ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 6

 1-2. అప్పుడు సొలోమోను, “ప్రభూ! నీవు కారుమబ్బులో వసింపగోరితివి. నీవు శాశ్వతముగా నివసించుటకుగాను నేను నీకొక మందిరమును నిర్మించితిని” అని పలికెను.

3. అపుడు యిస్రాయేలీయులెల్లరు అచట సమావేశమై ఉండగా రాజు వారివైపు తిరిగి వారిని ఆశీర్వదించెను.

4. అతడు “యిస్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక! ఆయన మా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానములను నెరవేర్చెను.

5. ప్రభువు మా తండ్రితో 'నేను నా ప్రజలను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పటినుండి నేటివరకును నా నామముండుటకై మందిరమును కట్టింప యిస్రాయేలు దేశమున ఏ పట్టణమును ఎన్నుకోనైతిని. ఎవనిని నా ప్రజలకు నాయకునిగా నియమింపనైతిని.

6. కాని ఇప్పుడు యెరూషలేమును నా నామముండు స్థలముగా ఎన్నుకొంటిని. దావీదువైన నిన్ను నా ప్రజకు నాయకునిగా నియమించితిని' అని చెప్పెను.

7. మా తండ్రి దావీదు యిస్రాయేలు దేవుడైన ప్రభువు నామ ఘనతకు దేవాలయమును కట్టింపగోరెను.

8. కాని ప్రభువు అతనితో 'నీవు నాకు మందిరమును కట్టింపగోరుట ఉచితముగనే ఉన్నది.

9. కాని ఆ మందిరమును కట్టింపవలసినది నీవు కాదు, నీకు పుట్టబోవు కుమారుడే నా నామమునకు దేవాలయము నిర్మించును' అని నుడివెను.

10. ప్రభువు తనమాట నిలబెట్టుకొనెను. అతడు చెప్పినట్లే నేను మా తండ్రికి బదులుగా యిస్రాయేలీయులకు రాజునైతిని. యిస్రాయేలు దేవుడైన ప్రభువునకు దేవళమును గూడ కట్టించితిని.

11. ప్రభువు యిస్రాయేలీయులతో చేసికొనిన నిబంధనపు శాసనములు గల మందసమును ఈ దేవాలయములో ఉంచితిని” అని పలికెను.

12. అంతట సొలోమోను ప్రజలెల్లరు చూచుచుండగా బలిపీఠముముందట నిలుచుండి ప్రార్థన చేయుటకు చేతులెత్తెను.

13. అతడు కంచుతో ఒక వేదికను సిద్ధముచేయించి దానిని ప్రాంగణము నడుమ ఉంచెను. దాని పొడవు, వెడల్పులు ఐదేసి మూరలు. ఎత్తు మూడుమూరలు. జనులెల్లరు చూచు చుండగా అతడు ఆ వేదికనెక్కి దానిపై మోకరిల్లి, చేతులు పైకిచాచి ఇట్లు ప్రార్ధించెను:

14. “యిస్రాయేలు ప్రభుడవైన దేవా! భూమిమీదగాని, ఆకాశ మందుగాని నీవంటి దేవుడొక్కడును లేడు. ప్రజలు నీకు విధేయులై జీవించినచో నీవు వారితో చేసికొనిన ఒప్పందమును నిలుపుకొందువు, వారిని కరుణతో ఆదరింతువు.

15. నీ సేవకుడగు మా తండ్రి దావీదునకు నీవు చేసిన వాగ్దానమును నెరవేర్చితివి. నీవు నోటితో పలికిన పలుకులు నేడు చేతలతో నిరూపించితివి.

16. 'నీ వంశజులును నీవలెనే నా ఆజ్ఞలను పాటింతురేని, వారిలో ఒకడు ఎల్లప్పుడును యిస్రాయేలీయులను పరిపాలించుచునే యుండును' అని నీవు మా తండ్రికి మాట యిచ్చితివికదా!

17. ప్రభూ! నీవు మా తండ్రికి సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరపరుచుము.

18. కాని దేవుడు ఈ భూమిమీద నరులతో వసించునా? ఆకాశ మహాకాశములే నిన్ను ఇముడ్చుకోజాలవనిన, నేను కట్టించిన ఈ దేవాలయమున నీవు ఇముడుదువా?

19. ప్రభూ! నీ దాసుడనైన నా ప్రార్థన ఆలింపుము. నా విన్నపమునకు చెవి యొగ్గుము.

20. రేయింబవళ్ళు ఈ దేవాలయమును చల్లనిచూపుతో చూడుము. ప్రజలు నిన్ను ఈ మందిరమున ఆరాధింపవలయునని నీవు ఆనతి నిచ్చితివికదా! కనుక నీ ఈ దేవాలయమున నేను చేయు ప్రార్థనను ఆలింపుము.

21. ప్రభూ! నేనును, ఈ ప్రజలును ఈ దేవాలయమున ప్రార్థన చేసినపుడు, నీవు మా మొరాలింపుము. ఆకాశమునుండి మా వేడుకోలు నాలించి మమ్ము క్షమింపుము.

22-23. ఎవడైన ఒకడు తోడి నరునిమీద నేరము మోపగా, ఆ నేరము మోపబడినవాడు ఈ దేవాలయమున నీ బలిపీఠము ఎదుటికి వచ్చి తాను నిరపరాధినని ఒట్టు పెట్టుకొనెనేని, నీవు ఆకాశము నుండి వారి తగవులాలించి, వారికి తీర్పుచెప్పుము. దోషిని వాని పాపమునకు తగినట్లుగా శిక్షింపుము. నిర్డోషిని వాని మంచితనమునకు తగినట్లుగా సంభావింపుము.

