1. యూదా, యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడైన యెషయా చూచిన దర్శనములివి: యూదానేలిన ఉజ్జీయా, యోతాము, ఆహాసు, హిజ్కియా రాజుల కాలములలో అతడు ఈ దృశ్యములను గాంచెను.
2. ప్రభువిట్లు పలికెను: “భూమ్యాకాశములారా వినుడు! నేను పెంచి పెద్దజేసిన బిడ్డలే నామీద తిరుగబడిరి.
3. ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియును. గాడిదకు తన యజమానుడు తనకెక్కడ గడ్డివేయునో తెలియును. కానీ యిస్రాయేలునకు ఏమియు తెలియదు. నా ప్రజలేమియు అర్థము చేసికొనరు.”
4. పాపజాతి ప్రజలారా! మీకు అనర్ధము వాటిల్లును. మీరు దుష్టులు, దుష్కార్యములకు పాల్పడువారు, పూర్తిగా చెడిపోయినవారు, మీరు ప్రభువును విడనాడితిరి. యిస్రాయేలు పరిశుద్ధ దేవుని నిర్లక్ష్యము చేసితిరి. అతని నుండి వైదొలగితిరి.
5. నేను మిమ్ము మరల కొట్టవలెనా? మీరు నిరంతరము నాపై తిరుగుబాటు చేయనేల? యిస్రాయేలూ! నీ తల ఇప్పటికే గాయములతో నిండియున్నది. నీ గుండె బలహీనమైయున్నది.
6. అరికాలినుండి నడినెత్తివరకు నీ దేహమున ఆరోగ్యకరమైన భాగమే లేదు. నీ తలనుండి కాలువరకు దెబ్బలు, గాయములు, పుండ్లతో నిండియున్నవి. నీ పుండ్లకు చికిత్సచేయలేదు, కట్టుకట్టలేదు, తైలముపూయలేదు.
7. నీ దేశము నాశనమైనది, నీ నగరములు కాలిపోయినవి. నీవు చూచుచుండగనే అన్యజాతి వారు నీ పొలములు ఆక్రమించుకొనిరి, అన్యులచే నాశనము చేయబడిన దానివలె, అది పాడైపోయెను.
8. సియోను కుమార్తె శత్రువుల ముట్టడికి గురియైన ద్రాక్షతోటలోని గుడిసె వలెను, దోసతోటలోని పాక వలెను ఏకాకిగా వదిలివేయబడినది.
9. సైన్యములకధిపతియైన ప్రభువు మనలో శేషజనమును కొద్దిమందిని మిగిల్చియుండనియెడల, మనము సొదొమవలె అయ్యెడివారము, గొమొఱ్ఱా వలె ఉండెడివారము.
10. సొదొమ పాలకులారా! ప్రభువు పలుకులు ఆలింపుడు. గొమొఱ్ఱా పౌరులారా! మన దేవుని ఉపదేశములు వినుడు.
11. ప్రభువు ఇట్లనుచున్నాడు: “మీ బహుళ బలులవలన నాకు ఒరిగినదేమిటి? మీరు పొట్టేళ్ళను దహనబలిగా అర్పించుటవలన, పోతరించిన పశువుల కొవ్వును వ్రేల్చుటవలన నాకు విసుగెత్తుచున్నది. ఎడ్లు, గొఱ్ఱెలు, మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు.
12. మీరు నా సన్నిధికి వచ్చినపుడు, వీనినన్నిటిని కొనిరమ్మన్నదెవరు? మిమ్ము నా ఆవరణములో కాలుపెట్టమన్నదెవరు?
13. అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు. మీరు వేయు సాంబ్రాణిపొగ . నాకు అసహ్యముగానున్నది. మీ అమావాస్య పండుగలు, విశ్రాంతిదినములు, ఉత్సవ దినసమావేశములు నేను భరింపలేను. అవన్నియు మీ పాపములవలన కలుషితములైనవి.
14. మీ అమావాస్య పండుగలు, మీ ఉత్సవములు నేనసహ్యించుకొనుచున్నాను. వానినిక సహింపజాలను. అవి నాకు బాధాకరములు.
15. మీరు ప్రార్ధన చేయుటకు చేతులెత్తినపుడు నేను మీ వైపు చూడను. మీరెన్ని మనవులుచేసినను నేను ఆలింపను. మీ చేతులు నెత్తురుతో నిండియున్నవి.
16. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసికొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడును విడనాడుడు.
17. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయముచేయుడు. వితంతువుల కోపు తీసికొనుడు.
18. ప్రభువు ఇట్లనుచున్నాడు : రండి, మన వివాదమును పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరమువలె ఎఱ్ఱగానున్నను, మంచువలె తెల్లనగును, కెంపువలె ఎఱ్ఱగానున్నను, ఉన్నివలె తెల్లనగును.
19. మీరు నాకు విధేయులగుదురేని, భూమినుండి పండు మేలిపదార్థములు భుజింతురు.
20. కాని నన్ను తిరస్కరించి, నా మీద తిరుగబడుదురేని, మీరు కత్తివాతబడుదురు. ప్రభుడనైన నా పలుకిది."
21. అయ్యో! పూర్వము విశ్వసనీయముగా మెలిగిన నగరమిప్పుడు వేశ్య అయినదే! ఒకప్పుడు ఇచట నీతిన్యాయములు నెలకొనియుండెను. ఆ కాని ఇప్పుడిది నరహంతలకు ఆలవాలమయ్యెను.
22. నీ వెండి చిట్టెముగా మారెను. నీ ద్రాక్షారసము నీళ్ళతో కలిసి పలుచనయ్యెను.
23. నీ అధికారులు నా మీద తిరుగబడుచున్నారు. దొంగలతో చేతులు కలుపుచున్నారు. బహుమతులు ఆశించుచున్నారు, లంచాలు కోరుచున్నారు. వారు అనాథలకు న్యాయము జరిగించుటలేదు, వితంతువుల వ్యాజ్యెములను పరిష్కరించుటలేదు.
24. కనుక సైన్యములకధిపతియైన ప్రభువు, బలసంపన్నుడైన యిస్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు: “నేను నా శత్రువులను జయింతును. నా విరోధులమీద పగతీర్చుకొందును.
25. నా హస్తమును నీపై చాచెదను. కొలిమిలో నిన్ను శుద్ధిచేసి నీ చిట్టెమును తొలగింతును. నీలోని మాలిన్యమును నిర్మూలింతును.
26. పూర్వము మీకుండిన న్యాయాధిపతులవంటివారిని, తొలుత మీకుండిన సలహాదారులవంటి వారిని మీకు మరల దయ చేయుదును. అప్పుడు నీతిగల పట్టణమనియు, విశ్వాసపాత్రమైన నగరమనియు నీవు పిలువబడుదువు.
27. సియోను న్యాయము చేతను, పశ్చాత్తాపపడు దాని నివాసులు నీతిచేతను రక్షింపబడుదురు.
28. కాని అతిక్రమమును చేయువారును, పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు. ప్రభువును విడనాడువారు హతులగుదురు.
29. మీరు సింధూరములకు మోజుపడినందులకు సిగ్గుపడుదురు. పవిత్ర వనముల పట్ల మక్కువ చూపినందులకు చింతించుదురు.
30. మీరు ఆకులు వాడిపోయిన సింధూరమువలెను, నీరు దొరకని తోటవలెను ఎండిపోయెదరు.
31. బలాఢ్యులు నారపీచువలె అగుదురు. వారి దుష్కార్యములు నిప్పురవ్వలగును ఆర్పువాడు ఎవ్వడును లేక వారును, వారి చెయిదములన్నియు కాలిపోవును”
1. యూదా, యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడైన యెషయా చూచిన దర్శనమిది:
2. కడవరిదినములలో ప్రభువు మందిరమున్న పర్వతము, శైలములన్నిటిలోను ఉన్నతమైనదగును. కొండలన్నిటిలోను ఎత్తయినదగును. సకలజాతి జనులును ప్రవాహమువలె దానిచెంతకు వత్తురు.
3. అనేకమంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు: “మనము ప్రభువు పర్వతమునకు పోవుదము. యాకోబు దేవుని దేవళమునకు పోవుదము. ఆయన తన మార్గములు మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడచుదము.” ధర్మశాస్త్రము సియోనునుండి వచ్చును. ప్రభువువాక్కు యెరూషలేమునుండి బయల్వెడలును.
4. ఆయన జాతులమధ్య తగవులు పరిష్కరించును. అనేక ప్రజలకు తీర్పుచెప్పును. వారు తమకత్తులను కట్టులుగా సాగగొట్టుకొందురు. తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకొందురు. ఒక జాతి మరియొక జాతి మీద కత్తిదూయదు. ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు.
5. యాకోబు వంశజులారా రండు! మనము ప్రభువుదయచేయు వెలుగులోనడచుదము.
6. ప్రభూ! నీవు నీ ప్రజయైన యాకోబుసంతతిని పరిత్యజించితివి. దేశము తూర్పునుండి వచ్చిన మాంత్రికులతో నిండిపోయినది. ఫిలిస్తీయదేశమునవలె సోదెచెప్పువారు ఎల్లెడల కనిపించుచున్నారు. ప్రజలు అన్యజాతులతో పొత్తుచేయుచున్నారు.
7. వారి దేశమున వెండి బంగారములు విస్తారముగానున్నవి. వారి సంపదలకు అంతమేలేదు. వారికి గుఱ్ఱములు సమృద్ధిగానున్నవి, రథములకు లెక్కయేలేదు.
8. వారి దేశమున విగ్రహములు విరివిగానున్నవి. ఆ ప్రజలు తమ చేతులతో మలచిన విగ్రహములను తామే ఆరాధించుచున్నారు.
9. నరమాత్రులెల్లరును మన్నుగరతురు. ప్రభూ! నీవు వారిని క్షమించవలదు!
10. ప్రభువు భీకర కోపమునుండి, ఆయన శక్తి ప్రభావముల నుండి తప్పించుకొని దాగుగొనుటకు కొండ గుహలలోనికి జొరబడుడు. నేల బొరియల లోనికి దూరుడు.
11. ఆ దినమున ప్రభువు నరుల పొగరును అణగదొక్కును. ప్రజల గర్వమును అణచివేయును. ప్రభువు మాత్రమే ఉన్నతుడగును.
12. ఆ దినమున సైన్యముల కధిపతియైన ప్రభువు గర్వాత్ములను, ఉన్నతపదవిలో ఉన్నవారిని, అహంకారులను అణగదొక్కును.
13. ఉన్నతములైన లెబానోను దేవదారులను, బాషాను సింధూరములను,
14. ఉత్తుంగ పర్వతములను, ఎత్తయిన కొండలను,
15. ఎత్తయిన కోట బురుజులను, దుర్గప్రాకారములను,
16. విలువగల తర్షీషు నావలను, అందమైన కళావస్తువులను ఆయన నాశనము చేయును.
17-18. ఆ దినమున ప్రభువు, నరుల పొగరును అణగదొక్కును. ప్రజల గర్వమును అణచివేయును. ప్రభువు మాత్రమే ఉన్నతుడగును. విగ్రహములెల్ల క్రింద పడవేయబడును.
19. ప్రభువు భూమిని గడగడలాడించుటకు లేచునపుడు అతని భీకర కోపము నుండియు, అతని శక్తి ప్రభావముల నుండియు తప్పించుకొని దాగుకొనుటకు కొండగుహలలోనికి జొరబడుదురు నేల బొరియలలోనికి దూరుదురు.
20-21. ఆ దినమున ప్రభువు భూమిని గడగడలాడించుటకు లేచునపుడు ఆయన భీకరకోపము నుండియు, ఆయన శక్తి ప్రభావములనుండియు తప్పించుకొని దాగుకొనుటకు కొండగుహలలోనికిని, బండనెఱ్ఱెలలోనికిని జొరబడెవలెనన్న ఆశతో ఆ దినమున నరులు తాము ఆరాధించుటకై చేసిన వెండిబంగారు విగ్రహములను చుంచెలుకలకును, గబ్బిలములకును పారవేయుదురు.
22. ముక్కు బెజ్జములలో ఊపిరియున్నఅల్పమానవుని లెక్కచేయ వాని బండారమెంత?
1. సైన్యములకధిపతియైన ప్రభువు యూదా, యెరూషలేముల నుండి ప్రజలకు ఆధారభూతమైన వానినన్నిటిని, అన్నపానీయములను తొలగించును.
2. శూరులను, సైనికులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెచెప్పు వారిని రాజనీతిజ్ఞులను,
3. సైన్యాధిపతులను, పెద్దలను, సలహాదారులను, మాంత్రికులను, శాకునికులను ఆయన తొలగించును.
4. ఆయన బాలురను ప్రజలకు అధిపతులనుగా నియమింతును. వారు బాలచేష్టలు చేసి, ప్రజలను పరిపాలింతురు.
5. ప్రజలు ఒకరినొకరు బాధింతురు. ఇరుగుపొరుగువారు ఒకరినొకరు పీడింతురు. పిన్నలు పెద్దలను తిరస్కరింతురు. అల్పులు ఘనులను గౌరవింపరు.
6. తన తండ్రి ఇంట తన సోదరుని పట్టుకొని “నీకు కనీసము కట్టుకొనుటకు బట్టలైననున్నవి. కనుక ఈ కష్టకాలమున నీవు మాకు నాయకుడవై మమ్ము పరిపాలింపుము” అని అడుగుదురు.
7. కాని అతడు “నేను మిమ్ము సంరక్షింపజాలను. మా ఇంట బట్టలును, తిండియు లేవు. నన్ను మీకు నాయకునిగా ఎన్నుకొనకుడు” అని పలుకును.
8. యెరూషలేము పతనమయ్యెను యూదా నాశనమయ్యెను ఆ ప్రజల మాటలు చేతలు ప్రభువునకు ప్రతికూలముగానున్నవి. వారు ప్రభువుమహిమను అవమానించుచున్నారు.
9. వారి ముఖలక్షణము వారికి ప్రతికూలముగా సాక్ష్యమిచ్చుచున్నది. ఆ ప్రజలు సొదొమ జనులవలె బహిరంగముగా పాపము చేయుచున్నారు. తమ మీదకు తామే కీడు తెచ్చుకొనియున్నారు.
10. సజ్జనులతో మీరు సంతోషము బడయుదురనియు, మీ సత్కార్యములకు తగినఫలమును అనుభవింతురనియు చెప్పుడు.
11. కాని దుష్టునికి అనర్థము వాటిల్లును. వారు ఇతరులకు చేసిన కీడే వారిని సోకును.
12. నా ప్రజలను బాలుడు పీడించుచున్నాడు. స్త్రీలు ఏలుచున్నారు. ప్రజలారా! మీ పాలకులు మిమ్ము అపమార్గము పట్టించుచున్నారు. మీరు ఏ దారిన పోవలెనో మీకే తెలియుటలేదు.
13. ప్రభువు తన వాదమును వినిపించుటకు సిద్ధమగుచున్నాడు. తన ప్రజలకు తీర్పుచెప్పుటకు సంసిద్ధుడు అగుచున్నాడు.
14. ఆయన పెద్దలను ప్రజాధిపతులను తీర్పునకు పిలుచుచున్నాడు. “ద్రాక్షతోటను దోచుకొనినది మీరే. మీరు పేదలనుండి దోచుకొనిన సొమ్ము మీ ఇండ్లలోనున్నది.
15. నా ప్రజలను అణగదొక్కి పేదలను పీడించు అధికారము మీకు ఎక్కడినుండి వచ్చినది? సైన్యములకధిపతియు, ప్రభుడనైన నా పలికిది” అని అనుచున్నాడు.
16. ప్రభువు ఇట్లనెను: “సియోను మహిళలకు పొగరెక్కినది. వారు గర్వముతో తలఎత్తుకొని నడచుచున్నారు. ఓర చూపులు చూచుచున్నారు. కాలియందెలు మ్రోగునట్లు కులుకుచు నడుచుచున్నారు”
17. కాన ప్రభువు సియోను స్త్రీల తలలు గొరిగించును. వారిని బోడివారిని చేయును. ప్రభువు వారి మానమును బయలుపరచును.
18. ఆ దినమున ప్రభువు యెరూషలేము స్త్రీల యందెలు, వర్తుల భూషణములు, చంద్రవంకలు,
19. లోలకులు, కంకణములు, మేలిముసుగులు,
20. కుళ్ళాయులు, కాలి గొలుసులు, ఒడ్డాణములు, అత్తరు బుడ్డులు, తాయెత్తులు,
21. ఉంగరములు, బులాకీలు, ముక్కుకమ్మలు,
22. దువ్వలువలు, పావడలు, అంగీలు, చేతిసంచులు,
23. అద్దములు, నార బట్టలు, శిరోవేష్టనములు, శాలువలు తొలగించును.
24. వారు పరిమళములకు మారుగా దుర్గంధము లొలుకుదురు. ఒడ్డాణములకు మారుగా త్రాళ్ళు ధరింతురు. అలంకృత కేశములకు మారుగా బోడితలలు చూపట్టును. వలువలకు మారుగా గోనెతాల్తూరు. సౌందర్యమునకు మారుగా వాతలు వేయించుకొందురు.
25. నీ పురుషులు కత్తివాతబడుదురు. నీ వీరులు పోరునచత్తురు,
26. నీ ద్వారములు ఏడుపులతో అంగలార్చును. నీవు శోకముతో నేలమీద చతికిలబడుదువు.
1. ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని “మేము మా అన్నమునే తిందుము, మా వస్త్రములనే తాల్తూము, మమ్ము నీ పేరున చలామణి కానిమ్ము. అప్పుడు మా అవమానము తొలగిపోవును” అని అందురు.
2. ఆ రోజున ప్రభువు చిగురు సొబగుగను, గొప్పదిగను ఉండును. నేలనుండి మొలచిన పైరు యిస్రాయేలు శేషజనమునకు, గర్వకారణముగను అలంకారముగను ఉండును.
3. సియోనున శేషించియున్నవారు, యెరూషలేమున మిగిలియున్నవారు, అనగా జీవమునొంద యెరూషలేములో దాఖలైన ప్రతివాడును పరిశుద్ధుడని పిలువబడును.
4. ప్రభువు తీర్పుతీర్చు ఆత్మచే, దహించు ఆత్మచే ప్రజలకు తీర్పుతీర్చి, వారిని శుద్ధిచేయును. ఆయన సియోను కుమార్తెల మాలిన్యమును కడిగివేయును. సియోనునందు చిందిన నెత్తుటికి ప్రాయశ్చిత్తము చేయును.
5. ఆయన సియోను కొండమీదను, దానిపైని ప్రోగయిన జనము మీదను పగలు మబ్బును, పొగను క్రమ్మించును. రేయి కాంతిమంతమైన జ్యోతిని వెలుగించును. ప్రభువు తేజస్సు నగరమంతటిని చాందినివలె కప్పును.
6. ఆయన తేజస్సు గుడారమై పగలు ప్రజలను ఎండ పొడనుండి కాపాడును. జనులు తలదాచుకొను తావుగా ఉండును. వాన, గాలివాన వచ్చినపుడు ఆశ్రయముగా ఉండును.
1. నేను నా ప్రియునికి ఒక పాటపాడెదను, నా చెలికానిని గూర్చి, అతని ద్రాక్షతోటను గూర్చి పాడెదను. సారవంతమైన కొండపై నా ప్రియుడికొక ద్రాక్షతోట కలదు.
2. అతడు ఆ తోటనుత్రవ్వి రాళ్ళు ఏరివేసి మేలైన ద్రాక్షతీగలు నాటెను. తోటనడుమ బురుజుకట్టి, రసము తీయుటకు తొట్టిని తొలిపించెను. అతడు ద్రాక్షపండ్లకొరకు ఎదురుచూచెను. కాని ఆ తోట పుల్లనికాయలు కాచెను.
3. కనుక యెరూషలేము పౌరులారా! యూదావాసులారా! మీరు నాకును, నా తోటకును తీర్పుచెప్పుడు.
4. నేను నా తోటకు చేయవలసిన సేవలన్నింటిని చేసితినిగదా! ఇంకా దానికి నేనేమి చేయవలెను? పండ్లు ఫలించునని నేను కాచుకొనియుండగా అది పుల్లనికాయలు కాయనేల?
5. నేను నా తోటనేమి చేయుదునో వినుడు! దాని కంచెను కొట్టి వేయుదును. గొడ్లు దానిని మేయును. దాని ప్రాకారమును పడగొట్టుదును. వన్యమృగములు దానిని తొక్కివేయును.
6. అది పాడువడిపోవునట్లు చేయుదును. నేను ద్రాక్ష కొమ్మలను కత్తిరింపను. పారతో నేలత్రవ్వను. దానిలో ముండ్లపొదలు ఎదుగును. దానిమీద వాన కురవవలదని , మబ్బులను ఆజ్ఞాపింతును.
7. యిస్రాయేలు జనులు సైన్యములకధిపతియైన ప్రభువు ద్రాక్షతోట. యూదాప్రజలు ఆయనకు ప్రీతిగొలుపు వనము. ఆయన న్యాయమును అపేక్షించెనుగాని, అక్కడ దౌర్జన్యముండెను. ఆయన నీతిని కాంక్షించెనుగాని అన్యాయమునకు బలియైనవారి ఆక్రందనము వినిపించెను.
8. ఇంటికి ఇల్లు, పొలమునకు పొలము కలుపుకొని ఇతరులకు ఏ మాత్రము తావు మిగులనీయక దేశమున తాము మాత్రమే వసించువారు శాపగ్రస్తులు.
9. నేను వినుచుండగా సైన్యములకధిపతియైన ప్రభువిట్లు ప్రమాణము చేసెను: “సుందరములైన మహాభవనములు అనేకములు నిర్మానుష్యమగును. "
10. పది ఎకరాల ద్రాక్షతోట మలుపులుఒక్క పీపాయిరసమును ఇచ్చును. పదికుంచాల విత్తనాలు ఒక్కకుంచము పంటనొసగును."
11. వేకువన లేచినప్పటినుండే మద్యపానము ప్రారంభించి, రేయి ప్రొద్దుపోవు వరకు త్రాగి కైపెక్కియుండువారు శాపగ్రస్తులు.
12. వారు స్వరమండలములు, తంత్రీవాద్యములు, సితారాలు, పిల్లనగ్రోవులతోను, ద్రాక్షారసముతోను ఉత్సవములు చేసికొందురు. కాని ప్రభువు కార్యములను ఏ మాత్రము గమనింపరు. ఆయన చెయిదములను ఏమాత్రము పరిశీలింపరు.
13. నా ప్రజలకు గ్రహణశక్తి లేదు. కనుక వారు ప్రవాసము వాతబడుదురు. ప్రజానాయకులు ఆకలితోచత్తురు. సామాన్య ప్రజలు దప్పికతో నశింతురు.
14. పాతాళము వారికొరకు ఆకలికొనియున్నది. నోరు విశాలముగా తెరచుకొనియున్నది. యెరూషలేమునందలి ప్రముఖులును, రణగొణ ధ్వనిచేయు సామాన్య ప్రజలును దాని నోటబడుదురు.
15. ప్రభువు మానవమాత్రులనెల్ల అణగదొక్కును. గర్వాత్ములను అణచివేయును.
16. సైన్యముల కధిపతియైన ప్రభువు తన తీర్పుద్వారా అధికుడగును. పవిత్రుడైన ప్రభువు తన న్యాయముద్వారా "స్వీయపావిత్య్రమును వెల్లడిచేయును.
17. పాడువడిన నగరములలో గొఱ్ఱెపిల్లలు గడ్డిమేయును. మేకపిల్లలు మేతమేయును.
18. త్రాళ్ళతో కట్టి లాగుకొని పోయినట్లుగా తమ దోషములను తమ వెంట లాగుకొనిపోవువారు శాపగ్రస్తులు.
19. “ప్రభువు తాను చేయబూనిన పనిని శీఘ్రమే చేయునుగాక! మనమెల్లరమును ఆ కార్యమును చూడవచ్చును. పవిత్రుడైన యిస్రాయేలు దేవుడు తన సంకల్పమును నెరవేర్చునుగాక! అప్పుడు ఆయన ఆలోచనలను మనము అర్ధము చేసికోవచ్చును” అని వారు పలుకుచున్నారు.
20. చెడును మంచిగాను, మంచిని చెడుగాను చిత్రించి; . వెలుతురును చీకటిగాను, . చీకటిని వెలుతురుగాను మార్చి; చేదును తీపిగాను, తీపిని చేదుగాను చేయువారు శాపగ్రస్తులు.
21. తమను తాము తెలివికల వారినిగాను, బుద్ధిమంతులనుగాను ఎంచుకొనువారు శాపగ్రస్తులు.
22. ద్రాక్షరసమును సేవించుటయందును, ఘాటయిన మద్యములను కల్పుటయందును వీరులయినవారు శాపగ్రస్తులు.
23. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పుతీర్చెదరు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.
24. కావున అగ్నినాలుక దుబ్బులను దహించునట్లును, ఎండుగడ్డి అగ్గిలో మాడిపోవునట్లును వారి వ్రేళ్ళు కుళ్ళిపోవును. వారి పూవులు ఎండి ధూళివలె ఎగిరిపోవును. వారు సైన్యములకధిపతియైన ప్రభువు చట్టమును తిరస్కరించిరి. యిస్రాయేలీయుల పవిత్రదేవుడైన దేవుని వాక్కును తృణీకరించిరి.
25. ప్రభువు కోపము ఆయన ప్రజలమీద రగుల్కొనినది. ఆయన వారిని శిక్షించుటకు చేతులెత్తును. కావున పర్వతములు కంపించును. వీధులలో పీనుగులు పెంటకుప్పలవలె ప్రోగువడును. ఆయన కోపము ఇంకను మరలింపబడలేదు. ఆయన బాహువు ఇంకను చాచబడియున్నది.
26. దూరప్రాంతమందలి జాతిని పిలుచుటకు ప్రభువు జెండాను ఎత్తెను. నేల అంచుల నుండి దానిని రప్పించుటకు ఆయన ఈలవేసెను. అదిగో! ఆ ప్రజ శీఘ్రముగా కదలివచ్చుచున్నది.
27. వారిలో అలసిపోయినవాడును, పడిపోవువాడును, నిద్రపోవువాడును, కునికిపాట్లు పడువాడును, నడికట్టు విడిపోయినవాడును, పాదరక్షలు తెగినవాడు ఒక్కడును ఉండడు.
28. వారి బాణములు వాడిగానున్నవి. వారు తమ విండ్లు ఎక్కుపెట్టి ఉన్నారు. వారి గుర్రలగిట్టలు చెకుముకి రాళ్ళవలె గట్టిగా నున్నవి. వారి రథచక్రములు సుడిగాలివలె తిరుగుచున్నవి.
29. వారు సింగములవలె, సింగపుకొదమలవలె గర్జింతురు. ఎరను పట్టి తమతావులకు గొనిపోవుదురు. ఇక ఆ వేటను ఎవడును విడిపింపజాలడు.
30. ఆ రోజున వారు యిస్రాయేలీయులమీదికి ఎత్తివచ్చి సముద్రమువలె ఘోషింతురు. దేశమువైపు పారజూచినచో అంధకారము, శోకము కనబడును. దేశముమీది వెలుగు మేఘముల వలన చీకటియగును.
1. ఉజ్జీయారాజు గతించిన యేడు ఉన్నతమైన సింహాసనముపై ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను.
2. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరాపులు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. వారు రెండు రెక్కలతో తమ ముఖమును, రెండింటితో కాళ్ళను కప్పుకొని రెండింటితో ఎగురుచుండిరి.
3. ఆ దేవదూతలు ఒకరితోనొకరు: "సైన్యములకధిపతియైన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది” అని యెలుగెత్తి పలుకుచుండిరి.
4. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను. దేవళము పొగతో నిండెను.
5. నేను: “హా! చెడితినిగదా! నా నోటినుండి వెలువడునవన్నియు అపవిత్రమైనమాటలే. అపవిత్రమైనమాటలు పలుకు ప్రజలనడుమ నేను వసించుచున్నాను. రాజును, సైన్యములకధిపతియునైన ప్రభువును నా కన్నులతో చూచితినిగదా!” అని అనుకొంటిని.
6. అప్పుడు ఒక దేవదూత నా చెంతకు ఎగిరివచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీదినుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొనివచ్చెను.
7. ఆ కణికను నా నోటికి అంటించి “ఇది నీ పెదవులకు సోకినది. కనుక నీ పాపము తొలగిపోయినది. నీ దోషమునకు పరిహారము జరిగినది” అని పలికెను.
8. అప్పుడు ప్రభువు: “నేనెవరిని పంపుదును? మనకొరకు ఎవడు పోవును?” అని పలుకుచుండగా నేను వింటిని. “చిత్తగించుము! నేనున్నాను, నన్నుపంపుడు” అని నేను అంటిని.
9. ప్రభువు నాతో ఇట్లనెను: “నీవు ఈ ప్రజలయొద్దకు పోయి వారితో ఇట్లు చెప్పుము: 'మరల మరల విన్నను మీకు అర్థముకాదు! మరలమరల చూచినను మీరు గ్రహింపలేరు!"
10. మరియు ఆయన నాతో ఇట్లు చెప్పెను: నీవు ఈ జనుల హృదయాలు మొద్దువారునట్లు చేయుము, వారి చెవులు చెవిటి వగునట్లు చేయుము, కన్నులు గ్రుడ్డివగునట్లు చేయుము. అప్పుడు వారు చూడజాలరు, వినజాలరు, అర్థము చేసుకోజాలరు. పరివర్తనము చెందజాలరు, స్వస్థతను బడయజాలరు.”
11. అందులకు నేను “ప్రభూ ! ఇట్లు ఎన్నాళ్ళు జరుగును?” అని ప్రశ్నింపగా ఆయన ఇట్లు నుడివెను: “పట్టణములు నాశనమై నిర్మానుష్యమగు వరకును గృహములు శూన్యమగు వరకును, దేశము పాడువడు వరకును,
12. నేను ప్రజలను దూరముగా పంపివేయగా దేశమంతయు నిర్జన ప్రదేశమగు వరకును ఇట్లే జరుగును.
13. దేశమున పదియవవంతు మిగిలియున్నను వారును చత్తురు. సింధూరమును నరికివేయగా, దాని మొద్దు మాత్రము మిగిలియున్నట్లుగా ఉండిపోవును. ఆ మొద్దు నుండి మరల పవిత్ర ప్రజ చిగురించును.”
1. ఉజ్జీయా మనుమడును, యోతాము కుమారు డునైన ఆహాసు, యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజైన రెజీను మరియు రెమల్యా కుమారుడును, యిస్రాయేలు రాజగు పెక యెరూషలేమును ముట్టడించిరిగాని, దానిని పట్టుకోజాలరైరి.
2. సిరియా సైన్యము ఎఫ్రాయీముతో జతకట్టెనని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజును, ప్రజలును పెనుగాలికి అరణ్యములోని చెట్లవలె తల్లడిల్లిరి.
3. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను: “నీవు నీ కుమారుడైన షేయార్యాషూబుతో పోయి పైకోనేటి నుండి పారు కాల్వచెంత చాకిరేవు మార్గములో ఆహాసును కలిసికొనుము.
4. అతనితో ఇట్లు చెప్పుము: 'నీవు జాగ్రత్తగానుండుము, భయపడకుము నెమ్మదిగా నుండుము, నిరుత్సాహము చెందకుము. ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఈ రెండు నిప్పుకొయ్యలకును వెరవకుము. సిరియనుల రాజు రెజీను మరియు రెమల్యా కుమారుడు పెక అనువారి కోపాగ్నికి జడియకుము.
5. సిరియాయు, యిస్రాయేలీయులును రెమల్యా కుమారుడును కలిసి నీమీద కుట్రపన్నిరి.
6. వారు “యూదా మీదికి దాడిచేసి, దానిని భయపెట్టి స్వాధీనము చేసుకొందము. టబెయేలు కుమారుని దానికి రాజును చేయుదము” అనుకొనిరి.
7. కాని ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. అది నిలువజాలదు. అటుల జరుగజాలదు.
8. సిరియా రాజధాని దమస్కు రెజీను దమస్కునకు అధిపతి. అరువది ఐదేండ్లు గడవకముందే యిస్రాయేలు ముక్కలుచెక్కలుకాగా అచట ప్రజలు ఒక జాతిగా మనజాలరు.
9. యిస్రాయేలు రాజధాని సమరియా.రెమల్యా కుమారుడు సమరియాకు అధిపతి. నా పలుకులు నమ్మవేని నీవు అసలు నిలువజాలవు.”
10. ప్రభువు మరల ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను:
11.“నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గురును పాతాళము క్రింది నుండియైనను లేక ఆకాశము పై నుండియైనను చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును.”
12. కాని ఆహాసు “నేను ఏ గుర్తును అడుగను. నేను ప్రభువును పరీక్షకు గురిచేయను” అని అనెను.
13. అంతట యెషయా ఇట్లనెను: “దావీదు వంశరాజులారా వినుడు! మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవునిగూడ విసిగించుచున్నారు.
14. సరే వినుడు. ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు' అని పేరు పెట్టును.
15. అతడు పెరిగి పెద్దవాడై, చెడును నిరాకరించి, మంచిని చేపట్టుకాలము వచ్చువరకు తేనెను, పెరుగును ఆరగించును.
16. అతడు విచక్షణాజ్ఞానముతో చెడును విడనాడి మంచిని చేపట్టుకాలము రాకమునుపే నిన్నింతగా భయపెట్టుచున్న ఈ ఇరువురు రాజుల దేశములు నిర్మానుష్యమగును.
17. నీకును, నీ ప్రజలకును, రాజకుటుంబమునకును ప్రభువు కడగండ్లు తెచ్చును. యిస్రాయేలు రాష్ట్రము యూదానుండి విడిపోయినప్పటినుండి నేటివరకు అట్టితిప్పలు మీరు ఏనాడును అనుభవించియుండరు. అతడు అస్సిరియారాజును మీమీదికి గొనివచ్చును.
18. ఆ దినమున ప్రభువు ఈలవేసి, దూరముననున్న ఐగుప్తు నదీతీరమునుండి జోరీగలను రప్పించును. అస్సిరియానుండి తుమ్మెదలను పిలిపించును.
19. అవి వచ్చి మిట్టపల్లాలతో గూడిన మీలోయలలోను, కొండగుహలలోను, ముండ్లపొదలలోను, పచ్చికపట్టులలోను దిగును.
20. ఆ రోజున ప్రభువు యూఫ్రటీసు నదికి ఆవలి తీరము నుండి తాను బాడుగకు తెచ్చుకొన్న క్షురకత్తితో - అనగా అస్సిరియా రాజుతో - మీ తలవెంట్రుకలు, కాళ్ళ వెంట్రుకలు, గడ్డములు కూడ గొరిగివేయును.
21. ఆ కాలము వచ్చినపుడు మీలో ఒక్కొక్కడు ఒక ఆవుపెయ్యను, రెండు మేకలను పెంచుకొనును.
22. అవి సమృద్ధిగా పాలిచ్చును. కనుక వానిని పెంచుకొనినవాడు పెరుగును ఆరగించును. దేశమున మిగిలిన కొద్దిమందియు తేనెను, పెరుగును భుజింతురు.
23. ఆ కాలము వచ్చినపుడు వేయి ద్రాక్షతీగలతో అలరారుచు, వేయి వెండి నాణెముల ఖరీదు చేయు ద్రాక్షతోటలు ముండ్లపొదలతో నిండిపోవును.
24. దేశమంతట ముండ్లతుప్పలు ఎదుగును. గనుక ప్రజలు విల్లమ్ములతో వేటకు పోవుదురు.
25. ఇపుడు మీరు సాగుచేయుచున్న కొండలమీద అప్పుడు ముండ్లతుప్పలు ఎదుగును. గాన ఆ తావులకెవడును వెళ్ళడు. ఆ తావులు గొడ్లు తోలుటకును, గొఱ్ఱె మేకలు తిరుగాడుటకును మాత్రము ఉపయోగపడును.
1. ప్రభువు నాతో "నీవు వ్రాతపలకను దీసికొని దానిమీద స్పష్టమైన అక్షరములతో “మహేర్ షాలాల్ హష్ బాజ్" అని వ్రాయుము.
2. నమ్మదగిన సాక్షులనిరువురిని అనగా యాజకుడైన ఊరియాను, యెబెరెక్యా కుమారుడైన జెకర్యాను గొనిరమ్ము” అని చెప్పెను.
3. నేను నా భార్యను కూడగా ఆమె గర్భవతియై కుమారుని కనెను. ప్రభువు నాతో “ఈ శిశువునకు మహేర్ షాలాల్ హష్ బాజ్ అని పేరు పెట్టుము.
4. ఈ బిడ్డనికి అమ్మా! నాన్నా! అని పిలుచు ప్రాయము రాకమునుపే అస్సిరియారాజు దమస్కు సంపదలను, సమరియా సొమ్మును కొల్లగొనిపోవును” అని చెప్పెను.
5. మరల ప్రభువు నాతో ఇట్లు చెప్పెను:
6. “ఈ ప్రజలు నెమ్మదిగా పారు షిలో జలములను నిరాకరించిరి. కావున రెజీనుని, రెమల్యా కుమారుని చూచి భయపడుచున్నారు.
7. కావున ప్రభువైన నేను యూఫ్రటీసు నది మహాప్రవాహమును వీరిమీదికి కొనివత్తును. అస్సిరియారాజు, అతనిదండు ఆ ప్రవాహము, ఆ వరద యేటి అంచులవరకు పొంగి, గట్టులు తెంచుకొని పారును.
8. ఆ వెల్లువ యూదా మీదికి వచ్చి అంతట పొంగిపారును. జనులను కుతికవరకు ముంచివేయును. ఇమ్మానుయేలూ! ఆ వరద పక్షివలె రెక్కలు విప్పి నీ దేశమంతటిని కప్పును.”
9. జనులారా! మీరు భయముతో గుమిగూడుడు. దూరప్రాంతపు దేశములారా! వినుడు మీరు యుద్ధమునకు సిద్ధముకండు. అయినను మీరు ఓడిపోయెదరు.
10. మీరెట్టి ఆలోచనలు చేసినను అవి వ్యర్థమగును. మీరెంత మాటలాడినను ప్రయోజనముండదు. ప్రభువు మాకు బాసటగానున్నాడు.
11. ప్రభువు నన్ను మహాబలముతో హెచ్చరించి నేను ప్రజలు పోవుత్రోవన పోరాదని చెప్పెను. మరియు ఆయన నాతో ఇట్లు నుడివెను:
12. “మీరు ఈ ప్రజల పన్నాగములతో, చేతులు కలుపవద్దు, వారు భయపడు దానికి మీరుభయపడవలదు.
13. సైన్యములకధిపతియును, ప్రభుడనైన నన్ను మీరు పవిత్రునిగా భావింపవలెను. నన్ను చూచి మీరు భయపడవలెను.
14. నా పావిత్య్రము వలన నేను ప్రజలు తట్టుకొని పడిపోవు రాయివంటి వాడనగుదును. యూదా, యిస్రాయేలు రాజ్యముల ప్రజలకును, యెరూషలేము జనులకును నేను బోనుగాను, చిక్కు వలనుగాను అగుదును.
15. చాలమంది ఆ రాయితగిలి క్రిందపడి గాయపడుదురు. పలు ఆ వలలో చిక్కుకొని బందీలగుదురు.”
16. నేను ఈ సందేశము వ్రాసినపత్రమును చుట్టచుట్టి ముద్రవేసి నా శిష్యుల అధీనమున ఉంచెదను.
17. ప్రభువు యాకోబు వంశజులకు దర్శనమీయడయ్యెను. నా మట్టుకు నేను ప్రభువును నమ్మి ఆయన కొరకు వేచియుందును.
18. ఇదిగో! నేనును, ప్రభువు నాకు దయచేసిన ఈ బిడ్డలును ఇచట ఉన్నాము. సియోను కొండమీద వసించు సైన్యములకధిపతియైన ప్రభువు మమ్ము యిస్రాయేలు ప్రజలకు గురుతుగాను, సూచనగాను నియమించెను.
19. ఏమేమో గొణగుచు, విన్పించనట్లు మాట్లాడు సోదెకాండ్రను, మాంత్రికులను సంప్రతింపుడని ప్రజలు మిమ్ము మభ్యపెట్టుచున్నారు. మీరు భూతముల సందేశములు వినవలెననియు, బ్రతికియున్నవారిని గూర్చి మృతులను సంప్రతింపవలెననియు వారు మీతో చెప్పుచున్నారు.
20. కాని మీరు వారితో, 'మీరు ప్రభువు వాక్కులు వినుడు. భూతముల సందేశములు వినుటవలన మీకెట్టి ప్రయోజనము కలుగదు' అని చెప్పవలెను.
21. ప్రజలు ఆకలిగొని, నిరుత్సాహముతో దేశమున తిరుగాడుదురు. ఆకలి వలనను, కోపము వలనను, తమ రాజును, దేవుని శపింతురు.
22. భూమివైపు పారజూతురు. కాని విషాదము, చీకటి తప్ప వారికేమి కనిపింపవు.
23. వారు భయంకరమైన అంధకారమున చిక్కుకొందుర. ఆ ఉపద్రవమునుండి తప్పించుకోజాలరు.
