1. సొలోమోను ఐగుప్తు రాజగు ఫరో కుమార్తెను వివాహమాడి అతనితో సంధి కుదుర్చుకొనెను. తన ప్రాసాదమును, దేవాలయమును, పురప్రాకారములను నిర్మించువరకు ఫరో కుమార్తెకు దావీదు నగరముననే నివాసము ఏర్పరచెను.
2. ప్రభువునకు దేవాలయము ఇంకను నిర్మింపబడలేదు. కనుక ఆనాటి ప్రజలు ఉన్నత స్థలములలో బలులర్పించుచుండిరి.
3. సొలోమోను ప్రభువును ప్రేమించెను. తన తండ్రి అయిన దావీదు ఉపదేశమును పాటించెను. కాని అతడు కూడ ఉన్నత స్థలముల యందు బలులు అర్పించుచు, సాంబ్రాణి పొగ వేయుచునుండెను.
4. సొలోమోను గొప్ప ఉన్నత స్థలమైన గిబ్యోను నందు బలి అర్పింపబోయెను. రాజు అచటికి పోయి ఆ బలిపీఠము మీద వెయ్యి దహనబలులను అర్పించెను.
5. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి నీకేమి కావలయునో కోరుకొనుము అనెను.
6. సొలోమోను “ప్రభూ! నీవు మా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి. నీ సేవకుడగు దావీదు నీ ఆజ్ఞలు పాటించెను. నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించెను. అతని కుమారుడే నేడు సింహాసనముపై కూర్చుండి పరిపాలనము చేయు చున్నాడనగా నీవు దావీదును నేటివరకు కరుణించితివనుట నిక్కముకదా!
7. ప్రభూ! ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజును చేసితివి. అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయునో నాకు తెలియదు.
8. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్కకు అందనివారు. నేను వీరితో మనువాడను.
9. కావున నీ ఈ సేవకునకు మంచిచెడ్డలనెంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవు ఎన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరముకాదు” అనెను.
10. సొలోమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతికలిగించెను.
11. యావే అతనితో “నీవు దీర్ఘాయువునుగాని, సిరి సంపదలనుగాని, శత్రువినాశనమునుగాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్దితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి.
12. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందటి వారిలోగాని, నీ తరువాతి వారిలోగాని ఎవ్వరికిని లేని వివేకమును, విజ్ఞానమును నీకు ప్రసాదింతును.
13. నీవు అడుగకున్నను ఈ వరమునుగూడ నీకిత్తును. ఏ రాజునకు లభింపని ఐశ్వర్యము, ప్రఖ్యాతి జీవితకాలమెల్ల నీకు లభించును.
14. నీ తండ్రివలె నీవును నా ఆజ్ఞలు పాటించుచు నాకు విధేయుడవై ఉందువేని నీకు దీర్ఘాయువు ప్రాప్తించును” అని చెప్పెను.
15. అంతట సొలోమోను మేల్కొని అది కల అని తెలిసికొనెను. అటు తరువాత అతడు యెరూషలేమునకు తిరిగివచ్చి ప్రభుమందసము ఎదుటనిలిచి దహన బలులను, సమాధానబలులను సమర్పించెను. తన సేవకులకందరికి విందుచేసెను.
16. ఒకమారు పడుపువృత్తితో జీవించు స్త్రీలు ఇరువురు సొలోమోను వద్దకు అభియోగము కొనితెచ్చిరి.
17. వారిలో ఒకతె “ప్రభూ! నేను, ఈమె ఒక ఇంటనే వసింతుము. మేము ఇరువురము కలసి ఉండగా నాకొక మగకందు పుట్టెను.
18. నాకు బిడ్డ పుట్టిన మూడుదినములకు ఈమెకును ఒక మగబిడ్డ పుట్టెను. ఆ ఇంట మేమిద్దరము తప్ప ఇతరులు ఎవ్వరును లేరు.
19. ఈమె ఒకనాటిరేయి దాని పడకలో ప్రమాదవశాత్తు తన బిడ్డపై పొరలి వానిని చంపి వేసినది.
20. కాని తాను మధ్యరాత్రి లేచివచ్చి నేను నిద్రించుచుండగా నా ప్రక్కలోనున్న నా బిడ్డను కొనిపోయి తన ప్రక్కమీద పరుండబెట్టుకొనెను. చనిపోయిన శిశువును తెచ్చి నాప్రక్కన పెట్టిపోయెను.
21. నేను వేకువనే మేల్కొని బిడ్డకు చన్ను గుడుపబోగా వాని మేనిలో ప్రాణము లేదయ్యెను. తెల్లవారగనే నేను శిశువును జాగ్రత్తగా పరిశీలించి చూడగా, వాడు నేను కన్నబిడ్డడు కాదని తేలిపోయినది” అని చెప్పెను.
22. ఆ మాటలకు రెండవ వేశ్య “నీ పలుకులు నిజముగాదు. బ్రతికియున్నవాడు నా బిడ్డ. చనిపోయిన వాడే నీ బిడ్డ” అని పలికెను. అందుకు మొదటివేశ్య “నీ మాట సరికాదు. చనిపోయినవాడు నీ బిడ్డ. బ్రతికియున్నవాడే నా బిడ్డ” అని వాదించెను. ఈ రీతిగా వారిరువురు రాజు ఎదుట గొడవజేసిరి.
23-25. రాజు “ఈమె చనిపోయిన శిశువు నీ బిడ్డ, బ్రతికి యున్నవాడు నా బిడ్డ అని చెప్పుచున్నది. ఆమె ఈమె మాటను త్రోసిపుచ్చి బ్రతికియున్నవాడు తన బిడ్డడే, చచ్చినది నీ బిడ్డ అని వాదించుచున్నది” అని నుడివి, కత్తిని కొనిరమ్మని సేవకుని ఆజ్ఞాపించెను. అతడు కత్తి తీసికొనిరాగా రాజు “ఈ బిడ్డను రెండు తుండెములుగా నరికి ఒక ముక్కను ఈమె కిమ్ము. ఇంకొక ముక్కను ఆమెకిమ్ము” అని పలికెను.
26. ఆ మాటలకు కన్నతల్లి ప్రేగులు తరుగుకొనిపోయెను. ఆమె రాజుతో “దేవరా! బిడ్డను చంపవలదు. వానిని ఈమెకే ఇచ్చివేయుడు” అనెను. కాని రెండవయామె “ఈ బిడ్డ మన ఇరువురిలో ఎవరికిని దక్కకూడదు. వీనిని రెండు ముక్కలుగా నరికి వేయవలసినదే” అనెను.
27. అప్పుడు రాజు “శిశువును చంపవలదు. వానిని మొదటి ఆమెకే ఇచ్చివేయుడు. కన్నతల్లి ఆమెయే” అని తీర్పు చెప్పెను.
28. యిస్రాయేలు ప్రజలు రాజు చెప్పిన తీర్పు వినిరి. ప్రభువు రాజునకు న్యాయము నిర్ణయించు వివేకము ఒసగెనని గుర్తించి అతనికి భయపడిరి.