ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 32

 1. రూబేను, గాదు తెగలవారు పెద్ద పెద్ద పశువుల మందలను సంపాదించిరి. యాసేరు, గిలాదు మండలములు పశువుల మందలను పెంచుటకు అనుకూలముగా నుండెను.

2. కనుక ఈ తెగలవారు మోషేను, యాజకుడైన ఎలియెజెరును, యిస్రాయేలు ప్రధానులను సమీపించి, 

3-4. "అటారోతు, దీబోను, యాసేరు, నిమ్రా, హేష్బోను, ఎల్యాలె, సేబోము, నేబో, బెయోను అను పట్టణములతో గూడిన ఈ మండలమును ప్రభువు అనుగ్రహమువలన మనము జయించితిమిగదా! ఈ సీమ పశువులను పెంచుటకు అనుకూలముగానున్నది. మాకు పెక్కు పశువుల మందలు కలవు.

5. మీకు మాపై కటాక్షము కలదేని యోర్దానునది ఆవలిదరికి మమ్ము దాటింపక మీ దాసులమైన మాకు ఈ నేల స్వాస్థ్యముగా ఇప్పింపుడు” అని అనిరి.

6. కాని మోషే వారితో “మీ సోదరులు యుద్ధమునకు పోగా మీరిక్కడనే ఉండిపోవచ్చునా?

7. ప్రభువు అనుగ్రహించిన సీమకు చేరకుండ మీరు యిస్రాయేలీయులను నిరుత్సాహపరచెదరా ఏమి?

8. నాడు నేను కాదేషు బార్నెయానుండి మీ పితరులను క్రొత్త దేశమునకు వేగులుగా పంపగా వారును అట్లే చేసిరి.

9. వారు ఏష్కోలు లోయవరకు వెళ్ళి వేగు చూచి వచ్చిరి. కాని వారు తిరిగివచ్చిన తరువాత మన ప్రజలను ప్రభువిచ్చిన సీమకు చేరనీయకుండ నిరుత్సాహపరచిరి.

10-11. కనుక ఆనాడు ప్రభువు ఉగ్రుడై ఐగుప్తునుండి వెడలివచ్చినవారిలో ఇరువది యేండ్లు మరియు అంతకు పైబడిన వారెవరు నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులకు వాగ్దానము చేసిన నేలకు చేరజాలరు. వారు నా ఆజ్ఞలను పాటింపరైరి' అని ఒట్టు వేసెను.

12. కెనిస్సీయుడైన యెఫున్నె కుమారుడు కాలెబు, నూను కుమారుడగు యెహోషువ మాత్రమే ప్రభువు ఆజ్ఞను పాటించిన వారు.

13. ప్రభువు మన ప్రజలపై కోపించి వారు నలువది యేండ్లపాటు ఈ ఎడారిలో తిరుగాడునట్లు చేసెను. ఆ విధముగా ప్రభువు ఆజ్ఞ మీరిన ఆ తరము వారందరును నశించిరి.

14. ఇప్పుడు పాపసంతతియగు మీరును మీ పితరులకు బదులుగా బయలుదేరి వచ్చితిరి. మీ పాపమువలన ప్రభువు కోపాగ్ని ఈ యిస్రాయేలు ప్రజలపై మరల రగుల్కొనును.

15. ఇప్పుడు మీరు ప్రభువును అనుసరింపలేని ప్రభువు మరల మన ప్రజలందరిని ఈ ఎడారిలోనే వదలివేయును. వారి వినాశనమునకు మీరు కారకులు అగుదురు” అనెను.

16. ఆ మాటలకు వారు మోషేతో “మేమిచట మా మందలకు దొడ్లు కట్టుకొందుము. మా బిడ్డలకు పట్టణములు నిర్మించుకొందుము.

17. అటు తరువాత మేము యిస్రాయేలీయులతో పాటు యుద్ధమున పాల్గొందుము. వారు ప్రభువు అనుగ్రహించిన దేశమును చేర్చువరకు మేము వారి ముందరసాగి యుద్ధము చేసెదము. అంతవరకు మా బిడ్డలు చీకుచింతలేకుండ ఇచట మేము నిర్మించిన సురక్షిత పట్టణములలో వసింతురు. ఈ దేశప్రజల వలన వారికి బాధకలుగదు.

18. మిగిలిన యిస్రాయేలీయులందరు వారి వారి భాగములను స్వాధీనము చేసికొనువరకు మేము ఈ పట్టణములకు తిరిగిరాము.

19. యోర్దానునకు ఆవలివైపున మేము భాగము తీసికొనము. మాకు రావలసినదేదో ఈ నదికి తూర్పు వైపుననే లభించు చున్నదిగదా!” అని అనిరి."

20. మోషే వారితో “మీరు చెప్పినట్లే చేయుదురేని అనగా మీరు ప్రభువుపక్షమున యుద్ధము చేయుటకు అంగీకరించెదరేని ఇక విచారింపనక్కర లేదు.

