1. దావీదు కుమారుడును, యెరూషలేము నుండి పరిపాలన చేయువాడునగు ఉపదేశకుని పలుకులివి.
2. వ్యర్థము, వ్యర్ధము, అంతయు వ్యర్థమేయని ఉపదేశకుడు చెప్పుచున్నాడు.
3. సూర్యుని క్రింద ఈ ధరణిపై నరుడుపడు నానాశ్రమలకు ఫలితమేమున్నది?
4. ప్రాతతరములు గతించి క్రొత్తతరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రము ఎప్పుడును ఒకే రీతిని కొనసాగిపోవుచున్నది.
5. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలమునకు మరల చేరుటకు త్వరపడును.
6. గాలి దక్షిణమునకు వీచి, అచటి నుండి ఉత్తరమునకు మరలి, అచట గుండ్రముగా తిరిగి మరల పూర్వస్థానమును చేరుకొనుచున్నది.
7. నదులన్నియు సముద్రములోనికి ప్రవహించును. అయినను, వానివలన సముద్రము నిండదు. జల ములు మరల నదీజన్మస్థానమును చేరుకొని అచటి నుండి మరల ప్రవహింప మొదలిడును.
8. ప్రతి దినము సమస్తమును ఎడతెరిపిలేకుండా జరుగు చున్నవి. మానవులు దానిని వివరింపజాలరు. మన కన్నులు తాము చూచినవానితోగాని, మన చెవులు తాము విన్నవానితోగాని సంతృప్తి చెందుటలేదు.
9. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడును జరుగు చున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరల చేయు చున్నారు. సూర్యునిక్రింద క్రొత్తది ఏదియును లేదు.
10. “ఇది క్రొత్తది” అనిపించుదానిని దేనినైనను పరిశీలింపుడు. అది మనము పుట్టక పూర్వము నుండియు ఉన్నదేనని విశదమగును.
11. పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవరును జ్ఞప్తియందుంచు కొనరు. అట్లే ఇక జరుగువానిని గూడ భావితరముల వారు జప్తియందుంచుకొనరు.
12. ఉపదేశకుడనైన నేను యెరూషలేము నుండి యిస్రాయేలీయులను పరిపాలించితిని.
13. నేను విజ్ఞానబలముతో ఈ లోకమున జరుగు కార్యము లన్నిటిని పరిశీలించుటకు నా మనస్సును లగ్నము చేసితిని. నరుడు సాధనమొనరింప దేవుడు వారికి ఏర్పాటుచేసిన శ్రమ బహువేదనకరమైనది.
14. నేను సూర్యుని క్రింద నరులుచేయు కార్యములెల్ల గమనించి తిని. అది అంతయూ వ్యర్ధమే. గాలికై ప్రయాస పడుటయే.
15. వంగిన దానిని వంకర తీయలేము, లోపము కలది లెక్కకు రాదు.
16. యెరూషలేమున రాజ్యము చేసిన రాజు లందరికంటెను నేనెక్కువ విజ్ఞానము గడించితిననియు, విద్యయందును, విజ్ఞానమునందును అందరికంటెను నాకు ఎక్కువ అనుభవము కలదనియు నేను భావించితిని.
17. నేను జాగ్రత్తగా విజ్ఞానమును అలవర్చుకో గోరితిని. వెట్టితనమును, బుద్ధిహీనతనుగూడ జాగ్రత్తగా పరిశీలించి చూడగోరితిని. కాని ఈ శ్రమగూడ గాలికై ప్రయాసపడుటయేనని గ్రహించితిని.
18. ఎక్కువ విజ్ఞానము ఎక్కువ విచారమును తెచ్చును; ఎక్కువవిద్య ఎక్కువ సంతాపమును తెచ్చును.
1. నేను సుఖములను అనుభవించి, సౌఖ్యము గూర్చి తెలిసికొందును అనుకొంటిని. కాని ఈ సౌఖ్యమును వ్యర్థమే.
2. సుఖసంతోషములు వెట్టితనమే గాని వానివలన ఫలితమేమియు లేదు.
3. విజ్ఞానమును గడింపవలెనన్నకోరికతోనే నేను ద్రాక్షారసమును సేవించి సుఖముననుభవింపజూచితిని. నరులు ఈ భూమిమీద వసించు కొద్దికాలము ఈరీతిగా సుఖములతో గడుపుటయే మంచిది కాబోలుననుకొంటిని.
4. నేను గొప్పపనులే చేసితిని. రాజభవనములు నిర్మించితిని, ద్రాక్షతోటలు నాటించితిని.
5. తోటలు, ఉద్యానవనములు వేయించి వానిలో సకల విధములైన ఫల వృక్షములు నాటించితిని.
6. చెరువులు త్రవ్వించి ఆ తోటలకు నీళ్ళు పెట్టించితిని.
7. దాసదాసి జనమును కొనితెచ్చుకొంటిని. ఇంక మా ఇంటపుట్టిన బానిసలును కూడా కలరు. పూర్వము యెరూషలేమున జీవించి పోయిన వారికంటె ఎక్కువగనే నేను పశువుల మందలు సంపాదించితిని.
8. వెండి బంగారములను, కోశాగారములను, రాష్ట్రములను, గాయనీగాయకు లను, అనేకమంది వనితలను సంపాదించితిని.
9. నేను చాల గొప్పవాడనైతిని. నాకంటె అధికుడు యెరూషలేమున ఏనాడును వసించియుండడు. నా విజ్ఞానమునకును కొదవలేదు.
10. నేను కోరినదెల సంపాదించితిని, నా హృదయము ఆశించిన సుఖము లెల్ల అనుభవించితిని. నా కృషి నాకు ఆనందమును చేకూర్చి పెట్టెను. ఈ వైభవమంతయు నేను చేసిన కృషి ఫలితమే.
11. కాని తరువాత నేను సాధించిన కార్యములగూర్చియు, ఆ కార్యములను సాధించుటకు నేను చేసిన కృషినిగూర్చియు, ఆలోచింప మొదలిడితిని. ఏమి చెప్పుదును? ఈ శ్రమ అంతయు వ్యర్థము, గాలికై ప్రయాసపడుటయే. ఇది అంతయు సూర్యుని క్రింద ఫలితము ద
12. అటుతరువాత నేను విజ్ఞానమును గూర్చియు, వెట్టితనమునుగూర్చియు, బుద్ధిహీనతను గూర్చియు ఆలోచింపమొదలిడితిని.
