ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉపదేశకుడు 5

 1. తొందరపడి మాట్లాడకూడదు. తొందరపడి దేవునిముందట ప్రమాణములు చేయకూడదు. ఆయన ఆకాశమునుండగా నీవు భూమి మీదనున్నావు. కనుక నీవు అతిగా మాట్లాడవలదు.

2. విస్తారమైన పనిపాటులవలన కలలెక్కువగును. మాటలెక్కువైనకొలది బుద్దిహీనత పెరుగును.

3. కనుక నీవు దేవుని ఎదుట ఏమైన మ్రొక్కు కొనినచో, ఆ మ్రొక్కును వెంటనే తీర్పుము. ఆయన బుద్దిహీనులను అంగీకరింపడు. నీవు చేయుదునన్నది చేయుము.

4. మ్రొక్కు మ్రొక్కుకొని దానిని చెల్లింప కుండుటకంటె, అసలు మ్రొక్కుకొనకుండుటయే మేలు.

5. నీ మాటలవలననే నీవు పాపము మూట గట్టు కోవలదు. తరువాత నీవు దేవుని యాజకుని వద్దకు వెళ్ళి, అయ్యా నా మాటలలో తప్పు దొర్లెనని చెప్పుకో వలసివచ్చును. నీ మాటలవలన దేవుని కోపము నీపైకి రప్పించుకోనేల? ఆయన అనుగ్రహమువలన పూర్వము నీవు సాధించిన కార్యములను నాశనము చేయించు కోనేల? .

6. విస్తార కలలు వ్యర్ధము. హెచ్చుపలుకులు పలుకుట నిరుపయోగము. నీవు దేవునియెడల భయభక్తులతో మెలగుము.

7. కొన్ని రాష్ట్రములలో ప్రభుత్వము పేదలను పీడించి వారి హక్కులను భంగపరచి వారికి అన్యాయము చేసినచో నీవేమియు ఆశ్యర్యపడనక్కరలేదు. క్రింది అధికారిని పై అధికారియు, వారిరువురిని అంతకంటే పై అధికారియు సంరక్షించుచుండును.

8. అయినను, సుభిక్షమైన భూమి సర్వజన శ్రేయస్సును, రాజు అందరి శ్రేయస్సును కోరవలయును.

9. డబ్బును కోరుకొను వారికి అది చాలినంత లభింపదు. ధనము ఆశించువానికి అది వలసినంత దొరకదు. ఇదియును వ్యర్థమే.

10. సంపదలున్నచోట పరాన్నభుక్కులునుందురు. కనుక ధనవంతుడు తన సంపదను కంటితో చూచు కొని తృప్తి చెందుటతప్ప అతనికి ఎట్టి లాభమును లేదు.

11. పేదకార్మికుడు కడుపునిండ తినకున్నను, కనీసము సుఖముగానైన నిద్రించును. కాని ధనవంతుని ధనము అతనికి నిద్రకూడ పట్టనీయదు.

12. ఈ లోకమున నేనొక ఘోరమైన సంగతిని గమనించితిని, ధనవంతుడు కూడబెట్టిన సొమ్ము అతనికి కీడునే తెచ్చుచున్నది.

13. ఒక్క తెలివితక్కువ పనిచాలు. అతని సంపదలెల్ల నాశన మగును. ఆ మీదట అతనికి తన కుమారునికి ఇచ్చుట కేమియు మిగులదు.

14. అతడు తల్లిగర్భమునుండి దిగంబరుడుగా వచ్చినట్లే మరల దిగంబరుడుగనే కాలము చేయును.

15. అతడు తాను కష్టపడి సాధించిన వేనినిగూడ తనవెంట తీసికొని వెళ్ళజాలడు. నరుడు వట్టిచేతులతో ఈ లోకములోనికి వచ్చినట్లే, వట్టిచేతులతోనే ఇచటినుండి వెళ్ళిపోవలెనను నది మిగుల ఘోరమైన సంగతి. అతడు నిరర్ధకముగా శ్రమపడినందున కలుగు ఫలితమేమిటి?

16. అతడు ఇచట విచారవిషాదములతోను, కోపతాపములతోను, వ్యాధిబాధలతోను జీవింపవలసినదేగదా?

17. కనుక నేను గ్రహించినసత్యమిది. మానవుడు, దేవుడు తనకు దయచేసిన ఈ అల్పకాలమున తిని, త్రాగి తాను సాధించిన వానిని అనుభవించుటయే శ్రేయస్కరము. నరుని భాగధేయమిదియే.

18. దేవుడు నరునికి సంపదలను, భూములనిచ్చి వానిని అనుభవించు భాగ్యములను దయచేసెనేని అతడు సంతసింపవలెను. అతడు తాను సాధించిన వానిని అనుభవింపవలెను. ఇది దేవుడొసగు వరము.

19. భగవంతుడు, అతనికి సుఖమును దయచేసెను. కనుక అతడు ఈ జీవితము క్షణభంగురమని హృదయమున విచారింపనక్కరలేదు.