ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 8

 1-2. దేవుడు మోషేతో ఇట్లు సెలవిచ్చెను. నీవు అహరోనుతో ఇట్లు చెప్పుము; “నీవు దీపమును వెలిగించునపుడు దీపస్తంభముమీది ఏడుదీపముల వెలుగు దీపస్తంభమునకు ముందు భాగమున పడునట్లు చూడవలెను.”

3. అహరోను ప్రభువు ఆజ్ఞాపించినట్లే దీపస్తంభమునకు ముందువైపున దీపములు అమర్చెను.

4. అతడు దీపస్తంభమునంతటిని సాగగొట్టిన బంగారముతో చేసెను. ప్రభువు మోషేకు చూపిన నమూన ప్రకారము దానిని తయారుచేసెను.

5-6. ప్రభువు మోషేతో ఇట్లనెను: “లేవీయులను యిస్రాయేలీయులనుండి వేరుపరచి శుద్ధిచేయింపుము.

7. వారిపై శుద్దీకరణ జలమును చల్లుము. వారు క్షురకత్తితో శరీరమంతటిని గొరిగించుకొని తమ బట్టలను శుభ్రము చేసుకోవలెను. అపుడు వారు శుద్ధి పొందినట్లగును.

8. వారు ఒకకోడెను, నైవేద్యమునకై నూనెకలిపిన గోధుమపిండిని తీసికొనిరావలెను. పాప పరిహారబలికై నీవు మరియొక కోడెను సమకూర్చు కొనుము.

9. లేవీయులను సాన్నిధ్యపుగుడారము నొద్దకు కొనిరమ్ము, యిస్రాయేలీయులందరిని పిలిపింపుము.

10. వారు లేవీయులమీద చేతులు చాపవలెను.

11. అంతట అహరోను యిస్రాయేలు ప్రజల నుండి లేవీయులను వేరుపరచి నాకు ప్రత్యేకమైన కానుకగా వారిని సమర్పింపవలెను. వారిని నా సేవకై నివేదింపవలెను. అప్పటినుండి వారు నా సేవకు సమర్పింప బడుదురు.

12. అటు తరువాత లేవీయులు కోడెల తలలపై చేతులు చాచెదరు. నీవు వానిలో ఒకదానిని పాపపరిహారబలిగా సమర్పింపుము. రెండవదానిని దహనబలిగా అర్పింపుము. లేవీయులను శుద్ధిచేయు విధానమిది.

13. అహరోను ఎదుటను, అతని కుమారుల ఎదుటను వారిని నిలువబెట్టి నాకు ప్రత్యేకమైన కానుకగా అర్పింపుము.

14. ఈ రీతిగా లేవీయులను యిస్రాయేలీయులనుండి వేరు పరచి వారిని నా వారినిగాజేయుము.

15. అపుడు వారు నా సమావేశపుగుడారమున పరిచర్య చేయుదురు.

16. లేవీయులను శుద్ధిచేసి నాకు సమర్పింపుము. వారు యిస్రాయేలీయులనుండి నాకు నివేదింపబడిన వారు. వారి తొలిచూలు కుమారులకు మారుగా నాకు సమర్పింపబడినవారు.

17. ఏలయన యిస్రాయేలీయుల సంతతిలోనేమి, వారి పశుగణములోనేమి తొలిచూలియైనది ప్రతి ఒక్కటి నాది. కుమారులతో పాటు వారి పశువుల తొలిచూలు పిల్లలు నాకు చెందును. నేను ఐగుప్తీయుల తొలిచూలు సంతతిని వధించినపుడే వారిని నావారినిగా చేసికొంటిని.

18. ఇపుడు యిస్రాయేలు తొలిచూలు కుమారులకు మారుగా లేవీయులను నా వారినిగా చేసికొందును.

19. వారు యిస్రాయేలీయులు నాకు ఇచ్చిన కానుక. నేను వారిని అహరోను కుమారుల అధీనమున ఉంచుదును. ఆ లేవీయులు సాన్నిధ్యపు గుడారమున పరిచర్య చేయుచు యిస్రాయేలీయులను కాపాడు దురు. కావున గుడారమును సమీపించునపుడు యిస్రాయేలీయులకు ప్రాణహానికలుగదు” అని చెప్పెను.

20. మోషే, అహరోనులు, యిస్రాయేలు ప్రజలు ప్రభువు ఆజ్ఞాపించినట్లే లేవీయులను శుద్ధిచేయించిరి.

21. లేవీయులు శుద్ధిచేసికొని తమబట్టలు శుభ్రము చేసికొనిరి. అహరోను వారిని దేవునికి ప్రత్యేకకానుకగా సమర్పించెను. వారికి శుద్ధీకరణ ప్రాయశ్చిత్తమును కూడ జరిపించెను.

22. అంతట లేవీయులు అహరోను కుమారుల పర్యవేక్షణలో గుడారమున పరిచర్యజేసిరి. లేవీయులను గూర్చి ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే అంతయు జరిగెను.

23-24. ప్రభువు మోషేతో “లేవీయులు ఇరువదియైదేండ్లు మరియు ఆ పైబడిన ప్రాయము నుండి సాన్నిధ్యపుగుడారమున పరిచర్య చేయుదురు.

25. ఏబదిఏండ్ల వయసు వచ్చిన పిదప వారు గుడారమున పరిచర్య చేయనక్కరలేదు.

26. ఆ తరువాత వారు తోటి లేవీయులకు పరిచర్యలో తోడ్పడవచ్చునుగాని తమంతట తాము పరిచర్యకు పూనుకోరాదు. లేవీయులను గూర్చిన నియమమిది” అని చెప్పెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services