ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు

1. యెహోషువ చనిపోయిన తరువాత యిస్రాయేలీయులు యావేను సంప్రతించి “కనానీయులతో పోరాడుటకు మాలో మొదట ఎవరిని పొమ్మందువు?” అని అడిగిరి.

2. యావే “యూదీయులు' మొదట యుద్ధమునకు పోవలయును. నేను ఆ దేశమును వారి వశముచేసెదను” అని చెప్పెను.

3. యూదీయులు షిమ్యోనీయులతో “మీరు మా నేల మీదికి వచ్చి మాతో పాటు కనానీయులతో పోరాడుడు. అటు తరువాత మేము మీ నేలమీదికి వచ్చి మీ పక్షమున పోరాడెదము” అనిరి.

4. కనుక షిమ్యోనీయులు యూదీయులతో దండువెడలిరి. కనానీయులమీదికి యూదీయులు పోయినపుడు యావే కనానీయులను, పెరిస్సీయులను వారివశము చేసెను. యూదీయులు బేసెకువద్ద శత్రువులను పదివేలమందిని చంపివేసిరి.

5. అచటనే అదోనిసెదెకు అను రాజును ఎదిరించి అతనితో వచ్చిన కనానీయులను, పెరిస్సీయులను చెల్లాచెదరు చేసిరి.

6. అదోనిసెదెకు యుద్ధము నుండి పారిపోవుచుండగా యూదీయులు అతనిని వెంటాడి పట్టుకొనిరి. అతని కాలు చేతులందలి బొటన వ్రేళ్ళను కోసివేసిరి.

7. అదోనిసెదెకు “నేను డెబ్బదిమంది రాజులకు బొటనవ్రేళ్ళు తీయించితిని. వారు నా భోజనశాలవద్ద పడియుండి నేను విసరివేసిన మెతుకులు తిని బ్రతుకు చున్నారు. నేను వారికి చేసినట్లే దేవుడు నాకును చేసెను” అనెను. యూదీయులు అతనిని యెరూషలేమునకు కొనివచ్చిరి. అతడు అచటనే చనిపోయెను.

8. యూదీయులు యెరూషలేమును ముట్టడించి పట్టుకొనిరి. పౌరులను కత్తివాదరకు ఎరజేసి నగరమును కాల్చివేసిరి,

9. అటుతరువాత యూదీయులు కొండలమీద, లోయలలో, ఎడారియందు వసించు కనానీయులతో యుద్ధము చేయబోయిరి. ఆ పిమ్మట హెబ్రోనున వసించు కనానీయులను ఎదిరించిరి.

10. అంతకు ముందు హెబ్రోనునకు కిర్యతార్బా అని పేరు. వారు షేషయి, అహీమాను, తల్మయీలను ఓడించిరి.

11. అచటినుండి దెబీరుపై దాడివెడలిరి. దెబీరునకు పాత పేరు కిర్యత్సేఫేరు.

12. కాలేబు “కిర్యత్సేఫేరును ముట్టడించి పట్టుకొనిన వీరునికి నా కూతురు అక్సాను ఇచ్చి పెండ్లి చేసెదను” అనెను.

13. కాలేబు చిన్న తమ్ముడగు కనసు కుమారుడు ఒత్నీయేలు నగరమును ముట్టడించి పట్టుకొనెను. కాలేబు అతనికి అక్సాను ఇచ్చి వివాహము చేసెను.

14. ఆమె కాపురమునకు వచ్చినపుడు ఒత్నీయేలు మీ తండ్రిని పొలమిమ్మని అడుగుమని ప్రోత్సహించెను. ఆమె గాడిదనుండి దిగి నిలచుండెను. కాలేబు "తల్లీ! నీకేమి కావలయును?” అని అడిగెను.

15. అక్సా తండ్రితో "నాయనా! నాకు ఒక వరమిమ్ము. నన్ను నేగేబు ఎడారిసీమకు పంపితివి. కనుక నీటి బుగ్గలను కూడ దయచేయుము” అనెను. కాలేబు కుమార్తెకు ఎగువ నీటి బుగ్గలను, దిగువ నీటి బుగ్గలను ఇచ్చివేసెను.

16. మోషే మామ కేనీయుడు గదా! అతని సంతతి వారు యూదీయులతో పాటు ఖర్జూరముల నగరము నుండి వెడలిపోయి ఎడారియందలి అరదు వద్ద అమాలెకీయుల చెంత వసించిరి

17. తరువాత యూదీయులు షిమ్యోనీయులతో దండువెడలి కనానీయుల సేఫాత్తును ముట్టడించి శాపముపాలు చేసిరి. అప్పటి నుండి ఆ నగరమునకు హోర్మా అని పేరు వచ్చెను.

18. యూదీయులు గాజా, అష్కలోను, ఎక్రోను పట్టణ ప్రదేశములను పట్టుకొనిరి.

19. యావే తోడ్పాటువలన యూదీయులు యూదా కొండ సీమలను జయించిరి. కాని మైదానములలో వసించు జనులకు ఇనుపరథములు ఉన్నందువలన వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. .

20. మోషే సెలవిచ్చినట్లే యిస్రాయేలీయులు హెబ్రోనును కాలేబునకు ఇచ్చిరి. అతడు అనాకు కుమారులు మువ్వురను అచటినుండి తరిమివేసెను.

21. కాని బెన్యామీనీయులు యెరూషలేమున వసించు యెబూసీయులను వెడలగొట్టలేక పోయిరి. వారు నేడును బెన్యామీనీయులతో పాటు యెరూషలేముననే వసించుచున్నారు.

22. యోసేపు వంశీయులు బేతేలు నగరము మీదికి యుద్ధమునకు పోయిరి. యావే వారికి తోడ్పడెను.

23. వారు బేతేలునకు వేగులవారిని పంపిరి. పూర్వము ఆ నగరము పేరు లూసు.

24. వేగుల వాండ్రు పురమునుండి వచ్చు నరునొకనిని చూచి “మాకు నగరము ప్రవేశించు మార్గము తెలియజేసెదవేని నిన్ను చంపక వదలివేసెదము” అనిరి.

25. అతడు వారికి త్రోవ చూపెను. వేగులు పట్టణమున ప్రవేశించి వీరులనందరిని కత్తివాదరకెరచేసిరి. త్రోవచూపిన నరుని, అతని కుటుంబమును మాత్రము వదలిరి.

26. ఆ నరుడు హిత్తీయుల మండలమునకు వెడలి పోయి అచ్చట ఒక నగరము నిర్మించి దానికి లూసు అని పేరు పెట్టెను. నేటికిని దాని పేరు అదియే.

27. మనష్షే వంశీయులు బేత్-షోయాను, తానాకు, దోరు, యిబ్లెయాము, మెగిద్ధో పట్టణములను వాని ప్రాంత గ్రామములను వశపరచుకోలేదు. ఆ ప్రాంతములందు కనానీయుల ప్రాభవము చెల్లుచుండెను.

28. కాని యిస్రాయేలీయులు బలవంతులైన పిదప, కనానీయులను తరిమివేయక పోయినను వారిచే వెట్టి చాకిరిచేయించుకొనిరి.

29. ఎఫ్రాయీము వంశీయులు కనానీయులను గేసేరు నుండి తరిమివేయలేదు. గేసేరులో కనానీయులు వారి మధ్యన నివసించిరి.

30. సెబూలూను వంశీయులు కిత్రోను, నహలోను పట్టణవాసులను వెళ్ళగొట్టలేదు. కనానీయులు సెబూలూను వంశీయుల మధ్య జీవించిరి. కాని వారికి వెట్టిచాకిరి చేసిరి.

31. ఆషేరు వంశీయులు అక్కో, సీదోను, అహ్లాబు, అక్సీబు, ఎల్బా, ఆఫెకు, రహొబు నగరవాసులను పారద్రోలలేదు.

32. ఆషేరు వంశీయులు ఆ ప్రాంతములందు వసించు కనానీయులను వెడలగొట్టక వారిమధ్య నివసించిరి.

33. నఫ్తాలి వంశీయులు బేత్పైమేషు, బేతనాతు పౌరులను వెళ్ళ గొట్టలేదు. కాని ఆ పౌరులచే వెట్టిచాకిరి చేయించు కొనిరి.

34. అమోరీయులు దాను వంశీయులను కొండలలోనికి తరిమికొట్టి క్రింద మైదానమునకు రానీయకుండ అడ్డుపడిరి.

35. అమోరీయులు హరేసు, అయ్యాలోను నందలి హోరేసు కొండలోను, షాల్బీము మండలములలో వసింప గట్టి పట్టుపట్టియుండగా, యోసేపు కుటుంబమువారు వృద్ది చెంది అమోరీయులను అణగదొక్కిరి. వారిచే వెట్టిచాకిరి చేయించుకొనిరి.

36. అమోరీయుల పొలిమేర అక్రాబిమ్ కొండనుండి సేలా కొండమీది భాగముల వరకు వ్యాపించియుండెను.

1. యావేదూత గిల్గాలునుండి బోకీమునకు వచ్చి యిస్రాయేలీయులతో “నేను మిమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చితిని. మీ పితరులకు వాగ్దానము చేసిన మీ దేశమునకు మిమ్ము చేర్చితిని. నేను మీతో చేసికొనిన నిబంధనమును మీరను అని మాట ఇచ్చితిని.

2. మీ మట్టుకు మీరు ఈ దేశీయులతో నిబంధనము చేసికోగూడదనియు వారి బలిపీఠములను కూలద్రోయవలెననియు ఆజ్ఞాపించితిని. కాని మీరు నా మాట పెడచెవిని పెట్టితిరి. ఇట్లు చేయనేల?

3. ఇక నా నిర్ణయమును ఆలింపుడు. నేను ఈ దేశీయులను మీ యొద్ద నుండి వెళ్ళగొట్టను. వారు మిమ్ము పీడించి పిప్పిచేయుదురు. ఈ దేశీయులు పూజించు దేవతల ఉరులలో మీరు చిక్కుకొందురు” అనెను.

4. యావేదూత ఇట్లు పలుకగా విని యిస్రాయేలీయులు పెద్దపెట్టున విలపించిరి.

5. ఆ తావునకు బోకీము' అని పేరు పెట్టి అచట యావేకు బలులు అర్పించిరి.

6. అంతట యెహోషువ జనులను పంపివేయగా వారు వెడలిపోయి యెవరి వారసత్వ భూమిని వారు స్వాధీనము చేసికొనిరి.

7. యెహోషువ బ్రతికియున్న న్నినాళ్ళు యిస్రాయేలీయులు యావేను కొలిచిరి. యెహోషువ సమకాలికులును, యావే చేసిన మహాకార్యములను కన్నులార చూచిన పెద్దలును బ్రతికియున్నంత కాలము యిస్రాయేలీయులు యావేను సేవించిరి.

8. నూను కుమారుడును యావే దాసుడునగు యెహోషువ నూటపదియేండ్లు జీవించి కన్నుమూసెను.

9. అతనిని గాషు పర్వతమునకు ఉత్తరముగా నున్న ఎఫ్రాయీము కొండసీమలో తిమ్నాత్-సెరా చెంత అతని వారసత్వ భూమియందే పాతి పెట్టిరి. యెహోషువ తరము వారందరు కాలముచేసిరి.

10. అటుతరువాత యావేను గాని, ఆ ప్రభువు యిస్రాయేలీయులకు చేసిన అద్భుత కార్య ములను గాని తెలుసుకోజాలని మరియొక తరముల వారు వృద్ధిచెందిరి.

11. యిస్రాయేలీయులు దుష్టకార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. బాలు దేవతలను పూజించిరి.

12. తమ్ము ఐగుప్తునుండి నడిపించుకొని వచ్చిన పితరుల దేవుడు యావేను విడనాడి, చుట్టు ప్రక్కలనున్న అన్యజాతుల దైవములకు మ్రొక్కి ఆ ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి.

13. యావేను విడనాడి బాలు, అష్టారోతు దేవతలను సేవించిరి.

14. యావే మహోగ్రుడై తన ప్రజలను దోపిడిగాండ్ర వశముచేయగా వారు యిస్రాయేలీయులను దోచుకొనిరి. చుట్టుపట్లనున్న శత్రువులవశము చేయగా వారు యిస్రాయేలీయులను అణగదొక్కిరి.

15. యావే తాను ముందుగా వక్కాణించినట్లే ప్రతి యుద్ధము నందును యిస్రాయేలీయులకు వ్యతిరేకముగా నిలచి వారిని ముప్పుతిప్పలు పెట్టెను. అందుచే వారు మిగుల వగచిరి.

16. యావే యిస్రాయేలీయుల మీద న్యాయాధి పతులను నియమించి దోపిడిగాండ పీడనుండి వారిని కాపాడెను.

17. అయినను ఆ ప్రజలు న్యాయాధిపతులను లెక్కచేయక అన్యజాతుల దైవములను ఆరాధించిరి. పూర్వము యావే ఆజ్ఞలకు బద్దులైన పితరులు నడచిన మార్గమునుండి వైదొలగిరి. వారు పూర్వుల సాంప్రదాయములను పాటింపలేదు.

18. యావే యిస్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించినపుడు తానును ఆ న్యాయాధిపతికి బాసటయైయుండి అతడు జీవించినంతకాలము ప్రజలను శత్రువుల నుండి కాపాడెను. ఎందుకనగా శత్రువుల రాపిడికి తాళలేక ప్రజలు మొరపెట్టగా యావే వారిని కరుణించెను.

19. కాని ఆ న్యాయాధిపతి చనిపోవగనే ప్రజలు మరల దుష్టకార్యములకు పూనుకొని ముందటితరము వారికంటెను అధికముగా భ్రష్టవర్తనులైపోయిరి. అన్యదైవములకు కైంకర్యము చేసిరి. ఆ రీతిగా యిస్రాయేలీయులు చాలకాలమువరకు తమ చెడు పనులను మాననులేదు, మొండిపట్టును విడనాడనులేదు.

20. కనుక ప్రభువు మహోగ్రుడై “ఈ ప్రజలు మునుపు నేను వీరి పితరులతో చేసిన నిబంధనమును పాటించుటలేదు. నా ఆజ్ఞలను వీరు లెక్కచేయుట లేదు.

21. యెహోషువ చనిపోయినప్పటినుండి ఈ నేలపై మిగిలియున్న అన్యజాతులను ఇక వీరి చెంత నుండి తరిమివేయను” అనుకొనెను.

22. యిస్రాయేలీయులు తమ పితరుల వలె యావే మార్గమును అనుసరింతురో లేదో పరీక్షచేసి తెలిసికొనుటకే ప్రభువు అన్యజాతులను అచ్చట నిలువనిచ్చెను.

23. కనుక నాడు యావే అన్యజాతులను వెంటనే వెళ్ళగొట్టలేదు, వారిని యెహోషువ వశము చేయలేదు.

 1. కనాను దేశమున వసించుచు, పోరాట తీరు ఎరుగని యిస్రాయేలీయులకు యుద్ధము నేర్పుటకై యావే ఆ దేశమున నిలువనిచ్చిన అన్యజాతుల పేర్లివి.

2. యిస్రాయేలు జనుల పలుతెగలవారికి, విశేషముగా పూర్వ యుద్ధముల నెరుగనివారికి, పోరాటము నేర్పుటకే యావే అన్యజాతులను అచ్చట నిలువనిచ్చెను.

3. ఫిలిస్తీయదొరలు ఐదుగురు, కనానీయులు, సీదోనీయులు, బాలుకొండసీమ నుండి హమాతుకనుమ వరకు లెబానోనున జీవించిన హివ్వీయులు యావే నిలువనిచ్చిన జాతులు.

4. యావే మోషే ద్వారా పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను యిస్రాయేలీయులు పాటింతురో లేదో తెలిసికొనునట్లు వారిని పరీక్షించుటకై ఈ జాతులు ఉపయోగపడినవి.

5-6. యిస్రాయేలు ప్రజలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, యెబూసీయులు మొదలైన జాతులతో కలిసి జీవించిరి. ఆ ప్రజలతో వియ్యమందుకొని వారి దేవతలను కొలిచిరి.

7. యిస్రాయేలీయులు దుష్టకార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. యావేను మరచిపోయి బాలు, అషేరా మొదలైన దేవతలను సేవించిరి.

8. యావే మహోగ్రుడై వారిని మెసపోతోమియ రాజగు కూషన్రిషాతయీము వశముచేసెను. ఆ రాజు యిస్రాయేలీయులను ఎనిమిదేండ్లు దాసులనుగా ఏలెను.

9. అంతట యిస్రాయేలీయులు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికొక రక్షకుని లేవనెత్తెను, కాలేబు చిన్నతమ్ముడును, కనసు కుమారుడగు ఒత్నీయేలు యిస్రాయేలీయులను రక్షించెను.

10. యావే ఆత్మ ఒత్నీయేలును ఆవేశించెను. అతడు యిస్రాయేలీయులకు న్యాయాధిపతియై శత్రువులతో యుద్ధమునకు సన్నద్ధుడయ్యెను. రాజైన కూషన్రిషాతయీము ఒత్నీయేలు వశముచేసెను. ఒత్నీయేలు ఆ రాజును ఓడించెను.

11. అటు తరువాత యిస్రాయేలీయులు నలువదియేండ్లు చీకుచింత లేకుండ జీవించిరి.

12. కాని కనసు కుమారుడగు ఒత్నీయేలు గతింపగనే యిస్రాయేలీయులు మరల దుష్టకార్య ములు చేసి యావేకు కోపము రప్పించిరి. ప్రభువు మోవాబురాజు ఎగ్లోనును యిస్రాయేలీయులపై పురికొల్పెను. ఆ ప్రజలు దుష్టకార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి గదా!

13. ఎగ్లోను అమ్మోనీయులను, అమాలేకీయులను ప్రోగుజేసికొని వచ్చి యిస్రాయేలీయుల మీదబడి వారి ఖర్జూర వృక్షముల నగరమును స్వాధీనము చేసికొనెను.

14. కనుక యిస్రాయేలీయులు మోవాబురాజు ఎగ్లోనునకు దాసులై పదునెనిమిదియేండ్లు అతనికి ఊడిగము చేసిరి.

15. అంతట యిస్రాయేలీయులు యావేకు మొరపెట్టగా ప్రభువు వారికి ఏహూదు అను రక్షకుని లేవనెత్తెను. అతడు బెన్యామీనీయుడగు గేరా కుమారుడు. ఎడమ చేతివాటమువాడు. యిస్రాయేలీయులు అతని ద్వారా మోవాబురాజైన. ఎగ్లోనునకు కప్పపు కానుకలు పంపుకొనిరి.

16. ఏహూదు మూరెడు పొడుగు గల రెండంచుల కత్తిని ఒక దానిని తయారు చేసికొని, తన దుస్తులక్రింద కుడితొడమీద వ్రేలాడ గట్టుకొనెను.

17. అతడు కప్పముకొనిపోయి మోవాబు రాజు ఎగ్లోనునకు సమర్పించెను. ఆ రాజు చాల లావైనవాడు.

18. ఏహూదు కప్పమును చెల్లించి, దానిని మోసిన పరిజనముతో తిరిగిపోయెను.

19. కాని అతడు గిల్గాలు ప్రతిమలదాక సాగిపోయి మరల ఎగ్లోను వద్దకు తిరిగివచ్చి “రాజా! నీకొక రహస్య సందేశము కొనివచ్చితిని” అనెను, ఎగ్లోను తన పరివారమంతయు అచటనుండి. లేచి వెడలిపోవు వరకు ఊరకుండ వలసినదిగా ఏహూదుతో చెప్పెను.

20. ఏహూదు రాజు దగ్గరకు వచ్చినపుడు, రాజు మిద్ధేమీది చలువగదిలో ఒంటరిగా కూర్చుండెను. ఏహూదు “రాజా! నీకొక దైవసందేశము వినిపింపవలెను” అని పలికెను. రాజు తన ఆసనము నుండి లేచి నిలబడెను.

21. వెంటనే ఏహూదు తన ఎడమచేతితో కుడితొడ మీద వ్రేలాడుకత్తిని దూసి ఎగ్లోను కడుపున పొడిచెను.

22. కత్తితోపాటు పిడికూడ ఎగ్లోను పొట్టలో దూరగా క్రొవ్వు వెలుపలికి వచ్చి కత్తిని కప్పివేసెను. కత్తి అతని వెనుక నుండి బయటికి వచ్చిన కారణమున ఏహూదు దానిని బయటికి తీయలేక పోయెను.

23. అతడు మీది గది తలుపులు లాగి, లోపల బిగించి తాను వెడలిపోయెను.

24. ఏహూదు వెడలిపోయిన తరువాత రాజ సేవకులు వచ్చి చూడగా తలుపులు లోపల బిగింపబడి యుండెను. వారు రాజు తన చలువగదిలో కాల కృత్యములు తీర్చుకొనుచుండెను కాబోలు అనుకొనిరి.

25. సేవకులు కొంత తడవాగి ఏమి జరిగినదోయని విస్తుపోవజొచ్చిరి. అయినను వారి రాజు మీది గది తలుపులు తెరవలేదు. కడకు పరిచారకులు వారి నిగునంతకెళ్ళ బీగము కొనివచ్చి తలుపులు తెరచి చూడగా రాజు చనిపోయి నేలపై పడియుండెను.

