1-3. దేవుడైన యావే మోషేతో “యిస్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము: నాసీరు వ్రతము' పట్టి తన జీవితమును ప్రభువునకు సమర్పించుకొనగోరిన వారు స్త్రీయైనను, పురుషుడైనను ద్రాక్షసారాయమును, ఘాటైన మద్యమును, ద్రాక్షపండ్లరసమును సేవింప రాదు. ద్రాక్షపండ్లు పచ్చివైనను, ఎండినవైనను భుజింపరాదు.
4. ఆ వ్రతమును పాటించినన్నాళ్ళు ద్రాక్ష సంబంధమైనది ఏదియును, కడకు ఆ పండ్ల విత్తనములను, ఆ పండ్లమీది చర్మమునుకూడ ముట్టుకోరాదు.
5. వ్రతమును పాటించినన్నాళ్ళు క్షురకత్తి అతని తలవెంట్రుకలను తాకరాదు. అతడు ప్రభువునకు సమర్పితుడైనన్నినాళ్ళు నాసీరువ్రతమునకు బద్దుడై యుండును గాన తన తలవెంట్రుకలను స్వేచ్చగా పెరుగనీయవలెను.
6. వ్రతమును పాటించినన్నాళ్ళు శవము దగ్గరకు వెళ్ళకూడదు.
7. తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు చనిపోయినను ఆ శవమును తాకరాదు. అతడు ప్రభువునకు తనను తాను సమర్పించుకొనెననుటకు అతని తలవెంట్రుకలే నిదర్శనము.
8. నాసీరు వ్రతమును పాటించినన్నాళ్ళు అతడు ప్రభువునకు చెందినవాడు.
9. నాసీరువ్రతముపట్టిన వాని సమక్షమున ఎవరైన హఠాత్తుగా చనిపోయినచో అతని తలవెంట్రుకలు అపవిత్రమగును. కనుక అతడు ఏడవనాడు తలవెంట్రుకలు తీయించుకోవలెను.
10. ఎనిమిదవనాడు రెండు తెల్లగువ్వలను గాని లేక రెండు పావురపు పిల్లలను గాని నిబంధన గుడారమున యాజకునకు అర్పింపవలెను.
11. యాజకుడు ఆ పక్షులలో ఒకదానిని పాపపరిహారబలిగాను, మరియొకదానిని దహనబలిగాను సమర్పించును. ఆ రీతిగా వ్రతము పట్టినవాడు శవమును తాకుటవలన కలిగిన అపవిత్రతను పోగొట్టి యాజకుడు అతనిని శుద్దుని చేయును. ఆ దినమే అతడు తన తలవెంట్రుకలను మరల ప్రభువునకు సమర్పించుకోవలెను.
12. అతడు నాసీరువ్రతమును పాటింపదలచుకొన్న దినములన్నియు తన్నుతాను మరల ప్రభువునకు సమర్పించుకోవలెను. దోషపరిహారబలిగా ఒక ఏడాది మగ గొఱ్ఱెపిల్లను దేవునికి సమర్పింపవలెను. శాపమువలన అతని తలవెంట్రుకలు అపవిత్రమైనవి కావున ఈ ప్రాయశ్చిత్తమును జరిపించుటకు ముందు తాను నాసీరువ్రతమున గడిపిన దినములు లెక్కకురావు."
13.నాసీరువ్రతము పట్టినవాడు ప్రతాంతమున ఈ క్రింది ఆచారమును పాటింపవలెను. అతడు సాన్నిధ్యపు గుడారమునొద్దకు వచ్చి ప్రభువునకు కానుక సమర్పించుకోవలెను.
14. దహనబలికి ఏడాది మగ గొఱ్ఱెను, పాపపరిహారబలికి ఏడాది ఆడుగొఱ్ఱెను, సమాధానబలికి ఒక పొట్టేలును సమర్పింపవలెను. ఈ జంతువులు నిర్దోషముగా ఉండవలెను.
15-16. మరియు గంపెడు పొంగని రొట్టెలను సమర్పింపవలెను. వానిని నూనెతో కలిపిన పిండితో చేయవలెను. వీనితోపాటు నూనెపూసిన పొంగని చిన్న రొట్టెలను కూడ అర్పింపవలెను. వీనితో పాటు ధాన్యమును, ద్రాక్షసారాయమును కూడ కొనిరావలెను.
17. నాసీరు వ్రతము సలుపువాడు పొట్టేలును వధించి సమాధానబలిని సమర్పింపవలెను. గంపలోని పొంగని రొట్టెలు అర్పింపవలెను. వాటితోపాటు యాజకుడు ధాన్యమును, ద్రాక్షసారాయమును అర్పించును.
18. అంతట వ్రతముపట్టినవాడు ప్రత్యక్ష గుడార ద్వారమునొద్ద, తన తలవెంట్రుకలు తీయించి వానిని సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలయును.
19. యాజకుడు పొట్టేలు యొక్క ఉడకబెట్టిన ముందటి తొడను తీసికొని, బుట్టనుండి పొంగని పెద్దరొట్టెను, చిన్న రొట్టెను తీసికొని వ్రతాచరుని చేతులలో పెట్టును.
20. అటు తరువాత యాజకుడు వానిని ప్రభువునకు అల్లాడింపు అర్పణగా అర్పించును. అవి పవిత్ర వస్తువులు కనుక యాజకునికే చెందును. పైగా పొట్టేలు రొమ్మును, అల్లాడింపబడిన వెనుకటి తొడయు యాజకునికే చెందును. ఇది అంతయు ముగిసిన తరువాత నాసీరు ప్రతాచరుడు మరల ద్రాక్షసారాయమును సేవింపవచ్చును.
21. నాసీరువ్రతాచరుడు పాటింపవలసిన ఆచారమిది. అతడు తలవెంట్రుకలనే కాక మరి దేనినైన ప్రభువునకు సమర్పించెదనని స్వయముగా మ్రొక్కు కొనినచో, ఆ మ్రొక్కును గూడ తీర్చుకోవలెను” అని చెప్పెను.
22-23. దేవుడైనయావే మోషేతో "అహరోను, అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించునపుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలెనని చెప్పుము:
24. 'యావే మిమ్ము దీవించి కాపాడునుగాక!
25. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక!
26. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానమును ఒసగునుగాక!'
27. మీరు యిస్రాయేలు ప్రజలను ఆశీర్వదించునపుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను” అని చెప్పెను.