24-25. యిస్రాయేలీయులు నీకు విరోధముగా పాపము చేసినందున యుద్ధమున ఓడిపోయి ఈ దేవాలయమునకు వచ్చి నిన్ను స్తుతించి తమను క్షమింపుమని వేడుకొందురేని, ఆకాశమునుండి నీవు వారి మొర ఆలింపుము. వారి అపరాధమును క్షమింపుము. నీవు వారికి, వారి పూర్వులకు దయ చేసిన ఈ నేలకు వారిని మరల తోడ్కొనిరమ్ము.

26-27. ప్రజలు పాపము చేసినందున నీవు వానలు ఆపివేయగా వారు ఈ దేవాలయమునకు వచ్చి నిన్ను స్తుతించి వినయముతో పశ్చాత్తాపపడుదు రేని, నీవు ఆకాశమునుండి వారి మొరాలింపుము. వారి దోషములను మన్నింపుము. వారికి మంచిని చేయువిధానము తెలియజెప్పుము. నీవు నీ ప్రజలకు శాశ్వతముగా భుక్తముచేసిన ఈ దేశముమీద వానలు కురియింపుము.

28-30. ఈ దేశమున కరువు, అంటురోగములు వ్యాపించినపుడు, వడగాలి, తెగుళ్ళు, మిడుతలవలన ఇచటి పైరులు నాశమైనపుడు, శత్రువులు వచ్చి ఈ దేశమును ముట్టడించినపుడు, ఇచటి ప్రజలు రోగగ్రస్తులైనపుడు, ఉపద్రవములకు చిక్కినపుడు, ఈ జనులలో ఒకడుకాని, అనేకులుకాని ఈ దేవాలయమునకు వచ్చి పశ్చాత్తాపపడి చేతులెత్తి నీకు మనవి చేసికొనినచో, నీవు ఆకాశమునుండి వారి మొర నాలింపుము. వారి పాపములు మన్నింపుము. నరుల హృదయములు తెలిసినవాడవు నీవొక్కడవే కనుక ప్రతివానికి వానివాని క్రియలకు తగినట్లుగా ప్రతిఫలమిమ్ము.

31. ఇట్లు చేయుదువేని ఈ ప్రజలు నీవు వారి పితరులకిచ్చిన ఈ నేలమీద వసించినంత కాలము వారు నీకు విధేయులై ఉందురు.

32-33. దూరదేశములందు వసించు పరదేశులు నీ శక్తి సామర్థ్యములనుగూర్చి విని ఈ దేవాలయమునకు వచ్చి నీకు ప్రార్థనచేసినచో ఆకాశమునుండి నీవు వారి వేడుకోలును ఆలించి వారి కోర్కెలు తీర్చుము. అప్పుడు యిస్రాయేలీయులవలె సమస్తజాతిజనులు నిన్నుగూర్చి తెలిసికొని నీ పట్ల భయభక్తులు చూపుదురు. నేను నిర్మించిన ఈ మందిరమున నీ నామము పెట్టబడినదని అన్యజాతి జనులెల్లరు గుర్తింతురు.

34-35. నీవు పంపగా నీ జనులు తమ శత్రువుల మీదికి యుద్ధమునకు పోయిరనుకొందము. వారు ఏ ప్రదేశము నుండియైనను, నీ వెన్నుకొనిన ఈ పట్టణమువైపునకును, నీ నామమునకు నేను కట్టించిన ఈ దేవాలయము వైపునకును తిరిగి నీకు విన్నపము చేయుదురేని, నీవు ఆకాశమునుండి వారి వేడుకోలునాలించి వారికి విజయమును ప్రసాదింపుము.

36-39. పాపము చేయనివాడు ఎవడునులేడు. కనుక నీ ప్రజలును పాపముచేయగా నీవు కోపించి వారిని శత్రువుల చేతికి చిక్కింపగా ఆ శత్రువులు వారిని దూరదేశములకో, దగ్గరి దేశములకో బందీలనుగా కొనిపోయిరనుకొందము. ఆ శత్రుదేశమున వారు బుద్దితెచ్చుకొని పశ్చాత్తాపపడి 'మేము దుర్మార్గపు పనులు చేసి పాపాత్ములమైతిమి' అని ఒప్పుకొందురనుకొందము. ఆ ప్రవాసమునుండి వారు నీవు మా పితరులకిచ్చిన ఈ నేలవైపు, నీవు ఎన్నుకొనిన ఈ నగరమువైపును, నీ నామ ఘనతకు నేను నిర్మించిన ఈ దేవాలయమువైపును మరలి పూర్ణహృదయముతో నీకు విన్నపము చేయుదురనుకొందము. అప్పుడు నీవు ఆకాశమునుండి వారి మనవిని ఆలింపుము. కరుణతో వారితప్పిదములను క్షమింపుము.

40-42. ప్రభూ! మేమిచట చేసిన ప్రార్థనలను దయతో ఆలింపుము. నా దేవా! ప్రభువా! నీ బలసూచకముగానున్న నీ నిబంధన మందసమును గాంచి ఇకలెమ్ము! నీ విశ్రాంతి స్థలమునకు తరలిరమ్ము. దేవా! ప్రభువా! నీ యాజకులు రక్షణ పరివేష్టితులగుదురుగాక! నీ ఉపకారములను పొంది ఈ జనులు ఆనందింతురుగాక! ఓ ప్రభువైన దేవా! నీ అభిషిక్తుని తిరస్కరించకుము. ప్రభూ! నీ సేవకుడైన దావీదునకు నీవు చేసిన ఉపకారములను స్మరించుకొనుము”.