ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 6

 1. ఒకనాడు ప్రవక్తల సమాజములోని శిష్యులు ఎలీషాతో "అయ్యా! మనము వసించు ఈ తావు చాల ఇరుకుగా ఉన్నది.

2. నీవు అనుమతి ఇచ్చినచో మేము యోర్దాను నదికి వెళ్ళి కట్టు నరుకుకొనివచ్చి క్రొత్త ఇండ్లు కట్టుకొందుము” అనిరి. అతడు 'అట్లే పొండు' అనెను.

3. వారిలో ఒకడు ఎలీషాను కూడ తమతో రమ్మని బతిమాలగా అతడు అంగీకరించెను.

4. వారందరును కలిసివెళ్ళి యోర్దాను చేరుకొని అచట కఱ్ఱ నరకుచుండిరి.

5. అపుడు ప్రవక్త ఒకడు చెట్టును నరకుచుండగా అతని ఇనుపగొడ్డలి జారి క్రింది నీటిలో పడెను. అతడు ఎలీషాతో "అయ్యా! ఇది ఎరవు గొడ్డలి. నేనిక ఏమి చేయుదును!” అనుచు సంతాప పడెను.

6. ఎలీషా అది ఎక్కడ పడినదో చూపుమనెను. అతడు గొడ్డలిపడిన తావును చూపెను. ఎలీషా ఒక కొమ్మ నరికి ఆ తావున పడవేయగా ఇనుపగొడ్డలి నీటిపై తేలియాడెను.

7. అతడు గొడ్డలిని తీసికొమ్మనగా చెట్టు కొట్టినవాడు చేయిచాచి దానిని వెలుపలికి తీసెను.

8. సిరియారాజు యిస్రాయేలుపై దండెత్త, అతడు తన ఉద్యోగులతో సంప్రతించి ఒకానొక అనువైన తావున శిబిరము పన్నెదమని చెప్పెను.

9. కాని దైవజనుడు ఎలీషా “అచట సిరియనులు పొంచి ఉన్నారు. కనుక నీవు ఆ తావునకు వెళ్ళవలదు” అని యిస్రాయేలు రాజునకు కబురంపెను.

10. కనుక యిస్రాయేలు రాజు ఆ శిబిరము ప్రాంతమున వసించు తన ప్రజలను ముందుగనే హెచ్చరింపగా వారు అపాయము నుండి తప్పించుకొనిరి. ఇట్లు చాలాసార్లు జరిగెను.

11. కడకు సిరియారాజు విసిగిపోయి తన సైనికోద్యోగులను పిలిపించి “మీలో ఎవడో మనగుట్టు యిస్రాయేలు రాజునకు ఎరిగించుచున్నాడు, అతడు ఎవడు?” అని ప్రశ్నించెను.

12. వారిలో ఒకడు “ప్రభూ! మన వారెవ్వరు ఇక్కడి రహస్యములను పొక్కనీయరు. కాని ప్రవక్త ఎలీషా నీవు పడకగదిలో రహస్యముగా పలికిన మాటలుకూడ గ్రహించి యిస్రాయేలు రాజునకు తెలియజేయుచున్నాడు” అని చెప్పెను.

13. రాజు “మీరు వెళ్ళి అతని జాడ తెలిసి కొనిరండు. నేనతనిని పట్టి తెప్పింతును” అనెను. అప్పుడు ఎలీషా దోతానున వసించుచున్నాడని తెలియ వచ్చెను.

14. కనుక రాజు రథములతో, గుఱ్ఱములతో మహా సైన్యమును అచటికి పంపెను. ఆ పటాలము రాత్రివేళవచ్చి నగరమును ముట్టడించెను.

15. ఎలీషా సేవకుడు వేకువనే నిద్రలేచి ఇంటినుండి వెలుపలికి వచ్చి చూడగా రథములతో, గుఱ్ఱములతో సిరియాదండు నగరమును చుట్టుముట్టియుండెను. అతడు ఎలీషాతో "అయ్యా! మనకు చావుమూడినది. ఇక ఏమిచేయుదము?" అనెను.

16. కాని ఎలీషా అతనితో “నీవు భయపడకుము. వారి వైపున పోరాడు వారికంటె మనవైపున పోరాడువారే ఎక్కువమంది యున్నారు” అనెను.

17. అతడు దేవుని ప్రార్ధించి “ప్రభూ! ఇతనికి దృష్టి దయచేయుము” అని మనవి చేసెను. ప్రభువు ఆ సేవకునకు చూపునొసగగా అతడు కొండ అంతయు అగ్నిరథములతోను గుఱ్ఱములతోను నిండియుండుటను చూచెను. అవన్నియు ఎలీషా చుట్టునున్నట్లుగా కూడ కన్పించెను.

18. అంతట సిరియనులు తన సమీపమునకు వచ్చుట చూచి ఎలీషా “ప్రభూ! వీరికి కనుచూపు పోవునట్లు చేయుము” అని ప్రార్థించెను. అతడు మనవిచేసినట్లే ప్రభువు సిరియా సైనికులను గ్రుడ్డివారిని చేసెను.

