ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

యెహేజ్కేలు గ్రంధము

Text Example

1.ముప్పదియవయేడు, నాలుగవ నెల, ఐదవ దినమున నేను కెబారునది చెంత ప్రవాసులమధ్య వసించుచుండగా ఆకాశము విచ్చుకొనెను. నాకు దైవ దర్శనము కలిగెను.

2. అది యెహోయాకీనును ప్రవాసమునకు కొనిపోయినపిదప ఐదవయేడు ఆ నెల ఐదవదినము.

3. బబులోనియాలోని కెబారు నది ఒడ్డున బూసి కుమారుడును, యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రభువువాణి ప్రత్యక్షమయ్యెను. ప్రభువుహస్తము అతని మీదికి వచ్చెను.

4. నేను కనులెత్తిచూడగా ఉత్తరదిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక పెద్ద మేఘము గుండ్రముగా దానినావరించి మెరుపులు మెరయుచుండెను. దానిచుట్టును ఆకాశము మిరుమిట్లు గొలుపుచుండెను. ఆ మెరుపుల మధ్య ఏదో కంచువలె మెరయుచు అగ్నికాంతులు విరజిమ్ముచుండెను.

5. తుఫాను మధ్యలో నాలుగుజీవుల రూపములు గల ఒకటి కనిపించెను. అవి మానవాకృతిలో నుండెను.

6. వానిలో ప్రతిదానికి నాలుగుముఖములు, నాలుగు రెక్కలుండెను.

7. వాని కాళ్ళు నిలువుగానుండి ఎద్దులకువలె గిట్టలు కలిగి ఉండెను. ఈ జీవులు మెరుగు పెట్టిన కంచువలె తళతళలాడుచుండెను.

8. వాని నాలుగు పక్కల నున్న నాలుగు రెక్కల క్రింద మానవహస్తముల వంటి హస్తములుండెను. నాలుగిటికిని ముఖములును, రెక్కలును కలవు. ఒక్కొక్క రెక్క క్రింద ఒక్కొక్కచేయి యుండెను.

9. అవి రెక్కలు విప్పగా వాని అంచులు ఒకదానికొకటి తగులునట్లుండెను. అవి తమ దేహములను ఏ వైపునకు త్రిప్పకయే ముందునకు కదలిపోవుచుండెను.

10. ఆ జీవులలో ప్రతిదానికి నాలుగు ముఖములుండెను. ముందట మనుష్యముఖము, కుడిప్రక్కన సింహముఖము, ఎడమప్రక్కన వృషభముఖము, వెనుక ప్రక్కన గరుడముఖమునుండెను.

11. ప్రతి ప్రాణిరెక్కలలోను రెండు పైకిలేచి ఇతర ప్రాణిరెక్కలకు తగులుచుండెను. రెండు రెక్కలు ముడుచుకొనియుండి తన స్వీయదేహమును కప్పుచుండెను.

12. ఆ జీవులన్ని సూటిగా ముందునకు పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఎటువైపునకు పోవునో ఆ వైపునకే పోవుచుండెను.

13. ఈ జీవుల మధ్య జ్వలించుచున్న దివిటీవంటి దేదో కనిపించెను. అది నిత్యము చలించుచుండెను. నిప్పుమంటలు లేచి మెరుపులను విరజిమ్ముచుండెను.

14. ఆ జీవులు మెరుపు తీగలవలె ముందువెనకలకు పరుగిడుచుండెను.

15. నేను ఈ ప్రాణులవైపు చూచుచుండగా నాలుగు చక్రములు నేలను తాకుచు కనిపించెను. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణి ప్రక్కన నేలను తాకుచుండెను.

16. నాలుగుచక్రములు ఒకేరీతిగానుండి పసుపు వన్నె గోమేధికమువలె మెరయుచుండెను. ప్రతిచక్రము, మరియొక చక్రములో ఇమిడియున్నట్లుగా వాని నిర్మాణము ఉండెను.

17. అవి ప్రక్కకు తిరుగకయే నాలుగు దిక్కులలో ఏ దిక్కునకైనను పోగలిగియుండెను.

18. ఆ నాలుగు చక్రములు ఆశ్చర్యము గొలిపెడి నిడివికలిగి, వాని వలయములు చుట్టు కన్నులతో నిండియుండెను.

19. ఆ ప్రాణులు కదలినప్పుడు చక్రములుకూడ కదలెను. అవి నేలనుండి పైకిలేచినప్పుడు చక్రములును లేచెను.

20. ఆ ప్రాణులు తమ ఆత్మ ఎచటికి పోవునో అచటికే పోవుచుండెను. ఆ జీవులకున్న ఆత్మయే చక్రములకు ఉండెను గనుక చక్రములు కూడ వానిని అనుసరించుచుండెను. ఆ జీవులే వానిని నడిపించుచుండెను.

21. కనుక ఆ జీవులు కదలినను, ఆగినను, పైకిలేచినను, చక్రములును అట్లే చేయు చుండెను.

22. ఆ ప్రాణుల తలపై గోళాకారపు ఆకాశ విశాలమండలము వంటిదేదోయుండెను. అది స్పటికమువలె మెరయుచుండెను.

23. ఆ మండలము క్రింద ఆ ప్రాణులు నిలిచియుండెను. అవి ఒక్కొక్కటి రెండు రెక్కలను తన ప్రక్కనున్న ప్రాణులవైపు విప్పి యుంచెను. రెండు రెక్కలతో తమ దేహమును కప్పు కొనుచుండెను.

24. అవి ఎగురునప్పుడు తమ రెక్కలతో చేయునాదము నా చెవినబడెను. అది సముద్రపు ఘోషవలెను, మహాసైన్యపు నాదమువలెను, సర్వశక్తిమంతుడైన ప్రభువు ధ్వానమువలెను ఉండెను. అవి ఎగురక నిలబడినపుడు రెక్కలను మూసికొనుచుండెను.

25. అటుల మూసికొని నిలబడినపుడెల్ల వాని తలల మీది గుండ్రని మండలమునుండి నాదము విన్పించుచునే ఉండెను.

26. వాని తలల పైనున్న విశాలమండలము మీద నీలమణికాంత సింహాసనము వంటిదేదో కని పించెను. ఆ సింహాసనముపై నరాకృతి కలిగిన జీవియొకడు కూర్చుండియుండెను.

27. అతడు కంచువలె మెరయుచుండెను. అతని నడుమునకు పై భాగమును, క్రింది భాగమునుకూడ అగ్నిమయమై యుండెను. అతని చుట్టును కాంతి మిరుమిట్లుగొలుపు చుండెను.

28. అది వానరోజున కన్పించు రంగుల విల్లువలెనుండెను. ఆ కాంతి ప్రభువుతేజస్సువలె నుండెను. దానిని చూచి నేను నేలపై బోరగిలబడితిని. అపుడు నేనొక స్వరమును వింటిని.

Text Example

1. ఆ వాణి నాతో, "నరపుత్రుడా! నీవు లేచి నిలు చుండుము. నేను నీతో మాట్లాడవలయును” అనెను.

2. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకిలేపి నిలువబెట్టెను. ఆ వాణి ఇంకను ఇట్లనెను:

3. “నరపుత్రుడా! నేను నిన్ను యిస్రాయేలీయుల చెంతకు పంపెదను. వారునా మీద తిరుగుబాటుచేసిరి, ఇంకను చేయుచునే ఉన్నారు. వారి పూర్వులుకూడ అటులనే చేసిరి.

4. వారు మొండి వారు. నన్ను లెక్కచేయనివారు. యావే ప్రభుడనైన నా సందేశమును వినిపించుటకుగాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును.

5. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినినను, వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడనియైనను గ్రహింతురు.

6. కాని “నరపుత్రుడా! నీవు వారికిని, వారి మాటలకును భయపడవలదు. వారు నిన్నెదిరింతురు. నిన్ను నిరాకరింతురు. నీకు ముళ్ళపొదలలో తిరుగుతున్నట్లుండును. నీకు తేళ్ళమీద కూర్చున్నట్లుగా నుండును. అయినను నీవు ఆ తిరుగుబాటుదారులకును, వారి మాటలకును భయపడవలదు.

7. వారు విన్నను, విన కున్నను నీవు నా పలుకులను వారికి తెలియచేయుము. వారు తిరుగుబాటు చేయువారు.

8. నరపుత్రుడా! నా మాటలు వినుము. నీవు వారివలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరచి నేనిచ్చు దానిని భక్షింపుము."

9. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపుచుట్టను పట్టుకొనిన చేయి నా చెంతకు చాపబడెను.

10. ఆయన ఆ పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులను మహావిలాపము, రోదనము, దుఃఖములతో గూడిన మాటలు వ్రాయ బడియుండెను.

Text Example

1. ఆయన నాతో “నరపుత్రుడా! నీకు కనబడిన దానిని భుజింపుము. నీవు ఈ గ్రంథపుచుట్టను భుజించి యిస్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారితో మాటలాడుము” అని చెప్పెను.

2. నేను నోరు తెరచితిని. ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథపుచుట్టను ఇచ్చి,

3. “నరపుత్రుడా! నేను నీకు ఇచ్చు ఈ గ్రంథపుచుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము” అని అనెను. నేను దానిని భుజింపగా అది నానోటిలో తేనెవలె మధురముగా ఉండెను.

4. అంతట ఆయన నాతో ఇట్లనెను. “నరపుత్రుడా! నీవు యిస్రాయేలీయుల వద్దకు వెళ్ళి నా మాటలను వారికి వినిపింపుము.

5. నేను నిన్ను కష్టమైన పరభాష మాటలాడు వారివద్దకు పంపుటలేదు. యిస్రాయేలీయుల వద్దకు పంపుచున్నాను.

6. నేను నిన్ను నీకు అర్థముకాని కఠినమైన భాషలు మాట్లాడు పెద్ద జాతుల వారివద్దకు పంపియున్నచో వారు నీ పలుకు లాలించియుండెడివారే.

7. కాని యిస్రాయేలీయులలో ఎవరును నీ పలుకులు వినరు. వారు నా పలుకులనే వినలేదు. వారు మొండివారు, కఠిన చిత్తులు.

8. కాని నేను నిన్నిపుడు వారివలె మొండి వానినిగాను, కఠినునిగాను చేయుదును.

9. నేను నిన్ను చెకుముకి రాయివలెను, వజ్రమువలెను కఠిను నిగా చేయుదును. కనుక నీవు ఆ తిరుగుబాటుదారులకు భయపడవలదు.”

10. ఆయన ఇంకను ఇట్లనెను: “నరపుత్రుడా! నేను నీతో చెప్పు మాటలన్నింటిని సావధానముగా విని జ్ఞప్తియందుంచుకొనుము.

11. అటుపిమ్మట ప్రవాసముననున్న మీ ప్రజల యొద్దకుపోయి, వారు వినినను, వినకున్నను యావే దేవుడనైన నా సందేశ మును వారికి తెలియజెప్పుము.”

12. అంతట దేవుని ఆత్మ నన్ను పైకిలే పెను. నేను నా వెనుక ప్రక్కన ఒక మహాస్వరము “ప్రభువు వాసస్థలమున ఆయన మహిమకు స్తుతి కలుగును గాక!" అని పలుకుటను వింటిని.

13. ఆ నాలుగు ప్రాణుల రెక్కలు ఒకదానితోనొకటి తాకుటవలన, ఆ రెక్కల ప్రక్కల ఉన్న చక్రములవలన కలిగిన చప్పుడు గొప్ప ప్రకంపనల ధ్వనిగా ఉండెను.

14. దేవుని హస్తము బలముగా నన్ను ఆవహించెను. దేవుని ఆత నన్ను పైకి తోడ్కొనిపోగా నాకు కోపమును, బాధయును కలిగెను.

15. ఆ రీతిగా నేను కెటారు నది చెంతగల టెలాబీబునకు వచ్చితిని. ప్రవాసులు అచటనే వసించుచుండిరి. నేను నిశ్చేష్టుడనై ఏడునాళ్ళు అచట నుంటిని.

16. ఏడుదినములైన తరువాత ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

17. “నరపుత్రుడా! నేను నిన్ను యిస్రాయేలీయులకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి తెలియజేయుచుండవలెను.

18. నేను ఎవడైన దుర్మార్గుడు 'చచ్చును' అని చెప్పితిననుకొనుము. నీవు అతనిని హెచ్చరించి అతడు తన దుష్టత్వము విడనాడి మరల బ్రతుకునట్లు చేయనందున అతడు పాపిగానే చనిపోయెను అను కొనుము. అప్పుడు అతని మరణమునకు నీవు బాధ్యుడ వగుదువు.

19. కాని నీవు దుష్టుని హెచ్చరించినను అతడు తనపాపము నుండి వైదొలగక ఆ పాపములోనే చచ్చిపోయెనను కొనుము. అప్పుడు నీ ప్రాణమునకు ముప్పు కలుగదు.

20. సజ్జనుడొకడు చెడుకు పాల్పడెననుకొనుము. నేనతనికి వలపన్నితిననుకొనుము. నీవు హెచ్చరింపనిచో అతడు చనిపోవుననుకొనుము. అతడు తన పాప ఫలితముగా నశించును. అతడు చేసిన మంచిని నేను గుర్తుంచుకొనను. కాని అతని చావునకు నీవు బాధ్యుడవు అగుదువు.

21. నీవు సజ్జనుని పాపము చేయవలదని హెచ్చరింపగా అతడు పాపమునుండి వైదొలగే నేని చావును తప్పించుకొనును. నీ ప్రాణమును దక్కును.”

22. ప్రభువు హస్తము నన్నావహించెను. ఆయన నాతో “నీవు మైదానపుభూమికి పొమ్ము , నేనచట నీతో మాట్లాడుదును” అని చెప్పెను.

23. నేను మైదానపు భూమికి వెళ్ళితిని. అచట కెబారునది చెంత చూచినట్లే ప్రభువు తేజస్సును చూచి నేలపై బోరగిలబడితిని.

24. అంతట ప్రభువు ఆత్మ నాలో ప్రవేశించి నన్ను పైకి లేపి నిలబెట్టెను. ప్రభువు నాతో ఇట్లనెను: “నీవు ఇంటికి వెళ్ళి తలుపులు వేసికొని లోపల ఉండిపొమ్ము.

25. నరపుత్రుడా! నీవు త్రాళ్ళతో బంధింపబడుదువు. వెలుపలికి వెళ్ళజాలవు.

26. నేను నీ నాలుక పడి పోవునట్లు చేయుదును. నీవు మూగవగుదువు. కనుక ఆ తిరుగుబాటుదారులను హెచ్చరింపజాలవు.

27. నేను మరల నీతో మాటలాడి నీ మూగతనమును తొలగింతును. అప్పుడు నీవు ప్రభుడనైన నా సందేశమును వారికి విన్పింపుము. వారిలో కొందరు విందురు. కొందరు వినరు. వారు తిరుగుబాటు చేయుజాతి”.

Text Example

1. ప్రభువు ఇట్లనెను. “నరపుత్రుడా! నీవు ఒక ఇటుకను కొనివచ్చి దానిని నీ ముందట ఉంచు కొనుము. దానిపై యెరూషలేము చిత్రమును గీయుము.

2. నగరము ముట్టడిని సూచించుటకుగాను దాని చుట్టును అగడ్తలను త్రవ్వునట్లును, కట్టలు పోయునట్లును, శిబిరములు పన్నునట్లును, బురుజులు నిర్మించునట్లును, గోడలను కూలద్రోయు యంత్రములను అమర్చినట్లును నీవు వ్రాయుము.

3. ఇనుప రేకును తీసికొని నీకును, నగరమునకును మధ్య గోడగా నిలబెట్టుము. నీవు నగరమువైపునకు మళ్ళుము. అది ముట్టడికి గురియగుచున్నది. ముట్టడించువాడవు నీవే. ఇదంతయు యిస్రాయేలీయులకు సూచనముగా నుండును.

4. అటుపిమ్మట నీవు ఎడమప్రక్కకు మళ్ళి పడుకొనుము. నేను యిస్రాయేలువారి దోషములను నీపై మోపుదును. నీవు ఎడమప్రక్కన పండుకొని యున్నన్నినాళ్ళును వారి దోషములను భరింతువు.

5. వారి దోషసంవత్సరములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దినము చొప్పున, నీవు మూడువందల తొంబది దిన ములు వారి దోషములను భరింపవలెను.

6. అటు తరువాత నీవు కుడిప్రక్కకు మళ్ళి పడుకొని యూదా వారి దోషములను నలుబది దినములు భరింపుము. ఒక్కొక్కదినము వారి దోష సంవత్సరములలో ఒక్కొక్క దానిని సూచించును.

7. నీవు యెరూషలేము ముట్టడివైపు మొగము త్రిప్పుము. నీ చేతి పై చొక్కాయని వెనుకకు తీసి, దాని వైపు నీ బాహువును ఎత్తి దానిగురించి ప్రవచింపుము.

8. నేను నిన్ను త్రాళ్ళతో బంధించియుంతును. కనుక ముట్టడి ముగియువరకును నీవు ఒక ప్రక్కనుండి మరియొక ప్రక్కకు కదలజాలవు.

9. నీవు గోధుమలు, యవలు, చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు తీసికొని వానినన్నిటిని కలిపి రొట్టెలు చేసికొనుము. నీవు ఎడమప్రక్కన పడుకొనియున్న మూడు వందల తొంబది దినములును వానినే భుజింపవలెను.

10. నీవు దినమునకు ఇరువదితులముల రొట్టెను మాత్రమే తినవచ్చును.

11. ఆ రీతినే రోజునకు రెండు ముంతల నీళ్ళు మాత్రమే త్రాగవచ్చును.

12. నీవు మనుష్య మలముతో మంటజేసి రొట్టెలను కాల్చుకొనుము. ఎల్లరును చూచుచుండగా వానిని భుజింపుము.

13. నేను యిస్రాయేలీయులను అన్యజాతుల మధ్య చెల్లా చెదరుచేసినప్పుడు, వారు ఈ రీతిగనే నిషిద్ధాహారమును భుజింతురని ప్రభుడనైన నా మాటలుగా చెప్పుము.

14. అందులకు నేను"యావే ప్రభూ! నేనెన్నడును మైలపడలేదు. బాల్యమునుండియు నేనెన్నడును సహజముగా చచ్చిన జంతువునుగాని, వన్యమృగములు చంపిన జంతువునుగాని భుజింపలేదు. నేను అశుద్ధాహారమును ఎన్నడును ఆరగింపలేదు” అని అంటిని.

15. ప్రభువు “సరే, మనుష్యమలమునకు బదులుగా ఆవుపేడను వాడుకొని రొట్టెలు కాల్చుకొమ్ము” అని చెప్పెను.

16. ప్రభువు ఇంకను “నరపుత్రుడా! నేను యెరుషలేమున రొట్టెలు దొరకకుండునట్లు చేయుదును. ఆ నగర వాసులు విచారముతో ఆహారమును తూచితిందురు. భయముతో నీళ్ళు కొలిచిత్రాగుదురు.

17. రొట్టెలును, నీళ్ళును తరిగిపోవుటచూచి వారు నిరాశచెందుదురు. తమ పాపములకు గాను కృశించిపోవుదురు” అనెను.

Text Example

1. ప్రభువు ఇట్లనెను. “నరపుత్రుడా! క్షురకత్తివంటి పదునైన కత్తి తీసికొని నీ తలను గడ్డమును గొరుగు కొనుము. ఆ జుట్టును తక్కెడలో తూచి మూడు భాగములుగా విభజింపుము.

2. ఒక మూడవవంతును ఈ ముట్టడి ముగిసినపిదప నగరమున కాల్చివేయుము. ఇంకొక మూడవ వంతును నగరము చుట్టు తిరుగుచు కత్తితో నరికివేయుము. మిగిలిన వంతును గాలిలోకి వదలివేయుము. నేను ఖడ్గముతో దాని వెంటబడుదును.

3. అయితే వాటిలో కొన్ని కేశములను మాత్రము నీ చెంగున ముడిచి ఉంచుకొనుము.

4. వానిలో కొన్నిటిని తీసికొని నిప్పులో కాల్చివేయుము. వానినుండి అగ్ని వెలువడి యిస్రాయేలువారినందరిని కాల్చివేయును”.

5. యావే ప్రభువు ఇట్లనెను: “ఈ యెరూషలేము నగరమును నేను అన్యజనులమధ్య నెలకొల్పితిని. దానిచుట్టు ఇతర దేశములను ఉంచితిని.

6. కాని ఈ నగరము దుష్టబుద్దితో ఇతర జాతులకంటె అధిక ముగా, తన చుట్టుపట్లనున్న దేశములకంటె ఎక్కువగా నా ఆజ్ఞలను మీరెను. అది నా చట్టములను, న్యాయ నిర్ణయములను త్రోసిపుచ్చెను.

7. కనుక యెరూషలేమూ! నీవు యావే ప్రభుడనైన నా పలుకులు ఆలింపుము. నా ఆజ్ఞలను పాటింపనందున నీవు నీ చుట్టుపట్లనున్న జాతులకంటెను దుష్టురాలవైతివి. నీవు ఇతరజాతులు పాటించు నియమమునైనను పాటింపవైతివి.

8. కనుక యావే ప్రభుడనైన నా పలుకులు వినుము. నేను నీకు శత్రువునగుదును. ఇతరజాతులు చూచుచుండగా నేను నిన్ను దండింతును.

9. నేను అసహ్యించుకొను పనులను నీవు చేయుచున్నాను. కనుక నిన్ను కఠినముగా దండింతును. నేను ముందెన్నడును ఇట్లు చేయలేదు. ఇక మీదటను చేయబోను.

10. ఈ శిక్ష ఫలితముగా యెరూషలేమునందలి తల్లిదండ్రులు, తమ పిల్లలను తిందురు. పిల్లలు తమ తల్లిదండ్రులను తిందురు. నేను నిన్ను శిక్షించి నీలో మిగిలినవారిని నాలుగు దిక్కులకు చెల్లాచెదరు చేయుదును.

11. కనుక సజీవుడనైన దేవుడను, యావే ప్రభుడ నగు నా పలుకులనాలింపుము. హేయ దేవతలన్నింటిని పూజించి చేసిన హేయమైన కార్యములతోను నీవు నా మందిరమును అమంగళము చేసితివి. కావున నేను నిన్ను నిర్దయతో నరికివేయుదును.

12. నీ జనులలో ఒక మూడవవంతు ఆకలితోను, రోగముల తోను నగరమున చత్తురు. ఇంకొక మూడవవంతు పట్టణము వెలుపల కత్తివాతపడుదురు. మిగిలిన మూడవవంతును నేను నలువైపులకు చెదుర గొట్టు దును. కత్తిదూసి వారి వెంటపడుదును.

13. నా ఆగ్రహము చల్లారువరకును నీవు నా దండనమును అనుభవింతువు. అప్పుడు నాకు ఉపశాంతి కలుగును. ఇదంతయు జరిగినప్పుడు నీ అవిశ్వాసమువలన ఆగ్రహముచెంది నేను ఇట్లు పలికితినని నీవు తెలిసికొందువు.

14. నీ చుట్టు పట్లనున్న అన్యజాతి ప్రజలు నిన్ను గేలిచేయుదురు. నిన్ను చీదరించుకొని దూరముగా తొలగిపోదురు.

15. నేను నీపై కోపము తెచ్చుకొని నిన్ను శిక్షించు నపుడు నీ చుట్టుపట్లనున్న జాతులు వెరగొందును. అవి నిన్ను చీదరించుకొని గేలిచేయును.

16. నేను నీకు ఆహారము దొరకకుండునట్లు చేయుదును. నీపై ఆకలి బాణములురువ్వి నిన్ను సర్వనాశనము చేయుదును.

17. నేను ఆకలిని, వన్యమృగములను పంపి నీ కుమారులను మట్టు పెట్టింతును. వ్యాధులను, పర పీడనమును, యుద్ధమును పంపి నిన్ను నాశనము చేయింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు”.

Text Example

1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! నీవు యిస్రాయేలు పర్వతముల వైపు చూచి వానిని మందలించుచు ఇట్లు ప్రవచింపుము.

3. యిస్రాయేలు పర్వతములారా! మీరు యావే ప్రభువు మాటవినుడు. ప్రభువు యిస్రాయేలు పర్వతములు, కొండలు, లోయలు, కనుమలతో ఇట్లు చెప్పుచున్నాడు. నేను కత్తిని పంపి జనులు విగ్రహము లను కొలుచు ఉన్నత స్థలములనెల్ల నాశనముచేసెదను.

4. మీ బలిపీఠములను కూలద్రోయుదురు. సాంబ్రాణి పీఠములను నాశనము చేయుదురు. అచట ప్రజలను వారి విగ్రహముల ముందే నేను వధింతును.

5. యిస్రాయేలీయుల కళేబరములను వారి విగ్రహముల యెదుట పడవేసి వారి ఎముకలను బలిపీఠముల చుట్టు పారవేయుదును.

6. యిస్రాయేలీయుల నగరములు నాశనమగును. ఉన్నతపూజా స్థలములు పాడగును. వారి బలి పీఠములు విగ్రహములు ముక్కల గును. సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును. వారు నిర్మించినవెల్ల నాశనమగును.

7. ఎల్లెడల జనులను వధింతురు. అప్పుడు నేను ప్రభుడనని మీరు గుర్తింతురు.

8. కాని నేను మీలో కొందరిని ప్రాణములతో బ్రతుకనిత్తును. వారు కత్తిని తప్పించుకొని అన్యజాతుల మధ్య చెల్లాచెదరు అగుదురు.

9. ఆ ప్రవాసమునుండి వారు నన్ను స్మరించుకొందురు. ఆ జనులు అవిశ్వాస హృదయులై నన్ను విడనాడి విగ్రహములను ఎన్ను కొనిరి. కనుక నేను వారిని శిక్షించి అవమానమున ముంచితినని గ్రహింతురు. తమ దుష్టకార్యము లకుగాను, తమ హేయమైన పనులకుగాను వారు తమ్ముతామే అసహ్యించుకొందురు.

10. నేను ప్రభుడననియు, నా హెచ్చరికలు వట్టి బెదిరింపులు కావనియు అర్థము చేసికొందురు."

11. యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు: “నీ చేతులు చరచి చిందులు తొక్కుచూ, యిప్రాయేలీయుల దుష్కార్యములకుగాను, హేయమైన పనులకుగాను విలపింపుము. వారు కత్తివలన మరియు కరువు వలన, అంటురోగములవలన చత్తురు.

12. దూరమున నున్నవారు రోగమువలన చత్తురు. దగ్గరలో నున్నవారు పోరున కూలుదురు. మిగిలినవారు ఆకలివలన చత్తురు. వారు నా కోపమును చవిచూతురు.

13. విగ్రహములచుట్టును, బలిపీఠములచుట్టును, కొండలమీదను, పర్వతములమీదను, పచ్చనిచెట్ల క్రిందను, సింధూరముల క్రిందను, విగ్రహములకు బలులర్పించిన తావులన్నింటను వారి శవములను పడవేయుదురు. అప్పుడు వారు నన్ను ప్రభుడని గుర్తింతురు.

14. నేను నా చేయిచాచి వారి దేశమును నాశనము చేయుదును. దక్షిణమునందలి ఎడారి నుండి ఉత్తరమునందలి ది బ్లాతావరకు వారి దేశ మును ఎడారి చేయుదును. యిస్రాయేలీయుల వాస స్థలములలో ఎవరును మిగులరు. అప్పుడు వారు నేను ప్రభుడనని గ్రహింతురు.”

Text Example

1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! ప్రభుడనైన నేను యిస్రాయేలు దేశముతో ఇట్లు చెప్పుచున్నాను. దేశమంతటికిని అంతము సమీపించినది.

3. యిస్రాయేలూ! నీ అంతము సమీపించినది. నేను నా ఆగ్రహమును నీ మీదికి రప్పింతును. నీ దుష్కార్యములకు ప్రతిగా నిన్ను దండింతును. నీ హేయమైన పనులకు నీవు ప్రతిఫలము అనుభవింతువు.

4. నేను నిన్ను వదలను, నీపై జాలి చూపను. నీవు చేసిన హేయమైన పనులకు గాను నేను నిన్ను దండింతును. అప్పుడు నీవు నేను ప్రభుడనని గుర్తింతువు.

5. యావే ప్రభువిట్లు పలుకుచున్నాడు: వినాశనములు వరుసగా నీ మీదికి వచ్చును.

6. అంతము వచ్చుచున్నది. రానే వచ్చినది.

7. ఈ దేశమున వసించు ప్రజలారా! అంతము వచ్చుచున్నది. ఆ దినము సమీపించినది. పర్వతముల మీది దేవళ ములలో ఇక ఉత్సవములు జరుగవు. గందరగోళము చూపట్టును.

8. నేను తక్షణమే నా కోపమును మీపై కుమ్మరింతును. నీ దుష్కార్యములకు గాను నీకు తీర్పు విధింతును. నీ హేయమైన పనులకు నీవు ప్రతిఫలమును అనుభవింతువు.

9. నేను నిన్ను విడువను, నీపై జాలి చూపను. నీ దుష్కార్యములకును, నీ హేయ మైన పనులకును నిన్ను దండింతును. అప్పుడు నేను ప్రభుడననియు, నిన్ను శిక్షించువాడననియు నీవు గ్రహింతువు.

10. ఇదిగో! ఆ దినము, అది వచ్చియేయున్నది. అన్యాయము మొలకెత్తినది. హింస పెచ్చరిల్లుచున్నది. అహంభావము మొగ్గతొడిగినది. గర్వము తాండవించుచున్నది.

11. హింస దుష్కృత్యములను అధికము చేయుచున్నది. కాఠిన్యమను కొమ్మ దిన దినాభివృద్ధి చెందుచున్నది. ఈ ప్రజల వస్తువులేమియు మిగులవు. వీరి ఆస్తి, కీర్తి అన్నియు నాశనమగును. కడకు వీరును నశింతురు.

12. కాలము సమీపించినది. ఆ రోజు వచ్చినది. ప్రభువు కోపము అందరిమీదికి దిగి వచ్చును. కనుక ఆస్తి అమ్మువారు దుఃఖింప నక్కర లేదు. కొనువారు ఆనందపడనక్కరలేదు.

13. అమ్మువాడు తాను పోగొట్టుకొనినదానిని తిరిగి పొంద జాలడు. ప్రభువు కోపము అందరిపై దిగివచ్చును. దుష్టులు శిక్షను తప్పించుకోజాలరు.

14. “బాకా నూదగా ఎల్లరును పోరునకు సిద్ధమగుదురు. కాని ప్రభువు కోపమెల్లరి పై విరుచుకుపడునుగాన, ఎవరును యుద్ధమునకు పోజాలరు.

15. నగరము వెలుపల పోరు జరుగుచున్నది. లోపల రోగములు, ఆకలి పీడించుచున్నవి. బయట పొలముననున్న వారు పోరున చత్తురు. నగరము లోపల ఉన్నవారు ఆకలివలనను, రోగమువలనను చత్తురు.

16. లోయలో నుండి బెదరిన పావురములవలె కొందరు కొండలకు పారిపోవుదురు. ఎల్లరును తమ పాపములకు విలపింతురు.

17. ఎల్లరి చేతులును చచ్చుపడును. మోకాళ్ళు గడగడవణుకును.

18. వారు గోనెతాల్చి భీతితో కంపింతురు. వారి తలలను గొరిగి వేయుదురు. కాన అవమానము తెచ్చుకొందురు.

19. వారు తమ వెండిబంగారములను కసవువలె వీధులలో పారవేయుదురు. ప్రభువు కోపము వారిపై దిగి వచ్చినపుడు అవి వారిని రక్షింపలేవు. అవి వారి కోరి కలను ఆకలిని తీర్చలేవు. అవి వారిని పాపమునకు ప్రేరేపించెను.

20. పూర్వము వారు తమ ఆభరణముల సౌందర్యమును చూచి గర్వపడిరి. కాని వారు ఆ నగలతో హేయమైన ప్రతిమలను చేసికొనిరి. కనుక ప్రభువు ఆ సొత్తు వారికి అసహ్యకరమగునట్లు చేసెను.”

21. ప్రభువు ఇట్లు అనుచున్నాడు. “నేను అన్య జాతి ప్రజలు వారిని దోచుకొనునట్లు చేయుదును. బందిపోటు దొంగలు వారి సొత్తును కొల్లగొట్టి దానిని అపవిత్రము చేయునట్లు చేయుదును.

22. దొంగలు నాకు ప్రీతిపాత్రమైన దేవాలయమును అపవిత్రము చేయునపుడు, దానిలో ప్రవేశించి దానిని మలినము చేయునపుడు, నేను పట్టించుకొనను. .

23. దేశము రక్తముతో నిండియున్నది. పొలము నరహంతకులతో నిండియున్నది. నగరమున హింస జరుగుచున్నది. సంకెళ్ళు సిద్ధముచేయుడి.

24. నేను క్రూరజాతులను ఇచటికి కొనివత్తును. వారు మీ ఇండ్లను ఆక్రమించుకొందురు. మీ బలాఢ్యులు నమ్మకమును కోల్పోవుదురు. పరజాతివారు మీ ఆరాధనా స్థలమును అపవిత్రము చేయుదురు.

25. నిరాశ మీ మీదికి ఎత్తివచ్చును. మీరు శాంతిని బడయగోరుదురు కాని అది మీకు దుర్లభమగును.

26. వినాశనములు ఒకదానివెంట ఒకటి మీమీదికి వచ్చును. దుర్వార్తలు నిరంతరము వినిపించును. మీరు ప్రవక్తలను దర్శనములు చెప్పుమందురు. యాజకులు ప్రజలకేమియు బోధింపలేరు. వృద్దులు ఉపదేశము చేయలేరు.

27. రాజు శోకించును. అధిపతులు నిరాశ చెందుదురు. ప్రజలు భీతితో వణకుదురు. నేను మీ దుష్కార్యములకు గాను మిమ్ము శిక్షింతును. మీరు ఇతరులకు తీర్పుతీర్చునట్లే నేనును మీకు తీర్పుతీర్తును. దీనివలన నేను ప్రభుడనని మీరు గ్రహింతురు.”

Text Example

1. అంతట ఆరవయేడు ఆరవనెల ఐదవరోజున యూదానాయకులు మా ఇంట నా ప్రక్కన కూర్చుండి యుండిరి. దిఢీలున ప్రభువు హస్తము నన్నావేశించెను.

2. నేను పైకి చూడగా అగ్నిమయమైన నరాకృతి కనిపించెను. ఆయన నడుము నుండి క్రింది వరకును అగ్నివలెనుండెను. నడుమునకు పైభాగము తోమిన కంచువలె మెరయుచుండెను.

3. ఆయన చేతి వంటి దానిని చాచి నా శిరోజములను పట్టుకొనెను, ఆ దర్శనమున దేవుని ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్ను పైకి లేపి యెరూషలేమునకు కొనిపోయెను. నన్ను లోపలి ఆవరణమున ఉత్తరదిక్కునకు చూచు ద్వారపు లోపలి తలుపు వద్దకు చేర్చెను. అచట దేవునికి కోపము రప్పించు విగ్రహము ఒకటున్నది.

4. అచట నేను పూర్వము లోయలో చూచినట్లే, యిస్రాయేలు దేవుని తేజస్సును చూచితిని.

5. ఆయన నాతో “నరపుత్రుడా! నీవు ఉత్తర దిక్కుకు చూడుము” అని అనెను. నేనట్లే చూడగా ఉత్తరము వైపున బలిపీఠమున్న ద్వారములోపల దేవునికి కోపము రప్పించు విగ్రహము కనిపించినది.

6. ఆయన నాతో “నరపుత్రుడా! ఈ ప్రజలేమి చేయుచున్నారో చూచితివా! యిస్రాయేలీయులు ఇచటెంత హేయమైన పనులు చేయుచున్నారో గమ నింపుము. వారు నా మందిరమునుండి నన్ను తరిమి వేయజూచుచున్నారు. నీవింకను ఘోరమైన కార్యములు చూతువు” అనెను.

7. ఆయన నన్ను ఆవరణ ద్వారము వద్దకు కొని పోయెను. అచట గోడలో ఒక రంధ్రము కన్పించెను.

8. ఆయన నరపుత్రుడా! నీవు ఈ గోడలో కన్నము వేయుము అనెను. నేనట్లే చేయగా అచట ఒక ద్వారము కనిపించెను.

9. ఆయన నీవు లోనికి వెళ్ళి ప్రజలు చేయు దుష్కార్యములు, హేయపు పనులు చూడుము అనెను.

10. నేనట్లే లోనికి వెళ్ళిచూచితిని. అచట గోడపై ప్రాకెడి జంతువులు, హేయమైన మృగములు, యిస్రాయేలీయులు పూజించు విగ్రహములు మొదలైన చిత్రములు గీయబడియుండెను.

11. అచట యిస్రాయేలు పెద్దలు డెబ్బదిమందిమధ్య షాఫాను కుమారుడగు యాసన్యా నిలిచియుండెను. ప్రతివాడు ధూప కలశము పట్టుకొనియుండెను. సాంబ్రాణి పొగ చిక్కటి మేఘమువలె పైకి లేచుచుండెను.

12. ఆయన నాతో “నరపుత్రుడా! యిస్రాయేలు పెద్దలు రహస్యముగా ఏమి చేయుచున్నారో చూచితివా! వారు చీకటిలో తమ విగ్రహపు గదులలో పూజలు చేయుచున్నారు. ప్రభువు మనలను చూడడు. ఆయన ఈ దేశమును పరిత్యజించెను అని చెప్పుకొనుచున్నారు” అని అనెను.

13. ఆయన నాతో నీవు ఇంకను ఘోరమైన కార్యములు చూతువు అని చెప్పెను.

14. ఆయన నన్ను దేవాలయము ఉత్తరద్వారము నొద్దకు కొని పోయెను. అచట స్త్రీలు తమ్మూసు దేవరమృతికిగాను శోకించుచు కూర్చుండియుండిరి.

15. ఆయన నాతో “నరపుత్రుడా! నీవాకార్యము చూచితివికదా! అంతకంటె ఘోరమైన కార్యమును కూడ చూతువు” అని చెప్పెను.

16. అంతట ఆయన నన్ను దేవాలయము లోపలి ఆవరణములోనికి కొని పోయెను. అచట ఆలయద్వారముచెంత వసారాకు, బలిపీఠమునకు మధ్య ఇరువది ఐదుగురు నరు లుండిరి. వారు తమ విపులను దేవాలయము వైపున కును, మొగములను తూర్పునకు త్రిప్పి సూర్యుని ఆరాధించుచుండిరి.

17. అంతట ఆయన నాతో “నీవు ఆకార్యమును చూచితివికదా! యూదీయులిట్టి హేయమైన కార్య ములు చేయుటతోను, దేశమును హింసతో నింపుటతోను సంతృప్తి చెందుటలేదు. ఈ కార్యములను ఈ దేవాలయములోనే చేసి నా కోపమును రెచ్చగొట్టు చున్నారు. కొమ్మను' ముక్కుముందు పెట్టుకొని నన్ను అవమానించుచున్నారు.

18. కావున నా కోపము పెచ్చుపెరుగుచున్నది. నేను వారిని వదలను. వారిపై దయచూపను. ఎంత పెడగా అరచినను నేను వారి మొరలు ఆలింపను” అనెను.

Text Example

1. అంతట నేను వినుచుండగా ఆయన “నగరమును శిక్షించువారలారా! మీరిచటికిరండు. మీ శిక్షా యుధములనుకూడ కొనిరండు” అని అరచెను.

2. వెంటనే వెలుపలి వైపుననున్న ఉత్తర ద్వారము నుండి ఆరుగురు మనుష్యులు శిక్షాయుధములతో వచ్చిరి, వారిలో ఒకడు నారబట్టలుతాల్చి, వ్రాత పరికరములను నడుమునకు కట్టుకొని ఉండెను. వారెల్లరును లోపలి ఆవరణమునకు వచ్చి ఇత్తడి బలి పీఠమువద్ద నిలుచుండిరి.

3. అంతవరకు కెరూబుదూతల మీద నిలిచి యుండిన యిస్రాయేలు దేవుని తేజస్సు పైకి లేచి మందిరద్వారము చెంతకు వచ్చి నిలబడెను. ఆయన నారబట్టలు తాల్చియున్న వ్యక్తితో,

4. "నీవు యెరూషలేము నగరమంతట సంచరించి పట్టణమున జరుగుచున్న హేయమైన కార్యములకుగాను సంతాపము చెందు వారి నొసటిపై గుర్తు పెట్టుము” అని అనెను.

