ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు మొదటి గ్రంధము 2

 1. దావీదునకు మరణము ఆసన్నముకాగా అతడు సొలోమోనును పిలిపించి ఇట్లు ఆజ్ఞాపించెను:

2. “నాయనా! నేను కన్నుమూయు గడియలు వచ్చినవి. నీవు ధైర్యముతో, సామర్థ్యముతో మెలగవలయును.

3. ప్రభువునకు లోబడియుండుము. మోషే ధర్మశాస్త్రమునందలి ఆజ్ఞలన్నిటిని పాటింపుము. అపుడు నీవు చేపట్టిన కార్యములన్నియు సఫలమగును. నీవు పోయిన తావులందెల్ల విజయము సిద్ధించును.

4. నీవు ప్రభువు ఆజ్ఞ పాటింతువేని యావే నాకు చేసిన వాగ్దానము తప్పక నెరవేరును. ప్రభువు 'నీ సంతతి వారు ధర్మమార్గమున వర్తించుచు, పూర్ణహృదయముతో, నిండుమనసుతో నా ఆజ్ఞలను పాటించినంత కాలము యిస్రాయేలు దేశమును పరిపాలించుచునే యుందురు' అని నాకు మాటయిచ్చెను.

5. మరియు వినుము. సెరూయా కుమారుడు యోవాబు చేసిన దుర్మార్గము నీవు ఎరుగుదువు. అతడు యిస్రాయేలు సైన్యాధిపతులను ఇద్దరిని చంపెను. వారు నేరు కుమారుడగు అబ్నేరు, యేతేరు కుమారుడగు అమాసా. అతడు యుద్ధసమయము అయినట్లుగా శాంతికాలమున వారిరువురి రక్తమును చిందించి దానిని తన దట్టిమీదను, తన పాదరక్షల మీదను పడజేసెను. అతడు నిరపరాధులను హత్యచేయగా దాని దుష్పలితమును అనుభవించు వాడను నేనైతిని.

6. కనుక నీవు యోవాబునకు తగినరీతిన బుద్ధి చెప్పుము. అతనిని ఈ ముసలితనమున ప్రశాంతముగా కన్నుమూయనీయరాదు.

7. కాని గిలాదు దేశీయుడు బెర్సిల్లయి పుత్రులను మాత్రము కొంచెము కనిపెట్టి యుండుము. వారికి అన్నపానీయముల కొరత యేర్పడ నీయకుము. నాడు నేను నీ అన్న అబ్షాలోమునకు వెరచి పారిపోవుచుండగా వారు నన్ను ఆదరించిరి.

8. ఇంకను వినుము. బెన్యామీను మండలములోని బహూరీము నగరమునకు చెందిన గెరా కుమారుడగు షిమీ నేను మహనాయీమునకు పోవునపుడు నన్ను దారుణముగా శపించెను. కాని తరువాత షిమీ నన్ను యోర్దాను నదిచెంత కలిసికొనగా నేను అతనిపై కత్తి యెత్తనని యావే పేర బాసచేసితిని.

9. అయినను నీవు మాత్రము షిమీని వదలరాదు. నీవు వివేకవంతుడవు గనుక నీకు తోచినరీతిని అతనికి బుద్ధిచెప్పుము. వానిని ముసలితనమున ప్రశాంతముగా కన్నుమూయ నీయరాదు."

10. తరువాత దావీదు కన్నుమూసి తమ పితరులను చేరుకొనెను. అతనిని దావీదునగరముననే పాతి పెట్టిరి.

11. దావీదు నలుబది ఏండ్లు యిస్రాయేలీయులను ఏలెను. అతడు హెబ్రోనున ఏడేండ్లు, యెరూషలేమున ముప్పదిమూడేండ్లు పరిపాలించెను.

12. సొలోమోను తన తండ్రి దావీదు సింహాసనమును ఎక్కెను. అతని రాజ్యాధికారము సుస్థిరమయ్యెను.

13. ఒకనాడు హగ్గీత్తు కుమారుడు అదోనీయా సొలోమోను తల్లియగు బత్షెబను చూడవచ్చెను. ఆమె అతనిని “నాయనా! నీవు స్నేహబుద్దితోనే వచ్చితివా?” అని ప్రశ్నించెను. అతడు అవునని బదులుపలికి,

14. “నాకొక కోరిక కలదు” అని అనెను. ఆమె అడుగుము అనెను.

15. అదోనియా "నేనే రాజును కావలసినది. యిస్రాయేలీయులు అందరు నేనే రాజునగుదునని భావించిరి. కాని దైవచిత్తము వేరుగానున్నందున నా తమ్ముడు సొలోమోను రాజయ్యెను.

