ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము

 1. యిస్రాయేలీయులు ఐగుప్తు వీడివచ్చిన రెండవ యేట రెండవనెల మొదటిరోజున సీనాయి ఎడారిసీమ యందు దేవుడైన యావే సాన్నిధ్యపు గుడారమున మోషేతో మాట్లాడుచు ఇట్లనెను.

2. “యిస్రాయేలు సమాజముయొక్క జనసంఖ్య వ్రాయింపుము. తెగల వారిగా, వంశములవారిగా మగవారినందరిని గణింపుము.

3. నీవు అహరోను కలిసి ఇరువది యేండ్లు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారినందరిని లెక్కింపుడు.

4. కనుక ప్రతి తెగనుండి కుటుంబపు పెద్దనొకనిని ఎన్నుకొనుము.

5-15. అటుల ఎన్నుకొనవలసిన వారి పేర్లివి. రూబేను తెగనుండి షెదేయూరు కుమారుడు ఎలీసూరు; షిమ్యోను తెగనుండి సూరీషద్దయి కుమారుడు షెలుమీయేలు; యూదా తెగనుండి అమ్మినాదాబు కుమారుడు నహషోను; యిస్సాఖారు తెగనుండి సూవారు కుమారుడు నెతనేలు; సెబూలూను తెగనుండి హెలోను కుమారుడు ఎలీయాబు; యోసేపు కుమారులగు ఎఫ్రాయీము తెగనుండి అమ్మీహూదు కుమారుడు ఎలీషామా; మనష్షే తెగనుండి పెదాహ్సురు కుమారుడు గమలీయేలు; బెన్యామీను తెగనుండి గిద్యోని కుమారుడు అబీదాను; దాను తెగనుండి అమ్మీషద్దయి కుమారుడు అహియెజెరు; ఆషేరు తెగనుండి ఓక్రాను కుమారుడు ఫగియేలు; గాదు తెగనుండి రవూయేలు కుమారుడు ఎలియాసాపు; నఫ్తాలి తెగనుండి ఏనాను కుమారుడు అహీరా.”

16. వీరందరును యిస్రాయేలు సమాజమున పేరుమోసిన పెద్దలు. యిస్రాయేలు వంశములకు అధిపతులు, యిస్రాయేలు సైన్యములకు నాయకులు.

17-18. మోషే అహరోనులు పైన పేర్కొనిన పెద్దలను పిలిపించి, రెండవనెల మొదటిరోజున యిస్రాయేలు సమాజమును సమావేశపరచిరి. ప్రజలందరిని వంశములవారిగా, కుటుంబముల వారిగా గణించిరి. ఇరువదియేండ్లు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారి పేర్లన్నియు నమోదుచేసిరి.

19. దేవుడైన యావే ఆజ్ఞాపించినట్లే మోషే సీనాయి ఎడారియందు జన సంఖ్యను నిర్ణయించెను.

20-43. యాకోబు పెద్ద కుమారుడు రూబేను తెగతో ప్రారంభించి యిరువది యేండ్లకు మరియు అంతకు పైబడి యుద్ధమున పాల్గొనుటకు సమర్థులైన మగవారి పేర్లన్నియు, వంశములవారిగా, తెగల వారిగా నమోదు చేయబడెను. అటుల నమోదు చేయబడినవారి సంఖ్య: రూబేను తెగ నుండి 46,500; షిమ్యోను తెగనుండి 59,300; గాదు తెగనుండి 45,650; యూదా తెగనుండి 74,600;  ఇస్సాఖారు తెగనుండి 54,400; సెబూలూను తెగనుండి 57,400; -ఎఫ్రాయీము తెగనుండి 40,500; మనష్షే తెగనుండి 32,200; బెన్యామీను తెగనుండి 35,400; దాను తెగనుండి 62,700; ఆషేరు తెగనుండి 41,500; నఫ్తాలి తెగనుండి 53,400;

 1. దేవుడైన యావే మోషే, అహరోనులతో ఇట్లు చెప్పెను: 

2. “యిస్రాయేలీయులలో ప్రతిపురుషుడు తమతమ పితరుల కుటుంబముల జెండాలక్రింద, తమతమ తెగల ధ్వజము క్రింద గుడారములు పాతుకోవలెను. సాక్ష్యపుగుడారము చుట్టు నియమిత దూరమున తమ గుడారములను పాతుకోవలెను.

3. తూర్పుదిక్కున యూదా శిబిరపు ధ్వజమునకు చెందినవారు తమతమ జెండాలతో తమ నాయకు లతో గుడారములను పాతుకోవలెను. యూదా తెగ నాయకుడు అమ్మినాదాబు పుత్రుడు నహషోను.

4. అతని పరివారము మొత్తముసంఖ్య-74,600.

5. అతనికి ప్రక్కన యిస్సాఖారు తెగవారుండవలెను. సూవారు పుత్రుడు నెతనేలు వారికి నాయకుడు.

6. అతని పరివారము మొత్తముసంఖ్య-54,400.

7. అతనికి ప్రక్కన సెబూలూను తెగవారు ఉండవలెను. హెలోను పుత్రుడు ఎలీయాబు వారికి నాయకుడు.

8. అతని పరివారము మొత్తముసంఖ్య-57,400.

9. యూదా శిబిరపు మొత్తము జనసంఖ్య 186,400. శిబిరము కదలునపుడు వీరు మొదట కదలవలెను,

10. దక్షిణమున రూబేను శిబిరపు ధ్వజమునకు చెందినవారు తమతమ జెండాలతో తమనాయకులతో గుడారములను పాతుకోవలెను. రూబేను తెగ నాయకుడు షెదేయూరు పుత్రుడు ఎలీసూరు.

11. అతని పరివారము మొత్తముసంఖ్య-46,500.

12. అతనికి ప్రక్కన షిమ్యోనుతెగ వారుండవలెను. సూరీషద్దయి పుత్రుడు షోలుమీయేలు వారి నాయకుడు.

13. అతని పరివారము మొత్తముసంఖ్య - 59,300.

14. అతనికి ప్రక్కన గాదుతెగ వారుండవలెను. రవూయేలు పుత్రుడు ఎలియాసపు వారి నాయకుడు.

15. అతని పరివారము మొత్తముసంఖ్య - 45,650.

16. రూబేను శిబిరపు మొత్తము జనసంఖ్య 151,450. శిబిరము కదలునపుడు వీరు రెండవ స్థానమువారుగా బయలుదేరవలెను.

17. వీరి తరువాత సాన్నిధ్యపుగుడారముతో లేవీయులు కదలవలెను. ఈ తెగల వారందరు గుడారములు పన్నుకొనినప్పటి క్రమమునే ప్రయాణము చేయునపుడును పాటింపవలెను. వారు తమ తమ ధ్వజములను పూని నడువవలెను.

18. పడమటి దిక్కున ఎఫ్రాయీము శిబిరపు ధ్వజమునకు చెందినవారు తమతమ జెండాలతో తమ నాయకులతో గుడారములను పాతుకోవలెను. ఎఫ్రాయీము తెగ నాయకుడు అమ్మీహూదు కుమారుడు ఎలీషామా.

19. అతని పరివారము మొత్తము సంఖ్య - 40,500.

20. అతనికి ప్రక్కన మనష్షే తెగ వారుండవలెను. పెదాహ్సూరు కుమారుడు గమలీయేలు వారికి నాయకుడు.

21. అతని పరివారము మొత్తముసంఖ్య-32,200.

22. అతనికి ప్రక్కన బెన్యామీను తెగవారు ఉండవలెను. గిద్యోని కుమారుడు అబీదాను వారికి నాయకుడు.

23. అతని పరివారము మొత్తముసంఖ్య-35,400.

24. ఎఫ్రాయీము శిబిరములో మొత్తము జనసంఖ్య 108,100. వారు మూడవస్థానము వారుగా పయ నింపవలెను.

25. ఉత్తరమున దాను శిబిరపు ధ్వజమునకు చెందినవారు తమతమ జెండాలతో తమ నాయకులతో గుడారములను పాతుకోవలెను. దానుతెగ నాయకుడు అమ్మీషద్దయి కుమారుడు అహియెజెరు.

26. అతని పరివారము మొత్తమునంఖ్య - 62,700.

27. అతనికి ప్రక్కన ఆషేరు తెగ వారుండవలెను. ఓక్రాను కుమారుడు ఫగియేలు వారికి నాయకుడు.

28. అతని పరివారము మొత్తముసంఖ్య - 41,500.

29. అతనికి ప్రక్కన నఫ్తాలి తెగవారు ఉండవలెను. ఏనాను కుమారుడు అకీరా వారికి నాయకుడు.

30. అతని పరివారము మొత్తముసంఖ్య - 53,400.

31. దాను శిబిరములో మొత్తము జనసంఖ్య 157,600. దాను శిబిరము వారు చివరన నడువవలెను.

32. ఈరీతిగా తెగలవారిగా, వంశములవారిగా యిస్రాయేలీయుల జనసంఖ్య నిర్ణయింపగా మొత్తము జనులు 603,550 మంది తేలిరి.

33. కాని దేవుడైన యావే మోషేను ఆజ్ఞాపించినట్లు లేవీయులను మిగిలిన యిస్రాయేలీయులతో పాటు లెక్కింపలేదు.

34. యిస్రాయేలీయులు దేవుడైన యావే మోషేను ఆజ్ఞాపించినట్లే చేసిరి. శిబిరముల వారిగా తమతమ ధ్వజములక్రింద గుడారములు పాతుకొనిరి. తెగలవారిగా వంశముల వారిగా శిబిరముల నుండి కదలిరి.

 1. సీనాయి కొండమీద దేవుడైన యావే మోషేతో మాట్లాడినపుడు మోషే, అహరోను కుటుంబములకు చెందినవారు వీరు:

2. అహరోనునకు నలుగురు కుమారులు. మొదట పుట్టినవాడగు నాదాబు, మిగిలినవారు అబీహు, ఎలియెజెరు, ఈతామారు.

3. వీరందరును యాజకులుగా అభిషిక్తులైరి.

4. సీనాయి ఎడారిలో ప్రభువునకు నియమ విరుద్ధముగా అగ్నిని సమర్పించినందులకు నాదాబు, అబీహులు ప్రాణములు కోల్పోయిరి. వారికి సంతానములేదు కనుక అహరోను పర్యవేక్షణలో ఎలియెజెరు, ఈతామారు యాజకులుగా పనిచేసిరి.

5. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను.

6. “లేవీ తెగవారిని పిలుచుకొని వచ్చి అహరోనునకు సేవకులనుగా నియమింపుము.

7. సాన్నిధ్యపుగుడారము విషయమున అహరోనునకును యిస్రాయేలు సమాజ మునకును విధింపబడిన బాధ్యతలను వారు నెరవేర్ప వలెను.

8. సాన్నిధ్యపుగుడారము పరికరములను కాపాడుచు యిస్రాయేలు జనుల బాధ్యతలను వారు నెరవేర్చుచుందురు.

9. లేవీయులు అహరోనునకు అతని కుమారులకు అంకితము కావలెను.

10. అహరోనును, అతని కుమారులను యాజకధర్మము నిర్వర్తించుటకు నియమింపుము. ఇతరులు ఎవరైన గుడారము చెంతకు వచ్చిన యెడల ప్రాణములు కోల్పోవుదురు.

11. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను:

12. “యిస్రాయేలీయుల తొలిచూలు కుమారులకు మారుగా నేను లేవీయులను గైకొంటిని. కనుక వారు నావారు.

13. ఐగుప్తున తొలిచూలు పిల్లలను చంపి నపుడు యిస్రాయేలీయు తొలిచూలు పిల్లలను, వారి పశువుల తొలిచూలు పిల్లలను నా కొరకై నివేదించు కొంటిని. వారు నా వారైయుందురు, నేను ప్రభుడను”.

14-15. సీనాయి అరణ్యమున దేవుడైన యావే మోషేతో “నెలకు పైబడిన లేవీయుల మగవారి నందరిని కుటుంబములవారిగా వంశములవారిగా గణింపుము" అని చెప్పెను.

16. ప్రభువు ఆజ్ఞ ప్రకారమే మోషే వారిని లెక్కించెను.

17-20. లేవీకి గెరోను, కోహాతు, మెరారి అని ముగ్గురు కుమారులు. గెర్షోనుకు లిబ్ని, షిమేయి అని ఇద్దరు కుమారులు. కోహాతునకు అమ్రాము, ఈష్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అని నలుగురు కుమారులు. మెరారికి మాహ్లీ , మూషీ అని ఇద్దరు కుమారులు. ఈ పేరులతో పిలుచు కుటుంబములకు వారే వంశకర్తలు.

21-22. గెర్షోను నుండి లిబ్నీయులు, షీమీయులు కలిగిరి. నెలకు పైబడిన మగవారినందరిని లెక్క వేయగా వారి సంఖ్య మొత్తము 7,500 ఆయెను.

23. గెర్షోనీయులు గుడారము వెనుక పడమటివైపున శిబిరమును పన్నుకొనిరి.

24. లాయేలు కుమారుడు ఎలియాసాపు గెర్షోనీయులకు నాయకుడు.

25. వారు గుడారమును, దానిని కప్పువస్త్రములను, దాని ద్వారపు తెరను,

26. గుడారమునకు, పీఠమునకు చుట్టునున్న ఆవరణమున వ్రేలాడుతెరలను, ఆవరణ ప్రవేశమున నున్న తెర ఇవి అన్నియు వారే చూచుకొను బాధ్యతను కలిగియుండిరి.

27. కోహాతు నుండి ఆమ్రమీయులు, ఈష్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు జన్మించిరి. వీరందరు కోహాతీయ వంశములు.

28. నెలకు పైబడిన మగవారినందరిని లెక్కింపగా వారిసంఖ్య 8,300 ఆయెను. వారు పరిశుద్ధస్థలమును చూచుకొనుచుండిరి.

29. వారు గుడారము ప్రక్కన దక్షిణమున శిబిరము ఏర్పరచుకొనిరి.

30. ఉజ్జీయేలు కుమారుడగు ఎలిసాఫాను కోహతీయులకు నాయకుడు.

31. వారు మందసము, బల్ల, దీపస్తంభము, పీఠములు, తాము పరిచర్యచేయు పవిత్రస్థలములోని ఉపకరణములు, గర్భగృహము ఎదుట వ్రేలాడు అడ్డుతెర, వీటినన్నింటిని చూచుకొను విధి వారిది.

32. అహరోను కుమారుడగు ఎలియెజెరు, లేవీయ నాయకులకు అధిపతి. అతడు పరిశుద్ధ స్థలమున ఊడిగముచేయు వారికందరికి పెద్ద.

33. మెరారి నుండి మాహ్లియులు మూషీయులు జన్మించిరి.

34. వీరిలో నెలకు పైబడిన మగవారి నందరిని లెక్కింపగా వారి సంఖ్య 6,200 ఆయెను.

35. అబీహాయిలు కుమారుడగు సూరియేలు మెరారి వంశములకు నాయకుడు. వారు గుడారముప్రక్కన ఉత్తరముగా శిబిరము పన్నుకొనిరి.

36. మెరారీయులు గుడారపు సామాగ్రిని చూచుకొను బాధ్యత కలిగియుండిరి. మందిరచట్రములు, వాని అడ్డకఱ్ఱలు, వానిదిమ్మెలు, స్తంభములు వాని దిమ్మెలు, కట్టడమున వాడబడిన పరికరములు వారి ఆధీనమున నుండెను.

37. ఆవరణము చుట్టునున్న స్తంభములు, వాటి దిమ్మెలును, మేకులును, త్రాళ్ళు వారి అధీనముననే ఉండెడివి.

38. మోషే, అహరోను, అతని కుమారులు గుడారము ఎదుట తూర్పువైపున శిబిరము పన్నుకొనిరి. వారు యిస్రాయేలు తరపున పరిశుద్ధస్థలమున జరుగు అర్చనలకు బాధ్యులు. మిగిలిన వారు ఎవరైనను ఆ పనికి పూనుకొనినయెడల మరణము పాలగుదురు.

39. మోషే లేవీయులలో నెలకు పైబడిన మగవారినందరిని వంశములవారిగా లెక్కింపగా మొత్తము 22,000 మంది తేలిరి.

40. దేవుడైన యావే మోషేతో “యిస్రాయేలీయులలో నెలకు పైబడిన తొలిచూలు మగబిడ్డలందరినీ లెక్కవేయుము.

41. యిస్రాయేలీయుల తొలిచూలు కుమారులకు మారుగా లేవీయులను నాకు సమర్పింపుము. యిస్రాయేలీయుల గొడ్లమందలు ఈనిన తొలిచూలు పిల్లలకు మారుగా లేవీయుల గొడ్లను నాకు సమర్పింపుము. నేను దేవుడైన యావేను” అనెను.

42. ప్రభువు కోరినట్లే మోషే యిస్రాయేలీయుల తొలి చూలు పిల్లలనందరిని లెక్కవేసెను.

43. నెలకు పై బడిన తొలిచూలు మగబిడ్డలను లెక్కింపగా 22,273 మంది తేలిరి.

44-45. దేవుడైన యావే మోషేతో “యిస్రాయేలీయుల తొలిచూలు పిల్లలకు మారుగా లేవీయులను, యిస్రాయేలీయుల పశువులకు మారుగా లేవీయుల పశువులను నాకు సమర్పింపుము. లేవీయులు యావేనైన నా ప్రజలు.

46. యిస్రాయేలు తొలిచూలు బిడ్డలు లేవీయులకంటె 273 మంది ఎక్కువ కలరు. వారిని నాకు సమర్పించిన పిమ్మట వారు విమోచింపబడునట్లు మీరు వారిని తిరిగి కొనితెచ్చుకోవలెను.

47. ఒక్కొక్క బిడ్డకు సామాన్య తులామానము చొప్పున ఐదువెండినాణెములు చెల్లింప వలెను.

48. ఆ విమోచనధనమును అహరోనునకు అతని కుమారులకు చెల్లింపవలెను” అని చెప్పెను.

49. ప్రభువు చెప్పినట్లే మోషే లెక్కకు మిగిలిన యిస్రాయేలు తొలిచూలు కుమారులనుండి విమోచన సొమ్ము గైకొనెను.

50. ఆ రీతిగా అతడు 1,365 వెండినాణెములు గైకొనెను.. 

51. ప్రభువు ఆజ్ఞాపించి నట్లే. అతడు ఆ విమోచనసొమ్మును అహరోనునకు అతని కుమారులకు చెల్లించెను.

 1-2. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను. “కుటుంబముల వారిగా, వంశముల వారిగా లేవీయులలో కోహతీయుల జనసంఖ్య నిర్ణయింపుము. 

3. ముప్పది నుండి యేబదియేండ్లకు మధ్య వయస్సు ఉండి సాన్నిధ్యపుగుడారమున పరిచర్యచేయుటకు యోగ్యులైన మగవారి పేర్లను వ్రాయింపుము.

4. కోహతీయులు సాన్నిధ్యపుగుడారమును, మహాపవిత్ర వస్తువులను చూచుకొను బాధ్యతలివి.

5. శిబిరము కదలవలసి వచ్చినపుడు అహరోను కుమారులు మందసము ముందు వ్రేలాడుతెరను దించి, దానితో మందసమును కప్పవలెను.

6. దాని మీద గట్టితోలుపట్టను కప్పి మీద ఊదావర్ణ వస్త్రము కప్పవలెను. అటుపిమ్మట మందసము కడియములలో మోతకఱ్ఱలను దూర్చవలెను,

7. దేవునికి రొట్టెలను అర్పించు బల్లమీద ఊదావస్త్రము కప్పి దానిమీద పాత్రలు, సాంబ్రాణి, గిన్నెలు, సమర్పణ పాత్రలు, ద్రాక్షాసారాయపు కూజాలు ఉంచవలెను. నిత్యార్పణముగా సమర్పించు రొట్టెలను గూడ దాని మీదనే ఉంచవలెను.

8. వీనిమీద ఎల్లని వస్త్రము కప్పి, పైన గట్టి తోలుపట్టను కప్పి, తరువాత బల్ల కడియములలో మోతకఱ్ఱలు దూర్చవలెను.."

9. ఊదావస్త్రముతో దీపస్తంభమును దాని దీపములను, వత్తులను, పళ్ళెరములను, తైల పాత్రములను కప్పివేయవలెను.

10. దీపస్తంభమును దాని పరికరములన్నిటిని గట్టి తోలుపట్టీతో కప్పివేసి మోత పలకల మీద ఉంచవలెను.

11. బంగారుపీఠము మీద ఊదావస్త్రము కప్పి దానిమీద గట్టి తోలుపట్టను కప్పవలెను. తరువాత దానికి మోతకఱ్ఱలు దూర్పవలెను.

12. పరిశుద్ధ స్థలమున వాడు ఇతర పరికరములను అన్నిటిని ప్రోగుచేసి ఊదావస్త్రముతో కప్పి :గట్టి తోలుపట్టను మీద పరచి మోతపలక మీద ఉంచవలెను.

13. బలిపీఠము మీదినుండి బూడిదను తొలగించి ఎఱ్ఱనివస్త్రము కప్పవలెను.

14. దానిమీద పరిచర్యోపకరణములు అనగా నిప్పు పళ్ళెరములు, చీలుగరిటెలు, నెత్తురుచల్లు పళ్లెరములు, పాత్రలు ఉంచవలెను. వానిమీద గట్టి తోలుపట్టను కప్పవలెను. అటు పిమ్మట దానికి మోతకఱ్ఱలు దూర్పవలెను.

15. శిబిరము కదులునపుడు అహరోను, అతని కుమారులు వచ్చి పరిశుద్ధస్థలములోని పరిశుద్ధ వస్తువులను, వాని ఉపకరణములను కప్పివేసిన పిదప గాని, కోహతీయులు వానిని మోసికొని వెళ్ళకూడదు. కోహతీయులు పరిశుద్ధవస్తువులను చేతితో ముట్టరాదు. ముట్టినచో చత్తురు. గుడారము కదలునపుడెల్ల కోహతీయులు చేయవలసిన పనులు ఇవియే.

16. అహరోను కుమారుడు. ఎలియెజెరు గుడారమునంతటిని చూచుకోవలెను. దీపములనూనె, సాంబ్రాణి, సమర్పణపురొట్టెలు, అభిషేకతైలము, గుడారము, పరిశుద్ధవస్తువులు, వాని ఉపకరణములు, వీని అన్నిటి బాధ్యతను అతడే వహించును.” అంది

17. దేవుడైన యావే మోషే అహరోనులతో ఇట్లు చెప్పెను.

18. “కోహతీయుల వంశకుటుంబములను లేవీ తెగనుండి అంతరించిపోకుండ తగు జాగ్రత్తలు తీసుకొనుము. పరిశుద్ధవస్తువుల దగ్గరకు వచ్చి కోహతీయులు ప్రాణములు కోల్పోకుందురుగాక.

19. వారు మహాపవిత్రమైన వాటిని సమీపించి ప్రాణములు కోల్పోక బ్రతికియుండునట్లు మీరు వారికిట్లు చేయుడు: అహరోనును అతని కుమారులును లోనికి వచ్చి వారిలో ఒక్కొక్కడు ఏమి చేయవలయునో, ఏమి మోసుకొని రావలయునో నియమింపవలెను.

20. కాని కోహాతీయులు గుడారములోనికి పోయి యాజకులు పరిశుద్ధ వస్తువులను ప్రయాణమునకు సిద్ధము చేయుచుండగా చూచినయెడల తప్పకచత్తురు.”

21. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను:

22. “కుటుంబములవారిగా - వంశములవారిగా గెర్షోనీయులను లెక్క వేయుము.

23. ముప్పది నుండి ఏబది యేండ్లకు మధ్య వయస్సు ఉండి గుడారమున పరిచర్యచేయుటకు యోగ్యులైన మగవారి పేర్లను వ్రాయింపుము.

24. వారి బాధ్యతలు, వారు మోసి కొనిపోవలసిన వస్తువులు ఇవి:

25-26. సాన్నిధ్యపు గుడారమును కప్పు లోపలితెరలను, వెలుపలికప్పు తెరలను, దానిమీద గట్టితోలు కప్పడమును, దాని ప్రవేశస్థలమున వ్రేలాడుతెరను, ఆవరణము తెరలను, వాని త్రాళ్ళను, ఆవరణ ప్రవేశస్థలమున వ్రేలాడు తెరలను, ఈ పరికరములను అమర్చుటకు వలసిన వస్తువులను వారు మోసికొనిరావలెను.

27. అహరోను అతని కుమారుల మాట ప్రకారము గెర్షోనీయులకు విధించిన బాధ్యతలు నిర్వర్తింపబడవలెను. అన్నిటిని వారు సక్రమముగా నిర్వర్తించునట్లు వారిని ఆజ్ఞాపింపవలెను. 

28.సాన్నిధ్యపు గుడారమున గెర్షోనీయుల బాధ్యతలివి. యాజకుడైన అహరోనుని కుమారుడు ఈతామారు వారిచే పనిచేయించును.”

29. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను: “మెరారీయులను వంశముల వారిగా, కుటుంబముల వారిగా లెక్కింపుము.

30. ముప్పది నుండి ఏబదియేండ్ల మధ్య వయస్సు ఉండి గుడారమున పరిచర్య చేయుటకు యోగ్యులైన మగవారినందరిని లెక్క వేయుము.

31-32. మెరారీయుల బాధ్యతలు, వారు మోయవలసిన వస్తువులు ఇవి: మందిరపు చట్రములు, దాని అడ్డకఱ్ఱలు, స్తంభములు, పునాదిదిమ్మెలు, ఆవరణ స్తంభములు, వాటి పునాదిదిమ్మెలు, మేకులు, త్రాళ్ళు, వాని ఉపకరణములన్నిటిని వారు మోసికొని రావలెను.

33. సాన్నిధ్యపుగుడారమున మెరారీయుల బాధ్యతలివి. యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు వారిచేత పనులు చేయించుచుండును.”

34-48. మోషే అహరోను సమాజపు పెద్దలు, కోహాతు, గెర్షోను, మెరారి అను మూడు లేవీయ వంశముల, జనసంఖ్యను నిర్ణయించిరి. ముప్పది నుండి ఏబదియేండ్లకు మధ్య వయస్సు ఉండి, సాన్నిధ్యపు గుడారమున పరిచర్యచేయుటకు యోగ్యులైన మగవారినందరిని వంశములవారిగా కుటుంబముల వారిగా లెక్కించిరి. కోహాతు వంశము - 2,750; గెర్షోను వంశము - 2,630; మెరారి వంశము - 3,200; మొత్తము . జనసంఖ్య - 8,580.

 1-2. దేవుడైన యావే మోషేతో "కుష్ఠరోగులను, స్రావము కారువారిని, శవమును తాకిన వారిని శిబిరమునుండి వెలివేయవలెనని యిస్రాయేలీయులతో చెప్పుము.

3. పురుషులనక, స్త్రీలనక యెవరినైనను శిబిరమునుండి వెలివేయవలసినదే. నేను వసించు శిబిరమును వారు అపవిత్రము చేయరాదు” అని చెప్పెను.

4. కనుక ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే యిస్రాయేలీయులు శరీరశుద్దిలేని వారిని అందరిని శిబిరమునుండి వెలివేసిరి.

5. దేవుడైన యావే మోషేతో ఇట్లనెను. “యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము.

6. స్త్రీ పురుషులలో ఎవరైనను దేవుని ఆజ్ఞమీరి ఇతరుల సొత్తును అపహరించిన అపరాధియగుదురు.

7. వారు తమ పాపమును ఒప్పుకొని తమ అపరాధము వలని నష్టమును సరిగానిచ్చుకొని, దానికి అదనముగా ఐదవవంతు కలిపి ఎవరికి విరోధముగా అపరాధము చేసిరో వారికే నష్టపరిహారము ఈయవలెను.

8. సొత్తు కోల్పోయినవాడు చనిపోయినను, అతనికి బంధువులు ఎవరును లేకున్నను ప్రభువునకు నష్టపరిహారము ఈయవలెను. ఆ సొమ్ము యాజకునకు చేరును. కాని ఈ నష్టపరిహారము వేరు. అపరాధి పాపమునకు ప్రాయశ్చిత్తముగా సమర్పించుకొను పొట్టేలు వేరు.

9. పైగా, ప్రభువునకు సమర్పింపుమని యిస్రాయేలీయులు యాజకునికి ఇచ్చిన కానుకలుకూడ అతనికే చెందును.

10. యాజకులు దేవునికి అర్పించిన కానుకలు వారికే దక్కును” అని చెప్పెను.

11-12. దేవుడైన యావే మోషేతో, “యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము.

13. భార్య తన భర్తకు ద్రోహము చేసినది అనుకొందము.

14. ఆమె భర్తకు తెలియకుండ అన్యపురుషుని కూడి తనతప్పిదమును రహస్యముగ ఉంచినదనుకొందము. ఆమె మీద నేరముమోపు సాక్షులు లేరు, ఆమె పాపక్రియలో చిక్కను లేదు. కాని భర్త ఆమె భ్రష్టురాలైనదని అనుమానపడును. లేదా ఒక్కొక్కమారు భార్య ఏ పాపము ఎరుగకున్నను భర్త ఆమెను శంకింపవచ్చును.

