ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము

 1. దావీదు కుమారుడైన సొలోమోను తన రాజ్యాధికారమును సురక్షితము చేసికొనెను, దేవుడైన ప్రభువు అతనిని దీవించి మహాబలసంపన్నునిచేసెను.

2. సొలోమోను తన సైన్యమందలి సహస్రాధిపతులను, శతాధిపతులను, న్యాయాధిపతులను, యిస్రాయేలీయులలోని ఆయా తెగల నాయకులను అనగా యిస్రాయేలు ప్రజలందరికిని ఆజ్ఞనీయగా అందరును సొలోమోనుతో కలిసి గిబ్యోను ఉన్నత స్థలమునకు వెళ్ళిరి.

3. ప్రభు భక్తుడైన మోషే ఎడారియందు నిర్మించిన దేవుని సమావేశపుగుడారము ఆ తావుననే ఉండెను.

4. (దావీదు మందసమును కిర్యత్యారీము నుండి యెరూషలేమునకు కొనివచ్చి, తాను ఏర్పరచిన తావునందు ఒక గుడారమును నిర్మించి దానియందు మందసమును భద్రపరచెను).

5. హూరు మనుమడును ఊరి కుమారుడైన బేసలేలు కంచుతో నిర్మించిన బలిపీఠము గిబ్యోనులో దేవుని సాన్నిధ్యపుగుడారము ఎదుటనుండెను. సొలోమోను అతనివెంట ప్రజలు అక్కడ దేవుని దర్శనము చేసికొనిరి.

6. సొలోమోను రాజు దేవుని సాన్నిధ్యపు గుడారము ఎదుటనున్న కంచు బలిపీఠమునెక్కిపోయి వేయి దహనబలులు అర్పించెను.

7. ఆ రేయి ప్రభువు సొలోమోనునకు దర్శనమిచ్చి నీకు ఏమి వరము కావలయునో కోరుకొమ్మనెను.

8. సొలోమోను “ప్రభూ! నీవు మా తండ్రియైన దావీదుని మిగుల కరుణించితివి. ఇప్పుడు అతని స్థానమున నన్ను రాజునుగా చేసితివి.

9. నీవు మా తండ్రితో పలికిన మాట నిలబెట్టుకొనుము. ధూళి కణములవలె అసంఖ్యాకములుగా నున్న ఈ ప్రజలకు నీవు నన్ను రాజును చేసితివి.

10. కావున వీరిని పరిపాలించుటకు కావలసిన వివేక విజ్ఞానములను నాకు దయచేయుము. లేదేని ఇంతటి అసంఖ్యాకులైన నీ ఈ ప్రజలను ఎవడు పరిపాలింపగలడు?” అనెను.

11. ప్రభువు సొలోమోనుతో “నీవు ఈ విధముగా యోచించి సిరిసంపదలనుకాని, కీర్తి ప్రతిష్ఠలనుకాని, శత్రునాశనమునుగాని, దీర్ఘాయువును గాని కోరుకోవైతివి. నా ప్రజలను పరిపాలించుటకు వలసిన వివేక విజ్ఞానములను మాత్రము అడిగితివి. నేను నిన్ను వీరికి రాజుగా నియమించితిని.

12. కనుక నేను నీకు వివేకవిజ్ఞానములను ప్రసాదింతును. అదియునుగాక నీకు ముందుగానున్న రాజులు కాని, నీ తరువాతవచ్చు రాజులుకాని పొందజాలని సిరిసంపదలు, కీర్తి ప్రతిష్ఠలను కూడ నీకు దయచేయుదును” అని చెప్పెను.

13. సొలోమోను గిబ్యోను ఉన్నత స్థలమున సమావేశపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును వీడి యెరూషలేమునకు వచ్చెను. అచటి నుండి యిస్రాయేలీయులను పరిపాలించెను.

14.. అతడు పదునాలుగు వందల రథములను, పండ్రెండువేల గుఱ్ఱములను చేకూర్చుకొనెను. వానిలో కొన్నింటిని ఆయా రథనగరములందు ఉంచెను.

15. అతని పరిపాలనాకాలమున యెరూషలేమున వెండి, బంగారములు రాళ్ళవలె సమృద్ధిగా లభ్యమయ్యెడివి. దేవదారుకొయ్య లోయలలోని మేడికలప వలె విరివిగా దొరకెడిది.

16. సొలోమోను ఐగుప్తునుండియు, కోవె నుండియు గుఱ్ఱములను తెప్పించెడివాడు. అతని వర్తకులు వానిని నియమిత మూల్యమునకు కొనెడివారు.

17. రథములు ఐగుప్తునుండి దిగుమతి అయ్యెడివి. రాజోద్యోగులు ఈ గుఱ్ఱములను, రథములను హిత్తీయరాజులకును, సిరియా రాజులకును కూడ విక్రయించెడివారు. ఒక్క రథము ఖరీదు ఆరువందల తులముల వెండి. గుఱ్ఱము ఖరీదు నూటయేబది తులముల వెండి.

 1. సొలోమోను ప్రభువును ఆరాధించుటకు ఒక దేవాలయమును, తాను వసించుటకు ఒక రాజ ప్రాసాదమును కట్టింపగోరెను.

2. అతడు బరువులు మోయుటకు డెబ్బదివేలమంది, రాళ్ళు పగులగొట్టు టకు ఎనుబదివేల మంది పనివారిని నియమించెను. మూడువేల ఆరువందలమందిని వారిమీద పర్యవేక్షకులుగా ఉంచెను.

3. ఆ రాజు తూరు రాజైన హురామునకు ఈ రీతిగా సందేశము పంపెను: “పూర్వము మా తండ్రియైన దావీదురాజు ప్రాసాదమును నిర్మించి నపుడు నీవు దేవదారు కలపను పంపితివి. అట్లే నేడు నాకు కూడ కలపను సరఫరాచేయుము.

4. నేను మా ప్రభువైన దేవుని నామమునకై ఒక మందిరమును కట్టింపవలయును. దానియందు మా దేవునికి సువాసనగల సాంబ్రాణిపొగ వేయుదుము. నిత్యము ఆయనసన్నిధిలో రొట్టెలను పెట్టుదుము. ప్రతిదినము ఉదయ సాయంత్రములు దహనబలులు అర్పింతుము. విశ్రాంతి దినములందు, అమావాస్యలందు, పండుగ దినములయందు కూడ దహనబలులు అర్పింతుము. ఈ కైంకర్యములన్నియు మేము కలకాలము చేయ వలెనని ప్రభువు ఆజ్ఞాపించెను.

5. మా ప్రభువు వేల్పులందరి కంటెను అధికుడు. కనుక నేను ఆయనకు గొప్పదేవళమును కట్టింపగోరెదను.

6. ఆకాశమహాకాశములు గూడ ఆ ప్రభువును ఇముడ్చుకోజాలవనిన మానవమాత్రులు ఆయన నివసించుటకు మందిరమును కట్టగలరా? ఆయన ముందట సాంబ్రాణిపొగ వేయుటకు మాత్రమే నేను దేవాలయమును నిర్మింప బూనితిని.

7. నీవు వెండి, బంగారము, కంచు, ఇనుములతో పనిచేయుట, ఎరుపు, ఊదా, ధూమ్ర వర్ణముగల రంగుల బట్టలను సిద్ధము చేయుట, చెక్కడపు పనిచేయుట మొదలైన విద్యలు తెలిసిన నిపుణుడు ఒకనిని నా యొద్దకు పంపుము. పూర్వము మా తండ్రి దావీదు యూదానుండియు, యెరూషలేము నుండియు నిపుణులను చేకూర్చుకొనెను. నీవు పంపు వాడు వీరితో కలిసి పనిచేయును.

8. నీ సేవకులు చెట్లు నరకుటలో నేర్పరులుకదా! కనుక లెబానోను నుండి నాకు దేవదారుకొయ్యను, సరళవృక్షపు కొయ్యను, చందనపు కొయ్యను సరఫరా చేయింపుము. నీ సేవకులకు తోడ్పడుటకు మా పనివారినిగూడ పంపుదును,

9. వారందరుకలిసి కలపను విస్తారముగా సేకరింతురు. నేను నిర్మింపబోవు దేవాలయము బృహత్తర మైనది.

10. మ్రానులు నరకు నీ పనివారికి బత్తెముగా నేను ఇరువదివేల మానికల దంచిన గోధుమలను, అంతియే యవధాన్యమును, ఇరువది వేల బుడ్ల ద్రాక్షసారాయమును, ఇరువదివేల బుడ్ల ఓలివునూనెను పంపుదును.”

11. అపుడు తూరురాజైన హురాము సొలోమోనునకు ఇట్లు ప్రత్యుత్తరము పంపెను: “ప్రభువు తన ప్రజలను ప్రేమించి వారికి నిన్ను రాజును చేసిన

12. యిస్రాయేలు దేవునికి స్తుతి కలుగునుగాక! అతడు భూమ్యాకాశములను సృజించెను. ప్రభువు దావీదునకు తెలివితేటలును వివేకముగల కుమారుని దయ చేసెను కనుక అతడు దేవునికి మందిరమును, తనకు ప్రాసాదమును నిర్మింపబూనినాడు.

13. నేను హూరాము అను నేర్పుగల కళాకారుని నీ చెంతకు పంపుదును. అతని తండ్రి తూరు నివాసి. తల్లి దాను తెగకు చెందినది.

14. అతడు బంగారము, వెండి, కంచు, ఇనుము, కొయ్య, రాయి మొదలైన వానితో వస్తువులు చేయగలడు. ఊదా, ఎరుపు, ధూమ్రవర్ణము గల వస్త్రములను, పట్టువస్త్రములను సిద్ధము చేయగలడు. చెక్కడపు పనులు చేయగలడు. తనకు చూపించిన నమూనా ప్రకారము ఎట్టి వస్తువునైనను చేయగలడు. అతడు నీ పనివారితోను, మీ తండ్రియైన దావీదు నియమించిన నిపుణులతోను కలిసి పనిచేయును.

15. నీవు నుడివినట్లే గోధుమలు, యవలు, ద్రాక్షసారాయము, ఓలివుతైలము పంపుము.

16. నేను లెబానోను కొండలనుండి నీకు వలసినంత కలప కొట్టింతును. దానిని మావారు తెప్పలుకట్టి సముద్ర మార్గమున యొప్పాకు పంపెదరు. అచటి నుండి నీవు ఆ కలపను యెరూషలేమునకు తరలించుకొని పోవచ్చును."

17. పూర్వము దావీదు చేసినట్లే సొలోమోను కూడ తన రాజ్యములోని పరదేశులందరిని లెక్క పెట్టించెను. వారు ఒక లక్ష ఏబదిమూడువేల ఆరు వందల మందియుండిరి.

18. అతడు వారిలో డెబ్బది వేలమందిని బరువులు మోయుటకును, ఎనుబది వేలమందిని కొండలలోని రాతిగనులలో రాళ్ళు పగులగొట్టుటకును నియమించెను. మూడువేల ఆరువందల మందిని కూలీలమీద పర్యవేక్షకులుగా ఉంచెను.

 1-2. యెబూసీయుడైన ఒర్నాను అనువాని కళ్ళమున దావీదునకు దేవుడు దర్శనమిచ్చెను. ఆ తావు యెరూషలేములోని మోరీయా కొండమీద ఉన్నది. ఆ స్థలమును దావీదు దేవాలయ నిర్మాణమునకు సిద్ధముచేసెను. సొలోమోను తన పరిపాలనాకాలము నాలుగవయేట, రెండవనెల, రెండవదినమున ఆ తావుననే దేవాలయ నిర్మాణము ప్రారంభించెను.

3. అతడు నిర్మించిన దేవాలయము పొడవు అరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు.

4. దేవాలయము ముందటి ప్రవేశగృహము ఇరువది మూరల వెడల్పు, నూటఇరువది మూరలు ఎత్తు కలిగియుండెను. దాని వెడల్పు దేవాలయము వెడల్పుతో సమానముగా నుండెను. అతడు ఈ గృహము లోపలి భాగమును మేలిమి బంగారముతో పొదిగించెను.

5. మందిరమున ముఖ్యమైన గదిని దేవదారు కొయ్యతో కప్పి మేలిమి బంగారముతో పొదిగించెను. దానియందు ఖర్జూర వృక్షములు, గొలుసుల ఆకృతులు చెక్కించెను.

6. దేవాలయమును అందమైన రత్నములతో, ఫర్వాయీమునుండి తెప్పించిన మేలిమి బంగారముతో అలంకరించెను.

7. దేవాలయపు గోడలను, దూలములను, ప్రవేశ మంటపమును, తలుపులను గూడ మేలిమి బంగారముతోనే పొదిగించెను. గోడల మీద కెరూబీము దూతల ప్రతిమలను కూడ చెక్కించెను.

8. మహాపవిత్రస్థలమైన గర్భగృహము పొడవు, వెడల్పుకూడ ఇరువది మూరలు. దాని వెడల్పు దేవాలయము వెడల్పుతో సమానముగా ఉండెను. దాని గోడలను ఒక వేయి రెండువందల మణుగుల మేలిమి బంగారముతో పొదిగించెను.

9. ఏబది తులముల బంగారముతో మేకులు చేయించెను. మీది గదుల గోడలను కూడ బంగారముతో పొదిగించెను.

10. లోహముతో రెండు కెరూబీము దూతల ప్రతిమలను పోత పోయించి, వానిని బంగారముతో పొదిగించి గర్భగృహమున ఉంచెను.

11-13. ఆ ప్రతిమల ముఖములు మందిరపు లోతట్టు తిరిగియుండి, ఒకదాని ప్రక్కన యొకటి ఉండునట్లు నిలబెట్టించెను. వానిలో ఒక్కొక్క దానికి రెండు రెక్కలు కలవు. ఒక్కొక్క రెక్క ఐదు మూరల పొడవు ఉండెను. అవి రెక్కలను చాచి యుండగా గది మధ్యన ఆ రెక్కలు ఒకదానికొకటి తాకుచుండెను. మరియు ఆ రెక్కలు గదిలోపలి రెండు గోడలకు కూడ తాకుచుండెను. ఆ నాలుగురెక్కలు ఒక కొననుండి మరియొక కొనకు ఇరువది మూరలు పొడవుండెను.

14. పట్టు దారముతో గర్భగృహమునకు ఒకతెరను అల్లించి దానికి ఊదా, ఎరుపు, ధూమ్రవర్ణము లతో అద్దకము వేయించెను. దానిమీద కెరూబీము దూతల బొమ్మలను కూడ కుట్టించెను.

15. అతడు దేవాలయమునకు ముందట రెండు స్థంభములు నెలకొల్పెను . వాని పొడవు ముప్పది ఐదు మూరలు. ఒక్కొక్క దానిమీద ఐదు మూరల ఎత్తుగల పీటలును కలవు.

16. ఆ స్తంభముల కొనలను కలగలసిన గొలుసుల పనితో కలుపుచూ, స్తంభముల పై భాగమున నూరు దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసుల పనిమీద అలంకరించెను. మీదిపీటలను దానిమ్మపండ్ల బొమ్మలతో అలంకరించెను.

17. స్తంభములను దేవాలయ ముఖద్వారమునకు ఇరు వైపుల అమర్చిరి. దక్షిణదిశనున్న దానికి యాకీను అనియు,. ఉత్తరదిశనున్న దానికి బోవాసు అనియు పేర్లు.

 1. సొలోమోను కంచుపీఠమును తయారు చేయించెను. దాని పొడవు ఇరువది మూరలు, వెడల్పు ఇరువది మూరలు, ఎత్తు పది మూరలు

2. మరియు అతడు కంచుతో ఒక గుండ్రని సంద్రమువంటి తొట్టిని కూడ పోతపోయించెను. దాని వెడల్పు పది మూరలు, లోతు ఐదు మూరలు, దాని చుట్టుకొలత ముప్పది మూరలు.

3. ఆ తొట్టి వెలుపలి అంచుచుట్టు రెండు వరుసలలో ఎద్దుల బొమ్మలు మూరకు పదేసి కలవు. తొట్టిని పోతపోసినపుడే ఆ బొమ్మలుకూడ తయారైనవి.

4. ఆ సంద్రమువంటి తొట్టిని పండ్రెండు కంచు ఎద్దుల బొమ్మలపై నిల్పిరి. అవి ఒక్కొక్క వరుసలో మూడేసి చొప్పున వాటి వెనుక భాగములన్నియు లోపలి తిరిగి యుండునట్లుగా నాలుగు దిక్కులవైపు తిరిగి ఉండెను.

5. తొట్టి అంచు బెత్తెడు మందము కలిగి గిన్నె అంచువలెను, విచ్చిన పూవువలెను గుండ్రముగా ఉండెను. దానిలో మూడువేల కూజాల నీళ్ళుపట్టును.

6. అతడు పది చిన్నతొట్లు చేయించి దేవాలయమునకు ఉత్తరదిశలో ఐదింటిని, దక్షిణదిశలో ఐదింటిని ఉంచెను. దహనబలిగా అర్పించు పశువులను అందులోని నీళ్ళతో కడిగి శుభ్రము చేయుదురు. యాజకులు సంద్రమువంటి తొట్టిలోని నీళ్ళతో శుద్ధిచేసికొనెడి వారు.

7. పదిబంగారు దీపస్తంభములను, వాని దిమ్మెలనుగూడ వాటి మాదిరిచొప్పున చేయించి దేవాలయమునందు ఉంచెను.

8. అవి ఉత్తరమున ఐదు, దక్షిణమున ఐదు ఉండెను. నెత్తుటిని చిలుకరించుటకు నూరు బంగారుగిన్నెలు కూడ చేయించెను.

9. సొలోమోను యాజకులకొరకు లోపలి ప్రాంగ ణమును కట్టించెను. వెలుపలి పెద్ద ప్రాంగణమును కూడ కట్టించెను. దానికి ద్వారములను అమర్చి, దాని తలుపులను కంచుతో పొదిగించెను.

10. సంద్రము వంటి తొట్టిని దేవాలయమునకు దాపులో ఆగ్నేయదిశ యందు ఉంచెను.

11-16. హూరాము బూడిదను ప్రోగుచేయు కుండలను, పారలను, గిన్నెలను చేసెను. అతడు దేవాలయమునకు చేయుదునన్న పరికరములన్నిటిని చేసి ముగించెను. ఆ వైనమిది:  రెండు స్తంభములు, వానిమీద గిన్నెల ఆకారములో ఉన్న పీటలు, ఆ పీటలమీద కలగలపులుగా ఉన్న గొలుసుల ఆకృతులు, ఒక్కొక్క పీటమీద రెండువరుసలలో అమర్చిన నాలుగువందల కంచు దానిమ్మపండ్లు, పదిచిన్నతొట్లు, వాని పీటలు, సంద్రమువంటి తొట్టి, దానిని మోయు పండ్రెండు ఎద్దులు, బూడిదనెత్తు కుండలు, పారలు, గరిటెలు. హురాము సొలోమోను కోరినట్లే దేవళములో వాడుటకు పై పరికరములన్నిటిని నాణ్యమైన కంచుతో చేసెను.

17. రాజు వానినన్నిటిని యోర్దాను లోయలో సుక్కోతు జెరెదా నగరముల మధ్యనున్న జిగటమన్ను కొలిమిలో తయారు చేయించెను.

18. అతడు ఆ పరికరములను విస్తారముగా చేయించెను. కనుక వానికి పట్టిన కంచు ఎంతయో ఎవరును చెప్పజాలరైరి.

19. సొలోమోను దేవాలయమునకు బంగారు పరికరములు గూడ చేయించెను. అవి ఏవనగా బంగారుపీఠము, దేవునియెదుట రొట్టెలను పెట్టు బంగారు బల్లలు,

20. నియమము ప్రకారము గర్భ  గృహము నెదుట వెలుగుటకు మేలిమిబంగారముతో చేసిన ప్రమిదలు, దీపస్తంభములు,

21. పుష్పా కృతితోనున్న అలంకరణములు, ప్రమిదలు, దీపము లార్పు పట్టుకారులు,

22. కత్తెరలు, నెత్తురు చిలుకరించు గిన్నెలు, సాంబ్రాణి పాత్రలు, అగ్ని కలశములు. అతడు దేవాలయము వెలుపలి తలుపును, గర్భగృహము తలుపును బంగారముతో పొదిగించెను.

 1. సొలోమోను దేవాలయపు పనులన్నిటిని పరిపూర్తి చేయించెను. అటుపిమ్మట ప్రభువునకు తన తండ్రి దావీదు అంకితముచేసిన వెండిబంగారములను, ఇతర వస్తువులను కొనివచ్చి దేవాలయ కోశాగారమునకు సమర్పించెను.

2. అంతట సొలోమోను రాజు యిస్రాయేలు పెద్దలను, తెగనాయకులను యెరూషలేమున సమావేశపరచెను. ప్రభువు మందసమును సియోను నందు గల దావీదు నగరము నుండి దేవాలయమునకు తరలింపవలెనని చెప్పెను.

3. కనుక యిస్రాయేలీయులెల్లరు ఏడవనెలలో వచ్చు ఉత్సవము సందర్భమున అక్కడ సమావేశమైరి.

4-5. అవ్విధమున నాయకులెల్లరు ప్రోగైన పిదప లేవీయులు మందసమును ఎత్తుకొనిరి. సొలోమోను, యిస్రాయేలు ప్రజలెల్లరు మందసము ముందట సమావేశమై లెక్కలేనన్ని పొట్టేళ్ళను, కోడెలను బలిగా సమర్పించిరి.

6. యాజకులును, లేవీయులును కలిసి ప్రభువు గుడారమును, దాని సామాగ్రితోపాటు దేవాలయమునకు కొని వచ్చిరి.

7. అటుతరువాత యాజకులు మందసమును దేవాలయములోనికి కొనివచ్చి గర్భగృహమున కెరూబు దూతల ప్రతిమల నడుమ ఉంచిరి.

8. వాని రెక్కలు మందసమును, దానిని మోయు దండెలను కప్పి వేసెను.

9. గర్భగృహము ఎదుట పవిత్రస్థలములో నిలుచుండి చూచినచో ఈ దండెల కొనలు కన్పించేడివి. కాని బయటనుండి చూచువారికి అవి కన్పించేడివికావు. ఆ దండెలు నేటికిని అచటనేయున్నవి.

10. మోషే హోరెబు కొండచెంత ఆ మందసములో ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేవు. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చిన తరువాత ప్రభువు ఈ కొండచెంతనే వారితో నిబంధనము చేసికొనెను.

11-14. యాజకులెల్లరును, వారు ఏ వర్గమునకు చెందినవారైనను, తమను తాము శుద్ధిచేసికొనిరి. గాయకులైన లేవీయులు, అనగా ఆసాపు, హేమాను, యెదూతూను మరియు వారి వంశీయులవారు, నార బట్టలు తాల్చి, బలిపీఠమునకు దగ్గరగా, తూర్పు వైపున నిలుచుండి స్వరమండలము, తంబుర, చిటి తాళములు వాయించుచుండిరి. నూటఇరువదిమంది యాజకులు వారికెదురుగా నిలుచుండి బూరలనూదు చుండిరి. బూరలనూదువారు, స్వరమండలము మొదలగు వాద్యములను వాయించువారు, గాయకులందరు ఏకమై “ప్రభువును స్తుతింపుడు, అతడు మంచివాడు, అతని ప్రేమ శాశ్వతమైనది" . అని ఎలుగెత్తి గానముచేసిరి. యాజకులు పవిత్ర స్థలమునుండి వెలుపలికి వచ్చుచుండగా ప్రభువు తేజస్సుతో ప్రకాశించు మేఘము దేవుని మందిరమును నింపెను. ఆ వెలుగు వలన యాజకులు ఆ మేఘమున్నచోట నిలిచి పరిచర్య చేయజాలరైరి.

 1-2. అప్పుడు సొలోమోను, “ప్రభూ! నీవు కారుమబ్బులో వసింపగోరితివి. నీవు శాశ్వతముగా నివసించుటకుగాను నేను నీకొక మందిరమును నిర్మించితిని” అని పలికెను.

3. అపుడు యిస్రాయేలీయులెల్లరు అచట సమావేశమై ఉండగా రాజు వారివైపు తిరిగి వారిని ఆశీర్వదించెను.

4. అతడు “యిస్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక! ఆయన మా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానములను నెరవేర్చెను.

5. ప్రభువు మా తండ్రితో 'నేను నా ప్రజలను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పటినుండి నేటివరకును నా నామముండుటకై మందిరమును కట్టింప యిస్రాయేలు దేశమున ఏ పట్టణమును ఎన్నుకోనైతిని. ఎవనిని నా ప్రజలకు నాయకునిగా నియమింపనైతిని.

6. కాని ఇప్పుడు యెరూషలేమును నా నామముండు స్థలముగా ఎన్నుకొంటిని. దావీదువైన నిన్ను నా ప్రజకు నాయకునిగా నియమించితిని' అని చెప్పెను.

7. మా తండ్రి దావీదు యిస్రాయేలు దేవుడైన ప్రభువు నామ ఘనతకు దేవాలయమును కట్టింపగోరెను.

8. కాని ప్రభువు అతనితో 'నీవు నాకు మందిరమును కట్టింపగోరుట ఉచితముగనే ఉన్నది.

9. కాని ఆ మందిరమును కట్టింపవలసినది నీవు కాదు, నీకు పుట్టబోవు కుమారుడే నా నామమునకు దేవాలయము నిర్మించును' అని నుడివెను.

10. ప్రభువు తనమాట నిలబెట్టుకొనెను. అతడు చెప్పినట్లే నేను మా తండ్రికి బదులుగా యిస్రాయేలీయులకు రాజునైతిని. యిస్రాయేలు దేవుడైన ప్రభువునకు దేవళమును గూడ కట్టించితిని.

11. ప్రభువు యిస్రాయేలీయులతో చేసికొనిన నిబంధనపు శాసనములు గల మందసమును ఈ దేవాలయములో ఉంచితిని” అని పలికెను.

12. అంతట సొలోమోను ప్రజలెల్లరు చూచుచుండగా బలిపీఠముముందట నిలుచుండి ప్రార్థన చేయుటకు చేతులెత్తెను.

13. అతడు కంచుతో ఒక వేదికను సిద్ధముచేయించి దానిని ప్రాంగణము నడుమ ఉంచెను. దాని పొడవు, వెడల్పులు ఐదేసి మూరలు. ఎత్తు మూడుమూరలు. జనులెల్లరు చూచు చుండగా అతడు ఆ వేదికనెక్కి దానిపై మోకరిల్లి, చేతులు పైకిచాచి ఇట్లు ప్రార్ధించెను:

14. “యిస్రాయేలు ప్రభుడవైన దేవా! భూమిమీదగాని, ఆకాశ మందుగాని నీవంటి దేవుడొక్కడును లేడు. ప్రజలు నీకు విధేయులై జీవించినచో నీవు వారితో చేసికొనిన ఒప్పందమును నిలుపుకొందువు, వారిని కరుణతో ఆదరింతువు.

15. నీ సేవకుడగు మా తండ్రి దావీదునకు నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చితివి. నీవు నోటితో పలికిన పలుకులు నేడు చేతలతో నిరూపించితివి.

16. 'నీ వంశజులును నీవలెనే నా ఆజ్ఞలను పాటింతురేని, వారిలో ఒకడు ఎల్లప్పుడును యిస్రాయేలీయులను పరిపాలించుచునే యుండును' అని నీవు మా తండ్రికి మాట యిచ్చితివికదా!

17. ప్రభూ! నీవు మా తండ్రికి సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరపరుచుము.

18. కాని దేవుడు ఈ భూమిమీద నరులతో వసించునా? ఆకాశ మహాకాశములే నిన్ను ఇముడ్చుకోజాలవనిన, నేను కట్టించిన ఈ దేవాలయమున నీవు ఇముడుదువా?

19. ప్రభూ! నీ దాసుడనైన నా ప్రార్థన ఆలింపుము. నా విన్నపమునకు చెవి యొగ్గుము.

20. రేయింబవళ్ళు ఈ దేవాలయమును చల్లనిచూపుతో చూడుము. ప్రజలు నిన్ను ఈ మందిరమున ఆరాధింపవలయునని నీవు ఆనతి నిచ్చితివికదా! కనుక నీ ఈ దేవాలయమున నేను చేయు ప్రార్థనను ఆలింపుము.

21. ప్రభూ! నేనును, ఈ ప్రజలును ఈ దేవాలయమున ప్రార్థన చేసినపుడు, నీవు మా మొరాలింపుము. ఆకాశమునుండి మా వేడుకోలు నాలించి మమ్ము క్షమింపుము.

22-23. ఎవడైన ఒకడు తోడి నరునిమీద నేరము మోపగా, ఆ నేరము మోపబడినవాడు ఈ దేవాలయమున నీ బలిపీఠము ఎదుటికి వచ్చి తాను నిరపరాధినని ఒట్టు పెట్టుకొనెనేని, నీవు ఆకాశము నుండి వారి తగవులాలించి, వారికి తీర్పుచెప్పుము. దోషిని వాని పాపమునకు తగినట్లుగా శిక్షింపుము. నిర్డోషిని వాని మంచితనమునకు తగినట్లుగా సంభావింపుము.

24-25. యిస్రాయేలీయులు నీకు విరోధముగా పాపము చేసినందున యుద్ధమున ఓడిపోయి ఈ దేవాలయమునకు వచ్చి నిన్ను స్తుతించి తమను క్షమింపుమని వేడుకొందురేని, ఆకాశమునుండి నీవు వారి మొర ఆలింపుము. వారి అపరాధమును క్షమింపుము. నీవు వారికి, వారి పూర్వులకు దయ చేసిన ఈ నేలకు వారిని మరల తోడ్కొనిరమ్ము.

