ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 7

 1. యెరూబాలు అనబడు గిద్యోను అతని అనుచరులును వేకువనే ఎన్హారోదు వద్ద శిబిరము పన్నిరి. మిద్యాను సైన్యములు వారికి ఉత్తరముగా మోరే కొండచెంత క్రిందిలోయలో గుడారములు పన్ని యుండెను.

2. యావే గిద్యోనుతో “నీ యొద్ద భటులు చాలమంది ఉన్నారు. ఇంతమంది భటులతోగూడిన మీకు మిద్యానీయులను వశముచేయుట నాకిష్టము లేదు. 'మా బలముతో మమ్ము మేమే రక్షించుకొంటిమి' అని మీ యిస్రాయేలీయులు విఱ్ఱవీగుదురు.

3. కనుక నీవు 'యుద్ధమునకు భయపడువారు వెంటనే వెడలిపోవచ్చును' అని శిబిరమున ప్రకటింపుము” అని చెప్పెను. గిద్యోను అట్లే చేయగా పాళెమునుండి ఇరువది రెండువేలమంది వెడలిపోయిరి. పదివేల మంది మాత్రము మిగిలియుండిరి.

4. యావే గిద్యోనుతో “ఇంకను చాలమంది జనులున్నారు. వారిని నీటిపడియ యొద్దకు కొని రమ్ము. అక్కడ వారిని పరిశీలించి చూచెదను. ఎవరు నిన్ను అనుసరింపవలెనని తెల్పుదునో వారు మాత్రమే నీ వెంటవత్తురు. ఎవరు నిన్ననుసరింపగూడదని తెల్పుదునో వారు నీ వెంటరాగూడదు” అని చెప్పెను.

5. గిద్యోను జనులను నీటిచెంతకు కొనివచ్చెను. యావే అతనితో "కుక్కవలె నాలుకతో నీళ్ళు గతుకు వారినందరిని ఒక వైపున ఉంచుము. మోకాళ్ళూని నీరు త్రాగువారినందరిని వేరొక వైపున చేర్చుము” అని పలికెను.

6. నాలుకతో నీళ్ళు గతికినవారి సంఖ్య మూడువందలు మాత్రమే. మిగిలినవారందరు మోకాళ్ళూని నీళ్ళు త్రాగిరి.

7. కనుక యావే గిద్యోనుతో “నాలుకతో నీళ్ళు గతికిన మూడువందల మందితోనే నేను మిమ్ము రక్షించి శత్రువులను మీ వశము చేసెదను. మిగిలిన వారినందరిని వెడలిపొండని చెప్పుము” అనెను.

8. గిద్యోను ఆ మూడు వందల మందిని మాత్రమే తన చెంతనుంచుకొనెను. మిగిలిన వారియొద్ద నుండి ఆహారమును, బాకాలను తీసికొని వారిని పంపివేసెను. మిద్యానీయులు గిద్యోను శిబిరము చెంతనే క్రిందిలోయలో విడిదిచేసిరి.

9. యావే ఆ రాత్రి గిద్యోనుతో “నీవు వెళ్ళి శత్రుశిబిరము మీదపడుము. వారిని నీ వశము చేసితిని.

10. నీవు శత్రువుల మీదపడుటకు జంకెద వేని మొదట నీ సేవకుడైన పూరాను తీసికొని వారి శిబిరము వద్దకు పొమ్ము.

11. అచట వారేమను కొనుచున్నారో వినుము. నీవు వారి పలుకులు ఆలించి ధైర్యము చెందగలవు” అని నుడివెను. కనుక గిద్యోను పూరాను వెంటనిడుకొని విరోధి సైన్యము చెంతకు పోయెను.

12. అచట మిద్యానీయులు, అమాలెకీయులు, తూర్పు దేశవాసులు మిడుతల దండువలె లోయ యందంతట వ్యాపించియుండిరి. వారి ఒంటెలు సముద్రపు ఒడ్డునగల యిసుకరేణువులవలె లెక్కకు మించియుండెను.

13. గిద్యోను వ్యూహము చేరునప్పటికి అచటనొకడు తన మిత్రునితో “వింటివా! నేనొక కలగంటిని. యవధాన్యముతో చేయబడిన గుండ్రనిరొట్టె ఒకటి గిరగిర దొర్లుకొనుచు వచ్చి మిద్యానీయుల శిబిరముచొచ్చెను. అది గుడారమునకు తగులగా ఆ గుడారము వెల్లికిలబడెను” అని చెప్పు చుండెను.