19. ఎలీషా ఆ సైనికులచెంతకు వెళ్ళి “నాయనలార! మీరు త్రోవతప్పితిరి. మీరు ముట్టడింప గోరిన నగరము ఇదికాదు. మీరు పట్టుకోగోరినవాని చెంతకు నేను మిమ్ము తోడ్కొనిపోయెదను, నా వెంట రండు” అనెను. కాని అతడు వారిని సమరియా నగరమునకు నడిపించుకొనిపోయెను.

20. ఆ దండు నగరము ప్రవేశింపగనే ఎలీషా “ప్రభూ! వీరికి చూపు దయచేయుము” అని ప్రార్ధించెను. అతడు కోరినట్లే ప్రభువు సైనికులకు దృష్టి ప్రసాదింపగా వారు తాము సమరియా నగరమున ఉన్నట్లు గుర్తించిరి.

21. యిస్రాయేలు రాజు సిరియా సైన్యమును చూచి "అయ్యా! వీరిని సంహరింపమందువా?” అని అడిగెను.

22. ప్రవక్త "వలదు వలదు నీ కత్తి, బాణము సహాయమున ఖైదీలను నిర్బందించి వారిని నీవు చంపుదువా? వారు భుజించుటకు రొట్టెలను, త్రాగుటకు నీటిని ఒసగుము. అటుపిమ్మట వారు తమ రాజునొద్దకు వెడలిపోవుదురు” అనెను.

23. కనుక యిస్రాయేలు రాజు వారికి గొప్పవిందు చేసెను. వారు అన్న పానీయములు సేవించి తమ రాజునొద్దకు మరలిపోయిరి. అటుతరువాత సిరియా దండులు యిస్రాయేలు దేశము మీద మరల దాడిచేసి ఎరుగవు.

24. అటుపిమ్మట సిరియా రాజు బెన్హ్-దదు సర్వ సైన్యముతో యిస్రాయేలు మీదికి దండెత్తి వచ్చి సమరియాను ముట్టడించెను.

25. ఈ ముట్టడి ఫలితముగా పట్టణమున ఆహారపదార్థములు కొరతపడి పెద్ద కరువురాగా, ఒక్క గాడిద తల ఎనుబది వెండినాణెములు, అరపావు పావురపురెట్ట' ఐదు వెండి నాణెములకు అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి.

26. ఒకనాడు యిస్రాయేలురాజు పట్టణ ప్రాకారముపై తిరుగుచుండగా ఒకానొక స్త్రీ "ప్రభూ! నన్ను రక్షింపుము" అని కేక వేసెను.

27. రాజు “అమ్మా! ప్రభువే నిన్ను రక్షించనపుడు నేనెట్లు రక్షింపగలను? నా ఇంట గోధుమలు, ద్రాక్షసారాయము ఉన్నవి కనుకనా? అయినను నీ బెడదయేమి?” అని అడిగెను.

28. ఆ స్త్రీ “ఇదిగో ఈమె 'నేడు నీ బిడ్డను తిందము, రేపటికి నా బిడ్డను తిందము' అనెను.

29. అట్లే నా బిడ్డను వండి తింటిమి. మరునాడు ఆమె బిడ్డను తిందమని అడుగగా తాను వానినెక్కడనో దాచినది” అని చెప్పెను.

30. ఆ మాటలాలించి రాజు విచారముతో బట్టలు చించుకొనెను. అప్పుడు రాజు ప్రాకారముపై నుండెనుకదా! అక్కడి జనులు అతడు వెలుపలి దుస్తుల మాటున గోనె తొడుగుకొని ఉండుటను గమనించిరి.

31. అతడు కోపముతో మండిపడుచు “నేడు ఎలీషా తల తీయింపనేని ప్రభువు నన్ను శిక్షించుగాక!” అని పలికెను.

32. అప్పుడు ఎలీషా కొందరు పెద్దలతో తన ఇంట కూర్చుండి ఉండెను. రాజు ఎలీషాను పట్టి తెచ్చుటకై దూతనంపెను. కాని ఆ దూత తన ఇల్లు చేరక మునుపే ఎలీషా పెద్దలతో “చూచితిరా! ఈ నరహంతకుని కుమారుడు నా తల నరకుకొని పోవుటకు దూతనంపుచున్నాడు. ఆ బంటు ఇచటికి వచ్చినపుడు మీరు తలుపుమూయుడు. వానిని లోనికి రానీయకుడు. వాని వెనుకనే వాని యజమానుని అడుగులచప్పుడు వినబడునుగదా!” అని చెప్పుచుండ గనే

33. రాజు వచ్చి “ప్రభువే మనకు ఈ కీడు వాటిల్లునట్లు చేసెను. నేనింకను అతనిని నమ్ముకొని కూర్చుండనేల?” అని పలికెను.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services