26. సేవకులు రాజుకొరకు మీది గది యొద్ద వేచియుండగనే ఏహూదు తప్పించుకొని పారిపోయెను. అతడు గిల్గాలు ప్రతిమలను దాటి సెయీరా మండలమునకు వెడలిపోయెను.

27. ఆ చోటు చేరగనే ఎఫ్రాయీము కొండసీమలో బాకానూదెను. యిస్రాయేలీయులు కొండల నుండి దిగివచ్చి ఏహూదును కలసికొనిరి.

28. అతడు వారితో “మీరు నా వెంట త్వరపడిరండు. యావే శత్రుప్రజలైన మోవాబీయులను మీ వశము చేసెను” అనెను. కనుక యిస్రాయేలీయులు అతని వెంట నడచిరి. వారు మోవాబు ప్రక్కనున్న యోర్దాను రేవును వశపరచుకొని యెవ్వరిని నది దాటనీయకుండ అడ్డుపడిరి.

29. నాడు మోవాబీయులను పదివేలమందిని చంపిరి. హతులైన వారందరు మెరికలవంటి యోధులు. వారిలో ఒక్కడును తప్పించుకోలేదు.

30. ఆ దినమున మోవాబు మరల లొంగిపోయెను. మరల యెనుబది ఏండ్ల వరకు యిస్రాయేలీయులు కడుపులో చల్ల కదలకుండ బ్రతికిరి.

31. అటు తరువాత అనాతు కుమారుడు షమ్గరు న్యాయాధిపతి అయ్యెను. అతడు ములుకోలతో ఆరు వందలమంది ఫిలిస్తీయులను మట్టుపెట్టెను. షమ్గరు కూడ యిస్రాయేలీయులను రక్షించెను.

 1. ఏహూదు చనిపోవగానే యిస్రాయేలీయులు మరల దుష్కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి.

2. కనుక యావే వారిని హాసోరు రాజైన యాబీను చేతికి అప్పగించెను. యాబీను సైన్యాధిపతి సీస్రా. అతడు అన్యజాతులకు చెందిన హరోషెతు నగరమున నివసించుచుండెను.

3. యాబీనునకు తొమ్మిదివందల ఇనుపరథములు కలవు. అతడు ఇరువది ఏండ్లు యిస్రాయేలీయులను పీడించి పిప్పి చేసెను. ఆ బాధ భరింపలేక వారు యావేకు మొర పెట్టుకొనిరి.

4. ఆ రోజులలో దెబోరా అను ప్రవక్తి యిస్రాయేలీయులకు తీర్పుతీర్చుచుండెను. ఆమె లప్పీదోతు భార్య.

5. ఎఫ్రాయీము కొండలలో రామా, బేతేలు నగరములకు మధ్యనున్న “దెబోరా ఖర్జూరము చెట్టు” క్రింద కూర్చుండియుండెడిది. యిస్రాయేలీయులు ఆమె చెంతకు వచ్చి తమ తగవులను పరిష్కరించు కొనెడి వారు.

6. ఆమె ఒకనాడు నఫ్తాలి మండలము నందలి కేదేషుకు చెందిన అబీనోవము కుమారుడు బారాకును పిలిపించి “వినుము, యిస్రాయేలు దేవుడైన యావే ఆజ్ఞ ఇది. నీవు నఫ్తాలి, సెబూలూను మండలముల నుండి పదివేలమంది యోధులను ప్రోగుజేసికొని తాబోరు కొండకు నడువుము.

7. యాబీను సైన్యాధిపతియైన సీస్రా సైన్యములతో, రథములతో వచ్చి కీషోను వాగు వద్ద నిన్ను ఎదుర్కొనునట్లు చేయుదును. అతనిని నీ వశము చేయుదును” అని చెప్పెను.

8. బారాకు ఆమెతో “నీవును నా వెంట వచ్చెదవేని నేను వెళ్ళెదను. నీవు రావేని నేనును వెళ్ళను” అనెను.

9. దెబోరా "నేను తప్పక నీతో వత్తును. కాని ఈ పయనము వలన నీకు కీర్తి కలుగదు. ప్రభువు సీస్రాను ఒక ఆడుపడుచు చేతికి అప్పగించును” అని చెప్పెను. అంతట దెబోరా బారాకుతో కేదేషునకు వెడలిపోయెను.

10. బారాకు సెబూలూను, నఫ్తాలి వీరులను కేదేషునకు పిలిపింపగా పదివేలమంది వచ్చి అతనిని అనుసరించిరి. దెబోరా బారాకు వెంటవెళ్ళెను.

11. అపుడు కేనీయుడైన హెబెరు కేనీయులతోను, మోషే మామయగు హోబబు సంతతివారితోను సంబంధము తెంచుకొని కేదేషు చెంతగల సాననీము లోని సింధూర వృక్షమువద్ద వసించుచుండెను.

12-13. అబీనోవము కుమారుడు బారాకు తాబోరు కొండమీద దండుదిగియున్నాడని విని సీస్రా తన సైన్యములను, తొమ్మిది వందల ఇనుపరథములను ప్రోగుచేసికొనెను. అతడు అన్యజాతులు వసించు హరోషెతు నుండి తన దళములన్నిటిని పిలిపించి కీషోను లోయలో ప్రోగుచేసెను.

14. అపుడు దెబోరా బారాకును హెచ్చరించి “పోయి శత్రువుపై పడుము. నేడు యావే సీస్రాను నీ వశము చేసెను. ప్రభువు నీ సైన్యమునకు ముందుగా తరలి పోవును” అని చెప్పెను. బారాకు పదివేలమందిని వెంటనిడుకొని తాబోరు కొండదిగి శత్రువు ఎదుటికి వచ్చెను.

15. బారాకు రాగానే యావే సీస్రాకు, అతని రథములకు, సైన్యములకు భయము పుట్టించి వారిని కలవరపరచెను. సీస్రా రథముదిగి బ్రతుకు జీవుడాయని పిక్కబలముకొలది పారిపోయెను.

16. బారాకు అతని రథములను, సైన్యములను హరోషెతు-హగోయిము వరకు తరిమి కొట్టెను. సీస్రా సైన్యమంతయు కత్తివాదరకు ఎరయయ్యెను. ఒక్కడు కూడ తప్పించుకొనలేదు.

17. సీస్రా కేనీయుడైన హెబెరుని భార్య యాయేలు వసించు గుడారమువైపు పరుగెత్తెను. ఆ రోజులలో కేనీయుడైన హెబెరునకు, హాసోరు రాజైన యాబీనునకు పొత్తు కలదు.

18. యాయేలు సీస్రాకు ఎదురుపోయి “దొరా! ఇటురమ్ము. మా గుడారమున వసింపుము. ఇచటనేమియు భయపడనక్కరలేదు” అని అతనిని ఆహ్వానించెను. అతడు ఆమె గుడారమున ప్రవే శించెను. యాయేలు సీస్రాను కంబళితో కప్పెను.

19. అతడు నాకు దప్పికయగుచున్నది. కొంచెము దాహమిమ్మనెను. ఆమె సీస్రాకు పాలతిత్తీ విప్పి త్రాగుటకు పాలుపోసి మరల అతనిని కంబళితో కప్పెను.

20. సీస్రా యాయేలుతో “నీవు గుడారము తలుపు నొద్ద నిలువుము. ఎవరైన వచ్చి 'ఇచట ఇతరులెవరైన ఉన్నారా' అని అడిగినయెడల ఎవ్వరును లేరని చెప్పుము” అని పలికెను.

21. సీస్రా అలసిసొలసియుండెను. గనుక మైమరచి గాఢనిద్ర కలిగియుండెను. యాయేలు గుడారపు మేకును, సుత్తెను తీసికొని మెల్లమెల్లగా అతని యొద్దకువచ్చి, మేకును అతని కణతలలో పెట్టి కొట్టగా అది నేలలోనికి దిగబడిపోయెను. ఆ రీతిగా సీస్రా ప్రాణములు విడిచెను.

22. అంతలో బారాకు సీస్రాను వెదకుకొనుచు వచ్చెను. యాయేలు అతనికి ఎదురుపోయి “నా వెంటరమ్ము. నీవు వెదకు మనుజుని చూపింతును” అనెను. అతడు యాయేలు గుడారములోనికి పోయిచూడగా కణతలో దిగబడిన మేకుతో సీస్రా చచ్చిపడియుండెను.

23. ఆ రీతిగా యావే నాడు యిస్రాయేలీయుల ముందర కనాను రాజు యాబీను పొగరణగించెను.

24. ఆ పిమ్మట యాబీను మీద యిస్రాయలీయులదే పైచేయి అయ్యెను. చివరకు వారతనిని పూర్తిగా అణగదొక్కిరి.

 1. ఆ దినమున దెబోరా, అబీనోవము కుమారుడు బారాకు ఈ క్రింది గీతము పాడిరి:

2. “యిస్రాయేలు వీరులు తలసిగలు విప్పుకొని ఉత్సాహముతో పోరునకు వచ్చిరి. కావున ప్రభుని స్తుతింపుడి!

3. రాజులార వినుడి! రాకొమరులార ఆలింపుడి! నేను ప్రభుని కీర్తించెదను. యిస్రాయేలు దేవుడైన యావేను స్తుతించి పాడెదను.

4-5. ప్రభూ! నీవు సేయీరునుండి బయలుదేరినపుడు, ఎదోము నుండి వెడలివచ్చినపుడు, నేల అదరెను, ఆకాశము కంపించెను. మేఘములు కరగి జలములొలికించెను. యిస్రాయేలు దేవుడైన యావేను చూచి కొండలు గడగడలాడెను.

6. అనాతు కుమారుడు షమ్గరు పాలించుచుండగా, యాయేలు ప్రభుత్వము నెరపుచుండగా, పథికులు భయమున రాజపథము విడనాడి ప్రక్క త్రోవలవెంట పయనము సాగించిరి.

7. దెబోరా! నీవు యిస్రాయేలీయులపాలిటి తల్లివలె విజయము చేయువరకును ఈ దేశమంతయు నిర్జీవమై యుండెను.

8. యిస్రాయేలీయులు క్రొత్త దైవములను కొలిచిరి, కాన యుద్ధము ద్వారముకడకు వచ్చినది. ఆ ప్రజలు నలువదివేలమంది ఉన్నను, ఒక్క బల్లెముగాని, డాలుగాని కన్పింపదయ్యెను.

9. యిస్రాయేలు వీరులారా! ధైర్యము వహింపుడు. స్వేచ్ఛగా యుద్ధభూమి చేరిన శూరులారా! మీపై నాకు ప్రేమ కలదు. ప్రభువైన యావేను సన్నుతింపుడు.

10-11. తెల్లనిగాడిదల నెక్కి తివాచీలపై కూర్చుండియున్న పథికులారా! రాజపథమున పయనించు పాంథులారా! ప్రభుని గూర్చి గానముచేయుడు, అదిగో! బావులచెంత గుమిగూడిన వనితల యెదుట సంతసమున పాటలుపాడు జనులను గాంచుడి! వారు ప్రభుని అద్భుతకార్యములను సన్నుతించుచున్నారు. ప్రభుని రక్షణ కార్యములను కొనియాడుచున్నారు అదిగో! యావే ప్రజలు పురద్వారములవద్ద గుమిగూడిరి.

12. దెబోరా! మేల్కొనుము! మేల్కొనుము! నీ విజయగీతికను విన్పింపుము! బారాకు లెమ్ము! అబీనోవము కుమారా లెమ్ము! యిస్రాయేలును చెరపట్టిన వారిని చెరపట్టుము.

13. అదిగో! యావే ప్రజలు పురద్వారములయొద్ద గుమిగూడిరి ప్రభుప్రజలు వీరులవలె నడచివచ్చిరి.

14-15. ఎఫ్రాయీము వీరులు లోయలో పోరాడుచున్నారు. వారి సోదరులు, బెన్యామీనీయులును పోరు సల్పుచున్నారు. మాఖీరు నుండి సైన్యాధిపతులు వచ్చిరి. సెబూలూను నుండి సైనికోద్యోగులు వచ్చిరి. యిస్సాఖారు వీరులు దెబోరా ననుసరించిరి. నఫ్తాలి వీరులు బారాకుతో లోయజొచ్చిరి.

16. రూబేను వీరులు చీలిపోయిరి. వారు వాదవివాదములతో కాలము వెళ్ళబుచ్చిరి. అన్నలార! మీరు గొఱ్ఱెల దొడ్లచెంత గుమిగూడి పిల్లనగ్రోవి పాటవినుచు జాగుచేయనేల?

17. గిలాదు యోర్దానునకు ఆవలియొడ్డుననే నిలిచెను. దాను అన్యజాతి నావలలో చేరెను. ఆషేరు సముద్ర తీరముననే వసించెను. రేవులలోనే రోజులు వెళ్ళబుచ్చెను.

18. సెబూలూను శూరులు చావునకు తెగించి పోరాడిరి. నఫ్తాలి శూరులు వీరావేశముతో కొండపై పెనగిరి.

19. రాజులు వచ్చి పోరుసల్పిరి. కనాను రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువ వద్ద, తానాకు చెంత పోరాడిరి, అయినను వారికి కొల్లసొమ్మేమియు లభింపదయ్యెను.

20. మింటినుండి నక్షత్రములుకూడ పోరాడెను. సీస్రాతో నక్షత్రములు యుద్ధము చేసెను.

21. అతడు కీషోను వాగునబడి కొట్టుకొనిపోయెను. ఆ ప్రాత వాగునపడి కొట్టుకొనిపోయెను. నా ప్రాణమా! బలముతో సాగిపొమ్ము.

22. అవిగో! నీ గుఱ్ఱములు స్వారి చేయుచున్నవి. మహావేగముతో పరుగెత్తుచున్నవి

23. అపుడు యావేదూత ఇట్లు వచించెను: మెరోసును శపింపుడు, శపింపుడు, ఆ పట్టణ వాసులను శపింపుడు. వారు యావేకు సాయము చేయుటకు రారైరి. యావే వీరులతో గూడి పోరుసల్పుటకు రారైరి.

24. కేనీయుడైన హెబేరుని భార్యయగు యాయేలు స్త్రీలందరికంటె ధన్యురాలు. గుడారములందు వసించు వనితలందరి కంటె ధన్యురాలు.

25-26. అతడు దాహమడుగగా ఆమె పాలు కొనివచ్చెను. యోగ్యమైన పాత్రమున పెరుగునందించెను. ఆమె చేయిచాచి గుడారపు మేకు గైకొనెను. కుడిచేతితో సుత్తె గైకొనెను.

27. ఆ సుత్తెతో సీసాను మోది తలబ్రద్దలు చేసెను. అతని కణతలలో మేకు దిగగొట్టెను. అతడామె పాదములచెంత కూలినేలకొరగెను. ఆమె కాళ్ళచెంత కూలి నేల పైబడెను. తాను కూలినచోటనే చచ్చిపడెను.

28. సీిస్రా జనని కిటికి నుండి వెలుపలికి చూచెను. అల్లిక కిటికీ నుండి వెలుపలికి చూచి కేకలిడెను. “నా తనయుని రథమింకను మరలిరాలేదు. రథాశ్వములింకను తిరిగిరాలేదు కారణమేమి చెపుమా” అని వాపోయెను.

29-30. వివేకవతియైన రాజకుమారి ఒకతె ఆమెతో ఇట్లనెను: “మన వీరులు కొల్లసొమ్ము పంచుకొనుచుందురు. మన శూరులలో ప్రతివాడు వనితలనొకర్తెనో ఇద్దరినో గైకొందురు. సీస్రాకు రంగురంగుల పట్టుసాలువలు రెండు లభించును. నాకును నగిషీ పని చేసిన పచ్చడములు రెండు” ఆ మాటలనే సీస్రా జననియు మననము చేసుకొనుచుండెను.

31. ప్రభూ! నీ శత్రువులందరు సీస్రావలె నశింతురుగాక! నిన్ను ప్రేమించు జనులు మాత్రము ఉదయభానునివలె తేజముతో వెలుగొందుదురుగాక!” అటు తరువాత యిస్రాయేలీయులు నలువదియేండ్లు చీకుచింతలేకుండ జీవించిరి.

 1. యిస్రాయేలీయులు మరల దుష్కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. అందుచే యావే వారిని ఏడేండ్లు మిద్యానీయుల వశము చేసెను.

2. మిద్యానీయులు యిస్రాయేలీయులను నేలబెట్టి కాలరాచిరి. యిస్రాయేలీయులు మిద్యానీయులకు భయపడి కొండ బొరియలలో దుర్గములలో దాగుకొనజొచ్చిరి.

3-4. యిస్రాయేలీయులు పైరువేయగనే మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుదేశపు ప్రజలుకూడ దాడిచేయవచ్చి పడెడివారు. యిస్రాయేలు రాజ్యముననే గుడారులు పన్నుకొని గాజావరకు వారి పైరుపంటలు నాశనము చేసెడివారు.వారి ఎడ్లను, గొఱ్ఱెలను, గాడిదలను తోలుకొనిపోయెడివారు. చివరకు యిప్రాయేలీయుల కేమియు మిగిలెడిదికాదు.

5. మిద్యానీయులు తమ పశువులమందలతో గుడారములతో వచ్చి మిడుతల దండువలె దిగెడివారు. వారినిగాని, వారి ఒంటెలను గాని లెక్కింపవలనుపడదు. వారు కాలు పెట్టిన నేల వల్లకాడు కావలసినదే.

6. మిద్యానీయుల దోపిడి వలన యిస్రాయేలీయులకు పొట్టకూడు కూడ కరవై పోయెను. అందుచే వారు యావేకు మొరపెట్టుకొనిరి.

7-8. యిప్రాయేలీయుల మొరవిని ప్రభువు వారి చెంతకు ఒక ప్రవక్తను పంపెను. అతడు “యిస్రాయేలు దేవుడైన ప్రభువు సందేశమిది: నేను మిమ్ము దాస్యగృహము ఐగుప్తునుండి వెలుపలికి కొనివచ్చితిని.

9. ఐగుప్తీయులనుండియు, మిమ్ము బానిసలుగా నేలిన యజమానులనుండియు మిమ్ము కాపాడితిని. వారిని మీ ఎదుటినుండి తరిమివేసి వారి భూములను మీ వశముచేసితిని.

10. మీ దేవుడైన యావేను నేనే కనుక మీరు అమోరీయుల మండలమున వసించునపుడు వారి దైవములను సేవింప వలదని ఆజ్ఞాపించితిని. అయినను మీరు నా మాట పెడచెవిని బెట్టితిరిగదా!” అని వారిని మందలించెను.

11. యావేదూత వచ్చి ఒఫ్రా చెంతగల సింధూర వృక్షము క్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబీయెసీయుని వంశమునకు చెందిన యెవాషునిది. యెవాపు కుమారుడగు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండుటకై, ద్రాక్షపండ్లను తొక్కించు గాటిలోనే గోధుమలను దుళ్ళ గొట్టుచుండగా,

12. ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై 'శూరాగ్రణి! యావే నీకు తోడైయున్నాడు” అని పలికెను.

13. గిద్యోను 'అయ్యా! యావే తోడైయున్నచో మాకు ఈ అగచాట్లేల పట్టును? ప్రభువు మమ్ము ఐగుప్తు నుండి తీసికొనివచ్చెనని మా పూర్వులు వచించెదరు గాని, ఆ అద్భుతకార్యములన్నియు నేడేమైనవి? యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను గదా!” అనెను.

14. యావే అతని వైపు చూచి "నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదికి పొమ్ము. యిస్రాయేలీయులను శత్రువులబారి నుండి రక్షింపుము. నేనే నిన్ను పంపుచున్నాను సుమా!” అని చెప్పెను.

15. గిద్యోను “ప్రభూ! నేనేమిటి, యిస్రాయేలీయులను రక్షించుటేమిటి? మనష్షే తెగన మేము ఊరు పేరులేని వారము. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువయు లేదు” అని పలికెను.

16. యావే అతనితో “ఓయి! నేను నీకు తోడైయుందును. నీవు మిద్యానీయులను ఏకనరునివలె చితుక గొట్టెదవు” అని చెప్పెను.

17. గిద్యోను యావేతో “నేను నీ దయకు పాత్రుడనైతినేని ఇపుడు నాతో మాటలాడినది నీవేననుటకు రుజువుగా నాకొక గురుతునిమ్ము.

18. నేను వెడలిపోయి నా బలియర్పణమును గొనివచ్చి నీ యెదుట నిడువరకు నీవిటనుండి సాగిపోవలదు" అని మనవి చేసికొనెను. అతడు “నీవు వచ్చువరకు నేనిచటనే ఉందును పొమ్ము” అనెను.

19. గిద్యోను వెడలిపోయి ఒక మేకపిల్లను కోసెను. కుంచెడు పిండితో పొంగనిరొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిడికొని మాంసపు చారును చట్టిలో పోసికొని సింధూరము చెంతకు గొనివచ్చెను.

20. ప్రభువుదూత అతనితో “మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము. మాంసపు చారును వానిపై పోయుము” అని చెప్పెను. అతడట్లే చేసెను.

21. ప్రభువుదూత తన చేతికర్రను చాచి దానికొనతో మాంసమును, పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతినుండి గుప్పున మంటలెగసి మాంసమును, పొంగనిరొట్టెలను కాల్చివేసెను. అంతట ప్రభువుదూత అతనికి అదృశ్యమైపోయెను.