26-27. ప్రజలు పాపము చేసినందున నీవు వానలు ఆపివేయగా వారు ఈ దేవాలయమునకు వచ్చి నిన్ను స్తుతించి వినయముతో పశ్చాత్తాపపడుదు రేని, నీవు ఆకాశమునుండి వారి మొరాలింపుము. వారి దోషములను మన్నింపుము. వారికి మంచిని చేయువిధానము తెలియజెప్పుము. నీవు నీ ప్రజలకు శాశ్వతముగా భుక్తముచేసిన ఈ దేశముమీద వానలు కురియింపుము.

28-30. ఈ దేశమున కరువు, అంటురోగములు వ్యాపించినపుడు, వడగాలి, తెగుళ్ళు, మిడుతలవలన ఇచటి పైరులు నాశమైనపుడు, శత్రువులు వచ్చి ఈ దేశమును ముట్టడించినపుడు, ఇచటి ప్రజలు రోగగ్రస్తులైనపుడు, ఉపద్రవములకు చిక్కినపుడు, ఈ జనులలో ఒకడుకాని, అనేకులుకాని ఈ దేవాలయమునకు వచ్చి పశ్చాత్తాపపడి చేతులెత్తి నీకు మనవి చేసికొనినచో, నీవు ఆకాశమునుండి వారి మొర నాలింపుము. వారి పాపములు మన్నింపుము. నరుల హృదయములు తెలిసినవాడవు నీవొక్కడవే కనుక ప్రతివానికి వానివాని క్రియలకు తగినట్లుగా ప్రతిఫలమిమ్ము.

31. ఇట్లు చేయుదువేని ఈ ప్రజలు నీవు వారి పితరులకిచ్చిన ఈ నేలమీద వసించినంత కాలము వారు నీకు విధేయులై ఉందురు.

32-33. దూరదేశములందు వసించు పరదేశులు నీ శక్తి సామర్థ్యములనుగూర్చి విని ఈ దేవాలయమునకు వచ్చి నీకు ప్రార్థనచేసినచో ఆకాశమునుండి నీవు వారి వేడుకోలును ఆలించి వారి కోర్కెలు తీర్చుము. అప్పుడు యిస్రాయేలీయులవలె సమస్తజాతిజనులు నిన్నుగూర్చి తెలిసికొని నీ పట్ల భయభక్తులు చూపుదురు. నేను నిర్మించిన ఈ మందిరమున నీ నామము పెట్టబడినదని అన్యజాతి జనులెల్లరు గుర్తింతురు.

34-35. నీవు పంపగా నీ జనులు తమ శత్రువుల మీదికి యుద్ధమునకు పోయిరనుకొందము. వారు ఏ ప్రదేశము నుండియైనను, నీ వెన్నుకొనిన ఈ పట్టణమువైపునకును, నీ నామమునకు నేను కట్టించిన ఈ దేవాలయము వైపునకును తిరిగి నీకు విన్నపము చేయుదురేని, నీవు ఆకాశమునుండి వారి వేడుకోలునాలించి వారికి విజయమును ప్రసాదింపుము.

36-39. పాపము చేయనివాడు ఎవడునులేడు. కనుక నీ ప్రజలును పాపముచేయగా నీవు కోపించి వారిని శత్రువుల చేతికి చిక్కింపగా ఆ శత్రువులు వారిని దూరదేశములకో, దగ్గరి దేశములకో బందీలనుగా కొనిపోయిరనుకొందము. ఆ శత్రుదేశమున వారు బుద్దితెచ్చుకొని పశ్చాత్తాపపడి 'మేము దుర్మార్గపు పనులు చేసి పాపాత్ములమైతిమి' అని ఒప్పుకొందురనుకొందము. ఆ ప్రవాసమునుండి వారు నీవు మా పితరులకిచ్చిన ఈ నేలవైపు, నీవు ఎన్నుకొనిన ఈ నగరమువైపును, నీ నామ ఘనతకు నేను నిర్మించిన ఈ దేవాలయమువైపును మరలి పూర్ణహృదయముతో నీకు విన్నపము చేయుదురనుకొందము. అప్పుడు నీవు ఆకాశమునుండి వారి మనవిని ఆలింపుము. కరుణతో వారితప్పిదములను క్షమింపుము.

40-42. ప్రభూ! మేమిచట చేసిన ప్రార్థనలను దయతో ఆలింపుము. నా దేవా! ప్రభువా! నీ బలసూచకముగానున్న నీ నిబంధన మందసమును గాంచి ఇకలెమ్ము! నీ విశ్రాంతి స్థలమునకు తరలిరమ్ము. దేవా! ప్రభువా! నీ యాజకులు రక్షణ పరివేష్టితులగుదురుగాక! నీ ఉపకారములను పొంది ఈ జనులు ఆనందింతురుగాక! ఓ ప్రభువైన దేవా! నీ అభిషిక్తుని తిరస్కరించకుము. ప్రభూ! నీ సేవకుడైన దావీదునకు నీవు చేసిన ఉపకారములను స్మరించుకొనుము”.

 1. సొలోమోను ప్రార్థన ముగించగానే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి బలి నైవేద్యములను దహించెను. ప్రభువు తేజస్సు గుడారమును నింపెను.

2. ఆ తేజస్సు వలన యాజకులు దేవాలయమును ప్రవేశింపజాలరైరి.

3. అగ్ని దిగివచ్చుటయు, తేజస్సు దేవాలయమును నింపుటయు చూచి యిస్రాయేలీయులందరు సాష్టాంగ నమస్కారము చేసి ప్రభువును ఆరాధించి స్తుతించిరి. “ప్రభువు మంచివాడు. ఆయనకృప కలకాలము వరకు ఉండును” అని స్తుతిచేసిరి.

4. అంతట రాజు, ప్రజలు దేవునికి బలులర్పించిరి.

5. సొలోమోను ఇరువది రెండువేల కోడెలను, లక్ష యిరువదివేల పొట్టేళ్ళను బలియిచ్చెను. ఆ రీతిగా రాజును, ప్రజలును దేవాలయమును ప్రతిష్ఠ చేసిరి.

6. యాజకులు వారివారి స్థానములలో నిలిచి యుండగా లేవీయులు వాద్యములు వాయించుచు “ఆయన కృప కలకాలము వరకు ఉండును” అని పాటపాడుచు ప్రభువును స్తుతించిరి. ఆ వాద్యములు పూర్వము దావీదు చేయించినవి. ఆ పాటలు కూడ అతడు నియమించినవే. అపుడు ప్రజలెల్లరు నిలుచుండి చూచుచుండగా యాజకులు బాకాలూదిరి.

7. సొలోమోను దేవాలయ ప్రాంగణపు మధ్య భాగమును శుద్ధిచేయించెను. అతడచటనే దహన బలులు, ధాన్యబలులు, సమాధాన బలులలో వేల్చు క్రొవ్వును సమర్పించెను. ఆ రాజు చేయించిన కంచుబలిపీఠము ఈ బలులన్నిటిని సమర్పించుటకు సరిపోదయ్యెను.

8. సొలోమోను ఏడురోజులపాటు ఉత్సవము చేయించెను. యిస్రాయేలీయులు తండోపతండములుగా ప్రోగైరి. వారు హమాతునకు పోవు మార్గము నుండి, ఐగుప్తు నదివరకును గల దూరప్రాంతముల నుండి గొప్పసమూహముతో చేరిరి.

9. ఆ ప్రజలు ఏడునాళ్ళు బలిపీఠమునకు ప్రతిష్ఠ చేసిరి. ఏడునాళ్ళు పండుగ చేసికొనిరి. చివరిదినమున ప్రాయశ్చిత్తబలి జరుపుకొనిరి.

10. ఆ మరునాడు ఎనిమిదవనాడు అనగా ఏడవనెల ఇరువది మూడవదినమున, సొలోమోను ప్రజలను పంపివేసెను. ప్రభువు యిస్రాయేలు ప్రజలకును, దావీదునకును, సొలోమోనుకును చేసిన ఉపకారములను తలచుకొని జనులెల్లరును సంతసించిరి.

11. సొలోమోను తాను కోరుకొన్నట్లుగనే దేవాలయమును, రాజప్రాసాదమును కట్టి ముగించెను.

12. అంతట ప్రభువు అతనికి రాత్రివేళ దర్శనమిచ్చి “నేను నీ ప్రార్థనను ఆలించితిని. ఈ దేశమున మీరు నాకు బలులు అర్పించుటకు అంగీకరించితిని.

13-14. నేను వానలు కురియకుండా ఆకాశద్వారములు మూసి వేసినపుడు గాని, దేశమును నాశనము చేయుటకు మిడుతల దండును పంపినప్పుడుగాని, అంటురోగములు వ్యాపింపజేసినప్పుడు గాని, ప్రజలు నాకు మొరపెట్టి, తమను తాము తగ్గించుకొని, తమ దుష్కార్యములను విడనాడుదురేని, ఆకాశమునుండి నేను వారి వేడికోలును ఆలింతును. వారి పావములను క్షమింతును. వారి దేశమును అభివృద్ధిలోనికి తెత్తును.

15. మీరు ఈ దేవళమున అర్పించు ప్రార్ధనలను ఎల్లప్పుడును ఆదరముతో ఆలింతును.

16. నా నామము ఈ మందిరమున నిత్యము ఉండునట్లుగ దీనిని నేను ఎన్నుకొని పవిత్రపరచితిని. నా కను దృష్టియు, నా మనస్సును ఎల్లవేళల దీనిమీద నుండును.

17-18. నీ తండ్రివలె నీవును చిత్తశుద్ధితో నన్ను సేవింతువేని నా ఆజ్ఞలను పాటించి నా విధులను నెరవేర్తువేని, నేను నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును. నీ వంశజుడొకడు కలకాలము యిస్రాయేలును పరిపాలించునని నేనతనికి బాసచేసితిని.

19. కాని నీవు నా మాట పెడచెవినిబెట్టి, నా ఆజ్ఞలను త్రోసిపుచ్చి అన్యదైవములను ఆరాధింతు వేని నేను మీకిచ్చిన ఈ నేలమీది నుండి యిస్రాయేలీయులను గెంటివేయుదును.

20. నా నామము నెలకొనియున్న ఈ ఆలయమును నా సాన్నిధ్యము నుండి తొలగింతును. అప్పుడు సకలజాతి జనులు దానిని అపహాస్యాస్పద లోకోక్తిగా వాడుదురు.

21. ప్రసిద్ధినొందిన ఈ ఆలయ మార్గమునబోవు బాటసారులెల్లరు అపుడు దీనిని జూచి విస్తుపోయి ప్రభువు ఈ దేశమును, ఈ దేవాలయమును ఇట్లు ధ్వంసము చేయనేల? అని ప్రశ్నింతురు.

22. ఆ ప్రశ్నకు ప్రజలు ‘యిస్రాయేలీయులు తమ పితరులదేవుని, తమను ఐగుప్తునుండి తోడ్కొని వచ్చిన ప్రభువును విడనాడిరి. అన్య దైవములను ఆశ్రయించి వారికి సేవలు చేసిరి. కనుకనే ప్రభువు వీరిని ఈ రీతిగా నాశనము చేసెను' అని జవాబు చెప్పుదురు” అని పలికెను.

 1. దేవాలయమును, ప్రాసాదమును కట్టి ముగించుటకు సొలోమోనునకు ఇరువది యేండ్లు పట్టెను.

2. అటు తరువాత అతడు హూరాము తనకిచ్చిన నగరములను పునర్నిర్మాణము చేయించి వానిలో యిస్రాయేలీయులను వసింపజేసెను.

3. అతడు హమాతు, సోబా మండలములను జయించెను.

4. ఎడారిలోని తడ్మోరు పట్టణమును సురక్షితము చేసెను. వస్తుసంభారములను నిల్వయుంచిన హమాతు మండలపు పట్టణములను అన్నిటిని పునర్నిర్మించెను.

5. ఆ రాజు ఈ క్రింది నగరములనుగూడ పునర్నిర్మాణము చేయించెను: కవాటములతో, ప్రాకారములతో సురక్షితములైయున్న ఎగువబేతహారోను, దిగువ బేతహారోను,

6. బాలతు నగరము, వస్తు సంభారములను ఉంచిన నగరములు, రథములను, గుఱ్ఱములను ఉంచిన నగరములు. పైగా యెరూషలేము నందును, లెబానోను నందును తన ఏలుబడిలో నున్న ఇతర మండలములలోను తాను నిర్మింపగోరిన భవనముల నెల్ల నిర్మించెను.

7-8. యిస్రాయేలీయులు కనాను మండలమును ఆక్రమించుకొనినపుడు అచటి జాతులనన్నిటిని సంహరింపలేదు. అటుల సంహరింపక మిగిల్చిన జాతులవారి సంతానమైన ప్రజలను సొలోమోను వెట్టిచాకిరికి వినియోగించుకొనెను. హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వియులు, యెబూసీయులు ఆ రీతిగా మిగిలియును ఆ జాతులవారి సంతానమే. ఈ ప్రజలు నేటికిని వెట్టి చాకిరి చేయుచునే ఉన్నారు.

9. అతడు యిస్రాయేలీయులచేత మాత్రము వెట్టిచాకిరి చేయింపలేదు. వారు సైనికులుగను, అధికారులుగను, రథనాయకులుగను, అశ్వదళాధిపతులుగను పనిచేసిరి.

10. వీరిలో రెండువందల ఏబదిమంది ముఖ్యులు. సొలోమోను రాజు వీరిని ప్రజలమీద అధికారులుగా నియమించెను.

11. సొలోమోను తన భార్యయైన ఐగుప్తురాజు కుమార్తెను దావీదునగరము నుండి తోడ్కొనివచ్చెను. తాను స్వయముగా నిర్మించిన భవనముననే ఆమెకు విడిది కల్పించెను. యిస్రాయేలు రాజైన దావీదు పట్టణమున ఆమె వసింపరాదనియు, దైవమందసము నుంచినందున ఆ తావు పవిత్రమైనదనియు అతడు తలంచెను.

12. సొలోమోను దేవాలయము నెదుట తాను నిర్మించిన బలిపీఠముపై ప్రభువునకు దహనబలులు అర్పించెను.

13. ప్రతిదిన దహనబలులు, విశ్రాంతి దినములందు, అమావాస్యలందు అర్పించుబలులు, పొంగనిరొట్టెల పండుగ, వారముల పండుగ, గుడారముల పండుగ అను మూడు సాంవత్సరిక ఉత్సవములు మొదలైనవానిని గూర్చి మోషే ధర్మశాస్త్రము నందు ఆదేశించిన నియమములనెల్ల అతడు పాటించెను.

14. సొలోమోను తన తండ్రి దావీదు చేసిన నియమముల ప్రకారము యాజకుల అనుదిన ఆరాధన కార్యక్రమములను క్రమబద్దము చేసెను. గానముచేయుచు ఆరాధనయందు యాజకులకు తోడ్పడు లేవీయుల పరిచర్యనుగూడ నియమబద్ధము చేసెను. దావీదు శాసనములననుసరించి దేవాలయ సంరక్షకులు ప్రతిరోజు ఆయా దేవాలయ ద్వారముల వద్ద చేయవలసిన ఊడిగమునుగూడ నియమబద్ధము చేసెను.

15. యాజకులు, లేవీయులు, రాజు తమని గూర్చి చేసిన నియమములనెల్ల పాటించిరి. వస్తు సంభారములను గూర్చియు, ఇతరాంశములను గూర్చియు అతడు చేసిన శాసనములనెల్ల అనుసరించిరి.

16. సొలోమోను తలపెట్టిన పనులన్నియు ముగిసెను. దేవాలయమునకు పునాదులెత్తుట నుండి దానిని కట్టి ముగించుట వరకునుగల సకలకార్యములు విజయవంతముగా పూర్తి అయ్యెను.

17. అంతట సొలోమోను ఎదోము మండలములోని ఏసోన్గబేరు, ఏలొతు రేవులను చూడబోయెను. హురాము అతనికి ఓడలనంపెను. వానిని హురాము అధికారులు నైపుణ్యముగల అతని నావికులు నడిపించిరి.

18. వారును, సొలోమోను నావికులును కలసి ఓఫీరు మండలమునకు వెళ్ళి అచటి నుండి పదునారు బారువుల బంగారము కొని తెచ్చిరి.

 1. షేబ దేశపు రాణి సొలోమోను కీర్తిని గూర్చి వినెను. ఆమె అతనిని పరీక్షింపగోరి గడ్డు ప్రశ్నలు సిద్ధముచేసికొని యెరూషలేమునకు పయనమై వచ్చెను.

2. ఆ రాణి సుగంధ ద్రవ్యములు, పెద్దమొత్తము బంగారము, రత్నములు ఒంటెల మీదికెక్కించుకొని గొప్ప పరివారముతో వచ్చెను. ఆమె సొలోమోనును కలిసికొని తాను అడుగదలచిన ప్రశ్నలన్నియు అడిగెను. రాజు ఆ ప్రశ్నలన్నిటికిని జవాబు చెప్పెను. అతనికి తెలియని అంశమేదియులేదు.

3-4. సొలోమోను విజ్ఞానమును, అతడు నిర్మించిన దేవాలయమును, అతడు భుజించు భోజనమును, అతని సేవకులు వనించు గృహములను, ప్రాసాదమునందలి అతని ఉద్యోగులు పనిచేయు తీరును, వారు తాల్చిన దుస్తులను, అతని పానీయవాహకులను, వారి ఉడుపులను, అతడు దేవాలయమున అర్పించు బలులను చూచి ఆ రాణి దిగ్బ్రాంతి చెందెను.

5. ఆమె రాజుతో “నేను నిన్ను గూర్చియు నీ విజ్ఞానమును గూర్చియు మా దేశమున వినినదెల్ల నిజమే.

6. నేను స్వయముగా వచ్చి చూచువరకును ఇతరులు నిన్నుగూర్చి పలికిన పలుకులు నమ్మనైతిని. కాని వారు నాకు విన్పించినది నీ విజ్ఞానములో అర్ధభాగము కంటెను తక్కువ. నీవు జనులు చెప్పుకొను దానికంటెను అధికవిజ్ఞానవంతుడవు.

7. ఎల్లప్పుడు నీ చేరువలోనుండి నీ విజ్ఞానవాక్యములను ఆలించు ఈ నీ సేవకులెంత ధన్యులు!

8. నీ పట్ల సంతృప్తి చెంది నిన్ను తన పేరు మీదుగా రాజును చేసిన ప్రభుదేవునకు స్తోత్రములు కలుగునుగాక, ఆయన యిస్రాయేలును ప్రేమించి వారిని కలకాలము సంరక్షింపగోరెను. కనుకనే నిన్ను వారికి రాజునుగా నియమించెను. నీవు వారికి న్యాయము, ధర్మము జరిగించునట్లు చేసెను” అనెను.

9. రాజునకు ఆ రాణి ఐదుబారువుల బంగారము, పెద్ద మొత్తము సుగంధ ద్రవ్యములు, రత్నములు బహూకరించెను. ఆమె బహూకరించిన సుగంధ ద్రవ్యములకు సాటియైనవి మరి యెచ్చట లేవు.

10. ఓఫీరు నుండి బంగారము కొనివచ్చిన హురాము నావికులు, సొలోమోను నావికులు ఆ రాజునకు చందనపుకొయ్యను, రత్నములను గూడ తీసికొనివచ్చిరి.

11. సొలోమోను ఆ కొయ్యతో దేవాలయమునకును, తన ప్రాసాదమునకును మెట్ల వరుసలు కట్టించెను. గాయకులకు తంబురలను, సితారాలను తయారుచేయించెను. యూదా దేశమున ఇట్టి కార్యమెన్నడును జరిగియుండలేదు.

12. సొలోమోను తన తరపున తాను షేబరాణి కోరుకొనినదెల్ల బహూకరించెను. ఆ రాణి తెచ్చిన బహుమతులకు ప్రతి బహుమతులనిచ్చెను. అటు తరువాత ఆ రాణి తన పరివారముతో షేబ దేశమునకు వెడలిపోయెను.

13. సొలోమోనునకు ప్రతి యేడు ఆరు వందల తలాంతుల బంగారము లభించెడిది.

14. వర్తకుల నుండి వసూలుచేసిన పన్నులు అతనికి ముట్టెడివి. అరేబియా రాజులు, వివిధ దేశాధిపతులు అతనికి వెండి బంగారములు తెచ్చి యిచ్చెడివారు.

15. ఆ రాజు రెండువందల పెద్దడాలులను చేయించెను. ఒక్కొక్కడాలును ఆరువందల తులముల మేలిమి బంగారముతో పొదిగించెను.

16. మరియు అతడు మూడు వందల చిన్నడాలులనుగూడ చేయించి ఒక్కొక్క దానిని మూడువందలతులముల మేలిమి బంగారముతో పొదిగించెను. వానినన్నిటిని “లెబానోను అరణ్యము” అను పేరుగల గృహమునందు పదిలపరచెను.

17. అతడు దంతముతో పెద్ద సింహాసనమును చేయించి దానిని మేలిమిబంగార ముతో పొదిగించెను.

18. సింహాసనమునతో కలిసియున్న ఆరుమెట్లు, బంగారపు పాదపీఠము కలవు. సింహాసనమునకు ఇరువైపుల చేతులు ఆనించుటకు గాను అమర్చిన హస్తములు కలవు. వాని పైని సింహముల బొమ్మలు చెక్కిరి,

19. ఆరు మెట్లకు కలిసి ప్రతిదాని కిటువైపు నొకటి అటువైపునొకటి చొప్పున మొత్తము పండ్రెండు సింగముల బొమ్మలు కలవు. ఏ రాజ్యముననైన ఏ కాలముననైన నరులు ఇట్టి సింహాసనమును కావించి యెరుగరు.

20. సొలోమోను పాన పాత్రలన్నిటిని బంగారము తోనే చేసిరి. “లెబానోను అరణ్యము” అను గృహము నందు వాడెడు పాత్రలన్నిటిని బంగారముతోనే చేసిరి. అతని కాలమున వెండికి విలువలేదు.

21. రాజునకు ఓడలును గలవు. వానిని హురాము నావికులే నడిపించిరి. అవి తర్షీసునకు వెళ్ళెడివి. ప్రతి మూడవ యేట వెండి బంగారములతో, దంతములతో, కోతులు, నెమళ్ళతో తిరిగివచ్చెడివి.

22. ప్రపంచములోని రాజులందరికంటెను సొలోమోను అధిక ధనవంతుడు, అధిక విజ్ఞాని.

23. ప్రభువు అతనికి దయచేసిన విజ్ఞానవాక్యములు వినుటకు రాజులెల్లరును అతనితో సంభాషింపగోరిరి.

24. వారు ఆ రాజును సందర్శింపవచ్చినపుడు వెండి బంగారు వస్తువులును, దుస్తులును, ఆయుధములును, సుగంధ ద్రవ్యములును, గుఱ్ఱములును, కంచర గాడిదలును మొదలుగాగల బహుమతులు కొని వచ్చిరి. ప్రతి యేడును రాజులిట్టి బహుమతులతో వచ్చెడివారు.

25. ఆ రాజు తన గుఱ్ఱములను, రథములను ఉంచుటకు నాలుగువేల అశ్వశాలలు కట్టించెను. అతనికి పండ్రెండువేల గుఱ్ఱములు ఉండెడివి. వానిలో కొన్ని యెరూషలేమున, మిగిలినవి వివిధ రథ నగరములందున ఉండెడివి.

26. యూఫ్రటీసునది నుండి ఫిలిస్తీయావరకు, ఐగుప్తు సరిహద్దు వరకుగల రాజులు అందరిమీద అతడు అధికారము నెరపెను.

27. అతనికాలమున యెరూషలేమున వెండి రాళ్ళవలె దొరికెడిది. దేవదారు కొయ్య షెఫేలా ప్రదేశములోని సాదా మేడికఱ్ఱవలె లభ్యమయ్యెడిది.

28. ఐగుప్తు దేశము నుండియు మరియు ఇతర దేశముల నుండియు అతడు గుఱ్ఱములను తెప్పించెడివాడు.

29. సొలోమోనును గూర్చిన ఇతర అంశములు మొదటినుండి తుదివరకు నాతాను ప్రవక్త రచించిన గ్రంథమునందును, షిలో నివాసియైన అహీయా ప్రవచన గ్రంథమునందును, దీర్ఘదర్శి ఇద్ధో దర్శనములు అను గ్రంథమునందు లిఖింపబడియేయున్నవి. ఈ చివరి గ్రంథమున నెబాతు కుమారుడును, యిస్రాయేలు రాజైన యరోబాము కథకూడా కలదు.

30. సొలోమోను యెరూషలేము నుండి యిస్రాయేలీయులెల్లరిని నలువదియేండ్ల కాలము పరిపాలించెను.

31. సొలోమోను తన పితరులతో నిద్రించగా, తన తండ్రియైన దావీదు నగరమందు పాతిపెట్టబడెను. అటుతరువాత అతని కుమారుడు రెహబాము రాజయ్యెను.

 1. రెహబాము షెకెమునకు వెళ్ళెను. అతనికి అభిషేకముచేయుటకు యిస్రాయేలీయులు కూడా అచటికిపోయిరి.

2. ఈ సమాచారమువిని నెబాతు కుమారుడగు యరోబాము ఐగుప్తునుండి తిరిగి వచ్చెను. అతడు సొలోమోనునకు భయపడి అంత వరకు ఐగుప్తుననే తలదాచు కొనుచుండెను.

3-4. యిస్రాయేలీయులు అతనిని పిలువనంపిరి. వారెల్లరు కలిసి రెహబాము వద్దకు పోయి "అయ్యా! మీ తండ్రి మా నెత్తిపై పెద్దభారము పెట్టెను. నీవు ఆ బరువును తొలగించి మేము కొంచెము ఊపిరి పీల్చుకొనునట్లు చేయుము. మేము నీకు తప్పక ఊడిగము చేయుదుము” అనిరి.

5. అతడు మీరు మూడురోజుల తరువాత తిరిగిరండని చెప్పి వారిని పంపివేసెను.

6. రెహబాము పూర్వము తన తండ్రి కొలువులో పనిచేసిన వృద్ధులను సంప్రతించి “ఈ జనులకు నన్నేమి జవాబు చెప్పమందురు?” అని ప్రశ్నించెను.

7. వారు “నీవు ఈ ప్రజలపట్ల కరుణతో ప్రవర్తింపుము. మృదువుగా మాటలాడి వారిని సంతోషపెట్టుము. అప్పుడు వారు ఎల్లకాలము నీకు ఊడిగము చేయుదురు” అని చెప్పిరి.

8. అయినా అతడు ఆ వృద్దుల హితోపదేశమును పెడచెవిని బెట్టి తనతో పెరిగి తన కొలువులో పనిచేయుచున్న యువకులను సలహా అడిగెను.

9. “మీ తండ్రి మా నెత్తిపై పెట్టిన భారమును తొలగింపుమని ఈ ప్రజలు నన్నడుగు చున్నారు. వీరికి నేనేమి జవాబు చెప్పవలయునో తెలుపుడు” అని యడిగెను.

10. ఆ యువకులు “నీవు వారితో మా తండ్రి నడుముకంటెను నా చిటికెనవ్రేలు లావు గలది.

11. మా తండ్రి మీ నెత్తిపై పెద్దభారము పెట్టినచో నేను అంతకంటే పెద్దదానినే పెట్టెదను. అతడు మిమ్ము చండ్రకోలలతో కొట్టించెను. కాని నేను మిమ్ము కొరడాలతో బాధింతునని చెప్పుము” అనిరి.

12. మూడునాళ్ళయిన పిమ్మట రెహబాము కోరినట్లే యరోబామును, ప్రజలందరును అతనియొద్దకు తిరిగివచ్చిరి.

13-14. కాని రాజైన రెహబాము పెద్దల ఉపదేశమును త్రోసిపుచ్చి యువకుల సలహాను పాటించెను. ప్రజలతో కటువుగా మాటలాడెను. “మా తండ్రి మీ నెత్తిపై పెద్దభారమును పెట్టెనుగదా! కాని నేనంతకంటే పెద్దదానినే పెట్టెదను. మా తండ్రి మిమ్ము చండ్రకోలలతో కొట్టించెను. కాని నేను మిమ్ము కొరడాలతో బాధింతును” అనెను.

15. ప్రభువు షిలో ప్రవక్తయైన అహీయద్వారా నెబాతు కుమారుడైన యరోబామున కిచ్చిన మాట నిలబెట్టుకోగోరెను. కనుకనే రెహబాము ప్రజల మొర ఆలింపడయ్యెను.

16. రాజు తమ వేడుకోలును అనాదరము చేయుట చూచి ప్రజలెల్లరు “దావీదులో మనకు పాలులేదు. యిషాయి కుమారుని వారసత్వమున పొత్తులేదు. మన నివాసములకు మనము వెళ్ళుదము రండు. ఇకమీదట దావీదు వంశజులను తమ ఇష్టము వచ్చినట్లే ఊరేగనిండు” అని యనిరి. ఆ రీతిగా యిస్రాయేలీయులు తిరుగు బాటుచేసి వెడలిపోయిరి.

17. అయితే, రెహబాము యూదా నగరములలో వశించు యిస్రాయేలీయులమీద రాజుగా మిగిలిపోయెను.

