ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉపదేశకుడు 6

 1. సూర్యునిక్రింద నరులను వేధించు మరియొక అనర్గ కార్యమును గూడ నేను చూచితిని. ఇది వీరిపై బలముగా పని చేయుచున్నది.

2. దేవుడు ఒకనికి సంపదలు, భూములు, కీర్తి ప్రతిష్టలు మొదలైన వాని నెల్ల దయచేసెననుకొందము. ఇక అతడు కోరుకొనున దేమియు లేదు. కాని భగవంతుడు అతనిని ఈ సొత్తు అనుభవింపనీయడు. అన్యుడొకడు దానిననుభవించును. ఇదియును వ్యర్ధము, అక్రమము. -

3. ఒకనికి నూరుగురు బిడ్డలుండవచ్చును. అతడు చాల యేండ్లు జీవింపవచ్చును. అయినను అతడు సుఖములను అనుభవింపక, గౌరవ ప్రదముగా భూస్థాపనము గావింపబడనియెడల, వాని గతికంటె పడిపోయిన పిండముయొక్క గతి మెరుగుకదా?

4. అది చీకటినుండి వచ్చును, మరల చీకటిలోనికి వెడలిపోవును.. చీకటి దాని పేరును కమ్మివేయును.

5. అది వెలుగును చూడజాలదు. మరియేమియు తెలిసికోజాలదు. అయినను పై నరునికంటె దాని గతి నెమ్మది గలది.

6. ఆ నరుడు రెండువేల యేండ్లు జీవించినను, సుఖములను అనుభవింపడేని ఏమి లాభము? కడన అందరును ఒకే తావును చేరుకొందురుకదా!

7. నరుని కృషియంతయు పొట్టకూటి కొరకే. అయినను అతని మనస్సు ఏనాడును సంతృప్తినొందదు.

8. బుద్దిహీనునికంటె విజ్ఞాని యేమి మెరుగు? జీవి తమునెట్లు గడపవలయునో తెలిసికొనినంత మాత్రమున పేదవానికి ఒరిగినదేమిటి?

9. ఇదియునువ్యర్ధము, గాలికై ప్రయాసపడుటయే. మనకు లేని దానిని ఆశించుటకంటె, ఉన్నదానితో సంతృప్తి చెందుటమేలు.

10. ఇప్పుడు జరుగునదంతయు ఇంతకు పూర్వమే నిర్ణయింపబడినది. దాని స్వభావము మనకు తెలియును. నరుడు తనకంటే బలవంతుడైన వానితో వాదింపజాలడు.

11. ఎక్కువగా మాట్లాడుట నిక్కముగా నిష్ప్రయోజనము. దానివలన ఎట్టి లాభమునులేదు.

12. నరుడు కొద్ది కాలము మాత్రమే జీవించును. అదియును అర్ధము లేని జీవితము. అతనిజీవితము నీడవలె గతించును. ఈ హ్రస్వకాలపు మనుగడలో అతనికేది మేలో ఎవడు చెప్పగలడు? అతడు గతించిన తరువాత లోకములో ఏమి జరుగునో వానికెవడు చెప్పగలడు?

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services