప్పినట్లే చేయుదుము. వారి పొలములు వారికి ఇచ్చివేయుదుము. మేమిచ్చిన అప్పులు తిరిగి వసూలు చేయము” అని పలికిరి. వెంటనే యాజకులను పిలిపించి నాయకుల చేత వారెదుటనే ప్రమాణము చేయించితిని.

13. నేను నడికట్టుగా కట్టుకొన్న బట్టను విప్పి వారి యెదుటనే దులిపితిని. “ఇప్పుడు మీరు చేసిన ప్రమాణములను నిలబెట్టుకొననిచో ప్రభువు కూడ మీ యిండ్లనుండి, మీ జీవనోపాధికి మీరు చేయు పనినుండి ఇట్లే దులిపివేయును”అని నుడివితిని. అక్కడ గుమిగూడిన వారందరు “ఇట్లే జరుగునుగాక!” అని బదులు పలికి ప్రభువునుసన్నుతించిరి. తరువాత వారందరు తమ మాట నిలబెట్టుకొనిరి.

14. ఇంకను రాజు నన్ను యూదా రాజ్యమునకు అధికారిగా నియమించిన పండ్రెండేండ్లు, అనగా అర్తహషస్తరాజైన యిరువదియవయేటి నుండి ముప్పది రెండవ యేటివరకు, నేనును, నా బంధువులును ప్రజలనుండి అధికారికి లభింపవలసిన భోజన వేతనములను ముట్టుకొనియెరుగము.

15. నాకు ముందు అధికారులుగా పనిచేసినవారు వారి అన్నపానీయములకు ప్రజలనుండి రోజుకు నలుబది వెండి నాణెములు వసూలుచేసి వారిని వేధించెడివారు. వారి సేవకులు కూడ ప్రజలను పీడించెడివారు. కాని నేను దేవునికి భయపడి అట్టి దుష్కార్యములు చేయనైతిని.

16. నా శక్తినంతటిని ప్రాకారము కట్టుటకు ధారపోసితిని. నేను పొలము పుట్ర సంపాదించుకోలేదు. నా తోటిపనివారందరు గోడ కట్టుటలో నిమగ్నులైరి.

17. దినదినము నూట యేబదిమంది యూద నాయకులు, అధిపతులు నా ఇంట భోజనము చేసెడి వారు. ఇంకను ఇరుగుపొరుగు జాతుల ప్రజలు కూడ నా యింటికొచ్చి అన్నము తినిపోయెడివారు.

18. ప్రతిదినము ఒక కోడెను, ఆరు మంచి పొట్టేళ్ళను, చాల కోళ్ళను కోయించెడివాడను. పదిరోజులకు ఒక సారి ద్రాక్షసారాయము తెప్పించి నిల్వచేసెడివాడను. ఇంత వ్యయమైనప్పటికీ అధికారి పోషణకు లభింపవలసిన పన్నును వసూలు చేయింపలేదు. ప్రజలప్పటికే దారిద్ర్యభారము వలన నలిగిపోవుచుండిరి.

19. 'ప్రభూ! నీవు మాత్రము నేనీ ప్రజలకు చేసిన ఉపకారమును జప్తియందుంచుకొనుము'.

 1. సన్బల్లటు, తోబియా, గేషెము, ఇంక ఇతర శత్రువులు మేము ప్రాకారమును కట్టి ముగించితి మనియు, దాని బీటలన్నింటిని పూడ్పించితిమనియు వినిరి. అప్పటికింకను మేము ద్వారములకు తలుపులు పెట్టలేదు.

2. సన్బల్లటు, గేషేము “ఓనో మైదానమున ఒక నిర్ణీత గ్రామమున మనమందరము కలసికొందము రమ్ము" అని నాకు కబురుపెట్టిరి. నాకు కీడుచేయుటకు వారు పన్నినకుట్ర యిది.

3. నేను వారిచెంతకు దూతలనంపి నేనిక్కడ మహత్తర కార్యమునందు నిమగ్నుడనైయున్నాను. కనుక మీ చెంతకు రాజాలను. నేను మీయొద్దకు వచ్చినచో ఇక్కడి పని కుంటు పడిపోవును. మా పనికి అంతరాయము కలిగించుకోవలసిన అవసరమేమి వచ్చినది?” అని బదులిచ్చితిని.

4. వారు నాకు నాలుగు మార్లు అదే సందేశము పంపగా, నేనును అదే విధముగా ప్రత్యుత్తరమిచ్చితిని.

5. ఐదవ మారు సన్బల్లటు జాబునిచ్చి తన సేవకుని పంపెను. ఆ జాబు ముడిచి ముద్రవేసినది కాదు.

6. అందలి సమాచారమిది: “నీవు, మీ యూదులు రాజుపై తిరుగబడుటకే ఆ ప్రాకారమును కట్టించుచున్నారని ఇరుగు పొరుగువారు అనుకొనుచున్నారట. ఇది గేషెము నాకు విన్పించిన వార్త. నీవు రాజు కావలెనని కోరుకొనుచున్నావట.

7. పైగా నీవే యూదాకు రాజువని యెరూషలేమున ప్రచారము చేయుటకుగాను ప్రవక్తలను గూడ నియమించితివట. ఈ వార్తలు రాజు చెవికెక్కుట తథ్యము. కనుక నీవిటకు వచ్చి ఈ సంగతులెల్ల మాతో చర్చించి పొమ్ము."

8. నేనతనికి ప్రతివార్త పంపి, “నీ మాటలు నిజముకావు. వీనినెల్ల నీవే కల్పించితివి"అని చెప్పించితిని.

9. ఈ రీతిగా మమ్ము బెదరగొట్టినచో మేము విసిగిపోయి పని ఆపివేయుదుమని, ఆ మీద ఈ గోడ యిక ముగియదని వారి తలపు. 'ప్రభూ! నీవు మాత్రము నాకు బలమును ప్రసాదింపుము!'

10. ఇదే సమయమున నేను మహితబేలు మనుమడును దెలాయా కుమారుడునగు షెమయాను చూడబోయితిని. అతడు నిర్బంధింపబడుటచే నన్ను స్వయముగా కలువజాలకుండెను. అతడు నాతో “మన మిరువురము పారిపోయి దేవాలయ గర్భగృహమున దాగికొని తలుపులు బిగించుకొందము. వారు నిన్ను చంపుటకు ఈ రాత్రియే వత్తురు" అని పలికెను.

11. కాని నేనతనితో “నావంటివాడు పారిపోయి దేవాలయమున దాగికొని ప్రాణములు రక్షించుకొనుటయా? నేనట్టి పనిచేయను” అని చెప్పితిని.

12. అసలు ప్రభువతనిని ఇట్టి ప్రవచనము చెప్పుమని అననేలేదు. అతడు తోబియా సన్బల్లటులయొద్ద డబ్బు పుచ్చుకొని యిట్టి సందేశము విన్పించెనని నేను గ్రహించితిని.

13. వారతనితో కుదుర్చుకొని నన్ను భయపెట్టించి, నా చేత పాపము చేయింపజూచిరి. ఆ మీదట నా పేరు చెడగొట్టి, నన్ను అవమానపరపవచ్చును గదా! అని వారి పన్నాగము.

14. ప్రభూ! తోబియా, సన్బల్లటులు చేసిన ఈ దుష్కార్యమును జ్ఞప్తియందుంచుకొనుము. వారిని శిక్షింపుము. నన్ను భయపెట్టజూచిన ఆ ప్రవక్తి నోవద్యాను మరియు ఈ ఇతర ప్రవక్తలను మరచిపోకుము.

15. ఏబది రెండు రోజులు పనిచేసిన తరువాత ఏలూలు నెలలో ఇరువదియైదవనాడు గోడ ముగిసెను.

16. మా శత్రువులు మాచుట్టుపట్లనున్న జాతులు గోడ ముగిసినదని విని చాల అధైర్యపడిరి. ఏలయన వారెల్లరు ప్రభువు మహాత్మ్యము వలననే ఈ పని జరిగినదని తెలిసికొనిరి.

17. ఈ కాలమున యూదా పెద్దలు చాలమంది తోబియాతో ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుచుండిరి.

18. యూదా పెద్దలు చాలమంది అతని కోపు తీసుకొనిరి. ఎందుకన అతడు ఆరా కుమారుడగు షెకన్యాకు అల్లుడు. ఇదియునుగాక, తోబియా కుమారుడగు యోహానాను, బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను పెండ్లియాడెను.

19. ఆ పెద్దలు తోబియా చేసిన మంచిపనులెల్ల నా ఎదుట వల్లించెడివారు. నేను పలికిన పలుకులు మరల అతని చెవిలో పడవేసెడివారు. నన్ను బెదిరించుట కొరకు అతడు జాబు తరువాత జాబువ్రాసెడివాడు.

