ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఉపదేశకుడు 4

 1. పిదప సూర్యునిక్రింద జరుగు పరపీడనను కూడ నేను పరిశీలించి చూచితిని. పీడితులు కన్నీరు కార్చుచుండగా వారిని ఆదుకొనువారు ఎవరునులేరైరి. పీడకులు బలవంతులుకాగా పీడితులు అండను కోల్పో యిరి.

2. కనుక బ్రతికి బట్టకట్టియున్న వారి కంటె, చనిపోయి దాటిపోయినవారే ధన్యులేమో అనిపించు చున్నది.

3. ఈ ఇరువురికంటెగూడ ఇంతవరకు పుట్టని వారు, సూర్యుని క్రింద దుర్మార్గములను కంటితో చూడనివారు, ఇంకను ఎక్కువ ధన్యులనిపించు చున్నది.

4. సూర్యునిక్రింద నరులు ఇతరుల వృద్ధిని చూచి ఓర్వజాలక తాముగూడ విజయమును సాధింప వలెనని తీవ్రముగా కృషి చేయుచున్నారు. ఇదియును వ్యర్ధమే, గాలికై ప్రయాసపడుటయే.

5. మూర్ఖుడు చేతులు ముడుచుకొని కూర్చుండును. అతడు ఆకలితో చచ్చును.

6. శ్రమయును గాలికైన యత్నములతో రెండుచేతులనిండా ఉండుటకంటే, ఒక చేతినిండ నెమ్మది కలిగియుండుట మేలు.

7. నేను ఆలోచింపగా, సూర్యునిక్రింద మరియొక వ్యర్ధమైన కార్యముగూడ గమనించితిని.

8. ఒక నరుడు ఏకాకిగా ఉన్నాడు. అతనికి సోదరులుగాని, తనయులుగాని లేరు. అయినను అతడు తాను కూడ బెట్టిన సంపదలతో తృప్తి చెందక నిరంతరము శ్రమ పడుచునేయుండును. కాని అతడు “సుఖములను గూడ విడనాడి అంతగా శ్రమపడునదెవరి కొరకు?” ఇదియు వ్యర్థమే, దయనీయమైన కార్యముకూడ.

9. ఏకాకిగా నుండుటకంటె ఇద్దరు కలిసిఉండుట మేలు. ఇరువురు కలిసినప్పుడు ఎక్కువ సమర్ధముగా పనిచేయుదురు.

10. ఆ ఇరువురిలోనొకడు పడి పోయినచో, రెండవవాడు వానిని లేవనెత్తును. కాని ఒంటిగాడు పడిపోయినచో ఇక వానిని పైకిలేపు వాడుండడు. కనుక అతడికి చేటువాటిల్లును.

11. చలిలో ఇరువురు కలిసి పడుకొనినచో వెచ్చగా నుండును. ఒక్కడే పడుకొనినచో వెచ్చగానుండదుకదా?

12. ఒక్కడు ఓడిపోవు తావున ఇరువురు కలిసినచో ఓడిపోరు. ముప్పేటల పేనిన త్రాడు సులువుగా తెగదుకదా? 

13. వృద్దుడును, బుద్దిహీనుడునై ఉపదేశము నాలింపని ,రాజుకంటె యువకుడైనను బుద్ధిమంతుడైన పేదవాడు మెరుగు.

14. ఆ యువకుడు పూర్వము చెరలోనుండి ఇప్పుడు రాజ్యము చేపట్టవచ్చును. లేదా పూర్వము భిక్షకుడై ఉండి ఇప్పుడు రాజ్యమును ఏలవచ్చును.

15. నేను లోకములోని నరులందరిని గమనించి తిని. ఎవడో ఒక యువకుడు రాజు స్థానమును ఆక్ర మించుకొని దేశమునకు పాలకుడయ్యెననుకొందము.

16. అతడు అసంఖ్యాకులైన ప్రజలను పరిపాలింప వచ్చును. కాని అతడు గతించిన తరువాత అతడు చేసిన కార్యములను ప్రశంసించువాడుండడు. ఇదియు వ్యర్ధమే, గాలికై ప్రయాసపడుటయే.

17. దేవాలయమునకు వెళ్ళినపుడు నీ ప్రవర్తన సరిచూసుకొనుము. అచటికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళవలెనుగాని, మంచి చెడ్డలు తెలియని మూరులవలె బలిని అర్పించుటకు కాదు.