15. ఇట్టి పరిస్థితులలో భర్త తన భార్యను యాజకుని యొద్దకు కొనిపోవలెను. రెండు మానికల యవ ధాన్యపు పిండిని దేవునికి అర్పింపవలెను. కాని అతడు దానిమీద నూనె పోయరాదు. ధూపము వేయరాదు. ఆ పిండి అనుమానము తీర్చుకొనుటకును, సత్యమును తెలిసికొనుటకును సమర్పింపబడిన కానుక.

16. యాజకుడు ఆ స్త్రీని ప్రభువు ఎదుట నిలుపవలెను.

17. అతడు మట్టిముంతలో పరిశుద్ధ నీరుపోసి, ఆ నీటిలో మందసపు గుడారమునుండి కొనివచ్చిన మట్టిని కలుపును.

18. ఆ స్త్రీ తల వెంట్రుకలను విప్పించి యవధాన్యపు పిండిని ఆమె చేతులలో ఉంచును. శాపమును తెచ్చిపెట్టునీటితో నిండియున్న పై మట్టిముంతను యాజకుడు తన చేతులలోనే ఉంచుకొనును.

19. అంతట యాజకుడు ఆ స్త్రీచే ప్రమాణము చేయింపవలెను. 'నీవు మరియొక పురుషుని కూడి భ్రష్టురాలవైతివి అన్నమాట నిజముకాని యెడల దేవుని శాపమును తెచ్చిపెట్టు ఈ చేదు నీరు నీకు ఏ ప్రమాదమును కలిగింపకుండునుగాక! .

20-22. కాని నీవు అన్య పురుషుని కూడి భ్రష్టురాలివైతివన్న మాట నిజమయినచో మీ జనులు అందరును చూచుచుండగనే ప్రభువు నిన్ను శాపము పాలు చేయునుగాక. నీ జననేంద్రియము ముడుచు కొనిపోవునుగాక! నీ కడుపు ఉబ్బునుగాక. ఈ శాపజలము నీ కడుపులోచేరి నీ పొట్టఉబ్బునట్లును నీ జననేంద్రియము ముడుచుకొని పోవునట్లు చేయును గాక!' అని ప్రమాణము చేయింపవలెను. ఆ మాటలకు ఆమె 'అట్లే జరుగునుగాక!' అని బదులీయవలెను.

23. అంతట యాజకుడు ఈ శాపమును పలకపై వ్రాయించి ఆ వ్రాతను పై చేదునీటిలో కడిగి వేయవలెను.

24. శాపము కలిగించు చేదునీటిని ఆమెచే త్రాగింపవలెను. ఆ నీళ్ళు ఆమె ఉదరమున ప్రవేశించి ఆమెకు బాధ కలిగించును.

25. యాజకుడు ఆ స్త్రీచే చేదునీళ్ళు త్రాగింపక ముందు ఆమె చేతులలోని పిండిని తీసికొని ప్రభువు సాన్నిధ్యమున ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠముపై ఉంచవలెను.

26. దానిలో గుప్పెడు పిండిని తీసికొని ప్రభువునకు సమర్పించి బలిపీఠముపై కాల్చివేయవలెను.

27. ఆ తరువాత ఆమెచే ఆ చేదు నీళ్ళను త్రాగింపవలెను. ఆమె మగనిని వంచించి భ్రష్టురాలైన మాట నిజమైనచో ఆ నీళ్ళు ఉదరమున ప్రవేశించి ఆమెకు బాధకలిగించును. ఆమె కడుపు ఉబ్బును. జననేంద్రియము ముడుచుకొని పోవును. ఎల్లరి యెదుట ఆమె శాపముపాలగును.

28. కాని ఆ స్త్రీ నిర్దోషియు పరిశుద్ధురాలును అయినచో త్రాగిన ఆమెను బాధింపవు. ఆమె అందరు స్త్రీల వలెనే పిల్లలను కనును.

29-30. భార్య అన్యపురుషుని కూడి భ్రష్టురాలైనపుడుగాని లేక భర్త తనభార్య అన్యపురుషుని కూడి భ్రష్టురాలైనదేమోయని శంకించినపుడుకాని అనుసరింపవలసిన ఆచారమిది. ఇట్టి నేరముతో భర్త తన భార్యను ప్రభువు ఎదుటకు కొనివచ్చినపుడు యాజకుడు పాటింపవలసిన నియమము ఇది.

31. భర్తకు ఏ దోషములేదుగాని, భార్య మాత్రము తన దోషమునకు తగిన శిక్షను అనుభవింపవలెను.”

 1-3. దేవుడైన యావే మోషేతో “యిస్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము: నాసీరు వ్రతము' పట్టి తన జీవితమును ప్రభువునకు సమర్పించుకొనగోరిన వారు స్త్రీయైనను, పురుషుడైనను ద్రాక్షసారాయమును, ఘాటైన మద్యమును, ద్రాక్షపండ్లరసమును సేవింప రాదు. ద్రాక్షపండ్లు పచ్చివైనను, ఎండినవైనను భుజింపరాదు.

4. ఆ వ్రతమును పాటించినన్నాళ్ళు ద్రాక్ష సంబంధమైనది ఏదియును, కడకు ఆ పండ్ల విత్తనములను, ఆ పండ్లమీది చర్మమునుకూడ ముట్టుకోరాదు.

5. వ్రతమును పాటించినన్నాళ్ళు క్షురకత్తి అతని తలవెంట్రుకలను తాకరాదు. అతడు ప్రభువునకు సమర్పితుడైనన్నినాళ్ళు నాసీరువ్రతమునకు బద్దుడై యుండును గాన తన తలవెంట్రుకలను స్వేచ్చగా పెరుగనీయవలెను.

6. వ్రతమును పాటించినన్నాళ్ళు శవము దగ్గరకు వెళ్ళకూడదు.

7. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు చనిపోయినను ఆ శవమును తాకరాదు. అతడు ప్రభువునకు తనను తాను సమర్పించుకొనెననుటకు అతని తలవెంట్రుకలే నిదర్శనము.

8. నాసీరు వ్రతమును పాటించినన్నాళ్ళు అతడు ప్రభువునకు చెందినవాడు.

9. నాసీరువ్రతముపట్టిన వాని సమక్షమున ఎవరైన హఠాత్తుగా చనిపోయినచో అతని తలవెంట్రుకలు అపవిత్రమగును. కనుక అతడు ఏడవనాడు తలవెంట్రుకలు తీయించుకోవలెను.

10. ఎనిమిదవనాడు రెండు తెల్లగువ్వలను గాని లేక రెండు పావురపు పిల్లలను గాని నిబంధన గుడారమున యాజకునకు అర్పింపవలెను.

11. యాజకుడు ఆ పక్షులలో ఒకదానిని పాపపరిహారబలిగాను, మరియొకదానిని దహనబలిగాను సమర్పించును. ఆ రీతిగా వ్రతము పట్టినవాడు శవమును తాకుటవలన కలిగిన అపవిత్రతను పోగొట్టి యాజకుడు అతనిని శుద్దుని చేయును. ఆ దినమే అతడు తన తలవెంట్రుకలను మరల ప్రభువునకు సమర్పించుకోవలెను.

12. అతడు నాసీరువ్రతమును పాటింపదలచుకొన్న దినములన్నియు తన్నుతాను మరల ప్రభువునకు సమర్పించుకోవలెను. దోషపరిహారబలిగా ఒక ఏడాది మగ గొఱ్ఱెపిల్లను దేవునికి సమర్పింపవలెను. శాపమువలన అతని తలవెంట్రుకలు అపవిత్రమైనవి కావున ఈ ప్రాయశ్చిత్తమును జరిపించుటకు ముందు తాను నాసీరువ్రతమున గడిపిన దినములు లెక్కకురావు."

13.నాసీరువ్రతము పట్టినవాడు ప్రతాంతమున ఈ క్రింది ఆచారమును పాటింపవలెను. అతడు సాన్నిధ్యపు గుడారమునొద్దకు వచ్చి ప్రభువునకు కానుక సమర్పించుకోవలెను.

14. దహనబలికి ఏడాది మగ గొఱ్ఱెను, పాపపరిహారబలికి ఏడాది ఆడుగొఱ్ఱెను, సమాధానబలికి ఒక పొట్టేలును సమర్పింపవలెను. ఈ జంతువులు నిర్దోషముగా ఉండవలెను.

15-16. మరియు గంపెడు పొంగని రొట్టెలను సమర్పింపవలెను. వానిని నూనెతో కలిపిన పిండితో చేయవలెను. వీనితోపాటు నూనెపూసిన పొంగని చిన్న రొట్టెలను కూడ అర్పింపవలెను. వీనితో పాటు ధాన్యమును, ద్రాక్షసారాయమును కూడ కొనిరావలెను.

17. నాసీరు వ్రతము సలుపువాడు పొట్టేలును వధించి సమాధానబలిని సమర్పింపవలెను. గంపలోని పొంగని రొట్టెలు అర్పింపవలెను. వాటితోపాటు యాజకుడు ధాన్యమును, ద్రాక్షసారాయమును అర్పించును.

18. అంతట వ్రతముపట్టినవాడు ప్రత్యక్ష గుడార ద్వారమునొద్ద, తన తలవెంట్రుకలు తీయించి వానిని సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలయును.

19. యాజకుడు పొట్టేలు యొక్క ఉడకబెట్టిన ముందటి తొడను తీసికొని, బుట్టనుండి పొంగని పెద్దరొట్టెను, చిన్న రొట్టెను తీసికొని వ్రతాచరుని చేతులలో పెట్టును.

20. అటు తరువాత యాజకుడు వానిని ప్రభువునకు అల్లాడింపు అర్పణగా అర్పించును. అవి పవిత్ర వస్తువులు కనుక యాజకునికే చెందును. పైగా పొట్టేలు రొమ్మును, అల్లాడింపబడిన వెనుకటి తొడయు యాజకునికే చెందును. ఇది అంతయు ముగిసిన తరువాత నాసీరు ప్రతాచరుడు మరల ద్రాక్షసారాయమును సేవింపవచ్చును.

21. నాసీరువ్రతాచరుడు పాటింపవలసిన ఆచారమిది. అతడు తలవెంట్రుకలనే కాక మరి దేనినైన ప్రభువునకు సమర్పించెదనని స్వయముగా మ్రొక్కు కొనినచో, ఆ మ్రొక్కును గూడ తీర్చుకోవలెను” అని చెప్పెను.

22-23. దేవుడైనయావే మోషేతో "అహరోను, అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించునపుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలెనని చెప్పుము:

24. 'యావే మిమ్ము దీవించి కాపాడునుగాక!

25. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక!

26. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానమును ఒసగునుగాక!'

27. మీరు యిస్రాయేలు ప్రజలను ఆశీర్వదించునపుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను” అని చెప్పెను.

 1. మోషే గుడారమును పూర్తిచేసి దానిని, దాని సామాగ్రిని, బలిపీఠమును ఆ పీఠముమీది పరికరములను తైలముతో అభిషేకించి దేవునికి సమర్పించెను.

2. అపుడు యిస్రాయేలు తెగ నాయకులు వచ్చి కానుకలు సమర్పించుకొనిరి. ప్రజల జనసంఖ్య నిర్ణయించినది వీరే.

3. వారిలో ఇద్దరిద్దరు ఒక బండి చొప్పున మొత్తము ఆరుబండ్లను, ఒక్కొక్కరు ఒక ఎద్దుచొప్పున మొత్తము పండ్రెండు ఎడ్లను సమర్పించిరి.

4-5. ప్రభువు మోషేతో “ఈ నాయకుల కానుకలను స్వీకరించి సమావేశగుడారము సేవకు వినియోగింపుము. వానిని లేవీయుల అధీనమున ఉంచుము. వారు తమ అవసరముల కొలది వానిని వాడుకొందురు” అని చెప్పెను.

6. మోషే వానిని : లేవీయులకు అప్పగించెను.

7. అతడు గెర్షోను కుమారులకు రెండు బండ్లను, నాలుగు ఎడ్లను ఇచ్చెను.

8. మెరారి కుమారులకు నాలుగుబండ్లను ఎనిమిది ఎడ్లను ఇచ్చెను. అహరోను కుమారుడు ఈతామారు వారిచే పనిచేయించు చుండెను.

9. కాని మోషే కోహాతు పుత్రులకు ఏమియు ఈయలేదు. వారు పవిత్రస్థలపరిచర్య చేయు వారు గనుక గుడారమునందలి. పవిత్రవస్తువులను తమ భుజముల మీదనే మోసికొని పోవలెను.

10. బలిపీఠము దేవునికి సమర్పింపబడినపుడు తెగనాయకులు బలిపీఠము ఎదుటికి కానుకలు తెచ్చిరి

11. ప్రభువు మోషేతో “ఈ నాయకులు పండ్రెండు రోజులపాటు వరుసగా రోజుకు ఒక్కడు చొప్పున కానుకలు అర్పింపవలెనని చెప్పుము” అనెను.

12. ఆ నాయకులు పాటించిన క్రమమిది : మొదటి దినమున యూదా తెగ, నాయకుడు, అమ్మినాదాబు , కుమారుడగు నహషోను యూదా తెగ తరుపున తెచ్చిన కానుకలు:

13. దేవాలయపడికట్టు చొప్పున నూట ముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది. తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

14. ఇంకను పది తులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణిగలదు:

15. దహనబలికై ఒకకోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల,

16. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

17. సమాధానబలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱె పిల్లలు. 

18. రెండవదినమున యిస్సాఖారు తెగనాయకుడు, సూవారు కుమారుడు. నెతనేలు తెచ్చిన కానుకలు:

19. దేవాలయపడికట్టు చొప్పున, నూట ముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

20. ఇంకను పదితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

21. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల.

22. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

23. సమాధానబలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱె పిల్లలు.

24. మూడవదినమున సెబూలూను తెగ నాయకుడు, హెలోను కుమారుడు ఎలీయాబు తెచ్చిన కానుకలు:

25. దేవాలయపడికట్టు చొప్పున నూట ముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

26. ఇంకను పదితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

27. దహనబలికై. ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల.

28. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

29. సమాధానబలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱె పిల్లలు.

30. నాలుగవదినమున రూబేను తెగనాయకుడు, షెదేయూరు. కుమారుడు ఎలీసూరు తెచ్చిన కానుకలు: 

31. దేవాలయపడికట్టు చొప్పున నూటముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

32. ఇంకను పధితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

33. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱపిల్ల,

34. పాపపరిహార బలికై ఒక మేకపిల్లను,

35. సమాధాన బలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱెపిల్లలు.

36. ఐదవదినమున షిమ్యోను తెగనాయకుడు, సూరీషద్దయి కుమారుడు షోలుమీయేలు తెచ్చిన కానుకలు:

37. దేవాలయపడికట్టు చొప్పున నూట ముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

38. ఇంకను పది తులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

39. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల.

40. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

41. సమాధానబలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱెపిల్లలు.

42. ఆరవదినమున గాదు తెగనాయకుడు, రవూయేలు పుత్రుడు ఎలియాసవు తెచ్చిన కానుకలు:

43. దేవాలయపడికట్టు చొప్పున నూటముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

44. ఇంకను పదితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

45. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల,

46. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

47. సమాధాన బలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱె పిల్లలు.

48. ఏడవదినమున ఎఫ్రాయీము తెగ నాయకుడు, అమ్మీహూదు కుమారుడు ఎలీషామా తెచ్చిన కానుకలు:

49. దేవాలయపడికట్టు చొప్పున నూటముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

50. ఇంకను పది తులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

51. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల,

52. పాపపరిహార బలికై ఒక మేకపిల్లను,

53. సమాధానబలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱెపిల్లలు.

54. ఎనిమిదవ దినమున మనష్షే తెగ నాయకుడు, పెదాహ్పూరు పుత్రుడు గమలీయేలు తెచ్చిన కానుకలు:

55. దేవాలయ పడికట్టు చొప్పున నూటముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

56. ఇంకను పదితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

57. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల,

58. పాపపరిహార బలికై ఒక మేకపిల్లను,

59. సమాధాన బలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱెపిల్లలు.

60. తొమ్మిదవదినమున బెన్యామీను తెగ నాయకుడు, గిద్యోని కుమారుడు అబీదాను తెచ్చిన కానుకలు:

61. దేవాలయపడికట్టు చొప్పున నూట ముప్పదితులముల ఎత్తుగల వెండి గిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

62. ఇంకను పదితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

63. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల,

64. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

65. సమాధానబలికై రెండు ఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱె పిల్లలు.

66. పదియవదినమున దాను తెగనాయకుడు, అమ్మీషద్ధయి కుమారుడు అహియెజెరు తెచ్చిన కానుకలు:

67. దేవాలయపడికట్టు చొప్పున నూట ముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

68. ఇంకను పదితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

69. దహనబలికై ఒకకోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల,

70. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

71. సమాధానబలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱె పిల్లలు.

72. పదునొకండవదినమున ఆషేరు తెగ నాయకుడు, ఓక్రాను కుమారుడు ఫగియేలు తెచ్చిన కానుకలు:

73. దేవాలయపడికట్టు చొప్పున నూట ముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

74. ఇంకను పదితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

75. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల,

76. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

77. సమాధానబలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱె పిల్లలు.

78. పండ్రెండవ రోజున నఫ్తాలి తెగనాయకుడు, ఏనాను కుమారుడు అకీరా తెచ్చిన కానుకలు:

79. దేవాలయపడికట్టు చొప్పున నూటముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నె, డెబ్బది తులముల ఎత్తుగల వెండిపళ్ళెము. ఈ రెండింటినిండ దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన గోధుమపిండి కలదు.

80. ఇంకను పదితులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీనినిండ సాంబ్రాణి గలదు.

81. దహనబలికై ఒక కోడె, ఒక పొట్టేలు, ఒక ఏడాది గొఱ్ఱెపిల్ల,

82. పాపపరిహారబలికై ఒక మేకపిల్లను,

83. సమాధాన బలికై రెండుఎడ్లు, ఐదుపొట్టేళ్ళు, ఐదు మేకపోతులు, ఏడాది ప్రాయముగల ఐదు గొఱ్ఱె పిల్లలు. -

84-88. కనుక పండ్రెండుమంది నాయకులు కొని తెచ్చిన మొత్తము కానుకలివి: పండ్రెండు వెండిగిన్నెలు, పండ్రెండు వెండిపళ్ళెములు, మొత్తము కలిపి రెండువేల నాలుగువందల తులముల ఎత్తు. పండ్రెండు బంగారు గిన్నెలు మొత్తము కలిపి నూట ఇరువది తులముల ఎత్తు. దహనబలికి పండ్రెండు ఎడ్లు, పండ్రెండు పొట్టేళ్ళు, ఒక ఏడాది గొఱ్ఱె పిల్లలు పండ్రెండు, వానికి సంబంధించిన నైవేద్యములు, పాపపరిహారబలికి పండ్రెండు మేకపిల్లలు, సమాధాన బలికి ఇరువదినాలుగు ఎడ్లు, అరువది పొట్టేళ్ళు, అరువది మేకపోతులు, ఏడాది గొఱ్ఱెపిల్లలు అరువది.

89. మోషే ప్రభువుతో మాట్లాడుటకు గుడారములోనికి పోయినపుడెల్ల నిబంధన మందసముపైనున్న కరుణాపీఠము మీది రెండు కెరూబీము దూతల ప్రతిమల మధ్యనుండి తనతో మాట్లాడిన యావే స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడేను.

 1-2. దేవుడు మోషేతో ఇట్లు సెలవిచ్చెను. నీవు అహరోనుతో ఇట్లు చెప్పుము; “నీవు దీపమును వెలిగించునపుడు దీపస్తంభముమీది ఏడుదీపముల వెలుగు దీపస్తంభమునకు ముందు భాగమున పడునట్లు చూడవలెను.”

3. అహరోను ప్రభువు ఆజ్ఞాపించినట్లే దీపస్తంభమునకు ముందువైపున దీపములు అమర్చెను.

4. అతడు దీపస్తంభమునంతటిని సాగగొట్టిన బంగారముతో చేసెను. ప్రభువు మోషేకు చూపిన నమూన ప్రకారము దానిని తయారుచేసెను.

5-6. ప్రభువు మోషేతో ఇట్లనెను: “లేవీయులను యిస్రాయేలీయులనుండి వేరుపరచి శుద్ధిచేయింపుము.

7. వారిపై శుద్దీకరణ జలమును చల్లుము. వారు క్షురకత్తితో శరీరమంతటిని గొరిగించుకొని తమ బట్టలను శుభ్రము చేసుకోవలెను. అపుడు వారు శుద్ధి పొందినట్లగును.

8. వారు ఒకకోడెను, నైవేద్యమునకై నూనెకలిపిన గోధుమపిండిని తీసికొనిరావలెను. పాప పరిహారబలికై నీవు మరియొక కోడెను సమకూర్చు కొనుము.

9. లేవీయులను సాన్నిధ్యపుగుడారము నొద్దకు కొనిరమ్ము, యిస్రాయేలీయులందరిని పిలిపింపుము.

10. వారు లేవీయులమీద చేతులు చాపవలెను.

11. అంతట అహరోను యిస్రాయేలు ప్రజల నుండి లేవీయులను వేరుపరచి నాకు ప్రత్యేకమైన కానుకగా వారిని సమర్పింపవలెను. వారిని నా సేవకై నివేదింపవలెను. అప్పటినుండి వారు నా సేవకు సమర్పింప బడుదురు.

12. అటు తరువాత లేవీయులు కోడెల తలలపై చేతులు చాచెదరు. నీవు వానిలో ఒకదానిని పాపపరిహారబలిగా సమర్పింపుము. రెండవదానిని దహనబలిగా అర్పింపుము. లేవీయులను శుద్ధిచేయు విధానమిది.

13. అహరోను ఎదుటను, అతని కుమారుల ఎదుటను వారిని నిలువబెట్టి నాకు ప్రత్యేకమైన కానుకగా అర్పింపుము.

14. ఈ రీతిగా లేవీయులను యిస్రాయేలీయులనుండి వేరు పరచి వారిని నా వారినిగాజేయుము.

15. అపుడు వారు నా సమావేశపుగుడారమున పరిచర్య చేయుదురు.

16. లేవీయులను శుద్ధిచేసి నాకు సమర్పింపుము. వారు యిస్రాయేలీయులనుండి నాకు నివేదింపబడిన వారు. వారి తొలిచూలు కుమారులకు మారుగా నాకు సమర్పింపబడినవారు.

17. ఏలయన యిస్రాయేలీయుల సంతతిలోనేమి, వారి పశుగణములోనేమి తొలిచూలియైనది ప్రతి ఒక్కటి నాది. కుమారులతో పాటు వారి పశువుల తొలిచూలు పిల్లలు నాకు చెందును. నేను ఐగుప్తీయుల తొలిచూలు సంతతిని వధించినపుడే వారిని నావారినిగా చేసికొంటిని.

18. ఇపుడు యిస్రాయేలు తొలిచూలు కుమారులకు మారుగా లేవీయులను నా వారినిగా చేసికొందును.

19. వారు యిస్రాయేలీయులు నాకు ఇచ్చిన కానుక. నేను వారిని అహరోను కుమారుల అధీనమున ఉంచుదును. ఆ లేవీయులు సాన్నిధ్యపు గుడారమున పరిచర్య చేయుచు యిస్రాయేలీయులను కాపాడు దురు. కావున గుడారమును సమీపించునపుడు యిస్రాయేలీయులకు ప్రాణహానికలుగదు” అని చెప్పెను.

20. మోషే, అహరోనులు, యిస్రాయేలు ప్రజలు ప్రభువు ఆజ్ఞాపించినట్లే లేవీయులను శుద్ధిచేయించిరి.

21. లేవీయులు శుద్ధిచేసికొని తమబట్టలు శుభ్రము చేసికొనిరి. అహరోను వారిని దేవునికి ప్రత్యేకకానుకగా సమర్పించెను. వారికి శుద్ధీకరణ ప్రాయశ్చిత్తమును కూడ జరిపించెను.

22. అంతట లేవీయులు అహరోను కుమారుల పర్యవేక్షణలో గుడారమున పరిచర్యజేసిరి. లేవీయులను గూర్చి ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే అంతయు జరిగెను.

23-24. ప్రభువు మోషేతో “లేవీయులు ఇరువదియైదేండ్లు మరియు ఆ పైబడిన ప్రాయము నుండి సాన్నిధ్యపుగుడారమున పరిచర్య చేయుదురు.

25. ఏబదిఏండ్ల వయసు వచ్చిన పిదప వారు గుడారమున పరిచర్య చేయనక్కరలేదు.

26. ఆ తరువాత వారు తోటి లేవీయులకు పరిచర్యలో తోడ్పడవచ్చునుగాని తమంతట తాము పరిచర్యకు పూనుకోరాదు. లేవీయులను గూర్చిన నియమమిది” అని చెప్పెను.

 1. యిస్రాయేలు ప్రజలు ఐగుప్తునుండి వెడలి వచ్చిన రెండవ సంవత్సరము మొదటినెలలో ప్రభువు సీనాయి ఎడారిలో మోషేతో మాట్లాడెను.

2. “ప్రజలు నియమిత రోజున పాస్కపండుగ చేసికోవలెను.

3. ఈ నెల పదునాలుగవరోజు సూర్యాస్తమయముతో పండుగ ప్రారంభమగును. ఉత్సవ నియమములన్నింటిని పాటించి పండుగ చేసికొనుడు” అని చెప్పెను.

4. కనుక మోషే పాస్క పండుగ జరుపుకోవలెనని ప్రజలకు ఆజ్ఞ ఇచ్చెను.

5. వారు సీనాయి ఎడారిలో రెండవ సంవత్సరము మొదటినెల పదునాలుగవరోజు సాయంకాలమున పండుగను ప్రారంభించిరి. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే ప్రజలు పండుగజరుపుకొనిరి.

6. ప్రజలలో కొందరు శవమును తాకుటచే అపవిత్రులైరి. కావున పాస్కపండుగను నియమిత రోజున చేసికొనలేకపోయిరి.

7. వారు ఆరోజే మోషే అహరోనుల వద్దకు వచ్చి "మేము శవమును ముట్టు కొని అపవిత్రులమైతిమి. అయినను యిస్రాయేలు ప్రజలతో పాటు మేమును ప్రభువునకు నియామక కాలమున అర్పణమును అర్పింపకుండునట్లు ఎట్లు అడ్డగింపబడితిమి?” అని అడిగిరి.

8. మోషే “మీ విషయమై ప్రభువు ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందును, కొంచెము ఆగుడు” అని వారితో అనెను.

9. ప్రభువు మోషేతో “యిస్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము.

10. మీరుగాని, మీ తరువాత మీ సంతతివారు గాని శవమును తాకుటవలన అపవిత్రు డైనను, దూరప్రయాణమువలనైనను పాస్కపండుగను ఆచరింపనిచో,

11. రెండవనెల పదునాలుగవ రోజు సాయంకాలమున ఉత్సవముచేసుకోవచ్చును. పొంగని రొట్టెలతో, చేదైన ఆకుకూరలతో, పాస్కవిందును భుజింపవలెను.

12. ఆ విందును మరుసటిరోజుకు మిగుల్పరాదు. పాస్కగొఱ్ఱె పిల్ల ఎముకలను విరుగ గొట్టరాదు. పాస్కనియమములను పాటించి పండుగ జరుపుకోవలెను.

13. అశుద్ధి, దోషము సోకనివారు గాని, ప్రయాణావసరము లేని వారుగాని పండుగను పాటింపనిచో సమాజము నుండి వెలివేయబడుదురు. వారు సకాలమున ప్రభువునకు కానుకలు కొనిరాలేదు కనుక పాపఫలమును అనుభవింతురు.

14. అన్యదేశీయుడెవడైన మీచెంత వసించుచు పాస్కపండుగను ఆచరింపగోరినచో, అతడు పండుగ నియమములన్నింటిని పాటింపవలెను. యిస్రాయేలు ప్రజలకుగాని అన్యదేశీయులకు గాని పాస్కనియమములు ఒక తీరుగానేయుండును” అని చెప్పెను.

15-16. నిబంధనగుడారము చేసి నిలబెట్టిన దినమున మేఘమొకటి దానిని క్రమ్ముకొనెను. చీకటి పడినప్పటి నుండి తెల్లవారువరకు అది అగ్నిరూపమున గుడారముపై నిల్చెడిది. నిత్యము అలాగే జరిగెడిది.

17. మేఘము గుడారముమీదినుండి పైకి లేవగనే యిస్రాయేలీయులు శిబిరమును కదలించి ప్రయాణము కట్టెడివారు. మేఘము ఆగగనే గుడారము పన్ని విడిదిచేసెడివారు.

18. ఈరీతిగా వారు ప్రభువు ఆజ్ఞను అనుసరించి ప్రయాణము చేసెడివారు. ప్రభువు ఆజ్ఞను అనుసరించి విడిది చేసెడివారు.

19. మేఘము గుడారముపై నిలిచినంతకాలము ప్రజలు విడిదిచేసెడివారు. మేఘము గుడారముపై చాలకాలము ఆగినచో ప్రజలు ప్రభువు ఆజ్ఞకు బద్దులై శిబిరమును కదలించెడివారుకారు.