18. అతడు వెట్టిచాకిరి చేయువారికి అధిపతియైన హదోరమును యిస్రాయేలీయుల మీదికి పంపెనుగాని, వారతనిని రాళ్ళతో కొట్టిచంపిరి. రెహబాము రథమునెక్కి యెరూషలేమునకు పారిపోయి ప్రాణములు దక్కించుకొనెను.

19. నాటినుండి ఉత్తర రాష్ట్రమునందలి యిస్రాయేలీయులు దావీదు రాజు వంశమునుండి విడిపోయిరి.

 1. రెహబాము యెరూషలేమునకు తిరిగి రాగానే యూదా, బెన్యామీను తెగలనుండి మెరికల వంటి యుద్ధవీరులను లక్ష ఎనుబది వేలమందిని ప్రోగుజేసికొనెను. అతడు ఉత్తరదేశమందలి యిస్రా యేలీయులను జయించి తన రాజ్యమును తిరిగి స్వాధీనము చేసికోగోరెను.

2-4. కాని ప్రభువు దివ్యవాణి షెమయా ప్రవక్తకు ప్రత్యక్షమై "నీవు రెహబాముతోను, యూదా మరియు బెన్యామీనీయుల తోను ఇట్లు నుడువుము. మీరు మీ సోదరుల మీదికి యుద్ధమునకు పోవలదు. ఎల్లరును ఎవరి ఇండ్లకు వారు తిరిగిపొండు. ఈ కార్యము నా వలన జరిగినది" అని చెప్పెను. కనుక వారు ప్రభువు ఆజ్ఞకు బద్దులై యుద్ధ ప్రయత్నములు విరమించుకొని వెడలిపోయిరి.

5-10. రెహబాము యెరూషలేమున వసించెను. అతడు యూదా బెన్యామీను మండలములలోని ఈ క్రింది నగరములకు ప్రాకారములు నిర్మించెను: బేత్లెహేము, ఏతాము, తెకోవా, బేత్సూరు, సోకో, అదుల్లాము, గాతు, మారేషా, సీపు, అదోరయీము, లాకీషు, అసేకా, సోరా, అయ్యాలోను, హెబ్రోను.

11-12. అతడు ఈ నగరములన్నింటికి సురక్షితములైన ప్రాకారములు నిర్మించి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క అధిపతిని నియమించెను. ఒక్కొక్క దానిలో ఆహార పదార్దములు, ఓలివునూనె, ద్రాక్షసారాయము, డాళ్ళు, ఈటెలు నిల్వయుంచెను. ఆ రీతిగా అతడు యూదా బెన్యామీను నగరములను తన పక్షమున నిలుపుకొనెను.

13. యిస్రాయేలు దేశమునందలి యాజకులును, లేవీయులును దక్షిణమునకు వచ్చి రెహబాము ప్రాపు జొచ్చిరి.

14. ఎందుకనగ, యరోబామును మరియు అతని కుమారులును ప్రభువునకు యాజక సేవ జరుగనీయక లేవీయులను త్రోసివేయగా, వారు తమకు హక్కుభుక్తమైన గడ్డిమైదానములను, పొలములను వదలుకొని యూదాదేశమునకును, యెరూషలేమునకును వచ్చిచేరిరి.

15. అతడు బలిపీఠములకును, దయ్యములకును తాను చేయించిన దూడలకును తన సొంత యాజకులను ఏర్పరచుకొనెను.

16. అయినను పూర్ణహృదయముతో యిస్రాయేలు దేవుని వెదుకగోరిన భక్తులుమాత్రము అన్ని యిస్రాయేలు తెగలనుండియు లేవీయుల వెంట యెరూషలేమునకు వచ్చి అచట స్థిరపడి తమ పితరుల దేవుడైన ప్రభువునకు బలులు అర్పించిరి.

17. వీరివలన యూదారాజ్యము బలపడెను. రెహబాము తన తండ్రి, తాతలైన సొలోమోను దావీదు రాజుల మార్గమున నడిచిన మూడేండ్లపాటు వారెల్లరును అతనిని సమర్థించిరి.

18. రెహబాము మహలతును పెండ్లియాడెను. ఆమె తండ్రి దావీదు కుమారుడైన యెరీమోతు. తల్లి యీషాయి మనుమరాలును, యెలియాబు కుమార్తెయునైన అబీహాయిలు.

19. మహలతు వలన అతనికి యెవూషు, షెమర్యా, సహాము అను ముగ్గురు కుమారులు కలిగిరి.

20. అటుతరువాత అతడు అబ్షాలోము కుమార్తె మాకాను వివాహమాడి నలుగురు కుమారులను కనెను. వారు అబీయా, అత్తయి, సిజా, షెలోమీతు.

21. రెహబామునకు పదునెనిమిది మంది భార్యలు, అరువదిమంది ఉప పత్నులు, ఇరువది ఎనిమిది మంది కుమారులు, అరువది మంది కుమార్తెలునుండిరి. భార్యలందరిలో మాకా అనిన అతనికి ఎక్కువ ప్రీతి.

22. ఆ రాజు అబీయాను తన సహోదరులమీద అధిపతిగా నియమించెను. తన తరువాత అతడు రాజు కావలెనని సంకల్పించుకొనెను.

23. రెహబాము మెలకువతో కుమారులందరిని యూదా బెన్యామీను మండలములోని సురక్షిత పట్టణములకు అధిపతులనుగా నియమించెను. ఆ కుమారుల పోషణమునకుగాను ధనమును సమృద్దిగా వెచ్చించెను. వారికి చాలమంది యువతులను పెండ్లి చేసెను.

 1. తన ఆధిపత్యమును సుస్థిరము చేసికొనగనే రెహబాము, అతని ప్రజలు ప్రభువు ధర్మశాస్త్రమును అనాదరము చేసిరి.

2. రెహబాము పరిపాలనకాలము ఐదవయేట అతని పాపమునకు తగిన శిక్షప్రాప్తించెను. ఐగుప్తురాజు షీషకు యెరూషలేము మీదికి దండెత్తి వచ్చెను.

3. అతడు పండ్రెండు వందల రథబలములతోను, అరువదివేల గుఱ్ఱపు బలముతోను, లిబియా, సుక్కీము, ఇతియోపియాల నుండి ప్రోగైవచ్చిన అసంఖ్యాక సైనికులతోను దాడిచేసెను.

4. యూదాలోని సురక్షిత పట్టణములను ఆక్రమించుకొని యెరూషలేము మీదికి దండెత్తెను.

5. ఆ దాడిని పురస్కరించుకొని రెహబాము మరియు యూదా నాయకులు యెరూషలేమున సమావేశమై యుండగా షెమయా ప్రవక్త వారి చెంతకు వచ్చి “ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు. మీరు నన్ను విడనాడితిరి గనుక నేనును మిమ్ము విడనాడితిని. మిమ్మెల్లరను షీషకు చేతికప్పగింతును” అని ప్రవచించెను.

6. ఆ మాటలకు రాజు, నాయకులు 'మనము తప్పు చేసిన మాట నిజమే. ప్రభువు చేసిన పని ఉచితముగనే ఉన్నది' అని ఒప్పుకొనిరి.

7. అట్లు వారు తనకు లొంగుటను చూచి ప్రభువు షేమయాతో “వారు తమ తప్పిదములను ఒప్పుకొనిరి కనుక నేను వారిని నాశనము చేయను. షీషకు ముట్టడినుండి వారిని కొంతవరకు కాపాడుదును. యెరూషలేము నా కోపమును పూర్ణముగా చవిచూడదు.

8. అయినను వీరు షీషకునకు దాసులగుదురు. అప్పుడుగాని నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులగుటకును గల వ్యత్యాసము వీరికి తెలిసిరాదు” అని నుడివెను.

9. షీషకు యెరూషలేము మీదికి దండెత్తివచ్చి దేవాలయ బొక్కసమును, రాజప్రాసాదపు కోశాగార మును కొల్లగొట్టెను. అతడు సొలోమోను చేయించిన బంగారుడాళ్ళతోపాటు మేలివస్తువులనన్నిటిని తీసికొని పోయెను.

10. రెహబాము ఆ పోయినవానికి బదులుగా ఇత్తడి డాళ్ళను చేయించి ప్రాసాద రక్షకుల ఆధీనమున ఉంచెను.

11. రాజు దేవళమునకు వెళ్ళినపుడెల్ల ప్రాసాదరక్షకులు ఈ డాళ్ళను వెలుపలికి తెచ్చెడివారు. తరువాత వానిని యథాస్థానమున భద్రపరచెడివారు.

12. రెహబాము ప్రభువునెదుట తలవంచెను గనుక ప్రభువు కోపము చల్లారి అతనిని పూర్తిగా నాశనము చేయడయ్యెను. అతడు యూదా మండలమునకు పెంపును గూడ దయచేసెను.

13. రెహబాము బలసంపన్నుడై యెరూషలేము నుండి పరిపాలనము చేసెను. అతడు తన నలువది ఒకటవ యేట రాజై పదునేడేండ్లపాటు యెరూషలేమున రాజ్యము చేసెను. ప్రభువు తనను ఆరాధించుటకుగాను యిస్రాయేలు దేశమంతటిలో ఈ నగరమును ఎన్నుకొనెను.

14. రెహబాము తల్లి అమ్మోనీయుల ఆడపడుచు నామా. అతడు ప్రభువును లక్ష్యము చేయక దుష్కార్యములు చేసెను.

15. రెహబాము ఉదంతము మొదటినుండి తుదివరకు షేమయా, ఇద్ధో ప్రవక్తలు రచించిన చరితమున లిఖింపబడియేయున్నది. అతడును, యరోబాము నిరంతరము పోరాడుకొనిరి.

16. అంతట రెహబాము తన పితరులతో నిద్రించి దావీదు నగరమున పాతి పెట్టబడెను. అటు తరువాత అతని కుమారుడు అబీయా రాజయ్యెను.

 1. యరోబాము పరిపాలనకాలము పదునెనిమిదవ సంవత్సరమున అబీయా యూదాకు రాజయ్యెను.

2. ఆ రాజు మూడేండ్లు పరిపాలించెను. అతని తల్లి గిబియా పౌరుడైన ఊరీయేలు కుమార్తె మీకాయా, అబీయాకును, యరోబామునకును పోరు మొదలయ్యెను.

3. అబీయా మెరికల వంటి వీరులను నాలుగు లక్షలమందిని ప్రోగుజేసికొని వచ్చెను. యరోబాము కూడ పరాక్రమవంతులను ఎనిమిది లక్షలమందిని సమకూర్చుకొని శత్రువు నెదిరించెను.

4-5. అబీయా ఎఫ్రాయీము మన్నెమునందలి సెమరాయీము కొండనెక్కి ఇట్లు ప్రకటించెను: “యరోబామూ! యిస్రాయేలీయులారా! మీరెల్లరు నా పలుకులాలింపుడు. ప్రభువు దావీదుతో నిత్యనిబంధనము చేసికొని అతనికిని, అతని సంతతికిని యిస్రాయేలు రాజ్యాధికారమును ఒప్పగించెనని మీరెరుగరా?

6. అయినను నెబాతు కుమారుడైన యరోబాము తాను సొలోమోను దాసుడయ్యు తన ప్రభువు మీద తిరుగు బాటు చేసెను.

7. అతడు ఎందుకు పనికిరాని దుర్మార్గులను కొందరిని ప్రోగుచేసి కొనివచ్చి రెహబామును ఎదిరించెను. అప్పుడు రెహబాము చిన్నవాడైయుండి అనుభవము చాలనందున వారిని ఓడింపలేకపోయెను.

8. ఇప్పుడు మీరు దావీదు సంతతికి ప్రభువు దయచేసిన రాజ్యాధికారమును సవాలు చేయవచ్చితిరి. మీరు పెద్ద సైన్యముతోనే వచ్చితిరి. యరోబాము మీకు వేల్పులుగా చేసిన బంగారు దూడలను గూడ సిగ్గు సెరములేక మీ వెంట తెచ్చుకొంటిరి.

9. మీరు అహరోను సంతతి వారైన యాజకులను మరియు లేవీయులను తరిమివేసితిరి. వారికి బదులుగా, అన్య జాతులవలె, మీ ఇష్టమువచ్చినవారిని యాజకులనుగా నియమించు కొంటిరి. ఎవడైన ఒక కోడెనో లేక ఏడు పొట్టేళ్ళనో కొనివచ్చిన చాలు మీరతనిని శుద్ధిచేసి దేవుడు కాని దేవునికి యాజకునిగా నియమించు చున్నారు.

10. కాని మాకు యావేయే దేవుడు. మేము ఆయనను పరిత్యజింపలేదు. అహరోను సంతతివారైన యాజకులు, లేవీయుల సహాయముతో మా దేవుని పరిచర్యచేయుదురు.

11. మా యాజకులు ప్రతిదినము ఉదయాస్తమయములందు ప్రభువునకు దహన బలులర్పింతురు. కమ్మని సాంబ్రాణి పొగ వేయుదురు. దేవునిసన్నిధిలో శుద్ధమైన బల్లపైని రొట్టెలర్పింతురు. ప్రతిరాత్రి బంగారు దీపస్తంభముమీద ప్రమిదలు వెలిగింతురు. మేము ప్రభువు ఆజ్ఞాపించిన సేవలనెల్ల చేయుదుము. కాని మీరు ఆయనను విడనాడితిరి.

12. ఈ యుద్ధమున ప్రభువే మాకు సైన్యాధిపతి. ఆయన యాజకులు బాకాలు చేపట్టి యున్నారు. యుద్ధనాదము చేసి మమ్ము మీ మీదికి పోరునకు పిలవసిద్ధముగానున్నారు. కావున యిస్రాయేలీయులారా! మీరు మీ పితరుల దేవుడైన ప్రభువుతో పోరాడెదరేని తప్పక ఓడిపోయెదరు.”

13. యరోబాము యూదీయులకు వెనుకవైపున తన సైన్యమును మాటుగానుంచెను. వారికి ముందు ప్రక్కగూడ తన సైన్యమును నిలిపెను.

14. యూదీయులు అటునిటు కలయజూడగా ముందు వెనుకల గూడ శత్రుసైన్యములు మోహరించియుండెను. వారు ప్రభువునకు మొరపెట్టిరి. వారి యాజకులు బాకాల నూదిరి.

15. యూదీయులు యుద్దనాదము చేసి అబీయా నాయకత్వమున పోరు ప్రారంభించిరి. ప్రభువు యరోబామును, యిస్రాయేలీయులను ఓడించెను.

16. యిస్రాయేలీయులు బ్రతుకు జీవుడాయని పలాయనము చిత్తగించిరి. కాని ప్రభువు వారిని యూదీయుల చేతికి చిక్కించెను.

17. అబీయా మరియు అతని సైనికులు యిస్రాయేలీయులను ఊచకోతకోసిరి. వారి వీరులు ఐదులక్షల మంది హతులైరి.

18. ఆ రీతిగా యిస్రాయేలీయులు ఓడి పోయిరి. యూదీయులు ప్రభువును నమ్ముకొనిరి కనుక విజయమును బడసిరి.

19. అబీయా యరోబాము సైన్యమును వెన్నాడెను. అతని నగరములైన బేతేలు, యెషానా, ఎఫోనులను వాని చుట్టుపట్లగల పల్లెలను ఆక్రమించుకొనెను.

20. అబీయా పరిపాలించినంత కాలము యరోబాము మరల కోలుకొననే లేదు. ప్రభువు యరోబామును మట్టుపెట్టగా అతడు కన్నుమూసెను.

21. కాని అబీయా నానాటికి ప్రవర్ధమానుడయ్యెను. అతడు పదునలుగురు స్త్రీలను పెండ్లియాడి ఇరువది యిద్దరు తనయులను, పదునారుగురు కుమార్తెలను కనెను.

22. అబీయాను గూర్చిన యితరాంశములు అతని మాటలును, చేతలన్నియు ఇదో ప్రవక్త రచించిన చరితమున లిఖింపబడియేయున్నవి.

 1. అబీయా తన పితరులతో కూడా నిద్రింపగా, అతనిని దావీదునగరమున పాతి పెట్టిరి. తరువాత అతని కుమారుడు ఆసా రాజయ్యెను. అతని కాలమున దేశము పదియేండ్లపాటు పూర్ణశాంతిని అనుభవించెను.

2. ఆ రాజు ధర్మబద్దముగా ప్రవర్తించి యావేకు ఇష్టుడయ్యెను.

3. అతడు అన్యదేవతల బలి పీఠములను తొలగించెను. ఉన్నత స్థలముల మీది పూజామందిరములను పడగొట్టించెను. దేవతా ప్రతిమలను పెరికించెను. అషీరా' కంబములను నరికించెను.

4. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభుని ఆజ్ఞలు అనుసరింపవలయుననియు, ఆయన చిత్తమును పాటింపవలయుననియు కట్టడచేసెను.

5. ఆసా యూదామండలములో ఉన్నత స్థలములోని సూర్యదేవత స్తంభములను యూదా నగరములన్నింటి నుండి తొలగించెను. కనుక అతనికాలమున దేశమున శాంతి నెలకొనెను.

6. ప్రభువు ఆసా కాలమున యుద్ధములను ఆపివేసి శాంతిని దయచేసెను గనుక అతడు యూదా నగరములకు ప్రాకారములను నిర్మించెను.

7. అతడు యూదీయులతో, “మన నగరములకు ప్రాకారములు, బురుజులు నిర్మింతము. ద్వారములకు గడెలు బిగింతము. మనము దైవచిత్తమును పాటించితిమి కనుక ఈ దేశము మీద ఆధిపత్యమును నెరపుచున్నాము. అతడు మనలను రక్షించి శాంతిభద్రతలు దయచేసెను” అని చెప్పెను. ఆ రీతిగా వారు ప్రాకారములు కట్టి అభివృద్ధిని సాధించిరి.

8. ఆసాకు డాళ్ళు, బల్లెములు తాల్చిన యోధులు యూదా నుండి మూడులక్షల మంది యుండిరి. బెన్యామీను మండలము నుండి డాళ్ళు, ధనుస్సులు ధరించిన వారలు రెండు లక్షల ఎనుబదివేల మందియుండిరి. వీరందరు పరాక్రమవంతులైన యోధులు.

9. కూషీయుడైన జేరా పదిలక్షల మంది యోధులతో మూడువందల రథములతో దండువెడలి మరేషా వరకు వచ్చెను.

10. ఆసా సైన్యముతోపోయి అతనిని ఎదిరించెను. ఇరుపక్షముల సైన్యములు మరేషావద్ద జెపాతా లోయలో బారులు తీరెను.

11. ఆసా తన ప్రభువునకు ప్రార్థనచేసి “దేవా! నీవు బలవంతులకును, బలహీనులకును గూడ సాయము చేయువాడవు. ఇప్పుడు మాకు తోడ్పడరమ్ము. నిన్నునమ్మి మేము ఈ మహాసైన్యమును ఎదిరించుచున్నాము. నీవే మా ప్రభుడవు. ఏ నరుడును నిన్ను జయింపజాలడు” అని వేడుకొనెను.

12. యూదీయులు ఆసా నాయకత్వమున పోరు ప్రారంభింపగా, ప్రభువు కూషీయులను ఓడించెను. వారు రణరంగము నుండి పారిపోయిరి.

13. ఆసా వారిని గెరారు వరకు తరిమికొట్టెను. కూషీయులు చాలమంది హతమైరి. కనుక వారి సైన్యము పోరు కొనసాగింపజాలదయ్యెను. ప్రభువు తన సేనలతో వారిని మట్టుపెట్టించెను. యూదా సైనికులు వారి నుండి కొల్లసొమ్ము విస్తారముగా దోచుకొనిరి.

14. వారు గెరారు చుట్టుపట్ల గల నగరములనుగూడ నాశనము చేసిరి. ఆ ప్రాంతపు ప్రజలెల్ల ప్రభువునకు భయపడి గడగడవణకిరి. యూదీయులు ఆ నగరములను దోచుకొని కొల్లసొమ్ము మిక్కుటముగా ప్రోగుచేసికొనిరి.

15. మరియు వారు అచటి పశువుల శాలల మీదబడి, చాల గొఱ్ఱెలను, ఒంటెలను తోలుకొని వచ్చిరి. అటుపిమ్మట ఎల్లరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

 1-2. ప్రభువు ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యాను ప్రేరేపింపగా, అతడు ఆసా రాజును కలిసికొని “ఆసా! యూదీయులారా! బెన్యామీనీయులారా! మీరెల్లరు నా పలుకులాలింపుడు. మీరు ప్రభువు పక్షమున నిలచినంతకాలము ఆయన మీ పక్షమున నిలుచును. మీరు ప్రభువును వెదకుదురేని ఆయన మీకు దొరకును. కాని మీరు ఆయనను విడనాడుదురేని, ఆయన కూడ మిమ్మును విడనాడును.

3. యిస్రాయేలీయులకు చాలకాలముపాటు నిజమైన దేవుడు లేడు, ధర్మశాస్త్రమును బోధించు యాజకులు లేరు, ధర్మశాస్త్రమును లేదు.

4. కాని వారు తమకు ఆపద రాగానే యిస్రాయేలు దేవునకు మొర పెట్టు కొనిరి. వారు ప్రభువు దర్శనమును అభిలషింపగా, ఆయన వారికి సాక్షాత్కరించెను.

5. ఆ రోజులలో ప్రతిదేశమున అరాజకము ప్రబలుటచే ఎల్లరకును శాంతిభద్రతలు కరువయ్యెను.

6. ప్రభువు ప్రజలెల్లరిని పీడించెను గనుక ఒక జాతి మరియొక జాతిని, ఒక నగరము మరియొక నగరమును వేధించెను.

7. కాని ఇప్పుడు మీరు ధైర్యము వహింపుడు. నిరుత్సాహము చెందకుడు. ప్రభువు మీ ప్రయత్నమును తప్పక దీవించును" అని చెప్పెను.

8. ఆసా ఆ ప్రవక్త సందేశమును ఆలించి ధైర్యము తెచ్చుకొనెను. అతడు యూదా బెన్యామీను మండలములలోని విగ్రహములను తొలగించెను. ఆ రీతినే ఎఫ్రాయీము మండలమున తాను జయించిన పట్టణములలోని విగ్రహములనుగూడ నిర్మూలించెను. అతడు దేవాలయ ప్రాంగణములోని ప్రభువు బలిపీఠమును పునర్నిర్మించెను.

9. ప్రభువు ఆసాకు బాసటగా నుండెనని గ్రహించి ఉత్తరరాజ్యమందలి ఎఫ్రాయీము, మనష్షే, షిమ్యోను తెగల మధ్య పరదేశులుగా ఉన్న వారు చాలమంది అచటినుండి వెడలివచ్చి ఆసాతో చేరిపోయిరి. అతని దేవుడైన ప్రభువు అతనికి సహాయుడై యుండుట చూచి, యిస్రాయేలు వారిలోనుండి బహు జనులు అతనివైపు చేరిరి.

10. ఆసా పరిపాలన కాలము పదునైదవయేటి మూడవ నెలలో వారెల్లరును యెరూషలేమున సమావేశమైరి.

11. వారు తాము కొనివచ్చిన కొల్లసొమ్ము నుండి ఏడువందల ఎడ్లను, ఏడువేల పొట్టేళ్ళను ప్రభువునకు బలియిచ్చిరి.

12. తమ పితరులదేవుడైన ప్రభువుతో నిబంధనము చేసి కొనిరి. పూర్ణాత్మతోను, పూర్ణహృదయముతోను అతనిని ఆరాధింపవలెనని నిశ్చయించిరి.

13. ప్రభువును ఆరాధింపనివారిని బాలురనేమి, వృద్ధులనేమి, స్త్రీల నేమి, పురుషులనేమి చంపవలయునని నిర్ణయించిరి.

14. ఆ ప్రజలు ఎలుగెత్తి ప్రభువు నెదుట ప్రమాణము చేసిరి. అటుపిమ్మట కోలాహలముచేసి బూరలనూదిరి.

15. దేవుని ఎదుట పూర్ణహృదయముతో ప్రమాణము చేసితిమిగదా అని యూదీయులెల్లరు మిగుల సంతసించిరి. వారు నిండుమనసుతో ప్రభువును కాంక్షించిరి కనుక ఆయన వారిని కరుణించి, నలువైపుల శాంతిని దయచేసెను.

16. ఆసా పితామహియైన మాకా అషేరా కొయ్యబొమ్మలను నెలకొల్పెను . కనుక అతడు ఆమెను రాజమాత పదవినుండి తొలగించెను. ఆ విగ్రహమును ముక్కలు ముక్కలుగా నరికించి కీద్రోను లోయలో కాల్పించెను.

17. ఆ రాజు ఉన్నత స్థలములను పూర్తిగా నాశనము చేయింపలేదు. అయినను అతడు బ్రతికిన దినములన్నియు పూర్ణహృదయముతో ప్రభువును సేవించెను.

18. అతడు తన తండ్రి అబీయా దేవుని కర్పించిన వస్తుసముదాయమును, తాను స్వయముగా అర్పించిన వెండి బంగారు పరికరములను దేవాలయమున కప్పగించెను.

19. ఆసా పరిపాలనాకాలము ముప్పది ఐదవ యేటి వరకును ఎట్టి యుద్ధములు జరుగలేదు.

 1. కాని ఆసా పరిపాలనాకాలము ముప్పది ఆరవ యేట యిస్రాయేలు రాజు బాషా యూదా మీద దాడిచేసెను. అతడు తన నగరమైన రామాను సురక్షితము చేసి యూదా రాజ్యమునకు రవాణా సౌకర్యములకు అంతరాయము కలిగించెను.

2-3. కనుక ఆసా తన ప్రాసాదమున, దేవళమున ఉన్నవెండి బంగారమును దమస్కున వసించు సిరియా రాజు బెన్హ్ దదునకు కానుకగా పంపి ఇట్లు సందేశము చెప్పించెను: “మన తండ్రులవలె మనముకూడ పరస్పరము పొత్తు కుదుర్చుకొందము. నేను ఈ వెండిబంగారములను కానుకగా పంపుచున్నాను. నీవు యిస్రాయేలు రాజు బాషాతో సఖ్యసంబంధములు వదలుకోవలయును. అతడు నా దేశమునుండి తన సైన్యమును మరలింపవలయును.”

4. బెన్హ్-దదు ఆసాతో పొత్తు కుదుర్చుకొని యిస్రాయేలు దేశము మీదికి తన సైన్యాధిపతులను పంపెను. వారు ఇయ్యోను, దాను, అబెల్మాయిము, వస్తుసంభారములు ఉంచిన నఫ్తాలి మండలములోని నగరములు ఆక్రమించుకొనిరి.

5. బాషా ఈ సంగతి తెలిసికొని రామా నగరమును సురక్షితము చేయుట మానివేసెను. ఆ పనిని పూర్తిగా విరమించుకొనెను.

6. ఆసా యూదీయుల నెల్లరిని పిలువనంపగా వారు పోయి బాషా రాజు రామా నగరమున ప్రోగు చేసిన రాళ్ళను, కలపను కొనివచ్చిరి. వానితో గేబా, మిస్పా నగరములను సురక్షితము చేసిరి.

7. అప్పుడు హనానీ ప్రవక్త ఆసా యొద్దకు వచ్చి “నీవు సిరియా రాజును నమ్మి ప్రభువును అలక్ష్యము చేసితివి కనుక యిస్రాయేలు సైన్యము నీ చేతులలో నుండి తప్పించుకొనిపోయెను.

8. కూషీయులును, లిబియనులు చాల రథములను, గుఱ్ఱములను, గొప్ప సైన్యములను ప్రోగుజేసికొని రాలేదా? అయినను నీవు ప్రభువును నమ్మితివి కనుక ఆయన వారిని నీ చేతికి అప్పగించెను.

9. ప్రభువునేత్రములు ప్రపంచమంతటిని పరికించుచుండును. తనను నమ్మిన భక్తులకు ఆయన బలమును దయచేయును. నీవు తెలివితక్కువ పని చేసితివి. కనుక ఇప్పటినుండి నీకు యుద్ధములు తప్పవు” అని చెప్పెను.

10. అటుల ప్రవచనము చెప్పినందుకు రాజు హనానీపై కోపగించి రౌద్రముతో అతనిని చెరలో త్రోయించెను. ఇదే సమయమున అతడు తన పౌరులను కొందరిని హింసించుటకు పూనుకొనెను.

11. ఆసా ఉదంతమెల్ల యూదా యిస్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నది.

12. ఆసా తన పరిపాలనాకాలము ముప్పదితొమ్మిదవ యేట అతని పాదములలో తీవ్రమైన వ్యాధిసోకెను. అప్పుడైనను అతడు ప్రభువును శరణువేడడయ్యెను. పైపెచ్చు వైద్యులను ఆశ్రయించెను.

13. అతడు తన పరిపాలనా కాలము నలువది ఒకటవ యేట మరణమునొందెను.

14. ఆసా తన పితరులతో నిద్రించగా జనులు అతనిని దావీదు నగరమున అతడు తాను స్వయముగా తొలిపించుకొనిన రాతిసమాధిలోనే పాతి పెట్టిరి. అతని శవమును సుగంధ ద్రవ్యములతోను, పరిమళతైలముల తోను లేపనము చేసిరి. సంతాప సూచనముగా పెద్ద మంటవేసిరి.

 1. ఆసా తరువాత అతని కుమారుడైన యెహోషాఫాత్తు రాజై యిప్రాయేలీయులు దండెత్త కుండునట్లు తన రాజ్యమును బలపరచుకొనెను.

