ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 9

 1. యిస్రాయేలు ప్రజలు ఐగుప్తునుండి వెడలి వచ్చిన రెండవ సంవత్సరము మొదటినెలలో ప్రభువు సీనాయి ఎడారిలో మోషేతో మాట్లాడెను.

2. “ప్రజలు నియమిత రోజున పాస్కపండుగ చేసికోవలెను.

3. ఈ నెల పదునాలుగవరోజు సూర్యాస్తమయముతో పండుగ ప్రారంభమగును. ఉత్సవ నియమములన్నింటిని పాటించి పండుగ చేసికొనుడు” అని చెప్పెను.

4. కనుక మోషే పాస్క పండుగ జరుపుకోవలెనని ప్రజలకు ఆజ్ఞ ఇచ్చెను.

5. వారు సీనాయి ఎడారిలో రెండవ సంవత్సరము మొదటినెల పదునాలుగవరోజు సాయంకాలమున పండుగను ప్రారంభించిరి. ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే ప్రజలు పండుగజరుపుకొనిరి.

6. ప్రజలలో కొందరు శవమును తాకుటచే అపవిత్రులైరి. కావున పాస్కపండుగను నియమిత రోజున చేసికొనలేకపోయిరి.

7. వారు ఆరోజే మోషే అహరోనుల వద్దకు వచ్చి "మేము శవమును ముట్టు కొని అపవిత్రులమైతిమి. అయినను యిస్రాయేలు ప్రజలతో పాటు మేమును ప్రభువునకు నియామక కాలమున అర్పణమును అర్పింపకుండునట్లు ఎట్లు అడ్డగింపబడితిమి?” అని అడిగిరి.

8. మోషే “మీ విషయమై ప్రభువు ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందును, కొంచెము ఆగుడు” అని వారితో అనెను.

9. ప్రభువు మోషేతో “యిస్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము.

10. మీరుగాని, మీ తరువాత మీ సంతతివారు గాని శవమును తాకుటవలన అపవిత్రు డైనను, దూరప్రయాణమువలనైనను పాస్కపండుగను ఆచరింపనిచో,

11. రెండవనెల పదునాలుగవ రోజు సాయంకాలమున ఉత్సవముచేసుకోవచ్చును. పొంగని రొట్టెలతో, చేదైన ఆకుకూరలతో, పాస్కవిందును భుజింపవలెను.

12. ఆ విందును మరుసటిరోజుకు మిగుల్పరాదు. పాస్కగొఱ్ఱె పిల్ల ఎముకలను విరుగ గొట్టరాదు. పాస్కనియమములను పాటించి పండుగ జరుపుకోవలెను.

13. అశుద్ధి, దోషము సోకనివారు గాని, ప్రయాణావసరము లేని వారుగాని పండుగను పాటింపనిచో సమాజము నుండి వెలివేయబడుదురు. వారు సకాలమున ప్రభువునకు కానుకలు కొనిరాలేదు కనుక పాపఫలమును అనుభవింతురు.

14. అన్యదేశీయుడెవడైన మీచెంత వసించుచు పాస్కపండుగను ఆచరింపగోరినచో, అతడు పండుగ నియమములన్నింటిని పాటింపవలెను. యిస్రాయేలు ప్రజలకుగాని అన్యదేశీయులకు గాని పాస్కనియమములు ఒక తీరుగానేయుండును” అని చెప్పెను.

15-16. నిబంధనగుడారము చేసి నిలబెట్టిన దినమున మేఘమొకటి దానిని క్రమ్ముకొనెను. చీకటి పడినప్పటి నుండి తెల్లవారువరకు అది అగ్నిరూపమున గుడారముపై నిల్చెడిది. నిత్యము అలాగే జరిగెడిది.

17. మేఘము గుడారముమీదినుండి పైకి లేవగనే యిస్రాయేలీయులు శిబిరమును కదలించి ప్రయాణము కట్టెడివారు. మేఘము ఆగగనే గుడారము పన్ని విడిదిచేసెడివారు.

18. ఈరీతిగా వారు ప్రభువు ఆజ్ఞను అనుసరించి ప్రయాణము చేసెడివారు. ప్రభువు ఆజ్ఞను అనుసరించి విడిది చేసెడివారు.

19. మేఘము గుడారముపై నిలిచినంతకాలము ప్రజలు విడిదిచేసెడివారు. మేఘము గుడారముపై చాలకాలము ఆగినచో ప్రజలు ప్రభువు ఆజ్ఞకు బద్దులై శిబిరమును కదలించెడివారుకారు.

20. ఒక్కొక్కమారు మేఘము కొద్దికాలము మాత్రమే గుడారముపై నిలిచెడిది. ఏది ఏమైనను వారు ప్రభువు ఆజ్ఞను అనుసరించి గుడారముపన్ని విడిది చేసెడివారు. ప్రభువు ఆజ్ఞను అనుసరించి శిబిరము కదలించి ప్రయాణము చేసెడివారు.

21. మేఘము రాత్రివేళ గుడారముపై ఆగి ఉదయమున పైకిలేచినచో వారును ఉదయమున ప్రయాణము కట్టెడివారు. పగలైననేమి, రాత్రియైననేమి, మేఘము కదలినప్పుడే వారు కూడ కదలెడివారు. ఆ

22. ఒక్కొక్కమారు మేఘము మూడు నాలుగు దినములు, నెల, ఏడాదిగూడ గుడారముపై నిలిచెడిది. అది నిలిచినంతకాలము యిస్రాయేలీయులు అక్కడనే విడిదిచేసెడివారు. కాని అది లేవగనే వారును ప్రయాణ మయ్యెడివారు.

23. ప్రభువు ఆజ్ఞను అనుసరించి గుడారముపన్ని విడిదిచేసెడివారు. ప్రభువు ఆజ్ఞను అనుసరించి శిబిరమును కదలించి ప్రయాణము చేసెడివారు. ఈ రీతిగా వారు ప్రభువు మోషేద్వారా ఇచ్చిన ఆజ్ఞలకు బద్ధులైరి.