13. రాజు వారసుడు ఏమి చేయును? అతడును పూర్వపురాజులు చేసిన కార్యములనే చేయునుకదా? చీకటికంటె వెలుగెంత గొప్పదో, బుద్దిహీనతకంటె విజ్ఞానమంత గొప్పదని నేనెరుగుదును.
14. విజ్ఞానికి కన్నులు తలలోనున్నవి. బుద్దిహీనుడు అంధకారమున పయనించును. అయినను వారిరువురికిని ఒకేగతి పట్టుచున్నదని నేను గ్రహించితిని.
15. "బుద్దిహీనునకు పట్టినగతియే నాకును పట్టుచున్నదిగదా? మరి నేను విజ్ఞానినైనందున ప్రయోజనమేమిటా?” అని ఆలోచించితిని. కనుక ఈ విజ్ఞానము కూడ వ్యర్థమే.
16. బుద్ధిహీనుని, విజ్ఞానిని కూడ ఎవరు జ్ఞప్తియందుంచుకొనరుగదా? రాబోవు తరములవారు ఇరువురిని విస్మరింతురు. బుద్ధిహీనుడు మృతినొందు విధమెట్టిదో, విజ్ఞాని మృతినొందు విధమును అట్టిదే.
17. ఇది చూడగా, సూర్యునిక్రింద జరుగు కార్య ములన్నియు నాకు అసహ్యము పుట్టించినవి. అంతయు వ్యర్థమే, గాలికై ప్రయాసపడుటయే.
18. నేను కృషి చేసి సాధించినవేమియు నాకు ప్రమోదము చేకూర్ప లేదు. వానినన్నిటిని నేను నా వారసునకు అప్పగింప వలసినదేగదా?
19. అతడు విజ్ఞానియగునో, అజ్ఞానియగునో ఎవ్వడెరుగును? అయినను ఈ లోకమున నేను నా విజ్ఞానమును, శ్రమను వెచ్చించి సాధించిన వానికి అన్నిటికిని అతడు అధిపతియగునుగదా? కనుక ఇదియును వ్యర్థమే.
20. కావున సూర్యుని క్రింద నేనుపడిన శ్రమను తలంచుకొని విచారింపజొచ్చితిని.
21. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించినవానిని ఎట్టి శ్రమచేయని తన వారసునికి అప్పగింప వలసినదేగదా? ఇదియును వ్యర్థమే, అక్రమమే.
22. సూర్యునిక్రింద ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందులకు నరునికి కలుగు ఫలితమేమి?
23. నరుడు జీవించినంతకాలమును అతడు చేయు పనులెల్ల శ్రమతోను, దుఃఖముతోను నిండియుండును. రాత్రులలో నిద్రపట్టదు. ఇదియును వ్యర్ధమే.
24. తిని, త్రాగి తాను సాధించిన దానిని అను భవించుటకంటే, మనుష్య జీవితమునకు సార్థక్యమే మున్నది? ఈ భాగ్యమునుగూడ దేవుడే అనుగ్రహింప వలయునని నేను తెలుసుకొంటిని.
25. దేవుడు తోడ్పడనిదే నరుడేమి తినగలడు, ఏమి అనుభవింపగలడు?
26. దేవుడు తనకిష్టుడైన నరునికి విజ్ఞానము, విద్య, సంతోషము దయచేయును. కాని ఆయన పాపిని మాత్రము కృషి చేసి వస్తువులు కూడబెట్టునట్లు చేసి, ఆ వస్తువులను మరల తనకు ప్రీతిపాత్రులైన వారి వశముచేయును. ఇదియును వ్యర్థమే, గాలికై ప్రయాసపడుటయే.
1. లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు:
2. పుట్టుటకొక సమయము, గిట్టుటకొక సమయము కలదు; నాటుటకొక సమయము, పెరికివేయుటకొక సమయము కలదు.
3. చంపుటకొక సమయము, చికిత్స చేయుటకొక సమయము కలదు; పడగొట్టుటకొక సమయము, కట్టుటకొక సమయము కలదు.
4. ఏడ్చుటకొక సమయము, నవ్వుటకొక సమయము కలదు; దుఃఖించుటకొక సమయము, నాట్యము చేయుటకొక సమయము కలదు.
5. రాళ్ళను పారవేయుటకొక సమయము, రాళ్ళను కుప్ప వేయుటకొక సమయము కలదు; కౌగిలించుకొనుటకొక సమయము, కౌగిలిని మానివేయుటకొక సమయము కలదు.
6. వెదకుటకొక సమయము, పొగొట్టుకొనుటకొక సమయము కలదు; పదిలపరుచుకొనుటకొక సమయము, పారవేయుటకొక సమయము కలదు.
7. చింపుటకొక సమయము, కుట్టుటకొక సమయము కలదు; మౌనము వహించుటకొక సమయము, మాట్లాడుటకొక సమయము కలదు.
8. ప్రేమించుటకొక సమయము, ద్వేషించుటకొక సమయము కలదు; యుద్ధమునకొక సమయము, శాంతికొక సమయము కలదు.
9. నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి?
10. నరుడు ; సాధనచేయ దేవుడు వానికి పెట్టిన శ్రమానుభవమును నేను గమనించితిని.
11. ఆయన ప్రతిపనికి దానికి తగిన సమయము నియమించెను. ఆయన నరునికి శాశ్వతత్త్వమును అర్ధముచేసికొను శక్తి నిచ్చెను. ; అయినను నరుడు దేవుని చర్యలను గ్రహింపజాలకున్నాడు.
12. కనుక ఆనందముగా బ్రతికి, ఈ జీవిత మును చక్కగా గడపుటకంటె మనము చేయదగిన దేమియులేదని నేను గ్రహించితిని.
13. నరుడు తిని, త్రాగి తాను సాధించిన వానిని అనుభవింపవలెను. ఇదియును దేవుడతనికి దయచేసిన వరమేనని గ్రహించితిని.
14. దేవుడు చేసిన కార్యము శాశ్వతముగా నుండిపోవును. మనము దానికి కొంత చేర్చనూలేము, దానినుండి కొంత తీసివేయనూలేము. ఆయన కార్యములు చూచి మనము ఆయనపట్ల భయభక్తులు ప్రదర్శింపవలసినదే.
15. ఇప్పుడున్నదికాని, ఇక మీదట ఉండబోవునదికాని ఇంతకుముందు కూడ ఉన్నదియే. దేవుడు జరిగినదానినే మరల జరిగించును.
16. ఇంకనూ లోకమున న్యాయమును, ధర్మమును కన్పింపవలసిన తావులో అన్యాయము కన్పించు చున్నది.