5. నేను వినుచుండగా ఆయన ఇతర మనుష్యులతో “మీరును ఇతని వెంట నగరము లోనికిపోయి ఎల్లరిని వధింపుడు. ఎవరిమీద జాలి చూపకుడు. ఎవరిని వదలివేయకుడు.

6. వృద్ధులను, యువతీ యువకులను, తల్లులను, పిల్లలను చంపివేయుడు. కాని నొసటిమీద గురుతున్నవారిని మాత్రము ముట్టు కొనకుడు. నా దేవాలయ పవిత్రస్థలమువద్దనే పని మొదలుపెట్టుడు” అని చెప్పెను. కనుక వారు దేవాలయ పవిత్రస్థలము వద్దనున్న నాయకులను చంపుటతో పని ప్రారంభించిరి.

7. ఆయన వారితో “మీరు దేవాలయమును అపవిత్రముచేయుడు. దాని ఆవరణములను శవములతో నింపుడు. పని మొదలు పెట్టుడు” అనెను. కనుక వారు బయలుదేరి నగరమున ప్రజలను చంపసాగిరి.

8. అటుల వారు ప్రజలను చంపుచుండగా నేను ఒంటరిగా నిలిచియుంటిని. అపుడు నేను నేలపై సాష్టాంగపడి “యావే ప్రభూ! నీవు యెరూషలేముపై ఆగ్రహముచెంది యిస్రాయేలీయులలో మిగిలినవారిని అందరిని వధింతువా?” అని విలపించితిని.

9. ఆయన నాతో ఇట్లు అనెను: “యూదావాసులును, యిస్రాయేలీయులును ఘోర పాపములు చేసిరి. వారు దేశమందంతట హత్యలుచేసిరి. యెరూషలేమును పాపముతో నింపిరి. వారు “ప్రభువు మన దేశమును పరిత్యజించెను. అసలు ఆయన మనలను చూడడు” అని చెప్పుకొనుచున్నారు.

10. నా మట్టుకు నేను వారిని వదలను, వారిపై దయచూపను. వారు ఇతరు లకు చేసిన చెడునే నేను వారికిని చేయుదును.”

11. అపుడు నారబట్టలు తాల్చిన వ్యక్తి తిరిగివచ్చి "అయ్యా! నేను నీవు ఆజ్ఞాపించినట్లే చేసితిని” అని పలికెను.

Text Example

1. నేను ఆ కెరూబుల తలపై గల విశాల మండలము వంటిదానివైపు చూచితిని. వాని పై నీలమణి సింహాసనము వంటిది ఒకటి కనిపించెను.

2. ఆయన నారబట్టలు తాల్చిన వ్యక్తితో “నీవు ఆ కెరూబుల క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి ఆ కెరూబుల నడుమనున్న నిప్పుకణికలను నీ చేతుల నిండా తీసికొని నగరముపై చల్లుము” అని చెప్పెను. నేను చూచుచుండగనే అతడు లోనికి వెళ్ళెను.

3. అతడు వెళ్ళినపుడు ఆ కేరూబులు దేవాలయమునకు దక్షిణ దిక్కున నిలిచియుండెను. లోపలి ఆవరణమును మేఘము క్రమ్మియుండెను.

4. అంతట ప్రభువు తేజస్సు ఆ కెరూబుల మీదినుండి లేచి దేవాలయ ప్రవేశస్థలము వద్దకు వెళ్ళెను. అపుడు మేఘము దేవాలయమును క్రమ్మెను. ఆవరణము ప్రభువు తేజస్సుతో నిండిపోయెను.

5. ఆ కెరూబులు తమ రెక్కలతో చేసిన చప్పుడు వెలుపలి ఆవరణము వరకు వినిపించెను. ఆ చప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభువువాక్కుల ధ్వానమువలె ఉండెను.

6. ప్రభువు నారబట్టలు ధరించిన వ్యక్తిని “నీవు ఆ కెరూబుల క్రిందనున్న చక్రముల నడుమనుండి అగ్నికణములను తీసికొనుము” అని చెప్పగా అతడు వెళ్ళి చక్రములచెంత నిలుచుండెను.

7. అప్పుడు ఆ కెరూబులలో ఒకడు చేయిచాచి తమ మధ్యనున్న నిప్పుకణికలను తీసికొని నారబట్టలు తాల్చిన వ్యక్తికి ఇచ్చెను. అతడు వానిని తీసికొని బయలుదేరెను.

8. ప్రతి కెరూబు రెక్కల క్రింద మనుష్య హస్త ముల వంటివి ఉండుటను నేను చూచితిని.

9-10. ప్రతి కెరూబు ప్రక్కన ఒక్కొక్కటి చొప్పున సమానా కారము గల చక్రములు నాలుగు కన్పించెను. అవి గోమేధికమువలె మెరయుచుండెను. అవి ఒక దానిలో ఒకటి ఇమిడియున్నట్లుగా ఉండెను.

11. ఆ ప్రాణులు కదలినప్పుడు ప్రక్కకు తిరుగకయే ఏ దిక్కునకైన సాగిపోవుచుండెను. అవి అన్నియు కలిసి ప్రక్కకు తిరుగకయే తల ఏ తట్టుతిరుగునో అవి ఆ తట్టునకే దానివెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక కదలుచుండెను.

12. వాని దేహములు, వీపులు, చేతులు, రెక్కలు, చక్రములు కన్నులతో నిండియుండెను.

13. ఆ చక్రములధ్వని నా చెవులలో రింగున మ్రోగెను.

14. ఒక్కొక్క జీవికి నాలుగు మొగములుండెను. మొదటిది కెరూబుముఖము, రెండవది మనుష్య ముఖము, మూడవది సింహముఖము, నాలుగవది గరుడముఖము.

15. అవి నేను కెబారు నదిచెంత చూచిన ప్రాణులే.

16. అవి పైకిలేచి ముందునకు కదలినపుడు చక్రములు కూడ వానితోపాటు కదలు చుండెను. అవి పైకి లేచుటకు రెక్కలు విప్పినపుడు చక్రములును వానితోపాటు కదలుచుండెను.

17. ఆ జీవులు ఆగినపుడు చక్రములు ఆగెను. అవి కదలినపుడు చక్రములుకూడ కదలెను. అవి వానిని నడిపించు చుండెను.

18. ప్రభువు తేజస్సు దేవాలయ ప్రవేశ సాన మును వదలి ఆ జీవుల మీదికి వచ్చెను.

19. నేను చూచుచుండగా ఆ ప్రాణులు రెక్కలు విప్పి నేల మీది నుండి పైకిలేచెను. చక్రములును వానితోపాటు కదలెను. అవి దేవాలయపు తూర్పు ద్వారము వద్ద ఆగెను. ప్రభువు తేజస్సు వాని పైనుండెను.

20. పూర్వము కెబారునది చెంత యిస్రాయేలు దేవుని క్రింద నాకు కనిపించిన జీవి ఇదియేనని నేను గ్రహించి తిని. అవి కెరూబులని గుర్తుపట్టితిని.

21. వానిలో ప్రతిదానికి నాలుగు మొగములు నాలుగు రెక్కలు ఉండెను. ప్రతి రెక్కక్రింద మనుష్య హస్తము వంటిది ఉండెను.

22. వాని మొగములు నేను కెబారు నదిచెంత చూచిన మొగాలవలె ఉండెను. అవి తిన్నగా ఆయా ముఖములతట్టు ముందునకు నడచి పోవుచుండెను.

Text Example

1. ప్రభుని ఆత్మ నన్ను పైకిలేపి దేవాలయపు తూర్పు ద్వారము వద్దకు కొనిపోయెను. అచట ద్వారము నొద్ద ఇరువది ఐదుగురు మనుష్యులు కనబడిరి. వారిలో అస్సూరు కుమారుడైన యాజన్యాయు, బెనాయా కుమారుడగు పెలట్యాయునుండిరి. వీరిద్దరును ప్రజా నాయకులు.

2. ప్రభువు నాతో “నరపుత్రుడా! ఈ నగరము వంటపాత్రమువలెను, మనము దానిలోని మాంసము వలెను ఉన్నామనియు, సమయము ఇంకనూ ఆసన్నము కాలేదు కావున ఇండ్లు కట్టుకొనుదము అని చెప్పుచూ,

3. వీరు కుతంత్రములుపన్ని నగరమునకు దుష్టోపదేశము చేయుచున్నారు.

4. కనుక నరపుత్రుడా! నీవు వారికి వ్యతిరేకముగా ప్రవచనము చెప్పుము” అని అనెను.

5. ప్రభువు ఆత్మ నన్ను ఆవేశించెను. “ఆయన నన్నిట్లు చెప్పుమనెను: యిస్రాయేలీయులారా! మీ మాటలును, మీ ఆలోచనలును నాకు తెలియును.

6. మీరు ఈ నగరమున పెక్కుమందిని చంపితిరి. వీధులను శవములతో నింపితిరి.

7. కనుక ప్రభువైన యావే మీతో ఇట్లు అను చున్నాడు: “ఈ నగరము వంటపాత్రము. మీరు చంపిన వారి శవములే మాంసము. నేను మిమ్మిచటి నుండి బయటికి గెంటివేయుదును.

8. మీకు ఖడ్గములన్న భయముకదా! నేను మీ మీదికి ఖడ్గమునే రప్పింతును.

9. మిమ్ము నగరమునుండి వెలుపలికి గొనివచ్చి అన్యజాతి ప్రజలకు అప్పగింతును. మిమ్ము శిక్షకు గురిచేయుదును.

10. మీరు మీ దేశముననే కత్తివాత పడుదురు. అప్పుడెల్లరును నేను ప్రభుడనని గుర్తింతురు.

11. వంటపాత్ర నిప్పునుండి మాంసమును రక్షించినట్లుగా ఈ నగరము మిమ్ము రక్షింపజాలదు. మీరు యిస్రాయేలు దేశమున ఎచటున్నను నేను మిమ్ము శిక్షింతును.

12. నేను ప్రభుడనని మీరు గుర్తింతురు. మీరు మీ ఇరుగుపొరుగు జాతుల ఆచార వ్యవహారములను పాటించుచున్నారు. కాని నా ఆజ్ఞలను, విధులను నిర్లక్ష్యము చేయుచున్నారు.”

13. నేను ఈ రీతిగా ప్రవచించుచుండగా పెలట్యా చనిపోయి నేలపైబడెను. నేను నేలపై బోరగిలపడి “యావే ప్రభూ! నీవు యిస్రాయేలీయులలో మిగిలి యున్నవారిని అందరినీ తుడిచిపెట్టుదువా?” అని పెద్దగా అరచితిని.

14. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

15. "నరపుత్రుడా! యెరూషలేమున వసించు ప్రజలు మిమ్మును గూర్చియు, ప్రవాసముననున్న మీ తోడి యిస్రాయేలీయులను గూర్చియు 'ఈ ప్రవాసులు దేశమునకు దూరముగానున్నారు. ప్రభువు దేశమును మనకే వదలి వేసెను' అని చెప్పుచున్నారు. .

16. కనుక నీవు నీ తోడి యిస్రాయేలీయులకు నా మాటలుగా ఇట్లు చెప్పుము: నేను వారిని దూరప్రాంతములందలి జాతుల నడుమను, అన్యదేశములలోను చెల్లాచెదరు చేసితిని. అయినను నేను కొంత కాలమువరకు వారు పోయిన దేశమున వారి మధ్యన నెలకొని ఉందును.

17. నీవు యావే ప్రభుడనైన నా మాటలుగా వారితో ఇట్లు చెప్పుము. నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశము నుండి వారిని ప్రోగుచేయుదును. యిస్రాయేలు దేశమును వారికి మరల ఇత్తును.

18. వారు తిరిగి వచ్చినపుడు దేశములోని హేయమైన, జుగుప్సాకరమైన విగ్రహముల తొలగింపవలెను.

19. నేను వారికి ఏకహృదయమును అనుగ్రహించి వారిలో నూత్నఆత్మను ఉంచుదును. వారిలోని రాతిగుండెను తీసివేసి, దాని స్థానమున మాంసపుగుండెనిత్తును.

20. అప్పుడు వారు నా చట్టములను, విధులను పాటింతురు. వారు నా ప్రజలగుదురు, నేను వారి దేవుడనగుదును.

21. కాని హేయములును, జుగుప్సాకరములునైన విగ్రహములను కొలుచువారిని నేను వారి క్రియలకు తగినట్లుగా శిక్షింతును. యావే ప్రభుడనైన నా పలుకులివి.”

22. అప్పుడు ఆ జీవులు రెక్కలు చాచి ఎగిరిపోవుటకు ఉపక్రమించెను. చక్రములు వానితోపాటు కదలెను. యిస్రాయేలుదేవుని తేజస్సు వానిపైనుండెను.

23. అటుపిమ్మట ప్రభునితేజస్సు నగరమును వీడి దానికి తూర్పుననున్న కొండపై నిలిచెను.

24. అంతట దర్శనమున దేవుని ఆత్మ నన్ను పైకిలేపి బబులోనియాలోని ప్రవాసులవద్దకు కొనివచ్చెను. అటుతరువాత ఆ దృశ్యము మరుగయ్యెను.

25. ప్రభువు నాకు చూపించిన విషయములెల్ల నేను ప్రవాసులకు వివరించితిని.

Text Example

1. ప్రభువు వాణి నాతో ఇట్లు అనెను:

2. “నరపుత్రుడా! నీవు తిరుగుబాటుదారులనడుమ వసించుచున్నావు. వారు తిరుగుబాటు చేయువారు కనుక కన్నులున్నను చూడరు. చెవులున్నను వినరు.”

3. “నరపుత్రుడా! నీవు ప్రవాసివలె నీ సామానులను మూట కట్టుకొని చీకటిపడకమునుపే ప్రయాణము కట్టుము. నీవు ఆ తావువీడి మరియొకచోటికి పోవుచున్నావని ప్రజలు గ్రహించునట్లు చేయుము. అపుడు వారు తాము తిరుగుబాటుదారులమని అర్థము చేసికోవచ్చును.

4. చీకటి పడకమునుపే, వారు చూచుచుండగా నీవు నీ సామానులు మూటకట్టుకొని ప్రయాణము కట్టుము. వారు చూచుచుండగా ప్రవాసమునకు పోవు వానివలె సాయంకాలమున బయలుదేరుము.

5. వారు చూచుచుండగా మీ ఇంటి గోడకు కన్నమువేసి నీ మూటను దానిగుండ బయటికి కొనిరమ్ము.

6. వారు చూచుచుండగా నీవు మూటను భుజముల మీదికి ఎత్తుకొని, చీకటిలోనికి వెళ్ళిపోవలెను. నీవు నేల కనబడ కుండ మొగము కప్పుకొని దానిని తీసుకొని పొమ్ము. నేను నిన్ను యిస్రాయేలీయులకు గుర్తుగానుంతును”.

7. నేను ప్రభువు చెప్పినట్లే చేసితిని. ప్రవాసివలె నా సామానులను మూటకట్టుకొంటిని. సాయంకాలము నా చేతులతోనే గోడకు కన్నమువేసి, ఆ రంధ్రము గుండ వెలుపలికి పోతిని. ఎల్లరును చూచుచుండగా చీకటి పడినపుడు నా మూటనెత్తి భుజములపై పెట్టుకొని బయలుదేరితిని.

8. మరునాటి ఉదయము ప్రభువువాణి నాతో ఇట్లు అనెను:

9. “నరపుత్రుడా! తిరుగుబాటుదారులైన యిస్రాయేలీయులు 'నీవు చేయునదేమిటి' అని ప్రశ్నించుచున్నారుగదా!

10. వారికి యావే ప్రభుడనైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము: 'ఈ సందేశము యెరూషలేమున పరిపాలనచేయురాజునకును, అచట వసించు ప్రజలకును వర్తించును.”

11. నీవు వారికి సూచనగానుందువు. నీవు ఇపుడు చేసినట్లుగానే వారికి కూడ జరుగును. వారు బందీలై ప్రవాసమునకు పోవుదురు.

12. వారిని పాలించురాజు రేయి మూటను భుజములపైకి ఎత్తుకొని గోడలో త్రవ్విన కన్నము గుండ వెడలిపోవును. అతడు మొగమును కప్పుకొని నేలచూడజాలకుండును.

13. నేను వలపన్ని అతనిని పట్టుకొందును. అతనిని బబులోనియాకు కొనిపోవు దును. అతడు ఆ నగరమును కంటితో చూడకుండ అచటనే చనిపోవును.

14. నేను అతని కొలువు కాండ్రను, అంగరక్షకులను నలుదిక్కులకు చెదరగొట్టుదును. జనులు వారిని పట్టుకొని చంపగోరుదురు.

15. నేను వారిని అన్యజాతుల నడుమను, అన్య దేశములందును చెల్లాచెదరుచేసినపుడు వారు నేను ప్రభుడనని గ్రహింతురు.

16. నేను వారిలో కొందరిని పోరు, కరువు, అంటురోగములనుండి తప్పింతును, వారు జాతుల మధ్య వసించుచు తాము చేసిన కార్యములెంత హేయమైనవో గుర్తింతురు. నేను ప్రభుడనని అర్థము చేసికొందురు.”

17. ప్రభువువాణి నాతో ఇట్లు అనెను:

18. “నీవు భోజనము చేయునపుడు గడగడవణకుము. నీళ్ళు త్రాగునపుడు భీతితో కంపింపుము.

19. తమ సొంతదేశముననే వసించు యెరూషలేము ప్రజలకు ప్రభువు ఈ సందేశమును వినిపించుచున్నాడని నీవు ఎల్లరితోను చెప్పుము. వారు భోజనము చేయునపుడు వణకుదురు. నీళ్ళు త్రాగునపుడు భీతితో కంపింతురు. అచట వసించు వారందరును హింసకు పాల్పడిరి గాన ఆ దేశము నాశనమగును.

20. ఇపుడు ప్రజలతో క్రిక్కిరిసియున్న నగరములు నాశనమగును. దేశము పాడగును. అపుడు నేను ప్రభుడనని వారు అర్ధము చేసికొందురు.”

21. ప్రభువువాణి నాతో ఇట్లు అనెను:

22. “నరపుత్రుడా! 'రోజులు గతించుచున్నవి కాని ప్రవచన ములు నెరవేరుటలేదు' అన్న సామెతను యిస్రాయేలీ యులు మాటిమాటికి వాడుచున్నారేల?”

23. యావే ప్రభుడనైన నా మాటలుగా వారితో నీవు ఇట్లు చెప్పుము. “నేను ఆ సామెతను తుదముట్టింతును. యిస్రాయేలు దేశమున జనులు దానిని ఇక వాడ బోరు. ప్రవచనములు నెరవేరు కాలము ఆసన్నమైన దని నీవు వారితో చెప్పుము.

24. యిస్రాయేలీయులలో ఇకమీదట అనృత దర్శనములుకాని, అసత్య ప్రవచనములుగాని ఉండబోవు.

25. ప్రభుడనైన నేను వారితో మాటలాడుదును. నా పలుకులు నెరవేరితీరును. ఇక జాప్యము జరుగదు. తిరుగుబాటు దారులారా! మీ జీవితకాలములోనే నేను చేయుదునన్న కార్యమును చేసితీరెదను. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు”

26. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

27. “నర పుత్రుడా! యిస్రాయేలీయులు నీవెప్పుడో జరుగనున్న సంగతుల గూర్చి దర్శనములు కనుచున్నావనియు, ప్రవచనములు చెప్పుచున్నావనియు తలంచుచున్నారు.

28. కనుక యావే ప్రభుడనైన నా పలుకులను వారికి తెలియజేయుము. ఇక ఆలస్యము జరుగదు. నా వాక్కు నెరవేరి తీరును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు”

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! తమ సొంత ప్రవచనములను చెప్పు యిస్రాయేలు ప్రవక్తలను నీవు ఖండింపుము. వారిని ప్రభువు పలుకులు ఆలింపమనుము.

3. యావే ప్రభువు పలుకులివి. అవివేకులైన ఈ ప్రవక్తలకు అనరము తప్పదు. వారు తమకు తామే ప్రేరణము పొంది, తమకు తామే దర్శనములు చూచుచున్నారు.

4. యిస్రాయేలీయులారా! మీ ప్రవక్తలు నగర శిథిలాలలో వసించు నక్కలవంటివారు.

5. వారు గోడపడి పోయిన చోట కావలికాయరు. పడిపోయిన గోడను మరలకట్టరు. ప్రభువు దినమున యుద్ధము సంభవించి నపుడు యిస్రాయేలీయులకు రక్షణ కల్పింపరు.

6. వారివి అనృతదర్శనములు, అసత్య ప్రవచనములు. వారు నా సందేశమును పలుకుచున్నాము అని చెప్పుచున్నారు. కాని నేను వారిని పంపనేలేదు. అయినను వారు తమ పలుకులు నెరవేరునని కాచు కొనియున్నారు.

7. నేను వారితో చెప్పునదేమనగా, వారి దర్శనములు అనృతములు, వారి ప్రవచనములు అసత్యములు. వారు నేను పలుకని పలుకులను నా పేరు మీదుగా ప్రభువే పలికెను అని చలామణి చేయుచున్నారు.”

8. కనుక ప్రభువైన యావే ఇట్లు చెప్పుచున్నాడు: “మీ మాటలు అనృతములు, మీ దర్శనములు అసత్య ములు. నేను నీకు విరోధినయ్యెదను.

9. అనృత దర్శనములు చూచి అసత్య ప్రవచనములు చెప్పు ప్రవక్తలారా! నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలు నిర్ణయములు చేసికొనుటకు సభ దీర్చినపుడు మీరందులో నుండజాలరు. యిస్రాయేలు పౌరుల జాబితాలో మీ పేరులుండవు. మీరు మీ దేశమునకు తిరిగిపోరు. అప్పుడు మీరు నేను యావే ప్రభుడనని గుర్తింతురు.

10. ప్రవక్తలు అంతయు క్షేమముగా నున్నదని చెప్పి నా ప్రజలను అపమార్గము పట్టించుచున్నారు. కాని అంతయు క్షేమముగా లేదు. నా ప్రజలు అతికీ అతకని రాళ్ళతో గోడకట్టిరి. ప్రవక్తలు దానికి సున్నము పూసిరి.

11. నీవు ఆ ప్రవక్తలతో వారి గోడ కూలునని చెప్పుము. నేను జడివాన కురిపింతును. వడగండ్లు దానిపై పడును. పెనుగాలి దానిపై వీచును.

12. ఆ గోడకూలును. అప్పుడు సున్నము కొట్టుటవలన ప్రయోజనమేమియని ఎల్లరును మిమ్ము ప్రశ్నింతురు.

13. యావే ప్రభువు పలుకులివి: నేను మహా రౌద్రముతో పెనుగాలిని, జడివానను, వడగండ్లను కొనివచ్చి గోడను కూలద్రోయుదును.

14. వారు సున్నముపూసిన గోడను పడగొట్టి చిన్నాభిన్నము చేయుదును. దాని పునాదిరాళ్ళు బయటికి కన్పించును. ఆ గొడ కుప్పకూలి మిమ్మెల్లరిని చంపును. అప్పుడెల్లరును నేను ప్రభుడనని గుర్తింతురు..

15. ఆ గోడయు దానికి సున్నము కొట్టినవారు కూడ నా ఆగ్రహమునకు గురియగుదురు. ఆ గోడయు, దానికి సున్నము పూసినవారుకూడ కనుమరుగైపోదురు.

16. ఆ సున్నము పూసిన వారెవరనగా, క్షేమము లేకున్నను, క్షేమము కలుగునని యెరూషలేమును మోసపుచ్చు ప్రవక్తలు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు”.

17. ప్రభువు ఇట్లనెను “నరపుత్రుడా! మీ జను లలో తమ సొంత ప్రవచనములను చెప్పు స్త్రీలను పరికింపుము. నీవు వారిని తెగడుచూ ప్రవచనము చెప్పుము.

18. యావే ప్రభుడనైన నా పలుకులను వారికిట్లు వినిపింపుము. స్త్రీలారా! మీకు అనర్ధము తప్పదు. మీరు ఎల్లరి చేతులకును మంత్ర బంధము లను, ఎల్లరి తలలకును మంత్రపు ముసు గులను తయారు చేయుచున్నారు. దీనివలన వారు ఇతరులపై అధికారము బడయుదురని చెప్పుచున్నారు. స్వార్థ లాభము కొరకు నా ప్రజల ప్రాణములను మీ గుప్పిట పెట్టుకొనుచున్నారు.

19. పిడికెడు యవ ధాన్యము కొరకును, రొట్టెముక్కల కొరకును నా ప్రజలయెదుట నన్ను అవమానపరచుచున్నారు. మీరు చంపకూడని వారిని చంపి, బ్రతుకకూడని వారిని బ్రతికించు చున్నారు. మీరు నా ప్రజలకు అబద్దము చెప్పగా వారు నమ్ముచున్నారు.

20. యావే ప్రభుడనైన నా పలుకులివి. ప్రజల ప్రాణములను మీ గుప్పిట పెట్టుకొనుటకుగాను మీరు వాడు మంత్ర బంధములను నేను అసహ్యించుకొందును. మీ చేతులనుండి వానిని లాగివేసి మీరు వేటాడి మీ గుప్పిటనుంచుకొను నావారిని పక్షులవలె విడిపింతును.

21. మీ ముసుగులను లాగివేసి మీ అధీనముననున్న నా వారిని విడిపింతును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

22. నేను కీడు చేయనొల్లని సజ్జనులను మీరు అబద్ధములు చెప్పి నిరుత్సాహపరచుచున్నారు. ఇంకను మీరు దుష్టులను ప్రోత్సహించి వారు తమ దుష్కార్య ములను విడనాడి, తమ ప్రాణములను దక్కించుకో కుండునట్లు చేయుచున్నారు.

23. మీ అనృత దర్శనము లును, అసత్య ప్రవచనములును ఇక చెల్లవు. నేను నా ప్రజలను మీ బారినుండి విడిపింతును. అపుడు నేను ప్రభుడనని మీరు గుర్తింతురు.”

Text Example

1. యిస్రాయేలు పెద్దలు కొందరు ప్రభువు చిత్తమును ఎరుగగోరి నా చెంతకు వచ్చి కూర్చుండిరి.

2. అంతట ప్రభువువాణి నాతో ఇట్లనెను:

3. “నరపుత్రుడా! ఈ ప్రజలు తమ హృదయములను విగ్రహములకు అర్పించిరి. అవి వారిని పాపము లోనికి నడిపించుచున్నవి. ఇట్టివారికి నేను నా చిత్తమును తెలియజేయుదునా?

4. నీవు వారితో మాట్లాడుము. యావే ప్రభుడనైన నా పలుకులను వారికి ఇట్లు వినిపింపుము. యిస్రాయేలీయులు తమ హృదయములను విగ్రహములకు అర్పించుకొని, వానివలన పాపములో పడుచున్నారు. అటుపిమ్మట నా చిత్తమును తెలిసికోగోరి ప్రవక్తలను సంప్రతించుచున్నారు. వారు పెక్కు విగ్రహములను సేవించుచున్నారు. అట్టివారికి నేనిచ్చు బదులు వారు చేయు కార్యములకు తగినట్లుగానే ఉండును.

5. ఆ విగ్రహములు యిస్రాయేలీయులను నా నుండి వైదొలగించెను. వారి హృదయమును లోబరచునట్లుగ ఇపుడు నేను వారికి బదులిచ్చుచున్నాను.

6. యావే ప్రభుడనైన నా మాటలను నీవు వారితో చెప్పుము. వారు హేయమైన విగ్రహములను విడనాడి నా చెంతకు తిరిగి రావలెనని చెప్పుము.

7. యిస్రాయేలీయులలో ఒకడుకాని, వారి నడుమ వసించు అన్యజాతి ప్రజలలో ఒకడుకాని, నానుండి వైదొలగి విగ్రహములను పూజించి అటుపిమ్మట ప్రవక్తను సంప్రతించెనేని, నేను వానికి తగిన జవాబునే ఇత్తును.

8. నేను వానికి విరోధినగుదును. వానిని దుర్గతికి సూచనగానుంతును. నా ప్రజల సమాజము నుండి వానిని తొలగింతును. అపుడు వారు నేను యావేనని గుర్తింతురు.

9. ఏ ప్రవక్తయైన మోసపోయి అసత్య ప్రవచనము చెప్పెనేని, అతనిని మోసగించినది నేనే అనుకొనుడు, నా జనులైన యిస్రాయేలీయుల నుండి వానిని నిర్నూలనము చేసెదను.

10. ఆ ప్రవక్తయు, అతనిని సంప్రతించిన వాడుకూడ అదియే దండనమును అనుభవించును.

11. నేనిట్లు చేసినచో యిస్రాయేలీ యులు నన్ను విడనాడకుందురు. తాము పాపము వలన అపవిత్రులు కాకుందురు. వారు నా ప్రజలగు దురు, నేను వారి దేవుడనగుదును. ఇది యావే ప్రభుడనైన నా పలుకు”.

12. ప్రభువువాణి నాతో ఇట్లు అనెను:

13. “నరపుత్రుడా! ఏ దేశమైన నన్ను నిరాకరించి నాకు ద్రోహముగా పాపము చేసెనేని, నేను చేయిచాచి దానికి ఆహారము సరఫరా కాకుండునట్లు చేయుదును. కరువునుపంపి దానిలోని నరులను, పశువులను నాశనము చేయుదును.

14. అపుడు నోవా, దానియేలు', యోబు అను ముగ్గురు వ్యక్తులు అచట వసించుచున్నను, వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు

15. ఒకవేళ నేను ఆ దేశముమీదికి వన్య మృగములను పంపగా అవి నరులను చంపివేసి, ఎవరును అటునిటు తిరగకుండునంతటి ప్రమాదమును తెచ్చిపెట్టెననుకొనుము.

16. అపుడు ఈ ముగ్గురు జనులు ఆ దేశమున వసించుచున్నను, వారు తమ బిడ్డలనుగూడ కాపాడుకోజాలరు. తమ ప్రాణములను మాత్రమే కాపాడుకొందురు. దేశము ఎడారియై తీరును. యావే ప్రభుడను, సజీవుడనగు దేవుడనైన నేను చెప్పుచున్నాను.

17. ఒకవేళ నేను ఆ దేశము మీదికి యుద్ధమును పంపి మారణాయుధములతో అందలి నరులను, పశువులను చంపివేసితిననుకొనుము.

18. అప్పుడు ఈ ముగ్గురు జనులు ఆ దేశమున వసించు చున్నను, వారు తమ బిడ్డలను కాపాడుకోజాలరు. తమ ప్రాణములను మాత్రమే కాపాడుకొందురు. యావే ప్రభుడను, సజీవుడనగు దేవుడనైన నేను చెప్పు చున్నాను.

19. ఒకవేళ నేను ఆ దేశము మీదికి అంటురోగమును పంపి కోపముతో చాలమందిని చంపితినను కొనుము. నరులను, మృగములను నాశనము చేసితిననుకొనుము.

20. అపుడు నోవా, దానియేలు, యోబు అచట నివసించుచుండినను వారు తమ బిడ్డలను కాపాడుకోలేరు. వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడును”.

21. ప్రభువైన యావే ఇట్లు చెప్పుచున్నాడు: “నేను యెరూషలేము మీదికి పోరు, కరువు, వన్యమృగ ములు, రోగములు అను కఠిన శిక్షలను నాలిగింటిని పంపి అచటి నరులను, పశువులను నాశనముచేయ తీర్పు తీర్చినయెడల అట్టి వారుండినను దానిని రక్షింపను.

22. ఎవరైన బ్రతికి బయటపడి తమ బిడ్డలను కాపాడుకొందురేని, వారు మీ చెంతకు వచ్చినపుడు మీరు వారి క్రియలను పరిశీలించి చూడుడు. యెరూషలేము వాసులందరు ఎంత దుష్టులో మీకే తెలియును. కనుక నేను యెరూషలేము నకు విధించు శిక్ష తగినదేనని మీరు ఒప్పుకొందురు.

23. నేను చేయు కార్యములనెల్ల సకారణముగనే చేయుదునని మీరు గ్రహింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు ”

Text Example

1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! అడవిలోని చెట్లకొయ్యతో పోల్చినచో, ద్రాక్షకొయ్య ఎందుకైన పనికి వచ్చునా?

3. దాని కొయ్యతో ఏ పరికరమునైన చేయుదురా? అది వస్తువులను తగిలించుటకు కనీసము మేకుగానైన ఉపయోగపడునా?

4. అది పొయ్యికే సరిపడునుకదా! రెండు కొనలును కాలి మధ్యభాగము మాడిపోయినపుడు అది ఎందుకును పనికిరాదు.

5. అది కాలకముందే నిరుపయోగమైనది. అగ్గి దానిని కాల్చిమాడ్చిన తరువాత అది దేనికి పనికివచ్చును?

6. యావే ప్రభువు పలుకులివి: నరులు అడవిలోని ద్రాక్ష కొయ్యను కాల్చివేసినట్లే, నేను యెరూషలేము ప్రజలను దండింతును.

7. వారొక అగ్గిని తప్పించుకొనిరి. కాని ఇపుడు నూతన అగ్ని వారిని దహించును. నేను వారిని శిక్షించినపుడు నేను ప్రభుడనని మీరు గ్రహింతురు.

8. వారు నాకు ద్రోహముచేసిరి. కనుక నేను వారి దేశమును ఎడారి చేయుదును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. “నర పుత్రుడా! యెరూషలేము చేసిన హేయమైన కార్యము లను దాని దృష్టికి తీసికొనిరమ్ము.

3. యావే ప్రభుడనైన నేను యెరూషలేముతో ఇట్లు చెప్పు చున్నాననుము: నీవు కనాను మండలమున జన్మించితివి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు.

4. నీవు పుట్టినపుడు ఎవరును నీ బొడ్డును కోయలేదు. నిన్ను స్నానము చేయింపలేదు. నీ చర్మమునకు ఉప్పు రుద్ది నిన్ను పొత్తిగుడ్డలతో చుట్టలేదు.

5. ఎవరును నీపై దయచూపి ఈ పరిచర్యలు చేయలేదు. నీవు జన్మించినపుడు. ఎవరును నిన్ను అనురాగముతో చూడక బయటి పొలమున పారవేయబడి, చూచుటకు అసహ్యముగానుంటివి.

6. అపుడు నేను నీ ప్రక్కగా పోవుచు నీవు నీ నెత్తురులోనే పడితన్నుకొనుచుండుటను చూచితిని. నేను 'నీవు రక్తములో పొర్లియున్నను బ్రతుకునట్లు చేసితిని.

7. నీవు పొలములోని మొక్కవలె చక్కగా పెరుగునట్లు చేసితిని.' నీవు పెరిగి యుక్తవయస్సునకు వచ్చి ఆభరణములు ధరించుదానవైతివి. నీ స్తనములు పుష్టిచెందెను. నీ శిరోజములు పెరిగెను. కాని నీవు దిగంబరివై యుంటివి.

8. నేను నీ ప్రక్కగా పోవుచు నీకు వలపుపుట్టు కాలము వచ్చినదని గ్రహించితిని. దిగంబరివైయున్న నిన్ను నా వస్త్రముతో కప్పి నీకు మాటయిచ్చితిని: నేను నీతో వివాహబంధనము చేసికొనగా నీవు నాదానవైతివి. ఇది యావే ప్రభుడనైన నా పలుకు.

9. అంతట నేను నీకు స్నానము చేయించి, నీ నెత్తుటిని కడిగివేసితిని. నీ చర్మముపై ఓలివు తైలము పులిమితిని.

10. నీకు బుట్టాలు వేసిన వస్త్రమును, మేలైన ఎఱ్ఱటి తోలుచెప్పులను తొడిగించితిని. నారబట్టతో కుట్టిన ఫాలపట్టికతోను, పట్టుఅంగీతోను నిన్ను అలంకరించితిని.

11. నిన్ను ఆభరణాలతో, చేతికంకణములతో, మెడకు రత్నమాలలతో సింగారించి,

12. నీ ముక్కునకు, చెవులకు నగలు పెట్టి, నీ తలపై సొగసైన కిరీటము నుంచితిని.

13. నీవు వెండిబంగారములతో చేసిన సొమ్ములు ధరించితివి. బుట్టాలు వేయించిన నారబట్టలను, పట్టుబట్ట లను తాల్చితివి. మేలిరకపు పిండితో చేసిన రొట్టెను, తేనెను, ఓలివు తైలమును భుజించితివి. సాటిలేని సొగసుకత్తెవైతివి.

14. నేను నా కీర్తిని నీకు ప్రసాదించితిని. కనుక నీవు పరిపూర్ణసౌందర్యవతివని దేశదేశములందు పేరు తెచ్చుకొంటివి. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు

15. కాని నీ సౌందర్యమువలనను, కీర్తి వలనను నీకు తల తిరిగినది. నీవు నీ చెంతకు వచ్చిన వారందరితోను వ్యభిచరించితివి.

16. నీవు నీ వస్త్రములలో కొన్ని తీసి, చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి, వాటిమీద పడుకొని ఎన్నడును జరుగని, జరుగకూడని రీతిగ వ్యభిచారము చేసితివి. అట్టివిక జరుగబోవు.

17. నేను నీకిచ్చిన వెండి, బంగారునగలతో పురుషవిగ్రహములను చేసి వానితో క్రీడించితివి.

18. బుట్టాలు వేసిన నీ దుస్తులను ప్రతిమలకు తొడిగితివి. నేను నీకిచ్చిన ఓలివు తైలమును, సాంబ్రాణిని వాని కర్పించితివి.

19. నేను నీకు నాణ్యమైన పిండితో చేసిన రొట్టెను, ఓలివుతైలమును, తేనెను భోజనముగానీయగా, నీవు వానిని విగ్రహముల కర్పించి, వాని మన్నన పొందగోరితివి. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు

20. నీవు నావలన కనిన బిడ్డలను ప్రతిమలకు బలిగా అర్పించితివి. నన్ను తోసిపుచ్చి జారత్వమునకు పూనుకొనుట చాలదోయన్నట్లు,

21. నా బిడ్డలను గూడ విగ్రహములకు బలియిచ్చెదవా?

22. నీవు రోత పుట్టించు వ్యభిచారిణివిగా మెలగునప్పుడు నీ బాల్యమును జ్ఞప్తికి తెచ్చుకోవైతివి. అప్పుడు నీవు దిగంబరివైయుంటివి. నీ నెత్తుటిలో నీవే తన్నుకొనుచుంటివి.

23. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు: నీకు శ్రమయు అనర్థముసుమా! నీవింతటి చెడుకు పాల్పడితివి.

24. ఇంకను ప్రతి రహదారి ప్రక్కన విగ్రహములకు దేవాలయములు, ఎత్తైన బలిపీఠములు నిర్మించి వ్యభిచరించితివి.

25. నీ సౌందర్యమును మంటగలిపి, ప్రతివానికి నీ శరీరమును అర్పించుకొంటివి. నీ రంకులకు అంతము లేదయ్యెను.

26. కామపూరితులును, నీ పొరుగువారునైన ఐగుప్తీయులతో శయ నించితివి. నీ చీకటి తప్పులవలన నా కోపమును రెచ్చగొట్టితివి.

27. కావున ఇపుడు నేను నిన్ను శిక్షించుటకు చేతినెత్తితిని. నీ జీవనోపాధిని తక్కువ చేసి, నిన్ను ద్వేషించువారును, నీ రోతపనులకు సిగ్గుపడువారునైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించితిని.

28. నీవు అంతటితో తృప్తిజెందక, అస్సీరియనుల వెంట బడితివి. వారికి వేశ్యవైతివి. కాని వారివలన కూడ నీకు తృప్తి కలుగలేదు.

29. కానాను దేశము మొదలుకొని బబులోనియా దేశమువరకును నీవు వ్యభిచరించి నను తృప్తినొందవైతివి. .

30. ప్రభువైన దేవుడు ఇట్లనుచున్నాడు: నీవు సిగ్గుమాలిన వేశ్యవై ఈ కార్యములెల్లచేసి నా రోషమును రెచ్చగొట్టితివి.