1. అయితే, వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారముండబోదు. ప్రభువు పూర్వము సెబూలూను, నఫ్తాలిమండలములను అవమానమున ముంచెను. ఆయన తదుపరి దినములలో ఈ ప్రాంతములకు కీర్తినితెచ్చును. సముద్రము ప్రాంతమును, యోర్దానుకు ఆవలి ప్రాంతమును, అన్వజాతివారు వసించు గలిలేయ ప్రాంతము వరకును గల ప్రదేశము కీర్తిని బడయును.
2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజలమీద జ్యోతిప్రకాశించెను.
3. ప్రభూ! నీ జాతిని విస్తరింపజేసితివి. వారిని సంతోషచిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్లసొమ్ము పంచుకొనువారు ప్రమోదము చెందినట్లుగా, ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు.
4. నీవు వారి మెడమీది కాడిని విరుగగొట్టితివి. వారి భుజములమీది, దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా, ఆ ప్రజలను పీడించువారిని ఓడించితివి.
5. వారిమీదికి దాడిచేయు శత్రుసైన్యముల పాదరక్షలు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును.
6. ఏలయన, మనకొక శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. “ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు” అని అతడికి పేరిడుదురు.
7. అతని రాజ్యా ధికారము విస్తరిల్లును. అతని రాజ్యమున సదా శాంతినెలకొనును. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి, నీతిన్యాయములతో అధికారము నెరపుచు నేటినుండి కలకాలమువరకును పరిపాలన చేయును. సైన్యములకధిపతియైన ప్రభువు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతనిశ్చయుడయ్యెను.
8. ప్రభువు యాకోబు వంశజుల మీదికి తన వాక్కు పంపెను. అది యిస్రాయేలీయుల మీదికి దిగివచ్చెను.
9. యిస్రాయేలీయులెల్లరును, సమరియా పౌరులెల్లరును ఈ సంగతిని యెరిగిపోయున్నారు. వారు పొగరుతోను, కండకావరముతోను ఇట్లనిరి:
10. “ఇటుకల ఇండ్లు పడిపోయినవి, కాని వానికి బదులుగా మేము చెక్కిన రాతిఇండ్లు కట్టుదుము. అంజూరములను నరికివేసిరి. కాని వానికి బదులుగా మేము దేవదారులను పెంచుదుము.”
11. కాని ప్రభువు శత్రువులను వారిమీదికి పురికొల్పెను. వారు దాడిచేయుటకు సంసిద్ధులు అగుచున్నారు.
12. తూర్పున సిరియా, పడమరన ఫిలిస్తీయులు కోరలువిప్పి యిస్రాయేలును, మ్రింగి వేయజూచుచున్నారు. అయినను ప్రభువు కోపము ఇంకను ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు చాపిన బాహువును దించలేదు.
13. సైన్యములకధిపతియగు ప్రభువు యిస్రాయేలు ప్రజలను శిక్షించినను వారు పశ్చాత్తాపపడి ఆయనచెంతకు తిరిగిరారైరి.
14. కనుక ప్రభువు ఒక్క రోజులోనే యిస్రాయేలు తలను, తోకను, తాటి కొమ్మను, రెల్లును కూడ నాశనము చేయును.
15. పెద్దలు ఘనులు ఆ తల. కల్లలాడు ప్రవక్తలు ఆ తోక.
16. ప్రజానాయకులు జనులను తప్పుత్రోవ పట్టించిరి, వారు నడిపించిన ఆ జనులు నాశనమైరి.
17. కనుక ప్రభువు వారి యువకులను బ్రతకనీయడు. వారి వితంతువులను, అనాథ శిశువులను కరుణింపడు. ప్రజలెల్లరు దుష్టులై పాపకార్యములకు పాల్పడిరి. వారు పలికెడు పలుకులెల్ల దుర్భాషలే. అయినను ప్రభుని కోపము ఇంకను ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు చాపిన బాహువును దించలేదు.
18. ప్రజలపాపములు అగ్నివలె మండి ముండ్ల పొదలనెల్ల తగులబెట్టును. అడవిలోని కారు చిచ్చువలె రగుల్కొని పొగలు వెడలగ్రక్కును.
19. సైన్యములకధిపతియైన ప్రభువు కోపాగ్ని దేశమునెల్ల కాల్చివేయును. ప్రజలెల్లరు ఆ అగ్నికి ఆహుతి అగుదురు. ఎవడు తోడివానిని పట్టించుకొనడు.
20. వారు కుడిప్రక్కన ఉన్న దానిని పట్టుకొందురు. కాని ఇంకను ఆకలిగొందురు. ఎడమప్రక్కన ఉన్నదానిని తిందురు. కాని ఇంకను తృప్తి పొందరు. తమ స్వమాంసమునే భక్షింతురు.
21. మనష్షే ఎఫ్రాయీమును, ఎఫ్రాయీము మనష్షేను భక్షించును. వీరు ఇరువురు కలిసి యూదాతో కలహింతురు. అయినను ప్రభువు కోపము ఇంకను ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకుగాను చాపిన బాహువును ఇంకను దించలేదు.
1. అన్యాయమైన విధులను అమలు పరచి ప్రజలను పీడించు శాసనములు జారీ చేయువారు శాపగ్రస్తులు.
2. ఆ శాసనకర్తలు దీనులకు న్యాయము 'జరుగనీయరు. నా ప్రజలలో పేదలైనవారి హక్కులను భంగపరతురు. వితంతువుల సొత్తును అపహరింతురు. అనాథశిశువులను దోచుకొందురు.
3. దర్శనదినము సమీపించినపుడు, దూరదేశమునుండి వినాశనము దాపురించినపుడు, మీరేమి చేయుదురు? సహాయార్ధము ఎవరి వద్దకు పరుగెత్తెదరు? మీ సొత్తును ఎచట దాచియుంతురు?
4. మీరు యుద్ధమున చత్తురు. ఆ లేదా శత్రువులకు చిక్కి బందీలు అగుదురు. అయినను ప్రభువుకోపము ఇంకను ఉపశమింపలేదు. ఆయన శిక్షించుటకు చాచిన బాహువును దించలేదు.
5. నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగాను, దుడ్డుకఱ్ఱగాను అస్సిరియాను వాడుకొందును.
6. నా కోపము రెచ్చగొట్టెడు భక్తిహీనులను శిక్షించుటకు నేను అస్సిరియాను పిలిచితిని. అస్సిరియనులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తునెల్ల అపహరింతురు. వారిని వీధులలోని బురదవలె తొక్కి వేయుదురు.
7. కాని అస్సిరియా రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చేయలేదు. చాల జాతులను హతమార్పవలెనని అతని తలంపు.
8. అతడిట్లు తలపోసెను. “నా సైన్యాధిపతులెల్ల రాజులు కారా?
9. కల్నో కర్కెమీషువలె ఉండలేదా? హమాతు అర్పాదువలె ఉండలేదా? సమరియా దమస్కువలె ఉండలేదా?
10. యెరూషలేము, సమరియాల కంటెగూడ ఎక్కువ విగ్రహములను పూజించు దేశములనే శిక్షించితిని.
11. నేను సమరియాను, అందలి విగ్రహములను పాడుచేసినట్లుగా యెరూషలేమును అందలి విగ్రహములను నాశనము చేయలేనా?”
12. కాని ప్రభువు సియోనుకొండ మీదను, యెరూషలేమునను తన పనినంతటిని ముగించిన పిదప, అస్సిరియా రాజు ప్రగల్భములకును, పొగరునకును అతనిని శిక్షించితీరును.
13. అస్సిరియా ప్రభువిట్లు గొప్పలు చెప్పుకొనెను: “నా బలము వలననే నేనీ కార్యములెల్ల చేసితిని. నేను తెలివితేటలు, ప్రజ్ఞ కలవాడను. జాతుల మధ్యగల సరిహద్దులను తుడిచివేసి వారి సంపదలనెల్ల దోచుకొంటిని. శూరుడనై ఆ జాతులను నా కాలితో తొక్కితిని.
14. పక్షిగూటి మీదవలె జాతుల సొత్తుమీద చేయి వేసితిని. గూటిలోని గ్రుడ్లను ఒకడు ఏరుకొనినట్లుగా లోకములోని సకలజాతుల సంపదలను గైకొంటిని. నన్ను భయపెట్టుటకు ఒక్క జాతియు రెక్కలాడింపలేదు. ముక్కు తెరచి కిచకిచలాడలేదు.
15. కాని గొడ్డలి తనను ఉపయోగించువానికంటే గొప్పదా? రంపము తనను వినియోగించువానికంటే శ్రేష్ఠమైనదా? కోల తనను ఎత్తువానిని ఆడించినట్లును, దండము కర్రకానివానిని ఎత్తినట్లును ఉండును కదా!
16. కనుక సైన్యములకధిపతియైన ప్రభువు బలిసియున్న అస్సిరియులను వ్యాధివలన చిక్కిపోవునట్లు చేయును. వారి దేహములో అగ్ని కణకణమండును.
17. యిస్రాయేలునకు వెలుగైన ప్రభువు అగ్నియగును. యిస్రాయేలు పవిత్రదేవుడు మంటయగును. ఆ నిప్పు ఒక్క రోజుననే ముండ్ల తుప్పలనెల్ల కాల్చి భస్మముచేయును.
18. ఘోరవ్యాధి నరుని నాశనముచేసినట్లే ఆ జ్వా ల పెరిగిన అతని అడవిని, పండిన పొలమును పూర్తిగా దహించివేయును.
19. కాలిన అడవిలో చెట్లు కొద్దిసంఖ్యలో మాత్రమే మిగులును. పసిబిడ్డడు కూడ వానిని లెక్కపెట్టగలడు.
20. ఆ రోజున యిస్రాయేలీయులలో శేషముగా ఉన్నవారు, యాకోబు వంశమున తప్పించుకొనినవారు, తమను నాశనముచేసిన జాతిమీద ఆధారపడరు. సత్యమునుబట్టి యిస్రాయేలు పవిత్రదేవుడైన ప్రభువుమీదనే వారు నిజముగా ఆధారపడుదురు.
21. యిస్రాయేలీయులలో శేషజనము మాత్రమే బలాఢ్యుడైన తమ దేవుని వద్దకు తిరిగివత్తురు.
22. యిస్రాయేలీయులు సముద్రపు ఒడ్డుననున్న ఇసుక రేణువులవలె అసంఖ్యాకముగానున్నను, కొద్దిమంది శేషజనులు మాత్రమే తిరిగివత్తురు. వారికి వినాశము దాపురించినది. అది యుక్తమైనదే.
23. సైన్యములకధిపతియైన ప్రభువు తాను తలపెట్టినట్లే దేశమంతటిని వినాశమునకు గురిచేయును.
24. సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు. “సియోనున వసించు ప్రజలారా! అస్సిరియనులు ఐగుప్తీయులవలె మిమ్ము దుడ్డుగట్టితో బాది, మీమీదికి దండమును ఎత్తినను మీరు భయపడకుడు.
25. కొద్దికాలములోనే మీపై నాకు గల కోపము చల్లారును. అప్పుడు నేను వారిని సర్వనాశనము చేయుదును.
26. సైన్యములకధిపతియును ప్రభుడనైన నేను పూర్వము ఓరేబు శిలవద్ద మిద్యానీయులను హతముచేసినట్లు వారిని కొరడాతో మోదుదును. ఐగుప్తును, సముద్రమును దండించినట్లుగా వారిని దండింతును.
27. ఆ దినమున అస్సిరియా బరువు మీ భుజముల మీదినుండి జారిపడును. దాని కాడి మీ మెడమీదినుండి తొలగిపోవును.”
28. అస్సిరియనులు అయ్యాతును స్వాధీనము చేసికొనెను. వారు మిగ్రోనుగుండ పయనించి మిక్మషులో వస్తువులను నిలువజేసిరి.
29. కనుమసందు దాటి గేబావద్ద రాత్రి విడిదిజేసిరి. వారిని గాంచి రామా పౌరులు భీతిల్లిరి. సౌలునగరమైన గిబ్యా నివాసులు పారిపోయిరి.
30. గల్లీము ప్రజలారా! కేకలు పెట్టుడు. లాకీషు జనులారా! వినుడు. అనాతోతు పౌరులారా! జవాబు చెప్పుడు.
31. మద్మేనా పౌరులు పారిపోవుచున్నారు. గోబీము ప్రజలు తప్పించుకొనిపోవుచున్నారు.
32. నేడే శత్రువులు నోబు నగరమున అగుదురు. వారు సియోనుకొండను, యెరూషలేమును గాంచి కోపముతో పిడికెళ్ళు బిగబట్టుదురు.
33. కాని సైన్యములకధిపతియైన ప్రభువు వారిని కొమ్మలవలె నరకగా, వారు గబాలున నేలగూలుదురు. ఆయన ఉన్నతములైన శాఖలను ఛేదించును. గర్వోన్నతములైన కొమ్మలు నేలకొరుగును.
34. ప్రభువు గొడ్డలితో అడవిపొదలను నరికివేయును, లెబానోను వృక్షరాజములను గూడ పడగొట్టును.
1. ఈషాయి మొద్దునుండి ఒక పిలక పుట్టును. అతని వేరులనుండి ఒక కొమ్మ ఎదుగును.
2. దేవుని ఆత్మ అతనిపై నిలుచును అది విజ్ఞానమును, వివేకమును ఒసగు ఆత్మ. దూరదృష్టిని, బలమును ప్రసాదించు ఆత్మ. దైవజ్ఞానమును, దైవభీతిని దయచేయు ఆత్మ.
3. ప్రభుని భయము అతనికి ప్రీతిని కలిగించును. అతడు కంటిచూపును బట్టి తీర్పు తీర్చడు. తాను వినుదానినిబట్టి నిర్ణయములు చేయడు.
4. అతడు దీనులకు న్యాయముతో తీర్పుచెప్పును. పేదలకు నీతితో న్యాయనిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును.
5. అతడు న్యాయమును నడికట్టువలె ధరించును. సత్యమును దట్టీవలె తాల్చును.
6. తోడేలు గొఱ్ఱెపిల్లతో కలిసి జీవించును. చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. లేగదూడ, కొదమసింగము కలిసిమేయును. చిన్నబాలుడు వానిని తోలుకొనిపోవును.
7. ఆవును, ఎలుగుబంటియు కలిసి మేతమేయును. వాని పిల్లలు కలిసిపడుకొనును. సింహము ఎద్దువలె గడ్డిమేయును.
8. చంటిబిడ్డడు త్రాచుపాము పుట్టమీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పము బొరియలో చేయి పెట్టును.
9. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, క్రూరమృగములు ఎట్టిహానియు, ఎట్టికీడును చేయవు. సముద్రము జలముతో నిండియున్నట్లు, దేశమంతయు ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.
10. ఆ దినమున ఈషాయివంశమున పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన ధ్వజముగా ఉండును, జాతులు అతని చెంతకు వచ్చును. అతని నగరము ఖ్యాతిని బడయును.
11. ఆ దినమున ప్రభువు మరల తనశక్తిని ప్రదర్శించును. అతడు అస్సిరియాలో నుండియు, ఐగుప్తులో నుండియు, పత్రోసులో నుండియు, కూషులో నుండియు, ఏలాములో నుండియు, షీనారులో నుండియు, హమాతులో నుండియు సముద్రతీరమునందలి ద్వీపములలో నుండియు తన ప్రజలలో మిగిలియున్నవారిని విడిపించి, స్వీయదేశమునకు రప్పించుటకు రెండవ మారు ప్రభువు తన బాహువును చాపును.
12. అతడు జాతులకు ధ్వజమును ఎత్తిచూపును. భ్రష్టులైన యిస్రాయేలీయులను చెదరిపోయిన యూదా ప్రజలను నేల నాలుగు చెరగులనుండి ప్రోగుజేయును.
13. అపుడు ఎఫ్రాయీముకున్న అసూయ సమసిపోవును. యూదా శత్రువులు అంతరింతురు. ఎఫ్రాయీము యూదామీద అసూయపడదు. యూదా ఎఫ్రాయీమును పీడింపదు.
14. ఆ రెండు రాజ్యములు కలిసి పడమరన ఫిలిస్తీయులమీద పడును. తూర్పుసీమలలో వసించువారిని కొల్లగొట్టును. ఎదోము, మోవాబులను స్వాధీనము చేసికొనును. అమ్మోనీయులను లొంగదీసికొనును.
15. ప్రభువు ఐగుప్తు సముద్రపుపాయ వట్టిపోవునట్లు చేయును. వేడిమిగల తన ఊపిరిని ఊది యూఫ్రటీసు మీద తన చేతిని ఆడించును. ఆ నదిని ఏడు సన్నని పాయలుగా విభజించును. పాదరక్షలు తడువ కుండగనే పొడినేలన ప్రజలు దానిని దాటిపోవుదురు.
16. అస్సిరియాలో మిగిలియున్న ప్రభువు ప్రజలు తిరిగివచ్చుటకు ఒక రాజపథము ఏర్పడును. అది పూర్వము యిస్రాయేలీయులు ఐగుప్తునుండి మరలి వచ్చినపుడు ఏర్పడిన మార్గమువంటిదగును.
1. ఆ దినమున మీరు ఇట్లు పలుకుదురు: “ప్రభూ! నేను నిన్ను స్తుతింతును. పూర్వము నీవు నామీద కోపించితివి. కాని ఇప్పుడు నీ కోపము చల్లారినది. నీవు నన్ను ఓదార్తువు.
2. దేవుడు నాకు రక్షకుడు. నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును, శక్తిని దయచేయును. రక్షణమును గూడ ప్రసాదించును.
3. మీరు రక్షణపు బావులనుండి సంతసముతో నీళ్ళు చేదుకొందురు.
4. ఆ దినమున మీరిట్లు పలుకుదురు: “ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన సహాయమును అర్థింపుడు. ఆయన అద్భుతకార్యములను జాతులకు ఎరిగింపుడు. ఆయన మహాఘనుడని ఎల్లరికిని తెలియజేయుడు.
5. ప్రభువును కీర్తింపుడు. ఆయన మహాకార్యములు చేసెను. లోకమెల్ల ఆయన చేతలను ఎరుగునుగాక!
6. సియోను వాసులారా! . మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొనియున్న యిస్రాయేలు పవిత్రదేవుడు మహాఘనుడు సుమా!"
1. ఆమోసు కుమారుడైన యెషయా బబులోనియాను గూర్చి వినిన దైవసందేశము.
2. చెట్లులేని కొండమీద యుద్ధధ్వజమును ఎత్తుడు. యుద్ధనాదము చేసి సైనికులను పిలువుడు. వారికి చేయెత్తి సంజ్ఞచేయుడు. . ప్రముఖుల ద్వారములను ముట్టడింపుడని వారితో చెప్పుడు.
3. ప్రభువు తనకు అంకితులైన పరాక్రమ శాలురలను పిలిచి, తాను కోపించినవారిని శిక్షింప ఆజ్ఞాపించెను.
4. పర్వతములమీద సందడియగుచున్నది వినుడు. అది మహా జనసమూహము చేయు సందడి, జాతులు రాజ్యములు కలిసి చేయు సందడి. సైన్యములకు అధిపతియైన ప్రభువు తన సేనలను యుద్ధమునకు సంసిద్ధము చేయుచున్నాడు.
5. ఆ సైన్యములు దూరదేశముల నుండి వచ్చుచున్నవి. నేలచెరగులనుండి వచ్చుచున్నవి. కోపపూరితుడైన ప్రభువు సర్వదేశములను నాశనముచేయుటకు వేంచేయుచున్నాడు.
6. మీరు బిగ్గరగా అరవుడు! ప్రభువు దినము సమీపించినది. అది సర్వశక్తిమంతుని నుండి ప్రళయమును కొనివచ్చును.
7. కనుక ప్రతి వాని బాహువులన్నియు దుర్బలమగును. ప్రతివాని గుండె ధైర్యమును కోల్పోవును.
8. ఎల్లరు భయకంపితులై బాధకును, దుఃఖమునకును గురియగుదురు. ప్రసవవేదనను అనుభవించు స్త్రీ వలె వేదననొందుదురు. భయముతో ఒకరివైపొకరు చూతురు. ఎల్లరి మోములు సిగ్గుతో వాడిపోవును.
9. ప్రభువుదినము వచ్చుచున్నది. అది అతని కోపమును, రౌద్రమును కొనివచ్చు క్రూరదినము. అది నేలను ఎడారిచేయును. పాపులను వేరంట పెల్లగించును.
10. చుక్కలు, నక్షత్రరాశులు ప్రకాశింపవు. సూర్యుడు ఉదయింపగనే చీకట్లు క్రమ్ముకొనును. చంద్రుడు వెలుగునీయడు.
11. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను లోకుల దుష్టత్వమునకు వారిని దండింతును. దుర్మార్గుల పాపములకు వారిని శిక్షింతును. నేను గర్వాత్ముల పొగరు అణగింతును. క్రూరులైన అధిపతుల అహంకారమును అణగదొక్కుదును.
12. నరులు మేలిమి బంగారము కంటెను అరుదగుదురు. శ్రేష్ఠమైన సువర్ణము కంటెను విరళమగుదురు నరులు అరుదుగా నుండజేసెదను.
13. సైన్యములకధిపతియైన నేను, ఆ రోజు నా ఆగ్రహమును ప్రదర్శించి, ఆకాశము కంపించునట్లు చేసెదను. నేల తావుదప్పునట్లు చేసెదను.
14. అప్పుడు వేటగాని నుండి పారిపోవు లేడివలెను, పోగుచేయని గొఱ్ఱెలవలెను. ప్రతివాడు తన దేశమునకు పారిపోవును. సొంతజనుల యొద్దకు పరుగెత్తును.
15. శత్రువులకు చిక్కిన వారందరును చత్తురు. వారికి దొరకిన వారందరును కత్తివాతబడుదురు.
16. ఆ ప్రజలు చూచుచుండగనే విరోధులు వారి శిశువులను చితుకగా వారి ఇండ్లను కొల్లగొట్టుదురు. వారి భార్యలను చెరతురు.
17. ఇదిగో నేను మాదీయులను వారిమీదికి పురికొల్పుచున్నాను. వారు వెండిని లక్ష్యము చేయరు. బంగారమును ఆశింపరు.
18. వారు విల్లమ్ములతో యువకులను వధింతురు. చంటిబిడ్డలను కరుణింపరు. గర్భఫలముల చూచి జాలిచెందరు.
19. బబులోనియా రాజ్యములలోనెల్ల శ్రేష్ఠమైనది. కల్దీయులకు అలంకారమును గర్వకారణమునైనది. కాని ప్రభుడనైన నేను సొదొమ గొమొఱ్ఱాలవలె దానినిగూడ కూలద్రోయుదును.
20. ఇకమీదట అచట ఎవడును ఎప్పటికిని వసింపడు. దేశదిమ్మరులైన అరబ్బులు అచట గుడారములు వేయరు. కాపరులు అచట గొఱ్ఱెలు మేపుకొనరు.
21. అచట ఎడారిమృగములు వసించును. గుడ్లగూబలు గూళ్ళుకట్టుకొనును. నిప్పుకోళ్ళు బ్రతుకును. ఎడారిమేకలు' తిరుగాడును.
22. ఆ నగరపు మేడలు, గోపురములు నక్కల కూతలతో, దుమ్ములగొండుల అరపులతో మారుమ్రోగును. దాని వినాశకాలము ఆసన్నమైనది. అది ఇంకెన్ని రోజులో మనజాలదు.”
1. ప్రభువు మరల యాకోబును కరుణించును. యిస్రాయేలీయులను మరల తనవారినిగా ఎన్నుకొని స్వీయదేశమున వసింపజేయును. అన్యదేశీయులు యాకోబు కుటుంబముతో కలియుదురు. వారితో కలసి జీవింతురు.
2. అన్యజాతులు వారిని వారి సొంత దేశమునకు కొనివత్తురు. యిస్రాయేలీయులు ప్రభువుదేశమున ఆ అన్యజాతులను దాసులనుగా, పనికత్తెలనుగా వినియోగించుకొందురు. వారు తమను బంధించిన వారిని బంధింతురు. తమను పీడించిన వారిని దాసులుగా ఏలుదురు.
3. ప్రభువు మీ బాధలనుండియు, వేదనల నుండియు, నిర్బంధముగా మీ నెత్తినబడిన వెట్టిచాకిరి నుండియు మీకు విశ్రాంతిని ఒసగును.
4. ఆ రోజున మీరు బబులోనియా రాజును గూర్చి ఈ అపహాస గీతము విన్పింపుడు: “ప్రజాపీడకుడెట్లు నశించెను? అతని పీడన ఎట్లు అడుగంటెను?
5. ప్రభువు దుష్టుల దండమును విరిచెను. పీడకుల రాజదండమును విరుగగొట్టెను.
6. వారు ప్రజలను ఆగ్రహముతో మోదిరి. దెబ్బల మీద దెబ్బలు కొట్టిరి. జాతులను క్రూరముగా పీడించిరి. వారి హింసలకు అంతరాయము లేదయ్యెను
7. ఇపుడు లోకమంతయు శాంతిని, విశ్రాంతిని అనుభవించును. జనులెల్లరు ఆనందముతో పాడుదురు.
8. తమాలవృక్షములును, లెబానోను దేవదారులును ఆ ప్రజాపీడకుని పతనమును చూచి ఆనందించును. అవి 'అతడు చచ్చెను గనుక ఇక మమ్మెవ్వరును నరకరు' అని యెంచును.
9. ఓయి ! అధోలోకములోని పాతాళము నీకు స్వాగతమిచ్చుటకై వేచియున్నది. అది ఈ లోకమున గొప్పవారుగా చలామణి ఐనవారి ప్రేతములను మేల్కొల్పుచున్నది. నీకొరకు సకలజాతుల రాజులను వారివారి సింహాసనముల పైనుండి లేపుచున్నది.
10. వారెల్లరును నిన్ను గాంచి: 'ఓహో! నీవును మావలె దుర్భలుడవైతివా? నీవునూ మా వంటివాడవైతివా?
11. నీ వైభవములు నీ వీణాగానములు పాతాళమున పడిపోయినవి కదా! నీవు పురుగుల పాన్పుమీద పరుండెదవు. క్రిములు నిన్ను బట్టవలె కప్పును' అని పలుకుదురు.
12. ఓ వేగుచుక్క! తేజోనక్షత్రమా! నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకపడితివి?
13. నీవు నీ మనసులో 'నేను ఆకాశముమీదికి అధిరోహింతును. ఉన్నత తారలకు పైగా నా సింహాసనమును నెలకొల్పుదును. ఉత్తరదిక్కున దేవతలు సభదీర్చు పర్వతముపైన రాజుగా ఆసీనుడనగుదును.
14. మేఘమండలము మీదికెగిసి మహోన్నతునికి సాటివాడనగుదును' అని భావించితివి.
15. కానీ నీవు ఇప్పుడు ఈ పాతాళలోకమున, ఈ అగాథపు అంతర్భాగమున పడితివి.
16. నిన్ను చూచినవారు నీ వైపు తేరి పారజూతురు. భూమినెల్ల గడగడలాడించినవాడును, రాజ్యములను కంపింపచేసినవాడును,
17. ప్రపంచమును ఎడారి కావించినవాడును, నగరములను నేలమట్టము చేసినవాడును, తన బందీలకు ఏనాడును విముక్తి దయచేయనివాడును ఇతడేనా అని పలుకుదురు.
18. భూలోకపు రాజులెల్లరు వైభవముగా తమ సమాధులలో పవ్వళింతురు.
19. కాని నీకు సమాధిలేదు నీ శవమును వెలుపలపారవేసిరి. అది కుళ్ళిపోవును. అది పోరున కత్తివాతబడిన వారి పీనుగులచే కప్పబడెను. శత్రువులు ఆ పీనుగులతోపాటు దానినిగూడ రాతిగుంతలో పడవేసి కాళ్ళతో తొక్కిరి.
20. నీవు నీ దేశమును నాశనము చేసి నీ ప్రజలను మట్టుపెట్టితివి. కనుక ఇతర రాజులకువలె నీకు భూస్థాపనములేదు. దుర్మార్గుల సంతానము పేరు విన్పింపరాదు.
21. తండ్రుల అపరాధములకుగాను తనయులను వధింపుడు. వారుమరల విజృంభించి దేశములను ఏలకుందురుగాక! లోకమున నగరములను నిర్మింపకుందురుగాక!”
22. సైన్యములకధిపతియైన ప్రభువిట్లు నుడువు చున్నాడు: “నేను బబులోనియాను ముట్టడించి సర్వ నాశనము చేయుదును. పిల్లలను భావితరములను ఎవరిని మిగులనీయను. ఇది ప్రభువు వాక్కు
23. నేను ఆ దేశమును చిత్తడినేలను చేయుదును. ముళ్ళ పందులు అచట వసించును. ఆ దేశమును వినాశ మను చీపురుతో ఊడ్చివేయుదును. ఇది సైన్యముల కధిపతియైన ప్రభువు వాక్కు”.
24. సైన్యములకధిపతియైన ప్రభువు ప్రమాణ పూర్వకముగా ఇట్లు చెప్పుచున్నాడు: “నేను సంకల్పించిన కార్యము నెరవేరును. నేను నిర్ణయించిన పని జరిగితీరును.
25. నేను నా దేశమున అస్సిరియాను నాశనము చేయుదును. నా పర్వతముల మీద దానిని అణగదొక్కుదును. అస్సిరియా తమమీద మోపిన కాడినుండియు, తమ నెత్తిమీదకెత్తిన బరువులనుండియు యిస్రాయేలు ప్రజలు తప్పించుకొందురు.
26. సర్వలోకమును గూర్చిన నా సంకల్పమిది. సర్వజాతులను శిక్షించుటకు చాపబడిన నా హస్తమిది.
27. సైన్యములకధిపతియైన ప్రభువు నిర్ణయము చేసినపుడు దానిని భంగపరుపగలవాడెవడు? ప్రభువు శిక్షించుటకు బాహువుచాచిననాడు ఆయనను వారింపగలవాడెవడు?”
28. ఆహాసురాజు మరణించిన సంవత్సరము వచ్చిన దైవవాక్కు
29. “ఫిలిస్తీయా! నిన్ను శిక్షించుదండము విరిగి పోయినదని సంతసింపకుము. సర్పబీజము నుండి మిన్నాగుపుట్టును. దాని ఫలము ఎగురు కాలకూటసర్పము.
30. ప్రభువు అతి పేదలకు కడుపార అన్నము పెట్టును. దరిద్రులు సురక్షితముగా మనుదురు. కాని ఆయన నీ సంతానమును ఆకటితో చంపును. నీ ప్రజలలో మిగిలియున్నవారిని నాశనము చేయును.
31. ఫిలిస్తీయా గుమ్మమా! ప్రలాపింపుము. ఫిలిస్తీయానగరమా! నీవు భయముతో కంపింపుము. ఉత్తరము నుండి ధూళిమేఘము వచ్చుచున్నది. పిరికివారెవరు లేని పటాలమది.”
32. ఆ అన్యజాతి దూతలకు మనమేమి బదులు చెప్పుదుము? “ప్రభువే సియోనునకు పునాదులెత్తును. శ్రమచెందెడు ప్రభువు ప్రజలు అచట విశ్రాంతిపొందుదురు” అని చెప్పుదము.
1. మోవాబును గూర్చిన దైవవాక్కు: ఒక్క రాత్రిలోనే 'ఆరు' పట్టణము నాశన మయ్యెను. ఒక్క రాత్రిలోనే 'కీరు' పట్టణము ధ్వంసమయ్యెను. మోవాబున నిశ్శబ్దము తాండవించుచున్నది.
2. దీబోను పౌరులు కొండనెక్కి . దేవళమునొద్ద ఏడ్చుచున్నారు. ఈ మోవాబు ప్రజలు నెబో, మేడెమో నగరముల గూర్చి ప్రలాపించుచున్నారు. వారు సంతాపముతో గడ్డము, తలవెంట్రుకలను గొరిగించుకొనిరి.
3. వీధులలో నరులు గోనెతాల్చిరి. ఇండ్లమీదను, నగరద్వారముచెంతను ప్రజలు శోకించి కన్నీరుకార్చుచున్నారు.
4. హెష్బోను, ఎలాలె నగరములు విలపించుచున్నవి. వాని శోకనాదము యాహాసు వరకు వినిపించుచున్నది. మోవాబు బంటులు గడగడలాడుచున్నారు. వారికి ధైర్యముచెడినది.
5. మోవాబుకొరకు నా హృదయము దురసిల్లుచున్నది. దాని ప్రజలు సోవరు వరకును, ఎగ్లాతు షెలీషియా వరకును పారిపోయిరి. కొందరు లూహీతు కొండమీదకు పోవుత్రోవనుబట్టి ఏడ్చుచు ఎక్కుచున్నారు. కొందరు హొరొనయీము త్రోవనుబట్టి దీనముగా రోదించుచు పోవుచున్నారు.
6. నిట్రము నదీజలములు ఎండిపోయినవి. దాని పచ్చిక మాడిపోయినది. అచట పచ్చనిది ఎక్కడను కన్పింపదు.
7. ప్రజలు తమ వస్తువులను తీసికొని నిరవంజిచెట్ల లోయగుండ పారిపోవుచున్నారు.
8. మోవాబు పొలిమేరలు అంతట శోకాలాపములు వినిపించుచున్నవి. ఎగ్లయీము, బేరెలీము నగరముల వరకు ఆ ఏడ్పులు వినిపించుచున్నవి.
9. దీబోను నగరమునొద్ద నదీజలములు రక్తసిక్తములైనవి. నేను దీబోను ప్రజలకు ఇంత కంటే అదనముగా చేటుకాలము కొనితెత్తును. మోవాబునుండి తప్పించుకొనిన వారందరి మీదికిని, ఆ దేశమున మిగిలియున్న వారందరి మీదికిని సింహమును రప్పించెదను.
1. ఎడారిలోని 'సెల' నగరము నుండి ప్రజలు యెరూషలేమున రాజ్యముచేయు రాజునకు గొఱ్ఱెపిల్లను కానుకగా పంపుచున్నారు.
2. ఆర్నోను రేవువద్ద మోవాబు స్త్రీలు గూటి నుండి ఎగురగొట్టబడిన పక్షులవలె అటునిటు తిరుగాడుచున్నారు.
3. “మీరు మాకు సలహానిండు, మాకు నిర్ణయములు చేసి పెట్టుడు, మధ్యాహ్నమున చల్లని నీడనొసగు చెట్టువలె మీరు మమ్ము సంరక్షింపుడు, మేము కాందిశీకులము. కాన శత్రువుల కంటబడనీకుండ మమ్ము దాచియుంచుడు.
4. మేము మోవాబు నుండి పారిపోయివచ్చితిమి. ఇపుడు మీ చెంత వసింతుము. మమ్ము చంపగోరు వారినుండి మీరు మమ్ము కాపాడుడు” అని మోవాబీయులు యూదీయులను అడుగుదురు. శత్రువులిక దేశమును పీడింపరు, నాశనముచేయరు. దేశమును ధ్వంసము చేయువారు గతింతురు.
5. అప్పుడు దావీదు వంశజుడొకడు రాజగును. అతడు సత్యసంపన్నుడై కరుణతో, ప్రజలను పాలించును. న్యాయమును జరిగించుటకై బహుజాగ్రత్తగా పరిశీలించుచు ధర్మముకొరకు తపించిపోవును.
6. మేము మోవాబీయులు గర్వాత్ములని వింటిమి. వారు అహంకారపూరితులని తెలిసికొంటిమి. కాని వారి పొగరుబోతుతనము ఎందుకు పనికిరాదని యూదీయులు పలుకుదురు.
7. కావున మోవాబీయులెల్లరును గూడి తమ దేశము కొరకు శోకింపవలెను. వారు కీరరే సెతున తాము భుజించుచువచ్చిన ద్రాక్షపండ్ల మోదకములను తలంచుకొని నిరాశతో విలపింతురు.
8. హెష్బోను, సిబ్మా ద్రాక్షతోటలు నాశనమైనవి. పూర్వము అన్య జాతులరాజులు ద్రాక్షరసము త్రాగి మత్తెక్కి యుండెడివారు. పూర్వము ఆ ద్రాక్షలు యాసేరు నగరమువరకును, ఎడారివరకును గూడ వ్యాపించియుండెడివి. వాని తీగెలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను.
9. కనుక నేను యాసేరుకొరకు శోకించినట్లే సిబ్మా ద్రాక్షల కొరకు కూడ శోకింతును. హెష్బోను, ఎలాలేను నా కన్నీళ్ళతో తడుపుదును. వానిలో పంట ఏమియు పండదు. కనుక ప్రజలు ఆనందముతో కేకలిడరు.
10. సారవంతమైన తోటలలోనుండి సంతోషము సమసిపోయెను. తోటలలో ఆనందముతో కేకలిడువాడుగాని, పాటలు పాడువాడుగాని లేడు. ద్రాక్షగెలలను తొక్కి రసముతీయువారు లేరు. సంతోషనాదములు అడుగంటినవి.
11. కావున మోవాబు కొరకు నా గుండె కొట్టుకొనుచున్నది, కీర్హరేసు కొరకు నేను తంత్రీవాద్యమువలె నిలువెల్ల కంపించిపోవుచున్నాను.
12. మోవాబు ప్రజలు ఆయాసముతో ఉన్నత స్థలమునకు ఎక్కిపోయినను, దేవళములలో ప్రవేశించి ప్రార్థనలు చేసినను ప్రయోజనమేమియు ఉండబోదు.
13. పూర్వము ప్రభువు మోవాబును గూర్చి పలికిన సందేశమిట్టిది.
14. కాని ఇప్పుడు “నియమిత కాలము మూడేండ్లలోనే మోవాబు గొప్పసంపదలన్నియు నాశనమగును. ఆ దేశపు మహాప్రజలలో కొద్దిమంది మాత్రమే మిగులుదురు. వారును బలహీనులగుదురు” అని ప్రభువు పలుకుచున్నాడు.
1. దమస్కును గూర్చిన దైవవాక్కు దమస్కు ఇక పట్టణముగా మనజాలదు, అది శిథిలముల ప్రోవగును.
2. ఆరాము నగరములు నిర్మానుష్యమగును. ఆ నగరములు గొఱ్ఱెలమందలు మేతమేయు తావులగును. వాటినెవడును అదలింపని విధముగా అవి విశ్రమించును.
3. ఎఫ్రాయీము రక్షణము కోల్పోవును. దమస్కు రాజ్యమును పొగొట్టుకొనును. సిరియాదేశమున మిగిలియున్నవారు యిస్రాయేలీయులవలె అవమానము పాలగుదురు. ఇది సైన్యములకధిపతియైన ప్రభువు వాక్కు
4. ఆ దినమున యాకోబుయొక్క గొప్పతనము సమసిపోవును. ఆ దేశము తన సంపదను కోల్పోయి పేదదగును.
5. ఆ దేశము గతి, కోతగాడు పండినదంట్లను చేతులలోనికి తీసికొని వానివెన్నులు కోసినట్లుండును. రెఫాయీము లోయలో పరిగెలు ఏరునట్లుండును.
6. ఓలివు చెట్టుపండ్లు దులపగా, పైకొమ్మ చివరన రెండు మూడుపండ్లుగాని, క్రింది కొమ్మమీద మూడు నాలుగు పండ్లు గాని మిగిలియున్నట్లుండును. యిస్రాయేలు దేవుడను, ప్రభుడనైన నేను పలికిన పలుకిది.
7. ఆ దినమున ప్రజలు తమ సృష్టికర్తయు, యిస్రాయేలు పవిత్రదేవుడునైన ప్రభువును చూచెదరు.
8. వారు తాము స్వయముగా నిర్మించిన బలిపీఠములను ఆశ్రయింపరు. ఆ దినమున అషేరా దేవత ప్రతిమలను గాని, సూర్యదేవత ప్రతిమలనుగాని, తమ చేతులు చేసిన దేనినైనను ఆశ్రయింపరు.
9. పూర్వము యిస్రాయేలీయులు వచ్చుటను చూచి అమోరీయులు, హివ్వీయులు భయముతో పారిపోవుచు, తమ నగరములను నిర్మానుష్యము కావించుకొనినట్లే, ఆ రోజున మీ నగరములు నిర్మానుష్యమగును.
10. మీరు మీ రక్షణకర్తయైన దేవుని విస్మరించితిరి. మీకు బలమునొసగు ప్రభువును మరచిపోతిరి. పైగా మీరు అన్యదేవతకు వనములునాటితిరి. పరదేవతకు కొమ్మలునాటితిరి.
11. ఆ వనములు మీరు నాటిన ఉదయముననే చిగిర్చి పూలుపూచినను మీ పొలములు పంటపండవు. మీరు ఆపదకును, తీరని బాధకును గురియగుదురు.
12. బలముగల జాతులు ఆర్బాటము చేయుచున్నవి. సముద్రమువలె గర్జించుచున్నవి. కడలి అలలవలె ఘోషించుచున్నవి.
13. అన్యజాతులవారు కడలి అలలవలె సమీపించుచున్నారు. కాని ప్రభువు వారిని మందలింపగా వారు వెనుకకు మరలుచున్నారు. పెనుగాలికి కొండలమీది ధూళివలెను, సుడిగాలికి చెత్తవలెను కొట్టుకొనిపోవుచున్నారు.
