ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 30

 1. యిస్రాయేలు తెగనాయకులకు మోషే ప్రభువు కట్టడలను ఇట్లేరిగించెను:

2. “మీలో ఎవరైన ప్రభువునకు ఏదైనా సమర్పించెదనని మ్రొక్కుకొనిన యెడల లేక దేనినైన ప్రమాణముచేసిన యెడల అతడు తనమాట నిలబెట్టుకోవలెను.

3-4. ఒక స్త్రీ బాల్యమునందు తన తండ్రి ఇంట వసించుచున్నపుడు ప్రభువునకు మ్రొక్కుకొన్నయెడల ఆమె తీసుకొనిన ఈ బాధ్యతను గూర్చి తన తండ్రికి తెలియజేసినపుడు అతను విని ఊరుకొనినయెడల ఆ మ్రొక్కుబడి నిలుచును.

5. అటులకానిచో తండ్రి వినిన దినమందే ఏదైన అభ్యంతరములు కలిగించినయెడల, ఆమె తాను తీసుకొనిన ఆ బాధ్యత నిలువకపోవును. తండ్రి ఆ కన్య ఋక్కును నిరాకరించెను గనుక ప్రభువు ఆమెను మన్నించును.

6-7. తెలిసిగాని తెలియకగాని ఒక కన్య ప్రభువునకు మ్రొక్కుకొనవచ్చును. లేక ప్రమాణము చేయవచ్చును. కాని అటుపిమ్మట ఆమె వివాహము చేసికొన్నప్పటికి భర్త అడ్డుచెప్పనపుడు, తప్పక తన మాట నిలబెట్టుకోవలెను. 

8. కాని భర్త అడ్డుచెప్పినచో ఆమెమాట దక్కించుకోనక్కరలేదు. ప్రభువు ఆమెను మన్నించును.

9. విధవ లేక భర్త విడనాడిన స్త్రీ తాను పట్టిన మ్రొక్కుబడి నెరవేర్పవలెను. చేసిన ప్రమాణమును నిలబెట్టుకోవలెను.

10-11. వివాహితయైన స్త్రీ పట్టిన మ్రొక్కుబడిని గాని, చేసిన ప్రమాణముగాని వినిన దినమందే భర్త అడ్డుచెప్పనప్పుడు తప్పక నిలబెట్టుకోవలెను.

12. కాని భర్త అడ్డుచెప్పినచో ఆమె వానిని పాటింపనక్కర లేదు. భర్త ఆమె మ్రొక్కుబడులకు అడ్డుచెప్పెను గనుక ప్రభువు ఆమెను క్షమించును.

13. భార్య మ్రొక్కుబడులను, ప్రమాణములను కొనసాగించుటకుగాని, కొనసాగింపకుండుటకుగాని భర్తకు అధికారము కలదు.

14. కాని అతడు ఆమె మ్రొక్కుబడులను గూర్చిగాని, ప్రమాణములను గూర్చి గాని ఏమియు అనడేని, ఆమె వానిని పాటింపవలెను. అతడు అవరోధము చేయకుండుటచే అవి చెల్లునట్లు చేసెననియే భావింపవలెను.

15. కాని అతడు మొదటకాక కొంతకాలమైన తరువాత భార్య మ్రొక్కుబడులను, ప్రమాణములను కొనసాగనీయనియెడల తనభార్య మ్రొక్కుబడులను తీర్పని దోషమును తానే భరించును.

16. తండ్రి ఇంట వసించు కన్యగాని, భర్త ఇంట వసించు భార్య గాని పట్టిన మ్రొక్కుబడులను గూర్చి ప్రభువు మోషేకు ఇచ్చిన కట్టడలు ఇవియే.