ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎజ్రా 4

 1. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు యిస్రాయేలు దేవుడైన యావేకు దేవళమును పునర్నిర్మించుచున్నారని యూదీయుల మరియు బెన్యామీనీయుల శత్రువులు వినిరి.

2. వారు సెరుబ్బా బెలును, వంశనాయకులను కలిసికొని “మేమును మీతో కలిసి మందిరము నిర్మింతుము. మేమును మీరు కొలుచుదేవునే కొలుచుచున్నాము కదా! అస్సిరియా రాజు ఏసర్హద్దొను మాకిట నివాసము కల్పించినప్పటి నుండియు మేము ఈ దేవునికే బలులు అర్పించుచున్నాము” అనిరి.

3. కాని సెరుబ్బాబెలు, యేషూవ మరియు వంశనాయకులు వారితో “మా దేవునికి మందిరము నిర్మించుటకు మీ నహాయము అవసరము లేదు. పారశీక ప్రభువైన కోరెషు ఆజ్ఞయిచ్చినట్లు మేమే మా దేవళమును కట్టుకొందుము” అనిరి.

4. ఆ మాటలు విని అంతకు పూర్వమునుండి ఆ రాజ్యమున వసించు ప్రజలు యిస్రాయేలీయులను భయపెట్టి నిరుత్సాహపరచిరి. ఆ రీతిగా వారు మందిర నిర్మాణమును సాగనీయరైరి.

5. ఇంకనువారు పారశీక రాజోద్యోగులకు లంచము ఇచ్చి వారిని యిస్రాయేలీయుల మీదికి పురికొల్పిరి. పారశీకరాజు కోరెషు పరిపాలనాకాల మంతయు మరియు దర్యావేషు పరిపాలనాకాలము వరకును ఇట్లే జరిగెను.

6. అహష్వేరుషు రాజయినప్పుడు కూడ వారు యూదా, యెరూషలేము మండలములందు వసించు యిస్రాయేలీయులమీద నేరములు వ్రాసిపంపిరి.

7. మరల అర్తహషస్త ప్రభువు కాలమున గూడ బిస్లాము, మిత్రేదాతు మరియు టబియేలు వారి అనుచరులు యిస్రాయేలీయులమీద నేరముమోపి జాబును అరమాయికు లిపిలో వ్రాసి, అరమాయికు భాషలో వివరణ ఇచ్చిరి.

8. మరియు రాష్ట్రపాలకుడగు రెహూము, రాష్ట్ర కార్యదర్శియైన షింషయి యెరూషలేమును గూర్చి పారశీక రాజైన అర్తహషస్తకు ఇట్లు లేఖ వ్రాసిరి:

9-10. “రాష్ట్రపాలకుడగు రెహూము, రాష్ట్ర కార్యదర్శియైన షంషయి, వారి అనుచరులు, న్యాయా ధిపతులు పారసీకులు బబులోనియా దేశమునందలి ఏంకునుండి ఏలాము దేశమునందలి సూసానుండి వచ్చిన అధికారులు, సుప్రసిద్ధుడు పరాక్రమశాలియైన అషూర్భనిపాలు ప్రభువు తీసికొనివచ్చి సమరియా నగరమునందు యూఫ్రటీసు నదికి పశ్చిమతీరము నందును స్థిరపరచిన వివిధజాతులవారు విన్నవించు కొనునది.”

11. వారు పంపిన లేఖ నకలు ఇట్లున్నది: “చక్రవర్తి అర్తహషస్తకు యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమున వసించు దాసులు చేయు విన్నపము.

12. మీ రాజ్యమునుండి యిటకు తరలివచ్చిన యూదులు యెరూషలేమున స్థిరపడి, ఈ నగరమును పునర్నిర్మించుచున్నారని ప్రభువుల వారు గుర్తింపవలయును. ఇది ఎప్పుడును తిరుగుబాటు చేయుటకు అలవాటు పడిన దుష్టపట్టణము. ప్రస్తుతము వారు ప్రాకారము మీద పనిచేయుచున్నారు. కొలదికాలముననే దాని నిర్మాణమును పూర్తిచేయుదురు.