21. మీయందు యుద్ధముచేయువారందరు యోర్దాను దాటి శత్రువులు మనకు లొంగిపోవువరకు ప్రభువు నాయకత్వము క్రింద పోరాడవలెను.

22. మొదట మనవారు ఆ నేలను స్వాధీనము చేసుకోవలెను. అటుపిమ్మట దేవుని ఎదుటను తోడి ప్రజల ఎదుటను మీ బాధ్యత తీరిపోవును గనుక, మీరు తిరిగిరావచ్చును. అపుడే యోర్దానునకు తూర్పుననున్న ఈ భాగమును మీ స్వాధీనము చేయుటకు ప్రభువు అంగీకరించును.

23. కాని మీరు మాట నిలబెట్టు కొనలేని ప్రభువునకు ద్రోహము చేసినవారు అగుదురు. మీ పాపమునకు మీరు తప్పక శిక్షను అనుభవింతురు.

24. కనుక మీరు కోరినట్లే ఇచట పట్టణములు, గొఱ్ఱెలదొడ్లు కట్టుకొనుడు. కాని మీ మాట దక్కించు కొనుడు” అని అనెను.

25. రూబేను, గాదు తెగలవారు మోషేతో “మేము నీ మాట చొప్పుననే నడచుకొందుము.

26. మా భార్యలు, పిల్లలు, మా పశువుల మందలు ఈ గిలాదు మండలమున వసించును.

27. మేమందరము ప్రభువు నాయకత్వమున యుద్ధమునకు పోవుటకు సంసిద్ధులమై ఉన్నాము. నీవు చెప్పినట్లే మేము యోర్ధాను దాటి శత్రువులతో పోరాడెదము” అనిరి.

28. కనుక మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియెజెరునకును, నూను కుమారుడగు యెహోషువ కును, యిస్రాయేలీయుల తెగలలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఈ ఉత్తరువు ఇచ్చెను:

29. “రూబేను, గాదు తెగలవారు ప్రభువు నాయకత్వమున యోర్దానునది దాటి యుద్ధమున పాల్గొందురేని, వారి తోడ్పాటున మీరు ఆ నేలను వశము చేసికొందురేని, అప్పుడు గిలాదు మండలమును వారికి భుక్తముగా ఇచ్చివేయుడు.

30. కాని వారు నదిని దాటి మీతో పాటు యుద్ధమున పాల్గొనరేని, మీతో పాటు వారికిని కనాను మండలముననే భాగము లభించును.”

31-32. రూబేను, గాదు తెగలవారు మోషేతో “అయ్యా! మేము ప్రభువు ఆజ్ఞాపించినట్లే చేసెదము. ప్రభువు నాయకత్వమున మేము కనాను మండలమునకు పోయి యుద్ధమున పాల్గొనెదము. తరువాతనే యోర్దానునకు తూర్పుననున్న ఈ భాగమును భుక్తము చేసుకొందుము”. అనిరి.

33. కనుక మోషే రూబేను, గాదు తెగలకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్ధతెగకు అమోరీయుల రాజగు సీహోను రాజ్యమును, బాషాను రాజగు ఓగు రాజ్యమును, ఆ రాజ్యములకు చుట్టుపట్లనున్న సీమలను, పట్టణములను ఇచ్చివేసెను.

34-36. గాదుతెగలవారు సురక్షిత పట్టణములగు దీబోను, అటారోతు, ఆరెయోరు, అట్రోత్తుషోఫాను, యాసేరు, యెగ్బేహాత్తు, బేత్నిమ్రా, బేత్హేరాను పునర్నిర్మించి మందలదొడ్లను కట్టుకొనిరి.

37-38. రూబేను తెగవారు హేష్బోను, ఎల్యాలే, కిర్యతాయీము, నేటో, బాల్మెయోను, సిబ్మా నగరములను నిర్మించిరి. (ఈ పేర్లు తరువాత మార్చబడెను. ) తాము తిరిగి నిర్మించు కొనిన పట్టణములకు వారు క్రొత్త పేర్లు పెట్టిరి.

39. మనష్షే పుత్రుడగు మాకీరు తెగవారు గిలాదు మండలమును ఆక్రమించుకొని అచట వసించు అమోరీయులను తరిమివేసిరి.

40. మోషే ఆ మండలమును మాకీరు తెగవారికీయగా వారచట వసించిరి.

41. మనష్షే తెగకు చెందిన యాయీరు వంశమువారు కొన్ని గ్రామములను ఆక్రమించుకొని వానికి యాయీరు గ్రామములని పేరిడిరి.

42. నోబా వెళ్ళి కేనాతును దానిచుట్టుపట్ల గ్రామములను ఆక్రమించుకొని వానికి 'నోబాహు ' అని తన పేరు పెట్టెను.