22. గిద్యోను అతడు దేవదూతయని గ్రహించి “అయ్యో ప్రభూ! నేను దేవదూతను ముఖాముఖి చూచితిని గదా!" అనుకొని భయపడెను.

23. కాని యావే “నీకు శుభమగుగాక! భయపడవలదు. నీకు ఏ అపాయమును కలుగదు” అని అతనికి అభయమిచ్చెను.

24. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలిపీఠమును నిర్మించెను. దానికి సమాధాన కర్తయైన యావే అని పేరిడెను. నేటికిని ఆ బలిపీఠమును అబీయెసీయుల ఒఫ్రా మండలమున చూడవచ్చును.

25. ఆ రాత్రి యావే గిద్యోనుతో “మీ నాయనకు ఒక బలిసిన కోడెదూడ కలదు గదా! దానిని గైకొనుము. అతడు నిర్మించిన బాలుపీఠమును పడ ద్రోయుము. దాని చెంతగల దేవతాస్తంభమును కూడ నరికి వేయుము.

26. ఆ కుప్పమీదే కొలతల ప్రకారముగా యావేకొక బలిపీఠము నిర్మింపుము. నరికివేసిన దేవతాస్తంభపు కొయ్యను కాల్చి కోడెదూడను బలిపీఠముపై సంపూర్ణ దహనబలిగా అర్పింపుము” అని చెప్పెను.

27. గిద్యోను తన పనివారిని పది మందిని వెంటనుంచుకొని ప్రభువు ఆజ్ఞాపించిన రీతినే చేసెను. కాని అతడు తన కుటుంబ జనమునకు, పట్టణ జనమునకు దడిసెను. కనుక పగటిపూట గాక రేయిన యావే ఆజ్ఞ నెరవేర్చెను.

28. మరునాటి ప్రొద్దున నగరవాసులు మేల్కొని చూడగా అట బాలు బలిపీఠము నిర్మూలమైయుండెను. ఆ చెంతగల దేవతా స్తంభమును కూలియుండెను. ఆ తావున క్రొత్తగా నిర్మింపబడిన బలిపీఠముపై పోతరించిన కోడెదూడ సంపూర్ణదహనబలిగా సమర్పింపబడి యుండెను.

29. పురవాసులందరు ఆ పని చేసినవాడు ఎవడాయని విస్తుపోయిరి. సంగతి తెలిసికొని యోవాషు కుమారుడు గిద్యోను సాహసముతో అంతటి పనిచేసెనుగదా! అనుకొనిరి.

30. కనుక పౌరులు యోవాసుతో “నీ కుమారుని ఇచటికి కొనిరమ్ము. అతడు బాలు బలి పీఠము కూలద్రోసి దాని చెంతగల దేవతాస్తంభమును తెగనరికెను గనుక తప్పక చంపనరుడు” అనిరి.

31. కాని యెవాషు తన యొద్దకు వచ్చిన పౌరులను చూచి “మీరు బాలును సమర్థింతురా? అతనిని మీరు రక్షింపగలరా? బాలును సమర్థించువారందరును ప్రొద్దు పొడవకముందే చంపబడుదురుగాక! బాలు దేవుడేయైన పక్షమున, ఇపుడు తన బలిపీఠము నాశనమైనది గనుక తనను తానే సమర్థించుకొనును గాక!” అనెను.

32. నాటినుండి గిద్యోనునకు యెరూబాలు' అని పేరు వచ్చెను. ఎందుకన ప్రజలు “బాలుపీఠమును గిద్యోను కూలద్రోసెను గనుక బాలు అతనితో వాదించుగాక!” అని అనిరి.

33. అంతట మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశవాసులు పోరునకు తలపడి యోర్దాను నది దాటివచ్చి యెఫ్రాయేలు మైదానమున గుడారములు పన్నిరి.

34. అపుడు యావే ఆత్మ గిద్యోనును ఆవేశింపగా అతడు బాకానూదెను. అబీయెసీయులందరు అతనిని అనుసరించిరి.

35. గిద్యోను మనష్షేయులకు వార్తనంపగా వారును అతని వెంటనంటిరి. ఆషేరు, సెబూలూను, నఫ్తాలి తెగలవారికి కబురంపగా వారును గిద్యోనుతో చేరిరి.

36. అపుడు గిద్యోను ప్రభువుతో “నీవు సెలవిచ్చినట్లు యిస్రాయేలును నా ద్వారా రక్షింపపూనెదవేని ఇట్లు జరుగునుగాక!

37. నేను కళ్ళమున గొఱ్ఱె ఉన్నిని ఉంచెదను. ఆ ఉన్నిమీద మాత్రమే మంచుపడి మిగిలిన నేలయంతయు పొడిగా ఉండినచో, నీవు నుడివినట్లే నా మూలమున యిస్రాయేలును రక్షింతువని తెలిసికొందును” అనెను.

38. అతడు అడిగినట్లే మంచుపడెను. అతడు మరునాడు వేకువనే లేచి గొఱ్ఱె ఉన్నిని పిండిచూడగా ముంతెడు మంచినీళ్ళు కారెను.

39. గిద్యోను మరల యావేతో “నేను ఇంకొక్క మనవి చేసికొన్నచో ప్రభువులవారు ఆగ్రహింప కుందురు గాక! గొఱ్ఱె ఉన్నితో ఇంకొకమారు పరీక్షించి చూచెదను. ఈ మారు గొఱ్ఱెఉన్ని మాత్రము పొడిగా నుండి కళ్ళమందంతట మంచుపడియుండునుగాక!” అనెను.

40. నాటిరాత్రి యావే అట్లే చేసెను. గొఱ్ఱె ఉన్ని మాత్రము పొడిగానుండెను. కళ్ళమందంతటను మంచుపడియుండెను.

 1. యెరూబాలు అనబడు గిద్యోను అతని అనుచరులును వేకువనే ఎన్హారోదు వద్ద శిబిరము పన్నిరి. మిద్యాను సైన్యములు వారికి ఉత్తరముగా మోరే కొండచెంత క్రిందిలోయలో గుడారములు పన్ని యుండెను.

2. యావే గిద్యోనుతో “నీ యొద్ద భటులు చాలమంది ఉన్నారు. ఇంతమంది భటులతోగూడిన మీకు మిద్యానీయులను వశముచేయుట నాకిష్టము లేదు. 'మా బలముతో మమ్ము మేమే రక్షించుకొంటిమి' అని మీ యిస్రాయేలీయులు విఱ్ఱవీగుదురు.

3. కనుక నీవు 'యుద్ధమునకు భయపడువారు వెంటనే వెడలిపోవచ్చును' అని శిబిరమున ప్రకటింపుము” అని చెప్పెను. గిద్యోను అట్లే చేయగా పాళెమునుండి ఇరువది రెండువేలమంది వెడలిపోయిరి. పదివేల మంది మాత్రము మిగిలియుండిరి.

4. యావే గిద్యోనుతో “ఇంకను చాలమంది జనులున్నారు. వారిని నీటిపడియ యొద్దకు కొని రమ్ము. అక్కడ వారిని పరిశీలించి చూచెదను. ఎవరు నిన్ను అనుసరింపవలెనని తెల్పుదునో వారు మాత్రమే నీ వెంటవత్తురు. ఎవరు నిన్ననుసరింపగూడదని తెల్పుదునో వారు నీ వెంటరాగూడదు” అని చెప్పెను.

5. గిద్యోను జనులను నీటిచెంతకు కొనివచ్చెను. యావే అతనితో "కుక్కవలె నాలుకతో నీళ్ళు గతుకు వారినందరిని ఒక వైపున ఉంచుము. మోకాళ్ళూని నీరు త్రాగువారినందరిని వేరొక వైపున చేర్చుము” అని పలికెను.

6. నాలుకతో నీళ్ళు గతికినవారి సంఖ్య మూడువందలు మాత్రమే. మిగిలినవారందరు మోకాళ్ళూని నీళ్ళు త్రాగిరి.

7. కనుక యావే గిద్యోనుతో “నాలుకతో నీళ్ళు గతికిన మూడువందల మందితోనే నేను మిమ్ము రక్షించి శత్రువులను మీ వశము చేసెదను. మిగిలిన వారినందరిని వెడలిపొండని చెప్పుము” అనెను.

8. గిద్యోను ఆ మూడు వందల మందిని మాత్రమే తన చెంతనుంచుకొనెను. మిగిలిన వారియొద్ద నుండి ఆహారమును, బాకాలను తీసికొని వారిని పంపివేసెను. మిద్యానీయులు గిద్యోను శిబిరము చెంతనే క్రిందిలోయలో విడిదిచేసిరి.

9. యావే ఆ రాత్రి గిద్యోనుతో “నీవు వెళ్ళి శత్రుశిబిరము మీదపడుము. వారిని నీ వశము చేసితిని.

10. నీవు శత్రువుల మీదపడుటకు జంకెద వేని మొదట నీ సేవకుడైన పూరాను తీసికొని వారి శిబిరము వద్దకు పొమ్ము.

11. అచట వారేమను కొనుచున్నారో వినుము. నీవు వారి పలుకులు ఆలించి ధైర్యము చెందగలవు” అని నుడివెను. కనుక గిద్యోను పూరాను వెంటనిడుకొని విరోధి సైన్యము చెంతకు పోయెను.

12. అచట మిద్యానీయులు, అమాలెకీయులు, తూర్పు దేశవాసులు మిడుతల దండువలె లోయ యందంతట వ్యాపించియుండిరి. వారి ఒంటెలు సముద్రపు ఒడ్డునగల యిసుకరేణువులవలె లెక్కకు మించియుండెను.

13. గిద్యోను వ్యూహము చేరునప్పటికి అచటనొకడు తన మిత్రునితో “వింటివా! నేనొక కలగంటిని. యవధాన్యముతో చేయబడిన గుండ్రనిరొట్టె ఒకటి గిరగిర దొర్లుకొనుచు వచ్చి మిద్యానీయుల శిబిరముచొచ్చెను. అది గుడారమునకు తగులగా ఆ గుడారము వెల్లికిలబడెను” అని చెప్పు చుండెను.

14. ఆ మిత్రుడతనితో “అయిననేమి? ఈ రొట్టె మరేమో కాదు. యిస్రాయేలీయుడగు యోవాసు కుమారుడగు గిద్యోను ఖడ్గమే. దేవుడు మిద్యానీయులను ఈ శిబిరమును అతనికి హస్తగతము చేసెను” అని పలికెను.

15. గిద్యోను ఆ స్వప్న వృత్తాంతమును దాని అర్ధమును విని భక్తిభావముతో ప్రభునకు నమస్కరించెను. అంతటతడు డేరాకు మరలి వచ్చి తన అనుచరులతో “రెండు! యావే మిద్యానీయుల శిబిరమును మీ వశము గావించెను” అని పలికెను.

16. గిద్యోను తన సైన్యములను మూడు దండులుగా విభజించెను. ప్రతి సైనికునికి ఒక బాకాను, కుండను ఇచ్చెను. ప్రతి కుండలోను దీపము గలదు.

17. అతడు వారితో “నన్ను జాగ్రత్తగా గమనించు చుండుడు. నేను చేసినట్లే మీరును చేయవలెను. నేను శత్రుశిబిరము చేరగానే ఏమిచేయుదునో జాగ్రత్తగా గమనింపుడు. నేను చేసినట్లే మీరును చేయవలెను.

18. నేను, నా వెంటనున్నవారు బాకానూదగనే మీరును శిబిరముచుట్టు బాకానూది యావేకు గిద్యోనునకు విజయమని నినాదములు చేయుడు” అని చెప్పెను.

19. గిద్యోను, అతని వెంటనున్న నూరుగురు సైనికులు నడిజామున శత్రుశిబిరము దాపునకు వచ్చిరి. అప్పుడే విడిదిపట్టున కావలిభటులు వంతులు మార్చుకొని యుండిరి. గిద్యోను అతని అనుచరులు బాకాలనూది కుండలు పగులగొట్టిరి.

20. అది చూచి మూడుదండులును బాకాలనూది కుండలు పగులగొట్టెను. ఎడమచేత దివిటీలుపట్టి, కుడిచేత బాకాలను పూని "యావేకు ఖడ్గము, గిద్యోనునకు ఖడ్గము!” అని నినాదములు చేసెను.

21. యిస్రాయేలు దండులు తమ శత్రువుల విడిదిచుట్టు నిలబడియుండెను. ఆ నినాదములకు శిబిరమంతయు మేల్కొని గావుకేకలిడుచు పలాయనమయ్యెను.

22. ఆ మూడువందలమంది బాకాలనూదు చుండగా శత్రుసైనికులందరు కలవరముచెంది ఒకరి మీద ఒకరు కత్తిదూయ మొదలిడిరి. అది యావే చేసిన కార్యము. ఆ సైనికులందరు సెరారాతు దిక్కుగా బేత్షిత్తా వరకు, తాబ్బాతు దిక్కుగా ఆబెల్మె-హోలా వరకును పారిపోయిరి.

23. నఫ్తాలి, ఆషేరు, మనష్షే తెగలవారైన యిస్రాయేలీయులందరు కూడివచ్చి మిద్యానీయులను వెన్నాడిరి.

24. గిద్యోను ఎఫ్రాయీము కొండసీమల లోనికి దూతలనంపి “మీరు దిగివచ్చి మిద్యానీయులతో పోరాడుడు. వారికి ముందుగా బోయి బెత్బారా, యోర్దాను రేవుల నాక్రమింపుడు” అని వర్తమానము పంపెను. కనుక ఎఫ్రాయీము వాసులందరు ప్రోగ్రె వచ్చి ఆ రేవులను ఆక్రమించుకొనిరి.

25. వారు మిద్యాను సైన్యాధిపతులైన ఓరేబు, సేయేబులను పట్టుకొనిరి. ఓరేబును ఓరేబు కొండవద్ద వధించిరి. సెయేబును సెయేబు ద్రాక్షగానుగ చెంత మట్టుపెట్టిరి. మిద్యానీయులను తరిమికొట్టిరి. ఇద్దరు మొనగాండ్ర తలలు తెగగొట్టి యోర్దాను ఒడ్డున గిద్యోను వద్దకు కొనివచ్చిరి.

 1. ఎఫ్రాయీము తెగలవారు గిద్యోనుతో “నీవు చేసినపని ఏమియు బాగుగాలేదు. నీవు మిద్యానీయులతో పోరునకు వెడలినపుడు మమ్మేల పిలువనైతివి?” అని తీవ్ర వివాదము పెట్టుకొనిరి.

2. గిద్యోను వారితో “మీతో పోల్చుకొనినచో నేను సాధించినది ఏపాటి? ఎఫ్రాయీము తెగలవారి పొలములో పరిగలేరినను, అబీయేసేరు తెగల వారి పొలములో పండిన నిండు పంటకంటెను మిక్కుటమే అగును.

3. మిద్యాను సైన్యాధిపతులైన ఓరేబు, సెయేబులను యావే మీ చేతికి అప్పగించెను. మీతో పోల్చుకొనినచో నేను చూపిన పరాక్రమము ఏపాటిది?” అనెను. ఆ మాటలకు వారి కోపము చల్లారెను.

4. గిద్యోను, అతని అనుచరులు మూడు వందల మంది అలసటగానున్నను శత్రువులను వెన్నాడుచు యోర్దాను నదిని దాటిరి. కాని వారు ఆకలివలన బాధపడజొచ్చిరి.

5. కనుక అతడు సుక్కోతు నగర వాసులతో “నా అనుచరులు అలసిసొలసియున్నారు! వారికి కొన్ని రొట్టెలను ఇవ్వుడు. నేను మిద్యాను రాజులు సెబా, సల్మూనాలను తరుముకొనివచ్చితిని” అని చెప్పెను.

6. కాని సుక్కోతు పెద్దలు “ఏమేమి! నీ సైన్యములకు రొట్టెలనీయవలయునా? సెబా, సల్మూనా రాజులు అప్పుడే నీ వశమైరి కాబోలు!” అని హేళన మొనర్చిరి.

7. గిద్యోను వారితో “అట్లే కానిండు! ప్రభువు ఈ శత్రువులను నా వశము చేయగనే నేను ఎడారిముండ్లతో, ముండ్లకంపతో మీ చర్మము చీల్చెదను” అనెను.

8. అటనుండి గిద్యోను పెనూవేలుకు సాగిపోయి ఆ నగరపౌరులనుగూడ రొట్టెలను ఇవ్వుడని అడిగెను. వారును సుక్కోతు పౌరుల రీతిగనే జవాబిచ్చిరి.

9. అతడు వారితో “నేను విజేతనై మరలి వచ్చునపుడు మీ బురుజులను నేలమట్టము చేయుదును” అనెను.

10. సెబా, సల్మూనా రాజులు కర్కోరున విడిది చేసిరి. వారితోపాటు పదునైదువందలమంది సైనికులు నుండిరి. తూర్పుసీమ నుండి వచ్చిన వారిలో మిగిలినది వారుమాత్రమే. వారి వీరులు లక్ష ఇరువది వేల మంది రణమున మడిసిరి.

11. గిద్యోను నోబా, సొగ్బేహా నగరములకు తూర్పుగా “దేశదిమ్మరుల త్రోవ" వెంటపోయి ఏమరుపాటుననున్న శత్రువుల మీదపడి వారిని చంపెను.

12. సెబా, సల్మూనా పారిపోయిరి. కాని గిద్యోను వారిని వెన్నాడి చెర పట్టెను. వారి దళమునుగూడ తునుమాడెను. -

13. ఆ రీతిగా యుద్ధము ముగిసిన తరువాత గిద్యోను హెరెసుకొండ మీదుగా మరలివచ్చెను.

14. అతడు దారిలో సుక్కోతు యువకుని ఒకనిని బంధించి ప్రశ్నింపగా వాడు ఆ నగరనాయకుల పేర్లు డెబ్బది ఏడు వ్రాసియిచ్చెను.

15. అంతట గిద్యోను సుక్కోతు చేరి పౌరులతో “అలసిసొలసిపోయిన నీ సైన్యములకు రొట్టెలనందించుటకు సెబా, సల్మూనా రాజులు అప్పుడే నీ చేతచిక్కిరి కాబోలు! అని మీరు నన్ను పరిహసించితిరి గదా! ఇదిగో, ఆ సెబా, సల్మూనా రాజులు" అని పలికెను.

16. సుక్కోతు నాయకులను, పౌరులను ఎడారి ముండ్లతో చీల్చివేసెను.

17. పెనూవేలు బురుజు పడగొట్టి పురజనులను చిత్రవధ గావించెను.

18. అంతట గిద్యోను సెబా, సల్మూనా రాజుల వైపు తిరిగి “మీరు తాబోరు కొండవద్ద సంహరించిన వీరులు ఎట్టివారో మీకు గుర్తున్నదా?” అని అడిగెను. ఆ రాజులు “వారు అచ్చముగా నీ వలె నుండిరి. ఆ వీరులందరు రాజతనయులవలె ప్రవర్తించిరి” అని చెప్పిరి.

19. గిద్యోమ వారితో “వారు మా తల్లి కడుపునపుట్టిన సొంతసోదరులు. యావే తోడు! నాడు మీరు వారిని విడిచిపెట్టియుండినయెడల నేడు నేనును మిమ్ము విడిచియుందును” అనెను.

20. అంతట గిద్యోను తన పెద్దకొడుకు యేతేరును చూచి “ఇటు వచ్చి వీరిని వధింపుము” అనెను. కాని ఆ కుఱ్ఱవాడు కత్తిదూయలేదు. అతడింకను పసివాడు గనుక భయపడిపోయెను.

21. సెబా, సల్మూనా రాజులు గిద్యోనుతో “నీవే మా మీదబడి మమ్ము వధింపుము. పరాక్రమము పెద్దవారికేగదా!" అనిరి. గిద్యోను ఆ రాజుల మీదబడి వారిని వధించెను. వారి ఒంటెల మెడలనుండి వ్రేలాడు చంద్రహారములను గైకొనెను.

22. యిస్రాయేలీయులు గిద్యోనుతో “నీవు మమ్ము మిద్యానీయుల బారినుండి కాపాడితివి గనుక నీవును, నీ కుమారుడును, నీ మనుమడును మా మీద పరిపాలన చేయవచ్చును" అనిరి.

23. కాని గిద్యోను “నేనుగాని నా కుమారుడుగాని మిమ్ము పరిపాలింపము. ప్రభువే మిమ్మేలును.

24. ఇపుడు నా మనవి ఒకటి వినుడు. మీలో ప్రతి ఒక్కడు కొల్లసొమ్ము నుండి నాకొక బంగారుపోగును ఈయవలయును” అనెను. ఓడి పోయిన శత్రు సైనికులు యిష్మాయేలీయులు గనుక వారు బంగారు చెవిపోగులు తాల్చియుండిరి.

25. యిస్రాయేలీయులు గిద్యోను విన్నపమును అంగీకరించిరి. అతడు ఉత్తరీయమును విప్పగా యిస్రాయేలీయులందరు తమ కొల్లసొమ్ము నుండి ఒక్కొక్క బంగారు చెవిపోగును విసరివేసిరి. ఆ రీతిగా గిద్యోను ప్రోగుజేసిన బంగారు చెవిపోగులు పదునేడు వందల తులముల యెత్తు ఆయెను.