2. అతడు యూదాలోని ప్రాకారములు గల సురక్షిత పట్టణములందును, చుట్టుపట్ల ప్రాంతములందును, ఎఫ్రాయీము మండలమునను ఆసా ఆక్రమించు కొనిన నగరములందును సైన్యములను ఉంచెను.

3. యెహోషాఫాత్తు తన తండ్రి తొలినాటి జీవితమును అనుకరించెను. అతడు బాలు దేవతలను పూజింపలేదు కనుక ప్రభువు అతనిని దీవించెను.

4. ఆ రాజు యిస్రాయేలు రాజువలె ప్రవర్తింపక తన తండ్రి కొలిచిన దేవునికొలిచి ఆ ప్రభువు ఆజ్ఞలను పాటించెను.

5. ప్రభువు అతని రాజ్యాధికారమును సుస్థిరము చేసెను. యూదీయులెల్లరును అతనికి కానుకలు కొనివచ్చిరి. కనుక అతని సిరిసంపదలు వృద్ధిచెందెను. కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించెను.

6. అతడు నిష్ఠతో ప్రభువును సేవించెను. యూదా రాజ్యములోని ఉన్నత స్థలములను, ఆషేరా దేవతా స్తంభములను నాశనము చేయించెను.

7-8. ఆ రాజు పరిపాలనాకాలము మూడవ యేట కొందరు పెద్దలనుపంపి యూదా నగరములందు ధర్మబోధ చేయించెను. వారు బన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మీకాయా. ఆ పెద్దలతో వెళ్ళిన లేవీయులు షేమయా, నెతన్యా, జెబద్యా, అసాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, తోబియా, టోబదోనీయా, మరియు పెద్దలతో వెళ్లిన యాజకులు ఎలీషామా,యెహోరాము.

9. వారు ప్రభువు ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదానగరములెల్ల సంచరించుచూ ప్రజలకు బోధ చేసిరి.

10. ప్రభువు యూదా చుట్టుపట్లగల రాజులనెల్ల భయపెట్టుటచే వారు యెహోషాఫాత్తుతో యుద్ధము చేయ సాహసింప లేదు.

11. కొందరు ఫిలిస్తీయులు ఆ రాజునకు వెండిని, కానుకలను కొనివచ్చిరి. అరబ్బీయులు ఏడువేల ఏడువందల పొట్టేళ్ళను, ఏడువేల ఏడువందల మేకపోతులను కొనివచ్చిరి.

12. యెహోషాఫాత్తు దినదిన ప్రవర్ధమానుడై యూదా రాజ్యమున కోటలను, గిడ్డంగుల పట్టణములను నిర్మించెను.

13. యెహోషాఫాత్తు యూదా నగరములలో బలమైన సైన్యములను ఉంచెను. యెరూషలేమున మహావీరుల శిబిరముండెను.

14. తెగలవారిగా ఆ వీరుల వివరములివి: యూదా తెగలకు చెందిన వీరులకు అద్నా మొదటి నాయకుడు. అతని క్రింద మూడు లక్షల మంది యోధులుండిరి.

15. రెండవ నాయకుడు యెహోహనా క్రింద రెండు లక్షల ఎనుబదివేల మంది వీరులు కలరు.

16. మూడవ నాయకుడు సిక్రి కుమారుడైన అమస్యా క్రింద రెండు లక్షల మంది బలశాలులుండిరి. ఈ అమస్యా తనను తాను ప్రభువు సేవకు అంకితము చేసికొనెను.

17. బెన్యామీను తెగకు చెందిన వీరులకు మహాశూరుడైన ఎల్యాదా మొదటినాయకుడు. అతని క్రింద రెండు లక్షలమంది వీరులు కలరు. వారెల్లరును డాళ్ళు, విల్లు ధరించినవారు.

18. రెండవ నాయకుడైన యెహోసాబాదు క్రింద ఆరితేరిన వీరులు లక్ష ఎనుబది వేల మంది కలరు.

19. ఈ వీరులెల్లరును యెరూషలేమున వసించుచు రాజును సేవించిరి. వారు గాక యూదా రాజ్యమునందలి ఇతర సురక్షిత పట్టణములలో నివసించు సైనికులును కలరు.

 1. యెహోషాఫాత్తు విస్తారమైన సిరి సంపదల తోను, కీర్తి ప్రతిష్ఠలతోను వెలుగొందుచు అహాబు రాజుతో వియ్యమందెను.

2. కొన్ని యేండ్ల తర్వాత అతడు సమరియాలోని అహాబురాజును సందర్శింప బోయెను. అహాబు చాల గొఱ్ఱెలను, ఎడ్లను కోయించి ఆ రాజునకును అతని పరిచారకులకును విందు చేయించెను. అతడు తనతోగూడి గిలాదునందలి రామోతును ముట్టడించుటకు యెహోషాఫాత్తును పురి కొల్పెను.

3. అహాబు “నీవు నాతోగూడ రామోతు మీదికి యుద్ధమునకు వత్తువా” అని అడిగెను. యెహోషాఫాత్తు “నేనును నీవలె యుద్ధమునకు సిద్ధముగనే యున్నాను. నా సైనికులును నీ సైనికులవలె పోరునకు తయారుగనే యున్నారు. మేము నీ పక్షమున పోరాడుదుము” అనెను.

4. మరియు అతడు “మనము మొదట యావేను సంప్రదింతుము” అని పలికెను.

5. కనుక అహాబు తన ప్రవక్తలను నాలుగు వందలమందిని పిలిపించి “నేను రామోతు మీదికి దాడి చేయవచ్చునా, చేయకూడదా?” అని ప్రశ్నించెను. వారెల్లరును “దాడి చేయుము. ప్రభువు ఆ నగరమును నీ చేతి కప్పగించును” అని పలికిరి.

6. కాని యెహోషాపాత్తు “ప్రభువును సంప్రతించుటకు ఇచట మరియొక ప్రవక్త ఎవరును లేరా?” అని ప్రశ్నించెను.

7. అహాబు “ఇమ్లా కుమారుడైన మీకాయా అనువాడు ఉన్నాడు. కాని అతడనిన నాకు ఇష్టములేదు. అతడెప్పుడును నాకు అశుభమునేగాని శుభసందేశ మును విన్పింపడు” అని చెప్పెను. యూదారాజు “రాజు ఆలాగు అనవలదు” అని పలికెను.

8. అంతట యిస్రాయేలు రాజు ఒక సేవకుని పంపి మీకాయాను శీఘ్రముగా తోడ్కొని రమ్మని ఆదేశించెను.

9. ఆ ఇరువురు రాజులు రాజవస్త్రములు ధరించి సమరియా నగర ద్వారము చెంతగల కళ్ళము వద్ద సింహాసనాసీనులై యుండిరి. ప్రవక్త లెల్లరు వారి ముందట ప్రోగై ప్రవచనములు చెప్పుచుండిరి.

10. కెనానా కుమారుడైన సిద్కియా ప్రవక్త ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చెను. అతడు అహాబు రాజుతో “ప్రభువు వాక్కిది. నీవు ఈ కొమ్ములతో సిరియనులను పొడిచి వారిని ఓడింతువు"అని పలికెను.

11. ఇతర ప్రవక్తలును అటులనే ప్రవచించిరి. “నీవు రామోతు మీదికి దండెత్తి దానిని జయింపుము. ప్రభువు ఆ నగరమును నీ వశము చేయును” అని చెప్పిరి.

12. మీకాయాను పిలువబోయిన సేవకుడు అతనితో “ప్రవక్తలెల్లరును ఏకకంఠముతో రాజునకు విజయము కలుగునని చెప్పిరి. నీవుకూడ రాజునకు విజయము కలుగునని చెప్పుము” అని పలికెను.

13. కాని మీకాయా “యావే జీవముతోడు. నేను ప్రభువు చెప్పుమనిన మాటలే చెప్పెదను” అనెను.

14. ప్రవక్త అహాబు నొద్దకు రాగానే ఆ రాజు “ఓయి! మమ్ము రామోతు మీదికి దండెత్తుమందువా, వలదందువా?" అని ప్రశ్నించెను. మీకాయా “దండెత్తుడు. మీకు తప్పక విజయము కలుగును. ప్రభువు ఆ నగరమును మీ పరము చేయునులే” అనెను.

15. ఆ మాటలకు రాజు “ఓయీ! ప్రభువు పేరు మీదుగా మాటాలాడు నపుడు నాతో నిజమునే చెప్పవలెనని నిన్ను ఎన్ని మారులు మందలింపలేదు?” అనెను.

16. అప్పుడు మీకాయా “యిస్రాయేలీయులెల్లరును కాపరిలేని మందవలె కొండలమీద చెల్లాచెదరగుటను నేను చూచితిని. ఈ ప్రజలకు నాయకుడు లేడు కనుక వారు నిశ్చింతగా తమ ఇండ్లకు వెళ్లిపోవచ్చునని ప్రభువు నుడివెను” అని చెప్పెను.

17. అహాబు యెహోషాఫాత్తుతో “ఇతడు నా అపజయమునే గాని విజయమునెరిగించు ప్రవచనము చెప్పడని నేను నీతో ముందుగనే వచింపలేదా?" అని పలికెను.

18. మీకాయా అహాబుతో “దేవుని మాట వినుము. ప్రభువు ఆకాశమున సింహాసనముపై ఆసీనుడై యుండగా నేను చూచితిని. పరమండల సైన్యము ఆయనకు కుడిఎడమల బారులుతీరి నిలువబడి యుండుట చూచితిని.

19. 'అహాబును మభ్యపెట్టి రామోతునకు పంపి అచట అతడు ప్రాణములు కోల్పోవునట్లు ఎవరు ప్రేరేపింపగలరు?' అని ప్రభువు ప్రశ్నించగా, ఒకరు ఒకరీతిగను, మరియొకరు ఇంకొక రీతిగాను ప్రత్యుత్తరము ఇచ్చిరి.

20. అప్పుడొక ఆత్మ ప్రభువు ఎదుటికి వచ్చి 'నేనతనిని మభ్య పెట్టుదును' అని పలికెను. 'ఏ రీతిని మభ్యపెట్టుదువు' అని ప్రభువు అడిగెను.

21. ఆ ఆత్మ 'నేను వెళ్ళి అహాబు ప్రవక్తల చేత అబద్దములు చెప్పింతును' అని పలికెను. 'సరియే వెళ్ళి నీవు చెప్పినట్లే చేయుము. నీవు ఆహాబును మభ్యపెట్టగలవు' అని ప్రభువు నుడివెను.

22. ఇప్పుడు ప్రభువు నీ ప్రవక్తలగు వీరినోట అబద్దములు చెప్పు ఆత్మను ఉంచియున్నాడు. కాని ప్రభువు మాత్రము నిక్కముగా నిన్ను నాశనము చేయనెంచెను” అని పలికెను.

23. అప్పుడు కెనాను కుమారుడగు సిద్కియా మీకాయా మీదికి వచ్చి అతని చెంపమీద కొట్టి “ప్రభువు ఆత్మ నన్ను విడనాడి నీతో మాటలాడ మొదలిడినది ఎప్పటినుండి?” అని యడిగెను.

24. మీకాయా అతనితో “నీవు ఇంటిలోపలి గదిలోనికి పరుగిడి దాగుకొనునపుడు నీకే తెలియును పొమ్ము” అనెను.

25-26. అహాబు తన ఉద్యోగిని ఒకనిని పిలిచి “మీకాయాను బంధించి నగరపాలకుడైన ఆమోనునకును, యువరాజగు యోవాసునకును అప్పగింపుము. ఇతనిని చెరలో త్రోయవలయుననియు నేను రణము నుండి సురక్షితముగా తిరిగి వచ్చువరకు ఇతని ఆహార పానీయముల విషయములో కఠినముగా వ్యవహరింపవలెననియు” అని ఆజ్ఞాపించెను.

27. కాని మీకాయా “నీవు సురక్షితముగా తిరిగివత్తువేని ప్రభువు నాద్వారా మాట్లాడలేదు అనుకొనుము. ఇచట వారెల్లరును నా పలుకులు ఆలింతురు గాక!” అనెను.

28. యిస్రాయేలు రాజగు అహాబు, యూదా రాజగు యెహోషాఫాత్తు గిలాదునందలి రామోతు మీదికి దండెత్తిపోయిరి.

29. అహాబు యెహోషాఫాత్తుతో “నేను మారువేషమున వత్తును. నీవు రాజవస్త్రములు ధరించియే రమ్ము" అని చెప్పెను. అహాబు మారువేషమున రాగా వారిరువురు యుద్ధరంగమునకు పోయిరి.

30. యిస్రాయేలు రాజును తప్ప మరియెవరిని పట్టుకోవలదని సిరియారాజు తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను.

31. కాని ఆ రథాధిపతులు యెహోషాపాతును చూచి అతడే యిస్రాయేలు రాజని భ్రాంతిచెంది అతని వెంటబడిరి. యెహోషాఫాత్తు మొట్టపెట్టినందున ప్రభువు అతనిని ఆదుకొనెను. కనుక యెహోషాఫాత్తును వెన్నాడువారు అతనిని విడనాడి వెళ్ళిపోయిరి.

32. రథాధిపతులు అతడు యిస్రాయేలు రాజు కాదని గుర్తించి అతనిని వదలివేసిరి.

33. అప్పుడు సిరియా సైనికుడొకడు గురిచూడకయే యాదృచ్చికముగా బాణమును విడువగా అది అహాబు కవచము అతుకుల మధ్య తగిలి అతని ఒడలిలోనికి గ్రుచ్చుకొనిపోయెను. ఆ రాజు తన రథమును తోలువానితో “నాకు గాయము తగిలినది. రథమును యుద్ధభూమినుండి వెలుపలికి తోలుము” అని చెప్పెను.

34. యుద్ధము కొనసాగుచుండగా అహాబు సిరియా సైన్యమువైపు మళ్ళి రథమునందు నిలుచుండెను. ప్రొద్దుక్రుంకు నపుడు అతడు కన్నుమూసెను.

 1. యెహోషాషాత్తు సురక్షితముగా యెరూషలేము నందలి తన ప్రాసాదమును చేరుకొనెను.

2. అప్పుడు హనానీ కుమారుడగు యెహూ ప్రవక్త ఆ రాజును కలిసికొని “నీవు దుష్టులకు సాయపడవచ్చునా? ప్రభువును నిరాకరించు వారికి ఆదరాభిమానములు చూపవచ్చునా? ఈ చెయిదమువలన నీవు ప్రభువు శత్రువులకు స్నేహితుడవైతివి. అందువలన ఆయన కోపమునకు గురియగుదువుకదా!

3. అయినను నీ యందు మంచితనము కొంతలేకపోలేదు. నీవు అషేరా దేవతా స్తంభములను తొలగించితివి. ప్రభువు చిత్తమును తెలిసికోగోరితివి” అని పలికెను.

4. యెహోషాఫాత్తు యెరూషలేముననే నివసించెను. అయినను అతడు దక్షిణమున బేర్షాబా నుండి ఉత్తరమున మన్యము కొసనున్న ఎఫ్రాయీము వరకు గల ప్రజల మధ్య సంచారములుచేసి వారినెల్లరిని తమ పితరుల దేవుడైన ప్రభువునొద్దకు రాబట్టెను.

5. అతడు యూదాలోని సురక్షిత పట్టణములన్నిటికిని న్యాయాధిపతులను నియమించెను.

6. ఆ న్యాయాధిపతులతో “మీరు తీర్పు చెప్పునప్పుడు మెలకువతో నుండుడు. మీరు జనులను చూచి కాదు ప్రభువును చూచి తగవులు తీర్పవలయును. మీరు తీర్పు తీర్చునప్పుడెల్ల ప్రభువు మీతో నుండును.

7. కనుక ఆ ప్రభువుపట్ల భయ భక్తులు కలిగియుండుడు. ఆయన మోసమును, పక్షపాతమును, లంచమును సంహించువాడుకాదు” అని చెప్పెను.

8. ఇంకా అతడు లేవీయులను, యాజకులను, ప్రముఖులైన పౌరులను యెరూషలేమున న్యాయాధిపతులుగా నియమించెను. ప్రభుని ఆజ్ఞలను మీరిన వారికిని, వివాదములు కలిగిన పురజనులకును తీర్పుచెప్పుట వారిపని.

9. రాజు ఆ న్యాయాధిపతులతో “మీరు ప్రభువుపట్ల భయభక్తులు కలిగియుండుడు. అతనికి విధేయులై తీర్పుచెప్పుడు.

10. మీ తోడి పౌరులు ఏ నగరమునుండియైన నరహత్య వ్యాజ్యెమును గాని లేక యేదైన ధర్మశాస్త్ర ఆజ్ఞను మీరిన వ్యాజ్యెమునుగాని కొనివచ్చినచో మీరు ప్రభువునకు ద్రోహముగా పాపము కట్టుకొనకుండునట్లు వారిని న్యాయసమ్మతముగా మెలగవలయునని హెచ్చరింపుడు. ఇట్లు చేయలేని మీరును, మీ చెంతకు వచ్చిన ఆ తోడి పౌరులును ప్రభువు కోపమునకు గురియగుదురు. కాని నేను చెప్పినట్లు మీ బాధ్యతను మీరు నిర్వర్తింతురేని ఆ కోపమును తప్పించుకొందురు.

11. మతపరమైన వ్యాజ్యెములలో ప్రధాన యాజకుడగు అమర్యా తీర్పే తుదితీర్పు. లౌకికమైన తగవులలో యూదావారికి అధిపతియు యిష్మాయేలు కుమారుడు నైన జెబద్యా తీర్పే తుదితీర్పు. మీరు చెప్పిన తీర్పులను అమలు పెట్టించుపూచీ లేవీయులది. మీరు ధైర్యముతో ఈ నియమములెల్ల పాటింపుడు. ప్రభువు న్యాయవంతుల పక్షమున నిలిచి విజయమును ప్రసాదించును” అని చెప్పెను.

 1. అటుతరువాత మోవాబీయులు, అమ్మోనీయులు, మెయూనీయులు యెహోషాఫాత్తు మీదికి దాడి చేసిరి.

2. దూతలు "మృతసముద్రపు ఆవలి తీరమున ఉన్న ఎదోమునుండి పెద్ద సైన్యము నీ మీదికి దండెత్తివచ్చుచున్నది. ఆ దండు హజజో మారు అను ఎంగడీ సీమను ఆక్రమించుకొనినది” అని రాజునకు వార్త పంపిరి.

3. యెహోషాఫాత్తు ఆ వార్త విని భయపడి ప్రభువును సలహా అడిగెను. యూద రాజ్యమంతట ఉపవాసము చేయవలెనని ఆజ్ఞాపించెను.

4. రాజ్యములోని ప్రతి పట్టణము నుండి వచ్చిన ప్రజలెల్లరును యెరూషలేమున ప్రోగై ప్రభువును సలహా అడిగిరి.

5-6. ఆ ప్రజలును, యెరూషలేము పౌరులును దేవాలయపు నూతన ప్రాంగణమునకు ముందట సమావేశమైరి. అప్పుడు యెహోషాఫాత్తు ఆ జనుల ముందట నిలుచుండి “మా పితరుల దేవుడైన ప్రభూ! నీవు ఆకాశము నుండి ఈ నేలమీది జాతులనెల్ల ఏలు దేవుడవు. నీవు అనంత శక్తి సామర్థ్యములు కలవాడవు. కనుక ఏ నరుడును నిన్నెదిరింపజాలడు.

7. నీవే మా దేవుడవు. నీవు ఈ దేశవాసులను తరిమివేసి ఈ భూమిని నీ మిత్రుడైన అబ్రహాము సంతతికి శాశ్వతముగా భుక్తము చేసితివి.

8. నీ ప్రజలు ఇచట వసించి నిన్ను కొలుచుటకు ఒక ఆలయమును కట్టిరి.

9. ఏదైనా యుద్ధము, శిక్ష, అంటురోగము, కాటకము సంభవించెనేని నీ నామమునకు నివాస స్థానమైన ఈ దేవాలయమునకు వచ్చి నిన్ను శరణు వేడవచ్చునని ఈ జనులకు తెలియును. వారు తమ గోడును నీకు విన్నవించుకొనగా నీవు వారి మొరాలించి వారిని ఆదుకొందువు.

10. ఇప్పుడు అమ్మోనీయులు, మోవాబీయులు, ఎదోమీయులు మా మీదికెత్తి వచ్చిరి. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలి వచ్చినప్పుడు, నీవు వారిని ఈ జాతుల రాజ్యములమీదుగా పయనము చేయనీయవైతివి. వారు వీరి రాజ్యములకు ఆవలి వైపుగా నడచివచ్చిరి కనుక వారిని నాడే మట్టుపెట్టరైరి.

11. కనుకనే వారు నేడు మాకిట్టి ప్రత్యుపకారము చేయుచున్నారు. నీవు మాకిచ్చిన ఈ నేలమీదినుండి వారు మమ్ము తరిమివేయ చూచుచున్నారు.

12. ఇంతటి మహాసైన్యము మా మీదికి రాగా మాకు వారి నెదుర్కొను సత్తువలేదు. మాకేమి చేయవలయునో గూడ తోచుటలేదు. మేము నిన్నే నమ్ముకొంటిమి. కనుక నీవే వారిని శిక్షింపుము” అని మొరపెట్టెను.

13. యూదీయులెల్లరు తమ భార్యలతో బిడ్డలతో దేవాలయమున నిలుచుండిరి.

14. అప్పుడు దేవుని యాత్మ ఆ ప్రజలలోనున్న యహసీయేలు అను లేవీయుని ఆవేశించెను. అతడు అసాపు వంశీయుడు, జెకర్యా కుమారుడు. అతని వంశకర్తలు క్రమముగా బెనయా, యెహీయేలు, మతన్యా.

15. ఆ లేవీయుడు “రాజా! యెరూషలేము పౌరులారా! యూదీయులారా! మీరెల్లరును ప్రభువు వాక్కునాలింపుడు. ఈ పెద్ద మూకను చూచి మీరు భయపడవలదు. నిరుత్సాహము చెందవలదు. ఈ యుద్ధము మీదికాదు, ప్రభువుది.

16. రేపు వారు సీసు కనుమ మీదుగా వచ్చినపుడు మీరు వారిని ఎదిరింపుడు. యెరూవేలు ఎడారి ముందటనున్న లోయ కొనయందు మీరు వారిని చూతురు.

17. మీరసలు యుద్ధము చేయనక్కర లేదు. మీ సేనలను యుద్ధమునకు మోహరింపుడు, చాలును. ప్రభువే మీకు విజయము దయచేయును. యూదీయులారా! యెరూషలేము పౌరులారా! భయపడకుడు, నిరుత్సాహము చెందకుడు. మీరు రేపు శత్రువుల మీదికి పొండు, ప్రభువు మీకు బాసటగా నుండును” అని ప్రవచించెను.

18. అప్పుడు యెహోషాఫాత్తు సాష్టాంగ నమస్కారము చేసెను. ప్రజలెల్లరు అతనితో పాటు భూమి మీదికి వంగి ప్రభువును ఆరాధించిరి.

19. అంతట లేవీయులైన కోహాతు, కోరా సంతతి వారు లేచి నిలుచుండి పెద్ద నాదముతో యిస్రాయేలు దేవుని స్తుతించిరి.

20. మరునాటి ఉదయము వారెల్లరును పెందల కడనే లేచి తెకోవా ఎడారికి వెళ్ళిరి. ఆ ప్రజలు పయనమగుచుండగా యెహోషాఫాత్తు “యూదీయులారా! యెరూషలేము పౌరులారా! మన దేవుడైన ప్రభువును నమ్మినచో మీకెట్టి ఆపదయు కలుగదు. ప్రభువు ప్రవక్తల సందేశమును నమ్ముడు. మీకు విజయము సిద్దించును” అని నుడివెను.

21. అతడు ప్రజలతో సంప్రతించిన పిదప, కొందరు సంగీతకారులు పవిత్ర అలంకారములు ధరించి సైన్యము ముందునడుచుచు “ప్రభువును స్తుతింపుడు. అతని కృప శాశ్వతముగా నుండును” అని పాడవలయునని ఆజ్ఞాపించెను.

22. వారట్లు స్తుతిగీతము పాడుచుండగా ప్రభువు యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చిన శత్రుప్రజలకు కలవరముపుట్టించి వారిని చిందరవందరచేసెను.

23. అమ్మోనీయులు, మోవాబీయులు ఇరువురును కలసి ఎదోమీయుల మీద ఆకస్మికదాడి జరిపి వారిని సర్వనాశనము చేసిరి. అటుపిమ్మట ఆ ఇరుతెగల వారుకూడ ఒకరినొకరు ఎదుర్కొని పరస్పరము చంపుకొనిరి.

24. యూదా సైన్యము ఎడారిలోని బురుజు చెంతకు వచ్చి చూడగా శత్రుసైన్యములు చచ్చి నేలమీద పడియుండెను. వారిలో ఒక్కడును తప్పించుకొని పోలేదు.

25. యెహోషాఫాత్తు అతని సైనికులు కొల్లసొమ్ము దోచుకొనుటకురాగా చాల పశువులు, వస్తువులు, విలువగల ఆభరణములు కనిపించెను. ఆ సొత్తు విస్తారముగా నున్నందున మూడుదినములు ప్రోగుజేసికొనినను ఇంకను మిగిలిపోయెను.

26. సైనికులెల్లరు నాలుగవదినమున బెరాకా లోయలో ప్రోగై ప్రభువును స్తుతించిరి. కనుకనే నేటి వరకు ఆ లోయకు బెరాకా' అను పేరు మారలేదు.

27. ప్రభువు శత్రువులను ఓడించెను కనుక యూదీయులు, బెన్యా మీనీయులు విజయోత్సాహముతో యెహోషాషాత్తు నాయ కత్వమున యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

28. స్వరమండలము, సితారా, బాకాలసంగీతము మారుమ్రోగుచుండగా సైన్యములు పట్టణము చేరుకొని దేవాలయమును సందర్శించెను.

29. ప్రభువు యిస్రాయేలు శత్రువులను ఓడించెనని విని అన్యజాతు లెల్ల గడగడ వణికిపోయెను.

30. యెహోషాఫాత్తు రాజ్యమున శాంతి నెలకొనెను. ప్రభువు అతనికి ఎల్ల దిశలందును భద్రత చేకూరునట్లు చేసెను.

31. యెహోషాఫొత్తు తన ముప్పది ఐదవయేట యూదాకు రాజయ్యెను. అతడు ఇరువది ఐదుఏండ్ల పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతని తల్లి షిల్హీ‌ కుమార్తెయైన అసూబా.

32. ఆ రాజు తన తండ్రి ఆసావలె ప్రభువునకు ప్రియము కలిగించు ధర్మ మార్గమున నడచెను.

33. అయినను ఉన్నత స్థలములను తీసివేయలేదు. ప్రజలును తమ పితరుల దేవుడైన ప్రభువును స్థిరహృదయముతో పూజింపరైరి.

34. యెహోషాపాతు తన పరిపాలనాకాలము ఆద్యంతముల వరకు చేసిన ఇతర కార్యములెల్ల హనానీ కుమారుడైన యెహూ రచించిన చరితమున లిఖింపబడియేయున్నవి. ఈ చరితము యిస్రాయేలు రాజులచరిత్రలో చేర్చబడినది.

35. ఒకమారు యెహోషాపాత్తు దుష్టకార్యములు చేసిన యిస్రాయేలురాజు అహస్యాతో చేతులు కలిపెను.

36. వారిరువురును కలిసి సముద్రయానము కొరకు అనగా తర్షీషు పట్టణమునకు పయనించుటకు ఏసోనెబేరు వద్ద ఓడలు నిర్మించిరి.

37. కాని దోదావాహు కుమారుడును, మరేషా నివాసియైన ఎలియెజెరు “నీవు అహస్యాతో చేతులు కలిపితివి కనుక ప్రభువు నీ ఓడలను ధ్వంసము చేయును” అని ప్రవచించెను. యెహోషాఫాత్తు నావలు అటులనే నాశనమయ్యెను గనుక అవి తర్షీషునకు సముద్రయానము చేయనే లేదు.

 1. యెహోషాపాత్తు తన పితరులతో నిద్రింపగా అతనిని దావీదు నగరమున పాతిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యెను.

2. యెహోషాఫాత్తు కుమారుడు యెహోరామునకు ఆరుగురు సోదరులు కలరు. వారు అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యాహు, మికాయేలు, షెఫట్యా.

3. తండ్రి వారికి పెద్దమొత్తము వెండి బంగారములు, ఆభరణములు కానుకగా ఇచ్చెను. యూదాలోని సురక్షిత పట్టణములకు వారిని అధిపతులను చేసెను. యెహోరాము పెద్దవాడు కనుక రాజ్యమును అతని పరముచేసెను.

4. కాని యెహోరాము తండ్రి రాజ్యమును కైవసము చేసికొని అధికారమును సుస్థిరము చేసికొనగనే సోదరులను, యిస్రాయేలు నాయకులను మరికొందరిని పట్టి చంపించెను.

5. యెహోరాము తన ముప్పది రెండవ యేట రాజై ఎనిమిదియేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను.

6. అతడు యిస్రాయేలును ఏలిన అహాబు వంటి దుష్టరాజుల పోకడలు అనుకరించెను. అహాబు కుమార్తెను పరిణయమాడెను. దుష్కార్యములు చేసి ప్రభువునకు అప్రియము కలిగించెను.