20. ఒక్కొక్కమారు మేఘము కొద్దికాలము మాత్రమే గుడారముపై నిలిచెడిది. ఏది ఏమైనను వారు ప్రభువు ఆజ్ఞను అనుసరించి గుడారముపన్ని విడిది చేసెడివారు. ప్రభువు ఆజ్ఞను అనుసరించి శిబిరము కదలించి ప్రయాణము చేసెడివారు.

21. మేఘము రాత్రివేళ గుడారముపై ఆగి ఉదయమున పైకిలేచినచో వారును ఉదయమున ప్రయాణము కట్టెడివారు. పగలైననేమి, రాత్రియైననేమి, మేఘము కదలినప్పుడే వారు కూడ కదలెడివారు. ఆ

22. ఒక్కొక్కమారు మేఘము మూడు నాలుగు దినములు, నెల, ఏడాదిగూడ గుడారముపై నిలిచెడిది. అది నిలిచినంతకాలము యిస్రాయేలీయులు అక్కడనే విడిదిచేసెడివారు. కాని అది లేవగనే వారును ప్రయాణ మయ్యెడివారు.

23. ప్రభువు ఆజ్ఞను అనుసరించి గుడారముపన్ని విడిదిచేసెడివారు. ప్రభువు ఆజ్ఞను అనుసరించి శిబిరమును కదలించి ప్రయాణము చేసెడివారు. ఈ రీతిగా వారు ప్రభువు మోషేద్వారా ఇచ్చిన ఆజ్ఞలకు బద్ధులైరి.

 1-2. ప్రభువు మోషేతో “సాగగొట్టిన వెండితో రెండు బాకాలు చేయింపుము. ప్రజలను సమావేశపరచునపుడును, గుడారమును కదలించునపుడును వానిని ఊదవలెను.

3. వానిని ఊదినపుడెల్ల ప్రజలెల్లరు సాన్నిధ్యపుగుడారమునెదుట నీచెంత చేరవలెను.

4. ఒక్క బాకానే ఊదినచో యిస్రాయేలు పెద్దలు మాత్రమే ప్రోగుగావలెను.

5. బాకాను ఊదుటతోపాటు యుద్ధనాదమును గూడ చేసినచో తూర్పువైపున శిబిరము పన్నియున్న వారు కదలవలెను.

6. రెండవమారుకూడ బాకానూది యుద్ధ నాదము చేసినచో దక్షిణమున శిబిరము పన్నియున్నవారు కదలవలెను. శిబిరమును తరలింపవలెనన్న బాకానూది యుద్ధనాదము చేయవలెను.

7. కాని ప్రజలను సమావేశపరచవలెనన్న బాకాలు మాత్రమే ఊదవలెను. యుద్ధనాదము చేయరాదు.

8. అహరోను కుమారులైన యాజకులు బాకాలు ఊదుదురు. మీకును మీ సంతతి వారికిని ఇదియే నియమము.

9. మీ దేశమునందు మిమ్ము పీడించు శత్రువులపై మీరు దాడికి వెడలునపుడు బాకానూది యుద్ధనాదము చేయుడు. మీ దేవుడైన ప్రభువు మిమ్ము జ్ఞప్తికి తెచ్చుకొని శత్రువుల నుండి మిమ్ముకాపాడును.

10. మీ ఉత్సవములందును, అమావాస్య పండుగలందును మీరు దహనబలులను, సమాధానబలులు సమర్పించునపుడు బాకాలు ఊదుడు. అపుడు నేను మిమ్ము స్మరించుకొందును. నేను మీ దేవుడనైన ప్రభుడను” అని చెప్పెను.

11. రెండవ సంవత్సరము రెండవనెల ఇరు దియవ రోజున మేఘము నిబంధన గుడారముమీది నుండి పైకి లేచెను.

12. అపుడు సీనాయి ఎడారినుండి యిస్రాయేలీయులు సైన్యములవలె నడిచిపోయిరి. పారాను ఎడారిలో మేఘము ఆగెను.

13. ప్రభువు మోషేను ఆజ్ఞాపించిన విధముగనే యిస్రాయేలీయులు నడచిరి.

14. యూదీయుల శిబిర ధ్వజము వారి సేనల ప్రకారము ముందర సాగెను. అమ్మినదాబు కుమారుడు నహషోను వారి నాయకుడు.

15. తరువాత సువారు కుమారుడు నెతనేలు నాయకత్వమున యిస్సాఖారు తెగవారు నడచిరి.

16. పిమ్మట హెలోను కుమారుడు ఎలీయాబు నాయకత్వమున సెబూలూను తెగవారు నడచిరి. .

17. వారివెనుక మడిచిన గుడారమును మోసి కొనుచు గెర్షోనీయులు, మెరారీయులు నడచిరి.

18. అటువెనుక రూబేనీయుల శిబిరధ్వజము వారి సేనల ప్రకారము సాగెను. షెదేయూరు కుమారుడు ఎలీసూరు వారి నాయకుడు.

19. సూరీషద్దయి కుమారుడు షెలుమీయేలు నాయకత్వమున షిమ్యోను తెగవారు నడచిరి.

20. రవూయేలు కుమారుడు ఎలియాసపు నాయకత్వమున గాదు తెగవారు నడచిరి.

21. అటుతరువాత పరిశుద్ధవస్తువులను మోసికొనుచు కోహాతీయులు నడచిరి. వీరు విడిదికి చేరునప్పటికే, ముందువెళ్ళినవారు గుడారమును పన్ని ఉంచెడివారు.

22. తరువాత ఎఫ్రాయీమీయుల శిబిరధ్వజము వారి సేనల ప్రకారము నడిచిరి. అమ్మీహూదు కుమారుడు ఎలీషామా. వారి నాయకుడు.

23. పెదాహ్సూరు కుమారుడు గమలీయేలు నాయకత్వమున మనష్షే తెగవారు నడచిరి.

24. గిద్యోని కుమారుడు అబీదాను నాయకత్వమున బెన్యామీను తెగవారు నడచిరి.

25. చిట్టచివరన దానీయుల శిబిరధ్వజము వారి సేనల ప్రకారము సాగెను. అమ్మీషద్దయి కుమారుడు అహియెజెరు వారి నాయకుడు.

26. ఓక్రాను కుమారుడు ఫసియేలు నాయకత్వమున ఆషేరు తెగవారు నడచిరి.

27. ఏనాను కుమారుడు అహీర నాయకత్వమున నఫ్తాలి తెగవారు నడచిరి.

28. ఈరీతిగా యిస్రాయేలీయులు సైన్యముల వలె వరుసలుకట్టి నడచిపోయిరి.

29. మోషే మిద్యానీయుడైన తన మామ రెయూవేలు కుమారుడగు హోబాబుతో “మేము ప్రభువు ప్రమాణముచేసిన భూమికి కదలిపోవు చున్నాము. ప్రభువు యిస్రాయేలునకు సిరిసంపదలు ఇచ్చును. నీవు కూడ మాతో రమ్ము, మేము మీకు మేలు చేసెదము. ప్రభువు యిస్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసెను” అని అనగా,

30. అందుకు హోబాబు “నేను మీ వెంట రాను. నేను మా దేశమునకు పోయి మా చుట్టపక్కా లతో జీవింతును” అనెను.

31. మోషే “నీవు మమ్ము విడనాడవలదు. ఈ ఎడారిలో మేమెక్కడ విడిది చేయవలెనో నీకు బాగుగా తెలియును. కనుక మాకు మార్గ దర్శకుడవుగా నుండుము.

32. నీవు మా వెంట వత్తువేని ప్రభువు మాకు ఏ మేలుచేయునో, ఆ మేలునుబట్టి మేమును నీకు మేలుచేయుదము” అని చెప్పెను.

33. యిస్రాయేలీయులు ప్రభువు పర్వతము నుండి బయలుదేరి మూడునాళ్ళు ప్రయాణము చేసిరి. ఆ మూడునాళ్ళు ప్రభువు నిబంధన మందసము వారికి ముందుగా పోవుచు విడిదిని వెదుకుచుండెను.

34. ప్రయాణకాలమున పగటిపూటలందెల్ల మేఘము వారిపై నిలిచియుండెడిది.

35. నిబంధన మందసము ప్రయాణమునకు కదలినపుడెల్ల మోషే “ప్రభూ,లెమ్ము! నీ శత్రువులు చెల్లాచెదరై పోవుదురుగాక! నిన్ను ద్వేషించువారు నీ ఎదుటినుండి పారిపోవుదురుగాక!” అనెడివాడు.

36. ఆ మందసము విశ్రాంతికై ఆగినపుడెల్ల అతడు “ప్రభూ, మరలిరమ్ము! ఈ వేవేలకొలది. యిస్రాయేలు ప్రజల యొద్దకు తిరిగిరమ్ము!” అనెడివాడు.

 1. ప్రజలు తమ దురదృష్టమునకు ప్రభువు మీద నిష్టూరములాడసాగిరి. ప్రభువు వారి నిష్టూరములు విని కోపించి అగ్నిని పంపగా అది భగభగ మండి శిబిరమున ఒక భాగమును కాల్చివేసెను.

2. అపుడు ప్రజలు మోషేకు మొర పెట్టగా అతడు ప్రభువును ప్రార్ధించెను. మంటలు ఆగిపోయెను.

3. ప్రభువు పంపిన నిప్పులు ప్రజల మధ్య ధగధగ మండినవి కావున ఆ తావునకు తబేరా' అని పేరు వచ్చినది.

4. యిస్రాయేలీయులతో పయనించు అన్యదేశీయులకు మాంసముపై కోరికపుట్టెను. యిస్రాయేలీయులు కూడ మాకు ఇక మాంసము దొరకదుగదా అని నిష్ఠూరోక్తులాడసాగిరి.

5. "మేము ఐగుప్తులో నుండగా అక్కడ చేపలు విరివిగ లభించెడివి. అచట మేము కడుపార తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికివచ్చుచున్నవి.

6. ఈ ఎడారిలో ఏమియు దొరకక తల్లడిల్లిపోవుచున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒక్కటి దప్ప యింకేమి దొరకదుగదా!” అని గొణగుకొనిరి.

7. మన్నా కొత్తిమీరగింజలవలె ఉండెడిది. తెల్లని పసుపువన్నె కలది.

8. ప్రజలు బయటికి వెళ్ళి దానిని ప్రోగుచేసికొని వచ్చి తిరుగటనో, రోకటనో పిండి చేసెడివారు. ఆ పిండిని పెనముమీద కాల్చి రొట్టెలు చేసికొనెడివారు. అవి ఓలివునూనెతో చేసిన రొట్టెలవలె రుచిగా నుండెడివి.

9. రాత్రివేళ శిబిరమున మంచు కురిసినపుడు మన్నా కూడ కురిసెడిది.

10. ప్రజలు వారివారి గుడారముల ముందట నిలుచుండి నిష్ఠూరోక్తులాడుచుండగా మోషే వినెను. ప్రభువు వారిమీద మండిపడుటను చూచి మోషే భయపడెను.

11. అతడు ప్రభువుతో “ప్రభూ! నీ సేవకుని ఇంతగా బాధపెట్టనేల? నేను నీ అనుగ్రహమునకు ఏల నోచుకోనైతిని? ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేల?

12. నేను వీరిని కంటినా! ఏమి? పాలుకుడుచు పిల్లలను రొమ్ముపై మోసుకొనిపోవు దాదివలె నేను వీరిని, నీవు పితరులకు వాగ్దానము చేసిన నేలకు, చేర్పవలెనని నిర్బంధము చేసెదవేల?

13. వీరు గంపెడాశతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపార తినెదము అని నన్ను విసిగించుచున్నారు. ఇంతమందికి కావలసినంత మాంసమును నేనెక్కడినుండి కొనిరాగలను?

14. ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడినే భరింపజాలను. అది నా తలకు మించిన పని.

15. నీవు నాయెడల ఇంత క్రూరముగా ప్రవర్తించుటకంటె, నా మీద కరుణగలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులార చూడకుందునుగదా!” అని మొరపెట్టెను.

16. ప్రభువు మోషేతో, “యిస్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను డెబ్బదిమందిని ప్రోగుజేసికొని సమావేశపు గుడారమునకు రమ్ము, వారిని నీ ప్రక్కన నిలుచుండుడని చెప్పుము.

17. నేను నీతో మాట్లాడ దిగి వచ్చెదను. నేను నీ ఆత్మను కొంత తీసికొని వారికిచ్చెదను. ఇక మీదట నీతోపాటు వారును ఈ ప్రజలను నడిపింపవలసిన బాధ్యత వహింతురు. నీవొక్కడివే వారి బాధ్యత వహింపవలదు.

18. మరియు నీవు ప్రజలతో ఇట్లు చెప్పుము: “మీరు రేపటిదినమునకు శుద్ధిచేసికొని సిద్ధముకండు. రేపు మీరు మాంసము తిందురు. మనము ఐగుప్తున ఎంత సుఖముగానుంటిమి! ఇట మాంసము దొరకక పోయెనుగదా, అని మీరు ఏడ్చుట ప్రభువు వినెను. ఇకనేమి, మీరు కోరుకొన్నట్లే ప్రభువు మీకు మాంసము నిచ్చును.

19-20. ఒక రోజుకాదు, రెండు రోజులు కాదు, ఐదు, పది, ఇరువది రోజులుకాదు, ఒకనెల రోజుల పాటు మీరు మాంసము తిందురు. మొగము మొత్తువరకు మాంసమును భుజింతురు. మీ మధ్య నెలకొనియున్న ప్రభువునుగూడ లెక్కచేయక ఐగుప్తు నుండి ఏల వెడలి వచ్చితిమని సణుగుకొనుచున్నారు కావున మీకు ఈ శిక్ష కలుగును.”

21. మోషే ప్రభువుతో “ఇక్కడ ఆరు లక్షలమంది ఉన్నారు. ఇంత మందికి నీవు ఒకనెలకు సరిపడునంత మాంసము ఇచ్చెదనని చెప్పుచున్నావు.

22. గొడ్లమందలను, గొఱ్ఱెమందలను చంపినను వీరికి సరిపోవునా? సముద్రములోని చేపలన్నిటిని పట్టుకొని వచ్చినను వీరికి సరిపోవునా?” అనెను.

23. ప్రభువు మోషేతో “నా బాహువు కురచయైనదా? నేనాడిన మాటలను చెల్లించుకొందునో లేదో నీవే చూచెదవుగాక!” అనెను.

24. మోషే వెడలిపోయి ప్రభువు చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేసెను. పెద్దలను డెబ్బదిమందిని ప్రోగుచేసికొని గుడారముచుట్టు నిలబెట్టెను.

25. అపుడు ప్రభువు మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంతతీసికొని ఆ డెబ్బదిమంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. ఆ ఆత్మ వారిపై నిలిచియున్నపుడు మాత్రమే వారు ప్రవచించిరిగాని మరల వారు ప్రవచింపలేదు.

26. పై డెబ్బదిమంది పెద్దలలో ఎల్దదు, మేదాదు అనువారు ఇద్దరు శిబిర ననే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారిమీదికి గూడ దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. 

27. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరుగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారుకూడ ప్రవచనములు, పలుకుచున్నారని అతనితో చెప్పెను. 

28. అపుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువ "అయ్యా! వారిని ప్రవచింపవలదని చెప్పుము” అనెను.

29. కాని మోషే అతనితో “ఓయి! నా యెడలగల అభిమానముచే నీవు వారిమీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికి ఆత్మను అనుగ్రహించి వీరిచే గూడ ప్రవచనములు పలికించిన ఎంత బాగుండెడిది!” అనెను.

30. అంతట మోషే, పెద్దలు శిబిరమునకు తిరిగిపోయిరి.

31. అపుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రము నుండి పూరేడు పిట్టలను తోలుకొనివచ్చెను. అవి నేలకు మూడడుగుల ఎత్తున ఎగురుచు నరులు ఒకరోజు ప్రయాణముచేయునంత దూరమువరకు శిబిరము చుట్టుప్రక్కల దట్టముగా క్రమ్ముకొనెను.

32. ఆ రోజు పగలు, రాత్రి, మరుసటిరోజు పగలు ప్రజలందరు పిట్టలను పట్టుకొనిపోయిరి. ఏబది బుట్టలకు తక్కువగా పట్టుకొనినవాడు ఎవడును లేడు. వారు ఆ పిట్టలను శిబిరము చుట్టు ఎండవేసిరి.

33. కాని జనులు ఆ పక్షుల మాంసమును నోటబెట్టుకొని పంటితో కొరికిరో లేదో ప్రభువు ఉగ్రుడై వారిని గొప్ప తెగులుపాలు చేసెను.

34. కావున ఆ తావునకు కిబ్రోతుహట్టావా' అని పేరు. మాంసమును ఆశించి మృత్యువువాతబడిన వారిని అక్కడనే పాతి పెట్టిరి.

35. అంతట ప్రజలు అక్కడనుండి కదలి హాసెరోతు చేరి అక్కడ విడిదిచేసిరి.

 1. మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లియాడుట వలన మిర్యాము, అహరోనులు అతనిని విమర్శించిరి.

2. “ఏమి, ప్రభువు మోషే ముఖముననే మాట్లాడేనా? మా వలనను మాట్లాడలేదా?" అనిరి. ప్రభువు వారి గొణగుడు వినెను.

3. భూమిమీద సంచరించు నరులందరిలోను మోషే మహావినయవంతుడు.

4. ప్రభువు తలవనితలంపుగా మోషే, అహరోను మిర్యాములతో మాట్లాడెను. ఆ ముగ్గురిని సాన్నిధ్యపు గుడారమునకు రమ్మని పిలిచెను. వారు వెళ్ళిరి.

5. ప్రభువు మేఘస్తంభముగ దిగివచ్చి గుడారము తలుపునొద్ద నిలుచుండి అహరోను, మిర్యాములను పిలువగా వారు ముందటికి వచ్చిరి.

6. ప్రభువు వారితో “మీరు నా పలుకులు ఆలింపుడు. మీలో ఎవరైన ప్రవక్తలు ఉన్నచో నేను వారికి దర్శనములందు కనిపింతును. కలలో వారితో మాట్లాడుదును.

7. కాని నా సేవకుడైన మోషేతో మాత్రము అటుల మాట్లాడను. అతనిని నా ప్రజలందరికిని పెద్దగా నియమించితిని.

8. నేను అతనితో ప్రత్యక్షముగా దర్శన మిచ్చి మాట్లాడుదును. గూఢార్థములతో గాకుండ సూటిగనే అతనితో సంభాషింతును. అతడు నా రూపమును నిమ్మళించి చూచెను. ఇట్టి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాట్లాడుటకు మీరేల భయపడరైరి?” అని ఉగ్రుడైపోయెను.

9-10. అంతట ప్రభువు అదృశ్యుడయ్యెను. అటుపిమ్మట మేఘము గుడారము మీదినుండి లేచిపోగానే, అదిగో మిర్యాము శరీరము మంచువలె తెల్లగానయ్యెను. ఆమె కుష్ఠరోగి అయ్యెను. అహరోను మిర్యామువైపు చూడగా ఆమెకు కుష్ఠవ్యాధి సోకియుండెను.

11. అహరోను మోషేతో "అయ్యా! మేము మా తెలివితక్కువతనము వలన పాపము' మూటగట్టు కొంటిమి. మమ్ము శిక్షింపకుము.

12. ఈమె శరీరము సగము మాంసము క్షీణించి పుట్టిన శిశువు శవమువలె నున్నది, కరుణింపుము” అనెను.

13. మోషే ప్రభువునకు మొర పెట్టి “ప్రభూ! ఈమెకు స్వస్థత దయచేయుము” అని వేడెను.

14. ప్రభువు అతనితో “ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమిసినచో ఆమె ఏడురోజులపాటు అవమానముతో ఉండిపోదా? కనుక మిర్యామును ఒక వారముపాటు శిబిరమునుండి వెళ్ళగొట్టుడు. తరువాత ఆమెను మరల కొనిరావచ్చును” అని చెప్పెను,

15. ఆ విధముననే మిర్యామును వారముపాటు శిబిరమునుండి బయటికి పంపివేసిరి. ఆమె మరల శిబిరమునకు తిరిగి వచ్చు వరకు ప్రజలు ఆ విడిదినుండి కదలిపోలేదు.

16. మిర్యాము తిరిగివచ్చిన తరువాత ప్రజలు హాసెరోతు నుండి కదలిపోయి పారాను ఎడారిలో దిగిరి.

 1-2. ప్రభువు మోషేతో “ప్రతి తెగకు ఒక్కొక్కని చొప్పున నాయకులను ఎన్నుకొని కనాను దేశమునకు వేగు నడిపింపుము. నేను మీకు ఆ భూమిని ఇచ్చెదను” అని చెప్పెను.

3-15. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే పారాను ఎడారినుండి తెగల నాయకులను పంపెను. వారి పేరులివి: రూబేను తెగనుండి సక్కూరు కుమారుడగు షమ్మువా, షిమ్యోను తెగనుండి హోరి కుమారుడగు షాఫతు, యూదా తెగనుండి యెఫున్నె కుమారుడగు కాలెబు, యిస్సాఖారు తెగనుండి యోసేపు కుమారుడగు ఈగాలు, ఎఫ్రాయీము తెగనుండి నూను కుమారుడగు హోషేయ, బెన్యామీను తెగనుండి రాపు కుమారుడగు పాల్టీ, సెబూలూను తెగనుండి సోడి కుమారుడగు గద్దీయేలు, యోసేవు తెగ అనగా మనష్షే తెగనుండి సూసి కుమారుడగు గదీ, దాను తెగనుండి గెమల్లి కుమారుడగు అమ్మియేలు. ఆషేరు తెగనుండి మికాయేలు కుమారుడగు సేతూరు, నఫ్తాలి తెగనుండి వోప్సీ కుమారుడగు నాబి, గాదు తెగనుండి మాఖి కుమారుడగు గేయువేలు.

 1. ఆ మాటలు విని ప్రజలందరు బిగ్గరగా కేకలువేసిరి. వారు రాత్రియెల్ల విలపించుచునేయుండిరి.

2. యిస్రాయేలు ప్రజలు మోషే, అహరోనులమీద గొణగుకొనిరి.

3. “మనమందరము ఆ ఐగుప్తుననో, ఈ ఎడారియందుననో చచ్చిన ఎంత బాగుండెడిది! ప్రభువు మనలను ఇక్కడికి తోడ్కొనిరానేల? ఈ శత్రువుల కత్తికి అప్పగించుటకా? మన ఆడపడుచులు, పిల్లలు వారిచేతికిచిక్కి చెఱపోవుటకా? మనము తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవుట మేలుకదా!” అనిరి.

4. వారు ఒక క్రొత్త నాయకుని ఎన్నుకొని ఐగుప్తునకు వెళ్ళిపోవలెనని మధనపడసాగిరి.

5. అపుడు మోషే అహరోనులు అచట గుమిగూడియున్న యిస్రాయేలు సమాజము ముందట సాష్టాంగపడిరి.

6. వేగు నడపి వచ్చిన నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు కట్టుబట్టలు చించుకొనిరి.

7. వారు ప్రజలతో “మేము చూచి వచ్చిన నేల చాల మంచిది.

8. ప్రభువునకు దయ కలిగినచో మనలను అక్కడికి కొనిపోయి ఆ నేలను మన వశము చేయును. అది పాలుతేనెలు జాలువారు నేల.

9. మీరు మాత్రము ప్రభువుమీద తిరుగబడవలదు. ఆ దేశప్రజలకు భయపడవలదు. వారిని మనము అవలీలగా జయింపవచ్చును. ఆ ప్రజల రక్షణ వారినుండి తొలగిపోయినది. ఏలయన, ప్రభువు మనకు అండగా ఉండును. కనుక మీరు భయపడనక్కరలేదు” అనిరి.

10. యిస్రాయేలు సమాజము మోషే అహరోనులను రాళ్ళతో కొట్టి చంపవలెనని తలంచుచుండగా హఠాత్తుగా, సమావేశపు గుడారముమీద ప్రభువు తేజస్సు ప్రకాశించెను.

11. ప్రభువు మోషేతో “వీరు ఇంకను ఎంతకాలము నన్ను నిరాకరింతురు? నేను చేసిన అద్భుతకార్యములు కన్నులార జూచియు ఎంతకాలమని విశ్వసించక నన్ను ఉపేక్షింతురు?

12. నేను అంటురోగములతో వీరిని నిర్మూలింతును, నీ నుండి మరియొక క్రొత్త జాతిని కలిగింతును. ఆ ప్రజలు వీరికంటె అధికులు, బలవంతులు అగుదురు” అని అనెను.

13. మోషే ప్రభువుతో “ప్రభూ! నీవు స్వీయ బలముతో ఈ ప్రజలను ఐగుప్తునుండి తరలించు కొనివచ్చితివిగదా! నీవు ఈ యిస్రాయేలు ప్రజలకు ఏమిచేసితివో తెలిసికొని ఆ విషయమును ఐగుప్తీయులు ఈ దేశవాసులకు ఎరిగింతురు.

14. నీవు మా మధ్య నెలకొనియున్నావనియు, నీ మేఘము మా మీద ఆగినపుడు నీవు మాకు ప్రత్యక్షముగా దర్శనమిత్తు వనియు, నీవు పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములోను మాముందు నడుచుచున్నావని ఈ ప్రజలు వినియేయున్నారు.

15. ఇప్పుడు నీవు తొందర పడి ఈ ప్రజలందరిని చంపివేసినచో నీ కీర్తిని వినిన ఈ దేశీయులు ఏమనుకొందురు?

16. 'చూచితిరా! ప్రభువు యిస్రాయేలు ప్రజలను తాను వాగ్దానము చేసిన భూమికి చేర్చలేకపోయెను. కనుకనే వారిని ఎడారిలో చంపివేసెను' అని ఆడిపోసుకోరా?

17. కనుక ప్రభూ! నీ బలమును ప్రదర్శింపుము.

18. ప్రభువు సులభముగా కోపపడువాడుకాడు. మిగుల దయగలవాడు. అతడు ప్రజల పాపములను తిరుగుబాటును మన్నించును. అయినను ఆయన అపరాధిని నిరపరాధిగా యెంచక, పితరుల పాపమునకై వారి సంతానమును మూడు నాలుగు తరముల వరకు శిక్షించును, అని నీవే స్వయముగా చేసిన ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము.

19. నీ దయ అపారమైనది. కనుక ఐగుప్తునుండి బయలుదేరినది మొదలుకొని ఇంతవరకు నీవు ఈ ప్రజలను మన్నించినట్లే ఇప్పుడును వీరి తప్పిదములు మన్నింపుము” అని మనవి చేసెను.

20. ప్రభువు మోషేతో “నీవు కోరినట్లే నేను వీరిని క్షమింతును.

21-22. కాని నేను సజీవుడను, భూమియంతయు ప్రభువు మహిమతో నిండియున్నది అనుట ఎంతసత్యమో ఈ ప్రజలును వాగ్దత్త భూమిని చేరరనుటయు అంతే సత్యము, వీరు నా సాన్నిధ్యమును చూచిరి. ఐగుప్తుననేమి, ఎడారిలో నేమి నేను చేసిన అద్భుత కార్యములను కన్నులార చూచిరి. కాని వీరు పదేపదే నన్ను పరీక్షించుచున్నారు. నా మాట పెడచెవిని పెట్టుచున్నారు.

23. కనుక వీరిలో ఒక్కడును నేను పితరులకు వాగ్ధానము చేసిన నేలను చేరుకొనడు. నా ఆజ్ఞను త్రోసివేసినవారు ఎవ్వరును ఆ భూమిని కంటితో చూడరు.

24. కాని నా సేవకుడైన కాలేబు మాత్రము వారివంటివాడు కాడు. అతడు నా మాట జవదాటి ఎరుగడు. కనుక కాలెబు తాను వేగు నడపి వచ్చిన దేశమున అడుగిడితీరును. అతని సంతతివారు ఆ నేలను భుక్తము చేసికొందురు.

25. ప్రస్తుతము అచ్చట అమాలేకీయులు, కనానీయులు వసించుచున్నారు. రేపు మీరు రెల్లు సముద్రము వైపుగా బయలుదేరి ఎడారికి మరలిపొండు” అనిచెప్పెను.

26-27. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను: “నాకు వ్యతిరేకముగా గొణుగుకొను ఈ సమాజమును నేను ఎంతకాలము సహింపవలెను? ఈ దుష్టుల సణుగుడును నేనువింటిని.

28. మీరు వారితో ఇట్లు చెప్పుడు: నేను సజీవుడననుట ఎంత నిక్కమో అంతే నిక్కముగా మీ మాటలకు తగినట్లే మిమ్ము దండింతును. ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, వినుడు.

29. మీరు చత్తురు. మీ శవములు ఈ ఎడారిలో చిందరవందరగా కూలిపడును. మీరు నా మీద గొణగితిరి. కావున మీలో ఇరువదియేండ్లు అంతకు పైబడినవారందరును ఇచటనే చత్తురు.

30. నేను మీకు భుక్తము చేయుదునన్న నేలపై యెఫున్నె కుమారుడగు కాలెబు, నూను కుమారుడగు యెహోషువ తప్ప మరెవ్వరును కాలుమోపరు.