 1. నేను ప్రాకారము నిర్మించి, ద్వారములు నిలిపి, ద్వారసంరక్షకులును, లేవీయులను, పాటలు పాడు వారిని నియమించిన పిమ్మట,

2. యెరూషలేమును పాలించుటకు నా సహోదరుడు హనానీకిని మరియు కోటను సంరక్షించుచున్న హనన్యాకును అధికారమిచ్చితిని. హనన్యా నమ్మదగినవాడు, అందరికంటె అధికమైన దైవభయము కలవాడు.

3. నేను వారితో ఉదయము ప్రొద్దెక్కువరకు నగరద్వారములు తెరవరాదనియు, సాయంకాలము ప్రొద్దుగ్రుంకక మునుపే వానిని మరల మూసి గడెలు బిగింపవలెననియు ఆజ్ఞాపించితిని. యెరూషలేమున వసించువారిని కొందరిని రక్షకభటులుగా నియమింపుడని ఆదేశించితిని. వారిలో కొందరు కొన్ని తావులందు, మరికొందరు వారివారి యింటిపట్టులందు వంతులచొప్పున కాపుండ నియమింపవలెనని చెప్పితిని.

4. యెరూషలేము పట్టణము విశాలముగా ఉన్నదిగాని అందువసించువారు మాత్రము కొద్దిమందియే. ఇంకను ఇళ్ళు కట్టబడలేదు.

5. కనుక ప్రజలను, వారి నాయకులను ప్రోగుజేసి ఆయా కుటుంబముల జనాభా లెక్కలు సరిచూడవలెనను ప్రేరణను దేవుడు నాకు కలిగించెను. ప్రవాసము నుండి మొట్టమొదట తిరిగివచ్చినవారి జాబితాలు దొరకినవి. ఆ వివరములు ఇవి.

6. ఈ క్రింది ప్రజలు యూదా రాజ్యవాసులు. బబులోనియా రాజగు నెబుకద్నెసరు వారిని బందీలుగా కొనిపోయెను గదా! వారిప్పుడు ప్రవాసము నుండి తిరిగివచ్చి యెరూషలేము యూదా దేశములోని తమ తమ నగరములు చేరుకొనిరి.

7. ఇట్లు తిరిగి వచ్చిన వారి నాయకులు సెరుబ్బాబెలు, మేషూవ, నెహెమ్యా, అసర్యా, రామాయా, నహమని, మొర్దేకయి, బిల్షాను, మిస్పేరెతు, బిగ్వయి, నెహూము, బానా.

8-25. ప్రవాసమునుండి తిరిగివచ్చిన వివిధ కుటుంబములు, వారి సంఖ్యలివి: పరోషు -2172; షేపట్య-372; ఆర-652; పహత్మోవబు (యేషూవ, యేవాబు వంశజులు)-2818; ఏలాము-1254; సత్తు-846; జక్కయి-760; బిన్నుయి-648; బేబై-628; అస్గాదు-2322; అదోనీకాము-667; బిగ్వయి-2067; ఆదీను-655; హిజ్కియా అనబడు ఆతేరు-98; హాషూము-328; బేసయి-324; హారీఫు-112; గిబ్యోను-95.

26-38. ఈ క్రింది నగరములకు చెందినవారు ప్రవాసము నుండి తిరిగివచ్చిరి. వారి సంఖ్యలివి: బేత్లహేము, నెటోఫా-188; అనాతోతు-128; బేతస్మావేతు-42; కిర్యత్యారీము, కేఫిరా, బేరోతు-743; రామా, గేబా-621; మిక్మాసు-122; బేతేలు, ఆయి-123; రెండవ నెబో-52; రెండవ ఏలాము -1254; హారిము-320; యెరికో-345;  లోదు, హాదిదు, ఓనో-721; సేనా-3930.

39-42. ప్రవాసము నుండి తిరిగివచ్చిన యాజక కుటుంబములు, వారి సంఖ్యలివి: యేషూవ వంశజుడగు యెదాయా-973; ఇమ్మేరు-1052; పషూరు-1247; హారిము-1017.

43. లేవీయకుటుంబములు, వారి సంఖ్యలివి: కద్మీయేలు వంశజులైన యేషూవ, హోదవ్యా -74.

44. ఆసాపు వంశజులైన దేవాలయ గాయకులు-148.

45. షల్లూము, ఆతీరు, తల్మోను, అక్కూబు, హతీతా, షోబయి కుటుంబములకు చెందిన దేవాలయద్వార సంరక్షకులు-138.

46-56. ప్రవాసము నుండి తిరిగివచ్చిన దేవాలయ పనివాండ్రు (నెతీనీయులు); సీహా, హసూఫా, టబ్బావోతు, కెరోసు, సియా, పాదోను, లెబనా, హగాబా, షల్మయి, హానాను, గిద్దేలు, గహారు, రెయాయ, రెసీను, నెకోదా, గస్సాము, ఉజ్జా, పాస్యా, బెసాయి, మెవూనీము, నెఫూషేసిము, బక్బూకు, హకూఫా, హర్హురు, బస్లీతు, మెహీదా, హర్షా, బర్కోసు, సీసెరా, తేమ, నెసీయా, హతీఫా.

57-59. ప్రవాసమునుండి తిరిగివచ్చిన సొలోమోను సేవకులు: సోటయి, సోఫెరెతు, పెరీదా, యాలా, దర్కోను, గిద్దెలు, షెఫట్య, హత్తీలు, పోకెరెతు, హస్సెబాయీము, ఆమోను.

60. దేవాలయ పనివాండ్రు, సొలోమోను బంటులు మొత్తము కలసి-392.

61-62. దెలాయా, తోబియా, నెకోదా కుటుంబములకు చెందినవారు 642 కలరు. వీరు తెల్మేలా, టెల్హర్షా, కెరూబు, అద్ధోను, ఇమ్మేరు నగరములనుండి తిరిగివచ్చిరి. కాని వీరు తాము యిస్రాయేలు వంశజులని ఋజువు చేసికోలేకపోయిరి.

63-65. హోబయా, హక్కోసు, బెర్సిల్లయి అను కుటుంబములకు చెందిన యాజకులు వారి మూల పురుషులను చూపలేకపోయిరి. బెర్సిల్లయి కుటుంబపు మూలపురుషుడు గిలాదునందలి బర్సిల్లయి కుటుంబమునకు చెందిన ఆడపడుచును పెండ్లియాడి తన మామ కుటుంబనామమును స్వీకరించెను. వారు తమ పూర్వుల నామముల కొరకు జాబితాలు గాలించిరి గాని, ఆ పేర్లు దొరకలేదు. కనుక వారిని శుద్ధిగల వారిగా యాజకులుగా గణింపలేదు. వారిని గూర్చి ఉరీము తుమ్మీము ధరించుకొని దైవచిత్తమును తెలిసికొను యాజకుడెవరైన ఏర్పడువరకు వారు పవిత్ర నైవేద్యములు భుజింపరాదని అధికారి కట్టడచేసెను.

66-69. ప్రవాసమునుండి తిరిగివచ్చినవారు మొత్తము -42360. వారి మగబానిసలు, ఆడుబానిసలు-7337. పాటలు పాడువారు, ఆడువారు, మగవారు కలిసి-245. గుఱ్ఱములు-736, కంచర గాడిదలు-245, ఒంటెలు-435, గాడిదలు-6720.

70-72. నాయకులు చాలమంది వనికి విరాళములిచ్చిరి. ఆ వివరములివి: అధికారి: 1000 బంగారు నాణెములు,  50 అర్చన పాత్రలు, 530 యాజక వస్త్రములు. ఆయాకుటుంబాల పెద్దలు: 20000 బంగారు నాణెములు, 2200 వెండి కాసులు. మిగిలిన ప్రజలు: 20000 బంగారు నాణెములు, 2000 వెండి నాణెములు, 67 యాజక వస్త్రములు.

73. యాజకులు, లేవీయులు, దేవాలయ ద్వారసంరక్షకులు, గాయకులు, దేవాలయ పరిచారకులు, సామాన్య జనులు మొదలైన యిస్రాయేలీయులందరు తమతమ నగరములలో స్థిరపడిరి.

 1. ఏడవనెల వచ్చునప్పటికి యిస్రాయేలీయులందరు తమతమ నగరములందును పట్టణములందును స్థిరపడిరి. ప్రజలెల్లరు ఒక్కుమ్మడిగా పయనమై వచ్చి జలద్వారమునొద్దగల మైదానమున ప్రోగైరి. వారు ధర్మశాస్త్ర బోధకుడగు ఎజ్రాను చూచి ప్రభువు మోషేద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్ర గ్రంథమును కొనిరమ్మనిరి.