31. నీవు ప్రతి రహదారి ప్రక్కన, ప్రతి వీధి మలుపునను విగ్రహములకు మందిరములు నిర్మించి రంకాడితివి. అయినను నీవు రంకులాడివలె డబ్బు కోరవైతివి.

32. నీవు భర్తను ప్రేమింపక అన్యులతో వ్యభిచరించు భార్యవంటిదానవు.

33. వేశ్య డబ్బును స్వీకరించును. కాని నీవు నీ విటుకాండ్రలకు బహుమతులిచ్చితివి. కానుకలు అర్పించి ఎల్లతావుల నుండి వారిని ఆకర్షించితివి.

34. నీవు ఇతర వేశ్యల వంటి దానవుకావు. ఎవరును నీ వెంటపడలేదు. నీకెవరును డబ్బు చెల్లింపలేదు. నీవే నీ విటుకాండ్రకు ఎదురు సొమ్ము చెల్లించితివి. ఇదియే నీ జారత్వమునకును, ఇతర స్త్రీల జారత్వమునకును ఉన్న బేధము. ఇది ప్రభువు వాక్కు

35. వేశ్యవైన యెరూషలేమూ! ప్రభువు పలుకులు ఆలింపుము.

36. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు: నీవు వేశ్యవలె బట్టలు విప్పి నీ విటుకాండ్రలకును, హేయమైన విగ్రహములకును నీ శరీరమును అర్పించుకొంటివి. నీ పిల్లల రక్తమును ఆ విగ్రహములకు , అర్పించితిని.

37. కావున నేను నీవు సుఖమనుభవించిన విటుకాండ్రనందరిని, నీకిష్టమైనవారిని, అయిష్టమైనవారిని గూడ ప్రోగుజేసికొని వత్తును. వారెల్లరును నీ చుట్టు సమకూరుదురు, నీ వలువలు ఊడదీయుదురు. వారు నీ నగ్నరూపము చూతురు.

38. నీ రంకులకును, నీ హత్యలకును నేనే నిన్ను దండింతును. మహాకోపముతోను, రోషముతోను నీకు మరణశిక్ష విధింతును.

39. నీ విటుకాండ్రలకు నిన్ను అప్పగింతును. వారు నీవు రంకాడిన తావులనెల్ల అనగా నీవు కట్టిన గుళ్ళను, నిలబెట్టిన బలిపీఠములనెల్ల కూలద్రోసి నాశనము చేయుదురు. నీ బట్టలను, నగలను తీసివేసి నిన్ను దిగంబరను చేయుదురు.

40. వారు నీ మీదికొక గుంపును తీసికొనివచ్చి నీపై రాళ్ళు రువ్వింతురు. నిన్ను కత్తితో నరుకుదురు.

41. నీ ఇండ్లను తగులబెట్టుదురు. నీవు దండన అను భవించుచుండగా చాలామంది స్త్రీలు చూతురు. నేను నీ వేశ్యావృత్తిని మాన్పింపగ నీవిక పడుపుసొమ్మీయక ఉందువు.

42. దానితో నా ఆగ్రహము చల్లారును. నేను శాంతింతును. అటుపిమ్మట నేను కోపమును, రోషమును తెచ్చుకొనను.

43. నీవు బాలికగా నున్న పుడు నేను నిన్ను ఎట్లు ఆదరించితినో మరచిపోతివి. నీ చెయిదముల ద్వారా నా కోపమును రెచ్చగొట్టితివి. కనుక నేను నీకు తగినశాస్తి చేసితిని. నీవీ హేయమైన కార్యములతోపాటు అవవిత్ర కార్యములు గూడ చేసితివికదా! ఇవి యావే ప్రభుడనైన నా పలుకులు.

44. యెరూషలేమూ! “తల్లి వలె తనయ” అను సామెతను ప్రజలు నీకు వర్తింపజేయుదురు.

45. నీవు నీ తల్లికి తగిన తనయవు. ఆమె తన భర్తను, పిల్లలను అసహ్యించుకొనెను. నీవు నీ తోబుట్టువులకు సాటి దానవు. వారు తమ భర్తలను, పిల్లలను అసహ్యించు కొనిరి, నీ తల్లి హిత్తీయురాలు, తండ్రి అమోరీయుడు.

46. నీ అక్క ఉత్తరమున ఆమె కుమార్తెలతోనున్న సమరియా నగరము, దాని గ్రామములు. నీ చెల్లెలు దక్షిణమున ఆమె కుమార్తెలతోనున్న సొదొమ నగరము, దాని గ్రామములు.

47. నీవు నీ తోబుట్టువుల మార్గములో నడచి వారివలె హేయమైన కార్యములు చేయుటతో సరిపెట్టుకొంటివా? లేదు. అనతికాలములోనే నీ దుష్కార్యముల ద్వారా వారిని మించిపోతివి.

48. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను వినుము. నా జీవము తోడు. నీ సోదరియైన సొదొమ పట్టణము ఆమె కుమార్తెలు, నీవు నీ కుమార్తెలు చేసినన్ని దుష్కార్యములు చేయలేదు.

49. నీ చెల్లెలైన సొదొమ, ఆమె కుమార్తెల పాపములు ఏవనగా: పొగరు, ఆహారసమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి నుండుట. అవి దీనులను, దరిద్రులను పట్టించు కోలేదు.

50. అవి తలబిరుసుతనముతో నేను అస్యహించుకొను కార్యములు చేసెను గనుక, నేను వానిని నాశనము చేసితిని. ఈ సంగతి నీకును తెలియును.

51. నీవు చేసిన పాపములో సమరియా సగము కూడ చేయలేదు. నీవు దానికంటెను హేయమైన పనులు చేసితివి. నీ రోతపనులతో పోల్చినచో నీ తోబుట్టువులు నిర్దోషులేమోయని అనిపించును.

52. ఇపుడు నీవు నీ అవమానమును భరింపుము. నీ తప్పులెంత ఘోరమైనవనగా, నీతో పోల్చినచో నీ అక్కచెల్లెండ్రు నిర్దోషులు. నీ అక్కచెల్లెండ్రు నీకంటెను విశుద్ధురాండ్రు కనుక నీవు వెలవెలబోయి సిగ్గు చెందుము.

53. యెరూషలేమూ! నేను సమరియాను దాని నగరములను, సొదొమను దాని నగరములను మరల స్థాపింతును. వారివలెనె అపాయమొందిన నిన్నుకూడ పూర్వపుస్థితికి తెత్తును.

54. నీ కార్యములకుగాను నీవు సిగ్గుపడుదువు. నీ అవమానముతో పోల్చినచో నీ తోబుట్టువులు మంచివారుగా చలామణి అయ్యెదరు.

55. సమరియా దాని గ్రామములు, సొదొమ దాని గ్రామములు మరల పెంపుజెందును. అట్లే నీ గ్రామములతో పాటు నీవును పెంపుజెందుదువు.

56. నీవు పూర్వము అహంకారముతో నీ చెల్లెలయిన సొదొమను గేలిచేసితివి.

57. నీ పాపములు బట్టబయలు కాకముందు ఆమెను ఎగతాళి చేసితివి. ఇపుడు నీవును ఆమె వంటిదానవైతివి. నిన్ను ద్వేషించు ఎదోమీయులు, ఫిలిస్తీయులు, ఇంకను నీ పొరుగుననున్న ఇతరులు నిన్నుచూచి నవ్వుచున్నారు.

58. నీవు చేసిన హేయమైన కార్యములకును, అపవిత్రక్రియలకును శిక్షను అను భవింపుము.” ఇది ప్రభువు వాక్కు

59. ప్రభువైన యావే ఇట్లు చెప్పుచున్నాడు: “నీ దుష్టవర్తనమునకు తగినట్లే నేను నిన్ను దండింతును. నీవు నీ ప్రమాణమును నిలబెట్టుకోవైతివి. నా నిబంధనను మీరితివి.

60. కాని నీవు బాలికగా ఉన్న పుడు నేను నీతో చేసికొనిన ఒడంబడికను స్మరించుకొని ఇపుడు నీతో శాశ్వతమైన నిబంధనము చేసికొందును.

61. నీ అక్కచెల్లెండ్లు నీవు చేసిన నిబంధనములో భాగస్తులు కాకున్నను, నేను వారిని నీకు కుమార్తెల నుగా ఇచ్చుచున్నాను. నీవు వారిని చేర్చుకొనినపుడు నీ ప్రవర్తనమును తలంచుకొని సిగ్గుపడుము.

62. నేను నీతో చేసికొనిన నిబంధనమును స్థాపింతును. అపుడు నేను ప్రభుడనని నీవు గ్రహింతువు.

63. నేను నీ అపరాధములెల్ల ప్రాయశ్చిత్తము చేయగా, నీవు వానిని జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి నోరు విప్పజాలవు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! యిస్రాయేలీయులకు ఒక పొడుపు కథను సామెతరూపమున చెప్పుము.

3. ప్రభువైన దేవుడు ఇట్లు నుడువుచున్నాడని చెప్పుము: ఆ ఒక పెద్ద గరుడపక్షి కలదు. దానికి సొగసైన రంగురంగుల ఈకలును, పొడవైన రెక్కలును కలవు.

4. అది లెబానోను కొండకెగిరిపోయి మెత్తని దేవదారు చిటారు కొమ్మను విరిచి, కానాను దేశమునకు కొనిపోయి వర్తకుల నగరమున దానిని నాటెను.

5. అటుపిమ్మట దేశపువిత్తనములు కొనిపోయి ,నీరు సమృద్ధిగా లభించుచోట సారవంతమైన నేలలో నాటెను.

6. అది చిగురించి ద్రాక్షవల్లి అయ్యెను. అది ఎత్తు పెరగకయే విశాలముగా రెమ్మలు చాచెను. దాని రెమ్మలు ఆ గరుడపక్షివైపుగా అల్లుకొనెను. వ్రేళ్ళు నేలలోనికి పారెను. అది తీగలతోను రెమ్మలతోను అలరారెను.

7. మరియొక పెద్ద గరుడపక్షి కలదు. దానికి పొడవైన రెక్కలును, దట్టమైన ఈకలును గలవు. ఆ ద్రాక్షవల్లి నీరు సమృద్ధిగా లభించు సారవంతమైన నేలలో నాటబడినది. అది అచట రెమ్మలు చాచి, పండ్లు కాచి పెద్ద చెట్టుగా ఎదుగవచ్చును.

8. అయితే అది ఆ తావునుండి ప్రక్కకు తొలగి తన వ్రేళ్ళను రెమ్మలను ఈ పక్షివైపునకు మళ్ళించి దానినుండి నీళ్ళు పొందగోరెను.

9. యావే ప్రభుడనైన నా పలుకులుగా నీవిట్లు చెప్పుము “ఆ ద్రాక్షవల్లి పెంపుజెందునా? జనులు దానిని వ్రేళ్ళతో పెకలింపరా? దానిపండ్లను దులిపివేయరా? దాని రెమ్మలను విరిచి వానిని ఎండగొట్టరా? ఆ తీగను పెరికి వేయుటకు మహాబలముకాని, మహాజాతికాని కావలయునా?

10. ఆ ద్రాక్షను అచట నాటినను అది పెంపుజెందునా? తూర్పు గాలిసోకి కమిలిపోదా? తాను పెరుగుతావుననే వాడిపోదా?”

11. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

12. “నీవా తిరుగుబాటుదారులను ఈ సామెత మీకర్ణమైనదా? అని అడుగుము. వారితో ఇట్లు చెప్పుము. బబులోనియా రాజు యెరూషలేమునకు వచ్చి అచటి రాజును, అధికారులను తనతో బబులోనియాకు కొనిపోయెను.

13. అతడు రాజవంశీయుని ఒకనిని ఎన్నుకొని అతనితో నిబంధనము చేసికొనెను. అతడు విశ్వాస పాత్రుడుగా మెలుగునట్లు ప్రమాణము కూడ చేయించు కొనెను. ఆ దేశములో ప్రముఖులైన వారిని జామీనుగా గూడ గొనిపోయెను.

14. ఆ దేశము మరల తిరుగుబాటు చేయక తనకు లొంగియుండవలెననియు, అది తాను చేసికొనిన ఒడంబడికను నిలబెట్టుకోవలె ననియు అతనికోరిక.

15. కాని యూదారాజు అతనిపై తిరుగుబాటు చేసెను. ఐగుప్తునకు దూతలనంపి అశ్వములను, పెద్ద సైన్యమును పంపుమని అడిగించెను. కాని అతడు విజయము పొందునా? ఇట్టి చెయిదమునకు పాల్పడినవాడు శిక్ష తప్పించుకొనునా? నిబంధనమును మీరినవాడు దండనమునకు గురి కాకుండునా?

16. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నా జీవము తోడు. ఆ రాజు తనను సింహాసనమెక్కించిన బబులోనియా రాజునకు అపకారము చేసెను. తాను అతనికి చేసిన బాసతప్పెను. తాను చేసికొనిన నిబంధనమును మీరెను. కనుక అతడు బబులోనియాలోనే చచ్చును. ఇది ప్రభుడనైన నా వాక్కు

17. బబులోనీయులు వచ్చి ముట్టడిదిబ్బలుపోసి, గోతులు త్రవ్వి, బురుజులు కట్టి పెక్కు జనులను చంపునపుడు, ఫరోరాజు ఎన్ని మహాసైన్యములను పంపినను అతనిని కాపాడలేడు.

18. అతడు తాను చేసిన బాసను, నిబంధనమును మీరెను. ఇట్టి చెయిదమునకు పాల్పడినవాడు ఇక తప్పించుకోజాలడు."

19. యావే ప్రభువు పలుకులివి: “నా జీవము తోడు. అతడు నా పేరు మీదుగా చేసికొనిన నిబంధన మును మీరెను గనుక నేను అతనిని శిక్షింతును.

20. నేను నా వలపన్ని అతనిని పట్టుకొని బబులోనియాకు కొనిపోయి అచట శిక్షింతును. అతడు నాకు ద్రోహము చేసెను.

21. అతని సైనికులలో మెరికల వంటి వారు పోరున కూలుదురు. మిగిలినవారు నలుదిక్కులకు చెదరిపోవుదురు. అప్పుడు ఈ పలుకులు ప్రభుడనైన నా పలుకులని మీరు గ్రహింతురు.”

22. యావే ప్రభువు పలుకిది: “నేను ఎత్తయిన దేవదారుమీది మెత్తనికొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును.

23. ఎత్తయిన యిస్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి, కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతిపకులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయును.

24. దేశములోని వృక్షములన్నియు నేను ప్రభుడనని గ్రహించును. , నేను ఎత్తయిన చెట్లను నరుకుదును. కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చనిచెట్లు ఎండిపోవునట్లును, ఎండినచెట్లు పచ్చబడునట్లును చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు”.

Text Example

1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

2. “తండ్రులు పుల్లని ద్రాక్షపండ్లు, భుజింపగా తనయులకు పండ్లు పులుపెక్కెను” అను సామెతను యిస్రాయేలీయుల దేశమున ప్రజలు నిరంతరము వాడుచున్నారేల?

3. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నా జీవము తోడు. ఇక మీదట యిస్రాయేలు దేశమున మీరు ఈ సామెతను ఉపయోగింపరు.

4. మనుష్యులందరు నా వశములో ఉన్నారు. తండ్రులేమి, కుమారులేమి అందరును నా వశములోనే ఉన్నారు. పాపము చేసినవాడే చచ్చును.

5. న్యాయపరుడుగాను, ధర్మపరుడుగాను జీవించు సత్పురుషుడు ఒకడున్నాడనుకొందము.

6. అతడు యిస్రాయేలీయులు కొలుచు విగ్రహములను పూజింపడు. కొండలమీది దేవళములలోని వాని కర్పించిన నైవేద్య ములను భుజింపడు. పరస్త్రీని చెరపడు. ముట్టుతను కూడడు.

7. ఎవరిని పీడింపడు, ఎవరి సొమ్ము దొంగిలింపడు. అప్పు తీసికొన్న వాని కుదువసొమ్మును తిరిగి ఇచ్చివేయును. ఆకలిగొన్న వారికి అన్నము పెట్టి, బట్టలులేని వారికి బట్టలిచ్చును.

8. వడ్డీకి అప్పు ఈయడు. చెడుకు పాల్పడడు. తగవులలో పక్షపాతిగాక న్యాయమైన తీర్పుచెప్పును.

9. అట్టివాడు నా చట్టము లను, విధులను చిత్తశుద్ధితో పాటించును. అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు

10. ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడనుకొందము. అతడు దొంగిలించుట, హత్యచేయుట మొదలైన కార్యములు చేయును. అతని తండ్రి ఇట్టి కార్యములు చేయలేదు.

11. కొండలమీది దేవళములలో అర్పించిన నైవేద్యములు భుజించును. పరస్త్రీలను చెరచును.

12. పేదలను పీడించును, దొంగిలించును. కుదువసొమ్మును తిరిగి ఇచ్చివేయడు. విగ్రహములను సేవించి పూజించును.

13. వడ్డీకి డబ్బు ఇచ్చును. అతడు బ్రతుకునా? ఇట్టి దుష్టకార్యములకు పాల్పడెను కనుక చచ్చును. అతడి చావునకు అతడే బాధ్యుడు.

14. అట్టివానికి ఒక కుమారుడు ఉన్నాడు అనుకొందము. అతడు తన తండ్రి చేసిన పాపములను తెలిసికొనును. తాను మాత్రము అట్టిపనులను చేయడు.

15. అతడు యిస్రాయేలీయులు కొలుచు విగ్రహములను పూజింపడు. కొండలమీది దేవత ములలో వానికర్పించిన నైవేద్యములను భుజింపడు. పరస్త్రీని చెరపడు.

16. ఇతరులను పీడింపడు. పరుల సొమ్ము దొంగిలింపడు. అప్పుతీసికొన్నవాని కుదువ సొమ్ము తిరిగియిచ్చివేయును. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టి, బట్టలు లేనివారికి బట్టలిచ్చును.

17. చెడును చేయడు. వడ్డీకి డబ్బీయడు. నా చట్టములను, విధులను పాటించును. తన తండ్రి పాపములకుగాను అతడు చనిపోడు. తప్పక బ్రతుకును.

18. అతని తండ్రి పరులను మోసగించెను. ఇతరుల సొమ్ము దొంగిలించెను. ఎల్లరికిని కీడు చేసెను. అతడు తన పాపములకు తానే చచ్చును.

19. కాని తండ్రి పాపములకు తనయుడేల శిక్ష పొందడని మీరడుగుదురు. కుమారుడు న్యాయసమ్మత మయిన మంచిపనులు చేసెను. నా చట్టములను జాగ్రత్తగా పాటించెను. కనుక అతడు అవశ్యకముగ బ్రతుకును.

20. అపరాధము చేసినవాడే చచ్చును. తండ్రి పాపములకు తనయుడుకాని, తనయుని పాపములకు తండ్రి కాని శిక్షపొందరు. నీతివర్తనుడు తన సత్క్రియలకు బహుమతిని, దుష్టవర్తనుడు తన దుష్క్రియలకు శిక్షను పొందును.

21. దుష్టుడు తన పాపములనుండి వైదొలగినా చట్టములను పాటించెనేని, న్యాయసమ్మతమైన మంచిపనులు చేసెనేని, చావును తప్పించుకొని బ్రతుకును.

22. అతని పాపములు పరిహరింతును. అతని పాపములలో ఒకటియును నా జ్ఞాపకములోనికి రాదు. అతని మంచి పనులకుగాను అతడు బ్రతుకును.

23. దుర్మార్గుడు చనిపోవుటవలన నాకు సంతోషము కలుగునా? అతడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటయే నా సంతోషముకదా! అని యావే ప్రభువు నుడువుచున్నాడు.

24. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడెనేని, దుష్టులు చేయు హేయమైనకార్యములు చేసెనేని, అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు జ్ఞాపకమునకు రావు. అతని ద్రోహములకును, పాపములకును అతడు చచ్చితీరును.

25. కాని మీరు 'యావే ప్రభువు చేయునది సబబుకాదు' అని పలుకుదురు. యిస్రాయేలీయులారా! వినుడు. నా మార్గము సబబైనదికాదా? మీ మార్గమే సబబైనదికాదు.

26. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయెనేని, తన దుష్కార్యములవలననే చనిపోయెను.

27. దుష్టుడు తన పాపకార్యములనుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచిపనులు చేసెనేని, తన ప్రాణములను కాపాడు కొనును.

28. అతడు తన తప్పులను తెలిసికొని తన పాపముల నుండి వైదొలగెను గనుక చావునకు తప్పి బ్రతుకును.

29. యిస్రాయేలీయులారా! మీరు యావే ప్రభువు చేయుపని న్యాయమైనది కాదని పలుకుదురు. నా మార్గము న్యాయమైనదికాదా? మీ మార్గమే న్యాయమైనది కాదు.

30. యిస్రాయేలీయులారా! యావే ప్రభుడనైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతివానికి తాను చేసిన పనులను బట్టి తీర్పు విధింతును. కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు. మీ పాపముల వలన మీరు నాశనము కావలదు.

31. మీరు చేయు పాపకార్యములనుండి వైదొలగి నూత్నహృదయమును, నూత్నఆత్మను పొందుడు. యిస్రాయేలీయులారా! మీరు చావనేల?

32. ఎవడును చనిపోవుటవలనను నాకు సంతోషము కలుగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు ".

Text Example

1. యిప్రాయేలు రాజుల మీద ఈ విలాపగీతమును వినిపింపుమని ప్రభువు నాతో చెప్పెను.

2. మీ తల్లి గొప్ప ఆడుసింగము. ఆమె భీకరములైన సింహముల మధ్య తన కిషోరములను పెంచెను.

3. ఆమె ఒక కిషోరమును పెంచి, పెద్దజేసి వేట నేర్పెను. అది నరభక్షకి అయ్యెను.

4. జాతులు దానిని గూర్చి వినెను. దానిని గోతిలో బడద్రోసి, బంధించి, కొక్కెములు తగిలించి ఐగుప్తునకు ఈడ్చుకొనిపోయెను.

5. ఆమె వేచి వేచి విఫలురాలయ్యెను. అటుపిమ్మట ఆమె మరియొక సంతానమును పెంచగా అది కొదమసింగమయ్యెను.

6. అది పెరిగి పెద్దదై తోడి సింగాలతో తిరుగజొచ్చెను. వేటనేర్చుకొని నరభక్షకి అయ్యెను.

7. అది కోటలను నాశనము చేసెను. నగరములను ధ్వంసము చేసెను. దాని గర్జనకు దేశములోని ప్రజలు భయపడిరి.

8. వివిధ దేశముల నుండి జాతులేకమై వచ్చి దానితో పోరాడిరి, దానికొరకు వలపన్నిరి. అది వారు త్రవ్విన గోతిలోపడి బందీ అయ్యెను.

9. వారు దానిని బోనులో బెట్టి బబులోనియా రాజు వద్దకు కొనిపోయిరి. ఆ సింగమును చెరలో పెట్టిరి. కనుక దాని గర్జనములు యిస్రాయేలు కొండలపై మరల వినిపింపవయ్యెను.

10. మీ తల్లి ఏటి ప్రక్కన నాటిన ద్రాక్షవల్లి వంటిది. నీరు సమృద్ధిగా లభించుట వలన ఆ తీగ ఆకు తొడిగి పండ్లు కాచెను.

11. అది పటువైన రెమ్మలు చాచెను. ఆ రెమ్మలు రాజదండములయ్యెను. ఆ తీగ ఎత్తుగా పెరిగి మేఘమండలమును తాకెను. దాని ఎత్తును గుబురైన ఆకులను గాంచి జనులెల్లరును విస్తుపోయిరి.

12. అయితే బహు రౌద్రముచేత అది పెరికి వేయబడినదై, నేలమీద పడవేయబడెను, తూర్పుగాలి విసరగా దానిపండ్లు వాడిపోయెను. మరియు దాని గట్టి రెమ్మలు తెగి, వాడిపోయి, అగ్నిచేత కాలిపోయెను.

13. దానినిపుడు నీరులేక ఎండియున్న ఎడారిలో నాటిరి. దాని రెమ్మలు విరిగి, ముందు ఎండి అగ్నికాహుతి అయ్యెను.

14. దాని బోదెకు నిప్పంటుకొని రెమ్మలను, పండ్లను కాల్చివేసెను. ఆ రెమ్మలలో ఇక పటుత్వముండదు. అవి మరల రాజదండములు కాజాలవు. ఇదియే విలాపగీతము. ఇది విలాపముగనే, వాడుకలోనికి వచ్చెను.

Text Example

1. అది ఏడవయేడు, ఐదవనెల, పదియవ రోజు. యిస్రాయేలు పెద్దలు కొందరు ప్రభువును సంప్రతింపగోరి నా చెంతకువచ్చి నా యెదుట కూర్చుండియుండిరి.

2. అంతట ప్రభువువాణి నాతో ఇట్లనెను:

3. “నరపుత్రుడా! నీవు పెద్దలతో ఇట్లు చెప్పుము. ప్రభువు పలుకులివి: మీరు నన్ను సంప్ర తింపవచ్చితిరా? నా జీవముతోడు. నా నుండి ఎట్టి ఆలోచనయు మీకు లభింపదు. ఇవి యావే ప్రభుడనైన నా పలుకులు”.

4. “నరపుత్రుడా! నీవు వారికి తీర్పుచెప్పుటకు నిధముగానున్నావా? ఉన్నచో వారికి తీర్పు విధింపుము. వారి పితరులు చేసిన ఘోరకార్యములను వారికి జ్ఞప్తికి తెమ్ము.

5. యావే ప్రభుడనైన నా పలుకులను వారికి ఇట్లు వినిపింపుము. నేను యిస్రాయేలీయులను ఎన్నుకొనినపుడు వారికొక ప్రమాణము చేసితిని. ఐగుప్తున నన్ను నేను వారికి ఎరుకపరచుకొని నేను మీ దేవుడనైన యావేనని చెప్పితిని.

6. అపుడు నేను వారిని ఐగుప్తునుండి తోడ్కొని వత్తునని బాస చేసితిని. వారిని నేనెన్నుకొనిన దేశమునకు చేర్చిద నంటిని. అది మిగుల పాలు తేనెలు జాలువారు నేల, అది శ్రేష్ఠమైన భూమి.

7. నేను తమకు ప్రీతి కలిగించు హేయమైన విగ్రహములను విడనాడవలెనని వారికి చెప్పితిని. నేను వారి ప్రభుడనైన దేవుడను గనుక, వారు ఐగుప్తు విగ్రహములను కొలిచి అపవిత్రులు కారాదని నుడివితిని.

8. కాని వారు నాకెదురుతిరిగి, నా మాటలు పాటింపరైరి. తమ హేయమైన విగ్రహ ములనుగాని, ఐగుప్తు దైవములనుగాని విడనాడరైరి. వారు ఐగుప్తీయుల దేశములో ఉండినపుడే వారిపై నేను నా కోపమును క్రుమ్మరించి, నా ఆగ్రహమును తీర్చుకోనెంచితిని.

9. కాని నేనట్లు చేసిన యెడల నా నామమునకు అపకీర్తి వచ్చెడిది. యిస్రాయేలీయులు అన్యజాతుల మధ్య వసించుచుండిరికదా! నేనా జాతుల యెదుట యిస్రాయేలీయులను ఐగుప్తులో నుండి రప్పించి నన్ను నేను తెలియజేతుననుకొంటిని. కనుక నేను తలపెట్టిన పనిని చేయనైతిని.

10. కావున వారిని ఐగుప్తు నుండి ఎడారిలోనికి తోడ్కొనివచ్చితిని.

11. వారికి నా చట్టములను, న్యాయ నిర్ణయములను దయచేసితిని. వానిని పాటించినవారు జీవమును బడయుదురు.

12. వారిని పవిత్రపరుచు వాడను నేనేయని వారు తెలుసుకొనునట్లు నాకును, వారికిని మధ్య విశ్రాంతి దినమును సూచనగా నేను నియమించితిని.

13. కాని ఎడారిలోనే వారు నాకు ఎదురుతిరిగిరి. తాము అనుసరించి బ్రతుకవలెనని నేను ఇచ్చిన నా చట్టములను, న్యాయనిర్ణయములను మీరిరి. వాటిని పాటించువారికి అవి జీవము నొసగు నవి. వారు విశ్రాంతిదినమును అపవిత్రము చేసిరి. నేను ఎడారిలోనే వారిపై నా కోపమును క్రుమ్మరించి వారిని నాశనము చేయగోరితిని.

14. కాని అటుల చేసినచో జాతుల యెదుట నా నామమునకు అషకీర్తి వాటిల్లెడిది. వారు నేను యిస్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడ్కొనివచ్చుట చూచిరి. కనుక నేను సంకల్పించు కొన్నట్లు చేయనైతిని.

15. కాని నేను వారిని వారి కిచ్చిన నేలకు తోడ్కొనిపోనని ఎడారిలోనే శపథము చేసితిని. అది పాలుతేనెలు జాలువారు నేల, శ్రేష్ఠమైన భూమి.

16. వారు నా న్యాయనిర్ణయములను, చట్టములను మీరిరి. విశ్రాంతిదినమును అపవిత్రము చేసిరి. విగ్రహములకు అంటిపెట్టుకొనిరి. కనుక నేనట్లు ప్రతిన బూనవలసి వచ్చెను. .

17. నేను వారిని కరుణించి నాశనము చేయ నైతిని. ఎడారిలో వారిని చంపివేయనైతిని.

18. నేను వారిలోని యువతరమును హెచ్చరించి “మీరు మీ పెద్దలు చేసినట్లు చేయకుడు. వారి ఆచారములను అనుకరింపకుడు. వారి విగ్రహములను కొలిచి, మీరు అపవిత్రులు కావలదు.

19. నేను మీ దేవుడనైన ప్రభుడను. మీరు నా చట్టములను, న్యాయనిర్ణయ ములను పాటింపుడు.

20. మీరు నా విశ్రాంతిదిన మును పవిత్రము చేయుడు. అది మన ఇరువురి ఒప్పందమునకు గుర్తుగా ఉండును. నేను మీ ప్రభుడనైన దేవుడనని మీరు జ్ఞప్తియందుంచుకొనునట్లు చేయును” అని చెప్పితిని.

21. కాని ఆ తరమువారుకూడ, నాకెదురుతిరిగి, నా చట్టములను, విధులను మీరిరి. అవి వాటిని పాటించువారికి జీవమునొసగునవి. వారు నా విశ్రాంతి దినమును అపవిత్రము చేసిరి. నేను వారిపై నా ఆగ్రహమును క్రుమ్మరించి ఎడారిలోనే వారిని చంపి వేయగోరితిని.

22. కాని అన్యజనుల మధ్య నా నామమునకు అపకీర్తి కలుగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో, ఆ జనులు చూచు చుండగానే వారిని చంపివేయు ఆలోచనను విరమించు కొని నా వాగ్దానమును నెరవేర్చితిని.

23. వారు నా చట్టములను, ఆజ్ఞలను మీరి నా విశ్రాంతి దినమును తృణీకరించి అపవిత్రము చేసిరి. తమ పితరులు కొలి చిన విగ్రహములను తాము కూడ పూజింపగా,

24. నేను వారిని పలు దేశములలో వివిధ జాతుల మధ్య చెల్లాచెదరు చేయుదునని ఎడారిలో శపథము చేసితిని.

25. అటుపిమ్మట నేను ప్రభుడనని వారు తెలుసు కొనునట్లును, వారిని విస్మయము నొందింపవలయునని వారికి మేలు చేయని చట్టములను, జీవము నొసగని విధులనిచ్చితిని.

26. తమ తొలిచూలు పిల్లలను నివేదించుటలోను, బలి అర్పణములను ఇచ్చుటలోను తమ అర్పణముల ద్వారా తమను తామే అపవిత్ర పరచుకొననిచ్చితిని.

27. "కనుక నరపుత్రుడా! నీవు యావే ప్రభుడనైన నా మాటలను యిస్రాయేలీయులకు ఇట్లు ఎరిగింపుము. వారి పితరులు నాకు ద్రోహముచేసి నన్ను మరియొక విధముగా కూడ అవమానపరచిరి.

28. నేను వారికిత్తునని ప్రమాణముచేసిన నేలకు వారిని తోడ్కొనివచ్చితిని. కాని వారచట ఎత్తయిన కొండలను, పచ్చనిచెట్లను చూచి వానికెల్ల బలులర్పించిరి. వారి పరిమళ ధూపములు, పానీయార్పణములు నా కోపమును రెచ్చ గొట్టెను.

29. మీరు వెళ్ళు ఆ ఉన్నత స్థలములేమిటి వని నేను వారిని ప్రశ్నించితిని. కనుక నేటివరకును వానికి ఉన్నత స్థలములను పేరు స్థిరపడినది.

30. యిస్రాయేలీయులకు నీవు నా మాటలుగా ఇట్లు చెప్పుము: మీరు మీ పితరులు కొలిచిన విగ్రహములను కొలిచి, మరల వారుచేసిన పాపములు చేయనేల?

31. నేడును మీరు వానికి అర్పణలర్పించుచున్నారు. మీ బిడ్డలను అగ్నిలో దహించి బలి అర్పించుచున్నారు. ఈ రీతిగా ఆ విగ్రహములవలన మీరు అపవిత్రులగుచున్నారు. యిస్రాయేలీయులారా! మీరింతచేసిన పిమ్మట మరల నన్ను సంప్రతింప వచ్చుచున్నారు. నా జీవము తోడు, నా నుండి ఏ ఆలోచనయు మీకు లభింపదు.

32. మీరు 'చెట్లను, రాళ్ళను కొలుచు అన్యజాతులవలె ఉండగోరుచున్నారు.. కాని అది పొసగదు. ఇది ప్రభువు వాక్కు.

33. నా జీవముతోడు. యావే ప్రభుడనైన నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. నేను నా ఆగ్రహమును రగుల్కొలిపి, భుజబలముతోను, చాచినబాహువుతోను మీపై అధికారము చెలాయింతును.

34. మీరు చెల్లాచెదరైయున్న దేశములనుండి మిమ్ము మరల తీసికొని వచ్చినపుడు, నేను నా బలమును, అగ్రహమును మీకు చూపింతును.

35. మిమ్ము "జాతుల ఎడారి" అను దానిలోనికి కొనివచ్చి, అచట మీ ముఖము నెదుటనే మీరు దోషులని నిరూపింతును,

36. నేను సీనాయి ఎడారిలో మీ పితరులను దోషులనుగా నిరూపించినట్లే, ఇప్పుడు మిమ్ము కూడ దోషులునుగా నిరూపింతును. ఇవి యావే ప్రభువు పలుకులు.

37. నేను మిమ్ము అదుపులో బెట్టుకొని, మీరు నా నిబంధనమును పాటించునట్లు చేయుదును.

38. నాకు ఎదురుతిరుగువారిని, నాకు ద్రోహము చేయు వారిని మీ నుండి తొలగింతును. వారిపుడు వసించు చున్న దేశమునుండి వారిని కొనివత్తునుగాని వారిని యిసాయేలు దేశమునకు తిరిగి రానీయను. అపుడు నేను ప్రభుడనని మీరు గుర్తింతురు.

39. యావే ప్రభువిట్లనుచున్నాడు: “యిస్రాయేలీయులారా! నా మాటవినక మీ విగ్రహములను మీ ఇచ్చ వచ్చినట్లు పూజించుకొనుడు. అయితే మీ అర్పణముల చేతను, మీ విగ్రహముల చేతను నా పవిత్ర నామమును అపవిత్రపరచకుడు.

40. యిస్రాయేలు ఉన్నతమైన కొండయగు నా పవిత్రపర్వతమందు దేశములోనున్న యిస్రాయేలీయులందరు నన్ను ఆరాధింతురు. అపుడు నేను మీ వలన ప్రీతిజెందుదును. మీరు నాకు బలులను, ఉత్తమ అర్పణములను, పవిత్ర నైవేద్యములను అర్పింపవలెనని కోరుకొందును.

41. మీరు చెల్లాచెదరైన జాతులనుండి మిమ్ము తీసికొని వచ్చి, మిమ్ము ప్రోగుజేసిన తరువాత, నేను పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరింతును. జాతులు నేను పవిత్రుడనని గుర్తించును.

42. నేను మీ పితరుల కిత్తునన్న యిస్రాయేలు దేశమునకు మిమ్ము కొనివచ్చి నపుడు, మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

43. అపుడు మీరు మీ దుష్టచేష్టలను, వాని ద్వారా మిమ్ము మీరు అపవిత్రము చేసికొనిన తీరును జ్ఞప్తికి తెచ్చు కొందురు. మీ దుష్కార్యములకు గాను మీమీద మీకే రోతపుట్టును.

44. యిస్రాయేలీయులారా! మీ దుష్టత్వమునుబట్టియు, మీ దుష్కార్యములనుబట్టియు గాక, నేను నా కీర్తిని నిలుపుకొనుటకుగాను ఈ కార్యములు చేసినపుడు, నేను ప్రభుడనని మీరు గుర్తింతురు. ఇవి యావే ప్రభువు పలుకులు”.

45. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

46. “నరపుత్రుడా! నీవు దక్షిణమునకు తిరిగి దక్షిణ దేశమును ఖండింపుము. దక్షిణ దేశమునగు నేగేబు ఎడారికి ప్రతికూలముగా ప్రవచనము చెప్పుము.

47. దానికి యావే ప్రభువు వాక్కులుగా ఇట్లు చెప్పుము. వినుము, నేను నిప్పును రగిలింతును. అది నీలోని పచ్చని చెట్లను, ఎండుచెట్లనుగూడ తగులబెట్టును, ఆ అగ్గిని ఏదియు ఆర్పజాలదు. అది దక్షిణము నుండి ఉత్తరమునకు వ్యాపించును. ఎల్లరును దాని మంటలకు కమిలిపోదురు.

48. ఎల్లరును ఆ అగ్నిని రగిల్చిన వాడను నేనే అనియు, అది చల్లారదనియు గ్రహింతురు”.

49. “ప్రభూ! ఈ ప్రజలు నేనెల్లపుడు గూఢార్థముగా మాటలాడుచున్నానని నన్ను ఈసడించుకొనుచున్నారు” అని నేను మొరపెట్టితిని.

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. “నర పుత్రుడా! నీవు యెరూషలేమును ఖండింపుము. ప్రజల పూజాస్థానములను తెగడుము. యిస్రాయేలు దేశమునకు నా హెచ్చరికలను ఇట్లు వినిపింపుము.

3. నేను నీకు శత్రువునగుదును. నేను నా కత్తిదూసి మీలో మంచివారినిగూడవధింతును.

4. నా ఖడ్గము దక్షిణము నుండి ఉత్తరమువరకును నీతిమంతులను, దుష్టులను గూడ నరుకును.

5. ఎల్లరును ప్రభుడనైన నేను కత్తి దూసితిననియు దానిని తిరిగి ఒరలో పెట్టననియు గ్రహింతురు.

6. నరపుత్రుడా! నీవు గుండె పగిలిపోవునట్లుగా నిరాశతో నిట్టూర్పు విడువుము.

7. 'నీ వెందుకు నిట్టూర్పు విడుచుచున్నావు' అని వారు నిన్నడుగుదురు. నీవు వారితో ఇట్లు చెప్పుము: 'నేను రానున్న వార్తలను బట్టి నిట్టూర్పు విడుచుచున్నాను. ఆ వార్తలు వచ్చి నపుడు మీ గుండెలు పగులును. చేతులు చచ్చుపడును. ధైర్యము చెడును, కాళ్ళు గడగడ వణకును. ఆ కాలము సమీపించినది, చేరువలోనికి వచ్చినది. ఇది ప్రభువు వాక్కు"

8. ప్రభువు వాణి నాతో ఇట్లనెను;

9. “నరపుత్రుడా! నీవు ప్రవచింపుము. ప్రభుడనైన నా పలుకులను ప్రజలకు ఇట్లు తెలియజేయుము: ఖడ్గము, ఖడ్గమే! దానికి పదును పెట్టి మెరుగులు దిద్దిరి.

10. చంపుట కొరకే దానికి పదును పెట్టిరి. మెరుపువలె మెరయుటకే దానికి మెరుగులు దిద్దిరి. ఇక ఆనందమునకు నా ప్రజలు నా హెచ్చరికలను, శిక్షను పట్టించుకోరైరి.

