1. ఆ దినమున దెబోరా, అబీనోవము కుమారుడు బారాకు ఈ క్రింది గీతము పాడిరి:
2. “యిస్రాయేలు వీరులు తలసిగలు విప్పుకొని ఉత్సాహముతో పోరునకు వచ్చిరి. కావున ప్రభుని స్తుతింపుడి!
3. రాజులార వినుడి! రాకొమరులార ఆలింపుడి! నేను ప్రభుని కీర్తించెదను. యిస్రాయేలు దేవుడైన యావేను స్తుతించి పాడెదను.
4-5. ప్రభూ! నీవు సేయీరునుండి బయలుదేరినపుడు, ఎదోము నుండి వెడలివచ్చినపుడు, నేల అదరెను, ఆకాశము కంపించెను. మేఘములు కరగి జలములొలికించెను. యిస్రాయేలు దేవుడైన యావేను చూచి కొండలు గడగడలాడెను.
6. అనాతు కుమారుడు షమ్గరు పాలించుచుండగా, యాయేలు ప్రభుత్వము నెరపుచుండగా, పథికులు భయమున రాజపథము విడనాడి ప్రక్క త్రోవలవెంట పయనము సాగించిరి.
7. దెబోరా! నీవు యిస్రాయేలీయులపాలిటి తల్లివలె విజయము చేయువరకును ఈ దేశమంతయు నిర్జీవమై యుండెను.
8. యిస్రాయేలీయులు క్రొత్త దైవములను కొలిచిరి, కాన యుద్ధము ద్వారముకడకు వచ్చినది. ఆ ప్రజలు నలువదివేలమంది ఉన్నను, ఒక్క బల్లెముగాని, డాలుగాని కన్పింపదయ్యెను.
9. యిస్రాయేలు వీరులారా! ధైర్యము వహింపుడు. స్వేచ్ఛగా యుద్ధభూమి చేరిన శూరులారా! మీపై నాకు ప్రేమ కలదు. ప్రభువైన యావేను సన్నుతింపుడు.
10-11. తెల్లనిగాడిదల నెక్కి తివాచీలపై కూర్చుండియున్న పథికులారా! రాజపథమున పయనించు పాంథులారా! ప్రభుని గూర్చి గానముచేయుడు, అదిగో! బావులచెంత గుమిగూడిన వనితల యెదుట సంతసమున పాటలుపాడు జనులను గాంచుడి! వారు ప్రభుని అద్భుతకార్యములను సన్నుతించుచున్నారు. ప్రభుని రక్షణ కార్యములను కొనియాడుచున్నారు అదిగో! యావే ప్రజలు పురద్వారములవద్ద గుమిగూడిరి.
12. దెబోరా! మేల్కొనుము! మేల్కొనుము! నీ విజయగీతికను విన్పింపుము! బారాకు లెమ్ము! అబీనోవము కుమారా లెమ్ము! యిస్రాయేలును చెరపట్టిన వారిని చెరపట్టుము.
13. అదిగో! యావే ప్రజలు పురద్వారములయొద్ద గుమిగూడిరి ప్రభుప్రజలు వీరులవలె నడచివచ్చిరి.
14-15. ఎఫ్రాయీము వీరులు లోయలో పోరాడుచున్నారు. వారి సోదరులు, బెన్యామీనీయులును పోరు సల్పుచున్నారు. మాఖీరు నుండి సైన్యాధిపతులు వచ్చిరి. సెబూలూను నుండి సైనికోద్యోగులు వచ్చిరి. యిస్సాఖారు వీరులు దెబోరా ననుసరించిరి. నఫ్తాలి వీరులు బారాకుతో లోయజొచ్చిరి.
16. రూబేను వీరులు చీలిపోయిరి. వారు వాదవివాదములతో కాలము వెళ్ళబుచ్చిరి. అన్నలార! మీరు గొఱ్ఱెల దొడ్లచెంత గుమిగూడి పిల్లనగ్రోవి పాటవినుచు జాగుచేయనేల?