2. ఏడవనెల, మొదటి దినమున ఎజ్రా గ్రంథమును తెచ్చెను. అచట స్త్రీలు, పురుషులు, ధర్మశాస్త్రమును అర్ధముచేసికొనుపాటి ప్రాయముగల పిల్లలు గుమిగూడియుండిరి.

3. అతడా మైదానముననే ప్రజలెదుట ఉదయము నుండి మధ్యాహ్నము వరకు గ్రంథము చదివెను. ఎల్లరు సావధానముగా వినిరి.

4. సమావేశము కొరకు ప్రత్యేకముగా నిర్మించిన కొయ్యవేదిక పైకెక్కి ఎజ్రా ధర్మశాస్త్రమును చదివెను. అప్పుడు మత్తిత్యా, షేమ, అనాయ, ఊరియా, హిల్కీయా, మాసేయా అతని కుడి ప్రక్కన నిలుచుండిరి. అతని ఎడమ ప్రక్కన పెదయా, మిషాయేలు, మల్కియా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము నిలుచుండిరి.

5. ఎజ్రా వేదికనెక్కి యుండుటచే అందరికంటె ఎత్తున నిలబడెను. కనుక ప్రజలెల్లరు అతనివైపు చూచుచుండిరి. అతడు గ్రంథము విప్పగనే జనులెల్లరు లేచి నిలుచుండిరి.

6. ఎజ్రా మహాదేవుడైన యావేను స్తుతించెను. ప్రజలెల్లరు చేతులు పైకెత్తి “ఆమెన్ ఆమెన్ అని బదులు పలికిరి. అటుపిమ్మట ఎల్లరు నేలమీద సాగిలపడి యావేకు నమస్కరించిరి.

7. అంతట ప్రజలు లేచి తమతమ తావులందు నిలుచుండిరి. అప్పుడు ఈ క్రింది లేవీయులు వారికి ధర్మశాస్త్ర భావమును వివరించిరి:" యేషూవ, బానీ, షేరెబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతయి, హోదీయా, మాసెయా, కేలీటా, అసర్యా, యోసాబాదు, హనాను, పెలాయా.

8. వారు ధర్మ శాస్త్రమును చదివి దానిననువదించిరి. దాని తాత్పర్యమును వివరించిరి. ఆ చదివిన భాగమును ప్రజలు అర్ధము చేసికొనిరి.

9. ప్రజలు ధర్మశాస్త్రమును ఆలించి దుఃఖము పట్టలేక బోరున ఏడ్చిరి. కనుక అధికారి నెహెమ్యా, యాజకుడును, ధర్మశాస్త్ర బోధకుడు అయిన ఎజ్రా, ప్రజలకు బోధచేయుచున్న లేవీయులు జనులను చూచి “ఇది ప్రభువునకు పవిత్రదినము. కనుక మీరు దుఃఖింపవలదు” అని చెప్పిరి.

10. మరియు అతడు వారితో “ఇక యింటికి వెళ్ళి క్రొవ్విన మాంసమును మధుర పానీయములను సేవించి ఆనందింపుడు. మీ అన్నపానీయములను పేదలకుగూడ పంచియిండు. నేడు ప్రభువునకు పవిత్రదినము కనుక మీరు దుఃఖింపవలదు. యావేనందు ఆనందించుటయే మీకు శక్తి.” అని చెప్పెను.

11. లేవీయులు ప్రజల మధ్యకు వెళ్ళి “దుఃఖింపకుడు. ఇది ప్రభువునకు పవిత్రదినము” అని చెప్పుచు వారినోదార్చిరి.

12. తమకు తెలియజేయబడిన మాటలన్నియు అర్ధము చేసుకొని ప్రజలు తమ ఇండ్లకు వెళ్ళి ఆనందముతో తిని, త్రాగిరి. పేదసాదలకు అన్నపానీయములు పంపించిరి.

13. రెండవ రోజు ప్రజానాయకులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్రమును వినుటకై ధర్మశాస్త్ర బోధకుడు ఎజ్రా వద్దకు వచ్చిరి.

14. ప్రభువు మోషే ద్వారా జారీ చేసిన ధర్మశాస్త్రమున "ఏడవనెల ఉత్సవము జరుగునపుడు యిస్రాయేలీయులు గుడారములలో వసింపవలయును” అను వాక్యము ఒకటి కలదు. అది వారి కంటబడెను.

15. కనుక వారు యెరూషలేమునందు ఇతర నగరములందు. ఈ క్రింది ప్రకటన జారీ చేయించిరి: “మీరు కొండలకు వెళ్ళి ఓలివు, దేవదారు, గొంజి, ఖర్జూరము మొదలైన గుబురుచెట్ల కొమ్మలను నరికి తెచ్చి ధర్మశాస్త్ర నియమము ప్రకారము గుడారములను నిర్మింపుడు.”

16. ప్రజలు వెంటనే వెళ్ళి కొమ్మలు నరికితెచ్చిరి. వానితో తమ మిద్దెలమీద, ముంగిళ్ళలో, దేవాలయ ప్రాంగణమునందు, జలద్వారము, ఎఫ్రాయీము ద్వారము, మైదానములందు గుడారములు నిర్మించిరి.

17. ప్రవాసమునుండి తిరిగివచ్చిన జనులెల్లరు గుడారములు కట్టి వానిలో వసించిరి. నూను కుమారుడైన యెహోషువ కాలమునుండి యిస్రాయేలీయులు ఇట్టి కార్యమును చేసి ఎరుగరు. ప్రజలెల్లరు పరమానందము నొందిరి

18. పండుగ మొదటి నాటినుండి కడపటి నాటివరకు ఎజ్రా ప్రతి రోజు ధర్మశాస్త్రమును చదువుచుండెను. ఉత్సవము ఏడు రోజులు సాగెను. ఎనిమిదవనాడు నియమము ప్రకారము పండుగ సమావేశము జరుపుకొనిరి.

 1. అదే నెల ఇరువది నాలుగవదినమున యిస్రాయేలీయులు గోనెపట్ట తాల్చి తలమీద ధూళి చల్లుకొని ఉపవాసము చేయుటకు సమావేశమైరి.

2. వారెల్లరు అన్యజాతి ప్రజలనుండి వైదొలగిరి. తాము తమ పూర్వులు చేసిన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడిరి.

3. ఆ ప్రజలు నిలుచుండి ఉండగా మూడుగంటల పాటు ధర్మశాస్త్రమును చదివి విన్పించిరి. మూడు గంటలపాటు ప్రజలు తమ పాపముల నొప్పు కొని యావే దేవుని నమస్కరించుచు ఉండిరి.

4. లేవీయులు వేదిక పైకెక్కి పెద్దగా మొరపెట్టుచు ప్రార్ధనలు చేసిరి. వారు యేషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్ని, షేరెబ్యా,బానీ, కెనానీ.

5. మరియు యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయా, షేరెబ్యా, హోదీయా, షెన్యా, పెతహాయా అను లేవీయులు ప్రభువును స్తుతింపుడని ప్రజలను పోత్సహించుచు ఇట్లు పలికిరి: “మీరెల్లరు నిలుచుండి ప్రభువును స్తుతింపుడు. కలకాలము మన ప్రభువును కొనియాడుడు. ప్రభూ! కీర్తిగల నీ నామమునకు సన్నుతులు నీ దివ్యనామమును మేము ఉచితరీతిన స్తుతింపజాలము.

6. నీవే అద్వితీయుడవైన దేవుడవు. నీవు ఆకాశమును, అందలి నక్షత్రములను, భూమిని దానిమీది ప్రాణులను, సముద్రములను, వానిలోని జలచరములను సృజించితివి. సమస్త ప్రాణులకు జీవమిచ్చినవాడవు నీవే, ఆకాశజ్యోతులు నిన్నారాధించును.

7. నీవు అబ్రామునెన్నుకొంటివి. కల్దీయుల ఊరునుండి అతనిని కొనివచ్చి అబ్రహాము అని పేరు పెట్టితివి.

8. అబ్రహాము విశ్వాసపాత్రుడగుటచే, అతనితో నిబంధనము చేసికొంటివి. కనానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరిస్సీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు, వసించు నేలనతనికి, అతని సంతతికి వారసత్వముగా ఇచ్చెదనంటివి. నీవు నమ్మదగినవాడవు గనుక నీవు చేసిన ప్రమాణములు నిలబెట్టుకొంటివి.