14. వారు సాయంకాలమున భయము పుట్టింతురు. కాని వేకువ అగునప్పటికి మటుమాయ మగుదురు. మనలను కొల్లగొట్టు వారి గతియిట్టిది. మనలను దోచుకొనువారి గతియిట్టిదే.
1. కూషు నదులకు ఆవల రెపరెప కొట్టుకొను రెక్కలుగల దేశమా! నీకు శ్రమ.
2. రెల్లుతో అల్లిన పడవలలో సముద్రమార్గమున అది రాయబారులను పంపుచున్నది. వేగముగా వచ్చిన దూతలారా! మీరు మరలిపొండు. నునుపైన చర్మముకలిగి పొడవుగానుండి ఎల్లరికిని భీతికలిగించు బలాఢ్యులు, శక్తిమంతులునై అలరారు ప్రజలయొద్దకును, నదులతో నిండియున్న దేశమునకును మీరు తిరిగిపొండు.
3. లోకములోని ప్రజలెల్లరును, భూమిమీద వసించు నరులెల్లరును వినుడు. అదిగో! కొండల మీద జెండానెత్తినారు చూడుడు. బాకాను ఊదినారు వినుడు.
4. ప్రభువు నాతో ఇట్లనెను: “పగటి వేడిమిలో సూర్యుడు నిశ్చలముగా ప్రకాశించునట్లును, పంటకాలపు వేడిరాత్రులలో మంచు నెమ్మదిగాపడినట్లును నేను ఆకాశము నుండి ప్రశాంతముగా భూమిమీదికి చూతును.
5. ద్రాక్షపండ్లను కోయకమునుపే, . పూవులురాలి కాయలు పక్వమగుచుండగనే ఆయన వాడియైన వంకికత్తులతో ద్రాక్షతీగలను నరికివేయును. వాని రెమ్మలనుకోసి ఆవలపారవేయును.
6. కొండలలోని పక్షులకును, వన్యమృగములకును వానిని మేతగా వదలి వేయును. వేసవిలో పక్షులు వానిని తినును. శీతకాలమున వన్యమృగములు వానిని మేయును.
7. అప్పుడు నునుపైనచర్మము కలిగి పొడవుగా నుండి ఎల్లరికిని భీతి కలిగించుచు, బలాఢ్యులుగా శక్తిమంతులుగా అలరారు ప్రజలనుండియు, నదులతో నిండియున్న దేశమునుండియు సైన్యములకధిపతియైన ప్రభువునకు కానుకలు ఆయన నామమునకు నివాస ముగా నుండు సీయోనుకొండకు తీసుకొనివత్తురు.”
1. ఐగుప్తును గూర్చిన దైవవాక్కిది: ప్రభువు మేఘమునెక్కి వేగముగా ఐగుప్తునకు వచ్చుచున్నాడు. అతనిని గాంచి ఐగుప్తులోని విగ్రహములు తల్లడిల్లుచున్నవి. ఐగుప్తీయుల గుండెలు నీరగుచున్నవి.
2. ప్రభువిట్లు నుడువుచున్నాడు: నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులనే రేపెదను. అచట అన్నదమ్ములు ఒకరితో నొకరును, ఇరుగుపొరుగువారు ఒండొరులతోను, నగరము నగరముతోను, రాజ్యము రాజ్యముతోను పోరాడును.
3. నేను ఐగుప్తు శక్తి సన్నగిల్లిపోవునట్లు చేయుదును. ఐగుప్తీయుల ఆలోచనలు వమ్మగునట్లు చేసెదను. వారు విగ్రహములను, మాంత్రికులను, సోదెచెప్పువారిని, మృతులను ఆవాహము చేయువారిని సంప్రతింతురు.
4. నేను ఐగుప్తీయులను పీడకుని చేతికి అప్పగింతును. క్రూరుడైనరాజు వారిని పరిపాలించును. సైన్యములకధిపతియు, ప్రభుడనైన నా వాక్కిది.
5. నైలునదిలోని నీరు తగ్గిపోవును. నది క్రమముగా ఎండిపోవును.
6. ఆ నది కాలువలువట్టిపోయి దుర్గంధమొలుకును. వానిలోని జమ్మును, రెల్లును మాడిపోవును.
7. నైలునది ఒడ్డున నాటిన పైరులన్నియు ఎండిపోయి, గాలికెగిరిపోయి అదృశ్యమగును.
8. బెస్తలు విలపింతురు. నైలునదిలో గాలములువేసి చేపలుపట్టువారు దుఃఖింతురు. వలలతో చేపలుపట్టువారు అంగలారురు.
9. నారపని చేయువారు, నారతో బట్టలునేయువారు నిరాశచెందుదురు, రాజ్యస్తంభములు పడగొట్టబడును. నేతపని చేయువారు విచారింతురు.
10. నేర్పరులైన పనివారు విషాదము చెందుదురు.
11. సోవను నాయకులు మందమతులు. బుద్ధికుశలులైన ఫరోజ్ఞానులు మూర్ఖపు సలహానిచ్చిరి “మేము జ్ఞానులకును, పూర్వపురాజులకును శిష్యులము" అని వారు ఫరోతో ఎట్లు చెప్పగలరు?
12. ఫరోరాజా! నీ జ్ఞానులేరి? సైన్యములకధిపతియైన ప్రభువు ఐగుప్తునకెట్టి దుర్గతి పట్టించునో వారు గ్రహించి చెప్పవలెనుకదా?
13. సోవను నాయకులు మందమతులు. నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్రమూలపురుషులు దానిని అపమార్గము పట్టించిరి.
14. ప్రభువు ఆ నాయకులు దుష్టాత్మనొందునట్లు చేసెను. కావుననే వారు త్రాగుబోతుమత్తులై తమ వాంతిలో తామే తూలిపడుపట్లుగా, ఐగుప్తు ప్రతికార్యమునను తూలి తప్పుటడుగు వేయునట్లు చేసిరి.
15. ఐగుప్తున ఇక తలయైనను, తోకయైనను, కొమ్మయైనను, రెల్లునైనను ఎవరును ఏమియు చేయజాలరు.
16. ఆ రోజున ఐగుప్తీయులు స్త్రీలవలె పిరికి వారగుదురు. వారు సైన్యములకధిపతియైన ప్రభువు తమ మీదికి హస్తము నెత్తుటనుజూచి భయపడుదురు.
17. సైన్యములకధిపతియైన ప్రభువు తమకు పట్టింప బోవు దుర్గతిని జ్ఞప్తికి తెచ్చుకొనునపుడెల్ల ఐగుప్తీయులు యూదా దేశమును తలంచుకొని భీతిల్లుదురు.
18. ఆ దినమున ఐగుప్తున ఐదునగరములు కనాను మండలపు భాషను మాట్లాడును. ఆ నగరముల ప్రజలు సైన్యములకధిపతియైన ప్రభువునకు చెందిన వారమని ప్రమాణము చేయుదురు. ఆ పట్టణములలో నొకటి సూర్యనగరమని పేరుబడయును.
19. ఆ కాలము వచ్చినపుడు ఐగుప్తుదేశము నడుమ ప్రభువునకు బలిపీఠమును నెలకొల్పుదురు. ఆ దేశపు సరిహద్దులలో ప్రభువునకు శిలాస్తంభము నాటుదురు.
20. అవి ఐగుప్తున సైన్యములకధిపతియైన ప్రభువునకు గుర్తుగాను సాక్ష్యముగాను ఉండును. ఐగుప్తీయులు పరపీడనమునకు గురియై, ప్రభువునకు మొరపెట్టుకొనినపుడు, ఆయన వారియొద్దకు ఒక విమోచకుని పంపి వారిని కాపాడును.
21. ఆ రోజున ప్రభువు ఆ ప్రజలకు ప్రత్యక్షమగును. వారు ఆయనను అంగీకరించి పూజింతురు. ఆయనకు బలులు, కానుకలు అర్పింతురు. ఆయనకు మ్రొక్కుబడులు చేసికొని, వానిని తీర్తురు.
22. ప్రభువు ఐగుప్తీయులను శిక్షించును. కాని వారిని మరల స్వస్థపరచును. ఆ ప్రజలు ప్రభువునకు మనవి చేయుదురు. ఆయన వారి వేడుకోలును ఆలించి, వారిని స్వస్థపరచును.
23. ఆ దినమున ఐగుప్తునుండి అస్సిరియాకు రాజ పథమును నిర్మింతురు. అపుడు అస్సిరియులు ఐగుప్తు నకు, ఐగుప్తీయులు అస్సిరియాకు వచ్చుచు పోవుచు నుందురు. వారిరువురును కలిసి యావేదేవుని సేవింతురు.
24. ఆ దినమున యిస్రాయేలు రాజ్యము ఐగుప్తు, అస్సిరియాలతో సరిసమానమగును. ఈ మూడు రాజ్యములు ప్రపంచమంతటికి దీవెనగా నుండును.
25. సైన్యములకధిపతియైన ప్రభువు 'ఐగుప్తు నా ప్రజగా నుండును. అస్సిరియా నేను సృజించినది. యిస్రాయేలు నేనెన్నుకొనినది” అని పలికి ఆ రాజ్యములను ఆశీర్వదించును.
1. అస్సిరియారాజైన సర్గోను తన సైన్యాధిపతియైన తరానునుకు, అష్టోదుమీదికి పంపెను. అతడు వచ్చి ఆ నగరమును ముట్టడించి స్వాధీనము చేసికొనెను.
2. ఆ కాలమున ప్రభువు ఆమోసు కుమారుడైన యెషయాతో “నీ నడుము మీది గోనెపట్టను తీసివేసి, పాదరక్షలను విడువుము” అని చెప్పెను.. అతడు ప్రభువు ఆజ్ఞాపించినట్లే పాదరక్షలు విడిచి దిగంబరుడుగా నడిచెను.
3. అష్ణోదు లొంగిపోయినపుడు ప్రభువిట్లు పలికెను: “నా సేవకుడైన యెషయా మూడేండ్ల నుండి పాదరక్షలు విడిచి దిగంబరుడుగా తిరుగుచున్నాడు. అతడు ఐగుప్తు కూషు దేశములకుపట్టు దుర్గతికి గుర్తుగాను, సూచనముగాను ఉన్నాడు.
4. అస్సిరియారాజు ఆ రెండు దేశములనుండియు బందీలను కొనిపోవును. అతడు ఆ దేశములనుండి పిన్నలను పెద్దలను గొనిపోవును. వారు బట్టలను చెప్పులను విడచివెళ్ళవలెను. వారి పిరుదుల మీద బట్టలేమియువుండవు. అది ఐగుప్తునకు అవమానకరమగును.
5. యిస్రాయేలీయులు తాము నమ్మిన కూషును గూర్చియు, తాము గొప్పగా ఊహించుకొనిన ఐగుప్తీయులను గూర్చియు నిరాశచెంది సిగ్గుపడుదురు.
6. ఆ కాలము వచ్చినపుడు సముద్రతీరమున వసించువారు, “మనము నమ్మినవారికి ఈ ఎట్టిగతి పట్టినదో చూడుడు! అస్సిరియారాజునకు భయపడి మనము వారి మరుగుజొచ్చితిమి. కాని ఇపుడు వారికి మరియు ఎట్టిదుర్గతి పట్టినదో చూడుడు. ఇక మనమెట్లు తప్పించుకోగలము?" అని చెప్పుకొందురు.
1. సముద్రతీర ఎడారి ప్రాంతమును గూర్చి దైవవాక్కు ఎడారిగుండ నేగేబున సుడిగాలి వీచినట్లే, భయంకరమైన దేశము నుండి విపత్తు వచ్చును.
2. నేనొక భీకరదృశ్యమును గాంచితిని. కొల్లగొట్టువారు కొల్లగొట్టుదురు, ధ్వంసము చేయువారు ధ్వంసము చేయుదురు. ఏలామూ! నీవు యుద్ధమునకు పొమ్ము. మాదీయా! నీవు పట్టణమును ముట్టడింపుము. ప్రభువు బబులోనియావలన కలిగిన దుఃఖము తీర్చును.
3. ఆ దృశ్యమునుగాంచి నా నడుము బహునొప్పిగానుండినది. ఆ బాధ ప్రసవవేదనను అనుభవించు స్త్రీ శ్రమవంటిది. నేను వేదనలవలన వినజాలనైతిని, భయమువలన కనజాలనైతిని.
4. నా గుండె కొట్టుకొనుచుండెను. నేను భీతితో కంపించుచుంటిని. నేను సాయంకాలము కొరకు ఎదురుచూచుచుంటిని. " కాని మునిమాపు నాకు భీతినే కలిగించెను.
5. ప్రజలు భోజనము సిద్ధముచేసి అతిథులు కూర్చుండుటకు కంబళ్ళు పరచిరి. వారు విందారగించుచుండగానే 'సైన్యాధిపతులారా! మీ డాళ్ళను సిద్ధము చేసికొనుడు' అని అరుపులు విన్పించెను.
6. అంతట ప్రభువు నాతో ఇట్లనెను: “నీవుపోయి గస్తీవానిని నియమింపుము. అతడు తాను చూచినది నీతో చెప్పవలెను.
7. రౌతులు గుఱ్ఱములనెక్కి జంటలుజంటలుగా వచ్చుటను అతడు చూచెనేని, నరులు గాడిదలపైనను, ఒంటెలపైనను వరుసలుగా వచ్చుటను గాంచెనేని వారిని జాగ్రత్తగా పరిశీలించిచూడవలెను.
8. గస్తీవాడు "అయ్యా! నలు నేను ఈ బురుజు మీదినుండి రేయింబవళ్ళు గస్తీ కాయుచున్నాను.
9. అవిగో అశ్వదళములు! రౌతులు గుఱ్ఱములనెక్కి జంటలుజంటలుగా వచ్చుచున్నారు” అని బిగ్గరగ కేకలిగెను. మరియు గస్తీవాడు ఇట్లు అనుచున్నాడు: “బబులోనియా ధ్వంసమైనది, ధ్వంసమైనది. ఆ నగర ప్రజలు కొలుచు విగ్రహములన్నియు కూలి నేలమీద పడినవి”.
10. నా ప్రజలైన యిస్రాయేలీయులారా! శత్రువులు మిమ్ము కళ్ళమున ధాన్యమువలె తొక్కించిరి. "యిస్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునైన ప్రభువు నాతో చెప్పిన సంగతినే నేను మీకు తెలిపితిని.
11. ఎదోమునుగూర్చి దైవవాక్కు; సేయీరునుండి నన్నెవరో గొంతెత్తి పిలిచి “కావలివాడా! రేయి ఎంతవేళయినది?” అని అడిగెను.
12. “ఓయి! వేకువవచ్చుచున్నది, కాని రేయి మరల వచ్చును. నీవు మరల నన్ను ప్రశ్నింపగోరెదవేని తిరిగివచ్చి ప్రశ్నింపుము” అని గస్తీవాడు చెప్పుచున్నాడు.
13. అరేబియాను గూర్చి దైవోక్తి: అరేబియా ఎడారులలో విడిదిచేయు దెదాను సార్ధవాహులారా! దప్పికగొనినవారికి నీళ్ళు గొనిరండు.
14. తేమా దేశనివాసులారా! మీరు కాందిశీకులను కలిసికొని వారికి భోజనము పెట్టుడు. దప్పికగొన్నవారికి నీళ్ళు తెండు.
15. వారు తమను నాశనముచేయు ఖడ్గముల నుండి పారిపోవుచున్నారు. ఎక్కు పెట్టిన విల్లులనుండి తప్పించుకొని పోవుచున్నారు. యుద్దాపాయములకు జంకి పరిగెత్తుచున్నారు.
16. ప్రభువు నాతో "ఖండితముగా ఒక సంవత్సరము ముగియకమునుపే కేదారు వైభవము అంతమగును.
17. కేదారు జనులలో విలుకాండ్రు మహాశూరులు. కాని వారిలో కొద్దిమంది మాత్రమే మిగులుదురు. యిస్రాయేలు దేవుడైన ప్రభువు ఆ ఇది” అని చెప్పెను.
1. దర్శనపులోయను గూర్చి దైవోక్తి: నగరవాసులెల్లరు ఇంటికప్పుమీదికెక్కి ఉత్సవము చేసికొనుచున్నారు. వారికేమి పోగాలము వచ్చినది?
2. కలకలముతోను సంతోషనాదముతోను నిండియున్న ఓ నగరమా! చచ్చినవారు కత్తివాతబడి చావలేదు. పోరాడుచు ప్రాణములు కోల్పోలేదు.
3. నీ నాయకులెల్లరును పారిపోయిరి. వింటిని వంచకముందే శత్రువులకు చిక్కిరి. నీ శూరులెల్లరును బందీలైరి. వెన్నిచ్చి పారిపోయిరి.
4. “మీరు నన్ను ఒంటరిగా వదిలివేయుడు. మృతులైన నా ప్రజలనుగూర్చి నేను సంతాపముతో ఏడ్చెదను. మీరు నన్ను ఓదార్పవలదు” అంటిని.
5. దర్శనపు లోయలో భయమును, పరాజయమును కలవరపాటును పుట్టించిన దినమిది. సైన్యములకధిపతియైన ప్రభువే ఈ చెయిదము చేసెను. నగరప్రాకారములు కూలిపోయినవి. ప్రజల ఆర్తనాదములు కొండలలో మారుమ్రోగినవి.
6. ఏలాము యోధులు విండ్లుతాల్చి గుఱ్ఱములనెక్కి వచ్చిరి. కీరునగర సైనికులు డాళ్ళను సిద్ధము చేసికొనిరి.
7. యూదాలోని సారవంతపు లోయలు రథములతో నిండిపోయినవి. రౌతులు నగరద్వారమునెదుట మోహరించిరి.
8. యూదా రక్షణదుర్గము వమ్మయ్యెను. యెరూషలేమువాసులారా! మీరు ఆ దినమున ఆయుధాగారమువైపు దృష్టిని మరల్చితిరి.
9-11. దావీదు నగరప్రాకారమున మరమ్మత్తు చేయవలసిన తావులను పరిశీలించితిరి. యెరూషలేము నగరములోని ఇండ్లను పరీక్షించి చూచితిరి. వానిలో కొన్నిటిని కూల్చివేసి, వాని రాళ్ళతో ప్రాకారమును మరమ్మతు చేయగోరితిరి. ప్రాత కోనేటినుండి పారునీటిని నిల్వజేయుటకుగాను పట్టణ రెండు గోడల మధ్యమున జలాశయమును నిర్మించితిరి. కాని వీనినన్నింటినిచేసిన దేవుని లక్ష్యము చేయరైతిరి. పూర్వమే వీనిని సిద్ధముచేసిన దేవుని గుర్తింపరైతిరి
12. సైన్యములకధిపతియైన ప్రభువు, మీరు ఆ దినమున విలపించి, తల గొరిగించుకొని గోనెతాల్పవలెను అనెను.
13. కాని మీరు ఎడ్లను, పొట్టేళ్ళను వధించి, మాంసమును, మధువును సేవించి సంతసముతో కాలము గడిపితిరి. “రేపు మనము చచ్చిన చావవచ్చును, కనుక నేడు తిని త్రాగుదము" అని పలికితిరి.
14. “ఈ ప్రజలు బ్రతికియున్నంతకాలము నేను ఈ అపరాధమును క్షమింపబోను.. సైన్యములకధిపతినైన నా వాక్కిది” అని ప్రభువు నాతో ప్రమాణపూర్వకముగా పలికెను.
15. సైన్యములకధిపతియగు ప్రభువు నన్ను రాజగృహ నిర్వాహకుడును, రాజప్రాసాద అధ్యక్షుడునైన షెబ్నా వద్దకు పోయి, అతనితో ఇట్లు చెప్పుము అనెను.
16. “ఇక్కడ నీకేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని కట్టించుకొనుచున్నావు శిలలో నీకు నివాసము నిర్మించుకొనుచున్నావు.
17. నీవు ప్రముఖుడవు కావచ్చును. కాని ప్రభువు నిన్ను గుప్పిటబట్టి క్రిందికి విసరివేయును. నిన్ను మూటకట్టి గట్టిగా నొక్కిపట్టి, బంతివలె సువిశాలదేశములోనికి విసరివేయును.
18. నీవు ఆ దేశముననే, నీవింతగా గర్వించు ఆ రథముల ప్రక్కనే చత్తువు. నీవు నీ యజమానుని రాజకుటుంబమునకు మచ్చతెచ్చితివి.”
19. ప్రభువు ఇట్లనెను: “నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును నీ ఉన్నతస్థానమునుండి నిన్ను పడద్రోయుదును
20. ఆ దినమున నేను హిల్కియా కుమారుడును, నా సేవకుడునగు ఎల్యాకీమును ఆహ్వానింతును.
21. నీ అధికార వస్త్రములను, నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును. నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు, యూదా నివాసులకు అతడు తండ్రివంటివాడగును.
22. దావీదు వంశపురాజు తాళపుచెవిని అతడు తన భుజములమీద తాల్చునట్లు చేయుదును. అతడు తెరచినదానిని ఎవరును మూయలేరు. అతడు మూసినదానిని ఎవరును తెరువలేరు.
23. నేనతనిని గుడారపుమేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబమంతటికిని వన్నెదెచ్చును.”
24. కాని ఎల్యాకీము కుటుంబము వారు సేవకులు అతనిమీద అతిగా ఆధారపడి అతనికి భారమగుదురు. పాత్రలు, గిన్నెలు, మేకుమీద వ్రేలాడి నట్లుగా, వారతనిమీద వ్రేలాడుదురు.
25. ఆ దినమున, గోడలోనికి లోతుగా దిగగొట్టబడిన మేకు జారి క్రిందబడును. ఆ మేకు మీద వ్రేలాడు వస్తువులన్నియు నాశనమగును. సైన్యములకధిపతియు ప్రభుడనైన నేను పలికిన పలికిది.
1. తూరును గూర్చిన దైవోక్తి: తర్షీషు నావలారా! మీరు శోకింపుడు. మీ తూరు రేవు ధ్వంసమైనది. ఆ నగరములోని ఇండ్లు ధ్వంసమైనవి. కిత్తీమునుండి మరలివచ్చుచు మీరు ఈ వార్తను వింటిరి.
2. సముద్రతీరవాసులారా! అంగలార్చుడి. సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి.
3. మీరు మీ ప్రజలను సముద్రములకు ఆవలికిపంపి షీహారునది. ధాన్యమును నైలునది పంటనుకొని తెచ్చి, ఎల్లజాతులతో వ్యాపారము చేయుచున్నారు.
4. సీవోను నగరమా! నీవు సిగ్గుపడుము. సముద్రమును, దాని గర్భమును “నేను ప్రసవవేదనను అనుభవింపలేదు కుమారులను గాని, కుమార్తెలనుగాని పెంచలేదు” అని పలుకును.
5. తూరు నాశనమైనదని విని, ఐగుప్తీయులు విస్మయము చెందుదురు.
6. సముద్రతీర వాసులారా! మీరు శోకింపుడు. తర్షీషునకు పారిపొండు.
7. ప్రాచీన కాలముననే స్థాపింపబడినదియు, సంతోష నిలయమైనదియునగు తూరు పట్టణమిదియేనా? సముద్రతీర ప్రదేశములకు ప్రజలనంపి అచట నూత్ననగరములను నిర్మింపజేసిన పట్టణమిదియేనా?
8. తూరునగర వ్యాపారులు రాజులవంటివారు. ఆ నగరవర్తకులు లోకమున సుప్రసిద్ధులు. అన్యులమీద పరిపాలనము నెరపు తూరునకు ఈ దుర్గతి పట్టించినదెవరు?
9. సైన్యములకధిపతియైన ప్రభువే ఈ నిర్ణయము చేసెను. ఆ నగరవాసుల పొగరణచుటకును, ఈ లోకమున ఘనులుగా చలామణి అగువారిని మన్నుగరపించుటకును ఆయన అటుల చేసెను.
10. తర్షీషు కుమారీ! నీ దేశమునకు ఇంక నిర్బంధములేదు. నైలునదివలె దానిమీదికి ప్రవహింపుము.
11. ప్రభువు సముద్రముమీద తన హస్తమునుచాచి రాజ్యములను కూలద్రోసెను. ఆయన తూరు ప్రజల వ్యాపార కేంద్రములను నాశనముచేయ నిర్ణయించెను.
12. ప్రభువిట్లనెను: “సీదోను కుమారీ! చెరపబడినదానా! నీ ఆనందము అంతరించినది. నీ జనులు పరపీడనకు గురియైరి. నీ ప్రజలు ఓడనెక్కి కిత్తీమునకు పారిపోయినను, అచటకూడ సురక్షితముగా మనజాలరు.”
13. అదిగో కల్దీయులను చూడుము! తూరుమీదికి వన్యమృగములను విడిపించినదివారే. వారే ముట్టడిమంచెలను కట్టి తూరు ప్రాకారములను పడగొట్టిరి. ఆ నగరమును నేలమట్టము చేసినది వారే.
14. తర్షీషు నావలారా! మీరు శోకింపుడు. మీ తూరు రేవు ధ్వంసమైనది.
15. ఆ కాలమున తూరు డెబ్బదియేండ్ల పాటు విస్మరింపబడును. ఇది ఒక రాజు జీవితకాలమునకు సరిసమానము. ఆ డెబ్బది యేండ్లు ముగిసిన పిదప తూరు గతి ఈ ప్రసిద్ధమైన గీతములోని వేశ్యగతి వంటిదగును.
16. “విస్మృతికి గురియైన వేశ్యాంగనా! నీవు తంత్రీవాద్యముతో నగరములోనికి పొమ్ము వాద్యము మీటి పాటలుపాడి మరల ప్రజలను ఆకర్షింపుము.”
17. డెబ్బదియేండ్లు ముగిసిన పిదప ప్రభువు తూరును దర్శించును. ఆ నగరము మరల వేశ్వా జీతమునకు భూమిమీద నున్న సమస్త రాజ్యములతో వ్యభిచారము చేయును.
18. వేశ్యజీతముగానున్న దాని వర్తక లాభము ప్రభువునకు నివేదితమగును. అది పోగుచేయబడదు, ధననిధిలో వేయబడదు. ప్రభువు సన్నిధిన వసించువారు ఆ లాభముతో మంచి భోజనము, ప్రశస్తమైన వస్త్రములు కొనితెచ్చుకొందురు.
1. ప్రభువు భూమిని శూన్యముచేసి నాశనము చేయును. నేల ఉపరిభాగమును వంచి, దానిమీది ప్రజలను చెల్లాచెదరుచేయును.
2. ప్రజలకు కలిగినట్లు యాజకులకు, దాసులకు కలిగినట్లు యజమానులకు, దాసీలకు కలిగినట్లు యజమానురాండ్లకు, కొనువారికి కలిగినట్లు అమ్మువారలకు, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పుపుచ్చుకొనువారికి వడ్డీకి ఇచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొనువారికి అందరికిని ఒకేగతి పట్టును.
3. భూమిశూన్యమై నాశనమగును. అది కేవలము కొల్లసొమ్ము అగును. ఇది ప్రభువు వాక్కు.
4. భూమి శుష్మించి వాడిపోవును. లోకమంతయు ఎండి క్షీణించిపోవును. భూమ్యాకాశములు అవిసిపోవును.
5. లోకము నరులవలన కలుషితమైనది. వారు శాసనములను పాటింపరైరి. శాశ్వతమైననిబంధనమును మీరిరి.
6. కావున శాపము భూమిని చుట్టుకొనినది. భూమిమీద ప్రజలు తమ పాపఫలమును అనుభవించుచున్నారు. వారిలో చాలమంది భస్మమైరి. ఇక కొద్దిమంది మాత్రమే మిగిలియుందురు.
7. ద్రాక్షతీగలు వాడిపోవుచున్నవి, ద్రాక్ష రసము కొరతపడుచున్నది. పూర్వము సుఖించినవారిపుడు దుఃఖించుచున్నారు.
8. సంతోషప్రదమైన తంత్రీవాద్యము పాట ఆగిపోయినది. ప్రజల సంతోషనాదములు అంతరించినవి. ఇంపైన సితారపాట సమసిపోయినది.
9. ప్రజలు మద్యము సేవించుచు, పాటలుపాడుట మానివేసిరి. త్రాగువారికి మద్యము చేదుగానున్నది.
10. నాశనమునకు గురికానున్న నగరము ధ్వంసమైనది. అందలి ఇండ్లను మూసివేసిరి. వానిలో ఎవరును ప్రవేశించుటలేదు.
11. ప్రజలు వీధులలో ద్రాక్షారసము కొరకు అరచుచున్నారు, సంతోషము మరుగైపోయినది. ఆనందము దేశమున కన్పింపకుండపోయినది.
12. నగరము ధ్వంసమైనది దాని ద్వారములు పగులగొట్టబడినవి.
13. భూమిమీది ప్రజలెల్లరును ఇట్లే నాశనమగుదురు. ఓలివుచెట్టునుండి పండ్లు దులిపినప్పుడును; ద్రాక్షలకోతకాలము ముగిసిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనునప్పుడు ఎట్లుండునో నరులగతియు అటులనే ఉండును.
14. కాని నాశనమును తప్పించుకొనువారు సంతసముతో పాటలు పాడుదురు. సముద్రతీరముననున్నవారు . ప్రభువుమాహాత్మ్యమును ఉగ్గడింతురు.
15. తూర్పుననున్నవారు ఆయనను ప్రశంసింతురు. ద్వీపవాసులు యిస్రాయేలు దేవుడైన ప్రభువును కొనియాడుదురు.
16. నీతిమంతమైన యిస్రాయేలు ప్రజకు గౌరవము కలుగుగాకయని నేల అంచులనుండి ప్రజలు పాడగా మనమువిందుము. కాని “అయ్యో! నేను చెడితిని, నాకు దుర్గతితప్పదు, మోసగాండ్రు మోసము చేయుచున్నారు. ద్రోహులు ద్రోహము చేయుచున్నారు” అని నేను భావించితిని.
17. భూలోకవాసులారా! మీకు భయమును, గొయ్యియు, ఉరులును తప్పవు.
18. భయమునుండి పారిపోజూచువాడు గోతిలోపడును, గోతినుండి తప్పించుకొనువాడు ఉరులలో చిక్కుకొనును.
19. ఆకసమునుండి కుండపోతగా వాన కురియును. నేలపునాదులు కంపించును. భూమి బద్దలగును, దద్దరిల్లి బీటలువారును, గడగడవణకును.
20. అది త్రాగినవానివలె ఇటునటు తూలును. గాలికి గుడిసెవలె ఊగిసలాడును. భూమికి పాపభారమెక్కువైనది. కనుక అది కూలిపడును, మరల లేవలేదు.
21. ఆ దినమున ప్రభువు ఆకాశమునందలి శక్తులను, భూమిమీది రాజులను శిక్షించును.
22. బందీలను గోతిలో పడవేసినట్లుగా రాజులను ప్రోగుజేసి చెరలోపడవేయును దీర్ఘకాలానంతరము వారిని దండించును.
23. అపుడు చంద్రుడు ప్రకాశింపడు, సూర్యుడు కాంతినీయడు. సైన్యములకధిపతియగు ప్రభువే రాజై యెరూషలేమున సియోనుకొండపై పరిపాలనము చేయును. ప్రజానాయకులు ఆయన తేజస్సును దర్శింతురు.
1. ప్రభూ! నీవే నాకు దేవుడవు. నేను నిన్ను హెచ్చించి కీర్తింతును. నీవు పూర్వమే చేసిన నిర్ణయములనెల్ల నమ్మదగినతనముతో నెరవేర్చితివి.
2. నీవు నగరములను శిథిలముగావించితివి. సురక్షిత నగరములను దిబ్బలు చేసితివి. గర్వాత్ములు నిర్మించిన ప్రాసాదములు నాశనమయ్యెను, వానిని మరల కట్టబోరు.
3. బలాఢ్యులైన ప్రజలు నిన్ను కీర్తింతురు. క్రూరులపట్టణములు నిన్ను చూచి భయపడును.
4. పేదలు నీ మరుగుదొత్తురు. ఆపదలోనున్నవారు నిన్ను ఆశ్రయింతురు గాలివానలో నీవు ఆశ్రయణీయుడవు, ఎండవేడిమిలో నీవు నీడవు. శీతకాలమునవచ్చు గాలివానవలెను, ఎండియున్న దేశమునకు తగిలిన బెట్టవలెను క్రూరులు మమ్ము బాధించిరి.
5. కాని నీవు మా విరోధులను అణగదొక్కితివి. మబ్బు ఎండవేడిమిని నాశనము చేసినట్లుగా, నీవు గర్వాత్ముల సంతోషనాదములు అణచివేసితివి.
6. సైన్యములకధిపతియైన ప్రభువు ఈ పర్వతముమీద సకలజాతులకును విందు సిద్ధముచేయును. అది ప్రశస్త మాంసభక్ష్యములతోను, మధువుతోను కూడియుండును. క్రొవ్విన పశువుల మాంసముతోను తేరుకొనిన ద్రాక్షరసముతోను నిండియుండును.
7. సకల జాతిజనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకలప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను, ఈ పర్వతముమీద ఆయన తొలగించును.
8. ప్రభువైన యావే, మృత్యువును సదా నాశనము చేయును. ఎల్లరి కన్నీళ్ళను తుడిచివేయును. భూమిమీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానము తొలగించును. ప్రభువు స్వయముగా పలికిన పలుకిది.
9. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు: “ఈయన మన ప్రభువు. మనము ఈయనను నమ్మితిమి. ఈయన మనలను కాపాడెను. ఈయన ప్రభువు, మనము ఈయనను విశ్వసించితిమి. ఈయన మనలను రక్షించెను. కనుక మనము ప్రమోదము చెందుదము.
10. ప్రభువు ఈ కొండను కాపాడును. కాని మోవాబును మాత్రము ఎరువుదిబ్బలో చెత్తనువలె తొక్కివేయును.
11. ఈతకొట్టువాడు చేతులు చాచినట్లుగా మోవాబీయులును చేతులు చాతురు. వారెన్ని తంత్రములు పన్నినను, ప్రభువు వారి పొగరు అణగించును.
12. ప్రభువు ఉన్నత ప్రాకారములుగల మోవాబీయుల కోటలు కూల్చివేసి మట్టిపాలు చేయును.
1. ఆ దినమున యూదాలో ఈ పాట పాడుదురు: “మాకొక బలమైన పట్టణము కలదు. ప్రభువే దాని ప్రాకారములను, బురుజులను కాపాడును.
2. నగరద్వారములు తెరువుడు! సత్యమును ఆచరించు నీతిగల జాతి లోనికి ప్రవేశించునుగాక! .
3. ప్రభూ! స్థిరమనస్సుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతినొసగుదువు.
4. మీరు సదా ప్రభువును నమ్ముడు. ఆయన మనకు శాశ్వతమైన రక్షణదుర్గము.
5. ఆయన ఉన్నత భవనములతో ఒప్పు నగరమున వసించువారిని మన్నుగరపించెను. ఆ నగరమును కూలద్రోసి మట్టిలో కలిపెను.
6. పీడనకు గురియైన దీనాత్ములు ఆ నగరమును తమ కాళ్ళతో తొక్కుదురు.”
7. ప్రభూ! నీవు సజ్జనుల త్రోవను సమతలమైనదిగా చేయుదువు. నీతిమంతుల మార్గము నునుపుగా ఉండును.
8. మేము నీ ఆజ్ఞలు పాటించి నిన్నునమ్మితిమి. నీ నామమును, నీ స్మరణమును మాత్రమే మేము కోరుకొందుము.
9. రేయి పూర్ణహృదయముతో నేను నిన్ను అభిలషించితిని. వేకువవేళ పూర్ణమనస్సుతో నిన్ను ఆశించితిని. లోకములో నీ విధులు చెల్లుబడియైనపుడు భూలోకవాసులు నీ న్యాయమును అర్థము చేసికొందురు.
10. నీవు దుష్టులకు కరుణ చూపినను వారు న్యాయమును గ్రహింపజాలరు. నీతిమంతుల దేశమునగూడ నీ మాహాత్మ్యమును అర్ధము చేసుకొనక వారు దుష్క్రియలు చేయుదురు.
11. నీవు దుర్మార్గులను శిక్షించుటకు చేతులెత్తితివి. కాని, వారు ఆ విషయమును గ్రహింపరైరి. ప్రభూ! వారు సిగ్గుచెందుదురుగాక! నీవు నిర్ణయించిన శిక్షను అనుభవింతురుగాక! నీ జనులపై నీకుగల అపారప్రేమను అర్థము చేసికొందురుగాక!
12. ప్రభూ! నీవు మాకు శాంతి దయచేయుదువు. మా క్రియలకు తగిన ప్రతిఫలమొసగుదువు.
13. మా ప్రభువైన దేవా! నీవుగాక ఇతర ప్రభువులును మమ్మేలిరి. కాని మేము నిన్ను మాత్రమే ప్రభునిగా అంగీకరించితిమి.
14. చచ్చినవారు మరల బ్రతుకరు. వారి ప్రేతములు మరల జీవముతో లేవవు. నీవు వారిని శిక్షించి సర్వనాశనము చేసితివి. నేలమీద వారి పేరు కూడ విన్పింపకుండపోయినది.
15. ప్రభూ! నీవు నీ ప్రజలను విస్తరింపజేసితివి. వారి సరిహద్దులు పొడిగించితివి. దీనివలన నీకు కీర్తి కలిగెను.
16. ప్రభూ! వారు ఆపదలలో నున్నప్పుడు నీకొరకు గాలించితిరి. నీవు శిక్షించినను, వారు నీకు విశేషముగా దీనప్రార్థనలు చేసిరి.
17. గర్భవతి ప్రసవకాలమున వేదనతో మూల్గినట్లే మేమును నీ సమక్షమున బాధతో మూల్గితిమి.
18. మేము గర్భము దాల్చి ప్రసవవేదనను అనుభవించితిమి. కాని దేనిని ప్రసవింపజాలమైతిమి, మేము మా దేశమునకెట్టి విజయమును చేకూర్చి పెట్టలేదు. మేము సాధించినదేమియు లేదు.
19. మృతులైన నీ ప్రజలు మరల జీవింతురు. వారి మృతశరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరు మరల లేచి, సంతోషముతో పాటలు పాడుదురు. తళతళలాడు మంచు, నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును.
20. నా ప్రజలారా! మీరు మీ ఇండ్లలోనికి వెళ్ళి తలుపులు మూసికొనుడు. ప్రభువు కోపము చల్లారువరకును కొంతకాలముపాటు అచట దాగుకొనుడు.
21. అదిగో! భూలోకవాసులు చేసిన పాపములనుగాంచి, వారిని దండించుటకుగాను ప్రభువు తన నివాసమునుండి వేంచేయుచున్నాడు చూడుడు. భూమిమీద రహస్యముగా జరిగిన హత్యలన్నియు వెల్లడియగును, ఎవరెవరు మృతులైరో తెలిసిపోవును.
1. ఆ దినమున ప్రభువు పదునును, గట్టి తనమునుగల తన మహాఖడ్గముతో చుట్టజుట్టు కొని నుండు మహాసర్పమును, వక్రముగా నుండు మకరమును దండించును. సముద్రముననున్న ఘటసర్పమును శిక్షించును.
2. ఆ దినమున ప్రభువు ఆనందప్రదమైన తన ద్రాక్షతోటను గూర్చి ఇట్లు పాడును:
3. "ప్రభుడనైన నేను ఆ తోటను సంరక్షింతును. నిరంతరము దానికి నీరుకట్టుదును. రేయింబ వళ్ళు దానిని కాపాడుచు ఎవరును దానికి కీడు చేయకుండునట్లు చూతును.
4. ఆ తోటమీద నాకిప్పుడు ఎట్టి కోపమునులేదు. దానిలో ముండ్లుతుప్పలు ఎదిగెనేని, నేను వానితో పోరాడి వానిని భస్మము చేసెదను.
5. కాని ఆ ముండ్లును తుప్పలును నా రక్షణమును ఆశించినచో నాతో సంధి చేసికోవలెను, నాతో సమాధానపడవలెను.”
6. రాబోవు దినములలో యాకోబు వేరూరును. యిస్రాయేలు చిగుర్చి పూలుపూయును. లోకమంతయు దానిపండ్లతో నిండిపోవును
7. ప్రభువు యిస్రాయేలును వారి శత్రువులను శిక్షించినంత ఘోరముగా శిక్షింపలేదా? వారి విరోధులను వధించినట్లుగా వధింపలేదా?
8. ప్రభువు తన ప్రజను ప్రవాసముతో శిక్షించెను. తూర్పునుండి వచ్చు సుడిగాలి వారిని వెన్నాడెను.
9. యిస్రాయేలు తన దోషములకు ప్రాయశ్చిత్తము చేసికొని పాపపరిహారము పొందుమార్గమిది. వారు తమ బలిపీఠముల శిలలను సుద్దవలె పొడిచేయవలెను. అషేరా దేవతా స్తంభములను, ధూపపీఠములను కూల్చివేయవలెను.