26. పైగా మిద్యాను రాజులు ధరించిన చంద్రహారములు, వాటికి వ్రేలాడు పతకములు, పట్టుబట్టలు, ఇంకను వారి ఒంటెల కంఠాభరణములు గిద్యోనునకు లభించెను.

27. వీనినన్నింటితో గిద్యోను యాజక ప్రత్యేక అంగీ ఎఫోదును ఒకటి తయారుచేయించి దైవప్రతిమనుచేసి తన నగరమైన ఒఫ్రాయందు ప్రతిష్ఠించెను. కాని యిస్రాయేలీయులు ఆ ఎఫోదును ఆరాధింపమొదలిడిరి. ఆ చర్యవలన గిద్యోను, అతని కుటుంబము ఉరిలో తగులుకొనెను.

28. ఆ రీతిగా మిద్యానీయులు యిస్రాయేలీయుల చేతిలో ఓడిపోయిరి. వారు మరల తలయెత్తుకొని తిరుగనేలేదు. యిస్రాయేలీయులు గిద్యోను జీవించినంత కాలము నలువదియేండ్లు చీకుచింత లేకుండ జీవించిరి.

29. యోవాషు కుమారుడు యెరూబాలు బ్రతికియున్నంత కాలము తన యింటనే వసించెను.

30. అతనికి చాలమంది భార్యలు కలరు గనుక డెబ్బదిమంది కుమారులు కలిగిరి.

31. షెకెమున వసించు అతని ఉంపుడుకత్తెకు గూడ ఒక కుమారుడు పుట్టెను. ఆ బిడ్డకు అబీమెలెకు అని పేరు పెట్టెను.

32. యోవాషు కుమారుడు గిద్యోను పండువంటి నిండు ప్రాయమున కన్నుమూసెను. అతనిని అబీయెసీయుల మండలమునందలి ఒఫ్రా నగరమున అతని తండ్రి యోవాసు సమాధిలోనే పూడ్చివేసిరి.

33. గిద్యోను గతించిన తరువాత యిస్రాయేలీయులు మరల బాలును కొలిచిరి. బాలుబెరీతును దైవముగా పూజించిరి.

34. చుట్టుపట్లనున్న శత్రువుల నుండి తమను కాపాడిన యావేను పూర్తిగా విస్మరించిరి.

35. తమకు అన్ని ఉపకారములు చేసిన యెరూబాలు అనబడు గిద్యోను కుటుంబమును కూడ పూర్తిగా మరచిపోయిరి.

 1-2. అబీమెలెకు షెకెమునకు వచ్చి తన తల్లి సోదరులను, బంధువులను చూచి “మిమ్ము యెరూబాలు కుమారులు డెబ్బదిమంది పాలించుట మేలా లేక నేనొక్కడనే పరిపాలించుట మేలా మీ షెకెము నాయకులనే అడిగి తెలిసికొనుడు. పైగా నేను మీకు రక్తబంధుడను” అని పలికెను.

3. వారు అబీమెలెకు మాటలను షెకెము నాయకులకు విన్పించిరి. షెకెము నాయకులు అబీమెలెకు మనవాడేకదా అనుకొని అతనికి మిత్రులైరి.

4. కనుక వారు బాలుబెరీతు దేవళము నుండి డెబ్బది వెండికాసులను గైకొని అబీమెలెకుకు ఇచ్చిరి. అతడు ఆ డబ్బుతో దుర్మార్గులను కొందరిని ప్రోగుచేసికొనెను.

5. పిమ్మట ఒఫ్రా నగరముననున్న తన తండ్రి ఇల్లు చేరి సోదరులను డెబ్బదిమందిని పట్టుకొని ఒకే రాతిపై సంహరించెను. అయినను యెరూబ్బాలు చిన్నకొడుకు యోతాము దాగుకొనియుండినందున అబీమెలెకు చేతికి చిక్కలేదు.

6. అంతట షెకెము, బెత్మిల్లో నగరముల నాయకులు ప్రోగై షెకెము బురుజువద్ద నున్న సింధూరవృక్షము చెంత అబీమెలెకును రాజుగా ప్రకటించిరి.

7. ఆ సంగతివిని యోతాము గెరిసీము కొండ నెక్కి పెద్ద స్వరముతో షెకెము నగరవాసులతో ఇట్లనెను: “షెకెము నాయకులారా వినుడు! మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాటలాలించును.

8. ఒకనాడు చెట్లన్నియు ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయెను, అవి ఓలివుచెట్టును జూచి నీవు మాకు రాజువు కమ్ము' అని అడిగెను.

9. కాని ఓలివు, వానితో 'ఏమేమి! నరులను, దేవతలనుకూడ సంతృప్తిపరుచు నా తైలమునియ్యక మానుకొని చెట్లమీద రాజ్యము నెరపవలయునా?' అనెను.

10. అపుడు చెట్లు అత్తిమ్రానిని చూచి 'రమ్ము, నీవు మమ్మేలుము' అని అడిగెను.

11. కాని అంజూరము వానితో 'ఏమేమి! నా తీయనిపండ్లను విడనాడి చెట్లమీద రాజ్యము నెరపవలయునా?' అనెను.

12. అంతట చెట్లు ద్రాక్షావల్లితో రమ్ము, నీవు మమ్మేలుము' అని అడిగెను.

13. కాని ద్రాక్షతీగ వానితో 'ఏమేమి! నరులను దైవములను కూడ సంతృప్తిపరుచు నా సారమును పోగొట్టుకొని చెట్లమీద రాజ్యము నెరపవలయునా?” అనెను.

14. అంతట చెట్లన్నియు ముండ్లతుప్పను చూచి, రమ్ము, నీవు మమ్మేలుము' అని అడిగెను.

15. తుప్ప వానితో 'మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలువుడు. లేదేని ఈ తుప్పనుండి అగ్గి వెలువడి లెబానోను దేవదారులను కాల్చివేయునుగాక' అనెను.

16. ఇపుడు మీరు ధర్మబుద్ధితో, చిత్తశుద్ధితో అబీమెలెకును రాజును చేసితిరా? యెరూబాలునకు అతని కుటుంబమునకు న్యాయము చేసితిరా?

17. మా తండ్రి, ప్రాణములకు తెగించి పోరాడి మిమ్ము మిద్యానీయుల బారినుండి తప్పించెనుగదా! అతనికి మీరు న్యాయము చేకూర్చితిరా?

18. నేడు మీరు మా తండ్రి కుటుంబము మీద తిరుగబడితిరి. అతని కుమారులను డెబ్బదిమందిని ఒక్కరాతిమీదనే వధించి తిరి. అతని దాసీపుత్రుడైన అబీమెలెకును మీ రక్త బంధువని షెకెమునకు రాజును చేసితిరిగదా!

19. మీరు యెరూబాలుపట్ల, అతని కుటుంబముపట్ల ధర్మ బుద్ధితో, చిత్తశుద్ధితో ప్రవర్తించితిరేని మీకు అబీమెలెకు వలన, అతనికి మీ వలన, ప్రమోదము కలుగునుగాక!

20. లేదేని అబీమెలెకు నుండి అగ్గిపుట్టి షెకెము, బెత్మిల్లో పౌరులను కాల్చివేయుగాక!.”

21. ఇటుల పలికి యోతాము పారిపోయెను. అతడు తన సోదరునికి భయపడి బెయేరు నగరమున తలదాచుకొనెను.

22. అబీమెలెకు మూడేండ్లు యిస్రాయేలీయులను పరిపాలించెను.

23. అంతట యావే అబీమెలెకుకు, షెకెము నాయకులకు విరోధము పుట్టింపగా, ఆ నాయకులు అతనిపై తిరుగబడిరి.

24. యెరూబాలు కుమారులను డెబ్బదిమందిని హత్యచేసిన పాపము కట్టికుడుపక ఊరకేపోవునా? చనిపోయిన వారి నెత్తురు హంతుకుడైన అబీమెలెకు మీదను, అతనికి తోడ్పడిన షెకెము నాయకుల మీదను పగతీర్చుకొనదా?

25. అబీమెలెకు పై గల గుఱ్ఱుచే షెకెము నాయకులు కొండలమీద తమవారిని కాపుంచగా వారు త్రోవలవెంటపోవు బాటసారులనందరిని దోచుకొనిరి. అబీమెలెకు ఆ సంగతి తెలిసికొనెను.

26. ఆ సమయముననే ఎబెదు కుమారుడు గాలు తన సోదరులతో ఆ ప్రాంతమున సంచరించుచు షెకెము నాయ =కుల మన్ననలందెను.

27. వారందరు ఒకనాడు పొలమునకు బోయి, ద్రాక్షపండ్లు సేకరించుకొని వచ్చి, గానుగ దొక్కించి, ఉత్సవము చేసికొని, తమ దేవళము చేరి, విందారగించి తప్పద్రాగి అబీమెలెకును శపించిరి.

28. అపుడు ఎబెదు కుమారుడైన గాలు “మిత్రులారా! అబీమెలెకు అనగా ఎవడు? షెకెము వాసులకు అతనితో ఏమి సంబంధము? మనమతనికి ఊడిగము చేయనేల? ఈ అబీమెలెకు, అతని సైన్యాధిపతి సెబూలు ఒకప్పుడు షెకెము నాయకుడు హామోరునికి బానిసలై ఉండలేదా? నేడు మనమతనికి దాసులము కానేల?

29. నేడు ఈ ప్రజలకు నన్ను సైన్యాధిపతిని చేసిన ఎంత బాగుగా నుండును! అపుడు నేను అబీమెలెకును తరిమికొట్టి, నీకు గుండెలున్నచో క్రొత్త బలగముతో వచ్చి నాతో పోరాడుమని గద్దించి పలుకనా?” అని బింకములాడెను.

30. ఎబెదు కుమారుడైన గాలు పలికిన పలుకులు నగరపాలకుడైన సెబూలు విని ఉగ్రుడైపోయెను.

31. అతడు అరూమా యందున్న అబీమెలెకు చెంతకు దూతలను పంపి “ఎబెదు కుమారుడైన గాలు సోదరులతో షెకెము నగరమునకు వచ్చెను. అతడు పట్టణ వాసులను నీ మీదికి రెచ్చగొట్టుచున్నాడు.

32. కనుక నీవు నీ అనుచరులు రాత్రిపూట పయనమై వచ్చి పొలమున దాగియుండుడు.

33. ఉదయమున ప్రొద్దుపొడవగనే నగరముమీదికి రండు. గాలు, అతని అనుచరులు పట్టణమునుండి వెలుపలికి రాగానే తగిన రీతిని బుద్ది చెప్పుడు” అని కబురు పంపెను.

34. కనుక అబీమెలెకు తన అనుచరులనందరిని ప్రోగు చేసికొని రాత్రిపూట పయనమై వచ్చి షెకెము ప్రక్క నాలుగు దండులతో పొలమున దాగియుండెను.

35. ఎబెదు కుమారుడైన గాలు నగరమునుండి వెలుపలికి వచ్చి పురద్వారముచెంత నిలిచియుండగా అబీమెలెకు, అతని అనుచరులు తాము దాగియున్న తావునుండి ఈవలికి వచ్చిరి.

36. గాలు వారిని చూచి సెబూలుతో “కొండలమీదినుండి జనులు దిగి వచ్చుచున్నారు” అనెను. సెబూలు అతనితో “నీవు కొండల నీడలు చూచి జనులనుకొని భ్రాంతిపడుచున్నావు” అనెను.

37. కాని గాలు మరల అతనితో “అదిగో! ఒక దళము నడికొండనుండి వచ్చుచున్నది, ఇంకొక దళము మాంత్రికుని సింధూరమువద్దనుండి వచ్చు చున్నది” అనెను.

38. సెబూలు “నీవు మనము అబీమెలెకుకు ఊడిగము చేయుటకు అతడు ఏపాటి వాడు అని బింకములు పలుకలేదా? ఇప్పుడు ఆ బింక మంతయు ఎటుపోయినది? ఇటవచ్చుచున్న ఆ ప్రజలందరు నీవు చిన్నచూపు చూచినవారే. ఇక నగరమును వెడలి వారితో పోరాడుము" అని పలికెను.

39. కనుక గాలు షెకెము నాయకులను ప్రోగుచేసికొని పోయి అబీమెలెకును ఎదిరించెను.

40. కాని అతడు అబీమెలెకు ముందు నిలువలేక పారిపోయెను. అబీమెలెకు అతనిని వెన్నాడెను. గాలు అనుచరులు పురద్వారమువరకు కుప్పలుగాకూలిరి.

41. అటుపిమ్మట అబీమెలెకు అరూమాకు వెడలిపోయెను. గాలును అతని సోదరులను సెబూలు షెకెమునుండి తోలివేసెను.

42.మరునాడు షెకెమువాసులు నగరమునుండి వెలుపలి పొలములోనికి వచ్చిరి. అబీమెలెకు ఆ సంగతి వినెను.

43. అతడు తన అనుచరులను మూడు దండులుగా విభజించి పొలమున పొంచియుండెను. షెకెము నివాసులు నగరమువీడి వెలుపలికి రాగానే వారిపైబడి వారిని తునుమాడెను.

44. అటుతరువాత అబీమెలెకు తన దండుతో త్వరత్వరగా ముందుకు సాగిపోయి పురద్వారమున నిలిచెను. మిగిలిన రెండు దండులు పొలముననున్న వారిమీదపడి తుత్తునియలు చేసెను.

45. ఆ దినమంతయు అబీమెలెకు నగరమును ముట్టడించుచునేయుండెను. దానిని వశము చేసికొని పౌరులను చిత్రవధ కావించెను. పట్టణమును సర్వనాశనము చేసి వాడవాడల ఉప్పు వెదచల్లించెను.

46. షెకెము కోటలో ఉన్నవారు పట్టణము నాశనమగుట చూచి ఎల్-బెరీతు దేవళముయొక్క కోట లోనికి జొరబడి దాగుకొనిరి.

47. షెకెము గోపుర యజమానులందరును ప్రోగైరని విని అబీమెలెకు అనుచరులను తీసికొని సల్మోనుకొండకు పోయెను.

48. అతడు గొడ్డలితో చెట్టుకొమ్మను నరికి భుజములపై నిడుకొని అనుచరులతో “మీరును నేను చేసినట్లే చేయుడు, త్వరపడుడు” అని చెప్పెను.

49. కనుక వారును తలకొక కొమ్మనరికి భుజములపై నిడుకొనిరి. ఆ కొమ్మలనుకొనివచ్చి జనులు దాగియున్న కోట దగ్గర పెట్టి, వాటిని కాల్చి కోటకు నిప్పుముట్టించిరి. షెకెము గోపురములో వసించిన వారందరు దాదాపు వేయిమంది స్త్రీపురుషులు నిప్పుమంటల్లో మడిసిరి.

50. అంతట అబీమెలెకు తేబేసును ముట్టడించి వశపరచుకొనెను.

51. ఆ నగర మధ్యమున ఒక రక్షణదుర్గము కలదు. పౌరులు పురనాయకులు శత్రువునకు భయపడి దుర్గమున జొచ్చిరి. వారులోపల నుండి దుర్గకవాటములను బిగించుకొని కోటబురుజు మీదికి ఎక్కిరి.

52. అబీమెలెకు దుర్గమును సమీపించి దాని తలుపులను నిప్పుతో కాల్చివేయబోయెను.

53. అపుడొక స్త్రీ పైనుండి తిరుగటిరాతిని దొర్లింపగా అబీమెలెకు తలబలయ్యెను.

54. అతడు వెంటనే తన అంగరక్షకుని పిలిచి “నీ కత్తిదూసి నన్ను చంపి వేయుము. ఒక ఆడుది అబీమెలెకును చంపెనని లోకులు నవ్వి పోకుందురుగాక!” అనెను. అంగరక్షకుడు కత్తితో పొడువగా అబీమెలెకు అసువులు వీడెను.

55. అబీమెలెకు చనిపోయెననివిని యిస్రాయేలీయులు తమ నివాసములకు వెడలిపోయిరి.

56. ఆ రీతిగా అబీమెలెకు తన సోదరులను డెబ్బది మందిని చంపి తనతండ్రికి చేసిన ద్రోహమునకు యావే ప్రతీకారము చేసెను.

57. షెకెము నగరవాసులను గూడ తమ దుష్టత్వమునకు తగిన ప్రతిఫలమును అనుభవింపజేసెను. యెరూబాలు కుమారుడగు యోతాము పెట్టిన శాపము చివరకు షెకెమువాసులకు తగిలెను.

 1. అబీమెలెకు తరువాత దోదా మనుమడును, పూవా కుమారుడైన టోలాయిస్రాయేలీయులను శత్రువుల నుండి రక్షించెను. అతడు యిస్సాఖారు తెగవాడు. ఎఫ్రాయీము పర్వతసీమలో షామీరు నగరమున వసించెడివాడు.

2. టోలా ఇరువది మూడేండ్లు యిస్రాయేలునకు న్యాయాధిపతిగా పనిచేసి మరణానంతరము షామీరుననే భూస్థాపితము చేయబడెను.

3. అటుపిమ్మట గిలాదునకు చెందిన యాయీరు న్యాయాధిపతియై ఇరువది రెండేండ్లు తీర్పుతీర్చెను.

4. అతని ముప్పదిమంది కుమారులు, ముప్పది గాడిదపిల్లలనెక్కి తిరిగెడివారు. వారికి ముప్పది పట్టణములుండెడివి. నేటికి గిలాదు సీమయందు ఆ పట్టణములకు యాయీరు పట్టణములనియే పేరు.

5. యాయీరు మృతిచెంది కామోనున పూడ్చివేయబడెను.

6. యిస్రాయేలీయులు మరల దుష్టకార్యములు చేసిరి. వారు బాలు, అష్టారోతు దేవతలను, అరాము, సీదోను, మోవాబు, అమ్మోను, ఫిలిస్తీయ దేశముల దేవతలను పూజించిరి. యావేను పూర్తిగా విస్మరించిరి.

7. ప్రభువు ఉగ్రుడై యిస్రాయేలీయులను ఫిలిస్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించెను.

8. వారు నాడు మొదలుకొని పదునెనిమిది యేండ్లపాటు యోర్దానుకు ఆవలి ప్రక్క అమోరీయుల దేశమగు గిలాదున వసించు యిస్రాయేలీయులనందరిని నేలబెట్టి కాలరాచిరి.

9-10. పై పెచ్చు అమ్మోనీయులు యోర్దాను దాటివచ్చి యూదా, బెన్యామీను, ఎఫ్రాయీము మండలములపై పడజొచ్చిరి. కనుక యిస్రాయేలీయులు మిగుల ఏడ్చి యావేకు మొర పెట్టి “ప్రభూ! నీకు అపరాధము చేసితిమి. మా దేవుడవైన నిన్నువిడనాడి బాలుదేవతలను పూజించితిమి” అనిరి.

11-12. యావే వారితో “ఐగుప్తీయులు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిస్తీయులు, సీదోనీయులు, అమాలెకీయులు, మిద్యానీయులు మిమ్ము పీడింపగా నేను మిమ్ము కాపాడలేదా?

13. అయినను మీరు నన్ను విడనాడి అన్యదైవములను సేవించిరి. కనుక నేను మిమ్ము రక్షింపను.

14. పొండు, మీరెన్నుకొనిన ఆ దైవముల యెదుటనే మొర పెట్టుకొనుడు. వారు మిమ్ము ఈ యిడుమలనుండి కాపాడగలరేమో చూతము” అనెను.

15. కాని యిస్రాయేలీయులు ప్రభూ! మేము అపరాధము చేసినమాట నిజమే. మమ్ము నీ ఇష్టము వచ్చినట్లు శిక్షింపుము. కాని నేడు ఈ ఆపదనుండి మాత్రము కాపాడుము” అని విన్నవించుకొనిరి.

16. యావేను సేవించవలెనని యిస్రాయేలీయులు తమ మధ్యనుండి అన్యదైవములను విడనాడగా, వారికి కలిగిన ఆపదనుచూచి యావే కడుపు తరుకుకొని పోయెను."

17. అపుడు అమ్మోనీయులు ప్రోగైవచ్చి గిలాదున శిబిరము పన్నిరి. యిస్రాయేలీయులు కూడ గుమిగూడి వచ్చి మిస్పా చెంత గుర్రులెత్తిరి.

18. గిలాదు పెద్దలు “అమ్మోనీయులతో పోరాడగలవాడే గిలాదు నంతటికి నాయకుడగును” అని నిశ్చయించుకొనిరి.

 1. గిలాదీయుడగు యెఫ్తా మహాశూరుడు. అతడు గిలాదునకు వేశ్యవలన పుట్టినవాడు.

2. గిలాదు భార్యకు పుట్టిన బిడ్డలు పెరిగి పెద్దవారైన పిదప యెఫ్తాను వెళ్ళగొట్టిరి. “నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మా తండ్రి స్వాస్థ్యములో నీకు భాగము లేదు పొమ్ము" అనిరి.

3. యెఫ్తా సోదరులనుండి పారిపోయి టోబు మండలమున తలదాచుకొనెను. అచట దుండగులు కొందరు అతనితో చేరిరి. వారందరు కలిసి పట్టణముల పైబడి దోచుకొనెడివారు.