31. మీ పిల్లలు చెఱపోవుదురని మీరు వాపోతిరి. కాని మీరు నిరాకరించిన నేలకు వారిని చేర్చుదును.

32. మీరు ఈ ఎడారిలోనే చత్తురు.

33. మీ పిల్లలు నలువది యేండ్ల వరకు ఈ ఎడారిలోనే తిరుగాడుచు, మీ అవిశ్వాసమునకు వారు ప్రాయశ్చిత్తము చేయుదురు. మీ తరములవారందరు కన్ను మూయు వరకును వారిని ఈ శాపము పీడించుచునేయుండును.

34. మీరు ఆ దేశమును వేగునడిపిన నలువది రోజులు ఒక్కొక్కరోజు ఒక్కొక్క సంవత్సరముగా గణింపబడును. నలువదియేండ్లు మీరు మీ పాపఫలితమును అనుభవింతురు. అప్పుడు గాని నన్ను నిర్లక్ష్యము చేయుట అనగానేమిటో మీకు అంతుపట్టదు.

35. నను ఎదిరించిన దుష్టులకు నేను ఈ అపకారము చేసి తీరెదను. ఈ ఎడారిలో మీరందరు చత్తురు. నేను  ప్రభుడను, నా మాటకు ఇక తిరుగులేదు.”

36. మోషే వేగునడుపుటకు పంపినవారు తాము చూచివచ్చిన దేశము మంచిదిగాదని చెప్పుటచే ప్రజలు మోషేమీద గొణగుకొనిరి.

37. కనుక ప్రభువు ఆ వేగులవాండ్రను రోగముతో నాశనము చేసెను.

38. వేగు నడిపినవారిలో యెహోషువ, కాలేబు మాత్రమే ప్రాణములతో బ్రతికిరి.

39. ప్రభువు తనతో చెప్పిన మాటలను మోషే యిస్రాయేలీయులకు ఎరిగింపగా, వారందరు పెద్ద పెట్టున వాపోయిరి.

40. వారు మరునాడు వేకువనే లేచి కనానును ఆక్రమించుకొనుటకై ఆ దేశములోని కొండలమీదికి ఎక్కిపోయిరి. వారు “ప్రభువు వాగ్దానము చేసిన భూమిని ఆక్రమించుకొనుటకు మనము సిద్ధముగనే ఉన్నాము గదా! మనము దేవుని ఆజ్ఞమీరి తప్పు చేసినమాట నిజమే” అనిరి.

41. కాని మోషే వారితో “మీరు ఇప్పుడు ప్రభువు ఆజ్ఞ మీరుచున్నారు. దీని వలన లాభములేదు.

42. మీరు కనానునకు వెళ్ళవద్దు. ప్రభువు మీకు తోడ్పడడు. కనుక శత్రువులు మిమ్ము జయించి తీరుదురు.

43. మీరు అచట వసించు అమాలెకీయులను, కనానీయులను ఎదిరింపగా వారు మిమ్ము నాశనము చేయుదురు. మీరు ప్రభువును ఉపేక్షించితిరి గనుక అతడు మీకు తోడ్పడడు” అని చెప్పెను.

44. అయినను వారు ఆ పలుకులు లెక్క చేయక పొగరెక్కి కనాను కొండలమీదికి ఎక్కిపోయిరి. మోషేగాని, దైవమందసముగాని వారి వెంట వెళ్ళలేదు.

45. అపుడు అచట వసించుచున్న కనానీయులు, అమాలేకీయులు, యిస్రాయేలీయులను ఎదుర్కొని ఓడించి హోర్మావరకు తరిమి హతముచేసిరి.

 1-2. ప్రభువు మోషేతో ఇట్లనెను: “యిస్రాయేలీయులతో నా మాటలుగా ఇట్లుచెప్పుము.

3. మీరు నేనొసగు దేశమును చేరిన తరువాత నాకు బలులు, దహనబలులు సమర్పింతురు. ఆయా పండుగలందో లేక మీరుచేసిన మ్రొక్కుబడులను ముగించుటకో లేక స్వేచ్చగా కోరికపడియో ఆ బలులను సమర్పింతురు. కోడెనుగాని, పొట్టేళ్ళనుగాని, మేకపోతులనుగాని నాకు సమర్పింతురు. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును.

4. ఈ బలులను అర్పించువారు రెండుకుంచముల ధాన్యము, రెండుపిడతల ఓలివునూనె కొనిరావలెను.

5. దహన బలులు అర్పించునపుడు ప్రతి గొఱ్ఱెపిల్లకు రెండు బుడ్ల ద్రాక్షసారాయము గూడ కొనిరావలెను.

6. పొట్టేలిని సమర్పించునపుడు నాలుగు కుంచముల పిండిని, మూడుపిడతల ఓలివునూనెతో తడిపి దేవునికి అర్పింపవలెను.

7. మూడుబుడ్ల ద్రాక్షసారాయము గూడ సమర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును.

8-9. దహనబలిగా గాని, సమాధానబలిగా గాని, మ్రొక్కుబడిబలిగా గాని కోడెదూడను సమర్పించునపుడు ధాన్యమును కూడ సమర్పింపవలెను. ఆరు కుంచముల పిండిని ఐదుపిడతల నూనెతో తడిపి సమర్పింపవలెను.

10. పైపెచ్చు. ఐదుబుడ్ల ద్రాక్షాసారాయమును గూడ సమర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతి కలిగించును.

11. కోడె, పొట్టేలు, గొఱ్ఱెపిల్ల, మేకపిల్ల వీనిలో దేనిని సమర్పించినను ఈ రీతిగనే చేయవలెను.

12. ఎన్ని పశువులను సమర్పించినను, ఒక్కొక్క పశువునకును పైన చెప్పిన కొలతల ప్రకారము ధాన్యము, పానము సమర్పింపవలెను.

13. యిస్రాయేలీయులు ప్రభువునకు ప్రీతి గలిగించు సువాసనగల దహనబలులు సమర్పించు నపుడెల్ల, ఈ నియమములు పాటింపవలెను.

14. మీయొద్ద వసించు పరదేశిగాని, మీ తరతరములలో మి మధ్యనున్నవాడెవడైనను గాని ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసనగల దహనబలి అర్పింపగోరినపుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.

15. సమాజమునకు అనగా మీకును, మీలో నివసించు పరదేశికిని ఒకటేకట్టడ. అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. దేవుని ఎదుట మీరును, పరదేశులును సమానులే.

16. కనుక మీకును వారికిని ఒకే ఏర్పాటు, ఒకే న్యాయవిధి వర్తించును” అని చెప్పెను.

17-18. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులతో నామాటగా ఇట్లు చెప్పుము:

19. మీరు నేనొసగు నేలను చేరుకొనిన తరువాత అక్కడ పంటను భుజించునపుడు దానిలో కొంతభాగమును నాకు సమర్పింపవలెను.

20. ప్రతి సంవత్సరమును క్రొత్తధాన్యము నుండి తయారుచేసిన భోజనము ప్రభువునకు కానుకగా అర్పింపవలెను. మీరు కళ్ళమున తొక్కించిన ధాన్యములో ఒకవంతు దేవునికి సమర్పించినట్లే, ఈ భోజనమును గూడ సమర్పింపుడు.

21. ఏటేట తొలిధాన్యమునుండి తయారుచేసిన భోజనమున ఒకవంతు ప్రభువునకు సమర్పింపుడు. కలకాలము ఇట్లు చేయుడు” అని చెప్పెను.

22. యావే మోషే ముఖమున ఇచ్చిన ఈ ఆలను ఎవరైనా ప్రమాదవశమున మీరినచో,

23. రాబోవు తరమువారు యావే మోషే ముఖమున ఇచ్చిన ఆజ్ఞలను మీరినచోప్రాయశ్చిత్తము చేసికొనవలెను.

24. సమాజమంతయు అనాలోచితముగ ప్రభువు ఆజ్ఞమీరినచో ఒక కోడెదూడను దహనబలిగా సమర్పింపవలెను. ఆ బలి సువాసన ప్రభువునకు ప్రీతిగలిగించును. దానితో పాటు ధాన్యము, ద్రాక్షసారాయము అర్పింపవలెను. పైగా పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పింపవలెను.

25. యాజకుడు సమాజమంతటికిని ప్రాయశ్చిత్తము జరుపవలెను. ప్రజలు అనాలోచితముగా పాపముచేసిరి కనుకను, పాపపరిహారమునకై దహనబలిని అర్పించిరి కావునను వారి పాపము మన్నింపబడును.

26. యిస్రాయేలు సమాజమంతయు వారితో జీవించు అన్యదేశీయులందరు పాపపరిహారము పొందుదురు. అందరును ఏమరుపాటున పాపము చేసినవారేకదా!

27. కాని ఎవడైనను వ్యక్తిగతముగా పొరపాటున పాపముచేసినచో, అతడు పాపపరిహారముగా ఒక యేడాది అడుమేకకూనను సమర్పింపవలెను.

28. యాజకుడు దేవుని ఎదుటనే పాపికి ప్రాయశ్చిత్తము జరుపును. అతనిపాపము పరిహరింపబడును,

29. యిస్రాయేలీయుడైన గాని, అన్యదేశీయుడైన గాని పొరపాటున పాపము చేసినపుడు ఈ నియమమునే పాటింపవలెను.

30. కాని యిస్రాయేలీయుడేగాని, పరదేశియే గాని తెగించి పాపముచేసెనేని ప్రభువును కించపరచి నట్లగును. కనుక అతనిని సమాజమునుండి వెలివేయవలెను.

31. అతడు ప్రభువును నిర్లక్ష్యము చేసి బుద్ధిపూర్వకముగా ఆయన ఆజ్ఞను మీరెను. కనుక వానిని నిశ్చయముగా వెలివేయవలెను. అతని తప్పిదములకు అతడే బాధ్యుడు.

32. యిస్రాయేలీయులు ఎడారియందున్న కాలమున ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున కట్టెపుల్లలు ప్రోగుచేసికొనుటను చూచిరి.

33. అతనిని మోషే, అహరోనులు మరియు యిస్రాయేలు సమాజము గుమిగూడియున్న చోటికి కొనివచ్చిరి.

34. కాని అతనికి ఏమి శిక్షవిధింపవలెనో తెలియక కొంత కాలము బందీగానుంచిరి.

35. అప్పుడు ప్రభువు మోషేతో "ద్రోహికి మరణశిక్ష విధింపుడు. సమాజమంతయు అతనిని శిబిరము వెలుపల రాళ్ళతో కొట్టి చంపవలయును” అని చెప్పెను.

36. కనుక సమాజము అతనిని శిబిరము వెలుపలకు కొనిపోయి మోషే ద్వారా ప్రభువు ఆజ్ఞాపించిన విధముగ రాళ్ళతో కొట్టిచంపెను.

37-38. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: “యిస్రాయేలు ప్రజలతో కట్టుబట్టల అంచులకు కుచ్చులు కుట్టించుకోవలెనని చెప్పుము. ప్రతి కుచ్చు మీదను ఒక ఊదాపోగు ఉండవలెను. తరతరముల వరకు వారు ఈ కుచ్చులు తాల్పవలెను.

39. ఈ కుచ్చులను చూచినపుడెల్ల మీరు నా ఆజ్ఞలను జ్ఞప్తికి తెచ్చుకొని వానిని పాటింతురు. ఇకమీదట మీరు దేవునికి పవిత్రులై యుండునట్లు మీ కోరికలకు లొంగిపోయి పాడుపనులు చేయరు.

40. ఈ కుచ్చులు చూచి మీరు, నా ఆజ్ఞలు జ్ఞప్తికి తెచ్చుకొని, వానిని పాటింతురు.

41. నేను మీ దేవుడనని ఎరిగించుటకే మిమ్ము ఐగుప్తునుండి తరలించుకొని వచ్చితిని. కనుక మీ దేవుడను ప్రభుడను నేనే.” 

 1. లేవీ తెగకు చెందినవాడును, కోహాతునికి మనుమడును, ఈసాహారు కుమారుడునగు కోరా,

2. రూబేను తెగవారైన ఎలీయాబు కుమారులగు దాతాను, అబీరాములు, పేలేతు కుమారుడగు ఓను యోచించుకుని రెండువందలయేబది మంది పేరుమోసిన యిస్రాయేలీయుల సమాజపెద్దలతో మోషేకు ఎదురుగాలేచి

3. మోషే అహరోనులకు వ్యతిరేకముగా జతకట్టి, “మీ గొప్పలు మా ఎదుట చెల్లవు. యిస్రాయేలు సమాజమంతయు పరిశుద్ధమైనదేకదా! ఈ ప్రజలందరు ప్రభువునకు చెందినవారేకదా! మరి ప్రభువు ప్రజలకు మీరు మాత్రమే పెద్దలు కానేల?” అని అడిగిరి.

4. ఆ మాటలువిని మోషే నేలమీద బోరగిలబడి దేవునికి మనవి చేసెను.

5. అతడు కోరాను, అతని అనుచరులను చూచి “ప్రభువు తనకు చెందిన వారెవరో, పవిత్రులెవరో రేపు ప్రొద్దున నిర్ణయించును. ఆయన తనకు చెందినవారినే తన చెంతకు రానిచ్చును.

6-7. రేపు నీవును, నీ అనుచరులును మీ ధూపపాత్రములను నిప్పులతో నింపి, సాంబ్రాణివేసి యావే సన్నిధిని ధూపమువేయుడి. పవిత్రులైనవారిని ప్రభువే ఎన్నుకొనును. లేవీయులారా! మీ ఆగడములు మా యెదుట చెల్లవు” అనెను.

8. మరియు మోషే కోరాతో “లేవీ కుమారులారా! నామాటలు వినుడు.

9. యిస్రాయేలు సమాజము నుండి ప్రభువు మిమ్ము తన సేవకు ఎన్నుకొనెను. మీరు ఆయన ఎదుటికివచ్చి ఆయన గుడారమున పరిచర్యచేయుచున్నారు. ప్రభువు సమాజమునకు ఊడిగము చేయుచున్నారు. ఇది ఎంతటి భాగ్యమో ఊహించితిరా?

10. ప్రభువు నిన్ను నీ అనుచరులైన లేవీయులను తనచెంతకు రానిచ్చుట చాలదా? మీరు ఇపుడు యాజకత్వమునకు కూడ అఱ్ఱులు చాపవలెనా?

11. దీనికై నీవును, నీతో జతకట్టినవారు ప్రభువునకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఏపాటివాడు? అతనికి విరోధముగా మీరు గొణగనేల?” అనెను.

12. మోషే ఎలీయాబు కుమారులు దాతానును అబీరాముని పిలువనంపెను. కాని వారు “మేము రాము,

13. నీవు మమ్ము పాలుతేనెలుజాలువారు ఆ ఐగుప్తుదేశము నుండి తరలించుకొని వచ్చినది ఈ నిర్జన ప్రదేశమున చంపివేయుటకే కదా? పైగా మా మీద పెత్తనముకూడా చేసెదవా?

14. నిశ్చయముగా నీవు మమ్ము పాలుతేనెలు జాలువారు నేలకు కొని రాలేదు. మాకు పొలములు, ద్రాక్షతోటలు పంచి ఈయలేదు. ఈ ప్రజలు అంత గ్రుడ్డివారనుకొంటివా యేమి? మేము నీయొద్దకు రాము ” అనిరి.

15. ఆ మాటలకు మోషే ఉగ్రుడై “ప్రభూ! నీవు వీరి సమర్పణములను అంగీకరింపవలదు. నేను వీరికి ఎట్టి అపకారమును చేయలేదు. తుదకు వీరి గాడిదనైనను తీసికొని ఎరుగను” అనెను.

16. మోషే కోరాతో “రేపు నీవు నీ అనుచరులును, అహరోనును ప్రభువు సన్నిధికి రండు.

17. మీ రెండువందల యేబదిమందిలో ప్రతివాడు తన ధూపకలశములను సాంబ్రాణితో నింపి ప్రభువు ఎదుటికి కొనిరావలెను. అట్లే నీవు, అహరోను మీ యిరువురి కలశములను కొనిరండు” అని చెప్పెను.

18. ఆ రీతిగనే ప్రతివాడును సాంబ్రాణి నిండిన తన ధూపకలశముతో నిబంధనపు గుడారము ఎదుట ప్రోగయ్యెను. మోషే అహరోనులు కూడ వచ్చిరి.

19. కోరా ఆ జనులనందరిని మోషే అహరోనులకు వ్యతిరేకముగా గుంపుగా చేర్చి సమావేశపు గుడారము ద్వారమువద్ద నిలుపగా, ప్రభువు సాన్నిధ్యపు ప్రకాశము ఒక్కసారిగా వారి ఎదుట ప్రత్యక్షమయ్యెను.

20-21. ప్రభువు మోషే అహరోనులతో మాటలాడెను. “మీరు ఈ ప్రజలకు దూరముగా నిలువుడు. నేను వారినందరిని ఒక్కక్షణములో నాశనము చేసెదను” అనెను.

22. కాని మోషే అహరోనులు నేలపై బోరగిలబడి “దేవా! నీవు జీవులన్నిటికి ప్రాణము ఇచ్చువాడవు. ఒక్కని పాపము కొరకు ఈ సమాజము నంతటిని శిక్షింతువా!” అనిరి.

23-24. ప్రభువు, మోషేతో “కోరా, దాతాను, అబీరాముల గుడారముల నుండి అవతలకు పోవలెనని ఈ ప్రజలను ఆజ్ఞా పింపుము” అనెను.

25. మోషే నేలమీదనుండి పైకిలేచి దాతాను, అబీరాముల వద్దకు వెళ్ళెను. ప్రజానాయకులును వారి వెంట వెళ్ళిరి.

26. అతడు ప్రజలతో “మీరు ఈ దుర్మార్గుల గుడారములకు దూరముగా ఉండుడు. వారి వస్తువులు వేనిని ముట్టుకోవలదు. లేదేని మీరును వారి పాపముల వలన బుగ్గియైపోవుదురు” అనెను.

27. కనుక ప్రజలు కోరా, దాతాను, అబీరాముల గుడారములనుండి దూరముగా తొలగిరి.

28. దాతాను, అబీరాములు తమ గుడారముల ముందట నిలబడియుండిరి. వారి భార్యలు, పుత్రులు, పసిబిడ్డలు అక్కడనే నిలిచియుండిరి.

29. అప్పుడు మోషే ప్రజలతో “ఈ కార్యములన్నిటిని ప్రభువు నాచేత చేయించెనేగాని నేను స్వయముగా ఏమియు చేయలేదని మీకిప్పుడే తేటతెల్లమగును. వీరు నరులందరివలెనే సహజమైన చావు చచ్చినచో ప్రభువు నన్ను పెద్దగా నియమింపలేదనుకొనుడు.

30. కాని ప్రభువు ఇపుడొక అద్భుతకార్యము చేసినచో, భూమి నోరువిప్పి వీరిని, వీరికి చెందినవారిని మ్రింగివేసినయెడల, వీరందరు జీవముతోనే పాతాళలోకము చేరుకొనినచో, వీరు ప్రభువును పరిత్యజించిరని తెలిసికొనుడు” అనెను.

31. మోషే ఈ రీతిగా మాట్లాడి ముగించెనో లేదో దాతాను, అబీరాముల కాళ్ళక్రిందటి నేల బ్రద్దలయ్యెను.

32. భూమి నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను మ్రింగివేసెను. కోరాను, అతని అనుచరులను వారి వస్తువులను కబళించివేసెను.

33. వారును, వారివస్తువులును పాతాళమునకు చేరుకొనెను. భూమి వారిని మ్రింగివేసెను. ఇకవారు ఎవరి కంటనుపడలేదు.

34. అక్కడ గుమిగూడియున్న యిస్రాయేలీయులందరు ఆ మంటిలో కలసి పోవుచున్న వారి ఏడ్పులువిని భూమి తమను గూడ మ్రింగి వేయునేమోయని భయపడిపారిపోయిరి.

35. అప్పుడు ప్రభువు సన్నిధినుండి ఒక మంట దిగివచ్చి ధూపము అర్పింపవచ్చిన ఆ రెండువందల యేబది మందిని గూడ కాల్చిబూడిద చేసెను.

36-37. ప్రభువు మోషేతో "యాజకుడగు అహరోను కుమారుడు ఎలియెజెరును పిలిచి, ధూప కలశములను బుగ్గినుండి వెలికిదీయుమని చెప్పుము. ఈ ధూపకలశములు పవిత్రములైనవి. ఆ బుగ్గిని దూరముగా చల్లుము.

38. వీనిని ప్రభువు ఎదుటికి కొనివచ్చినందున పవిత్రములైనవి. కనుక వీనిని రేకులుగా సాగగొట్టి బలిపీఠమును కప్పునట్లు వానిని బిగగొట్టుము. అది యిస్రాయేలీయులకు ఒక హెచ్చరిక సూచికముగా నుండగలదు” అని చెప్పెను.

39. యాజకుడగు ఎలియెజెరు, అగ్గిలో బుగ్గి యైన వారు కొనివచ్చిన ఆ కంచుకలశములను వెలికిదీసి వాటిని రేకులుగా సాగగొట్టి బలిపీఠమును కప్పుచు బిగగొట్టెను. 

40. అహరోను వంశీయులు తప్ప అన్యులు ప్రభువు సాన్నిధ్యమున ధూపము సమర్పింపరాదనుటకు ఇది హెచ్చరిక అయ్యెను. , ఎవరైనను ఇట్టి కార్యమునకు తలపడెదరేని వారును , కోరా వలెను, అతని అనుచరులవలెను సర్వనాశనమగుదురు. మోషే ద్వారా ప్రభువు ఎలియెజెరును ఆజ్ఞాపించిన రీతిగనే ఇది అంతయు జరిగెను.

41. ఆ మరునాడు యిస్రాయేలు సమాజమంతా మోషే, అహరోనుల మీద గొణిగి “మీ వలన ప్రభువు ప్రజలకు ఇంతటి ముప్పువాటిల్లినదిగదా!” అనెను.

42. ఈ రీతిగా ప్రజలు మోషే, అహరోనులమీద తిరుగబడగా వారిరువురును సమావేశపు గుడారము వైపు చూచిరి. అపుడు మేఘము గుడారమును క్రమ్ముకొనగా, ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము ప్రత్యక్షమయ్యెను.

43. మోషే, అహరోనులు సాన్నిధ్యపు గుడారము ఎదుటకు వచ్చిరి.

44-45. ప్రభువు మోషేతో “మీరు ఈ ప్రజల నడుమ నుండి ప్రక్కకు తొలగుడు. వీరిని నేను ఉన్న వారినున్నట్లుగా క్షణములో నాశనము చేసెదను” అనెను. వెంటనే మోషే, అహరోనులు నేలపై బోరగిలబడిరి.

46. మోషే అహరోనుతో “నీ ధూపకలశమును బలిపీఠముమీది నిప్పుకణికలతో నింపి సాంబ్రాణి వేయుము. నీవు త్వరత్వరగా ప్రజల యొద్దకు వెళ్ళి వారికొరకు ప్రాయశ్చిత్తము చేయుము. ప్రభువు కోపము ప్రజ్వరిల్లినది. అంటురోగము ప్రారంభమైనది” అనెను. 

47. అహరోను మోషే ఆజ్ఞాపించినట్లే ధూప కలశము గైకొని గబగబ ప్రజల యొద్దకు వెళ్ళెను. కాని అప్పటికే ప్రజలకు అంటురోగము సోకియుండెను. అతడు ధూపమున సాంబ్రాణి వేసి ప్రజల పాపమునకు ప్రాయశ్చిత్తము చేసెను.

48. అహరోను చనిపోయినవారికి బ్రతికియున్నవారికి నడుమ నిలువబడగా అంటురోగము ఆగిపోయెను.

49. కోరా తిరుగుబాటువలన చచ్చినవారుకాక ఈ తెగులు వలన మడిసినవారు 14,700 మంది.

50. ఈ విధముగా అంటురోగము సమసిపోయిన పిదప అహరోను సాన్నిధ్యపుగుడారము ద్వారమునొద్దనున్న మోషేను తిరిగి కలసికొనెను.

1-2. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులు ఒక్కొక్క తెగకు ఒక్కొక్కటి చొప్పున మొత్తము పండ్రెండు చేతికఱ్ఱలను కొనిరావలెనని చెప్పుము. ఏ తెగకఱ్ఱమీద ఆ తెగ పేరు వ్రాయింపుము.

3. లేవీయ తెగ కఱ్ఱమీద అహరోను పేరు వ్రాయింపుము. ఏలయనగ పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కఱ్ఱయే ఉండవలెనుగదా!

4. ఈ కఱ్ఱలన్నింటిని సాన్నిధ్యపుగుడారమున నేను మిమ్ము కలసికొను మందసము ఎదుటపెట్టుడు.

5. అచట నేను ఎవరిని ఎన్నుకొందునో వాని కఱ్ఱ చిగురించును. యిస్రాయేలీయులు మీకు విరోధముగా గొణుగు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును” అని చెప్పెను.

6. మోషే ఈ సంగతిని యిస్రాయేలీయులకు తెలియజేయగా వారు తెగకు ఒక్క కఱ్ఱ చొప్పున మొత్తము పండ్రెండు కఱ్ఱలు కొనివచ్చిరి. అహరోను కఱ్ఱగూడ వానియందుగలదు.

7. మోషే వానిని అన్నిటిని సాన్నిధ్యపుగుడారమున దైవమందసము ఎదుటనుంచెను.

8. మరునాడు మోషే గుడారమునందు ప్రవేశించి చూడగా లేవీ తెగకు చెందిన అహరోను కఱ్ఱ చిగురించియుండెను.

9. అది చిగురించి, పూలు పూచి బాదముపండ్లు కాచెను. మోషే ఆ కఱ్ఱలన్నింటిని యిస్రాయేలు ప్రజలయొద్దకు కొనిపోయెను. వారు ఆ కఱ్ఱలను పరిశీలించి, ఎవరి దానిని వారు తీసికొనిరి.

10. ప్రభువు మోషేతో “అహరోను కఱ్ఱను సమావేశపు గుడారమున దైవమందసము ఎదుట ఉంచుము. అది తిరుగుబాటుదారులకు హెచ్చరిక సూచికముగా నుండును. అటులచేసిన వారు చావకుండునట్లు, వారి గొణుగుడు నాకు వినపడకుండా నీవు అణచి మాన్పివేసిన వాడవుదువు.

11. మోషే ప్రభువు చెప్పినట్లే చేసెను.

12. యిస్రాయేలీయులు మోషేతో “మేమిక సర్వనాశమైపోయెదము.

13. ప్రభుమందిరము దగ్గరికి వచ్చువారందరు చత్తురు. ఈ రీతిగా మేమందరము నాశమైపోవలెనా?” అని అనిరి.

 1. ప్రభువు అహరోనుతో ఇట్లనెను: “నీవును, నీ కుమారులును, నీతండ్రి కుటుంబపువారును పవిత్రస్థలపు పరిచర్యలో చోటుచేసుకున్న దోషములకు బాధ్యులగుదురు. కాని నీవును, నీ తనయులును మాత్రమే యాజకపరిచర్యలలో కలిగిన దోషములకు బాధ్యులు అగుదురు.

2. మీకు సాయము చేయుటకు మీ తండ్రి తెగవారు అనగా లేవీ తెగవారైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొనిరమ్ము. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును, నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట పరిచర్య చేయవలయును.

3. వారు నిన్నును, గుడారమంతటిని కాపాడుచుండవలయును. అయితే వారును, మీరును చావకుండునట్లు వారు పవిత్రస్థలమునందలి పాత్రములనుగాని, బలిపీఠమునుగాని తాకరాదు. తాకినచో నీవును, వారును చత్తురు.

4. వారు నీతో కలసి పనిచేయుచు సమావేశపు గుడారపు పరిచర్యలెల్ల చేయుదురు. కాని ఇతరులు మీచెంతకు రాకూడదు.

5. నీవును, నీ తనయులును మాత్రమే పవిత్ర స్థలమునకు, బలిపీఠమునకు పూచీపడవలయును. అప్పుడు నా కోపము యిస్రాయేలీయుల మీద రగుల్కొనదు.

6. నేను యిస్రాయేలీయులనుండి మీ సహోదరులైన లేవీయులను ఎన్నుకొని, వారిని నీకు కానుకగా ఇచ్చితిని. వారు నాకు అంకితులై సమావేశపు గుడారముయొక్క సేవలు చేయుదురు.

7. కాని బలిపీఠపు పరిచర్య విషయములో నీవును, నీ తనయులును, అడ్డతెర అవతలి పరిచర్య విషయములో నీవు మాత్రమే యాజకపరిచర్య చేయవలయును. నేను మీకు యాజకత్వమను వరమును ఇచ్చితిని గనుక ఈ పరిచర్య మీ బాధ్యత. ఇతరులు ఎవడైనను పవిత్ర స్థలమును సమీపించిన యెడల ప్రాణములు కోల్పోవును.”

8. ప్రభువు అహరోనుతో “యిస్రాయేలీయులు నాకు సమర్పించు భాగములు, కానుకలు అన్నియు నీవే. అవి నీకును, నీ సంతతి వారికిని దక్కునట్లు శాశ్వతనియమము చేయుచున్నాను.