17. దేవుడు న్యాయవంతులకును, అన్యాయ పరులకునుకూడ తీర్పు విధించుననియు, ప్రతికార్య మును అది జరుగవలసినపుడు జరుగుననియు నేను భావించితిని.
18. ఇంకను దేవుడు మనలను పరీక్షించుచున్నాడనియు, మనముగూడ జంతువులవలె జీవించు వారలమేనని ఆయన మనకు నేర్పుచున్నాడనియు నేను తలంచితిని.
19. నరులకు పట్టిన గతియే జంతువు లకును పట్టుచున్నదికదా? నరులవలె జంతు వులును చచ్చుచున్నవి. ఆ ఉభయప్రాణులు ఒకే కోవకు చెంది నవి. జంతువుకంటె నరుడేమి ఎక్కువ? అంతయును వ్యర్థమే.
20. నరులు, జంతువులుకూడ ఒకే గమ్యమును చేరుకొందురు. అన్నియు మట్టినుండి పుట్టినవే, చివరకు మట్టిలో కలిసిపోవునవే.
21. నరుని ఆత్మ పైని ఆకాశమునకును, జంతువు ఆత్మ క్రింది భూమిలోనికిని పోవునని ఎవడు రూఢిగా చెప్పగలడు?
22. కనుక నరుడిచట తాను సాధించిన కార్యములను అనుభవించుటయే ఉత్తమమైన పద్ధతి. ఇదియే నరుని భాగధేయము. మనము గతించిన తరువాత ఏమి జరుగునో తెలిసికొను మార్గమేమియును లేదు.
1. పిదప సూర్యునిక్రింద జరుగు పరపీడనను కూడ నేను పరిశీలించి చూచితిని. పీడితులు కన్నీరు కార్చుచుండగా వారిని ఆదుకొనువారు ఎవరునులేరైరి. పీడకులు బలవంతులుకాగా పీడితులు అండను కోల్పో యిరి.
2. కనుక బ్రతికి బట్టకట్టియున్న వారి కంటె, చనిపోయి దాటిపోయినవారే ధన్యులేమో అనిపించు చున్నది.
3. ఈ ఇరువురికంటెగూడ ఇంతవరకు పుట్టని వారు, సూర్యుని క్రింద దుర్మార్గములను కంటితో చూడనివారు, ఇంకను ఎక్కువ ధన్యులనిపించు చున్నది.
4. సూర్యునిక్రింద నరులు ఇతరుల వృద్ధిని చూచి ఓర్వజాలక తాముగూడ విజయమును సాధింప వలెనని తీవ్రముగా కృషి చేయుచున్నారు. ఇదియును వ్యర్ధమే, గాలికై ప్రయాసపడుటయే.
5. మూర్ఖుడు చేతులు ముడుచుకొని కూర్చుండును. అతడు ఆకలితో చచ్చును.
6. శ్రమయును గాలికైన యత్నములతో రెండుచేతులనిండా ఉండుటకంటే, ఒక చేతినిండ నెమ్మది కలిగియుండుట మేలు.
7. నేను ఆలోచింపగా, సూర్యునిక్రింద మరియొక వ్యర్ధమైన కార్యముగూడ గమనించితిని.
8. ఒక నరుడు ఏకాకిగా ఉన్నాడు. అతనికి సోదరులుగాని, తనయులుగాని లేరు. అయినను అతడు తాను కూడ బెట్టిన సంపదలతో తృప్తి చెందక నిరంతరము శ్రమ పడుచునేయుండును. కాని అతడు “సుఖములను గూడ విడనాడి అంతగా శ్రమపడునదెవరి కొరకు?” ఇదియు వ్యర్థమే, దయనీయమైన కార్యముకూడ.
9. ఏకాకిగా నుండుటకంటె ఇద్దరు కలిసిఉండుట మేలు. ఇరువురు కలిసినప్పుడు ఎక్కువ సమర్ధముగా పనిచేయుదురు.
10. ఆ ఇరువురిలోనొకడు పడి పోయినచో, రెండవవాడు వానిని లేవనెత్తును. కాని ఒంటిగాడు పడిపోయినచో ఇక వానిని పైకిలేపు వాడుండడు. కనుక అతడికి చేటువాటిల్లును.
11. చలిలో ఇరువురు కలిసి పడుకొనినచో వెచ్చగా నుండును. ఒక్కడే పడుకొనినచో వెచ్చగానుండదుకదా?
12. ఒక్కడు ఓడిపోవు తావున ఇరువురు కలిసినచో ఓడిపోరు. ముప్పేటల పేనిన త్రాడు సులువుగా తెగదుకదా?
13. వృద్దుడును, బుద్దిహీనుడునై ఉపదేశము నాలింపని ,రాజుకంటె యువకుడైనను బుద్ధిమంతుడైన పేదవాడు మెరుగు.
14. ఆ యువకుడు పూర్వము చెరలోనుండి ఇప్పుడు రాజ్యము చేపట్టవచ్చును. లేదా పూర్వము భిక్షకుడై ఉండి ఇప్పుడు రాజ్యమును ఏలవచ్చును.
15. నేను లోకములోని నరులందరిని గమనించి తిని. ఎవడో ఒక యువకుడు రాజు స్థానమును ఆక్ర మించుకొని దేశమునకు పాలకుడయ్యెననుకొందము.
16. అతడు అసంఖ్యాకులైన ప్రజలను పరిపాలింప వచ్చును. కాని అతడు గతించిన తరువాత అతడు చేసిన కార్యములను ప్రశంసించువాడుండడు. ఇదియు వ్యర్ధమే, గాలికై ప్రయాసపడుటయే.
17. దేవాలయమునకు వెళ్ళినపుడు నీ ప్రవర్తన సరిచూసుకొనుము. అచటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలెనుగాని, మంచి చెడ్డలు తెలియని మూరులవలె బలిని అర్పించుటకు కాదు.
1. తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి దేవునిముందట ప్రమాణములు చేయకూడదు. ఆయన ఆకాశమునుండగా నీవు భూమి మీదనున్నావు. కనుక నీవు అతిగా మాట్లాడవలదు.
2. విస్తారమైన పనిపాటులవలన కలలెక్కువగును. మాటలెక్కువైనకొలది బుద్దిహీనత పెరుగును.
3. కనుక నీవు దేవుని ఎదుట ఏమైన మ్రొక్కు కొనినచో, ఆ మ్రొక్కును వెంటనే తీర్పుము. ఆయన బుద్దిహీనులను అంగీకరింపడు. నీవు చేయుదునన్నది చేయుము.