4. యెఫ్తా యీ రీతిగా దోపిడి జరుపుచున్న కాలముననే అమ్మోనీయులు యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చిరి.

5. కనుక గిలాదు పెద్దలు బోబు మండలము నుండి యెఫ్తాను తీసికొనివచ్చుటకు వెళ్ళిరి.

6. వారు యెఫ్తాతో “నీవు మాతో రమ్ము. నీవు మాకు నాయకుడవయ్యెదవేని అమ్మోనీయులతో పోరాడవచ్చును” అనిరి.

7. కాని యెఫ్తా వారితో “నన్ను ద్వేషభావముతో నాడు నా తండ్రి ఇంటినుండి వెళ్ళగొట్టినది మీరుకారా? ఇప్పుడు మీకు కష్టములు వచ్చి నా కాళ్ళు పట్టుకొనవచ్చితిరా?” అనెను.

8. వారు “నిజమే! మాకు కష్టములు వచ్చినవి కనుకనే నిన్నాశ్రయింపవచ్చితిమి. నీవు వచ్చి అమ్మోనీయులతో పోరాడవలయును. ఇక గిలాదునంతటికి నీవే నాయకుడవు కావలయును” అనిరి.

9. యెఫ్తా “నేను మీ వెంటవచ్చి అమ్మోనీయులతో పోరాడగా ప్రభువు శత్రువులను నా వశము చేసినచో నేను మీకందరకు నాయకుడనయ్యెదనుగదా?” అని ప్రశ్నించెను.

10. వారతనితో “నీ మాట చొప్పుననే నడచెదము. యావే మనకు సాక్ష్యముగానుండుగాక!” అనిరి.

11. కనుక యెఫ్తా గిలాదు నాయకులతో బయలుదేరి వచ్చెను. వారతనిని గిలాదునకు నాయకునిగా, సేనాధిపతినిగా నియమించిరి. మిస్పా వద్ద యావే యెదుట యెఫ్తా తన షరతును పునరుద్ఘాటించెను.

12. యెఫ్తా, అమ్మోనురాజు వద్దకు దూతలనంపి “నీవు మా దేశము మీదికి యుద్ధమునకు వచ్చుటకు కారణమేమి? అని అడిగించెను.

13. అమ్మోనురాజు “యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలి వచ్చినపుడు అర్నోను నుండి ఇటు యబ్బోకు వరకును, అటు యోర్డాను వరకును నా దేశమును ఆక్రమించుకొనిరి. కావున ఐగుప్తునుండి యిస్రాయేలీయులు వచ్చినపుడు మీరు ఆక్రమించుకొనినభాగము ఇపుడు శాంతియుతముగా మాకు ఇచ్చివేయుడు” అని జవాబు పంపెను.

14-15. యెఫ్తా “యిస్రాయేలీయులు మోవాబీయుల దేశమునుగాని, అమ్మోనీయుల దేశమునుగాని ఆక్రమించుకోలేదు.

16. యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చినపుడు ఎడారి మార్గమున నడచి రెల్లు సముద్రమునకు వచ్చి కాదేషు చేరిరి.

17. అచటినుండి ఎదోమురాజు వద్దకు దూతలనంపి 'మమ్ము నీ రాజ్యముగుండా వెడలిపోనిమ్ము' అని అడిగించిరి. కాని ఆ రాజు అంగీకరింపలేదు. అదే విన్నపమును మోవాబు రాజునకును పంపిరి. అతడును వారి కోరికను నిరాకరించెను. కనుక యిస్రాయేలీయులు కాదేషుననే నిలిచిపోయిరి.

18. తరువాత వారు ఎడారియందు ప్రయాణముచేసి ఎదోము మోవాబు దేశములను చుట్టివచ్చి మోవాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి, అర్నోను నదికి ఆవలి దరిని శిబిరము పన్నిరి. ఆ నదియే మోవాబు దేశమునకు ఎల్ల గనుక మా వారు మోవాబు దేశమున అడుగిడనేలేదు.

19. అంతట యిస్రాయేలీయులు హెష్బోనున వసించు అమోరీయరాజు సీహోను నొద్దకు దూతలనంపి 'నీ దేశముగుండ మమ్ము వెడలిపోనిమ్ము' అని అడిగించిరి.

20. కాని సీహోను అందుకు అంగీకరింపక తన సైన్యములను ప్రోగుచేసికొని వచ్చి యాహాసువద్ద శిబిరముపన్ని యిస్రాయేలీయులతో పోరాడెను.

21. కాని యిస్రాయేలు దేవుడైన యావే సీహోనును సైన్యములతోపాటు యిస్రాయేలీయుల వశముచేసెను. కనుక యిస్రాయేలీయులు వారిని లొంగదీసిరి. ఆ ప్రాంతమున వసించు అమోరీయుల దేశమునంతటిని ఆక్రమించుకొనిరి.

22. ఈ రీతిగా యిస్రాయేలీయులు అర్నోను నుండి యబ్బోకు వరకు, ఎడారినుండి యోర్ధాను వరకు గల అమోరీయుల దేశమునంతటిని స్వాధీనము చేసికొనుట సంభవించినది.

23. మా దేవుడైన యావే అమోరీయులను మా యెదుటినుండి వెళ్ళగొట్టెననగా నేడు నీబోటివారు మేము ఆక్రమించుకొన్న దేశమును స్వాధీనము చేసి కొనగలరా?

24. మీ దేవుడైన కెమోషు ఏ రాజుల రాజ్యములను మీకు వశపరచెనో ఆ రాజ్యములను నేడు మీరు అనుభవించుట లేదా? ఆ రీతిగనే మా దేవుడైన యావే ఏ రాజులను మా ఎదుటినుండి వెళ్ళ గొట్టెనో వారి రాజ్యములను మేము అనుభవించుచున్నాము.

25. సిప్పోరు కుమారుడైన మోవాబీయుల రాజగు బాలాకు కంటెను నీవేమి మొనగాడవుకావు. అతడు ఎన్నడైన యిస్రాయేలీయులపై సవాలుచేసి యుద్ధమునకు వచ్చెనా?

26. యిస్రాయేలీయులు మూడువందల ఏండ్లనుండి హెష్బోనుమండల గ్రామములందును, అరోయేరుమండల గ్రామములందును, అర్నోను మండల గ్రామములందును వసించుచుండిరి గదా? ఇంతకాలమునుండి వారిని వెళ్ళగొట్టక ఊర కుంటిరేల?

27. మేము మీకు ఏ అపరాధమును చేయలేదు. మీరే యుద్ధము ప్రారంభించి మాకు అపరాధము చేయుచున్నారు. న్యాయాధిపతియైన దేవుడు నేడు యిస్రాయేలీయులకు అమ్మోనీయులకు తీర్పు తీర్పకపోడు” అని ప్రత్యుత్తరమంపెను.

28. కాని అమ్మోనీయుల రాజు, యెఫ్తా పంపిన ప్రత్యుత్తరమును లెక్కచేయలేదు.

29. అంతట యావే ఆత్మ యెఫ్తాను ఆవేశింపగా అతడు గిలాదు, మనష్షే మండలములు దాటిపోయెను. గిలాదునందలి మిస్ఫానుండి బయలువెడలి అమ్మోనీయుల దాపునకు వచ్చెను.

30-31. అతడు యావే ఎదుట ఒక ప్రతిజ్ఞ చేసెను. “నీవు అమ్మోనీయులను నా చేతికి చిక్కింతువేని నేను శత్రువులను ఓడించి విజయసిద్దితో తిరిగివచ్చునపుడు స్వాగతము చెప్పు టకు నా ఇంటిద్వారమునుండి ఎదురువచ్చిన వ్యక్తిని నీకు బలియిచ్చెదను. ఆ వ్యక్తిని నీకు దహనబలిగా అర్పించెదను" అని పలికెను.

32. యెఫ్తా అమ్మోనీయులను ఎదుర్కొనగా యావే వారిని అతని చేతికి చిక్కించెను.

33. అరోయేరు నుండి మిన్నీతు వరకును, ఆబేల్కెరామిము వరకును వారిని ఊచముట్టుగ తునుమాడెను. ఆ రీతిగా అమ్మోనీయులు యెఫ్తాకు లొంగిపోయిరి.

34. యెఫ్తా మిస్పా నగరమునందలి తన ఇంటికి తిరిగిరాగా గృహమునుండి సితారాగానముతో నాట్యమాడుచు తన కూతురు ఎదురువచ్చెను. ఆమె అతనికి ఏకైక పుత్రిక. ఆ బాలిక తప్ప అతనికి కొడుకులుగాని కుమార్తెలుగాని లేరు.

35. యెఫ్తా ఆమెను చూచి శోకముతో బట్టలుచించుకొని “తల్లీ! నీవు నా గుండెలు బ్రద్దలు చేసితివి. నా కడుపున చిచ్చు పెట్టితివి. నేను యావేకు మాట ఇచ్చితిని. నా మాట నిలబెట్టుకోక తప్పదు” అనెను.

36. ఆమె అతనితో “నాయనా! నీవు యావేకు మాట ఇచ్చితినంటివి గదా! ప్రభువు శత్రువుమీద విజయమును ప్రసాదించెను. కనుక నీవు ప్రభువు సమ్ముఖమున చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకొనుము.

37. నా మనవి ఒక్కటి మాత్రము వినుము. నన్ను రెండు నెలలపాటు ఒంటరిగా విడిచి పెట్టుము. నేను నా చెలికత్తెలతోపోయి కొండలలో తిరుగాడి నిష్ఫలమైన నా కన్యాత్వమును గూర్చి శోకించి వచ్చెదను” అనెను'.

38. యెఫ్తా అట్లే వెళ్ళుమని చెప్పి కుమార్తెను రెండు నెలలపాటు పంపివేసెను. ఆమె చెలికత్తెలతో వెడలిపోయి నిష్పలమైన తన కన్నెరికమును గూర్చి కొండలలో పెద్దపెట్టున దుఃఖించెను.

39. గడువు ముగియగానే బాలిక తిరిగిరాగా యెఫ్తా తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి ప్రకారము ఆమెకు చేసెను. ఆ బాలిక మగపోడిమి ఎరుగని కన్నె.

40. అటుతరువాత యిస్రాయేలు వనితలు ఏటేట ఇల్లు వెడలి గిలాదీయుడగు యెఫ్తా కుమార్తెను గూర్చి నాలుగుదినములు శోకించుట ఆచారమయ్యెను.

 1. ఎఫ్రాయీము జనులు యుద్ధమునకు సన్నద్దులై సాఫోను చేరి యెఫ్తాతో “మమ్ము ఆహ్వానింపకుండ నీవొక్కడివే అమ్మోనీయులతో యుద్ధమునకు పోనేల? నిన్నును, నీ ఇంటిని తగులబెట్టెదము” అనిరి.

2. యెఫ్తా వారితో “నేనును, మా ప్రజలును అమ్మోనీయులకు చిక్కి చాల బాధపడితిమి. నేను మీకు కబురు పెట్టితినిగాని మీరు నన్నాదుకొనలేదు.

3. ఎవరును సాయపడుటకు రాకుండుటచూచి ప్రాణములు గుప్పిట బెట్టుకొని నేనే శత్రువుల మీదికిపోతిని. యావే నాకు విజయము ప్రసాదించెను. నేడు నాతో మీరు జగడము పెట్టుకోనేల?” అనెను.

4. యెఫ్తా గిలాదీయులనందరిని ప్రోగుచేసికొని ఎఫ్రాయీమీయులతో పోరుసల్పగా ఎఫ్రాయీమీయులు ఓడిపోయిరి. ఎందుకనగ వారు “ఎఫ్రాయీము, మనష్షే మండలములమధ్య వసించు గిలాదీయులారా! మీరు ఎఫ్రాయీమీయుల ఎదుట నిలువలేక పారిపోయి వచ్చినవారేకదా!" అని గేలిచేయుచుండిరి గనుక తగినశాస్తిని అనుభవించిరి.

5. గిలాదీయులు ఎఫ్రాయీమీయులను యోర్దానురేవు దాటనీయలేదు. ఎఫ్రాయీమీయులనుండి పారి వచ్చిన వారెవరైన రేవును దాటబోయినచో గిలాదీయులు “నీవు ఎఫ్రాయీమీయుడవుగావా?” అని అడిగెడివారు.

6. అతడు “కాను” అన్నచో వారు “షిబ్బోలెతు”' అనుమాటను ఉచ్చరింపుమనెడివారు. అతడు ఆ మాటను ఉచ్చరింపలేక “సిబ్బోలెతు” అనెడివాడు. వెంటనే గిలాదీయులు అతనిని పట్టుకొని రేవు కడనే వధించెడివారు. ఈ రీతిగా ఎఫ్రాయీమీయులు నలువది రెండు వేలమంది మడిసిరి.

7. యెఫ్తా ఆరేండ్లు యిస్రాయేలీయులకు న్యాయాధిపతిగా పనిచేసెను. గిలాదీయుడైన యెఫ్తా చనిపోగా స్వీయనగరమైన గిలాదు పట్టణముననే అతనిని పాతిపెట్టిరి.

8. యెఫ్తా తరువాత బేత్లెహేమునకు చెందిన ఇబ్సాను న్యాయాధిపతి అయ్యెను.

9. అతనికి ముప్పది మంది కొడుకులు, ముప్పదిమంది కుమార్తెలుండిరి.

10. అతడు తన కుమార్తెలను తన వంశమున చేరని వారికిచ్చి, తన వంశమునకు చేరనివారిని ముప్పది మంది కన్యలను తన కొడుకులకు పెండ్లి చేసెను. ఇబ్సాను ఏడేండ్లు యిస్రాయేలీయులకు న్యాయాధిపతియై మరణానంతరము బేత్లెహేమున ఖననము చేయబడెను.

11. అటుతరువాత సెబూలూనునకు చెందిన ఏలోను పదియేండ్లు న్యాయాధిపతిగా పనిచేసెను.

12. మరణానంతరము అతనిని సెబూలూనునందలి ఏలోనుననే పాతిపెట్టిరి.

13. అటుపిమ్మట పిరతోను నివాసియు హిల్లేలు కుమారుడగు అను న్యాయాధిపతి అయ్యెను.

14. అతనికి నలువదిమంది కుమారులును, ముప్పది మంది మనుమలును ఉండిరి. వారు డెబ్బది గాడిదల నెక్కి తిరిగెడివారు.

15. అతడు ఎనిమిదేండ్లు యిస్రాయేలీయులకు తీర్పుతీర్చి కన్నుమూసెను. ఎఫ్రాయీము మండలమున గల అమాలేకీయుల పర్వతసీమలో పిరతోను ననే అబ్దోనును పాతిపెట్టిరి.

 1. యిస్రాయేలీయులు మరల దుష్కార్యములు చేసిరి. యావే నలువదియేండ్లపాటు వారిని ఫిలిస్తీయుల వశముచేసెను.

2. ఆ కాలమున జోరాసీమలో మనోవా అను దాను వంశస్థుడొకడు వసించుచుండెను. అతని భార్య గొడ్రాలు.

3. ఒకనాడు యావేదూత ఆమెకు ప్రత్యక్షమై "నీవు గొడ్రాలవు. కాని ఇక గర్భవతివై బిడ్డను కందువు.

4. ఇకమీదట జాగ్రత్తగా నుండుము. ద్రాక్షసారాయమును గాని ఘాటైన మద్యమునుగాని సేవింపకుము. అశుచికరమయిన పదార్ధములను ముట్టుకొనకుము.

5. నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఆ శిశువు తలజుట్టు కత్తిరింపరాదు. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండియు వ్రతతత్పరుడై ఉండును'. అతడు యిస్రాయేలును ఫిలిస్తీయుల బారినుండి కాపాడును" అని చెప్పెను.

6. ఆమె భర్తచెంతకు వచ్చి “నాకు దివ్యపురుషుడొకడు కన్పించెను. అతని మొగము దేవదూత మొగమువలె మిలమిలమెరయుచు భీతి గొలుపుచుండెను. అతడెక్కడి నుండి వచ్చినది నేనడుగ లేదు. అతడు తన పేరుకూడా తెలుపలేదు.

7. కాని ఆ దివ్యపురుషుడు నాతో “నీవు గర్భవతివై బిడ్డను కందువు. ఇక మీదట ద్రాక్షసారాయమును గాని, ఘాటయిన మద్యమును గాని సేవింపకుము. అశుచికరమయిన పదార్థములను ముట్టుకొనకుము. నీకు జన్మింపబోవు శిశువు గర్భమునుండి ఆమరణాంతము వ్రతతత్పరుడై జీవించును అని పలికెను” అని చెప్పెను.

8. మనోవా దేవునికి మనవిచేసి "ప్రభూ! నీవు పంపిన దివ్యపురుషుడు మరల మాకు దర్శనమిచ్చి ఆ పుట్టబోవు శిశువుకు మేమేమి చేయవలయునో తెలియజెప్పుగాక!” అని ప్రార్థించెను.

9. ప్రభువు మనోవా మొరనాలించెను. ఒకనాడు అతని భార్య పొలముననుండగా దివ్యపురుషుడు మరల ప్రత్యక్షమయ్యెను. అపుడు మనోవా దగ్గరలేడు.

10. ఆమె వడివడిగా పెనిమిటియొద్దకు పరుగెత్తికొనివచ్చి మునుపు తనకు దర్శనమిచ్చిన దివ్యపురుషుడు మరల కనిపించే నని చెప్పెను.

11. మనోవా తన భార్య వెంటబోయి దివ్యపురుషుని కనుగొని “ఈమెతో మాటాడినది  నీవేనా?" అని అడిగెను. అతడు “అవును నేనే” అనెను.

12. మనోవా “నీ మాట ప్రకారముగా శిశువు జన్మించిన పిదప ఆ బిడ్డ ఎట్లునడుచుకోవలయును? ఏమి చేయవలయును?” అని అడిగెను.

13. ప్రభువు దూత మనోవాతో “నేను ముట్టుకోవలదన్న వస్తువులు ఈమె ముట్టుకోరాదు. ఈమె ద్రాక్షవల్లినుండి పుట్టినదేదియు తినకూడదు.

14. ద్రాక్షసారాయముగాని, ఘాటైన మద్యమునుగాని, అశుచికరమయిన పదార్థములను గాని సేవింపరాదు. నేను చెప్పిన నియమమునే ఈమె పాటింపవలెను” అనెను.

15. మనోవా ప్రభువు దూతతో "అయ్యా! నీకొక మేకకూనను కోసి విందు సిద్ధము చేసెదము. మమ్ము కరుణించి కొంచెము సేపిట నిలువుము” అనెను.

16. అతడు ప్రభువుదూత యని మనోవాకు తెలియదు. ప్రభువుదూత అతనితో నేను కొంచెము సేపు ఇట నిలిచినను మీ భోజనము ముట్టుకొనను. కాని మీరు దహనబలిని అర్పింపగోరెదరేని యావేకు సమర్పింపుడు” అనెను.

17. మనోవా యావేదూతతో "అయ్యా! నీ పేరేమో చెప్పుము. నీవు చెప్పినట్లుగా శిశువు జన్మించిన పిదప నిన్ను గౌరవించి నీ ఋణము తీర్చుకొందుము” అనెను.

18. కాని ప్రభువుదూత అతనితో “నీవు నా పేరు అడుగనేల? నా నామము వచింపశక్యముకానిది” అని పలికెను.

19. అంతట మనోవా మేకకూనను బలిభోజ్యమును గైకొని అద్భుతకార్యములనుచేయు యావేకు రాతిబండపై దహనబలిగా సమర్పించెను.

20. మనోవాయు, అతని భార్యయు చూచుచుండగనే బలిపీఠమునుండి మంట గుప్పునలేచెను. ప్రభువుదూత ఆ మంటలలో పైకెగసి పోయెను. ఆ దృశ్యముచూచి దంపతులిద్దరును నేలపై బోరగిలబడిరి.

21. అటు తరువాత ప్రభువుదూత వారికి మరల దర్శనమీయలేదు. అతడు ప్రభువుదూతయని మనోవా అప్పుడు తెలిసికొనెను.

22. మనోవా తన భార్యతో “మనము దేవుని కన్నులార జూచితిమి. ఇక మనకు చావు నిక్కము” అనెను.

23. కాని ఆమె అతనితో “యావే మనలను చంపువాడయినచో మన దహనబలిని, బలిభోజ్యమును స్వీకరించియుండడు. శిశువును గూర్చి ఈ వృత్తాంతమంతయు చెప్పి ఉండడు” అనెను.

24. అంతట ఆమె కొడుకును కని ఆ శిశువునకు సంసోను అను పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్ద వాడయ్యెను. యావే అతనిని చల్లనిచూపు చూచెను.

25. సంసోను జోరా, ఎష్టావోలు నగరముల మధ్య గల దాను మైదానముననుండగా యావే ఆత్మ అతనిని పురికొల్పెను.

 1. ఒక మారు సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళి అచట ఒక ఫిలిస్తీయ యువతిని చూచెను.

2. అతడు ఇంటికి తిరిగివచ్చి తల్లిదండ్రులతో ఆ సంగతి చెప్పి “తిమ్నాతున ఫిలిస్తీయుల పిల్లనొకతెను చూచితిని. ఆ బాలికను నాకు భార్యగా కొనిరండు” అని అడిగెను.