17. గిలాదు యోర్దానునకు ఆవలియొడ్డుననే నిలిచెను. దాను అన్యజాతి నావలలో చేరెను. ఆషేరు సముద్ర తీరముననే వసించెను. రేవులలోనే రోజులు వెళ్ళబుచ్చెను.
18. సెబూలూను శూరులు చావునకు తెగించి పోరాడిరి. నఫ్తాలి శూరులు వీరావేశముతో కొండపై పెనగిరి.
19. రాజులు వచ్చి పోరుసల్పిరి. కనాను రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువ వద్ద, తానాకు చెంత పోరాడిరి, అయినను వారికి కొల్లసొమ్మేమియు లభింపదయ్యెను.
20. మింటినుండి నక్షత్రములుకూడ పోరాడెను. సీస్రాతో నక్షత్రములు యుద్ధము చేసెను.
21. అతడు కీషోను వాగునబడి కొట్టుకొనిపోయెను. ఆ ప్రాత వాగునపడి కొట్టుకొనిపోయెను. నా ప్రాణమా! బలముతో సాగిపొమ్ము.
22. అవిగో! నీ గుఱ్ఱములు స్వారి చేయుచున్నవి. మహావేగముతో పరుగెత్తుచున్నవి
23. అపుడు యావేదూత ఇట్లు వచించెను: మెరోసును శపింపుడు, శపింపుడు, ఆ పట్టణ వాసులను శపింపుడు. వారు యావేకు సాయము చేయుటకు రారైరి. యావే వీరులతో గూడి పోరుసల్పుటకు రారైరి.
24. కేనీయుడైన హెబేరుని భార్యయగు యాయేలు స్త్రీలందరికంటె ధన్యురాలు. గుడారములందు వసించు వనితలందరి కంటె ధన్యురాలు.
25-26. అతడు దాహమడుగగా ఆమె పాలు కొనివచ్చెను. యోగ్యమైన పాత్రమున పెరుగునందించెను. ఆమె చేయిచాచి గుడారపు మేకు గైకొనెను. కుడిచేతితో సుత్తె గైకొనెను.
27. ఆ సుత్తెతో సీసాను మోది తలబ్రద్దలు చేసెను. అతని కణతలలో మేకు దిగగొట్టెను. అతడామె పాదములచెంత కూలినేలకొరగెను. ఆమె కాళ్ళచెంత కూలి నేల పైబడెను. తాను కూలినచోటనే చచ్చిపడెను.
28. సీిస్రా జనని కిటికి నుండి వెలుపలికి చూచెను. అల్లిక కిటికీ నుండి వెలుపలికి చూచి కేకలిడెను. “నా తనయుని రథమింకను మరలిరాలేదు. రథాశ్వములింకను తిరిగిరాలేదు కారణమేమి చెపుమా” అని వాపోయెను.
29-30. వివేకవతియైన రాజకుమారి ఒకతె ఆమెతో ఇట్లనెను: “మన వీరులు కొల్లసొమ్ము పంచుకొనుచుందురు. మన శూరులలో ప్రతివాడు వనితలనొకర్తెనో ఇద్దరినో గైకొందురు. సీస్రాకు రంగురంగుల పట్టుసాలువలు రెండు లభించును. నాకును నగిషీ పని చేసిన పచ్చడములు రెండు” ఆ మాటలనే సీస్రా జననియు మననము చేసుకొనుచుండెను.
31. ప్రభూ! నీ శత్రువులందరు సీస్రావలె నశింతురుగాక! నిన్ను ప్రేమించు జనులు మాత్రము ఉదయభానునివలె తేజముతో వెలుగొందుదురుగాక!” అటు తరువాత యిస్రాయేలీయులు నలువదియేండ్లు చీకుచింతలేకుండ జీవించిరి.