4. మ్రొక్కు మ్రొక్కుకొని దానిని చెల్లింప కుండుటకంటె, అసలు మ్రొక్కుకొనకుండుటయే మేలు.
5. నీ మాటలవలననే నీవు పాపము మూట గట్టు కోవలదు. తరువాత నీవు దేవుని యాజకుని వద్దకు వెళ్ళి, అయ్యా నా మాటలలో తప్పు దొర్లెనని చెప్పుకో వలసివచ్చును. నీ మాటలవలన దేవుని కోపము నీపైకి రప్పించుకోనేల? ఆయన అనుగ్రహమువలన పూర్వము నీవు సాధించిన కార్యములను నాశనము చేయించు కోనేల? .
6. విస్తార కలలు వ్యర్ధము. హెచ్చుపలుకులు పలుకుట నిరుపయోగము. నీవు దేవునియెడల భయభక్తులతో మెలగుము.
7. కొన్ని రాష్ట్రములలో ప్రభుత్వము పేదలను పీడించి వారి హక్కులను భంగపరచి వారికి అన్యాయము చేసినచో నీవేమియు ఆశ్యర్యపడనక్కరలేదు. క్రింది అధికారిని పై అధికారియు, వారిరువురిని అంతకంటే పై అధికారియు సంరక్షించుచుండును.
8. అయినను, సుభిక్షమైన భూమి సర్వజన శ్రేయస్సును, రాజు అందరి శ్రేయస్సును కోరవలయును.
9. డబ్బును కోరుకొను వారికి అది చాలినంత లభింపదు. ధనము ఆశించువానికి అది వలసినంత దొరకదు. ఇదియును వ్యర్థమే.
10. సంపదలున్నచోట పరాన్నభుక్కులునుందురు. కనుక ధనవంతుడు తన సంపదను కంటితో చూచు కొని తృప్తి చెందుటతప్ప అతనికి ఎట్టి లాభమును లేదు.
11. పేదకార్మికుడు కడుపునిండ తినకున్నను, కనీసము సుఖముగానైన నిద్రించును. కాని ధనవంతుని ధనము అతనికి నిద్రకూడ పట్టనీయదు.
12. ఈ లోకమున నేనొక ఘోరమైన సంగతిని గమనించితిని, ధనవంతుడు కూడబెట్టిన సొమ్ము అతనికి కీడునే తెచ్చుచున్నది.
13. ఒక్క తెలివితక్కువ పనిచాలు. అతని సంపదలెల్ల నాశన మగును. ఆ మీదట అతనికి తన కుమారునికి ఇచ్చుట కేమియు మిగులదు.
14. అతడు తల్లిగర్భమునుండి దిగంబరుడుగా వచ్చినట్లే మరల దిగంబరుడుగనే కాలము చేయును.
15. అతడు తాను కష్టపడి సాధించిన వేనినిగూడ తనవెంట తీసికొని వెళ్ళజాలడు. నరుడు వట్టిచేతులతో ఈ లోకములోనికి వచ్చినట్లే, వట్టిచేతులతోనే ఇచటినుండి వెళ్ళిపోవలెనను నది మిగుల ఘోరమైన సంగతి. అతడు నిరర్ధకముగా శ్రమపడినందున కలుగు ఫలితమేమిటి?
16. అతడు ఇచట విచారవిషాదములతోను, కోపతాపములతోను, వ్యాధిబాధలతోను జీవింపవలసినదేగదా?
17. కనుక నేను గ్రహించినసత్యమిది. మానవుడు, దేవుడు తనకు దయచేసిన ఈ అల్పకాలమున తిని, త్రాగి తాను సాధించిన వానిని అనుభవించుటయే శ్రేయస్కరము. నరుని భాగధేయమిదియే.
18. దేవుడు నరునికి సంపదలను, భూములనిచ్చి వానిని అనుభవించు భాగ్యములను దయచేసెనేని అతడు సంతసింపవలెను. అతడు తాను సాధించిన వానిని అనుభవింపవలెను. ఇది దేవుడొసగు వరము.
19. భగవంతుడు, అతనికి సుఖమును దయచేసెను. కనుక అతడు ఈ జీవితము క్షణభంగురమని హృదయమున విచారింపనక్కరలేదు.
1. సూర్యునిక్రింద నరులను వేధించు మరియొక అనర్గ కార్యమును గూడ నేను చూచితిని. ఇది వీరిపై బలముగా పని చేయుచున్నది.
2. దేవుడు ఒకనికి సంపదలు, భూములు, కీర్తి ప్రతిష్టలు మొదలైన వాని నెల్ల దయచేసెననుకొందము. ఇక అతడు కోరుకొనున దేమియు లేదు. కాని భగవంతుడు అతనిని ఈ సొత్తు అనుభవింపనీయడు. అన్యుడొకడు దానిననుభవించును. ఇదియును వ్యర్ధము, అక్రమము. -
3. ఒకనికి నూరుగురు బిడ్డలుండవచ్చును. అతడు చాల యేండ్లు జీవింపవచ్చును. అయినను అతడు సుఖములను అనుభవింపక, గౌరవ ప్రదముగా భూస్థాపనము గావింపబడనియెడల, వాని గతికంటె పడిపోయిన పిండముయొక్క గతి మెరుగుకదా?
4. అది చీకటినుండి వచ్చును, మరల చీకటిలోనికి వెడలిపోవును.. చీకటి దాని పేరును కమ్మివేయును.
5. అది వెలుగును చూడజాలదు. మరియేమియు తెలిసికోజాలదు. అయినను పై నరునికంటె దాని గతి నెమ్మది గలది.
6. ఆ నరుడు రెండువేల యేండ్లు జీవించినను, సుఖములను అనుభవింపడేని ఏమి లాభము? కడన అందరును ఒకే తావును చేరుకొందురుకదా!
7. నరుని కృషియంతయు పొట్టకూటి కొరకే. అయినను అతని మనస్సు ఏనాడును సంతృప్తినొందదు.
8. బుద్దిహీనునికంటె విజ్ఞాని యేమి మెరుగు? జీవి తమునెట్లు గడపవలయునో తెలిసికొనినంత మాత్రమున పేదవానికి ఒరిగినదేమిటి?
9. ఇదియునువ్యర్ధము, గాలికై ప్రయాసపడుటయే. మనకు లేని దానిని ఆశించుటకంటె, ఉన్నదానితో సంతృప్తి చెందుటమేలు.
