ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 3

 1. సీనాయి కొండమీద దేవుడైన యావే మోషేతో మాట్లాడినపుడు మోషే, అహరోను కుటుంబములకు చెందినవారు వీరు:

2. అహరోనునకు నలుగురు కుమారులు. మొదట పుట్టినవాడగు నాదాబు, మిగిలినవారు అబీహు, ఎలియెజెరు, ఈతామారు.

3. వీరందరును యాజకులుగా అభిషిక్తులైరి.

4. సీనాయి ఎడారిలో ప్రభువునకు నియమ విరుద్ధముగా అగ్నిని సమర్పించినందులకు నాదాబు, అబీహులు ప్రాణములు కోల్పోయిరి. వారికి సంతానములేదు కనుక అహరోను పర్యవేక్షణలో ఎలియెజెరు, ఈతామారు యాజకులుగా పనిచేసిరి.

5. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను.

6. “లేవీ తెగవారిని పిలుచుకొని వచ్చి అహరోనునకు సేవకులనుగా నియమింపుము.

7. సాన్నిధ్యపుగుడారము విషయమున అహరోనునకును యిస్రాయేలు సమాజ మునకును విధింపబడిన బాధ్యతలను వారు నెరవేర్ప వలెను.

8. సాన్నిధ్యపుగుడారము పరికరములను కాపాడుచు యిస్రాయేలు జనుల బాధ్యతలను వారు నెరవేర్చుచుందురు.

9. లేవీయులు అహరోనునకు అతని కుమారులకు అంకితము కావలెను.

10. అహరోనును, అతని కుమారులను యాజకధర్మము నిర్వర్తించుటకు నియమింపుము. ఇతరులు ఎవరైన గుడారము చెంతకు వచ్చిన యెడల ప్రాణములు కోల్పోవుదురు.

11. దేవుడైన యావే మోషేతో ఇట్లు చెప్పెను:

12. “యిస్రాయేలీయుల తొలిచూలు కుమారులకు మారుగా నేను లేవీయులను గైకొంటిని. కనుక వారు నావారు.

13. ఐగుప్తున తొలిచూలు పిల్లలను చంపి నపుడు యిస్రాయేలీయు తొలిచూలు పిల్లలను, వారి పశువుల తొలిచూలు పిల్లలను నా కొరకై నివేదించు కొంటిని. వారు నా వారైయుందురు, నేను ప్రభుడను”.

14-15. సీనాయి అరణ్యమున దేవుడైన యావే మోషేతో “నెలకు పైబడిన లేవీయుల మగవారి నందరిని కుటుంబములవారిగా వంశములవారిగా గణింపుము" అని చెప్పెను.

16. ప్రభువు ఆజ్ఞ ప్రకారమే మోషే వారిని లెక్కించెను.

17-20. లేవీకి గెరోను, కోహాతు, మెరారి అని ముగ్గురు కుమారులు. గెర్షోనుకు లిబ్ని, షిమేయి అని ఇద్దరు కుమారులు. కోహాతునకు అమ్రాము, ఈష్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అని నలుగురు కుమారులు. మెరారికి మాహ్లీ , మూషీ అని ఇద్దరు కుమారులు. ఈ పేరులతో పిలుచు కుటుంబములకు వారే వంశకర్తలు.

21-22. గెర్షోను నుండి లిబ్నీయులు, షీమీయులు కలిగిరి. నెలకు పైబడిన మగవారినందరిని లెక్క వేయగా వారి సంఖ్య మొత్తము 7,500 ఆయెను.

23. గెర్షోనీయులు గుడారము వెనుక పడమటివైపున శిబిరమును పన్నుకొనిరి.

24. లాయేలు కుమారుడు ఎలియాసాపు గెర్షోనీయులకు నాయకుడు.

25. వారు గుడారమును, దానిని కప్పువస్త్రములను, దాని ద్వారపు తెరను,

26. గుడారమునకు, పీఠమునకు చుట్టునున్న ఆవరణమున వ్రేలాడుతెరలను, ఆవరణ ప్రవేశమున నున్న తెర ఇవి అన్నియు వారే చూచుకొను బాధ్యతను కలిగియుండిరి.

27. కోహాతు నుండి ఆమ్రమీయులు, ఈష్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు జన్మించిరి. వీరందరు కోహాతీయ వంశములు.

28. నెలకు పైబడిన మగవారినందరిని లెక్కింపగా వారిసంఖ్య 8,300 ఆయెను. వారు పరిశుద్ధస్థలమును చూచుకొనుచుండిరి.

29. వారు గుడారము ప్రక్కన దక్షిణమున శిబిరము ఏర్పరచుకొనిరి.