7. అయినను ప్రభువు పూర్వము దావీదుతో నిబంధనము చేసికొని అతని సంతతి కలకాలము ఈ రాజ్యమును పాలింతురని బాసచేసెను. కనుక అతని వంశమును రూపుమాపనొల్లడయ్యెను.

8. యెహోరాము కాలమున ఎదోము యూదా మీద తిరుగుబాటు చేసి స్వాతంత్య్రము సంపాదించు కొని, సొంతరాజు నేర్పరచుకొనెను.

9. కనుక యెహోరాము తన సైన్యాధిపతులు రథములతో పోయి ఎదోమీయులను హతముచేసెను.

10. కాగా నేటి వరకు జరుగుచున్నట్లు ఎదోమీయులు యూదావారిపై తిరుగబడుచూనేయుండిరి. అదే సమయమున యెహోరాము తన పితరుల దేవుడైన ప్రభువును విడ నాడినందులకు శిక్షగా లిబ్నా నగరము కూడ యూదా మీద తిరుగుబాటు చేసి స్వేచ్చను పొందెను.

11. ఆ రాజు యూదాలోని ఉన్నతస్థలములలో బలిపీఠములను నిర్మించి యూదీయులను, యెరూషలేము పౌరులను విగ్రహారాధనకు పురికొల్పెను.

12-13. అటు తరువాత ఏలీయా ప్రవక్త లేఖ ఒకటి ఆ రాజునకు చేరెను: “నీ వంశకర్తయైన దావీదు కొలిచిన దేవునివాక్కిది. నీవు నీ తండ్రి యెహోషాఫాత్తు మార్గమున, నీ తాత ఆసారాజు మార్గమున నడువక యిస్రాయేలు రాజులను అనుకరించితివి. అహాబు కుటుంబమువలె నీవును యూదీయులను, యెరూషలేము పౌరులను విగ్రహారాధనకు ప్రేరేపించితివి. పైపెచ్చు నీకంటె ఉత్తములైన నీ సోదరులను చంపించితివి.

14. దీనికి ప్రతీకారముగా ప్రభువు నీ ప్రజలను, భార్యలను, బిడ్డలను దారుణముగా శిక్షించును. నీ ఆస్తిపాస్తులను నాశనము చేయును.

15. నీ మట్టుకు నీవు ఘోరమైన ఆంత్రవ్యాధికి చిక్కుదువు. ఆ ఉదర రోగము నానాటికి ముదిరి నీ ప్రేవులు తెగిపడును.”

16. అప్పుడు కొందరు ఫిలిస్తీయులు, అరబ్బీ యులు కూషీయులతో కలసి జీవించుచుండిరి. ప్రభువు వారినందరిని యెహోరాము మీదికి పురికొల్పెను.

17. కనుక వారు యూదామీద దాడిచేసిరి. రాజ ప్రాసాదమును కొల్లగొట్టి అతని భార్యలను, కుమారులను బందీలనుగా కొనిపోయిరి. కడగొట్టు కొడుకైన అహస్యా మాత్రము మిగిలెను.

18. ఈ కష్టములన్ని వాటిల్లిన పిదప ప్రభువు ఆ రాజును ఘోరమైన ఆంత్ర వ్యాధితో పీడించెను.

19. రెండేండ్లు ఈ రోగముతో బాధపడినపిదప అతని ప్రేగులు తెగి బయటికివచ్చెను. అతడు దుర్భరమైన బాధతో కన్ను మూసెను. పౌరులు యెహోరాము పితరుల మృతికివలె అతని మృతికి సంతాప సూచకముగా మంటవేయరైరి.

20. రాజు అగునప్పటికి యెహోరామునకు ముప్పది రెండేండ్లు. అతడు యెరూషలేమునుండి ఎనిమిదేండ్లు పరిపాలించెను. ఆ రాజు చావునకు ఎవరును కంటతడి పెట్టలేదు. అతనిని దావీదు నగరముననే పాతిపెట్టిరి. కాని రాజసమాధులలో మాత్రము కాదు.

 1. అరబ్బీయులను ప్రోగుజేసికొని వచ్చి దాడి చేసిపోయిన దండులు యెహోరాము కుమారులలో కనిష్ఠుని తప్ప అందరిని వధించిరి. కనుక యెరూషలేము పౌరులు యెహోరామునకు బదులుగా అతని కడగొట్టు కుమారుడైన అహస్యాను రాజును చేసిరి.

2. రాజగునప్పటికి అహస్యాకి ఇరువది రెండేండ్లు. అతడు యెరూషలేమున ఒక సంవత్సర కాలము రాజ్యము చేసెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తెయైన అతల్యా.

3. అతడుకూడ అహాబు బంధువుల మార్గముననే నడిచెను. తల్లి సలహాలను పాటించి కానిపనులు చేసెను.

4. తండ్రి మరణానంతరము అహాబు బంధువులు అహస్యాకు దురుపదేశముచేయగా అతడు ప్రభువు సహింపని దుష్కార్యములు చేసి వినాశనము తెచ్చుకొనెను.

5. వారి దుర్బోధల వలన అతడు అహాబు కుమారుడును, యిస్రాయేలు రాజునైన యెహోరాముతో కలిసి సిరియారాజు హసాయేలు మీదికి యుద్ధమునకు పోయెను. గిలాదులోని రామోతున పోరు జరిగెను. అచట సిరియనులు యెహోరామును గాయపరచిరి.

6. యెహోరాము యెస్రెయేలు నగరమునకు వచ్చి గాయములకు చికిత్స చేయించుకొనుచుండెను. అహస్యా గాయపడియున్న యెహోరామును చూడబోయెను.

7. ఈ రాజసందర్శన సంఘటన ద్వారానే ప్రభువు అహస్యాను నాశనము చేసెను. అతడు యెస్రెయేలున నున్న కాలమున యెహోరాముతో కలసి నింషీ కుమారుడైన యెహూ మీదికి పోయెను. ప్రభువు అహాబు కుటుంబమును నాశనము చేయుటకు ఈ యెహూను అభిషేకించెను.

8. యెహూ అహాబు వంశ జులనెల్ల నిర్మూలించుచుండగా కొందరు యూదీయ నాయకులు, అహస్యాతో పాటు వచ్చిన అతని సోదరుల పుత్రులు ఆ వీరుని కంటబడిరి. అతడు వారినందరిని మట్టు పెట్టెను.

9. అటుతరువాత యెహూ అహస్యాను గాలించెను. అతడు సమరియా నగరమున దాగుకొనియుండి శత్రువులకు దొరకి పోయెను. బంటులు అతనిని యెహూ చెంతకు కొని వచ్చి వధించిరి. కాని పూర్ణహృదయముతో ప్రభువును సేవించిన యెహోషాఫాత్తు మనుమడన్న గౌరవముతో వారతనికి అంత్యక్రియలు జరిపిరి. అటు తరువాత అహస్యా కుటుంబమున రాజ్యపదవిని చేపట్టగల దిట్ట ఎవడును లేడయ్యెను.

10. అతల్యా తన కుమారుడు అహస్యా మరణించెనని వినగానే యూదా రాజకుటుంబమునకు చెందిన వారినందరిని హత్య చేయించెను.

11. కాని అహస్యాకు యెహోషెబ అను మారుచెల్లెలు కలదు. ఆమెను యెహోయాదా అను యాజకునకిచ్చి పెండ్లి చేసిరి. ఆమె తన అన్నయగు అహస్యా కుమారులలో ఒకడగు యోవాసును మృత్యువాతబడనున్న ఇతర రాజకుమారుల నుండి రహస్యముగా తప్పించెను. ఆ పిల్లవానిని, అతని దాదిని ఒక శయన మందిరమున దాచియుంచెను. ఆ రీతిగా దాచియుంచినందున ఆ శిశువు అతల్యా చేతికి చిక్కి ప్రాణములు కోల్పోలేదు.

12. అతడు వారితోకూడా ఆరేండ్లపాటు దేవాలయముననే దాగియుంచబడెను. ఆ కాలమున అతల్యా దేశమునేలుచుండెను.

 1. ఏడవసంవత్సరమున యెహోయాదా బలమును చేకూర్చుకొనెను. అతడు ఐదుగురు సైన్యాధిపతులతో ఒప్పందము కుదుర్చుకొనెను. వారు యెరోహాము కుమారుడైన అజర్యా, యెహోనాను కుమారుడైన యిష్మాయేలు, ఓబేదు కుమారుడైన అజర్యా, అదాయా పుత్రుడైన మాసేయా, సిక్రి తనయుడైన యెలీషాఫాత్తు.

2. వారు యూదా పట్టణములందెల్ల సంచరించి లేవీయులను ఆయా తెగల పెద్దలను యెరూషలేమునకు తీసికొని వచ్చిరి.

3. వారెల్లరును దేవాలయమున ప్రోగై రాజకుమారుడైన యోవాషుతో ఒడంబడిక చేసికొనిరి. అప్పుడు యెహోయాదా “రాజ కుమారుడు ఇతడే. ప్రభువు దావీదు వంశజులు రాజులగుదురని నుడివినట్లే ఇప్పుడితడు రాజపదవిని చేపట్టునుగాక!

4. మీరిట్లుచేయుడు, విశ్రాంతిదినమున యాజకులును, లేవీయులును అర్చనకు వచ్చినప్పుడు వారు మూడు భాగములై, వారిలో ఒకభాగము దేవాలయ ద్వారము చెంతను,

5. రెండవ భాగము రాజప్రాసాదద్వారము చెంతను మిగిలిన భాగము పునాది ద్వారముచెంతను కావలి నుండవలయును. ప్రజలెల్లరును దేవాలయ ప్రాంగణమున ప్రోగుకావలయును.

6. అర్చన చేయు యాజకులను, లేవీయులను తప్ప మరియెవ్వరిని దేవాలయమున ప్రవేశింపనీయరాదు, వారు శుద్ధిని పొందిరి కనుక దేవాలయ ప్రవేశము చేయవచ్చును. మిగిలిన ప్రజలెల్లరును ప్రభుని ఆజ్ఞకు బద్దులై వెలుపలనే యుండవలయును.

7. లేవీయులు ఆయుధములు తాల్చి రాజును చుట్టి ఉండి రక్షించుచుండ వలయును. రాజు ఎటు కదలిన వారు కూడ అతనితో పోవలయును. దేవాలయమున మరి ఎవరైనను ప్రవేశించిన వారిని పట్టి వధింపవలయును" అని చెప్పెను.

8. లేవీయులును, యూదీయులును యెహోయాదా ఆజ్ఞలను పాటించిరి. వారు విశ్రాంతిదినమున పని చాలించినవారిని వెళ్ళిపోనీయరైరి. కనుక విరమించిన వారును, పనిలో చేరువారునుగూడ సైన్యాధిపతులకు లభ్యమైరి.

9. యెహోయాదా సైన్యాధిపతులకు ఈటెలు, కవచములిచ్చెను. అవి దావీదు కాలము నాటివి. అంతవరకు వానిని దేవాలయమున భద్రపరచి యుంచిరి.

10. అతడు కత్తి పట్టినవారిని దేవాలయమునకు కుడి ఎడమలందును, బలిపీఠముచెంతను కావలి పెట్టగా వారెల్లరుు రాజును అపాయము నుండి కాపాడుచుండిరి.

11. అంతట యెహోయాదా యోవాషను వెలుపలికి కొనివచ్చి అతని శిరస్సుపై కిరీటము పెట్టెను. అతని చేతికి ధర్మశాస్త్ర గ్రంథమును అందించెను. ప్రజలతనిని రాజుగా ప్రకటించిరి. యెహోయాదా మరియు అతని తనయులు యోవాషునకు అభిషేకము చేసిరి. ఎల్లరును రాజునకు దీర్ఘాయువని కేకలు పెట్టిరి.

12. ప్రజలు రాజు చెంతకు పరుగెత్తుకొని వచ్చి సంతోషముతో నినాదములు చేయుచుండగా అతల్యా ఆ ధ్వని వినెను. ఆమె దేవళము చెంత ప్రజలు గుమిగూడియున్న తావునకు గబగబ నడచి వచ్చెను.

13. దేవాలయ ప్రవేశ స్థలమున రాజులు నిలుచుండు స్తంభముచెంత రాజు నిలుచుండి ఉండుటచూచెను. సైన్యాధిపతులు బాకాలనూదువారు అతని చుట్టు ప్రోగైయుండిరి. ప్రజలెల్లరు చుట్టు గుమిగూడి ఆనందముతో బాకాలు ఊదుచుండిరి. దేవాలయ గాయకులు వాద్యములు మీటుచు ప్రజలచే పాటలు పాడించు చుండిరి. అతల్యా బట్టలుచించుకొని “ద్రోహము, ద్రోహము” అని అరచెను.

14. యెహోయాదా దేవాలయము చుట్టుపట్టులలో అతల్యాను వధింపకూడదని తలంచెను. కనుక అతడు సైన్యాధిపతులను పిలిచి “మీరామెను సైనికుల వరుసలగుండ వెలుపలికి కొని పొండు. ఆమెను రక్షింపబూనిన వానిని కత్తికి బలిచేయుడు” అని చెప్పెను.

15. వారు అతల్యాకు దారినిచ్చి ఆమె రాజప్రాసాదమువద్దనున్న అశ్వ ద్వారముచెంత చేరగనే వధించిరి.

16. యెహోయాదా జనులందరు యావేవారై ఉండవలయునని జనులతోను, రాజుతోను నిబంధనము చేయించెను.

17. పిమ్మట ప్రజలెల్లరును బాలు మందిరమునకు వెళ్ళి దానిని కూలద్రోసిరి. బలి పీఠములను విగ్రహములను ధ్వంసము చేసిరి. బాలు పూజారి మత్తనుని బలిపీఠము ముందటనే సంహరించిరి.

18. యెహోయాదా యాజకులను, లేవీయులను దేవాలయ సేవకు వినియోగించెను. వారు దావీదు నియమించిన ఊడిగములెల్ల చేయవలయును. మోషే ధర్మశాస్త్రమును అనుసరించి బలులు సమర్పింపవలయును. సంగీతము పాడుచు ఉత్సాహముతో ఆరాధనము చెల్లింపవలయును.

19. అతడు దేవాలయమునకు ద్వారపాలకులను నియమించి శుద్ధి చేసికొననివారిని లోనికి రానీయవలదని ఆజ్ఞాపించెను.

20. అంతట యెహోయాదా, సైన్యాధిపతులు, పుర ప్రముఖులు, ఉద్యోగులు, పౌరులందరును కూడి రాజును దేవాలయమునుండి ప్రాసాదమునకు కొనిపోయిరి. ఎల్లరును సింహద్వారమువెంట ప్రాసాద మును ప్రవేశించిరి. అచట రాజును సింహాసనాసీనుని జేసిరి.

21. ప్రజలెల్లరు మిగులసంతసించిరి. అతల్యా గతించెను గనుక నగరమున ఎట్టి కలకలము పుట్టదయ్యెను.

 1. యోవాషు తన యేడవయేట రాజై నలువది యేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతని తల్లి బేర్షెబా నగరమునకు చెందిన సిబ్యా.

2. ఆ రాజు యెహోయాదా జీవించినంతకాలము ప్రభువునకు ప్రీతిపాత్రుడుగనే మెలిగెను.

3. యెహోయాదా రాజునకు ఇద్దరు పడతుల నిచ్చి పెండ్లి చేసెను. వారివలన యోవాషు కుమారులను కుమార్తెలను కనెను.

4. అటుపిమ్మట రాజు దేవాలయమును బాగుచేయింప నిశ్చయించుకొనెను.

5. అతడు యాజకులు, లేవీయులు యూదా నగరములకు వెళ్ళి ప్రజలనుండి పన్ను వసూలుచేసి, ఆ సొమ్ముతో ఏటేట గుడిని మరమ్మతు చేయవలెననియు ఆజ్ఞాపించెను. అతడు ఆ కార్యమును సత్వరమే ప్రారంభింపవలెనని చెప్పినను లేవీయులు జాగుచేసిరి.

6. కనుక రాజు లేవీయుల నాయకుడైన యెహోయాదాను పిలువనంపి “నీవు లేవీయులనంపి యూదీయుల నుండియు యెరూషలేము పౌరుల నుండియు పన్ను వసూలు చేయింపవైతివేల? ప్రభు భక్తుడైన మోషే సాన్నిధ్యగుడారమును సంరక్షించుటకు ప్రజల నుండి పన్ను వసూలు చేయింపలేదా?” అని అడిగెను.

7. అతల్యా మరియు ఆమెవలన చెడిపోయిన ఆమె అనుచరులు దేవాలయమును పాడుచేసిరి. పవిత్రమైన దేవాలయ పరికరములను బాలు ఆరాధనకు వినియోగించిరి.

8. రాజు ఒక పెట్టెను చేయించి దేవాలయ ప్రవేశద్వారమునొద్ద పెట్టుడని లేవీయులను ఆజ్ఞాపించెను.

9. ప్రభుభక్తుడైన మోషే ఎడారిలో ప్రజలనుండి వసూలు చేసిన పన్నునే యిస్రాయేలీ యులు ప్రభు మందిరమునకు కొనిరావలెనని యూదాలోను, యెరూషలేములోను చాటింపు చేయించెను.

10. ఫలితముగా ప్రజా నాయకులును, ప్రజలును సంతసముతో పన్నులు కొనివచ్చి కానుకల పెట్టెను నింపిరి.

11. ప్రతిదినము లేవీయులు ఆ కానుకల పెట్టెను రాజాధికారియొదకు కొనిపోయెడివారు. పెట్టే నిండినపుడెల్ల రాజోద్యోగియు, ప్రధానయాజకుని ప్రతి నిధి కలిసి సొమ్ము బయటికి తీసి దానిని మరల యథా స్థానమునకు పంపెడివారు. ఆ రీతిగా వారు పెద్ద మొత్తము ప్రోగుజేసిరి.

12. రాజును, యెహోయాదాయును ఆ పైకమును మరమ్మతులు చేయువారికి ఇచ్చెడివాడు. వారు వడ్రంగులను, ఇనుప పరికరములను చేసెడి వారిని, రాతిపని వారిని వినియోగించి, దేవళమును బాగుచేయించెడి వారు.

13. ఆ పనివారెల్లరును కష్టపడి కృషిచేసి దేవాలయమును పూర్వస్థితికి కొనివచ్చిరి. అది భద్రమైన కట్టడముగా రూపొందెను

14. మరమ్మతు ఖర్చులకుపోగా మిగిలిన సొమ్మును యెహోయాదా కును, రాజునకును ముట్టజెప్పిరి. వారు ఆ సొమ్ముతో మందిర పరిచర్య సమయము నందును, బలులు అర్పించునపుడును వాడు పాత్రలను, సాంబ్రాణి కలశములను, వెండి బంగారపు పరికరములను చేయించిరి. యెహోయాదా బ్రతికియున్నంత కాలము క్రమము చొప్పున దేవళమున బలులర్పించిరి.

15. అతడు పండు వంటి నిండుజీవితము గడపి నూట ముప్పదియవయేట మరణించెను.

16. ఆ యాజకుడు దేవునికిని, దేవళమునకును, ప్రజలకును చేసిన సేవలకు గుర్తింపుగా అతనిని దావీదునగరమున రాజసమాధులలో పాతి పెట్టిరి.

17. యెహోయాదా మరణానంతరము యూదా నాయకులు యోవాసునకు కొలువు చేయవచ్చిరి. అతడు వారి సలహాలను పాటింప మొదలిడెను.

18. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభువు దేవళమును విడనాడి విగ్రహములను, అషేరా స్తంభములను పూజించిరి. ఈ పాపమునకుగాను ప్రభువు యూదామీదను యెరూషలేముమీదను కినుక పూనెను.

19. అతడు ప్రవక్తలను పంపి ఈ ప్రజలను తన చెంతకు రాబట్టుకోజూచెను. గాని వారు వారి హెచ్చరికలను పెడచెవినిబెట్టిరి.

20. అప్పుడు ప్రభుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడు జెకర్యాను ఆవహించెను. అతడు ప్రజల ఎదుట ఎత్తయిన తావున నిలుచుండి “ప్రభువు వాక్కిది, మీరు దేవుని విడనాడి వినాశనము తెచ్చుకోనేల? మీరు ప్రభువును పరిత్యజించితిరి. కనుక అతడు మిమ్ము పరిత్యజించెను” అని నుడివెను.

21. ప్రజలు జెకర్యాపై కుట్రపన్నిరి. రాజు అనుమతిపై అతనిని యావే మందిర ప్రాంగణముననే రాళ్ళతో కొట్టి చంపిరి.

22. యోవాసు రాజు తనకు యెహోయాదా చేసిన ఉపకారములను విస్మరించి అతని కుమారుడగు జెకర్యాను చంపించెను. జెకర్యా ప్రాణములు విడుచుచు “ప్రభువు నీ చెయిదమును గుర్తించి నిన్ను శిక్షించు గాక!” అని పలికెను.

23. ఆ మరుసటి సంవత్సరము అరామీయులు యెరూషలేము మీదికి దండెత్తిరి. వారు యూదాను, యెరూషలేమును ముట్టడించి ప్రజానాయకులనెల్ల చంపిరి. దమస్కుననున్న తమ రాజునకు అపారమైన కొల్లసొమ్మును పంపిరి.

24. అరామీయులు కొద్దిపాటి సైన్యముతోనే వచ్చిరి. అయినను ప్రభువు చాల పెద్దదియగు యూదయా సైన్యమును వారికి లొంగి పోవునట్లు చేసెను. వారు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడినందుచే ఆ రీతిగా యోవాషు శిక్షననుభవించెను.

25. అరామీయులు యోవాషును తీవ్రముగా గాయపరచి వెళ్ళిపోయిరి. ఇక ఇద్దరు రాజోద్యోగులు యోవాసుపై కుట్రపన్ని అతనిని పడకమీదనే హత్య చేసిరి. యోవాసును దావీదు నగరముననే పాతి పెట్టిరి గాని రాచసమాధులలో మాత్రముకాదు.

26. కుట్ర పన్నినవారు అమ్మోనీయురాలగు షిమాతు కుమారుడైన సాబాదు మరియు మోవాబీయురాలగు షిమ్రీతు కుమారుడైన యెహోసాబాదు.

27. యూదారాజుల చరిత్రకు వివరణ చెప్పు గ్రంథమున యోవాసు కుమారుల కథలు, యోవాసు వినాశనమును గూర్చిన ప్రవచనములు, అతడు దేవాలయమును పునర్నిర్మా ణము చేసిన ఉదంతము లిఖింపబడియేయున్నవి. అటుతరువాత అతని కుమారుడు అమస్యా రాజయ్యెను.

 1. అమస్యా తన యిరువది ఐదవయేట రాజై యిరువది తొమ్మిదేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతని తల్లి యెరూషలేమునకు చెందిన యెహోఅద్దాను.

2. అతడు ప్రభువునకు నచ్చిన రీతినే ప్రవర్తించెను కాని పూర్ణహృదయముతో మాత్రముకాదు.

3. అమస్యా తన ఆధిపత్యమును సుస్థిరము చేసికొనగనే తన తండ్రిని చంపిన ఉద్యోగులను తెగటార్చెను.

4. అయినను వారి తనయులను మాత్రము వధింపలేదు. అతడు ప్రభువు మోషే ధర్మ శాస్త్రమున విధించిన ఈ క్రింది ఆజ్ఞను పాటించెను: “కుమారుల పాపములకు తండ్రులనుగాని, తండ్రుల పాపములకు కుమారులనుగాని వధింపరాదు. ప్రతి వ్యక్తి తన పాపములకు తానే చావవలెను.”

5. అమస్యా యూదీయులను, బెన్యామీనీయులను వారివారి తెగల ప్రకారము దళములుగా  విభజించెను. వేయిమంది నూరుమందిగల దళములకు సైన్యాధిపతులను నియమించెను. అతడు ఇరువది యేండ్లు లేక అంతకు పైబడిన వయస్సుకలవారి నెల్లరిని లెక్కించి చూడగా మూడులక్షల మంది తేలిరి. వారెల్లరును యుద్ధము చేయగలవారు. ఈటెలను డాళ్ళను ఉపయోగింపగలవారు.

6. ఇంకను అతడు రెండువందల మణుగుల వెండిని వెచ్చించి యిస్రా యేలీయుల నుండి లక్షమంది వీరులను బాడుగకు కుదుర్చుకొనెను.

7. అప్పుడు ప్రవక్త ఒకడు రాజు చెంతకు వచ్చి “నీవు ఈ యిస్రాయేలు సైన్యమును పోరునకు కొనిపోవలదు. ప్రభువు యిస్రాయేలువారైన ఎఫ్రాయీమీయులలో ఎవరికిని తోడ్పడడు.

8. వారు నీ వెంటవత్తురేని నీవెంతబలముతో పోరాడిన ప్రభువు నిన్ను ఓడించితీరును. విజయమునకును, పరాజయమునకును గూడ ఆయనే కర్తకదా!" అని చెప్పెను.

9. అమస్యా “మరి నేను యిస్రాయేలు సైనికులకొరకు వెచ్చించిన రెండు వందల మణుగుల వెండిని నష్ట పోవలసినదేనా?" అని ప్రశ్నించెను. ప్రవక్త “ప్రభువు నీకు అంతకంటే ఎక్కువ లాభమునే చేకూర్చి పెట్టును” అనెను.

10. కనుక అమస్యా యిస్రాయేలీయుల నుండి బాడుగకు కుదుర్చుకొనిన సైన్యములనెల్ల వెనుకకు పంపివేసెను. వారు యూదీయులమీద పండ్లు కొరుకుచు వెళ్ళిపోయిరి.

11. అమస్యా ధైర్యము తెచ్చుకొని తన సైన్యమును ఉప్పులోయకు నడిపించుకొనిపోయెను. అచట యూదీయులు ఎదోమీయులను పదివేలమందిని మట్టు పెట్టిరి.

12. మరియొక పదివేలమందిని బందీలనుగా చేసి కొండశిఖరమునకు కొనిపోయి క్రిందికి త్రోయగా ఎల్లరును తుత్తునియలైరి.

13. ఇంతలో అమస్యా తనవెంట రానీయక వెనుకకు పంపిన యిస్రాయేలు సైన్యము, సమరియా బేత్-హోరోను నగరముల మధ్యగల యూదియా నగరములపై దాడి చేసెను. ఆ దండు యూదీయులను మూడువేల మందిని చంపి కొల్లసొమ్మును విస్తారముగా ప్రోగుజేసి కొని పోయెను.

14. అమస్యా ఎదోమీయులను జయించి తిరిగి వచ్చునప్పుడు వారి విగ్రహములను కొనివచ్చెను. ఆ బొమ్మలను తనకు దేవతలగా చేసికొని ఆరాధన చెల్లించెను. వాని ముందట సాంబ్రాణి పొగ వేసెను.

15. ప్రభువు అమస్యా మీద మండిపడి అతని యొద్దకు ఒక ప్రవక్తను పంపెను. ఆ ప్రవక్త “ఈ దేవతలు తమను కొలుచు ప్రజలనే నీ బారినుండి కాపాడలేరైరి. అట్టి వారిని నీవు కొలువవచ్చునా?” అని అడిగేను.

16. అమస్యా అతని మాటలకు అడ్డువచ్చి “ఓయి! నిన్ను రాజునకు సలహాదారునిగా నియమించితిమా యేమి? ఇంతటితో నోరు మూసి కొనుము. లేదేని నీకు చావు మూడినట్లే” అనెను. ఆ ప్రవక్త కొంచెమాగి “నీవిట్టి పనులకు పాల్పడితివి. ఇప్పుడు నా హెచ్చరికనుగూడ పెడచెవిని పెట్టితివి. కనుక ప్రభువు నిన్ను నాశనము చేయ నెంచెనని నేను గ్రహించితిని” అని పలికెను.

17. అమస్యా తన సలహాదారులతో సంప్రదించి యిస్రాయేలు రాజైన యెహూ మనుమడును, యెహోవాహాసు కుమారుడైన యోవాషును యుద్ధమునకు సవాలు చేయుచు వార్త పంపెను.

18. కాని యోవాషు అమస్యాకు ఈ క్రింది వార్తపంపెను. “లెబానోను కొండలలోని ముండ్లపొద ఒకటి నీ కుమార్తెను నా కుమారునకిచ్చి పెండ్లి చేయుమని అచటి దేవదారునకు కబురు పంపెను. కాని ఆ కొండలలోని వన్యమృగము ఒకటి అటుపోవుచు ఆ ముండ్లపొదను తన కాళ్ళతో అణగతొక్కెను.

19. నీవు ఎదోమీయులను ఓడించితిని గదాయని విఱ్ఱవీగుచున్నావు. నీవు నీ ఇంటిపట్టుననే పడియుండుట మేలు. నాతో చెలగాట మాడితివా నీకును, నీ ప్రజలకును ముప్పుతప్పదు.”

20. అయినను అమస్యా యోవాసు మాట వినడయ్యెను. అతడు ఎదోము దేవత నారాధించెను కనుక ప్రభువు అతనిని శత్రువుల వశము చేయించెను.

21. కనుక యూదారాజైన అమస్యా, యిస్రాయేలు రాజైన యోవాషు యూదాలోని బేత్-షెమేషు వద్ద పోరునకు తలపడిరి.

22. ఆ పోరాటమున యిస్రాయేలీయులు యూదీయులనోడింపగా వారు తమ నివాసములకు పారిపోయిరి.

23. యోవాషు అమస్యాను బంధించి యెరూషలేమునకు కొనిపోయెను. అతడు నగరప్రాకారమును ఎఫ్రాయీము ద్వారము నుండి మూలద్వారమువరకు రెండు వందల గజములవరకు పడగొట్టించెను.