10. ఇప్పుడు జరుగునదంతయు ఇంతకు పూర్వమే నిర్ణయింపబడినది. దాని స్వభావము మనకు తెలియును. నరుడు తనకంటే బలవంతుడైన వానితో వాదింపజాలడు.
11. ఎక్కువగా మాట్లాడుట నిక్కముగా నిష్ప్రయోజనము. దానివలన ఎట్టి లాభమునులేదు.
12. నరుడు కొద్ది కాలము మాత్రమే జీవించును. అదియును అర్ధము లేని జీవితము. అతనిజీవితము నీడవలె గతించును. ఈ హ్రస్వకాలపు మనుగడలో అతనికేది మేలో ఎవడు చెప్పగలడు? అతడు గతించిన తరువాత లోకములో ఏమి జరుగునో వానికెవడు చెప్పగలడు?
1. విలువగల సుగంధ తైలములకంటె మంచిపేరు మెరుగు. పుట్టినరోజుకంటె, గిట్టినరోజు విలువైనది.
2. విందులు చేసికొను ఇంటికి పోవుటకంటె, విచారముతో మ్రగ్గు ఇంటికి పోవుటమేలు. మనందరి గమ్యము మృత్యువేనని బ్రతికియున్న వారెల్లరును గుర్తించుట మేలు.
3. ఆనందముకంటె విచారముమిన్న. విచారవదనుడు విషయములను లెస్సగా గ్రహించును.
4. విజ్ఞాని మృత్యువుపై మనస్సు నిల్పును. అజ్ఞాని ఆనందముపై నిల్పును. .
5. బుద్దిహీనుల ముఖస్తుతులు ఆలించుటకంటె విజ్ఞానులచే చీవాట్లు తినుటయే మేలు.
6. మూర్చులు నవ్వెడినవ్వు నిప్పులలో చిటపట కాలు ముండ్ల శబ్దమువలె నుండును. ఇదియును వ్యర్థమే.
7. మోసముచేయు విజ్ఞాని మూర్ఖుడే అగును. లంచము పుచ్చుకొనుటచేత బుద్ధిచెడును.
8. కార్యారంభముకంటె దాని ముగింపు ముఖ్యము. దాని మీకంటే సహనము ము బుద్దిహీనుల
9. త్వరగా కోపపడవద్దు. కోపము బుద్దిహీనుల హృదయములో గూడుకట్టుకొని యుండును.
10. “నేటి దినములకంటె పూర్వపు దినములేల మెరుగుగా నుండెడివి” అని ప్రశ్నింపవలదు. అది తెలివి తక్కువ ప్రశ్న.
11. బ్రతికియున్న వారికందరికిని విజ్ఞానము అవసరము. అది వారసత్వముగా వచ్చిన ఆస్తివంటిది.
12. ధనమువలె అదియును రక్షణమునిచ్చును. విజ్ఞానమువలన నరునికి భద్రత సిద్దించును. దాని లాభమట్టిది.
13. దేవుని కార్యములను పరిశీలింపుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడును తిన్నని దానినిగా చేయజాలడు.
14. నీకు అనుకూలముగా కార్యములు జరుగునప్పుడు సంతసింపుము. అవి నీకు ప్రతికూలముగా జరుగునప్పుడు ఈ విషయమును గుర్తుంచుకొనుము. సంతోషమును, దుఃఖమునుగూడ దేవుడే పంపును. మనము ఆయనమీద తప్పు మోపలేము.
15. నిరర్ధకమైన నా ఈ జీవితకాలములో నేను అన్ని విషయములను గమనించితిని. మంచివాడు గతించుచున్నాడు. దుర్మార్గుడేమో చాల కాలము జీవించుచున్నాడు.
16. నీవు అతి దుర్మార్గుడవు కాని, మహావిజ్ఞానివి కాని కావలదు. అట్లయిన నిన్ను నీవే నాశనము చేసుకోనేల?
17. నీవు పరమ దుర్మార్గుడవు కాని, మహా మూర్ఖుడవు కాని కావలదు. అట్లయిన నీ కాలము రాకమునుపే చావనేల?
18. ఒకదానిని సాధించునపుడు మరి యొకదానిని విడనాడకుండుట ఉత్తమమైన పద్దతి. దేవునిపట్ల భయభక్తులు చూపువారికి ఈ రెండింటను విజయము కలుగును.
19. పదిమంది నగరపాలకులవలన పట్టణ మునకు కలుగు బలముకంటె జ్ఞానమువలన నరుని కెక్కువ బలము కలుగును.
20. ఎప్పుడును తప్పు చేయక ఎల్లవేళల ఒప్పే చేయు పుణ్యపురుషుడెవడును ఈ మంటిమీద లేడు.
21. జనులు చెప్పు చాడీలను నమ్మవలదు. నీ సేవకుడు నిన్ను దూషించుచుండగా నీవు వినియుండవచ్చును.
22. కాని నీ మట్టుకు నీవు మాత్రము ఇతరులనెన్ని మారులు దూషించి యుండలేదు?
23. నేను ఈ అంశములనెల్ల విజ్ఞానముతో పరీక్షించితిని. “నేను విజ్ఞానమును బడయగోరితిని”. గాని దానిని సాధింపజాలనైతిని.
24. జీవిత పరమార్ధమునెవడు గ్రహింపగలడు? అది చాల లోతైనది, ఎత్తైనది.
25. నేను విజ్ఞానమును, విద్యను ఆర్జింపబూని తిని. మూరత్వము, వెట్టితనమెంత అవివేకమైనవో పరిశీలించి తెలిసికోగోరితిని.
26. స్త్రీ మృత్యువుకంటె గూడ ఘోరమైనది. ఆమె ప్రేమ బోను వంటిది, వల వంటిది. ఆమె బాహువులు గొలుసుల వంటివి. దేవునికి ప్రీతి కలిగించువాడు స్త్రీని తప్పించుకోవచ్చును. కాని పాపాత్ముడు మాత్రము ఆమెకు దొరకిపోవును.
27. నేను ఆయా విషయములను పరిశీలించి నిదానముగా కనిపెట్టిన సత్యమిదియేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు.
28. నేను ఇతరాంశములను గూడ పరిశీలింపబూనితిని గాని కృషికి ఫలితము దక్కలేదు. వేయిమంది పురుషులలో సన్మానింపదగినవాడు ఒక్కడైన నుండును. కాని వేయిమంది స్త్రీలలో సన్మానింపదగినది ఒక్కతెయు నుండదు.
29. నేను గ్రహించినదంతయు ఇదియే. దేవుడు నరుని సరళవర్తనునిగనే చేసెను. కాని నరుడు మాత్రము పెక్కు కుతంత్రములను కల్పించుకొనెను.