9. పవిత్రములైన నైవేద్యములలో ఈ క్రిందివి నీకు లభించును. యిస్రాయేలీయులు అర్పించు ధాన్య సమర్పణములు, పాప పరిహార సమర్పణములు, ప్రాయశ్చిత్త సమర్పణములు అన్నియు నీకును, నీ కుమారులకును లభించును.

10. ఈ నైవేద్యములను మీరు భుజింపవచ్చును. ప్రతి పురుషుడు వానిని భుజింపవలెను. అది నీకు పవిత్రమైనది.

11. యిస్రాయేలీయులు నా ఎదుట అర్పించు అల్లాడింపు అర్పణలన్నియు మరియు ప్రత్యేక సమర్పణలన్నియు మీకే లభించును. మీ కుటుంబమున మైలపడని సభ్యులందరు వానిని భుజింపవచ్చును. ఇవి నీకు, నీ పుత్రులకు, నీ పుత్రికలకు లభించునట్లు శాశ్వత నియమము చేయుచున్నాను.

12. ఏటేట సమర్పించు శ్రేష్ఠములైన ఓలీవు, ద్రాక్ష, ధాన్య ప్రథమ ఫలములుకూడ మీకే లభించును.

13. ప్రభువునకు సమర్పించిన పంటలోని ప్రథమఫలములన్నియు మీకే దక్కును. మీ కుటుంబమున మైలపడని వారందరు వీనిని భుజింపవచ్చును.

14. ఇంకను శాపము పేర నాకు సమర్పింపబడిన వస్తువులు కూడ మీకే దక్కును.

15. యిస్రాయేలీయులు ప్రభువునకు సమర్పించు తొలికాన్పు శిశువునుగాని, పశువుల తొలియీత పిల్లగాని మీకే లభించును. కాని తొలికాన్పు శిశువుల కొరకును, అపవిత్ర పశువుల పిల్లలకొరకును డబ్బు సమర్పించి వానిని విడిపించుకొనిపోయెదరు.

16. వానికి నెలప్రాయము దాటిన తరువాత ఐదు వెండి నాణెములను చెల్లించి వానిని విడిపించుకొనిపోయెదరు. ఈ నాణెములు మందిర తులామానమునకు సరిపోవలెను.

17. కాని గోవు, గొఱ్ఱె, మేక వీని తొలిచూలు పిల్లలను మాత్రము ఇట్లు విడిపించుకొని పోరాదు. అవి నాకు చెందినవి కనుక వానిని బలిగా సమర్పింపవలెను. వాని నెత్తురును బలిపీఠముపై చల్లి, క్రొవ్వును బలిపీఠముపై వ్రేల్వవలెను. ఈ దహనబలి సువాసన నాకు ప్రీతిని కలిగించును.

18. వాని మాంసము మీకే లభించును. వాని రొమ్ము, కుడితొడ నా ఎదుట అల్లాడింపు అర్పణగా సమర్పింపబడును. అవి మీకే లభించును.

19. యిస్రాయేలీయులు నాకు సమర్పించు పవిత్ర అర్పణములన్నియు మీకే లభించునట్లు శాశ్వతనియమము చేయుచున్నాను. నీతోను, నీ సంతతివారితోను నా సన్నిధిన నేను చేసికొను శాశ్వతకట్టడ ఇది” అనెను.

20. మరియు ప్రభువు అహరోనుతో “మీకు ఏ భూమియు భుక్తమునకు లభింపదు. యిస్రాయేలీయుల భూమిలో మీకు భాగము లేదు. మీ భుక్తమును, మీ భాగమును నేనే అనుకొనుడు” అనెను.

21. యిస్రాయేలీయులు అర్పించుకొను దశమ భాగమును సమావేశపు గుడారమున పరిచర్య చేసినందులకు లేవీయులకు ఇచ్చితిని.

22. ఇకమీదట యిస్రాయేలీయులు సమావేశపు గుడారమున ప్రవే శింతురేని పాపముతగిలి తప్పకచత్తురు.

23. లేవీయులు సమావేశపు గుడారముయొక్క పరిచర్య చేయుదురు. వారి పరిచర్యదోషములకు వారే బాధ్యులు. ఇది మీకందరికి శాశ్వతనియమము. యిస్రాయేలీయుల మధ్య లేవీయులకు వారసత్వముండదు.

24. యిస్రాయేలీయులు నాకర్పించు దశమభాగము లేవీయుల వశమగును, కనుక వారికి వారసత్వమేమియు లేకుండచేసితిని.

25-26. ప్రభువు మోషేతో “నీవు లేవీయులతో ఇట్లు చెప్పుము. మీరు యిస్రాయేలీయుల నుండి దశమభాగము తీసికొనినపుడు మరల దానిలో దశమ భాగమును యాజకుడైన అహరోనునకు అర్పింపుడు.

27. మీరు అర్పించు ఈ దశమభాగము ప్రజలు సమర్పించు ధాన్యమునకు ద్రాక్షసారాయమునకు తుల్యమగును.

28. ఈరీతిగా మీరు యిస్రాయేలీయుల నుండి పొందెడి దశమభాగములన్నింటినుండి ప్రభువునకు కానుకగా సమర్పింతురు. దీనినుండి ప్రభువునకు అర్పించుకానుకగా మీరు యాజకుడైన అహరోనునకు అర్పింపుడు.

29. మీరు పొందెడి కానుకలలో నుండి ఉత్తమమైనవే ప్రభువునకు తిరిగి కానుకలర్పింపుడు.

30. ఈ రీతిగా మీరు వానిలో మేలిరకములైన వాటిని ప్రభువునకు అర్పింపగ మిగిలిన కళ్ళములోని ధాన్యము, గానుగ తొట్టిలోని ద్రాక్షారసము కర్షకుడికి చెందినట్లే మీకు అవి చెందినవని భావించుకొనుడు.

31. మీకు లభించిన భాగములను మీరును, మీ కుటుంబసభ్యులును ఎక్కడనైనను ఆర గింపవచ్చును. ఆ అర్పణములు గుడారమున మీరు చేసిన ఊడిగమునకు గాను మీకు లభించిన బత్తెములు.

32. ఆ కానుకలలోని ఉత్తమభాగములను ప్రభువు నకు అర్పించిన పిదప వానిని మీరు భుజించిన యెడల దోషములేదు. యిస్రాయేలీయులు అర్పించిన కానుకలను మీరు అపవిత్రము చేయరాదు. అపుడు మీరు ప్రభువు కోపమువలన నాశనము కారు” అని అనెను.

 1-2. ప్రభువు మోషే అహరోనులతో “యిస్రాయేలీయులకు ఈ క్రింది ఆజ్ఞలనిండు. ఇప్పటి వరకు కాడిని మోయనిదియు, ఎట్టి అవలక్షణములు లేనిదియునగు ఎఱ్ఱని ఆవు పెయ్యను ఒక దానిని కొనిరండు.

3. దానిని యాజకుడగు ఎలియెజెరునకు అర్పింపుడు. ఆ పెయ్యను శిబిరమువెలుపల అతని యెదుటనే వధింపవలెను.

4. ఎలియెజెరు దాని నెత్తురును కొనగోళ్ళతో సమావేశపు గుడారపువైపు ఏడుసార్లు చిలుకరింపవలెను.

5. చర్మము, మాంసము, నెత్తురు, ప్రేవులతో పాటు ఆ పెయ్యను యాజకుని ముందటనే పూర్తిగా కాల్చివేయవలెను.

6. అతడు దేవదారు కొయ్యను, నెత్తురు చిలుకరించు హిస్సోపు మండను, ఎఱ్ఱనినూలును తీసికొని ఆ పెయ్యను కాల్చుచున్న నిప్పులో పడవేయవలెను.

7. అటు పిమ్మట అతడు తన బట్టలు ఉతుకుకొని తలస్నానము చేసి శిబిరమునకు వెళ్ళిపోవచ్చును. అయినను అతడు సాయంకాలమువరకు మైలపడియుండును.

8. ఆవు పెయ్యను దహనము చేసినవాడు కూడ తన బట్టలు ఉతుకుకొని తలస్నానము చేయవలెను. అతడు కూడ సాయంకాలము వరకు మైలపడియుండును.

9. శుద్ధుడైన నరుడు ఒకడు దహింపబడిన ఆ ఆవు పెయ్య బూడిదను ప్రోగుజేసి శిబిరమునకు వెలుపల ఒక శుభ్రమైన స్థలమున ఉంచవలెను. యిస్రాయేలీయులలో మైలపడిన వారిని శుద్ధిచేయుటకై పాపపరిహార జలముగా వారికొరకు దానిని పదిలపరుపవలెను. నరులను పాపమునుండి శుద్ధిచేయుటకై ఇట్లు చేయవలెను.

10. ఆవు పెయ్య బూడిదను ప్రోగుచేసిన వాడు తన బట్టలు ఉదుకుకోవలెను. కాని అతడు సాయంకాలము వరకు మైలపడియుండును. యిస్రాయేలీయులకు గాని వారితో జీవించు పర దేశీయులకు గాని ఈ నిత్యమైనకట్టడ కలకాలము వర్తించును.

11. శవమును ముట్టుకొనినవాడు ఏడురోజుల వరకు మైలపడియుండును.

12. అతడు మూడవ దినమునను మరియు ఏడవ దినమునను శుద్ధీకరణ జలముతో శుద్ధి చేసుకొనినపిదప శుద్ధినొందును. అటుల చేయనివారు శుద్ధినొందరు.

13. శవమును ముట్టుకొని శుద్ధిచేసికొనని వారు ప్రభుమందిరమును మైలపరుతురు. శుద్ధీకరణ జలము వారిమీద చిలుకరింపబడలేదు. కనుకవారిని సమాజము నుండి వెలివేయవలెను, వారిమైల వారిని వదలదు.

14. మీ గుడారమునందు ఎవరైనను చనిపోయినపుడు అక్కడ ఉన్నవారును, అందు ప్రవేశించువారును ఏడుదినములవరకు మైలపడుదురు.

15. ఆ గుడారమున ఉన్న పాత్రలు మూతవేయబడక తెరిచియున్నచో అవియును మైలపడిపోవును.

16. వెలుపలి పొలమున ఎవరైనను మృతదేహమును గాని, హతునిదేహమును గాని, మృతుల ఎముకలనుగాని, సమాధులను గాని ముట్టుకొనినచో ఏడుదినములవరకు మైలపడుదురు.

17. ఇటువంటిమైలను తొలగింపవలెనన్న పాపపరిహారముగా దహనము చేయబడిన ఆవు పెయ్య బూడిదను. తీసికొని ఒక మట్టిపాత్రలో ఉంచి పారుచున్న యేటినీరును దానిలో పోయవలెను.

18. అంతట మైలసోకని నరుడొకడు ఆ నీటిలో హిస్సోపు మండలను ముంచి గుడారముమీదను, దానిలోని నరులమీదను, కుండలమీదను చిలుకరింపవలెను. మృతదేహమునుగాని, హతుని దేహమునుగాని, ఎముకలనుగాని, సమాధులనుగాని ముట్టుకొని మైలపడిన వానిమీదగూడ ఆ నీటిని చిలుకరింపవలెను.

19. పవిత్రుడొకడు మైలసోకిన వానిమీద మూడవ దినమున, ఏడవదినమున నీళ్ళు చిలుకరింపవలెను. అతడు ఏడవదినమున శుద్దుడగును. అతడు బట్టలు ఉతుకుకొని స్నానముచేసిన పిదప సాయంకాలమున శుద్దుడగును.

20. మైలసోకినవారు. ఈ రీతిగా శుద్ధిచేయించుకొనని యెడల వారిని సమాజమునుండి వెలివేయవలెను. లేదేనివారు ప్రభుని గుడారమును మైలపరతురు. వారిమీద శుద్ధీకరణ జలము చిలుకరింపబడలేదు కదా! కనుక వారు అపవిత్రులు.

21. ఇది. మీకు శాశ్వతనియమముగా ఉండవలెను. శుద్ధీకరణ జలము చిలుకరించువాడు , తన బట్టలు ఉతుకుకొనవలెను. ఈ జలములు ముట్టు కొనినవాడు సాయంకాలమువరకు మైలపడియుండును.

22. మైలపడినవాడు ముట్టుకోనిన వస్తువులును మైలపడిపోవును. ఆ వస్తువులను ముట్టుకొనినవారును మైలపడిపోవుదురు” అనెను.

 1. యిప్రాయేలు సమాజము మొదటి నెలలో సీను ఎడారి చేరి కాదేషున శిబిరము షన్నెను. అక్కడ మిర్యాము చనిపోగా యిస్రాయేలీయులు ఆమెను పాతిపెట్టిరి.

2. అచట ప్రజలకు నీళ్ళు లభింపలేదు. వారు గుమిగూడి వచ్చి మోషేపై, అహరోనుపై తిరుగబడిరి.

3. వారు మోషేతో “నాడు మా సోదరులు ప్రభువు గుడారము ముందట నాశనమైపోయినపుడు. మేము కూడ వారితోపాటు చచ్చియుండవలసినది.

4. నీవు ప్రభువు ప్రజలను ఇక్కడికి తోడ్కొనిరానేల? మేమును, మా పశువులును చచ్చుటకేగదా?

5. నీవు మమ్ము ఐగుప్తునుండి తరలించుకొనిరానేల? ఈ పాడునేలకు చేర్చుటకొరకేనా? ఇచట ధాన్యము, అత్తిపండ్లు, ద్రాక్షపండ్లు, దానిమ్మపండ్లు లభింపవాయె! అసలు త్రాగుటకు చుక్కనీళ్ళయిన దొరుకుటలేదే” అని గొణగుకొనిరి.

6. మోషే అహరోనులు.ప్రజలను వీడి సాన్నిధ్యపు గుడారము ఎదుటికి వచ్చి నేలపై బోరగిలబడిరి. అపుడు ప్రభు సాన్నిధ్యపు ప్రకాశము వారికి గోచరించెను.

7. ప్రభువు మోషేతో మాట్లాడెను.

8. “నీవు నీ కఱ్ఱను తీసికొనుము. నీవును, నీ సహోదరుడైన అహరోను ప్రజలను సమావేశపరుపుడు. వారందరు చూచుచుండగా ఆ ఎదుటనున్న బండతో మాట్లాడుము. అది నీళ్ళిచ్చును. ఈ రీతిగా నీవు బండనుండి నీళ్ళు పుట్టింపుము. ఈ ప్రజలు, వారి పశువులు ఆ నీళ్ళు త్రాగవచ్చును” అనెను

9. ప్రభువు ఆజ్ఞాపించినటులనే మోషే ప్రభు సాన్నిధ్యమునుండి ఆ కఱ్ఱను తీసికొనెను.

10. మోషే అహరోనులు ప్రజలను బండయెదుట ప్రోగుజేసిరి. మోషే వారితో “ద్రోహులారా! మేము మీకు బండ నుండి నీళ్ళు పుట్టింపవలెనా?” అనెను.

11. అంతట మోషే తన చెయ్యినెత్తి కఱ్ఱతో రెండు సార్లు బండను. మోదగా దానినుండి జలము పుష్కలముగా వెలువడెను. ప్రజలు, పశువులు ఆ నీళ్ళు త్రాగిరి.

12. అప్పుడు ప్రభువు మోషే అహరోనులను మందలించి “యిస్రాయేలు ప్రజలకన్నుల యెదుట నా పవిత్రతను మీరు విశ్వసించరైరి. కనుక నేను వాగ్దానముచేసిన భూమికి మీరు వీరిని నడిపించుకొని పోలేరు” అనెను.

13. ఈ సంఘటన మెరిబా వద్ద జరిగెను. అచట యిస్రాయేలీయులు ప్రభువుతో వాదులాడిరి. ప్రభువు వారి ఎదుట తన పవిత్రతను వెల్లడిచేసెను.

14. మోషే కాదేషునుండి ఎదోమురాజు వద్దకు దూతలను పంపెను.

15. 'ఎదోము రాజునకు నీ సోదరులగు యిస్రాయేలీయులు పంపువర్తమానము: మేము ఎన్ని కష్టములపాలయితిమో నీకు తెలియును. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి. అచ్చట మేము చాన్నాళ్ళు వసించితిమి. కాని ఐగుప్తీయులు మా పితరులను, మమ్ములను పెట్టరానిబాధలు పెట్టిరి.

16. మేము ప్రభువునకు మొర పెట్టితిమి. ఆయన మా మనవిని ఆలించి ఐగుప్తునుండి మమ్ము తరలించుకొని వచ్చుటకై ఒక దూతను పంపెను. కనుక మేము నీ పొలిమేరలలోనున్న కాదేషునొద్దకు వచ్చి చేరితిమి.

17. మమ్ము నీ దేశముగుండ ప్రయాణము చేయనిమ్ము. మేము మీ పొలములకు, ద్రాక్షతోటలకు అడ్డముగా పడిపోము. మీ బావులలోని నీరు ముట్టు కోము. వేయేల, నీ పొలిమేరలు దాటువరకు మా పశువులును, మేమును రాజమార్గమునుండి బెత్తెడైనను వైదొలగము” అని చెప్పి పంపెను.

18. కాని ఎదోము రాజు "మీరు మా దేశముమీదుగా ప్రయాణము చేయరాదు, చేసెదరేని మేము మిమ్ము కత్తితో ఎదిరింతుము” అని సమాధానము పంపెను.

19. యిస్రాయేలీయులు మరల “మేము రాజమార్గము నుండి వైదొలగము. మా పశువులు కాని, మేముగాని మీ నీళ్ళు ముట్టు కొందుమేని మీకు పన్ను చెల్లింతుము. మీ దేశము గుండ మమ్ము కాలినడకన సాగిపోనిండు. మాకు ఈ మాత్రము అనుమతినిచ్చినచాలు” అని కబురంపిరి. 

20. ఎదోమురాజు మరల “మీరు మా దేశమున అడుగు పెట్టరాదు” అని సమాధానము పంపెను. పైపెచ్చు ఎదోమీయులు పెద్దదండుగా గుమిగూడి యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చిరి.

21. ఈ రీతిగా ఎదోము అడ్డుతగిలినందున యిస్రాయేలీయులు వైదొలగి మరియొక మార్గము పట్టిరి.

22. యిస్రాయేలు సమాజము కాదేషు నుండి బయలు దేరి ఎదోము పొలిమేరలలో ఉన్న హోరు పర్వతము చేరెను.

23. అచట ప్రభువు మోషే అహరోనులతో మాట్లాడెను. 

24. “మీరిరువురు మెరిబా వద్ద నామాట పాటింపలేదు. కనుక నేను యిస్రాయేలీయులకు ఇచ్చెదననిన భూమిని అహరోను చేరుకోజాలడు. అతడు ఇక్కడనే చనిపోయి తన పూర్వులను కలిసికొనును.

25. అహరోనును, అతని కుమారుడు ఎలియెజెరును, హోరు కొండ మీదికి కొనిరమ్ము.

26. ఆ కొండమీద అహరోను యాజక వస్త్రములను తొలగించి వానిని అతని కుమారునికి తొడుగుము. అహరోను అక్కడనే కన్నుమూయును” అని చెప్పెను.

27. మోషే ప్రభువు చెప్పినట్లే చేసెను. సమాజమంతయు చూచుచుండగా వారు హోరు కొండమీదికి ఎక్కిపోయిరి.

28. మోషే అహరోనునుండి యాజక వస్త్రములను తొలగించి ఎలియెజెరునకు తొడిగెను. అహరోను ఆ కొండమీదనే ప్రాణము విడిచెను. మోషే, ఎలియెజెరులు కొండమీదినుండి దిగివచ్చిరి.

29. అహరోను చనిపోయెనని విని యిస్రాయేలు సమాజమంతయు అతనికొరకు ముప్పది రోజులు విలపించెను.

 1. కనాను మండలము దక్షిణ భాగమును పరిపాలించు కనానీయుడైన అరాదురాజు యిస్రాయేలీయులు అతారీము మీదుగా వచ్చుచున్నారని వినెను. అతడు వారిని ఎదుర్కొని కొందరిని చెర పట్టెను.

2. యిస్రాయేలీయులు ప్రభువునకు విన్నపము చేసి “నీవు ఈ ప్రజలను మా వశము చేసెదవేని మేము వీరి పట్టణములను శాపముపాలు చేసెదము” అని మ్రొక్కుకొనిరి.

3. ప్రభువు యిస్రాయేలీయుల మొరాలించి కనానీయులను వారివశము చేసెను. యిస్రాయేలీయులు వారిని వారి పట్టణములను సర్వనాశనము గావించిరి. కనుక ఆ తావునకు 'హోర్మా'' అని పేరు వచ్చెను.

4. యిస్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమును చుట్టిపోవలెనని రెల్లు సముద్రము త్రోవవెంట పయనమైపోయిరి. కాని ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోషేమీదను, దేవునిమీదను తిరుగబడిరి.

5. "నీవు మమ్ము ఐగుప్తునుండి తరలించుకొనిరానేల? ఈ ఎడారిలో చంపుటకే గదా! ఇచట అన్నపానీయములు ఏమియు లభించుటలేదు. ఈ రుచిపచిలేని ఈ ఆహారము మాకు అసహ్యమైనది” అని గొణగుకొనిరి.

6. అపుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటువలన ప్రజలు చాలమంది మరణించిరి.

7. అంతట వారు మోషే వద్దకు వచ్చి “మేము నీకును, దేవునికిని ఎదురుమాట్లాడి తప్పుచేసితిమి. నీవు ప్రభువునకు విన్నపముచేసి ఈ పాములబెడద తొలగింపుము” అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవిచేసెను.

8. ప్రభువు మోషేతో “తాపకరమైన సర్పమువంటి రూపమునుచేసి, గడెమీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు” అని చెప్పెను.

9. కనుక మోషే కంచుసర్పముచేసి, గడె కఱ్ఱ మీద తగిలించెను. పాము కరచినవారు ఆ కంచుసర్పమును చూచి చావును తప్పించుకొనిరి.

10. యిస్రాయేలీయులు ప్రయాణము సాగించి ఓబోతు దగ్గర విడిదిచేసిరి.

11. అచటినుండి కదలి మోవాబీయుల మండలమునకు తూర్పున ఈయ్యె - అబారీము వద్ద శిబిరము పన్నిరి.

12. అచటినుండి బయలుదేరి సేరెదు లోయలో విడిదిచేసిరి.

13. అచటినుండి కదలి అర్నోను నదికి ఉత్తరమున దిగిరి. ఈ ఎడారిభాగము అమోరీయుల సీమవరకు పోవును. అర్నోను నది మోవాబీయులకు, అమోరీయులకు మధ్యనుండు సరిహద్దు.

14-15. కనుకనే “ప్రభువు యుద్ధములు" అను గ్రంథమున “సూఫా మండలము లోని వాహెబు పట్టణమును, అర్నోను లోయలోని ఆరు పట్టణము వరకును, మోవాబు సీమ వరకును వ్యాపించియున్న లోయ అంచున ప్రవహించు యేరుల మడుగులను పట్టుకొనెను” అనుమాట పేర్కొనబడి యున్నది.

16. అక్కడి నుండి కదలి యిస్రాయేలీయులు బెయేరు' కు వెళ్ళిరి. అక్కడ ప్రభువు మోషేతో "ప్రజలను ప్రోగుచేయుము. నేను వారికి జలమును ఇచ్చె దను” అని చెప్పెను.

17-18. అపుడు యిస్రాయేలీయులు ఈ విధముగా పాటపాడిరి. “బావినిగూర్చి పాటపాడుడు, ఉబికే ఊటకు గానము చేయుడు. ఆ ప్రజానాయకులు బావిని త్రవ్విరి, దొరలు నూతిని త్రవ్విరి. రాజదండముతో, చేతి కఱ్ఱలతో వారు నూతిని త్రవ్విరి”.

19. అంతటవారు ఆ ఎడారినుండి మట్టానాకును, అక్కడినుండి నహాలియేలుకును, అక్కడినుండి బామోతునకును ప్రయాణము చేసిరి.

20. మోవాబీయుల సీమయందలి లోయలోనున్న బామోతునుండి ఎడారికి ఎదురుగానున్న పికొండపైకి చేరిరి.

21-22. యిస్రాయేలీయులు, అమోరీయుల రాజగు సీహోను నొద్దకు దూతలను పంపి, “మమ్ము మీ దేశముగుండ ప్రయాణము చేయనిండు. మేము మీ పొలములలోను, ద్రాక్షతోటలలోను అడుగు పెట్టము. మీ నూతులనుండి నీళ్ళు త్రాగము. మీ పొలి మేరలు దాటువరకు రాజమార్గమునుండి బెత్తెడైనను కదలము” అని వర్తమానము పంపిరి.

23. కాని సీహోను యిస్రాయేలీయులు తన దేశముగుండ ప్రయాణము చేయుటకు అంగీకరింపలేదు. అతడు తన జనమును ప్రోగుజేసికొని వచ్చి ఎడారిలోనున్న యాహాసు వద్ద యిస్రాయేలీయులను ఎదిరించెను.

24. యిస్రాయేలీయులు అమోరీయులను చాలమందిని మట్టుబెట్టిరి. అర్నోను నది నుండి యబ్బోకు వరకు, అమ్మోనీయుల సరిహద్దుననున్న యాసేరు వరకు అమోరీయుల రాష్ట్రమును ఆక్ర మించుకొనిరి. అమ్మోనీయుల సరిహద్దు కట్టుదిట్టమైనది.

25. ఈరీతిగా యిస్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నింటిని జయించిరి. హెష్బోనును దాని సమీపముననున్న నగరములను వశము చేసికొనిరి. ఆ పట్టణములందును చుట్టుప్రక్కల గ్రామములందును వసించిరి.

26. హెష్బోను అమోరీయరాజగు సీహోనునకు రాజధాని. అతడు మోవాబీయుల రాజును ఓడించి అర్నోను నది వరకు ఆ రాజు రాజ్యమును ఆక్రమించుకొనెను.

27. కనుకనే సామెతలు వల్లించు వారు ఈ క్రింది రీతిగా పాడిరి. “సీహోను రాజధాని హెష్బోనునకు రండు, దానిని మరల నిర్మింతము.

28. ఈ నగరము నుండి సీహోను సైన్యము అగ్నివలె వెడలెను. ఆ నిప్పు మోవాబులోని ఆరు పట్టణమును కాల్చివేసెను. అర్నోను కొండలను మసిచేసెను.

29. కేమోషును ఆరాధించు మోవాబీయులారా! మీకు వినాశనము దాపురించినది! మీరు కొలుచు దేవుడు మీ స్త్రీ పురుషులను అమోరీయ రాజైన సీహోనునకు చెరపట్టిన వారినిగా చేసెను.

30. హెష్బోను నుండి దీబోను వరకు నాషీము నుండి మేడెబా దాపునగల నోఫావరకు నిప్పుమంటలు వ్యాపింపగా అందరును సర్వనాశనమైరికదా!”

31. యిస్రాయేలీయులు అమోరీయుల రాష్ట్రమున స్థిరపడిరి.

32. మోషే యాసేరు. పట్టణమునకు వేగులవాండ్రను పంపెను. యిస్రాయేలీయులు ఆ పట్టణమును దాని పరిసరములందున్న పురములను జయించి అక్కడ వసించుచున్న అమోరీయులను వెడలగొట్టిరి.

33. అటుపిమ్మట యిస్రాయేలీయులు బాషాను మార్గమును పట్టిపోయిరి. బాషాను రాజు ఓగు తన జనముతో వచ్చి ఎద్రేయివద్ద యిస్రాయేలీయులను ఎదిరించెను.

34. ప్రభువు మోషేతో “భయపడకుము. ఈ రాజును, ఇతని జనమును, ఇతని దేశమును నీ వశము చేసితిని. హెష్బోనున వసించిన అమోరీయుల రాజు సీహోనును వలె ఇతనిని గూడ అణచివేయుడు” అని చెప్పెను.

35. యిస్రాయేలీయులు ఓరు. రాజును అతని కుమారులను, అతని ప్రజలను సంహరించిరి. వారి రాజ్యమును ఆక్రమించుకొనిరి.

 1. అంతట యిస్రాయేలీయులు అచటినుండి కదలిపోయి మోవాబు మైదానమున విడిదిచేసిరి. ఈ తావు యోర్దానుకు తూర్పున, యెరికోకు ఎదుటివైపున కలదు.

2. యిస్రాయేలీయులు అమోరీయులను చిదుకకొట్టిరని విని సిప్పోరు కుమారుడగు బాలాకు మరియు అతని ప్రజలగు మోవాబీయులు భయపడిపోయిరి.

3. యిస్రాయేలీయుల సంఖ్యను చూచివారు మిక్కిలి జడిసిరి.

4. మోవాబీయులు మిద్యాను పెద్దలతో “ఎద్దు పొలములోని గడ్డిని మొదలంటా నాకివేసినట్లే ఈ యిస్రాయేలీయుల గుంపు మనమండలమును ధ్వంసము చేసితీరును” అనిరి. ఆ కాలమున సిప్పోరు కుమారుడగు బాలాకు మోవాబునకు రాజు.