24. దేవళమునుండి వెండి బంగార ములను గైకొనెను. ఓబేదెదోము మరియు ప్రాసాద కోశాధికారుల అధీనముననున్న దేవాలయసామగ్రిని తీసికొనెను. వానినెల్ల కొల్లసొమ్ముగా సమరియాకు కొనిపోయెను. పైపెచ్చు యూదీయులను కొందరిని బందీలనుగాగూడ కొనిపోయెను.

25. అమస్యా, యిస్రాయేలు రాజైన యోవాషు గతించిన పిమ్మట పదునైదేండ్లు జీవించెను.

26. అతడు తన పరిపాలన కాలము మొదటినుండి తుది వరకును చేసిన ఇతర కార్యములెల్ల యూదా, యిస్రాయేలు రాజులచరితమున లిఖింపబడియేయున్నవి.

27. ఆ రాజు ప్రభువును విడనాడిన తరువాత కొంత కాలమునకు యెరూషలేమున కొందరు అతనిమీద కుట్రపన్నిరి, అమస్యా లాకీషు నగరమునకు పారిపోయెను. కాని శత్రువులు అతనిని వెన్నాడిరి. ఆ నగరముననే అతనిని పట్టుకొని చంపివేసిరి.

28. అతని శవమును గుఱ్ఱముపై యెరూషలేమునకు కొనివచ్చి దావీదునగరమున రాజసమాధులలో పాతి పెట్టిరి.

 1. యూదీయులెల్లరు అమస్యా కుమారుడైన ఉజ్జీయాను రాజుగా ఎన్నుకొనిరి. అప్పుడతనికి పదునారేండ్లు.

2. అమస్యా మరణానంతరము ఉజ్జీయా ఏలోతు నగరమును జయించి దానిని పునర్నిర్మాణము చేయించెను.

3. రాజగునప్పటికి ఉజ్జీయాకు పదునారేండ్లు. అతడు యెరూషలేము నుండి ఏబదిరెండేండ్లు పరిపాలించెను. అతని తల్లి యెరూషలేమునకు చెందిన యెకొల్యా.

4. ఆ రాజు తన తండ్రి అడుగుజాడలలో నడచి ప్రభువునకు ఇష్టుడయ్యెను.

5. దైవభక్తిగల జెకర్యా జీవించినంత కాలము అతడు ప్రభువును సేవించెను. ప్రభువు కూడ అతనిని ఆదరించెను.

6. ఉజ్జీయా ఫిలిస్తీయుల మీదికి యుద్ధమునకు పోయి వారి నగరములైన గాతు, యబ్నె, అష్దోదు ప్రాకారములను పడగొట్టించెను. అష్టోదు చెంతను, ఫిలిస్తీయ మండలమునందలి ఇతర స్థలమునందును సురక్షిత నగరములను నిర్మించెను.

7. ప్రభువు దీవెనతో అతడు ఫిలిస్తీయులను గూర్భాలున వసించు అరబ్బీయులను, మెయూనీయులను జయించెను.

8. అమ్మోనీయులు అతనికి కప్పముకట్టిరి. అతడు మహాబలసంపన్నుడు అయ్యెను. ఐగుప్తు సరిహద్దులలో కూడ అతని పేరు మారుమ్రోగెను.

9. ఆ రాజు యెరూషలేము నగరమున మూల ద్వారముచెంతను, లోయ ద్వారముచెంతను, ప్రాకా రము మలుపుతిరుగు తావునను ద్వారములను నిర్మించెను. వాని వలన నగరము సురక్షితమయ్యెను.

10. అతడు ఎడారియందు గూడ దుర్గములు నిర్మించెను. ఉజ్జీయాకు షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను విస్తారమైన పశువుల మందలు ఉండెడివి. కనుక అతడు చాల బావులను కూడ త్రవ్వించెను. అతనికి సేద్యమనిన ప్రీతి, కనుక అతనికి కొండలలో ద్రాక్షలను పెంచువారును మైదానములలో సారవంతమైన పొలములను సాగుచేయు వారును ఉండిరి.

11. ఉజ్జియాకు యుద్ధమునకు సిద్ధమైన సైన్యములుండెడివి. వానిని పటాలములుగా విభజించిరి. ఆ సైనికుల లెక్కలను కార్యదర్శి యెయీయేలు, అధికారి మాసెయా చూచుచుండెడివారు. రాజు సైన్యాధిపతులలో ఒకడైన హనన్యా ఆ సైన్యమునకు అధిపతి.

12. రెండువేల ఆరువందల మంది పరాక్రమశాలురు నాయకులుగా నుండిరి.

13. వారి క్రింద మూడు లక్షల ఏడు వేల ఐదువందల మంది యోధులుండిరి. వారెల్లరును రాజుపక్షమున శత్రువులతో పోరాడెడివారు.

14. ఉజ్జీయా ఈ సైనికులకు డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణములు, కవచములు, విల్లంబులు, ఒడిసెలరాళ్ళు సమకూర్చెడివాడు.

15. నిపుణులైన అతని ఉద్యోగులు యెరూషలేము ప్రాకారము మలుపులమీదను, కోట బురుజుల మీదను యంత్రములు అమర్చిరి. వానిద్వార పెద్ద రాళ్ళను బాణములను విసరవచ్చును. ఉజ్జీయా కీర్తి ఎల్లెడల వ్యాపించెను. అతడు దైవసహాయము వలన అద్భుతమైన బలమును సంపాదించెను.

16. ఆ రాజు బలవంతుడైన కొలది అతని గర్వము పెచ్చు పెరిగెను. ఆ పొగరువలననే అతడు పడిపోయెను. అతడు ప్రభువునకు భయపడక యావే మందిరములోనికి వెళ్ళి ధూపపీఠముపై ధూపము వేయుటకై తన దేవుడైన ప్రభువుమీద ద్రోహము చేయబోగా

17. యాజకుడైన అజర్యా మరియు ఎనుబది మంది ధైర్యముగల యాజకులు రాజువెంట దేవాలయము లోనికి పోయిరి.

18. వారు అతనిని వారించుచు 'రాజా! ప్రభువునకు సాంబ్రాణి పొగవేయుట నీ పని కాదు. ఇది అహరోను సంతతియై శుద్ధినిబడసిన యాజకులు చేయవలసిన కార్యము. కనుక నీవు దేవాలయము నుండి వెలుపలికి పొమ్ము. నీవు ప్రభువును ధిక్కరించితివి కనుక ఆయన అనుగ్రహమును కోల్పోయితివి” అని హెచ్చరించిరి.

19. ఉజ్జీయా ధూపకలశమును చేతబట్టుకొని దేవాలయమున ధూపపీఠము చెంత నిలుచుండియుండెను. అతడు యాజకుల మాటలు విని వారి మీద మండిపడెను. వెంటనే అతని నొసటిమీద కుష్ఠు పొటమరించెను.

20. అజర్యా మరియు ఇతర యాజకులు రాజువైపు చూడగా అతని నొసటికి కుష్ఠు సోకియుండెను. వెంటనే వారు అతనిని దేవాలయము నుండి బయటికి వెళ్ళగొట్టిరి. ప్రభువు తనను శిక్షించెను గనుక అతడే త్వరత్వరగ వెలుపలికి వెళ్ళిపోయెను.

21. ఉజ్జీయా ఆమరణాంతము కుష్ఠరోగిగా నుండెను. అతడు కుష్ఠరోగియై యావేమందిరము లోనికి పోకుండా ప్రత్యేకింపబడెను కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంట్లో నివసించుచుండెను. అతనికి బదులుగా అతని కుమారుడు యోతాము రాజ్య వ్యవహారములను పరిశీలించుచు దేశమును ఏలెను.

22. ఉజ్జీయా చరితమున మిగిలిన అంశములు మొదటినుండి చివరివరకును ఆమోసు కుమారుడైన యెషయా లిఖించెను.

23. ఆ రాజు చనిపోగా అతనిని రాజశ్మశానభూమిలోనే పాతిపెట్టిరి. అతడు కుష్ఠరోగి కనుక పూర్వ రాజసమాధులలో మాత్రము పాతిపెట్టరైరి. అటుతర్వాత అతని పుత్రుడు యోతాము రాజయ్యెను.

 1. రాజగునప్పటికి యోతామునకు ఇరువది యైదేండ్లు. అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలన చేసెను. అతని తల్లి, సాదోకు కుమార్తెయైన యెరూషా.

2. యోతాము తన తండ్రి ఉజ్జీయావలె ప్రభువునకు ప్రీతిగలిగించు కార్యములు చేసెను. అయినను అతడు దేవాలయములోనికి అడుగు పెట్టలేదు. ప్రజలు మాత్రము పాపము మూటగట్టు కొనుచునే యుండిరి.

3. దేవాలయపు ఉత్తర ద్వారమును నిర్మించినది యోతామే. ఓఫెలుచెంత యెరూషలేము ప్రాకారమును పొడిగించినది కూడ అతడే.

4. ఇంకను అతడు యూదా మన్యమున పట్టణములు నిర్మించెను. అరణ్య సీమలో కోటలు బురుజులు కట్టించెను.

5. యోతాము అమ్మోనీయుల రాజుతో పోరాడి వారిని ఓడించెను. వారు మూడేండ్లపాటు ఏటేట రెండువందల మణుగుల వెండి, పదివేల కుంచముల గోధుమలు, పదివేల కుంచముల యవలు కప్పము కట్టుటకు అంగీకరించిరి.

6. అతడు ప్రభుని యాజ్ఞలు పాటించెను గనుక మహా బలసంపన్నుడయ్యెను.

7. యోతాము పరిపాలనలోని ఇతరాంశములు, అతడు చేసిన యుద్ధములు, అనుసరించిన పద్ధతులు అన్నియుయిస్రాయేలు యూదారాజులచరితమున లిఖింప బడియేయున్నవి.

8. రాజు అగునప్పటికి యోతాము నకు ఇరువది ఐదేండ్లు, అతడు యెరూషలేము నుండి పదునారేండ్లు పరిపాలించెను.

9. యోతాము తన పితరులతో నిద్రించగా అతనిని దావీదు నగరమున పాతిపెట్టిరి. అటుతరువాత అతని కుమారుడు ఆహాసు రాజయ్యెను.

 1. ఆహాసు ఇరువదియేండ్ల ఈడున రాజై పదనారేండ్ల పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతడు తన పితరుడైన దావీదువలె ప్రభువు దృష్టికి యదార్ధముగ ప్రవర్తింపలేదు.

2. పై పెచ్చు యిస్రాయేలు రాజుల మార్గముననుసరించి లోహముతో బాలు విగ్రహములు చేయించెను. బెన్-హిన్నోము లోయయందు అన్యదేవతలకు సాంబ్రాణి పొగ వేసెను.

3. ప్రభువు యిస్రాయేలు ప్రజల సమక్షమునుండి తరిమివేసిన అన్యజాతులవారి జుగుప్సాకరమైన ఆచారముల ననునుసరించి తన సొంతకుమారులను గూడ దహనబలిగా సమర్పించెను.

4. ఉన్నత స్థలముల మీదను, పర్వతముమీదను, గుబురైన చెట్ల క్రిందను బలులు అర్పించి సాంబ్రాణి పొగవేసెను.

5. ఈ దుష్కార్యములకు శిక్షగా ప్రభువు ఆహాసును సిరియారాజు చేతికప్పగించెను. ఆ రాజు అతనిని ఓడించి అతని ప్రజలను చాలమందిని బందీలను చేసి దమస్కునకు కొనిపోయెను. యిస్రాయేలు రాజు, రెమల్యాకుమారుడైన పెకా చేతికి గూడ ప్రభువు ఆహాసును అప్పగించెను.

6. ఆ రాజు ఆహాసును ఓడించి ఒక్క రోజులోనే బలశాలులైన యూదీయ సైనికులను లక్ష ఇరువదివేలమందిని మట్టు పెట్టెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడిరి కనుక ఇట్టి శిక్షకు పాత్రులైరి.

7. ఎఫ్రాయీము యోధుడైన సిక్రి అనువాడు ఆహాసు కుమారుడైన మాసెయాను, ప్రాసాదపాలకుడైన అబ్రీకామును, రాజునకు ముఖ్యమంత్రి అయిన ఎల్కానాను వధించెను.

8. యిస్రాయేలీయులు తమ సోదరులైన యూదీయుల స్త్రీలను, పిల్లలను రెండు లక్షలమందిని బందీలనుచేసి సమరియాకు కొనిపోయిరి. ఇంకను వారు పెద్దమొత్తమున కొల్ల సొమ్మునుగూడ తీసికొనిపోయిరి.

9. ఓదెదు అను పేరుగల ప్రభువు ప్రవక్త ఒకడుండెను. అతడు యుద్ధము ముగించుకొని సమరియా నగరమును ప్రవేశించుచున్న యిస్రాయేలు సైన్యముతో “మీ పితరుల దేవుడైన ప్రభువు యూదీయుల మీద ఆగ్రహముచెంది వారిని మీ చేతికప్పగించెను. కాని మీరు ఆకాశమునంటునంత దారుణముగా వారిని వధించితిరి.

10. ఇప్పుడు మీరు యూదా యెరూషలేము నివాసులైన ఈ స్త్రీ పురుషులను మీకు బానిసలను చేసికోగోరుచున్నారు. ఇందునుబట్టి మీరు మాత్రము ప్రభువునకు ద్రోహముగా పాపము కట్టుకొనక యున్నారా?

11. కనుక ఇప్పుడు నా మాటవినుడు. సోదరప్రజలనుండి మీరు తీసికొని వచ్చిన ఈ బందీలను విడచి పెట్టుడు. ప్రభువునకు మీపై ఆగ్రహము కలిగినది” అని పలికెను.

12. అప్పుడు ఎఫ్రాయీము నాయకులు కొందరు యుద్ధము ముగించుకొని వచ్చిన సైన్యమునకు ఎదురుగా నిలబడిమాట్లాడిరి. వారు యోహానాను కుమారుడు అజర్యా, మెషిల్లెమోతు కుమారుడైన బెరెక్యా. షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హడ్లాయి కుమారుడైన అమాసా.

13. వారెల్లరును “మీరు ఈ బందీలను ఇచటకు తీసికొనిరాగూడదు. మనము ఇదివరకే ప్రభువునకు కోపము రప్పించితిమి. ఇప్పుడు ఈ కార్యముద్వారా ఇంకను అధికముగా పాపము మూటకట్టుకోనేల? మనమిదివరకే ఘోరమైన పాపములు చేసితిమికదా? ప్రభువు యిస్రాయేలీయులపై నిప్పులు క్రక్కుచున్నాడు” అని పలికిరి.

14. ఆ మాటలు విని సైనికులు తాము కొనివచ్చిన కొల్లసొమ్మును బందీలను యిస్రాయేలు ప్రజలకును, వారి నాయకులకును అప్పగించిరి.

15. అప్పుడు బందీలను పరామర్శించుటకు నియమింపబడిన నాయకులు వారికి పరిచర్యచేసిరి. కొల్లసొమ్మునుండి బట్టలు లేనివారికి బట్టలిచ్చిరి. ఇంకను ఆ నాయకులు వారికి దుస్తులును, చెప్పులును అన్నపానీయములును చేకూర్చిరి. వారి శిరములమీద నూనెపోసిరి. నడువలేనివారిని గాడిదలపై ఎక్కించిరి. బందీలనందరిని యూదయా లోని ఖర్జూరవృక్షముల నగరమైన యెరికోకు, వారి సహోదరులయొద్దకు కొనిపోయి అచట వదలిపెట్టిరి. అటుపిమ్మట యిస్రాయేలీయులు సమరియాకు తిరిగివచ్చిరి.

16. ఆహాసు తనకు సాయము చేయుమని అస్సిరియా రాజునకు కబురుపంపెను. ఏలన,

17. ఎదోమీయులు మరల యూదామీదికి దాడిచేసి చాల మందిని బందీలనుగా పట్టుకొనిపోయిరి.

18. ఫిలిస్తీయులు కూడ షెఫేలా ప్రదేశములోని పట్టణములను యూదా దేశమునకు దక్షిణ దిక్కునున్న నగరములను ఆక్రమించుకొనిరి. వారు బేత్-షేమేషు, అయ్యాలోను, గెదెరోతు పట్టణములను మరియు సొకో, తిమ్నా, గింసోను నగరములను వాని పరిసర గ్రామములను వశముచేసికొని ఆనగరములలోనే స్థిరపడిరి.

19. ఆహాసు యూదీయుల హక్కులను మన్నింపక నిరంకుశముగా పరిపాలించెను. ప్రభువును లక్ష్యపెట్టలేదు. కనుక ప్రభువు యూదాకు తిప్పలు తెచ్చెను.

20. అస్సిరియా రాజు తిగ్లత్-పీలేసరు ఆహాసునకు సాయము చేయుటకు బదులుగా అతనిని బాధించి ముప్పుతిప్పలు పెట్టెను.

21. కనుక ఆహాసు దేవాలయము నుండియు, ప్రాసాదమునుండియు, ప్రజా నాయకుల గృహముల నుండియు బంగారమును గైకొని అస్సిరియా రాజునకర్పించెను. అయినను ఆ రాజు అతనికి ఎట్టి సాయమును చేయలేదు.

22. ఇట్టి విపత్తులలోనున్నపుడు ఈ ఆహాసు ప్రభుని ఆజ్ఞలను మరి ఎక్కువగా జవదాటెను.

23. అతడు తనను ఓడించిన సిరియనుల దేవతలకు బలులర్పించెను “సిరియా దేవతలు ఆ దేశపు రాజులకు సాయపడిరి గదా! నేనును ఆ దేవతలను కొలిచినచో వారు నాకు కూడ తోడ్పడుదురు” అని అతడు భావించెను. కాని ఆ దేవతలే అతని వినాశమునకును అతని ప్రజల పతనమునకును కారకులైరి.

24. ఆహాసు ప్రభుని దేవాలయ వస్తుసామాగ్రిని ముక్కలు చేసి నాశనము చేసెను. దేవాలయపు తలుపులు మూయించెను. యెరూషలేమున మూల మూలలందు బలిపీఠములు నిర్మించెను.

25. యూదా లోని ప్రతినగరమున అన్యదేవతల ఆరాధనకుగాను మందిరములు నెలకొల్పి వానిలో సాంబ్రాణి పొగ వేయించెను. కనుక అతని పితరుల దేవుడైన ప్రభువు అతనిమీద ఆగ్రహము చెందెను.

26. ఆహాసు చేసిన ఇతర కార్యములు, అతడు అనుసరించిన పద్ధతులన్నియు మొదటినుండి తుది వరకు యూదా యిస్రాయేలు రాజుల చరితమున లభింపబడియేయున్నవి.

27. అంతట ఆహాసు తన పితరులతో నిద్రింపగా యెరూషలేముననే పాతిపెట్టిరి, గాని రాజసమాధులలో మాత్రముకాదు. అటు తరువాత అతని పుత్రుడు హిజ్కియా రాజయ్యెను.

 1. హిజ్కియా తన ఇరువది ఐదవయేట రాజై యిరువదితొమ్మిది యేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలించెను. అతని తల్లి జెకర్యా కుమార్తెయైన అబీయా.

2. అతడు తన పితరుడైన దావీదువలె ప్రభువునకు ఇష్టమైన కార్యములు చేసెను.

3. హిజ్కియా తన యేలుబడి మొదటి యేడు మొదటి నెలలో ప్రభువు మందిర ద్వారములు తెరపించి వానిని మరమ్మతు చేయించెను.

4-5. యాజకులను, లేవీయులను దేవాలయము తూర్పు ప్రాంగణమున సమావేశపరచి వారితో ఇట్లు చెప్పెను: “లేవీయులారా! మీరు శుద్ధిచేసికొని మన పితరుల దేవుడైన ప్రభువు మందిరమును పవిత్రపరుపుడు. దేవళమును అమంగళముచేయు అపవిత్ర వస్తువులనెల్ల ఎత్తి బయట పడవేయుడు.

6. మన పూర్వులు ప్రభువుపట్ల విశ్వాసము చూపక అతడు ఒల్లని పనులుచేసిరి. అతనిని పరిత్యజించిరి. అతడు వసించు మందిరమును విడనాడిరి.

7. వారు ముఖమంటపమును గూడ మూసివేసిరి. యిస్రాయేలు దేవుడైన ప్రభువు పరిశుద్ధ మందిరమున దీపమును వెలిగింపరైరి. సాంబ్రాణి పొగవేయరైరి. దహనబలులు అర్పింపరైరి.

8. కనుక ప్రభువు కోపము యూదా మీదను, యెరూషలేము మీదను రగుల్కొనెను. అతడు ఈ ప్రజలను శిక్షించిన తీరు ఎల్లరికిని భయమును, ఆశ్చర్యమును కలి గించెను. ఈ ప్రజను ఎల్లరును అపహసించిరి. ఈ సంగతి మీకును తెలియును.

9. ప్రభువు ఆగ్రహము వలన మన పితరులు యుద్ధమున కత్తికి ఎరయైరి. శత్రువులు మన పత్నులను పిల్లలను చెరగొనిపోయిరి.

10. నేనిపుడు యిస్రాయేలు దేవుడైన ప్రభువుతో నిబంధనము చేయగోరుచున్నాను. అప్పుడు గాని అతని ప్రచండకోపము మన నుండి వైదొలగదు.

11. కుమారులారా! ఇకమీదట మీరు అశ్రద్ధచేయకుడు. ప్రభువు సాన్నిధ్యమున నిలిచి సాంబ్రాణిపొగ వేయుటకును, పరిచర్యలు నిర్వర్తించుటకును ఆయన మిమ్మే ఎన్నుకొనెనుగదా!”

12-14. అప్పుడు ఈ క్రింది లేవీయులు దేవాలయమును శుద్ధిచేయుటకు పూనుకొనిరి: కోహాతు వంశమునుండి అమాసయి కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారి వంశము నుండి అబ్ది కుమారుడైన కీషు, యెహాల్లేలు కుమారుడైన అజర్యా, గెర్షోను వంశమునుండి సిమ్నా కుమారుడైన యోవా, యోవా కుమారుడైన ఏదేను. ఏలీషాఫాను వంశమునుండి షిమ్రీ, యెవూవేలు. ఆసాపు వంశమునుండి జెకర్యా, మత్తన్యా. హెమాను వంశమునుండి యెహూవేలు, షిమీ. యెదూతూను వంశము నుండి షేమయా, ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి.

15. వీరెల్లరును తోడి లేవీయులనుకూడ కలుపుకొని శుద్ధిచేసికొనిరి. యావే దేవుని మాటచొప్పున రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవాలయ శుద్ధికి పూనుకొనిరి.

16. యాజకులు దేవాలయమును శుద్ధిచేయుటకుగాను లోనికి వెళ్ళిరి. వారు అపవిత్రములైన వస్తువులనెల్ల దేవాలయము నుండి వెలుపలి ఆవరణములోనికి కొనివచ్చిరి. లేవీయులు వానిని కొనిపోయి పట్టణము వెలుపలి కీద్రోను లోయలో పడవేసిరి.

17. మొదటి నెల మొదటినాడు ఈ శుద్దీకరణము ప్రారంభమయ్యెను. ఎనిమిదవ దినమునకు దేవాలయమును, ముఖమంటపమునుగూడ శుద్ధిచేసి ముగించిరి. వారు ఇంకను ఎనిమిదిదినములు పని చేసి మొదటినెల పదునారవదినమున దేవాలయమును ప్రతిష్టించిరి.

18. అంతట వారు హిజ్కియాను సందర్శించి “మేము దేవాలయమునంతటిని శుద్ధిచేసితిమి. దహన బలులర్పించు బలిపీఠమును, సాన్నిధ్యపు రొట్టెల నుంచు బల్లనుగూడ వానివాని ఉపకరణములతో పాటు శుద్ధిచేసితిమి.

19. ఆహాసురాజు ప్రభువు ఆజ్ఞలను ధిక్కరించి పరిపాలనము నెరపిన కాలమున దేవాలయము నుండి తొలగించిన ఉపకరణములను కూడ శుద్ధిచేసి, మరల దేవాలయమున చేర్చితిమి. ఆ ఉపకరణములన్నియు ఇప్పుడు ప్రభువు బలిపీఠము ఎదుటనున్నవి” అని విన్నవించిరి.

20. హిజ్కియా వెంటనే పురప్రముఖులను పిలిపించెను. ఎల్లరును కలిసి దేవాలయములోనికి పోయిరి.

21. వారు రాజ్యము కొరకును, దేవాలయ పవిత్రతకొరకును, యూదా ప్రజలకొరకును పాప పరిహారబలినర్పించుటకై కోడెలను, పొట్టేళ్ళను, గొఱ్ఱె పిల్లలను, మేకపోతులను ఏడేసి చొప్పున కొని వచ్చిరి. అహరోను వంశజులైన యాజకులను రాజు పిలిచి బలిపీఠముమీద బలియర్పింపుడని చెప్పెను.

22. వారు కోడెలను, పొట్టేళ్ళను, గొఱ్ఱె పిల్లలను వరుసగా వధించి వాని నెత్తుటిని పీఠముపై చిలు కరించిరి.

23. అటుపిమ్మట మేకపోతులను రాజు ఎదుటికిని, ప్రజలఎదుటికిని కొనిరాగా ఎల్లరును వానిపై చేతులు చాచిరి.

24. యాజకులు ఆ పోతులను వధించి వానినెత్తుటిని బలిపీఠముమీద చిలకరించిరి. యిస్రాయేలు ప్రజలెల్లరి పాపములను తొలగించుటకు వానిని పావవరిహారబలిగా సమర్పించిరి. ప్రజలెల్లరి తరఫున దహనబలులను, పరిహారబలులను అర్పింపవలెనని రాజు యాజకులను ఆదేశించియుండెను.

25. గాదు, నాతాను ప్రవక్తలద్వారా పూర్వము ప్రభువు దావీదునకిచ్చిన ఆజ్ఞలననుసరించి లేవీయులు సితారా, స్వరమండలము, చిటితాళములతో దేవాలయమున సేవచేయవలెనని హిజ్కియా కట్టడ చేసెను.

26. కనుక లేవీయులు దావీదువాడిన వాద్యములవంటి వాద్యములను చేపట్టి దేవాలయమున నిలిచిరి. యాజకులు బూరలను చేపట్టిరి.

27. అంతట హిజ్కియా దహనబలిని అర్పింపుడని ఆజ్ఞాపించెను. ఆ బలి ప్రారంభము కాగానే ప్రజలు ప్రభుని కీర్తించుచు గానముచేసిరి. బూరలు మ్రోగెను. సంగీత కారులు దావీదువాడిన వాద్యములవంటి వాద్యములు వాయించిరి.

28. ప్రజలెల్లరును ప్రభువును ఆరాధించిరి. దహనబలి ముగియువరకును గానము, బూరలమ్రోత కొనసాగెను.

29. బలి అంతమున రాజును, ప్రజలును తలవంచి ప్రభువును ఆరాధించిరి.

30. దావీదు మరియు ఆసాపు ప్రవక్త రచించిన స్తుతిగీతములను పాడుడని రాజైన హిజ్కియాయు, ప్రజానాయకులును లేవీయులను కోరిరి. ఎల్లరు కలిసి ఆనందముతో ఆ గీతములుపాడిరి. సాగిలపడి దేవుని వందించిరి.

31. అప్పుడు హిజ్కియా ప్రజలతో “మీరిప్పుడు శుద్ధిని పొందితిరి. ఇక కృతజ్ఞతాసూచకముగా ప్రభువునకు మీ బలులర్పింపుడు” అని చెప్పెను. వారు అట్లే చేసిరి. కొందరు దహనబలులు అర్పించుటకు వారియంతట వారే పశువులనుగూడ కొనివచ్చిరి.

32. అటుల వారు కొనివచ్చిన పశువులు డెబ్బది కోడెలు, వంద పొట్టేళ్ళు, రెండువందల గొఱ్ఱెపిల్లలు.

33. ఇంకను వారు ఆరువందల కోడెలను మూడువేల పొట్టేళ్ళను ప్రతిష్టార్పణములుగా అర్పించిరి.

34. ఆ పశువులన్నిటిని వధించుటకు చాలినంతమంది యాజకులు దొరకరైరి. కనుక లేవీయులుకూడ ఆ పనిలో తోడ్పడిరి. అంతలో ఎక్కువమంది యాజకులు శుద్ధినిపొంది వచ్చిరి. యాజకులకంటె లేవీయులు శుద్ధినియమములను యదార్ధహృదయులై పాటించిరి.

35. యాజకులు దహనబలులు అర్పించుట మాత్రమే కాక సమాధానబలిగా అర్పించిన పశువుల క్రొవ్వు గూడ వేల్చిరి. దహనబలులతోపాటు అర్పింపబడిన ద్రాక్షసారాయమును బలిపీఠమునెదుట ధారగాపోసిరి. ఈ రీతిగా దేవాలయమున ఆరాధనము పునఃప్రారంభమయ్యెను.

36. ప్రభువు కృపవలన ఇంత త్వరగా కార్యములెల్లను ముగిసినవిగదాయని రాజును, ప్రజలును ఆనందభరితులైరి.

