ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 5

 1. తూరు రాజైన హేరాము దావీదునకు ఆప్త మిత్రుడు. హీరాము, దావీదు స్థానములో సొలోమోను రాజయ్యెనని విని అతని దగ్గరకు రాయబారులను పంపెను.

2-3. సొలోమోను హీరామునకు సందేశము పంపి “ప్రభువునకు మా తండ్రి దావీదు మందిరము నిర్మింపలేకపోయెను. చుట్టుపట్లనున్న శత్రువులతో పోరాడి ప్రభుకృపవలన వారిని గెలుచుటతోనే ఆయన కాలమంతయు చెల్లిపోయెను.

4. కాని ఇపుడు ప్రభువు మా దేశపు సరిహద్దులందెల్ల శాంతి నెలకొల్పేను. నాకు శత్రువులు లేరు. ఇక ఏ కీడులు కలుగవు.

5. 'నీ తరువాత నేను నీ కుమారుని సింహాసనము ఎక్కింతును, అతడే నాకు దేవాలయము కట్టును' అని ప్రభువు మా తండ్రికి మాట ఇచ్చెను. కావున నేను ఇపుడు మా దేవుడైన ప్రభువునకు మందిరము నిర్మింప నిశ్చయించుకొంటిని.

6. నీవు నాకొరకై లెబానోనున ఎదుగు దేవదారులను నరికింపవలయును. నా సేవకులు నీ సేవకులతో కలసి పని చేయుదురు. నీ పనివారికి నీవు నియమించిన వేతనములు నేను చెల్లింతును. నీ పనివారైన సీదోనీయుల వలె చెట్లుకొట్టగల నేర్పరులు మా వారిలో లేరు” అని చెప్పించెను.

7. సొలోమోను వర్తమానము విని హీరాము మిక్కిలి సంతసించి “మహాజాతిగా విస్తరిల్లిన దావీదు ప్రజలను పరిపాలించుటకై అతనికి వివేకవంతుడైన కుమారుని ప్రసాదించిన ప్రభువునకు స్తుతి కలుగును గాక!” అని అనెను.

8. అతడు “నీ సందేశము అందినది. నీవు కోరినట్లుగనే దేవదారులను సరళ వృక్షములను కొట్టింతును.

9. మా పనివారు కలపను లెబానోనునుండి సముద్రతీరమునకు చేర్చెదరు. దూలములను తెప్పలుకట్టి నీవు కోరుకొన్న తావునకు పంపుదురు. అచట మా పనివారు తెప్పలను విప్పగా మీ పనివారు కొయ్యను కొనిపోవచ్చును. నీవు మాత్రము మా పనివారికి భోజన సదుపాయములు ఒనర్పుము” అని సొలోమోనునకు బదులు మాటపంపెను.

10. ఈరీతిగా హీరాము సొలోమోనునకు కావలసినంత దేవదారు, సరళవృక్షముల కలపను సరఫరా చేసెను.

11. సొలోమోను హీరాము పనివారికి ఏటేట లక్ష కుంచముల గోధుములను, లక్ష పదివేల సీసాల అచ్చమైన ఓలివు నూనెను పంపించెను.

12. ప్రభువు తాను వాగ్దానము చేసినట్లే సొలోమోనునకు వివేకము నొసగెను. సొలోమోనునకు హీరామునకు పొత్తు కుదిరెను. వారిరువురును ఒడంబడిక కూడ చేసికొనిరి.

13-14. సొలోమోను యిస్రాయేలీయుల నుండి ముప్పదివేలమంది వెట్టిచాకిరి చేయువారిని ప్రోగుచేసి అదోనీరామును వారికి అధిపతిగా చేసెను. అతడు వారిని ఒక్కొక్క గుంపున పదివేలమంది చొప్పున మూడు గుంపులుగా విభజించెను. ఒక్కొక్కగుంపు లెబానోనున ఒకనెల, ఇంటివద్ద రెండునెలలు గడపెను.

15. సొలోమోను పనివాండ్రు ఎనుబది వేలమంది కొండలలో రాళ్ళుచెక్కిరి. డెబ్బదివేలమంది ఆ రాళ్ళను మోసికొనివచ్చిరి.

16. ఆ రాతిపని వారిమీద మూడు వేల మూడువందల మంది పర్యవేక్షకులువుండిరి.

17. సొలోమోను ఆజ్ఞపై రాతిపనివారు దేవాలయ పునాదులకు అత్యంత ఖరీదైన, పెద్దరాళ్ళను మలిచి సిద్ధముచేసిరి.

18. సొలోమోను పనివాండ్రు, హీరాము పనివాండ్రు, గిబాలీయుల పనివాండ్రు దేవాలయ నిర్మాణమునకు కావలసిన రాళ్ళను, కొయ్యనుచెక్కి సిద్ధముచేసిరి.