3. అందులకు తల్లిదండ్రులు సంసోనుతో “మన తెగయందుగాని, మన జాతిలోగాని నీకు పిల్లలు కరవైరా ఏమి? సున్నతి సంస్కారము లేని ఆ ఫిలిస్తీయుల పిల్లయే కావలసివచ్చినదా?" అనిరి. కాని సంసోను తండ్రితో “కాదు, ఆ బాలికనే కొనిరమ్ము, ఆమె నాకు నచ్చినది” అనెను.

4. కాని ఇది అంతయు యావే నిర్ణయమనియు, ప్రభువు ఫిలిస్తీయులను అణగదొక్కుటకు సమయము వెదకుచుండెననియు సంసోను తల్లిదండ్రులకు తెలియదు. ఆ కాలమున యిస్రాయేలీయులు ఫిలిస్తీయుల ఏలుబడిలోనుండిరి.

5. సంసోను తన తల్లిదండ్రులతో కూడ తిమ్నాతునకు వెళ్ళెను. అతడు నగరము చెంతగల ద్రాక్షతోటలను చేరగనే కొదమసింగమొకటి గర్జించుచు అతని మీదికి ఉరికెను.

6. వెంటనే యావే ఆత్మ సంసోనును ఆవేశించెను. అతడు చేతిలో ఆయుధమేమియు లేకున్నను సింగము మీదబడి మేకపిల్లను చీల్చివేసినట్లు చీల్చి వేసెను. కాని సంసోను జరిగిన సంగతిని తల్లిదండ్రులకు తెలియజేయలేదు.

7. అతడు నగరమునకు వెళ్ళి ఆ యువతితో మాట్లాడెను. ఆమె అతనికి నచ్చెను.

8. అనతికాలములోనే సంసోను ఆమెను పెండ్లియాడుటకు తిరిగివచ్చెను. అతడు సింహపు కళేబరము ఏమైనదో చూతమని త్రోవనుండి ప్రక్కకు తొలగెను. ఆ కళేబరములో తేనెపట్టు కన్పించెను. పట్టున తేనె కలదు.

9. సంసోను చేతితో తేనె తీసికొని త్రాగుచు వెడలిపోయెను. తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కూడ కొంచెము తేనెను ఈయగా వారును త్రాగిరి. కాని ఆ తేనెను సింగముడొక్కనుండి తీసితినని సంసోను వారితో చెప్పలేదు.

10. తర్వాత సంసోను తండ్రి ఆ యువతిని చూడబోయెను. అక్కడ సంసోను విందు చేసెను. అది ఆనాటి యువకుల ఆచారము.

11. పెండ్లికుమార్తె వైపువారు సంసోను యొద్దనుండుటకు ముప్పదిమంది మనుష్యులను తోడుగా తెచ్చిరి.

12. సంసోను ఆ ముప్పదిమందితో “మిమ్మొక పొడుపుకథ అడిగెదను. పెండ్లి విందు ఏడుదినములు ముగియకమునుపే కథ విప్పెదరేని మీకు ముప్పది కప్పడములు, ముప్పదికట్టుబట్టలు బహుమానముగా నిత్తును.

13. విప్పలేరో, మీరును నాకు అదియే బహుమానముగానిండు. ఇది పందెము” అనెను. వారు "అడుగుము చూతము" అనిరి.

14. సంసోను “తినెడు దానినుండి తినబడునది వచ్చె, బలమైన దానినుండి తీయనిది వచ్చె” అని పొడుపు కథ వేసెను. మూడునాళ్ళు గడిచినను వారికి జవాబు దొరకలేదు.

15. నాలుగవరోజున వారు సంసోను భార్యతో “నీ భర్తను లాలించి పొడుపుకథ భావమేమో తెలిసికొనుము. లేదేని నిన్ను, నీ పుట్టింటివారిని నిలువున కాల్చివేసెదము. మమ్మును దోచుకోవలెనని ఈ పెండ్లికి ఆహ్వానించితిరి కాబోలు!" అనిరి.

16. సంసోను భార్య తన భర్తముందట ఏడ్చుచు “నేననిన నీకిష్టములేదు. అసలు నాపై నీకు ప్రేమలేదు. నీవు మా జనమును ఒక పొడుపుకథ అడిగితివి. దాని అర్థమేమో నాకును వివరింపవైతివి గదా!” అనెను. సంసోను “ఆ కథ మర్మము మా తల్లిదండ్రులకు గూడ చెప్పలేదు, నీకు చెప్పవలెనా!” అనెను.

17. కాని ఆమె పండుగ దినములన్నింటిలో అతని ముందట ఏడ్చుచునే యుండెను. సంసోను భార్యపోరు పడలేక ఏడవనాడు కథలోని మర్మమును చెప్పివేసెను. వెంటనే ఆమె తన జనమును పిలిచి కథభావమును తెలియ జెప్పెను.

18. ఏడవనాడు సంసోను పడుకటిల్లు ప్రవేశింపక ముందు నగరవాసులు అతనితో “తేనెకంటె తీపియేది? సింగముకంటె బలమైనదేది?” అని అడిగిరి. కాని సంసోను వారితో “మీరు నా పెయ్యతో దున్ననియెడల ఈ పొడుపుకథను విప్పియుండరు” అనెను.

19. అంతట యావే ఆత్మ సంసోనును ఆవహించెను. అతడు అష్కెలోనునకు వెళ్ళి ముప్పది మంది ఫిలిస్తీయులను చంపెను. వారి దుస్తులను గొనివచ్చి పొడుపుకథ విప్పిన వారికి ఇచ్చివేసి కోపముతో నిప్పులుక్రక్కుచు తండ్రి ఇంటికి వెడలిపోయెను.

20. అటుతరువాత సంసోను భార్యను అతని తోడి పెండ్లి కొడుకునకిచ్చి వివాహముచేసిరి.

 1. కొంతకాలమైన తరువాత గోధుమ పంట కాలమున సంసోను భార్యను చూడబోయెను. ఆమె కొరకు ఒక మేకపిల్లను బహుమానముగా కొనిపోయెను. అతడు “నా భార్యగదికి వెళ్ళెదను” అనెను. కాని ఆమె తండ్రి సంసోనునకు అడ్డుపడి,

2. “నీకు ఆ యువతిపె అయిష్టము కలిగినదనుకొని ఆమెను నీ స్నేహితునికిచ్చి పెండ్లి చేసితిని. అయినను ఆ బాలిక కంటె ఆమె చెల్లెలు అందగత్తె. ఆ పిల్లకు బదులుగా ఈ పిల్లను నీకిత్తుము” అనెను.

3. సంసోను “ఈ ఫిలిస్తీయుల పీచమణచి తీరవలయును. వీరింత పనిచేసిరి. ఇక నేనేమి చేసినను తప్పుగాదు” అనుకొనెను.

4. అతడు పొలమునకు వెళ్ళి మూడువందల గుంటనక్కలను పట్టుకొనెను. రెండేసి గుంటనక్కల తోకలను ఒకదానితోనొకటి ముడివేసి ప్రతిముడిలోను ఒక కొరవిని దోపెను.

5. ఆ కొరవులకు నిప్పంటించి గుంటనక్కలను ఫిలిస్తీయుల పొలముల మీదికి తోలెను. పొలములలో కోతకు వచ్చిన పంట, కోసి కట్టలుకట్టిన పంట, ద్రాక్షతోటలు, ఓలివుతోటలు అన్ని నిప్పంటుకొని కాలిపోయెను.

6. ఫిలిస్తీయులు ఆ అపకారము చేసినది ఎవరాయని విచారింపగా సంసోనని తెలిసిపోయెను. సంసోను తిమ్నాతు పౌరుని కుమార్తెను పెండ్లియాడెననియు, తండ్రి వధువును మరల సంసోను స్నేహితునికిచ్చి పెండ్లి చేసెననియు, అందులకే అతడు ఈ పనిచేసి ననియు వినిరి. వారు సంసోను భార్యను ఆమె పుట్టినింటి వారిని నిలువునకాల్చి చంపిరి.

7. ఆ సంగతివిని సంసోను వారితో "మీరంతటి పాడుపనికి తలపడితిరి గనుక మీపై పగతీర్చుకొని తీరెదను” అనెను.

8. అతడు ఫిలిస్తీయుల మీదబడి చిక్కినవారిని చిక్కినట్లు చీల్చి చెండాడెను. అటుపిమ్మట ఏతాము కొండగుహకు వెడలిపోయి అచట వసించెను.

9. అపుడు ఫిలిస్తీయులు యూదా మీదికి దండెత్తి వచ్చి లేహినగరమును ముట్టడించిరి.

10. యూదీయులు ఫిలినీయులను చూచి “మీరు మాపై ఇట్లు దాడిచేయనేల?” అని అడిగిరి. వారు “మేము సంసోనును పట్టుకొనవచ్చితిమి. అతడు మాకు చేసిన కీడుకు ప్రతీకారము చేసితీరెదము" అనిరి.

11. అపుడు మూడువేలమంది యూదీయులు ఏతాము కొండస్థావరమునకు వెళ్ళి సంసోనుతో “ఫిలిస్తీయులు మన ఏలికలని నీకు తెలియదా? నీవు మాకెంతటి ముప్పు తెచ్చి పెట్టితివి” అని అనిరి. అతడు వారితో “ఫిలిస్తీయులు నాకు ద్రోహము తలపెట్టిరి కనుక నేను వారికి శాస్తి చేసితిని” అనెను.

12. యూదీయులు అతనితో “మేము నిన్ను పట్టుకొని పోయి ఫిలిస్తీయులకు అప్పగించెదము” అని పలికిరి. సంసోను “మీరు నన్ను చంపము అని ప్రమాణము చేయుడు” అనెను.

13. యూదీయులు అతనితో “మేము నిన్ను చంపదలచుకోలేదు. నిన్ను బంధించి ఫిలిస్తీయుల చేతికి అప్పగించెదము” అని పలికిరి. అంతట యూదీయులు అతనిని రెండు క్రొత్త త్రాళ్ళతో బంధించి కొండగుహ నుండి వెలుపలికి కొనివచ్చిరి.

14. సంసోను లేహి పట్టణమునకు రాగానే ఫిలిస్తీయులు అతనిని చూచి పొంగిపోయి వెట్టి కేకలు వేసిరి. అంతట యావే ఆత్మ సంసోనును ఆవహింపగా అతని బంధములన్నియు నిప్పంటుకొనిన నార త్రాళ్ళ వలె నయ్యెను. త్రాటికట్టులన్నియు సడలిపోయెను.

15. అచ్చట పచ్చిపచ్చిగానున్న గాడిద దవడ ఎముక యొకటి సంసోను కంటబడెను. అతడు చేయిచాచి ఆ ఎముక నందుకొని దానితో ఫిలిస్తీయులను వేయిమందిని చంపెను.

16. అతడు “గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీయులను గాడిదలను కొట్టినట్లుగా కొట్టితిని, గాడిద దవడ ఎముకతో వేయిమందిని పడగొట్టితిని” అనెను.

17. ఆ మాటలతో సంసోను చేతిలోని దవడ ఎముకను విసరిపారవేసెను. కనుకనే ఆ తావునకు రామత్-లేహి' అని పేరువచ్చెను.

18. అపుడు సంసోను దప్పికగొని యావేకు మొర పెట్టెను. “ప్రభూ! నీ దాసునికి ఈ మహావిజయము ప్రసాదించినవాడవు నీవే. నేనిపుడు దప్పికతో చావవలసినదేనా? సున్నతి సంస్కారములేని ఈ ఫిలిస్తీయుల చేతికి చిక్కవలసిన దేనా?” అని వేడుకొనెను.

19. ఆ వేడుకోలువిని యావే నేలను బద్దలుచేసి గోయి ఏర్పడునట్లు చేసెను. నేడు లేహి పట్టణమున ఉన్న గొయ్యి అదియే. ఆ గోతి నుండి నీళ్ళు పైకి ఉబికివచ్చెను. సంసోను నీళ్ళు త్రాగి సేదదీర్చుకొనెను. అతనికి మరల సత్తువకలిగెను. కనుకనే ఆ ఊటకు ఎనోహక్కోరే' అని పేరు వచ్చెను. లేహి చెంత నేటికిని ఆ చెలమను చూడవచ్చును.

20. ఫిలిస్తీయుల కాలమున సంసోను ఇరువది ఏండ్లపాటు యిస్రాయేలీయులకు న్యాయాధిపతిగా నుండెను.

 1. సంసోను గాజాకు వెళ్ళెను. అచట ఒక వేశ్యను చూచి ఆమె ఇంటికి పోయెను.

2. సంసోను వచ్చెనని విని పురజనులు ప్రోగైవచ్చి నగరద్వారమున కాపుండిరి, వారు ఉదయముననే సంసోనును చంపవచ్చునుగదా అనుకొని రేయంతయు ఊరకుండిరి.

3. సంసోను నడిరేయివరకు సద్దు సేయక నిద్దురపోయెను. కాని అతడు అర్ధరాత్రమున లేచి నగర ద్వారము తలుపులను, ద్వారబంధమును, అడ్డు గఱ్ఱతోపాటు ఊడబెరికి భుజములపై మోసికొని వెడలి పోయెను. హెబ్రోనునకు ఎదురుగానున్న కొండపైకి ఎక్కిపోయి వానినచట వదలివేసెను.

4. అటు తరువాత అతడు సోరేకు లోయలో వసించు వనితను ఒకతెను వలచెను. ఆమె పేరు డెలీలా.

5. ఫిలిస్తీయ దొరలు డెలీలా చెంతకు వచ్చి “నీవు సంసోనును లాలించి అతని విచిత్రబలమునకు కారణమేమో తెలిసికొనుము. అతనిని లోగొని త్రాళ్ళతో కట్టి చెరపట్టు మార్గమేమో కనుగొనుము. నీ మట్టుకు నీకు మేమొక్కొక్కరము పదునొకండు వేల వెండికాసులు కానుకగానిత్తుము” అని చెప్పిరి.

6. డెలీలా సంసోనును “నీ విచిత్రబలమునకు కారణమేమి? నిన్ను చెరపట్టుట ఎట్లు?” అని అడిగెను.

7. సంసోను “పచ్చిపచ్చిగానున్న అల్లెత్రాడులు ఏడింటితో నన్ను బంధింతురేని నాబలమంతయు ఉడిగిపోయి సామాన్యజనునివలె అయ్యెదను” అని చెప్పెను.

8. ఫిలిస్తీయదొరలు వచ్చి అల్లెత్రాడులు ఏడింటిని డెలీలా కిచ్చిరి. ఆమె వానితో సంసోనును బంధించెను.

9. ఫిలిస్తీయులు డెలీలా ఇంట దాగి యుండిరి. ఆమె “సంసోను! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేకపెట్టెను. సంసోను ఆ అల్లెత్రాళ్ళనన్నింటిని నిప్పంటుకొనిన నారత్రాళ్ళను వలె సునాయాసముగా ట్రెంచివేసెను. కనుక అతని బలమునకు కారణమేమో తెలియలేదు.

10. డెలీలా మరల సంసోనుతో “నీవు కల్లబొల్లి కబుర్లు చెప్పి నన్ను గేలిచేసితివి. నిన్ను బంధించుట ఎట్లో చెప్పవైతివిగదా!" అనెను.

11. అతడు “ఇంత వరకు ఎవ్వరును వాడని క్రొత్త త్రాళ్ళతో నన్ను కట్టుదురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరుని వలె నయ్యెదను” అని చెప్పెను.

12. కనుక డెలీలా అతనిని క్రొత్త తాళ్ళతో బంధించి “సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేక పెట్టెను. ఫిలిస్తీయులు ఆమె యింట దాగియుండిరి. కాని సంసోను తనచేతి కట్టులన్నిటిని దారములవలె ట్రెంచివేసెను.

13. డెలీలా మరల సంసోనుతో “ఇంతవరకు అల్లిబిల్లిమాటలు చెప్పి నన్ను గేలిసేసితివిగదా! ఇకనైన నిన్ను బంధించుట ఎట్లో నాతో చెప్పవా?” అనెను.

14. అతడు ఆమెతో “నా తలజడలు ఏడు పడుగువలె నేసి మేకునకు బిగగట్టెదవేని నా బలమంతయు ఉడిగి సామాన్య జనునివలెనయ్యెదను” అని చెప్పెను. ఆమె సంసోనును నిదురబుచ్చి అతని జడలు ఏడింటిని పడుగువలె నేసి మేకునకు బిగగట్టి “సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేక వేసెను. అతడు నిద్దురలేచి తలవెండ్రుకలను వానిని కట్టిన మేకును ఒక్క ఊపున ఊడబెరికెను. కనుక అతని బలమునకు కారణమేమియో తెలియలేదు.

15. అంతట డెలీలా అతనితో “నీవు నన్ను వలచితివన్నమాట కల్ల. అసలు నీకు నాపై నమ్మకమే లేనపుడు ఇక వలపెక్కడిది? నీవు నన్ను ముమ్మారు గేలి సేసితివి. నీ విచిత్రబలమునకు కారణమేమో ఇంతవరకు నాకు తెలుపవైతివిగదా!” అని వాపోయెను.

16. ఆమె రేపుమాపు సంసోనును గ్రుక్క తిప్పుకొన నీయకుండ అదే ప్రశ్నతో పీడించి తొందర పెట్టజొచ్చెను. అతడు విసిగివేసారిపోయెను.

17. ఆమె పోరు పడలేక చివరకు తన రహస్యమును చెప్పివేసెను. “ఇంతవరకు క్షురకత్తి నా తలవెంట్రుకలను తాకలేదు. పుట్టుక నుండి నేను వ్రతతత్పరుడనై జీవించుచుంటిని. నా తలజుట్టు కత్తిరింతురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరునివలె అయ్యెదను” అని చెప్పెను.

18. డెలీలా చిట్టచివరకు సంసోను తన రహస్యము తెలియజెప్పెనని గ్రహించెను. వెంటనే ఆమె “ఇంకొక మారు మీరు ఇచ్చటికిరండు. సంసోను తన మర్మమును తెలియజెప్పెను” అని ఫిలిస్తీయ దొరలకు వర్తమాన మంపెను. ఆ కబురందుకొని ఫిలిస్తీయదొరలు రూకలతో వచ్చిరి.

19. ఆమె సంసోనునులాలించి తన ఒడిలో నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి అతని తలజడలు ఏడుకత్తెరలు వేయించి, అతనిని బాధింప మొదలిడెను. వెంటనే అతనిబలము ఉడిగిపోయెను.

20. డెలీలా “సంసోనూ! ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదికి వచ్చుచున్నారు” అని కేక పెట్టెను. అతడు నిద్రమేల్కొని మునుపటివలెనె బయటపడుటకు భుజములు జాడింపవచ్చును గదా అనుకొనెను. కాని ప్రభువు తనను విడనాడెనని సంసోనునకు తెలియదు.

21. అంతట ఫిలిస్తీయులు సంసోనును బంధించి అతని కన్నులు పెరికివేసి గాజాకు నడిపించుకొని పోయిరి. రెండుకట్ల ఇత్తడి గొలుసుతో అతనికి సంకెళ్ళు వేసిరి. సంసోను వారి చెరలో తిరగలి విసురు వాడయ్యెను.

22. కాని కత్తిరింపబడిన అతని తలవెంట్రుకలు మరల పెరుగజొచ్చెను.

23. అంతట ఫిలిస్తీయ సర్దారులు వారి దేవుడైన దాగోనునకు మహావైభవముతో బలి సమర్పించి ఉత్సవము చేసికొనుటకై ప్రోగైవచ్చిరి. వారు “మనము కొలుచుదేవుడు మన పగతుడైన సంసోనును మన చేతికి అప్పగించెనుగదా!” అనుకొని పొంగిపోయిరి.

24. ఆ ప్రజలు దాగోను విగ్రహము కంటబడగనే అతనిని స్తుతించుచు: “మన దేశమును సర్వనాశనము చేసి మనవారినెందరినో మట్టుపెట్టిన మన పగతుడైన సంసోనును మన దేవుడు నేడు మనచేతికి అప్పగించెను” అని అరచిరి.

25. వారి హృదయములు ఆనందము నొందగా “మనమాతని ఆటపట్టింప పిలిపింపుడు, అతని కార్యములనుజూచి వినోదింతుము” అని చెరసాల నుండి సంసోనును కొనివచ్చిరి. అతడు వారి ఎదుట వీరకార్యములు చేసెను. ఫిలిస్తీయులు అతనిని తమ దేవళమునందలి స్తంభములమధ్య నిలిపి పరిహసించిరి.

26. సంసోను తనను నడిపించు బాలకునితో “ఈ మందిరమును మోయు స్తంభములను తడవి చూడనిమ్ము. నేను వానిపై కొంచెము ఆనుకోవలయును” అనెను.

27. దేవళము స్త్రీపురుషులతో క్రిక్కిరిసియుండెను. ఫిలిస్త్రీయ దొరలందరు అచట సమావేశమై సంసోనును ఎగతాళిచేయగా మీది అంతస్తున రమారమి మూడు వేలమంది స్త్రీపురుషులు తిలకించుచుండిరి.