5. అతడు బెయోరు కుమారుడగు బిలామును పిలుచుకొనివచ్చుటకై దూతలను పంపెను. బిలాము యూఫ్రటీసు నదీతీరమునగల మండలములోని తన జనులమధ్య పేతోరున వసించు చుండెను. “ఐగుప్తునుండి వచ్చినవారు నేల యీనినట్లు దేశమంతట వ్యాపించిరి. వారు నా మండలమును మ్రింగివేయ చూచుచున్నారు.

6. వారు మా కంటె బలవంతులు. కనుక నీవు వచ్చి నామేలుకోరి వీరిని శపింపవలయును. అటుల శాపముపాలయిన వారిని మేము జయించి వెడలగొట్టగలుగుదుమేమో. నీవు దీవించిన వారు దీవెనను, శపించిన వారు శాపమును పొందుదురని నేనెరుగుదును. చిత్తగించగలరు!" అని బాలాకు దూతలతో వర్తమానము పంపెను.

7. మోవాబు నాయకులు, విద్యానునాయకులు సోదె చెప్పినందుకు చెల్లింపవలసిన సొమ్ము తీసికొని పయనమై వచ్చిరి. వారు, బిలాము చెంతకు వచ్చి బాలాకు వర్తమానమును వినిపించిరి.

8. అతడు వారితో "మీరీరాత్రి ఇచటనే బసచేయుడు. ప్రభువు నాకు తెలియచేసిన విషయమును నేను మీకు తెలుపుదును” అనెను. కనుక మోవాబు అధికారులు బిలాము ఇంటనే విడిదిచేసిరి.

9. బిలామునకు దేవుడు ప్రత్యక్షమై "మీ యింటికి వచ్చిన యీ జనులు ఎవరు?” అని ప్రశ్నించెను.

10-11. బిలాము “ప్రభూ! ఐగుప్తునుండి వచ్చిన క్రొత్త ప్రజలు నేల యీనినట్లు దేశమంతటవ్యాపించిరి. నీవు వచ్చి నా మేలు గోరి వారిని శపింపవలయును. అట్లు శాపము పాలయిన వారిని మేము. జయించి వెడలగొట్ట గలుగుదుమేమో అని సిప్పోరు కుమారుడగు బాలాకు నాకు వర్తమానము పంపెను” అని చెప్పెను.

12. దేవుడు అతనితో “నీవు వీరితో పోవలదు. ఆ ప్రజలు నా వలన, దీవెనపొందిరి కావున నీవు వారిని శపింపరాదు” అని చెప్పెను.

13. కనుక మరునాటి ఉదయమున బాలాకు పంపిన అధికారులను చూచి, బిలాము “మీరు మీ దేశమునకు వెడలిపొండు. నన్ను మీ వెంటపంపుటకు ప్రభువు సమ్మతింపలేదు" అనెను.

14. కనుక మోవాబు అధికారులు బాలాకు వద్దకు తిరిగిపోయి బిలాము మా వెంటవచ్చుటకు అంగీకరింప లేదని తెలియజేసిరి.

15. బాలాకు పూర్వము కంటె గూడ గొప్పవారిని, మరి ఎక్కువమంది అధికారులను ఎన్నుకొని బిలాము నొద్దకు పంపెను.

16. వారు బిలాము ఇంటికి వచ్చి “నీవు నా వద్దకు వచ్చుటకు నిరాకరింపవలదు.

17. నేను నిన్ను ఘనముగా సన్మానించెదను. నీవేమి చేయుమన్నను చేసెదను. నీవు మాత్రము ఇచటికివచ్చి నా మేలుగోరి ఈ ప్రజలను శపింపవలయును” అని సిప్పోరు కుమారుడు బాలాకు పంపిన వర్తమానమును అతనికెరిగించిరి.

18. బిలాము వారితో “బాలాకు తన యింట నున్న వెండిబంగారములను త్రవ్వి నా నెత్తిని పెట్టినను, నేను దేవుడైన ప్రభువుమాట మీరి ఒక చిన్నపనియైనను చేయజాలను.

19. మునుపు వచ్చినవారివలె మీరును ఈ రాత్రికి ఇక్కడనే బసచేయుడు. ప్రభువు నాకేమైన తెలియజెప్పునేమో చూతము” అనెను.

20. ప్రభువు ఆ రాత్రి బిలామునకు ప్రత్యక్షమై "ఈ ప్రజలు నిన్ను పిలువవచ్చినచో నీవు వారివెంట వెళ్ళవచ్చును. కాని నేను నీతో చెప్పిన మాట ప్రకారమే నీవు చేయవలెను” అని చెప్పెను.

21. బిలాము ఉదయముననే లేచి తన గాడిదమీద జీను బిగించి మోవాబు అధికారులతో పయనమై వెళ్ళెను.

22. బిలాము తన గాడిదనెక్కి పోవుటను చూచి దేవుడు కోపపడెను. బిలాము తన సేవకులిద్దరిని వెంటనిడుకొని గాడిదనెక్కి పోవుచుండగా అతనిని ఆపుటకై ప్రభువుదూత త్రోవకడ్డముగా నిలిచెను.

23. ప్రభువుదూత కత్తిచాచి నిలబడి ఉండుట చూచిన ఆ గాడిద మార్గమునుండి వైదొలగి ప్రక్క పొలములోనికి పోయెను. బిలాము గాడిదను కఱ్ఱతో మోది మరల త్రోవకు మరలించెను.

24. రెండు ద్రాక్షతోటలకు నడుమ రెండు రాతిగోడలనడుమ మార్గము ఇరుకుగానున్నచోట ప్రభువుదూత గాడిదకు అడ్డముగా నిలిచెను.

25. ప్రభువుదూతను చూచి గాడిద గోడకు అదుముకొని పోగా బిలాము కాలు గోడను రాచుకొనిపోయెను. బిలాము మరల గాడిదను మోదెను.

26. ప్రభువుదూత ముందుకుకదలి మార్గము కుడి ఎడమలకు తప్పుకోలేనంత యిరుకుగా ఉన్న తావున గాడిదకు అడ్డముగా నిలబడెను.

27. గాడిద ఎదుటనున్న ప్రభువుదూతను చూచి నేలమీద చతికిలపడెను. బిలాము ఉగ్రుడై చేతికఱ్ఱతో దానిని చావ మోదెను,

28. అపుడు ప్రభువు గాడిదచే మాటలాడింపగా అది “నేను నీకేమి అపకారము చేసితిని? నన్నీరీతిని మూడుసారులు చావగొట్టనేల?” అని అడిగెను.

29. బిలాము దానితో “నీవు నన్ను గేలి చేయుచున్నావు. నా చేతిలోనే కత్తియున్న నిన్నీ పాటికి నరికివేసియుండెడి వాడను” అనెను.

30. గాడిద అతనితో “నేను నీవు ఇంతకాలమునుండి ప్రయాణమునకు వాడుకొనిన గాడిదను కానా? కాని నేనెప్పుడైనను ఈ విధముగా ప్రవర్తించితినా?” అని అడిగెను. అతడు “లేదు” అనెను.

31. అపుడు ప్రభువు బిలాము కన్నులు తెరచెను. అతడు కత్తినిదూసి త్రోవకెదురుగా నిలబడియున్న ప్రభువుదూతను జూచి నేలమీద బోరగిలపడెను.

32. ప్రభువుదూత అతనితో “నీవు గాడిదను ముమ్మారు చావమోదితివేల? నేను నీ త్రోవకు అడ్డుపడవచ్చితిని. నీ ప్రయాణము నాకు సమ్మతముకాదు.

33. నీ గాడిద నన్ను జూచి మూడుసార్లు తప్పుకొన్నది. కాదేని నేనీపాటికి నిన్నుచంపి, గాడిదను వదలివేసి యుండెడి వాడను” అనెను.

34. ప్రభువుదూతతో బిలాము “నేను తప్పుచేసితిని. నీవు నాకు అడ్డముగా నిలబడితివని నేను గుర్తింపలేదు. ఇపుడు నీవు వెళ్ళవద్దంటే నేను వెనుకకు తిరిగి పోయెదను” అనెను.

35. ప్రభువుదూత అతనితో “నీవు వీరితో వెళ్ళవచ్చును. కాని నీవు నేను చెప్పిన మాటలను మాత్రమే పలుకవలెను” అనెను. కనుక బిలాము బాలాకు పంపిన అధికారులతో సాగిపోయెను.

36. బిలాము వచ్చుచున్నాడని విని బాలాకు అతనికి ఎదురువెళ్ళెను. మోవాబు పొలిమేరలలో అర్నోను నదీతీరముననున్న ఆరు పట్టణమువద్ద అతడు బిలామును కలిసికొనెను.

37. బాలాకు అతనితో “నేను దూతలను పంపగా నీవు రానననేల? నేను నిన్ను ఘనముగా సన్మానింపలేననుకొంటివా?” అనెను.

38. బిలాము అతనితో “ఇపుడు వచ్చితిని గదా! ఏదైన చెప్పుటకు నాకు శక్తికలదా? నేను దేవుడు పలికించు పలుకులను మాత్రమే పలికెదనుసుమా!" అనెను.

39. బిలాము బాలాకుతో కలసి కిర్యతుహుజోతు చేరెను.

40. బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలి అర్పించెను. బిలామునకు అతనితోనున్న అధికారులకు బలిమాంసమును పంపెను. "

41. మరునాడు బాలాకు బిలామును బామోతు బాలు యొక్క ఎత్తైన స్థలముల మీదకు కొనివచ్చెను. అక్కడి నుండి బిలాము యిస్రాయేలు సైన్యము చిట్ట చివరి భాగము వరకునున్న జనులను చూడవలెనని అతడిని అక్కడికి ఎక్కించెను.

 1. బిలాము బాలాకుతో “ఇక్కడ నాకొరకకు ఏడు పీఠములు నిర్మించి ఏడుఎడ్లను, ఏడుపొట్టేళ్ళను కొనిరమ్ము” అనెను.

2. బాలాకు అట్లే చేసెను. బాలాకు మరియు బిలాము ఒక్కొక్క పీఠముమీద ఒక్కొక్క ఎద్దును ఒక్కొక్క పొట్టేలును దహనబలిగా సమర్పించిరి.

3. అతడు బాలాకుతో “నీవు ఈ దహనబలుల యొద్దనే యుండుము. నేను వెళ్ళి ప్రభువు దర్శనమిచ్చునేమో చూచివచ్చెదను. ప్రభువు నాతో చెప్పినమాట నేను నీకు తెలియజెప్పెదను” అని పలికి తాను చెట్టుచేమలులేని ఒక కొండమీదికి ఎక్కిపోయెను.

4. దేవుడు బిలామునకు ప్రత్యక్షముకాగా అతడు “నేను నీకు ఏడుపీఠములు కట్టి ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క ఎద్దును ఒక్కొక్క పొట్టేలును బలి యిచ్చితిని” అనెను.

5. ప్రభువు తన వాక్కును బిలాము నోట ఉంచి “నీవు వెళ్ళి బాలాకుకు నా సందేశమును వినిపింపుము” అని చెప్పెను.

6. బిలాము తిరిగి పోయిచూడగా బాలాకు, మోవాబీయ అధికారులు దహనబలి చెంతనే వేచియుండిరి.

7. బిలాము వారికి దైవవాక్కును ఉపమాన రీతిగా ఇమెరిగించెను: “మోవాబురాజగు బాలాకు ఆరాము నుండి తూర్పుకొండలనుండి నన్ను పిలిపించెను. అతడు 'రమ్ము! నామేలుకోరి  యాకోబును శపింపుము.  యిస్రాయేలు ప్రజలను దూషింపుము' అనెను.

8. కాని దేవుడు శపింపనివారిని నేనెట్లు శపింతును? దేవుడు దూషింపనివారిని నేనెట్లు దూషింతును?

9. నేను కొండకొమ్మునుండి యిస్రాయేలును చూచితిని. కొండలమీదినుండి వారి పొడగంటిని. ఆ ప్రజలు ఒక ప్రత్యేక జాతిగా మనువారు. వారికి ఇతర జాతులకు సాటిలేదు.

10. యాకోబు సంతతి భూరేణువుల వంటిది. యిస్రాయేలు సంఖ్య లెక్కలకు అందనిది. నేను నీతిమంతునివలె మరణింతునుగాక! నా అంత్యము వారిఅంత్యమువలె ఉండునుగాక!”

11. బాలాకు బిలాముతో “నీవు ఎంతపని చేసి తివి! నా శత్రువులను శపించుటకై నిన్నిచటకు పిలిపించితిని. కాని నీవు వారిని దీవించితివి” అనెను.

12. బిలాము అతనితో “ప్రభువు నా నోట ఉంచిన దానినే నేను తు.చ.తప్పక పలుకవలదా?” అని ప్రత్యుత్తరమిచ్చెను.

13. బాలాకు అతనితో “ఇంకొక తావునకు వెళ్ళుదము రమ్ము. అక్కడినుండి చూచినచో యిస్రాయేలీయులు అందరు కనిపింపరు, వారి చిట్ట చివరిభాగము మాత్రమే కనబడును. అచటినుండి నా కొరకు నీవు యిస్రాయేలీయులను శపింపవచ్చును” అనెను.

14. అతడు బిలామును' పిస్గా కొండమీది సోఫీము మైదానమునకు కొనిపోయెను. అక్కడను ఏడు పీఠములను గట్టి ఎడ్లను పొట్టేళ్ళలను దహనబలిగా సమర్పించెను.

15. బిలాము బాలాకుతో “నీవు ఈ బలుల వద్ద వేచియుండుము. నేను వెళ్ళి ప్రభువును కలసికొనివచ్చెదను” అనెను.

16. బిలామునకు దేవుడు ప్రత్యక్షమై తనవాక్కును అతనినోట ఉంచి “నీవు వెళ్ళి బాలాకుకు నా సందేశము వినిపింపుము” అనెను.

17. బిలాము తిరిగివచ్చి చూడగా బాలాకు, మోవాబు అధికారులు దహనబలిచెంతనే వేచియుండిరి. బాలాకు “దేవుడు నీతో ఏమి చెప్పెను?” అని అడిగెను.

18. బిలాము దైవవాక్కును ఉపమానరీతిగా ఇట్లేరిగించెను. “సిప్పోరు కుమారుడవగు బాలాకూ! నా పలుకులు సావధానముగా వినుము.

19. దేవుడు అసత్యమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపము పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన మాటయిచ్చి పనిచేయకుండునా? చేసిన ప్రమాణము నిలబెట్టుకొనకుండునా?

20. దేవుడు వారిని దీవింపుమనెను. దేవుడు దీవెనలను నేను కాదనగలనా?

21. యిస్రాయేలీయులకు ఏ ఆపదయు కలుగదు. వారికి ఏ బాధలును సంభవింపవు. ప్రభువు వారికి బాసటయై యుండును. వారు ఆయనను రాజుగా ఎన్నుకొనిరి.

22. ప్రభువు వారిని ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను. వారికి ప్రాపును, ప్రోపును' ఆయనయే

23. వాస్తవముగా మంత్రజాలము యాకోబు మీద పనిచేయదు. శకునములు యిస్రాయేలీయుల విషయములో నిస్సహాయకములు. 'దేవుడు యిస్రాయేలీయులయెడల ఎంతటి అద్భుత కార్యములను నిర్వహించెను'  అని సమస్తజాతులును చెప్పుకొందరు.

24. ఈ జనులు ఆడుసింహమువంటివారు సింహమువలె దుముకువారు. సింహము ఎరనుపట్టి మాంసమునుతిని, రక్తము త్రాగువరకు ఎట్లు విశ్రమింపదో, వీరును అట్టివారే”.

25. ఆ పలుకులు విని బాలాకు బిలాముతో “నీవు యిస్రాయేలును శపింపనొల్లవుగదా! కనీసము వారిని దీవింపకుము” అనెను.

26. బిలాము అతనితో “నేను ప్రభువు పలికించిన పలుకు పలుకక తప్పదు” అనెను.

27. బాలాకు బిలాముతో “మనము మరియొక తావునకు వెళ్ళుదము రమ్ము. అక్కడనుండియైనను దేవుడు నీచే శాపవచనములు పలికించునేమో!” అనెను.

28. అతడు బిలామును ఎడారికి ఎదుట నున్న పెయోరుకొండ శిఖరమునకు తీసికొని వెళ్ళెను.

29. బిలాము ఇక్కడ ఏడు పీఠములుకట్టి ఏడుఎడ్లను, ఏడుపొట్టేళ్ళను తెప్పింపుమనెను.

30. బాలాకు అట్లే చేసి ప్రతిపీఠముమీద ఒక ఎద్దును ఒక పొట్టేలును దహనబలిగా అర్పించెను.

 1-2. ప్రభువు యిస్రాయేలును దీవింపగోరెనని బిలాము గ్రహించెను. అతడు మునుపటి రీతిగా ప్రభువు చిత్తమును ఎరుగుటకై శకునములు చూడబోలేదు. నేరుగా ఎడారివైపు తిరిగి అచట తెగల ప్రకారముగా విడిదిచేసియున్న యిస్రాయేలీయులను చూచెను. దేవుని ఆత్మ అతనిపై రాగా బిలాము దైవవాక్కును ఉపమానరీతిగానిట్లు వినిపించెను;

3. “బెయోరు కుమారుడు బిలాము పలుకు దైవవాక్కు నేత్రములు తెరిచినవానికి వచ్చిన దైవసందేశము.

4. అతడు దైవవాక్కును వినువాడు. మహోన్నతుడైన దేవుడు చూపు దివ్యదర్శనములను తిలకించువాడు.

5-6. యిస్రాయేలు గుడారములు  ఎంత సుందరమ వరుసలుగా నాటిన ఖర్జూరవృక్షములవలె, నదీతీరమున పెరిగిన తోటలవలె, దేవుడునాటిన సుగంధ వృక్షములవలె, నీటి ఒడ్డున ఎదిగిన దేవదారులవలె, యిస్రాయేలు నివాసములు రమ్యముగానున్నవి.

7. నీళ్ళు అతని బొక్కెనల నుండి కారును. అతని సంతతి బహుజలముల యొద్ద నివసించును. యిస్రాయేలు రాజు అగాగు కంటె అధికుడు. అతడు మహావైభవముతో రాజ్యమేలును.

8. ప్రభువు ఆ రాజును . ఐగుప్తునుండి తోడ్కొని వచ్చెను. కొమ్ముగుఱ్ఱము వంటి వేగముతో యిస్రాయేలు తన శత్రువులను ఓడించి, వారి యెముకలు విరుగగొట్టును. బాణములతో వారిని గ్రుచ్చెదరు.

9. యిస్రాయేలు ప్రజలు ఆడుసింహము వంటివారు. వారిని రెచ్చగొట్టుట ఎవరితరము? యిస్రాయేలును దీవించువారు దీవెనను, శపించువారు శాపమును పొందుదురు.”

10. ఆ మాటలువిని బాలాకు బిలాముమీద కోపము పట్టజాలక చేతులు చరుచుకొని బిలాముతో “నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని. కాని నీవు వారిని ముమ్మారు దీవించితివి.

11. ఇంక నీ యింటి మొగము పట్టిపొమ్ము. నేను నిన్ను ఘనముగా సత్కరింపవలెననుకొంటిని. కాని ప్రభువే నీకు ఈ సన్మానము దక్కకుండజేసెను” అనెను.

12-13. బిలాము అతనితో “నేను నీవు పంపిన అధికారులతో బాలాకు తన ఇంటనున్న వెండి బంగారములను త్రవ్వి నా నెత్తిని బెట్టినను నేను ప్రభువు ఆజ్ఞ మీరి ఒక చిన్నపనియైనను చేయను అని చెప్పలేదా? ప్రభువు ఏవి చెప్పుమనెనో దానిని మాత్రమే నేను చెప్పెదను.

14. నేను మా దేశమునకు వెడలిపోవుచున్నాను. కాని నేను వెళ్ళకముందు యిస్రాయేలు ప్రజలు మీ ప్రజలకు ఏమి చేయుదురో తెలియజెప్పెదను వినుము” అని మరల దైవవాక్కును ఉపమానరీతిగ ఇట్లేరిగించెను;

15. “బెయోరు కుమారుడు బిలాము పలుకు దైవవాక్కు నేత్రములు తెరిచిన నరుని దైవసందేశము.

16. అతడు దైవవాక్కును వినువాడు, దైవజ్ఞానము నెరిగినవాడు మహోన్నతుడైన దేవుడుచూపు దివ్యదర్శనములను తిలకించువాడు.

17. నేను అతనిని చూచుచున్నాను. కాని ఇపుడున్నట్లు కాదు. నేను అతనిని పరికించుచున్నాను.  కాని సమీపములో ఉన్నట్లు కాదు. యిస్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును.  ఒక రాజదండము బయల్వెడలును. అది మోవాబీయుల కణతలు అదరగొట్టును. షేతువంశమువారి పుఱ్ఱెలు పగులగొట్టును

18. ఎదోమీయులను లొంగదీయును. సెయీరు మండలమును వశముచేసికొనును.

19. యిస్రాయేలు బలపరాక్రమములుచూపి, శత్రువులను అణచివేయును, పట్టణములను నాశనము చేయును”.

20. అంతట బిలాము అమాలేకీయులసీమవైపుతిరిగి దైవవాక్కును ఉపమానరీతిగా ఇట్లేరిగించెను:  “అన్యజాతులన్నిటిలోను అమాలెకు ప్రథముడు,  అయినను ఈ జాతి సర్వనాశనమగును".

21. అతడు కేనీయుల మండలమువైపు తిరిగి దైవవాక్కును ఉపమానరీతిగా ఇట్లేరిగించెను: “మీరు కయీను వంశమువారు. శిఖరముననున్న పక్షిగూడువలె సురక్షితముగా ఉన్నవారు.

22. అయినను  అస్సిరియ దేశీయులు మిమ్ము చెఱపట్టుదురు.  మీరు సర్వనాశమైపోవుదురు".

23. అతడు వారివైపు తిరిగి దైవవాక్కును ఉపమానరీతిగా ఇట్లేరిగించెను:  అయ్యో! దేవుడిట్లు చేయునపుడు బ్రతుకగలవాడెవడు?

24. “కిత్తీము ద్వీపమునుండి దండులువచ్చి అస్సిరియ, ఏబేరు దేశములను బాధించును. అటుతరువాత ఆ జనులుకూడ నాశనమైపోవుదురు”.

25. ఇట్లు దైవవాక్యములు పలికి బిలాము తన ఇంటికి వెడలిపోయెను. బాలాకు గూడ తనత్రోవను తాను వెళ్ళిపోయెను.

 1. యిస్రాయేలీయులు షిత్తీమున విడిదిచేసిరి. అచట వారు మోవాబీయుల స్త్రీలతో వ్యభిచారము చేసిరి.

2. ఆ స్త్రీలు వారి దేవతలకు బలులర్పించుచు యిస్రాయేలీయులను ఆహ్వానింపగా వారు ఆ ఉత్సవములో పాల్గొని నైవేద్యములు భుజించిరి. వారి దేవతలను ఆరాధించిరి.

3. ఈ విధముగా యిస్రాయేలు మోవాబీయులు కొలుచు పెయోరుబాలు దేవతను ఆరాధింపగా ప్రభువు మహోగ్రుడయ్యెను.

4. ప్రభువు మోషేతో “యిస్రాయేలు నాయకులను పట్టుకొని బహిరంగముగా పట్టపగలు ఉరితీయుము. అప్పుడుగాని నా కోపము చల్లారదు” అని చెప్పెను.

5. కనుక మోషే న్యాయాధిపతులను చూచి “మీరు మీ మీ తెగలలో పెయోరుబాలును ఆరాధించిన వారినందరిని వధింపుడు” అని ఆజ్ఞ యిచ్చెను.

6. మోషే మరియు యిస్రాయేలు సమాజమువారు సాన్నిధ్యపు గుడార ద్వారము ముందట ప్రోగై బహుగ పరితపించుచుండిరి. అంతట వారందరు చూచుచుండగానే ఒక యిస్రాయేలీయుడు తన సహోదరుల యొద్దకు మిద్యాను స్త్రీ నొకతెను తోడుకొనివచ్చెను.

7. అది చూచి అహరోను మనుమడును ఎలియేజెరు కుమారుడునగు యాజకుడైన ఫీనెహాసు, యిస్రాయేలు సమావేశము నుండి కదలి వచ్చెను.

8. అతడు ఈటెను చేతగాని ఆ స్త్రీ పురుషులను వెంబడించెను. వారి శయనస్థలమున ప్రవేశించి ఈటెతో వారిరువురిని అనగా, ఆ యిస్రాయేలీయుని, ఆ స్త్రీని కడుపు గుండా దూసుకుపోవునట్లు ఒక్కపోటుతో పొడిచెను. దానితో యిస్రాయేలీయులను పీడించు జాడ్యము ఆగిపోయెను.

9. కాని ఆ జాడ్యమున చిక్కి మరణించిన వారు ఇరువదినాలుగువేల మంది.

10-11. ప్రభువు మోషేకు ఇట్లు చెప్పెను, “యాజకుడైన అహరోను మనుమడును, ఎలియెజెరు కుమారుడునైన ఫీనెహాసు యిప్రాయేలీయుల మధ్య నేను ఓర్వలేని దానిని, తానును ఓర్వలేకపోవుట వలన వారిమీదినుండి నా కోపము మళ్ళించెను కనుక నేను ఓర్వలేకయుండియు యిస్రాయేలీయులను నశింపజేయలేదు.

12. అతనితో నేను శాంతినిబంధనము చేసికొనుచున్నానని చెప్పుము.

13. ఫీనెహాసు అతని తరువాత అతని సంతతివారు కలకాలము నాకు యాజకులు అగుదురు. అతడు నన్ను కాదని అన్య దైవతములను కొలువనీయలేదు కనుక, ప్రజల పాపమునకు పరిహారము చేసెను కనుక ఈ నిత్యమైన యాజకనిబంధనను బహుమానముగా బడయును” అని చెప్పెను.

14. మిద్యాను స్త్రీతో చంపబడిన యిస్రాయేలీయుడు సాలు కుమారుడు సిమ్రి. అతడు షిమ్యోను తెగలోని కొన్ని కుటుంబములకు నాయకుడు.

15. ఆ స్త్రీ పేరు కోస్బీ. ఆమె తండ్రి సూరు. అతడు మిద్యానీయులలో ఒక తెగకును, తన పితరుల కుటుంబమునకును నాయకుడు.

16-17. ప్రభువు మోషేతో “మిద్యానీయులను ముట్టడించి మొదలంట నాశనము చేయుము.

18. వారు పెయోరువద్ద మిమ్మును దుర్బుద్ధితో మోసగించిరి. పెయోరు అంటురోగము మీకు సోకిననాడు, హత్య చేయబడిన విద్యానీయుల ఆడుపడుచును, మిద్యాను నాయకుడి కుమార్తెయుయైన కోస్బీవలన మీరు భ్రష్టులై పోతిరి” అని చెప్పెను.

 1. అంటురోగము సమసిపోయిన తరువాత ప్రభువు మోషేతోను, అహరోను కుమారుడును ఎలియెజెరుతోను మాట్లాడెను.

2. "కుటుంబముల వారిగా యిస్రాయేలీయుల జనసంఖ్య వ్రాయింపుడు. ఇరువదిఏండు మరియు అంతకు పైబడి యుద్ధము చేయుటకు అర్హులైన వారి పేర్లను నమోదుచేయింపుడు” అని చెప్పెను.

3. కనుక మోషే ఎలియెజెరులు ఇరువదిఏండ్లు మరియు అంతకు పైబడిన యిస్రాయేలీయులు అందరిని సమావేశపరచిరి.

4. యెరికోకు ఎదురుగా నున్న యోర్డాను నదీ తీరమందలి మోవాబు మైదానమున వారు గుమిగూడిరి. ఐగుప్తునుండి వెడలి వచ్చిన యిస్రాయేలీయులు వీరు:

5. యాకోబు పెద్ద కుమారుడగు రూబేను. రూబేను కుమారులలో హానోకీయులు హానోకు వంశస్తులు.

6. పల్లువీయులు ఫల్లు వంశస్తులు. హెసోనీయులు హెన్రోను వంశస్తులు, కార్మీయులు కార్మి వంశస్తులు.

7. రూబేను తెగలో లెక్కింపబడిన వీరు 43,730 మంది పురుషులు.

8. పల్లు కుమారుడు ఎలీయాబు. ఎలీయాబు కుమారులు నెమూవేలు, దాతాను, అబీరాము.

9. మోషే అహరోనులను ధిక్కరించి కోరా బృందముతో చేతులు కలిపి యిస్రాయేలు సమాజమును ప్రభువుమీద తిరుగబడునట్లు రెచ్చగొట్టిన వారు వీరే.

10. అపుడు నేల నోరువిప్పి కోరా బృందముతోపాటు వీరిని గూడ మ్రింగివేసెను. అగ్నిప్రజ్వరిల్లి రెండువందల ఏబదిమందిని కాల్చి వేసెను. ఆ విషయము ప్రజలకొక హెచ్చరిక అయ్యెను.

11. కోరా కుమారులు మాత్రము నాశనమైపోలేదు.

12. షిమ్యోను కుమారుల వంశములలో నెమూవేలీయులు నెమూవేలు వంశస్తులు, యామీనీయులు యామీను వంశస్తులు, యాహీనీయులు యాహీను వంశస్తులు.

13. సెరాహీయులు సెరా వంశస్తులు, షవూలీయులు షవూలు వంశస్తులు.