1. విజ్ఞానివంటి వాడెవడు? పరమార్థము తెలిసినవాడతడే. విజ్ఞానమువలన నరుని ముఖము తేజరిల్లును. అతని ముఖములోని కోపము తొలగిపోవును.
2. రాజాజ్ఞను పాటింపుము. త్వరపడి దేవుని పేరు మీద వ్రతము పట్టవలదు.
3. రాజు తలంచిన దెల్ల చేయగలడు. కనుక నీ కోర్కెను నెరవేర్చుకొను టకుగాను మొండిపట్టుపట్టి అతనియెదుట చాలకాలము నిలువవలదు.
4. రాజు అధికారము కలవాడు. అతనిని కాదనుటకు ఎవడు సాహసించును?
5. రాజాజ్ఞను పాటించువానికి ఎట్టి ముప్పును లేదు. ఆ ఆజ్ఞను ఎట్లు పాటింపవలయునో జ్ఞాని ఎరుగును.
6. ఏ కార్యమునైన సక్రమముగా చేయవలెనన్న ఒక కాలమును, ఒక పద్ధతిని అనుసరింపవలయును. కాని ఈ వివరములు మనకు సరిగా తెలియవు.
7. భవిష్యత్తులో ఏమి జరుగునో మనకు తెలియదు. తెలియ జేయువారును లేరు.
8. ఏ నరుడును తన జీవనకాలమును పొడిగించుకొని మృత్యువునకు దూరము కాజాలడు. మరణ యుద్ధమును ఎవడును తప్పించుకోజాలడు. ఇక్కడ మన మోసములేమియు చెల్లవు.
9. సూర్యునిక్రింద జరుగు కార్యములను చూచినపుడు నేను ఈ సంగతులెల్ల గ్రహించితిని. ఇచట ఒకడు మరియొకని మీద పెత్తనముచేసి, వానికి హాని కలిగించుచున్నాడు. .
10. నేను దుర్మార్గులను సమాధులలో పాతి పెట్టుట చూచితిని. కాని ప్రజలు ఆ సమాధులనుండి తిరిగి రాగానే ఆ దుర్మార్గులు పూర్వము దుష్కార్యములు చేసిన నగరములలోనే వారిని స్తుతింపనారంభించిరి. ఇదియును వ్యర్థమే.
11. నేరము చేసిన వారికి వెంటనే శిక్షపడదు. కనుకనే నరులు భయము విడిచి హృదయపూర్వకముగా చెడుపనులు చేయుచున్నారు.
12. దుర్మార్గులు నూరు నేరములు చేసికూడ బ్రతికి పోవచ్చును. అయినను దేవునికి లొంగియుండినచో అన్నియును సవ్యముగనే జరుగును.
13. “దుర్మార్గునికి సంతోషము లేదు. అతడు దేవుని ఆజ్ఞను పాటింపడు. కనుక నీడవలె రోజులు గడపి, వయసు చెల్లకమునుపే గతించును”. అని జనులు చెప్పుదురు.
14. కాని ఇది నిజము కాదు. వ్యర్ధమైనది ఒకటి సూర్యునిక్రింద దీనికి భిన్నముగా జరుగుటను చూచుచున్నాము. సత్పురుషులు దుర్మార్గులవలె శిక్షననుభవించుచున్నారు. దుర్మార్గులేమో సత్పురుషులవలె సన్మానము పొందుచున్నారు. ఇది యును వ్యర్థమే.
15. కనుక నరుడు సుఖములను అనుభవింపవలెనని నా అభిప్రాయము. తిని, త్రాగి, ఆనందించుటకంటె నరుడు ఈ లోకమున చేయగలిగిన ఉత్తమ కార్యమేమియును లేదు. దేవుడు నరునికి ఈ లోకమున దయచేసిన జీవితకాలములో అతడు కష్టపడి పనిచేసినందులకు అతనికి దక్కు ఫలితమిదియే. -
16. నేను విజ్ఞానమును ఆర్జింపగోరితిని. ఈ లోకములోని సంగతులు తెలిసికోగోరితిని. నేను గ్రహించినదేమనగా, నరుడు రేయింబవళ్ళు నిద్ర మాని కన్నులు తెరచుకొని చూచినను దేవుడు చేయు కార్యములను అర్థము చేసికోజాలడు.
17. నరుడు ఎంత ప్రయత్నించినను ఈ విషయమును గ్రహింప జాలడు. జ్ఞానులకు కూడ ఈ సంగతి తెలియదు. వారు మాత్రము తమకు తెలియుననుకొందురు.
1. నేను ఈ సంగతులన్నిటిని గూర్చి ఆలోచించి చూచినపిదప ఈ విషయము గ్రహించితిని. నీతి మంతులు, వివేకవంతులు చేయుపనులు, వారు చూపు ద్వేషము లును, ప్రేమలునుగూడ దేవుని అధీనమున ఉన్నవి. భవిష్యత్తులో తనకేమి జరుగనున్నదో ఎవరికిని తెలియదు.
2. ధర్మవర్తనులకును, అధర్మవర్తనులకును, పవిత్రుల కును, అపవిత్రులకును, బలులర్పించు వారికిని, అర్పింపనివారికిని, సత్పురుషులకును, పాపులకును, వ్రతము పట్టువారికిని, పట్టనివారికిని కడన ఒకేగతి పట్టుచున్నది.
3. ఈ భూమిమీద జరుగు కార్యములన్నిటిలో ఒక చెడుగుణము కన్పించు చున్నది. అది ఎల్లరికిని కడన ఒకే గతి పట్టుట అనునది. నరులు జీవించినంతకాలమును దుష్టులుగాను, బుద్ధి హీనులుగాను ప్రవర్తించి, ఆ మీదట చనిపోవుచున్నారు.
4. కాని ఇంకను చావకబ్రతికియున్న కుక్క మెరుగు కదా! చచ్చిన సింహముకంటె బ్రతికి ఉన్న కుక్క మెరుగుకదా?
5. బ్రతికి ఉన్నవారికి తాము చత్తుమని తెలియును, చచ్చినవారు ఏమియు ఎరుగరు. వారికిక ఏ బహుమతియు లేదు. ఎల్లరును వారిని విస్మరింతురు.
6. వారి ప్రేమలు, ద్వేషములు, అసూయలు వారితోనే గతించును. ఈ లోకమున జరుగు కార్యములలో వేనిలోను, వారికి ఎప్పటికిని వంతులేదు.
