ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయాధిపతులు 6

 1. యిస్రాయేలీయులు మరల దుష్కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి. అందుచే యావే వారిని ఏడేండ్లు మిద్యానీయుల వశము చేసెను.

2. మిద్యానీయులు యిస్రాయేలీయులను నేలబెట్టి కాలరాచిరి. యిస్రాయేలీయులు మిద్యానీయులకు భయపడి కొండ బొరియలలో దుర్గములలో దాగుకొనజొచ్చిరి.

3-4. యిస్రాయేలీయులు పైరువేయగనే మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పుదేశపు ప్రజలుకూడ దాడిచేయవచ్చి పడెడివారు. యిస్రాయేలు రాజ్యముననే గుడారులు పన్నుకొని గాజావరకు వారి పైరుపంటలు నాశనము చేసెడివారు.వారి ఎడ్లను, గొఱ్ఱెలను, గాడిదలను తోలుకొనిపోయెడివారు. చివరకు యిప్రాయేలీయుల కేమియు మిగిలెడిదికాదు.

5. మిద్యానీయులు తమ పశువులమందలతో గుడారములతో వచ్చి మిడుతల దండువలె దిగెడివారు. వారినిగాని, వారి ఒంటెలను గాని లెక్కింపవలనుపడదు. వారు కాలు పెట్టిన నేల వల్లకాడు కావలసినదే.

6. మిద్యానీయుల దోపిడి వలన యిస్రాయేలీయులకు పొట్టకూడు కూడ కరవై పోయెను. అందుచే వారు యావేకు మొరపెట్టుకొనిరి.

7-8. యిప్రాయేలీయుల మొరవిని ప్రభువు వారి చెంతకు ఒక ప్రవక్తను పంపెను. అతడు “యిస్రాయేలు దేవుడైన ప్రభువు సందేశమిది: నేను మిమ్ము దాస్యగృహము ఐగుప్తునుండి వెలుపలికి కొనివచ్చితిని.

9. ఐగుప్తీయులనుండియు, మిమ్ము బానిసలుగా నేలిన యజమానులనుండియు మిమ్ము కాపాడితిని. వారిని మీ ఎదుటినుండి తరిమివేసి వారి భూములను మీ వశముచేసితిని.

10. మీ దేవుడైన యావేను నేనే కనుక మీరు అమోరీయుల మండలమున వసించునపుడు వారి దైవములను సేవింప వలదని ఆజ్ఞాపించితిని. అయినను మీరు నా మాట పెడచెవిని బెట్టితిరిగదా!” అని వారిని మందలించెను.

11. యావేదూత వచ్చి ఒఫ్రా చెంతగల సింధూర వృక్షము క్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబీయెసీయుని వంశమునకు చెందిన యెవాషునిది. యెవాపు కుమారుడగు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండుటకై, ద్రాక్షపండ్లను తొక్కించు గాటిలోనే గోధుమలను దుళ్ళ గొట్టుచుండగా,

12. ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై 'శూరాగ్రణి! యావే నీకు తోడైయున్నాడు” అని పలికెను.

13. గిద్యోను 'అయ్యా! యావే తోడైయున్నచో మాకు ఈ అగచాట్లేల పట్టును? ప్రభువు మమ్ము ఐగుప్తు నుండి తీసికొనివచ్చెనని మా పూర్వులు వచించెదరు గాని, ఆ అద్భుతకార్యములన్నియు నేడేమైనవి? యావే మమ్ము పరిత్యజించి మిద్యానీయుల వశము చేసెను గదా!” అనెను.

14. యావే అతని వైపు చూచి "నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదికి పొమ్ము. యిస్రాయేలీయులను శత్రువులబారి నుండి రక్షింపుము. నేనే నిన్ను పంపుచున్నాను సుమా!” అని చెప్పెను.

15. గిద్యోను “ప్రభూ! నేనేమిటి, యిస్రాయేలీయులను రక్షించుటేమిటి? మనష్షే తెగన మేము ఊరు పేరులేని వారము. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువయు లేదు” అని పలికెను.

16. యావే అతనితో “ఓయి! నేను నీకు తోడైయుందును. నీవు మిద్యానీయులను ఏకనరునివలె చితుక గొట్టెదవు” అని చెప్పెను.

17. గిద్యోను యావేతో “నేను నీ దయకు పాత్రుడనైతినేని ఇపుడు నాతో మాటలాడినది నీవేననుటకు రుజువుగా నాకొక గురుతునిమ్ము.

18. నేను వెడలిపోయి నా బలియర్పణమును గొనివచ్చి నీ యెదుట నిడువరకు నీవిటనుండి సాగిపోవలదు" అని మనవి చేసికొనెను. అతడు “నీవు వచ్చువరకు నేనిచటనే ఉందును పొమ్ము” అనెను.

19. గిద్యోను వెడలిపోయి ఒక మేకపిల్లను కోసెను. కుంచెడు పిండితో పొంగనిరొట్టెలు కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిడికొని మాంసపు చారును చట్టిలో పోసికొని సింధూరము చెంతకు గొనివచ్చెను.

20. ప్రభువుదూత అతనితో “మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము. మాంసపు చారును వానిపై పోయుము” అని చెప్పెను. అతడట్లే చేసెను.

21. ప్రభువుదూత తన చేతికర్రను చాచి దానికొనతో మాంసమును, పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతినుండి గుప్పున మంటలెగసి మాంసమును, పొంగనిరొట్టెలను కాల్చివేసెను. అంతట ప్రభువుదూత అతనికి అదృశ్యమైపోయెను.