9. ఐగుప్తునందలి మా పితరుల గోడు వింటివి. రెల్లు సముద్రమువద్ద వారి మొరనాలించితివి.

10. ఫరోను అణగదొక్కుటకును, అతని అధికారులను ప్రజలను అణచివేయుటకును, నీవు అద్భుతకార్యములు చేసితివి. గర్వముతో నీ ప్రజలను పీడించిరి గనుక వారిని అణగదొక్కినేటిదనుక ఖ్యాతి గడించితివి.

11. నీవు సముద్రమును చీల్చి దారిచేయగా, నీ ప్రజలు నీళ్ళనడుమ పొడినేలపై నడిచిపోయిరి వారిని వెన్నాడిన శత్రువులు మాత్రము పొంగిపొరలు నీళ్ళలో వేసిన రాయివలె వారిని అగాధజలములలో నీవు పడవేసితివి

12. పగలు మేఘస్తంభముతో, రేయి అగ్నిస్థంభముతో నీ ప్రజను నడిపించితివి.

13. నీవు ఆకసమునుండి దిగివచ్చి సీనాయి కొండమీద నీ జనముతో మాట్లాడితివి. నీతియుక్తమైన చట్టములు, సత్యమైన ఆజ్ఞలను వారికొసగితివి.

14. పరిశుద్ధమైన విశ్రాంతిదినమును వారి కెరిగించితివి. నీ సేవకుడు మోషే ద్వారా ఆజ్ఞలు, కట్టడలు, శాసనములిచ్చితివి.

15. ప్రజలు ఆకలిదప్పులతో అలమటించుచుండగా, ఆకాశమునుండి ఆహారమును, రాతినుండి నీళ్ళను ఒసగితివి. పితరులకు వాగ్దానముచేసిన భూమిని స్వాధీనము చేసికొండని సెలవిచ్చితివి.

16. కాని మా పెద్దలకు తలబిరుసెక్కి నీ ఆజ్ఞలు లెక్కచేయరైరి.

17. వారు నీ మాట జవదాటిరి. నీ అద్భుతకార్యములు విస్మరించిరి. నీపై తిరుగుబాటు చేసి మరల ఐగుప్తునకు తిరిగి వెళ్ళి బానిసలగుటకు ఒక నాయకుని గూడ ఎన్నుకొనిరి. కాని నీవు క్షమాపరుడవు, కరుణాళుడవు, కృపామయుడవు, దయాపూర్ణుడవు, నీవు శీఘ్రముగా కోపించువాడవు కాదు కనుక వారిని విడనాడవైతివి.

18. ప్రజలు పోతదూడను చేసి తమ్ము ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన దేవుడు ఇతడే'యని పలుకుచు నీ కోపమును రెచ్చగొట్టిరి.

19. అయినను నీ అనంతమైన కృపవలన వారిని ఆ ఎడారిలోనే చావనీయవైతివి. రేయింబవళ్లు ప్రజలను నడిపించుచున్న అగ్గికంబము, మబ్బుకంబము వారిని విడనాడవయ్యెను.

20. నీవు మంచివాడవు గనుక ఆ ప్రజకు ధర్మమార్గము బోధించితివి. మన్నాను, జలమును ఒసగి వారిని పోషించితివి.

21. ఎడారిలో నలువదియేండ్లు వారి అక్కరలు తీర్చితివి. వారి బట్టలు చినిగిపోలేదు. వారి పాదములు వాపెక్కలేదు.

22. నీవు శత్రురాజ్యములను నీ ప్రజలవశము చేయగా అవి వారి సరిహద్దులలోని మండలములాయెను. వారు సీహోను రాజు దేశము హెష్బోనును, ఓగురాజు దేశము బానును జయించిరి.

23. చుక్కలవలె లెక్కలకందని మగబిడ్డలను నీ జనమున కొసగితివి. పితరులకు వాగ్దానము చేసిన భూమికి వారిని కొనిపోయితివి.

24. నీ ప్రజలు కనాను దేశమును ఆక్రమించుకొనిరి. అచటి జనులు వారికి లొంగిపోవునట్లు చేసితివి. కనాను రాజులను, జనులను, నీ ప్రజలు తమ ఇష్టము వచ్చినట్లుగా చేయనిచ్చితివి.

25. నీ ప్రజలు సురక్షిత పట్టణములను, సారవంతమైన భూములను, ధనవంతమైన యిండ్లను, త్రవ్విన బావులను, పెక్కు ద్రాక్షతోటలను, ఓలివుతోటలను, పండ్లతోటలను స్వాధీనము చేసికొనిరి. వారు మస్తుగా భుజించి బలసిపోయిరి. నీవిచ్చిన మేలివస్తువులెల్ల హాయిగా అనుభవించిరి.

26. కాని ఆ ప్రజలు నీ మీద తిరుగబడి నీ ధర్మశాస్త్రమును త్రోసివేసిరి. ప్రభువును సేవింపుడని తమను మందలించిన ప్రవక్తలను పట్టి చంపివేసిరి, మాటిమాటికి నిన్ను నిందించిరి.

27. కావున నీవా ప్రజను శత్రువుల వశము చేయగా ఆ శత్రువులు వారిని పీడించి పిప్పిచేసిరి. వారు మరల నీకు మొరపెట్టగా, ఆకాశమునుండి నీవు ఆ వేడికోలు వింటివి. నీవు నెనరుతో పంపిన నాయకులు శత్రుబాధనుండి వారిని కాపాడిరి.

28. కాని బాధలు తీరిపోయిన వెంటనే మరల వారు దుష్కార్యములు చేసిరి. కనుక నీవు వారిని శత్రువులకు వదలివేయగా ఆ విరోధులు వారిని నేలబెట్టి కాలరాచిరి. వారు పశ్చాత్తాపపడి నీకు మొరయిడగా నీవు ఆకాశమునుండి వారిగోడు వింటివి. అనంతకృపతో తేపతేపకు వారిని కాపాడితివి.

29. నీ యాజ్ఞలను పాటింపవలెనని, మాటిమాటికి నీ ప్రజలను హెచ్చరించితివి. అయినను వారు గర్వముతో నీ మాట లెక్కచేయరైరి. నీ విధులను పాటించినచో జీవము కలుగును. కాని వారు మూర్ఖులై నీ శాసనములను ఆచరించరైరి.

30. ఏటేట ఓర్మితో నీవు వారిని మందలించితివి. నీ ప్రవక్తలద్వార వారికి బోధ చేయించితివి. నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివి కాని ఆ బోధలు వారి తలకెక్కలేదు. కనుక వారిని అన్యజాతుల వశము చేసితివి.

31. అయినను అనంత కరుణగలవాడవు కనుక నీవు వారిని సర్వనాశనము చేయలేదు. వారిని విడనాడనులేదు. నీవు కృపానిధివి, దయామయుడవు.

32. ప్రభూ! నీవెంత మహానుభావుడవు! ఎంత భయంకరుడవు! ఎంత శక్తిమంతుడవు! నీవు చేసిన నిబంధనను మీరనివాడవు. అస్సిరియా రాజులు మమ్ము జయించిన నాటినుండి నేటిదనుక మాకు కలిగిన యిక్కట్టులన్ని యిన్ని కావు. మా రాజులు, నాయకులు, యాజకులు, ప్రవక్తలు, పితరులు, ప్రజలు నానా బాధలనుభవించిరి.

33. నీవు మాకు ఇట్టి శిక్షలు విధించుట న్యాయమే. నీవు న్యాయవంతుడవేగాని మేము మాత్రము దోషులము.

34. మా పితరులు, రాజులు, నాయకులు, యాజకులు నీ ఆజ్ఞలను పాటింపలేదు. నీ హెచ్చరికలను లక్ష్యము చేయలేదు.

35. నీ ప్రజలకు విశాలము సారవంతమునైన ఈ దేశము నిచ్చితివి. కాని అచట ఉన్నంతకాలము వారు దుష్టులై నిన్ను సేవింపరైరి.

36. నీవు మా పితరులకిచ్చిన ఫలప్రదమైన నేలపై నేడు మేము బానిసలుగా ఉన్నాము.

37. ఈ నేలలో పండిన పంట అంతయు పరరాజుల పాలగుచున్నది. . మా పాపములకుగాను వారు మాకు పాలకులైరి. ఆ ఏలికలు మమ్ము, మా పశువులను , తమ యిష్టము వచ్చినట్లు చేయుచున్నారు. మా అగచాట్లు ఇంత ఘోరముగా నున్నవి.”

38. ప్రభూ! మాకిన్ని బాధలు సంభవించినవి గనుక మేమెల్లరముగూడి నిబంధనపత్రము ఒకటి సిద్ధము చేసితిమి. మా పెద్దలు, యాజకులు, లేవీయులు దానిమీద సంతకము చేసిరి.