 1-3. ప్రజలు పాస్క ఉత్సవమును మొదటి నెలలో జరపుకోజాలరైరి. శుద్ధిచేసికొనిన యాజకులు చాలినంతమంది లేరైరి. ప్రజలు ఎక్కువమంది యెరూషలేమున ప్రోగుగారైరి. కావున హిజ్కియా, అతని ఉద్యోగులు, యెరూషలేము పౌరులు ఉత్సవమును రెండవనెలలో జరుపుకొందమనుకొనిరి. యిస్రాయేలు, యూదాపౌరులకు ఆ సంగతిని తెలియజేయుచు రాజు వార్తపంపెను. పైపెచ్చు అతడు ఎఫ్రాయీము, మనష్షే తెగలకుకూడ లేఖలు వ్రాయించెను. వారు యెరూషలేము దేవాలయమునకు వచ్చి పాస్కఉత్సవమున పాల్గొని తమ పితరుల దేవుడైన ప్రభువును కీర్తింపవలయునని కోరెను.

4. రాజు, ప్రజలు గూడ తమ ప్రణాళికను గూర్చి సంతృప్తి చెందిరి. అప్పటికి పాస్కఉత్సవమును గూర్చిన విధులను ఎల్లరును పాటించుటలేదు.

5. కనుక ప్రజలెల్లరు యెరూషలేము దేవాలయమునకు వచ్చి ఉత్సవమున పాల్గొని ప్రభును కీర్తింపవలయునని బేర్షెబా నుండి దానువరకు గల యిస్రాయేలు ప్రాంతములంతట యెరూషలేముననున్న ప్రభువు చెంతకువచ్చి తప్పక పాస్కాను ఆచరింపవలెను అని చాటింపు వేయింతమనుకొనిరి.

6. వార్తావహులు రాజునుండి అతని ఉద్యోగులనుండి తాకీదులు తీసికొని యూదా, యిస్రాయేలు రాజ్యములలోని అన్ని ప్రాంతములకు వెళ్ళిరి. వారు రాజు పేరుమీదుగా ఇట్లు చెప్పిరి. “యిస్రాయేలీయులారా! ఇప్పుడు మీరెల్లరు అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడైన ప్రభువు వైపు తిరుగుడి. అప్పుడు ఆయన మీలో అస్సిరియా రాజుల చేతిలోనుండి తప్పించుకొని మిగిలినవారి వైపు తిరుగును.

7. మీ పితరులును మీతోడి యిస్రాయేలీయులును తమ దేవుడైన ప్రభువును లక్ష్యము చేయరైరి. ప్రభువు వారిని దారుణముగా శిక్షించెనని మీరెరుగుదురు. మీరు వారివలె ప్రవర్తింపరాదు.

8. వారివలె మీరు గుండె రాయిచేసికొనకుడు. ప్రభువునకు విధేయులు కండు. మీరెల్లరును ప్రభువు శాశ్వతముగా పవిత్రము కావించిన యెరూషలేము దేవాలయమునకు వచ్చి ఆయనను సేవింపుడు. అప్పుడు ఆయన మీ మీది ప్రచండకోపమును ఉపసంహరించుకొనును.

9. మీరు ప్రభువుచెంతకు వత్తురేనిమీ తోడి యిస్రాయేలీయులను బందీలనుగా కొనిపోయిన పాలకులు వారిమీద జాలి గొని వారిని స్వదేశమునకు పంపుదురు. మీ దేవుడైన ప్రభువు దయాసముద్రుడు. మీరు అతనిచెంతకు వత్తురేని అతడు మిమ్ము అంగీకరించి తీరును.”

10. వార్తావహులు ఎఫ్రాయీము, మనష్షే, సెబూలూను మండలములలోని ప్రతి నగరమునకు వెళ్ళిరి. ప్రజలు వారిని చూచి నవ్విరి. వారిని గేలి చేసిరి.

11. అయినను ఆషేరు, మనష్షే, సెబూలూను తెగలనుండి కొందరు మాత్రము వినయముతో యెరూషలేమునకు వచ్చుటకు అంగీకరించిరి.

12. ప్రభువు యూదీయుల హృదయములను గూడ ఐక్యము చేసి వారు రాజాజ్ఞలను, అతని ఉద్యోగుల ఆదేశములను పాటించునట్లు చేసెను.

13. పొంగనిరొట్టెల పండుగను చేసికొనుటకు గాను రెండవనెలలో చాలమంది ప్రజలు యెరూషలేమున ప్రోగైరి.

14. వారు బలులు అర్పించుటకు సాంబ్రాణిపొగ వేయుటకు పూర్వము యెరూషలేమున నిర్మింపబడిన బలిపీఠములు, ధూపపీఠములు అన్నింటిని తొలగించి కీడ్రోను లోయలో పడవేసిరి.

15. రెండవ నెల పదునాలుగవ దినమున పాస్క బలికొరకు గొఱ్ఱెపిల్లలను వధించిరి. అప్పటివరకు శుద్ధి పొందని యాజకులు, లేవీయులు సిగ్గుపడి శుద్ధి చేసికొనిరి. కనుక వారు దేవాలయమున దహనబలులు అర్పించుటకు యోగ్యులైరి.

16. దైవ భక్తుడు మోషే ఆదేశించినట్లే వారెల్లరును దేవాలయమున తమతమ స్థానములందు నిలిచిరి. లేవీయులు బలిపశువుల రక్తమును అందీయగా యాజకులు దానిని పీఠముపై చిలుకరించిరి.

17. ప్రజలలో చాలమంది శుద్ధిని పొందలేదు. కనుక వారు పాస్క గొఱ్ఱెపిల్లలను వధింప జాలరైరి. కనుక వారికి బదులుగా లేవీయులే వానిని వధించి ప్రభువునకు అర్పించిరి.

18. పై పెచ్చు ఎఫ్రాయీము, మనష్షే, యిస్సాఖారు, సెబూలూను తెగలనుండి వచ్చిన వారిలో చాలమంది శుద్ధిచేసి కోలేదు. కనుక వారు నియమములను పాటింపకుండనే పాసువిందును భుజించిరి. అందుచేత హిజ్కియా వారి తరఫున దేవుని ప్రార్థించెను.

19. “పవిత్ర స్థలము యొక్క శుద్ధీకరణము చొప్పున తనను పవిత్రపరచకొనకయే తన పితరులదేవుడైన యావేను ఆశ్రయింప హృదయాభిలాషగల ప్రతివారినిమిత్తము దయగల ప్రభువు ప్రాయశ్చిత్తము చేయునుగాక” అని ప్రార్ధించెను.

20. ప్రభువు రాజు మొర ఆలించి ఆ ప్రజలను శిక్షింపడయ్యెను.

21. ప్రజలు ఏడుదినములపాటు అమితానందముతో యెరూషలేమున పొంగని రొట్టెల పండుగ చేసికొనిరి. లేవీయులు, యాజకులు తమ శక్తికొలది ప్రతిదినము దేవుని స్తుతించిరి.

22. లేవీయులు ఆరాధన నిర్వహణలో చూపిన నైపుణ్యమునకుగాను హిజ్కియా వారితో ఉల్లాసముగా మాట్లాడెను. వారు ఏడుదినములపాటు తమ పితరుల దేవుడైన ప్రభువును స్తుతించుచు బలులర్పించిరి. నైవేద్యములను భుజించిరి.

23. అటుపిమ్మట ఎల్లరును మరి ఏడుదినములు ఉత్సవము చేసికొనుటకు అంగీకరించిరి. తాము అంగీకరించినట్లే ఆనందముతో పండుగను కొనసాగించిరి.

24. హిజ్కియా ప్రజలు భుజించుటకు గాను వేయికోడెలను, ఏడువేల గొఱ్ఱెలను కానుకగా ఇచ్చెను. రాజోద్యోగులుకూడ వేయికోడెలను, పదివేల గొఱ్ఱెలనిచ్చిరి. చాలమంది యాజకులు శుద్ధిని పొందిరి.

25. అపుడు యాజకులును, లేవీయులును, యూదానుండియు, యిస్రాయేలునుండియు వచ్చిన వారును, యిస్రాయేలు దేశమునుండి వచ్చిన అన్యు లును మరియు యూదాలో నివసించుచున్న అన్యులును మిగుల సంతసించిరి.

26. యెరూషలేము నగరమున ఆనందము మిన్నుముట్టెను. దావీదు కుమారుడైన సొలోమోను ఏలుబడి తరువాత ఆ పట్టణమున ఈ విధమున ఉత్సవము ఎన్నడును జరుగలేదు.

27. కడన లేవీయులైన యాజకులులేచి ప్రజలను దీవించిరి. వారి ప్రార్ధన ఆకాశముననున్న పవిత్ర నివాసమును చేరెను.

 1. ఉత్సవము ముగిసినపిదప ప్రజలు యూదా లోని ప్రతిపట్టణమునకు వెళ్ళి విగ్రహములను, అషేరా స్తంభములను, ఉన్నత స్థలములలోని బలిపీఠములను నిర్మూలించిరి. వారు యూదా దేశమందంతటను మరియు ఎఫ్రాయీము బెన్యామీను మనష్షే మండలములలోను ఆ రీతినే చేసిరి. తరువాత యిస్రాయేలీయులందరు తమ తమ నగరములకు నివాసములకు తిరిగి చేరుకొనిరి.

2. హిజ్కియా ఎవ్వరి పరిచర్య వారు చేయునట్లుగా యాజకుల వరుసక్రమమును, లేవీయులను వారి వారి వరుసలనుబట్టి నియమించెను. దహనబలులును, సమాధానబలులును అర్పించుటకును, పరిచర్యచేయుటకును, దేవాలయమున స్తుతులు చెల్లించుటకును, ప్రభువు శిబిరద్వారముల వద్ద స్తుతులు చేయుటకును యాజకులను, లేవీయులను నియమించెను.

3. ప్రతిదినము ఉదయ సాయంకాలములందు అర్పించు దహనబలులకును, విశ్రాంతిదినములందు, అమావాస్యలందు అర్పించు బలులకును, నియమిత పండుగలందు సమర్పించు బలులకు కావలసిన పశువులను రాజు తన సొంత మందలనుండియే ఇచ్చుటకు ఏర్పరచెను.

4. ఇంకను యాజకులకును, లేవీయులకును ముట్టవలసిన అర్పణలను యెరూషలేము పౌరులు కొనిరావలయుననియు, ఆ అర్పణలవలన వారు తమ అక్కరలను తీర్చుకొని తమ కాలము నంతటిని ధర్మశాస్త్రము ఆదేశించు పరిచర్యలందు వినియోగింతురనియు రాజు హెచ్చరిక చేసెను.

5. ఆ హెచ్చరిక చెవినిబడిన వెంటనే ప్రజలు తమ ప్రథమఫలములైన ధాన్యమును, ద్రాక్షసారాయమును, ఓలివునూనెను, తేనె, పొలములో పండిన ఇతర వస్తువులును కొనివచ్చిరి. వారికి పండిన పంటమీద పదియవవంతు పన్నునుగూడ తీసికొని వచ్చిరి.

6. యూదా నగరములలో వసించు యూదీయులును, యిప్రాయేలీయులు తమ పశువులలో పదియవ వంతును తీసికొనివచ్చిరి. మరియు వారు చాల వస్తువులనుగూడ కానుకలుగా కొనివచ్చి ప్రభువునకు అర్పించిరి.

7. మూడవ నెలనుండి కానుకలను అర్పింపమొదలిడిరి. ఏడవ నెలవరకు వానిని సేకరించి కుప్పలుగా పేర్చిరి.

8. రాజు అతని ఉద్యోగులు ఆ కుప్పలను చూడవచ్చినపుడు ప్రభువును ప్రజలను కూడ కొనియాడిరి.

9. రాజు యాజకులతోను, లేవీయులతోను కానుకల ప్రోగులగూర్చి సంభాషించెను.

10. అప్పుడు సాదోకు వంశజుడును, ప్రధాన యాజకుడునైన అజర్యా, రాజుతో “ఈ ప్రజలు దేవాలయమునకు కానుకలు కొనివచ్చుట మొదలిడినప్పటినుండియు మేము సమృద్ధిగా భుజించినను ఇంకను చాల మిగులచున్నవి. ప్రభువు ఈ ప్రజను దీవించెను గనుక ఈ వస్తువులన్నియు ప్రోగైనవి” అని చెప్పెను.

11. రాజు ఆజ్ఞపై దేవాలయము చెంత వస్తు సంభారములు నిల్వజేయుకొట్లు సిద్ధముచేసిరి.

12. కానుకలను, అర్పణములను, పన్నులుగా వచ్చిన వివిధ వస్తువులను వానిలో భద్రపరచిరి. లేవీయుడైన కొనన్యాను ఆ వస్తు సముదాయమునకు అధిపతిని చేసిరి. అతని సోదరుడు షిమీ అతని క్రింది అధికారి.

13. రాజు మరియు ప్రధానయాజకుడైన అజర్యా ఆజ్ఞపై పదిమంది లేవీయులుగూడ వారిరువురికి సహాయులుగా నుండిరి. వారు యెహీయేలు, అసస్యా, నహతు, అసావేలు, యెరీమోతు, యోసాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా, మహతు, బెనాయా అనువారు.

14. దేవాలయ తూర్పుద్వారమునకు అధిపతి ఇమ్నా కుమారుడును లేవీయుడైన కోరె ప్రజలు తమంతట తాము కొనివచ్చిన కానుకలను స్వీకరించెడివాడు. అతడే ఆ కానుకలను, పరిశుద్ధ వస్తువులను ప్రజలకు పంచి యిచ్చెడివాడు కూడ.

15. యాజకులు వసించు ఇతర నగరములలో కోరెకు సహాయులుగానున్న ఏదెను, మిన్యామీను, యేషువ, షెమయా, అమర్యా, షెకన్యా అనువారు నమ్మకస్తులైయుండి యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతుల చొప్పున భాగములిచ్చుటకు నియమింపబడిరి. వారు లేవీయుల వర్గములననుసరించి గాక వారి వారి పనులనుబట్టి వారికి ఆహారపదార్ధములను పంచిపెట్టెడివారు.

16. తెగలలో మూడు యేండ్లు లేక అంతకు పైబడిన వయస్సు కలిగి జనసంఖ్య సరిచూడబడి ప్రతిదినమును దేవాలయమున తమకు నియమింపబడిన సేవలుచేయు పురుషులందరికి వారు ఆహార పదార్థములు పంచియిచ్చిరి.

17. యాజకులకు వారివారి వంశముల ప్రకారము పనులను ఒప్పగించిరి. ఇరువది యేండ్లు లేక అంతకు పైబడిన వయస్సు గల లేవీయ యాజకులకు వారి వారి పితరుల కుటుంబముల ప్రకారము పనులు ఒప్పగించిరి.

18. ఈ లేవీయులను వారివారి భార్యలు, పిల్లలు, బంధువులతో పాటు లెక్కించిరి. వారెల్లరును పవిత్ర నైవేద్యములను భుజించువారు కనుక ఎల్లపుడును శుద్ధినిపొంది ఉండవలయును.

19. అహరోను అనుయాయులకు ఈయబడిన నగరములలో కాని ఆ నగరములకు చెందిన పొలములలో కాని వసించు యాజకులకు కొందరు పెద్దలుండిరి. వారు యాజకుల కుటుంబములలోని మగవారికందరికిని, లేవీయుల వంశములబట్టి సరిచూడబడిన వారికిని ఆహారపదార్ధములు పంచియిచ్చిరి.

20. ఈ రీతిగా హిజ్కియా యూదా దేశమంతట ప్రభువు మెచ్చుకొను సత్కార్యములు చేసెను.

21. ధర్మశాస్త్రమును పాటించుటలోగాని, దేవాలయ సేవలో కాని అతడు చేసిన కార్యములెల్ల హృదయపూర్వకముగానే చేసెను. కనుకనే అతడు విజయము పొందెను.

 1. హిజ్కియా పైరీతిగా ప్రభువునకు విశ్వసనీయమైన సేవలు చేసిన తరువాత అస్సిరియా రాజైన సన్హెరీబు యూదా మీదికి దండెత్తివచ్చెను. అతడు యూదాలోని ప్రాకారములు గల రక్షితపట్టణములను ముట్టడించి వానిని శీఘ్రగతిని వశము చేసికోవలెనని తమ సైనికులకు ఆజ్ఞ ఇచ్చెను.

2. ఆ రాజు యెరూషలేమునుగూడ వశము చేసికోగోరెనని హిజ్కియా గ్రహించెను.

3. కనుక అతడును, అతని ఉద్యోగులును, వీరులును యెరూషలేమునకు వెలుపల నున్న చెలమనుండి పారెడు నీటిని ఆపివేయవలెనని సంకల్పించుకొనిరి. అస్సిరియనులు పట్టణము దగ్గరికి వచ్చినప్పుడు వారికి నీరు దొరకకూడదు అనుకొనిరి.

4. కనుక రాజోద్యోగులు చాలమంది ప్రజలను తీసి కొనిపోయి చెలమను పూడ్చి పొలముగుండ పారు నీటి కాలువను ఆపివేసిరి.

5. హిజ్కియా పట్టణములోని కోటలను బలపరచెను. ప్రాకారమును మరమ్మతు చేయించి దానిమీద బురుజులు నిర్మించెను. నగరమునకు వెలుపల గూడ ప్రాకారము నిర్మించెను. నగరమునకు తూర్పువైపున పల్లమునుపూడ్చిన తావున నిర్మింపబడిన మిల్లో దుర్గములను బలపరచెను. ఈటెలను డాళ్ళను విస్తారముగా చేయించెను.

6. అతడు పట్టణ ప్రజలందరికిని సైన్యాధిపతులను నియమించెను. ఆ జనులందరిని నగరద్వారము చెంతనున్న మైదానమున ప్రోగుచేయించి వారికి ధైర్యము కలిగించుటకు ఇట్లు చెప్పెను.

7. “మీరు ధైర్యస్టెర్యములు అలవరచుకొనుడు. అస్సిరియా రాజును అతని దండునుచూచి భయపడకుడు. దిగులు చెందకుడు. అతనికంటె మనకే ఎక్కువ బలముకలదు.

8. అతనికి మానుషబలమున్నది. కాని మనకు మన దేవుడైన ప్రభువున్నాడు. ఆ ప్రభువు మన పక్షమున యుద్ధముచేసి మనకు సాయపడును.” ఆ రాజు మాటలు విని ప్రజలు ధైర్యము తెచ్చుకొనిరి.

9. సన్హెరీబు అతని సైన్యములు లాకీషు చెంత మకాము చేయుచుండెను. అతడు అచటినుండి హిజ్కియాకును, యెరూషలేమున వసించు యూదీయులకును తన దూతలద్వారా ఈ క్రింది వార్తపంపెను:

10. "అస్సిరియా ప్రభువైన సన్హెరీబు వార్తయిది. నేను యెరూషలేమును ముట్టడింపబోవుచుండగా ఈ నగరమును విడనాడకుండుటకు మీకు ధైర్యమెట్లు కలిగి నది?

11. మీ దేవుడైన ప్రభువు మిమ్ము మా దాడి నుండి కాపాడునని హిజ్కియా మీతో చెప్పుచున్నాడు. కాని మీరు ఆకలిదప్పులకు చిక్కి చచ్చుటతథ్యము.

12. ఈ హిజ్కియా మీరు ఒక్క బలిపీఠము ఎదుటనే నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదీయులను, యెరూషలేము పౌరులను నిర్బంధించి, ఇతర ఉన్నతస్థలములలోని యావే బలిపీఠములను పడగొట్టించినవాడుకాడా?

13. మా పూర్వులును, నేనును ఇతర జాతులకు ఏమి చేసితిమో మీరెరుగరా? ఏ జాతి దేవతలైన తమ ప్రజను నా బారినుండి కాపాడగలిగిరా?

14. మా పూర్వులు నాశనము చేసిన జాతులలో ఏ జాతి దేవతలైన తమ ప్రజను నేడు నా దాడినుండి రక్షింపగలిగిరా? మరి మీ దేవుడు మాత్రము మిమ్ము నా దాడినుండి ఎట్లు కాపాడ గలుగును?

15. కనుక ఇప్పుడు హిజ్కియా ఈ రీతిగా మిమ్ము మోసపుచ్చి అపమార్గము పట్టించుచుండగా మీరు ఊరకుండరాదు. అసలు మీరతనిని నమ్మవలదు. ఏ జాతి దేవుడైనను ఏ దేశపు దేవుడైనను తన ప్రజను మా పితరుల దాడి నుండిగాని, నా దాడి నుండిగాని రక్షింపజాలడు. కనుక మీ దేవుడు కూడ మిమ్ము నా బారినుండి కాపాడజాలడు."

16. సన్హెరీబు దూతలు దేవుడైన ప్రభువునకును, ఆయన సేవకుడైన హిజ్కియాకును వ్యతిరేకముగా ఇంకా పెక్కు దుర్భాషలాడిరి.

17. అతడు ప్రభువును అవమానించుచు ఈ క్రింది లేఖ కూడ వ్రాసెను: “ఇతర దేశములలోని జాతుల దేవతలు తమ ప్రజను నా బారినుండి కాపాడ జాలరైరి. అటులనే హిజ్కియా సేవించు దేవుడుకూడా తన ప్రజను నా ముట్టడినుండి కాపాడలేడు.”

18. ఆ రాజోద్యోగులు పురప్రాకారముమీద కూర్చుండియున్న యెరూషలేము పౌరులవైపు తిరిగి గొంతెత్తి హీబ్రూ భాషలో ఈ సంగతులెల్ల చెప్పిరి. ప్రజలను కలవర పెట్టి భయపెట్టి పట్టణమును స్వాధీనము చేసి కొనవలెనని వారి పన్నాగము.

19. వారు నర మాత్రులు చేసిన విగ్రహములగు ఇతర జాతుల దేవత లను గూర్చి పలికిన దూషణలను యెరూషలేము దేవునిమీద కూడ పలికిరి.

20. ఇట్టి పరిస్థితులలో హిజ్కియా రాజును, ఆమోసు కుమారుడైన యెషయా అను ప్రవక్తయు ప్రభువును ప్రార్థించి తమకు సహాయము చేయుమని మొర పెట్టుకొనిరి.

21. అప్పుడు ప్రభువు ఒక దేవదూతను పంపగా అతడు అస్సిరియా సైన్యాధిపతులను, సైనికులను హతము చేసెను. అస్సిరియా రాజు అవమానముతో తన దేశమునకు తిరిగిపోయెను. అచట అతడు ఒకనాడు తన దేవుని మందిరములోనికి వెళ్ళగా అతని సొంత కుమారులే అతనిని కత్తితో నరికివేసిరి.

22. ఈ రీతిగా ప్రభువు హిజ్కియాను యెరూషలేము పౌరులను అస్సిరియా రాజు సన్హెరీబు  దాడినుండియు, ఇతర శత్రువుల బారినుండియు కాపాడెను. వారికెల్ల దిక్కులందు శాంతిలభించెను.

23. అప్పటినుండి ఎల్లజాతులు హిజ్కియాను గౌరవముతో చూచెను. చాలమంది యెరూషలేమునకు వచ్చి ప్రభువునకు కానుకలను, హిజ్కియాకు బహుమతులను అర్పించిరి.

24. ఈ సంఘటన జరిగిన కాలముననే హిజ్కియా తీవ్రముగా జబ్బుపడి చనిపోవు స్థితికి వచ్చెను. అతడు ప్రభువునకు మొర పెట్టగా దేవుడు అతని వేడుకోలునాలించెను. అతని వ్యాధి నయమగు ననుటకు నిదర్శనముగా ఒక గుర్తును చూపించెను.

25. కాని రాజు గర్వభావముతో ప్రభువునకు వందనములు చెల్లింపడయ్యెను. కనుక అతనితో పాటు యూదా రాజ్యము, యెరూషలేము నగరముకూడ ప్రభువు ఆగ్రహమునకు గురియయ్యెను.

26. చివరకు హిజ్కియాయు, యెరూషలేము పౌరులును దేవుని ముందట తలవంచిరి. కనుక ఆ రాజు జీవించి యున్నంతకాలము ప్రభువు ఆ ప్రజలను శిక్షింపలేదు.

27. ఆ రాజునకు విస్తార సంపదలు, గౌరవము దక్కెను. అతడు తన వెండి బంగారములను, రత్నములను, సుగంధ ద్రవ్యములను, డాళ్ళను, విలువగల ఇతర వస్తువులను భద్రపరచుటకు కొట్లను కట్టించెను.

28. తన ధాన్యమును ద్రాక్షసారాయమును ఓలివు తైలమును పదిలపరచుటకు కొట్లను కట్టించెను. తన పశువులకు కొట్టములను, గొఱ్ఱెలమందలకు దొడ్లను నిర్మించెను.

29. అతనికి పశువులమందలు, గొఱ్ఱెల మందలు సమృద్ధిగా నుండెడివి. ప్రభువు ఆ రాజునకు చాల సంపదలు దయచేసెను. కనుక అతడు నగరములు నిర్మించెను.

30. హిజ్కియా గిహోను చెలమనుండి వెలువడు నీటిపాయను ఆపుచేయించి ఈ నీటిని పడమటివైపుగా దావీదునగరమునకు మరలించెను. అతడు తాను చేపట్టిన కార్యములందెల్ల విజయము సాధించెను.

31. అతని రాజ్యమున జరిగిన ఆ అద్భుత వృద్ధిని గూర్చి విచారించుటకు బబులోనియా అధిపతులు రాయబారులను పంపినపుడుగూడ ప్రభువు అతనిని తన ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తింపనిచ్చెను. అతని శీలమును పరీక్షించుటకే దేవుడట్లు చేసెను.

32. హిజ్కియా చేసిన ఇతర కార్యములు, అతని సేవాకృత్యములు ఆమోసు కుమారుడైన యెషయా ప్రవక్త దర్శనములు అను గ్రంథమునను, యూదా యిస్రాయేలు రాజుల చరితమునను లిఖింపబడియే యున్నవి.

33. అంతట హిజ్కియా తన పితరులతో నిద్రించగా జనులు అతనిని రాజసమాధులలో పై భాగమున పాతిపెట్టిరి. ఆ రాజు చనిపోయినపుడు యూదీయులు యెరూషలేము పౌరులు అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అటుతరువాత అతని కుమారుడు మనష్షే రాజయ్యెను.

 1. మనష్షే తన పండ్రెండవయేట రాజై ఏబదియైదేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను.

2. అతడు యిస్రాయేలీయుల యెదుటినుండి ప్రభువు తరిమివేసిన అన్యజాతుల వారి జుగుప్సా కరమైన కార్యములను అనుకరించెను. ప్రభువునకు ఇష్టముకాని దుష్కార్యములెల్లను చేసెను.

3. తన తండ్రి నిర్మూలించిన ఉన్నత స్థలములమీద బలిపీఠములను పునర్నిర్మాణము చేసెను. బాలుదేవతకు బలిపీఠములు కట్టించెను. అషీరా దేవతకు స్తంభములు నాటించెను. నక్షత్రములను పూజించి సేవించెను.

4. ప్రభువు తన నామమును శాశ్వతముగా ఆరాధించుటకుగాను ఎన్నుకొనిన దేవాలయమున అన్యదైవతములకు బలిపీఠములు నిర్మించెను.

5. దేవాలయపు రెండు ప్రాంగణములందు నక్షత్రములను పూజించుటకు బలిపీఠములు కట్టించెను.

6. బెన్-హిన్నోము లోయలో తన కుమారులను దహనబలిగా సమర్పించెను. అతడు సోదె చెప్పించుకొనెను. మాంత్రికులను సంప్రదించెను. జ్యోతిష్కులను, మృతుల ఆత్మలను ఆవాహనము చేయువారిని ప్రోత్సహించెను. ప్రభువునకు ఇష్టము కాని పనులింక అనేకములు చేసి ఆయన కోపమును రెచ్చగొట్టెను. -

7-8. “నా నామము సదా ఉండునట్లు యిస్రాయేలు తెగలన్నిటిలో ఈ యెరూషలేము పట్టణమును, ఈ దేవాలయమును నేను ఎన్నుకొంటిని. నేను నా భక్తుడైన మోషేద్వారా ప్రసాదించిన ధర్మశాస్త్రము నంతటిని, దాని ఆజ్ఞలన్నిటిని, యిస్రాయేలీయులు పాటింతురేని నేను వారి పితరులకిచ్చిన ఈ నేల మీదినుండి వారిని వెడలగొట్టను” అని ప్రభువు దావీదు సొలోమోను రాజులతో నుడివెనుగదా! అట్టి దేవాలయముననే మనష్షే విగ్రహమును నెలకొల్పెను .

9. అతడు యూదీయులను, యెరూషలేము పౌరులను పెడత్రోవపట్టింపగా, వారు ప్రభువు కనాను మండలమునుండి వెడలగొట్టిన అన్యజాతుల ప్రజలకంటెను ఎక్కువగా దుష్కార్యములు చేసిరి.

10. ప్రభువు ఆ రాజును అతని ప్రజలను హెచ్చరించెను గాని వారు ఆయన మాటవినలేదు.

11. కనుక ప్రభువు అస్పిరియా సైన్యాధిపతులను యూదా మీదికి దాడిచేయించెను. వారు మనష్షేను బంధించి అతని శరీరములో కొక్కెములు గ్రుచ్చిరి. అతనిని గొలుసులతో కట్టి బబులోనియాకు చెరగొని పోయిరి.

12. అతడు తన బాధలలో ప్రభువును శరణువేడెను. తన పితరుల దేవుడైన ప్రభువు ముందు వినయమును ప్రదర్శించెను.

13. అతడు ప్రభువునకు మొర పెట్టగా ప్రభువు మనసుకరిగి అతనిని మరల యెరూషలేమునకు కొనివచ్చి రాజుగా కొనసాగ నిచ్చెను. అప్పుడుగాని అతడు ప్రభువే దేవుడని అర్ధము చేసికోలేదు.