10. సురక్షిత పట్టణము ధ్వంసమైనది. జనులు దానిని ఎడారివలె పరిత్యజించిరి. అది గొడ్లకు పచ్చిక పట్టయినది. పశువులు అచట విశ్రమించును, మేతమేయును.
11. చెట్లకొమ్మలు ఎండి విరిగిపోయినవి. స్త్రీలు వానిని వంటచెరకుగా ప్రోగుజేసికొందురు, ఈ ప్రజలకు జ్ఞానము లేదయ్యెను. కావున వారిని సృజించిన దేవుడు వారిని కరుణింపడు, అనుగ్రహింపడు.
12. ఆ దినమున ప్రభువు యూఫ్రటీసు నది నుండి ఐగుప్తునది వరకును కళ్ళము సిద్ధము చేసి ధాన్యము తొక్కించును. యిస్రాయేలీయులారా! ప్రభువు మీలో ఒక్కొక్కనిని పొట్టునుండి ధాన్యమును వలె వేరుజేయును. మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.
13. ఆ దినమున గొప్ప బాకానూదుదురు. అప్పుడు అస్సిరియాలో నాశనముకానున్న ప్రజలును ఐగుప్తున చెల్లాచెదరైయున్న జనులును, తిరిగివత్తురు. వారు యెరూషలేమున పవిత్రపర్వతముపై ప్రభువును ఆరాధింతురు.
1. ఎఫ్రాయీము త్రాగుబోతుల గర్వపు పుష్పకిరీటము నాశనమగు కాలము వచ్చినది. సారవంతమైన లోయకెదురుగా , నిల్చియుండి యిస్రాయేలు రాజ్యవైభవమును సూచించెడు నగరము పూవువలె వాడిపోవును. తప్ప గి తూలిపడిపోయియున్నవారు నాశనమగుదురు.
2. ప్రభువు బలాఢ్యుడైన వీరుని వారిమీదికి పంపెను. అతడు వడగండ్ల వానవలెను, తన సర్వమును ధ్వంసముచేయు తుఫానువలెను, ఉధృతముగాపారు మహాప్రవాహమువలెను వచ్చి దేశమును కూలద్రోయును.
3. ఎఫ్రాయీము త్రాగుబోతుల గర్వపు కిరీటమును ఆయన తన కాలితో తొక్కివేయును.
4. సారవంతమైన లోయకెదురుగా నిలిచియుండి, యిస్రాయేలు రాజ్యవైభవమును సూచించునదియు, మంచి పూవువలె వాడిపోయినదియు అగు నగరమువలెను, ఋతువు రాకముందే పండిన తొలి అంజూరపు పండును అని ఒకడు చూచినవెంటనే, తన చేతిలోనికి తీసికొని గబాలున మ్రింగివేయు చందమున నాశనమగును.
5. ఆ కాలమున సైన్యములకధిపతియైన ప్రభువు తన ప్రజలలో మిగిలియున్న వారికి అందమైన కిరీటమగును. సుందరమైన మకుటమగును.
6. ఆయన న్యాయస్థానమున న్యాయాధిపతులకు, తీర్పుతీర్చ నేర్పును, ఆత్మను దయచేయును. నగరద్వారమువద్ద పోరాడుచు శత్రువులను త్రిప్పికొట్టు వీరులకు పరాక్రమమును ఒసగును.
7. యాజకులు, ప్రవక్తలు ఘాటయిన మద్యము సేవించి మతికోల్పోయిరి. వారు తప్ప త్రాగి మైకముతో తూలుచున్నారు. ఘాటైన మద్యమువలన వారు తూలుతున్నారు. వారు తప్ప గి ఉన్నందున దర్శనములు కలిగినప్పుడు తూలుదురు. న్యాయము చెప్పవలసి వచ్చినపుడు జారిపడుదురు.
8. వారు కూర్చున్న తావులన్నియు వారి వాంతుల వలన మలినమైనవి. శుభ్రమైన స్థలమొక్కటియు లేదు.
9. “ఇతడు తానెవరికి బోధచేయుచున్నాననుకొనుచున్నాడో? ఇతని ఉపదేశములెవరికి కావలెను? ఇప్పుడే చనుబాలు మానిన చిన్న బిడ్డలకా?
10. ఇతడు మనకు ఆజ్ఞ మీద ఆజ్ఞను, సూత్రము మీద సూత్రమును, కొంచెమిక్కడను, కొంచెమక్కడను బోధించుచున్నాడు” అని వారనుకొనుచున్నారు.
11. సరే, ప్రభువు ఈ ప్రజలతో అన్యదేశీయుల భాషలో నత్తినత్తిగా మాట్లాడును. అయినను వారు వినరైతిరి.
12. ఆయన మీకు విశ్రాంతి నొసగెను. “అలసిపోయినవారు విశ్రాంతి చెందుడు” అని చెప్పెను. కాని మీరు ఆయన మాట వినరైతిరి.
13. కావున ప్రభువు మీకిప్పుడు ఆజ్ఞమీద ఆజ్ఞను, సూత్రము మీద సూత్రమును, కొంచెమిక్కడను, కొంచెమక్కడను బోధించును. మీరు నడచుచు వెనుకకు మొగ్గి వెల్లకిలపడుదురు. మీరు గాయపడి వలలో చిక్కి బందీలగుదురు.
14. యెరూషలేమున ప్రజలను ఏలెడి, అపహాసకులారా! మీరు ప్రభువు పలుకులు వినుడు.
15. “మేము మృత్యువుతో నిబంధన చేసికొంటిమి. పాతాళలోకముతో ఒప్పందము చేసికొంటిమి. నాశనకరమైన మహాప్రవాహము వచ్చినపుడు మమ్ము బాధింపజాలదు. మేము అబద్దము నాశ్రయించితిమి, అసత్యము మరుగుజొచ్చితిమని మీరు ప్రగల్భములు పలుకుచున్నారు.
16. కాని ప్రభువైన యావే ఇట్లనుచున్నాడు: “సియోనున పునాదిరాయినీ వేసినవాడను నేనే. అది పరీక్షకు నిలిచిన రాయి. ఆ మూలరాయి అమూల్యమైనది, పటిష్ఠమైనది. విశ్వసించువాడు చలింపడు.
17. ఆ పునాది రాతికి ఆ న్యాయము కొలనూలుగానుండును. నీతి లంబసూత్రముగానుండును. మరల దుష్టాధికారులను గూర్చి వడగండ్లవాన మీ అబద్దములనెడు కుటీరమును కూల్చివేయును. ప్రవాహము మీ ఆశ్రయస్థానమును కూలద్రోయును”.
18. మీరు మృత్యువుతో చేసికొనిన ఈ నిబంధనము వమ్మగును. పాతాళముతో చేసికొనిన , ఒప్పందము వ్యర్థమగును. నాశనకరమైన ప్రవాహము వచ్చినపుడు అది మిమ్ము హతము చేసి తీరును.
19. ఆ ప్రవాహము మిమ్ము మాటిమాటికి తాకును. ప్రతి ఉదయము మిమ్ము బాధించును. ఈ విషయమునర్ధము చేసికొందురేని మీరు భయకంపితులగుదురు.
20. 'కాళ్ళుచాచుకొనుటకు మంచము కురచ, కప్పుకొనుటకు కంబళి వెడల్పుచాలదు' అను సామెత మీపట్ల నెరవేరితీరును.
21. ప్రభువు పెరాసీముకొండ మీదవలె యుద్ధము చేయును. గిబ్యోను లోయయందువలె పోరాడును. ఆయన విచిత్రమైన కార్యము చేయును. ఆశ్చర్యకరమైన చెయిదము సల్పును.
22. కావున మీ అపహాసములిక చాలింపుడు. లేదేని మీ బంధములు మరి అధికముగా బిగుసుకొనును. సైన్యములకధిపతియగు ప్రభువు నిఖిలదేశమును నాశనము చేయుదునని ప్రకటనము చేయగా నేనువింటిని.
23. నా మాటలను జాగ్రత్తగా వినుడు. నా పలుకులను అవధానముతో గ్రహింపుడు.
24. సేద్యగాడు విత్తుటకుగాను నిరంతరము పొలము దున్నుచునేయుండునా? ఎల్లవేళల మట్టి పిల్లలు పగులగొట్టుచునే యుండునా?
25. అతడు పొలము చదునుచేసిన పిమ్మట నల్లజీలకర్రగాని, తెల్లజీలకర్రగాని చల్లునుగదా! గోధుమలు చాళ్ళుగా విత్తును. యవలను సిద్ధపరిచిన పొలములో ఇతర మొక్కలను గట్టున వేయునుగదా!
26. ప్రభువే సేద్యగానికి ఉపదేశముచేసి, అతడికి ఆ పని నేర్పించును.
27. సేద్యగాడు నల్లజీలకర్రను బరువైన పరికరముతో నూర్చడు. బండిచక్రములను జీలకర్రమీద నడిపింపడుగాని, కర్రచేత నల్లజీలకర్రను, చువ్వచేత జీలకర్రను దుళ్ళకొట్టునుగదా!
28. గోధుమలను మితిమీరి తొక్కించి పిండిచేయరు గదా? గింజలు నలిగి పోకుండునట్లుగనే వానిమీద బండిచక్రములు త్రిప్పుదురు.
29. సైన్యములకధిపతియైన ప్రభువే ఈ పరిజ్ఞానమునుకూడ దయచేయును. ప్రభువు ప్రణాళికలు అద్భుతమైనవి. ఆయన కృత్యములు మహత్తరమైనవి.
1. అరీయేలునకు శ్రమ. దావీదు సైన్యము దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి. పండుగలు క్రమముగా జరుగనీయుడి.
2. ప్రభువే దైవపీఠము అనబడు అరీయేలు నగరమును ముట్టడించును. ప్రజలెల్లరు విలపించి దుఃఖింతురు. అప్పుడు నగరము బలితోగూడిన పీఠమువంటిదగును.
3. ప్రభువు ఈ పట్టణముమీద దాడిచేసి, దీనిచుట్టు శిబిరముపన్ని ముట్టడిమంచెలు కట్టును.
4. అప్పుడు నీవు అణచబడి , నేలనుండి పలుకుచుందువు. నీ మాటలు నేలనుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. దయ్యము స్వరమువలె నీ స్వరము నేలనుండివచ్చును. నీ పలుకులు ధూళినుండి గుసగుసలువలె వినబడును.
5. యెరూషలేము మీదికెత్తివచ్చిన అన్యజాతి ప్రజలు ధూళివలె ఎగిరిపోవుదురు. భయంకరమైన వారి సేనలు పొట్టువలె లేచిపోవును.
6. దిఢీలున సైన్యములకధిపతియైన ప్రభువు యెరూషలేమును ఆదుకొనును. ఉరుములు భూకంపములు, భీకరనాదములతో, సుడిగాలితో, తుఫానుతో, జ్వలించు అగ్నితో ఈ నగరమును రక్షించును.
7. అప్పుడు దేవునిపీఠము అనబడు యెరూషలేమును ముట్టడించిన అన్యజాతి సైన్యములెల్ల, వారి ఆయుధసామాగ్రితోపాటు కలవలెను, కలలో కనిపించిన దృశ్యమువలెను కరగిపోవును.
8. సియోనుకొండను ముట్టడించిన అన్యజాతి సైన్యములగతి, ఆకలిగొనినవాడు తాను భోజనము చేయుచున్నట్లు కలగాంచి నకనకలాడు కడుపుతో నిద్రమేల్కొనిన చందమగును. దప్పికగొనినవాడు తాను నీరుత్రాగుచున్నట్లు కలగాంచి ఎండిన గొంతుకతో నిద్రమేల్కొనిన చందమగును.
9. జనులారా! మీరు విస్మయముననే మునిగియుండుడు. గ్రుడ్డివారుగనే కొనసాగుడు. ద్రాక్షారసమును సేవింపకయే మత్తులుకండు. మద్యమును పుచ్చుకొనకయే తూలిపడుడు.
10. ప్రభువు, మిమ్ము నిద్రపరవశులను గావించెను. కనుక ప్రవక్తలుగా ఉండవలసిన మీరు దర్శనములు చూడకుండునట్లు చేసెను. దీర్ఘదర్శులుగా ఉండవలసిన మీరు దైవసందేశమును గ్రహింపకుండునట్లు చేసెను.
11. దైవసందేశము మీకు మూసివేయబడిన పుస్తకమువంటిదైనది. మీరు చదువుకొనిన వానివద్దకు దానిని కొనిపోయి “చదువుము” అని అడిగినచో, అతడు “ఇది మూసివేయబడి ఉన్నది. కనుక నేను చదువజాలను” అని చెప్పును.
12. చదువురాని వాని వద్దకు దానిని కొనిపోయి “చదువుము” అని అడిగినచో అతడు “నాకు చేతగాదు” అని చెప్పును.
13. ప్రభువిట్లనెను: “ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకువచ్చుచున్నారు. కేవలము పెదవులతో నన్ను శ్లాఘించుచున్నారు. వీరి హృదయములు నాకు దూరముగానున్నవి. వీరు తాము కంఠతఃనేర్చుకొనిన నరుల శాసనములే మతమనుకొనుచున్నారు.
14. కావున నేను వీరిని దెబ్బమీద దెబ్బకొట్టి వీరి గుండెలదరునట్లు చేయుదును. వీరి జ్ఞానుల జ్ఞానమంతరించును. వీరి పండితుల తెలివి సమసిపోవును.
15. తమ పన్నాగములను దేవుని కంటబడకుండ దాచియుంచువారు నాశనమగుదురు. వారు రహస్యముగా దుష్కార్యములుచేసి “మమ్మునెవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియును?” అని ఎంతురు.
16. వారు విషయమును తలక్రిందులు చేయుచున్నారు కుమ్మరి మట్టికంటె అధికుడుకాడా? నరుడు చేసిన వస్తువు ఆ నరునితో “నీవు నన్ను చేయలేదు” అని చెప్పునా? కుండ తనను చేసిన కుమ్మరితో “నీకు తెలివిలేదు” అని పలుకునా?
17. సామెత చెప్పినట్లు కొద్దికాలములోనే అడవి సేద్యపునేల అగును. సేద్యపునేల అడవి అగును.
18. ఆ దినమున చెవిటివారు గ్రంథములోని వాక్యములను చదువగా విందురు. కారుచీకటిలోనున్న గ్రుడ్డివారు కన్నులువిప్పి చూతురు.
19. దీనులు మరల ప్రభువునుగాంచి ఆనందింతురు. దరిద్రులు పవిత్రుడైన యిస్రాయేలు దేవుని చూచి సంతసింతురు.
20. పరపీడకులును, దేవుని గేలిచేయువారును చత్తురు. దుష్టకార్యములకు పాల్పడువారందరును నశింతురు.
21. అన్యులమీద చాడీలు చెప్పువారును, దుష్టులకు దండనము విధింపకుండ అడ్డుపడువారును, కల్లలాడి సజ్జనులకు న్యాయము జరుగనీయని వారును అడపొడ గానరాకుండ బోవుదురు.
22. కావున యాకోబు దేవుడును, అబ్రహాముని అపాయమునుండి తప్పించినవాడును అగు ప్రభువు ఇట్లనుచున్నాడు: “ఇకమీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు.
23. నేను వారినడుమ చేసిన కార్యములుచూచి వారిసంతానము నన్ను పవిత్రునిగానెంచి పూజించును. వారు నన్ను కొలుతురు. నా నామమును పవిత్రపరచుదురు. నన్ను గాంచి భయపడుదురు. యిస్రాయేలు దేవుని మాహాత్మ్యమును గాంచెదరు.
24. మందమతులు వివేకముబడయుదురు, సణుగుకొనువారు ఉపదేశమును స్వీకరింతురు.”
1. ప్రభువు ఇట్లనెను: “అయ్యో! నన్నెదిరించు ప్రజలకు అనర్ధము. వారు నేను చేయని నిర్ణయములను పాటించుచున్నారు. నా యాత్మ అనుమతింపని నిబంధనలను చేసికొనుచున్నారు. ఆ రీతిగా నిరంతరము పాపము కట్టుకొనుచున్నారు.
2. వారు నన్ను సంప్రతింపకయే ఐగుప్తునకు వెళ్ళుచున్నారు. ఫరో రక్షణ బడయవలెనని వారి కోరిక.
3. కాని ఐగుప్తు మరుగుజొచ్చినందుకు మీరు సిగ్గుపడుదురు. ఫరో రక్షణ ఆశించినందులకు అవమానము చెందుదురు.
4. వారి మంత్రులప్పుడే సోవానును చేరుకొనిరి. వారి రాయబారులు హానేసులో ప్రవేశించిరి.
5. నిరుపయోగమైన ప్రజను నమ్ముకొనినందుకు, తాము ఆశించిన సాయము చేయజాలక తమను అవమానమున ముంచు జనులను నమ్ముకొనినందుకు వారెల్లరును సిగ్గుపడుదురు.”
6. దక్షిణపు ఎడారి నేగేబు ప్రదేశములోని మృగములను గూర్చి దైవోక్తి: కష్టమునకును, అపాయమునకును నిలయమైన దేశముగుండ రాయబారులు ప్రయాణము చేయుచున్నారు. అచట సింగములును, గర్జించుసింహములును ఉండును. విషసర్పములును, మిన్నాగులును ఉండును. వారు తమకు ఉపయోగపడని జాతియొద్దకు గాడిదలపైన, ఒంటెలపైన బహుమతులు మోయించుకొని పోవుచున్నారు.
7. ఐగుప్తుచేయు సహాయము ఎందుకును పనికిరాదు కావుననే 'ఏమియు చేయజాలని రహాలు భూతము' అని నేను ఐగుప్తునకు పేరిడితిని.
8. ప్రభువు ప్రజలు చూచుచుండగనే నన్ను ఈ సందేశమును వ్రాతపరికరములపై వ్రాయుమని చెప్పెను. భావితరముల వారికి ఈ ప్రజలు ఎట్టివారో తెలియచేయుటకు ఈ వ్రత శాశ్వతముగా ఉపయోగపడును.
9. ఈ ప్రజలు దేవునిమీద తిరుగుబాటుచేయువారు, అబద్దమాడువారు, ప్రభువు సందేశమును విననివారు.
10. వీరు ప్రవక్తలతో “మీరు దర్శనములు చూడవలదు. దీర్ఘదర్శులు సత్యము చెప్పవలదు. మీరు మాకు ప్రీతికలిగించు సంగతులు చెప్పుడు, కల్లబొల్లి దర్శనములు తెలియజేయుడు.
11. మీరు మా త్రోవకు అడ్డుగా నిలవకుడు. ఆ యిస్రాయేలు పవిత్రదేవునిగూర్చి మాతో మాటలాడకుడు” అని పలుకుదురు.
12. కావున యిస్రాయేలు పవిత్రదేవుడు ఇట్లనుచున్నాడు: “మీరు నా హెచ్చరికను నిరాకరించి మోసమును, దౌర్జన్యమును అంగీకరించితిరి.
13. కనుక దోషులైతిరి. ఎత్తయిన గోడ నిలువుననెఱ్ఱె విచ్చి, దిడీలున కూలిపోవునట్లుగా మీరును కూలుదురు.
14. మట్టికుండను ముక్కలుముక్కలుగా పగులగొట్టగా ఊటనుండి నీటిని తెచ్చుటకు గాని, పొయ్యినుండి నిప్పుకణికలు తెచ్చుటకు గాని ఆ ముక్కలలో ఒక్కటియు పనికిరాదు. మీరును ఇట్లే అగుదురు.
15. మీరు నాయొద్దకు తిరిగివచ్చి నెమ్మదిగా ఉందురేని, సురక్షితముగా మనుదురు. నన్ను నమ్మి నెమ్మదిగా ఉండుటలోనే మీ బలము ఇమిడియున్నది” అని పవిత్రుడైన యిస్రాయేలు మహాప్రభువు మీతో చెప్పుచున్నాడు. కాని మీరు అందులకు అంగీకరించుటలేదు.
16. మీరు “గుఱ్ఱములనెక్కి పారిపోవుదము” అనుకొనుచున్నారు. సరే, మీరు కోరినట్లే పారిపోవుదురు! మీరు మీ గుఱ్ఱములు వేగముగా పోవుననుకొనుచున్నారు, కాని మీ వెంటబడువారు అంతకంటెను వేగముగా వత్తురు.
17. ఒక్క శత్రువును చూచి మీలో వేయిమంది పారిపోవుదురు. ఐదుగురు శత్రువులను చూచి మీరెల్లరు దౌడు తీయుదురు. కడన కొండమీద పాతిన జెండా కఱ్ఱ తప్ప, మీ సైన్యమున ఏమియు మిగులదు.
18. కాని ప్రభువు మీపట్ల దయజూపుటకు వేచియున్నాడు. మిమ్ము కరుణించుటకు సిద్ధముగానున్నాడు. ప్రభువు న్యాయవంతుడు. అతనిని నమ్మువారు ధన్యులు.
19. యెరూషలేము వాసులారా! మీరిక విలపింప నక్కరలేదు. మీరు ప్రభువును సహాయము చేయుమని అర్థించినపుడు, ఆయన దయతో మీ మొరవినును.
20. ప్రభువు మిమ్ము కష్టములపాలు చేయును. కాని ఆయన మీకు మరుగుకాడు. మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షముగా చూతురు.
21. మీరు త్రోవదప్పి కుడివైపునకుగాని, ఎడమ వైపునకుగాని జరిగినప్పుడు “త్రోవ యిది, మీరీ మార్గమున నడువుడు” అని ఆయన స్వరము వెనుక నుండి మిమ్ము హెచ్చరించును.
22. మీరు వెండి బంగారములతో తాపడము చేసిన మీ విగ్రహముల వస్త్రములను ఈసడింతురు. వీని పీడ ఇంతటితో 'వదలినది' అనుకొని వానిని విసరిపార వేయుదురు.
23. మీరు పైరులు వేసినపుడు ప్రభువు వానలు కురిపించును. కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశువుల మందలు విశాలమైన పచ్చికపట్టులలో మేయును.
24. మీ పొలములు దున్ను ఎడ్లును, గాడిదలును మేలైన తిండి తినును.
25. ఆ దినమున మీరు శత్రువుల పట్టణ ములు ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అపుడు ప్రతి ఉన్నత పర్వతమునుండి వాగులు, నదులు పారును.
26. అపుడు చంద్రుడు సూర్యునివలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే, ఏడురెట్లు అదనముగా వెలుగును. ఆ కాంతి ఏడుదినముల సూర్య ప్రకాశము ఏకమైనట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టుకట్టును. వారి దెబ్బలను నయము చేయును.
27. ప్రభువు శక్తి దూరము నుండి విచ్చేయుచున్నది. ఆయన కోపము నిప్పువలె మండుచున్నది. దట్టమైన పొగవలె రాజుకొనుచున్నది. ఆయన పెదవులు ఆగ్రహపూరితములై ఉన్నవి. ఆయన నాలుక జ్వలించు అగ్నివలెనున్నది.
28. ఆయన శ్వాసము నిండుగా పొర్లిపారు ఏరువంటిది. అది జాతులన వినాశనమను జల్లెడతో జల్లించును వారి నోటికి కళ్ళెము పెట్టును.
29. మీరు ఉత్సవ రాత్రులందువలె సంతసముతో పాటలు పాడుదురు. వేణునాదము ఆలించుచు యిస్రాయేలు రక్షకుడైన ప్రభువు పర్వతమునకు యాత్రచేయువారివలె ఆనందము నొందుదురు.
30. ప్రభువు తన మహాధ్వానమును ఎల్లరికిని విన్పించును. తన కోపమెల్లరును చవిచూచునట్లు చేయును. అగ్నిజ్వాలలును, కుంభవర్షములను, వడగండ్ల వానలును, ప్రవాహములును నెలకొనును.
31. ప్రభువు భీకరనాదమువిని అస్సిరియా భీతిల్లును. అది ఆయన దండతాడనమునకు తల్లడిల్లును.
32. ప్రభువు అస్సిరియా ప్రజలను దెబ్బమీద దెబ్బకొట్టగా, ఆయన ప్రజలు డప్పులు తంత్రీవాద్యములతో తాళము వేయుదురు . ప్రభువు అస్సిరియాతో స్వయముగా పోరాడును.
33. పూర్వమే 'తోపెతు' అను ఒక చోటును సిద్ధము చేసియుంచిరి. అందలి అగ్ని అస్సిరియా రాజును దహించును. అది లోతుగా, వెడల్పుగా ఉన్న గుంత. దానిలో కట్టెలను పేర్చియుంచిరి. ప్రభువు శ్వాస గంధక ప్రవాహమువలె వచ్చి దానికి నిప్పంటించును.
1. ఐగుప్తును సహాయమర్ధింపబోవువారు నశింతురు. వారు ఐగుప్తు అశ్వములను, బలాడ్యులైన పదాతులను, అధికసంఖ్యాకములైన రథములను నమ్ముచున్నారు, కాని యిస్రాయేలు పరిశుద్ధదేవుని నమ్ముటలేదు. ఆయనను సంప్రతించుట లేదు.
2. ఆయన వివేకవంతుడు. ఆయన నాశనమును రప్పించును. ఆయన ఆడినమాట తప్పక దుష్టులదండించును. దుర్మార్గులను కాపాడువారిని శిక్షించును.
3. ఐగుప్తీయులు నరమాత్రులే గాని దైవములుకారు. వారి గుఱ్ఱములు మాంసమయములే గాని ఆత్మ గావు. ప్రభువు శిక్షించుటకు తన చేయిచాచినపుడు సాయము చేయువారును, సాయము పొందువారును కూలుదురు. ఎల్లరును మూకుమ్మడిగా చత్తురు.
4. ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: సింగము లేదా సింగపుకొదమ తానుపట్టిన యెర దగ్గర నిలుచుండి గర్జించునే కాని, తనచుట్టుగుమికూడిన కాపరులను చూచి వెరవదు వారి బెదరింపులకును, అరపులకును దడియదు. ఆ రీతిగానే సైన్యములకధిపతియైన ప్రభువు సియోను కొండను, దాని శిఖరమును కాపాడుటకు పోరుసల్పును.
5. పక్షి తనపిల్లలమీద రెక్కలు విప్పి, వానిని కాపాడినట్లే సైన్యములకధిపతియైన ప్రభువు యెరూషలేమును కాపాడును. దానిని శత్రువులకు చిక్కకుండ రక్షించి భద్రముగా మనజేయును.
6. నామీద తీవ్రముగా తిరుగుబాటుచేసిన యిస్రాయేలీయులు నా యొద్దకు తిరిగి రావలెను.
7. ఆ దినమున మీరు వెండిబంగారములతో స్వయముగా జేసికొనిన పాపపు విగ్రహములనెల్ల ఆవల పారవేయుదురు.
8. “అస్సిరియా కత్తివాతబడును, కాని ఆ కత్తి నరులు వాడునది కాదు. నరులు వాడని ఖడ్గమునకు అది బలియగును. అస్సిరియా జనులు పోరునుండి పారిపోవుదురు. వారి యువకులు బందీలగుదురు.
9. వారి రాజు భయపడి పారిపోవును. వారి అధిపతులు వెరగొంది తమ జెండాలను వదలివేయుదురు”. ఇది ప్రభువు వాక్కు. సియోనున ఆయన అగ్నియు, యెరూషలేమున ఆయన కొలిమియు ఉన్నవి.
1. ఇదిగో వినుడు. రాజు నీతితో పరిపాలించును. అధిపతులు న్యాయముతో ఏలుదురు.
2. వారు గాలినుండి తప్పించుకొను గుడి సెవలెను, గాలివాననుండి తప్పించుకొను ఆశ్రయమువలెను ఉందురు. మరుభూమిలో పారెడుకాలువలవలెను. ఎడారిలో నీడనిచ్చు పెద్దబండవలెను ఒప్పుదురు.
3. చూచువారి కన్నులు జాగ్రత్తగా చూచును. వినువారి చెవులు అవధానముతో వినును.
4. తొందరపడువారు వివేకముతో ప్రవర్తింతురు. నత్తివారు స్పష్టముగా మాటలాడుదురు.
5. మందమతిని ఘనునిగా ఎంచరు. దుర్మార్గుని సజ్జనునిగా గణింపరు.
6. మూర్ఖుడు మూరముగా మాట్లాడును, దుష్కార్యములు చేయనెంచును. అతడు దుష్టవర్తనమునకు పాల్పడును ప్రభువును గూర్చి చెడుగా మాట్లాడును. అతడు ఆకలిగొనిన వారికి అన్నము పెట్టడు. దప్పిక గొనినవారికి దాహమీయడు.
7. మూర్ఖుడు దుష్టుడు, దుష్కార్యములు చేయువాడు. అతడు కొండెములతో పేదలను నాశనము చేయుటకు పన్నాగములు పన్నును. వారికి న్యాయము జరుగనీయడు.
8. కాని సజ్జనుడు యోగ్యముగా ప్రవర్తించును. యోగ్యుడుగా మనును.
9. హాయిగా కాలము వెళ్ళబుచ్చు ఉవిదలారా! రెండు, నా పలుకులులాలింపుడు! చీకు చింతలేని మహిళలారా! నా మాటలు వినుడు!
10. మీరిపుడు నిశ్చింతగా ఉన్నారు గాని ఒక యేడాది గడవకమునుపే . మీరు తల్లడిల్లుదురు. ద్రాక్షపంట అడుగంటును. ద్రాక్షపండ్లు సేకరించు కాలము ఇక రాదు.
11. హాయిగా కాలము వెళ్ళబుచ్చు మీరు భీతిల్లుడు. చీకు చింతలేని మీరు గడగడ వణకుడు. మీ వస్త్రములను తొలగించి గోనె ధరింపుడు.
12. మీ రొమ్ములు బాదుకొనుడు. సారవంతమైన పొలములు, ద్రాక్షతోటలు నాశనమైనవి.
13. నా జనుల పొలములలో ముండ్లపొదలు ఎదుగుచున్నవి. సుఖప్రదమైన గృహములును, సంతోషప్రదమైన నగరమును పాడువడినవి.
14. రాజ ప్రాసాదమును విడనాడిరి. జనసమర్థమైన పట్టణమును పరిత్యజించిరి. కోటలును, బురుజులును ధ్వంసమైనవి. అడవి గాడిదలచట తిరుగాడును. గొఱ్ఱెలకు ఆ చోటు పచ్చిక పట్టగును.
15. ప్రభువు పైనుండి తన అనుగ్రహమును మనమీద కురియించును. ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారును. పొలములలో పంటలు పుష్కలముగా పండును.
16. ఎడారిలో న్యాయము నెలకొనును. పంట పొలములలో నీతి నిలుచును.
17. నీతివలన శాంతి కలుగును. నీతివలన నిత్యము నమ్మకము, నిబ్బరము కలుగును.
18. దేవుని ప్రజలు చీకుచింతలేకుండ శాంతి సమాధానములతో జీవింతురు.
19. అరణ్యము వడగండ్లచే నాశనమగును. పట్టణము ధ్వంసమగును.
20. ప్రజలెల్లరు ఏటి దాపున పైరులు వేసికొనుచు ఎడ్లను, గాడిదలను పచ్చికపట్టులలో త్రిప్పుచు ఆనందముతో జీవింతురు.
1. ఇతరులు తమను దోచుకొనకున్నను తాము ఇతరులను దోచుకొనువారు, ఇతరులు తమకు ద్రోహము చేయకున్నను తాము ఇతరులకు ద్రోహము చేయువారు నాశనమగుదురు. మీ దోపిడియు మీ ద్రోహములును ఇక ముగియును. ఇప్పుడు మిమ్ము ఇతరులు దోచుకొందురు. మీకు ఇతరులు ద్రోహము చేయుదురు.
2. ప్రభూ! నీవు మమ్ము కరుణింతువు. మేము నిన్ను నమ్మితిమి. ప్రతిరోజు నీవు మాకు అండగా నుండుము. ఆపదలలో మమ్ము ఆదుకొనుము.
3. నీవు జాతులను బెదిరింపగా వారు పారిపోవుదురు. నీవు పోరాడుటకు లేవగా జనులు చెల్లాచెదరు అగుదురు.
4. అన్యులు మిడుతల దండువలె ఎగిరి, ఆ జనులు విడచిపోయిన కొల్లసొమ్మును చీడపురుగులు కొట్టివేయునట్లు దోచుకుందురు.
5. ప్రభువు ఉన్నతుడయ్యెను. అతడు ఆకసమునుండి పరిపాలనము చేయును. సియోనును నీతిన్యాయములతో నింపును.
6. ప్రజలకు స్థిరత్వము నొసగును. జనులకు వివేకవిజ్ఞానములు దయచేసి , వారిని కాపాడును. వారి నిధి దైవభీతియే.
7. శూరులు సహాయమును అర్ధించుచున్నారు. శాంతికాముకులైన రాయబారులు శోకించుచున్నారు.
8. ప్రజలు రహదారులను విడనాడిరి. వానిగుండ ఎవరు ప్రయాణము చేయుటలేదు. జనులు నిబంధనములను మీరుచున్నారు. ఒప్పందములను భగ్నము చేయుచున్నారు. వారెవరిని గౌరవముతో చూచుటలేదు.
9. ప్రజలు పొలములను సాగుచేయక వదలివేసిరి. లెబానోను అడవులు వాడిపోయినవి. షారోను లోయ ఎండి ఎడారి అయినది. బాషాను, కర్మేలు మండలములలో చెట్ల ఆకులురాలినవి,
10. ప్రభువు జాతులతో ఇట్లనుచున్నాడు: “నేనిప్పుడు పనికి పూనుకొందును. మీ ఎదుట నా శక్తిని పరిపూర్ణముగా ప్రదర్శింతును.
11. మీరు పన్నుపన్నాగములు వట్టిపొట్టు, వట్టిచెత్త. మీ ఊపిరియే అగ్నివలె మిమ్ము దహించును.
12. నేను మిమ్ము కాల్చి సున్నము చేయుదును. నరికిన ముండ్ల పొదలవలె మిమ్ము కాల్చుదును.
13. దూరముననున్నవారు నేనేమి చేసితినో తెలిసికొందురు గాక! దగ్గరలో నున్నవారు నా శక్తిని గుర్తింతురుగాక!”
14. సియోనునందలి పాపులు వెరగొందుదురు. దుష్టులు భయముతో కంపింతురు. “మనలో నిత్యము ఈ జ్వలించు అగ్నితో నివసించుచు తట్టుకోగల వారెవరు? ఈ నిత్యాగ్నితో నివసించుచు భరింపగలవారెవరు?” అని వారు పలుకుదురు.
15. నీతితో జీవించువాడు, సత్యము చెప్పువాడు, పేదలను పీడించి సొమ్ము చేసికొననివాడు, లంచములకు చేయిచాచనివాడు, హత్య చేయువారితో పొత్తుకలవనివాడు, దుష్కార్యముల పొంతకు పోనివాడు,
16. ఉన్నత స్థలమున సురక్షితముగా వసించును. కొండమీది దుర్గమునందు వలె భద్రముగా జీవించును. అతనికి అన్నపానీయములకు లోటు ఉండదు.
17. మీరు విశాలమైన దేశమును, వైభవముగా ఏలు రాజును చూతురు.
18. మీరు పూర్వము మీకు భీతిపుట్టించిన సంగతులను జ్ఞప్తికి తెచ్చుకొందురు. “జనసంఖ్య వ్రాయువాడు ఎక్కడున్నాడు? తూకము వేయువాడు ఎక్కడున్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడున్నాడు?
19. గర్వాత్ములును, మీకర్థముకాని అనాగరికమైన నత్తిభాషను మాట్లాడు అన్యజాతి ప్రజలను మీరు మరల చూడబోరు.
20. ఉత్సవనగరమైన సియోనును చూడుడు, యెరూషలేమును తిలకింపుడు. అది సురక్షితమైన నగరము. అది మేకులు కదలక, త్రాళ్ళు తెగక, పదిలముగా నిల్చియుండు గుడారము వంటిది.
21. అచట ప్రభువు తన వైభవము మనకు చూపించును. మనము విశాలమైన నదులు, వాగులు పారు తావున వసింతుము. కాని వానిలో శత్రువుల నావలు పయనింపవు.
22. ఆ నావలలోని త్రాళ్ళు వదులుగా ఉన్నవి, వానిలోని కొయ్యస్తంభములను స్థిరముగా నిలబెట్టలేకున్నారు. తెరచాపలు ఎత్తలేకున్నారు.
23. మనము శత్రువుల కొల్లసొమ్మును దోచుకోవచ్చును. కుంటివారును ఆ సొత్తు చేజిక్కించుకోవచ్చును. ప్రభువే మనకు న్యాయాధిపతి, ధర్మశాస్త్ర ప్రదాత, రాజు, రక్షకుడు.
24. యెరూషలేమున వసించు ఏ ఒక్కడును ఆ “నాకు వ్యాధి సోకినది” అని చెప్పడు. ప్రభువు వారి పాపములను పరిహరించును.
1. సకలజాతి జనులారా! ఇటు దగ్గరికి వచ్చి వినుడు. సమస్త ప్రజలారా! ఆలింపుడు. భూమియు, దానిలోని వారందరును వినుడు. లోకమును, దానిలోని వారెల్లరును ఆలింపుడు.
2. ప్రభువు నిఖిలజాతులమీదను కోపించెను. వారి సైన్యములమీద ఆగ్రహము చెందెను. ఆయన వారిని నాశనము చేసి వధింపనెంచెను.
3. శత్రువుల శవములను ఖననముచేయక బయట పారవేయుదురు. వారి పీనుగుల నుండి దుర్గంధము వెలువడును. కొండలమీద వారి నెత్తురులు ఏరులుగా పారును.
4. సూర్యచంద్ర నక్షత్రములు నాశనమగును. ఆకాశమును లిఖితప్రతినివలె చుట్ట చుట్టుదురు. వాటి సైన్యమంత ద్రాక్షదళములవలెను, అంజూరపు ఆకులవలెను రాలిపోవును.
5. ప్రభువు ఆకాశమున తన ఖడ్గమును సిద్ధము చేసికొనెను. అది ఎదోముమీదికి దిగివచ్చును. ప్రభువు తాను నాశనముచేయగోరిన ప్రజలను వధించును.
6. ఎదోమీయుల నెత్తురును, క్రొవ్వును ప్రభువు ఖడ్గమునకు అంటుకొనును. ఆ దృశ్యము పొట్టేళ్ళను, మేకలను బలి ఈయగా, వాని నెత్తురును, క్రొవ్వును కత్తికి అంటుకొని ఉన్నట్లుగా ఉండును. ప్రభువు బోసానగరమున బలినర్పించును. ఎదోమున మహాసంహారము జరిపించును.
7. జాతులు ఎడ్లవలె కూలును. ప్రజలను కోడెలవలె వధింతురు. నేల నెత్తురులో నానును.భూమి క్రొవ్వుచే కప్పబడును.
8. ఇది ప్రభువు శత్రువులను శిక్షించుకాలము. సియోను రక్షకుడు తన విరోధులమీద పగతీర్చుకొనుకాలము.
9. ఎదోము నదులు కీలుగా మారిపోవును. అందలి భూమి గంధకమగును. ఆ దేశమంతయు కీలువలెమండును.
10. ఎదోము రేయింబవళ్ళును. కాలును. దాని పొగ నిరంతరమును పైకి లేచుచుండును. అది తరతరములవరకు మరుభూమిగా ఉండిపోవును. దాని గుండ ఎవడును ప్రయాణముచేయడు.
11. ముండ్లపందులును, గూడబాతులును అచట వసించును. గుడ్లగూబలును, కాకులును అచట తిరుగాడును. ప్రభువు ఆ నేలను చిందరవందరచేసి , ఎంత శూన్యము చేయును.
12. అచట రాజులు రాజ్యము చేయరు, నాయకులు అంతరింతురు.
13. అచటి ప్రాసాదములలో ముండ్ల పొదలెదుగును. అచటి కోటలలో గచ్చచెట్లు పెరుగును. నక్కలకును, నిప్పుకోళ్ళకును ఆ తావు వాసస్థలమగును.
14. అచట అడవి పిల్లులు దుమ్ములగొండ్లతో కలిసి తిరుగును. ఎడారి మేకలు ఒండొంటిని కలిసికొనును. అడవి పిట్ట విశ్రాంతి స్థలమును వెదకుకొనును.
15. కౌజులు గూళ్ళుకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలనుచేసి వానిని సంరక్షించుకొనును. రాబందులు ఒకదాని తరువాత ఒకటి వచ్చిచేరును.
16. ప్రభువు గ్రంథమును తిరుగవేసిచూడుడు. ఈ ప్రాణులలో ఒక్కటీ తప్పిపోదు. ప్రతిప్రాణియు తన జంటప్రాణితో కూడియుండును. ప్రభువే ఈ నియమము చేసెను. ఆయన స్వయముగా వానిని జతపరచెను.
17. ప్రభువు వన్యప్రాణులకు ఆ భూమిని పంచియిచ్చును. వానిలో ప్రతి దానికి ఆయన ఈ భూమిలో భాగమిచ్చును. . ఆ ప్రాణులు ఆ భూమిని స్వాధీనము చేసికొని కలకాలమచట వసించును.
1. ఎండిన ఎడారి సంతసించునుగాక! మరుభూమి ప్రమోదముచెంది, పుష్పించును గాక!