13. ఈ పట్టణమును, దాని ప్రాకారములను పునర్నిర్మింతురేని ఈ ప్రజలిక పన్నులు చెల్లింపరు. కనుక, ఏలినవారి ఆదాయము తగ్గిపోవును.

14. మేము ఈ ఉప్పు తిని బ్రతుకువారమగుటచే ప్రభువుల వారికి ఈ కీడు వాటి ల్లుట మేము సహింపజాలము. కనుకనే మేమీ సమా చారము పంపుచున్నాము.

15. మీ మట్టుకు మీరు, మీ పూర్వులు పదిలపరచి యుంచిన చారిత్రకాంశముల దస్తావేజులను ఒకమారు పరిశీలింపుడు. అప్పుడు మీకే తెలియును. ఇది ఎప్పుడును తిరుగు బాటు చేయునగరముగాను, పురాతనకాలము నుండియు రాజులను, రాజ్యపాలకులను ముప్పతిప్పలు పెట్టిన పట్టణముగాను, ఈ నగర పౌరులెప్పుడు కుట్రలు పన్నువారేననియు, కనుకనే ఈ పురమును నాశనము చేసిరనియు రాజ్యపు దస్తావేజుల ద్వారానే తమకు తెలియనగును.

16. ఇప్పుడు ఈ నగరమును దీని ప్రాకారములను పునర్నిర్మింతురేని ఇక ఈ యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమున ప్రభువుల వారికి రాజ్యము మిగులదని విన్నవించుచున్నాము.”

17. ఆ లేఖకు రాజు ప్రతిలేఖను పంపెను: “రాష్ట్రపాలకుడైన రెహూమునకు, రాష్ట్ర కార్యదర్శి యైన షింషయికి, సమరియా యందును, యూఫ్రటీసు నదికి పశ్చిమ తీరమున వసించు వారి అనుచరులకు శుభములు.

18. మీరు వ్రాసిన జాబును తర్జుమా చేసి నాకు చదివి వినిపించిరి.

19. నా ఆజ్ఞపై మా ఉద్యోగులు మా కార్యాలయమును పరిశీలించిరి. మొదటినుండి యెరూషలేము అను పట్టణము రాజుల మీద తిరుగబడుచు వచ్చిన మాట నిజమే. తిరుగు బాటునకు, కుట్రకు ఆ పట్టణము పెట్టినది పేరు అని మాకు అగుపడినది.

20. అచట పరాక్రమవంతులైన రాజులు పరిపాలించిరి. వారు యూఫ్రటీసు నదికి పశ్చిమతీరము నందలి మండలమునుండి సుంకములు వసూలు చేసిరి.

21. ఇపుడానగర నిర్మాణమును ఆపివేయ వలసినదని మీరు ప్రజలకు ఆయిండు. నేను మరల అనుమతి యిచ్చువరకు ఆ పట్టణనిర్మాణమును ప్రారంభింపరాదు.

22. నా రాజ్యమునకు ముప్పు వాటిల్లకుండునట్లు మీరు నగర నిర్మాణమును వెంటనే ఆపు చేయింపుడు.”

23. చక్రవర్తి అర్తహషస్త వ్రాసిన జాబు నకలు రెహూము, షింషయి, వారి అనుచరులకు చదివి వినిపింపబడగా వారు వెంటనే యెరూషలేమునకు వెళ్ళి ఆయుధములతో నిర్మాణకార్యక్రమమును ఆపు చేయించిరి.

24. ఈ రీతిగా యెరూషలేము దేవాలయ నిర్మా ణము కుంటుపడెను. పారశీకరాజు దర్యావేషు రాజు పరిపాలనాకాలము రెండవయేటి వరకును ఆ పని అటులనే ఆగిపోయెను.