1. ప్రవక్తల సమాజమునకు చెందిన ఒక శిష్య ప్రవక్త ఇంటి విధవరాలు ఎలీషా వద్దకు వచ్చి "అయ్యా! నా పెనిమిటి చనిపోయినాడు. అతడెంత దైవభక్తుడో నీవెరుగుదువు! ఇప్పుడు ఋణదాత ఒకడు వచ్చి నా ఇద్దరు కుమారులను బానిసలుగా కొనిపోనున్నాడు” అని పలికెను.
2. ఎలీషా ఆమెతో “అమ్మా! నీకు నేనేమి ఉపకారము చేయవలయునో చెప్పుము. ఇప్పుడు మీ ఇంట ఏమియున్నది?” అని అడిగెను. ఆమె “ఒక దుత్తెడు నూనె మాత్రమున్నది” అనెను.
3. ప్రవక్త ఆమెతో “మొదట నీవు వెళ్ళి మీ ఇరుగుపొరుగు వారి ఇండ్లనుండి నీకు దొరికినన్ని ఖాళీ దుత్తలు ప్రోగుజేసికొనిరమ్ము.
4. ఆ మీదట నీవు నీ కుమారులు మీ ఇంటిలోపలికి వెళ్ళి తలుపులు బిగించు కొని ఆ ఖాళీ దుత్తలన్నిటిని నూనెతో నింపుడు. ఒక్కొక్క దుత్త నిండగనే దానిని ప్రక్కన పెట్టుడు” అని చెప్పెను.
5. ఆమె ఆ రీతిగనే కుమారులతో ఇంటి లోపలికి వెళ్ళి తలుపు బిగించుకొనెను. కొడుకులు దుత్తలనందించు చుండగా తాను వాటిని నూనెతో నింపెను.
6. అన్ని నిండిన పిదప ఆమె ఇంకను దుత్తయేదైన ఉన్నదా అని కుమారుని అడుగగా అతడు ఏదియులేదని చెప్పెను. వెంటనే ఇంటనున్న దుత్త నుండి నూనె పొర్లుట ఆగిపోయెను.
7. ఆ వితంతువు ప్రవక్త వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పగా అతడు "ఆ నూనెను అమ్మి మీ బాకీ తీర్చుకొనుడు. ఋణముతీరగా మిగిలిన సొమ్ముతో నీవును, నీ కుమారులును బ్రతుకవచ్చును” అని చెప్పెను.
8. ఒకనాడు ఎలీషా షూనేము నగరమునకు వెళ్ళగా అచటవసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనమునకు రమ్మని బలవంతపెట్టెను. అప్పటినుండి ఎలీషా ఆ దెసగా పయనించినపుడెల్ల ఆమె ఇంటనే భోజనము చేసెడివాడు.
9. ఆమె తన పెనిమిటితో “ఈ అతిథి ఇన్నిసారులు మన ఇంటికి వచ్చి పోవు చున్నాడు. ఇతడు దైవభక్తుడు.
10. మన ఇంటిమీద ఒక గది కట్టించి దానిలో మంచము, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినపు డెల్ల ఆ గదిలో విశ్రమించును” అని చెప్పెను.
11. ఒకసారి ఎలీషా షూనేమునకు వచ్చి తనకొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసికొనెను.
12. అతడు తన సేవకుడగు గేహసీని పిలిచి ఈ షూనేమీయురాలిని పిలువమనగా, ఆమె వచ్చి ప్రవక్త దాపున నిలుచుండెను.
13. అతడు గేహసీతో “ఆమెతో ఇట్లనుము. నీవు మాయందు భక్తిశ్రద్ధలు చూపితివికదా! నేను నీకేమి చేయవలయును? రాజునొద్దగాని, సైన్యాధిపతి యొద్ద గాని నీవు విన్పించుకోగోరిన మనవులేమైన ఉన్నచో మేముపోయి వారితో మాట్లాడివచ్చెదము” అని అడుగమని గేహసీకి ఆజ్ఞఇవ్వగా, వాడు ఆ ప్రకారముగా ఆమెను అడిగెను. కాని ఆమె “నేను నాసొంత జనుల మధ్యనున్నాను, నా అక్కరలన్నియు వారే తీర్తురు” అనెను.
14. ప్రవక్త “మరి మనము ఈమెకు ఏమి సహాయము చేయుదుము?" అని గేహసీ నడిగెను. అతడు “ఈమెకు సంతానములేదు. పెనిమిటి కూడ ముసలివాడయ్యెను” అని చెప్పెను.
