1-5. ఈ సంఘటనలు ముగిసిన తరువాత, అర్తహషస్త పారశీకదేశమును పరిపాలించుకాలమున సెరాయ కుమారుడగు ఎజ్రా బబులోనియా దేశము నుండి యెరూషలేము నగరమునకు వచ్చెను. అతని వంశకర్తలు క్రమముగా- అసర్యా కుమారుడగు సెరాయ, అసర్యా, హిల్కియా, షల్లూము, సాదోకు, అహీటూబు, అమర్యా, అసర్యా, మెరాయోతు, సెరాహియా, ఉజ్జీ, బుక్కీ ఫీనెహాసు, ఎలియెజెరు, ప్రధానయాజకుడగు అహరోను.
6. ఈ ఎజ్రా యిస్రాయేలు దేవుడైన ప్రభువు మోషేకు ప్రసాదించిన ధర్మశాస్త్రమున పండితుడు. ప్రభువు ఎజ్రాను చల్లనిచూపు చూచెను గనుక రాజు అతడు కోరినదంతయు ఒసగెను.
7. అర్తహషస్త ఏలుబడి ఏడవయేట యిస్రాయేలీయులు కొందరు, యాజకులు కొందరు, లేవీయులును, దేవాలయ గాయకులును, దేవాలయ ద్వారసంరక్షకులును, నెతీనీయులును' బయలుదేరి యెరూషలేమునకు వచ్చిరి.
8-9. వారు మొదటి నెల మొదటిదినమున బబులోనియా నుండి పయనమైరి. ఐదవనెల మొదటిరోజున యెరూషలేము చేరుకొనిరి. ప్రభువు వారికి తోడైయుండెను.
10. ఎజ్రా నిష్ఠతో ధర్మశాస్త్రమును పరి శోధించి, దానిని ఆచరించుటకును, అందలి నియమములన్నిటిని యిస్రాయేలీయులకు నేర్పుటకును నిశ్చయించుకొనెను.
11. అర్తహషస్త, యాజకుడును ధర్మశాస్త్ర పండితుడునైన ఎజ్రాకిచ్చిన శాసనమిది. ఈ ఎజ్రా యిస్రాయేలునకు ప్రభువు ప్రసాదించిన ధర్మశాస్త్రవిధులను క్షుణ్ణముగా ఎరిగినవాడు,
12. “రాజాధిరాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమున కోవిదుడును యాజకుడునైన ఎజ్రాకు శుభములు పలికి వక్కాణించునది;
13. నీకు తెలిసియున్న ధర్మశాస్త్రమును యూదా, యెరూషలేమువాసులైన యూదులు ఎంతవరకు పాటించుచున్నారో తెలిసికొనుటకు నీవు రాజు చేతను, అతని ఏడుగురు మంత్రులచేతను పంపబడితివి. కనుక మేము చేసిన నిర్ణయమేమనగా,
14. మా రాజ్యములోను ఉండు యిస్రాయేలీయులలో వారి యాజ కులలోను, లేవీయులలోను యెరూషలేము పట్టణ మునకు వెళ్ళుటకు హృదయపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరును నీతోకూడ వెళ్ళవచ్చును.
15. యెరూషలేములో నివాసముగల యిస్రాయేలీయులు దేవునకు సమర్పించు వెండి బంగారు కానుకలను నీవు అచటకు కొనిపోవలయును.
16. పైగా నా రాజ్యమున నీవు సేకరించు వెండి బంగారములను, ఇచటి యిస్రాయేలీయులు, వారి యాజకులు యెరూషలేమునందలి దేవాలయమునకు సమర్పించు కానుకలను నీవు అచటకు కొనిపోవలయును.
17. ఈ సొమ్ముతో నీవు కోడెలను, పొట్టేళ్ళను, గొఱ్ఱెపిల్లలను, ధాన్యమును, ద్రాక్షసారాయమును కొని యెరూషలేమునందలి బలిపీఠము మీద బలిగా సమర్పింపుము.
18. మిగిలిన సొమ్మును మీ దేవుని చిత్త ప్రకారముగా నీవు, మీ దేశీయులు కోరుకొని నట్లుగా వెచ్చింపవచ్చును.
19. దేవాలయమున విని యోగించుటకు నీకీయ బడిన పాత్రలన్నిటిని నీవు యెరూషలేము దేవాలయమున అర్పింపవలయును.
20. దేవాలయమునకు వలసిన ఇతర వస్తువులేమైన కావలయునేని మా రాజ్య ధనాగారమునుండి నీకు ఇయ్యబడును.
21. మరియు రాజునైన అర్తహషస్త అను నేను యూఫ్రటీసు నదికి పశ్చిమమునయున్న కోశాధికారులందరికి ఇచ్చు ఆజ్ఞ: “ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమున కోవిదుడును, యాజకుడునైన ఎజ్రా కోరినదంతయు క్రమము తప్పక సమకూర్ప వలయును.
22. వారతడు కోరిన వస్తువులను 7,500 వెండి నాణెములవరకు, 500 కుంచముల గోధుమల వరకు, 550 బుడ్డు ద్రాక్షసారాయము వరకు, 500 బుడ్లు ఓలివునూనె వరకు సమకూర్పవలయును. ఉప్పు అడిగినంత ఈయవలెను.
23. ఆకాశమందలి దేవుడు తన దేవాలయార్చనకు కోరుకొనునదంత రాజోద్యో గులు సమకూర్పవలెను. ఆ దేవుడు నా మీదగాని, నా అనుయాయుల మీదగాని కినుక పూనరాదు.
24. దేవాలయమున కైంకర్యము చేయు యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారసంరక్షకులు, దేవా లయ పనివాండ్రనుండి రాజోద్యోగులు పన్నులు వసూలు చేయరాదు.
25. ఓయి ఎజ్రా! నీవు మీ దేవుడు నీకు ప్రసాదించిన వివేకముతో పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రమున యావే ప్రభువు ధర్మశాస్త్ర మును అనుసరించి జీవించు ప్రజలందరికి పాలకులను, న్యాయాధిపతులను నియమింపుము. తెలియనివారికి నీవు ధర్మశాస్త్రమును బోధింపుము.
26. ఎవరైనను దేవుని ధర్మశాస్త్రములకును, ఈ నాఆజ్ఞలకును బద్దులుకారేని వారికి ఉరికంబము, ప్రవాసము, ఆస్తిజప్తు, చెర మొదలైన శిక్షలను విధింపవలయును.”
27. అప్పుడు ఎజ్రాయిట్లనెను: “మన పితరుల దేవుడు స్తుతింపబడును గాక! ఆయన యెరూషలేము నందలి మన ప్రభువు దేవాలయమును రాజు గౌరవించునట్లు చేసెను.
28. ప్రభువు కృపవలన నేను ఆ రాజు, అతని సలహాదారులు, ఉన్నతోద్యో గులు మొదలగు వారి ఆదరమునకు నోచుకొంటిని. ప్రభువు నాకు ధైర్యమును ప్రసాదించెను. కనుకనే నేను చాలా మంది యిస్రాయేలీయులను నా వెంట కొనిరాగలిగితిని.”