ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 5

 1-2. దేవుడైన యావే మోషేతో "కుష్ఠరోగులను, స్రావము కారువారిని, శవమును తాకిన వారిని శిబిరమునుండి వెలివేయవలెనని యిస్రాయేలీయులతో చెప్పుము.

3. పురుషులనక, స్త్రీలనక యెవరినైనను శిబిరమునుండి వెలివేయవలసినదే. నేను వసించు శిబిరమును వారు అపవిత్రము చేయరాదు” అని చెప్పెను.

4. కనుక ప్రభువు మోషేను ఆజ్ఞాపించినట్లే యిస్రాయేలీయులు శరీరశుద్దిలేని వారిని అందరిని శిబిరమునుండి వెలివేసిరి.

5. దేవుడైన యావే మోషేతో ఇట్లనెను. “యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము.

6. స్త్రీ పురుషులలో ఎవరైనను దేవుని ఆజ్ఞమీరి ఇతరుల సొత్తును అపహరించిన అపరాధియగుదురు.

7. వారు తమ పాపమును ఒప్పుకొని తమ అపరాధము వలని నష్టమును సరిగానిచ్చుకొని, దానికి అదనముగా ఐదవవంతు కలిపి ఎవరికి విరోధముగా అపరాధము చేసిరో వారికే నష్టపరిహారము ఈయవలెను.

8. సొత్తు కోల్పోయినవాడు చనిపోయినను, అతనికి బంధువులు ఎవరును లేకున్నను ప్రభువునకు నష్టపరిహారము ఈయవలెను. ఆ సొమ్ము యాజకునకు చేరును. కాని ఈ నష్టపరిహారము వేరు. అపరాధి పాపమునకు ప్రాయశ్చిత్తముగా సమర్పించుకొను పొట్టేలు వేరు.

9. పైగా, ప్రభువునకు సమర్పింపుమని యిస్రాయేలీయులు యాజకునికి ఇచ్చిన కానుకలుకూడ అతనికే చెందును.

10. యాజకులు దేవునికి అర్పించిన కానుకలు వారికే దక్కును” అని చెప్పెను.

11-12. దేవుడైన యావే మోషేతో, “యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము.

13. భార్య తన భర్తకు ద్రోహము చేసినది అనుకొందము.

14. ఆమె భర్తకు తెలియకుండ అన్యపురుషుని కూడి తనతప్పిదమును రహస్యముగ ఉంచినదనుకొందము. ఆమె మీద నేరముమోపు సాక్షులు లేరు, ఆమె పాపక్రియలో చిక్కను లేదు. కాని భర్త ఆమె భ్రష్టురాలైనదని అనుమానపడును. లేదా ఒక్కొక్కమారు భార్య ఏ పాపము ఎరుగకున్నను భర్త ఆమెను శంకింపవచ్చును.

15. ఇట్టి పరిస్థితులలో భర్త తన భార్యను యాజకుని యొద్దకు కొనిపోవలెను. రెండు మానికల యవ ధాన్యపు పిండిని దేవునికి అర్పింపవలెను. కాని అతడు దానిమీద నూనె పోయరాదు. ధూపము వేయరాదు. ఆ పిండి అనుమానము తీర్చుకొనుటకును, సత్యమును తెలిసికొనుటకును సమర్పింపబడిన కానుక.

16. యాజకుడు ఆ స్త్రీని ప్రభువు ఎదుట నిలుపవలెను.

17. అతడు మట్టిముంతలో పరిశుద్ధ నీరుపోసి, ఆ నీటిలో మందసపు గుడారమునుండి కొనివచ్చిన మట్టిని కలుపును.

18. ఆ స్త్రీ తల వెంట్రుకలను విప్పించి యవధాన్యపు పిండిని ఆమె చేతులలో ఉంచును. శాపమును తెచ్చిపెట్టునీటితో నిండియున్న పై మట్టిముంతను యాజకుడు తన చేతులలోనే ఉంచుకొనును.

19. అంతట యాజకుడు ఆ స్త్రీచే ప్రమాణము చేయింపవలెను. 'నీవు మరియొక పురుషుని కూడి భ్రష్టురాలవైతివి అన్నమాట నిజముకాని యెడల దేవుని శాపమును తెచ్చిపెట్టు ఈ చేదు నీరు నీకు ఏ ప్రమాదమును కలిగింపకుండునుగాక! .

20-22. కాని నీవు అన్య పురుషుని కూడి భ్రష్టురాలివైతివన్న మాట నిజమయినచో మీ జనులు అందరును చూచుచుండగనే ప్రభువు నిన్ను శాపము పాలు చేయునుగాక. నీ జననేంద్రియము ముడుచు కొనిపోవునుగాక! నీ కడుపు ఉబ్బునుగాక. ఈ శాపజలము నీ కడుపులోచేరి నీ పొట్టఉబ్బునట్లును నీ జననేంద్రియము ముడుచుకొని పోవునట్లు చేయును గాక!' అని ప్రమాణము చేయింపవలెను. ఆ మాటలకు ఆమె 'అట్లే జరుగునుగాక!' అని బదులీయవలెను.

23. అంతట యాజకుడు ఈ శాపమును పలకపై వ్రాయించి ఆ వ్రాతను పై చేదునీటిలో కడిగి వేయవలెను.

24. శాపము కలిగించు చేదునీటిని ఆమెచే త్రాగింపవలెను. ఆ నీళ్ళు ఆమె ఉదరమున ప్రవేశించి ఆమెకు బాధ కలిగించును.

25. యాజకుడు ఆ స్త్రీచే చేదునీళ్ళు త్రాగింపక ముందు ఆమె చేతులలోని పిండిని తీసికొని ప్రభువు సాన్నిధ్యమున ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠముపై ఉంచవలెను.

26. దానిలో గుప్పెడు పిండిని తీసికొని ప్రభువునకు సమర్పించి బలిపీఠముపై కాల్చివేయవలెను.

27. ఆ తరువాత ఆమెచే ఆ చేదు నీళ్ళను త్రాగింపవలెను. ఆమె మగనిని వంచించి భ్రష్టురాలైన మాట నిజమైనచో ఆ నీళ్ళు ఉదరమున ప్రవేశించి ఆమెకు బాధకలిగించును. ఆమె కడుపు ఉబ్బును. జననేంద్రియము ముడుచుకొని పోవును. ఎల్లరి యెదుట ఆమె శాపముపాలగును.

28. కాని ఆ స్త్రీ నిర్దోషియు పరిశుద్ధురాలును అయినచో త్రాగిన ఆమెను బాధింపవు. ఆమె అందరు స్త్రీల వలెనే పిల్లలను కనును.

29-30. భార్య అన్యపురుషుని కూడి భ్రష్టురాలైనపుడుగాని లేక భర్త తనభార్య అన్యపురుషుని కూడి భ్రష్టురాలైనదేమోయని శంకించినపుడుకాని అనుసరింపవలసిన ఆచారమిది. ఇట్టి నేరముతో భర్త తన భార్యను ప్రభువు ఎదుటకు కొనివచ్చినపుడు యాజకుడు పాటింపవలసిన నియమము ఇది.

31. భర్తకు ఏ దోషములేదుగాని, భార్య మాత్రము తన దోషమునకు తగిన శిక్షను అనుభవింపవలెను.”