 1. నిబంధన పత్రము మీద మొదట సంతకము చేసినవాడు అధికారియు హకల్యా కుమారుడునగు నెహెమ్యా. అటుతరువాత సిద్కియా సంతకము చేసెను.

2-8. ఆ పిమ్మట ఈ క్రింది యాజకులు: సెరాయా, అసర్యా, యిర్మియా; పషూరు, అమర్యా, మల్కీయా; హట్టూషు, షెబన్యా, మల్లూకు; హారిము, మెరేమోతు, ఓబద్యా; దానియేలు, గిన్నెతోను, బారూకు; మెషుల్లాము, అబీయా, మీయామిను; మాస్యా, బిల్గాయి, షెమయా.

9-13. ఈ క్రింది లేవీయులు: అసన్యా కుమారుడగు యెషూవ; హెనాదాదు వంశజుడైన బిన్నుయి, కద్మీయేలు, షెబన్యా, హోదీయా, కెలితా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, హషబ్యా, సక్కూరు, షేరెబ్యా, షెబన్యా, హోదియా, బానీ, బెనీను.

14-27. ఈ క్రింది పెద్దలు: పారోషు, పహత్మోవలు; ఏలాము, సత్తూ, బానీ; బున్ని, అస్గాదు, బేబై; అదోనియా, బిగ్వయి, ఆదీను; ఆతేరు, హేజ్కియా, అస్సూరు; హోదియా, హాషూము, బేసయి; హారీపు, అనాతోతు, నేబయి; మగ్పీయాషు, మెషుల్లాము, హెసీరు; మెషసబెలు, సాదోకు, యద్దూవ; పెలట్యా, హానాను, అనయా; హోషేయ, హనన్యా, హష్షూబు; హల్లోహేషు, పిల్హా, షోబేకు; రెహూము, హషబ్నా, మాసెయా; అహియా, హానాను, ఆనాను; మల్లూకు, హారిము, బానా.

28-29. యిస్రాయేలీయులమైన మేమెల్లరము అనగా యాజకులము, లేవీయులము, దేవాలయ ద్వారపాలకులము, గాయకులము, దేవళపు పనివారలము దైవాజ్ఞకు బద్దులమై మా దేశములోని అన్య జాతులనుండి వైదొలగితిమి. మేము, మా భార్యలు, పెరిగి పెద్దయి బుద్ధివివరము తెలిసిన మా పిల్లలు, మా పెద్దలు ఎల్లరము ప్రభువు తన సేవకుడైన మోషే ద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రమును పాటింతుమని ప్రమాణము చేయుచున్నాము. మేము ప్రభువాజ్ఞలన్నిటిని అనుసరింతుము. ఆయన నిబంధనలు జవదాటము. ఈ ప్రమాణమును నిలుబెట్టుకోమైతి మేని మేమెల్లరము శాపముపాలగుదుముగాక!

30. మా దేశమున వసించు అన్యజాతి జనుల పిల్లలను మేము పెండ్లియాడము, మా పిల్లలను వారికీయము.

31. అన్యజాతిజనులు విశ్రాంతి దినమునగాని పరిశుద్ధదినములందు గాని ధాన్యమును మరి ఇతర వస్తువులను అమ్ముటకు తీసికొనివచ్చినచో మేము వానిని కొనము. ప్రతి ఏడవయేడు మా పొలము సాగుచేయము. మాకు రావలసిన ఋణములు కూడ క్షమించి వదిలివేయుదుము.

32. ప్రతి సంవత్సరము దేవాలయము ఖర్చులకు ఒక్కొక్కరము తులమున మూడవవంతు వెండిని అర్పింతుము.

33. దైవసన్నిధిలో నుంచు రొట్టెలు, ధాన్యబలికి అవసరమైన ధాన్యము, ప్రతిదిన బలికి వలసిన పశువులు, విశ్రాంతిదినమునర్పించు నైవేద్యములు, అమావాస్య మొదలైన పండుగలలో ఇతర పండుగులలో అర్పించు నివేదనములు, పాపపరిహార బలికి అవసరమగు వస్తువులు. ఈ రీతిగా దేవాలయ ఆరాధనకు కావలసినవి అన్నియు మేమే ఇచ్చు కొందుము.

34. సామాన్య ప్రజలము, లేవీయులము, యాజకులమునైన మేమెల్లరము చీట్లు వేసికొని ఎవరి వంతుల ప్రకారము వారలము ధర్మశాస్త్రవిధి చొప్పున ఏడాది పొడుగున సమర్పించు బలులకుగాను దేవాలయమునకు వంటచెరకు కొనివత్తుము.

35. ప్రతియేడు మా పొలమున పండిన ప్రథమ వెన్నులను మా చెట్లపై పండిన ప్రథమఫలములను దేవాలయమునకు కానుకగా ఇత్తుము.

36. మా తొలి చూలు బిడ్డలను, మా ఆవులు ఈనిన మొదటి దూడలను, మా మందలలో పుట్టిన మొదటి గొఱ్ఱెపిల్లలను, మేకపిల్లలను దేవాలయమునకు గొనిపోయి యాజకులకు అర్పింతుము.

37. క్రొత్త ధాన్యమునుండి తయారైన పిండి, క్రొత్త ద్రాక్షసారాయము, క్రొత్త ఓలివునూనె, క్రొత్తపండ్లను ప్రతియేడు దేవాలయ మునకు ఇత్తుము. మా పొలమున పండిన పంటలో పదియవవంతు మా గ్రామములందు పన్ను వసూలు చేయు లేవీయులకిత్తుము.

38. లేవీయులు దశమ భాగము వసూలు చేయునపుడు అహరోను వంశమునకు చెందిన యాజకులు కూడ వారితో ఉందురు. పదవ భాగము క్రింద లేవీయులు వసూలు చేయు ధాన్యమున పదియవవంతు దేవాలయపు గిడ్డంగులకు చేరును.

39. మా ప్రజలు, లేవీయులు కలిసి ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలివునూనె మొదలైన వానిని దేవాలయపు గిడ్డంగులకు చేర్చుదురు. అచటనే దేవాలయపు వంటపాత్రలను భద్రపరచియుంచిరి. మరియు అర్చనచేయు యాజకులు దేవాలయ సంరక్షకులు, గాయకులు వసించు గృహములు ఆ తావుననే కలవు. మేము దేవాలయమును ఎంతమాత్రము అశ్రద్ధచేయము.

 1. పెద్దలు యెరూషలేమున స్థిరపడిరి. మిగిలినవారిలో ప్రతి పదికుటుంబములలో ఒక కుటుంబము యెరూషలేమున స్థిరపడవలెనని ఒప్పందము చేసికొని చీట్లు వేసికొనిరి. యెరూషలేమున వసింపని కుటుంబములు అన్ని ఇతర నగరములలో వసింపవలెను.

2. యెరూషలేమున జీవించుటకు ఒప్పుకొనిన వారందరిని ప్రజలు దీవించిరి.

3. యూదా రాజ్యమునకు చెందిన వారిలో యెరూషలేమున వసించిన ప్రముఖవ్యక్తుల జాబితా ఇది యూదా పట్టణములలో ప్రతివారు తమతమ పట్టణములలోని స్వస్థలములలో జీవించిరి. యిస్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయపు పనివాండ్రు, సొలోమోను సేవకుల బిడ్డలు ఇతర నగరములలో తమతమ భూములలోనే నివాసములు ఏర్పరచుకొనిరి.

4. యెరూషలేమున వసించిన యూదా తెగ వారు వీరు: జెకర్యా మనుమడును ఉజ్జీయా కుమారుడునైన అతాయా. యూదా కుమారుడైన పెరెసు వంశమునకు చెందిన అమర్యా. షెఫత్యా, మహలలేలు ఇతని మూల పురుషులు.

5. కొల్హోసే మనుమడును బారూకు కుమారుడునైన మాసెయా. హసాయా, అదాయా, యోయారిబు, జెకర్యా, షిలోను ఇతని మూలపురుషులు

6. పెరెసు వంశజులలో మొత్తము నాలుగు వందల అరువది ఎనిమిది మంది ప్రముఖ వ్యక్తులు యెరూషలేమున వసించిరి.

7. యెరూషలేమున స్థిరపడిన బెన్యామీను తెగ వారు వీరు: యోయేదు మనుమడును మెషుల్లాము కుమారుడునగు సల్లు. పెదయా, కోలాయా, మాసెయా, ఈతియేలు, యెషయా ఇతని మూలపురుషులు.