7. ఇక వెళ్ళి నీ భోజనము భుజించి సంతసింపుము. నీ ద్రాక్షసవము సేవించి ఆనందింపుము. దేవుడు ఈ కార్యమునకు సమ్మతించును.
8. ఎప్పుడును శ్వేతవస్త్రములు ధరింపుము. నీ శిరస్సును తైలముతో అభిషేకించుకొనుము.
9. ఈ లోకమున దేవుడు నీకు దయచేసిన నిరక మైన రోజులన్నిటను నీవు ప్రేమించిన భార్యతో కలిసి సుఖింపుము. ఈ లోకమున నివసించుచూ శ్రమపడి పనిచేసినందులకుగాను నీకు కలుగు ప్రతిఫలమిదియే.
10. నీవు చేయదలచుకొన్న పనిని కష్టపడి బాగుగా చేయుము. నీవు పోనున్న పాతాళలోకమున పనిచేయు - టకుగాని, ఆలోచించుటకుగాని, విద్య, విజ్ఞానమును గడించుటకుగాని వీలుపడదు.
11. ఇంకను నేను ఆలోచింపగ, సూర్యుని క్రింద జరుగుచున్న ఈ సంగతి కూడ గమనించితిని. వేగ ముగా పరుగెత్తువారికి పందెములలో గెలుపును, శౌర్యవంతులకు యుద్ధములలో విజయమును సిద్ధించుట లేదు. విజ్ఞానులకు తిండిలేదు, మేథోవంతులకు డబ్బు లేదు, విద్యావంతులకు మన్ననలేదు. అన్నియు అదృష్ట ములను బట్టి కాలవశమున జరిగిపోవుచున్నవి.
12. నరునికి తన కాలమెప్పుడు వచ్చునో తెలియదు. చేపలు పాడువలలో చిక్కుకొనినట్లు, పక్షులు ఉచ్చులలో తగులుకొనినట్లు, నరుడు తలవని తలంపుగా వచ్చు విపత్కాలమున చిక్కుచున్నాడు.
13. విజ్ఞానమును గూర్చి ఇంకొక ముఖ్యమైన అంశమునుగూడ నేను ఈ లోకమున గమనించితిని. :
14. కొద్దిమంది పౌరులు మాత్రమే వసించు చిన్న నగరమొకటి కలదు. ఒక గొప్పరాజు ఆ నగరము మీదికి దాడిచేసి దానిని ముట్టడించెను. దానిచుట్టు గోడలనుకూల్చు మంచెలు కట్టించెను.
15. ఆ నగర మున దరిద్రుడైన విజ్ఞాని ఒకడు కలడు. అతడు తన విజ్ఞానముతో ఆ పట్టణమును కాపాడెను. కాని అతడినెవరును తలంపనైనను లేదు.
16. బలము కంటె జ్ఞానమే గొప్పదని నేనెంచితిని. కాని దరిద్రుని జ్ఞానమునెవరును లెక్కచేయరు. అతని పలుకులనెవరును ఆలింపరు.
17. బుద్ధిహీనుల సభలో పెద్దగా అరచు రాజు కేకలనాలించుటకంటె, మెల్లగా మాట్లాడు విజ్ఞాని పలుకులు వినుట మేలు.
18. ఆయుధముల కంటె విజ్ఞానము మెరుగు. కాని ఒక తప్పిదము వలన మంచిపనులు చాల చెడిపోవును.
1. ఈగలు పడి చచ్చిన బుడ్డిలోని పరిమళతైలమంతయు పాడగును. ఈ రీతిగనే కొద్దిపాటి బుద్దిహీనత నరుని మహావిజ్ఞానమును గూడ నాశనము చేయును.
2. విజ్ఞాని బుద్ధి అతనిని తిన్నగా నడిపించును. మూర్ఖుని బుద్ది అతనిని పెడత్రోవ పట్టించును.
3. దారివెంట నడచునప్పుడు కూడ మూర్యునికి వివేకము చాలదు. కనుక ఎల్లరును అతని బుద్దిహీన తను గుర్తింతురు.
4. రాజునకు నీ మీద ఆగ్రహము కలిగినచో నీవు నీ ఉద్యోగమునకు రాజీనామా చేయవలదు. నీవు నెమ్మదిగా నుందువేని పెద్ద తప్పులుకూడ మన్నింప బడును.
5. రాజు అవివేకము వలన ఉత్పన్నమైన అనర్గము నొకదానిని నేను గమనించితిని.
6. బుద్ధి హినులకు పెద్ద ఉద్యోగములు లభింపగా, ధనికులు క్రింది స్థానములోనే ఉండిపోయిరి.
7. బానిసలు గుఱ్ఱముల నెక్కి తిరుగగా, రాజకుమారులు బానిసలవలె కాలి నడకన పోయిరి.
8. గోతిని త్రవ్వువాడు దానిలోనే కూలును, గ కంచె కొట్టువానిని పాము కరచును.
9. రాళ్ళు కొట్టువాడు రాతి వలననే గాయపడును. చెట్లు నరుకువానికి వానివలననే దెబ్బ తగులును.
10. పదును పెట్టింపనందున గొడ్డలి మొద్దు బారెనేని ఎక్కువ బలముతో నరకవలసి యుండును. ముందుగా జాగ్రత్త పడువానికి ఫలితము కలుగును.
11. మంత్రపుకట్టు లేక పాము కరిచినచో మంత్రగాని వలనను లాభము లేదు.
12. బుద్ధిమంతుని పలుకులు అతడికి గౌరవము తెచ్చి పెట్టును. మూర్ఖుని పలుకులు అతనికి నాశనము తెచ్చిపెట్టును.
13. మూర్చుని మాటలు బుద్దిహీనతతో ప్రారంభ మగును, వెఱ్ఱితనముతో ముగియును.
14. మూర్ఖుడు ఎడతెరపి లేకుండ మాట్లాడును. నరునికి భవిష్యత్తులో ఏమిజరుగునో తెలియదు. తన మరణము తరువాత ఏమి జరుగునో అతనికి తెలియదు.
15. మూర్ఖుని ప్రయాస తుదకు ఇంటికి తిరిగివచ్చుటకు త్రోవ తెలిసికోలేనంతగా అతనిని అలసటకు గురిచేయును.
16. ఏదేశమున యువకుడు రాజగునో, రాజోద్యోగులు రేయెల్ల విందులుచేసికొందురో, ఆ దేశము నాశన మగును.