28. అపుడు సంసోను యావేను స్మరించుకొని “ప్రభూ! నన్ను జ్ఞప్తియుంచుకొనుము. ఇంకొక్కమారు నీ బలమును నాకు ప్రసాదింపుము. నా రెండుకన్నులను పెరికివేసినందులకై ఈ ఫిలిస్తీయులపై ఒక్క దెబ్బతో పగతీర్చుకోనిమ్ము" అని ప్రార్థించెను.

29. అతడు మందిరమును మోయు మూలస్తంభములు రెండింటిమీద చేతులు మోపెను. కుడిచేతిని ఒకదాని మీద, ఎడమచేతిని మరొకదానిమీద మోపి రెండు స్తంభములపై తన బలమును చూపెను.

30. "ఈ ఫిలిస్తీయులతోపాటు నేనును చత్తునుగాక!” అని అరచి ముందటికి వంగి స్తంభములను శక్తికొలది నెట్టెను. ఆ నెట్టుడుకు మందిరము పెళ్ళున కూలి దొరల మీదను, ప్రేక్షకులమీదను విరుచుకొనిపడెను. సంసోను తాను బ్రతికియుండగా చంపిన వారికంటె చనిపోవుచు చంపినవారే అధికులు.

31. అంతట సంసోను సోదరులు, బంధువులు వచ్చి అతని మృతదేహమును కొనిపోయిరి. జోరా, ఎష్టావోలు నగరముల మధ్య నున్న అతని తండ్రి మనోవా సమాధిలోనే అతనిని గూడ పాతిపెట్టిరి. సంసోను ఇరువదియేండ్ల పాటు యిస్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.

 1. ఎఫ్రాయీము పర్వతసీమలో మీకా అను వాడొకడుండెను.

2-3. అతడు తన తల్లితో “అమ్మా! నీవు పదునొకండువందల వెండికాసులు పోగొట్టుకొంటివిగదా! నేను వినుచుండగనే నీవా సొమ్మును అపహరించిన దొంగను నిశితముగా శపించితివి. ఆ సొమ్మును ప్రభువునకు అర్పించితివి. దానితో చెక్కడపు బొమ్మను తయారు చేయింపవలయును అంటివి. ఆ సొమ్ము నాయొద్దనున్నది. కాసులను తీసికొన్నది నేనే సుమా! ఇక నీ డబ్బు నీకిచ్చివేసెదను” అని చెప్పెను. ఆమె “యావే నా బిడ్డను దీవించును గాక!” అనెను. మీకా పదునొకండు వందల వెండి నాణెములు తల్లికి ముట్టజెప్పెను.

4. అంతట ఆమె తన సొమ్మునుండి రెండు వందల నాణెములు తీసికొని కంసాలికి ఈయగా అతడు చెక్కడపు బొమ్మను తయారుచేసెను. ఆ విగ్రహమును మీకా ఇంటనుంచిరి.

5. మీకా ఒక దేవళమును నిర్మించి ఏఫోదు తెరాఫీము' చేయించి గృహ దేవతా విగ్రహమును ప్రతిష్ఠించెను. అతడు తన కుమారునే యాజకునిగా నియమించెను.

6. ఆ రోజులలో యిస్రాయేలీయులకు రాజులేడు. ఎవరి ఇష్టమువచ్చినట్లు వారు ప్రవర్తించెడివారు. .

7-8. అట్లుండగా యూదా బేత్లెహేమునకు చెందిన యువకుడొకడు అక్కడ పరదేశిగా బ్రతుకుచుండెను. అతడు యూదా కుటుంబమునకు చెందిన లేవీయుడు. బేత్లెహేము నగరమును విడనాడి మరి ఎక్కడైన పొట్టపోసికొందును అనుకొని పయనమై ఎఫ్రాయీము కొండసీమయందున్న మీకా ఇంటికి వచ్చెను.

9. మీకా అతనిని జూచి “నీ వెక్కడినుండి వచ్చితివి” అని ప్రశ్నించెను. ఆ యువకుడు “నేను యూదా బేత్లెహేము నివాసిని, లేవీయుడను. ఎక్కడైనను బ్రతుకు తెరువు దొరుకునేమో అని వచ్చితిని” అని చెప్పెను.

10. మీకా అతనితో “నీవు మా ఇంటనుండ వచ్చును. నాకు యాజకుడవై నాపట్ల తండ్రివలె మెలగుము. నేను నీకు అన్నము, బట్టలు ఇచ్చి ఏడాదికి పది వెండినాణెములిత్తును” అనెను.

11. లేవీయుడు ఒప్పుకొనెను. మీకా కుమారునివలె అతడు ఆ ఇంట మనజొచ్చెను.

12. మీకా లేవీయుని యాజకునిగా నియమించెను. లేవీయుడు మీకాకు అర్చకుడై అతని ఇంటనే వసించుచుండెను.

13. మీకా “నా భాగ్యము వలన ఈ లేవీయుడు నాకు యాజకుడు అయ్యెను. ఇక యావే నన్ను తప్పక దీవించును” అనుకొనెను.

 1. ఆ రోజులలో యిస్రాయేలీయులకు రాజు లేడు. ఆ కాలమున దాను తెగవారు నివాస ప్రదేశము కొరకు వెదకుచుండిరి. యిస్రాయేలు తెగలందు దాను తెగవారికి స్వాస్త్యభూమి ఇంకను లభింపలేదు.

2. దానీయులు తమ జనమునుండి ఐదుగురు వీరులను ఎన్నుకొనిరి. దేశమును వేగుజూచుటకై జోరా, ఎష్టావోలు నగరమునుండి ఆ ఐదుగురను పంపించిరి. “మీరు పోయి ఈ దేశమును పరిశీలించిరండు” అని చెప్పిరి. ఆ వేగులవాండ్రు ఎఫ్రాయీము పర్వతసీమ  చేరుకొని రేయి మీకా ఇంట బసచేయవచ్చిరి.

3. వారు మీకా ఇంటిపట్టునకు రాగానే అతని యాజకుడైన లేవీయ యవ్వనస్తుని స్వరమును గుర్తుపట్టిరి. ఆ ఇల్లు సొచ్చి “నిన్నిచటికి ఎవ్వరు కొనివచ్చిరి? ఇచట ఏమి చేయుచున్నావు? నీ పనియేమి?" అని ప్రశ్నించిరి.

4. అతడు “ఈ మీకా నన్ను పరామర్శించుచున్నాడు. ఇతడు జీతము బత్తెము ఇచ్చి నన్ను తన యాజకునిగా నియమించుకొనెను” అని చెప్పెను.

5. వారు అతనితో “మేము చేయు ప్రయాణము సఫలమగునేమో యావేను సంప్రతించిచూడుము” అనిరి.

6. అతడు వారితో “యావే మీకు బాసటయైయుండును. నిశ్చింతగా పోయి రండు” అని చెప్పెను.

7. ఆ ఐదుగురు అటనుండి పయనమైపోయి లాయీషు చేరుకొనిరి. అచటి జనులు సీదోనీయులవలె చీకుచింతలేక నిర్భయముగా జీవించు చుండిరి. పొలమున పంటకేమియు కొదువలేదు. సీదోనీయులకు, వారికి చాలదూరము. అరామీయులతో వారికి అసలు సంబంధమేలేదు.

8. ఆ తావును పరిశీలించి వేగువాండ్రు జోరా, ఎష్ణావోలు పట్టణములకు తిరిగివచ్చిరి. పట్టణవాసులు “ఏమి వార్తలు తెచ్చితిరి?” అని అడిగిరి.

9. వారు “మేము దేశమంతయు గాలించి లాయీషువరకు పోయితిమి. అచటి ప్రజలు చీకుచింతలేక నిర్భయముగా జీవించుచున్నారు. సీదోనీయులకు వారికి చాలదూరము. అరామీయులతో వారికి అసలు పొత్తులేదు. పోయి వారిమీద పడుదమురండు. మేము ఆనేలను కన్నులార చూచివచ్చితిమి. అది కంటికి ఇంపయిననేల. ఇక ఆలోచింపనక్కరలేదు. జాగు సేయకపోయి లాయీషు మీదపడి ఆ నేలను గెలుచుకొందము.

10. ఆ జనమునకు అక్కడ దిక్కుదివాణము లేదు. ఆ దేశముకూడ చాల విశాలమైనది. ఇంతయేల? భూమిమీద నరుడు కోరుకొనువస్తువు దేనికిని కొరత కలుగని నేలను యావే మనకు అందునట్లు చేసెను” అని చెప్పిరి.

11. జోరా, ఎష్టావోలు పట్టణములనుండి దాను వంశీయులు ఆరువందలమంది సాయుధులై యుద్ధమునకు బయలుదేరిరి.

12. వారు కిర్యత్యారీమున విడిదిచేసిరి. కనుకనే ఆ తావునకు నేటికిని దానీయుల శిబిరము అని పేరు. ఆ చోటు కిర్యత్యారీమునకు పడమట కలదు.

13. అచటినుండి వారు ఎఫ్రాయీము పర్వతసీమ చేరి మీకా ఇల్లుసొచ్చిరి.

14. అపుడు దేశమును వేగుచూచుటకు వెళ్ళివచ్చిన ఐదుగురు తమ అనుచరులతో “చూచితిరా! ఈ ఇంట ఏఫోదు, తెరాఫీము, పోతవిగ్రహమును గలవు. ఇపుడు మనము చేయవలసినదేమో లెస్సగా విచారింపుడు” అని చెప్పిరి.

15. అంతట వారు త్రోవనుండి ప్రక్కకు తొలగి మీకా ఇంటనున్న లేవీయునియొద్దకు వచ్చి అతనిని కుశలమడిగిరి.

16. సాయుధులై వచ్చిన ఆరువందల మంది పురద్వారముచెంత నిలుచుండిరి.

17. వేగు జూచి వచ్చిన ఆ ఐదుగురు ఇల్లుసొచ్చి విగ్రహమును, ఏఫోదు తెరాఫీములను కొనివచ్చిరి. అపుడు యాజకుడు సాయుధులతోపాటు పురద్వారము ఎదుట నిలు చుండియుండెను.

18. ఇంటి లోపలికి వెళ్ళినవారు విగ్రహమును, ఏఫోదు తెరాఫీములను కొనివచ్చుట జూచి యాజకుడు “ఇది ఏమి పని?” అని ప్రశ్నించెను.

19. వారు అతనితో “నీవు చప్పుడు చేయవలదు. నోటిపై చేయిమూసికొని మా వెంటరమ్ము. నీవు మాకు యాజకుడవై మాపట్ల తండ్రివలె ప్రవర్తింపవలెను. నీవు ఒక్క కుటుంబమునకు అర్చకుడవగుట మేలా లేక ఒక యిస్రాయేలు వంశమునకు, ఒక తెగ వారందరికి యాజకుడవగుట మేలా?" అని అనిరి.

20. ఆ మాటలకు యాజకుడు సంతసించెను. వారియొద్ద నుండి విగ్రహమును, ఏఫోదు తెరాఫీములను గైకొని తాను ఆ జనుల నడుమ నడువజొచ్చెను.

21. వారు తమ సేవకులు, సామగ్రి, మందలు ముందు నడువగా మునుపు వచ్చిన త్రోవవెంటనే పయనము సాగించుచుండిరి.

22. ఆ ప్రజలు కొంత దూరము సాగిపోగానే మీకా ఇరుగుపొరుగు వారిని ప్రోగుచేసికొని దానీయుల వెంటబడెను.

23. వారు దానీయులను పొలికేకలువెట్టి పిలిచిరి. దానీయులు వెనుదిరిగి చూచి మీకాతో "ఓయి! నీకేమి పొగరు? ఇట్లు మా వెంట బడెదవేల?” అని అడిగిరి.

24. అతడు “మీరు నేను స్వయముగా నా చేతులతో చేసికొనిన దేవతా విగ్రహమును గొనిపోవుచున్నారు. నా యాజకునిగూడ తీసికొనిపోవుచున్నారు. మీ త్రోవను మీరు హాయిగా వెళ్ళుచున్నారు. కాని నాకిక ఏమి మిగిలినది? పైపెచ్చు నాకేమి పొగరని అడుగు చున్నారా?” అనెను.

25. దానీయులు “ఇక నోరు తెరవకుము. వీరికి కోపము రప్పింతువేని తప్పక నీ మీదబడెదరు. నీవును నీ కుటుంబమును ప్రాణములు కోల్పోవలసివచ్చును” అని పలికిరి.

26. అటుల పలికి దానీయులు సాగిపోయిరి. వారు తనకంటెను బలవంతులు కనుక మీకా ఏమియు చేయజాలక వెను దిరిగి ఇంటిమొగము పట్టెను.

27. ఆ రీతిగా దానీయులు మీకా విగ్రహమును, అతని యాజకునిగొనివచ్చి లాయీషు మీదపడిరి. చీకుచింత లేక నిరాడంబరముగా జీవించుచున్న ఆ నగర వాసులనెదుర్కొని అందరిని మట్టుపెట్టిరి. నగరమును కాల్చివేసిరి.

28. లాయీషు పౌరులకు సాయపడుటకు ఎవ్వరును రాలేదు. సీదోను అచటికి చాలదూరము. అరామీయులతో వారికి పొతులేదు. ఆ పట్టణము బేత్-రెహోబు వైపున ఒక లోయయందు నిర్మింపబడియుండెను.

29. దానీయులు పట్టణమును మరల కట్టుకొని అటవసించిరి. తమ వంశకర్తయు, యిస్రాయేలు కుమారుడునగు దాను పేరు మీదుగా ఆ నగరమునకు దాను అని పేరిడిరి. కాని దాని మొదటి పేరు లాయీషు.

30. దానీయులు తాము కొనివచ్చిన పోత విగ్రహమును అచట ప్రతిష్టించుకొనిరి. మోషే కుమారుడగు గెర్షోము పుత్రుడు యోనాతాను, అతని తరువాత అతని కుమారులు దానీయులకు యాజకులైరి. ప్రవాసకాలము వరకు వారే యాజకులుగా పని చేసిరి.

31. మీకా తయారుచేసికొనిన పోతవిగ్రహమును దానీయులు తమ దేవళమున ప్రతిష్ఠించు కొనిరి. దైవమందసము షిలో నగరమున ఉన్నంత కాలము ఆ విగ్రహము అచటనేయుండెను.

 1. యిస్రాయేలీయులకు రాజు లేని దినములలో, ఎఫ్రాయీము కొండసీమలో లేవీయుడు ఒకడు పరదేశిగా వసించుచుండెను. అతడు యూదా బేత్లెహేమునకు చెందిన ఒక ఉంపుడుగత్తెను భార్యగా ' చేకొనెను.

2. ఒకమారు ఆమె భర్త మీద కోపపడి పుట్టినింటికి వెళ్ళిపోయి నాలుగు నెలలపాటు అచటనే యుండెను.

3. లేవీయుడు భార్యతో ప్రియముగా మాటలాడి ఆమెను మరల తీసికొని వత్తును అనుకొని సేవకుని, రెండు గాడిదలను వెంట పెట్టుకొని బేత్లెహేమునకు వచ్చెను. మామ అతనిని అల్లంతదూరమున నుండగనే చూచి సంతోషముతో ఎదురువచ్చెను.

4. అల్లుని అన్ని మర్యాదలతో సత్కరించెను. లేవీయుడు అచట మూడునాళ్ళుండెను. వారు అచటనే అన్నపానీయములు పుచ్చుకొని రేయిగడిపిరి.

5. నాలుగవనాడు వేకువనే మేల్కొనిరి. లేవీయుడు ప్రయాణమునకు సంసిద్ధుడగుచుండగా మామ “పిడికెడు మెతుకులుతిని సత్తువ దెచ్చుకొనుము. తరువాత సాగిపోవచ్చును” అనెను.

6. కనుక వారిద్దరు భోజనమునకు కూర్చుండి అన్నపానీయములు పుచ్చుకొనిరి. మామ అల్లునితో “ఈ రాత్రికి నిలువుము ఇచట హాయిగా నుండి పోవచ్చును” అనెను.

7. లేవీయుడు వలదువలదనుచు ప్రయాణము కట్టబోయెను గాని మామ బలవంతము చేయుటచే ఆరాత్రికి ఆగిపోయెను.

8. ఐదవనాడు లేవీయుడు తెల్లవారకముందే లేచి ప్రయాణమునకు సిద్ధపడుచుండగా మామ కొంచెము అన్నము పుచ్చు కొమ్మని బతిమాలెను. వారు, మాట్లాడుచు సాయంత్రము వరకు ప్రొద్దుపుచ్చిరి. మామ అల్లుడు కలిసియే భుజించిరి.

9. అంతట లేవీయుడు భార్యను సేవకుని తీసికొని పయనము కాబోగా మామ “ఇపుడు ప్రొద్దు గ్రుంక బోవుచున్నది. హాయిగా ఈ రేయి యిట గడుపుము. రేపు వేకువనే లేచి మీ ఇంటికి వెడలిపోవచ్చును” అనెను.

10. కాని లేవీయుడు ఆ రాత్రి అచట గడుపుటకు అంగీకరింపలేదు. అతడు ప్రయాణము కట్టి, జీను కట్టబడిన రెండు గాడిదలు మరియు అతని భార్యతో, సేవకునితో యెబూసు పట్టణము దాపునకు వచ్చెను. (అదియే యెరూషలేము).

11. వారు యెరూషలేము చేరునప్పటికి ప్రొద్దు వ్రాలుచుండెను. కనుక సేవకుడు "అయ్యా! రాత్రికి ఈ యెబూసీయుల పట్టణమున బసచేయుదము రమ్ము” అనెను.

12-13. కాని యాజకుడు “మనము యిస్రాయేలీయులు కాని అన్యజాతి జనుల పట్టణములకు పోరాదు, గిబియాకు వెళ్ళుదము పద. గిబియా గాని, రామాగాని చేరుకొని అట బసచేయవచ్చును” అనెను.

14. కనుక వారు ప్రయాణము సాగించిరి. ఆ బాటసారులు బెన్యామీనీయుల గిబియా చేరుకొను నప్పటికి ప్రొద్దుక్రుంకెను.

15. రేయి అచట గడుపుదము అనుకొని వారు పట్టణమున ప్రవేశించిరి. లేవీయుడు రచ్చపట్టున నడివీధిలో కూర్చుండెనుగాని, రాత్రికి మా ఇంటికి రమ్మని పిలిచిన దిక్కులేదు.

16. కొంచెము సేపయిన తరువాత పొలము పని చాలించుకొని తిరిగివచ్చు ముదుసలి ఒకడు వారి కంటబడెను. అతడు ఎఫ్రాయీము కొండసీమ నుండి వలసవచ్చి ఆ బెన్యామీనీయుల నగరమున వసించుచుండెను.

17. ఆ ముదుసలి ఎగాదిగా పారజూచి ఎవరో బాటసారి నగరము నడివీధిలో కూర్చుండి యున్నాడని గ్రహించి "అయ్యా! నీ వెచ్చటినుండి వచ్చుచున్నావు? ఎచ్చటికి వెళ్ళుచున్నావు?” అని అడిగెను.

18. బాటసారి “మేము యూదా బేత్లెహేము నుండి ఎఫ్రాయీము పర్వతసీమల ఆవలికి వెళ్ళుచున్నాము. నేను అచటివాడను. నేను యూదా బేత్లెహేమునకు వెళ్ళితిని. ఇపుడు యావే ఆలయమునకు పోవుచున్నాను. కాని ఈ ఊరిలో మీరు రాత్రికి మా ఇంటికిరండు, అని పిలిచిన దిక్కులేదు.

19. మా గాడిదలకు గడ్డి, ధాన్యము కలవు. నాకు, ఈ నీ దాసురాలికి, మావెంట వచ్చు ఈ సేవకునికి సరిపోవునంత రొట్టె, ద్రాక్షసారాయము కలవు. ఇక మాకేమియు అక్కరలేదు” అనెను.

20. ముదుసలి “మీరు మా ఇంటికి రండు. నేను మీకు ఏ కొరత కలుగనీయను. రాత్రి వీధులలో పడియుండనేల?” అనెను.

21. వారిని తన ఇంటికి కొనిపోయి గాడిదలకు మేత వేయించెను. అతిథులు కాళ్ళుగడుగుకొని అన్నపానీయములు పుచ్చుకొనిరి.

22. అటుల వారు ఆ ఇంట సుఖముగానుండగా నగరమునందలి ముష్కరులు కొందరు గుమిగూడివచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపు మీద దబదబబాదిరి. ఆ ఇంటి యజమానుడైన ముదుసలితో “నీ ఇంటికి వచ్చిన మనుజుని ఇచటకు కొనిరమ్ము. మేము అతనిని కూడవలయును” అనిరి.

23. గృహయజమానుడు వెలుపలికి వచ్చి “నాయనలారా! ఇట్టి పాడుపని చేయుదురా? అతడు నా ఇంటికి వచ్చిన అతిథి. మీరిట్టి దుష్కార్యమును తలపెట్టవలదు.

24. అదిగో కన్యక అయిన నా కుమార్తె మరియు ఆ మనుష్యుని భార్యను బయటకు కొనివత్తును. వారిని మీ ఇష్టము వచ్చినట్లు చేయుడు. కాని ఈ నరునికి మాత్రము చెడు తలపెట్టకుడు”' అని వారింపజొచ్చెను.