11. కత్తిని వినియోగించుకొనుటకే దానికి మెరుగులు దిద్దిరి. సంహారకుని చేతి కందించుటకే దానికి పదును పెట్టి మెరుగులు దిద్దిరి.

12. నరపుత్రుడా! నీవు విచారముతో పెడబొబ్బలు పెట్టుము. ఈ ఖడ్గము నా ప్రజల కొరకును, యిస్రాయేలు నాయకుల కొరకును ఉద్దేశింపబడినది. వారెల్లరును నా ప్రజలతో పాటు చత్తురు. నీవు నిరాశతో గుండె బాదుకొనుము. నీ తొడను చరచుకొనుము.

13. నేను నా ప్రజలకు పరీక్ష పెట్టుచున్నాను. వారు పశ్చాత్తాపపడరేని ఈ వినాశనములెల్ల ప్రాప్తించును." ఇది దేవుడైన ప్రభువు వాక్కు.

14. “నరపుత్రుడా! నీవు ప్రవచింపుము, చేతులు చరుచుకొనుము. ఆ కత్తి మరల మరల నరుకును. అది నరులను చంపునది, వారికి భీతిగొల్పునది. వారిని ముక్కలు ముక్కలుగా నరుకునది.

15. దానిని చూచి నా ప్రజలు ధైర్యము కోల్పోయి తొట్రిల్లుదురు, నేను మెరుపువలె తళతళ మెరయుచు వధించుటకు సిద్ధమైయున్న కత్తిని జూపి వారి నగరమును భయపెట్టుదును.

16. పదునైన ఖడ్గమా! నీవు కుడిఎడమలందును నరుకుము. నీవు తిరిగిన చోటులందెల్ల నరుకుము.

17. నేను చేతులు చరుచుకొందును. . నా కోపము తీర్చుకొందును. ఇవి ప్రభుడనైన నా పలుకులు”.

18. ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

19. “నరపుత్రుడా! బబులోనియా రాజు ఖడ్గము వచ్చుటకు నీవు రెండు మార్గములను గుర్తింపుము. ఆ త్రోవలు రెండును ఒక దేశమునుండే బయలుదేరునట్లు సూచించుటకై ఒక హస్తరూపమును నగరపు వీధి కొనవద్ద గీయుము.

20. ఒక చీలిక అమ్మోనీయుల నగరమైన రబ్బాకు పోవు త్రోవను ఖడ్గమునకు చూపును. మరియొకటి యూదాకు, సురక్షితనగరమైన యెరూషలేమునకు పోవు త్రోవను ఖడ్గమునకు చూపును.

21. బబులోనియారాజు మార్గము చీలినచోట నిలుచుండి శకునములు చూచును. ఏ త్రోవను పోవలయునో తెలిసికొనుటకు అతడు బాణములను ఊపును. తెరాఫీముచే విచారణ చేయుచూ, బలియర్పించిన పశువు కాలేయమును పరిశీలించి చూచుచున్నాడు.

22. అదిగో! యెరూషలేము ఎదుట ద్వారములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వనిఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టుమనియు తన కుడివైపున శకునము కనబడెను.

23. యెరూషలేము పౌరులు తాము చేసికొనిన సంధినిబట్టి ఈ సంగతులను నమ్మరు. కాని ఈ ప్రవచనము వారు తమ పాపము లను జ్ఞప్తికి తెచ్చుకొనునట్లు చేయును. అది వారు శత్రువులకు చిక్కుదురని హెచ్చరించును.

24: ప్రభువును, దేవుడనైన నా పలుకులివి. జనులారా! మీ పాపములు బట్టబయలయినవి. మీ తప్పిదము లెల్లరికిని తెలియును. మీరు చేయు పనులన్నిటిలోను మీ పాపములు కన్పించుచునేయున్నవి. మీరు దోషులని రుజువైనది. నేను మిమ్ము మీ శత్రువులకు అప్పగింతును.

25. అపవిత్రుడవును, దుష్టుడవునైన యిస్రాయేలు రాజా! నీ పాపకార్యములను తుదముట్టించురోజు వచ్చుచున్నది.

26. యావే ప్రభుడనైన నా పలుకులివి. నీవు నీ తలపాగాను, కిరీటమును తొలగింపుము. అంతయు మారిపోవును. దరిద్రులు అధికులగుదురు. పాలకులు దరిద్రులగుదురు.

27. నాశనము, నాశనము! నేను నగరమును నాశనము చేయుదును. కాని నగరమును నాశనముచేయుటకు నేను ఎన్ను కొనినవాడు వచ్చు వరకును ఈ కార్యము జరుగదు. అతడు వచ్చినపుడు నేను పట్టణమును అతనికి అప్పగింతును.”

28. “నరపుత్రుడా! నీవు ప్రవచింపుము. యిస్రాయేలీయులను అవమానించు అమ్మోనీయు లకు యావే ప్రభుడనైన నా పలుకులిట్లు ఎరిగింపుము: నాశనము చేయుటకు కత్తిని దూసిరి. హతము చేయుటకు కత్తికి పదును పెట్టిరి. మెరుపువలెమెరయ కత్తికి మెరుగు పెట్టిరి.

29. మీరు చూచు దర్శనములు అనృతములు. మీరు చెప్పు ప్రవచనములు అసత్యములు. మీరు దుష్టులు, పాపులు, మీ కార్యములను తుదముట్టించు రోజు వచ్చుచున్నది. కత్తి మీ మెడమీదవాలును.

30. కత్తిని ఒరలో దూర్చుడు. మీరు పుట్టిన దేశముననే, మీరు జన్మించిన తావుననే, నేను మీకు తీర్పు విధింతును.

31. నేను నా కోపమును మీపై క్రుమ్మరింతును. నా కోపాగ్నిని మీపై రగిలింతును. నాశనము చేయుటలో నేర్పుగల క్రూరులకు మిమ్ము అప్పగింతును.

32. అగ్ని మిమ్ము కాల్చివేయును. మీరు మీ దేశముననే మీ నెత్తురును ఒలుకుదురు. మీ పేరును ఇక ఎవడును గుర్తుంచుకొనడు. ఇది ప్రభువు వాక్కు.”

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. "నర పుత్రుడా! నీవు హత్యలకు ఆలవాలమైన నగరమునకు తీర్పుచెప్పుటకు సిద్ధముగానున్నావా? నీవు దాని దుష్టకార్యములను దాని కెరిగింపుము.

3. నీవు యావే ప్రభుడనైన నా పలుకులను నగరమునకు ఇట్లు ఎరిగింపుము. నీవు నీ ప్రజలలో చాలమందిని చంపితివి. విగ్రహములను కొలిచి అపవిత్రురాల వైతివి. కనుక నీకు కాలము సమీపించినది.

4. నీ హత్యల ద్వారా నీవు పాపము మూటకట్టుకొంటివి. నీవు చేసిన ప్రతిమలద్వారా అపవిత్రురాలవైతివి. కనుక నీ శిక్షాదినము సమీపించినది. కావున జాతులు నిన్ను గేలి చేయునట్లును, రాజ్యములు నిన్నెగతాళి చేయునట్లును నేను చేసితిని.

5. దగ్గరి దేశములును, దూరదేశములును గూడ నీ అక్రమములను, అపజయ ములను చూచినవ్వును.

6. యిస్రాయేలు నాయకు లెల్లరును తమ బలమును నమ్ముకొని హత్యలకు పాల్పడుచున్నారు.

7. నగరములోని వారేవరును తల్లిదండ్రులను గౌరవించుట లేదు. మీరు పరదేశులను వంచించుచున్నారు. అనాథలను, వితంతువులను పీడించుచున్నారు.

8. పవిత్ర స్థలములను గౌరవించుటలేదు. విశ్రాంతిదినములను పాటించుటలేదు.

9. మీలో కొందరు ఇతరులమీద కొండెములు చెప్పి వారిని చంపించుచున్నారు. మరికొందరు విగ్రహముల కర్పించిన నైవేద్యములు భుజించుచున్నారు. ఇంకను కొందరు కామకలాపములకు పాల్పడుచున్నారు.

10. కొందరు తమ మారు తల్లులతో శయనించుచున్నారు. మరికొందరు ముట్టుతలను బలవంతము చేసి కూడుచున్నారు.

11. కొందరు పొరుగువాని పెండ్లముతో వ్యభిచరించుచున్నారు. కొందరు తమ కోడండ్రను, కొందరు మారుచెల్లెండ్రను చెరచుచున్నారు.

12. మీలో కొందరు లంచము తీసికొని హత్యలు చేయుచున్నారు. కొందరు తోడి యిస్రాయేలీయులకు సొమ్ము వడ్డీకి ఇచ్చుచున్నారు. వారిని మోసగించి సొమ్ము చేసికొను చున్నారు. వేయేల? మీరు నన్ను విస్మరించితిరి. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు

13. నగరమా! నేను నీవు చేసిన హత్యలకును, దోపిడులకును నీపై చేయెత్తి నిన్ను శిక్షింతును.

14. నేను నిన్ను దండించుటకు పూనుకొనినపుడు నీకు ధైర్యము చాలునా? బలము చాలునా? ప్రభుడనైన నేను మాటపలికితిని. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును.

15. నేను నీ ప్రజలనెల్ల దేశములందును, ఎల్లజాతుల మధ్యను చెదరగొట్టుదును. నీ పాపకార్యములను తుదముట్టింతును.

16. అన్యజాతులు నిన్ను అవమానించును. కాని నీవు నేను ప్రభుడనని గుర్తింతువు.”

17. ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

18. “నర పుత్రుడా! యిస్రాయేలీయులు మమువలె నిష్ప్రయో జకులైరి. అందరును కొలిమిలో వేసిన సీసము, తగరము, ఇనుము, ఇత్తడివంటి వారైరి. వారు వెండి మష్టువంటి వారైరి.

19. కనుక యావే ప్రభుడనైన నేనిట్లు చెప్పుచున్నాను: వారెల్లరును కొలిమిలో మిగిలిన మష్ఠు వంటివారు. నేను వారిని అందరిని యెరూషలేమున ప్రోగుజేయుదును.

20. నరులు వెండి, రాగి, ఇనుము, తగరము, సీసములతో గూడిన ముడి పదార్ధములు కుంపటిలో పెట్టి కరగించినట్లే, నేనును వారిని ప్రోగుచేసి నా కోపముతోను, నా ఉగ్రతతోను కరగింతును.

21. నేను వారిని యెరూషలేమున ప్రోగుచేసి నా కోపాగ్నిని ఊదగా వారు కరిగిపోవుదురు.

22. వారు యెరూషలేమున కుంపటిలో వెండివలె కరుగుదురు. అప్పుడు వారు ప్రభుడనైన నేను నా కోపమును వారిపై కుమ్మరించితినని గ్రహింతురు.”

23. ప్రభువు వాణి నాతో ఇట్లనెను.

24. "నర పుత్రుడా! నీవు యిస్రాయేలీయులతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. వారి దేశము అపవిత్రమైపోయినది కనుక నేను కోపముతో దానిని శిక్షింతును.

25. ప్రభుని ఆగ్రహదినమున నీకు వర్షమురాదు. ఆ దినములలో ప్రవక్తలు కుట్రలు చేయుచూ, గర్జించు సింహము వేటను చీల్చునట్లు, వారు ప్రజలను భక్షింతురు. వారి సొమ్మును, ఆస్తిని అపహరింతురు. వారి భార్యలను వితంతువులను చేయుదురు.

26. యాజకులు నా నియమములను మీరుచున్నారు. వారు పవిత్రవస్తువులను లెక్కచేయుటలేదు. పవిత్ర వస్తువులకును, లౌకికవస్తువులకును మధ్య వ్యత్యాసమును గూడ గుర్తించుటలేదు. విశ్రాంతదినములను గమనించుట లేదు. కావున యిస్రాయేలీయులు నన్ను గౌరవించుట లేదు. నేను అపవిత్రము చేయబడితిని.

27. వారిలో అధికారులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుష్యులను నశింపజేయుటలోను తాముపట్టిన యెరను చీల్చు తోడేళ్ళవలె నున్నారు.

28. ప్రవక్తలు మట్టిగోడకు సున్నము పూసినట్లుగా ఈ పాపకార్యములనెల్ల కప్పిపెట్టుచున్నారు. వారు అనృత దర్శనములను చూచుచున్నారు. అబద్ద ప్రవచనములు చెప్పుచున్నారు. వారు యావే ప్రభుడనైన నా పలుకు లను విన్పించుచున్నట్లు కన్పించుచున్నారు. కాని నేను వారికి నా పలుకులను తెలియజేయలేదు.

29. ధనవంతులు మోసమునకును, దొంగతనమునకును పాల్పడుచున్నారు. పేదలను పీడించి, పరదేశులను వంచించుచున్నారు.

30. నేను దేశమును పాడుచేయకుండునట్లు, దాని ప్రాకారములను దిట్టపరుచుటకు ప్రాకారసందులలో నిలుచుటకు అర్హులైన వారు ఎవరైనను ఉన్నారాయని ఎంత వెదకినను ఒకడును కనపడడాయెను.

31. కావున నేను వారిపై నా కోపమును క్రుమ్మరింతును. వారి దుష్కార్యములకుగాను నా కోపాగ్నితో వారిని భస్మము చేయుదును. ఇది ప్రభువు వాక్కు”

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను;

2. “నరపుత్రుడా! ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు.

3. వారు ఐగుప్తున యువతులుగానున్నపుడు వ్యభిచారిణులైరి. అక్కడ పురుషులు వారి చనుమొనలను నలిపిరి. వారి ఎల ప్రాయపు కుచములను పిసికిరి.

4. వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమెయే సమరియా, చిన్నదాని పేరు ఒహోలిబా', ఆమెయే యెరూషలేము. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను, కుమార్తెలను కనిరి.

5. ఒహోలా నా భార్యయైనను వేశ్యగా వర్తించెను. ఆమె తన పొరుగువారైన అస్పిరియనులను కామించెను.

6. వారు ముదురు కెంపువన్నె ముడుపులు తాల్చిన సైనికులు, ప్రసిద్ధులు, ఉన్నతోద్యోగులు, అందరును సొగసైన యెలప్రాయపు రౌతులు.

7. ఆమె అస్సిరియా అధికారులకెల్ల వేశ్యయయ్యెను. కామోద్రేకముతో అస్సిరియా విగ్రహములను సేవించి భ్రష్టురాలయ్యెను.

8. ఆమె ఐగుప్తుననే పడుపువృత్తి మొదలు పెట్టెను. అచట పడుచుగా ఉన్నపుడే పురుషులు ఆమెతో శయనించిరి. ఆమె యెలప్రాయపు కుచములను పిసికి ఆమెతో వ్యభిచరించిరి. ఆమె వేశ్యావృత్తిని మానదయ్యెను.

9. కావున నేను ఒహోలా విటులకు అనగా ఆమె కామించు వారైన అస్సిరియనులకు ఆమెను ఒప్పగించితిని.

10. వారామెను దిగంబరనుచేసిరి, ఆమె సంతానమును బంధించి, ఆమెను సంహరించిరి. స్త్రీలు ఎల్లరును ఆమెకు పట్టిన దుర్గతి గూర్చి చెప్పుకొనిరి.

11. ఆమె చెల్లెలైన ఒహోలీబాకు ఈ సంగతంతయు తెలియును. కాని ఆ చెల్లెలి కామోద్రేకము, వేశ్యా వర్తనము అక్కను తలదన్నెను.

12. ఆమె కూడ అందమైన దుస్తులను తాల్చిన అస్సిరియా ప్రముఖులను, అధికారులను, రౌతులను కామించెను. వారెల్లరు సొగసైన యువకులు.

13. ఆమె అపవిత్రురాలనియు, ఆ అక్క చెల్లెండ్రిద్దరు భ్రష్టురాండ్రై ఒకేవిధముగా ప్రవర్తించుచున్నారనియు నేను గ్రహించితిని.

14. ఆమె వేశ్యావృత్తి ఇంకను పెరిగిపోయెను. బబులోనియా అధికారుల చిత్రములను చూడగా ఆమెకు మతి చలించెను.

15. వారి బొమ్మలను గోడలమీద చెక్కి వానికి ఎఱ్ఱని రంగు పూసిరి. వారి నడుముల మీద దట్టీలును, తలపై పాగాలునుండెను.

16. ఆ చిత్రము లను చూడగానే, ఆమె కామోద్రేకము చెంది వారిని పిలిపించుటకు బబులోనియాకు దూతలను పంపెను.

17. బబులోనీయులు వచ్చి ఆమెతో శయనించిరి, ఆమెతో వ్యభిచరించి ఆమెను అపవిత్రము చేసిరి. ఆమె బబులోనీయుల వలన భ్రష్టురాలైన విదప ఆశాభగ్నురాలాయెను.

18. ఇట్లు తన జారత్వమును అధికము చేసి తన మానచ్చాదమును తీసివేసికొనెను. ఆమెయందున్నది. గనుక ఆమె అక్క విషయములో ఆశాభగ్నుడైనట్టు, ఈమె విషయములో కూడా నేను నిరాశచెందితిని.

19. ఆమె పడుపువృత్తి ఇంకను పెరిగిపోయెను. తాను పూర్వము ఐగుప్తున యువతిగానున్నపుడెట్లు వేశ్యగా వర్తించెనో అటు తరువాత గూడ అట్లే చేసెను.

20. అచటి పురుషులు గాడిదలవలె పెద్ద జననేంద్రియములు కలవారు. గుఱ్ఱములవలె రేతఃస్టలనము చేయువారు.

21. ఒహోలీబా! నీవు ఐగుప్తున పడుచుదానవుగా నున్నపుడు చేసిన వ్యభిచారమును కొనసాగింపనెంచితివి. అచట పురుషులు నీ చనుమొనలను నలిపి నీ యెలప్రాయపు కుచములను చిదిమిరి.”

22. కావున ఒహోలీబా! యావే ప్రభుడనైన నా పలుకులు ఇవి: నీవు నీ ప్రేమికులవలన విసుగుచెంది తివి. కాని నేను వారు నీపై ఆగ్రహించి నిన్ను చుట్టుముట్టునట్లు చేయుదును.

23. నేను బబులోనీయులను, కల్దీయులను, పెకోడు, షోవా, కోవాదేశీయులను, అస్సిరియనులను, యువకులను, సుందరరూపులునైన ఆ ప్రముఖులను, ఉన్నతాధికారులను, రౌతులను నీ మీదికి కొనివత్తును.

24. వారు పెద్ద సైన్యములతోను, రథములతోను, సామానులబండ్లతోను ఉత్తరదిక్కు నుండి వచ్చి నీ పై బడుదురు. శిరస్త్రాణములతో, డాళ్ళతో వచ్చి నిన్ను ముట్టడింతురు. నేను నిన్ను వారికి అప్పగింతును. వారు తమ చట్టముల ప్రకారము నీకు తీర్పు చెప్పుదురు.

25. నేను నీపై కోపించితిని కనుక వారును కోపముతో నిన్ను శిక్షింతురు. నీ ముక్కును, చెవులను కోసివేసి, నీపిల్లలను చంపుదురు. నీ బిడ్డలను సజీవులుగా కాల్చివేయుదురు.

26. నీ బట్టలను ఊడబీకి నీ సొమ్ములు దోచుకొందురు.

27. నీవు ఐగుప్తుననున్నప్పటి నుండియు ప్రదర్శించుచు వచ్చిన వ్యభిచారములను, కామకలాపములను నేను తుద ముట్టింతును. నీవు ఆ మీదట విగ్రహములవైపు చూడవు. ఐగుప్తును గుర్తుకు తెచ్చుకొనవు.

28. యావే ప్రభుడనైన నా పలుకులివి: నీవు ద్వేషించువారును, నీకు రోత పుట్టించువారునైన ప్రజలకు నేను నిన్నప్పగింతును.

29. వారు నిన్ను ద్వేషింతురు. కనుక నీవు కూడబెట్టుకొన్న వానినెల్ల దోచుకొందురు. నిన్ను దిగంబరనుచేయగా నీవు వేశ్యవలె నగ్నమగుదువు. నీ వ్యభిచారములు, రంకులు నీకు ఈ ఆపద తెచ్చెను.

30. నీవు అన్యజాతులతో రంకాడితివి. వారి విగ్రహముల వలన భ్రష్టురాలవైతివి.

31. నీవు మీ అక్క అడుగుజాడలలో నడిచితివి. కనుక నేను ఆమెచే త్రాగించిన శిక్షాపాత్రలోని పానీయమునే నీ చేతను త్రాగింతును.

32. యావే ప్రభువు పలుకులివి: “మీ అక్క త్రాగిన పాత్రముయందలి పానీయమునే నీవును త్రాగుదువు. ఆ పాత్రము వెడల్పయినది, లోతయినది. ఎల్లరును నిన్ను గేలిచేసి తిరస్కరింతురు. ఆ పాత్రము అంచుల వరకును నిండియున్నది.

33. మీ అక్కయైన సమరియా త్రాగిన పాత్రమును పుచ్చుకొనినపుడు నీకు దుఃఖము కలుగును, కైపెక్కును. అది భయమును, నాశనమును కొనివచ్చు పాత్రము.

34. నీవు ఆ పాత్రమునందలి పానీయమును చుక్క కూడ మిగులకుండ త్రాగి, ఆ పాత్రమును పగలగొట్టి, దాని పెంకులతో నీ స్తనములను పెరుకుకొనెదవు.

35. యావే ప్రభువు పలుకులివి: నీవు నన్ను విస్మరించి నా నుండి వైదొలగితివి కనుక నీ వ్యభిచార ములకును, రంకులకును తగినదండన అను భవింతువు.”

36. ప్రభువు నాతో ఇట్లనెను: “నరపుత్రుడా! నీవు ఒహోలాకును, ఒహోలీబాకును తీర్పు విధించుటకు సిద్ధముగా ఉన్నావా? వారి హేయమైన కార్యములకు గాను వారికి బుద్ధిచెప్పుము.

37. వారు వ్యభిచారము నకును, హత్యకును పాల్పడిరి, విగ్రహములతో రంకాడిరి. నాకు కనిన బిడ్డలను హత్యచేసిరి. నా బిడ్డలను అగ్నిలో దహించి బలిగా అర్పించిరి.

38. అంతటితో ఆగక నా మందిరమును అపవిత్రము చేసిరి. నేను నియమించిన విశ్రాంతిదినమును పాటింపరైరి.

39. వారి బిడ్డలను వారి విగ్రహములకు బలిగా అర్పించిన దినముననే దేవాలయమునఅడుగిడి, దానిని అమంగళముచేసిరి. నా మందిరముననే అటులచేసిరి.

40. వారు దూరప్రాంతముల నుండి పురుషులను రప్పించుటకుగాను పలుసారులు దూతలను పంపిరి. వారు రాగానే ఈ అక్క చెల్లెండ్రు స్నానమాడి, కన్నులకు కాటుక పెట్టుకొని, నగలతో అలంకరించుకొనెడివారు.

41. అందమైన పాన్పుపై కూర్చుండెడివారు. వారి చెంతనున్న బల్లపై నేను వారికిచ్చిన సాంబ్రాణి, ఓలివు తైలము నుంచెడి వారు.

42. అంతట ఎడారినుండి వచ్చిన భోగప్రియుల కోలాహలము వినిపించెడిది. వారు ఆ ఉవిదల చేతులకు కంకణములు తొడిగి, వారి శిరస్సులను పూలదండలతో అలంకరించెడివారు.

43. వీరు వ్యభిచారములవలన బలహీనురాలైన స్త్రీని ఇంకనూ వేశ్యగా వాడుకొనుచున్నారుగదా! అది మరెన్నటికిని వ్యభిచారము చేయకమానదు అని నేను తలంచితిని.

44. వారు ఆ వేశ్యలను పలుమారులు సందర్శించిరి. వ్యభిచారిణులైన ఒహోలాను, ఒహోలీబాను పెక్కుమారులు సమీపించిరి.

45. సజ్జనును ఆ స్త్రీలు రంకులు, హత్యలు, నేరములను చేసిరని తీర్పు చెప్పుదురు. వారు రంకాడిరి. వారి చేతులు నెత్తురులో తడిసినవి.”

46. యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు: “ఈ స్త్రీలను భయపెట్టి దోచుకొనుటకుగాను మీరొక పెద్ద గుంపును తీసికొనిరండు.

47. ఆ మూక వారిపై రాళ్ళురువ్వునుగాక! వారిపై కత్తులు దూసి వారి పిల్లలను చంపి, వారి ఇండ్లను తగులబెట్టును గాక!

48. నేను దేశమునుండి వ్యభిచారమును తొలగింతును. వారివలె ఏ స్త్రీయుకూడ వ్యభిచారము చేయరాదని హెచ్చరింతును.

49. అక్కచెల్లెండ్రలారా! మీరు రంకాడి నందులకుగాను, విగ్రహములను సేవించినందులకు గాను నేను మిమ్మిద్దరిని దండింతును. అప్పుడు నేను యావే ప్రభుడనని మీరు గ్రహింతురు.”

Text Example

1. అంతట తొమ్మిదవయేడు, పదియవనెల, పదియవ దినమున ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! ఈ రోజు తేదీని లిఖించి ఉంచుము. నేడు బబులోనియా రాజు యెరూషలేము ముట్టడిని ప్రారంభించెను.

3. ఈ తిరుగుబాటుదారులకు నీవు ఈ సామెతను చెప్పుము. యావే ప్రభువిట్లు పలుకుచున్నాడు. వంట పాత్రమును పొయ్యిమీద పెట్టి దానిలో నీళ్ళు పోయుము.

4. దానిని మేలైన మాంసపు ముక్కలతో తొడజబ్బ మొదలగు మంచిమంచి ముక్కలన్నింటిని చేర్చి, అందులో వేసి, మంచి ఎముకలను ఏరి దానిని నింపుము.

5. మంచి గొఱ్ఱెనే ఎన్నుకొనుము. కుండ క్రింద కట్టెలు చాలా పేర్చుము. నీటిని బాగుగా మరగబెట్టి పొంగువరకు మాంసమును, ఎముకలను చాలినంతగ ఉడుకబెట్టుము.

6. యావే ప్రభువిట్లు చెప్పుచున్నాడు; నరహంతల నగరము నాశమగును. అది మాలిన్యముపట్టిన పాత్రమువంటిది. ఆ మాలిన్యమును తొలగింపరైరి. కుండలోని మాంసపుముక్కలన్నిటిని తీసివేయుదురు. చీట్లు వేయకయే ఒక్కదానినికూడ మిగులనీయరు.

7. నగరమున నెత్తురు చిందించిరి. ఆ రక్తమును నేలమీదనే చిందించినచో ధూళి దానిని కప్పివేసెడిది కాని దానిని బండమీద ఒలికించిరి.

8. నా కోపమురానిచ్చి నేను ప్రతీకారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని బండమీదనే ఉండనిచ్చితిని.

9. యావే ప్రభువిట్లు పలుకుచున్నాడు: నరహంతల నగరము నాశనమగును. నేనే కట్టెలు పేరును.

10. నీవు ఇంకను ఎక్కువ కట్టెలు కొనివచ్చి మంటలు లేపుము. మాంసమును ఉడుకబెట్టి, మసాలా కలుపుము. ఎముకలను మాడనిమ్ము.

11. ఖాళీ యిత్తడి పాత్రమును పొయ్యిమీద పెట్టి ఎఱ్ఱగా మండునట్లు చేయుము. దానిలోని మాలిన్యము కరగిన పిమ్మట అది శుద్ధి చెందును.

12. నేను ఎంత కష్టపడి అలసటచెందినను దాని మాలిన్యము అంతయు మంటలో కరగిపోదు.

13. యెరూషలేమూ! నేను నీ వ్యభిచార మాలిన్యమును తొలగింప గోరితిని. కాని నీవు నీ మురికిని తొలగించు కొనుటకు ఇష్టపడవైతివి. నేను నీపై నా కోపము తీర్చుకొనువరకును నీవు శుద్ధిచెందవు.

14. ప్రభుడనైన నేను మాట పలికితిని. దానిని జరిగించి తీరుదును. నేను వెనుకాడను. నీపై దయచూపను. నిన్ను కరుణింపను. నీ క్రియలకు తగినట్లుగా నిన్ను శిక్షింతును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు"

15. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

16. “నర పుత్రుడా! నేను నీకు ప్రీతిపాత్రురాలైన వ్యక్తిని అకస్మాత్తుగా నీనుండి తొలగింతును. కాని నీవు ఫిర్యాదు చేయవద్దు, దుఃఖపడవద్దు, కన్నీరు కార్చవద్దు.

17. మృతునికై విలాపము చేయక నిట్టూర్పు విడువుము. నీవు సంతాప సూచకముగా తలపాగాను తీసివేయకుము, పాదరక్షలు విడువకుము, నీ గడ్డమును కప్పుకోవలదు, దుఃఖించువారికి జనులొసగెడి ఆహారమును భుజింపవలదు”.

18. ఆ రోజు ప్రొద్దున నేను ప్రజలతో మాట్లాడితిని. ఆ సాయంకాలము నా భార్య మరణించెను. ఆ మరుసటి నాటి ఉదయము నేను ప్రభువు చెప్పినట్లే చేసితిని.

19. ప్రజలు 'నీ చెయిదముల భావమేమిటి' అని అడిగిరి.

20. “నేనిట్లంటిని: ప్రభువువాణి నాతో ఇట్లుచెప్పెను:

21. 'నీవు యిస్రాయేలీయులతో ఇట్లు నుడువుము: ప్రభువు వాక్కిది: మీరు దేవాలయ బలమునుజూచి గర్వించుచున్నారు. దానిని సందర్శించి దానినిజూచి ఆనందింపగోరుచున్నారు. కాని ప్రభువు దానిని అపవిత్రము చేయును. యెరూషలేమున మిగిలియున్న మీ బిడ్డలు పోరున చత్తురు.

22. అప్పుడు నేను చేసిన క్రియలనే మీరును చేయుదురు. మీరు మీ గడ్డములను కప్పుకొనరు, దుఃఖించు వారివలె భోజనము చేయరు.

23. మీ తలపాగాలను తీయక, మీ పాదరక్షలను పాదములనుండి తీయక, అంగలార్పక, ఏడ్వక ఉందురు. ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడుచుచు, మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు.

24. అప్పుడు నేను మీకు గుర్తుగా ఉందును. నేను చేసిన కార్యములనెల్ల మీరునూ చేయుదురు. ఇదంతయు జరిగినప్పుడు మీరు ఆయన యావే ప్రభుడని అర్థము చేసికొందురు. ఇది ప్రభువు వాక్కు "

25. ప్రభువిట్లనెను: “నరపుత్రుడా! నేను ఆ ప్రజలనుండి వారి ఆశ్రయమును, అతి శయాస్పదమును, వారు కన్నులకు ఇంపైన దానిని, వారికి ప్రీతిని కలిగించు దేవాలయమును, వారి కుమారులను, కుమార్తెలను నేను తీసివేయు దినమునందు

26. నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన ఒకడు నీయొద్దకు వచ్చును.

27. నీవు కోల్పోయిన వాక్చక్తిని ఆ దినమున మరల పొందుదువు. నీవు ఆ కాందిశీకునితో స్పష్టముగా మాటలాడు దువు. ఈ రీతిగా నీవు ప్రజలకు గుర్తుగా నుందువు. అపుడు వారు నేను ప్రభుడనని గుర్తింతురు.”

Text Example

1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను;

2. "నర పుత్రుడా! నీవు అమ్మోనీయులను ఖండింపుము. వారితో ఇట్లు చెప్పుము.

3. మీరు యావే ప్రభువు పలుకులాలింపుడు. ఆయన ఇట్లు నుడువుచున్నాడు. 'ఆహా' మీరు నా మందిరము అపవిత్రమగుట జూచి సంతోషించితిరి.

4. యిస్రాయేలు దేశము నాశనమగుటను జూచి ఆనందించితిరి. యూదా ప్రజలు ప్రవాసమునకు బోవుటను జూచి సంతసించితిరి. ఇందుకుగాను నేను మిమ్ము తూర్పు ఎడారినుండి వచ్చిన జాతులకు అప్పగింతును. వారు మీ దేశమున గుడారములు పన్నుకొని స్థిరపడుదురు. మీ దేశమున పండిన పండ్లను భుజించి మీ పాలను త్రాగుదురు.

5. నేను రబ్బా నగరమును ఒంటెలదొడ్డిని చేయుదును. అమ్మోను దేశమంతటిని గొఱ్ఱెలదొడ్డిని చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

6. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు: మీరు చేతులుతట్టి ఆనందముతో ఎగిరి గంతులువేసితిరి. యిస్రాయేలు దేశమును చిన్నచూపు చూచితిరి.

7. కావున నేను మిమ్ము అన్యజాతుల కప్పగింతును. వారు మీ సొత్తును దోచుకొందురు. మీరిక ఒక జాతిగా మన జాలరు. నేను మీ దేశమును నాశనము చేసి మిమ్ము అడపొడ కానరాకుండ చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

8. యావే ప్రభువు ఇట్లనెను: యూదాకూడ ఇతర జాతులవంటిదేనని మోవాబు పలికెను.

9. కనుక నేను మోవాబు సరిహద్దులను కాపాడు నగరములను శత్రువుల ముట్టడికి గురిచేయుదును. సుప్రసిద్ధ పట్టణములగు బెత్యేషిమోతు, బాల్మెయోను, కిర్యతాయము ముట్టడికి లొంగును.

10. నేను తూర్పు ఎడారినుండి వచ్చిన జాతులు మోవాబును, అమ్మోనును జయించునట్లు చేయుదును. ఆ మీదట మోవాబు ఒక జాతిగా మనజాలదు.

11. నేను దానిని శిక్షింతును. అప్పుడు మోవాబీయులు నేను ప్రభుడనని గుర్తింతురు.

12. యావే ప్రభువు ఇట్లనెను: ఎదోము యూదా మీద పగతీర్చుకొని ఘోరమైన అపరాధము చేసెను.

13. కావున నేను ఎదోమును దండింతును. ఆ దేశమునందలి నరులను, పశువులను చంపుదును. తేమా నుండి దాదాము వరకు ఆ దేశమును ఎడారి కావింతును. అందలి జనులు పోరున చత్తురు.

14. నేను నా ప్రజలైన యిస్రాయేలీయుల ద్వారా వారిపై పగతీర్చుకొందును. ఎదోమీయులు నా కోపమును చవిజూచునట్లు చేయుదురు. అప్పుడు వారు నా ప్రతీకారమును అర్థము చేసికొందురు. ఇది యావే ప్రభువు వాక్కు.

15. యావే ప్రభువిట్లనెను: ఫిలిస్తీయులు తమ చిరకాల విరోధులపై క్రూరముగా పగ తీర్చుకొనిరి. ద్వేషభావముతో వారిని నాశనము చేసిరి.

16. కావున నేను ఫిలిస్తీయా మీదికిపోయి వారిని రూపుమాపు దునని ప్రకటించుచున్నాను. ఆ దేశమున మిగిలియున్న వారినిగూడ తుదముట్టింతును.

17. ఘోరదండన ముతో వారికెల్లరికిని ప్రతీకారము చేయుదును. వారు నా ఆగ్రహమును చవిజూతురు. అప్పుడు వారు నేను ప్రభుడనని గ్రహింతురు.”

Text Example

1. అంతట పదునొకొండవ యేడు, మాసపు మొదటి దినమున ప్రభువు వాక్కు నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! యెరూషలేమును గూర్చి తూరు ఇట్లనెను: 'ఆహా! జాతులు ప్రవేశించు ద్వారము వంటిదైన యెరూషలేము నాశనమయ్యెను. దాని సంపద ధ్వంసమయ్యెను. అదిక నాతో పోటీ పడజాలదు. కనుక నేను వృద్ధిలోనికి వత్తును.'

3. కనుక యావే ప్రభుడనైన నేనిట్లు నుడువుచున్నాను. తూరు నగరమా! నేను నీకు శత్రువునగుదును. నేను పెక్కుజాతుల ప్రజలను నీమీదికి గొనివత్తును. వారు సాగర తరంగములవలె నీ మీదికెత్తివత్తురు.

4. వారు నీ ప్రాకారములను, బురుజులను పడగొట్టుదురు. నేను నీ ధూళినంతటిని తుడిచివేసి, నీయందు వట్టి కొండబండను మాత్రము మిగుల్తూను.

5. సాగరగర్భముననున్న ఆ కొండబండపై బెస్తలు తమ వలలను ఎండబెట్టుకొందురు. ఇది ప్రభుడనైన నా వాక్కు. అన్యజాతి ప్రజలు నిన్ను దోచుకొందురు.

6. వారు తమ కత్తులతో నీ చుట్టుపట్ల ఉన్న నగరములోని నరులను వధింతురు. అపుడు నీవు నేను ప్రభుడనని గుర్తింతువు”

7. యావే ప్రభుడనైన నా పలుకిది: “నేను ఉత్తర దిక్కునుండి రాజాధిరాజైన నెబుకద్నెసరును నీ మీదికి గొనివత్తును. " అతడు మహాసైన్యముతోను, గుఱ్ఱములు, రథములు, రౌతులతోను వచ్చును.

8. నీ చుట్టుపట్ల ఉన్న నగరములలోని ఈ ప్రజలు పోరున చత్తురు. అతడు నీ చుట్టును ముట్టడిదిబ్బలు పోయును. గుంతలు తవ్వును, డాళ్ళను గోడవలె పేర్చును

9. గోడలనుకూల్చు యంత్రములతో నీ గోడలు పడగొట్టును. ఇనుప గడెలతో నీ బురుజులు కూల్చును.

10. అనంతమైన అతని అశ్వదళము లేపిన ధూళి నిన్ను క్రమ్మును.. అతడు బండ్లను, రథములనులాగు గుఱ్ఱములతో వచ్చి శత్రువు తాను జయించిన నగరమునందువలె నీ యందు ప్రవేశించి కూలిపోయిన నీ ద్వారములగుండ గుండ పోవునపుడు జనించిన శబ్దము వలన నీ గోడలు దద్దరిల్లును.

11. అతని రౌతులు నీ వీధులను ఆక్రమించి నీ ప్రజలందరిని ఖడ్గముతో వధింతురు. నీ మహాస్తంభములు నేలకొరగును.

12. శత్రువులు నీ సొత్తును, వర్తకపు సరకును దోచుకొందురు. నీ గోడలు కూల్చి సుఖప్రదములైన నీ ఇండ్లను బద్దలు చేయుదురు. నీ బండలను, కలపను, రాతి ముక్కలను ఎత్తి సముద్రమున పడవేయుదురు.

13. నేను నీ పాటలను మాన్పించెదను. నీ తంత్రీవాద్యముల నుండి సంగీతము వెలువడనీయను.

14. బెస్తలు తమ వలలను ఆరబెట్టుకొనుటకు నీ యందు వట్టి కొండబండను మాత్రము మిగులును. ఇక నిన్నెప్పటికిని పునర్నిర్మింపరు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు"

15. యావే ప్రభువు తూరుతో ఇట్లు నుడువు చున్నాడు: “శత్రువులు నిన్ను జయించినపుడు, వారి కత్తికి బలియైన నీ పౌరుల ఆర్తనాదములను విని నీ తీరములందు వసించు ప్రజలు భీతిల్లుదురు.

16. సముద్ర తీరవాసుల రాజులు తమ సింహాసనముల మీదినుండి క్రిందికి దిగుదురు. వారు తమ రాజ వస్త్రములను, బుట్టాలు వేసిన ఉడుపులను తొలగించి, గడగడవణకుచు నేలపై చతికిలబడుదురు. వారు నీ పతనమును గాంచి భీతిల్లి శరీరకంపమును ఆపుకోజాలకుందురు.

17. వారు నీపై ఈ శోకగీతము పాడుదురు. 'సుప్రసిద్ధ నగరమా! నీవు నాశనమైతివి గదా! సముద్రము నుండి నిన్ను తొలగించిరిగదా! నీవు సాగరముల నేలితివి. నీవును నీ పౌరులును తీర వాసులనెల్ల గడగడలాడించితిరి.

18. నీవు పతనమైన దినమున ద్వీపములు తల్లడిల్లెను. నీ వినాశనమును గాంచి ద్వీపములు నిర్ఘాంతపోయెను.'

19. యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు. నేను నిన్ను నాశనముగావించి నిర్జన నగరమును చేయుదును. నిన్ను అగాధ జలములలో ముంచివేయుదును.

20. నిన్ను మృతలోకమునకు పంపుదును. అచట నీవు పురాతన ప్రజలను కలిసికొందువు. పాతాళమున శాశ్వతశిథిలముల మధ్య మృతులతో కలిసివసింతువు. నరులు నీ యందు మరల వసింపరు. నీవు మరల జీవవంతుల లోకమున కనిపింపవు.

21. నిన్ను తలంచుకొని ఎల్లరును భీతిచెందుదురు. నీవు అంత మగుదువు. జనులు నీ కొరకు గాలింతురు గాని నీవు కనిపింపవు.”

Text Example

1. ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! తూరుమీద శోకగీతము వినిపింపుము.

3. సముద్రపురేవుల మీద నెలకొనియుండి పెక్కు ద్వీపములతో వర్తకముచేయు తూరుతో ఇట్లు చెప్పుము: యావే ప్రభువు వాక్కిది: తూరు! నీవు నీ మహా సౌందర్యమునకు గర్వపడితివి.

4. నీవు సముద్రమున నెలకొనియుంటివి. ఆ నిన్ను నిర్మించినవారు లు నిన్ను సుందరమైన నావవలె కట్టిరి.

5. వారు నీ పలకలను చేయుటకు సేనీరు కొండనుండి తమాలములు తెచ్చిరి. నీ స్తంభములను చేయుటకు లెబానోను కొండనుండి దేవదారులు తెచ్చిరి.

6. బాషాను సింధూరములతో నీ తెడ్లను చేసిరి. కిత్తీము దేవదారులతో నీ ఉపరిభాగమును చేసి దానిని దంతముతో పొదిగిరి.

7. నీ తెరచాపలను బుట్టాలు వేసిన ఐగుప్తు నారవస్త్రములతో చేసిరి. ఆ వానిని దూరమునుండియే గుర్తింపవచ్చును. నీ పై కప్పును ఎలీషా ద్వీపమున తయారైన ముదురు కెంపువన్నె వస్త్రములతో తయారుచేసిరి.

8. నీకు తెడ్లువేయువారు సీదోను, అర్వదు నగరముల నుండి వచ్చిరి. నేర్పరులైన నీ ప్రజలే నీ నావికులు.

9. గెబాలున తర్ఫీదు పొందినవారు నీ వడ్రంగులు నావలలో సముద్రయానము చేయు నావికులెల్లరు నీ సరుకులు కొనెడివారు.

10. పారశీకము, లూదు, పూతు దేశీయులు నీ సైన్యమున చేరిరి. వారు తమ డాళ్ళను, శిరస్త్రాణములను నీశిబిరములలో వ్రేలాడ గట్టిరి. వారు నీకు కీర్తిని తెచ్చిపెట్టిరి.

11. అర్వదు సైనికులు నీ ప్రాకారములకును, గమదు సైనికులు నీ బురుజులకును కావలికాసిరి. వారు తమ డాళ్ళను నీ గోడలపై వ్రేలాడగట్టిరి. వారు నిన్ను సుందరముగా తీర్చిదిద్దిరి.

12. నీవు తర్షీషుతో వర్తకము చేసి అచటి వెండి, ఇనుము, తగరము, సీసములకు నీ వస్తుసముదాయమును మారకము చేసితివి.

13. నీవు యావాను, తుబాలు, మెషెకు దేశములతో వర్తకము చేసితివి. నీ సరకులతో బానిసలను, కంచు పరికరములను కొనితెచ్చుకొంటివి.

14. నీ వస్తువులతో బేత్తోగర్నా నుండి గుఱ్ఱములను, యుద్ధాశ్వములను, కంచరగాడిదలను కొనితెచ్చుకొంటివి.

15. దెదాను ప్రజలు నీతో వర్తకము చేసిరి. తీర ద్వీపములందలి ప్రజలు నీకు ఏనుగు దంతమును, విలువైన కోవిదారు మ్రానునిచ్చి, నీ సరకులు పుచ్చుకొనిరి.

16. సిరియా ప్రజలు నీ నుండి పలురకములైన సరకులను తీసుకొని వానికి బదులుగా నీకు పచ్చలు, ఊదావన్నె బట్టలు, బుట్టాలు వేసిన ఉడుపులు, నారబట్టలు, పగడాలు, మాణిక్యాలు ఇచ్చిరి.

17. యూదా యిస్రాయేలు ప్రజలు గోధుమలు, తేనె, ఓలివుతైలము, గుగ్గిలము, అత్తిపండ్లు, సుగంధ ద్రవ్యములిచ్చి నీ వస్తువులను కొనిరి.

18. దమస్కు ప్రజలు పలురకములైన నీ సరకులకు గాను హెల్బోను ద్రాక్షరసము, తెల్లని ఉన్నినిచ్చిరి.

19. వారు నీ వస్తువులకు గాను పోతపోసితీసిన ఇనుము, కసిందమూలిక, సుగంధపు చెరకు నిచ్చిరి.

20. దెదాను ప్రజలు నీ సరకులకు, జీనులకు వేయు వస్త్రములిచ్చిరి.

21. అరేబియా ప్రజలు, కేదారు రాజులు నీ వస్తువుల కొరకు గొఱ్ఱెపిల్లలు, పొట్టేళ్ళు, మేకలు ఇచ్చిరి.

22. షేబా, రామా వర్తకులు నీతో వర్తకముచేసి నీ సరకుల కొరకు బంగారము, రత్నములు, మేలైన సుగంధ ద్రవ్యములను ఇచ్చిరి.

23. హారాను, కన్నె, ఏదెను నగరములు, షెబా వర్తకులు, అష్షూరు, కల్మాదు నగరములు నీతో వర్తకముచేసిరి.

24. ఆ నగరముల ప్రజలు నీకు విలువగల దుస్తులును, ముదురు కెంపు రంగు వస్త్రములును, బుట్టాలు వేసిన ఉడుపులును, పలు రంగుల తివాచీలును, గట్టిగా అల్లిన త్రాళ్ళును, నూలు దారములును అమ్మిరి.

25. నీ సరకులను పెద్ద పెద్ద తర్షీషు ఓడలలో కొనిపోయెడివారు. నీవు నిండుగా సామానులు నింపిన సముద్రములోని ఓడవంటిదానవు.

26. నీకు తెడ్లు వేయువారు నిన్ను సాగరములలోనికి నడిపించిరి. తూర్పుగాలి నిన్ను సాగరమధ్యమున బ్రద్దలు చేసెను.

27. విలువగల నీ సరకులును, నావికులును, నీ వడ్రంగులును, వర్తకులును, సైనికులెల్లరును నీవు ధ్వంసముకాగా, నీతోపాటు సముద్రమున మునిగిరి.

28. నీట మునుగు నావికుల ఆర్తనాదములు సముద్ర తీరమున ప్రతిధ్వనించెను.

29. ప్రతి నావలోని నావికులును, తెడ్లువేయువారును తమ ఓడలను విడనాడి ఒడ్డుచేరిరి.

30. వారు నీకొరకు ఘోరసంతాపముతో విలపించుచు తలపై దుమ్మెత్తి పోసికొందురు. బూడిదలోపడి పొర్లాడుదురు.

31. నీవు మునిగినందుకు తలలు గొరిగించుకొని, గోనె తాల్చి విచారముతో విలపింతురు.

32. వారు నిన్ను గూర్చి విలాపగీతమును ఇట్లు ఆలాపింతురు. ఆ తూరునకు సాటి నగరమేది? నీటమునిగి నిశ్శబ్దముగానున్న పట్టణమా! నీకు సమమైన పట్టణమేది?

33. నీసరకులుసముద్రమున ప్రయాణము చేయునపుడు ఎల్లరి అక్కరలు తీర్చెడివి. విలువగల నీ వస్తువుల వలన రాజులు ధనవంతులైరి.

34. కాని నీవిపుడు సముద్రమున బ్రద్దలైతివి. సాగరగర్భమున మునిగితివి.నీ సరకులు నీ నావికులు ఎల్లరును నీతో పాటు జలనిధిలో కలిసిపోయిరి.

35. నీ దుర్గతిని గాంచి తీరవాసులెల్లరును భీతిల్లిరి. వారి రాజులు వెరగొందిరి. వారి మొగములు పాలిపోయెను.

36. నీవు భీకరముగా అంతమొందితివి. : శాశ్వతముగా కనుమరుగైతివి. లోకములోని వర్తకులెల్లరు నిన్ను గాంచి భీతిల్లిరి.”

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెన:

2. “నరపుత్రుడా! ప్రభుడనైన నా పలుకులు తూరు రాజునకిట్లు వినిపింపుము: “ఓయి! నీవు గర్వముతో పొంగిపోయి నేను దేవుడను అనుకొనుచున్నావు సాగరములనడుమ దేవునివలె సింహాసనముపై కూర్చుంటినని తలంచుచున్నావు నేను దేవునితో సరిసమానుడనని ఎంచుచున్నావు. నీవు నరుడవు కాని దేవుడవుకావు.

3. నీవు నేను దానియేలుకంటె తెలివైనవాడను నాకు తెలియని రహస్యములులేవని తలంచుచున్నావు.

4. నీవు తెలివితోను, నేర్పుతోను సంపదలు కూడబెట్టితివి. వెండి, బంగారు రాసులు ప్రోగుచేసితివి.

5. నీవు నైపుణ్యముతో వర్తకముచేసి నీ ధనమును అభివృద్ధి చేసికొంటివి. సంపదలవలన నీకు మిగుల పొగరెక్కినది.

6. కనుక యావే ప్రభుడనైన నావాక్కిది: నేను దేవునితో సరిసమానుడనని నీ వెంచితివి.

7. నేను మహాక్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదికి రప్పింతును. వారు నీవు చాకచక్యముతో కూడబెట్టిన వైభవోపేతములైన వస్తువులన్నిటిని నాశనము చేయుదురు.

8. వారు నిన్ను సంహరించి జలముల మధ్య అగాధపు గోతిలో పడద్రోయుదురు.

9. నిన్ను సంహరించువారు నీ మీదికి వచ్చినపుడు నేను దేవుడనని నీవు చెప్పగలవా? నిన్ను హతము చేయువారు నీ మీదికి వచ్చినపుడు నీవు నరుడవే అవుదువుగాని, దేవుడవు కాజాలవు.

10. సున్నతిలేనివారు చంపబడురీతిగా నీవు పరజాతి వారికిచిక్కి నీచమైన చావుచత్తువు. ఇది దేవుడైన ప్రభువు ఆజ్ఞ.”

11. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

12. “నరపుత్రుడా! నీవు తూరు రాజును గూర్చి శోకాలాపము చేయుము. అతనితో యావే ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము: నీవు ఒకప్పుడు సర్వగుణ సంపూర్ణుడవు, మహాజ్ఞానివి, మహాసౌందర్యమూర్తివి.

13. నీవు దేవుని వనమైన ఏదెనున వసించితివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతము, వజ్రము, కురవిందము, నీలము, పద్మరాగము, పచ్చ మొదలైన మణులను ధరించితివి. సువర్ణాభరణములు తాల్చితివి. నేను నిన్ను సృజించిన దినముననే అవియన్నియు తయారుచేయబడినవి.

14. నీకు కావలికాయుటకు ఒక కెరూబు దూతను నియమించితిని. నీవు నా పవిత్ర పర్వతముపై వసించుచు ధగధగ మెరయు మణులమధ్య తిరుగాడుచుంటివి.

15. నీవు జన్మించినప్పటినుండియు సుచరిత్రుడవుగానే ఉంటివి. కాని కొంతకాలమునకు చెడుకు పాల్పడితివి.

16. నీ వ్యాపారము పెరుగుట వలన నీవు హింసకును పాపమునకును ఒడిగట్టితివి. నేను నిన్ను నా పవిత్రనగరము నుండి గెంటివేసితిని. నీకు కావలియున్న కెరూబుదూత, నిన్ను ధగధగ మెరయు మణులనుండి తరిమివేసెను.

17. నీవు నేను అందగాడనని గర్వించితివి. నీ కీర్తివలన నీకు తలతిరిగెను. నీ విజ్ఞానమంతరించెను. కావున నేను నిన్ను నేలమీద పడత్రోసితిని. ఇతరజాతులు నీ నుండి గుణపాఠము నేర్చుకొనునట్లు చేసితిని.

18. వ్యాపారమున నీవు చేసిన అన్యాయముల వలన నీ ఆరాధనా మందిరములు అపవిత్రమయ్యెను. కావున నేను నిన్ను సూచించు ఈ నగరమునకు నిప్పంటించి దానిని కాల్చివేసితిని. నీవైపు చూచువారందరును నీవు బుగ్గియైతివని గ్రహింతురు.

19. జాతులలో నిన్నెరిగినవారు నిన్ను చూచి భీతిల్లుదురు. నీవు భీకరముగా అంతమొందితివి. శాశ్వతముగా కనుమరుగైపోతివి.”

20. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

21. నీవు సీదోనును ఖండింపుము.

22. దానికి నా పలుకులుగా ఇట్లు చెప్పుము: సీదోసూ! నేను నీకు శత్రువును అగుదును. నేను నిన్ను శిక్షించి కీర్తి తెచ్చుకొందును. నేను నిన్ను దండించి నా పావిత్ర్యమును వెల్లడిచేసికొనినపుడు ప్రజలు నేను ప్రభుడనని గుర్తింతురు.

23. నేను నీ మీదికి అంటురోగమును పంపుదును. నీ వీధులలో నెత్తురు పారును. శత్రువులు నలువైపుల నుండి నిన్ను ముట్టడించి, నీ ప్రజలను హతము చేయుదురు. అప్పుడు నేను ప్రభుడనని నీవు గుర్తింతువు.”

24. ప్రభువు పలుకులివి: “యిస్రాయేలునకు చుట్టుపట్ల వసించుచు వారిని చిన్నచూపు చూచిన జాతులు ఇకమీదట ముండ్లవలెను, ముండ్లకంపవలెను వారిని బాధింపజాలవు. యిస్రాయేలీయులు నేను ప్రభుడనని గుర్తింతురు.

25. యావే ప్రభువు ఇట్లనెను: నేను యిస్రాయేలీయులను చెల్లాచెదురు చేసిన దేశములనుండి మరల వారిని రప్పింతును. ఎల్లజాతులును నేను పవిత్రుడనని గుర్తించును. యిస్రాయేలీయులు వారి సొంతదేశముననే, నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన నేల మీదనే వసింతురు.

26. అచట వారు సురక్షితముగా బ్రతుకుదురు. ఇండ్లు కట్టుకొని, ద్రాక్షతోటలు నాటు దురు. నేను వారిని చిన్నచూపు చూచిన ఇరుగుపొరుగు జాతులను శిక్షింతును. యిస్రాయేలునకు భద్రత కలుగును. అప్పుడు వారు నేను తమ దేవుడనైన ప్రభుడనని గుర్తింతురు”.

Text Example

1. అంతట పదియవయేడు పదియవనెల పండ్రెండవ దినమున ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! నీవు ఐగుప్తు రాజును తెగడుము. అతనికిని అతని దేశమంతటికిని దండనము తప్పదని చెప్పుము.

3. యావే ప్రభుడనైన నా పలుకులుగా అతనితో ఇట్లు చెప్పుము: ఐగుప్తు రాజా! నేను నీకు శత్రువును, నీవు పెద్ద మకరమువలే నదిలో పరుండిఉంటివి. నైలునది నాది, నేనే దానిని చేసితిని అని నీవు పలుకుచున్నావు.

4. నేను నీ దౌడలకు గాలము తగిలింతును. నీ నదిలోని చేపలు నీ పొలుసులకు అంటి పెట్టుకొని ఉండునట్లు చేయుదును. నేను నిన్నును, నీకు అంటిపెట్టుకొనియున్న మత్స్యములను నైలు నదినుండి బయటికి లాగుదును.

5. నిన్నును నీ మీనములను ఎడారిలో పడవేయుదును. నీ దేహము భూమిపైన పడును. నిన్నెవ్వరును పాతిపెట్టరు. వన్యమృగములు పక్షులు నిన్ను తినివేయును.

6. అప్పుడు ఐగుప్తు జనులెల్లరును నేను ప్రభుడనని గ్రహింతురు. నాకు యిస్రాయేలీయులు ఐగుప్తీయుల మీద ఆధారపడిరి . కాని మీరువారికి రెల్లుకాడవంటి వారైతిరి.

7. వారు మీమీద ఆనుకొనగా మీరు రెల్లువలె విరిగి వారి ప్రక్కలలో గుచ్చుకొంటిరి. వారు మీమీద ఆనుకొనగా, మీరు విరిగి వారి నడుములకు కలక పుట్టించితిరి.

8. కనుక ప్రభుడనైన నేను నీతో ఇట్లు చెప్పుచున్నాను: నేను మీ మీదికి ఖడ్గములను పంపుదును. మీరును, మీ పశువులను ఖడ్గములతో వధింపబడుదురు.

9. ఐగుప్తు ఎడారి అగును. అప్పుడు నేను ప్రభుడనని మీరు గుర్తింతురు. మీరు 'నైలు నది మాది, మేమే దానిని చేసితిమి' అని వాకొంటిరి.

10. కావున నేను మీకును, మీ నైలునదికిని శత్రువునగుదును. నేను ఐగుప్తును నాశనము చేసి ఎడారి కావింతును. ఉత్తరమున మిగ్దోలు నుండి దక్షిణమున సెవెనే వరకును, కూషు సరిహద్దుల వరకును, దానిని మరుభూమిని చేయుదును.

11. ఇక ఆ దేశముగుండ నరులుకాని, జంతువులు కాని నడువవు. నలువది యేండ్లపాటు దానిలో ఎవరును వసింపరు.

12. నేను ఐగుప్తును ప్రపంచములోకెల్ల ఘోరమైన ఎడారిని చేయుదును. దాని నగరములు నలువది యేండ్లపాటు పాడువడి ఉండును. అంతగా పాడువడిన పట్టణములు మరెచ్చటను ఉండవు. నేను ఐగుప్తీయులను శరణార్థులను చేయుదును. వారు ఇతర దేశములలో పరజాతుల మధ్య నివసింతురు.

13. యావే ప్రభువు పలుకులివి: నలువదియేండ్ల తరువాత నేను ఐగుప్తీయులను వారు చెల్లాచెదరైన జాతుల నడుమనుండి మరల తోడ్కొని వత్తును.

14. చెరలోనున్న ఐగుప్తీయులు తిరిగి తమ జన్మభూమియైన పత్రోసునందు వసించునట్లు చేయుదును. అచట వారు దుర్భలమైన రాజ్యమును స్థాపించుకొందురు.

15. ఐగుప్తు అన్నిటికంటే దుర్బలమైన రాజ్యమగును. అది ఇక మీదట ఇతర జాతులను ఏలజాలదు. నేను దానిని పూర్తిగా తగ్గింతును. కనుక అది ఇతరులను పరిపాలింపజాలదు.

16. యిస్రాయేలీయులు ఐగుప్తుమీద మరల ఆధారపడరు. ఐగుప్తు దుర్గతినిచూచి, దానిని నమ్ముకొనుట తప్పని గ్రహింతురు. అప్పుడు యిస్రాయేలీయులు నేను ప్రభుడనని గుర్తింతురు”.

17. అంతట ఇరువదియేడవ ఏడు, మొదటినెల మొదటి రోజున ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

18. “నరపుత్రుడా! బబులోనియారాజైన నెబుకద్నెసరు తూరుపై దాడిచేసెను. ఆ ముట్టడివలన అతని సైనికుల తలలుబోడులైనవి. వారి భుజములు చితికి పోయినవి. అంత శ్రమపడినను ఆ దాడిలో అతనికి గాని, అతని సైనికులకుగాని ఎట్టి ప్రతిఫలమును ముట్టలేదు.

19. కనుక ఇప్పుడు యావే ప్రభుడనైన నేనిట్లు నుడువుచున్నాను: “నేను ఐగుప్తును నెబుకద్నెసరు రాజునకిత్తును. అతడు ఐగుప్తును కొల్లగొట్టి దాని సంపదను దోచుకొనిపోవును. ఆ సొత్తు అతని సైనికులకు జీతమగును.

20. అతడు తూరు పట్టణమున చేసిన శ్రమకుగాను నేను ఐగుప్తును అతని వశము చేయుదును. అతని సైనికులు నా కొరకే కృషిచేసిరి. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు

21. ఈ కార్యము జరిగినపుడు నేను యిస్రాయేలీయులను బలపరుతును. యెహెజ్కేలూ! అప్పుడు నీవు పదిమందికి వినిపించునట్లు మాటలాడగలుగుదువు, కావున ప్రజలు నేను ప్రభుడనని గుర్తింతురు."

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! నీవు నా పేరు మీదుగా ప్రవచింపుము. పెద్దగా అరుచుచు ఇట్లు చెప్పుము. అయ్యో దుర్దినము!

3. ఆ దినము రానే వచ్చినది, ప్రభువు దినము సమీపించినది. అది మేఘావృతమైన దినము. జాతులకు నాశనకరమైన రోజు.

4. ఐగుప్తున పోరు జరుగును. కూషు వేదనలకు గురియగును. ఐగుపున చాలమందిని వధింతురు. శత్రువులు ఆ దేశమును దోచుకొని దాని పునాదులను ధ్వంసము చేయుదురు.

5. కూషు, పూటు, లూదు, అరేబియా, కూబు దేశముల నుండి బాడుగకు వచ్చిన సైనికులును, నా సొంత ప్రజలును గూడ ఆ యుద్ధమున కూలుదురు.

6. ప్రభువు వాక్కిది: ఉత్తరమున మిగ్దోలు నుండి దక్షిణమున సెవెనే వరకును ఐగుప్తును ఆదుకొను వారందరును పోరునచత్తురు. ఐగుప్తునకు గర్వకారణమైన సైన్యము నాశనమగును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు,

7. ఐగుప్తు ప్రపంచములోని అన్ని దేశముల కంటె అదనముగా నాశనమగును. దాని నగరములు ఎడారులగును,

8. ఐగుప్తును తగులబెట్టి దాని సహాయులనందరిని వధించినపుడు, వారు నేనే ప్రభుడనని గుర్తింతురు.

9. ఐగుప్తు నాశనమగుదినము వచ్చినపుడు నేను ఓడలలో కూషునకు దూతలను పంపుదును. చీకు చింత లేక యుండు అచటి ప్రజలు తల్లడిల్లుదురు. ఆ దినము సమీపించుచున్నది.

10. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను బబులోనియారాజగు నెబుకద్నెసరు ద్వారా ఐగుప్తు మూకలను నాశనము చేయింతును.

11. అతడు తన క్రూర సైన్యముతోవచ్చి ఆ దేశమును పాడు చేయును. వారు కత్తులతో ఐగుప్తుమీదకి దాడిచేయుదురు. ఆ దేశమున పీనుగులు కుప్పలుగా పడును.

12. నేను నైలు నదిని ఎండబెట్టి ఐగుప్తును దుష్టుల కప్పగింతును. అన్యజాతులు ఆ దేశమునంతటిని పాడుచేయును. ఇది ప్రభుడనైన నా వాక్కు

13. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను నోపు నగరములోని విగ్రహములను, దబ్బర దైవములను నాశనము చేయుదును. ఐగుప్తును పరిపాలించు వాడెవడును ఉండడు. ఆ దేశ ప్రజలెల్లరును భీతిల్లునట్లు చేయుదును.

14. నేను పత్రోసును ధ్వంసము చేయుదును, ఉత్తరమున సోవానును తగులబెట్టుదును, నో పట్టణమును శిక్షింతును.

15. ఐగుప్తు మహాదుర్గమైన సీనుపై నా కోపము రగుల్కొనును. నో నగరపు ప్రజాసమూహములను హతము చేయుదును.

16. నేను ఐగుప్తునకు నిప్పంటింతును. సీను నగరము వేదనలకు గురియగును. నో నగరపు గోడలు కూలును. అది వరదలలో మునుగును.

17. ఓను, పిబేసేతు నగరముల యువకులు పోరున చత్తురు. ఇతర ప్రజలు బందీలగుదురు.

18. నేను ఐగుప్తు అధికారమును వమ్ముచేసి, దానికి గర్వకారణమైన బలగమును తుడిచి పెట్టినప్పుడు, తహపనేసు నగర ముపై చీకట్లు క్రమ్ముకొనును. ఐగుప్తును మేఘములు ఆవరించును. ఆ దేశనగరముల ప్రజలెల్లరును బందీలగుదురు.

19. నేను ఐగుప్తును ఈ రీతిగా శిక్షించినపుడు అచటి జనులు నేనే ప్రభుడనని గ్రహింతురు.”

20. అంతట పదునొకండవయేడు, మొదటినెల ఏడవదినమున ప్రభువువాణి నాతో ఇట్లనెను:

21. “నరపుత్రుడా! నేను ఐగుప్తు రాజు హస్తమును విరుగగొట్టితిని. దానికెవరును కట్టుకట్టలేదు. దానిని ఎత్తిపట్టి త్రాటితో కట్టలేదు. కనుక అది మరల కుదురుకొని బలపడి ఖడ్గమును పట్టజాలదు.

22. కావున యావే ప్రభుడనైన నేనిట్లు చెప్పుచున్నాను. 'నేను ఐగుప్తు రాజునకు శత్రువునగుదును. అతని రెండు చేతులను మంచి చేతిని, ఇదివరకే విరిగిన చేతినిగూడ విరుగ గొట్టుదును. అతని చేతినుండి ఖడ్గము జారిపడును.

23. నేను ఐగుప్తీయులను జాతులనడుమను దేశముల మధ్యను చెల్లాచెదరు చేయుదును.

24. అటుపిమ్మట బబులోనియారాజు హస్తములను బలపరచి నా ఖడ్గమును అతని చేతికందింతును. కాని ఐగుప్తురాజు హస్తములు విరుగగొట్టుదును. అతడు తన శత్రువుల ముందట మూలుగుచు ప్రాణములు విడుచును.

25. నేను బబులోనియా రాజు చేతులను బలపరుతును. ఫరో చేతులు చచ్చుపడును. నేను బబులోనియా రాజు చేతికి కత్తినందింపగా, అతడు దానిని ఐగుప్తువైపునకు త్రిప్పును. అపుడు ఎల్లరును నేనే ప్రభుడనని గ్రహింతురు.

26. నేను ఐగుప్తీయులను లోకమందంతట చెల్లా చెదరు చేయుదును. అప్పుడు వారు నేను ప్రభుడనని తెలిసికొందురు.”

Text Example

1. అంతట పదునొకొండవ యేడు, మూడవ నెల మొదటి రోజున ప్రభువు వాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! నీవు ఐగుప్తు రాజునకును, అతని ప్రజలకును ఇట్లు చెప్పుము. నీ గొప్పతనమును దేనితో పోల్తును?

3. నీవు లెబానోను దేవదారు వంటివాడవు. దానికి నీడనిచ్చు అందమైన కొమ్మలు కలవు. అది మేఘమండలము వరకు ఎదిగెను.

4. నీరు సమృద్ధిగా లభించుటచే బాగుగా పెరిగెను. అగాధజలములు దానిని వృద్ధికి తెచ్చెను. ఆ జలములు అది ఎదుగు తావును తడిపెను. అడవిలోని ఇతర వృక్షములకుకూడ ఊటనిచ్చెను

5. ఆ దేవదారు ఇతర వృక్షములకంటె ఎత్తుగా పెరిగెను. దాని శాఖలు బహువిస్తారముగా పెరిగెను. పుష్కలముగా నీరు లభించుటచే దాని చిగుళ్ళు పెద్దకొమ్మలాయెను.

6. నానావిధ పక్షులు దానికొమ్మలలో గూళ్ళు కట్టుకొనెను. దాని నీడలో వన్యమృగములు పిల్లలను ఈనెను. వివిధ జాతి ప్రజలు ఆ తరుచ్చాయలో విశ్రమించిరి.

7. ఆ తరువు అందమయినది, ఎత్తయినది. దాని కొమ్మలు పొడవైనవి. దాని వేళ్ళు అగాధ జలములోనికి పారెను.

8. దేవుని వనములో దానికి ధీటైన చెట్టులేదు. ఏ దేవదారునకును, దాని శాఖలను పోలిన శాఖలు లేవు. ఏ మేడిచెట్టునకును దాని కొమ్మలవంటి కొమ్మలు లేవు. దేవుని వనములో అంత సొగసైన చెట్టులేదు.

9. నేను దానిని విశాల శాఖలు గల సుందర వృక్షముగా చేసితిని. దానిని చూడగా దేవుని తోటయైన ఏదెనులోని చెట్లకు కన్నుకుట్టెను.

10. యావే ప్రభువు ఇట్లు అనుచున్నాడు: మబ్బుల వరకు ఎదిగిన ఆ చెట్టునకు ఏమి జరుగునో చెప్పెదను. అది పెరిగినకొలది దానికి పొగరు హెచ్చెను.

11. కావున నేను దానిని పరిత్యజించితిని. అన్యజాతి రాజునకు దాని నొప్పగించితిని. అతడు ఆ చెట్టును దాని దుష్టత్వమునకు తగినట్లుగా దండించును.

12. క్రూరులైన అన్యదేశీయులు దానిని నరికి అచటనే వదలివేయుదురు. దానికొమ్మలు, ఛేదమైన ముక్కలును ప్రతికొండమీదను, ప్రతి లోయలోను పడును. దాని నీడన వసించు జాతులన్నియు దానిని విడనాడి వెళ్ళిపోవును.

13. పక్షులు వచ్చి పడిపోయిన ఆ చెట్టుమీద వ్రాలును. వన్యమృగములు దాని కొమ్మల మీద నడచును.

14. నీరెంత సమృద్ధిగా లభించినను, ఇకమీదట ఏ చెట్టుకూడ అంత ఎత్తుగా ఎదుగజాలదు. అంత ఉన్నతముగా పెరిగి మేఘముల వరకు కొమ్మలు చాపజాలదు. ఆ చెట్లన్నియు చావునకు గురియగు నరులవలె చచ్చును. మృతలోకమునకు పోవు వారి సంఖ్యలో చేరి నాశనమునకు గురియగును.

15. ప్రభువైన దేవుడు ఇట్లనుచున్నాడు: ఆ చెట్టు పాతాళమునకు ఏగిననాడు, అగాధజలములు సంతాప సూచకముగా దానిని ముంచివేయును. నేను భూగర్భ నదులను ఆపివేయుదును. బహుముఖములైన వాని ప్రవాహములు ప్రవహింపజాలవు. ఆ చెట్టు చచ్చినది కనుక నేను లెబానోనుకొండలమీద చీకట్లు క్రమ్మింతును. అడవిలోని చెట్లన్నియు వాడిపోవును.

16. నేను ఆ చెట్టును పాతాళమున పడద్రోసినపుడు పుట్టిన శబ్దము వలన జాతులు కంపించును. మృతలోకమున చేరుకొనిన ఏదెను వృక్షములును, సమృద్ధిగా నీరు బడసిన లెబానోను వృక్షరాజములును ఆ వృక్షపతనమునుచూచి సంతసించును.

17. అతని నీడన వసించి అన్యజాతులకు మధ్య అతనికి సహాయపడిన వారు అతనితోకూడ పాతాళమునకు, అతడు ఖడ్గముతో హతముచేసినవారి చెంతకు దిగిరి. పూర్వము ఆ వృక్షపునీడన వసించిన వారు జాతులమధ్య చెల్లా చెదరగుదురు.

18. ఆ వృక్షము ఐగుప్తురాజును, అతని ప్రజలను సూచించును. ఏదెను వనములోని చెట్లకుగూడ దానికి ఉన్నంత ఎత్తుగాని, వైభవముగానిలేదు. ఇపుడు ఏదెను చెట్లతో పాటు అది కూడ పాతాళమునకు చేరుకొని అచట సున్నతినొందని వారితోను, పోరున చచ్చిన వారి తోను కలిసిపోవును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.”

Text Example

1. అంతట పండ్రెండవయేడు, పండ్రెండవ నెల మొదటి రోజున ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! నీవు ఐగుప్తు రాజుమీద శోకగీతమును వినిపింపుము. అతనితో ఇట్లు చెప్పుము: నీవు జాతులలో సింగమువలె ఉన్నావు. కాని నీవు నదిలో నీటిని ఎగజిమ్ము మకరమవు మాత్రమే. నీవు నీ కాళ్ళతో నీటిని కలుషితము చేసి నదులను పాడుచేయుచున్నావు.

3. నా జాతి ప్రజలు ఏకమై వచ్చినపుడు నేను వలవేసి నిన్ను పట్టుకొందును. వారు నిన్ను ఒడ్డునకు లాగుదురు.

4. నేను నిన్ను నేలపై పడవేయుదును. నిన్ను పీకుకొని తినుటకుగాను సకల పక్షులను, వన్యమృగములను కొనివత్తును.

5. నేను కొండలను నీ శవముతో కప్పుదును. లోయలను మురిగిన నీ మాంసముతో నింపుదును

6. నీ నెత్తుటిని నీ దేశముపై క్రుమ్మరింతును. అది కొండలను తడిపి వాగులను నింపును.

7. నేను నిన్ను సంహరించినపుడు, ఆకాశమును కప్పివేసి తారలను నిర్మూలింతును. సూర్యుని మేఘములు ఆవరించును. చంద్రుడు కాంతినీయడు.

8. నేను ఆకాశజ్యోతులన్నింటిని ఆర్పివేసి, నీ దేశమును తమోమయము చేయుదును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు

9. నేను నీ వెరుగని దేశములలో నీ మరణ వార్తను విన్పింపగా, బహుజాతులు గగ్గోలుపడును. నేను నీకు పట్టించిన దుర్గతి చూసి బహుజాతులు భీతిల్లును.

10. నా ఖడ్గమును వారిమీద ఝళిపించే దను. నిన్నుబట్టి చాలమంది జనులు కలవరించుదురు, వారి రాజులు నిన్నుబట్టి భీతిల్లుదురు. నీ పతనదినమున వారందరు ఎడతెగక ప్రాణభయముచేత వణకుదురు.

11. యావే ప్రభువుపలుకిది: నీవు బబులోనియా రాజు ఖడ్గమునకు బలియగుదువు.

12. క్రూరజాతుల సైనికులు నీ ప్రజలమీద కత్తులు దూసి, వారిని హత మార్చునట్లు నేను చేయుదును. నీ ప్రజలును, నీకు గర్వకారణమైన సమస్త వస్తువులును నాశనమగును.

13. నేను నీటి ఒడ్డులందు నీ పశువులను వధింతును. ఆ మీదట పశువులు కాని, నరులుకాని తమ కాళ్ళతో నీటిని మురికి చేయజాలరు.

14. నీ నీళ్ళు తేరుకొని స్వచ్చమగును. నీ నదులు నూనెపారినట్లుగా నెమ్మదిగా పారును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు,

15. నేను ఐగుప్తును ఎడారిచేసి దానిలోని నరులనెల్ల నాశనము చేయునపుడు వారు. నేను ప్రభుడనని గ్రహింతురు.

16. ఈ హెచ్చరిక విలాపగీతమగును. నానా జాతుల స్త్రీలు ఈ గీతమును ఆలపించుచు ఐగుప్తుకొరకును, దాని ప్రజల కొరకును విలపింతురు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు”

17. అంతట పండ్రెండవయేడు, మొదటి నెల పదునైదవదినమున ప్రభువువాణి నాతో ఇట్లనెను:

18. “నరపుత్రుడా! ఐగుప్తులోని జనబాహుళ్యము మీద శోకగీతమును ఆలపింపుము. బలాఢ్యులైన ఇతర జాతి ప్రజలతోపాటు వారినికూడ పాతాళమునకు పంపుము.

19. నీవు ఐగుప్తీయులతో ఇట్లనుము: మీరు ఇతరులకంటె . సుందరమూర్తులమని ఎంచితిరా? మీరు పాతాళలోకమునకు పోయి సున్నతినొందనివారి ప్రక్కన పవ్వళింపుడు.”

20. పోరున చచ్చిన వారితోపాటు ఐగుప్తీయులును కూలుదురు. ఒక ఖడ్గము వారినందరిని మట్టు పెట్టును.

21. మహావీరులును, ఐగుప్తుతరపున పోరాడిన యోధులును ఐగుప్తీయులను మృతలోకమునకు ఆహ్వానించుచు “పోరున మడిసిన సున్నతి నొందనివారును ఇచటికి దిగివచ్చి ఈ తావున పవ్వళించిరి” అని పలుకుదురు.

22. అస్సిరియా ఆ పాతాళలోకమున ఉన్నది. దాని సైనికుల సమాధులు దానిచుట్టును కలవు. వారందరును యుద్ధమున చనిపోయిరి. వారి సమాధులు పాతాళలోకమున లోతైన తావున ఉన్నవి.

23. అస్సిరియా సైనికులెల్లరును యుద్ధమున చనిపోయిరి. వారి సమాధులు అస్సిరియా గోరీ ప్రక్కనే ఉన్నవి. కాని పూర్వము వారు సజీవుల లోకమును గడగడలాడించిరి.

24. ఏలాము అచట ఉన్నది. దాని సైనికుల సమాధులు దాని చుట్టును ఉన్నవి. వారెల్లరును పోరున మడిసిరి. సున్నతినొందని వారై మృతలోకమును చేరుకొనిరి. వారు బ్రతికి ఉన్నపుడు ఎల్లెడల భీతిని పుట్టించిరి. కాని ఇపుడు మృతులై అవమానము చెంది యున్నారు.

25. ఏలాము పోరున కూలిన వారి ప్రక్కన పండుకొని ఉన్నది. దాని సైనికుల సమాధులు దాని చుట్టునున్నవి. వారెల్లరును పోరున మడిసిన సున్నతిలేనివారు. వారు బ్రతికి ఉండగా భీతిని పుట్టించిరి. కాని ఇప్పుడు మృతులై అవమానము చెంది ఉన్నారు. పోరున కూలినవారికి పట్టుదురతియే వారికిని పట్టినది.

26. మెషెక్కు తుబాలు అచటనున్నవి. వాని సైనికుల సమాధులు వాని చుట్టునున్నవి. వారెల్లరును సున్నతిలేనివారై పోరునమడిసిరి. అయినను ఒకప్పుడు వారు సజీవులను గడగడలాడించిరి.

27. పురాతన కాలపు వీరులకువలె వారికిని ఖననసంస్కారములు జరుగలేదు. ఆ ప్రాచీన వీరులు తమ ఆయుధములతో పాటు పాతాళమునకు దిగిపోయిరి... అచట వారి ఖడ్గములు వారి తల క్రిందనున్నవి. వారి డాళ్ళు వారి దేహములపైనున్నవి. ఈ వీరులొకప్పుడు సజీవులకు భీతి పుట్టించిరి.

28. ఈ రీతిగా ఐగుప్తీయులు పోరున కూలిన సున్నతి లేని వారి ప్రక్కన పండుకొందురు.

29. ఎదోము తన రాజులతోను, అధిపతులతోను అచట నున్నది. వారు శూరులు. కాని ఇప్పుడు పోరున కూలిన సున్నతినొందని వారితోపాటు పాతాళమున పరుండియున్నారు.

30. ఉత్తర దేశాధిపతులును, సీదోనీయులును అచ్చటనున్నారు. ఒకప్పుడు వారి అధికారము నరులకు భీతిని పుట్టించెను. కాని, వారిప్పుడు పోరున కూలిన వారితోపాటు పాతాళము చేరుకొని అవమానము చెందిరి. సున్నతిలేనివారై అచట పరుండియుండిరి. మృతలోకమునకు పోవువారికి కలుగు అవమానమే వారికిని కలిగినది.

31. పోరున మడిసిన వీరులెల్లరిని చూచి ఐగుప్తు రాజును అతని సైన్యమును ఓదార్పు చెందునని యావే ప్రభువు నుడువుచున్నాడు.

32. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు: నేను ఐగుప్తురాజు సజీవులకు భీతి పుట్టించునట్లు చేసితిని. కాని అతడును, అతని సైనికులును చత్తురు. వారు పోరునకూలిన సున్నతినొందని వారి ప్రక్కన పవ్వ అంతురు.” ఇది దేవుడైన ప్రభువు వాక్కు

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను;

2. “నరపుత్రుడా! నీవు నీ జనులతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను ఏ దేశము మీదికైనను యుద్ధము పంపినపుడు ఆ దేశీయులు తమలో ఒకనిని తమకు కావలివానినిగా ఉంచుకొందురు.