8. గబ్బయి, సల్లయి ఇతనికి దగ్గరి చుట్టాలు. బెన్యామీను కుటుంబ సభ్యులు తొమ్మిది వందల ఇరువది ఎనిమిది మంది యెరూషలేమున వసించిరి.

9. సిక్రి కుమారుడైన యోవేలు వారికి అధికారి. హసెనూవా కుమారుడగు యూదా రెండవ అధికారి.

10. అచట వసించిన యాజకులు వీరు: యోయారీబు కుమారులు యెదాయా, యాకీను.

11. మెషూల్లాము మనుమడును హిల్కియా కుమారుడునగు సెరాయా. సాదోకు, మెరాయోతు, దేవాలయాధికారియైన అహీటూబు, సెరాయా ఇతని మూలపురుషులు.

12. ఈ వంశమునకు చెందినవారు ఎనిమిది వందల ఇరువది రెండు మంది దేవాలయమున ఊడి గము చేసిరి. పెలాయా మనుమడును యెరోహాము కుమారుడునైన అదాయా. అంసీ, జెకర్యా, పషూరు, మల్కీయా ఇతని మూలపురుషులు.

13. ఈ వంశ మునకు చెందినవారు రెండువందల నలుబది రెండు మంది ఆయా వంశములకు అధిపతులు. అహ్సయి మనుమడును అసరేలు కుమారుడునైన అమష్షయి. మెషిల్లేమోతు, ఇమ్మేరు ఇతని మూలపురుషులు.

14. ఈ వంశమునకు చెందినవారు నూట ఇరువది ఎనిమిది మంది మహావీరులు. ప్రసిద్ద కుటుంబమునకు చెందిన హగ్గేదోలీము కుమారుడగు సబ్దియేలు వీరికి అధిపతి.

15. అచట వసించిన లేవీయులు వీరు: అస్రికాము మనుమడును హష్షూబు కుమారుడునైన షేమయా, హషబ్యా, బున్ని ఇతని మూల పురుషులు.

16. షబ్బెతాయి, యోసాబాదు అను ఇద్దరు ప్రముఖులు దేవాలయమునకు చెందిన బాహ్య విషయములను చూచుకొనుచుండిరి.

17. ఆసాపు వంశమునకు చెందిన సబ్ది మనుమడును మీకా కుమారుడునైన మత్తనియా. స్తుతిగీతములు పాడు గాయకులకు ఇతడు నాయకుడు. బక్బుక్యా ఇతనికి సహాయకుడు, యెదూతూను వంశమునకు చెందిన గాలాలు మనుమడును షమ్మువ కుమారుడునైన అబ్ధా.

18. పవిత్ర నగరమగు యెరూషలేమున మొత్తము రెండు వందల ఎనుబదినాలుగుమంది. లేవీయులు వసించిరి.

19. అచట వసించిన దేవాలయ ద్వార సంరక్షకులు వీరు: అక్కూబు, తల్మోను అను వారు, వారి బంధువులు మొత్తము కలిసి నూట డెబ్బది రెండు మంది.

20. మిగిలిన యిస్రాయేలీయులు, మిగిలిన యాజకులు, లేవీయులు యూదా రాజ్యములోని వారి వారి నగరములలో సొంతభూములలోనే వసించిరి.

21. దేవాలయపు పనివాండ్రు (నెతీనీయులు) యెరూషలేములోని ఓఫేలులో వసించిరి. వారు సీహా, గిష్పా నాయకుల క్రింద పనిచేసిరి.

22. హషబ్యా మనుమడును బానీ కుమారుడునైన ఉజ్జి యెరూషలేమున వసించు లేవీయులకు పర్యవేక్షకుడు. మత్తన్యా, మీకా అనువారు ఇతని మూలపురుషులు. ఈ ఉజ్జి దేవాలయములో పాటలు పాడిన ఆసాపుని వంశమునకు చెందినవాడు

23. లేవీయులు దేవాలయమున ప్రతిదినము వంతుల ప్రకారము పాటలు పాడవలయును. వారికి అనుదిన బత్తెము ఈయవలెనని రాజశాసనము కలదు.

24. యూదావంశమున సేరా కుటుంబమునకు చెందిన మెషెసాబెలు కుమారుడు పెతాహియా పారశీక ప్రభువు ఆస్థానమున అన్ని ప్రజావ్యవహారములు చక్కబెట్టువానిగా ఉండెను.

25. చాలమంది వారి పొలముల దాపునగల గ్రామములలో వసించిరి. యూదా వంశమువారు కిర్యతార్బా, దీబోను, యేకబ్సీలు నగరములందు వాని దాపునగల గ్రామములందు వసించిరి.

26-27. మరియు వారు యేషూవ, మొలాదా, బెత్పేలెటు, హసర్షువలు, బేర్షేబా నగరములలోను, బేర్షెబా వాని చేరువనగల గ్రామములలో వసించిరి.

28-29. ఇంకను సిక్లాగు, మెకోనా, మరియు దాని చుట్టు పట్లగల గ్రామములు, ఎన్-రిమ్మోను, సోరా, యార్మూతు తావులలో వసించిరి.

30. సనోవా, అదుల్లాము నగరములలో వాని దాపునగల పల్లెలలో, లాకీషులో దాని చెంతగల పొలములలో, అసెకాలోను దాని ప్రక్కననున్న పల్లెలలో వసించిరి. ఈ రీతిగా యూదీయులు దక్షిణమున బేర్షెబా, ఉత్తరమున హిన్నోము లోయ ఎల్లలుగాగల దేశమున స్థిరపడిరి.

31-35. బెన్యామీను వంశమువారు గేబా, మిక్మాసు, హాయ, బేతేలు, వాని చెంతగల గ్రామములు, అనానోతు, నోబు, అనన్యా, హాసోరు, రామా, గిత్తాయీము, హాదీదు, సెబోయీము, నెబల్లాతు, లోదు, చేతివృత్తులవారి లోయ ఓనో మొదలైన తావులలో వసించిరి.

36. యూదా వంశజులతో వసించి లేవీయులు కొందరు వచ్చి బెన్యామీనీయులతో నివసించిరి. 

 1. షల్తీయేలు కుమారుడైన సెరుబ్బాబెలుతో, ప్రధానయాజకుడు యోషూవతో ప్రవాసము నుండి తిరిగివచ్చిన యాజకులు, లేవీయులు వీరు:

2-7. సెరాయా, యిర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకన్యా, రెహూము, మెరెమోతు, ఇద్దో, గెన్నెతోయి, అబీయా, మియామీను, మాద్యా, బిల్గా, షేమయా, యోయారీబు, యెదయా, సల్లూ, ఆమోకు, హిల్కీయా, యెదాయా. యోషూవ కాలమున వీరెల్లరు యాజకులకు పెద్దలు.

8. లేవీయులలో ఈ క్రిందివారు కృతజ్ఞతాస్తుతులు పాడెడివారు: యేషూవ, బిన్నుయి, కద్మీయేలు, షేరెబ్యా, యూదా, మత్తన్యా.

9. ఈ క్రిందివారు పాటలకు వంతలు పాడెడివారు. బక్బుక్యా, ఉన్నో మరియు వారి తోడివారు. వీరు గాయక బృందమునకు ఎదురు వరుసలో నిలుచుండెడివారు.

10. యేషూవా కుమారుడు యోయాకీము. అతని కుమారుడు ఎల్యాషిబు, అతని కుమారుడు యోయాదా.

11. యోయాదా పుత్రుడు యోనాతాను, అతని కుమారుడు యద్దూవ. 

12-21. యోయాకీము ప్రధాన యాజకుడుగా నున్న కాలమున ఈ క్రింది వారు యాజకుల వంశములకు పెద్దలుగా నుండిరి: సెరాయా ఇంటివారికి మెరాయా, యిర్మీయా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యెహోహానాను, మల్లూకి ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, హారిము ఇంటివారికి ఆద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కాయి, ఇద్దో ఇంటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబీయా ఇంటివారికి సిక్రీ, మిన్యామీను ఇంటివారికి మరియు మోవద్యా ఇంటివారికి పిల్టాయి, బిల్గా ఇంటివారికి షమ్మువ, షేమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తెనాయి, యెదాయా ఇంటివారికి ఉజ్జీ, సల్లాయి ఇంటివారికి కల్లాయి, ఆమోకు ఇంటివారికి ఏబేరు, హిల్కీయా ఇంటివారికి హషబ్యా, యెదాయా ఇంటివారికి నెతనేలు.

