ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎజ్రా 9

 1. ఈ కార్యములన్ని జరిగిన తరువాత ప్రజానాయకులు కొందరు నా యొద్దకు వచ్చి "అయ్యా! మన ప్రజలు, యాజకులు, లేవీయులు చెడుపనులు చేయు అన్యజాతి జనులతో తెగతెంపులు చేసికోరైరి. కనాను, మోవాబు, అమ్మోను, ఐగుప్తు దేశములతో, హిత్తీయులు పెరిస్సీయులు, యెబూసీయులు, అమోరీయులు మొదలగు జాతులనుండి వేరుపడకుండ, వారితో కలిసి అసహ్యమైన కార్యములను చేయుచూ,

2. యూదులు ఇతరజాతుల ఆడుపడుచులను పెండ్లియాడి ప్రభువు పవిత్ర ప్రజలను భ్రష్టము చేసిరి. మన నాయకులును, అధికారులును ఈ పాపమును అధికముగా మూటకట్టుకొనిరి” అని చెప్పిరి.

3. ఆ మాటలు విని నేను విచారముతో బట్టలు చించుకొంటిని. తల వెంట్రుకలను, గడ్డపువెంట్రుకలను పెరికి వేసికొంటిని. విషాదముతో నేలపై చతికిలబడితిని.

4. సాయంకాలము దహనబలి సమర్పించు సమయమువరకు నేనట్లే దిగులుతో చతికలబడియుంటిని. నిర్వాసితుల పాపమును గూర్చి దేవుడుపలికిన పలుకులు విని భయపడిన యిస్రాయేలీయులందరు క్రమముగా వచ్చి నా చుట్టు ప్రోగైరి.

5. సాయంకాలబలిని సమర్పించునపుడు నేను చతికిలబడియున్న తావు నుండి ఎట్టకేలకు పైకి లేచితిని. ఆ చినిగిన బట్టలతోనే మోకాళ్లూని యావే వైపు చేతులెత్తి,

6. "ఓ దేవా, నాదేవా, నాదేవా! నీ ఎదుట తలెత్తుటకు గూడ నాకు సిగ్గుగానున్నది. మా పాపములు మా తలల కంటె ఎత్తుగా కుప్పలు పడియున్నవి. మా దోష రాశులు ఆకాశమంతయెత్తుగానున్నవి.

7. మా పితరుల కాలమునుండి మేము ఘోర పాతకములు చేసితిమి. మా అపరాధముల వలన మేమును, మా రాజులును, మా యాజకులును అన్యజాతిరాజులకు చిక్కిపోతిమి. వారు మమ్ము కత్తులతో పొడిచిరి. ప్రవాసమునకు కొనిపోయిరి. మా ఆస్తిపాస్తులను దోచుకొనిరి. మమ్ము అవమానపరచిరి. నేటికి మేము ఈ దురవస్థలోనే ఉన్నాము.

8. అయితే ఇప్పుడు మా దేవుడు మా కన్నులకు వెలుగునిచ్చి, మా దాస్యము నుండి మేము కొంచెము ఉపశమనము పొందునట్లును, మాలో ఒక శేషజనమును ఉండనిచ్చునట్లుగాను, తన పవిత్రస్థలమునందు మమ్ము స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యావే కొంతమట్టుకు మా మీద దయచూపెను.

9. మేము బానిసలము. అయినను నీవు మమ్ము బానిసలుగానే వదిలివేయలేదు. నీ దయవలన పారశీక రాజు మమ్మాదరముతో చూచెను. అతడు మమ్ము తెగటార్పలేదు. యెరూషలేమున శిథిలమైయున్న నీ దేవాలయమును మరలకట్టుటకును, యూదా రాజ్యమందు, యెరూషలేము పట్టణమునందు సురక్షితముగా వసించుటకును అతడు మాకు అనుమతినిచ్చెను.

10. మా దేవా! ఇంత కృపనొందిన పిమ్మట ఇక మేమేమి చెప్పగలము? మేము నీ ఆజ్ఞలను ధిక్కరించిన అపరాధులము.

11. మేము వసింపబోవు దేశము అపవిత్రమైనదని ప్రవక్తలద్వారా నీవు ముందు గనే యెరిగించితివి. ఆ దేశీయులు ఆ నేల నాలుగు చెరగులను అపవిత్ర కార్యములతో నింపివేసిరని నీవు పలికితివి.

12. మేము మా కుమార్తెలను వారి కుమారులకు వియ్యమొందరాదని మరియు మా కుమారులకు, వారి కుమార్తెలను పుచ్చుకొనరాదని నీ ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించితివి. మేము వృద్ధిచెంది ఈ దేశమునందలి భూములను మా సంతానమునకు వారసత్వముగా ఈయగోరెదమేని ఆ అన్య దేశీయులకు అభ్యుదయమునుగాని, శాంతి భద్రతలనుగాని తలపెట్టరాదని ఆజ్ఞాపించితివి.

13. మేము చేసిన మహాపాపములకుగాను మాకీ శిక్షలు ప్రాప్తించినవి. అయినను నీవు మా దోషములకు తగినట్లుగా మమ్ము దండింపవైతివి. నేటి వరకు మాలో కొందరిని ప్రాణములతో బ్రతుకనిచ్చితివి.

14. ఇదంతయు చాల దోయన్నట్లు మేము మరల నీ ఆజ్ఞ మీరి ఈ దుష్ట జనముతో పెండ్లి పొత్తు కుదుర్చుకొనుట యెట్లు? ఇట్లు చేసినచో నీవు మహాకోపముతో మమ్మందరిని నాశన ముచేయవా? ఎవరిని మిగులకుండ మమ్మందరిని మట్టుపెట్టవా?

15. యిస్రాయేలు దేవుడవైన ప్రభూ! నీవు న్యాయవంతుడవు కనుకనే నేడు మాలో కొందరము ఇంకనుబ్రతికిబట్టగట్టియున్నాము. చిత్తగించుము! నీ యెదుట మా పాపములను ఒప్పుకొనుచున్నాము. పాపులమైన మాకు నీ యెదుట నిలుచుటకట్టి యోగ్యతలేదు” అని ప్రార్ధించితిని.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services