1. విజ్ఞానివంటి వాడెవడు? పరమార్థము తెలిసినవాడతడే. విజ్ఞానమువలన నరుని ముఖము తేజరిల్లును. అతని ముఖములోని కోపము తొలగిపోవును.
2. రాజాజ్ఞను పాటింపుము. త్వరపడి దేవుని పేరు మీద వ్రతము పట్టవలదు.
3. రాజు తలంచిన దెల్ల చేయగలడు. కనుక నీ కోర్కెను నెరవేర్చుకొను టకుగాను మొండిపట్టుపట్టి అతనియెదుట చాలకాలము నిలువవలదు.
4. రాజు అధికారము కలవాడు. అతనిని కాదనుటకు ఎవడు సాహసించును?
5. రాజాజ్ఞను పాటించువానికి ఎట్టి ముప్పును లేదు. ఆ ఆజ్ఞను ఎట్లు పాటింపవలయునో జ్ఞాని ఎరుగును.
6. ఏ కార్యమునైన సక్రమముగా చేయవలెనన్న ఒక కాలమును, ఒక పద్ధతిని అనుసరింపవలయును. కాని ఈ వివరములు మనకు సరిగా తెలియవు.
7. భవిష్యత్తులో ఏమి జరుగునో మనకు తెలియదు. తెలియ జేయువారును లేరు.
8. ఏ నరుడును తన జీవనకాలమును పొడిగించుకొని మృత్యువునకు దూరము కాజాలడు. మరణ యుద్ధమును ఎవడును తప్పించుకోజాలడు. ఇక్కడ మన మోసములేమియు చెల్లవు.
9. సూర్యునిక్రింద జరుగు కార్యములను చూచినపుడు నేను ఈ సంగతులెల్ల గ్రహించితిని. ఇచట ఒకడు మరియొకని మీద పెత్తనముచేసి, వానికి హాని కలిగించుచున్నాడు. .
10. నేను దుర్మార్గులను సమాధులలో పాతి పెట్టుట చూచితిని. కాని ప్రజలు ఆ సమాధులనుండి తిరిగి రాగానే ఆ దుర్మార్గులు పూర్వము దుష్కార్యములు చేసిన నగరములలోనే వారిని స్తుతింపనారంభించిరి. ఇదియును వ్యర్థమే.
11. నేరము చేసిన వారికి వెంటనే శిక్షపడదు. కనుకనే నరులు భయము విడిచి హృదయపూర్వకముగా చెడుపనులు చేయుచున్నారు.
12. దుర్మార్గులు నూరు నేరములు చేసికూడ బ్రతికి పోవచ్చును. అయినను దేవునికి లొంగియుండినచో అన్నియును సవ్యముగనే జరుగును.
13. “దుర్మార్గునికి సంతోషము లేదు. అతడు దేవుని ఆజ్ఞను పాటింపడు. కనుక నీడవలె రోజులు గడపి, వయసు చెల్లకమునుపే గతించును”. అని జనులు చెప్పుదురు.
14. కాని ఇది నిజము కాదు. వ్యర్ధమైనది ఒకటి సూర్యునిక్రింద దీనికి భిన్నముగా జరుగుటను చూచుచున్నాము. సత్పురుషులు దుర్మార్గులవలె శిక్షననుభవించుచున్నారు. దుర్మార్గులేమో సత్పురుషులవలె సన్మానము పొందుచున్నారు. ఇది యును వ్యర్థమే.
15. కనుక నరుడు సుఖములను అనుభవింపవలెనని నా అభిప్రాయము. తిని, త్రాగి, ఆనందించుటకంటె నరుడు ఈ లోకమున చేయగలిగిన ఉత్తమ కార్యమేమియును లేదు. దేవుడు నరునికి ఈ లోకమున దయచేసిన జీవితకాలములో అతడు కష్టపడి పనిచేసినందులకు అతనికి దక్కు ఫలితమిదియే. -
16. నేను విజ్ఞానమును ఆర్జింపగోరితిని. ఈ లోకములోని సంగతులు తెలిసికోగోరితిని. నేను గ్రహించినదేమనగా, నరుడు రేయింబవళ్ళు నిద్ర మాని కన్నులు తెరచుకొని చూచినను దేవుడు చేయు కార్యములను అర్థము చేసికోజాలడు.
17. నరుడు ఎంత ప్రయత్నించినను ఈ విషయమును గ్రహింప జాలడు. జ్ఞానులకు కూడ ఈ సంగతి తెలియదు. వారు మాత్రము తమకు తెలియుననుకొందురు.