25. అయినను ఆ గుంపు వినిపించుకోలేదు. అపుడు లేవీయుడు తన భార్యను వెలుపలికి తీసికొని వచ్చి వారికి అప్పగించెను. ఆ దుర్మార్గులు ఆమెను కూడిరి. ఉదయమగువరకు ఆ రేయంతయు ఆమెను చెరిచి తెలతెలవారుచుండగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి.

26. ఆమె తెల్లవారు చుండగా లేచివచ్చి తన భర్తయున్న ఇంటిద్వారము ముంగిటబడెను. ప్రొద్దుపొడుచువరకు అచటనే యుండెను.

27. ఉదయముననే లేవీయుడు ప్రయాణమునకు సన్నద్ధుడై ఇంటితలుపు తీసిచూడగా భార్య తలుపుచెంత పడియుండెను. ఆమె చేతులను గడప మీద చాపియుండెను.

28. అతడు “లెమ్ము మనము వెళ్ళిపోవలెను” అనెను గాని ఆమెనోట మాటవెలువడ లేదు. అతడు ఆమె దేహమునెత్తి గాడిదమీదనుంచి ప్రయాణము కట్టెను.

29. ఇల్లు చేరుకొనిన తరువాత లేవీయుడు కత్తి తీసికొని ఏ అవయవమునకు ఆ అవయవము వచ్చునట్లుగా భార్యను పన్నెండు ముక్క లుగా కోసెను. ఆ ముక్కలను యిస్రాయేలు దేశము నలుమూలలకు పంపించెను.

30. అతడు దూతలను పంపుచు “మీరు మన జనులెల్లరితో ‘యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చినప్పటి నుండి నేటి వరకు ఇట్టి పాడుపనిని ఎందైన కంటిరా? మీరే స్వయముగా ఆలోచించి ఒకరితో ఒకరు సంప్రతించి జవాబునిండు' అని చెప్పుడు” అనెను. ఆ సంగతి వినినవారందరు “యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన నాటినుండి యిట్టి దుష్కార్యమును కన్నదిలేదు, విన్నదిలేదు” అని జవాబు ఇచ్చిరి.

 1. యిస్రాయేలీయులందరు ప్రోగైవచ్చిరి. దాను నుండి బేర్షెబా వరకును గిలాదు వరకునుగల ప్రజలందరును ఒక్కుమ్మడిగా గుమిగూడివచ్చి మిస్ఫా వద్ద యావే ఎదుట సమావేశమైరి.

2. దైవ ప్రజయగు యిస్రాయేలు తెగలవారందరు అచట ప్రోగైరి. వారి పెద్దలందరు హాజరైరి. అచట ఖడ్గమును ఝళిపింప గల కాలిబంట్లు నాలుగులక్షల మంది ఉండిరి.

3. యిస్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు వినిరి. యిస్రాయేలీయులు లేవీయునితో “ఈ దుష్కార్యమెట్లు జరిగినదో వివరింపుము" అనిరి.

4. అసువులు బాసిన స్త్రీ భర్త లేవీయుడు వారితో “నేను నా భార్య బెన్యామీను గిబియా చేరి రాత్రి అచట నిద్రింపదలచితిమి.

5. గిబియా పౌరులు వచ్చి నా మీదపడిరి. రేయి వచ్చి నేనున్న ఇంటిని చుట్టుముట్టిరి. ఆ దుర్మార్గులు నన్ను వధింపగోరిరి. నా భార్యను చెరచగా ఆమె చనిపోయినది.

6. కనుక నేనామెను ముక్కలు ముక్కలుగా కోసి యిస్రాయేలు దేశము నలుమూలలకు పంపితిని. వారు యిస్రాయేలు నేలమీద ఇంతటి దుష్కార్యము చేసిరి. యిస్రాయేలీయులారా!

7. మీరందరు ఇచట గుమిగూడితిరిగదా! ఇపుడేమి చేయుదమో మీరే ఆలోచించి చెప్పుడు” అనెను.

8. ఆ జనులందరు లేచి నిలుచుండి ఏకగ్రీవముగా “మనలో ఒక్కడును తన గుడారమునకు తిరిగి పోకూడదు. ఒక్కడును తన ఇంటికి మరలి పోకూడదు.

9. గిబియాకు ఇట్లు బుద్ది చెప్పుదము. వంతులు వేసి గిబియాను ముట్టడింతము.

10. యిస్రాయేలు తెగల నుండి నూటికి పదిమందిని, వేయికి నూరు మందిని, పదివేలకు వేయిమందిని ఎన్నుకొందము. యిస్రాయేలు నేలమీద ఈ దుష్కార్యము చేసిన బెన్యామీను గిబియా పౌరుల పీచమణచుటకై యుద్ధమునకు పోయిన సైనికులకు వీరు ఆహారము సమకూర్ప వలయును” అని అనుకొనిరి.

11. కనుక యిస్రా యేలీయులందరు ఒక్కుమ్మడిగా గిబియాను ఎదుర్కొన బోయిరి.

12-13. యిస్రాయేలీయులు బెన్యామీనీయుల మండలము నాలుగుచెరగులకు దూతలనంపి “మీ జనము ఎంత పాడుపనిచేసెనో చూడుడు. ఈ జనులను, ఈ గిబియా పట్టణ దుర్మార్గులను మాకు అప్పగింపుడు. మేము వారిని చిత్రవధ చేసి యిస్రాయేలు నేలమీది నుండి దుష్టులనెల్లరను తుడిచివేసెదము” అని కబురు పెట్టించిరి. కాని బెన్యామీనీయులు తమ సోదరులగు యిస్రాయేలీయుల మాట పాటింపలేదు.

14. బెన్యామీనీయులు తమ పట్టణముల నుండి గిబియా వద్ద ప్రోగై యిస్రాయేలీయులతో యుద్ధమునకు తలపడిరి.

15. అటుల వెడలివచ్చిన బెన్యామీనీయులను లెక్కించిచూడగా ఖడ్గము ఝుళిపింపగల యోధులు ఇరువది ఆరు వేలమంది తేలిరి. గిబియా పౌరులు ఈ లెక్కలో చేరలేదు.

16. ఆ సైన్యమున ఏడు వందలమంది యోధులు ఎడమచేతితో గూడ పోరుసల్పగలరు. ఒడిసెలతో తలవెంట్రుకకు గూడ గురి పెట్టి తప్పిపోకుండ కొట్టగలరు.

17. యిస్రాయేలీయులు కూడ తమ జనమును లెక్కింపగా ఖడ్గము ఝుళిపింపగల వీరులు నాలుగులక్షలమంది తేలిరి. వారందరు పోరున కాకలుతీరిన వీరులు. ఈ లెక్కలో బెన్యామీనీయులు చేరలేదు.

18. యిస్రాయేలీయులందరు బేతేలు దేవళమునకు వెళ్ళి యావేను సంప్రతించిరి. “మాలో మొట్టమొదట బెన్యామీనీయులను ఎవరు ఎదుర్కోవలయును?” అని యావేను అడిగిరి. యావే “మొట్టమొదట యూదీయులు బెన్యామీనీయులను ఎదుర్కోవలయును” అని జవాబు చెప్పెను.

19. యిస్రాయేలీయులు వేకువనే పోరుకు ఆయత్తమై గిబియాకెదురుగా గుడారముపన్నిరి.

20. బెన్యామీనీయులను తాకుటకై తమపౌరులను నగరమునకు ఎదురుగా బారులు తీర్చిరి. కాని బెన్యామీనీయులు నగరము వెడలివచ్చి యిస్రాయేలీయులను ఇరువది రెండువేలమందిని రణరంగమున కూల్చిరి.

21. యిస్రాయేలీయులు వెనుదిరిగిపోయి యావే సముఖమున చేరి మాపటిజాము వరకు బోరున ఏడ్చిరి. యావేను సంప్రతించి "మా సోదరులైన బెన్యామీనీయులతో మరల పోరాటమునకు పొమ్మందువా?” అని అడిగిరి. యావే “పొండు, వారితో పోరాడుడు” అనెను.

22. యిస్రాయేలు సైన్యము ధైర్యము తెచ్చుకొని ముందటి రోజువలె మరల తమ దండులను బారులు తీర్చిరి.

23. రెండవనాడు బెన్యామీనీయులను మరల తాకిరి.

24-25. కాని బెన్యామీనీయులు మరల నగరము వెడలివచ్చి యిస్రాయేలీయులను పదునెనిమిది వేలమందిని రణరంగమున కూల్చిరి. మడిసిన వారందరును ఆరితేరిన శూరులు, ఖడ్గము ఝళిపింపగల వీరులు.

26. యిస్రాయేలు ప్రజలందరు బేతేలునకు వెళ్ళి దేవుని సముఖమున కూర్చుండి పెద్దపెట్టున ఏడ్చిరి. సాయంత్రము వరకు ఉపవాసముండిరి. సమాధానబలిని, దహనబలిని సమర్పించు కొనిరి.

27. యావేను సంప్రతించిరి. ఆ రోజులలో దైవమందసము బేతేలుననే యుండెడిది.

28. అహరోను మనుమడును, ఎలియెజెరు కుమారుడునగు ఫీనెహాసు అచట యాజకుడుగా నుండెను. వారు “మమ్ము మా సోదరులైన బెన్యామీనీయులతో మరల పోరాడమందువా లేక ఇంతటితో పోరు విరమింపమందువా?” అని ప్రశ్నించిరి. యావే “పోరాడుడు, రేపు వారిని మీ వశము చేసెదను” అని చెప్పెను.

29. యిస్రాయేలీయులు కొందరు వెళ్ళి గిబియా ప్రక్క దాగుకొనిరి.

30. మూడవదినము యిస్రాయేలీ యులు బెన్యామీనీయులపై పోరుకు వెడలి మునుపటి రీతిగనే తమ దండులను బారులు తీర్చిరి.

31. బెన్యామీనీయులు నగరము వెడలివచ్చి యిస్రాయేలీయులను తాకిరి. వారు పూర్వపురీతినే బేతేలు గిబియా నగరములకు వెడలు మార్గములలోనున్న యిస్రాయేలీయులను చంపవచ్చిరి. అటులవచ్చి మైదానమున యిస్రాయేలీయులను ముప్పది మందిని చంపిరి.

32. బెన్యామీనీయులు వీరు మునుపటివలె మనచేతబడి చత్తురులెమ్మను కొనిరి. కాని యిస్రాయేలీయులు “మనము పారిపోయినట్లు నటించి ఈ బెన్యామీనీయులను రాచబాటలవెంట నగరము నుండి వెలుపలికి రప్పింతము.

33. అపుడు యిస్రాయేలు సైన్యమున ప్రధానాంగము బాల్తమారు వద్ద శత్రువులను ఎదిరించును. అంతలో దాగియున్న యిస్రాయేలు కూడ గిబియాకు పడమటివైపు నుండి రావలెను” అని కూడ బలుకుకొనిరి.

34. ఆ రీతిగా కలియబలుకు కొని యిస్రాయేలీయులు పదివేలమంది వీరులను ఎన్నుకొని గిబియామీదికి పంపిరి. అచట పోరు ముమ్మరమయ్యెను. కాని బెన్యామీనీయులకు తమ వినాశము దాపురించినదని తెలియదు.

35. యావే బెన్యామీనీయులను ఓడింపగా యిస్రాయేలీయులు శత్రువులను ఇరువదిఅయిదువేల నూరుగురిని తునుమాడిరి. వారందరును కత్తి దూయగల వారే.

36. అప్పుడు బెన్యామీనీయులు ఓడిపోయితిమి గదా అనుకొనజొచ్చిరి. యిస్రాయేలీయులు గిబియా మాటున పొంచియున్న తమ సైన్యముతో ముందుగనే అన్ని ఏర్పాట్లు చేసికొని బెన్యామీనీయులు ముందు పారిపోయినట్లు నటించిరి.

37. అంతలో దాగి యున్న యిస్రాయేలీయులు వెలుపలికి వచ్చి పట్టణము మీదబడి అచటి జనులనెల్లరను కత్తివాదరకు ఎరజేసిరి.

38. గిబియామాటున దాగియున్నవారు నగరమును కాల్చి పొగ ఆనవాలు చూపింతుమని ముందుగనే యిస్రాయేలీయులకు చెప్పిరి.

39. అపుడు పారివచ్చిన యిస్రాయేలీయులు బెన్యామీనీయులను ఎదిరించి పోరాడిరి. బెన్యామీనీయులు యిస్రాయేలీయులను ముప్పదిమందిని కూల్చిరి. వారు “మునుపటివలెనే శత్రువులను ఎదిరించి పారద్రోలవచ్చును గదా!" అనుకొనిరి.

40. అంతలోనే నగరము నుండి పొగవెలువడెను. బెన్యామీనీయులు వెనుదిరిగి చూచి పొగమంటలు మింటికెగయుచుండగా తమ నగరము కాలి బుగ్గియగుటను గాంచిరి.

41. వారు యిస్రాయేలీయులు ఒక్కుమ్మడిగా తమపై పడుటను జూచి ఇక నాశనము తప్పదనుకొని చెల్లాచెదరైపోయిరి.

42. బెన్యామీనీయులు బ్రతుకుజీవుడాయని ఎడారిత్రోవలు పట్టి పారిపోజొచ్చిరి. కాని యిప్రాయేలు సైన్యములు వారిపై బడెను. పట్టణము మాటున పొంచియున్న వారును వచ్చి బెన్యామీనీయులు ఎదుర్కొనిరి.

43. వారందరు బెన్యామీనీయులను చుట్టుముట్టి తరుముకొనిపోయి గిబియాకు తూర్పున చిత్రవధ చేసిరి.

44. బెన్యామీనీయులు పదునెనిమిది వేలమంది కూలిరి. చచ్చిన వారందరును మహావీరులే.

45. చావక మిగిలినవారు తప్పించుకొని ఎడారివెంట పలాయితులై రిమ్మోను తిప్పకు పారిపోవుచుండగా వారిలో ఐదువేలమందిని ప్రధాన మార్గములలో మట్టుబెట్టిరి. వారిని గిదోము వరకును తరుముకొని మరి రెండువేలమందిని చంపిరి.

46. ఆ దినమున మడిసిన బెన్యామీనీయులు మొత్తము ఇరువది ఐదువేలమంది, వారందరును కత్తిదూయ గల మహా వీరులు.

47. ఆరువందలమంది మాత్రము ఎడారిని బడి పారిపోయి రిమ్మోనుతిప్ప చేరుకొని నాలుగు మాసముల వరకు దాగుకొనిరి.

48. యిస్రాయేలీయులు తిరిగిపోయి బెన్యామీను పట్టణముల మీద బడి నరులనక, పశువులనక, కంటికి కనుపించిన ప్రాణులనన్నింటిని మట్టు పెట్టిరి. వారి నగరములన్నిటిని కాల్చివేసిరి.

 1. యిస్రాయేలీయులు మిస్పావద్ద ప్రోగై “మన పిల్లలను బెన్యామీనీయులకు ఈయవద్దు” అని ప్రమాణము చేసికొనిరి.

2. వారు బేతేలునకు వచ్చి యావే ముందట సాయంకాలము వరకు మిక్కిలి విలపించిరి.

3. “యిస్రాయేలు దేవుడైన యావే! నేడు యిస్రాయేలున ఒక తెగతక్కువైపోయినది కదా!” అని పరితపించిరి.

4. మరునాడు వేకువనే లేచి దేవునికి బలిపీఠముకట్టి సమాధానబలులు, దహనబలులు సమర్పించిరి.

5. యిస్రాయేలు తెగలందు నేడు యావే సన్నిధికి రానివారె వరైనా ఉన్నారా అని విచారించి చూచిరి. మిస్పా నగరమున యావే సన్నిధికి రానివారిని ప్రాణములతో బ్రతుకనీయరాదని ముందే బాసచేసికొనిరి.

6.  యిస్రాయేలీయులు బెన్యామీనీయులను తలచుకొని విచారపడిరి. “నేడు యిస్రాయేలున ఒక తెగ అంతరించినది గదా!

7. ఆ తెగలో మిగిలినవారికి పెండ్లి చేయుటయెట్లు? వారికి మన పిల్లలను ఈయరాదని యావే పేరుమీద బాసచేసితిమి గదా!" అని అనుకొనిరి.

8. మిస్పానగరమున యావేసన్నిధికి రానివారు ఎవరా అని విచారించిచూడగా యాబేషు గిలాదు నుండి ఎవ్వరు రాలేదని తెలియవచ్చెను.

9. వచ్చిన వారినందరను జాగ్రత్తగా లెక్కించిచూచిరిగాని యాబేషు గిలాదు పౌరులు ఎవ్వరును అట కనిపింపలేదు.

10-11. కనుక యిస్రాయేలీయులు పండ్రెండువేలమంది పరాక్రమశాలులను ఎన్నుకొని “పోయి యాబేషు గిలాదు నివాసులను స్త్రీలనక, శిశువులనక అందరిని చంపివేయుడు. ప్రతి పురుషుని, మగనితో కాపురము చేయు ప్రతి స్త్రీని శాపముపాలు చేయుడు. మగపోడిమి ఎరుగని కన్నెలను మాత్రము వదలివేయుడు” అని ఆజ్ఞాపించిరి. వారు అటులనే చేసిరి.

12. ఆ నగరమున మగపోడిమి ఎరుగని ఎలప్రాయపు కన్నెలు నాలుగువందల మంది కలరు. వారినందరిని షిలో నగరమున గుమిగూడిన యిస్రాయేలు సమాజము నొద్దకు కొనివచ్చిరి. ఈ షిలో నగరము కనాను మండలమున గలదు.

13. అంతట ఆ సమాజము రిమ్మోనుతిప్ప యందు వసించు బెన్యామీనీయులకు శాంతి వార్తలను ఎరిగించుటకై దూతలనంపెను.

14. బెన్యామీనీయులు తిప్పనుండి తిరిగివచ్చిరి. యాబేషుగిలాదు నుండి కొనివచ్చిన కన్నెలను వారికి అర్పించిరి. కాని బెన్యామీనీయుల కందరికి వధువులు సరిపోలేదు.

15. యిస్రాయేలీయులు బెన్యామీనీయులను తలంచుకొని విచారపడిరి. యావే ఒక తెగవారిని నాశనము చేసెనుగదా!

16. యిప్రాయేలు సమాజపు పెద్దలందరు ప్రోగై “బెన్యామీను స్త్రీలందరును చనిపోయిరి. ఇక ఆ తెగలో మిగిలియున్న మగవారికి పెండ్లి అగుట ఎట్లు?

17. బెన్యామీనీయులకు సంతానము కలిగించుటెట్లు? యిస్రాయేలున ఏ తెగయును అణగారిపోరాదుగదా!

18. మన పిల్లలనా వారికి ఈయరాదు. మరి ఏమి చేయుదము?” అని వితర్కించుకొనిరి. అంతకుముందే వారు “బెన్యామీనీయులకు పిల్లలనిచ్చినవారు శాపమువలన మగ్గిపోవుదురు గాక!” అని బాసచేసికొనియుండిరి.

19. యిస్రాయేలీయులు తమలో తాము మథనపడి “ఏటేట షిలోనగరమున యావే ఉత్సవము జరుగునుగదా!” అనుకొనిరి. (ఈ నగరము బేతేలు నకు ఉత్తరమున, బేతేలు నుండి షెకెమునకు పోవు రాచబాటకు తూర్పున, లెబోనాకు దక్షిణమున గలదు.)

20. కనుక వారు బెన్యామీనీయులతో “మీరు షిలో చెంతగల ద్రాక్షతోటలలో పొంచి, కనిపెట్టియుండుడు.

21. షిలో కుమార్తెలు నాట్యబృందముతో కలసి నాట్యము చేయవత్తురు. అపుడు మీరు ద్రాక్షతోటల నుండి వెలువడి పెండ్లియాడుటకు ఒక్కొక్కరు ఒక్కొక్క యువతిని భార్యగా పట్టుకొని మీ మండలమునకు పారిపొండు.

22. వారి తండ్రులు, సోదరులు వచ్చి తగవు పెట్టుకొందురేని “మీరు వారిని క్షమింపవలయును. యుద్ధమున యోధులు స్త్రీలను చేకొనినట్లే ఈ బెన్యామీనీయులు ఒక్కొక్కరు ఒక్కొక్క యువతిని భార్యగా గైకొనిరి. అంతేకదా! మీ అంతట మీరే వారికి యువతులను ఇచ్చియుందురేని శపథము మీరి పాపము కట్టుకొనియుందురు అని వారిని ఒప్పింతము” అనిచెప్పిరి.

23. అయితే బెన్యామీనీయులు ఆ ఉపదేశమును పాటించిరి. నాట్యమాడ వచ్చిన స్త్రీల నుండి తమకు కావలసినంతమందిని భార్యలుగా తీసుకొని పారిపోయిరి. వారు తమ దేశములకు వెడలిపోయి తమ నగరములను తిరిగి నిర్మించుకొని వానిలో కాపురముండిరి.

24. ఆ పిమ్మట యిస్రాయేలీయులలో ప్రతి ఒక్కడు అక్కడనుండి తమ తమ తెగల స్థానములకును, కుటుంబములకును పోయిరి. అందరును వారి వారి స్వాస్థ్యములకు చేరుకొనిరి.

25. ఆ రోజులలో యిస్రాయేలీయులకు రాజు లేడు. కనుక ఎవరి ఇష్టము వచ్చినట్లుగా వారు ప్రవర్తించిరి.