14. ఆ మిత్రుడతనితో “అయిననేమి? ఈ రొట్టె మరేమో కాదు. యిస్రాయేలీయుడగు యోవాసు కుమారుడగు గిద్యోను ఖడ్గమే. దేవుడు మిద్యానీయులను ఈ శిబిరమును అతనికి హస్తగతము చేసెను” అని పలికెను.

15. గిద్యోను ఆ స్వప్న వృత్తాంతమును దాని అర్ధమును విని భక్తిభావముతో ప్రభునకు నమస్కరించెను. అంతటతడు డేరాకు మరలి వచ్చి తన అనుచరులతో “రెండు! యావే మిద్యానీయుల శిబిరమును మీ వశము గావించెను” అని పలికెను.

16. గిద్యోను తన సైన్యములను మూడు దండులుగా విభజించెను. ప్రతి సైనికునికి ఒక బాకాను, కుండను ఇచ్చెను. ప్రతి కుండలోను దీపము గలదు.

17. అతడు వారితో “నన్ను జాగ్రత్తగా గమనించు చుండుడు. నేను చేసినట్లే మీరును చేయవలెను. నేను శత్రుశిబిరము చేరగానే ఏమిచేయుదునో జాగ్రత్తగా గమనింపుడు. నేను చేసినట్లే మీరును చేయవలెను.

18. నేను, నా వెంటనున్నవారు బాకానూదగనే మీరును శిబిరముచుట్టు బాకానూది యావేకు గిద్యోనునకు విజయమని నినాదములు చేయుడు” అని చెప్పెను.

19. గిద్యోను, అతని వెంటనున్న నూరుగురు సైనికులు నడిజామున శత్రుశిబిరము దాపునకు వచ్చిరి. అప్పుడే విడిదిపట్టున కావలిభటులు వంతులు మార్చుకొని యుండిరి. గిద్యోను అతని అనుచరులు బాకాలనూది కుండలు పగులగొట్టిరి.

20. అది చూచి మూడుదండులును బాకాలనూది కుండలు పగులగొట్టెను. ఎడమచేత దివిటీలుపట్టి, కుడిచేత బాకాలను పూని "యావేకు ఖడ్గము, గిద్యోనునకు ఖడ్గము!” అని నినాదములు చేసెను.

21. యిస్రాయేలు దండులు తమ శత్రువుల విడిదిచుట్టు నిలబడియుండెను. ఆ నినాదములకు శిబిరమంతయు మేల్కొని గావుకేకలిడుచు పలాయనమయ్యెను.

22. ఆ మూడువందలమంది బాకాలనూదు చుండగా శత్రుసైనికులందరు కలవరముచెంది ఒకరి మీద ఒకరు కత్తిదూయ మొదలిడిరి. అది యావే చేసిన కార్యము. ఆ సైనికులందరు సెరారాతు దిక్కుగా బేత్షిత్తా వరకు, తాబ్బాతు దిక్కుగా ఆబెల్మె-హోలా వరకును పారిపోయిరి.

23. నఫ్తాలి, ఆషేరు, మనష్షే తెగలవారైన యిస్రాయేలీయులందరు కూడివచ్చి మిద్యానీయులను వెన్నాడిరి.

24. గిద్యోను ఎఫ్రాయీము కొండసీమల లోనికి దూతలనంపి “మీరు దిగివచ్చి మిద్యానీయులతో పోరాడుడు. వారికి ముందుగా బోయి బెత్బారా, యోర్దాను రేవుల నాక్రమింపుడు” అని వర్తమానము పంపెను. కనుక ఎఫ్రాయీము వాసులందరు ప్రోగ్రె వచ్చి ఆ రేవులను ఆక్రమించుకొనిరి.

25. వారు మిద్యాను సైన్యాధిపతులైన ఓరేబు, సేయేబులను పట్టుకొనిరి. ఓరేబును ఓరేబు కొండవద్ద వధించిరి. సెయేబును సెయేబు ద్రాక్షగానుగ చెంత మట్టుపెట్టిరి. మిద్యానీయులను తరిమికొట్టిరి. ఇద్దరు మొనగాండ్ర తలలు తెగగొట్టి యోర్దాను ఒడ్డున గిద్యోను వద్దకు కొనివచ్చిరి.