14. షిమ్యోను తెగలో లెక్కింపబడిన వీరు 22,200 మంది పురుషులు.

15. గాదు కుమారుల వంశములలో సెఫోనీయులు సెఫోను వంశస్తులు, హగ్గియులు హగ్గి వంశస్తులు, షూనీయులు షూని వంశస్తులు,

16. ఓస్నీయులు ఓస్ని వంశస్తులు, ఎరీయులు ఎరి వంశస్తులు

17. అరోదీయులు అరోదు వంశస్తులు. అరేలీయులు అరేలి వంశస్తులు.

18. గాదీయుల తెగలో లెక్కింపబడిన వీరు 40,500 మంది పురుషులు.

19. యూదా కుమారులగు ఏరు, ఒనాను అనువారు కనాను మండలమున చనిపోయిరి.

20. యూదావంశమున షేలాహీయులు షేలా వంశస్తులు, పేరేసీయులు పేరేసు వంశస్తులు, సేరామీయులు సేరాహు వంశస్తులు.

21. రేసు కుమారులు హెస్రోను, హామూలు. హెసోనీయులు హెన్రోను వంశస్తులు, హామూలీయులు హామూలు వంశస్తులు.

22. యూదా తెగలో లెక్కింపబడిన వీరు 76,500 మంది పురుషులు.

23. యిస్సాఖారు కుమారుల వంశములందు టోలాహీయులు టోలా వంశస్తులు, పూవీయులు పూవా వంశస్తులు,

24. యాషూబీయులు యాషూబు వంశస్తులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్తులు,

25. యిస్సాఖారు తెగలోని లెక్కింపబడిన వీరు 64,300 మంది పురుషులు.

26. సెబూలూను కుమారుల వంశములందు సేరేదీయులు సేరేదు వంశస్తులు, ఏలోనీయులు ఏలోను వంశస్తులు, యాహ్లియులు యాహ్లిలు వంశ స్తులు.

27. సెబూలూను తెగలో లెక్కింపబడిన వీరు 60,500 మంది పురుషులు.

28. యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయీము.

29. మనష్షే కుమారులలో మాహీరీయులు మాహీరు వంశస్తులు. మాహిరు కుమారుడు గిలాదు. గిలాదీయులు గిలాదు వంశస్తులు.

30. గిలాదు కుమారుల వంశస్తులు యేసేరీయులు యేసేరు వంశస్తులు, హెలేకీయులు హెలేకు వంశస్తులు,

31. ఆస్రియేలీయులు ఆస్రియేలు వంశస్తులు, షెకేమీయులు షెకెము వంశస్తులు,

32. షేమిదామీయులు షేమిదా వంశస్తులు, హేఫేరీయులు హేఫేరు వంశస్తులు.

33. హేఫేరు కుమారుడు సెలోఫెహాదునకు కుమార్తెలే గాని, కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా తీర్సా.

34. మనష్షే తెగలోని లెక్కింపబడిన వీరు 52,700 మంది పురుషులు. వారి కుటుంబముల ప్రకారము యోసేపు పుత్రులు వీరు.

35. ఎఫ్రాయీము కుమారుల వంశములివి. షుతేలాహీయులు షుతేలా వంశస్తులు, బేఖేరీయులు బేఖేరు వంశస్తులు, తాహానీయులు తాహాను వంశ సులు. 

36. షుతేలా కుమారుడైన ఏరాను వంశస్తులు ఏరానీయులు.

37. ఎఫ్రాయీము తెగలో లెక్కింప బడిన వీరు 32,500 మంది పురుషులు.

38. బెన్యామీను కుమారుల వంశములలో బేలీయులు బేలా వంశస్తులు, ఆష్బేలీయులు ఆష్బేలు వంశస్తులు,

39. అహీరామీయులు అహీరాము వంశస్తులు,

40. షెపూఫామీయులు షేపూఫాము వంశస్తులు. బేలా కుమారులు ఆర్డు, నామాను. ఆర్గీయులు ఆర్డు వంశస్తులు, నామానీయులు నామాను వంశస్తులు.

41. బెన్యామీను తెగలో లెక్కింబడిన వీరు 45,600 మంది పురుషులు.

42-43. దాను కుమారుల వంశములలో షూహామీయులు షూహాము వంశస్తులు. దాను తెగలో లెక్కింపబడిన వీరు 64,400 మంది పురుషులు.

44. ఆషేరు కుమారుల వంశములలో ఇమ్నాయులు ఇమ్నా వంశస్తులు, ఈష్వీయులు ఈష్వీ వంశస్తులు, బెరియాయీలు బెరియా వంశస్తులు.

45. హేబేరు, మాల్కియేలు కుటుంబములు బెరియా నుండి పుట్టెను. హేబేరీయులు హేబేరు వంశస్తులు, మాల్కియేలీయులు మాల్కియేలు వంశస్తులు.

46. ఆషేరు కుమార్తె పేరు సేరా.

47. ఆషేరు తెగలో లెక్కింపబడిన వీరు 53,400 మంది పురుషులు.

48. నఫ్తాలి కుమారుల వంశములలో యాహ్సీయులు యాహ్సీలు వంశస్తులు, గూనీయులు గూని వంశస్తులు,

49. యేసేరీయులు యేసేరు వంశస్తులు, షిల్లేమీయులు షిల్లెము వంశస్తులు. నప్తాలీ తెగలో లెక్కింపబడిన వీరు 45,400 మంది పురుషులు.

51. యిస్రాయేలీయుల పురుషులందరు కలసి 601,730 మంది.

52. ప్రభువు మోషేతో “ఈ భూమిని వారి వారి పేర్లను అనుసరించి యిస్రాయేలు తెగలవారికి స్వాస్థ్యముగా పంచిపెట్టుము.

53. ఎక్కువసంఖ్యగల తెగకు ఎక్కువ స్వాస్థ్యమును ఈయవలెను.

54. తక్కువ సంఖ్యగల తెగకు తక్కువ స్వాస్థ్యమును ఈయవలెను.

55. చీట్లు వేసి తమతమ పితరుల తెగల జనసంఖ్యలు అనుసరించి స్వాస్థ్యములను పొందవలెను.” అని చెప్పెను.

56. ఎక్కువ సంఖ్య గలవారేమి, తక్కువ సంఖ్య గలవారేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచి పెట్టవలెను.

57. లేవీ తెగయందు గెర్షోను, కోహాతు, మెరారి వంశములు కలవు.

58. లిబ్ని, హెబ్రోను, మాహ్లి, మూషి, కోరా అనునవి లేవీయ కుటుంబములు. కోహాతు కుమారుడు అమ్రాము.

59. అతడు లేవీకి ఐగుప్తున జన్మించిన యోకేబేదును పెండ్లియాడి అహరోను, మోషే, మిర్యాములను కనెను. 

60. వారిలో అహరోనునకు నాదాబు, అబీహు, ఎలియెజెరు, ఈతామారు అను నలుగురు కుమారులు కలరు.

61. దేవునికి అపవిత్రమైన అగ్నిని సమర్పించుట వలన నాదాబు, అబీహులు చనిపోయిరి.

62. లేవీయులందు నెల ప్రాయమునకు పైబడిన మగవారు 23,000 మంది. ఇతర యిస్రాయేలీయులవలె వీరికి ఆస్తిహక్కులు లేవు. కనుక వీరి పేర్లు ప్రత్యేకముగా నమోదు చేయబడెను.

63. యెరికో ఎదుటనున్న యోగాను నదీతీరము నందలి మోవాబు మైదానమున మోషే, ఎలియెజెరులు జనసంఖ్యను నిర్ణయించినపుడు ఈ కుటుంబముల పేర్లు లిఖింపబడినవి.

64. ప్రజలు సీనాయి ఎడారిలో నున్నపుడు మోషే, అహరోనులు జనసంఖ్య వ్రాసిరి కదా! ఈ రెండవలెక్క తయారైనపుడు ఆ మొదటి లెక్కలోని మగవారెవరును మిగిలిలేరు.

65. వారందరు ఎడారిలోనే కన్ను మూయుదురని ప్రభువు సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడగు కాలెబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిగిలిన మగవారందరు ప్రభువు చెప్పినట్లే మరణించిరి.

 1. మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా అనువారు సెలోఫెహాదు పుత్రికలు. సెలోఫెహాదు హెఫేరు కుమారుడు, గిలాదు మనుమడు, మాహీరు మునిమనుమడు. వీరు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్తులు.

2-3. ఆ కుమార్తెలు సమావేశపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషేను, యాజకుడగు ఎలియెజెరును యిస్రాయేలు ప్రజలను, ప్రజానాయకులను కలిసికొని “మా తండ్రి మగబిడ్డలు లేకయే ఎడారియందు చనిపోయెను గదా! ఆయన తన పాపము వలన తాను చనిపోయెనుగాని దేవునిమీద తిరుగబడిన కోరా బృందమున చేరుటవలనకాదు.

4. మా తండ్రికి మగబిడ్డలు లేరు కనుక ఆయన పేరు మాసిపోవలెనా యేమి? మా తండ్రి సహోదరులతో పాటు మమ్మును మా తండ్రి వారసులనుగా చేయుడు” అని అడిగిరి.

5-6. మోషే ఆ మాట ప్రభువునకు విన్నవింపగా ప్రభువు అతనితో

7. “సెలోఫెహాదు కుమార్తెల విన్నపము ధర్మబద్దమైనదే. వారి తండ్రి సహోదరులతో పాటు వారిని తండ్రి వారసులనుగా చేయుము.

8. ఎవడైనను పుత్రులులేక చనిపోయినచో అతని ఆస్తి అతని కుమార్తెలకు సంక్రమించునని యిస్రాయేలీయులతో చెప్పుము.

9. పుత్రికలును లేనిచో అతని ఆస్తి అతని సోదరులకు దక్కును.

10. సోదరులును లేనిచో ఆ ఆస్తి అతని తండ్రి సోదరులకు చెందును.

11. వారును లేనిచో దగ్గరి చుట్టమునకు చెందును. తరతరముల వరకు యిస్రాయేలీయులకు మోషే ద్వారా ప్రభుడనైన నేను చేసిన న్యాయమిది” అని చెప్పెను.

12. ప్రభువు మోషేతో "నీవు అబారీము కొండ నెక్కి నేను యిస్రాయేలీయులకు ఇచ్చిన భూమిని పారజూడుము. 

13. ఆ దేశమును కన్నులార చూచిన పిదప అహరోనునివలె నీవును మరణింతువు.

14. మీరిరువురును సీను ఎడారిలో నా ఆజ్ఞలను జవదాటిరి గదా! నాడు మెరిబావద్ద యిస్రాయేలు సమాజము నామీద గొణగుకొనగా మీరిరువురును వారి ఎదుట నన్ను పవిత్రపరచక నామీద తిరుగబడితిరి” అనెను. (సీను ఎడారి యందలి కాదేషు వద్దనున్న చెలమయే మెరిబా.)

15-17. మోషే దేవునితో “ప్రభూ! సకల ప్రాణులకు జీవాధారము నీవే. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపుము. అతడు యుద్ధములలో వీరిని నడిపించుచుండును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరిలేని మంద దుర్గతి పట్టదు” అనెను.

18. ప్రభువు అతనితో “నూను కుమారుడైన యెహోషువ ఆత్మశక్తి కలవాడు. నీవు అతనిపై చేతులు చాపుము.

19. యిస్రాయేలు సమాజము చూచు చుండగా అతనిని యాజకుడగు ఎలియెజెరు ముందు నిలిపి నీకు ఉత్తరాధికారినిగా ప్రకటింపుము.

20. పిమ్మట యిస్రాయేలు సమాజము అంతయు అతనిని విధేయించునట్లు నీ అధికారమును కొంత అతనికి ఇమ్ము.

21. యెహోషువ, యాజకుడగు ఎలియెజెరు మీద ఆధారపడియుండును. ఎలియెజెరు నా చిత్తమును ఊరీము తీర్పువలన అతనికి యెరుకపరుచు చుండును. ఈ రీతిగా ఎలియెజెరు యెహోషువను, యిస్రాయేలు సమాజమునంతటిని తన మాట చొప్పున సమస్త కార్యములలో నడిపించుచుండును” అని చెప్పెను.

22. మోషే ప్రభువు చెప్పినట్లే చేసెను. అతడు యిస్రాయేలు సమాజము చూచుచుండగా యెహోషువను యాజకుడగు ఎలియెజెరు ముందు నిలిపి అతనిపై చేతులు చాచెను.

23. అతనిని తనకు ఉత్తరాధికారినిగా నియమించెను.

 1-2. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. మీరు నియమితకాలములందు నాకు బలులు సమర్పింపవలెను. అవి నాకు ప్రీతిని కలిగించును.

3. మీరు నాకు సమర్పింపవలసిన బలి అర్పణములు యివి: ప్రతిదినమును అవలక్షణములు లేని ఏడాది మగగొఱ్ఱెపిల్లలను రెండింటిని దహనబలిగా అర్పింపవలెను.

4. వానిలో ఒకదానిని ఉదయము, మరొకదానిని సాయంకాలము సమర్పింపుడు.

5. ఆ రెండింటితో పాటు రెండుకుంచముల ధాన్యపు పిండిని, రెండుబుడ్ల దంచి తీసిన శ్రేష్టమైన ఓలివు నూనెను అర్పింపవలెను.

6. ఈ ఆహారపదార్థములు అన్నియు పూర్తిగా దహనము చేయబడును. ఈ దహనబలి మొదట సీనాయి కొండ వద్ద సమర్పింప బడెను. ఆ బలిసువాసన ప్రభువునకు ప్రీతికలిగించెను.

7. మొదటి గొఱ్ఱె పిల్లతోపాటు ద్రాక్షసారాయమును ప్రభువునకు పానార్పణముగా పవిత్రస్థలమున ధారవోయవలెను.

8. ఆ రీతిగానే సాయంకాలమును నైవేద్య, ద్రాక్షసారాయమును అర్పించుచు రెండవ గొఱ్ఱెపిల్లను దహనబలిగా అర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతికలిగించును.

9.. విశ్రాంతిదినమున అవలక్షణములులేని ఏడాది ప్రాయముగల రెండు మగ గొఱ్ఱె పిల్లలను అర్పింపుడు. వానితోపాటు నాలుగు కుంచముల పిండిని ఓలివు నూనెను ద్రాక్షసారాయమును అర్పింపుడు.

10. ప్రతిదిన సమర్పణలతోపాటు, ప్రతిదిన ద్రాక్షసారాయముతోపాటు ఈ దహనబలిని గూడ విశ్రాంతిదినమున ప్రత్యేకముగా సమర్పింపవలెను.

11-13. ప్రతినెల మొదటిదినమున అవలక్షణములు లేని రెండు కోడెదూడలను, ఒక పొట్టేలును, ఏడాదిప్రాయముగల ఏడు మగగొఱ్ఱె పిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు. ధాన్యార్పణముగా ఓలివునూనెతో కలిపిన పిండిని అర్పింపుడు. ఒక్కొక్క కోడెకు ఆరుకుంచముల పిండి, పొట్టేలుకు నాలుగు కుంచములపిండి, గొఱ్ఱెపిల్లకు రెండు కుంచముల పిండి చొప్పున అర్పింపుడు. ఈ దహనబలులు ప్రభువు నకు అర్పింపబడును. ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చును.

14. ద్రాక్షసారాయమును ఒక్కొక్క కోడెకు నాలుగుబుడ్లు, పొట్టేలుకు మూడుబుడ్లు, గొఱ్ఱెలకు రెండుబుడ్లు అర్పింపవలెను. ఏడాది పొడుగున ప్రతినెల మొదటిరోజున సమర్పింపవలసిన దహనబలులివి.

15. ప్రతిరోజు సమర్పించు దహన బలితో పాటు పాపపరిహారబలిగా ఒక మేకపోతును గూడ సమర్పింపుడు.

16-17. మొదటినెల పదునాలుగవ దినమున పాస్క వచ్చును. పదునైదవనాడు పండుగ ప్రారంభమై ఏడురోజులవరకు కొనసాగును. ఈ ఏడురోజులు పొంగని రొట్టెలను మాత్రమే భుజింపుడు.

18. పండుగ వారము మొదటి రోజున మీరందరు దేవుని ఆరాధించు టకు సమావేశము కావలెను. ఆ దినము మీరు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

19. అవ లక్షణములులేని రెండుకోడెదూడలను, ఒక పొట్టేలును, యేడాది ఈడు గల ఏడు మగగొఱ్ఱెపిల్లలు ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు.

20-21. ఓలివునూనెతో కలిపిన పిండిని ఒక్కొక్క కోడెకు ఆరుకుంచములు, పొట్టేలుకు నాలుగుకుంచములు, గొఱ్ఱె పిల్లకు రెండు కుంచముల చొప్పున అర్పింపుడు.

22. పాపపరిహారముగా ఒక మేకపోతును గూడ అర్పింపుడు. ఈ విధముగా ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరిపింపుడు.

23. ప్రతిదినమున ఉదయమర్పించు దహనబలితో పాటు వీనిని కూడ అర్పింపుడు,

24. ఈ బలులను ఏడురోజులపాటు అర్పింపవలెను. ఈ దహనబలులు ప్రభువునకు ప్రీతికలిగించు సువాసన నిచ్చి ఆయనకు భోజనమగును.

25. ఏడవనాడు ప్రభుని ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆనాడు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

26. వారములపండుగ మొదటిదినమున మీరు ప్రథమ ఫలములను ప్రభునికి అర్పింతురుగదా! ఆ దినమున ప్రభుని ఆరాధించుటకు సమావేశము కండు. ఆరోజు మీరు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయకుడు.

27. అవలక్షణములులేని రెండుకోడెలను, ఒక పొట్టేలును, ఏడాది యీడుగల ఏడు మగగొఱ్ఱె పిల్లలను దహనబలిగా అర్పింపుడు. ఈ బలి ప్రభువునకు ప్రీతికలిగించు సువాసననిచ్చును.

28-29. ఓలివు నూనెతో కలిపిన పిండిని ఒక్కొక్కకోడెకు ఆరు కుంచములు, పొట్టేలుకు నాలుగుకుంఛములు, గొఱ్ఱె పిల్లకు రెండుకుంచముల చొప్పున అర్పింపుడు. 

30. పాపపరిహారబలిగా ఒక మేకపోతునుగూడ అర్పింపుడు. ఈ రీతిగా ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరిపింపుడు.

31. ప్రతిదినము అర్పించు దహనబలితో పాటు, ధాన్యార్పణముతోపాటు వీనినికూడ అర్పింపుడు.

 1. ఏడవ నెల మొదటిదినమున మీరు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆ దినము మీరు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు. ఆర్బాటముగా శృంగములను ఊదు దినమది.

2. అవలక్షణములు లేని ఒక కోడెను, ఒక పొట్టేలును ఏడాది ఈడుగల ఏడుమగగొఱ్ఱె పిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు.

3-4. ఓలివునూనెతో కలిపిన పిండిని ఒక్కొక్కకోడెకు ఆరుకుంచములు, పొట్టేలుకు నాలుగుకుంచములు, గొఱ్ఱె పిల్లకు రెండు కుంచములచొప్పున అర్పింపుడు.

5. పాపపరిహార బలిగా ఒక మేకపోతును గూడ సమర్పింపుడు. ఈ రీతిగా మీ నిమిత్తము పాపములకు ప్రాయశ్చిత్తము జరిపింపుడు.

6. ప్రతి నెల మొదటిరోజున అర్పించు దహనబలితో పాటు, ప్రతిదినము అర్పించు దహన బలితోపాటు, ఈ బలులను కూడ అర్పింపుడు. ఇవి ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చి, అతనికి భోజనమగును.

7. ఏడవనెల పదియవ దినమున ప్రభువును ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆ దినమున మీరు ఏ పనియుచేయక ఉపవాసము ఉండుడు.

8. ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానీయార్పణములుగాక అవలక్షణములేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది ఈడుగల ఏడుగొఱ్ఱె పిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు. ఆ బలి ప్రభునికి ప్రియము కలిగించు సువాసననిచ్చును.

9-10. ఓలివునూనెతో కలిపిన పిండిని కోడెకు ఆరు కుంచములు, పొట్టేలుకు నాలుగు కుంచములు, ఒక్కొక్క గొఱ్ఱె పిల్లకు రెండుకుంచముల చొప్పున అర్పింపుడు.

11. పాపపరిహారబలిగా ఒక మేక పోతును అర్పింపుడు.

12. ఏడవనెల పదునైదవ దినమున ఆరాధనకు సమావేశము కండు. ప్రభువు పేర ఉత్సవము చేసుకొనుడు. ఆనాడు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయవలదు. మీరు ఏడుదినములు పండుగ ఆచరింపవలయును.

13. ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములునుగాక ఈ మొదటి దినమున అవలక్షణములేని పదమూడు కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱెపిల్లలను దహనబలిగా అర్పింపుడు. ఆ బలి ప్రభువునకు ప్రీతికలిగించు సువాసననిచ్చును.

14-15. ఓలివు నూనెతో కలిపిన గోధుమపిండిని ఒక్కొక్క కోడెకు ఆరుకుంచములు, పొట్టేలుకు నాలుగు కుంచములు, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లకు రెండుకుంచముల చొప్పున అర్పింపుడు.

16. పాపపరిహారబలిగా ఒక మేకపిల్లను అర్పింపుడు.

17. రెండవ దినమున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములునుగాక అవలక్షణములేని పండ్రెండుకోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా సమర్పింపుడు.

18-19. వానివాని లెక్క చొప్పున కోడెలతోను, పొట్టేళ్ళతోను, గొఱ్ఱెపిల్లలతోను వాటివాటి నైవేద్యములను, పానార్పణములను పాపపరిహారబలిగా ఒక మేకపిల్లను సమర్పింపుడు.

20. మూడవదినమున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములును గాక అవలక్షణములేని పదునొకండు కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱెపిల్లలను అర్పింపుడు.

21-22. మిగిలినవానినన్నిటిని మొదటి రోజున అర్పించు రీతిగనే అర్పింపుడు.

23. నాలుగవరోజున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములునుగాక అవలక్షణములేని పది కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱె పిల్లలను సమర్పింపుడు.

24-25. మిగిలిన వానినన్నిటిని మొదటిరోజున అర్పించు రీతిగనే సమర్పింపుడు.

26. ఐదవరోజున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములునుగాక అవలక్షణములేని తొమ్మిది కోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ఈడుగల పదునాలుగు గొఱ్ఱెపిల్లలను సమర్పింపుడు.

27-28. మిగిలినవానినన్నిటిని మొదటి రోజున అర్పించు రీతిగనే సమర్పింపుడు.

29. ఆరవరోజున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములును గాక. అవలక్షణములేని ఎనిమిదికోడెలను, రెండుపొట్టేళ్ళను, ఏడాది ప్రాయముగల పదునాలుగు గొఱ్ఱె పిల్లలను అర్పింపుడు.

30-31. మిగిలినవానినన్నిటిని మొదటి రోజున అర్పించు రీతిగనే సమర్పింపుడు.

32. ఏడవ రోజున ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములునుగాక అవలక్షణములేని ఏడుకోడెలను, రెండు పొట్టేళ్ళను, ఏడాది ప్రాయముగల పదునాలుగు గొఱ్ఱె పిల్లలను సమర్పింపుడు.

33. కోడెలతోను, పొటేళ్ళతోను, గొఱ్ఱె పిల్లలతోను వాటివాటి నైవేద్యమును, పానార్పణములను

34. పాపపరిహారబలిగా ఒక మేకపిల్లను, మొదటి దినమున అర్పించురీతిగనే మిగిలిన ఆరు దినములలోను సమర్పింపుడు.

35. ఎనిమిదవదినమున ప్రభువును ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆ దినము మీ జీవనోపాధియైన ఏ పనియుచేయవలదు.

36. ప్రతిదిన దహనబలియు, దాని నైవేద్యమును, వాటి పానీయార్పణమును గాక అవలక్షణములేని ఒక కోడెను, ఒక పొట్టేలును, ఏడాది ఈడుగల ఏడుగొఱ్ఱెపిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు. ఈ భోజనబలి ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చును.

37-38. మిగిలిన వానినన్నిటిని మొదటిరోజున అర్పించు రీతిగనే సమర్పింపుడు.

39. మీకు నేను నియమించిన పండుగలందు మీరు సమర్పింపవలసిన దహనబలులు, ధాన్యార్పణములు, ద్రాక్షసారాయార్పణములు, సమాధానబలులు ఇవియే. మ్రొక్కుబడులు పట్టుటవలననైన, స్వేచ్చార్పణముగానైనను మీరు సమర్పించుకొను సమర్పణములు మాత్రము పై లెక్కలోనికి రావు.”

40. ఈ రీతిగా ప్రభువు తనకు ఆజ్ఞాపించిన కట్టడలనన్నిటిని మోషే యిస్రాయేలీయులకు తెలియజేసెను.

 1. యిస్రాయేలు తెగనాయకులకు మోషే ప్రభువు కట్టడలను ఇట్లేరిగించెను:

2. “మీలో ఎవరైన ప్రభువునకు ఏదైనా సమర్పించెదనని మ్రొక్కుకొనిన యెడల లేక దేనినైన ప్రమాణముచేసిన యెడల అతడు తనమాట నిలబెట్టుకోవలెను.

3-4. ఒక స్త్రీ బాల్యమునందు తన తండ్రి ఇంట వసించుచున్నపుడు ప్రభువునకు మ్రొక్కుకొన్నయెడల ఆమె తీసుకొనిన ఈ బాధ్యతను గూర్చి తన తండ్రికి తెలియజేసినపుడు అతను విని ఊరుకొనినయెడల ఆ మ్రొక్కుబడి నిలుచును.

5. అటులకానిచో తండ్రి వినిన దినమందే ఏదైన అభ్యంతరములు కలిగించినయెడల, ఆమె తాను తీసుకొనిన ఆ బాధ్యత నిలువకపోవును. తండ్రి ఆ కన్య ఋక్కును నిరాకరించెను గనుక ప్రభువు ఆమెను మన్నించును.

6-7. తెలిసిగాని తెలియకగాని ఒక కన్య ప్రభువునకు మ్రొక్కుకొనవచ్చును. లేక ప్రమాణము చేయవచ్చును. కాని అటుపిమ్మట ఆమె వివాహము చేసికొన్నప్పటికి భర్త అడ్డుచెప్పనపుడు, తప్పక తన మాట నిలబెట్టుకోవలెను. 

8. కాని భర్త అడ్డుచెప్పినచో ఆమెమాట దక్కించుకోనక్కరలేదు. ప్రభువు ఆమెను మన్నించును.

9. విధవ లేక భర్త విడనాడిన స్త్రీ తాను పట్టిన మ్రొక్కుబడి నెరవేర్పవలెను. చేసిన ప్రమాణమును నిలబెట్టుకోవలెను.

10-11. వివాహితయైన స్త్రీ పట్టిన మ్రొక్కుబడిని గాని, చేసిన ప్రమాణముగాని వినిన దినమందే భర్త అడ్డుచెప్పనప్పుడు తప్పక నిలబెట్టుకోవలెను.

12. కాని భర్త అడ్డుచెప్పినచో ఆమె వానిని పాటింపనక్కర లేదు. భర్త ఆమె మ్రొక్కుబడులకు అడ్డుచెప్పెను గనుక ప్రభువు ఆమెను క్షమించును.

13. భార్య మ్రొక్కుబడులను, ప్రమాణములను కొనసాగించుటకుగాని, కొనసాగింపకుండుటకుగాని భర్తకు అధికారము కలదు.

14. కాని అతడు ఆమె మ్రొక్కుబడులను గూర్చిగాని, ప్రమాణములను గూర్చి గాని ఏమియు అనడేని, ఆమె వానిని పాటింపవలెను. అతడు అవరోధము చేయకుండుటచే అవి చెల్లునట్లు చేసెననియే భావింపవలెను.

15. కాని అతడు మొదటకాక కొంతకాలమైన తరువాత భార్య మ్రొక్కుబడులను, ప్రమాణములను కొనసాగనీయనియెడల తనభార్య మ్రొక్కుబడులను తీర్పని దోషమును తానే భరించును.

16. తండ్రి ఇంట వసించు కన్యగాని, భర్త ఇంట వసించు భార్య గాని పట్టిన మ్రొక్కుబడులను గూర్చి ప్రభువు మోషేకు ఇచ్చిన కట్టడలు ఇవియే.

 1-2. ప్రభువు మోషేతో “నాడు మిద్యానీయులు యిస్రాయేలీయులకు చేసిన అపరాధమునకై వారికి ప్రతిదండనచేయుము. అటుపిమ్మట నీవు, నీ పితరులను చేరుకొందువు” అని చెప్పెను.

3. కనుక మోషే యిస్రాయేలీయులతో “మీరు యుద్ధమునకు సన్నాహములు చేయుడు. మిద్యానీయులకు ప్రభువు విధించిన ప్రతిదండననుచేయ వారి మీదికి పొండు.

4. ఒక్కొక్క తెగనుండి వేయిమందిని యుద్ధమునకు పంపుడు” అని చెప్పెను.