3. అతడు శత్రువులు వచ్చుటను చూచినపుడు బాకానూది ప్రజలకు హెచ్చరిక చేయును.

4. ఎవడైనను ఆ హెచ్చరికను ఆలించియు, అశ్రద్ధచేసి శత్రువు వాతపడి చచ్చెనేని, తన చావునకు తానే బాధ్యుడగును.

5. వాడు హెచ్చరికను వినియు అలక్ష్యము చేసెను. కనుక తన మరణమునకు తానే బాధ్యుడగును. అతడు లక్ష్యము చేసియుండిన యెడల చావును తప్పించుకొనెడివాడే.

6. కావలివాడు శత్రువు వచ్చుటను చూచియు బాకా నూది హెచ్చరిక చేయడేని, శత్రువు వచ్చి జనులను వధించెనేని, వారి మరణమునకు కావలివాడే బాధ్యుడగును.

7. “నరపుత్రుడా! నేను నిన్ను యిస్రాయేలీయులకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను.

8. నేనెవడైన పాపాత్ముడు చచ్చునని పలికితినేని, నీవతనిని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకొనునట్లు చేయవేని, అతడు పాపిగానే మరణించును. అప్పుడు నీవతని మరణమునకు బాధ్యుడవగుదువు.

9. కాని నీవెవడినైన దుష్టుని హెచ్చరించి పశ్చాత్తాపపడుమని చెప్పినను పశ్చాత్తాపపడడని అతడు పాపిగానే చని పోవును. అప్పుడు నీ ప్రాణములకు ముప్పుకలుగదు.

10. నరపుత్రుడా! నీవు యిస్రాయేలీయులకు ఇట్లు చెప్పుము: మీరు 'మా పాపములు అక్రమములు మాపై భారమువలె నిలిచియున్నవి. మేము కృశించి పోవుచున్నాము. ఇక బ్రతుకుటెట్లు?' అని నిరంతరము పలుకుచున్నారు.

11. నా జీవముతోడు, యాకోబు ప్రభుడనైన నా మాటలుగా నీవు వారితో ఇట్లనుము. దుష్టుడు చనిపోవుటవలన నాకు సంతుష్టి కలుగదు. దుష్టుడు తన మార్గమునుండి వెనుకకు మరలి బ్రతుకుటవలన నాకు సంతోషము కలుగును. యిస్రాయేలీయులారా! మీరు మీ దుష్టమార్గమునుండి వెనుకకు మరలుడు. మీరు అనవసరముగా చావనేల!"

12. నరపుత్రుడా! నీవు నీ ప్రజలతో ఇట్లు చెప్పుము. “ఎవడైన సజ్జనుడు ఒకడు పాపము చేసెనేని అతడు చేసిన మంచి పనులతడిని . రక్షింపజాలవు. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగెనేని, శిక్షను అనుభవింపడు. సజ్జనుడు పాపములకు పాల్పడెనేని అతని ప్రాణములు దక్కవు.

13. నేనెవడైన ఒక సజ్జనునికి జీవము నొసగుదునని మాటనీయ వచ్చును. కాని అతడు పూర్వము తాను చేసిన మంచిపనులను నమ్ముకొని పాపమునకు పాల్పడెనేని నేనతని సత్కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనను. అతడు తన పాపములకుగాను చచ్చితీరును.

14. ఎవడైన ఒక దుర్మార్గుని నేను 'అతడు చచ్చును' అని హెచ్చరిక చేయవచ్చును. కాని అతడు పాపమును విడనాడి న్యాయయుక్తములైన మంచికార్యములు చేసెను అనుకొందము.

15. ఉదాహరణకు అతడు కుదువ సొమ్ముగా నుంచుకొనిన వస్తువును తిరిగి ఇచ్చివేయును. తాను అపహరించిన వస్తువులను తిరిగి ఇచ్చివేయును. పాపమును విడనాడి జీవమునొసగు ఆజ్ఞలను పాటించెనేని అతడు చావనక్కరలేదు, బ్రతుకవచ్చును.

16. నేనతని పూర్వపాపములను విస్మరింతును. న్యాయమైన మంచిపనిని చేసెను, కనుక అతడు బ్రతుకును.

17. మీ ప్రజలు ప్రభువు కార్యములు న్యాయముగా లేవు' అని చెప్పుకొనుచున్నారు. కాని వారి కార్యములే న్యాయముగా లేవు.

18. సజ్జనుడు మంచిపనులను మాని చెడుపనులకు పాల్పడెనేని, వాటిమూలముగనే అతడు చచ్చును.

19. దుష్టుడు పాపకార్యములను వదిలివేసి నీతిన్యాయములను పాటించెనేని తన ప్రాణములను దక్కించుకొనును.

20. యిస్రాయేలీయులారా! మీరు “ప్రభువు పని న్యాయముగా లేదు' అనుచున్నారు. కాని నేను మీ నడవడిని బట్టి మీకు తీర్పు విధింతును.”

21. మా ప్రవాసము పండ్రెండవయేడు, పదియవనెల ఐదవదినమున యెరూషలేము నుండి తప్పించుకొని వచ్చిన కాందిశీకుడు నాతో "నగరము పట్టువడినది” అని చెప్పెను.

22. అతడు వచ్చుటకు ముందటి రోజు సాయంకాలము ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆ మరుసటి దినము ఉదయమున కాందిశీకుడు వచ్చినపుడు ప్రభువు నాకు మరల వాక్చక్తిని ప్రసాదించెను.

23. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

24. “నరపుత్రుడా! యిస్రాయేలు దేశమునందలి పాడుపడిన నగరములలో వసించు జనులు 'అబ్రహాము ఒక్కడైయుండగా ప్రభువు అతనికి ఈ భూమినంతటిని ఇచ్చెను. ఇప్పుడు మనము చాలమందిమి కనుక ఈ భూమియంతయు మనదే అగును' అని అనుకొను చున్నారు.

25. కనుక యావే ప్రభుడనైన నా పలుకులుగా నీవు వారితో ఇట్లు చెప్పుము. “మీరు రక్తమును ఓడ్చివేయక మాంసమును భుజించుచున్నారు. విగ్రహములను పూజించుచున్నారు. నరహత్య చేయుచున్నారు. అట్టి మీరు ఈ భూమిని స్వాధీనము చేసికొనుటయా?

26. మీరు మీ కత్తులను నమ్ముకొనుచున్నారు. మీ క్రియలు హేయమైనవి. మీలో ప్రతివాడును పొరుగు వాని పెండ్లముతో వ్యభిచరించుచున్నాడు. అట్టి మీరు ఈ భూమిని స్వాధీనము చేసికొనుటయా?

27. నా జీవముతోడు, యావే ప్రభుడనైన నేను ప్రమాణము చేసి చెప్పుచున్నాను వినుడు. పాడువడిన నగరములలో వసించువారు కత్తివాతబడుదురు. వెలుపలి పొలములలో వసించువారిని వన్య మృగములు తినివేయును, కొండలలో, గుహలలో దాగుకొనువారు అంటురోగ ముల వలన చత్తురు.

28. నేను దేశమును ఎడారిచేసి నిర్మానుష్యము కావింతును. ప్రజలు నమ్ముకొనిన బలము అంతయు వమ్మగును. యిస్రాయేలు కొండలు అడవులగును. కనుక వానిగుండ ఎవడును ప్రయాణము చేయజాలడు.

29. నేను ప్రజలను వారి హేయమైన పాపములకుగాను శిక్షింతును. దేశమును నిర్మానుష్యము చేయుదును. అప్పుడు వారు నేను ప్రభుడనని గుర్తింతురు.”

30. ప్రభువువాణి నాతో ఇట్లనెను: “నరపుత్రుడా! ఈ ప్రజలు ప్రాకారములచెంతను, తమ గృహద్వారముల చెంతను నిన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు. 'రండు, మనము ప్రభువు పలుకులను ఆలింతము' అని అనుకొనుచున్నారు.

31. నా ప్రజలు నీ చుట్టు కూర్చుండి నా పలుకులు ఆలించుచున్నారు. కాని నీవు చెప్పినట్లు చేయుటలేదు. ప్రేమపూరితమైన పలు కులు వారి నోటవచ్చుచున్నవి. కాని వారి కోరికలు లాభార్జనము మీదనే ఉన్నవి.

32. వారు నీవు ప్రేమ గీతములను పాడుచునో, తంత్రీవాద్యములు మీటు చునో, వినోదమును చేకూర్చి పెట్టువాడవని తలంచు చున్నారు. వారునీ పలుకులు ఆలింతురుగాని పాటింపరు.

33. అయితే నీ పలుకులెల్ల నెరవేరి తీరును. అవి నేరవేరినపుడు వారు. ప్రవక్త ఒకడు తమ మధ్య ఉన్నాడని గుర్తింతురు.”

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. “నరపుత్రుడా! యిస్రాయేలు రాజులను ఖండింపుము. యావే ప్రభుడనైన నా పలుకులను ప్రవచనరూపమున వారితో ఇట్లు చెప్పుము: యిస్రాయేలు కాపరులారా! మీకు అనర్ధము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారేగాని గొఱ్ఱెలమందలను మేపుటలేదు.

3. మీరు గొఱ్ఱెల పాలు త్రాగుచున్నారు. వాని ఉన్నితో నేసిన దుస్తులు తాల్చుచున్నారు. వానిలో మంచివానిని చంపి తినుచున్నారు. కాని మందను మాత్రము మేపుట లేదు.

4. మీరు గొఱ్ఱెలలో దుర్బలమైన వానిని పట్టించుకొనుట లేదు. రోగము సోకిన వానికి జబ్బు నయము చేయుట లేదు. గాయపడిన వానికి కట్టు కట్టుట లేదు. ప్రక్కకు తప్పుకొనిన వానిని మందలోనికి కొనివచ్చుటలేదు. తప్పిపోయినవానిని వెదకి తోలు కొని వచ్చుటలేదు. పైగా వారిపట్ల క్రూరముగా, కఠినముగా ప్రవర్తించుచున్నారు.

5. కాపరి లేనందున గొఱ్ఱెలు చెల్లాచెదరయ్యెను. వన్యమృగములు వానిని చంపి తినివేసెను.

6. నా గొఱ్ఱెలు ఎత్తయిన కొండలన్నిటిమీదను, ప్రతి తిప్పమీదను తిరుగాడెను. భూమి యందు అంతటను చెల్లాచెదరయ్యెను. వానిని పట్టించుకొను వారుగాని, వెదకువారుగాని లేరు.

7. కాపరులారా! మీరు ప్రభుడనైన నా పలుకులాలింపుడు:

8. నా జీవముతోడు, యావే ప్రభుడనైన నేను ఆనపెట్టి చెప్పుచున్నాను. కాపరిలేడు కనుక వన్యమృగములు నా గొఱ్ఱెల మీదపడి వానిని చంపి తినివేసెను. నా కాపరులు మందను వెదకలేదు. వారు తమ కడుపు నింపుకొనుచున్నారేగాని నా మందను మేపలేదు.

9. కావున కాపరులారా! మీరు ప్రభుడనైన నా పలుకులు ఆలింపుడు.

10. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నేను మీకు విరోధినగుదును. నేను మీనుండి నా గొఱ్ఱెలను తీసికొందును. మీరిక మీదట వానిని మేపజాలరు. నేను మీనుండి నా గొఱ్ఱెలను కాపాడుదును. మీరు వానిని మ్రింగివేయజాలరు.

11. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నేను నా మందను వెదకెదను. వానిని గూర్చి జాగ్రత్త పడెదను.

12. కాపరి చెదరిపోయిన గొఱ్ఱెలను గూర్చి జాగ్రత్తపడి వానిని మరల ప్రోగుజేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొఱ్ఱెలు చెల్లాచెదరైన తావులనుండి వానిని మరల తోలుకొని వత్తును.

13. నేను వానిని పర దేశములనుండి ప్రోగుజేసి స్వీయదేశమునకు గొని వత్తును. వానిని యిస్రాయేలు కొండలకును, వాగుల కును తోడ్కొనివచ్చి మంచి గడ్డి బీడులలో మేపుదును.

14. వానిని యిస్రాయేలు దేశములోని కొండలమీది పచ్చికపట్టులలోను, లోయలలోను, పచ్చనిగడ్డి బీళ్ళలోను మేపుదును.

15. నేనే నా గొఱ్ఱెలను మేపుదును. వానికి విశ్రమస్థానమును చూపింతును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.

16. నేను తప్పిపోయిన గొఱ్ఱెలను, ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్టుకట్టుదును. రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. క్రొవ్విన వాటిని, బలముగలవాటిని శిక్షయను మేత పెట్టి లయపరుతును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని.

17. నా మందా! ప్రభుడనైన నేను చెప్పున దేమనగా, గొట్టెకును గొట్టెకును మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్ళకును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకును మధ్యను బేధము కనుగొని నేను తీర్పుతీరును.

18. విస్తారముగా మేతమేసి, మిగిలినదానిని కాళ్ళతో తొక్కుట మీకు చాలదా?

19. మీరు స్వచ్చమైన నీరు త్రాగి మిగిలినదానిని కాళ్ళతో కలుషితము చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కినదానిని నా గొఱ్ఱెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?

20. కనుక యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నేను బలిసిన గొఱ్ఱెలకును, బక్కచిక్కిన గొఱ్ఱెలకును మధ్య తీర్పు తీరును.

21. మీరు బక్కచిక్కిన వానిని మీ భుజములతో త్రోసి, మీ కొమ్ములతో పొడిచి మందనుండి గెంటివేసితిరి.

22. కాని నేను నా మందను కాపాడి దానికి హాని కలుగకుండునట్లు చేయుదును. నేను నా గొఱ్ఱెలలో ప్రతిదానికి తీర్పుతీరును.

23. నా సేవకుడైన దావీదును వానిమీద ఒక్క కాపరినిగా నియమింతును. అతడు వానిని పోషించును.

24. ప్రభుడనైన నేను వానికి దేవుడనగుదును. నా సేవకుడైన దావీదు వానికి పాలకుడగును. ఇది ప్రభుడనైన నా వాక్కు.

25. నేను వానితో భద్రతాయుతమైన నిబంధనము చేసికొందును. దేశములోని వన్యమృగములనెల్ల తొలగింతును. కావున నా గొఱ్ఱెలు సురక్షితముగా పొలమునవసించి, అడవిలో నిద్రించును.

26. నేను వానిని దీవించి నా పవిత్ర పర్వతము చెంత వసింపనిత్తును. అచట వానికి సకాల వర్షములు అను దీవెననిత్తును.

27. చెట్లు పండ్లుకాయును. పొలములు పండును. ప్రతివాడును సురక్షితముగా తన పొలమున వనించును. నేను నా ప్రజల శృంఖలాలను చేధించి, వారిని బానిసలుగా చేసిన వారినుండి వారిని విడిపించినపుడు, వారు నేను ప్రభుడనని గుర్తింతురు.

28. అటుపిమ్మట అన్య జాతులు వారిని దోచుకొనవు. వన్యమృగములు వారిని చంపవు. వారు భద్రముగా జీవింతురు. ఎవరును వారిని భయపెట్టజాలరు.

29. నేను వారికి బాగుగా పంటలు పండుపొలముల నిత్తును. దేశమున కరువు ఉండబోదు. అన్యజాతులు వారిని గేలిచేయజాలవు.

30. నేను యిస్రాయేలునకు తోడుగా నుందుననియు, వారు నా ప్రజలనియు ఎల్లరును గుర్తింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు”

31. “నా గొఱ్ఱెలారా! మీరు, నేను మేపుమంద. నా ప్రజలు. నేను మీ దేవుడను. ఇది ప్రభుడనైన నా వాక్కు”

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను;

2. "నరపుత్రుడా! ఎదోమువైపు తిరిగి దానిని ఖండింపుము.

3. నీవు ఆ దేశముతో ప్రభుడనైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము: ఎదోము పర్వతమా! నేను నీకు శత్రువునగుదును. నేను నిన్ను నిర్మానుష్యమైన ఎడారి కావింతును.

4. నీ నగరములను నాశనము చేయుదును. నీ భూమి ఎడారి అగును. అప్పుడు నీవు నేను ప్రభుడనని గుర్తింతువు.

5. నీవు యిస్రాయేలునకు దీర్ఘకాల విరోధివి. వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని కత్తివాతబడనిచ్చి తివి.

6. కనుక నా జీవముతోడు, ప్రభుడనైన నా పలుకులివి. నీవు మృత్యువాతబడుదువు. రక్తము నిన్ను తరుమును. నీకు రక్తము ఇష్టమాయెను కనుక, రక్తమే నిన్ను తరుమును.

7. నేను సెయీరు పర్వతసీమను ఎడారి చేయుదును. దానిగుండ పయనించు వారిని అందరిని చంపుదును.

8. కొండలను శవములతో నింపుదును. యుద్ధమున కూలిన వారి శవములు కొండలను లోయలను నింపును.

9. నేను నీ పట్టణములను కలకాలము వరకు నిర్మానుష్యము కావింతును. నీ నగరములలో ఇంకెవరును వసింపరు. అప్పుడు నేను ప్రభుడనని నీవు గ్రహింతువు.

10. 'యూదా యిస్రాయేలు జాతులు రెండును వాని రాజ్యములతోపాటు నాకే చెందినవి' అని నీవు వలికితివి. యావే అచటనుండినను వాటిని స్వాధీనము చేసుకొందుననుకొంటివే.

11. నా జీవముతోడు, ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నీవు నా ప్రజలపట్ల చూపిన కోపమునకు, ద్వేషమునకు, అసూయకు నేను నీకు ప్రతీకారము చేయుదును. నీవు నా ప్రజలకు చేసిన అపకారమునకుగాను, నేను నిన్ను శిక్షించితినని వారు గ్రహింతురు.

12. నీవు తృణీకార భావముతో యిస్రాయేలు కొండలు నిర్మానుష్యమైనవనియు, నీవు వానిని మ్రింగివేయుటకు సిద్ధముగా నున్నాను అనియు పలికితివి. ఆ మాటలు ప్రభుడనైన నేను వింటినని నీవు గ్రహింతువు.

13. నీవు గర్వముతో నాకు ప్రతికూలముగా పలికిన పలుకులు నేను వింటిని.

14. యావే ప్రభుడనైన నా పలుకిది. నేను నిన్ను ఎడారి కావింతును. లోకమెల్ల నీ పతనమును గాంచి హర్షించును.

15. నా సొంతదేశమైన యిస్రాయేలు పతనమును గాంచి నీవు హర్షించితివి. కావున నేను నీకు తగిన శాస్తి చేయుదును. సెయీరు కొండలును, ఎదోము దేశమెల్లను నిర్మానుష్యమగును. అప్పుడు ఎల్లరును నేను ప్రభుడనని గుర్తింతురు."

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను: “నరపుత్రుడా! నీవు యిస్రాయేలు పర్వతములకిట్లు ప్రవచనము చెప్పుము: యిస్రాయేలు పర్వతములారా! మీరు ప్రభువు పలుకులు ఆలింపుడు.

2. ప్రభువు ఇట్లనుచున్నాడు: యిస్రాయేలు శత్రువులు గర్వాతిశయముతో 'ఆహా! ఆ పురాతన పర్వతములు మావే' అని పలికిరి.

3. నీవు నా పేరు మీదుగా ఇట్లు ప్రవచింపుము: యావే ప్రభువు పలుకిది. ఇరుగుపొరుగు జాతులు యిస్రాయేలు కొండలను పట్టుకొని వానిని దోచుకొనినపుడు ఎల్లరును యిస్రాయేలును గేలిచేసిరి.

4. కనుక ఇపుడు ప్రభుడనైన నేను పర్వతములతోను, కొండలతోను, ఏరులతోను, లోయలతోను, పాడువడిన తావులతోను, పాడువడి దోపిడికి గురియై ఇరుగుపొరుగు జాతులనుండి నగుబాట్లు తెచ్చుకొనిన నగరములతోను ఇట్లు చెప్పు చున్నాను.

5. యావే ప్రభుడనైన నేను ఇరుగుపొరుగు జాతులతోను, విశేషముగా ఎదోముతోను కోపావేశముతో మాట్లాడితిని. ఆ దేశము సంబరముతోను, తృణీకార భావముతోను నా దేశమును స్వాధీనము చేసికొని, దాని గడ్డి బీళ్ళను భుక్తము చేసికొనెను."

6. కావున నీవు యిస్రాయేలు దేశమును గూర్చి ప్రవచనము చెప్పుము. పర్వతములకును, కొండలకును, ఏరులకును, లోయలకును ఇట్లు చెప్పుము. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు: “ఇతర జాతులు మిమ్ము అవమానించినవి. కనుక నేను రోషముతోను, ఆగ్రహముతోను మాటలాడుచున్నాను.

7. మీ ఇరుగు పొరుగు జాతులు అవమానము తెచ్చుకొనునని ప్రభుడనైన నేను ఆనబెట్టి చెప్పుచున్నాను.

8. యిస్రాయేలీయులారా! యిస్రాయేలు కొండలపై మీకొరకు చెట్లు మరల చిగిర్చి పండ్లుకాయును. మీరు మరల తిరిగివత్తురు.

9. నేను మీ పక్షముననుండి మిమ్ము ఆదరింతును. మీ పొలములలో మరల సేద్యము చేసి పైరువేయుదురు.

10. నేను మీ ప్రజలను వృద్ధి చేయుదును. మీరు నగరములలో వసింతురు. పాడు వడిన కట్టడములను పునర్నిర్మింతును.

11. నేను మీ ప్రజలను పశువులను వృద్ధి చేయుదును. మీరు పూర్వముకంటె ఎక్కువమంది అగుదురు. మీ సంతానము విస్తరిల్లును. పూర్వము వసించినట్లే మీరు మరల ఆ నేలమీద వసింతురు. ఇంతకు పూర్వము కంటె ఎక్కువగా అభివృద్ధి చెందుదురు. అప్పుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

12. నా ప్రజలైన యిస్రాయేలీయులారా! నేను మిమ్ము మరల మీ నేలకు కొనివతును. అది మీ సొంత దేశమగును. మీకు పుత్రహీనత అనునది ఇక ఉండబోదు.

13. యావే ప్రభుడనైన నేనిట్లు చెప్పుచున్నాను. ప్రజలు ఆ దేశమును నరభక్షకి అని పిలుచుట వాస్తవమే. అది తన ప్రజల పిల్లలను అపహరించినదనియు వారు చెప్పుచున్నారు.

14. కాని ఇప్పటినుండి అది నరభక్షకి కాజాలదు. మీ బిడ్డలను అపహరింపజాలదు. ఇది ప్రభుడనైన నా వాక్కు.

15. మీ దేశము ఇక మీదట జనుల హేళనమును అవమాన వాక్యములను విన నక్కరలేదు. అది ఇకమీదట మీ బిడ్డలను అప హరింపదు. ఇది ప్రభుడనైన నా వాక్కు."

16. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

17. “నరపుత్రుడా! యిస్రాయేలీయులు తమ దేశమున వసించినపుడు వారు తమ ప్రవర్తన ద్వారాను, క్రియలద్వారాను ఆ నేలను మలినముచేసిరి. నా దృష్టిలో వారి ప్రవ ర్తనము ముట్టుతవలె అపవిత్రమైనది.

18. వారు ఆ దేశమున హత్యలుచేసిరి. విగ్రహముల ద్వారా ఆ నేలను మలినముచేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని.

19. వారి ప్రవర్తనమునకును, క్రియలకును వారిని దండించితిని. వారిని అన్యదేశములకు చెదరగొట్టితిని.

20. వారు పోయిన తావు లందెల్ల నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు 'వీరు ప్రభువు ప్రజలు. కాని ఆయన వీరిని తన దేశము నుండి బహిష్కరించెను' అని చెప్పుకొనిరి.

21. కాని నా దివ్యనామమును గూర్చి నేను చింతించితిని. యిస్రాయేలీయులు తాము పోయిన తావులందెల్ల దానికి అపకీర్తి తెచ్చిరి.

22. నీవు యిస్రాయేలీ యులతో యావే ప్రభుడనైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము. “నేను మిమ్ముచూచి కాదుగాని, నా దివ్య నామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశములందెల్ల దానికి అవమానము తెచ్చి తిరి.

23. మీరు జాతులమధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరికదా! నేను జాతులమధ్య నా మహానామము యొక్క పావిత్య్రమును వెల్లడి చేయుదును. అప్పుడవి నేను ప్రభుడనని గుర్తించును. ఇది ప్రభుడనైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసికొందును.

24. ప్రతి జాతినుండియు నేను మిమ్ము ప్రోగుజేసి మీ దేశమునకు కొనివత్తును.

25. నేను మీ పై శుభ్రమైన జలములు చల్లి మీ విగ్రహములనుండియు, మీ మాలిన్యము నుండియు మిమ్ము శుద్ధిచేయుదును.

26. మీకు నూత్నహృదయమును దయచేయుదును. నూతన ఆత్మను మీలో నుంచెదను. మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపుగుండెను దయచేయుదును.

27. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించునట్లును, నా విధులను పాటించునట్లును చేయుదును.

28. అపుడు మీరు నేను మీ పితరులకిచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు. నేను మీకు దేవుడనగుదును.

29. నేను మీ అపవిత్రత నుండి మిమ్ము రక్షింతును. నేను ఆజ్ఞాపింపగా మీకు ధాన్యము పుష్కలముగా లభించును. ఇక కరువుండబోదు.

30. నేను మీ పండ్ల చెట్లు, పొలములు అధికముగా పండునట్లు చేయుదును. కావున ఇక మీదట మీకు కరువుకలుగదు. అన్యజాతులు మిమ్ము హేళనచేయవు.

31. అప్పుడు మీరు దుష్కార్య ములను, మీ అక్రమములను జ్ఞప్తికి తెచ్చుకొందురు. మీ పాపములను, హేయమైన కార్యములను తలంచుకొని మిమ్ము మీరే ఛీ కొట్టుకొందురు.

32. యిస్రాయేలీయులారా! నేను ఈ కార్యములెల్ల మీకొరకు చేయుట లేదు. మీరు మీ చెయిదములను తలంచుకొని అవమానముతో మ్రగ్గిపోవలెనని నా కోరిక. ఇది ప్రభుడనైన నా వాక్కు.

33. ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను మీ పాపముల నుండి మిమ్ము శుద్ధి చేసిన పిదప మిమ్ము మరల మీ నగరాలలో వసింపనిత్తును. మీరు మీ శిథిలాలయములను పునర్నిర్మించు కొనవచ్చును.

34. మీ పొలముల ప్రక్కన నడచువారు అవి పాడువడి నాశనమై పోయినవని గుర్తించిరి. మీరు వానిని మరల సేద్యము చేసికోవచ్చును.

35. 'ఒకప్పుడు ఎడారివలె ఉన్న ఈ భూమి మరల ఏదెను తోటవలె అయినదని ఎల్లరును చెప్పుకొందురు. చిన్నాభిన్నమై దోపిడికి గురియై నాశనమైన నగరములు మరల జనావాసయోగ్యమై సురక్షిత పట్టణములైనవి' అని ఎల్లరును చెప్పుకొందురు.

36. అప్పుడు చుట్టుపట్ల మిగిలియున్న జాతులు ప్రభుడనైన నేను శిథిల నగరములను పునర్నిర్మింతుననియు, బీడు వడిన పొలములలో మరల చెట్లు నాటుదుననియు గ్రహింతురు. ఇది ప్రభుడనైన నేను పలికిన వాక్కు, నేను దానిని నేరవేర్చి తీరుదును.

37. ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను మరల యిస్రాయేలీయులను నా సహాయము అర్ధింపనిత్తును. వారు గొఱ్ఱెలమందవలె వృద్ధిచెందుదురు.

38. ఉత్సవ దినమున బలిగా అర్పింపనున్న గొఱ్ఱెలతో యెరూషలేము నిండియుండునుగదా! అట్లే నేనిప్పుడు పాడు వడియున్న నగరములు మరల ప్రజలతో నిండి యుండునట్లు చేయుదును. అప్పుడు వారు నేను ప్రభుడనని గుర్తింతురు.”

Text Example

1. ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆయన ఆత్మ నన్ను కొనిపోయి ఎముకలతో నిండిన ఒకలోయ నడుమ దింపెను.

2. ఆయన నన్ను ఆ లోయలో అటునిటు త్రిప్పెను. దానినిండ ఎండిన ఎముకలు కలవు

3. ఆయన “నరపుత్రుడా! 'ఈ అస్థికలు మరల జీవింపగలవా?' అని నన్నడిగెను. నేను 'ప్రభూ! ఆ సంగతి నీకే తెలియును' ” అంటిని.

4. ఆయన నాతో నీవు ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభువు పలుకులు ఆలింపుడని చెప్పుము.

5. యావే ప్రభుడనైన నేను ఈ ఎముకలతో ఇట్లు చెప్పుచున్నాను. “నేను మీలోనికి ఊపిరిని పంపుదును. మీరు మరల జీవింతురు.

6. నేను మీకు నరములను, కండరములను ఒసగి మీపై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరినొసగి మీరు మరల బ్రతుకునట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు.”

7. ఆయన ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించితిని. నేను ప్రవచించుచుండగా టపటపమను ధ్వనిపుట్టెను. ఎముకలు ఒక దానితో నొకటి సంధించుకొనెను.

8. నేను చూచుచుండగనే నరములు, కండరములు చర్మము ఆ ఎముకలను కప్పెను. కాని వానిలో ఇంకను ప్రాణము లేదయ్యెను.

9. ప్రభువు నాతో నరపుత్రుడా! నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము. ఊపిరితో ప్రవచన పూర్వకముగా ఇట్లు చెప్పుము. “ప్రభువు వాక్కిది. ఊపిరీ! నీవు నాలుగు దిక్కుల నుండి విచ్చేసి, హతులైన వీరిలో ప్రవేశించి వీరిని బ్రతికింపుము.”

10. ఆయన చెప్పినట్లే నేను ప్రవచించితిని. ఊపిరి ఆ దేహములలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి.

11. అంతట ప్రభువు నాతో “నరపుత్రుడా! ఈ ఎముకలు యిస్రాయేలీయులందరికి చిహ్నముగా ఉన్నవి. వారు 'మేము అస్థికలవలె ఎండిపోయితిమి. మా ఆశ విఫలమైనది. మేము మృతులతో సమాన మైతిమి' అని పలుకుచున్నారు.

12. కనుక నీవు యిస్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము, యావే ప్రభువిట్లు నుడువుచున్నాడు. “నా ప్రజలారా! నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరల యిస్రాయేలు దేశమునకు తోడ్కొని వత్తును.

13. నేను మీ సమాధులను తెరచి, మిమ్ము లేపునపుడు మీరు నేను ప్రభుడనని గుర్తింతురు.

14. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించునట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించునట్లు చేయుదును. అప్పుడు ప్రభుడనైన నేను మాట యిచ్చి చెప్పినట్లే చేసితినని గ్రహింతురు. ఇది ప్రభుడనైన నా వాక్కు”

15. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

16. “నరపుత్రుడా! నీవు ఒక కఱ్ఱ తీసికొని దానిపై 'యూదా మరియు వారి తోటివారగు యిస్రాయేలీయులకు' అని వ్రాయుము. అటుపిమ్మట మరియొక కఱ్ఱను తీసికొని దానిపై ఎఫ్రాయీము కఱ్ఱ అనగా యోసేపు మరియు వారి తోటివారగు యిస్రాయేలీయులకు' అని వ్రాయుము.

17. అంతట ఆ రెండింటిని నిలువుగా కలిపి ఒకే కఱ్ఱ అగునట్లుగా నీ చేతితో పట్టు కొనుము.

18. నీ ప్రజలు 'దీని భావమేమిటి' అని అడిగినప్పుడు వారితో యావే ప్రభుడనైన నా పలు కులుగా ఇట్లు చెప్పుము.

19. 'నేను ఎఫ్రాయీమునకు, అతనికి చెందిన వారికిని సంబంధించిన యోసేపు కఱ్ఱను తీసికొని యూదా కఱ్ఱతో జోడింతును. ఆ రెండింటిని ఒకే కఱ్ఱగాచేసి నా చేతితో పట్టుకొందును.”

20. నీవు పేరులు లిఖించిన ఆ రెండు కఱ్ఱలను ప్రజలు చూచునట్లుగా నీ చేతితో పట్టుకొనుము.

21. ఆ జనులతో యావే ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. “నేను ప్రజలను చెల్లాచెదరైన జాతులనుండి తిరిగి రప్పింతును. వారిని ఏకము చేసి వారి నేలకు తోడ్కొనివత్తును.

22. వారి దేశమున యిస్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును. ఒక్క రాజే వారిని పాలించును. వారు మరల రెండు జాతులు గాను, రెండు రాజ్యములుగాను చీలిపోరు.

23. వారు మరల రోతగొల్పు విగ్రహములద్వారా గాని, పాపకార్యముల ద్వారాగాని మలినాత్ములు కారు. నేను వారి పాపములనుండియు, ద్రోహముల నుండియు వారిని విముక్తిచేసి శుద్ధిచేయుదును. వారు నా ప్రజలగుదురు. నేను వారికి దేవుడనగుదును.

24. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక్కరాజు వారినేలును. వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు.

25. నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారును, వారి సంతతియు తరతరముల వరకు అచటనే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును.

26. నేను వారితో సమాధానార్ధమైన నిబంధనము చేసికొందును. అది నాకును, వారికిని నిత్య నిబంధనముగా ఉండును. వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారినడుమ శాశ్వతముగా నిలిచియుండును.

27. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు.

28. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొలిపినపుడు ప్రభుడనైన నేను యిస్రాయేలును పవిత్రపరచువాడనని అన్యజాతులు గ్రహించును."

Text Example

1. ప్రభువువాణి నాతో ఇట్లనెను:

2. "నరపుత్రుడా! నీవు మాగోగు దేశములోని రోషు, మెషెక్కు తుబాలు అను జాతులకు అధిపతియైన గోగును ఖండింపుము.

3. యావే ప్రభుడనైన నేను అతనికి విరోధిని అగుదునని చెప్పుము.

4. నేను అతనిని వెనుకకు తిప్పి అతని దౌడలకు గాలము తగిలింతును. అతనిని, అతని సైన్యములను ఈడ్చుకొని పోవుదును. అతని దండు చాల గొప్పది. అతనికి అశ్వ బలమును, ఆయుధధారులైన రౌతులును గలరు. ప్రతి సైనికుడు డాలును, కత్తిని తాల్చును.

5. పారశీకము, కూషు, పూటు దేశముల సైనికులు అతని పక్షమున ఉన్నారు. వారికి డాళ్ళు, శిరస్త్రాణములు కలవు.

6. గోమెరు వీరులు, ఉత్తరమున ఉన్న బేత్ తొగార్మా వీరులు అతని పక్షమున ఉన్నారు. ఇంకను పెక్కు దేశముల సైనికులతనిని అనుసరించుచున్నారు.

7. అతనిని యుద్ధమునకు సన్నద్ధము కమ్మని చెప్పుము. తన సైన్యములను సిద్ధము చేసికొమ్మని చెప్పుము.

8. చాల ఏండ్ల తరువాత నేనతనితో నీవు ఒక దేశమును ముట్టడింపుమని చెప్పుదును. ఆ దేశ ప్రజలను పెక్కు జాతుల నుండి ప్రోగుచేసికొని వచ్చిరి. వారు యుద్ధ భయము లేక నిశ్చింతగా జీవించుచున్నారు. అతడు యిస్రాయేలు కొండలను ముట్టడించును. అవి చాలా కాలము వరకు ఎడారులుగా ఉండెను. కాని వానిలో ఇపుడు ప్రజలు సురక్షితముగా జీవించుచున్నారు.

9. గోగును, అతని సైన్యములును, అతని వెంటనున్న పెక్కు జాతులును తుఫానువలె ఆ దేశముపైకి వచ్చును. దానిని మేఘమువలె క్రమ్మును.

10. యావే ప్రభువు గోగుతో ఇట్లు అనుచున్నాడు; ఆ కాలము వచ్చినపుడు నీవొక చెడ్డ పన్నాగమును పన్నుదువు.

11. నీవు దురాలోచనలతో ఇట్లనుకొను చున్నావు. 'నేను నిస్సహాయముగానున్న దేశమును ముట్టడింపగోరుదును. అచటి ప్రజలు నిశ్చింతగా జీవించుచున్నారు.” అందలినగరములకు ప్రాకారములు ద్వారములు గడెలు లేవు.

12. ఒకప్పుడు శిథిలములుగా ఉండిపోయిన నగరములను నీవు తిరిగి దోచుకొందుననుకొనుచున్నావు. వారిని అన్యజాతుల నుండి తోడ్కొనివచ్చిరి. వారికిప్పుడు పశులమందలు, సరకులు కలవు. వారు ప్రపంచమధ్యమున జీవించు చున్నారు.

13. షేబా, దెదాను ప్రజలు తర్షీషు వర్తకులు 'నీవు నీ సైన్యమును సిద్ధముచేసికొని ఆ దేశమును దోచుకొందువా? ఆ దేశమునుండి వెండి, బంగారములను, పశువులను, సరకులను, కొల్లసొమ్మును దోచు కొని వెడలిపోవుదువా?' అని నిన్ను ప్రశ్నింతురు.

14-15. ప్రభువు నన్ను గోగుతో తన మాటలుగా ఇట్లు చెప్పుమనెను: నా ప్రజలైన యిస్రాయేలీయులు సురక్షితముగా జీవించుచుండగా నీవు ఉత్తరమున దూరప్రాంతముననున్న నీ స్థలమునుండి బయలు దేరుదువు. నీవు చాలజాతుల నుండి వచ్చిన బంటులతో గూడిన మహా సైన్యమును నడిపించు కొనివత్తువు.

16. వారెల్లరును గుఱ్ఱములపై వత్తురు. నీవు భూమి మీదికి వ్యాపించు తుఫానువలె వచ్చి నా ప్రజలమీద పడుదువు. ఆ కాలము వచ్చినపుడు నేను నిన్ను నా దేశమును ముట్టడించుటకు పంపుదును. దాని వలన జాతులు నేనెవరినో తెలిసికొనును. నీ ద్వారా నేను చేయు కార్య ములు చూచి నా పావిత్య్రమును అర్థము చేసికొనును.

17. నేను రాబోవు కాలములో యిస్రాయేలీయులను ముట్టడించుటకు ఒకనిని పంపుదునని పూర్వమే నా సేవకులైన యిస్రాయేలు ప్రవక్తల ద్వారా చెప్పించితిని. అతడివి నీవే.

18. ప్రభువు ఇట్లు అనుచున్నాడు: గోగు యిస్రాయేలును ముట్టడించినపుడునేను ఆగ్రహము చెందుదును.

19. నేను కోపావేశముతో చెప్పుచున్నాను. ఆ దినమున యిస్రాయేలు దేశమున పెద్ద భూకంపము సంభవించును.

20. ప్రతి చేప, పక్షి, వన్యమృగములు, భూమిమీద ప్రాకు ప్రాణులు, నేలమీది ప్రతినరుడు నన్ను చూచి భయపడును. కొండలు కూలును, శిఖరములు రాలును, ప్రాకారములు పడిపోవును.

21. నేను గోగును పెక్కు విపత్తులతో భయపెట్టుదును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు. అతని సైనికులు ఒకరినొకరు కత్తితో చంపుకొందురు.

22. నేను అతనిని రోగముతోను, రక్తపాతముతోను శిక్షింతును. అతని మీదను, అతని సైన్యముమీదను, అతని పక్షమును అవలంబించిన నానాజాతుల మీదను నిప్పు గంధకములతో కూడిన కుంభవర్షములు వడగండ్లు కురియును.

23. ఈ రీతిగా నేను ఎల్లజాతులకు నా మహాత్మ్యమును, పావిత్య్రమును వెల్లడి చేయుదును. ఎల్లజాతులు నన్ను తెలిసికొనునట్లు చేయుదును. అప్పుడు నేను ప్రభుడనని ఎల్లరును గుర్తింతురు.”

Text Example

1. ప్రభువిట్లనెను: నరపుత్రుడా! రోషు, మెషెకు, తుబాలు జాతులకు అధిపతియైన గోగును ఖండింపుము. నేనతనికి శత్రువునగుదునని చెప్పుము.

