1. దర్యావేషు రాజు ఆజ్ఞపై అతని ఉద్యోగులు బబులోనియాలోని చారిత్ర కాంశముల దస్తావేజులను పరిశీలించిరి.
2. అపుడు మేదియా మండలములోని ఎక్బటానా నగరమున లభించిన ఒక లిఖిత పత్రములో ఈ క్రింది రాజశాసనము కన్పించెను:
3. "కోరెషురాజు తన యేలుబడి మొదటియేట ఈ శాసనము చేసెను. యెరూషలేము దేవాలయ మును పునర్నిర్మింపవలయును. అచట బలులు, దహనబలులు అర్పింపవచ్చును. ఆ మందిరము ఎత్తు అరు వది మూరలు, వెడల్పు అరువది మూరలు ఉండ వలెను.
4. గోడలను మూడువరుసలు గండరరాతి తోను, ఒక వరుసకొయ్యతోను నిర్మింపవలెను. ఖర్చులన్నియు రాజకోశాగారమే భరింపవలెను.
5. నెబుకద్నెసరు రాజు బబులోనియాకు కొనివచ్చిన వెండి బంగారు పాత్రలను మరల యెరూషలేము దేవాలయమునకు చేర్చి వాటిని పూర్వస్థానముననే పదిలము చేయవలయును."
6. అంతట దర్యావేషురాజు ఈ క్రింది రీతిగా జవాబు వ్రాసి పంపెను: “పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకుడగు తత్తనాయికి, షెతర్బోస్నాయికి, తోడి ఉద్యోగులకు దర్యావేషు వ్రాయునది. మీరు ఆ దేవాలయము జోలికి పోవలదు.
7. మందిర నిర్మాణమునకు అడ్డుపడవలదు. యూదా మండలపాలకుని, యూదుల పెద్దలను పూర్వస్థానముననే దేవాలయమును కట్టుకొన నీయుడి.
8. ముఖ్యముగా దేవుని మందిరము కట్టించు యూదులపెద్దలకు మీరు చేయవలసిన సహాయము గూర్చిన శాసనమేమనగా: నది అవతలనుండి ప్రోగు చేసిన పన్నులనుండి మందిర నిర్మాణమునకగు ఖర్చులను వెంటనే చెల్లింపుడు. ధనము లభింపకపోవుటచే నిర్మాణ కార్యక్రమము కుంటుపడిపోరాదు.
9. యెరూషలేములోని యాజకులకు కావలసిన వస్తు సామగ్రిని కూడ ప్రతిదినము మీరే సమకూర్పవలెను. ఆకాశమందలి దేవునికి దహనబలిగా సమర్పింప వలసిన కోడెదూడలు, పొట్టేళ్ళు, గొఱ్ఱెపిల్లలు, గోధుమ ధాన్యము, ఉప్పు, ద్రాక్ష సారాయము, ఓలివునూనె మొదలైనవన్నియు మీరే సరఫరా చేయవలెను.
10. వీనితో వారు ఆకాశమందలి దేవునికి ప్రీతికరమైన బలులు సమర్పించి నాకును, నా కుమారులకును మేలు చేకూరునట్లు విన్నపములు చేయుదురు.
11. ఎవడైన ఈ నా ఆజ్ఞలను ధిక్కరించెనేని వాని ఇంటి దూలమును పెరికి నేలలోనాటి దానిపై వానిని ఉరితీయించవలెను. అతని యింటిని పెంటదిబ్బగా మార్చివేయుడు.
12. యెరూషలేమును తన నామమునకు స్థానముగా ఏర్ప రచుకొనిన ఈ దేవుడే, యీ నాఆజ్ఞలను పాటింపక ఆ నగరమునందలి దేవాలయమును ధ్వంసము చేయబూనిన ఏ రాజునైనను, ప్రజలనైనను నాశనము చేయును గాక! దర్యావేషు ప్రభుడనైన నేను ఈ శాసనము చేసితిని. ఎల్లరును ఈ నియమమునకు సంపూర్ణముగా సత్వరమే బద్దులై ఉందురుగాక!"
13. పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్రపాలకుడైన తత్తనాయి, షెతర్బోస్నాయి, వారి తోడి ఉద్యోగులు రాజాజ్ఞాపించినట్లే చేసిరి.
14. ప్రవక్తలు హగ్గయి, జెకర్యా ప్రోత్సహించుచుండగా నాయకులు చకచక దేవాలయమును కట్టించిరి. యిస్రాయేలు దేవుడైన ప్రభువు, పారశీక రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్త ఆజ్ఞాపించినట్లే మందిరమును పూర్తి చేసిరి.
15. దర్యావేషు రాజు ఏలుబడి ఆరవయేట, అదారు నెల మూడవరోజున కట్టడములు ముగించిరి.
16. అంతట యాజకులు, లేవీయులు, ప్రవాసమునుండి తిరిగివచ్చిన యిస్రాయేలీయులందరును ఉత్సాహముతో దేవాలయమును ప్రతిష్ఠించిరి.
17. మందిర ప్రతిష్ఠను పురస్కరించుకొని నూరు కోడెలు, రెండువందల పొట్టేళ్ళు, నాలుగు వందల గొఱ్ఱపిల్లలు బలిగా సమర్పించిరి. ఒక్కొక్క తెగకు ఒక్కటి చొప్పున పండ్రెండు మేకపోతులను పాపపరి హారబలిగా సమర్పించిరి.
18. మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞాపించినట్లు యెరూషలేము దేవాలయమున కైంకర్యము చేయుటకు యాజకులను, లేవీయులను క్రమ ముగా నియమించిరి.
19. ప్రవాసము నుండి తిరిగివచ్చిన నిర్వాసితులు మొదటి నెల పదునాల్గవ దినమున పాస్క పండుగ జరుపుకొనిరి.
20. యాజకులు, లేవీయులు తమనుతాము శుద్ధిగావించుకొనిరి. ప్రవాసము నుండి తిరిగివచ్చిన యిస్రాయేలీయులందరి కొరకును, యాజకులకొరకును, తమకొరకును లేవీయులు పాస్క పశువును వధించిరి.
21. ప్రవాసమునుండి వచ్చిన వారందరును, ప్రవాస దేశమునందలి అన్యజాతుల ఆచారములను వదులుకొని యిస్రాయేలు దేవుని కొలుచుటకు వచ్చినవారందరు నైవేద్యములను భుజించిరి.
22. వారు ఏడుదినములపాటు ఉత్సాహముతో పొంగని రొట్టెల పండుగ చేసికొనిరి. ప్రభువు అస్సిరియా రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారి దేవాలయమును నిర్మించునట్లు చేసెను గనుక వారి ఆనందము మిన్నుముట్టెను.