5. కనుక యిస్రాయేలీయులు ఒక్కొక్క తెగనుండి వెయ్యిమందిని ఎన్నుకొనగా మొత్తము పండ్రెండు వేలమంది యుద్ధమునకు సంసిద్ధులైరి.

6. యాజకుడగు ఎలియెజెరు కుమారుడు ఫీనెహాసు నాయకత్వమున మోషే వారినందరిని యుద్ధమునకు పంపెను. పరిశుద్ధపాత్రములును, యుద్ధమున ఊదు బాకాలును ఫీనెహాసు వశమున ఉండెను.

7. వారు ప్రభువు ఆజ్ఞాపించినట్లే మిద్యానీయులను ముట్టడించి వారి పురుషులనందరిని చంపివేసిరి.

8. వారి ఐదుగురు రాజులగు ఎవి, రేకెము, సూరు, హూరు, రేబా అనువారిని గూడ సంహరించిరి. బెయోరు కుమారుడగు బిలామును గూడ కత్తితో వధించిరి.

10. వారి పట్టణములను, శిబిరములను, ఊళ్ళను బూడిద చేసిరి.

9. యిస్రాయేలీయులు మిద్యానీయుల స్త్రీలను బిడ్డలను చెరగొనిరి. వారి పశువులను, మందలను వారికి కలిగిన యావత్తును స్వాధీనము చేసికొనిరి. వారి సొత్తును కొల్లగొట్టిరి.

10. వారి పట్టణములను, శిబిరములను, ఊళ్ళను బూడిద చేసిరి.

11. ఆ రీతిగా యిస్రాయేలు యోధులు చేతికి చిక్కిన కొల్లసొమ్మును అనగా స్త్రీలనేమి, పురుషులనేమి, పశువులనేమి మిద్యానీయుల సొత్తు నంతటిని కొల్లగొట్టిరి.

12. వారు యెరికో చెంత యోర్దానునకు ఎదుట మోవాబు మైదానమున విడిది చేసియున్న మోషేవద్దకును, ఎలియెజెరు వద్దకును, యిస్రాయేలు సమాజము నొద్దకును చెరపట్టబడిన వారిని ఆ కొల్లసొమ్ముతో తీసుకొని వచ్చిరి.

13. మోషే, యాజకుడగు ఎలియెజెరు, సమాజ నాయకులు శిబిరమునుండి వెడలివచ్చి యుద్ధవీరులకు ఎదురువోయిరి.

14. కాని వారి సహస్రాధిపతులునగు, శతాధిపతులునగు సైనికాధికారులను చూచి మోషే మండిపడెను.

15. “మీరు ఈ స్త్రీలను ప్రాణములతో బ్రతుకనిచ్చితిరా? 

16. బిలాము దుర్బోధలకు లొంగి, నాడు పెయోరునొద్ద మన ప్రజలు ప్రభువును విడనాడునట్లు చేసినది ఈ స్త్రీలే కదా? నాడు యిస్రాయేలీయుల అరిష్టమునకు, నాశనమగుటకు ఆ సంఘటనమే కారణముగదా!

17. కనుక ఇపుడు ఈ చిన్నపిల్లలలో మగపిల్లలనందరిని, ఈ స్త్రీలలో పురుషులతో కాపురము చేసినవారినందరిని వధింపుడు.

18. కాని కాపురమునకు రాని కన్నెలను మాత్రము చంపక మీరు స్వీకరింపుడు.

19. యుద్ధమున శత్రువులను వధించినవారుగాని, శవములను అంటుకొనినవారుగాని ఏడుదినములు శిబిరము వెలుపల వసింపుడు. మూడవనాడు, ఏడవనాడు మిమ్మును, మీరు చెరపట్టినవారును శుద్ధిచేసికొనుడు.

20. మీ బట్టలను, తోలుతోగాని మేకవెంట్రుకలతో గాని కొయ్యతోగాని చేసిన మీ పరికరములనుగూడ శుద్ధి చేసికొనుడు” అని చెప్పెను.

21. యాజకుడగు ఎలియెజెరు యుద్ధము చేసి వచ్చిన వీరులతో “ప్రభువు మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలివి:

22-23. నిప్పునకు లొంగని బంగారము, వెండి, కంచు, ఇనుము, తగరము, సీసము మొదలగు లోహములను అగ్నితో శుద్ధి చేయవలెను. కాని వానిని శుద్ధీకరణ జలముతోగూడ శుద్ధి చేయవలెను. అగ్నిచేత చెడునట్టి మిగిలినవస్తువులను నీళ్ళలో శుద్ధిచేసిన చాలును.

24. ఏడవదినమున మీ బట్టలను శుద్ధిచేసి కొనుడు. అప్పుడు మీరు శుద్ధినిపొందుదురు. గనుక శిబిరమునకు తిరిగిరావచ్చును” అనెను.

25-26. ప్రభువు మోషేతో “నీవును, యాజకుడైన ఎలియెజెరును, సమాజనాయకులును కూడి కొల్లసొమ్మును లెక్కింపుడు. చెరజిక్కిన వారిని పశువులను గూడ లెక్కపెట్టుడు.

27. కొల్లసొమ్ము సగము యుద్ధము చేసిన సైనికులకును, సగము సమాజమునకును లభించును.

28. సైనికులకు లభించిన సగము సొమ్ము నుండి ప్రతి ఐదువందల ఎడ్లకు, గాడిదలకు, గొఱ్ఱెలకు ఒకదానిని, చెరజిక్కిన ప్రతి ఐదువందలమందికి ఒకరిని గైకొని ప్రభువునకు అర్పింపుడు. అది ప్రభువునకు కానుక సొమ్ము.

29. ఈ సొమ్ము ప్రభువునకు ముట్టుటకై యాజకుడైన ఎలియెజెరునకు అప్పగింపుడు.

30. ఇక, సమాజమునకు లభించిన కొల్ల సొమ్ము నుండి ప్రతి ఏబది ఎడ్లకు, గాడిదలకు, గొఱ్ఱెలకు, మేకలకు ఒకదానిని, చెరజిక్కిన ప్రతి ఏబది మందికి ఒకరిని గైకొని ప్రభుమందిరమునకు పరిచర్య చేయు లేవీయుల కిండు” అని చెప్పెను.

31. మోషే, ఎలియెజెరులు ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసిరి.

32. యిస్రాయేలు సైనికులు కొనివచ్చిన కొల్ల సొమ్ము వివరములివి:

33. ఆరులక్షల డెబ్బది ఐదు వేల గొఱ్ఱెలు;

34. డెబ్బది రెండువేల పశువులు; అరువది ఒక్కవేయి గాడిదలు;

35. ముప్పది రెండు వేలమంది పురుషుని కూడని కన్యలు.

36. సైనికులకు లభించిన సగభాగము సొమ్మున మూడు లక్షల ముప్పది ఏడువేల ఐదువందల గొఱ్ఱెలు కలవు. వీనిలో ప్రభువువంతు ఆరువందల డెబ్బది ఐదు.

37. వారికి లభించిన పశువులు ముప్పది ఆరువేలు. వీనిలో ప్రభువువంతు డెబ్బదిరెండు.

38. వారికి లభించిన గాడిదలు ముప్పదివేల ఐదువందలు.

39. దీనిలో ప్రభువువంతు అరువది ఒకటి.

40. వారికి లభించిన వ్యక్తులు పదహారువేలమంది, దీనిలో ప్రభువువంతు ముప్పదిఇద్దరు.

41. కొల్లసొమ్ములో ప్రభువునకు ప్రతిష్ణార్పణముగా చెల్లింపవలసినవంతును మోషే యాజకుడైన ఎలియెజెరునకు అప్పగించెను.

42. సైనికులయొద్దనుండి మోషే తీసుకొని యిస్రాయేలు సమాజమునకు ఇచ్చిన సగమునుండి లేవీయుల కిచ్చినవి:

43. మూడులక్షల ముప్పది ఏడువేల ఐదు వందల గొఱ్ఱెలు.

44. ముప్పది ఆరువేల పశువులు; ముప్పదివేల ఐదు వందల గాడిదలు;

45. పదునారు వేలమంది మనుష్యులును కలరు.

46. యిస్రాయేలు సమాజమునకు వచ్చిన ఈ సగము నుండి మనుష్యులలోను, పశువులలోను

47. ఏబదికి ఒకటి చొప్పున మోషే వేరుచేసి ప్రభువు ఆజ్ఞాపించినట్లు ప్రభుమందిరమున పరిచర్యచేయు లేవీయులకిచ్చెను.

48-49. యిస్రాయేలు సైన్యమున సహస్రాధిపతులు, శతాధిపతులు మోషే యొద్దకు వచ్చి “మేము మా సైనికులనందరిని లెక్కించిచూచితిమి. వారిలో ఒక్కడును హతుడు కాలేదు.

50. యుద్ధమున మాకు లభించిన బంగారు నగలు, కడియములు, మురుగులు, ఉంగరములు, చెవిపోగులు, దండలు ప్రభువునకు కానుకగా కొనివచ్చితిమి. ఇక మాకు ప్రాయశ్చిత్తము చేయింపుడు” అనిరి.

51. మోషే, యాజకుడైన ఎలియెజెరులు వారు కొనివచ్చిన బంగారమును, ఆభరణములను స్వీకరించిరి.

52. ఆ అధికారులు కొనివచ్చిన సొమ్ము 16,750 తులములు తూగెను.

53. ప్రతి సైనికుడు తాను కొల్లగొట్టిన సొమ్ము తానే ఉంచుకొనెను.

54. కాని సైనికాధికారులు అప్పగించిన సొమ్మును మాత్రము మోషే యాజకుడైన ఎలియెజెరులు ప్రభు సన్నిధిన యిస్రాయేలీయులకు జ్ఞాపకార్ధముగా సమావేశగుడారమున ఉంచిరి.

 1. రూబేను, గాదు తెగలవారు పెద్ద పెద్ద పశువుల మందలను సంపాదించిరి. యాసేరు, గిలాదు మండలములు పశువుల మందలను పెంచుటకు అనుకూలముగా నుండెను.

2. కనుక ఈ తెగలవారు మోషేను, యాజకుడైన ఎలియెజెరును, యిస్రాయేలు ప్రధానులను సమీపించి, 

3-4. "అటారోతు, దీబోను, యాసేరు, నిమ్రా, హేష్బోను, ఎల్యాలె, సేబోము, నేబో, బెయోను అను పట్టణములతో గూడిన ఈ మండలమును ప్రభువు అనుగ్రహమువలన మనము జయించితిమిగదా! ఈ సీమ పశువులను పెంచుటకు అనుకూలముగానున్నది. మాకు పెక్కు పశువుల మందలు కలవు.

5. మీకు మాపై కటాక్షము కలదేని యోర్దానునది ఆవలిదరికి మమ్ము దాటింపక మీ దాసులమైన మాకు ఈ నేల స్వాస్థ్యముగా ఇప్పింపుడు” అని అనిరి.

6. కాని మోషే వారితో “మీ సోదరులు యుద్ధమునకు పోగా మీరిక్కడనే ఉండిపోవచ్చునా?

7. ప్రభువు అనుగ్రహించిన సీమకు చేరకుండ మీరు యిస్రాయేలీయులను నిరుత్సాహపరచెదరా ఏమి?

8. నాడు నేను కాదేషు బార్నెయానుండి మీ పితరులను క్రొత్త దేశమునకు వేగులుగా పంపగా వారును అట్లే చేసిరి.

9. వారు ఏష్కోలు లోయవరకు వెళ్ళి వేగు చూచి వచ్చిరి. కాని వారు తిరిగివచ్చిన తరువాత మన ప్రజలను ప్రభువిచ్చిన సీమకు చేరనీయకుండ నిరుత్సాహపరచిరి.

10-11. కనుక ఆనాడు ప్రభువు ఉగ్రుడై ఐగుప్తునుండి వెడలివచ్చినవారిలో ఇరువది యేండ్లు మరియు అంతకు పైబడిన వారెవరు నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులకు వాగ్దానము చేసిన నేలకు చేరజాలరు. వారు నా ఆజ్ఞలను పాటింపరైరి' అని ఒట్టు వేసెను.

12. కెనిస్సీయుడైన యెఫున్నె కుమారుడు కాలెబు, నూను కుమారుడగు యెహోషువ మాత్రమే ప్రభువు ఆజ్ఞను పాటించిన వారు.

13. ప్రభువు మన ప్రజలపై కోపించి వారు నలువది యేండ్లపాటు ఈ ఎడారిలో తిరుగాడునట్లు చేసెను. ఆ విధముగా ప్రభువు ఆజ్ఞ మీరిన ఆ తరము వారందరును నశించిరి.

14. ఇప్పుడు పాపసంతతియగు మీరును మీ పితరులకు బదులుగా బయలుదేరి వచ్చితిరి. మీ పాపమువలన ప్రభువు కోపాగ్ని ఈ యిస్రాయేలు ప్రజలపై మరల రగుల్కొనును.

15. ఇప్పుడు మీరు ప్రభువును అనుసరింపలేని ప్రభువు మరల మన ప్రజలందరిని ఈ ఎడారిలోనే వదలివేయును. వారి వినాశనమునకు మీరు కారకులు అగుదురు” అనెను.

16. ఆ మాటలకు వారు మోషేతో “మేమిచట మా మందలకు దొడ్లు కట్టుకొందుము. మా బిడ్డలకు పట్టణములు నిర్మించుకొందుము.

17. అటు తరువాత మేము యిస్రాయేలీయులతో పాటు యుద్ధమున పాల్గొందుము. వారు ప్రభువు అనుగ్రహించిన దేశమును చేర్చువరకు మేము వారి ముందరసాగి యుద్ధము చేసెదము. అంతవరకు మా బిడ్డలు చీకుచింతలేకుండ ఇచట మేము నిర్మించిన సురక్షిత పట్టణములలో వసింతురు. ఈ దేశప్రజల వలన వారికి బాధకలుగదు.

18. మిగిలిన యిస్రాయేలీయులందరు వారి వారి భాగములను స్వాధీనము చేసికొనువరకు మేము ఈ పట్టణములకు తిరిగిరాము.

19. యోర్దానునకు ఆవలివైపున మేము భాగము తీసికొనము. మాకు రావలసినదేదో ఈ నదికి తూర్పు వైపుననే లభించు చున్నదిగదా!” అని అనిరి."

20. మోషే వారితో “మీరు చెప్పినట్లే చేయుదురేని అనగా మీరు ప్రభువుపక్షమున యుద్ధము చేయుటకు అంగీకరించెదరేని ఇక విచారింపనక్కర లేదు.

21. మీయందు యుద్ధముచేయువారందరు యోర్దాను దాటి శత్రువులు మనకు లొంగిపోవువరకు ప్రభువు నాయకత్వము క్రింద పోరాడవలెను.

22. మొదట మనవారు ఆ నేలను స్వాధీనము చేసుకోవలెను. అటుపిమ్మట దేవుని ఎదుటను తోడి ప్రజల ఎదుటను మీ బాధ్యత తీరిపోవును గనుక, మీరు తిరిగిరావచ్చును. అపుడే యోర్దానునకు తూర్పుననున్న ఈ భాగమును మీ స్వాధీనము చేయుటకు ప్రభువు అంగీకరించును.

23. కాని మీరు మాట నిలబెట్టు కొనలేని ప్రభువునకు ద్రోహము చేసినవారు అగుదురు. మీ పాపమునకు మీరు తప్పక శిక్షను అనుభవింతురు.

24. కనుక మీరు కోరినట్లే ఇచట పట్టణములు, గొఱ్ఱెలదొడ్లు కట్టుకొనుడు. కాని మీ మాట దక్కించు కొనుడు” అని అనెను.

25. రూబేను, గాదు తెగలవారు మోషేతో “మేము నీ మాట చొప్పుననే నడచుకొందుము.

26. మా భార్యలు, పిల్లలు, మా పశువుల మందలు ఈ గిలాదు మండలమున వసించును.

27. మేమందరము ప్రభువు నాయకత్వమున యుద్ధమునకు పోవుటకు సంసిద్ధులమై ఉన్నాము. నీవు చెప్పినట్లే మేము యోర్ధాను దాటి శత్రువులతో పోరాడెదము” అనిరి.

28. కనుక మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియెజెరునకును, నూను కుమారుడగు యెహోషువ కును, యిస్రాయేలీయుల తెగలలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఈ ఉత్తరువు ఇచ్చెను:

29. “రూబేను, గాదు తెగలవారు ప్రభువు నాయకత్వమున యోర్దానునది దాటి యుద్ధమున పాల్గొందురేని, వారి తోడ్పాటున మీరు ఆ నేలను వశము చేసికొందురేని, అప్పుడు గిలాదు మండలమును వారికి భుక్తముగా ఇచ్చివేయుడు.

30. కాని వారు నదిని దాటి మీతో పాటు యుద్ధమున పాల్గొనరేని, మీతో పాటు వారికిని కనాను మండలముననే భాగము లభించును.”

31-32. రూబేను, గాదు తెగలవారు మోషేతో “అయ్యా! మేము ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసెదము. ప్రభువు నాయకత్వమున మేము కనాను మండలమునకు పోయి యుద్ధమున పాల్గొనెదము. తరువాతనే యోర్దానునకు తూర్పుననున్న ఈ భాగమును భుక్తము చేసుకొందుము”. అనిరి.

33. కనుక మోషే రూబేను, గాదు తెగలకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్ధతెగకు అమోరీయుల రాజగు సీహోను రాజ్యమును, బాషాను రాజగు ఓగు రాజ్యమును, ఆ రాజ్యములకు చుట్టుపట్లనున్న సీమలను, పట్టణములను ఇచ్చివేసెను.

34-36. గాదుతెగలవారు సురక్షిత పట్టణములగు దీబోను, అటారోతు, ఆరెయోరు, అట్రోత్తుషోఫాను, యాసేరు, యెగ్బేహాత్తు, బేత్నిమ్రా, బేత్హేరాను పునర్నిర్మించి మందలదొడ్లను కట్టుకొనిరి.

37-38. రూబేను తెగవారు హేష్బోను, ఎల్యాలే, కిర్యతాయీము, నేటో, బాల్మెయోను, సిబ్మా నగరములను నిర్మించిరి. (ఈ పేర్లు తరువాత మార్చబడెను. ) తాము తిరిగి నిర్మించు కొనిన పట్టణములకు వారు క్రొత్త పేర్లు పెట్టిరి.

39. మనష్షే పుత్రుడగు మాకీరు తెగవారు గిలాదు మండలమును ఆక్రమించుకొని అచట వసించు అమోరీయులను తరిమివేసిరి.

40. మోషే ఆ మండలమును మాకీరు తెగవారికీయగా వారచట వసించిరి.

41. మనష్షే తెగకు చెందిన యాయీరు వంశమువారు కొన్ని గ్రామములను ఆక్రమించుకొని వానికి యాయీరు గ్రామములని పేరిడిరి.

42. నోబా వెళ్ళి కేనాతును దానిచుట్టుపట్ల గ్రామములను ఆక్రమించుకొని వానికి 'నోబాహు ' అని తన పేరు పెట్టెను.

 1. మోషే అహరోనుల నాయకత్వమున ఐగుప్తునుండి వెడలివచ్చిన యిస్రాయేలు సమాజము విడిదిచేసిన తావుల జాబితా యిది.

2. ఎడారిలో ఏ తావునైన విడిదిచేసినపుడు మోషే ప్రభువు ఆజ్ఞననుసరించి ఆ తావు పేరు లిఖించుచువచ్చెను. వారి విడుదుల పేర్లివి:

3. యిస్రాయేలీయులు ఏడాదిలో మొదటినెల పదునైదవ దినమున, తొలి పాస్క ఉత్సవమును జరుపుకొనిన దినమునకు మరుసటి దినమున ఐగుప్తునుండి బయలుదేరిరి. ఐగుప్తీయులు కన్నులార చూచుచుండగనే వారు విజయోత్సాహముతో రామెసేసు పట్టణమునుండి బయలుదేరిరి.

4. ప్రభువు సంహరించిన తమ తొలిచూలు పిల్లలను ఐగుప్తీయులు అపుడు పాతి పెట్టుకొనుచుండిరి. ఆ రీతిగా ప్రభువు ఐగుప్తీయులు కొలుచు దేవతలకు తీర్పుతీర్చెను.

5. ప్రజలు రామెసేసును వీడివచ్చి సుక్కోత్తున విడిదిచేసిరి.

6. సుక్కోత్తునుండి కదలి ఎడారి అంచున నున్న ఏతామున దిగిరి.

7. అచటినుండి సాగి వెనుకకు మరలి బాల్సెఫోనునకు తూర్పునున్న పీహహిరోత్తును చేరి మిగ్దోలు చెంత మకాముచేసిరి.

8. ఆ తావును వీడి రెల్లు సముద్రమును దాటి ఎడారిలో ప్రవేశించిరి. ఏతాము ఎడారిలో మూడునాళ్ళు ప్రయాణముచేసి మారా వద్ద విడిదిచేసిరి.

9. అచటినుండి ఏలీము చేరుకొనిరి. ఈ ఏలీమున పండ్రెండు చెలమలు, డెబ్బది ఖర్జూర వృక్షములు కలవు. గనుక అచట విడిది చేసిరి.

10. ఏలీము నుండి బయలుదేరి రెల్లు సముద్రము చెంత దిగిరి.

11. అటుపిమ్మట సీను ఎడారిచేరి అచట బసచేసిరి.

12. తరువాత దోఫ్కా వద్ద దిగిరి.

13. పిమ్మట ఆలూషున మకాము చేసిరి.

14. అటు తరువాత రెఫీదీమున ఆగిరి. ఇచట వారికి త్రాగుటకు నీళ్ళు దొరకలేదు.

15-37. రెఫీదీము నుండి హోరు పర్వతము వరకు వారు చేసిన విడుదులివి: సీనాయి ఎడారి, కిబ్రోతుహట్టావా, హాసెరోత్తు, రీత్మా, రిమ్మోను, పేరేసు, లిబ్నా, రీస్సా, కెహేలతా, సేఫేరా పర్వతము, హారదా, మాఖేలోత్తు, తాహతు, తేరా, మిత్కా హాష్మోను, మోసేరోత్తు, బెనెయాకాను, హోరు, హగ్గిద్ఘాదు, యోత్బాతా, అబ్రోనా, ఏసోన్గె‌బేరు కాదేషు అనబడు సీను ఎడారి, ఏదోము అంచుననున్న హోరు పర్వతము.

38-39. ప్రభువు ఆజ్ఞ చొప్పున యాజకుడగు అహరోను హోరు కొండమీదికెక్కి అచటనే ప్రాణములు విడిచెను. అప్పుడతనికి నూట యిరువది మూడేండ్లు, అది యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన నలువదియవ యేట ఐదవనెలలో మొదటిరోజు.

40. కనానుమండలము దక్షిణ భాగము పాలించు ఆరదు రాజు యిస్రాయేలీయులు వచ్చుచున్నారన్న వార్త వినెను.

41-49. హోరు పర్వతమునుండి మోవాబు మండలము వరకు యిస్రాయేలీయులు చేసిన విడుదులివి: సాల్మోనా, పూనోను, ఓబోతు, మోవాబు మండలములోని యియ్యెఅబరీము, దీబోనుగాదు, అల్మోను, దిబ్లతాయీము, నేబో పర్వతము చెంతనున్న అబారీము కొండ, మోవాబు మైదానమున యెరికో చెంతగల యోర్దాను తీరము. వారు మోవాబు మండలమున బేత్యేషిమోతు, ఆబేలు హాషిత్తీము ప్రదేశములకు మధ్య యోర్దాను తీరమున విడిదిచేసిరి.

50. ఆ మోవాబు మైదానమున యెరికో ఎదుట నున్న యోర్దాను తీరమున ప్రభువు మోషేను ఇట్లు ఆజ్ఞాపించెను:

51-52. “మీరు యోర్ధాను దాటి కనాను మండలమున ప్రవేశించినపిదప అచట ఆ దేశనివాసులందరిని తరిమివేయుడు. వారి రాతి విగ్రహములను, పోతబొమ్మలను, ఆరాధన స్థలములను నాశనము చేయుడు.

53. ఆ నేలను నేను మీకు ఇచ్చితిని గనుక మీరు దానిని స్వాధీనపరచుకొని అచట నివసింపుడు.

54. చీట్లు వేసి ఆయా తెగలకు, వంశములకు ఆ దేశమును వంచి పెట్టుము. పెద్ద వంశములకు పెద్దభాగములను, చిన్నవంశములకు చిన్న భాగములను పంచియిమ్ము. ఏ చీట్లకు ఏ భాగమువచ్చునో ఆ భాగమునే ప్రజలు తీసికొనవలెను. యిస్రాయేలు తెగకర్తలను బట్టి ఆయాతెగలకు ఈ నేలను పంచి యిమ్ము.

55. కాని మీరు ఆ దేశ వాసులను తరిమివేయనియెడల వారు మీకు కంటిలోని నలుసువలెను, ప్రక్కలో బల్లెమువలె నగుదురు. మీతో పోరాటమునకు దిగుదురు.

56. కనుక మీరు వారిని వెడలగొట్టలేని, నేను వారిని నాశనము చేయదలచు కొన్నట్లే మిమ్మును నాశనము చేసెదను” అని వారితో చెప్పుము.

 1. ప్రభువు మోషేతో “యిస్రాయేలు ప్రజలను ఇట్లు ఆజ్ఞాపింపుము.

2. మీరు కనానున ప్రవేశించిన తరువాత మీ సీమకు సరిహద్దులివి.

3. మీ సీమ దక్షిణపుభాగము సీను ఎడారినుండి ఎదోము సరిహద్దు మీదుగా పోవును. మీ దక్షిణపుహద్దు మృతసముద్రము చివరిన తూర్పు తీరమువరకు ఉండును.

4. తరువాత అది దక్షిణముగా అక్రాబీము కనుమ వరకు పోయి, సీను ఎడారిగుండ సాగిపోయి కాదేషు బార్నెయా చేరును. అటు తరువాత అది ఉత్తరమునకు తిరిగి హాస్సారు-అద్దారు, ఆస్మోను చేరును.

5. అచటినుండి ఐగుప్తు సరిహద్దులలోనున్న ఐగుప్తు నదివరకు పోయి సముద్రము చేరుకొనును.

6. మీ పడమటిహద్దు మధ్యధరాసముద్రము.

7. మీ ఉత్తరపుహద్దు మధ్యధరాసముద్రము నుండి హోరుకొండ వరకు పోయి

8. హామతు కనుమకు చేరును. అచటినుండి సేదాదు మీదుగా పోయి,

9. సీఫ్రొను చేరుకొని, హాసారు ఏనానున ముగియును.

10. మీ తూర్పుహద్దు హాసారు ఏనాను నుండి షేఫాము వరకు పోవును.

11. అచట నుండి రిబ్లాకు దక్షిణమునకు తిరిగి అయీనునకు తూర్పుననున్న కిన్నెరెతు చేరుకొని, కిన్నెరెతు సముద్రము నుండి తూర్పుననున్న కొండలను కలియును.

12. ఆ చోట నుండి యోర్దాను నదిమీదుగా మృతసముద్రము వరకు వ్యాపించి ఉండును. ఈ నాలుగు సరిహద్దులు మధ్య నుండు దేశము మీదదును” అనెను.

13. కనుక మోషే ప్రజలతో “మీరు చీట్లు వేసికొని పంచుకోవలసిన భూమి ఇదియే. ఈ నేలను ప్రభువు తొమ్మిదిన్నర తెగలకు ఇచ్చెను.

14-15. రూబేను, గాదు, మనష్షే అర్థతెగవారు వారివారి భాగములను యోర్ధానునకు తూర్పు దిక్కున ఇంతకు పూర్వమే స్వీకరించి వంశములవారిగా పంచుకొనిరి గదా!” అనెను.

16-17. ప్రభువు మోషేతో "యాజకుడగు ఎలియెరు, నూను కుమారుడగు యెహోషువ భూమిని పంచెదరు. 18. ఈ పనిలో వారికి తోడ్పడుటకై ప్రతి తెగనుండి ఒక నాయకునిగూడ ఎన్నుకొనుము.

19-28. వారి పేర్లివి: యూదా తెగనుండి యెఫున్నె కుమారుడగు కాలేబు, షిమ్యోను తెగనుండి అమ్మీహూదు కుమారుడగు షెలుమీయేలు, బెన్యామీను తెగనుండి ఖీస్లోను కుమారుడగు ఎలీదాదు, దాను తెగనుండి యోగ్లి కుమారుడగు బుక్కి, మనష్షే తెగనుండి ఎఫోదు కుమారుడగు హన్నీయేలు, ఎఫ్రాయీము తెగనుండి షిఫ్టాను కుమారుడగు కెమూవేలు. సెబూలూను తెగనుండి పార్నాఖు కుమారుడగు యెలిస్సాఫాను, యిస్సాఖారు తెగనుండి ఆస్సాను కుమారుడగు పల్టీయేలు, ఆషేరు తెగనుండి షెలోమి కుమారుడగు అహీహూదు, నఫ్తాలి తెగనుండి అమ్మీహూదు పుత్రుడగు పెదహేలు నాయకులుగా నుందురు” అనెను.

29. కనాను మండలమున యిస్రాయేలీయులకు భూమిని పంచియిచ్చుటకు ప్రభువు నిర్ణయించిన నాయకులు వీరే.