1. ఎలీషా రాజుతో "ప్రభువు సందేశము వినుము. రేపీపాటికే సమరియా అంగడిలో ఒక మానిక మంచి గోధుమపిండి, రెండు మానికల యవలను ఒక వెండి నాణెమునకు అమ్మెదరు” అనెను.
2. ఆ మాటలకు రాజు అంగరక్షకుడు “ప్రభువు వెంటనే ఆకాశకిటికీలు తెరిచిననూ, నీవు చెప్పినంత చౌకగా ధాన్యము అమ్ముడు పోదు” అనెను. ఎలీషా “నీ కన్నులారా చూతువు కాని నీవు మాత్రము ఆ ధాన్యముతో వండిన భోజనమును ముట్టుకోజాలవు” అని మారు పలికెను.
3. అప్పుడు కుష్ఠరోగులు నలుగురు సమరియా నగరద్వారమువద్ద పడిఉండిరి. వారు తమలో తాము “మనము ఆకలితో చచ్చు వరకు ఇకుడనే పడి ఉండనేల?
4. నగరమున ప్రవేశించినచో, నగరమున కరువు ఉన్నందున అక్కడను చత్తుము. అటులని ఇక్కడున్నను చావు తప్పదు. కనుక ఇపుడు సిరియనుల శిబిరమునకు వెళ్ళుదము రండు. వారు మనలను చంపినచో చత్తుము. బ్రతుకనిచ్చినచో బ్రతుకుదుము” అనుకొనిరి.
5. ఇట్లనుకొని వారు సందె చీకటిన శత్రు శిబిరమునకు పోయి చూచెదమని లేచి, శిబిరమును చేరిచూడగ అచట ఎవ్వరును కన్పింపలేదు.
6. ప్రభువు సిరియనులకు రథములతో, గుఱ్ఱములతో వచ్చు మహా సైన్యనాదము వంటి ధ్వని విన్పడునట్లు చేయగా, ఆ శబ్దము విని సిరియనులు యిస్రాయేలు రాజు జాతీయ రాజులకును, ఐగుప్తు రాజులకును బత్తెమిచ్చి తమమీద పడుచున్నాడు కాబోలునని కలవరపడిరి.
7. కనుక వారు తమ గుడారములను, గుఱ్ఱములను, కంచరగాడిదలను విడనాడి శిబిరమును ఉన్నదానిని ఉన్నట్లు వదలి పెట్టి బ్రతుకుజీవుడా అని సందె చీకటిలో పారిపోయిరి.
8. కుష్ఠరోగులు పాళెము చొచ్చి ఒక గుడారమున జొరబడి అచటనున్న అన్న పానీయములు పుచ్చుకొనిరి. అచట దొరకిన వెండి బంగారములు, వస్త్రములు దోచుకొనిపోయి ఒక తావున దాచివచ్చిరి. మరల ఇంకొక గుడారమున ప్రవేశించి దానినిగూడ దోచుకొనిపోయిరి.
9. అంతట ఆ నలుగురు ఒకరితోనొకరు “మనము పాడుపని చేయుచున్నాముకదా! ఇది నేడు పట్టణమున వినిపింపదగిన శుభసందేశము. అయినను మనము నోరు కదుపుటలేదు. రేపు ప్రొద్దు పొడుచువరకు ఈ సంగతిని దాచెదమేని అధికారులు మనలను దండింతురు. కావున వెంటనే వెళ్ళి జరిగిన సంగతిని రాజోద్యోగులకు తెలియజేయుదము” అని తమలో తాము మథనపడిరి.
10. కనుక వారు శిబిరమునుండి సమరియా నగరద్వారము వద్దకు వచ్చి అచట కాపున్న ద్వారపాలకులతో “మేము సిరియనుల మకామునకు వెళ్ళితిమి. కాని అచట ఎవరును కన్పింపలేదు. జనసందడి కూడలేదు. గుఱ్ఱములు, గాడిదలు కట్టిపడియున్నవి, గుడారములు ఎక్కడివక్కడే నున్నవి” అని చెప్పిరి.