17. అభిజాతుడైన రాజు రాజ్యము చేయు దేశము, రాజోద్యోగులు త్రాగుబోతులుగాక మితముగా భుజించు రాజ్యము, భాగ్యములు బడయును.
18.ఇంటి యజమాని సోమరియైనచోడ, ఇంటి కప్పులు కూలును. ఇల్లు వానకు కారి నేలమట్టమగును.
19. విందులు ఆరగించుటవలన సంతసమును, మద్యము సేవించుటవలన ఆనందమును కలుగును, కాని ఇవన్నియు ధనము వలననే సాధ్యపడును.
20.నీ మనసులోగూడ రాజును విమర్శింపకుము. ఏకాంతముననైన ధనికులను దూయబట్టకుము. ఆకాశపక్షులు నీ మాటలను వారి చెంతకు కొనిపోవును. రెక్కలుగల ప్రాణి నీ పలుకులను వారికెగిరించును.
1. నీ ధనమును వాణిజ్యమున వినియోగించి నచో అనతికాలముననే నీకు పెద్ద లాభము చేకూరును.
2. నీ డబ్బును పలువిధములైన వర్తకములలో విని యోగింపుము. ఈ లోకమున ఎట్టి దురదృష్టము పట్టునో చెప్పలేము.
3. చెట్టు ఎటువైపు పడినను అది పడినచోటనే ఉండును. మేఘములు నీటితో నిండియున్నపుడు వాన కురియును.
4. గాలివాటు కొరకు వేచియుండువాడు విత్తనము జల్లజాలడు. వానకొరకు ఎదురు చూచువాడు పంటను సేకరింపలేడు.
5. తల్లిగర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు. అలాగుననే సమస్తమును సృష్టించు ఆ దేవుని క్రియలను నీవెరుగవు.
6. ఉదయమున విత్తుము. సాయంకాలమునగూడ ఆ పనినే కొనసాగింపుము. ఉదయము విత్తిన పైరే ఫలించునో, లేక సాయంకాలము విత్తిన పైరే ఫలించునో మనకు తెలియదు. రెండూ ఫలించినా ఫలింపవచ్చును.
7. వెలుతురు మనోజ్ఞమైనది. సూర్యుని చూచిన నేత్రములు ఆనందించును.
8. నరుడు చాలయేండ్లు జీవింపవచ్చును. అట్లు జీవించి నందుకుగాను సంతోషింపవచ్చునుగూడ. కాని అతడు గడపవలసిన అంధకారపు రోజులు మాత్రము చాలయుండును. మనకు రానున్న భవిష్యత్కాలమంతయు నిరర్థకమైనది.
9. యువకుడా! నీ యవ్వనమును అనుభవింపుము. నీ యవ్వనకాలమును చూచి సంతసింపుము. నీ మనస్సు కోరిన కోరికలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము. అయితే వీటినన్నిటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము.
10.నీ మనస్సునుండి విచారమును తొలగింపుము. నీ శరీరమునుండి బాధలను దూరము చేయుము. ఎందుకనగా యవ్వనము, యుక్తప్రాయము దీర్ఘ కాలము నిలుచునవికావు.
1. కనుక నీవు యువకుడుగానున్నపుడే, ఈ జీవితము మీద నాకిక ఆసక్తిలేదని నుడువవలసిన దుర్దినములు ప్రాప్తింపకమునుపే, నీ సృష్టికర్తను స్మరించుకొనుము.
2. ఆ కాలమున నీకు సూర్యచంద్ర నక్షత్రాదుల కాంతి స్పష్టముగా కన్పింపదు. జోరున కురియు విషాద మేఘములు ఏనాడును విడిపోవు.
3. అపుడు ఇంతవరకు నిన్ను కాపాడిన చేతులు వణకును. ఇంతదనుక బలముగానున్న నీ కాళ్ళు కూలబడును. నీ పండ్లు రాలిపోవును. నీ కన్నులు వెలుతురును సరిగా చూడజాలవు.
4. వీధిలోని తలుపులు శబ్దములను చేయవు. తిరుగటిరాళ్ళ ధ్వని తగ్గిపోవును. పిట్టకూతకు ఒకడు లేచును. సంగీతమును చేయు స్త్రీలు, నాదము చేయువారందరును నిశ్శబ్దముగా ఉందురు.
5. అపుడు నీవు మెరకలను ఎక్కజాలవు. అటునిటు కదలుటగూడ ప్రమాదకరమగును. నీ తల వెంట్రుకలు నెరసి తెల్లనగును. నీవు కష్టముతోగాని అటునిటు కదలజాలవు. నీ యెదలోని కోర్కెలన్నియు సమసిపోవును. అపుడు నరుడు తన శాశ్వత నివాసమునకు వెడలి పోవును. అతని కొరకు శోకించువారు వీధులలో ఇటు నటు తిరుగాడుదురు.
6. అపుడు వెండి గొలుసు తెగిపోవును. బంగారు గిన్నె బద్దలైపోవును. ఊటయెద్ద కుండ ముక్కలైపోవును. బావిమీద గిలక విరిగిపోవును.
7. నరుని దేహము ఏ మట్టినుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును. అతని ఆత్మ దానిని దయచేసిన దేవుని చేరుకొనును.
8. కనుక అంతయు వ్యర్థమే. సర్వము వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పు చున్నాడు.
9. ఉపదేశకుడు విజ్ఞాని. అతడు తనకు తెలిసిన విజ్ఞానమును తోడి ప్రజలకుగూడ బోధించెను. ఆ జ్ఞాని చాలసామెతలను పఠించి వాని భావమును జాగ్రత్తగా పరిశీలించి చూచెను.
10. అతడు చదువరు నలకు ప్రీతినిగొల్పు భాషలో గ్రంథము వ్రాసెను. అతడు వ్రాసినది సత్యమే.
11. విజ్ఞానులవాక్యములు కాపరులు గొఱ్ఱెల మందలను అదలించుటకు వాడు ములుకోలల వంటివి. అవి నేలలో లోతుగా నాటిన మేకులవలె స్థిరముగా నుండిపోవును.
12. కుమారా! కడన ఒక్క హెచ్చరిక చేయు చున్నాను. పుస్తకరచనకు అంతములేదు. అధిక పఠనము అలసట తెచ్చిపెట్టును.
13. ఇంతవరకు చెప్పినదాని సారాంశమేమనగా - దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటింపుము. నరుని ప్రధాన ధర్మమిదియే.
14. నరులు చేసిన పనులు మంచివికావచ్చును, చెడ్డవికావచ్చును. కాని వాని కన్నిటికిని దేవుడు తీర్పు తీర్చును,