14. అటుతరువాత రాజు ఊహోనునకు పడమటివైపున వున్న దావీదు నగరమువెలుపలి ప్రాకా రము ఎత్తును పొడిగించెను. లోయలోని గీహోను చెలమ దగ్గరినుండి ఉత్తరమున మత్స్యద్వారము వరకును, ఓఫేలు చుట్టునుకూడ ప్రాకారము ఎత్తును పెంచెను. అతడు యూదాలోని ప్రతి సురక్షిత పట్టణము లోను ఒక సైన్యాధిపతినిగూడ ఉంచెను.

15. దేవాలయ ములో నుండి అన్యదైవములను, పూర్వము తాను అచట నెలకొల్పిన విగ్రహములను తొలగించెను. దేవాలయమున్న కొండమీద, యెరూషలేము నగర మున తానునిర్మించిన బలిపీఠములను నిర్మూలించెను. వానినన్నిటిని నగరము వెలుపలకు త్రోయించెను.

16. ప్రభువు బలిపీఠమును పునర్నిర్మాణము చేయించి దానిమీద సమాధానబలులు, కృతజ్ఞతాబలులు అర్పించెను. యూదీయులెల్లరును యిస్రాయేలు దేవుడైన ప్రభువును ఆరాధింపవలెనని ఆజ్ఞ యిచ్చెను.

17. ప్రజలు ఉన్నత స్థలములమీద బలిపీఠములయెద్ద బలులర్పించుట కొనసాగించినను వానిని ప్రభువునకే అర్పించిరి.

18. మనష్షే చేసిన ఇతర కార్యములు, అతడు ప్రభువునకు చేసిన ప్రార్థనలు, ప్రవక్తలు యిస్రాయేలు దేవుడైన ప్రభువు పేరిట అతనికి విన్పించిన సందేశము లన్నియు యిస్రాయేలు రాజుల చరితమున లిఖింప బడియే ఉన్నవి.

19. అతని ప్రార్ధనము, ప్రభువు అతనిని క్షమించినతీరు, మనసు మార్చుకొనకముందతడు చేసిన దుష్కార్యములు అనగా ప్రభువు ఆజ్ఞలను మీరి అతడు చేసిన పాపకార్యములు, ఉన్నత స్థలముల మీద అతడు కట్టిన బలిపీఠములు, నెలకొల్పిన విగ్రహ ములు, దేవతాస్తంభములు - మొదలైన అంశము లన్నియు ప్రవక్తలచరిత్ర గ్రంథమున లిఖింపబడియే ఉన్నవి.

20. అంతట మనష్షే తన పితరులతో నిద్రించి, తన నగరునందు పాతిపెట్టబడెను. అటు తరువాత అతని పుత్రుడు ఆమోను రాజయ్యెను.

21. ఆమోను తన ఇరువది రెండవయేట రాజై రెండేండ్లపాటు యెరూషలేమునుండి పరిపాలన చేసెను.

22. తన తండ్రి మనష్షేవలె అతడు కూడ ప్రభువునకు నచ్చని దుష్కార్యములు చేసెను. తన తండ్రి కొలిచిన విగ్రహములను అతడుకూడ కొలిచెను.

23. కాని అతడు తన తండ్రివలె దేవునియెదుట వినయము ప్రదర్శింపక ఆ తండ్రిని మించిన పాపి అయ్యెను.

24. ఆమోను ఉద్యోగులు అతనిమీద కుట్ర పన్ని ప్రాసాదముననే హత్యచేసిరి. యూదా ప్రజలు రాజహంతకులను పట్టి వధించి ఆమెను కుమారుడు యోషీయాను రాజును చేసిరి.

 1. యోషీయా యెనిమిది యేండ్ల యీడున రాజై యెరూషలేము నుండి ముప్పది ఒక్కయేండ్లు పరిపాలించెను.

2. అతడు ధర్మబద్దముగా ప్రవర్తించి ప్రభువునకు ఇష్టుడయ్యెను. తన పితరుడైన దావీదువలె ధర్మశాస్త్రనియమములను పూర్తిగా పాటించెను.

3. ఆ రాజు తన పరిపాలనాకాలము ఎనిమిదవ యేట, తానింక చిన్నవాడుగా ఉన్నప్పుడే, తన పితరుడైన దావీదు యొక్క దేవుని సేవింపమొదలిడెను. అటు పిమ్మట నాలుగేండ్ల తరువాత ఉన్నత స్థలముల మీది బలిపీఠములను తీసివేసెను. దేవతాస్తంభము లను, విగ్రహములను కూలద్రోయించెను.

4. యోషీయా పర్యవేక్షణక్రింద అతని సేవకులు బాలు బలిపీఠములను పడగొట్టిరి. వానిచెంతనేయున్న సాంబ్రాణి పొగ వేయు వేదికలనుగూడ కూలద్రోసిరి. అషేరా దేవతాస్తంభములను, బాలు విగ్రహములను పగులగొట్టి పొడి చేసి, ఆ పొడిని ఆ దేవతలకు బలులర్పించినవారి సమాధులపై చల్లిరి.

5. అన్యదేవతలను కొలిచిన పూజారుల ఎముకలను వారు బలులర్పించిన బలిపీఠముల పైనే కాల్చివేసిరి, ఈ రీతిగా అతడు యెరూషలేమునకును, యూదాకును శుద్ధి చేయించెను.

6. మనష్షే, ఎఫ్రాయీము, షిమ్యోను, దూరముననున్న నఫ్తాలి తెగలలోని నగరములందును, ఆ నగరముల చుట్టు పాడుపడియున్న మండలములందు గూడ అతడు ఆ రీతిగానే సంస్కరణలు చేయించెను.

7. ఆ తావులలోని బలిపీఠములను, అషీరాదేవత స్తంభములను పడగొట్టించెను. విగ్రహములను పగుల గొట్టించి పిండిచేయించెను. సాంబ్రాణి పొగ వేయు పీఠములను కూలద్రోయించెను. అటుపిమ్మట అతడు యెరూషలేమునకు తిరిగివచ్చెను.

8. యోషీయా దేశమును, దేవాలయమును శుద్ధి చేసిన తరువాత తన పరిపాలనాకాలము పదునెనిమిదియవయేట, ముగ్గురిని దేవాలయమును మరమ్మతు చేయుటకు పంపెను. వారు అసల్యా కుమారుడగు షాఫాను, యెరూషలేము పట్టణాధిపతియైన మాసెయా, యోవహాసు కుమారుడును, చరిత్ర లేఖకుడునైన యోవా.

9. లేవీయులు తాము దేవాలయమున వసూలుచేసిన సొమ్మును ప్రధానయాజకుడైన హిల్కీయాకు ముట్టజెప్పిరి. ఎఫ్రాయీము మనష్షే తెగలనుండియు, యిస్రాయేలు రాజ్యములోని ఇతర భాగములనుండియు, యూదా బెన్యామీను యెరూషలేముల నుండియు లేవీయులు ఆ సొమ్మును వసూలు చేసిరి.

10. ఈ ధనము ప్రధాన యాజకుని నుండి దేవాలయము మరమ్మత్తులను చూచుకొను పై ముగ్గురికి చేరెను.

11. వారు దానిని అప్పటికే యూదా రాజుల అశ్రద్ధవలన కట్టడముల దూలములు పాడైపోవుచున్నందున, దూలములను కొనుటకును, వడ్రంగులకును, తాపీ పనివారు రాళ్ళను కొనుటకును వినియోగించిరి.

12. పనివారందరు చిత్తశుద్ధితో కృషిచేసిరి. నలుగురు లేవీయులు ఆ పనివారిమీద పర్యవేక్షకులుగా ఉండిరి. వారు మెరారి వంశమునకు చెందిన యాహాతు, ఓబద్యా, కోహాతు వంశమునకు చెందిన జెకర్యా, మెషుల్లాము అనువారు. వారెల్లరును సంగీతమున నేర్పరులు.

13. ఇంకను ఇతర లేవీయులు వస్తువులను సరఫరా చేయువారిమీదను, వివిధములైన పనులు చేయువారిమీదను పర్యవేక్షకులుగా నుండిరి. కొందరు లేవీయులు లేఖకులుగాను, మరికొందరు దేవాలయ ద్వార సంరక్షకులుగాను పనిచేసిరి

14. దేవాలయమునందలి బొక్కసములో నుండి ధనము తీయునపుడు మోషేద్వారా ప్రభువు దయచేసిన ధర్మశాస్త్రము లిఖింపబడిన గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను.

15. అతడు లేఖకుడైన షాఫానుతో తనకు దేవాలయమున ధర్మశాస్త్ర గ్రంథము దొరకినదని చెప్పి ఆ గ్రంథమును అతనికిచ్చెను.

16. షాఫాను దానిని రాజునొద్దకు తీసికొని వెళ్ళి “మేము నీవు చెప్పిన పనులెల్లచేసితిమి.

17. దేవాలయములోని సొమ్మును తీసికొని వెళ్ళి పనివారిమీద పర్యవేక్షకులుగానున్న వారికిని, పనివారికిని చెల్లించితిమి” అని చెప్పెను.

18. అటుతరువాత అతడు రాజుతో హిల్కీయా నాకు ఈ గ్రంథమును ఇచ్చెనని చెప్పి దానిలోని భాగములను చదివి విన్పించెను.

19. రాజు ఆ పుస్తక వాక్యములను విని విచారముతో బట్టలు చించుకొనెను.

20. అతడు యాజకుడైన హిల్కీయాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయా కుమారుడైన అబోనును, లేఖకుడైన షాఫానును, రాజునకు పరిచర్యచేయు అసాయాను ఇట్లు ఆజ్ఞాపించెను:

21. “మీరు వెళ్ళి నా పక్షమునను, యూదా యిస్రాయేలు రాజ్యములలో ఇంకను మిగిలియున్న ప్రజల పక్షమునను దేవుని సంప్రతింపుడు. ఈ గ్రంథములోని అంశముల భావమేమిటో తెలిసికొనుడు. మన పూర్వులు ఈ గ్రంథ బోధలను పాటింపలేదు కనుక ప్రభువు ఆజ్ఞ మీరిరి. కావుననే ఆయన మనమీద మిక్కిలి కోపము తెచ్చుకొనెను.”

22. అప్పుడు యాజకుడైన హిల్కీయాయు, రాజోద్యోగులును హుల్దాఅను ప్రవక్తిని సంప్రదింపబోయిరి. జరిగినదంతయు ఆమెకు విన్నవించిరి. ఆమె యెరూషలేములోని క్రొత్త భాగమున వసించుచుండెను. ఆమె భర్త షల్లూము దేవాలయములోని వస్త్రశాలలకు అధిపతి. అతని తండ్రి తాతలు తోకాతు, హస్రా అను వారు.

23. ఆమె వారితో ఇట్లనెను; “మిమ్ము పంపిన రాజునకు మీరు ఈ క్రింది సందేశము విన్పింపుడు. ప్రభువువాక్కిది.

24. నేను యెరూషలేమును, దానిలో వసించు పౌరులను శిక్షింతును. రాజు ఎదుట చదివిన గ్రంథము పేర్కొనుశాపముల ప్రకారమే ఈ ప్రజను దండింతును.

25. వీరు నన్ను త్యజించి అన్యదైవము లకు సాంబ్రాణి పొగవేసిరి, తాముచేసిన దుష్కార్యముల వలన నా కోపమును రెచ్చగొట్టిరి. యెరూషలేముపై  నా కోపము రగుల్కొనుచున్నది. అది యిక చల్లారదు.

26. నన్ను సంప్రతించుటకు మిమ్ము పంపిన యూదా రాజుతో మీరిట్లు నుడువుడు. యిస్రాయేలు దేవుడనైన నా పలుకులివి. నీవు ఈ గ్రంథమునందు వ్రాయబడిన సంగతులు వింటివి.

27. నేను యెరూషలేమును దానిలో వసించు ప్రజలను శిక్షింతునని చెప్పగా నీవు పశ్చాత్తాపపడి, నా యెదుట వినయమును ప్రదర్శించి తివి. నీ బట్టలు చించుకొని బోరున యేడ్చితివి. కనుక నేను నీ మొరాలించితిని.

28. నేను యెరూషలేమునకు విధింపబోవు శిక్షలు నీ జీవితకాలమున సిద్ధింపవు. నీ మట్టుకు నీవు సమాధానముతో కన్నులు మూయుదువు.” దూతలు ఈ సందేశముతో రాజునొద్దకు తిరిగిపోయిరి.

29. యోషీయా రాజు ఆ సందేశమును విని యూదా, యెరూషలేము నాయకులను ప్రోగుచేసెను.

30. రాజును, నాయకులును, యాజకులును, లేవీయులును, యూదా యెరూషలేము ప్రజలలో పిన్నలు, పెద్దలందరును కూడి దేవళమునకు పోయిరి. రాజు దేవాలయమున దొరికిన నిబంధన గ్రంథమునంతటిని వారియెదుట చదివెను.

31. రాజు స్తంభము ప్రక్క తన స్థలమందు నిలుచుండెను. ప్రభువుతో నిబంధనము చేసికొనెను. 'నేను ప్రభువునకు విధేయుడనై ఆయన ఆజ్ఞలను, శాసనములను, చట్టములను పూర్ణహృదయముతోను, పూర్ణమనస్సుతోను పాటింతును' అని మాటయిచ్చెను.

32. అతని ప్రోత్సాహము వలన బెన్యామీనీయులును, యెరూషలేమున హాజరైయున్న ఇతర ప్రజలును నిబంధనమును పాటింతుమని ప్రమాణము చేసిరి. కావున యెరూషలేము వాసులు తమ పితరుల దేవుడైన ప్రభువు నిబంధన ప్రకారము మెలగిరి.

33. యోషీయా యిస్రాయేలు దేశములోని రోతపుట్టించు విగ్రహములనెల్ల నాశనము చేయించెను. అతడు జీవించినంతకాలము యిస్రాయేలీయులు తమ పితరుల దేవుడైన ప్రభువును మాత్రమే సేవించునట్లు జాగ్రత్త వహించెను.

 1. యోషీయా యెరూషలేమున పాస్క ఉత్సవమును జరిపించెను. మొదటినెల పదునాలుగవ దినమున పండుగకు పశువులను వధించిరి.

2. అతడు దేవాలయమున యాజకులను వారివారి పనులకు నియమించెను. వారిని ప్రోత్సహించి వారు తమ బాధ్యతలను సంతృప్తికరముగా నిర్వర్తించునటు చేసెను.

3. లేవీయులు ప్రజలకు బోధకులు, ప్రభువునకు అంకితులుగదా! రాజు వారితో “మీరు దావీదు కుమారుడగు సొలోమోను కట్టిన మందిరమున పవిత్ర మందసమును పదిలపరుపుడు. ఇక మీదట మీరు దానిని భుజములపై మోసికొని పోనక్కర లేదు. మీరు ప్రభువును, అతని ప్రజను సేవించిన చాలును.

4. దావీదు రాజును, అతని కుమారుడైన సొలోమోనును మీకు ఒప్పగించిన బాధ్యతల ప్రకారము మీరు మీ వంశముల వారిగా మీమీ స్థానములలో నుండి దేవాలయమున పరిచర్యచేయుడు.

5. మీలో మీరు బృందములుగా ఏర్పడి యిస్రాయేలు కుటుంబముల కెల్ల దేవాలయమున సేవలుచేయుడు.

6. పాస్క ఉత్సవమున బలిగా సమర్పించు పశువులను మీరు వధింపవలెను. కనుక మిమ్ము మీరు శుద్ధి చేసికొనుడు. మీ తోటి యిస్రాయేలీయులు కూడ ప్రభువు మోషే ద్వారా జారీ చేసిన ఆజ్ఞలు పాటించునట్లు మీరు వారికి తోడ్పడుడు” అని చెప్పెను.

7. పాస్క పండుగలో పాల్గొను ప్రజలకొరకు యోషీయా రాజు తన సొంతమందల నుండి ముప్పది వేల మేకపిల్లలను, గొఱ్ఱెపిల్లలను ఇచ్చెను. మూడువేల కోడెలను ఇచ్చెను.

8. అధిపతులు ప్రజలకును, యాజకులకును, లేవీయులకును బలిపశువులను ఇచ్చిరి. దేవాలయాధికారులైన హిల్కీయా, జెకర్యా, యెహీయేలు దేవాలయమున అర్పించుటకు యాజకులకు రెండు వేల ఆరువందల గొఱ్ఱె పిల్లలను, మేకపిల్లలను ఇచ్చిరి. మూడువందల కోడెలనిచ్చిరి.

9. లేవీయుల నాయకులైన కొనన్యా, షెమయా, అతని సోదరుడు నెతనేలు, హషబ్యా యేయీయేలు, యోసాబాదు ఐదు వేల గొఱ్ఱె పిల్లలను లేవీయులకిచ్చిరి. ఐదువందల కోడెలను గూడ ఇచ్చిరి.

10. పాస్కోత్సవమునకు ఎల్ల కార్యములును సిద్ధముకాగా రాజాజ్ఞను అనుసరించి యాజకులును, లేవీయులును వారివారి స్థానములలో నిలిచిరి.

11. లేవీయులు గొఱ్ఱెపిల్లలను వధించి వానిని బలికి సిద్ధముచేసిరి. యాజకులు వాని నెత్తుటిని బలిపీఠముపై చిలుకరించిరి.

12. ప్రజలకు వారివారి వంశములననుసరించి దహనబలికిగాను పశువులను యాజకులకిచ్చిరి. వారు ధర్మశాస్త్ర నియమముల ప్రకారము ఆ బలులు అర్పింపవలయును. కోడలెను కూడ అట్లే పంచియిచ్చిరి.

13. పాస్కా నియమములను అనుసరించి పాస్క పశువులను నిప్పులపై కాల్చిరి. పవిత్ర నైవేద్యములను కుండలలోను, పెనములలోను, బోవాణములలో వండి త్వరత్వరగా ప్రజలకు వడ్డించిరి.

14. ఈ కార్యము ముగిసిన తరువాత లేవీయులు తమ కొరకును, అహరోను వంశజులైన యాజకులకొరకును పాస్క పశువులను సిద్ధము చేసికొనిరి. యాజకులు రాత్రియగువరకు దహన బలులు అర్పించుటయందును, కొవ్వును వ్రేల్చుటయందును నిమగ్నులైయుండిరి. కనుక లేవీయులే దహనబలి పశుమాంసమును సిద్ధము చేయవలసి వచ్చెను.

15. ఆసాపు, హేమాను, దావీదునకు దీర్ఘ దర్శియైన యెదూతూను మరియు ఆసాపు వంశమునకు చెందిన సంగీతకారులును పూర్వము దావీదు జారీచేసిన ఉత్తర్వులననుసరించి వారివారి స్థానములలో నిలిచిరి. దేవాలయ ద్వారములకు కావలికాయు వారు తమ స్థానములలోనుండి కదలవలసిన అవసరము కలుగలేదు. లేవీయులే వారికి సిద్ధముచేసిరి.

16. ఆ రీతిగా యోషీయా ఆజ్ఞలననుసరించి ఆ దినము ప్రభువును ఆరాధించుటకును, పాస్కోత్సవమును జరుపుకొనుటకును, బలిపీఠముమీద దహన బలిని అర్పించుటకును ఎల్లకార్యములు సిద్ధమాయెను.

17. అచట హాజరైన యిస్రాయేలీయులెల్లరును ఏడు దినములపాటు పాస్కోత్సవమును పొంగనిరొట్టెల పండుగను జరుపుకొనిరి.

18-19. ప్రవక్త సమూవేలు కాలమునుండి యిస్రాయేలీయులలో ఇట్టి పాస్క ఉత్సవము ఎన్నడును జరుగలేదు. యోషీయా, యాజకులు, లేవీయులు, యిస్రాయేలు, యూదా యెరూషలేము ప్రజలును కలిసి యోషీయా రాజు పరిపాలనాకాలము పదునెనిమిదియవయేట జరుపుకొనిన ఈ పాస్కోత్స వము వంటి ఉత్సవమును పూర్వము రాజులెవరును జరిపియుండలేదు.

20.  యోషీయా దేవళమును చక్కదిద్దుటకు ఈ కార్యములెల్ల నిర్వహించినపిదప ఐగుప్తు ఫరోయగు నెకో తన దండుతో యూఫ్రటీసు నదీతీరమునందలి కర్కెమీషు మీదికి దండెత్తిపోవుచుండగా యోషీయా అతనినెదిరింపబోయెను.

21. కాని ఫరో యోషీయాకు ఈ క్రింది సందేశమంపెను: “యూదారాజా! ఈ యుద్ధముతో నీకెట్టి సంబంధములేదు. నేను నా శత్రువులతో పోరాడవచ్చితినిగాని నీ మీదికి రాలేదు. దేవుడు నన్ను త్వరగా పోరు ప్రారంభింపుమనెను. ఆయన నా పక్షమున ఉన్నాడు. ఇప్పుడు నీవు నన్నెదిరింతువేని ఆయన నిన్ను నాశనము చేయును.

22. కాని యోషియా నెకోతో పోరాడనెంచెను. నెకోరాజు ద్వార దేవుడు వినిపించిన పలుకులు అతడు ఆలింపడయ్యెను. కనుక అతడు మారు వేషమున పోయి మెగిద్ధో మైదానమున జరిగిన యుద్ధములో పాల్గొనెను.

23. యుద్ధమున విలుకాండ్రు యోషీయాను బాణములతో కొట్టగా అతడు తన సేవకులతో “నేను మిగుల గాయపడితిని. మీరు నన్ను వెలుపలికి కొని పొండు” అనెను.

24. సేవకులు అతనిని తన రథము మీదినుండి ఎత్తి మరియొక రథముమీద కూర్చుండబెట్టి యెరూషలేమునకు కొనివచ్చిరి. అచట అతడు మృతి నొందగా, తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతి పెట్టబడెను. యూదీయులు, యెరూషలేము పౌరులెల్లరును అతని మృతికి సంతాపము తెల్పిరి.

25. రాజు మృతికి యిర్మీయా శోకగీతమును రచించెను. నేటికిని యోషీయా మృతికి సంతాపము తెల్పునపుడు యిస్రాయేలు గాయనీగాయకులు ఈ గీతమును ఆలపించుట ఆచారమైయున్నది. ఈ పాట విలాపవాక్యములలో కన్పించును.

26-27. యోషీయా చేసిన ఇతర కార్యములు, ప్రభువుపట్ల అతడు చూపిన భక్తి, ధర్మశాస్త్రముపట్ల అతడు ప్రదర్శించిన విధేయత, మొదటినుండి తుదివరకును అతని క్రియలన్నియు యూదా యిస్రాయేలు రాజుల చరితమున లిఖింప బడియే యున్నవి.

 1. ప్రజలు యోషీయా కుమారుడైన యెహోవాహాసును యెరూషలేమున రాజుగా అభిషేకించిరి.

2. రాజగునప్పటికి యెహోవాహాసునకు ఇరువదిమూడేండ్లు. అతడు యెరూషలేము నుండి మూడునెలలు పరిపాలించెను.

3. ఐగుప్తురాజు నెకో యెహోవాహాసును తొలగించి అతనిని బందీగా కొనిపోయెను. యూదా రాజ్యమునకు రెండు వందల మణుగుల వెండిని, రెండు మణుగుల బంగారమును కప్పముగా నిర్ణయించెను.

4. నెకో యెహోవాపసు సోదరుడైన యెల్యాకీమును యూదాకు రాజును చేసి అతని పేరును యెహోయాకీముగా మార్చెను. నెకో యెహోవాహాసును బందీగా ఐగుప్తునకు కొనిపోయెను.

5. రాజగునప్పటికి యెహోయాకీమునకు ఇరువదియైదేండ్లు. అతడు యెరూషలేమునుండి పదునొకండేండ్లు పరిపాలించెను. అతడు ప్రభువునకు నచ్చని దుష్కార్యములు చేసెను.

6. బబులోనియా రాజగు నెబుకద్నెసరు అతనిమీదికి దాడిచేసి, బబులోనియాకు బందీగా కొనిపోవుటకై అతనిని బంధించెను.

7. నెబుకద్నెసరు దేవాలయములోని పరికరములనుగూడ కొనిపోయి బబులోనియాలో తన ఆలయములో ఉంచుకొనెను.

8. యెహోయాకీము జీవితములోని ఇతరాంశములు, అతడు చేసిన దుష్కార్యములు, జుగుప్సాకరమైన చెయిదములు యూదా యిస్రాయేలు రాజుల చరితమున లిఖింప బడియేయున్నవి. అతని తరువాత అతని కుమారుడు యెహోయాకీను రాజయ్యెను.

9. రాజగునప్పటికి యెహోయాకీనునకు ఎనిమిదియేండ్లు'. అతడు యెరూషలేము నుండి మూడునెలల పదిరోజులు పరిపాలన చేసెను. అతడు యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

10. సంవత్సరాంతమున నెబుకద్నెసరు అతనిని బబులోనియాకు బందీనిగా కొనిపోయెను. అతనితో పాటు దేవాలయములోని విలువగల పరికరములనుగూడ కొని పోయెను. ఆ రాజు యెహోయాకీను పినతండ్రియైన సిద్కియాను యూదా యెరూషలేములకు రాజుగా నియమించెను.

11. రాజగునప్పటికి సిద్కియాకు ఇరువదియొక్క యేండ్లు. అతడు యెరూషలేమునుండి పదునొక్క యేండ్లు పరిపాలించెను.

12. అతడు ప్రభువు ఒల్లని దుష్కార్యములు చేసెను. ప్రభువు పలుకులను విన్పించిన ప్రవక్త యిర్మీయా మాటలను వినయముతో ఆలింపడయ్యెను.

13. అతడు నెబుకద్నెసరుకు విధేయుడనై ఉందునని దేవుని పేరుమీదుగా ప్రమాణము చేసికూడ అతనిపై తిరుగబడెను. తన మొండితనము చేత హృదయము కఠినపరచుకొని యిస్రాయేలు దేవుడైన ప్రభువును శరణు వేడడయ్యెను.

14. ఇంకను యాజకులును, జనులును, అధిపతులగు వారును చుట్టుపట్లగల ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పెట్టుకొని మిక్కిలి ద్రోహులై, ప్రభువు పవిత్రముచేసిన మందిరమును అమంగళము చేసిరి.

15. వారి పితరుల దేవుడైన ప్రభువు వారి యొద్దకు ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపెను. ఆయన ఆ ప్రజను, ఆ దేవాలయమును కనికరముతో కాపాడనెంచెను.

16. కాని వారు ప్రభువు ప్రవక్తలను గేలిచేసిరి. వారిని ఎగతాళిచేసి ప్రభువు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభువు మహోగ్రుడు కాగా వారు ఆయన కోపమునుండి తప్పించుకోజాలరైరి.

17. ప్రభువు కల్దీయుల రాజును తీసికొనిరాగా అతడు యూదా యువకులనుపట్టి దేవాలయముననే వధించెను. ఆ రాజు పెద్దలనేమి, పిన్నలేమి, వృద్ధులనేమి, యువతులనేమి ఏ తారతమ్యము లేకుండ అందరిని నిర్దయగా వధించెను. ప్రభువు అందరిని అతని చేతికప్పగించెను.

18. ఇంకను బబులోనియా రాజువచ్చి యథేచ్ఛగా దేవాలయ ఉపకరణములను, దేవాలయ కోశాగారమును, రాజనిధులను, రాజోద్యోగుల నిధులను దోచుకొని ఆ సొత్తునంతటిని బబులోనియాకు కొనిపోయెను.

19. అతడు దేవాలయమును తగులబెట్టెను. నగర ప్రాకారములను పడగొట్టి లోపలి ప్రాసాదమును కాల్చివేసెను. పట్టణములో విలువగల వస్తువులనెల్ల ధ్వంసము చేసెను.

20. చావును తప్పించుకొని బ్రతికియున్న వారిని బబులోనియాకు బందీలనుగా కొనిపోయెను. వారు పారశీకరాజ్యము తలయెత్తిన వరకు నెబుకద్నెసరునకును, అతని వంశజులకును దాసులై సేవలు చేయుచువచ్చిరి.

21. “ఈ దేశము విశ్రాంతి దినములను పాటింపలేదు, కనుక ప్రాయశ్చిత్తముగా డెబ్బదియేండ్లదాక పాడుపడి యుండును” అని ప్రభువు యిర్మీయా ప్రవక్తద్వారా పలికిన ప్రవచనము నెరవేరెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతిదినములను అనుభవించెను.

22. పారశీకదేశరాజైన కోరెషు ఏలుబడి మొదటియేట ప్రభువు అతని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడొక లిఖితరూపమైన చట్టమును జారీచేసి దానిని తన రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభువు ముందుగానే యిర్మీయా ద్వారా పలికిన పలుకు నెరవేరునట్లు ఈ సంఘటన జరిగెను.

23. "పారశీక ప్రభువైన కోరెషు ఆజ్ఞ ఇది. ఆకాశమందలి దేవుడు నన్ను ఈ భూలోకమంతటికిని అధిపతిని చేసెను. ఆయన యూదా దేశమందలి యెరూషలేమున నన్నొక దేవాలయము నిర్మింపుమని ఆజ్ఞను ఇచ్చెను. మీలో ఎవరు ఆ ప్రభువు ప్రజలైయున్నారో వారు బయలు దేరవచ్చును. వారి దేవుడైన యావే వారికి తోడుగా నుండునుగాక.