15. ప్రవక్త ఆమెను నా ఎదుటికి పిలువుమని చెప్పెను.
16. ఆమెవచ్చి తలుపుచెంత నిలువబడగా ప్రవక్త “రానున్న యేడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడుండును” అని పలికెను. ఆమె “అయ్యా! నీవు దైవభక్తుడవు. నాతో అబద్దములాడవలదు” అనెను.
17. అటు పిమ్మట ఆమె గర్భవతియై సరిగా ఎలీషా చెప్పిన సమయమునకే కుమారుని కనెను.
18. శిశువు పెరిగి పెద్దవాడయ్యెను. ఒకనాడు ఆ అతడు పొలమున కోతగాండ్రతో పంట కోయించు తండ్రివద్దకు వెళ్ళెను.
19. అక్కడ బాలుడు తలవని తలంపుగా “నాయనా! నాకు తలనొప్పిగా ఉన్నది” అని అరచెను. తండ్రి ఒక సేవకుని పిలిచి బిడ్డను తల్లి వద్దకు కొనిపొమ్మనెను.
20. సేవకుడు బాలుని తల్లివద్దకు కొనిపోయెను. ఆమె బిడ్డను మధ్యాహ్నము వరకు ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అటు తరువాత అతడు చనిపోయెను.
21. తల్లి బాలుని ఎలీషా గదిలోనికి మోసికొనిపోయి దైవభక్తుని పడుకమీద పరుండబెట్టి గది తలుపులు మూసివేసెను.
22. అంతట ఆమె పెనిమిటిని పిలిచి "నాకొక గాడిదయు, సేవకుడును కావలయును. నేను శీఘ్రమే దైవభక్తుని యొద్దకు వెళ్ళివచ్చెదను” అని చెప్పెను.
23. భర్త ఆమెతో “నీవు నేడు ప్రవక్త యొద్దకుపోనేల? ఈ దినము విశ్రాంతి దినమును కాదు, అమావాస్యయును కాదు గదా!” అనెను. ఆమె “కాకున్నను పరవాలేదు” అని పలికెను.
24. అంతట ఆ ఇల్లాలు గాడిదపై జీను వేయించెను. సేవకునితో “గాడిదను త్వరగా నడిపింపుము. నేను చెప్పనిదే ఆపవలదు” అని చెప్పెను.
25. ఆ రీతిగా ఆమె పయనమై వచ్చి కర్మేలు కొండపై నున్న ఎలీషా తావును చేరుకొనెను.
26. ప్రవక్త ఆమెను అల్లంతదూరము నుండియే గుర్తుపట్టి సేవకుడగు గేహసీతో “అదిగో! ఆ షూనేమీయురాలు వచ్చుచున్నది. నీవు పరుగెత్తుకొనిపోయి ఆమె, పెనిమిటి, పిల్లవాడు క్షేమముగా ఉన్నారో లేదో తెలిసి కొనిరమ్ము” అనెను. గేహసీ ఎదురువచ్చి తనను కలిసికొనగా ఆమె అందరును కుశలముగనే ఉన్నామని చెప్పెను.
27. కాని ఆ గృహిణి ప్రవక్తచెంతకు వచ్చి అతని పాదములు పట్టుకొనెను. గేహసీ ఆమెను ప్రక్కకు తొలగింపబోయెనుగాని ఎలీషా అతనితో “నీవు ఈ ఇల్లాలిజోలికి వెళ్ళవలదు. ఈమె హృదయము సంతాపముతో నిండియున్నది. కారణమేమో యావే నాకు తెలియజేయడయ్యెను” అని అనెను.
28. ఆ గృహిణి అతనితో "అయ్యా! ఆనాడు నేను బిడ్డను కోరుకొంటినా? నన్ను వంచింపవద్దని మనవిచేయలేదా?” అని అనెను.
29. ఎలీషా గేహసీతో “నీవు నడికట్టు కట్టుకొని నా చేతికఱ్ఱను తీసికొని వెంటనే పయనమైపొమ్ము. దారిలో ఎవ్వరిని పలుకరింపవలదు. నిన్ను పలుకరించిన వారికి సమాధానముకూడ చెప్పవలదు. తిన్నగా ఆ ఇంటికి వెళ్ళి బాలునిపై నా కఱ్ఱచాపుము" అని చెప్పెను.
30. కాని ఆ ఇల్లాలు “యావే జీవముతోడు! నీ జీవముతోడు! నేను నిన్ను వదలిపెట్టను” అని పలికెను. కనుక ఎలీషా ఆమె వెంటవెళ్ళెను. .