11. ద్వారపాలకులు ఆ వార్తను రాజసౌధమున వినిపింపజేసిరి.
12. అప్పటికింకను చీకట్లు విచ్చిపోలేదు. అయినను రాజు పడక నుండి లేచి తన ఉద్యోగులతో “మీరు ఈ సిరియనుల పన్నాగము నెరిగితిరా? మనమిక్కడ కరవుతో చచ్చిపోవుచున్నాము కదా! కనుక వారు శిబిరము వీడిపోయినట్లు నటించి ఎక్కడనో పొలమున దాగుకొని ఉందురు. మనము భోజనపదార్థములు సేకరించుకొనుటకు నగరము వీడివత్తుమని వారి తలపు. అప్పుడు మనమీదపడి మనలను బంధించి, మన నగరమును స్వాధీనము చేసికొనవచ్చునని వారి కుట్ర” అనెను.
13. అప్పుడు రాజోద్యోగి ఒకడు “ప్రభూ! ఇక ఈ పట్టణమున మిగిలియున్నవారును గతించినవారివలె చచ్చుట నిక్కము. కనుక ఆ మిగిలియున్న అయిదు గుఱ్ఱములపై కొందరిని శత్రు శిబిరమునకు పంపుదము. వారు వెళ్ళి ఏమి జరిగినదో తెలిసికొనివత్తురు” అనెను'.
14. అంతట ఉద్యోగులు జనులను కొందరిని ఎన్నుకొనగా రాజు వారిని రెండు రథములపై పంపి, మీరుపోయి సిరియనుల శిబిరమున ఏమి జరిగినదో తెలిసికొనిరండని చెప్పెను.
15. అటుల వెళ్ళిన వారు సిరియనులను గాలించుచు యోర్దాను వరకు వెళ్ళిరి. శత్రువులు పారిపోవుచు త్రోవలో జారవిడిచిన బట్టలను సామగ్రిని చూచిరి. వారు తిరిగివచ్చి తాము చూచినదంతయు రాజునకు విన్నవించిరి.
16. వెంటనే యిస్రాయేలు పౌరులు ఒక్కుమ్మడిగా పరుగెత్తుకొనిపోయి సిరియా శిబిరమును దోచుకొనిరి. అపుడు ప్రభువు చెప్పినట్లుగనే నగరమున ఒకమానిక మంచి గోధుమపిండి, రెండుమానికల యవలు ఒకవెండినాణెమునకు అమ్ముడుపోయెను.
17. ఆ సమయమున రాజు తన అంగరక్షకునే నగరద్వారమునకు కాపుంచి ఉండెను. కాని ప్రజలు శిబిరమునకుపోవు సంబరమున అతనిని తొక్కివేసిరి. మునుపు రాజు తనను చూడబోయినప్పుడు ఎలీషా ప్రవచించినట్లే ఆ అంగరక్షకుడు మరణించెను.
18. రేపు ఈ పాటికి సమరియా అంగడిలో ఒక మానిక మంచి గోధుమపిండి, రెండుమానికల యవలు ఒక వెండినాణెమునకు అమ్ముడుపోవునని ప్రవక్త రాజుతో చెప్పెనుకదా! అతడు చెప్పినట్లే జరిగెను.
19. అపుడు రాజు అంగరక్షకుడు ప్రభువు వెంటనే ఆకాశ కిటికీలు తెరిచిననూ నీవు చెప్పినంతచౌకగా ధాన్యము అమ్ముడు వోదు అనెను. అందుకు ఎలీషా “నీ కన్నులారా చూతువు కాని నీవు మాత్రము ఆ ధాన్యముతో వండిన భోజనమును ముట్టుకోజాలవు” అని నుడివెను గదా!
20. అతడు చెప్పినట్లే జరిగెను. నగరద్వారమున ప్రజలు అంగరక్షకుని తొక్కుకొని పోగా అతడు మరణించెను.