2. అది జాజిపూలు పూయునుగాక! సంతసముతో పాటలుపాడునుగాక! అది లెబానోనువలె వైభవముగా అలరారును. కర్మేలు, షారోను మండలములవలె సారవంతమగును. ఎల్లరును ప్రభువు వైభవమును గాంతురు. మన దేవుని తేజస్సును జూతురు.
3. దుర్బల హస్తములను బలపరుపుడు. గడగడ వణకు మోకాళ్ళకు సత్తువనిండు.
4. “మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, శత్రువులకు ప్రతీకారము చేయుటకును, విరోధులను శిక్షించి మిమ్ముకాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు” అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు.
5. అప్పుడు గ్రుడ్డివారు చూతురు. చెవిటివారు విందురు.
6. కుంటివారు లేడివలె గంతులువేయుదురు. మూగవారు సంతసముతో కేకలిడుదురు. మరుభూమిలో ఏరులు పారును.
7. ఎండిననేల సరస్సగును. మాడిననేలలో నీటి బుగ్గలు పుట్టును. పూర్వము నక్కలు వసించిన పొదలలో తుంగలును, జమ్ములును ఎదుగును.
8. అచట రాజపము ఒకటి నెలకొనును. దానిని 'పవిత్రపథము' అని పిలుతురు. పాపాత్ములు దానిగుండ పయనింపజాలరు. దానివెంట పోవువారిని మూడులు ప్రక్కకు త్రిప్పజాలరు.
9. ఆ మార్గమున సింగము కన్పింపదు. క్రూరమృగములు దానివెంట పయనింపవు. ప్రభువు రక్షించినవారు ఆ త్రోవగుండ నడతురు.
10. ఆయన రక్షించినవారు ఇంటికి తిరిగివత్తురు. ఉల్లాసముతో పాటలుపాడుచు మహానందముతో సియోనును చేరుకొందురు. వారు సంతోషముతోను, ప్రమోదముతోను వత్తురు. వారి దుఃఖవిషాదములెల్ల తొలగిపోవును.
1. హిజ్కియా పరిపాలనాకాలము పదు నాలుగవయేట అస్సిరియారాజగు సన్హరీబు యూదా రాజ్యములోని సురక్షిత పట్టణములను ముట్టడించి జయించెను.
2. అస్సిరియా రాజు యెరూషలేమును ముట్టడించుటకు లాకీషునుండి సైన్యాధిపతియగు రబ్షాకెను పెద్ద సైన్యముతో పంపెను. అతడు యెరూషలేము చేరుకొని ఎగువ చెరువునుండి వచ్చిన నీరు నిలుచు కోనేటివద్ద విడిదిచేసెను. అచ్చటనే చాకిరేవు కలదు.
3. హిల్కీయా కుమారుడును రాజప్రాసాదపాలకుడునగు ఎల్యాకీము, రాజాస్థాన కార్యదర్శియగు షెబ్నా, ఆసాపు కుమారుడును రాజలేఖకుడునగు యోవా వారివద్దకు వెళ్ళిరి.
4. అప్పుడు వారితో రబాకై “అస్సీరియా మహాప్రభువు మీ రాజుతో ఇట్లు చెప్పుము అని అనుచున్నాడు. 'ఓయి! నీవేమి చూచుకొని ఇంత మదించితివి?
5. యుద్ధము చేయుటకు నేర్పును, బలమును ఉండవలెనుకాని, వట్టి మాటలతో ఏమి ప్రయోజనము? నీవెవరిని నమ్ముకొని మామీద తిరుగబడితివి?
6. ఐగుప్తు నీకు తోడ్పడుననుకొంటివి కాబోలు! ఆ దేశమును నమ్ముకొనుట రెల్లుకాడను ఊతకఱ్ఱగా వాడుకొనుటయే. ఆ కాడ విరిగి చేతిలో గుచ్చుకొనును, ఐగుప్తురాజు ఫరోను నమ్ముకొను వారికి చేకూరు ఫలితము ఇంతియే.
7. ఒకవేళ మీరు మీ దేవుడైన యావే ప్రభువును నమ్ముకొంటిరేమో! కాని హిజ్కియా ఇక మీదట యూదావాసులును, యెరూషలేము పౌరులును యెరూషలేమున మాత్రమే ప్రభువును ఆరాధింప వలెనని ఆజ్ఞాపించి, ఎవరి ఉన్నత స్థలములను, బలి పీఠములను ధ్వంసముచేసెనో ఆయనే కదా యావే!
8. మా రాజు తరపున నేను మీతో పందెము వేయు చున్నాను వినుడు. నేను మీకు రెండువేల గుఱ్ఱములు ఉచితముగా ఇత్తును. కాని వానిని ఎక్కుటకు మీకు రెండు వేలమంది రౌతులు కలరా?
9. అటులకానిచో, నీవు మా అస్సిరియా సైన్యమున ఒక అత్యల్ప ఉద్యోగి నైనను ఎట్లు ఎదిరింపగలవు? అయినను ఐగుప్తు మీకు రథములను, గుఱ్ఱములను పంపునని కాచుకొని ఉన్నారు. ఎంత వెఱ్ఱి!
10. నేను యావే అనుమతి లేకయే నీ దేశముమీదికి దండెత్తివచ్చితినని అను కొంటివా? యావే ప్రభువు నన్ను నీ దేశముపై దండెత్తి మిమ్ము నాశనము చేయుమని చెప్పెను” అని పలికెను.
11. అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాలు రబ్బాకెతో "అయ్యా! నీవు మాతో అరమాయికు భాషలో మాట్లాడుము. మాకు ఆ భాష తెలియును. నీవు హీబ్రూభాషలో మాటలాడెదవేని గోడమీది జనులెల్లరు అర్థము చేసికొందురు” అని అనిరి.
12. కాని అతడు వారితో “మీతో, మీ రాజుతో మాత్రమే మాట్లాడుటకు మా ప్రభువు నన్నిటకు పంపెననుకొంటిరా! నేను ఆ గోడమీద కూర్చున్న వారితో గూడ మాట్లాడవలెను. మీవలెనే వారును అనతికాలములోనే తమ మల మూత్రములను తిని, తాగవలసివచ్చును” అనెను.
13. అంతట ఆ సైన్యాధిపతి లేచి నిలుచుండి జనులందరును వినునట్లు హీబ్రూభాషలో పెద్దగా ఇట్లుపలికెను: “ప్రజలారా! అస్సీరియా మహాప్రభువు పలుకులు వినుడు.
14. ఈ హిజ్కియా రాజు మిమ్ము మోసగించుచున్నాడు. అతడు ఏ విధముగానైనను మా రాజు దాడినుండి మిమ్ము కాపాడలేడు.
15. యావే వలన ఈ పట్టణము అస్సిరియారాజు చేతిలో చిక్కక పోవునని హిజ్కియా మిమ్ము నమ్మించుటకు చెప్పు మాటలను మీరు అంగీకరింపవలదు. మేము ఈ పట్టణమును పట్టుకొనకుండ మీ రాజు అడ్డుపడ జాలడు.
16. మీరు హిజ్కియా మాట వినవద్దు. మీరు మా రాజు వచనము లాలించి అతనికి లొంగిపొండు. అటుల చేసినచో మీరు మీ ద్రాక్షతోటలలో కాచిన పండ్లను భుజింతురు. మీ అంజూరముల మీద ఫలించిన ఫలములను తిందురు. మీ బావులలోని నీళ్ళు త్రాగుదురు.
17. అటుపిమ్మట మా రాజు వచ్చి మిమ్ము మరొక దేశమునకు కొనిపోయి, అచట మీకు స్థిరనివాసము కల్పించును. ఆ భూమి మీ భూమి వంటిదే. ఇక్కడవలె, అక్కడను ద్రాక్షలుకాయును. గోధుమ పండును. మీకు ద్రాక్షారసమును, రొట్టెయు లభించును.
18. హిజ్కియా పలుకులాలించి యావే మిమ్ము రక్షించునని నమ్మి మోసపోకుడు. ఏ జాతుల దైవములైన, మారాజు బారినుండి వారి దేశములను కాపాడుకోగలిగిరా?
19. హామాతు, అర్పాదు దైవము లేరీ? సెఫర్వాయీము దైవములెక్కడ ఉన్నారు? సమరియాను ఏ దైవము రక్షించెను?
20. ఈ దేశముల దైవములలో ఎవరైనా మా రాజు దాడినుండి తమ రాజ్యములను కాపాడుకోగలిగిరా? మరి యావే ప్రభువు నేడు మీ యెరూషలేమును మాత్రము ఎట్లు కాపాడగలడు?”
21. ప్రజలు అస్సిరియా సైన్యాధిపతి మాటలకు జవాబు చెప్పలేదు. హిజ్కియా వారిని నోరుమెదప వద్దని ముందుగనే అజ్ఞాపించి ఉండెను.
22. ఎల్యాకీము, షెబ్నా, యోవాలు శత్రువు మాటలు విని వస్త్రములు చించుకొనిరి. తమ రాజువద్దకు వెళ్ళి అతడు పలికిన పలుకులు విన్నవించిరి.
1. వారి మాటలు విని హిజ్కియా విచారముతో వస్త్రములు చించుకొని గోనెపట్ట తాల్చి ప్రభు మందిర మునకు వెళ్ళెను.
2. అతడు ప్రాసాద రక్షకుడగు ఎల్యాకీమును, రాజలేఖకుడగు షెబ్నాను, వృద్ధులైన యాజకులును ఆమోసు కుమారుడును, ప్రవక్తయైన యెషయా వద్దకు పంపెను. వారందరు గోనెలు తాల్చియే వెళ్ళిరి.
3. వారు యెషయా ప్రవక్త వద్దకు వచ్చి, అతనితో ఇట్లనెను: “హిజ్కియా సెలవిచ్చునదేమన, 'నేడు మనకు ఇక్కట్టులు వచ్చినవి. శత్రువులు మనలను శిక్షించి, అవమానముపాలు చేయుచున్నారు. మనము ప్రసవకాలము వచ్చినను బలము చాలనందున బిడ్డలను కనలేని గర్బిణులవలె ఉన్నాము.
4. అస్సిరియా రాజు పంపిన రబ్షాకె సజీవుడైన ప్రభువును తూలనాడెను. నీవు కొలుచు ప్రభువు ఈ నిందావాక్యములను ఆలించుగాక! వానిని పలికినవారిని శిక్షించునుగాక! నీవు మాత్రము మన జనమున శేషముగాయున్నవారిని కరుణింపుమని ప్రభువునకు మనవి చేయుము.' "
5. హిజ్కియా దూతలు తన చెంతకురాగా యెషయా రాజునకు ఈ ప్రతిసందేశము పంపెను.
6. “ప్రభువు సందేశమిది: అస్సిరియారాజు అధికారులు పలికిన వాక్యములను దేవదూషణములను విని నీవు భయపడవలదు.
7. నేను ఆ రాజునకు దుష్ట ప్రేరణ కలిగింతును. అతడొకవదంతిని విని తనదేశమునకు మరలిపోవును. తన దేశముననే కత్తివాతపడును. ఇదంతయు నేను చేయుపని.”
8. అస్సిరియా సైన్యాధిపతి రబ్షాకే తన రాజు లాకీషు నుండి వెడలిపోయి లిబ్నా నగరమును ముట్ట డించుచున్నాడని వినెను. కనుక అతడు రాజును కలిసికొనుటకై అచటికి వెళ్ళెను.
9. అంతలో కూషు రాజగు తిర్హకా ఐగుప్తు సైన్యముతో అస్సిరియామీదికి దండెత్తి వచ్చుచున్నాడని వార్తవచ్చెను.
10. ఆ వార్త అందినపిదప అస్సిరియా రాజు యూదా రాజు హిజ్కియాకు తన దూతలద్వారా లేఖ పంపెను. “యెరూషలేము అషూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి, నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము.
11. ఇంతవరకు అస్సిరియా రాజులు నానా రాజ్యములనెట్లు నాశనముచేసిరో నీవు వినియేయుందువు. నా దాడినుండి నీవు మాత్రము తప్పించుకోగలవా?
12. మా పూర్వులు గోషాను, హారాను, రెసపు పట్టణములను నాశనము చేసిరి. తెలస్పారు మండలమున వసించుచున్న బేతేదేను ప్రజలను సంహరించిరి. వారిదైవములు వారిని రక్షింపగలిగిరా?
13. హామాతు, అర్పాదు, సెఫర్వాయీము, హినా, ఇవ్వా రాజులిప్పుడేరీ?”
14-15. హిజ్కియారాజు దూతలనుండి ఆ లేఖను అందుకొని చదివెను. అంతట అతడు దేవాలయమున ప్రవేశించి, లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను.
16. “కెరూబీము దూతల నడుమ ఆసీనుడవైయున్న దేవా! భూమ్యాకాశములను సృజించినవాడవు నీవే. ఈ లోకమందున్న సకలరాజ్యములకు దేవుడవైయున్నావు.
17. సైన్యములకధిపతియైన ప్రభూ! వీనులొగ్గివినుము. కన్నులు విప్పిచూడుము. సజీవుడవైన దేవుడవగు నిన్ను కించపరచుటకుగాను సన్హారీబు పలికిన పలుకులు ఆలింపుము.
18. అస్పిరియా రాజులు నానాజాతులను జయించి ఆ వారి దేశములను నాశనము చేసిరి.
19. ఆ జాతుల దైవములను కాల్చివేసినది నిజమే! కాని వారు నిజముగా దైవములు కారు. నరులు మలచిన రాతిబొమ్మలు, కొయ్యబొమ్మలు. కనుకనే వారు వానిని నాశనము చేయగలిగిరి.
20. కావున ప్రభూ! ఇప్పుడు నీవు మమ్ము అస్సిరియా రాజు దాడినుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములును నీవు ఒక్కడవే నిక్కముగా దేవుడవని గుర్తించును.”
21. అంతట యెషయా హిజ్కియా వద్దకు సేవకు లను పంపి ఇట్లు చెప్పించెను: “అస్సీరియా రాజునుండి కాపాడుమని నీవు పెట్టిన మొరకు ప్రభువు ఇచ్చిన సమాధానమిది.
22. ఆ రాజును గూర్చిన దైవవాకిది. “ఓయి! యెరూషలేము కన్య నిన్నుచూచి నవ్వుచున్నది. నిన్ను చిన్నచూపు చూచుచున్నది. యెరూషలేము కన్య నీవు వెనుదిరిగి పోవుటను చూచి తలఊపుచున్నది.
23. నీవెవరిని అవమానించి దూషించితివో గుర్తించితివా? కన్నుమిన్నుగానక ఎవరిని నిందించితివో తెలిసికొంటివా? నీవు యిస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నన్నే తృణీకరించితివి.
24-25. నా రథసమూహముతో నేను ఎత్తయిన లెబానోను కొండలను గెల్చితిని. అచట ఉన్నతములైన దేవదారులను, శ్రేష్టములైన తమాలములను నరికించితిని. అడవుల అంతర్భాగము వరకును వెళ్ళితిని. అన్యదేశములలో బావులుత్రవ్వించి నీళ్ళు త్రాగితిని. నా సైన్యముల పాదతాడనమువలన నైలునది ఎండిపోయినదని నీవు నీ సేవకులు ముఖమున నా ఎదుట ప్రగల్భములాడితివి.
26. కాని ఈ విజయములు అన్నిటిని నేను పూర్వమే నిర్ణయించితినని నీవు వినలేదా? ఇప్పుడు నేను వానిని క్రియాపూర్వకముగా జరిగించితిని. నీవు నాకు సాధన మాత్రుడవై సురక్షిత పట్టణములను నేలమట్టము చేసితివి.
27. ఆ పట్టణములందలి ప్రజలు దుర్బలులైరి, భయపడి నిశ్చేష్టులైరి. వారు తూర్పుగాలికి సోలిపోవు పొలములోని పైరువలెను, బీళ్ళలోను మిద్దెలమీదను ఎదుగు గడ్డివలెను నలిగిపోయిరి.
28. నీ సంగతులెల్ల నాకు బాగుగా తెలియును. నీ రాకపోకలు, నీ చెయిదములు నేను ఎరుగుదును. నీవు నామీద మండిపడుటను నేను గుర్తించితిని.
29. నేను నీ పొగరును గూర్చి వింటిని. నా గాలము నీ ముక్కుకు తగిలింతును. నీ నోటికి కళ్ళెము పెట్టింతును. నీవు వచ్చిన త్రోవవెంటనే నిన్ను వెనుకకు పంపింతును.”
30. హిజ్కియా, నీవు ఈ గుర్తును గమనింపుము. ఈ సంవత్సరము, వచ్చు సంవత్సరముకూడ మీకు పడిమొలిచిన ధాన్యమే లభించును. కాని మూడవ సంవత్సరము మీరు పైరువేసి, కోతకోసుకొందురు. ద్రాక్షలు పెంచి వానిపండ్లు కోసికొందురు.
31. యూదా మండలమున తప్పించుకొని శేషముగా ఉన్నవారు యెరూషలేమునుండి బయలుదేరుదురు. వారు నేలలోనికి వేళ్ళుతన్ని, పండ్లు కాయు వృక్షములవలె వృద్ధి చెందుదురు.
32. యెరూషలేమున, సియోను కొండమీద ప్రజలు మిగిలియుందురు. తన ప్రజలపట్ల ప్రేమగల సైన్యములకధిపతియైన ప్రభువు ఈ కార్యమును సాధింపసమకట్టెను.”
33. అస్పిరియా రాజును గూర్చి ప్రభువు వాక్కిది: “అతడు ఈ పట్టణమున ప్రవేశింపజాలడు. దీనిమీద ఒక్క బాణమును కూడ రువ్వజాలడు. డాలుతో దీనిచెంతకు రాజాలడు. దీనిచుట్టు ముట్టడికిగాను , మట్టిదిబ్బలు పోయజాలడు.
34. ఇతడు తానువచ్చిన త్రోవపట్టి వెడలిపోవును. ఈ నగరమున ఎంతమాత్రము ప్రవేశింపజాలడు.
35. నా గౌరవార్థము, నా సేవకుడగు దావీదు నిమిత్తము, నేను ఈ నగరమును రక్షింతును.”
36. ఆ రాత్రి ప్రభువుదూత అస్పిరియా శిబిరమునకు పోయి అచట లక్షయెనుబది ఐదువేల మంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరు చచ్చిపడియుండిరి.
37. అంతట అస్సీరియా రాజు సైన్యమును తరలించుకొని నీనెవెకు వెడలి పోయెను.
38. అచట ఒకనాడు సన్హరీబు దేవళమున తన దేవత నిస్రోకును ఆరాధించుచుండగా అద్రమ్మలేకు, షరెసేరు అను అతని కుమారులిద్దరు అతనిని కత్తితో వధించి ఆరారాతునకు పారిపోయిరి. అటుపిమ్మట ఏసర్హద్ధోను అను అతని మరియొక పుత్రుడు తండ్రికి బదులుగా రాజయ్యెను.
1. ఆ రోజులలో హిజ్కియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలోనుండెను. అప్పుడు ప్రవక్తయగు యెషయా రాజును సందర్శింపవచ్చి “ప్రభువు సందేశమిది. నీ కార్యములను చక్కబెట్టుకొనుము. నీవిక బ్రతుకవు” అని చెప్పెను.
2-3. హిజ్కియా గోడవైపు మొగము త్రిప్పి “ప్రభూ! ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితో, చిత్తశుద్ధితో సేవించితినిగదా! నీ చిత్తము చొప్పున నడుచుకొంటినిగదా!" అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించెను.
4-5. తిరిగి ప్రభువు వాణి యెషయాతో ఇట్లు పలికెను: “నీవు హిజ్కియా యొద్దకుపోయి అతనితో ఇట్లు చెప్పుము: 'నీ పితరుడగు దావీదు దేవుడనైన నా వాకింది. నేను నీ మొరవింటిని. నీ కన్నీళ్ళు చూచితిని. నేను నీ ఆయువును ఇంకను పదునైదేండ్లు పొడిగింతును.
6. నేను నిన్నును, ఈ నగరమును అస్సిరియా రాజు బారినుండి కాపాడు దును. ఈ పట్టణమును రక్షించి తీరుదును."
7. యావే తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యావే వలన నీకు కలిగిన సూచన.
8. ఆయన ఆహాసు ఎండ గడియారము మీద మెట్లపై బడిన సూర్యునినీడ పది అడుగులు వెనుకకు పోవునట్లు చేయును” అని చెప్పెను. ప్రవక్త చెప్పినట్లే సూర్యునినీడ పది అడుగులు వెనుకకు పోయెను. "
9. యూదా రాజు హిజ్కియా తనకు వ్యాధి కుదిరిన పిమ్మట ఈ స్తుతిగీతమును రచించెను.
10. నేను నా జీవిత మధ్యముననే పాతాళద్వారము చేరుదునని అనుకొంటిని. నా జీవితమున మిగిలిన రోజులను కోల్పోదును అనుకొంటిని.
11. ఈ సజీవుల లోకమున నేను ప్రభువును మరల దర్శింపజాలననుకొంటిని. ఈ భూమిమీద ఉన్నవారు చూచునట్లుగా నేను నరులను మరల చూడజాలననుకొంటిని.
12. ప్రభువు నా జీవితమును, గొఱ్ఱెలకాపరి గుడారమువలె పెరికివేసెను. సాలెవాడు తాను చేసిన బట్టను చుట్టచుట్టి మగ్గము నుండి కత్తిరించునట్లు ప్రభువు నా జీవితమును కత్తిరించెను. వేకువ నుండి రేయివరకు ఆయన నన్ను బాధించుచునే యుండెను.
13. రేయెల్ల నేను వేదనతో విలపించితిని. ఆయన సింగమువలె నా మీదపడి, నా ఎముకలు విరుగగొట్టెను. వేకువ నుండి రేయివరకును నన్ను బాధించుచునేయుండెను.
14. నేను పిచ్చుకవలె అరచితిని, గువ్వవలె విలపించితిని ఆకసమువైపు చూచిచూచి నా కన్నులు వాచెను. ప్రభూ! నీవు నన్నాదుకొనుము, నాకు అండగా ఉండుము.
15. నేనేమి ఫిర్యాదు చేయుదును? ప్రభువునకేమి విన్నవించుకొందును? ఆయనయే ఈ చెయిదము చేసెను. నా హృదయము సంతాపముతో నిండియున్నది. నాకు నిదురపట్టుటలేదు.
16. ప్రభూ! నేను నీ కొరకే జీవింతును. నిఖ్ఖముగా నీ కొరకే బ్రతుకుదును. నీవు నన్ను బాగుచేయుదువు. నన్ను జీవింపచేయుదువు.
17. నీవు నా దుఃఖమును సంతోషముగా మార్చుదువు. వినాశకరమైన పాతాళము బారినుండి నీవు నన్ను ప్రేమతో కాపాడితివి. నా పాపములెల్ల ఎత్తి నీ వెనుక తట్టున విసరివేసితివి.
18. పాతాళలోకము నిన్ను స్తుతింపదు. మృతలోకము నిన్ను కొనియాడదు. మృతలోకమునకు ఏగువారు నీ నమ్మదగినతనము మీద ఆధారపడరు.
19. సజీవులు, సజీవులేకదా నిన్ను స్తుతింతురు. నేడు నేను నిన్ను కీర్తించినట్లే, వారును నిన్ను కీర్తింతురు. తండ్రులు తమ తనయులతో నీవు నమ్మదగినవాడవని చెప్పుదురు.
20. ప్రభూ! నీవు నన్నాదుకొనుము. మేము తంత్రీవాద్యములతో నిన్ను కీర్తింతుము. మా జీవితకాలమంతయు దేవాలయమున నిన్ను కొనియాడెదము.
21. యెషయా అత్తిపండ్ల గుజ్జును రాజు వ్రణముపై పూసినచో అతనికి ఆరోగ్యము చేకూరునని చెప్పెను.
22. హిజ్కియా 'నేను ప్రభువు మందిరమునకు పోవుదుననుటకు గుత్తేమిటి' అని అడిగెను.
1. ఆ కాలముననే బబులోనియా రాజును బలదాను కుమారుడునగు మెరొదక్బలదాను హిజ్కియా వ్యాధిగ్రస్తుడై మరల కోలుకొనెనని విని, అతనికొక జాబును వ్రాసి బహుమతిని పంపెను.
2. హిజ్కియా అతని దూతలను ఆహ్వానించి వారికి తన కోశాగారము నందలి వెండిబంగారములను, సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను, ఆయుధ సామగ్రిని చూపించెను. తన ప్రాసాదమునగాని, రాజ్యమునగాని హిజ్కియా వారికి చూపింపని వస్తువులేదు.
3. అంతట యెషయా ప్రవక్త రాజు వద్దకు వచ్చి 'వీరెచ్చటినుండి వచ్చిరి, నీతో ఏమిచెప్పిరి' అని అడిగెను. రాజు అతనితో 'వీరు దూరదేశమైన బబులోనియా నుండి వచ్చిరి' అని చెప్పెను.
4. యెషయా 'వీరు నీ ప్రాసాదమున ఏమి చూచిరి' అని అడిగెను. రాజు, 'వీరు అంతయును చూచిరి. నా కోశాగారమున నేను వీరికి చూపింపని వస్తువే లేదు' అని బదులు చెప్పెను.
5. యెషయా “అటులయినచో సైన్యములకధి పతియైన ప్రభువువాక్కు వినుము.
6. నీ ప్రాసాదమున నున్న వస్తువులన్నింటిని, నేటివరకు మీ పూర్వులు కూడబెట్టియుంచిన వస్తువులన్నింటిని, ప్రజలు బబులోనియాకు ఎత్తుకొనిపోవు కాలమువచ్చుచున్నది. ఇక నీ ఇంట ఏమియు మిగులదు.
7. నీ వంశజులను గూడ బబులోనియాకు కొనిపోయెదరు. అచట వారు రాజప్రాసాదమున నపుంసకులుగా బ్రతికెదరు” అని అనెను.
8. కాని హిజ్కియా తన పరిపాలన కాలమున శాంతిభద్రతలు నెలకొనియుండిన, అదియే చాలునను కొనెను. కనుక అతడు యెషయాతో 'నీవు నాకు వినిపించిన ప్రభువు సందేశము మంచిదే' అని పలికెను.
1. నా ప్రజలను ఓదార్పుడు, ఓదార్పుడు అని మీ దేవుడు పలుకుచున్నాడు.
2. యెరూషలేము పౌరులకు ధైర్యముచెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదనియు, వారి తప్పిదములును మన్నింపబడినవనియు, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్షను అనుభవించిరనియు తెలియజెప్పుడు.
3. ఒక శబ్దమిట్లు పలికెను: “ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధముచేయుడు. మరుభూమిలో మనదేవునికి రాజపథమును తయారుచేయుడు.
4. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు. ప్రతి పర్వతమును, తిప్పను నేలమట్టము చేయుడు. మిట్టపల్లములు సమతలము కావలెను. కరకు తావులు నునుపు కావలెను.
5. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరు ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలుకిది.”
6. ఒక శబ్దము నాతో నీవు సందేశమును వినిపింపుమని చెప్పెను. కాని ఏమి సందేశము వినిపింపగలనని నేనంటిని. “నరులెల్లరును గడ్డివంటివారనియు వారు అడవిలో పూచిన పూలకంటె ఎక్కువకాలము మనజాలరనియు నీవు వినిపింపుము.
7. ప్రభువు తన శ్వాసను దానిమీద ఊదగా, గడ్డి ఎండిపోవును, పూవు వాడిపోవును. నరులు గడ్డివంటివారు.
8. గడ్డి ఎండిపోవును, పూవు వాడిపోవును. కాని మన దేవుని వాక్కు కలకాలము నిలుచును.”
9. సియోనూ! నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము." యెరూషలేమూ! నీవు గొంతెత్తి అరువుము. శుభవార్తను విన్పింపుము. భయపడక యెలుగెత్తి అరువుము. యూదా నగరములతో “ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు” అని చెప్పుము.
10. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన తాను ఒసగు బహుమానమును తనతో గొనివచ్చుచున్నాడు. ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందట నడచుచున్నది.
11. ఆయన కాపరివలె తనమందను మేపును. గొఱ్ఱెపిల్లలను తన బాహువులతో కూర్చి, రొమ్ము నానించుకొని మోసికొనిపోవును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా అదలించును.
12. సముద్రజలమును తన కరతలముతో కొలిచినవాడెవడు? జేనతో ఆకాశమును కొలిచినవాడెవడు? నేలలోని మంటిని కొలపాత్రమున ఉంచినవాడెవడు? పర్వతములను, తిప్పలను తక్కెడలో పెట్టి తూచినవాడెవడు?
13. ప్రభువు ఆత్మకు సలహా ఈయగలవాడెవడు? ప్రభువునకు ఉపదేశము చేయగలవాడెవడు?
14. ప్రభువు ఎవనిని సంప్రదించును? ఆయనకు ఎవడు బోధచేయును? ఆయనకు న్యాయవర్తనమును తెలియజేయువాడు ఎవడు? కార్యములను జరిపించు విధానమును ఎగిరించువాడెవడు?
15. ఆయన ఎదుట జాతులు చేదనుండి జాలువారు నీటి బొట్టు వంటివారు. తక్కెడ సిబ్బిమీది ధూళివంటివారు. ఆయనఎదుట ద్వీపములు సూక్ష్మరేణువుల వంటివి.
16. లెబానోను అడవిలోని చెట్లు మంటకు చాలవు. దానిలోని మృగములు బలినర్పించుటకు సరిపోవు.
17. ప్రభువెదుట అన్యజాతులు లెక్కకురావు. ఆయన వానిని శూన్యముగాను, ఉనికిలో లేనివానినిగాను గణించును.
18. దేవుని ఎవనితో పోల్చగలము? ఆయనకు సాటియైన రూపమెది?
19. కళాకారుడు బొమ్మను చేయగా, కంసాలి దానికి బంగారము తాపడముచేసి, దానిని వెండిలో బిగించును. కాని దేవుడు ఈ బొమ్మవంటివాడు కాడు.
20. వెండిబంగారములు లేనివాడు పుచ్చని కొయ్యను తెచ్చి, నేర్పరియైన పనివానికిచ్చి క్రిందపడిపోని బొమ్మను చేయించుకొనును.
21. మీకు తెలియదా? పూర్వమే మీరు వినలేదా? లోకమెట్లు పుట్టెనో మీరెరుగరా?
22. ఆయన భూమ్యాకాశములకు పైనున్న సింహాసనము మీద ఆసీనుడై యుండును. క్రింది నేలమీది నరులు ఆయనకు మిడుతలవలె కన్పింతురు. ఆయన ఆకాశమును తెరవలె విప్పెను. దానిని నరులు వసించు గుడారమువలె పన్నెను.
23. ఆయన రాజులను అంతమొందించును. లోకపాలకులను అడపొడ కానరాకుండ చేయును.
24. ఆ పాలకులు నేలలో నాటగా అప్పుడే వేరు పాతుకొను లేతమొక్కల వంటివారు. ప్రభువు ఆ పాలకులమీదికి ఊదగా వారు వాడిపోవుదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.
25. మీరు నన్నెవ్వరితో పోల్తురు? నాకు సాటివాడెవడని, పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు.
26. కన్నులెత్తి ఆకాశమువైపు చూడుడు. ఆ నక్షత్రములనెవడు చేసెను? వానిని సైన్యమువలె నడిపించువాడే కదా! అవి ఎన్నియో ఆయన ఎరుగును. తను వానిలో ప్రతిదానిని ఆయన పేరుపెట్టి పిలుచును. ఆయన మహాశక్తిసంపన్నుడు కనుక ఆ తారలలో ఒక్కటియు తప్పిపోదు.
27. యాకోబూ! “నా మార్గము యావేకు మరుగైయున్నది. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు” అని నీవేల అనుచున్నావు? యిస్రాయేలూ! నీవేల చెప్పుచున్నావు?
28. నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభువు శాశ్వతుడైన దేవుడు. ఆయన భూదిగంతములను చేసెను. ఆయన అలసిసొలసిపోవువాడు కాదు. ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు.
29. ఆయన అలసిపోయినవారికి శక్తినొసగును. దుర్బలులకు బలమును దయచేయును.
30. యువకులును అలసిసొలసి పోవుదురు. లేతప్రాయము వారుసు పడిపోవుదురు.
31. కాని ప్రభువును నమ్మినవారు నూత్నబలమును పొందుదురు. వారు పక్షిరాజువలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలసట లేక పరుగెత్తుదురు. బడలిక లేక నడకసాగింతురు.
1. ద్వీపములారా! మీరు మౌనము తాల్చి ఆ నా పలుకులు ఆలింపుడు. జనులారా! నూతన బలము పొందుడు. మీరు నా ఎదుటికి వచ్చి న్యాయస్థానమున మీ వాదమును వినిపించుకొనుడు. మనలో ఎవరిది ఒప్పోచూతము.
2. ఎచటికి వెళ్ళినను విజయము చేపట్టు వీరుని ఒకనిని పురికొల్పి అతనిని తూర్పుదిక్కునుండి తీసికొని వచ్చినదెవరు? జాతులమీదను, రాజులమీదను అడు అతనికి విజయమును ఒసగినదెవరు? అతని ఖడ్గమునకు ధూళివలె, అతని వింటికి ఎగిరిపోవు పొట్టువలె వారిని అప్పగించుచున్నాడు.
3. అతడు ఎట్టి అపాయమునకును గురికాక వారిని వెన్నాడును. అని తన పాదములు నేలకు తగలనంత వేగముగా పరుగెత్తును.
4. ఈ కార్యమును నిర్వహించినదెవడు? ఆదినుండి తరతరాల ప్రజలను సృజించినదెవడు? ప్రభుడనైన నేనే. మొదటివాడను, కడవరివారితో ఉండువాడను నేనే.
5. ద్వీపవాసులు నా చెయిదములు చూచివెరగొందిరి. తీరవాసులు భీతితో కంపించిరి. వారెల్లరును ఏకమై వచ్చిరి.
6. ఇరుగుపొరుగువారు ఒకరికొకరు సాయము చేసికొందురు. ధైర్యము వహింపుడని ప్రోత్సహించుకొందురు.
7. వడ్రంగి కంసాలిని మెచ్చుకొనును. విగ్రహములను సుత్తెతో కొట్టి నునుపు చేయువాడు, దాగిలిమీద కొట్టువానిని ప్రోత్సహించును. వారెల్లరును బొమ్మ అతుకులు బాగుగా ఉన్నవని చెప్పుకొనుచు, దాని తావున దానిని చీలలతో కొట్టిబిగింతురు.
8. యిస్రాయేలూ! నీవు నాకు సేవకుడవు, యాకోబూ! నేను నిన్నెన్నుకొంటిని. నీవు నా స్నేహితుడైన అబ్రహాము వంశజుడవు.
9. నేను నిన్ను ప్రపంచపు అంచులనుండి కొనివచ్చితిని. భూలోకపు చెరగులనుండి నిన్ను పిలిచితిని. నీవు నాకు సేవకుడవని చెప్పితిని. నేను నిన్ను ఎన్నుకొంటిని, నిన్ను నిరాకరింపనైతిని.
10. నీవు భయపడకుము, నేను నీకు తోడైయుందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకొందును. నీతి అను నా కుడిచేతితో నిన్ను కాపాడుదును.
11. నీ మీద కోపించువారు ఓడిపోయి అవమానము చెందుదురు. నీతో పోరాడువారు సర్వనాశనమగుదురు.
12. నీ శత్రువులు నీవు గాలించినను దొరకరు. నీతో పోరాడువారు. మటుమాయమగుదురు.
13. నీ దేవుడను, ప్రభుడనైన నేను నీకు బలమును ఒసగుదును. “నీవు భయపడకుము, నేను నిన్నాదుకొందును” అని నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడిచేతిని పట్టుకొందును.
14. పురుగువంటివాడవైన యాకోబూ! చిన్న క్రిమివంటివాడవైన యిస్రాయేలూ! భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును. యిస్రాయేలు పవిత్రదేవుడనైన నేను నీకు విమోచకుడను - ఇవి ప్రభువు పలుకులు.
15. నేను నిన్ను నూర్పిడికొయ్యగా చేయుదును. దానికి కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తపారలకు అమర్తును. నీవు పర్వతములను నూర్చి పొడిచేయుదువు. కొండలను పొట్టు చేయుదువు.
16. నీవు వానిని తూర్పారబట్టగా అవి గాలికెగిరిపోవును. పెనుగాలికి కొట్టుకొనిపోవును. అప్పుడు నీవు ప్రభువునందు సంతసింతువు. యిస్రాయేలు పవిత్ర దేవునియందు అతిశయిల్లుదువు.
17. దీనులును,పేదలునైనవారు దప్పిక గొనిరిగాని నీరు దొరకదయ్యెను. "వారి నాలుక పిడుచగట్టెను. ప్రభుడనైన నేను వారి మొరవిందును. యిస్రాయేలు దేవుడనైన నేను వారిని చేయి విడువను.
18. నేను బోడిగానున్న కొండలలో , నదులను పారింతును. లోయలలో ఊటలను ఉబకచేసెదను. ఎడారిని నీటిమడుగుగా మారును. ఎండిననేలను నీటిబుగ్గలుగా చేయుదును.
19. ఎడారిలో దేవదారులు, కసివిందచెట్లు, గొంజిచెట్లు, ఓలివులు నాటుదును. మరుభూమిలో నేరేడులు, సరళవృక్షములు, తమాలములు పాతుదును.
20. ప్రజలు దీనినెల్ల చూచి ప్రభువునైన నేను ఈ చెయిదమును చేసితిననియు, యిస్రాయేలు పవిత్రదేవుడనైన నేను ఈ కార్యము సల్పితిననియు స్పష్టముగా గ్రహించి అర్థము చేసికొందురు.
21. యిస్రాయేలు రాజైన ప్రభువు ఇట్లనుచున్నాడు: "జాతుల దేవతలారా! మీ వ్యాజ్యెమును వినిపింపుడు. న్యాయస్థానమున మీ వాదమును నిరూపింపుడు.
22. మీరు ఇచటికి వచ్చి భవిష్యత్తున ఏమి జరుగునో చెప్పుడు. ఆ కార్యము జరిగిన వెంటనే మేము దానిని గుర్తింతుము. భూతకాలమున జరిగిన కార్యములను వివరింపుడు. వాటి భావమును తెలియజెప్పుడు.
23. భవిష్యత్తున ఏమి జరుగునో చెప్పుడు, అప్పుడు మేము మీరు దైవములని ఒప్పుకొందుము. మీరు మంచియో, చెడ్డయో ఏదో ఒకటి చేసి మాకు భీతిని, విస్మయమును కలిగింపుడు.
24. మీరు సర్వశూన్యులు. మీ క్రియలు కూడా శూన్యములే. మిమ్ము కొలుచువారు నింద్యులు.
25. నేను ఉత్తరమునుండి ఒకరిని పురికొల్పితిని. తూర్పునుండి ఒకనిని పేరెత్తి పిలిచితిని. అతడు రాజులను బురదనువలె త్రోక్కును. కుమ్మరి మంటిని తొక్కినట్లుగా వారిని త్రోక్కివేయును.
26. ఈ కార్యమును మీలో ఎవ్వరైన ముందుగా తెల్పియుంటిరా? అటులయిన మేము దానిని గూర్చి తెలిసికొని ఉండెడివారము. అతడు చెప్పినది ఒప్పని ఒప్పుకొని ఉండెడివారము. కాని మీలో ఎవ్వడును దానిని ముందుగా చెప్పలేదు. మీ పలుకులను విన్నవాడెవడును లేడు.
27. నేను సియోనునకు ఈ సంగతి మొదటనే ఎరిగించితిని. యెరూషలేమునకు వార్తావహుని పంపించి, నా ప్రజలు వచ్చుచున్నారని చెప్పించితిని.
28. నేను దైవములవైపు చూడగా వారిలో ఒక్కడును మాటలాడడయ్యెను. ఒక్కడును నా ప్రశ్నలకు జవాబు చెప్పలేడయ్యెను.
29. ఈ దైవములెల్ల సర్వశూన్యులు. వీరి కార్యములును శూన్యములే. వీరెల్లరును చేతగాని దుర్బల విగ్రహములు.
1. ఇడుగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసితిని. ఇతనిని ఎన్నుకొంటిని. ఇతని వలన ప్రీతిచెందితిని. ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు అన్యజాతులకు న్యాయము గొనివచ్చును.
2. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు. వీధులలో ఉపన్యసింపడు.
3. నలిగిన రెల్లుకాడను త్రుంచివేయడు. కునికిపాట్లుపడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగినతనముతో ఎల్లరికిని న్యాయము గొనివచ్చును.
4. నిరాశచెందక, నిరుత్సాహమునకు గురికాక నేలమీద న్యాయమును నెలకొలుపును. ద్వీపములితని బోధకొరకు ఎదురుచూచును.
5. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను. భూమిని దానిమీద వసించు ప్రాణులను చేసెను. దానిమీది నరులకు ప్రాణమొసగెను. . దానిమీద సంచరించు వారికి జీవమును దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు:
6. “ప్రభుడనైన నేను నిన్ను పిలిచితిని. నీకు బలమునొసగితిని, రూపమునిచ్చితిని. నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను, జాతులకు జ్యోతినిగాను నియమించితిని.
7. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు. బందీలను చెరనుండి వెలుపలికి గొనివత్తువు. చీకటిలో ఉన్నవారిని బందీగృహమునుండి విడిపింతువు.
8. యావేను నేనే. ఇదియే నా నామము. నేను నా మహిమను మరి ఎవనికిని ఈయను. నాకు ముట్టవలసిన స్తుతి, విగ్రహములకు దక్కనీయను.
9. నేను పూర్వము చెప్పిన సంగతులు నెరవేరినవి. ఇప్పుడు క్రొత్త సంగతులు తెలియజేసెదను. అవి జరుగక మునుపే వానినెరిగించెదను."
10. ప్రభువునకు నూత్నగీతము పాడుడు. నేలయందంతట ఆయన స్తుతి మారుమ్రోగునుగాక! సముద్రయానము చేయువారు ఆయనను కీర్తింతురుగాక! సముద్రమున జీవించు ప్రాణులు ఆయనను నుతించునుగాక! - ద్వీపములును, వానిలో వసించువారును ఆయనను స్తుతింతురుగాక!
11. ఎడారియు, దానిలోని నగరములును, కేదారు నివాసులును బిగ్గరగా పాడుదురుగాక! సెర నగరవాసులు పర్వతాగ్రమునుండి సంతసముతో కేకలిడుదురుగాక!
12. ద్వీపములలో వసించువారు ప్రభువును స్తుతించి కీర్తింతురుగాక!
13. ప్రభువు శూరునివలె బయలుదేరును. యుద్ధవీరునివలె ఆగ్రహము చెందును. ఆయన హుంకరించుచు యుద్ధనాదము చేయును. శత్రువులమీద విజయము సాధించును.
14. ప్రభువిట్లు పలుకుచున్నాడు: నేను దీర్ఘకాలము మౌనముగా ఉంటిని. నోరువిప్పి మాట్లాడనైతిని, నన్ను నేను నిగ్రహించుకొంటిని. కాని ఇప్పుడు ప్రసవవేదనపడు స్త్రీవలె అరచుచున్నాను. గట్టిగా గాలిపీల్చుచు రొప్పుచున్నాను.
15. నేను కొండలను, తిప్పలను నాశనము చేయుదును. వానిలోని చెట్టు చేమలను మాడ్చివేయుదును. నదులను ఎడారులుగా మార్చెదను. సరస్సులు ఎండిపోవునట్లు చేయుదును.
16. గ్రుడ్డివారిని మార్గమువెంట నడిపింతును. వారు ఎరుగని త్రోవలగుండ వారిని కొనిపోవుదును. వారి ముందట చీకటిని వెలుగుగా మార్చెదను. కరకునేలను నునుపుగా జేయుదును. ఒక్కదానిని గూడ విడువక ఈ కార్యములెల్ల చేయుదును.
17. విగ్రహములను నమ్ముచు పోత విగ్రహములను చూచి మీరే 'మా దైవములు' అనినెంచువారు సిగ్గుజెంది వెనుకకు మరలుదురుగాక!
18. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు: చెవిటివారలారా వినుడు! గ్రుడ్డివారలారా జాగ్రత్తగా చూచి తెలిసికొనుడు!
19. నా సేవకునియంత గ్రుడ్డివాడెవడు? నా వార్తావహునియంత చెవిటివాడెవడు? నా దూతయంత గ్రుడ్డివాడెవడు? ప్రభువు సేవకునియంత చెవిటివాడెవడు?
20. మీరు చాల సంఘటనలను చూతురు. కాని వాటిని గ్రహింపరు. వారు చెవులతో వినియు వినరైతిరి.
21. ప్రభువు తన ప్రజలను రక్షింపగోరువాడు కనుక ధర్మస్తశామును గొప్పజేసి దానికి కీర్తి తెచ్చెను.
22. కాని ఇప్పుడు ఆయన ప్రజలు దోపిడికి గురియైరి. వారు కొండబిలములలో బందీలైరి. బందీగృహమున చిక్కి కనుమరుగైరి. వారు దోపిడికి గురికాగా ఎవరును వారిని ఆదుకోరైరి. అన్యులు వారిని కొల్లగొట్టగా ఎవరును వారికి తోడ్పడరైరి.
23. మీలో ఈ సంగతిని వినువారెవరైనా ఉన్నారా? ఇక మీదటనైనా మీరు జాగ్రత్తగా విందురా?
24. యిస్రాయేలును దోపిడి చేయనిచ్చినదెవరు? వారిని కొల్లగొట్టనిచ్చినది యావేనే కదా! మనము ఆయన మార్గములలో నడువమైతిమి. ఆయన ఉపదేశమును పాటింపమైతిమి.
25. కనుక ఆయన తన కోపమును మనమీద కుమ్మరించెను. మనలను ఘోర యుద్ధమునకు గురిచేసెను. ఆయన కోపాగ్ని మనలను క్రమ్ముకొనెను. కాని మనము ఆ విషయమును గ్రహింపమైతిమి. ఆ నిప్పు మనలను దహించెను. కాని మనము బుద్ధి తెచ్చుకోమైతిమి.
1. కాని యాకోబూ! ఇప్పుడు నిన్ను సృజించిన దేవుడు ఇట్లు అనుచున్నాడు. యిస్రాయేలూ! నీకు రూపమిచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు. ఆ “నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించితిని. నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా సొత్తు.
2. నీవు లోతైన నీటిగుండ నడచునప్పుడు , నేను నీకు తోడుగానుందును. నదులగుండ నడచునపుడు అవి నిన్ను ముంచివేయలేవు. ఈ నీవు అగ్నిగుండ నడచునపుడు కమిలిపోవు. మంటలు నిన్ను కాల్చివేయలేవు.
3. నేను నీ ప్రభుడనైన నీ దేవుడను, యిస్రాయేలు పవిత్రదేవుడను, నిన్ను రక్షించువాడను. నీకు విమోచనమును ఒసగుటకు క్రయముగా నేను ఐగుప్తును ఇచ్చియున్నాను. నీ కొరకు ప్రతిగా కూషు, సేబా దేశములను ఇచ్చియున్నాను.
4. నేను నీ కొరకు ప్రతిగా నరులను త్యజింతును. నీ ప్రాణములకు బదులుగా జాతులను త్యాగము చేయుదును. నీవు నాకు అమూల్యమైనవాడవు. నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును.
5. నీవు భయపడకుము, నేను నీకు తోడుగా నుందును. నేను తూర్పునుండి నా ప్రజలను గొనివత్తును, పడమరనుండి నా జనులను ప్రోగుజేయుదును.
6. ఉత్తరదిక్కుతో నీవు వారిని వెడలిపోనిమ్ము అని చెప్పుదును. దక్షిణదిక్కుతో నీవు వారిని బంధించియుంచవలదు అని చెప్పుదును. దూరమునుండి నా కుమారులు వత్తురుగాక! నేలచెరగులనుండి నా కుమార్తెలు తిరిగివత్తురుగాక!
7. వారెల్లరు నా పేరును ధరించినవారు. నాకు కీర్తికలుగుటకుగాను , నేను వారిని సృజించితిని, వారికి రూపము నిచ్చితిని.”
8. ప్రభువు ఇట్లనుచున్నాడు: నా ప్రజలను పిలువుడు. వారు కన్నులున్నను గ్రుడ్డివారుగా నున్నారు. చెవులున్నను చెవిటివారుగా నున్నారు.
9. ప్రజలనెల్ల, జాతులనెల్ల తీర్పునకు పిలిపింపుడు. వారి దైవములలో భవిష్యత్తున జరుగు కార్యములను ముందుగా ఎరిగింపగలవారెవరు? ఇప్పుడు జరుగుదానిని పూర్వము తెలియజేసిన దెవరు? ఈ దైవములు సాక్ష్యములు చూపించి తమది ఒప్పేనని నిరూపించుకొందురుగాక! " తమ మాటలు నిజమేనని రుజువు చేసికొందురుగాక! .
10. యిస్రాయేలీయులారా! మీరు నాకు సాక్షులు. మీరు నన్నెరిగి, నన్ను విశ్వసించి, ఆయన నన్నే ఏకైక దేవునిగా గుర్తించుటకుగాను నేను మిమ్ము నా సేవకులనుగా ఎన్నుకొంటిని. నాకు ముందు ఏ దైవమును లేడు. నా తరువాత ఏ దైవమును ఉండబోడు.
11. నేను మాత్రమే ప్రభుడను. నేను తప్ప రక్షించువాడు ఎవడునులేడు.
12. నేను. జరుగబోవు సంగతులను ముందుగా ఎరిగించితిని. అలా ఆ పిమ్మట మిమ్ము ఆదుకొంటిని. అన్యదైవములెవ్వరును ఈ కార్యము చేయలేదు. మీరు నాకు సాక్షులు” - ఇవి ప్రభువు పలుకులు.
13. “నేను దేవుడను, ఎల్లపుడును దేవుడనే. నేను పట్టినది విడిపించువాడెవడును లేడు. నేను చేసినదానిని మార్పువాడెవడును లేడు."
14. యిస్రాయేలు పవిత్రదేవుడును, మీ విమోచకుడునైన అయిన ప్రభువు ఇట్లు అనుచున్నాడు: నేను మీకొరకు బబులోనియా మీదికి సైన్యమును పంపెదను. ఆ నగర ద్వారములను పడగొట్టెదను.
15. నేను మీ పవిత్రదేవుడనైన ప్రభుడను, యిస్రాయేలీయులగు మిమ్ము సృజించినవాడను, నేనే మీకు రాజును.
16. సముద్రముగుండ త్రోవజేసిన ప్రభువు, మహాజలరాశి గుండ మార్గముజేసిన ప్రభువు ఇట్లు అనుచున్నాడు:
17. రథములతోను, గుఱ్ఱములతోను కూడిన మహాసైన్యమును నాశనము గావించినదెవరు? ఆసైన్యము నేలపైబడి మరల లేవజాలదయ్యెను. నేను దానిని దీపమువలె ఆర్పివేసితిని.
18. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కరలేదు. ప్రాతసంఘటనలు తలచుకోనక్కరలేదు.”
19. ఇప్పుడు నేనొక నూత్నకార్యము చేసెదను. అది తక్షణమే జరుగును. ఆ మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాటవేయుదును. మరుభూమిలో త్రోవవేయుదును.
20. నేను ఎడారిలో నదులు పారించి నేనెన్నుకొనిన ప్రజలకు నీటినిత్తును. అప్పుడు నక్కలు నిప్పుకోళ్ళు మొదలైన వన్యప్రాణులు నన్ను గౌరవించును.
21. ఆ జనులు, నా స్తుతులను పాడువారు. వారిని నేను నా కొరకే సృజించితిని.
22. యాకోబూ! నీవు నన్ను ఆరాధింపలేదు. యిస్రాయేలూ! నీవు నన్ను గూర్చి విసిగితివి.
23. నీవు నాకు దహనబలిగా గొఱ్ఱెలను కొనిరావైతివి. నీ బలులతో నన్ను గౌరవింపవైతివి. నాకు నైవేద్యములు అర్పింపుమని నేను నిన్ను బాధింపలేదు. సాంబ్రాణి పొగ వేయుమని నిన్ను విసిగింపలేదు.
24. నీవు నాకొరకు సుగంధపు కాడలను కొనలేదు. బలిపశువుల క్రొవ్వుతో నన్ను సంతృప్తిపరచలేదు. కాని నీ పాపములతో నీవు నన్ను బాధించితివి. నీ దోషములతో నన్ను విసిగించితివి.
25. అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించువాడను. నేను నీ తప్పిదములను జప్తియందుంచుకొనను.
26. మనము వ్యాజ్యెమాడుదమురమ్ము. నీ అభియోగమును వినిపించుకొనుము, నీదే ఒప్పని నిరూపించుకొనుము. నీ వాదమును వివరింపుము.
27. నీ ప్రథమ పితరుడు పాపము చేసెను. నీ నాయకులు నా మీద తిరుగుబాటు చేసిరి.
28. నీ పాలకులు నా మందిరమును అపవిత్రము చేసిరి. ఆ కనుక నేను యాకోబును నాశనము చేసితిని. నా ప్రజలను అవమానముపాలు కావించితిని.
1. “అయినను నా సేవకుడవైన యాకోబూ! వినుము. నేనెన్నుకొనిన యిస్రాయేలూ! ఆలింపుము.
2. ప్రభువిట్లు నుడువుచున్నాడు. నేను నిన్ను కలిగించితిని. నీవు గర్భమున పడినప్పటినుండియు నీకు రూపమును ఇచ్చితిని. నిన్ను ఆదుకొంటిని. నా సేవకుడవైన యాకోబూ! నీవు భయపడకుము. యెషూరూనూ ! నేను నిన్ను ఎన్నుకొంటిని.
3. నేను దాహముగొనిన నేలమీద నీళ్ళు కుమ్మరింతును. ఎండిన నేలమీద ఏరులు పారింతును. నీ బిడ్డల మీదికి నా ఆత్మను కుమ్మరింతును. నీ వంశజులమీద నా దీవెనలను వర్షింతును.
4. వారు నీరు పెట్టిన గడ్డివలె ఎదుగుదురు. పారు ఏరులచెంత నిరవంజి చెట్లవలె పెరుగుదురు.
5. ఒకడు నేను ప్రభువునకు చెందినవాడనని చెప్పును, ఇంకొకడు నేను యిస్రాయేలు పక్షము వాడనని పలుకును. మరియొకడు తన చేతిపై ప్రభువు పేరు వ్రాసికొనును. యిస్రాయేలు అను పేరును తన నామమునకు చేర్చుకొనును.”
6. యిస్రాయేలు రాజును, వారి విమోచకుడును, సైన్యములకధిపతియైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “మొదటివాడను, కడపటి వాడను నేనే. నేను తప్ప ఏ దేవుడును లేడు.
7. నేను చేసిన కార్యములను ఇతరులెవరైన చేయగలిగిరా? కాలము మొదటనుండి చివరివరకును జరుగు కార్యములను ఎవరైనా ముందుగా ఎరిగింపగలిగిరా?
8. జనులారా! మీరు భయపడకుడు, వెరవకుడు. ఆదినుండి నేటివరకును జరుగు సంగతులనెల్ల నేను ముందుగా ఎరిగించియుంటిని. మీరు నాకు సాక్షులు. నేనుగాక దేవుడెవడున్నాడు? నేను తప్ప, ఆశ్రయింపదగిన దేవుడెవడును లేడు. ఉన్నట్లు నేనెరుగను”
9. విగ్రహములను చేయువారు నిరర్ధకులు. వారంతగా మెచ్చుకొను ఆ విగ్రహములు నిష్ప్రయోజ నమైనవి. వారే అందుకు సాక్షులు. వారు గ్రహించి, తెలుసుకొనువారు కారు గనుక సిగ్గుపడరు.
10. ఏలయనగ, నిష్ప్రయోజనమైన పోతవిగ్రహమును చేసి, దానిని దేవునిగా రుజువు చేయువాడు ఎవడు?
11. దానిని వందించువారును సిగ్గు చెందుదురు. ఆ విగ్రహములను చేయువారు నరమాత్రులేకదా. వారినిచటకి రానిండు, తీర్పునకు తట్టుకోగలరేమో చూతము! వారు తప్పక భయముతో కంపించి సిగ్గు పడుదురు.
12. కమ్మరి లోహపుముక్కను అగ్నిలో కాల్చి సమ్మెటతో బాదును. అతడు తనబలమైన చేతులతో దానిని సుత్తితో మోదిమోది అలసిపోవును. ఆకలిగొని దప్పికచెందును.
13. వడ్రంగి కొయ్యను కొలతవేయును. సున్నముతో దానిమీద రూపము గీయును. తన పని ముట్లతో ఆ రూపమును కోయును. దానిని చెక్కి సుందరమైన నరాకృతిని తయారుచేయును. ఆ బొమ్మను మందిరమున స్థాపింపనెంచును.
14. అతడు బొమ్మనుచేయుటకు దేవదారు చెట్టును నరుకవచ్చును. లేదా అడవినుండి సింధూరమునో, తమాలమునో కొనివచ్చి వాడవచ్చును. లేదా స్వయముగా ఏదో ఒక చెట్టునునాటి అది వానకు పెరుగువరకును వేచి యుండవచ్చును.
15. ఆ చెట్టు అతనికి వంటచెరకుగా ఉపయోగపడును. దానితో అతడు చలికాచుకొనును. రొట్టెకాల్చుకొనును. కాని ఆ చెట్టుకొయ్యతోనే అతడు విగ్రహమును చేసి ఆరాధించును.
16. అతడు ఆ చెట్టు కొయ్యలో కొంతభాగముతో నిప్పు తయారు చేయును. దానిమీద మాంసము వండుకొని ఆరగించును. ఆ నిప్పుతో చలికాచుకొని “నా యెదుట అగ్గి యున్నది, ఆహా, నాకు వెచ్చగానున్నది” అని తలంచును.
17. మిగిలిన భాగముతో బొమ్మను జేసి దానికి సాగిలపడి నమస్కారము చేసి, “నీవే నాకు దేవుడవు, నన్ను రక్షింపుము” అని ప్రార్థన చేయును.
18. అట్టి జనులకు ఏమియు తెలియదు. ఏమియు అర్థము కాదు. వారి కన్నులు గ్రుడ్డివి కనుక ఏమియు చూడజాలవు. వారి హృదయములు మూయ బడి ఉన్నవి. కనుక ఏమియు గ్రహింపజాలవు.
19. విగ్రహములను చేయువాడు ఆలోచింపడు. “నేను కొంత కొయ్యనుకాల్చి నిప్పుచేసితిని. ఆ నిప్పుమీద రొట్టెకాల్చుకొని మాంసము వండుకొని భుజించితిని. మిగిలినకొయ్యతో ఈ విగ్రహమును చేసితిని. కనుక నేను వట్టి కొయ్యముక్కను ఆరాధించుచున్నాను” అని ఆలోచించునంతటి వివేకమైనా అతనికి లేదు.
20. అతడు బూడిదను తిన్నట్లగును. అతని పిచ్చి తలంపులే అతనిని తప్పుత్రోవ పట్టించెను. అతనికిక సద్గతిలేదు. “తన చేతిలోనున్న బొమ్మ దేవుడు కానే కాదు” అని అంగీకరింపడు.
21. యాకోబూ! నీవు ఈ సంగతులెల్ల గుర్తుంచుకొనుము. యిస్రాయేలూ! నీవు నా సేవకుడవని జ్ఞప్తియందుంచుకొనుము. నేను నీకు రూపమునిచ్చితిని, నీవు నా సేవకుడవు. యిస్రాయేలూ! నేను నిన్ను విస్మరింపను.
22. నేను నీ తప్పిదములను మబ్బువలె ఎగురగొట్టితిని. నీ పాపములను మంచుతెరవలె చెదరగొట్టితిని. నీవు నా చెంతకు మరలిరమ్ము.
23. ప్రభువే ఈ చెయిదమును చేసెను. కనుక ఆకసమా! సంతోషముతో కేకలిడుము. భూమియందలి అగాధస్థలములారా! ఆనంద నాదముచేయుడు. . కొండలారా! అడవిలోని చెట్టులారా! సంతసముతో అరువుడు. ప్రభువు యాకోబును విమోచించెను. యిస్రాయేలును రక్షించి తన మహిమను ప్రదర్శించెను.
24. నిన్ను విమోచించి, గర్భమున పడినప్పటినుండియు, నీకు రూపమునొసగిన ప్రభువు ఇట్లనుచున్నాడు: “సకలమును చేసిన ప్రభువును నేనే. నాయంతట నేనే ఆకాశమును విశాలముగా విప్పితిని, నాయంతట నేనే భూమి రూపొందునట్లు చేసితిని..
25. నేను సోదె చెప్పువారిని భంగపరతును. జ్యోతిష్కులను వెఱ్ఱివారిని చేయుదును. జ్ఞానుల వచనములు వమ్ము జేయుదును. వారి జ్ఞానము హుళక్కి అని నిరూపింతును.
26. కాని నా సేవకుల ప్రవచనములను బలపరతును. నా దూతల ప్రణాళికలను విజయవంతము చేయుదును. నేను యెరూషలేమును గూర్చి 'అచట జనులు మరలవసింతురు' అని చెప్పుదును. యూదా నగరములను గూర్చి 'వానిని మరల నిర్మింతురు' అని ఆజ్ఞ ఇచ్చుదును. ఆ పురములలోని శిథిలగృహములను పునఃనిర్మింతును.
27. నేను 'నీవు ఎండిపొమ్ము , నేను నీ నదులను ఎండబెట్టుదును' అని ప్రవాహముతో చెప్పుదును.
28. నేను కోరెషుతో ఇట్లు చెప్పుదును: 'నీవు నేను నియమించిన కాపరివి. నా సంకల్పమును నెరవేర్చువాడవు. నీవు యెరుషలేమును పునర్నిర్మింపవలెనని పలుకుదువు. దేవాలయమునకు పునాదులెత్తవలెనని నుడువుదువు”.
1. ప్రభువు కోరెషును అభిషిక్తుని గావించెను. జాతులను జయించుటకును, రాజుల అధికారమును అడ్డగించుటకును అతనిని నియమించెను. ప్రభువు అతనికి నగరద్వారములు తెరచును. అట్టి కోరెషుతో ప్రభువు ఇట్లు నుడివెను:
2. “నేను నీకు మార్గము సిద్ధము చేయుటకు కొండలను చదునుచేయుదును. ఇత్తడి ద్వారములను పగులగొట్టి వాని ఇనుపగడెలను విరుగగొట్టెదను.
3. చీకటి తావులలో రహస్యముగా దాచియుంచిన నిధులను నీవశము గావించెదను. అప్పుడు నీవు, నేను ప్రభుడనని తెలిసికొందువు. యిస్రాయేలు దేవుడు నిన్ను పేరెత్తి పిలిచెనని గ్రహింతువు.
4. నా సేవకుడైన యాకోబునకు, నేనెన్నుకొనిన యిస్రాయేలునకు తోడ్పడు నిమిత్తము నేను నిన్ను పేరెత్తి పిలిచితిని. నీవు నన్ను ఎరుగకున్నను, నేను నిన్ను ఘనుని చేసెదను.
5. నేను ప్రభుడను, నాకు సాటివాడు లేడు. నేనుతప్ప వేరొక వేల్పులేడు. నన్ను గూర్చి నీకు తెలియకున్నను, నేను నిన్ను బలాఢ్యుని జేయుదును.
6. దీనివలన తూర్పునుండి పడమటి వరకును గల జనులెల్లరు, నేనుతప్ప మరియొక దేవుడు లేడని తెలిసికొందురు. నేను ప్రభుడను, వేరొక దైవములేడు.
7. వెలుగును చీకటినిగూడ నేనే కలిగింతును. మంచిని చెడునుగూడ నేనే చేయుదును. వీనినెల నేనే చేయుదును.
8. ఆకాశమా! పైనుండి నీతిని కురిపించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు, నీతిని మొలకెత్తించునుగాక! విమోచనను అంకురింపచేయుగాక! ప్రభుడనైన నేను ఈ కార్యము చేయుదును.
9. కుండలలో ఒకటైన మట్టికుండ తనను చేసిన కుమ్మరితో వాదము చేయునా! మట్టి కుమ్మరితో 'నీవేమి చేయుచున్నావు' అని అడుగునా? కుండ కుమ్మరితో 'నీకు నేర్పు చాలదు' అని పలుకునా?
10. బిడ్డడు తండ్రితో 'నీవు నన్నిట్లుకననేల' అని పలుకునా?? అట్లే తల్లితో 'నీవు గర్భమున ధరించినదేమి?" అని అడుగునా?
11. యిస్రాయేలును సృజించినవాడును, యిస్రాయేలు పవిత్ర దేవుడునైన ప్రభువు ఇట్లనుచున్నాడు: “మీరు నా బిడ్డలను గూర్చి నన్ను ప్రశ్నింతురా? నేనేమి చేయవలెనో నాకు నేర్పింతురా?
12. భూమిని చేసినది, దానిమీద నరుని సృజించినది నేనే నా చేతులతో ఆకాశమును విశాలముగా విప్పితిని. నేను సూర్య, చంద్ర, తారకలను నా అధీనమున ఉంచుకొందును.
13. నీతినిబట్టి కోరెషును పురికొల్పినది నేనే. నేను అతడి త్రోవలను సరాళము చేయుదును. అతడు నా నగరమును నిర్మించును. బదులు ధనమునుగాని, లంచమునుగాని పుచ్చుకొనకయే బందీలైన నా ప్రజలను తీసికొనివచ్చును." సైన్యములకధిపతియైన ప్రభువు పలుకిది.
14. ప్రభువు యిస్రాయేలుతో ఇట్లనుచున్నాడు: “ఐగుప్తు కార్మికులును, కూషు వర్తకులును, దీర్ఘకాయులైన సెబా ప్రజలును నీకు దాసులై నీ వారగుదురు. వారు సంకెళ్ళతో నీ వెంటవత్తురు. నీకు వంగి దండము పెట్టి 'దేవుడు నీతోనున్నాడు, అతనికి సాటివాడు లేడు, మరియొక దేవుడులేడు” ' అని విన్నవింతురు.
15. రక్షకుడైన యిస్రాయేలు దేవుడు నిక్కముగా దాగియున్న దేవుడు.
16. ప్రభువు నెదిరించువారు అవమానము చెందుదురు. విగ్రహములను చేయువారు సిగ్గుచెందుదురు.
17. కాని ప్రభువు యిస్రాయేలును రక్షించును. ఆ రక్షణము శాశ్వతమైనది. ఆ ప్రజలు ఇక ఎప్పటికిని, అవమానమునకు గురికారు.
18. ప్రభువు ఆకసమును సృజించెను.ఆయనే దేవుడు. ఆయన భూమికి రూపమునిచ్చి దానిని కలిగించెను. దానిని స్థిరముగా నెలకొల్పేను. ఆ భూమిని నివాసయోగ్యముగా చేసెనుగాని అస్తవ్యస్తముగా చేయలేదు. అట్టి దేవుడు ఇట్లు పలుకుచున్నాడు: “నేనే ప్రభుడను, మరియొక దేవుడు లేడు.
19. నేను రహస్యముగా మాటలాడలేదు. నా సంకల్పమును మరుగుచేయలేదు. నేను యాకోబు వంశజులతో ఆ 'మీరు నన్ను అస్తవ్యస్తమైన తావున వ్యర్ధముగ వెదకుడు' అని చెప్పలేదు. ప్రభుడనైన నేను సత్యమును పలుకుదును. న్యాయమును తెలియజేయుదును.”
20. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “జాతులందు చావును తప్పించుకొని బ్రతికియున్నవారలారా! మీరెల్లరును కలిసి ఇటు రండు, తీర్పునకు సిద్ధముకండు. " కొయ్యబొమ్మలను మోసికొని పోవువారికి, తమను రక్షింపజాలని దైవములకు మ్రొక్కువారికి ఙ్ఞానములేదు.
21. రండు, మీ అభియోగమును న్యాయస్థానమున విన్పింపుడు. అందుకు మీరు ఒకరినొకరు సంప్రతించుకొనుడు. ఈ అంశమును ముందుగా ఎరిగించినదెవరు? దానిని పూర్వమే తెలియజేసినదెవరు? ప్రభుడనైన నేను కాదా? నేను న్యాయవంతుడను, రక్షకుడను. నేను తప్ప మరియొక దేవుడు లేడు.
22. లోకము నాలుగు చెరగులనున్న ప్రజలెల్లరు నా చెంతకువచ్చి లు రక్షణమును బడయుడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు.
23. నేను నా పేరిట ప్రమాణముచేసి చెప్పుచున్నాను. నా ప్రమాణము నీతివంతమైనది, ఆ దానికి తిరుగులేదు. ఎల్లరును నా ముందట మోకరిల్లుదురు. 'మేము నీ ఆజ్ఞానువర్తులమైయుందుము' అని బాస చేయుదురు.
24. నీతియు, బలమును యావేయందే ఉన్నవని ఎల్లరును చెప్పుకొందురు. నన్నెదిరించు వారందరును అవమానము చెందుదురు.
25. యిస్రాయేలు సంతతియెల్ల ప్రభువునందు నీతిమంతులుగా ఎంచబడి అతిశయిల్లును.
1. బేలు దేవత క్రిందికి క్రుంగెను, నెటో దేవత కూలెను. ప్రజలు వారి విగ్రహములను పూర్వము ఆరాధించిరి. కాని ఇపుడు వానిని బరువులు మోయు జంతువుల మీదికెత్తిరి. అవి అలసిపోయిన పశువులకు భారమయ్యెను.
2. ఆ విగ్రహములు క్రుంగేను, కూలెను. అవి తమను తాము రక్షించుకోజాలవయ్యెను. అవి స్వయముగా బందీలై చెరలోనికి వెళ్ళిపోవుచున్నవి.
3. యాకోబు వంశజులారా! . యిస్రాయేలునందు మిగిలియున్నవారలారా! నా మాట వినుడు. మీరు పుట్టినప్పటినుండి నేను మిమ్ము భరించితిని. మీరు జన్మించినప్పటినుండియు నేను మిమ్ము మోసితిని.
4. మీరు వృద్ధులగు వరకును నేను మీకు దేవుడను. మీ తల నెరసినదాక నేను మిమ్ము మోయుదును. నేను మిమ్ము సృజించితిని, మిమ్ము భరింతును. నేను మిమ్ము మోయుదును, రక్షింతును. ప్రభువునకు సాటిదైవము లేడు
5. మీరు నన్నెవనితో పోల్చెదరు? నాకు సాటివాడెవడు? నాకు తుల్యుడెవడు? నా వంటి వాడెవడు?
6. నరులు సంచులు విప్పి బంగారము కుమ్మరింతురు. వెండిని త్రాసున తూచియిత్తురు. ఆ కంసాలికి కూలియిచ్చి ఆ లోహములతో.... విగ్రహము చేయింతురు. తాము దాని ఎదుట సాగిలపడిదండము పెట్టుదురు.
7. దానిని తమ భుజముమీదికెత్తుకొని మోసికొనిపోవుదురు. ఆ బొమ్మనొక తావున పెట్టగా అది అచట నిలిచియుండును. ఆ చోటు నుండి కదలజాలదు. ఎవడైన దానికి ప్రార్థన చేసినచో అది ప్రత్యుత్తరమీయలేదు. అతని ఆపద బాపి అతనిని రక్షింపలేదు.
8. పాపులారా! దీనిని జ్ఞప్తియందుంచుకొనుడు. ఈ కార్యమును గూర్చి ఆలోచింపుడు.
9. పూర్వసంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. నేనే దేవుడను, మరియొక వేల్పులేడు. నేనే దేవుడను, నన్ను పోలినవాడులేడు.
10. మొదటి నుండియు నేను జరుగబోవు కార్యముల నెరిగించితిని. ముందుగానే భవిష్యత్తును తెలియజేసితిని. నేను చెప్పుచున్నాను, 'నా సంకల్పము నెరవేరితీరును. నేను చేయదలచుకొన్న కార్యములెల్ల చేసి తీరుదును'.
11. నేను తూర్పునుండి. వేటాడు పక్షిని పిలిచితిని. దూరప్రాంతము నుండి నా సంకల్పమును నెరవేర్చు వానిని రప్పించితిని. నేను పలికిన మాట నెరవేరితీరును.
12. “మొండివారలారా! మీరు నీతిని దరిచేరనీయరు అయితే నా పలుకులాలింపుడు.
13. నేను నీతిని చేరువలోనికి గొనివచ్చితిని. అది దూరమున లేదు. నా రక్షణము మీకు శీఘ్రమే లభించును. నేను యెరూషలేమును రక్షించి, యిస్రాయేలీయులకు గౌరవము కలిగింతును.”
1. బబులోనియా కుమారీ! నీవు సింహాసనము దిగివచ్చి క్రింది దుమ్ముమీద చతికిలబడుము. కల్దియుల కుమారీ! నీకిక సింహాసనములేదు, నేలమీద కూర్చుండుము. నీ సౌకుమార్యమును, భోగలాలసతయు ఇక మీదట చెల్లవు.
2. నీవిక తిరుగలి త్రిప్పి, పిండి విసరుము. నీ మేలిముసును తొలగింపుము, నీ తొడలు కన్పించునట్లు వస్త్రములను పైకెత్తుకొని ఏరులు దాటుము.
3. ప్రజలు నీవు వస్త్రహీనవై ఉండుటను చూతురు. నీవు దిగంబరివై ఉండుటను కాంతురు. నేను నీకు ప్రతీకారము చేయుదును. నాకెవరును అడ్డు రాజాలరు.
4. సైన్యములకధిపతియైన ప్రభుడని పేరు బడసినవాడును, తన ప్రజలను రక్షించువాడును అయిన యిస్రాయేలు పవిత్రదేవుడు ఇట్లనుచున్నాడు:
5. కల్దీయుల కుమారీ! నీవు ఇక మౌనముదాల్చి చీకటిలో చతికిలబడుము. నిన్నికమీదట రాజ్యములకు సామ్రాజ్ఞీనిగా గణింపరు.
6. నేను నా ప్రజలమీద కోపించితిని. వారికి అవమానము కలుగునట్లు చేసితిని. వారిని నీచేతికి అప్పగించితిని. కాని నీవు వారిపట్ల దయజూపవైతివి. వృద్ధులను గూడ నిర్దయతో జూచితివి.
7. నీవు, నేనెల్లకాలమును, రాణిగా ఉందుననుకొంటివి. ఈ విషయమును ఆలోచింపవైతివి, అంతము ఎట్లుండునో గ్రహింపవైతివి.
8. సుఖములకు మరిగి నాకు ఆపదరాదని భ్రమపడినదానా! వినుము. నేను దేవుడంతటిదానను. నాకు సాటియైన వారెవరునులేరు. నాకు వైధవ్యము కలుగదు, నా బిడ్డలు చనిపోరు అని నీవు తలంచుచున్నావు.
9. దిడీలున, ఒక్కరోజులోనే, ఒక్క నిమిషములోనే ఈ రెండు దురదృష్టములును నీకు వాటిల్లును. నీవు పుత్రశోకమును, వైధవ్యమును పూర్తిగా అనుభవింతువు , నీకు మాంత్రికవిద్యలు శాకునిక తంత్రములు ఎన్ని తెలిసియున్నను అవి నిన్ను ఆదుకోజాలవు.
10. నీ దుష్కార్యములవలన నీకు ధైర్యము కలిగినది నన్నెవరును చూడరులే అని నీవు తలపోసితివి. నీ విజ్ఞానమును, నీ విద్యలును నిన్ను అపమార్గము పట్టించెను. నీవు నేను దేవుడను. నా అంతటి వాడెవడును లేడు అని తలంచితివి.
11. విపత్తు నీ మీదికి ముంచుకొనివచ్చును. నీ మాంత్రికవిద్య దానిని ఆపజాలదు. వినాశనము నీ మీదికెత్తివచ్చును. నీవు దానిని తప్పించుకోజాలవు. నీవు ఊహింపనపుడు వినాశనము దిఢీలున వచ్చి నీమీదపడును.
12. నీవు బాల్యమునుండియు వినియోగించు కొనుచువచ్చిన మాంత్రిక విద్యలు, శాకునిక తంత్రములను కొనసాగింపుము. బహుశః అవి నీకు తోడ్పడవచ్చును. వాటితో నీవు ఇతరులను బెదరగొట్టవచ్చును.
13. నీవెంతగా ఉపదేశమును బడసినను లాభములేదు. నీ జ్యోతిష్కులను రమ్మనుము. వారు నిన్ను రక్షింపగలరేమో చూతము. వారు ఆకాశమును మండలములుగా విభజించి, నక్షత్రములను పరిశీలింతురుగదా! నీకు సంభవింపబోవు సంఘటనములను ప్రతిమాసము నీకు ఎరిగించుచుందురుగదా!
14. ఆ జ్యోతిష్కులు గడ్డితునియల వంటివారు. అగ్నివారిని దహించును. వారు నిప్పుమంటలనుండి , తమను తాము కాపాడుకోజాలరు. ఆ అగ్ని, దగ్గర కూర్చుండి చలికాచుకొను నిప్పువంటిదికాదు.
15. నీవు బాల్యమునుండియు సంప్రతించుచు వచ్చిన ఈ జ్యోతిష్కుల వలన నీకు కలుగు ప్రయోజనమింతియే. వారు నిన్ను విడనాడి ఎవరిదారిన వారు వెళ్ళిపోవుదురు. . నిన్ను రక్షించువారు ఎవరును ఉండబోరు.
1. యాకోబు సంతతీ! యిస్రాయేలు నామధారులారా! యూదవంశజులారా! ఈ సంగతి వినుడు. మీరు ప్రభువు పేరుమీద బాస చేయుదురు. యిస్రాయేలు దేవుని ఆరాధింతురు. కాని మీకు చిత్తశుద్ధి ఏ మాత్రమును లేదు.
2. మీరు మేము పరిశుద్ధ నగరపౌరులమనియు, సైన్యములకధిపతి అని పేరుపొందిన యిస్రాయేలు దేవునిపై ఆధారపడు వారమనియు చెప్పుకొనుచున్నారు.
3. "జరుగనున్న కార్యములను నేను పూర్వమే తెలియ జేసితిని. వానినిగూర్చి స్వయముగా చెప్పియుంటిని. అవి దిఢీలున జరుగునట్లు చేసితిని.
4. మీరు మొండివారని నేనెరుగుదును. నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడిదనియు నేను ఎరుగుదును.
5. నేను పూర్వమే భవిష్యత్ సంఘటనములను మీకెరిగించితిని కనుక మీరు కొలుచు విగ్రహములే, మీ కొయ్యబొమ్మలే, మీ లోహవిగ్రహములే వానిని జరిగించెను అని మీరు చెప్పజాలరు.
6. నేను చెప్పినవన్నియు నెరవేరినవి కనుక మీరు నా వాక్కుల యథార్థమును అంగీకరింపవలెను. నేనిపుడు మీకు క్రొత్త సంగతులు తెలియ జేయుచున్నాను. . వీనిని గూర్చి మీరింతవరకును ఎరుగరు.
7. ఈ కార్యములను నేను ఇప్పుడే నిర్ణయించితిని. వీనిని గూర్చి మీరింత వరకును వినియుండలేదు. కనుక ఈ సంగతులు మీకిది వరకే తెలియునని మీరు చెప్పజాలరు.
8. మీరు నమ్మదగినవారు కారు, మొదటి నుండియు నామీద తిరుగుబాటు చేసినవారు కనుకనే మీరు ఆ విషయములను ఏనాడును వినియుండలేదు. ఆ సంగతులు ఏనాడును మీ చెవిన బడియుండలేదు.
9. "నా నామ కీర్తి కొరకు నేను కోపమును అణచుకొంటిని. ప్రజలు నన్ను స్తుతించుట కొరకు నా ఆగ్రహమును విడనాడితిని. నేను మిమ్ము నాశనము చేయను.
10. వెండిని కుంపటిలో పుటము వేసినట్లుగా, నేను మిమ్ము బాధలు అను కుంపటిలో పుటము వేసితిని.
11. నేను నా కీర్తి కొరకే ఈ కార్యమును చేసితిని. నాకు అపకీర్తి కలుగుటను నేను సహించజాలను. నేను నా కీర్తిని మరియొకరితో పంచుకొనను.
12. “యాకోబూ! నేను పిలిచిన యిస్రాయేలూ! నా పలుకులాలింపుము. నేనే ఆయనను, నేను మొదటివాడను, కడపటివాడను.
13. నేలకు పునాదులెత్తినది నేనే. ఆకాశమును విశాలముగా విప్పినది నేనే. భూమ్యాకాశములను పిలువగా అవి తక్షణమే ప్రత్యక్షమయ్యెను.
14. మీరెల్లరును ప్రోగై నా వాక్కులను ఆలింపుడు. నాకిష్టుడైనవాడు నా చిత్తము నెరవేర్చుటకై బబులోనియా మీదికి దండెత్తెను, కల్దీయులను ముట్టడించెను. ఈ సంగతిని ముందుగా తెలియజేసినవాడు మీలో ఎవడున్నాడు?
15. ఈ ఆజ్ఞలను ఇచ్చినవాడను నేనే. పలుకు పలికినది నేనే, అతనిని పిలిచినది నేనే, అతనిని పంపినది నేనే, అతనికి విజయమొసగినది నేనే.
16. మీరు నా దగ్గరికి వచ్చి నామాటలాలింపుడు. ఆదినుండియు నేను మీతో స్పష్టముగనే మాటలాడితిని. ఎల్లప్పుడును నా పలుకులు నెరవేరునట్లు చేసితిని.” ఇప్పుడు ప్రభువైన దేవుడు నన్నును, తన ఆత్మను పంపెను.
17. మిమ్ము రక్షించు యిస్రాయేలు పవిత్రదేవుడు మీతో ఇట్లనుచున్నాడు: “నేను మీ ప్రభుడనైన దేవుడను. నేను మీమేలు కొరకే మీకు ఉపదేశము చేయుదును. మీరు పోవలసిన త్రోవలో మిమ్ము నడిపింతును.
