1. ఏడవనెల వచ్చునప్పటికి యిస్రాయేలీయులందరు వారివారి నగరములలో స్థిరపడిన పిదప వారందరు ఏకముగ యెరూషలేమున ప్రోగైరి.
2. యోసాదాకు కుమారుడగు యేషూవయు, తోడి యాజ కులును షలీయేలు కుమారుడైన సెరుబ్బాబెలును అతని బంధువులును కలిసి యిస్రాయేలు దేవుని బలి పీఠమును పునర్నిర్మించిరి. దైవభక్తుడు మోషే ధర్మ శాస్త్రమునందు లిఖించిన రీతిగా ఆ బలిపీఠము మీద దహనబలులు అర్పించుటకు సిద్ధమైరి.
3. నిర్వాసితులు అంతకు పూర్వమునుండియు ఆ నేలమీద వసించుచున్న ప్రజలకు భయపడిరి. అయినను వారు ధైర్యముచేసి పూర్వస్థానముననే బలిపీఠమును పునర్నిర్మించిరి. దానిమీద ఉదయ సాయంకాలములందు దహన బలులు సమర్పించిరి.
4. ధర్మశాస్త్ర గ్రంథము ఆదేశించినట్లు గుడారముల పండుగ చేసి కొనిరి. ఏ రోజు అర్పింపవలసిన దహనబలులను ఆ రోజు అర్పించిరి.
5. ఇంకను మామూలుగా సమర్పింపవలసిన సంపూర్ణ దహన బలులను, అమావాస్య నాడు అర్పింపవలసిన బలులను, ప్రభువు పేర ఉత్స వము చేసికోనున్నప్పుడు అర్పింపవలసిన బలులను, స్వేచ్చగా సమర్పించు బలులను కూడ అర్పించిరి.
6. దేవాలయ పునర్నిర్మాణము ఇంకను ప్రారంభము కాలేదు. అయినను ఏడవనెల మొదటి దినమున వారు బల్యర్పణము మొదలు పెట్టిరి.
7. వారు తాపీ పనివారికిని, వడ్రంగులకును వేతనములిచ్చిరి. తూరు సీదోను పట్టణవాసులకు అన్న పానీయములను, ఓలీవునూనెను పంపిరి. పై వస్తువులకు బదులుగా ఆ నగరముల ప్రజలు లెబానోను దేవదారుకొయ్యను సముద్రముమీదుగా యొప్పా రేవునకు పంపవలయును. ఇదియంతయు పారశీక ప్రభువైన కోరెషు అనుమతి మేరకు జరిగెను.
8. బబులోనియానుండి వచ్చి యెరూషలేము దేవాలయమును చేరుకొనిన నిర్వాసితులు వారు వచ్చిన రెండవ యేడు రెండవ నెలలో పనిని ప్రారంభించిరి. ఫెయలీ యేలు కుమారుడైన సెరుబ్బాబెలు, యోసాదాకు కుమా రుడగు యేషూవ, వారి తోడిజనము, యాజకులు, లేవీయులు, యెరూషలేము చేరుకొనిన నిర్వాసితులందరు దేవాలయ పునర్నిర్మాణము ప్రారంభించిరి. ఇరువదియేండ్లు మొదలుకొని అంతకు పైబడిన లేవీయులు మందిరనిర్మాణమున పర్యవేక్షకులుగా పని చేసిరి.
9. యేషూవ, అతని కుమారులును, బంధువులును; కద్మీయేలు అతని కుమారులును; హోదవ్యా అతని కుమారులును; హేనదాదు అతని కుమా రులును; లేవీయులైన వారి బంధువులును కలిసి ఏకమొత్తముగా పనివారిచేత పనిచేయించు టకు నియమింపబడిరి.
10. పనివాండ్రు దేవాలయమునకు పునాదులు వేయుచుండగా యాజకులు అర్చన వస్త్ర ములు తాల్చి, చేత బాకాలుపూని చెంతనిలుచుండిరి. ఆసాపు వంశజులైన లేవీయులు చిటితాళములతో ప్రక్కన నిలుచుండిరి. వారు దావీదురాజు సంప్రదాయము చొప్పున ప్రభువును స్తుతించిరి.
11. ప్రభువును కొనియాడిగానము చేయుచు, “ప్రభువు మంచివాడు ఆయన కృప యిస్రాయేలీయులపై శాశ్వతముగా నిలుచును" అని వంతపాటపాడిరి. దేవాలయమునకు పునాదులు వేయబడుట చూచిన ఆ ప్రజలు మహానాదముతో ప్రభుని స్తుతించిరి.
12. వారిలో చాలమంది యాజకులు, లేవీయులు, వంశనాయకులు మునుపటి దేవాలయమును కనులార జూచిన వృద్ధులు ప్రస్తుతము వేయబడిన దేవాలయ పునాదులను చూచి వెక్కివెక్కి యేడ్చిరి. కాని మిగిలినవారు మాత్రము సంతోషము పట్టజాలక పెద్ద పెట్టున అరచిరి.
13. ఆ జనసమూహములో సంతోషస్వర మేదియో, దుఃఖ స్వరమేదియో గుర్తించుట సాధ్యము కాదయ్యెను. ఆ ప్రజల అరుపులు, కేకలుచాల దూరమువరకు విన్పించెను.