31. గేహసీ వారికి ముందుగా పోయి బాలునిపై కఱ్ఱచాపెను గాని మృతదేహమునుండి శబ్దములేదు, సమాధానమును లేదు. కనుక అతడు ఎలీషాను కలిసికొన ఎదురు వెళ్ళి బాలుడు మేల్కొనలేదని విన్నవించెను.
32. ఎలీషా ఆ ఇంటికి రాగానే పడకపైనున్న మృతదేహము కనిపించెను.
33. అతడు గదిలోనికి వెళ్ళి లోపలినుండి తలుపులు బిగించి ప్రభువును ప్రార్థించెను.
34. అంతట ప్రవక్త మంచము మీదికెక్కి బాలునిపై బోరగిల పరుండెను. అతని నోరు, కన్నులు, చేతులు బాలుని నోటిని, కన్నులను, చేతులను తాకుచుండెను. అతడు ఆ రీతిగా కాలు సేతులు చాచుకొని చిన్నవానిపై పరుండగా బాలుని శరీరమున ఉష్ణము పుట్టెను.
35. ఎలీషా మంచముదిగి గది నలువైపుల కొంచెముసేపు పచార్లు చేసెను. మరల మంచము ఎక్కి కాలుసేతులు చాచు కొని చిన్నవానిపై బోరగిలపరుండెను. ఈమారు బిడ్డడు ఏడుసార్లు తుమ్మి కన్నులు విప్పిచూచెను.
36. అంతట అతడు గేహసీతో ఆ షునామీయురాలును పిలువుమని చెప్పెను. ఆమె రాగా ఎలీషా “ఇదిగో నీ బిడ్డడు! తీసికొనిపొమ్ము” అనెను.
37. ఆమె అతని పాదముల చెంత సాగిలపడెను. బిడ్డను తీసికొని పైగదినుండి వెలుపలికి వచ్చెను.
38. ఒకమారు యిస్రాయేలు దేశమంతటిని కరువు పీడించుచుండెను. అప్పుడు ఎలీషా గిల్గాలునకు తిరిగివచ్చి ప్రవక్తల సమాజమునకు బోధించు చుండెను. అతడు సేవకుని పిలిచి పొయ్యిమీద పెద్ద కాగు పెట్టి ప్రవక్తలకు పులుసు వండుమని చెప్పెను.
39. ఆ ప్రవక్తలలో ఒకడు కూర ఆకులేమైన దొరుకునేమో అని పొలమునకు పోయెను. అక్కడ ఒక పిచ్చితీగ కాయలు కాసియుండెను. అతడు ఒడినిండ కాయలు కోసికొని వచ్చి వానిని ముక్కలుగా తరిగి పులుసులో కలిపెను. అవి ఏమి కాయలో ఆ ప్రవక్తకు తెలియదు.
40. అటుతరువాత పులుసును వంచిరి. కాని ప్రవక్త శిష్యులు దానిని నోటబెట్టుకొనగనే ఎలీషాను చూచి "అయ్యా! ఈ పులుసునకు విషమెక్కినది” అని అరచిరి. ఇక వారు దానిని ముట్టుకోరైరి.
41. ఎలీషా “కొంచెము పిండిని నాయొద్దకు కొనిరండి” అని చెప్పెను. అతడు ఆ పిండిని పులుసు కాగులో పడవేసి “ఈ మారు వంపుడు” అనెను. ఆ పులుసు వారికి ఎట్టి హానియు చేయదయ్యెను.
42. మరియొకమారు బాల్షాలిషా నుండి ఒకడు ఇరువది రొట్టెలను, ధాన్యపు వెన్నులను తీసికొనివచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ సంవత్సరము క్రొత్తగా తొక్కించిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను, వెన్నులను ప్రవక్త లకు పంచిపెట్టుమని చెప్పెను.
43. కాని సేవకుడు “వంద మందికి ఇవియేపాటి?” అని అడిగెను. ఎలీషా “వానిని వీరికి పంచి పెట్టుము. ప్రభువు వాక్కు ఇది: వీరు ఈ రొట్టెలను తిన్నపిమ్మట ఇంకను కొన్ని మిగులును” అని పలికెను.
44. అతడు రొట్టెలను పంచి పెట్టెను. ప్రభువు చెప్పినట్లే, వారు భుజించిన పిమ్మట ఇంకను కొన్ని రొట్టెలు మిగిలెను.