18. నా ఆజ్ఞలు పాటించియుండిన ఎడల . మీరు పొంగిపారెడు నదివలె వృద్ధిచెందియుండెడి వారు. మీ విజయము సముద్రతరంగముల వలె ఒప్పియుండెడిది.
19. మీ బిడ్డలు ఇసుకవలె విస్తరించుదురు. మీ సంతానము ఇసుక రేణువులవలె సంఖ్యలకు అందకయుండెడిది. వారి నామము నా సన్నిధినుండి , తీసివేయబడదు లేదా మరువబడదు."
20. బబులోనియా నుండి వెడలిపొండు. కల్దీయులనుండి వెళ్ళిపొండు. సంతోషనాదములతో, ఈ సంగతి తెలియజేయుడు. ఈ వార్తను నేల అంచులవరకును విన్పింపుడు. ప్రభువు తనసేవకుడైన యిస్రాయేలును రక్షించెనని పలుకుడు.
21. ప్రభువు తన ప్రజలను ఎడారిగుండ నడిపించినపుడు వారు దప్పికకు గురికాలేదు. ఆయన వారికొరకు తమ బండనుండి నీళ్ళు వెలువడునట్లు చేసెను. ఆయన కొండబండను చీల్చగా జలము స్రవించెను.
22. కాని దుష్టులకు శాంతియుండదని ప్రభువు చెప్పుచున్నాడు.
1. ద్వీపములారా! నా మాటవినుడు. దూరప్రాంతపు జాతులారా! నా పలుకు లాలింపుడు. నేను తల్లికడుపున పడినప్పటినుండియు ప్రభువు నన్ను పిలిచి, నా నామమును జ్ఞాపకము చేసికొనెను.
2. ఆయన నాకు పదునైన కత్తివంటివాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. అతని నన్ను వాడియైన బాణముగా చేసి వాడుకొనుటకుగాను తన అంబులపొదిలో దాచెను.
3. ఆయన నాతో “యిస్రాయేలూ! నీవు నాకు సేవకుడవు. నీ వలన నాకు కీర్తికలుగును” అని చెప్పెను.
4. నేను నిరర్ధకముగా శ్రమపడితిని. నా బలమునంతటిని వినియోగించినను ఫలితము సాధింపజాలనైతినని నేననుకొంటిని. కాని ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును. నా కృషికిగాను నన్ను బహూకరించును.
5. నన్ను మాతృగర్భమున రూపించిన ప్రభువు ఇట్లు సెలవిచ్చెను . యాకోబును తనవద్దకు కొనివచ్చుటకును, యిస్రాయేలును తన చెంతకు చేర్చుటకును ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు ఆయనే.
6. ప్రభువు నాతో ఇట్లు అనెను: “నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, యిస్రాయేలున మిగిలినవారిని : నాయొద్దకు తీసికొనివచ్చుట మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము . నేల అంచులవరకు వ్యాపించును.”
7. జనులు చిన్నచూపు చూచినవానికి, జాతులు అసహ్యించు కొనినవానికి, రాజులకు బానిసయైనవానికి, యిస్రాయేలును రక్షించువాడును, వారి పవిత్రదేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: “రాజులు నిన్ను చూచి - గౌరవసూచకముగా నిలుచుందురు. పాలకులు నీ ముందట శిరమువంతురు. ప్రభువు తనమాట నిలబెట్టుకొనును గనుకను యిస్రాయేలు పవిత్రదేవుడు నిన్నెన్నుకొనెను గనుకను ఈ కార్యము జరుగును.
8. ప్రభువు ఇట్లు అనుచున్నాడు. “నేను నిన్ను కరుణించు సమయము వచ్చినపుడు నీ మొరవిందును. నిన్ను రక్షించు దినము వచ్చునప్పుడు, నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును, నీ ద్వారా జాతులతో నిబంధన చేసికొందును. ఇపుడు బీడువడియున్న నేలమీద నీకు మరల పునరావాసము కల్పింతును.
9. నేను బందీలతో 'మీరు స్వేచ్చగా వెళ్ళుడు' అని చెప్పుదును. చీకటిలో ఉన్నవారితో 'మీరు వెలుగులోనికిరండు' అని పలుకుదును. వారు గొఱ్ఱెలమందవలె మార్గము ప్రక్కన మేయుదురు. కొండలమీది పచ్చికను తిందురు.
10. వారికి ఆకలిదప్పులు కలుగవు. సూర్యతాపము వారిని బాధింపదు.. వారిమీద నెనరుగలవాడే వారిని నడిపించును. ఆయన వారిని నీటి బుగ్గల వద్దకు గొనిపోవును.
11. నేను కొండలగుండ మార్గము వేయుదును. రాజపథమును సిద్ధము చేయుదును.
12. నా జనులలో కొందరు దూరమునుండి వత్తురు. కొందరు ఉత్తరమునుండియు, పడమటి నుండియు వత్తురు. మరికొందరు సీనీము దేశమునుండి వత్తురు.”
13. ఆకసమా! ఆనందనాదము చేయుము. భూమీ! సంతసింపుము. పర్వతములారా! సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును. బాధలకు గురియైన తన జనుల మీద జాలిజూపును.
14. “ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను” అని సియోను పలికెను.
15. స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరచిపోవునా? తన ప్రేవున బుట్టిన బిడ్డమీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను మరువను.
16. నేను నీ పేరు నా అరచేతులమీద చెక్కుకొంటిని. నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచియున్నవి.
17. నిన్ను పునర్నిర్మించువారు శీఘ్రమే వత్తురు. నిన్ను ధ్వంసముచేసినవారు వెళ్ళిపోవుదురు.
18. అదిగో, కన్నులెత్తి చూడుము. నీ ప్రజలెల్లరును ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. ప్రభుడనైన నేను నా జీవము మీదుగా బాసచేసి చెప్పుచున్నాను. నీవు ఆ ప్రజలను ఆభరణమువలె ధరింతువు. వారు నీకు అలంకారముకాగా నీవు వధువువలె నొప్పుదువు.
19. “నీ దేశము నాశనమై పాడువడెను. అది ఇప్పుడు నీ యందు వసింపబోవువారికి సరిపోదు. నిన్ను శిథిలము కావించినవారు నీకు దూరముగానుందురు.
20. ప్రవాసమున నీకు పుట్టినబిడ్డలు నీతో ఈ స్థలము మాకు చాలదు, మాకు ఎక్కువనేల కావలయును అని చెప్పుదురు.
21. అప్పుడు నీవు ఈ బిడ్డలందరిని నాకెవరు పుట్టించిరి? నా బిడ్డలు గతించిరి, నేనిక పిల్లలను కనజాలనైతిని, నన్ను ప్రవాసమునకు నెట్టివేసిరి. ఈ బిడ్డల నెవరు పెంచిరి? నేను ఒంటరిదాననైతిని. మరి ఈ బిడ్డలెచటినుండి వచ్చిరి? అని తలంతువు.
22. దేవుడైన ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “నేను జాతులను పిలుతును. జెండా ఎత్తి వారిని రప్పింతును. వారు నీ పుత్రులను తమ చేతులతో మోసికొని వత్తురు. నీ కుమార్తెలను భుజములమీద మోసికొని వత్తురు.
23. రాజులు మీకు పెంపుడు తండ్రులగుదురు, రాణులు మీకు దాదులగుదురు. వారు మీ ముందట సాగిలపడి మీ పాదములమీది ధూళిని ముద్దిడుకొందురు. అపుడు మీరు నేను ప్రభుడననియు, నన్ను నమ్మినవారు భంగపాటు చెందరనియు గుర్తింతురు.
24. సైనికులనుండి కొల్లసొమ్మును దోచుకోవచ్చునా? క్రూరుడైన నియంతనుండి బందీలను విడిపింపవచ్చునా?
25. కాని ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “సైనికులనుండి బందీలను విడిపింపవచ్చును. క్రూరుడైన నియంతనుండి కొల్లసొమ్ము దోచుకోవచ్చును. మిమ్మెదిరించు వారిని నేను ఎదిరింతును. నేను మీ బిడ్డలను రక్షింతును.
26. మిమ్ము పీడించువారు ఒకరినొకరు చంపి తిందురు. ఒకరినెత్తురొకరు మద్యమువలె త్రాగి మత్తులగుదురు. అప్పుడు ప్రభుడనైన నేనే మీకు రక్షకుడననియు, బలాఢ్యుడననియు, యాకోబు దేవుడనగు నేనే మీకు విమోచకుడననియు జనులెల్లరును గ్రహింతురు.”
1. ప్రభువు ఇట్లనుచున్నాడు: “నేను మీ తల్లిని విడనాడినట్లు పరిత్యాగ పత్రిక ఏమైన ఉన్నదా? నేను నా ఋణదాతలకెవనికైనను మిమ్ము బానిసలనుగా అమ్మివేసితినా? మీ తప్పులకు గాను మీరే బానిసలుగా అమ్ముడుపోతిరి. మీ పాపములకుగాను నేను మీతల్లిని విడనాడ వలసివచ్చినది.
2. నేను రక్షింపవచ్చినపుడు నీ ప్రజలేల అంగీకరింపలేదు? నేను పిలిచినపుడు వారు ఏల ప్రత్యుత్తరమీయలేదు? నా చేయి విమోచింపలేనంత కురచయైపోయెనా? వారిని రక్షించుటకు నాకు శక్తిలేదా? నేను ఒక్క ఆజ్ఞ ఈయగనే సముద్రము ఎండిపోవును, ఏరులు ఎడారియగును. వానిలోని చేపలు నీరులేక నశించును, దప్పికగొని చచ్చును.
3. నేను ఆకాశమును నల్లబరతును. అది దుఃఖముతో గోనె తాల్చినదో అన్నట్లు కన్పించును.”
4. ప్రభువైన దేవుడు నాకు బోధచేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకుగాను ఆయన నాకు సంభాషణా శక్తిని దయచేసెను. శిష్యులు వినునట్లుగ నేనును వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు విను బుద్దిని పుట్టించెను.
5. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డుచెప్పలేదు. ఆయన మాట పెడచెవిని పెట్టలేదు.
6. నన్ను మోదువారికి సకల నేను నా వీపును అప్పగించితిని. వారు నా గడ్డపు వెండ్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని. నా మొగముమీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొగమును దాచుకొనలేదు.
7. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనునుగాన, వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలె గట్టి జేసికొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియును.
8. నన్ను నీతిమంతునిగా యెంచువాడు నా ప్రక్కనే యున్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో అతడును నేనును కలిసి న్యాయస్థానమునకు పోయెదము. నా ప్రత్యర్థి తన అభియోగమును ఋజువు చేయునుగాక!
9. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగల వాడెవడు? నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలె క్షీణింతురు.
10. ప్రభువుపట్ల భయభక్తులు చూపుచు ఆయన సేవకుని మాట పాటించువారలారా! మీరు వెలుగుసోకని చీకటి తావులలో నడవవలసి వచ్చినపుడు, ప్రభువును నమ్మి ఆయనపై ఆధారపడుడు.
11. కాని నిప్పునురాజేసి కొరవులను మండించువారలారా! మీరు మీ నిప్పులోనికే నడతురు. మీ కొరవులలోనే అడుగు పెట్టుదురు. ప్రభువువలన మీకు ఈ గతి పట్టును. మీరు ఘోరబాధలలో చిక్కుకొందురు.
1. “నీతిని అనుసరించువారును, నన్ను వెదకువారును నా పలుకులు ఆలింపుడు. మీరు ఏ రాతినుండి చెక్కబడితిరో, ఏ గవిరినుండి తొలువబడితిరో ఊహింపుడు.
2. మీ తండ్రియైన అబ్రహామును, మీకు జన్మనిచ్చిన సారాను తలంపుడు. నేను అతనిని పిలిచినపుడు అతడు ఒంటరియైయున్నాడు, కాని నేను అతనిని దీవించి, అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని.
3. ప్రభువు సియోనును కరుణించును. శిథిలములైన దాని గృహములను నెనరుతో జూచును. అది అరణ్యమువలె నున్నను, దానిని ఏదెనుతోటనుగా మార్చును. అది ఎడారివలె నున్నను దానిని ప్రభువు వనముగా మార్చును. ఆ నగరమున సంతోషానందములు నెలకొనును, స్తుతిగీతములు విన్పించును.
4. ప్రజలారా! నా మాటవినుడు. జాతులారా! నా పలుకులు ఆలింపుడు. . ఉపదేశమును ఒసగువాడను నేనే. నా ఆజ్ఞలు జాతులకు వెలుగు నొసగును.
5. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా నున్నది. నేను శీఘ్రమేవచ్చి ప్రజలను రక్షింతును. నేనే జాతులను పాలింతును. ద్వీపనివాసులు నా రాక కొరకు ఎదురుచూచుదురు. నేను వచ్చి తమను రక్షింతునని కాచుకొనియుండుదురు.
6. కన్నులెత్తి ఆకసమును పరీక్షింపుడు. భూమిని పరిశీలింపుడు. ఆకసముపొగవలె అదృశ్యమగును. భూమి జీర్ణవస్త్రమువలె పాతబడి పోవును. దానిమీది నరులెల్లరును దోమలవలె చత్తురు. కాని నా రక్షణము కలకాలము నిలుచును, నా నీతికి అంతముండదు.
7. న్యాయమునెరిగినవారలారా! నా ఉపదేశమును హృదయమున నిలుపుకొనిన వారలారా! వినుడు. జనులు మిమ్ము నిందించి అవమానించినను, మీరు భయపడనక్కరలేదు.
8. వారు చిమటలుకొట్టిన వస్త్రములవలెను, పురుగులు తినివేసిన ఉన్నివలెను . అదృశ్యము అగుదురు. కాని నా రక్షణము కలకాలము నిలుచును, నా నీతికి అంతముండదు.”
9. ప్రభూ! మేలుకొనుము, మేలుకొనుము. .నీ బలముతో మమ్ము కాపాడుము. పూర్వమువలె నేడును మేలుకొని ముందు నీ బలమును ప్రదర్శింపుము. నీవు జలభూతమైన రహాబును రెండు ముక్కలుగా చీల్చితివి.
10. అగాధ సముద్రము ఎండిపోవునట్లు చేసితివి. దాని గర్భముగుండ మార్గము కల్పించితివి. ఆ మార్గ ముగుండ నీవు రక్షించిన వారిని నడిపించితివి.
11. నీవు రక్షించినవారు ఆనందనాదముతో సియోనునకు తిరిగివత్తురు. సంతసముతో పాడుచువత్తురు. వారు సదా సంతోషచిత్తులు అగుదురు. దుఃఖ విచారములు ఇక అంతరించును.
12. “మిమ్మును ఓదార్చుటకు నేను ఉన్నాను. గడ్డివలె క్షణమాత్ర జీవియైన నరమాత్రునికి మీరు భయపడవలెనా?”
13. మీరు మిమ్ము సృజించిన ప్రభువును మరచితిరా? ఆకాశమును విశాలముగా విప్పి, నేలకు పునాదులు ఎత్తినవానిని విస్మరించితిరా మిమ్ము పీడించువారిని జూచి, మిమ్ము నాశనము చేయువారిని గాంచి మీరు నిరంతరము. భీతితో కంపింపనేల? వారి కోపము మిమ్ము ఏమియు చేయజాలదు.
14. బందీలు శీఘ్రమే విమోచనము పొందుదురు. వారు చెరలో మరణింపరు. వారికి భోజనము సమృద్ధిగా లభించును.
15. “నేను మీ ప్రభుడనైన దేవుడను నేను సాగరమును పొంగింతును. దాని తరంగములు ఘోషించునట్లు చేయుదును.” సైన్యములకధిపతియైన ప్రభుడని ఆయనకు పేరు.
16. “నేను ఆకాశమును విశాలముగా విప్పితిని, భూమికి పునాదులెత్తితిని. సియోను పౌరులతో, మీరు నా ప్రజలు, నేను మీకు నా ఉపదేశము నొసగితిని. నా హస్తములతో నేను మిమ్ము కాపాడుదునని చెప్పితిని.”
17. యెరూషలేమూ! మేలుకొనుము, మేలుకొనుము. లేచి నిలుచుండుము. నీవు ప్రభువు కోపము అను పాత్రనుండి పానీయమును త్రాగితివి. దానిలోని పానీయమును. పూర్తిగా త్రాగి తూలిపడిపోతివి.
18. నిన్ను నడిపించు వారెవరును లేరు. నీవు కనిపెంచిన ప్రజలలో ఎవరును నీ చేతినిపట్టుకొని నిన్ను తోడుకొనిపోరు.
19. నీకు రెండు ఇక్కట్టులు ప్రాప్తించెను. నీ దేశము యుద్ధమువలన నాశనమయ్యెను. నీ ప్రజలు ఆకలికి చిక్కిరి.. నీ కొరకు విలపించువారెవరును లేరు. నిన్ను ఓదార్చువారెవరును లేరు.
20. నీ ప్రజలు సత్తువనుకోల్పోయి వీధుల అంచులలో కూలిరి. వారు వలలో చిక్కుకొనిన దుప్పివలె ఉన్నారు. వారు ప్రభువు బెదరింపులకును, కోపమునకును గురియైరి.
21. బాధలవలన క్రుంగియున్న యెరూషలేము! మద్యము సేవింపకున్నను త్రాగినదానివలె తూలి పడిపోవుదానా!
22. నిన్ను సమర్థించు నీ దేవుడైన ప్రభువు నీతో ఏమి చెప్పుచున్నాడో వినుము. “నేను కోపముతో నీకందించిన పానపాత్రమును నీ చేతిలోనుండి తీసివేయుదును. " నీవు తూలి పడిపోవునట్లు చేయు పానీయమును ఇక మీదట నీవు సేవింపనక్కరలేదు.
23. నేను ఆ పాత్రమును . నిన్ను పీడించువారికి త్రాగనిత్తును. " మేము దాటిపోవునట్లు క్రిందకు వంగి సాగిలపడుము అని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును, దాటువారికీ దారినిగా చేసి, నేలకు దానిని ఒంచితివికదా! వారి చేతులలో ఆ పాత్రను పెట్టెదను.”
1. సియోనూ! మేలుకొనుము, బలము తెచ్చుకొనుము. పరిశుద్ధనగరమైన యెరూషలేమూ! . సుందరములైన వస్త్రములను ధరింపుము. సున్నతి పొందని అపవిత్రజనులు నీ ద్వారములలో మరల అడుగిడరు.
2. బందీవిగానున్న యెరూషలేమూ! పైకిలేచి నిలుచుండుము. నీ మీది దుమ్ము దులుపు కొనుము. బందీవిగా నున్న సియోను కుమారీ! నీ మెడకు చుట్టుకొనియున్న బంధములను వదలించుకొనుము.
3. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “శత్రువులు మిమ్ము ఊరకనే బందీలుగా చేసిరి. మీకు సొమ్ము చెల్లింపలేదు. ఆ రీతిగనే ఇపుడు నేను మిమ్ము వారి నుండి ఊరకనే విముక్తుల చేయుదును. వారికి సొమ్ముచెల్లింపనక్కరలేదు.
4. మీరు ఐగుప్తునకు వలస వెళ్ళి అచట పరదేశులుగా జీవించితిరి. అస్సిరియా మిమ్ము బందీలనుజేసి కఠినముగా పీడించెను.
5. కాని ఇప్పుడు జరిగినదేమిటి? శత్రువులు మిమ్ము బబులోనియాకు బందీలనుగా కొనివచ్చిరి. మీ యజ మానులు ప్రగల్భములు పలికి నిరంతరము నన్ను అవమానించుచున్నారు.
6. ఆ రోజున నా జనులు నా నామమును తెలుసుకొందురు. 'ఉన్నవాడను' అను నేనే వారితో మాట్లాడుచున్నానని వారు ఆ రోజున తెలుసుకొందురు."
7. శుభవార్తతో పర్వతములమీదుగా నడచివచ్చు వార్తావహుని పాదములెంత మనోజ్ఞముగానున్నవి అతడు చల్లని కబురును, శాంతిని, రక్షణమును తెలియజేయుచున్నాడు. సియోనుతో “నీ దేవుడు రాజు” అని చెప్పుచున్నాడు.
8. నగరమునకు గస్తీ కాయువారు కేకలిడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరచుచున్నారు. ప్రభువు సియోనునకు తిరిగివచ్చుటను కన్నులార గాంచుచున్నారు.
9. యెరూషలేములోని శిథిలగృహములారా! మీరు ఏకకంఠముతో సంతోషముగా అరువుడు. ప్రభువు తన నగరమును కాపాడును. తన జనులను ఓదార్చును.
10. ఎల్లజాతులును చూచుచుండగా ప్రభువు తన దివ్యశక్తిని ప్రదర్శించును. భూధిగంతవాసులెల్లరును మన దేవుని రక్షణమును కాంచుదురు.
11. ప్రభువు దేవాలయ పాత్రములు కొనిపోవువారలారా! మీరు బబులోనియానుండి వెడలిపొండు. అపవిత్ర వస్తువులను ముట్టకుడు. పవిత్రులుగా ఇచటనుండి వెడలిపొండు.
12. కాని మీరు వేగిరముగా వెళ్ళిపోనక్కరలేదు, ఇచటనుండి పారిపోనక్కరలేదు. ప్రభువు మీకు ముందుగా నడచును. యిస్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చుచు, మిమ్ము కాపాడును.
13. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: ఇదిగో, నా సేవకుడు వివేకముబడయును. అతడు ఘనుడై ప్రశంసలందుకొనును.
14. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. ఏ నరుని రూపము కంటెను చాల వికృతమని అతనిని చూచి అనేకులు విస్మయమొందిరో ఆ విధముగనే అతని ముఖమును, ఆకృతియును వికారముగానుండెను
15. కనుకనే ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమొందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కనివిని ఎరుగని సంగతులను తెలిసికొందురు.
1. ప్రజలిట్లు బదులు చెప్పుదురు: మేమిపుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మిరి? ఇది ప్రభువువలన జరిగెనని ఎవరు గ్రహించిరి?
2. దైవచిత్తము వలన అతడు ఎండిననేలలో వేరుపాతుకొని లేతమొక్కవలె పెరిగెను, అతనికి సౌందర్యముగాని, చక్కదనముగాని లేదయ్యెను. మనలను ఆకర్షించు సొగసు ఏమియు అతనిలో కన్పింపదయ్యెను.
3. ప్రజలతనిని చిన్నచూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడును, బాధామయుడును అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనను ఇష్టపడలేదు. జనులతనిని తిరస్కరించుటచే మనమతనిని లెక్కచేయలేదు.
4. అయినను అతడు మన రోగములను భరించెను. మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టెనని మనము భావించితిమి.
5. కాని అతడు మన తప్పిదములకొరకు గాయపడెను. మన పాపములకొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బలద్వారా మనకు స్వస్థత చేకూరెను.
6. మనమందరము గొఱ్ఱెలవలె దారితప్పితిమి. ప్రతివాడును తనకిష్టమైన త్రోవన తొలగిపోయెను. కాని ప్రభువు మన అందరి దోషమును అతని మీద మోపెను.
7. దౌర్జన్యమునకు గురియైనను అతడు వినయముతో సహించెను. పల్లెత్తుమాట అనడయ్యెను. అతడు వధకు గొనిపోబడు గొఱ్ఱెపిల్లవలెను, ఉన్ని కత్తిరింపబడు గొఱ్ఱెవలెను . మౌనముగానుండెనే కాని నోరు తెరవలేదు.
8. అతనిని దౌర్జన్యముగను, అన్యాయముగను కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకొన్నవారే లేరాయెను. అతనిని నరికి సజీవుల లోకమునుండి తొలగించిరి. మన ప్రజల పాపములకొరకు అతనిని వధించిరి.
9. అతడు హింసాపూరితమైనదేదియు చేయకున్నను అతనిలో ఏ కపటము లేకున్నను అతనిని దుష్టుల ప్రక్కన పాతిపెట్టిరి. తన మరణములో ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను.
10. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: అయినను అతనిని బాధాభరితుని చేయవలెననియే నా సంకల్పము. అతడు తననుతానే పాపపరిహారబలిచేయగా అతడు దీర్ఘాయువును బడసి, పుత్రపౌత్రులను జూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును.
11. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును.
12. అతడు తన ప్రాణములను అర్పించెను. దుష్ఠుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి, వారి పాపముల పరిహారముకొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును. అతడు ఘనులలో నొకడుగా గణింపబడును.
1. “గొడ్రాలవైయున్నదానా! సంతసముతో పాటలు పాడుము. ఎప్పుడును ప్రసవవేదన అనుభవింపనిదానా! ఆనందముతో పాడుము. కాపురముచేయు భార్యకంటెను పరిత్యక్తయైన భార్యకు ఎక్కువమంది బిడ్డలు కలుగుదురని ప్రభువు పలుకుచున్నాడు.
2. నీవు వసించుగుడారమును విశాలము చేసికొనుము దాని తెరలను పెద్దవి జేసికొనుము. దాని త్రాళ్ళను పొడిగింపుము. దాని మేకులను గట్టిగా బిగగొట్టుము.
3. నీవు నీ సరిహద్దులను విస్తృతము చేసికొందువు. అన్యజాతులు ఆక్రమించుకొనిన తావులను నీ ప్రజలు మరల స్వాధీనము చేసికొందురు. పాడువడియున్న నీ నగరములు మరల ప్రజలతోనిండును.
4. భయపడకుము, నీవు అవమానము చెందవు. నీవు పరాభవమునకు గురియై లజ్జ చెందనక్కరలేదు. నీవు పడుచుభార్యవుగా నున్నప్పుడు సిగ్గులేని దానివిగా ప్రవర్తించిన తీరును, వితంతువుగా నుండి నిందను తెచ్చుకొనిన తీరును ఇక విస్మరింతువు.
5. నిన్ను సృజించినవాడు నీకు భర్తయగును. సైన్యములకధిపతియైన ప్రభుడని ఆయనకు పేరు. యిస్రాయేలు పవిత్రదేవుడు నిన్ను రక్షించును. విశ్వధాత్రికిని దేవుడని ఆయనకు పేరు.
6. నీవు భర్తచే పరిత్యక్తయై దుఃఖాక్రాంతురాలైన పడుచుభార్య వంటిదానవు. కాని ప్రభువిపుడు నిన్ను మరలచేపట్టును. ఆయన నీతో ఇట్లు పలుకుచున్నాడు:
7. 'నేను నిన్ను ఒక క్షణకాలము విస్మరించితిని. గాఢానురాగముతో నిన్నిపుడు మరల స్వీకరింతును.
8. కోపమువలన ఒక్క క్షణకాలము నా మొగమును నీ నుండి మరుగుజేసికొంటిని. కాని ఇపుడు శాశ్వత కృపతో నిన్ను కరుణింతును' అని నీ రక్షకుడైన ప్రభువు పలుకుచున్నాడు.
9. నా దృష్టిలో ఇవి నోవా దినములవంటివి. జలప్రళయము మరల భూమిని ముంచివేయదని నోవాతో నాడు నేను ప్రమాణము చేసితిని. ఇపుడు నీతో నేను బాసచేయుచున్నాను. నేను నీమీద మరలకోపింపను. నిన్ను మరల చీవాట్లు పెట్టను.
10. పర్వతములు గతించిన గతింపవచ్చునుగాక! కొండలు చలించిన చలింపవచ్చునుగాక! నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. సమాధానపూర్వకమైన నా నిబంధనము తొలగిపోదు అని నీ మీద నెనరు జూపు ప్రభువు పలుకుచున్నాడు.”
11. బాధలకు గురియై విచారమున జిక్కి ఓదార్చువారులేక యున్నదానా! నేను విలువగల మణులతో నిన్ను పునర్నిర్మింతును. నీలమణులతో నీకు పునాదులెత్తుదును.
12. మాణిక్యములతో నీ బురుజులు కట్టుదును. అరుణకాంతులీను మణులతో నీ ద్వారములు కట్టుదును. ప్రశస్తరత్నములతో నీ ప్రాకారమును నిర్మింతును.
13. నీ ప్రజలందరికి ప్రభువే ఉపదేశము చేయును, వారు మిక్కుటముగా వృద్ధిజెందుదురు.
14. నీవు న్యాయమును పాటించి స్థిరముగా నెలకొందువు. నిన్ను పీడించువారును భయపెట్టువారును ఉండరు. భీతి నీ చెంతకు రాజాలదు.
15. నీ మీదికి దండెత్తు వారు నా ఆజ్ఞ లేకయే దండెత్తినట్లగును. నిన్ను ముట్టడించు వారు ఓడిపోవుదురు.
16. నిప్పును రగుల్కొనజేసి ఆయుధములు తయారుచేయు కమ్మరిని నేనే చేసితిని. ఆ ఆయుధములను ఉపయోగించి నరులను చంపు సైనికునిగూడ నేనే చేసితిని.
17. కాని నీ మీద ప్రయోగించుటకు చేసిన ఆయుధమేదియు నీకు కీడు చేయజాలదు. నీ మీద నేరముమోపు ప్రతివానికి నీవు నేరస్థాపన చేయుదువు. ప్రభువు సేవకులకు సిద్ధించు భాగ్యమిది. నేనే వారికి నీతిని ఒసగెదను. ఇదియే వారి స్వాస్థ్యము” ఇది ప్రభువు పలుకు.
1. “దప్పికగొనినవారెల్లరును నీటి చెంతకురండు. ధనములేనివారును వచ్చి ధాన్యముగొని ఆరగింపుడు. రండు, ధనమీయకయే ద్రాక్షారసమును, పాలను కొనుడు.
2. ఆకలి తీర్పజాలని రొట్టెమీద మీ ధనమును వెచ్చింపనేల? మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేల? మీరు నా మాటవినుడు, మీకు మంచిభోజనము లభించును. మీరు శ్రేష్ఠమైన ఆహారమును భుజింతురు.
3. నా మాటవిని నాచెంతకు రండు. నా పలుకులాలింపుడు, మీరు జీవమును బడయుదురు.
4. నేను మీతో నిత్యనిబంధనము చేసికొందును. దావీదునకు వాగ్దానము చేసిన దీవెనలను మీకిత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగాను, అధికారినిగాను నియమించితిని. అతని ద్వారా వారికి నా శాశ్వతకృపను చూపుదును.
5. మీకిదివరకు తెలియని జాతులను మీరు ఇపుడు పిలుతురు. మిమ్ము ఎరుగని ప్రజలు సంతలు మీలో చేరుటకు పరుగెత్తుకొని వత్తురు. మీ ప్రభుడను, దేవుడను, యిస్రాయేలు పవిత్రదేవుడనగు నేను ఈ కార్యము చేయుదును. నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును. ప్రభువు చేరువలోను, దూరమునను ఉండువాడు
6. ప్రభువు దొరుకునప్పుడే ఆయనను వెదకుడు. ఆయన చేరువలోనున్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు.
7. దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక! తమ ఆలోచనను మార్చుకొందురుగాక! వారు ప్రభువువద్దకు మరలివచ్చినచో, .. ఆయన వారి మీద దయజూపును. మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును.
8. “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివికావు. మీ మార్గములు నా మార్గముల వంటివికావు” అని ప్రభువు పలుకుచున్నాడు.
9. "ఆకాశము భూమికెంత ఎత్తుగా ఉండునో మీ మార్గములకంటే నా మార్గములు, మీ ఆలోచనలకంటే నా ఆలోచనలు అంత ఉన్నతముగా నుండును.”
10. వానయు, మంచును ఆకాశమునుండి దిగివచ్చి, ఎచటికిని మరలిపోక, భూమినితడిపి, దానిమీద పైరును మొలిపించి, పంట పండించునో
11. ఆ రీతిగనే నా నోటినుండి వెలువడు వాక్కు కూడ ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగిరాక, నా సంకల్పమును నేరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును.
12. మీరు సంతసముతో వెడలిపోదురు. సమాధానముతో తోడుకొనిపోబడుదురు. మిమ్ముజూచి కొండలు, మెట్టలు సంగీతనాదములు చేయును. పొలములోని చెట్లన్నియు చప్పట్లు కొట్టును.
13. ముండ్లపొదలకు బదులుగా దేవదారులెదుగును. దురదగొండిచెట్లు పెరుగుచోట, గొంజివృక్షములు పెరుగును. దీనివలన ప్రభువునకు కీర్తి కలుగును. అది ఎన్నడును చెరిపివేయబడని జ్ఞాపకసూచనగా నిలిచియుండును.”
1. ప్రభువిట్లు నుడువుచున్నాడు: “మీరు నీతి న్యాయములు పాటింపుడు.. నేను సత్వరమే మిమ్ము రక్షింతును. నా ధర్మము ప్రస్ఫుటమగును.
2. విశ్రాంతి దినమును అపవిత్రముచేయక, దానిని పాటించు వానిని దీవింతును. చెడుకార్యములకు పాల్పడనివానిని నేను ఆశీర్వదింతును.”
3. ప్రభువు ప్రజలలో చేరి పోయిన అన్యజాతిజనుడు ఎవడును “ప్రభువు తన ప్రజల సమాజమునుండి నన్ను బహిష్కరించును” అని తలంపకుండును గాక! నపుంసకుడు ఎవడును “నేను ఎండిన చెట్టును” అని చెప్పకుండును గాక!
4. ప్రభువు ఆ నపుంసకునితో ఇట్లు చెప్పుచున్నాడు: “నీవు నా విశ్రాంతిదినమును పాటింపుము. నా చిత్తము ప్రకా రము జీవించి నా నిబంధనమును అనుసరింపుము.
5. అపుడు నా దేవాలయమునను నా ఆవరణములోను, కుమారులు కుమార్తెలు కలిగినప్పటికంటెను మించిన పేరు నీకు చిరస్మరణీయము గాను మరియు ఎప్పటికిని కొట్టివేయబడనదిగాను పెట్టుచున్నాను. నా ప్రజలలోను నీ నామము స్మరింపబడును. నీకొక జ్ఞాపకచిహ్నము నెలకొనును. నీకు బిడ్డలు కలిగినప్పటి కంటే ఇవ్విధమున నీవెక్కువకాలము స్మరింపబడు దువు. జనులు నిన్ను ఏనాటికిని విస్మరింపరు.”
6. ప్రభువు ప్రజలలో చేరి, ఆయనను ప్రేమించి, సేవించి, ఆయన విశ్రాంతిదినమును పాటించి, నిబంధనము అనుసరించెడు అన్యజాతి ప్రజలకు ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు:
7. “నేను మిమ్ము నా పవిత్రపర్వత మునకు కొనివత్తును. నా ప్రార్థనామందిరమున మిమ్ము సంతోషచిత్తులగావింతును. నా బలిపీఠముపై మీరు అర్పించుబలులను, దహనబలులను స్వీక రింతును. నా మందిరము సకలజాతిజనులకు ప్రార్ధనా మందిరమని పిలువబడును.”
8. యిస్రాయేలును ప్రవాసమునుండి కొనివచ్చిన ప్రభువైన దేవుడు అన్యజనులనుగూడ తీసికొని వచ్చి ఆ యిస్రాయేలీయు లతో చేర్చుదునని ప్రమాణము చేయుచున్నాడు.
9. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: అడవిలోని క్రూరమృగములారా! మ్రింగివేయుటకు రండు.
10. యిస్రాయేలునకు కావలికాయువారు గ్రుడ్డివారు, వారికేమియు తెలియదు. వారు మూగ కుక్కలవలె మొరగలేరు. వారు పరుండి కలలుగాంతురు. నిద్ర అనిన వారికి పరమప్రీతి.
11. వారు ఎంత తినినను తృప్తి చెందని ఆశపోతు కుక్కల వంటివారు. ఆ కాపరులకు ఏమియు తెలియదు, వారిలో ప్రతివాడును తనదారి తాను చూచుకొనును, తన లాభమును తాను కోరుకొనును.
12. మనము ద్రాక్షసారాయమును కొనివత్తము. ఘాటయిన మద్యమును సేవింతము. నేటికంటెను రేపు ఇంకను మెరుగుగానుండును అని వారు పలుకుచున్నారు.
1. నీతిమంతులు వినాశనము చెందుదురు. కానీ దానినెవరును మనస్సున పెట్టరు. దుష్టుల కపటయోచనలనుండి తప్పించుటకై, నీతిమంతులు వారినుండి తీసుకొనిపోబడుదురు. దీనిని ఎవరును యోచింపరు.
2. ధర్మబద్దముగా జీవించువారు చనిపోయిన పిదప శాంతిని బడయుదురు.
3. మాంత్రికుల పుత్రులారా! వ్యభిచారిణుల సుతులారా! వేశ్యల తనయులారా! మీరు తీర్పునకు రండు.
4. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు! మీ నాలుకలు చాచి ఎవరిని గేలిచేయుచున్నారు? మీరు పాపాత్ములు, అసత్యవాదులు
5. మీరు సింధూరముల క్రింద, ప్రతి పచ్చనిచెట్టు క్రింద కామక్రియలు సల్పుదురు. ఏరుల చెంతగల కొండగుహలలో మీ పసిబిడ్డలను బలియిత్తురు.
6. మీరు ఏరులలోని గుండ్రాళ్ళను దైవములుగా కొలుచుచున్నారు. వాని ముందట పానీయార్పణగా ద్రాక్షారసమును పోయుచున్నారు. వానికి ధాన్యబలులు అర్పించుచున్నారు. ఈ కార్యములవలన నేను ప్రీతిజెందెదను అని అనుకొంటిరా?
7. మీరు ఎత్తయిన కొండలమీది కెక్కిపోయి, అక్కడ కామక్రియలు సల్పి బలులర్పించుచున్నారు.
8. మీ గడపకును, తలుపునకును చేరువలోనే విగ్రహమును నెలకొల్పితిరి. మీరు నన్ను తిరస్కరించి, బట్టలు విప్పుకొని, వెడల్పుగానున్న మంచముల మీదికెక్కి, మీరు డబ్బిచ్చి పొత్తుజేసికొనిన కాముకులతో శయనించి, మీ కామతృష్ణను తీర్చుకొనుచున్నారు.
9. అత్తరులను, లేపనములను పూసికొని మోలెకుదేవతను కొలువబోవుచున్నారు. మీరు అన్యదైవములను వెదకుటకు పాతాళలోకము వరకును దూతలను పంపుదురు.
10. మీరు పరదేవతను వెదకివెదకి అలసిపోయితిరి. అయినను మీ పట్టుదలను విడువనైతిరి. మీ విగ్రహములు మీకు బలమును ఒసగునని భావించితిరి. కనుక అలసట చెందరైతిరి.
11. మీరు ఈ దైవములకు భయపడి నన్నువిడనాడితిరి, నన్ను పూర్తిగా విస్మరించితిరి. కాని మీ దైవములు ఏపాటివారు? నేను ఇంతకాలము కన్నులు మూసికొని ఊరకుండినందున మీరు నాకు భయపడరైతిరి కాబోలు.
12. మీరు మీ కార్యములు మంచివే అనుకొనుచున్నారు. కాని నేను మీ ప్రవర్తనను బట్టబయలు చేయుదును. మీ విగ్రహములు మీకెట్టి సాయము చేయలేవు.
13. మీరు మొరపెట్టినపుడు అవి మిమ్ము ఆదుకోగలవేమో చూతము. అవి నరుడు విడిచిన శ్వాసవలె ఎగిరిపోవును. కాని నన్ను నమ్మువాడు భూమిని స్వాధీనముచేసికొనును. నా పవిత్ర పర్వతమును భుక్తము చేసికొనును.
14. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: "మార్గము నిర్మింపుడు, బాట సిద్ధము చేయుడు. త్రోవలోని ఆటంకములనెల్ల తొలగించి నా జనులను తిరిగిరానిండు”.
15. మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రుడైన ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు: "నేను ఉన్నతమైన పవిత్రస్థలమున వసించువాడను. అయినను వినయాత్ములును, పశ్చాత్తాప మనస్కులైన వారితోను వసింతును. వారికి నూత్నబలమును దయచేయుదును.
16. నా ప్రజలను నిరంతరము నిందింపను. వారిమీద సదా కోపింపను. అట్లయిన నేను జీవమొసగిన నరులు, ఆత్మయందు క్షీణించిచత్తురు,
17. వారి పాపములకును, దురాశకును నేను వారిమీద కోపించితిని. వారిని శిక్షించి చేయివిడచితిని. ఆ జనులు మొండితనముతో తమదారిన తాము వెళ్ళిపోయిరి.
18. నేను వారి చెయిదములను గమనించితిని. అయినను వారిని స్వస్థపరుచుదును, వారిని నడిపింతును. శోకార్తులను ఓదార్తును. వారి నోట స్తుతిపలుకులు పలికింతును.
19. సమీపముననున్న వారికి దూరముననున్న వారికి కూడ శాంతినిదయచేయుదును. నా ప్రజలకు చికిత్సచేయుదును.
20. దుష్టులు సంక్షోభముచెందిన సముద్రము వంటివారు. దాని అలలు మట్టిని మురికిని వెళ్ళగ్రక్కును.
21. దుష్టులకు శాంతిలేదు సుమా!” ఇవి ప్రభువు పలుకులు.
1. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: “నీవు బిగ్గరగా కేకలిడుము, బాకానూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారిపాపములను తెలియజేయుము. యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము.
2. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగ గోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్దముగా వర్తించుజాతివలె కన్పింప గోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు ఒసగవలెననియు, తాము నన్ను ఆరాధింప కోరుచున్నామనియు చెప్పుదురు.
3. ప్రజలు ఇట్లు అడుగుచున్నారు: 'ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేల? ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దు ఉండనేల?' ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు! మీరు ఉపవాసము ఉండునపుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు. మీ పనివారిని పీడించుచున్నారు.
4. మీరు ఉపవాసము ఉండునపుడు వివాదములుచేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరు ఈ దినము ఉపవాసముండరు.
5. మీరు ఉపవాసము ఉండునపుడు రెల్లుకాడవలె వంగుదురు. బూడిద మీదను, గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాస మనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా?
6. నేను ఇష్టపడు ఉపవాసమిది: మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడమీదికెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు. వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు.
7. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు. ఇల్లువాకిలి లేనివారికి ఆశ్రయమిండు, బట్టలులేనివారికి దుస్తులిండు." మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు.
8. అప్పుడు నా కృప ప్రాతఃకాల సూర్యునివలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ నీతి మీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము మీ వెనువెంటవచ్చును.
9. మీరు ప్రార్ధించునప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినపుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును, మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు.
10. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు. బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీమీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టునున్న అంధకారము మిట్టమధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును.
11. నేనెల్లపుడును మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరుకట్టిన తోటవలె కళకళలాడుదురు. వట్టిపోని చెలమవలె ఒప్పుదురు.
12. మీ జనులు బహుకాలమునుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరల కట్టినవారుగాను, శిథిలగృహములను పునర్నిర్మించినవారుగాను పేరు తెచ్చుకొందురు.
13. మీరు విశ్రాంతిదినమును పవిత్రము చేయుడు. నా పవిత్రదినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానిని గాను, గౌరవార్హమైనదిగాను భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు.
14. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును. మిమ్ము భూమియందంతట మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారసభూమిని అనుభవింతురు. ఇవి ప్రభువు పలుకులు.”
1. ప్రభువు హస్తము మిమ్ము రక్షింపలేనిదిగా కురచ కాలేదు. ఆయన మీ మనవిని ఆలింపలేని , చెవిటివాడును కాలేదు.
2. మీ పాపములు మీకును దేవునికిని మధ్య అడ్డముగానున్నవి. మీ దోషములవలన ఆయన తన మొగమును మరుగుజేసికొని మీ వేడుకోలును ఆలింపకున్నాడు.
3. మీ చేతులు రక్తముచేతను, మీ వ్రేళ్ళు దోషముచేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్దములాడుచున్నవి. మీ నాలుకలు చెడు మాట్లాడుచున్నవి.
4. మీరు న్యాయస్థానమున . నీతినిబట్టి సాక్ష్యము పలుకుటలేదు. సత్యమును లెక్కచేయుటలేదు. ఎల్లరును కల్లలాడువారే. మీ పన్నాగములతో ఇతరులకు హాని చేయుచున్నారు.
5. మీ కుతంత్రములతో విషసర్పమువలె గ్రుడ్లు పెట్టుచున్నారు. సాలెపురుగులవలె గూళ్ళు అల్లుచున్నారు. ఎవడైనను ఆ గ్రుడ్లలో ఒకదానిని తిన్నచో చచ్చును. ఒక దానిని పగులగొట్టినచో విషసర్పము బయటికివచ్చును.
6. మీ సాలెగూళ్ళవలన ప్రయోజనము లేదు. అవి ఎవరికి బట్టలుగా ఉపయోగపడవు. మీరు దుష్టకార్యములకు పాల్పడుచున్నారు. దౌర్జన్యమునకు పూనుకొనుచున్నారు.
7. మీరు త్వరితముగా దుష్కార్యములకు ఎగబడుచున్నారు. త్వరపడి నిర్దోషులను హత్యచేయుచున్నారు. పాపపు ఆలోచనలు చేయుచున్నారు. మీరు పోయిన తావులందెల్ల వినాశమును తెచ్చిపెట్టుచున్నారు.
8. మీకు శాంతిమార్గము తెలియదు. మీరు చేయునవన్నియు అన్యాయపు పనులే. మీ మార్గములు వంకరటింకరలు.. వానిలో పయనించువారికి శాంతిలేదు.
9. ప్రజలిట్లు పలుకుదురు: కనుకనే ప్రభువురక్షణము మాకు దూరముగానున్నది. ఆయన మమ్ము కాపాడుటలేదు. ఈ మేము వెలుగుకొరకు చూచితిమిగాని, అంతయు చీకటే. ప్రకాశమును ఆశించితిమిగాని, తమస్సులో నడువవలసి వచ్చినది.
10. మేము గ్రుడ్డివారివలె గోడపట్టుకొని నడుచుచున్నాము. అంధులవలె తడుముకొనుచు పోవుచున్నాము. మిట్టమధ్యాహ్నము కూడ చీకటియందువలె పడిపోవుచున్నాము. అంధకార లోకములోని మృతులవలె కాలుజారి పడిపోవుచున్నాము.
11. మేము ఎలుగుబంటివలె ఆక్రోశించుచున్నాము. గువ్వలవలె శోకాలాపము చేయుచున్నాము. మేము న్యాయముకొరకు కాచుకొనియున్నాము గాని అది మాకు లభించుటలేదు. మేము ప్రభువు రక్షణముకొరకు ఎదురు చూచుచున్నాము గాని అది మాకు దూరమున నున్నది.
12. ప్రభూ! మేము నీకు ద్రోహముగా ఎన్నో పాపములు చేసితిమి. మా పాపములు మాకు లు ప్రతికూలముగా సాక్ష్యము పలుకుచున్నవి. మా దోషములు మాకు కన్పించుచునే ఉన్నవి. మేము వానిని బాగుగా ఎరుగుదుము.
13. మేము నీ మీద తిరుగబడి నిన్ను విడనాడితిమి. నిన్ను వెంబడింపమైతిమి. అన్యులను పీడించితిమి, నీనుండి వైదొలగితిమి. మా ఆలోచనలలోను, మాటలలోను విశ్వసనీయత లేదయ్యెను.
14. న్యాయము దూరమయ్యెను, నీతి దగ్గరకు రాదయ్యెను. సత్యము సంతవీధులలో కాలుజారి పడిపోయెను. ధర్మమునకు ప్రవేశము లేదయ్యెను.
15. సత్యము కొరతబడినది. చెడును విడనాడువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరుగుటలేదు. అది ఆయనకు అయిష్టము కలిగించెను.
16. ప్రభువు ఈ సంగతులనెల్ల గమనించెను. న్యాయము అడుగంటుటను చూచి కోపించెను. పీడితులను ఆదుకొను మధ్యవర్తి లేకుండుట గాంచి విస్మయము మొందెను. ఆ కనుక ఆయన పీడితులను కాపాడుటకు ఆయన బాహువు ఆయనకు తోడ్పడెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమయ్యెను.
17. ఆయన నీతిని కవచముగా తాల్చును. రక్షణమును శిరస్త్రాణముగా ధరించును. ప్రతిదండనను వస్త్రముగా తాల్చును. న్యాయమును చక్కబెట్టవలెనను ఆసక్తిని పై వస్త్రముగా ధరించును.
18. ఆయన శత్రువులను వారి క్రియలకు తగినట్లు దండించును. విరోధులను కోపముతో శిక్షించును.
19. తూర్పున ఉన్నవారు ఆయనను గాంచి భయపడుదురు. పడమరన ఉన్నవారు ఆయన ప్రభావము చూచి వెరగొందుదురు. ఆయన ఉదృతితో పారు నదివలె వచ్చును. బలమైన వాయువువలె ఏతెంచును.
20. కాని "అతడు సియోను పౌరులయొద్దకును, పాపమునుండి వైదొలగిన యాకోబుసంతతి వద్దకును రక్షకుడుగా వేంచేయును.
21. ప్రభువు తన ప్రజలతో నిబంధనము చేసి కొనును. ఆయన వారికి తనశక్తిని, ఉపదేశమును దయచేయును. అవి వారిని వారి కుమారులను, కుమార్తెలను ఏనాడును విడనాడవు. ఇవి ప్రభువు పలుకులు.
1. లెమ్ము, ప్రకాశింపుము. నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది.
2. ధరణిని చీకట్లు ఆవరించియున్నను, ఈ జాతులను తమస్సు కప్పియున్నను, నీపైని ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును.
3. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు.
4. కన్నులెత్తి నలువైపుల పరికించిచూడుము. జనులు ప్రోగై నీ చెంతకువచ్చుచున్నారు. నీ కుమారులు దూరప్రాంతములనుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందులవలె మోసికొని వచ్చుచున్నారు.
5. ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీకడకు వచ్చును.
6. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిద్యాను, ఏఫాల నుండి లొట్టిపిట్టలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుండి బంగారమును, సాంబ్రాణిని గొనివచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు.
7. కేదారు గొఱ్ఱెల మందలను నీ వద్దకు తోలుకొని వత్తురు. నెబాయోతు పొట్టేళ్ళను బలికి కొనివత్తురు. అవి ప్రభువునకు అంగీకృతములై, పీఠముపై బలిగావింపబడును. ఆయన తన మందిరమును మహిమాన్వితము చేయును.
8. మేఘములవలెను, గూళ్ళకు చేరు గువ్వల వలెను ఎగురుచు వచ్చెడి ఆ వస్తువులేమిటివి?
9. అవి దూరప్రాంతము నుండియు, తన్టీషు నుండియు ప్రోగయి వచ్చు నావలు. అవి నీ ప్రజలను కొనివచ్చుచున్నవి. అవి వెండి బంగారములతో వచ్చి జాతులు నిన్ను గౌరవించునట్లు చేసినవాడును, యిస్రాయేలు పవిత్రదేవుడునైన నీ ప్రభువు నామమునకు కీర్తి దెచ్చును.
10. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: అన్యజాతులు నీ ప్రాకారమును పునర్నిర్మించును. వారి ఏలికలు నీకు సేవలు చేయుదురు. నేను కోపముతెచ్చుకొని నిన్ను శిక్షించితిని. కాని ఇప్పుడు నిన్ను కరుణించి ఆదరింతును.
11. నీ ద్వారములు నిరంతరము తెరువబడి ఉండును. రేయింబవళ్ళును వానిని తెరచియుంతురు. కావున జాతులు తమ రాజులతో గూడి తమ సంపదలను గొనివత్తురు.
12. నీకు సేవలు చేయనొల్లని జాతులు, రాజ్యములు నిలువవు. అవి సర్వనాశనమగును.
13. లెబానోను నుండి మేలిరకపు కొయ్యను, దేవదారులు, తమాలములు, సరళ వృక్షములను గొనివచ్చి, నా దేవాలయమును సుందరముగా తీర్చిదిద్దుదురు. నేను వసించు నగరము శోభాయమానమగును.
14. నిన్ను పీడించినవారి తనయులు నీ చెంతకువచ్చి, నీకు వంగి నమస్కారము చేయుదురు. నిన్ను చిన్నచూపు చూచినవారే నీ పాదములపై బడుదురు. వారు నిన్ను ప్రభువు నగరమనియు, యిస్రాయేలు పవిత్రదేవుని పట్టణమైన సియోను అనియు పిలుతురు.
15. నిన్నిక మీదట ప్రజలు పరిత్యజింపరు, ద్వేషింపరు, విసర్జింపరు. నేను నిన్ను సదా సర్వోత్కృష్టమైన దానినిగా చేయుదును. నిరతము ప్రమోదము చెందుదానినిగా చేయుదును.
16. జాతులు, రాజులుకూడ నిన్ను దాదివలె పాలిచ్చి పెంచుదురు. ప్రభుడనైన నేను నిన్ను రక్షించితిననియు, బలాఢ్యుడను, యాకోబు దేవుడనైన నేను నీ బానిసత్వమును బాపితిననియు నీవు గుర్తింతువు.
17. నేను నీకు ఇత్తడికి బదులుగా బంగారమును, ఇనుమునకు బదులుగా వెండిని, కొయ్యకు మారుగా ఇత్తడిని, రాళ్ళకు మారుగా ఇనుమును గొనివత్తును. నీ పాలకులు నిన్నిక పీడింపరు. నీ అధికారులు నిన్ను న్యాయముగా పరిపాలింతురు.
18. నీ నేలపై బలాత్కారనాదములిక విన్పింపవు. వినాశనము నీ పొలిమేరల లోపల కన్పింపదు. నీ ప్రాకారములకు రక్షణమనియు నీ ద్వారములకు దైవస్తుతియనియు పేరిడుదువు.
19. నీకిక పగలు సూర్యుని వెలుగును అక్కరలేదు. రేయి చంద్రుని వెన్నెలయు అక్కరలేదు. ప్రభుడనైన నేను నీకు శాశ్వతజ్యోతిని అగుదును. నీ దేవుడనైన నేను నీకు తేజస్సునగుదును.
20. నీ సూర్యుడిక క్రుంగడు. నీ చంద్రుడిక క్షీణదశనొందడు. ప్రభుడనైన నేను నీకు శాశ్వత జ్యోతిని అగుదును. నీ విచార దినములు ఇక ముగియును.
21. నీ ప్రజలు నీతితో వర్తించుచు, భూమిని శాశ్వతముగా భుక్తము చేసికొందురు. నేను నా కీర్తిని ఎల్లరికిని వెల్లడిచేయుటకుగాను వారిని కొమ్మవలె నాటితిని, వారిని సృజించితిని.
22. నీ ప్రజలలో స్వల్పసంఖ్యాకులును పెద్దజాతి అగుదురు. ఊరుపేరు లేనివారును బలమైన జాతి అగుదురు. అనుకూలమైన సమయము రాగానే నేను ఈ కార్యమును శీఘ్రమే నెరవేర్చెదను. నేను ప్రభుడను.
1. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను. ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందినవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను.
2. ప్రభువు అనుగ్రహవత్సరమును గూర్చియు, మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించువారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను.
3. సియోనునందు దుఃఖించువారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనందతైలమును ఒసగుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన 'నీతివృక్షములు' అని దుఃఖార్తులకు పేరిడుదురు.
4. వారు బహుకాలమునుండి శిథిలములై కూలిపోయియున్న గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలమునుండి శిథిలములై పాడువడియున్న నగరములను మరల కట్టుదురు.
5. అన్యదేశీయులు మీ గొఱ్ఱెల మందలను కాయుదురు. మీ పొలములనుదున్ని మీ ద్రాక్షలను పెంచుదురు.
6. మీరు మాత్రము ప్రభువు యాజకులుగాను, మన దేవుని పరిచారకులుగాను గణుతికెక్కుదురు, మీరు జాతులసొత్తును అనుభవింతురు. దానిని దక్కించుకొనినందులకు గర్వింతురు.
7. మీరు రెండంతలుగా అవమానమును అనుభవించితిరి. నిందకును, అపహాసమునకును గురియైతిరి. కావున మీరు మీ దేశముననే రెండంతలుగా సంపదలుబడసి శాశ్వతానందమును అనుభవింతురు.
8. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: ప్రభుడనైన నేను నీతిని అభిమానింతును. పరపీడనను, దుష్టవర్తనను అసహ్యించుకొందును. నేను నమ్మదగినతనముతో నా ప్రజను బహూకరింతును. వారితో శాశ్వతముగ నిబంధనము చేసికొందును.
9. వారు జాతులన్నింటను సుప్రసిద్ధులగుదురు. వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచినవారెల్లరును నేను వారిని దీవించితినని గుర్తింతురు.
10. యెరూషలేము ఇట్లనును; నేను ప్రభువునందు ఆనందింతును. నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణము అను వస్త్రములను తొడిగించెను. నీతి అను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువువలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరునివలెను ఒప్పితిని.
11. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా నేలనుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లను ఆయనను సన్నుతించును.
1. నేను సియోను పక్షమున మాట్లాడకుండ ఉండజాలను. నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము యొక్క నీతి | వేకువ వెలుగువలె ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపమువలె మెరయును.
2. యెరూషలేమూ! జాతులు నీ నీతిని గాంచును. రాజులెల్లరు నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు.
3. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజమకుటముగాను ఒప్పుదువు.
4. నిన్నిక పరిత్యక్తయని పిలువరు. నీ భూమినిక విడువబడిన భార్యయని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయినివని పిలుతురు. నీ భూమిని వివాహిత అని పిలుతురు.
5. యవ్వనుడు కన్యకను వరించిన పెండ్లి చేసుకొనినట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. వరుడు తన వధువును చూసి ఆనందించునట్లే నీ దేవుడును నిన్ను గాంచి సంతసించును.
6. యెరూషలేమూ! నేను నీ ప్రాకారములమీద కావలివారిని నిలిపితిని. వారు రేయింబవళ్ళును మొర పెట్టుచు ప్రభువునకు ఆయన ప్రమాణములను జ్ఞాపకము చేయుచుండవలయునే గాని ఊరకుండరాదు.
7. ప్రభువు యెరూషలేమునకు అభ్యుదయము దయజేసి జనులెల్లరును దానిని శ్లాఘించునట్లు చేయువరకు, వారు ఆయనను వదలిపెట్టకూడదు.
8. ప్రభువు ఖండితముగా ఇట్లు ప్రతిజ్ఞ చేసెను. ఆయన స్వీయబలముతో . ఈ వాగ్దానము నెరవేర్చును. “ఇకమీదట మీరు పండించిన ధాన్యమును మీ శత్రువులు ఆరగింపరు. మీరు శ్రమపడి తయారుచేసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు.
9. మీలో ధాన్యమును నూర్చినవారే దానిని భుజించి ప్రభువును స్తుతింతురు. ద్రాక్షపండ్లను కోసిన వారే వాని రసమును నా దేవాలయ ఆవరణములో పానము చేయుదురు."
10. యెరూషలేము పౌరులారా! మీరు నగరద్వారముల ద్వారా రండు, రండు! తిరిగివచ్చు ప్రజలకొరకు త్రోవ సిద్ధముచేయుడు, సిద్ధము చేయుడు. రాజపథమును నిర్మింపుడు, నిర్మింపుడు. వారికి అడ్డముగానున్న రాళ్ళనెల్లతొలగింపుడు. జాతులకు జెండానెత్తి చూపుడు.
11. ప్రభువు ధాత్రికంతటికిని ఇట్లు తెలియజెప్పుచున్నాడు: “మీరు సియోను కుమారితో ఇట్లు నుడువుడు: “ప్రభువు నిన్ను రక్షింప వచ్చుచున్నాడు, ఆయన తాను విముక్తులను చేసిన ప్రజలను వైభవముగా తనవెంట కొనివచ్చుచున్నాడు.”
12. ఆ విముక్త జనులను ప్రభువు పవిత్ర ప్రజలనియు, ప్రభువు రక్షించినవారనియు పిలుతురు. యెరూషలేమును దేవుడు ప్రేమించు నగరమనియు, దేవుడు పరిత్యజింపని పట్టణమనియు పిలుతురు.
1. ఎదోమునందలి బోస్రా నుండి వచ్చు ఇతడెవడు? వైభవోపేతముగా రక్తవర్ణ వస్త్రములుతాల్చి బలాధిక్యముతో ఠీవిగా విచ్చేయు ఇతడు ఎవడు? “నేను నా నీతిని ఎరిగించువాడను. నా ప్రజలను రక్షించుటకు సమర్థుడనైనవాడను.”
2. ద్రాక్షపండ్లను నలగదొక్కి రసము తీయువానివలె నీ దుస్తులు ఎఱ్ఱగానున్నవేల?
3. “నేను ఒక్కడనే జాతులను , ద్రాక్షపండ్లవలె నలగద్రోక్కితిని. నాకు సాయపడుటకు ఎవరును రారైరి. నేను కోపముతో జాతులను నలగదొక్కితిని. రౌద్రముతో వారినణచితిని. వారి నెత్తురు నా బట్టలమీద చింది పడగా నా దుస్తులన్నిటికి మరకలైనవి.
4. నా ప్రజలను రక్షించుసమయమును, వారి శత్రువులను శిక్షించుకాలమును ఆసన్నమైనదని నేను భావించితిని.
5. నేను సహాయము కొరకు పారజూచితిని గాని నాకు తోడ్పడువాడెవడును' కన్పింపడయ్యెను. ఎవడును నన్ను ఆదుకోనందులకు నేను ఆశ్చర్యపడితిని. కాని నా బాహువే నాకు సహాయమయ్యెను. నా ఉగ్రతయే నాకు ఆధారమయ్యెను.
6. నేను కోపముతో జాతులను నలగదొక్కితిని. ఆగ్రహముతో వారిని కండతుండెములు చేసితిని. వారి నెత్తుటిని నేలపై చిమ్మితిని.”
7. నేను ప్రభువు ప్రేమను కీర్తించెదను, ప్రభువు మనకు చేసిన అద్భుతకార్యములను స్తుతించెదను. ఆయన మిక్కుటమైన కరుణతో ప్రేమతో యిస్రాయేలునకు చాల మేలులు చేసెను.
8. ప్రభువు యిస్రాయేలు గూర్చి వీరు నా ప్రజలు, వీరు నా తనయులు కనుక నన్ను మోసగింపరని ఎంచెను.
9. కనుక వారి ఆపదలు అన్నింటిలోను, ఆయన వారికొరకై బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. దయతో, ప్రేమతో వారిని కాపాడెను. పూర్వదినములన్నింటను ఆయన వారిని ఎత్తుకొని మోసికొనిపోయెను.
10. కాని యిస్రాయేలీయులు ఆయన మీద తిరుగబడి ఆయన పవిత్రాత్మను దుఃఖపెట్టిరి. కావున ఆయన వారికి శత్రువై వారితో పోరాడెను.
11. కాని యిస్రాయేలీయులు మోషేయున్న పూర్వదినములను జ్ఞప్తికి తెచ్చుకొని, తమ ప్రజలనాయకులకు సహకారియై సముద్రము గుండా తమను నడిపించిన ప్రభువేడీ? తన పవిత్రాత్మను తమలో ఉంచినవాడేడి? అని ప్రశ్నించిరి.
12. స్వీయశక్తితో మోషేద్వారా మహాకార్యములు సల్పి, నీళ్ళను పాయలుగా చేసి, కీర్తిని బడసిన ప్రభువేడీ? అని అడిగిరి.
13. గుఱ్ఱము ఎడారిలో కాలుజారి పడకుండ నడచినట్లే తన ప్రజలను సముద్రము గుండ నడిపించిన ప్రభువేడీ? అని ప్రశ్నించిరి.
14. ఎద్దులను పచ్చికలోయలోనికి తోలుకొని పోయినట్లే ప్రభుని ఆత్మ , తన ప్రజలను విశ్రమ స్థానమునకు కొనిపోయెను. ఆ రీతిగా ఆయన ప్రజలను నడిపించిన తనకు కీర్తి తెచ్చుకొనెను.
15. ప్రభూ! పరమునుండి, పవిత్రమును మహిమాన్వితములైన నీ నివాసస్థలము నుండి మమ్ము కరుణతో వీక్షింపుము. నీకు మా పట్ల ఆదరభావమేది? నీ శూర కార్యములేవి? నీ నెనరేదీ? నీ ప్రేమ యేదీ? నీవు మమ్ము పట్టించుకోవా?
16. నిక్కముగా నీవే మాకు తండ్రివి. "అబ్రహాము మమ్మెరుగకపోయినను, యాకోబు మమ్మును అంగీకరింపకపోయినను, యావే, నీవే మా తండ్రివి. అనాదికాలము నుండి మా విమోచకుడవని నీకు పేరే కదా!
17. ప్రభూ! నీవు మేము నీ మార్గమునుండి వైదొలగునట్లు చేసితివేల? మేము నీకు భయపడకుండునట్లు మా హృదయములను నీవేల కఠినపరిచితివి? నీ దాసులను చూచి, నీ వెన్నుకొనిన తెగలను చూచి నీవు మా యొద్దకు మరలిరమ్ము.
18. దుష్టులు నీ మందిరమున అడుగిడనేల? మా శత్రువులు నీ దేవాలయమును తమ కాళ్ళతో తొక్కనేల?
19. చాలకాలమునుండి మేము నీ పరిపాలనకు నోచుకోని జనులవంటి వారమైతిమి. నీకుచెందని ప్రజలవంటి వారమైతిమి.
1. నీవు గగనమును చీల్చుకొని క్రిందికి దిగిరావేల? అప్పుడు కొండలు నిన్ను చూచి గడగడవణకును.
2. అవి అగ్నికి కాలిపోయెడు పొదవలెను, నిప్పునకు కాగెడు నీటివలెను కంపించును. నీవు వచ్చి నీ విరోధులకు నీ నామమును తెలియజేయుము. జాతులు నిన్ను చూచి భీతితో కంపించునట్లు చేయుము.
3. పూర్వము నీవు మేము ఊహింపని అద్భుతకార్యములు చేసినపుడు, కొండలు నిన్నుచూచి గడగడవణకెను.
4. తనను నమ్మినవారికి ఇట్టి ఉపకారములు చేసిన దేవుని ఇంతవరకు ఎవరును చూచియుండలేదు. ఎవరును అట్టివానిని గూర్చి వినియుండలేదు.
5. ధర్మమును ప్రీతితో పాటించుచు, నీ మార్గములను విస్మరింపని వానిని నీవు ఆహ్వానింతువు. నీవు కోపించినను లెక్కచేయక మేము పాపము కట్టుకొంటిమి. నీ ఆగ్రహమును లెక్కచేయక పూర్వము నుండియు మేము పాపము చేయుచునే యుంటిమి.
6. మేమెల్లరమును అపవిత్రులమైతిమి. మా పుణ్యక్రియలు మలినవస్త్రము వంటివయ్యెను. మేము ఆకులవలె ఎండిపోయితిమి. మా కిల్బిషములు మమ్ము గాలివలె ఎగురగొట్టెను.
7. నీకు ప్రార్థనచేయు వాడెవడును లేడయ్యెను. నిన్నాశ్రయించు వాడెవడును కన్పింపడయ్యెను. నీవు నీ దివ్యముఖమును మా నుండి మరుగు జేసికొంటివి. మా అపరాధములను చూచి మమ్ము చేయి విడచితివి.
8. అయినను ప్రభూ! నీవు మాకు తండ్రివి. మేము మట్టిమి, నీవు కుమ్మరివి. నీవే మమ్మెల్లరిని సృజించితివి.
9. ప్రభూ! మా మీద మిక్కుటముగా కోపింపకుము. మా పాపములను సదా జ్ఞప్తియందుంచుకొనకుము. మమ్ము కరుణతో వీక్షింపుము. మేమెల్లరమును నీ ప్రజలము.
10. నీ పవిత్రనగరములు ఎడారులైనవి సియోను పాడువడినది. యెరూషలేము బీడు వడినది.
11. పవిత్రమును, సుందరమునైన మా దేవళమును, మా పితరులు నీకు ప్రార్ధన చేసిన ఆ మందిరమును నిప్పుతో తగులబెట్టిరి. మాకు ప్రీతిపాత్రములైన స్థలములన్నియు నాశనమయ్యెను.
12. ప్రభూ! ఈ కార్యములెల్ల చూచి నీవు ఊరకుందువా? నీవు మౌనము వహించి మమ్మధికముగా శిక్షింతువా?
1. ప్రభువు ఇట్లనెను: నేను ప్రజల మనవులను ఆలించుటకు సిద్ధముగనే ఉంటిని గాని, వారు నాకు మొర పెట్టలేదు. నేను వారికి దర్శనమీయ గోరితినిగాని, వారు నాచెంతకు రానేలేదు. నేను మీకు సాయ పడుటకు “ఇచట ఉన్నాను, ఇచట ఉన్నాను” అని పలికినను, ఈ జనులు నా నామమున ప్రార్ధన చేయలేదు.
2. నేను నిరంతరము చేతులు చాచి ఈ ప్రజలను చెంతకు ఆహ్వానించుచుంటిని. కాని వారు మొండివారై దుష్కార్యములు చేసిరి. తమ ఆలోచనల ప్రకారము తాము ప్రవర్తించిరి.
3. నన్ను లెక్కచేయక నిరంతరము నాకు కోపము రప్పించిరి. వనములలొ బలులర్పించిరి. బలిపీఠములపై సాంబ్రాణిపొగ వేసిరి.
4. రేయి సమాధులలో, రహస్యస్థలములలొ గడపిరి. పందిమాంసము తినిరి. నిషిద్ధ భోజనములు ఆరగించిరి.
5. వారు 'మా దరిదాపునకు రావలదు. ఎడముగా ఉండవలెను. మీకంటే మేము పవిత్రులము' అని చెప్పుదురు. “వీరు నా నాసిక రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు.
6. వారి శిక్ష నా ఎదుట గ్రంథములో లిఖింప బడియున్నది. నేనిక ఊరకుండను. వారి పాపములకు ప్రతీకారముగా వారిని దండించి తీరుదును.
7. వారి తప్పిదములకును, వారి పితరుల తప్పిదములకును వారిని శిక్షింతును. వారు కొండల మీద సాంబ్రాణిపొగ వేసి నన్ను నిందించిరి. కావున నేను వారి పాపము లకు తగినట్లుగా వారిని శిక్షించి తీరుదును.”
8. ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు: “కొత్త ద్రాక్షరసము తీయునపుడు గుత్తిలో ఇంకను రసమున్నచో జనులు 'దానిని పారవేయవద్దు, అది దీవెన కరమైనది. దానిలో రసమున్నది' అని పలుకుదురు కదా! అట్లే నేను ప్రజలందరిని నాశనము చేయను. నన్ను సేవించువారిని నేను కాపాడుదును.
9. నేను యాకోబునుండి సంతానమును, నా పర్వతములను స్వాధీనము చేసికొనుటకు యూదానుండి జనులను పుట్టింతును. నా సేవకులును, నేను ఎన్నుకొనిన వారును ఆ కొండలలో వసింతురు.
10. వారు నన్ను పూజింతురు. షారోను మైదానములో తమ గొఱ్ఱెలను మేపుకొందురు. ఆకోరులోయ తమ పశువులు పరుండు స్థలముగా ఉండును.
11. కాని నన్ను పరిత్యజించి, నా పవిత్ర పర్వతమును విస్మరించి గాదు అను అదృష్ట దేవతకు భోజనార్పణమును, మెనీ అను భాగ్యదేవరకు పానీయార్పణమును చేయువారిని
12. నేను కత్తికి ఎరజేయుదును. మీరెల్లరు యుద్ధమున కూలుదురు. నేను పిలిచినపుడు మీరు పలుకలేదు. నేను మాట్లాడినపుడు మీరు వినలేదు. మీరు నేనొల్లని కార్యములు చేసి నాకు అప్రియము కలిగించితిరి.”
13. ప్రభువైన యావే ఇట్లు పలుకుచున్నాడు: “నా సేవకులు కడుపునిండ భుజింతురు. కాని, మీరు ఆకలితో అలమటింతురు. నా దాసులు పానీయము సేవింతురు. కాని మీరు దప్పికగొందురు. నా దాసులు సంతోషింతురు. కాని మీరు అవమానమున మునుగుదురు.
14. నా సేవకులు సంతసముతో పాడుదురు. కాని మీరు విచారముతో విలపింతురు, దుఃఖముతో అంగలారురు.
15. నేను ఎన్నుకొనిన ప్రజలు మీ పేరును శాపవచనముగా వాడుకొందురు. ప్రభుడను, యావే నైన నేను మిమ్ము సంహరింతును. కాని నేను నా సేవకులకు నూత్ననామము నొసగుదును.
16. దేశమున దీవెన కోరుకొనువాడు విశ్వసనీయుడైన దేవుని నుండియే ఆ దీవెనను కోరుకొనును. ఒట్టు పెట్టుకొనువాడు నమ్మదగిన దేవుని పేరుమీదనే ఆ ఒట్టు పెట్టుకొనును. నేను పూర్వపుబాధలను పట్టించు కొనను, వానిని స్మరించను.
17. ఇదిగో! నేను నూత్నదివిని, నూత్నభువిని సృజింతును. పూర్వసంఘటనలను ఇక ఎవరును జ్ఞప్తికి తెచ్చుకొనరు.
18. నేను సృజింపబోవువానిని గాంచి మీరు సదా ఆనందింపుడు. నేను కలిగింపబోవు యెరూషలేము సంతసముతో నిండియుండును.ఆ నగరపౌరులు ఆనందముతో అలరారుదురు.
19. నేనును యెరూషలేమును చూచి ఆనందింతును. నా ప్రజలను గాంచి హరింతును. ఆ పట్టణమున ఇక ఏడుపులు గాని, సహాయమునకై అంగలార్పులుగాని విన్పింపవు.
20. శిశువులకు బాల్యమరణములు ఉండవు. వృద్దులు నిండు జీవితము జీవింతురు. ప్రతివాడు నూరేండ్లు జీవించిగాని కన్నుమూయడు. నూరేండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును.
21. ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు. ద్రాక్షతోటలు నాటుకొని వాని ఫలములారగింతురు.
22. వారు కట్టిన ఇండ్లలో అన్యులు వసింపరు. వారు నాటిన ద్రాక్షాఫలములను ఇతరులు అనుభవింపరు. నా ప్రజలు వృక్షములవలె దీర్ఘకాలము జీవింతురు నేను ఎన్నుకొనినవారు తమ కృషిఫలము తాము అనుభవింతురు.
23. వారి ప్రయాసము వ్యర్ధముగాదు. వారి పిల్లలకు దురదృష్టము వాటిల్లదు. నేను వారిని,వారి సంతానమునుగూడ దీవింతును
24. వారు మొరపెట్టక మునుపే వారి విన్నపమును విందును. వారు ప్రార్థనచేసి ముగింపక మునుపే వారి వేడుకోలును ఆలింతును.
25. తోడేలు, గొఱ్ఱెపిల్లయు కలిసి మేయును. సింగము ఎద్దువలె గడ్డిమేయును. పాము మన్నుతినును. నా పవిత్ర పర్వతమైన సియోనునందంతటను ఎట్టిహానియు, ఎట్టికీడును కలుగదు. ఇవి ప్రభువు పలుకులు.”
1. ప్రభువు ఇట్లనుచున్నాడు: ఆకాశము నాకు సింహాసనము. భూమి నాకు పాదపీఠము. మీరు నాకెట్టి మందిరమును కట్టుదురు? ఎట్టి విశ్రమ స్థానమును నిర్మింతురు?
2. భూమ్యాకాశములను నేనే చేసితిని. ఇవి అన్నియు నావే. ఇవి ప్రభువు పలుకులు. వినయాన్వితుడును, పశ్చాత్తాపమనుస్కుడునై నా వాక్కులకు భయపడు నరుని నేను ప్రీతితో చూతును.
3. ఎద్దును బలియిచ్చువాడు నరుని చంపువాడే. గొఱ్ఱె పిల్లను బలియిచ్చువారు శునకము మెడను విరుచువాడే. ధాన్యమును అర్పించువాడు, పందిరక్తమును అర్పించువాడే. సాంబ్రాణిపొగ వేయువాడు విగ్రహములను స్తుతించువాడే. ఈ జనులు తమకిష్టము వచ్చినట్లుగా ప్రవర్తించుచున్నారు. వారి కార్యములు హేయములైనను వారికవి బాగుగానే యున్నవి.
4. కావున నేను వారిని కడగండ్లపాలు చేయుదును. వారు భయపడు అశుభములే వారినెత్తి మీది కెక్కును. నేను పిలిచినను ఎవడును పలుకలేదు. నేను సంభాషించినను ఎవడును వినలేదు. వారు నేనొల్లని కార్యములు చేసి నాకు అప్రియము కలిగించిరి.
5. ప్రభువు వాక్కునకు భయపడువారలారా! మీరు ఆయన పలుకులాలింపుడు. నా నామము నిమిత్తము మీ సహోదరులు మిమ్ము ద్వేషింతురు. మిమ్ము త్యజింతురు. వారు ప్రభువును తన మాహాత్మ్యము చూపింపుమనుచు, 5) మీరెట్లు సంతసింతురో మేము చూతుము అనుచున్నారు. కాని వారు నగుబాట్లు తెచ్చుకొందురు.
6. పట్టణమునుండి వినిపించు ఆ కోలాహలమును, ఆ దేవళమునుండి విన్పించు ఆ ధ్వనిని ఆలింపుడు. అది ప్రభువు తన శత్రువులను శిక్షించు ధ్వని.
7. ప్రసవవేదన రాకమునుపే యెరూషలేము ప్రసవించినది. పురిటినొప్పులు రాకపూర్వమే మగబిడ్డను కనినది.
8. ఇంతకు పూర్వము ఇట్టివార్తను ఎవరైనను వినిరా? ఇట్టి సంగతిని ఎవరైనను చూచితిరా? ఏ దేశమైనా ఒక్కరోజులో పుట్టునా? ఏ జాతియైన దిఢీలున ఉద్భవించునా? కాని సియోను మాత్రము పురుటినొప్పులు ప్రారంభము కాగానే సుతులను కనెను.
9. నేను గర్భము నాశీర్వదించిన పిదప శిశువును కలిగింపకుందునా? కడుపు పండించిన పిదప గర్భమును మూసివేయుదునా? ఇవి ప్రభువు పలుకులు.
10. యెరూషలేమును ప్రేమించువారెల్లరు ఆ నగరమును చూచి సంతసింపుడు. ఆ పట్టణముతోపాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించినవారు ఇప్పుడు దానితోపాటు సంతోషింపుడు.
11. మీరు యెరూషలేమను తల్లినుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పునొసగు ఆమె పాలిండ్లనుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు
12. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: “నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలె పారింతును. జాతులసంపదలను పొంగి పొరలు కాలువవలె ఆ నగరముమీదికి పారింతును. యెరూషలేము అనుతల్లి మీకు చంటిబిడ్డలకువలె పాలిచ్చును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును. తన వడిలో కూర్చుండబెట్టుకొని లాలించును.
13. తల్లి బిడ్డలను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్చును యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు.
14. ఈ కార్యము జరిగినపుడు మీరు సంతసించి పచ్చిగడ్డివలె కళకళలాడుదురు ప్రభుడనైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. -గ్రహమును ప్రదరింతును
15. చూడుడు! ప్రభువు అగ్నితో విజయము చేయుచున్నాడు. తుఫాను పైనెక్కి వచ్చుచున్నాడు. ఆయన ఉగ్రకోపముతో తనశత్రువులను శిక్షించును ఆగ్నిజ్వాలలతో వారిని గడగడలాడించును.
16. ఆయన అగ్నితోను, ఖడ్గముతోను దుష్టులనందరిని శిక్షించును. అనేకులు ఆయనవలన చత్తురు.
17. పవిత్రతను పొందవలయునను తలపుతో శుద్ధి చేసికొని, ఒకరివెంటనొకరు వరుసగా పవిత్రవనములలో ప్రవేశించి పందిమాంసమును, ఎలుకలను, హేయములైన క్రిములను భుజించువారికి చావుమూడును, వారి ఆలోచనలు క్రియలు నాకు తెలియునని ప్రభువు పలుకుచున్నాడు.
18. నేను జాతులన్నింటిని ప్రోగు చేయుటకు వచ్చుచున్నాను. వారెల్లరును వచ్చి నా మహిమను గాంతురు. నేను తమను శిక్షించువాడనని వారు గ్రహింతురు.
19. వారియెదుట ఒక సూచకక్రియను ఉంచుదును. నేను వారిలో కొందరిని తప్పింతును. వారిని నా పేరు వినని, నా మహిమచూడని జాతుల యొద్దకు పంపుదును. దూరప్రాంతములందలి ప్రజలయొద్దకు పంపుదును. వారు తర్షీషు, పూతు, లూదు, తులాలు, యావాను మొదలగు తావులకు పోయి, అచటి జనులకు నా మాహాత్మ్యమును ఎరిగింతురు
20. అన్ని జాతులనుండియు మీ స్వదేశీయులను నాకు కానుకగా కొనివత్తురు. యిస్రాయేలీయులు పవిత్రపాత్రములలో దేవాలయమునకు ధాన్యబలిని కొనివచ్చినట్లే వారు ఆ ప్రజలను గుఱ్ఱముల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెలమీదను, రథములలోను, డోలికలలోను కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్రపర్వతమున చేర్తురు
21. నేను వారిలో కొందరిని యాజకులుగాను, లేవీయులుగాను నియమింతును. ఇవి ప్రభువు పలుకులు.
22. నేను సృజింపబోవు నూత్న దివి, నూత్న భువి లయముకాక నా సన్నిధిని సదా నిలిచియుండునట్లే మీ సంతతియు, మీ పేరును శాశ్వతముగా నిలుచును.
23. ప్రతి అమావాస్యనాడును, ప్రతి విశ్రాంతిదినమునను సకలజాతి ప్రజలు నా సమక్షమునకు వచ్చి నన్ను ఆరాధింతురు, ఇవి ప్రభువు పలుకులు.
24. వారు తిరిగిపోవుచు నాకు ఎదురుతిరిగినవారి శవములను గాంతురు. వానిని తినివేయు పురుగులు ఎన్నటికిని చావవు. వానిని కాల్చు నిప్పు ఎన్నటికిని చల్లారదు. ఆ పీనుగులు ఎల్లరికిని హేయముగా ఉండును.