30. ఉజ్జీయేలు కుమారుడగు ఎలిసాఫాను కోహతీయులకు నాయకుడు.

31. వారు మందసము, బల్ల, దీపస్తంభము, పీఠములు, తాము పరిచర్యచేయు పవిత్రస్థలములోని ఉపకరణములు, గర్భగృహము ఎదుట వ్రేలాడు అడ్డుతెర, వీటినన్నింటిని చూచుకొను విధి వారిది.

32. అహరోను కుమారుడగు ఎలియెజెరు, లేవీయ నాయకులకు అధిపతి. అతడు పరిశుద్ధ స్థలమున ఊడిగముచేయు వారికందరికి పెద్ద.

33. మెరారి నుండి మాహ్లియులు మూషీయులు జన్మించిరి.

34. వీరిలో నెలకు పైబడిన మగవారి నందరిని లెక్కింపగా వారి సంఖ్య 6,200 ఆయెను.

35. అబీహాయిలు కుమారుడగు సూరియేలు మెరారి వంశములకు నాయకుడు. వారు గుడారముప్రక్కన ఉత్తరముగా శిబిరము పన్నుకొనిరి.

36. మెరారీయులు గుడారపు సామాగ్రిని చూచుకొను బాధ్యత కలిగియుండిరి. మందిరచట్రములు, వాని అడ్డకఱ్ఱలు, వానిదిమ్మెలు, స్తంభములు వాని దిమ్మెలు, కట్టడమున వాడబడిన పరికరములు వారి ఆధీనమున నుండెను.

37. ఆవరణము చుట్టునున్న స్తంభములు, వాటి దిమ్మెలును, మేకులును, త్రాళ్ళు వారి అధీనముననే ఉండెడివి.

38. మోషే, అహరోను, అతని కుమారులు గుడారము ఎదుట తూర్పువైపున శిబిరము పన్నుకొనిరి. వారు యిస్రాయేలు తరపున పరిశుద్ధస్థలమున జరుగు అర్చనలకు బాధ్యులు. మిగిలిన వారు ఎవరైనను ఆ పనికి పూనుకొనినయెడల మరణము పాలగుదురు.

39. మోషే లేవీయులలో నెలకు పైబడిన మగవారినందరిని వంశములవారిగా లెక్కింపగా మొత్తము 22,000 మంది తేలిరి.

40. దేవుడైన యావే మోషేతో “యిస్రాయేలీయులలో నెలకు పైబడిన తొలిచూలు మగబిడ్డలందరినీ లెక్కవేయుము.

41. యిస్రాయేలీయుల తొలిచూలు కుమారులకు మారుగా లేవీయులను నాకు సమర్పింపుము. యిస్రాయేలీయుల గొడ్లమందలు ఈనిన తొలిచూలు పిల్లలకు మారుగా లేవీయుల గొడ్లను నాకు సమర్పింపుము. నేను దేవుడైన యావేను” అనెను.

42. ప్రభువు కోరినట్లే మోషే యిస్రాయేలీయుల తొలి చూలు పిల్లలనందరిని లెక్కవేసెను.

43. నెలకు పై బడిన తొలిచూలు మగబిడ్డలను లెక్కింపగా 22,273 మంది తేలిరి.

44-45. దేవుడైన యావే మోషేతో “యిస్రాయేలీయుల తొలిచూలు పిల్లలకు మారుగా లేవీయులను, యిస్రాయేలీయుల పశువులకు మారుగా లేవీయుల పశువులను నాకు సమర్పింపుము. లేవీయులు యావేనైన నా ప్రజలు.

46. యిస్రాయేలు తొలిచూలు బిడ్డలు లేవీయులకంటె 273 మంది ఎక్కువ కలరు. వారిని నాకు సమర్పించిన పిమ్మట వారు విమోచింపబడునట్లు మీరు వారిని తిరిగి కొనితెచ్చుకోవలెను.

47. ఒక్కొక్క బిడ్డకు సామాన్య తులామానము చొప్పున ఐదువెండినాణెములు చెల్లింప వలెను.

48. ఆ విమోచనధనమును అహరోనునకు అతని కుమారులకు చెల్లింపవలెను” అని చెప్పెను.

49. ప్రభువు చెప్పినట్లే మోషే లెక్కకు మిగిలిన యిస్రాయేలు తొలిచూలు కుమారులనుండి విమోచన సొమ్ము గైకొనెను.

50. ఆ రీతిగా అతడు 1,365 వెండినాణెములు గైకొనెను.. 

51. ప్రభువు ఆజ్ఞాపించి నట్లే. అతడు ఆ విమోచనసొమ్మును అహరోనునకు అతని కుమారులకు చెల్లించెను.