1. ప్రవక్తలయిన హగ్గయియు, ఇద్ధో కుమారుడైన జెకర్యాయు యూదా, యెరూషలేము మండలములలో నున్న యూదులకు యిస్రాయేలు దేవుడైన ప్రభువు ప్రవచనము వినిపింపనారంభించిరి.
2. షల్తీయేలు కుమారుడగు సెరుబ్బాబెలు, యోసాదాకు కుమారుడైన యేషూవ వారి సందేశములు విని దేవాలయ పునర్ని ర్మాణమును ప్రారంభించిరి. ప్రవక్తలిద్దరు వారికి బాసటగా నుండిరి.
3. వెంటనే పశ్చిమ యూఫ్రటీసు మండలమునకు అధికారియైన తత్తనాయి, షెతర్బోస్నాయి మరియు వారి తోడి ఉద్యోగులు యెరూషలేమునకు వచ్చి “మీరు ఈ దేవాలయమును కట్టుటకును, ఈ వడ్రంగము పనిచేయించుటకును ఎవరు అనుమతి నిచ్చిరి?” అని ప్రశ్నించిరి.
4. ఆ అధిపతులు దేవాలయ నిర్మాణమునకు పెత్తనదారులైన వారి పేర్లు కూడ అడిగి తెలిసికొనిరి.
5. కాని ప్రభువు యూదా నాయకులకు బాసటయైయుండెను. కనుక అధికారులు మందిర నిర్మాణమును ఆపు చేయింపలేదు. వారు దర్యావేషునకు జాబు వ్రాసి ఆ ప్రభువు సమాధానము కొరకు వేచియుందమనుకొనిరి.
6. పశ్చిమ యూఫ్రటీసు రాష్ట్ర పాలకుడు తత్తనాయి, షెతర్బోస్నాయి, వారి తోడి అధికారులు రాజునకు పంపిన లేఖ యిది:
7. “దర్యావేషు ప్రభువునకు శాంతిభద్రతలు సిద్ధించుగాక!
8. రాజు గారికి తెలియజేయుట ఏమనగా మేము యూదామండలమునకు వెళ్ళి చూడగా అచటి ప్రజలు గండశిలలతోను, గోడలలోనికి చొన్పిన దూలములతోను వారి మహాదేవునకు మందిరము కట్టుచున్నారు. వారు నైపుణ్యముతో పనిచేయుచున్నారు. ఆ పని కూడ చకచక సాగిపోవుచున్నది. కనుక మేము ఈ సంగతిని ప్రభువుల వారికి తెలియజేయుచున్నాము.
9. దేవాలయమును కట్టుటకు, ప్రాకారములను నిల్పుటకు, పనిచేయించుటకు మీకెవరు అనుమతిచ్చిరని మేము వారి నాయకులను ప్రశ్నించితిమి.
10. దేవరవారికి తెలుపవలయునన్న తలంపుతో మేము వారి నాయకుల పేర్లు కూడ అడిగి తెలిసికొంటిమి.
11. మా ప్రశ్నకు వారు చెప్పిన జవాబిది: మేము భూమ్యాకాశములకు అధిపతియైన ప్రభువును సేవించు భక్తులము. ఈ దేవాలయమును పెక్కేండ్ల క్రితమే ఒక సుప్రసిద్ధుడైన రాజు నిర్మించిపోయెను. దానినే ఇప్పుడు మేము పునర్నిర్మాణము చేయుచున్నాము.
12. మా పూర్వులు పరలోకమందలి దేవునికి కోపము రప్పించుటవలన అతడు కల్దీయ రాజవంశీయుడు బబులోనియా రాజు నెబుకద్నెసరునకు వారు లొంగిపోవునట్లు చేసెను. ఆ రాజు వారి దేవళమును పడగొట్టి వారిని బబులోనియాకు చెరగొనిపోయెను.
13. అటు తరువాత కోరెషు ప్రభువు బబులోనియాకు చక్రవర్తియైనమొదటియేట ఈ దేవాలయమును పునర్నిర్మింపవలెనని ఆజ్ఞయిచ్చెను.
14. పూర్వము నెబుకద్నెసరు యెరూషలేము దేవాలయమునుండి కొనిపోయి బబులోనియా దేవళమున కానుకగా సమర్పించిన వెండి, బంగారు పాత్రలను గూడ కోరెషురాజు తిరిగి ఇచ్చి వేసెను. యూదాకు మండలపాలకుడుగా నియమింపబడిన షేష్బస్సరునకు అతడు పాత్రముల నొప్పగించెను.
15. అతడు ఈ విధముగా ఆజ్ఞాపించెను; ఈ పాత్రలను తీసికొనిపోయి యెరూషలేము దేవాలయము నందు ఉంచవలెను మరియు దేవాలయము మరల యథాస్థానముననే నిర్మించవలెను.
16. ఆ రీతిగా షేస్బస్సరు యెరూషలేమునకొచ్చి దేవాలయమునకు పునాదులెత్తెను. అప్పటినుండి ఇప్పటివరకును నిర్మా ణము కొనసాగుచునేయున్నది. కాని యింతవరకు పూర్తి కాలేదు'.
17. ప్రభువుల వారికి సమ్మతియగునేని బబులోనియా యందలి చారిత్రకాంశముల దస్తా వేజులను పరిశీలించి కోరెషురాజు ఈ దేవాలయమును పునర్నిర్మించుటకు ఆజ్ఞ ఇచ్చెనో లేదో తెలిసికొనుడు. అటుపిమ్మట దేవరవారి నిర్ణయమును మాకు తెలియజేయుడు.”