22. ఈ క్రింది ప్రధానయాజకుల కాలమున యాజకుల కుటుంబములకు, లేవీయుల కుటుంబములకు పెద్దలుగానుండిన వారి జాబితాలను పదిల పరచియుంచిరి. వారు ఎల్యాషిబు, యోయాదా, యోహానాను, యద్దూవ. దర్యావేషురాజు పారశీకమునకు రాజుగ నున్నకాలమున ఈ జాబితా వ్రాయుట ఆపివేసిరి.

23. ఎల్యాషిబు మునిమనుమడైన యోహానాను కాలమువరకు లేవీయుల కుటుంబములకు పెద్దలుగా నుండినవారి జాబితాలను దినవృత్తాంతముల గ్రంథమున పదిలపరిచిరి.

24. హషబ్యా, షేరెబ్యా, యేషూవ, కద్మీయేలు వారి అనుయాయులు నాయకత్వమున లేవీయులను బృందములుగా విభజించిరి. దేవాలయమున ఒక్కొక్కసారి రెండు బృందముల గాయకులు ప్రోగై స్తుతి గీతములను, వానికి వంతపాటలను పాడెడివారు. దైవభక్తుడు దావీదే ఈ నియమము చేసిపోయెను.

25. దేవాలయ ద్వారమునొద్దనున్న వివిధ వస్తుభాండాగారములకు కాపుండిన దేవాలయ ద్వారాపాలకులు వీరు: మత్తన్యా, బక్బూక్యా, ఓబద్యా, మెషుల్లాము, తల్మోను, అక్కూబు.

26. పైన పేర్కొనిన వారందరు యోసాదాకు మనుమడును యేషూవ కుమారుడైన ప్రధానయాజకుడు యోయాకీమునకు, అధికారి అయిన నెహెమ్యాకు, యాజకుడును, ధర్మశాస్త్ర పండితుడునైన ఎజ్రాకు సమకాలికులు.

27. యెరూషలేము నగర ప్రాకారమునకు ప్రతిష్ఠ చేసినపుడు నానా స్థలములనుండి లేవీయులను పిలువనంపిరి. ఆ సమయమున కృతజ్ఞతాస్తుతులతో, స్వరమండలము, చిటితాళము, పిల్లనగ్రోవి మొదలగు వాద్యములతో హృదయానందముగా ఉత్సవము చేసి కోవలెనని సంకల్పించుకొనిరి.

28-29. యెరూషలేము చుట్టుపట్లనున్న నగరములనుండి, నెటోఫానగరము చుట్టుపట్టులనుండి, బేతు, గిల్గాలు, గేబా, అస్మావేతు పట్టణములనుండి లేవీయ గాయకులు వచ్చిచేరిరి. వారెల్లరు యెరూషలేమునకు చేరువలోని పట్టణముల వారే.

30. లేవీయులు, యాజకులు తమ్ముతాము శుద్ధిచేసికొనిరి. ప్రజలను, ప్రాకారమును, దాని ద్వారములను గూడ శుద్ధిచేసిరి.

31. నేను యూదా పెద్దలను గోడమీద సమావేశపరచితిని. వారిని రెండు గాయక బృందములుగా విభజించితిని. మొదటి బృందము గోడమీద కుడివైపు నడచి పేడద్వారము వైపు వెళ్ళెను.

32. వారి వెనుక హోషయా అతనితోపాటు సగముమంది యూదియా నాయకులు నడచిరి.

33-35. అసర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనువారు వెళ్ళిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలూదుచు వారి వెనుక వెళ్ళిరి. వారెవరనగా, షెమయా మనుమడును యోనాతాను కుమారుడునగు జెకర్యా నడచెను. మత్తన్యా, మీకాయా, సక్కూరు, ఆసాపు ఈ జెకర్యాకు మూలపురుషులు.

36. జెకర్యా వెనుక అతని ఇంటికి చెందిన యాజకులు షెమయా, అసరేలు, మిలాలయి, గిలాలయి, మాయి, నెతనేలు, యూదా, హనానీ వచ్చిరి. వారెల్లరు పూర్వము దైవభక్తుడైన దావీదు వాడిన సంగీతవాద్యముల వంటి వాద్యములు కొనివచ్చిరి. ధర్మశాస్త్ర బోధకుడగు ఎజ్రా ఈ మొదటి బృందమునకు ముందు నడచెను.

37. వారు జలధార ద్వారమునొద్ద మెట్లెక్కి దావీదు నగరమున ప్రవేశించి ఆ రాజప్రాసాదము ప్రక్కగా నడచిరి. పిమ్మట జల ద్వారమునొద్ద నగరమునకు తూర్పువైపున మరల ప్రాకారమును చేరుకొనిరి.

38. రెండవ బృందము గోడమీద ఎడమ వైపుగా నడచివెళ్ళెను. నేను వారిననుసరించితిని. మేము కొలిమి ప్రాకారము మీదుగా పోయి మైదానపు గోడను చేరితిమి.

39. అచట ఎఫ్రాయీము, మేషనా, మత్స్య ద్వారమును దాటితిమి. హననేలు బురుజును, మేయా బురుజును, గొఱ్ఱెల ద్వారమును చేరితిమి. కడకు గస్తీద్వారము చేరుకొంటిమి.

40-41. ఈ రీతిగా రెండు బృందములు దేవాలయము చేరెను. మాతోనున్న సగము మంది పెద్దలు మాత్రమేకాక ఈ క్రింది యాజకులు బాకాలూదుచు మావెంట వచ్చిరి: ఎల్యాకీము, మాసెయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనయి, జెకర్యా, హనన్యా.

42. ఈ క్రింది గాయకులు ఎస్రహయా నాయకత్వమున పాటలు పాడుచు మా వెంట వచ్చిరి: మాసెయా, షేమయా, ఎలియెజెరు, ఉజ్జీ, యెహోహానాను, మల్కీయా, ఏలాము, ఏసేరు.

43. ఆ దినము ప్రజలు చాలా బలులు సమర్పించిరి. ప్రభువు ప్రజలను సంతోష చిత్తులను చేయగా వారు మిక్కిలి ఆనందించిరి. స్త్రీలు, పిల్లలుకూడ ఉత్సవమున పాల్గొనిరి. ఆ ప్రజల ఉత్సాహ నినాదములు చాలదూరమువరకు విన్పించెను.

44. దేవాలయమునకర్పించెడు ధాన్యము, ఫలములు, పండిన పంటలో పదియవ వంతు, మరియు ఇతర వస్తువులు భద్రము చేయు భాండాగారమునకు పర్యవేక్షకులను నియమించితిని. ధర్మశాస్త్ర విధి ప్రకారము యాజకులకొరకు, లేవీయులకొరకు, ఆయా నగరములకు చెందిన పొలములనుండి ధాన్యాదులు సేకరించుట ఈ పర్యవేక్షకుల పని. యాజకులు లేవీయులు సంతృప్తికరముగా పనిచేసి యూదీయుల మన్నన పొందిరి.

45. దైవారాధనను, శుద్ధీకరణను నిర్వర్తించినది వారే. దావీదు అతని కుమారుడు సొలోమోను విధించినట్లుగనే గాయకులు, దేవాలయ ద్వారపాలకులు తమతమ విధులను పాటించిరి.

46. దావీదు కాలము నుండి ఆసాపునాటినుండి గాయకులు బృందములుగా గూడి ప్రభుని స్తుతించి గానము చేయుచుండిరి.

47. సెరుబ్బాబెలు కాలమున, నెహెమ్యా కాలమున గాయకుల కొరకు, దేవాలయ ద్వారపాలకుల కొరకు యిస్రాయేలీయులందరు ప్రతిరోజు భోజన పదార్ధములు ఇచ్చిరి. ప్రజలు లేవీయులకు కానుకలీయగా, లేవీయులు వానినుండి యాజకులవంతు యాజకులకు పంచియిచ్చెడివారు.

 1. ఆ రోజులలో జనులకు మోషే ధర్మశాస్త్రమును చదివి వినిపించుచుండగా “అమ్మోనీయులనుగాని, మోవాబీయులనుగాని దేవుని ప్రజలతో కలియనీయరాదు”అను వాక్యము విన్పించెను.

2. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చునపుడు అమ్మోనీయులు, మోవాబీయులు వారికి ఆహారపానీయములు ఒసగరైరి. పైగా వారు బలాముతో మాట్లాడుకొని అతనిచే యిస్రాయేలీయులను శపింపచేసిరి. కాని మన దేవుడు ఆ శాపమును దీవెనగా మార్చెను.

3. పై వాక్యమును చదువగా విని యిస్రాయేలీయులు అన్యజాతి వారినందరిని తమ చెంతనుండి అవతలికి పంపివేసిరి.

4. యాజకుడగు ఎల్యాషిబు దేవాలయ భాండాగారమునకు అధిపతి. అతడు తోబియాకు బంధువు.