2. అతనిని క్రొత్తదారి పట్టింతును. అతనిని దూరమున నున్న ఉత్తర ప్రాంతమునుండి తోడ్కొనివచ్చి యిస్రాయేలు కొండల మీదికి తీసికొనివత్తును.

3. అతని ఎడమచేతిలోని వింటిని, కుడిచేతిలోని బాణములను పడగొట్టుదును.

4. గోగు అతని సైన్యము, అతని పక్షమున అవలంబించిన వారు యిస్రాయేలు కొండలపై కూలుదురు. వన్య మృగములు, పక్షులు వారి శవములను తినివేయును.

5. వారు పొలములలో కూలుదురు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు,

6. నేను మాగోగు దేశమునను, ప్రజలు నిశ్చింతగా జీవించు సముద్రతీరములందును మంటలు లేపుదును. అప్పుడెల్లరును నేను ప్రభుడనని గుర్తింతురు.

7. నా ప్రజలైన యిస్రాయేలీయులు నా పవిత్ర నామమును గుర్తింతురు. నా నామమునకు ఇక అపకీర్తి కలుగదు. అప్పుడు జాతులు నేను ప్రభుడననియు, యిస్రాయేలు కొలుచు పవిత్ర దేవుడ ననియు గ్రహించును.

8. యావే ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు. నేను చెప్పినదంతయు జరిగి తీరును. నేను పేర్కొనిన దినము వచ్చితీరును.

9. యిస్రాయేలు నగరములలో వసించు వారు వెలుపలికి వెళ్ళి శత్రువులు వదలిపెట్టిన ఆయుధములను వంటచెరకుగా ప్రోగుజేసికొందురు. వారు డాళ్ళు, విండ్లు, బాణములు, బల్లెములు, ఈటెలు, గదలు మొదలైన వానిని పొయ్యిలో పెట్టుకొందురు. అవి ఏడేండ్లవరకు వారికి వంటచెరకుగా ఉపయోగపడును.

10. వారు పొలములలో పుల్లలు ఏరుకొన నక్కర లేదు. శత్రువులు వదలిపెట్టిన ఆయుధములే వారికి వంటచెరకగును. వారు తమను దోచుకొనిన వారిని దోచుకొందురు. తమను కొల్లగొట్టిన వారిని కొల్లగొట్టుదురు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు

11. ప్రభువిట్లనెను: ఆ కాలమున నేను గోగును పాతిపెట్టుటకు యిస్రాయేలు దేశమున తావునిత్తును. సముద్రమునకు తూర్పున, ప్రయాణికులు పోవు లోయలో ఆ తావును ఏర్పరచెదను. గోగును, అతడి సైన్యమును అచటనే పాతి పెట్టుదురు. ప్రయాణికులు పోవుటకు వీలులేకుండా ఆ తావునకు హమోన్-గోగు' అని పేరు పెట్టుదురు.

12. దేశమును శుద్ధి చేయుచు యిస్రాయేలీయులు ఏడునెలలుపాటు శవములను పాతి పెట్టుదురు.

13. వారిని పాతిపెట్టుటకు, దేశములోని ప్రజలెల్లరు సాయపడుదురు. నేను విజయము బడసిన దినమున ఈ కార్యమునకుగాను వారికి కీర్తి లభించును. ఇది ప్రభుడనైన నా వాక్కు

14. ఏడు నెలలు గడచిన పిదప ప్రజలు ఎన్నుకొనిన వారు కొందరు దేశమున సంచరించి, ఇంకను నేలపై మిగిలియున్న శవములను పాతి పెట్టింతురు. అప్పుడుగాని దేశము శుద్ధికాదు.

15. ఆ మనుష్యులు దేశము నలుమూలల తిరుగునప్పుడు నరాస్థికలు కన్పించెనేని వాని ప్రక్క ఒకగుర్తు పెట్టుదురు. తరువాత పాతి పెట్టువారు వచ్చి వారిని హమోన్ గోగు లోయలో పాతి పెట్టుదురు.

16. ఆ ప్రాంతమున హమోన్ అను పేరుగల ఒక పట్టణము వెలయును. ఈ రీతిగా దేశము మరల శుద్ధినిపొందును.

17. యావే ప్రభువు నాతో ఇట్లనెను: నరపుత్రుడా! 'నేను సిద్ధముచేయు బలిని భుజించుటకు గాను నలువైపుల నుండి పక్షులను, మృగములను పిలువుము. యిస్రాయేలు కొండలమీద పెద్దబలి జరుగును. అవి అచట మాంసముతిని, నెత్తురు త్రాగవచ్చును.

18. అవి సైనికుల మాంసము తినును, లోకపు రాజుల నెత్తురు త్రాగును. నేను వారినెల్లరిని గొఱ్ఱె పిల్లలవలె, పొట్టేళ్ళవలె, మేకపోతులవలె, బాషానులో బలిసిన ఎడ్లవలె వధింతును.

19. నేను ఆ జనులను బలి పశువులవలె వధించినపుడు ఆ మృగములు, పక్షులు తమకు వలసినంత క్రొవ్వు తినవచ్చును. తాము మత్తెక్కువరకు నెత్తురు త్రాగవచ్చును.

20. నేను వానికి భోజనము సిద్ధము చేయుదును. అవి గుఱ్ఱములను, సైనికులను, వీరులను కడుపార భుజింపవచ్చును.' ఇది ప్రభుడనైన నా వాక్కు,

21. ప్రభువిట్లనెను: నేను జాతులకు నా మహిమను చూపింతును. నేను నా హస్తముతో నా న్యాయనిర్ణయ ములను జరిగించు తీరును వానికి చూపింతును.

22. అప్పటినుండి యిస్రాయేలీయులు నేను వారి ప్రభుడనైన దేవుడనని గుర్తింతురు.

23. నాకు ద్రోహముగా పాపము చేసినందులకు యిస్రాయేలీయులు ప్రవాసమునకుపోయిరని జాతులు గ్రహించును. నేను నా ప్రజల నుండి వైదొలగితిని. శత్రువులు వారిని యుద్ధమున ఓడించి చంపనిచ్చితిని.

24. హేయమైన వారి పాపములకు తగినట్లుగానే నేను వారికి బుద్ధి చెప్పితిని. వారినుండి వైదొలగితిని.

25. ప్రభువిట్లనెను: “ఇప్పుడు నేను యాకోబు సంతతిని చెరనుండి విడి పింతును. యిస్రాయేలీయులకు దయచూపుదును. నా పవిత్రనామమును కాపాడుకొందును.

26. వారు శత్రువుల పీడనమును తప్పించుకొని స్వీయదేశమున సురక్షితముగా వసించునపుడు, పూర్వము నాకు ద్రోహముచేసి, అవమానము తెచ్చుకొన్న ఉదంతమును మరచిపోదురు.

27. నేను నా ప్రజలను వారి శత్రువుల దేశమునుండి తోడ్కొనివచ్చి పెక్కుజాతులకు నా పావిత్య్రమును చూపింతును.

28. అప్పుడు నా ప్రజలు నేను వారి ప్రభువును, దేవుడనని గ్రహింతురు. నేను వారిని ప్రవాసమునకు పంపితిని గనుకను, ఇప్పుడు మరల ఒక్కరిని గూడ వదలిపెట్టక అందరిని ప్రవాసమునుండి ప్రోగుజేసి స్వీయదేశమునకు కొని వత్తును. గనుక వారు ఈ అంశమును గ్రహింతురు.

29. నేను యిస్రాయేలీయులపై నా ఆత్మను క్రుమ్మరింతును. వారినుండి నా మొగమును మరల ప్రక్కకు త్రిప్పుకొనను. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు" ,

Text Example

1. అది నూతన వత్సరము తొలిమాసపు పది యవరోజు. మా ప్రవాసము ఇరువది ఐదవయేడు. యెరూషలేము పట్టువడిన పిదప పదునాలుగవయేడు. ఆ దినము ప్రభువు హస్తము నామీదికి రాగా, ఆయన నన్ను కొనిపోయెను.

2. దర్శనములో దేవుడు నన్ను యిస్రాయేలు దేశమునకు కొనిపోయి, ఒక ఉన్నత పర్వతముపై నిలిపెను. నా యెదుట దక్షిణపు వైపున నగరమువంటి కట్టడములేవో కన్పించెను.

3. ఆయన నన్ను వాని చెంతకు తీసుకొనిపోయెను. నాకు కంచు వలె మెరయు నరుడొకడు కనిపించెను. అతడు కొలనూలు, కొలబద్ద పట్టుకొని ద్వారముచెంత నిలుచుండి ఉండెను.

4. అతడు నాతో “నరపుత్రుడా! జాగ్రత్తగా గమనింపుము. నా పలుకులను శ్రద్ధగా విని నేను నీకు చూపించు సంగతులను మనసులో ఉంచుకొనుము. నిన్నిక్కడికి తీసికొని వచ్చినది ఇందు కొరకే. నీవు చూచిన అంశములెల్ల యిస్రాయేలీయులకు తెలియజెప్పుము” అని అనెను.

5. నేను దేవాలయము ప్రాంగణమునకు వెలుపల దానిచుట్టు ఉన్న గోడను చూచితిని. ఆ మనుష్యుని చేతిలోనున్న కొలబద్ద పొడవు ఆరుమూరలుండెను. మూర ఒకటి ముంజేతి పొడవు మరియు అరచేయి వెడల్పు కలిపినంత పొడవుండెను'. అతను గోడను కొలిచెను. దాని ఎత్తు ఒక కొలబద్ద మరియు మందము ఒక కొలబద్ద.

6. అంతట అతడు తూర్పు ద్వారము నొద్దకు వెళ్ళి మెట్లెక్కి దాని ప్రవేశగదిని కొలచెను. అది ఒక కొలబద్ద వెడల్పుండెను.

7. దానికి ఇరువైపుల ఒక్కొక్కపక్క చతురస్రాకారపు మూడేసి కావలివారి గదులుండెను. ఒక్కొక్క గది కొలత ఒక కొలబద్ద. గదుల నడుమనున్న గోడల మందము ఐదుమూరలు.

8-9. ఆ గదులకు ఆనుకొనియున్న లోపలి ప్రవేశగది వెడల్పు ఒక కొలబద్ద మరియు చివరనున్న వసారా ఎనిమిదిమూరల వెడల్పు కలిగి ఇరువైపుల రెండు మూరల స్తంభాకార గోడలు కలిగియుండెను. వసారా చిట్టచివరనుండెను.

10. తూర్పు ద్వారములో ఇరు వైపులనున్న కావలివారి గదులన్నియు ఒకే పరిమాణమున ఉండెను. వాని నడుమనున్న గోడల మందమును సమానమే.

11. అటుపిమ్మట అతడు ద్వారప్రవేశ భాగమును కొలవగా అది పది మూరలుండెను. మరియు ప్రవేశ గది వెడల్పు మొత్తము పదమూడు మూరలుండెను.

12. కావలివారి గదుల ముందున్న అడ్డకమ్ములు ఒక మూర ఎత్తు, అంతే మందము కలిగియుండెను. చతురస్రాకారపు ఒక్కొక్క గది కొలత ఆరు మూరలు.

13. అటుపిమ్మట అతడు ఒక గది వెనుకటి గోడ నుండి దాని అభిముఖముగానున్న గది వెనుకటి గోడ వరకును గల పొడవును కొలువగా అది ఇరువది అయిదు మూరలుండెను. తలుపులులేని ఖాళీ ప్రవే శములు ఒకదానికొకటి ఎదురుగానుండెను.

14. చిట్ట చివరనున్న వసారాగదిని అతడు కొలువగా ఇరువది మూరలుండెను. ఈ వసారానుండి దేవాలయ వెలుపలి ఆవరణలోనికి వెళ్ళవచ్చును.

15. ప్రవేశద్వారము వెలుపలి గోడనుండి లోపలిద్వారమును ఆనుకొని యున్న వసారా చివరవరకును గల పొడవు ఏబది మూరలు.

16. ప్రతి గది వెలుపలి గోడలోను, గదికి గదికి మధ్యగల గోడలలోను ఒకదానికొకటి అభిముఖముగా అల్లిక కిటికీలు గలవు. అదే విధముగా వసారాలో కిటికీలు మరియు దాని పక్కనగల స్థంభాకార గోడల మీద ఖర్జూర వృక్షములను చెక్కిరి.

17. ఆ మనుష్యుడు నన్ను వెలుపలి ఆవరణము లోనికి తీసికొనిపోయెను. అచట వెలుపలి గోడనాను కొని చుట్టు ముప్పది గదులుండెను.

18. వాని ముందట రాళ్ళు పరచిన తావుండెను. ఆ రాళ్ళు వెలుపలి ఆవరణములోనికి వ్యాపించి ప్రవేశగది పొడుగున వ్యాపించియుండెను. వెలుపలి ఆవరణము లోపలి ఆవరణము కంటె పల్లముగా నుండెను.

19. లోపలి ఆవరణములోనికి కొనిపోవు ఎత్తయిన ద్వారము ఒకటి కలదు. అతడు రెండు ద్వారముల మధ్య గల దూరమును కొలువగ వంద మూరలుండెను.

20. అంతట అతడు వెలుపలి ఆవరణమునకు చేర్చు ఉత్తరద్వారమును కొలిచెను.

21. ప్రవేశమునకు ఇరువైపులనున్న మూడు కావలివారి గదులు, వాని నడుమనున్న కావలివారి గదులు, వాని నడుమనున్న గోడలు, ప్రవేశపు గది కొలతలు తూర్పు ద్వారపు కొలతల వలెనే యుండెను. ఆ ద్వారపు పొడవు ఏబది మూరలు. వెడల్పు ఇరువది అయిదు మూరలు..

22. కిటికీలు, వసారాగది, చెక్కిన ఖర్జూర వృక్షములును తూర్పుద్వారముననున్నట్లే ఉండెను. ఇచట ఏడు మెట్లు ద్వారమునొద్దకు కొనిపోవును. దేవాలయ వెలుపలి ఆవరణములోనికి ప్రవేశించునట్లుగా వసారాగది యుండెను.

23. ఈ ఉత్తరద్వారమునకు అభిముఖముగా వెలుపలి ఆవరణమునుండి, దేవాలయ లోపలి ఆవరణములోనికి పోవుటకు ఒక ద్వారము కలదు. తూర్పున కూడ ఈ విధానమే కలదు. ఆ మనుష్యుడు ఈ రెండు ద్వారముల నడుమనున్న దూరమును కొలవగా వందమూరలుండెను.

24. అంతట అతడు నన్ను దక్షిణ దిక్కునకు కొనిపోయెను. అచట నేను మరియొక ద్వారమును చూచితిని. అతడు దాని లోపలి గోడలను దాని ప్రవేశపు గదిని కొలిచెను. అవి ఇతర ద్వారముల కొలతలవలె నుండెను.

25. ఈ ద్వారమునకు చెందిన గదులకు ఇతర ద్వారములవలెనె కిటికీలు కలవు. ద్వారము పొడవు ఏబది మూరలు, వెడల్పు ఇరువది ఐదు మూరలు.

26. ఏడు మెట్లు దాని చెంతకు కొనిపోవును. ఈ ద్వారము నందు కూడ దేవాలయ వెలుపలి ఆవరణములోనికి ప్రవేశించునట్లుగా వసారాగది యుండెను. వసారాకు ఇరువైపుల స్తంభాకార గోడల మీద చెక్కిన ఖర్జూర వృక్షములు కలవు.

27. ఈ వసారాగదికి అభిముఖమున కూడ దేవాలయ లోపల ఆవరణములోనికి పోవు ద్వారము కలదు. ఆ మనుష్యుడు రెండు ద్వారముల నడుమన నున్నదూరమును కొలువగా అది వందమూరలుండెను.

28. అతడు నన్ను దక్షిణద్వారముగుండ లోపలి ఆవరణములోనికి కొనిపోయెను. అతడు లోపలి ఆవరణ ద్వారమును కొలిచిచూడగా అది వెలుపలి గోడలోనున్న ద్వారముల కొలతకు సమానము గానుండెను.

29-30. దాని కావలివారి గదులు ప్రవేశపుగది, లోపలిగోడలు, వెలుపలి ద్వారములలోని గదుల కొలతలకు సమానముగానుండెను. పొడవు ఏబది మూరలు, వెడల్పు ఇరువది ఐదు మూరలు.

31. అయితే దాని వసారాగది దేవాలయ వెలుపలి ఆవరణము లోనికి ప్రవేశించునట్లు ఉండెను. వసారా ఇరువైపుల స్థంభాకార గోడలమీద ఖర్జూర వృక్షముల చెక్కడములు కలవు. వెలుపలి ఆవరణమునుండి ఎనిమిది మెట్లు ఈ ద్వారమునకు కొనిపోవును.

32. అతడు నన్ను దేవాలయ లోపలి ఆవరణములో తూర్పుదిక్కునకు కొనిపోయి అచట ద్వారమును కొలిచెను. అది ఇతర ద్వారముల కొలతలకు సమానముగా ఉండెను.

33. దాని కావలివారి గదులు, ప్రవేశపుగది, లోపలి గోడలు ఇతర ద్వారములలోని గదుల కొలతలకు సమానముగా నుండెను. దానికి అన్నివైపుల, ప్రవేశపు గదిలో కూడ కిటికీలు కలవు. దాని పొడవు ఏబది మూరలు, వెడల్పు ఇరువది అయిదు మూరలు.

34. వసారాగది ఇరుప్రక్కల స్థంభాకార గోడలమీద ఖర్జూర వృక్షములను చెక్కిరి. వసారా గదినుండి దేవాలయ వెలుపలి ఆవరణము లోనికి వెళ్ళవచ్చును. వెలుపలి ఆవరణమునుండి ఎనిమిది మెట్లు ఈ ద్వారమునకు కొనిపోవును.

35. అంతట ఆ మనుష్యుడు నన్ను ఉత్తర ద్వారమునకు కొనిపోయెను. అతడు దానిని కొలిచిచూడగా అది ఇతర ద్వారముల కొలతలకు సమానముగా నుండెను.

36. వానివలెనె దానికి గూడ కావలివారి గదులు, అలంకరింపబడిన లోపలిగదులు, ప్రవేశపు గది, నలువైపుల కిటికీలుండెను. దాని పొడవు ఏబది మూరలు, వెడల్పు ఇరువది అయిదు మూరలు.

37. వసారా నుండి దేవాలయ వెలుపలి ఆవరణమునకు వెళ్ళవచ్చును. వసారా ప్రక్కనున్న స్తంభాకారగోడలపై ఖర్జూరవృక్షములను చెక్కిరి. ఎనిమిది మెట్లు ఈ ద్వారమునకు కొనిపోవును.

38. ద్వారపు వసారానుండి ప్రవేశింపదగిన గది ఒకటి ఉండెను. దానిలో దహనబలి పశువు మాంసమును కడిగి శుద్ధిచేయుదురు.

39. ద్వారపు వసారాలో దహనబలి పశువులను, పాపపరిహార బలి పశువులను, ప్రాయశ్చిత్త బలిపశువులను వధించుటకు ఇరువైపుల రెండేసి బల్లలు కలవు.

40. ద్వారపు వెలుపల వసారా గోడను ఆనుకొని మెట్లు ఎక్కు స్థలమునకు ఇరుపక్కల రెండేసి బల్లలుండెను.

41. ఆ విధముగ ద్వారమునకు ఒకవైపు నాలుగు బల్లలు, మరొకవైపు నాలుగు బల్లలు మొత్తము ఎనిమిది బల్లలపై పశువులను వధింతురు.

42. పశువులను దహనబలికి సిద్ధముచేయు బల్లలు చెక్కిన రాతితో చేయబడినవి. అవి ఒకటిన్నర మూర పొడవు, ఒకటిన్నర మూర వెడల్పు మరియు ఒక మూర ఎత్తు కలిగి ఉండెను. బలిపశువులను వధించు పరికరము లన్నింటిని ఈ బల్లలపైననే ఉంచుదురు.

43. బల్లల పై భాగముచుట్టు ఒకచేతి వెడల్పు గల దోనెలు ఉండెను. బలిగా అర్పించు మాంసమును మాత్రము ఈ బల్లలపైననే ఉంచుదురు. .

44. అంతట ఆ మనుష్యుడు నన్ను లోపలి ఆవరణలోనికి కొనిపోయెను. అచట ఆవరణము వైపు నకు తెరవబడియున్న రెండు గదులు కలవు. ఒకటి ఉత్తరద్వారము ప్రక్కన దక్షిణ దిక్కునకు అభిముఖ ముగా నుండెను. మరియొకటి దక్షిణద్వారము ప్రక్కన ఉత్తర దిక్కునకు అభిముఖముగా నుండెను.

45. దక్షిణమునకు అభిముఖముగానున్న గది దేవళమున పరిచర్యచేయు యాజకులకొరకు అనియు,

46. ఉత్తరమునకు అభిముఖముగానున్న గది బలి పీఠమువద్ద పరిచర్యచేయు యాజకులకొరకు అనియు అతడు నాతో చెప్పెను. యాజకులెల్లరును సాదోకు వంశజులు. లేవీయులతెగలలో దేవునిసన్నిధిలో పరిచర్యలు చేయుటకు అనుమతి పొందినవారు వీరు మాత్రమే.

47. ఆ మనుష్యుడు లోపలి ఆవరణమును కొలువగా అది నలుచదరముగానుండి వందమూరలు పొడవు, వందమూరలు వెడల్పును కలిగియుండెను. దేవాలయమునకు ఎదురుగా బలిపీఠము కలదు.

48. అంతట అతడు నన్ను దేవాలయ ముఖ మంటపమునకు కొనిపోయెను. దాని ఇరుప్రక్కల ఒక్కొక్కటి ఐదు మూరల మందముగల స్తంభాకార గోడలుండెను. దాని ప్రవేశద్వారమును ఆనుకొని ఇరు వైపుల మూడు మూరల గోడలు ఉండెను.

49. ప్రవేశ గది మొత్తము పొడవు ఇరువది మూరలు, వెడల్పు పదునొకండు మూరలు. పదిమెట్లు దేవాలయ ప్రవేశ భాగములోనికి కొనిపోవును. ద్వారముకిరు వైపుల స్తంభములు కలవు.

Text Example

1-2. అటుపిమ్మట అతడు నన్ను దేవాలయములోని పవిత్రస్థలమునకు కొనిపోయి దానికి ఇరు వైపులనున్న స్తంభాకార గోడలను కొలిచెను. ఇవి ఒక్కొక్కటి ఆరుమూరల మందము కలిగియుండెను. దాని ప్రవేశద్వారము పదిమూరలు కలిగి, ద్వారమును ఆనుకొని ఇరువైపుల ఒక్కొక్కటి ఐదు మూరలు పొడవు కలిగిన గోడలును కలవు. అతడు పవిత్రస్థలమును కొలవగా అది నలుబదిమూరల పొడవు, ఇరువది మూరల వెడల్పు ఉండెను.

3. అటుపిమ్మట అతడు గర్భగృహము లోనికి పోయి, దాని ఇరుప్రక్కలనున్న స్తంభాకార గోడలను కొలవగా ఒక్కొక్కటి రెండు మూరలమందము ఉండెను. ప్రవేశద్వారము వెడల్పు ఆరుమూరలు మరియు ప్రవేశ ద్వారమును ఆనుకొని ఇరువైపులనున్న గోడలు ఒక్కొక్కటి ఏడు మూరల పొడవు ఉండెను.

4. గర్భగృహమును కొలువగా అది నలుచదరముగా నుండి ఇరువది మూరల పొడవును మరియు పవిత్ర స్థలపు వెడల్పు ననుసరించి ఇరువది మూరలు వెడల్పు కలిగి యుండెను. ఇది పవిత్రస్థలమునకు ఆవలనున్నది. అతడు నాతో అది మహాపవిత్రస్థలమని చెప్పెను.

5. ఆ మనుష్యుడు దేవాలయపు గోడను కొలువగా అది ఆరుమూరల మందముండెను. ఒక్కొక్కటి నాలుగు మూరల మందము కలిగిన చిన్నగదులు దేవాలయము చుట్టు ఉండెను.

6. ఈ గదులు ఒక దానిపైన ఒకటిగా మూడంతస్తులులో ఉండెను. ఒకొక్క అంతస్తులో ముప్పది గదులుండెను. గదులను చుట్టియున్న దేవాలయపు వెలుపలి గోడనుండి ఆ గదులు గూడులవలె చొచ్చుకొని వచ్చియుండెను గాని అవి దేవాలయపు గోడను ఆధారము చేసుకొనలేదు. దేవాలయపు వెలుపలి గోడ ఒక్కొక్క అంతస్తు పెరిగిన కొలది తగ్గుచూ వచ్చెను.

7. ఒక్కొక్క అంతస్తునకు గోడ మందము తగ్గిన పరిమాణము చొప్పున దేవాలయము చుట్టునున్న ఆయా అంతస్తులలోని గది కొలత పెరుగుచుండెను. వెలుపలినుండి చూచునపుడు దేవాలయపు గోడలు క్రిందినుండి మీదివరకును ఒకే మందము కలిగియుండునట్లు కనిపించెను. దేవాలయపు వెలుపలి గోడ ప్రక్కన, పైగదులకు వెలపలి ప్రక్క రెండు మెట్ల వరుసలు కలవు. క్రింది అంతస్తు నుండి పై రెండు అంతస్తుల లోనికి ఈ మెట్ల ద్వారా వెళ్ళవచ్చును.

8-11. ఈ గదుల వెలుపలిగోడ మందము ఐదుమూరలు. దేవాలయమునకు ఉత్తర దిక్కున ఈ గదులలోనికి పోవుటకు ఒక తలుపు కలదు. దక్షిణ దిక్కుననున్న గదులలోనికి పోవుటకును ఒక తలుపుగలదు. దేవాలయము చుట్టు రాళ్ళుపరిచిన ఐదుమూరల వెడల్పు గల ఎత్తయిన సమతలము ఉండెను. దేవాలయము ప్రక్కనున్న గదులకు పునాదిగానున్న ఈ సమతలకప్పు ఎత్తు ఒక నిండు కొలబద్ద. అనగా ఆరుమూరలు ఉండెను. దేవాలయము ప్రక్కనున్న గదుల పునాదికి ఈ కప్పు సమతలముగా నుండెను. ఈ ఎత్తయిన సమతలమునకును యాజకులు వాడుకొను కట్టడముల కును మధ్య ఖాళీస్థలము కలదు. దాని పొడవు ఇరువది మూరలు. అది దేవాలయము చుట్టును కలదు.

12. దేవాలయమునకు పశ్చిమమున ఉన్న ఖాళీ స్థలము ప్రక్కన ఒక కట్టడము కలదు. అది తొంబది.మూరల పొడవు, డెబ్బదిమూరల వెడల్పునుండెను. దాని గోడల మందము ఐదుమూరలు.

13. ఆ మనుష్యుడు దేవాలయపు వెలుపలి పొడవును కొలువగా వందమూరలుండెను, దేవాలయము వెనుక నుండి పశ్చిమభాగమునందలి ఖాళీ స్థలములోని కట్టడము చివరివరకును దూరముకూడ వందమూరలు.

14. దేవాలయపు ముందటిభాగము ఇరువైపుల నున్న ఖాళీస్థలముతో కలుపుకొని వంద మూరల పొడవుండెను.

15. అతడు పడమరనున్న కట్టడమును దానికిరువైపులనున్న వసారాలతో కలుపు కొని కొలువగా వందమూరలుండెను.

16. దేవాలయ ముఖమంటపము, పవిత్ర స్థలము, గర్భగృహము నేలమీదినుండి కిటికీల వరకును కొయ్య పలకలతో కప్పబడి ఉండెను. ఈ కిటికీలను మూసివేయవచ్చును.

17. దేవాలయపు గోడల లోపలిభాగము తలుపులపై భాగము వరకును మరియు గర్భగృహము, పవిత్రస్థలము చుట్టునున్న అన్ని గోడలును కొలత ప్రకారము కట్టబడి, చెక్కడ ములతో నిండియుండెను.

18. వానిమీద ఖర్జూరములను, కెరూబుదూతలను ఒకదాని తరువాత ఒకటి వచ్చునట్లుగా చెక్కిరి. ఒక్కొక్క కెరూబుదూతకు రెండేసి మొగములు కలవు.

19-20. మనుష్యముఖము ఒక వైపున నున్న ఖర్జూరము వైపును, కొదమసింహ ముఖము మరియొక వైపునున్న ఖర్జూరము వైపు మళ్ళియుండెను. నేల మీదినుండి తలుపువరకు ఆలయముననున్న గోడ అంతయు ఇట్లే చెక్కబడి యుండెను.

21. పవిత్రస్థలము ద్వారబంధములు చతురస్రముగా ఉండెను. గర్భగృహము ప్రవేశభాగము ముందట కొయ్య పీఠము వంటిదొకటి కలదు.

22. దాని ఎత్తు మూడు మూరలు, వెడల్పు రెండు మూరలు. దాని మూలలు, ప్రక్కలు క్రింది భాగము అంతయు కొయ్యతో చేయబడి ఉండెను. అతడు నాతో 'ఇది దేవుని సముఖమున నుండెడు బల్ల' అని చెప్పెను.

23. పవిత్రస్థలములోనికి పోవు ద్వారమునకు గర్భగృహములోనికి పోవు ద్వారమునకు రెండేసి తలుపులు కలవు.

24. అవి మధ్యలో తెరచుకొను జంట తలుపులుగా నుండెను.

25. పవిత్రస్థలము గోడలమీదవలె తలుపుల మీదకూడ ఖర్జూరములను, కెరూబుదూతలను చెక్కిరి. దేవాలయ ముఖమంటప ద్వారముపైన వెలుపలితట్టున కొయ్యచూరు కలదు.

26. ఈ గది ప్రక్కలందు కిటికీలు కలవు. దాని ప్రక్క గోడలను ఖర్జూరములతో అలంకరించిరి.

Text Example

1. అంతట ఆ మనుష్యుడు నన్ను ఉత్తరము వైపునుండి వెలుపలి ఆవరణములోనికి కొనిపోయి మందిరమునకు ఉత్తరమున వేరుగానున్న భవనము లోనికి తీసుకొనిపోయెను. అది ఉత్తరము వైపుననున్న కట్టడమునకు ఎదురుగానున్నది.

2. వెలుపలకు దాని పొడవు ఉత్తరమువైపున వందమూరలు కలిగి, వెడల్పు ఏబది మూరలుండెను.

3. అది ఒక వైపున దేవాలయము ప్రక్కనున్న ఇరువది మూరల ఖాళీస్థలమును ఆనుకొనియుండెను. మరియొక ప్రక్కన వెలుపలి ఆవరణములో రాళ్ళుపరచిన తావునానుకొని యుండెను. అది మూడు అంతస్థులుగా నిర్మింపబడెను. ఒక్కొక్క అంతస్తు దాని క్రింది అంతస్తుకంటె వెనుకకు వచ్చునట్లు నిర్మింపబడెను.

4. ఈ కట్టడమునకు ఉత్తరదిక్కున ఒకవసారా కలదు. దాని పొడవు వందమూరలు, వెడల్పు పది మూరలు. దాని తలుపులు ఉత్తరదిక్కుననే గలవు.

5. ఆ కట్టడము పై అంతస్తులోని గదులుమధ్య, క్రింది అంతస్తులలోని గదులకంటే ఇరుకుగానుండెను. వానిని వెనుక ప్రక్కకు జరుగునట్లుగా నిర్మించిరి.

6. ఆ మూడు అంతస్తులలోని గదులును కప్పులపై నిర్మింప బడెను. ఆవరణములోని ఇతర కట్టడములకు వలె వానికి స్తంభములు లేవు.

7-8. ఆ భవనము క్రింది అంతస్తులోని వెలుపలి గోడ ఏబదిమూరల పొడవున గట్టిగానుండెను. అది ఆ కట్టడములో సగము పొడవుండెను. మిగిలిన ఏబదిమూరల దూరములో గదులు నిర్మింపబడెను. మీది విభాగములో కట్టడము ఎంత పొడవుండెనో అంతవరకు గదులుండెను.

9-10. ఈ గదుల క్రింద కట్టడమునకు తూర్పుదిక్కున వెలుపలి ఆవరణము లోనికి ద్వారముండెను. ఇచటనే ఆవరణపు గోడకూడ ప్రారంభమయ్యెను. దేవాలయమునకు దక్షిణ దిక్కునగూడ ఇటువంటి కట్టడమే కలదు. అది దేవాలయమునకు పశ్చిమముననున్న కట్టడమునకు దగ్గరగానుండెను. దాని గదులకు ముందట ఉత్తరదిక్కునవలె దారి కలదు.

11. దాని కొలతలు, ఆకారము, ద్వారములు ఉత్తర దిక్కునవలె నుండెను.

12. దేవళమునకు దక్షిణమున నున్న గదుల క్రింద ఒక ద్వారము కలదు. అచటనే తూర్పుదిక్కున గోడ ప్రారంభమయ్యెను.

13. ఆ నరుడు నాతో ఇట్లనెను: “ఈ రెండు కట్టడములును పవిత్రమైనవి. దేవుని సన్నిధిలోనికి పోవు యాజకులు వానిలో పవిత్రమైన నైవేద్యములను భుజింతురు, ఆ గదులు పవిత్రమైనవి కనుక యాజకులు పరమ పవిత్ర వస్తువులను, అనగా ధాన్యబలులను, పాపపరిహారబలి మాంసమును, ప్రాయశ్చిత్త బలి మాంసమును వానిలోనుంచుదురు. ఆ స్థలము పరమ పవిత్రము.

14. యాజకులు దేవళములో అర్చన చేసిన పిదప వెలుపలి ఆవరణములోనికి పోగోరెదరేని, అర్చన సమయములో తాము ధరించిన పవిత్ర వస్త్రములను ఈ గదులలోనుంచవలెను. అవి నివేదింప బడినవి కనుక, ప్రజల సంబంధమైన దేనినైనను వారు ముట్టునపుడు వారు వేరు వస్త్రములు ధరించు కొనవలెను.

15. అతడు దేవాలయము లోపలి భాగమును కొలిచి ముగించిన పిదప తూర్పు ద్వారముగుండ నన్ను బయటికి కొనిపోయి వెలుపలిభాగమును కొలిచెను.

16. అతడు తన కొలబద్దను తీసికొని తూర్పుభాగమును కొలువగా అది ఐదువందల మూర లుండెను.

17-19. తరువాత అతడు ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిక్కులందు కొలిచెను. అన్ని ప్రక్కలందును ఐదువందల మూరలే ఉండెను.

20. కనుక ఐదు వందల మూరల నలుచదరమును దానిచుట్టును గోడయు కలదు. ఆ గోడ సాధారణ స్థలము నుండి నివేదితస్థలమును ప్రత్యేకపరుచుచుండెను.

Text Example

1. అంతట అతడు నన్ను తూర్పునకు అభిముఖముగా నున్న ద్వారమువద్దకు కొనిపోయెను.

2. అచట నేను యిస్రాయేలు దేవుని తేజస్సు తూర్పు నుండి వచ్చుటను చూచితిని. ప్రభువు ధ్వానము సముద్ర ఘోషవలె నుండెను. భూమి ఆయన తేజస్సుతో ప్రకా శించెను.

3. ప్రభువు యెరూషలేమును నాశనము చేయుటకు వచ్చినపుడును, కెబారునది చెంతనుగూడ నేనిట్టి దర్శనమునే కాంచితిని. అపుడు నేను నేలపై బోరగిలబడితిని.

4. ప్రభువుతేజస్సు తూర్పు ద్వారము నుండి దేవళమును ప్రవేశించెను.

5. దేవుని ఆత్మ నన్ను పైకెత్తి లోపలి ఆవరణము లోనికి కొనిపోయెను. అచట నేను మందిరము దేవుని తేజస్సుతో నిండియుండుట గాంచితిని.

6. ఆ మనుష్యుడు నా ప్రక్కన నిలుచుండెను. ప్రభువు దేవళమును నుండి నాతో ఇట్లు చెప్పుచుండగా వింటిని.

7. “నర పుత్రుడా! ఇది నా సింహాసనము ఉండుస్థలము. నా పాదపీఠము, నేనిచట యిస్రాయేలు ప్రజల మధ్య సదా నివసించెదను. ఇకమీదట యిస్రాయేలు ప్రజలును, వారి రాజులును విగ్రహారాధన వలనను, రాజులను నాకు చేరువలో పాతి పెట్టుటవలనను నా పవిత్ర నామమును అమంగళము చేయరు.

8. రాజులు వారి ప్రాసాదపు ద్వారబంధములను, గడపలను నా దేవాలయపు ద్వారబంధములకును, గడపలకును చేరువలో కట్టిరి. నాకును వారికిని మధ్య ఒక్క గోడమాత్రమే అడ్డము కలదు. వారు తమ హేయమైన కార్యముల ద్వారా నా పవిత్రనామమునకు అపకీర్తి తెచ్చిరి. కావున నేను కోపముతో వారిని నాశనము చేసితిని.

9. వారిపుడు విగ్రహారాధనను మానుకొని, తమ రాజుల శవములను నా సన్నిధినుండి తొలగింపవలెను. నేను వారి నడుమ శాశ్వతముగా వసింతును.

10. నరపుత్రుడా! యిస్రాయేలీయులు వారు తమ పాపములకు సిగ్గుపడునట్లు దేవళమును గూర్చియు, దాని వివిధ భాగములను గూర్చియు తెలియజెప్పుము.

11. వారు తమ ప్రవర్తనకు సిగ్గుపడుదురేని, నీవు వారికి ఆలయము ఆకారము గూర్చియు, దాని ప్రవేశ ద్వారములు, నిష్క్రమణ ద్వారములు, దాని ఏర్పాటు, దాని నియమములు మొదలైన అంశములను గూర్చియు వివరింపుము. ఈ అంశములన్నియు వారికి వ్రాసియిమ్ము. అపుడు వారు దేవాలయము ఎట్లు ఏర్పాటు చేయబడునో గ్రహింతురు. దానిని గూర్చిన నియమములన్నింటిని పాటింతురు.

12. కొండమీద దేవళముచుట్టునున్న స్థలమంతయు పరమపవిత్రమైనది. దేవళమును గూర్చిన విధి యిదియే.

13. బలిపీఠము కొలతలివి. మూర ఒకటి ముంజేతి పొడవు మరియు అరచేయి వెడల్పు కలిపి నంత పొడవుండెను. బలిపీఠము: ఒక మూర ఎత్తు, ఒక మూర వెడల్పు గల పాదుచుట్టు, దానికి వెలుపలి ప్రక్కన ఒక జేన వెడల్పు అంచుకలదు.

14. నేలమీది పాదునుండి మొదలు పెట్టినచో పీఠము క్రిందికట్టు వరకు ఎత్తు రెండుమూరలు, గనిమ వెడల్పు ఒక మూర. క్రిందికట్టునుండి పైకట్టు వరకు ఎత్తు నాలుగు మూరలు, గనిమ వెడల్పు ఒకమూర. పైకట్టునుండి పీఠముయొక్క ఉపరిభాగము క్రిందికి నాలుగుమూరల ఎత్తు ఉండెను.

15. ఈ మూడవదే పై భాగము. దానిపై పశువులను దహించెడివారు. దాని ఎత్తు నాలుగు మూరలు. ఈ మూడవ భాగము నుండి నాలుగుమూలలను నాలుగుకొమ్ములు వ్యాపించి, మిగిలిన భాగముకంటె ఎత్తుగానుండెను.

16. పీఠము ఉపరిభాగము పన్నెండు మూరల నలుచదరము.

17. పైనున్న గనిమ పదునాలుగు మూరల నలు చదరము. దానికి చుట్టు ఒక మూర అలుగు దానిపైన ఒక జేన ఎత్తు గల అంచు కలదు. తూర్పు దిక్కున పీఠము మీదికెక్కుటకు మెట్లు కలవు.”

18. యావే ప్రభువునాతో ఇట్లనెను: “నరపుత్రుడా! నా మాటలు ఆలింపుము. మీరు ఈ బలిపీఠమును నిర్మించి దానిని ప్రతిష్ఠించినపుడు దానిపై పశువులను దహనబలిగా అర్పింపవలెను. వాని నెత్తుటిని దానిపై చల్లవలెను.

