ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉపదేశకుడు 7

 1. విలువగల సుగంధ తైలములకంటె మంచిపేరు మెరుగు. పుట్టినరోజుకంటె, గిట్టినరోజు విలువైనది.

2. విందులు చేసికొను ఇంటికి పోవుటకంటె, విచారముతో మ్రగ్గు ఇంటికి పోవుటమేలు. మనందరి గమ్యము మృత్యువేనని బ్రతికియున్న వారెల్లరును గుర్తించుట మేలు.

3. ఆనందముకంటె విచారముమిన్న. విచారవదనుడు విషయములను లెస్సగా గ్రహించును.

4. విజ్ఞాని మృత్యువుపై మనస్సు నిల్పును. అజ్ఞాని ఆనందముపై నిల్పును. .

5. బుద్దిహీనుల ముఖస్తుతులు ఆలించుటకంటె విజ్ఞానులచే చీవాట్లు తినుటయే మేలు.

6. మూర్చులు నవ్వెడినవ్వు నిప్పులలో చిటపట కాలు ముండ్ల శబ్దమువలె నుండును. ఇదియును వ్యర్థమే.

7. మోసముచేయు విజ్ఞాని మూర్ఖుడే అగును. లంచము పుచ్చుకొనుటచేత బుద్ధిచెడును.

8. కార్యారంభముకంటె దాని ముగింపు ముఖ్యము. దాని మీకంటే సహనము ము బుద్దిహీనుల

9. త్వరగా కోపపడవద్దు. కోపము బుద్దిహీనుల హృదయములో గూడుకట్టుకొని యుండును.

10. “నేటి దినములకంటె పూర్వపు దినములేల మెరుగుగా నుండెడివి” అని ప్రశ్నింపవలదు. అది తెలివి తక్కువ ప్రశ్న.

11. బ్రతికియున్న వారికందరికిని విజ్ఞానము అవసరము. అది వారసత్వముగా వచ్చిన ఆస్తివంటిది.

12. ధనమువలె అదియును రక్షణమునిచ్చును. విజ్ఞానమువలన నరునికి భద్రత సిద్దించును. దాని లాభమట్టిది.

13. దేవుని కార్యములను పరిశీలింపుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడును తిన్నని దానినిగా చేయజాలడు.

14. నీకు అనుకూలముగా కార్యములు జరుగునప్పుడు సంతసింపుము. అవి నీకు ప్రతికూలముగా జరుగునప్పుడు ఈ విషయమును గుర్తుంచుకొనుము. సంతోషమును, దుఃఖమునుగూడ దేవుడే పంపును. మనము ఆయనమీద తప్పు మోపలేము.

15. నిరర్ధకమైన నా ఈ జీవితకాలములో నేను అన్ని విషయములను గమనించితిని. మంచివాడు గతించుచున్నాడు. దుర్మార్గుడేమో చాల కాలము జీవించుచున్నాడు.

16. నీవు అతి దుర్మార్గుడవు కాని, మహావిజ్ఞానివి కాని కావలదు. అట్లయిన నిన్ను నీవే నాశనము చేసుకోనేల?

17. నీవు పరమ దుర్మార్గుడవు కాని, మహా మూర్ఖుడవు కాని కావలదు. అట్లయిన నీ కాలము రాకమునుపే చావనేల?

18. ఒకదానిని సాధించునపుడు మరి యొకదానిని విడనాడకుండుట ఉత్తమమైన పద్దతి. దేవునిపట్ల భయభక్తులు చూపువారికి ఈ రెండింటను విజయము కలుగును.

19. పదిమంది నగరపాలకులవలన పట్టణ మునకు కలుగు బలముకంటె జ్ఞానమువలన నరుని కెక్కువ బలము కలుగును.

20. ఎప్పుడును తప్పు చేయక ఎల్లవేళల ఒప్పే చేయు పుణ్యపురుషుడెవడును ఈ మంటిమీద లేడు.

21. జనులు చెప్పు చాడీలను నమ్మవలదు. నీ సేవకుడు నిన్ను దూషించుచుండగా నీవు వినియుండవచ్చును.

22. కాని నీ మట్టుకు నీవు మాత్రము ఇతరులనెన్ని మారులు దూషించి యుండలేదు?

23. నేను ఈ అంశములనెల్ల విజ్ఞానముతో పరీక్షించితిని. “నేను విజ్ఞానమును బడయగోరితిని”. గాని దానిని సాధింపజాలనైతిని.

24. జీవిత పరమార్ధమునెవడు గ్రహింపగలడు? అది చాల లోతైనది, ఎత్తైనది.

25. నేను విజ్ఞానమును, విద్యను ఆర్జింపబూని తిని. మూరత్వము, వెట్టితనమెంత అవివేకమైనవో పరిశీలించి తెలిసికోగోరితిని.

26. స్త్రీ మృత్యువుకంటె గూడ ఘోరమైనది. ఆమె ప్రేమ బోను వంటిది, వల వంటిది. ఆమె బాహువులు గొలుసుల వంటివి. దేవునికి ప్రీతి కలిగించువాడు స్త్రీని తప్పించుకోవచ్చును. కాని పాపాత్ముడు మాత్రము ఆమెకు దొరకిపోవును.

27. నేను ఆయా విషయములను పరిశీలించి నిదానముగా కనిపెట్టిన సత్యమిదియేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు.

28. నేను ఇతరాంశములను గూడ పరిశీలింపబూనితిని గాని కృషికి ఫలితము దక్కలేదు. వేయిమంది పురుషులలో సన్మానింపదగినవాడు ఒక్కడైన నుండును. కాని వేయిమంది స్త్రీలలో సన్మానింపదగినది ఒక్కతెయు నుండదు.

29. నేను గ్రహించినదంతయు ఇదియే. దేవుడు నరుని సరళవర్తనునిగనే చేసెను. కాని నరుడు మాత్రము పెక్కు కుతంత్రములను కల్పించుకొనెను.