ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 33

 1. మోషే అహరోనుల నాయకత్వమున ఐగుప్తునుండి వెడలివచ్చిన యిస్రాయేలు సమాజము విడిదిచేసిన తావుల జాబితా యిది.

2. ఎడారిలో ఏ తావునైన విడిదిచేసినపుడు మోషే ప్రభువు ఆజ్ఞననుసరించి ఆ తావు పేరు లిఖించుచువచ్చెను. వారి విడుదుల పేర్లివి:

3. యిస్రాయేలీయులు ఏడాదిలో మొదటినెల పదునైదవ దినమున, తొలి పాస్క ఉత్సవమును జరుపుకొనిన దినమునకు మరుసటి దినమున ఐగుప్తునుండి బయలుదేరిరి. ఐగుప్తీయులు కన్నులార చూచుచుండగనే వారు విజయోత్సాహముతో రామెసేసు పట్టణమునుండి బయలుదేరిరి.

4. ప్రభువు సంహరించిన తమ తొలిచూలు పిల్లలను ఐగుప్తీయులు అపుడు పాతి పెట్టుకొనుచుండిరి. ఆ రీతిగా ప్రభువు ఐగుప్తీయులు కొలుచు దేవతలకు తీర్పుతీర్చెను.

5. ప్రజలు రామెసేసును వీడివచ్చి సుక్కోత్తున విడిదిచేసిరి.

6. సుక్కోత్తునుండి కదలి ఎడారి అంచున నున్న ఏతామున దిగిరి.

7. అచటినుండి సాగి వెనుకకు మరలి బాల్సెఫోనునకు తూర్పునున్న పీహహిరోత్తును చేరి మిగ్దోలు చెంత మకాముచేసిరి.

8. ఆ తావును వీడి రెల్లు సముద్రమును దాటి ఎడారిలో ప్రవేశించిరి. ఏతాము ఎడారిలో మూడునాళ్ళు ప్రయాణముచేసి మారా వద్ద విడిదిచేసిరి.

9. అచటినుండి ఏలీము చేరుకొనిరి. ఈ ఏలీమున పండ్రెండు చెలమలు, డెబ్బది ఖర్జూర వృక్షములు కలవు. గనుక అచట విడిది చేసిరి.

10. ఏలీము నుండి బయలుదేరి రెల్లు సముద్రము చెంత దిగిరి.

11. అటుపిమ్మట సీను ఎడారిచేరి అచట బసచేసిరి.

12. తరువాత దోఫ్కా వద్ద దిగిరి.

13. పిమ్మట ఆలూషున మకాము చేసిరి.

14. అటు తరువాత రెఫీదీమున ఆగిరి. ఇచట వారికి త్రాగుటకు నీళ్ళు దొరకలేదు.

15-37. రెఫీదీము నుండి హోరు పర్వతము వరకు వారు చేసిన విడుదులివి: సీనాయి ఎడారి, కిబ్రోతుహట్టావా, హాసెరోత్తు, రీత్మా, రిమ్మోను, పేరేసు, లిబ్నా, రీస్సా, కెహేలతా, సేఫేరా పర్వతము, హారదా, మాఖేలోత్తు, తాహతు, తేరా, మిత్కా హాష్మోను, మోసేరోత్తు, బెనెయాకాను, హోరు, హగ్గిద్ఘాదు, యోత్బాతా, అబ్రోనా, ఏసోన్గె‌బేరు కాదేషు అనబడు సీను ఎడారి, ఏదోము అంచుననున్న హోరు పర్వతము.

38-39. ప్రభువు ఆజ్ఞ చొప్పున యాజకుడగు అహరోను హోరు కొండమీదికెక్కి అచటనే ప్రాణములు విడిచెను. అప్పుడతనికి నూట యిరువది మూడేండ్లు, అది యిస్రాయేలీయులు ఐగుప్తునుండి వెడలివచ్చిన నలువదియవ యేట ఐదవనెలలో మొదటిరోజు.

40. కనానుమండలము దక్షిణ భాగము పాలించు ఆరదు రాజు యిస్రాయేలీయులు వచ్చుచున్నారన్న వార్త వినెను.

41-49. హోరు పర్వతమునుండి మోవాబు మండలము వరకు యిస్రాయేలీయులు చేసిన విడుదులివి: సాల్మోనా, పూనోను, ఓబోతు, మోవాబు మండలములోని యియ్యెఅబరీము, దీబోనుగాదు, అల్మోను, దిబ్లతాయీము, నేబో పర్వతము చెంతనున్న అబారీము కొండ, మోవాబు మైదానమున యెరికో చెంతగల యోర్దాను తీరము. వారు మోవాబు మండలమున బేత్యేషిమోతు, ఆబేలు హాషిత్తీము ప్రదేశములకు మధ్య యోర్దాను తీరమున విడిదిచేసిరి.

50. ఆ మోవాబు మైదానమున యెరికో ఎదుట నున్న యోర్దాను తీరమున ప్రభువు మోషేను ఇట్లు ఆజ్ఞాపించెను:

51-52. “మీరు యోర్ధాను దాటి కనాను మండలమున ప్రవేశించినపిదప అచట ఆ దేశనివాసులందరిని తరిమివేయుడు. వారి రాతి విగ్రహములను, పోతబొమ్మలను, ఆరాధన స్థలములను నాశనము చేయుడు.

53. ఆ నేలను నేను మీకు ఇచ్చితిని గనుక మీరు దానిని స్వాధీనపరచుకొని అచట నివసింపుడు.

54. చీట్లు వేసి ఆయా తెగలకు, వంశములకు ఆ దేశమును వంచి పెట్టుము. పెద్ద వంశములకు పెద్దభాగములను, చిన్నవంశములకు చిన్న భాగములను పంచియిమ్ము. ఏ చీట్లకు ఏ భాగమువచ్చునో ఆ భాగమునే ప్రజలు తీసికొనవలెను. యిస్రాయేలు తెగకర్తలను బట్టి ఆయాతెగలకు ఈ నేలను పంచి యిమ్ము.

55. కాని మీరు ఆ దేశ వాసులను తరిమివేయనియెడల వారు మీకు కంటిలోని నలుసువలెను, ప్రక్కలో బల్లెమువలె నగుదురు. మీతో పోరాటమునకు దిగుదురు.

56. కనుక మీరు వారిని వెడలగొట్టలేని, నేను వారిని నాశనము చేయదలచు కొన్నట్లే మిమ్మును నాశనము చేసెదను” అని వారితో చెప్పుము.

Copyright © 2025 Telugu Catholic Bible All Rights Reserved | Website Designed by HyderHub Web Services