5. కనుక అతడు తోబియాను దేవాలయమున ఒక పెద్ద గదిని ఆక్రమించుకొననిచ్చెను. ఆ గదిలో అంతకు ముందు దేవాలయమునకర్పించిన ధాన్యము, సాంబ్రాణి, పాత్రలు, యాజకులకిచ్చిన పదయవ వంతు ధాన్యము, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులకొరకిచ్చిన పదియవవంతు పంట ధాన్యము, ద్రాక్షసారాయము, ఓలీవునూనెను భద్రపరచియుంచెడివారు.

6. తోబియా ఆ గదిని ఆక్రమించుకొనినపుడు నేను యెరూషలేము నందు లేను. అర్తహషస్త బబులోనియాను ఏలుచున్న ముప్పది రెండవయేట నేను ఆ రాజును చూడబోయితిని. కొంతకాలము గడచిన పిదప నేనతని ఆజ్ఞ గైకొని,

7. యెరూషలేమునకు తిరిగివచ్చితిని. అప్పుడు ఎల్యాషిబు తోబియాకు దేవాలయమున ఒక గది ఏర్పరచి దుష్కృత్యము చేసెనని బహుగా దుఃఖపడి,

8. తోబియా వస్తువులన్నిటిని ఆ గదినుండి బయట వేయించితిని.

9. గదిని శుద్ధిచేయించితిని. దేవాలయ వంట పాత్రలను, ధాన్యమును, సాంబ్రాణిని మరల యథాస్థానమునకు చేర్పుడని ఆజ్ఞాపించితిని. "

10. లేవీయులకు చెందవలసినవంతు వారికి అందకపోవుటచే సేవచేయు లేవీయులు, గాయకులు యెరూషలేమును విడనాడి పల్లెలలోని వారి పొలములను సాగుచేసి కొనబోయిరి.

11. నేను దేవాలయమును ఇట్లు గాలికి వదలివేయుదురా అని పెద్దలను మందలించితిని. లేవీయులను, గాయకులను మరల తీసుకొని వచ్చి దేవాలయమున చేర్పించితిని.

12. అప్పుడు యిస్రాయేలీయులందరు పంటలో పదియవ వంతు, ద్రాక్ష సారాయము, ఓలివు నూనెను కొనివచ్చి దేవాలయమునకర్పించిరి.

13. నమ్మకము గల వ్యక్తులు అని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను పండితుని, లేవీయులలో పెదాయాను దేవాలయ భాండాగారమునకు కాపరులుగా నియమించితిని. మత్తన్యా మనుమడును సక్కూరు కుమారుడునగు హానాను వారికి సహాయకుడు. వారెల్లరు నమ్మదగినవారు. భాండాగారము నుండి తోడిపనివారికి ఆయా వస్తువులను పంచి ఇచ్చుట వారి బాధ్యత.

14. ప్రభూ! ఈ సత్కార్యమునకుగాను నన్ను గుర్తుంచుకొనుము. నీ దేవాలయము, దేవాలయారాధనము కొరకు నేను చేసిన కృషిని విస్మరింపకుము.

15. ఆ రోజులలో యూదీయులు కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షసారాయము తయారుచేయుట గమనించితిని. మరికొందరు ధాన్యమును, ద్రాక్షసారాయమును, ద్రాక్షపండ్లను, అత్తిపండ్లను, వివిధ బరువులను గాడిదల పైకెక్కించి యెరూషలేములోనికి కొనిపోవుట గూడ చూచితిని. విశ్రాంతిదినమున వానిని అమ్మవలదని హెచ్చరించితిని.

16. తూరు దేశస్తులు కొందరు యెరూషలేమున మకాము చేయుచు చేపలు మరియు వివిధ వస్తువులు యెరూషలేమునకు తీసికొని వచ్చి విశ్రాంతిదినమున యూదులకు అమ్ముచుండిరి.

17. నేను యూద నాయకులను చీవాట్లు పెట్టి “మీరు ఎంత పాడుపని చేయుచున్నారు! విశ్రాంతి దినమును అమంగళ పరచుచున్నారుగదా!

18. మునుపు మన పితరులిట్టి దుష్కార్యము చేయుటవలననే గదా ప్రభువు ఈ నగరమును నాశనము చేసినది? ఇపుడు మీరు మరల పవిత్రదినమును అపవిత్ర పరచినచో ప్రభువు కోపించి మునుపటికంటె అధికముగా యిస్రాయేలీయులను నాశనము చేయడా? అని హెచ్చరించితిని.

19. కనుక విశ్రాంతిదినము ప్రారంభమై చీకట్లు అలుముకొనగనే నగరద్వారములను మూసివేయవలెనని పవిత్రదినము ముగియువరకు వానిని మరల తెరువరాదని ఆజ్ఞాపించితిని. విశ్రాంతిదినమున బరువులను నగరములోనికి తీసికొని రాకుండుటకై సేవకులను కొందరిని ద్వారమునొద్ద కాపుంచితిని.

20. వివిధ వస్తువులను అమ్ము వ్యాపారులు ఒకటి రెండుసారులు విశ్రాంతిదిన సాయంత్రమున నగర ద్వారమునొద్ద పడిగాపులు కాసిరి.

21. నేను “మీరు రేయి ద్వారమునొద్ద కనిపెట్టికొనియుండనేల? ఇట్టి కార్యము మరల చేయుదురేని మిమ్ము శిక్షించి తీరుదును”అని వారిని బెదిరించితిని. నాటినుండి వారు మరల పవిత్రదినమున రాలేదు.

22. లేవీయులు విశ్రాంతిదినమును అమంగళ పరపకుండుటకై తమను తాము శుద్ధిచేసికొని నగరద్వారము వద్ద కాపుండవలెనని ఆజ్ఞాపించితిని. ప్రభూ! ఈ సత్కార్యమునకు గూడ నన్ను గుర్తుంచుకొనుము. నీవు కృపామయుడవు గనుక నన్ను రక్షింపుము.

23.ఆ కాలమున యూదులు అష్టోదు, అమ్మోను, మోవాబు, పడుచులను పెండ్లియాడుటగూడ గమనించితిని.

24. వారికి పుట్టిన పిల్లలలో సగముమంది అష్టోదు భాష మాట్లాడెడివారు. కాని వారు యూదా భాష మాట్లాడలేకపోయిరి. వారు నానా భాషలలో మాట్లాడిరి.

25. నేను వారినందరిని చీవాట్లు పెట్టి శపించితిని. కొందరిని కొట్టి వారి తలవెంట్రుకలను పెరికివేసితిని. ఇక మీదట వారుగాని, వారి బిడ్డలుగాని అన్యజాతివారిని పెండ్లియాడకుండునట్లు ప్రభువు పేర బాస చేయించితిని.

26. “సొలోమోను అన్యజాతి రాజులందరికంటెను గొప్పవాడు. ప్రభువతనిని ఆదరించి యిస్రాయేలులందరికి రాజుగా చేసెను. అయినను అన్యజాతి భార్యలతనిని పాపమునకు పురికొల్పిరిగదా?

27. ఇప్పుడు మీరును యిట్టి దుష్కార్యము చేయవలయునా? అన్యజాతి స్త్రీలను పెండ్లియాడి దేవునికి ద్రోహము చేయుదురా? మీ వంటి వారి మాటలు మేము ఆలకించవచ్చునా?” అని ప్రశ్నించితిని.

28. ప్రధాన యాజకుడును ఎల్యాషిబు కుమారుడునైన యెహోయాదా. ఇతని కుమారుడొకడు బేత్ హోరోనునకు చెందిన సన్బల్లటు కుమార్తెను పెండ్లియాడెను. కనుక నేనతనిని నా వద్దనుండి వెళ్ళగొట్టించితిని.

29. ప్రభూ! ఈ ప్రజలు యాజకత్వమునకు తలవంపులు తెచ్చిరి. యాజకులతో, లేవీయులతో నీవు చేసిన నిబంధనను అవమానపరచిరి. కనుక వారిని జ్ఞాపకముంచుకొనుము.

30. ఆ రీతిగ నేను అన్యజాతి జనులనుండి మన ప్రజలను వేరుజేసి వారిని పవిత్రపరచితిని. యాజకుల, లేవీయుల బాధ్యతలు తెలియజేసితిని.

31. ఆయా కాలములలో దేవాలయమునకు వంట చెరకు, ప్రథమ ఫలములు సమర్పణకై కొనిరావలెనని నియమములు చేసితిని. ఈ మంచి పనులన్నిటికిగాను ప్రభూ! నీవు నన్ను గుర్తుంచుకొనుము.