22. గిద్యోను అతడు దేవదూతయని గ్రహించి “అయ్యో ప్రభూ! నేను దేవదూతను ముఖాముఖి చూచితిని గదా!" అనుకొని భయపడెను.

23. కాని యావే “నీకు శుభమగుగాక! భయపడవలదు. నీకు ఏ అపాయమును కలుగదు” అని అతనికి అభయమిచ్చెను.

24. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలిపీఠమును నిర్మించెను. దానికి సమాధాన కర్తయైన యావే అని పేరిడెను. నేటికిని ఆ బలిపీఠమును అబీయెసీయుల ఒఫ్రా మండలమున చూడవచ్చును.

25. ఆ రాత్రి యావే గిద్యోనుతో “మీ నాయనకు ఒక బలిసిన కోడెదూడ కలదు గదా! దానిని గైకొనుము. అతడు నిర్మించిన బాలుపీఠమును పడ ద్రోయుము. దాని చెంతగల దేవతాస్తంభమును కూడ నరికి వేయుము.

26. ఆ కుప్పమీదే కొలతల ప్రకారముగా యావేకొక బలిపీఠము నిర్మింపుము. నరికివేసిన దేవతాస్తంభపు కొయ్యను కాల్చి కోడెదూడను బలిపీఠముపై సంపూర్ణ దహనబలిగా అర్పింపుము” అని చెప్పెను.

27. గిద్యోను తన పనివారిని పది మందిని వెంటనుంచుకొని ప్రభువు ఆజ్ఞాపించిన రీతినే చేసెను. కాని అతడు తన కుటుంబ జనమునకు, పట్టణ జనమునకు దడిసెను. కనుక పగటిపూట గాక రేయిన యావే ఆజ్ఞ నెరవేర్చెను.

28. మరునాటి ప్రొద్దున నగరవాసులు మేల్కొని చూడగా అట బాలు బలిపీఠము నిర్మూలమైయుండెను. ఆ చెంతగల దేవతా స్తంభమును కూలియుండెను. ఆ తావున క్రొత్తగా నిర్మింపబడిన బలిపీఠముపై పోతరించిన కోడెదూడ సంపూర్ణదహనబలిగా సమర్పింపబడి యుండెను.

29. పురవాసులందరు ఆ పని చేసినవాడు ఎవడాయని విస్తుపోయిరి. సంగతి తెలిసికొని యోవాషు కుమారుడు గిద్యోను సాహసముతో అంతటి పనిచేసెనుగదా! అనుకొనిరి.

30. కనుక పౌరులు యోవాసుతో “నీ కుమారుని ఇచటికి కొనిరమ్ము. అతడు బాలు బలి పీఠము కూలద్రోసి దాని చెంతగల దేవతాస్తంభమును తెగనరికెను గనుక తప్పక చంపనరుడు” అనిరి.

31. కాని యెవాషు తన యొద్దకు వచ్చిన పౌరులను చూచి “మీరు బాలును సమర్థింతురా? అతనిని మీరు రక్షింపగలరా? బాలును సమర్థించువారందరును ప్రొద్దు పొడవకముందే చంపబడుదురుగాక! బాలు దేవుడేయైన పక్షమున, ఇపుడు తన బలిపీఠము నాశనమైనది గనుక తనను తానే సమర్థించుకొనును గాక!” అనెను.

32. నాటినుండి గిద్యోనునకు యెరూబాలు' అని పేరు వచ్చెను. ఎందుకన ప్రజలు “బాలుపీఠమును గిద్యోను కూలద్రోసెను గనుక బాలు అతనితో వాదించుగాక!” అని అనిరి.

33. అంతట మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశవాసులు పోరునకు తలపడి యోర్దాను నది దాటివచ్చి యెఫ్రాయేలు మైదానమున గుడారములు పన్నిరి.

34. అపుడు యావే ఆత్మ గిద్యోనును ఆవేశింపగా అతడు బాకానూదెను. అబీయెసీయులందరు అతనిని అనుసరించిరి.

35. గిద్యోను మనష్షేయులకు వార్తనంపగా వారును అతని వెంటనంటిరి. ఆషేరు, సెబూలూను, నఫ్తాలి తెగలవారికి కబురంపగా వారును గిద్యోనుతో చేరిరి.

36. అపుడు గిద్యోను ప్రభువుతో “నీవు సెలవిచ్చినట్లు యిస్రాయేలును నా ద్వారా రక్షింపపూనెదవేని ఇట్లు జరుగునుగాక!

37. నేను కళ్ళమున గొఱ్ఱె ఉన్నిని ఉంచెదను. ఆ ఉన్నిమీద మాత్రమే మంచుపడి మిగిలిన నేలయంతయు పొడిగా ఉండినచో, నీవు నుడివినట్లే నా మూలమున యిస్రాయేలును రక్షింతువని తెలిసికొందును” అనెను.

38. అతడు అడిగినట్లే మంచుపడెను. అతడు మరునాడు వేకువనే లేచి గొఱ్ఱె ఉన్నిని పిండిచూడగా ముంతెడు మంచినీళ్ళు కారెను.

39. గిద్యోను మరల యావేతో “నేను ఇంకొక్క మనవి చేసికొన్నచో ప్రభువులవారు ఆగ్రహింప కుందురు గాక! గొఱ్ఱె ఉన్నితో ఇంకొకమారు పరీక్షించి చూచెదను. ఈ మారు గొఱ్ఱెఉన్ని మాత్రము పొడిగా నుండి కళ్ళమందంతట మంచుపడియుండునుగాక!” అనెను.

40. నాటిరాత్రి యావే అట్లే చేసెను. గొఱ్ఱె ఉన్ని మాత్రము పొడిగానుండెను. కళ్ళమందంతటను మంచుపడియుండెను.