19. లేవీ తెగలో సాదోకు వంశజులైన యాజకులు మాత్రమే నా సన్నిధిలోనికి వచ్చి నన్ను అర్చింపవలెను. ఇది యావే ప్రభుడనైన నా ఆజ్ఞ. పాపపరిహారబలిని అర్పించుటకు నీవు ఆ యాజకులకు ఒక కోడె నీయవలయును.

20. నీవు దాని నెత్తుటిని కొంచెము తీసికొని పీఠము ఉపరిభాగము మూలలందున్న కొమ్ములకును, ఉపరిభాగపు నాలుగు మూలలకును, అంచులచుట్టును పూయవలెను. ఈ రీతిగా నీవు బలిపీఠమును శుద్ధి చేసి ప్రతిష్ఠింపవలెను.

21. పిమ్మట పాప పరిహారబలిగా అర్పించిన కోడెను కొనిపోయి దేవాలయము వెలుపల నిర్ణీత స్థలమున దహింపవలెను.

22. ఆ మరుసటి రోజున ఎట్టి లోపములులేని మేకపిల్లను పాపపరిహారబలిగా అర్పింపవలెను. కోడె నెత్తుటితోవలె ఈ మేకపిల్ల నెత్తుటితోగూడ బలిపీఠమును శుద్ధి చేయవలయును.

23. ఈ కార్యము ముగించిన తరువాత ఎట్టి లోపములేని కోడెను, పొట్టేలిని గైకొని,

24. వానిని నా వద్దకు కొనిరమ్ము. యాజకులు వానిపై ఉప్పు చల్లి వానిని నాకు దహనబలిగా అర్పింతురు.

25. ఏడురోజులపాటు ప్రతిరోజు నీవు నాకు పొట్టేలిని, మేకను, కోడెను పాపపరిహారబలిగా అర్పింపవలెను. ఆ బలిపశువులలో ఎట్టి లోపము ఉండరాదు.

26. యాజకులు ఏడు నాళ్ళు బలిపీఠమును ప్రతిష్ఠించి దానిని బలులర్పించుటకు సిద్ధము చేయవలయును.

27. ఏడునాళ్ళు ముగిసినపిదప వారు ప్రజలు కొని వచ్చు సమాధానబలులను, దహనబలులను పీఠముపై అర్పించవచ్చును. అపుడు నేను మిమ్ము ప్రీతితో చూతును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు."

Text Example

1. అతడు నన్ను పవిత్రస్థలమునకు తూర్పున నున్న లోపలి ఆవరణపు వెలుపలి గుమ్మమునొద్దకు మరల కొనివచ్చెను. అది మూసివేయబడియుండెను.

2. ప్రభువు నాతో “ఈ ద్వారము మూసివేయబడి యుండునే గాని మరల తెరువబడదు. దీనిగుండ ఎవరును పోజాలరు. యిస్రాయేలు దేవుడను ప్రభుడనైన నేను దీనిగుండ ప్రవేశించితిని గనుక ఇది ఇకమీదట సదా మూయబడియుండును.

3. అయినను పరిపాలనముచేయు రాజు తన ఆధిపత్యమును బట్టి దీనియందు కూర్చుని నా సన్నిధిలో అతని ఆహారమును భుజింప వచ్చును. అతడు వసారాగుండ ప్రవేశించి అదే మార్గమున బయటికి వెళ్ళివలయును” అని చెప్పెను.

4. తరువాత అతడు నన్ను ఉత్తరద్వారము గుండ దేవాలయము ముందటికి కొనిపోయెను. నేనటు పారచూడగా మందిరము ప్రభువు తేజస్సుతో నిండియుండెను. నేను నేలపై బోరగిలబడితిని.

5. ప్రభువు నాతో ఇట్లనెను: “నరపుత్రుడా! నీవు చూచుదానిని, వినుదానిని జాగ్రత్తగా గమనింపుము. నేను నీకు దేవాలయ నియమములను ఎరిగింతును. ఎవరు దేవళములోనికి ప్రవేశించి బయటికి వెళ్ళిపోవచ్చునో, ఎవరట్లు చేయరాదో శ్రద్ధగా గ్రహింపుము.

6. ఆ తిరుగుబాటుదారులైన యిస్రాయేలు ప్రజలతో యావే ప్రభుడనైన నేను వారి హేయమైన కార్యములను సహింపనని చెప్పుము.

7. వారు బలి పశువులనెత్తుటిని, కొవ్వును నాకు అర్పించునపుడు శరీరమున సున్నతి పొందని పరజాతివారిని నా దేవళములోనికి కొనివచ్చి దానిని అపవిత్రము చేసిరి. నా ప్రజలు హేయమైన కార్యములతో నా నిబంధనమును ఉల్లంఘించిరి.

8. వారు స్వయముగా దేవళమున పరిచర్య చేయుటకు మారుగా అన్యజాతి వారికి ఆ పనిని అప్పగించిరి.

9. హృదయసున్నతియు మరియు శరీరసున్నతియు నొందని అన్యజాతివాడు ఎవడును, అతడు యిస్రాయేలీయుల నడుమ వసించుచున్నను, నా దేవాలయమును ప్రవేశింపరాదని ప్రభుడనైన నేను ఆజ్ఞాపించుచున్నాను.

10. ఇతర యిస్రాయేలీయులతోపాటు నన్ను విడనాడి విగ్రహములను సేవించిన లేవీయులను నేను శిక్షింతును.

11. అయితే వారు దేవళమున ఊడిగము చేయుటకును, ద్వారపాలకులుగా ఉండుటకును, నా మందిరమున సేవచేయుటకును జనుల సమక్షమున నియమింపబడినవారు. ప్రజలు బలులను, దహన బలులను అర్పించుటకు కొనివచ్చిన పశువులను ప్రజల తరుపున వారు వధింపవచ్చును. ప్రజలకు సేవలు చేయవచ్చును.

12. కాని ఆ లేవీయులు యిస్రాయేలు ప్రజలు విగ్రహములను కొలిచినపుడు వారికి అర్చకులుగా పనిచేసి వారిని పాపమునకు ప్రేరేపించిరి. కనుక వారిని దండించి తీరుదునని యావే ప్రభుడనైన నేను శపథము చేయుచున్నాను.

13. వారు నా సన్నిధికి వచ్చి నాకు యాజకులుగా పని చేయరాదు. నా పవిత్ర వస్తువులనుగాని, పరమపవిత్ర వస్తువులనుగాని ముట్టరాదు. వారు చేసిన హేయమైన కార్యములకు ఇది శిక్ష.

14. దేవళమున జరుగు పనులన్నింటిని నిర్వహించుచు దానిని కాపాడు వారినిగ నేను వారిని నియమించుచున్నాను.

15. ఇతర యిస్రాయేలీయులు నన్ను విడనాడి నప్పుడు కూడ లేవీ తెగకు చెందిన సాదోకు వంశజు లగు యాజకులు నా దేవళమున నన్ను భక్తితో కొలిచిరి. కావున ఇప్పుడు వారే నా సన్నిధిలోనికి వచ్చి నన్ను సేవింతురు. నాకు బలిపశువుల క్రొవ్వును, నెత్తుటిని అర్పింతురు.

16. వారు మాత్రమే నా దేవళమున ప్రవేశించి నా బలిపీఠమును సమీపించి, నా ఆరాధనమును నిర్వహింపవచ్చును.

17. వారు దేవళమున అందలి లోపలి ఆవరణ ద్వారమును ప్రవేశింపగానే నారబట్ట ధరింపవలెను. లోపలి ఆవర ణమున గాని, దేవాలయమునగాని పరిచర్య చేయు నపుడు వారు ఉన్నిబట్టలను తాల్చరాదు.

18. అవిసె నార పాగాలను ధరించి, నడుములకు జనుప నార వస్త్రములను కట్టుకొనవలయును. చెమటను పుట్టించు ఏ వస్త్రములను వారు ధరింపరాదు.

19. వారు జనులు ప్రోగగు వెలుపలి ఆవరణములోనికి పోవుటకు ముందే నివేదిత వస్త్రములను తీయకపోవుటచేత ప్రజలకు శాపము తెప్పింపకుండునట్లు, తాము దేవాలయమున పరిచర్య చేయునపుడు తాల్చిన ఆ నివేదిత వస్త్రములను తొలగించి వానిని పవిత్రమైన గదులలో పెట్టి, సామాన్యదుస్తులను ధరించి బయటికి వెళ్ళవలెను.

20. యాజకులు తల బోడి చేయించుకోరాదు. జుట్టు పొడవుగా పెంచుకోరాదు. దానిని తగుమాత్రముగా ఉంచుకోవలెను.

21. వారు లోపలి ఆవరణము లోనికి పోవునపుడు మద్యమును సేవింపరాదు.

22. వారు వితంతువునుగాని, విడాకులు పొందిన ఉవిదను గాని పెండ్లియాడరాదు. యిస్రాయేలు కన్యలను, యాజకుల వితంతువులను మాత్రమే పరిణయమాడ వచ్చును.

23. ఏది నివేదితమైనదో ఏది నివేదితమైనది కాదో, ఏది పవిత్రమైనదో ఏది పవిత్రముకానిదో యాజకులు నా ప్రజలకు బోధింపవలెను.

24. ప్రజలకు తగాదాలు వచ్చినపుడు వారు నా నియమము లను అనుసరించి తీర్పుచెప్పవలెను. నా నియమముల ప్రకారము ఉత్సవములు జరుపవలెను. విశ్రాంతి దినమును పవిత్రముగా గడపవలెను.

25. యాజకులు శవములను తాకి అశుద్దులు కారాదు. తల్లిదండ్రుల, తనయుల, సోదరుల, అవి వాహితులైన సోదరీల శవములను మాత్రము తాక వచ్చును.

26. వారు మైలనుండి శుద్ధినిపొందుటకు ఏడునాళ్ళు ఆగవలెను.

27. అటుపిమ్మట దేవాలయమందలి లోపటి ఆవరణములోనికి పోయి పాపపరిహారబలిని అర్పింపవలెను. అటుతరువాత వారు దేవాలయమున ఆరాధ నమును నిర్వహింపవచ్చును. ఇదియే యావే ప్రభుడనైన నా వాక్కు,

28. ప్రభుడనైన నేనే యాజకులకు వారసత్వము. యాజకుల వారసత్వము ఇదియే. యిస్రాయేలీయులలో వారికి ఎంతమాత్రమును ఆస్తిని ఇవ్వరాదు. నేనే వారికి ఆస్తి.

29. వారు ధాన్యబలులను, పాపపరిహార బలిమాంసమును, ప్రాయశ్చిత్త బలి మాంసములను భుజింతురు. యిస్రాయేలీయులు నా కొరకు నివేదించిన వస్తువులెల్ల వారివే అగును.

30. ఆ ప్రజలు ప్రథమఫలములుగా నాకు అర్పించు వానిలో శ్రేష్ఠమైనవియు, వారు అర్పించు ఇతర పదార్ధములును యాజకులవే అగును. ప్రజలు రొట్టెలు కాల్చుకొనునపుడెల్ల మొదటిదానిని యాజకులకు అర్పింపవలెను. అప్పుడు ఆ ప్రజల కుటుంబములకు నా దీవెనలు లభించును.

31. యాజకులు పక్షులలోనేమి, పశువులలోనేమి వానియంతట అవియే చనిపోయిన వానిని లేక ఇతర జంతువులు చంపినవానిని భుజింపరాదు.”

Text Example

1. “మీరు ఓట్లు వేసి, ఒక్కొక్క తెగకు భూమిని పంచి ఇచ్చినపుడు ప్రతిష్ఠిత అర్పణముగా ఒక భాగమును దేవునికి అర్పింపవలెను. అది ఇరువది ఐదువేల మూరల పొడవును, ఇరువదివేల మూరల వెడల్పు నుండవలెను. ఆ భాగమంతయు పవిత్రమైన నేలయగును.

2. ఈ నేలలో ఐదువందల మూరల నలుచదరపు భాగము దేవాలయమునకు వినియోగింపబడును. దాని చుట్టును ఏబది మూరల వెడల్పు గల ఖాళీస్థలముండవలెను.

3. ప్రభువునకు నివేదించిన నేల మొత్తములో సగభాగము అనగా ఇరువది ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పుగల నేలను ప్రత్యేకింపవలెను. అందులో మహాపవిత్రస్థలము, పవిత్ర స్థలములుండును.

4. అది దేశమున పవిత్రభూమి యగును. దేవాలయమున ప్రభువు నర్చించు యాజకులు దానిని వాడుకొందురు. దానిలో గృహములును దేవాలయ మునకు ఉద్దేశింపబడిన భూమియునుండును.

5. మిగిలిన సగభాగము దేవాలయమున ఊడిగము చేయు లేవీయులకు చెందును. అచట వారు వసించు టకు నగరములుండును.

6. ఈ దేవుని భాగమునకు ప్రక్కన మరియొక భాగమును విభజింపవలెను. యిస్రాయేలీయులెవరైనను వసించుటకు దానిలో ఒక నగరముండును. దాని పొడవు ఇరువది ఐదువేల మూరలు, వెడల్పు ఐదువేల మూరలు.

7. రాజునకుకూడా ఒక భాగము విభజింపవలెను. అది రెండు ప్రక్కలను అనగా పవిత్ర భూమి నానుకుని ఒకప్రక్కను మరియు తూర్పు పడమడరలుగా నగర భాగము నానుకొని మరియొకప్రక్కను విస్తరించి ఉండవలెను. దాని పొడవు యిస్రాయేలీయుల ఒక తెగకు లభించు భాగమునకు సమానముగ నుండును.

8. యిస్రాయేలు దేశమున ఈ భాగమును రాజు తీసికొనును. కనుక అతడు ప్రజలను పీడింపడు. మిగిలిననేలయిస్రాయేలులోని ఆయా తెగలకు దక్కును.

9. యావే ప్రభువు ఇట్లనెను: యిస్రాయేలు రాజులారా! మీరు చేసిన పాపములు చాలును. ఇక మీరు హింసను, పీడనమును మానుడు. నీతిన్యాయములను పాటింపుడు. ఇకమీదట మీరు నా ప్రజలను దేశము నుండి వెళ్ళగొట్టరాదు. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు.

10. ఎల్లరును న్యాయమైన త్రాసులను, కొలమానములను, పడికట్టురాళ్ళను వాడవలెను.

11. ఘనపదార్థములను కొలుచు పడి, ద్రవపదార్దములను కొలుచు తూము సమానముగా నుండవలెను. పందుమును సామాన్య పరిమాణముగా నెంచుడు. కావున ఒక తూము పందుములో పదియవ వంతు.

12. మీ పడికట్టురాళ్ళు ఇట్లుండవలెను. ఒక తులము 20 చిన్నములు, 60 తులములు అరవీసె.

13-15. మీరు అర్పించు బలులకు నియమములివి. మీకు పండినపంటలో అరువదియవవంతు గోధుమలను, అరువదియవవంతు యవలను చెల్లింపుడు. మీకు లభించు ఓలివుతైలములో నూరవవంతు చెల్లింపుడు. పదితూములు ఒక పందుమగును. మీ పొలములోని ప్రతి రెండువందల గొఱ్ఱెలకును ఒకటి చొప్పున సమర్పింపుడు. మీరు ధాన్యబలులను, దహన, సమాధానబలులకు వలయు పశువులను కొనిరండు. దానివలన మీ పాపములు పరిహార మగును. ఇది యావే ప్రభుడనైన నా శాసనము.

16. దేశ ప్రజలెల్ల ఈ అర్పణములను రాజు వద్దకు కొనిరావలెను.

17. అమావాస్య పండుగ లందును, ఇతర ఉత్సవములందును, విశ్రాంతిదినము లందును దహనబలులను, ధాన్యబలులను, పానీయార్పణములను యిస్రాయేలీయులందరి కొరకు అర్పించుట అతని బాధ్యత. ప్రజల పాపముల పరి హారమునకుగాను అతడు ప్రాయశ్చిత్త బలులను, ధాన్య బలులను, దహన, సమాధానబలులను అర్పింపవలెను.

18. ప్రభువు ఇట్లనెను: మీరు మొదటి నెల మొదటి రోజున ఎట్టి లోపములేని కోడెను బలి యిచ్చి దేవాలయమును శుద్ధిచేయవలెను.

19. పాపపరిహార బలిగా అర్పించు ఈ కోడె నెత్తుటిని యాజకుడు కొంచెము తీసికొని మందిరపు ద్వారబంధములకును, బలిపీఠమునాలుగు కొమ్ములకును, లోపలి ఆవరణము ద్వారబంధములకును పూయవలెను.

20. ఎవరైన అజ్ఞానమువలనగాని, అనాలోచితముగాగాని పాప ములు చేసినచో వాని పరిహారము కొరకుకూడ నెల ఏడవనాడు మీరు ఈ రీతినే చేయవలెను. ఈ విధముగా మీరు దేవాలయమున ప్రాయశ్చిత్తము చేయుదురు.

21. మొదటి నెల పదునాలుగవ దినమున మీరు పాస్కాపండుగను ప్రారంభింపవలెను. ఎల్లరును ఏడునాళ్ళపాటు పులిపిడి ద్రవ్యము కలుపని రొట్టెలను భుజింపవలెను.

22. ఉత్సవము మొదటిదినమున రాజు తన పాపములును, ప్రజల పాపములును పరిహారమగుటకు కోడెను అర్పింపవలెను.

23. అతడు ఉత్సవము ఏడునాళ్ళ పొడవున ప్రతిదినమును ఎట్టి లోపములులేని ఎడ్లను ఏడింటిని, పొట్టేళ్ళను ఏడింటిని ప్రభువునకు దహనబలిగా అర్పింపవలెను. ఇంకను ప్రతిదినము ప్రాయశ్చిత్త బలిగా ఒక మేకపోతునుగూడ అర్పింపవలెను.

24. ఇంకను బలి ఇచ్చిన ప్రతి ఎద్దున కును, ప్రతి పొట్టేలునకు ఒక తూము పిండిపట్టిన ధాన్యమును, మూడుపడుల ఓలివుతైలమును అర్పింపవలెను.

25. ఏడవ నెల పదిహేనవదినమున ప్రారంభమగు గుడారముల పండుగలోకూడ రాజు ఏడు దినములపాటు ప్రతిరోజు పై విధముననే పాప పరిహార బలిని ధాన్యతైలార్పణములను అర్పింపవలెను.”

Text Example

1. యావే ప్రభువిట్లనెను: “లోపలి ఆవరణపు తూర్పుద్వారమును పనిచేయు ఆరుదినములు మూసియుంచవలెను. కాని విశ్రాంతిదినములందును, అమావాస్య పండుగలందును దానిని తెరచియుంచవలెను.

2. రాజు వెలుపలి ఆవరణములోనుండి ద్వారపు గది వసారా గుండా వెళ్ళి, యాజకులు అతని దహనబలులను, సమాధానబలులను అర్పించుచుండగా అతడు ద్వారబంధముల వద్ద నిలుచుండును. అతడు ద్వారమువద్దనే ప్రభువును ఆరాధించి తిరిగిపోవును. ఆ సాయంకాలమువరకు ఆ ద్వారమును మూయరాదు.

3. విశ్రాంతిదినములందును, అమా వాస్య పండుగలందును ప్రజలు ప్రవేశద్వారము నెదుట శిరమువంచి దేవుని ఆరాధింపవలెను.

4. విశ్రాంతిదినములందు రాజు దహనబలికిగాను గొఱ్ఱెపిల్లలను ఆరింటిని, పొట్టేలిని ఒక దానిని కొనిరావలెను. వానికెట్టి లోపమును ఉండరాదు.

5. అతడు ఒక్కొక్క పొట్టేలితోపాటు తూము ధాన్యమును, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో పాటు తన శక్తి కొలది ధాన్యమును కొనిరా వలెను. ఒక్కొక్క తూము ధాన్యముతోపాటు మూడు బానల ఓలివుతైలమునుగూడ కొనిరావలెను.

6. అమావాస్య పండుగనాడు అతడు ఒక కోడెను, ఆరు గొఱ్ఱెపిల్లలను, ఒక పొట్టేలిని అర్పింపవలెను. వానికెట్టి లోపమును ఉండరాదు.

7. అతడు ఒక్కొక్క కోడెతో పాటు, ఒక్కొక్క పొట్టేలితో పాటు తూము ధాన్యమును, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో పాటు తనకిష్టమైనంత ధాన్యమును అర్పింపవలెను. మరియు ఒక్కొక్క తూము ధాన్యముతో పాటు మూడు పడుల ఓలీవు తైలమునర్పింపవలెను.

8. అతడు వసారాగది నుండి బయలుదేరి తాను లోనికి వచ్చిన ద్వారముగుండనే వెలుపలికి పోవలెను.

9. ఆయా పండుగలలో ప్రభువును ఆరాధించుటకు వచ్చినపుడు ఉత్తరద్వారముగుండ లోనికి వెళ్ళిన వారు, దక్షిణద్వారముగుండ బయటికి వెళ్ళిపోవలెను. దక్షిణద్వారముగుండ లోనికి వెళ్ళినవారు, ఉత్తర ద్వారముగుండ బయటికి వెళ్ళిపోవలెను. ఎల్లరును తాము ప్రవేశించిన ద్వారముగుండగాక దానికి అభిముఖముగానున్న ద్వారముగుండ తిరిగిపోవలెను.

10. రాజు ప్రజలతో కలిసి ప్రవేశింపగ వారు ప్రవేశించుదురు. వారు వెళ్ళిపోయినపుడు అందరును కూడి బయటకు వెళ్ళిపోవును.

11. పండుగదినములలోను, నియమితదినములలోను భక్తులు ప్రతి కోడెకును, పొట్టేలికిని తూము ధాన్యపు పిండి చొప్పున అర్పింప వలెను. వారు ప్రతి గొఱ్ఱెపిల్లతో పాటు తమకిష్టము వచ్చినంత ధాన్యమును అర్పింపవచ్చును. ప్రతి తూము ధాన్యపుపిండికిని మూడు పడుల ఓలివు తైలమును అర్పింపవలెను.

12. రాజు తనంతట తాను దహన బలిని గాని, సమాధానబలినిగాని అర్పింపకోరినపుడు అతనికొరకు లోపలి ఆవరణములోని తూర్పుద్వారమును తెరువవలెను. అతడు విశ్రాంతిదినములందువలె బలినర్పించును. అతడు వెళ్ళిపోయిన తరువాత ద్వారమును మూయవలెను.

13. ప్రతిదినము ఉదయము ఎట్టి లోపమునులేని ఏడాది గొఱ్ఱెపిల్లను ప్రభువునకు దహనబలిగా అర్పింపవలెను. ప్రతిరోజు దానిని అర్పింపవలెను.

14. మరియు ప్రతి ఉదయము తూమున ఆరవ వంతు పిండిని సమర్పింపవలెను. దానిని పిసుకుటకు ఒక పడి ఓలివుతైలము అర్పింపవలెను. ఈ సమర్పణము గూర్చిన నియమములు శాశ్వతముగా అమలులో ఉండును.

15. కలకాలము వరకును ప్రతి ఉదయము గొఱ్ఱపిల్లను, పిండిని, ఓలివుతైలమును ప్రభువునకు అర్పింపవలెను.

16. యావే ప్రభువిట్లనెను: రాజు తన భూమిలో కొంతభాగమును తన కుమారులకు బహుమతిగా ఇచ్చెనేని అది వారికి శాశ్వతముగా భుక్తమగును.

17. కాని అతడు తన భూమిలో కొంతభాగమును తన సేవకులకిచ్చెనేని, విమోచన సంవత్సరము వచ్చినపుడు అది మరల రాజునకే చెందును. అది అతనిది. కనుక అతడు, అతని పుత్రులు మాత్రమే దానిని శాశ్వతముగా భుక్తము చేసికోవచ్చును.

18. ప్రజలకు వారసత్వముగా వచ్చిన భూమిని రాజు స్వాధీనము చేసికోరాదు. అతడు తన సొంత భూమినే తన కుమారులకు పంచి పెట్టవలెను. అతడు జనులు తమ వారసత్వమును అనుభవింపనీయక వారి భూమిని తీసికొని వారిని పీడింపరాదు.”

19. తరువాత అతడు నన్ను లోపలి ఆవరణములో దక్షిణ దిక్కునందలి ద్వారమునకు ఎదురుగా నున్న గదుల ముంగిటికి కొనిపోయెను. ఇవి యాజకులు ఉపయోగించుకొను పవిత్రమైన గదులు. అతడు ఆ గదులకు పశ్చిమముననున్న గదులను నాకు చూపించి,

20. ఇచట యాజకులు పాపపరిహార బలిగాను, ప్రాయశ్చిత్తబలిగాను వధించిన పశువుల మాంసమును వండుదురు. భక్తులర్పించిన పిండిని కాల్చి రొట్టెలు చేయుదురు. కనుక పవిత్ర వస్తువేదియు వెలుపలి ఆవరణములోనికి పోయి ప్రజలకు హాని చేయదు” అని చెప్పెను.

21-22. అంతట అతడు నన్ను వెలుపలి ఆవరణములోనికి కొనిపోయి, దాని నాలుగు మూలలందును నాలుగు చిన్న ఆవరణములను చూపించెను. అవి ఒక్కొక్కటి నలుబది మూరల పొడవు ముప్పది మూరల వెడల్పు ఉండెను.

23. వానిలో ప్రతిదాని చుట్టును రాతిగోడవరుస కలదు. ఆ గోడవరుసలనానుకొని చుట్టు అడుగుభాగమున పొయ్యిలు కలవు. వంటగదులు కలవు.

24. దేవాలయమున ఊడిగము చేయువారు ఆ వంటగదులలో ప్రజలర్పించు బలిపశువుల మాంసమును వండుదురు అని అతడు నాతో చెప్పెను.

Text Example

1. అతడు నన్ను మరల దేవళము గుమ్మము నొద్దకు కొనివచ్చెను. దేవళము తూర్పుముఖముగా నుండెను. దేవళముగడప క్రిందినుండి నీరువూరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచితిని. ఆ జలము దేవళము కుడి ప్రక్కన బలిపీఠమునకు దక్షిణపు ప్రక్కగా క్రిందికి పారుచుండెను.

2. అతడు నన్ను దేవాలయ ఆవరణమునుండి ఉత్తరద్వారము గుండ వెలుపలికి చుట్టును కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసికొనిపోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను.

3. అతడు తన కొలతకఱ్ఱతో కాలువను తూర్పు వైపునకు వేయిమూరలు వరకు కొలిచెను. అచటనున్న నీటిగుండ నన్ను దాటించెను. అచట నీళ్ళు నా చీలమండలము వరకు మాత్రమే వచ్చెను.

4. అతడు మరల వేయిమూరల దూరము కొలిచి అచట నాచే నీటిని దాటించెను. అక్కడ నీళ్ళు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరల వేయిమూరల దూరము కొలిచి అక్కడ నన్ను నీళ్ళను దాటింపగా, నీళ్ళు నా నడుము వరకు వచ్చెను.

5. అతడు మరల వేయిమూరల దూరము కొలిచెను. కాని అచట ఏరు , చాల లోతుగానుండి దాటుట అసాధ్యమయ్యెను. నేను ఈదిననే గాని అచట ఏటిని దాటజాలనైతిని.

6. అతడు నాతో” నరపుత్రుడా! దీనిని జాగ్రత్తగా గమనింపుము” ; అనెను. అతడు నన్ను మరల ఏటి ఒడ్డునకు కొనిపోయెను.

7. నేనచటికి చేరుకొని ఏటికిరువైపుల చాల వృక్షములుండుట చూచితిని.

8. అతడు నాతో ఇట్లనెను: , “ఈ నీళ్ళు తూర్పుదిక్కుగా ప్రవహించి యోర్దాను లోయనుచేరి అచటనుండి మృతసముద్రమున కలియును. వీనివలన దానిలోని ఉప్పునీళ్ళు మంచినీళ్ళగును.

9. ఈ నీళ్ళు పారిన తావులందెల్ల వివిధ జంతువులు, చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృతసముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్ల జీవము నెలకొనును.

10. ఎంగెది చెలమల నుండి ఎనెగ్లాయిము ఊటలవరకును సముద్రపుటాడున బెస్తలు సంచరింతురు. ఆ తావున వారు తమ వలలను ఆరబెట్టుకొందురు. అచట మధ్యధరాసముద్రమున దొరికినన్ని చేపలు దొరకును.

11. కాని అచటి ఒడ్డుననున్న కుంటలలోను, బురద గుంటలలోను ఉన్న జలములు మంచినీళ్ళుగా మారవు. అవి ఉప్పునీళ్ళుగానే ఉండి, ఉప్పు చేయుటకు ఉపయోగపడును.

12. ఆ ఏటి యొడ్డులపై అన్నిరకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులువాడవు. అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయమునుండి పారు ఏరు వానికి నీరందించును. కనుక అవి ప్రతినెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును, ఆకులు ఔషధమునకును ఉపయోగపడును.”

13. యావే ప్రభువు ఇట్లనెను: “మీరు పండ్రెండు తెగలకును వారసత్వముగా పంచి ఈయవలసిన భూమి ఎల్లలు ఇవి. యోసేపు తెగకు రెండువంతులు రావలెను.

14. ప్రతియొక్కడు దానిలో ఏ బేధము లేకుండ తన వారస ఆస్తిని కలిగియుండును. ఎందుకన నేను నా హస్తమును పైకెత్తి ప్రమాణము చేయుచూ దానిని మీ పితరులకు దత్తముచేసితిని. అందుచేత ఈ దేశము మీకు వారసఆస్థిగా నుండవలెను.

15. ఈ దేశపు ఎల్లలివి: ఉత్తరమున మహా సముద్రము నుండి హెత్లోను దిశగా లెబోహాయారు, సేదాదు,

16. బెరౌతా, దమాస్కు హామాతు ప్రాంతముల మధ్యనున్న సిబ్రాయిము, హౌరాను పర్వతముల మీదనున్న హాసారుఏనోను వరకు ఉన్నభాగము.

17. అందుచేత ఈ సరిహద్దు సముద్రము మొదలుకొని హాసారుఏనోను వరకు ఉన్న స్థలము. దమాస్కు సాఫోను, హామాతు ప్రాంతములు దీనికి ఉత్తరముగా నుండును. ఇది ఉత్తరపు సరిహద్దు.

18. తూర్పుదిశన యోర్దాను నది గిలాదుకును యిస్రాయేలు దేశమునకును మధ్యగా హౌరాను పర్వతములకు దమాస్కునకు మధ్యనున్న హాసారు ఏనోను మొదలుకొని తూర్పుదిశన ఉన్న సముద్రము, తామారు వరకు ఈ సరిహద్దు ఉండును. ఇది తూర్పు సరిహద్దు.

19. దక్షిణపు సరిహద్దు నెగెబులో ఉండును. తామారు మొదలుకొని మెరిబా, కాదేషు జల ఊటల వరకును, మహాసముద్రములోనికి పారుచున్న వాగు వరకును ఉండును. ఇది నెగెబులో దక్షిణపు సరిహద్దు.

20. పశ్చిమమున మహాసముద్రము లెబోహమాతు వరకు సరిహద్దుగా నుండును. ఇది పశ్చిమ సరిహద్దు.

21. మీరు ఈ భూమిని మీ తెగలకు పంచి యిండు.

22. ఇది మీకు శాశ్వతముగా భుక్తమగును. మీ మధ్య వశించుచు సంతానమును కనిన అన్యజాతి వారికి కూడ మీరు ఈ నేలను పంచి యీయవలయును. మీరు వారిని యిస్రాయేలు పౌరునివలె గణింపవలయును. యిస్రాయేలు తెగలకువలె వారికి కూడ చీట్లు వేసి నేలను పంచిపెట్టవలయును.

23. ప్రతి అన్యజాతి పౌరుడును తాను ఏ తెగతో వశించునో ఆ తెగపౌరులతో పాటు తన వాటాను స్వీకరించును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు”

Text Example

1. తెగల పేరులివి: “ఉత్తరమున హామాతు మార్గమును హెత్లోనుకు పోవు సరిహద్దువరకును, హాసారుఏనోను అను దమస్కు సరిహద్దువరకును హామాతు సరిహద్దు మార్గమున వ్యాపించి తూర్పు నుండి పడమర వరకు దాను భాగముండును.

2. దాను సరిహద్దును ఆనుకొని తూర్పు నుండి పడమర వరకును ఆషేరు భాగముండును.

3. ఆషేరు సరిహద్దును ఆనుకొని, తూర్పునుండి పడమరవరకును నఫ్తాలి భాగముండును.

4. నఫ్తాలీ సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పడమర వరకును మనష్షే భాగముండును.

5. మనష్షే సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పడమరవరకును ఎఫ్రాయీము భాగముండును.

6. ఎఫ్రాయీము సరిహద్దును ఆనుకొని తూర్పు నుండి పడమరవరకును రూబేను భాగముండును.

7. రూబేను సరిహద్దును ఆనుకొని తూర్పు నుండి పశ్చిమము వరకును యూదాభాగముండును.

8. యూదా సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పడమర వరకును వ్యాపించియున్న భూమి మీరు ప్రభువునకు నివేదించు ప్రతిష్ఠితస్థలము. అది ఇరువది ఐదువేల మూరల వెడల్పును కలిగియుండి, తక్కిన భాగములవలెనె తూర్పు నుండి పడమర వరకు నిడివి కలిగియుండును. దీని మధ్యన వవిత్రస్థలము ఉండవలయును.

9. మీరు దేవునికి నివేదించు స్థలము ఇరువది ఐదువేల మూరల పొడవును, పదివేల మూరల వెడల్పును కలిగియుండును.

10. ఈ పవిత్రస్థలమును ఈ విధముగా విభజింపవలయును. ఒక భాగము యాజకులపరము కావలయును. అది ఉత్తరమున ఇరువది ఐదువేల మూరల పొడవును, పశ్చిమము, తూర్పులందు పదివేల మూరల వెడల్పును, దక్షిణమున ఇరువది ఐదువేల మూరల పొడవును ఉండును. ప్రభువు మందిరము ఈ నేలనడుమన ఉండును.

11. ఈ పవిత్ర స్థలము సాదొకు వంశజులైన యాజకులకు చెందును. లేవీ తెగలవారివలె వారు దుష్కార్యములు చేసిన యిస్రాయేలీయులతో చేతులు కలపక నన్ను విశ్వాసముతో సేవించిరి.

12. కనుక వారికి ప్రతిష్ఠిత స్థలమునందు లేవీయుల సరిహద్దు దగ్గర ఒక ప్రత్యేక భాగముండవలయును. అది అన్నింటికంటె పవిత్రమైన భాగము.

13. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకును ఒక భాగముండును. అది ఇరువది ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పు ఉండవలయును.

14. అది యావేకు ప్రతిష్ఠితమైన భూమి కనుక దానిలో ఏమాత్రపు భాగమునైనను వారు అమ్మకూడదు. మారకము చేయరాదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింప నీయకూడదు.

15. ఇరువది ఐదువేల మూరల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన ఐదువేలమూరల నేల పవిత్రమైనది కాదు. ప్రజలు దానిని ఇండ్లు, బీళ్ళు మొదలైన సామాన్య అవసరములకు వాడుకోవచ్చును. దాని నడుమ ఒక పట్టణముండును.

16. దాని పరిమాణ వివరమేదనగా: ఉత్తరదిక్కున నాలుగు వేల ఐదువందల మూరలు, దక్షిణ దిక్కున నాలుగువేల అయిదువందల మూరలు, తూర్పుదిక్కున నాలుగువేల అయిదువందల మూరలు, పడమటి దిక్కున నాలుగువేల అయిదు వందల మూరలు.

17. పట్టణమునకు చేరిన ఖాళీస్థలము ఉత్తరపు వైపున రెండు వందల ఏబది మూరలు, దక్షిణపు వైపున రెండు వందల ఏబది మూరలు, తూర్పు వైపున రెండు వందల ఏబది మూరలు, పడమటి వైపున రెండు వందల ఏబది మూరలు.

18. ప్రతిష్ఠితస్థలమునకు ఆనుకొని మిగిలియున్న భూమిని పట్టణములో కష్టించి జీవించువారు వ్యవసాయమునకు వాడుకొందురు. అది తూర్పు వైపున పదివేల మూరలు పొడవు, పడమట వైపున పదివేల మూరల పొడవు,

19. పట్టణవాసులు ఏ తెగవారైనను దానిలో కష్టించి సేద్యము చేసికోవచ్చును.

20. ప్రతిష్ఠిత భూమియంతయు ఇరువది ఐదువేల మూరల చతురస్రముగానుండును. దీనిలో ఒక చతురస్రాకారస్థలము నగరమునకు ఏర్పాటు చేయవలయును.

21. ప్రతిష్ఠిత స్థానమునకును, నగరమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరుప్రక్కల మిగిలియున్న భూమిని అనగా తూర్పుదిశన ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన ఇరువది ఐదువేల మూరలు, అదే విధముగా పడమటిదిశన ఏర్పడిన ఇరువది ఐదువేల మూరలు గల భూమిని, తెగలభాగమును ఆనుకొని యున్న భూభాగము అధిపతిదగును. ప్రతిష్ఠిత స్థానమును, దేవాలయమునకు నివేదింపబడిన స్థానము దానికి మధ్యగానుండును.

22. తూర్పు పడమరలుగా అధిపతి ఆస్తికి మధ్య లేవీయుల ఆస్తి మరియు నగరపు ఆస్తి యుండును. యూదీయుల సరిహద్దునకును మరియు బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న, లేవీయుల వారసత్వభూమి మరియు నగరమునకు ఏర్పాటైన భూమిని ఆనుకొనియున్న భూమిలో అధిపతి భూమియుండును.

23. మిగిలినయున్న తెగల భాగములు: తూర్పు నుండి పశ్చిమము వరకు బెన్యామీనీయులకు ఒక భాగము.

24. బెన్యామీను సరిహద్దును ఆనుకొని తూర్పు నుండి పశ్చిమము వరకు షిమ్యోను భాగము ఉండును.

25. షిమ్యోను సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పశ్చిమమువరకు యిస్సాఖారు భాగముండును.

26. యిస్సాఖారు సరిహద్దునానుకొని తూర్పునుండి పశ్చిమమువరకు సెబూలోను భాగముండును.

27. సెబూలోను సరిహద్దును ఆనుకొని తూర్పునుండి పశ్చిమమువరకు గాదు భాగముండును.

28. గాదు సరిహద్దును ఆనుకొని దక్షిణపు సరిహద్దు నెగెబులో ప్రవేశించును. అది తామారు నుండి కాదేషు చెలమ వరకును పోవును. వాయవ్య దిక్కున ఐగుప్తు పొలిమేరలనుండి మధ్యధరా సముద్రము వరకును పోవును.

29. మీరు ఆయా తెగలకిట్లు భూమిని ఓట్లు వేసి పంచియీయగా వారు తమ భాగములను భుక్తము చేసికొందురు” ఇది ప్రభుడనైన నా వాక్కు

30-31. “యెరూషలేమునకు పన్నెండు ద్వారములుండును. ఇవి నగరములోనుండి నిష్క్రమించుటకు మార్గములు. నగరద్వారములు యిస్రాయేలు తెగల పేర్లు కలిగియుండును. నాలుగువేల ఐదు వందల మూరల పొడవు గల ఉత్తరదిశన మూడు ద్వారములు అనగా రూబేను ద్వారము, యూదా ద్వారము, లేవీ ద్వారమును,

32. నాలుగువేల ఐదువందల మూరల పొడవుగల తూర్పుదిశన మూడు ద్వారములు అనగా, యోసేపు ద్వారము, బెన్యామీను ద్వారము, దాను ద్వారమును,

33.నాలుగువేల ఐదువందల మూరల పొడవు గల దక్షిణదిశన మూడు ద్వారములు అనగా షిమ్యోను ద్వారము, యిస్సాఖారు ద్వారము, సెబూలోను ద్వారమును,

34. నాలుగువేల ఐదువందల మూరల పొడవుగల పశ్చిమదిశన మూడు ద్వారములు అనగా గాదు ద్వారము, ఆషేరు ద్వారము, నఫ్తాలీ ద్వారములుండును.

35. నగరము చుట్టుకొలత పదునెనిమిది వేల మూరలుండును. ఇక మీదట నగరమునకు 'ప్రభువు ఇచటనున్నాడు' అని పేరు పెట్టవలయును.”