16. ఇప్పుడు నాదొక మనవి కలదు. నీవు దానిని కాదనరాదు” అని పలికెను. బత్షెబ “చెప్పుము విందము” అనెను.

17. అదోనీయా “షూనేము నుండి వచ్చిన అబీషగును నాకు భార్యగా ఇమ్మని నీవు సొలోమోను రాజును అడుగుము. రాజు నీమాట త్రోసిపుచ్చడు” అనియనెను.

18. బత్షెబ “మంచిది. నీ మనవిని రాజునకు విన్నవింతును” అని చెప్పెను.

19. అటు తరువాత బత్షెబ అదోనియా కోరికను ఎరిగించుటకై సొలోమోను వద్దకు వెళ్ళెను. ఆమెను చూచి రాజు సింహాసనము దిగెను. తల్లికి నమస్కారము చేసి మరల ఆసనముమీద కూర్చుండెను. రాజుకు కుడిప్రక్క బత్షెబకు మరియొక ఆసనము వేయగా ఆమె దానిపై కూర్చుండెను.

20. బత్షెబ సొలోమోనుతో “నాయనా! నాదొక చిన్న మనవి. నీవు దానిని త్రోసివేయరాదు” అనెను. అతడు “అమ్మా! నీ మనవి నేను త్రోసిపుత్తునా? అదియేమో తెల్పుము” అని పలికెను.

21. ఆమె “అబీషగును నీ సోదరుడు అదోనియాకు భార్యగానిమ్ము” అని అడిగెను.

22. సొలోమోను “అబీషగును ఒక్కతెనే ఈయమందువేల? అతడు నా అన్న కావున అతని కొరకును, యాజకుడైన అబ్యాతారు కొరకును, సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుము” అని తన తల్లికి బదులిచ్చెను.

23. మరియు రాజు “ఇట్టి కోరిక కోరుకొన్నందులకు అదోనీయాను ప్రాణములతో బ్రతుకనిత్తునేని యావే నాకు అధిక కీడు చేయునుగాక!

24. ప్రభువు తాను మాట ఇచ్చి నట్లే నా తండ్రి దావీదు సింహాసనముపైన నన్ను కూర్చుండబెట్టెను. ఈ రాజ్యము నాకును, నాసంతతి వారికిని దక్కునట్లు చేసెను. కనుక సజీవుడైన యావే తోడు. అదోనియాను నేడే చంపింతును” అని శపథము చేసెను.

25. అపుడు సొలోమోను ఆజ్ఞపై బెనాయా వెడలిపోయి అదోనియాను వధించివచ్చెను.

26. సొలోమోను యాజకుడు అబ్యాతారుతో “ఓయీ! నీవిక అనాతోతు గ్రామముననున్న నీ ఇంటికి వెళ్ళిపొమ్ము. నీవు మరణపాత్రుడవు. కాని మా తండ్రితోనున్నపుడు దైవమందసమును కాపాడితివి గనుక, ఆయనతో నీవును వెతలను అనుభవించితివి గనుక నిన్నిపుడు చంపింపను” అని అనెను.

27. సొలోమోను అబ్యాతారును యాజక పదవినుండి తొలగించెను. ఈరీతిగా ప్రభువు షిలోనగరమున ఏలీ వంశమునకు పెట్టిన శాపము నెరవేరెను.

28. యోవాబు అబ్షాలోము పక్షము వహించలేదు. కాని అదోనియాను సమర్ధించెను. అతడు జరిగిన సంగతులన్నివిని మిగుల భయపడి ప్రభువు గుడారమునకు పరుగిడి బలిపీఠము కొమ్ములకు పెనవేసికొనెను.

29. యోవాబు ప్రభువుగుడారమునకు పారిపోయి బలిపీఠము వద్ద పడియున్నాడని విని సొలోమోను, దూతనంపి “నీవు బలిపీఠమును ఆశ్ర యింపనేల?” అని అడిగించెను. యోవాబు “నేను నీకు వెరచి యావే శరణుజొచ్చితిని” అని జవాబిచ్చెను. సొలోమోను అంతట యోవాబును వధించి రమ్మని బెనాయాను పంపెను.

30. అతడు ప్రభుగుడారము నొద్దకు వచ్చి “రాజు నిన్ను గుడారమునుండి వెలుపలికి రమ్మని ఆజ్ఞాపించుచున్నాడు” అని అనెను. కాని యోవాబు "నేను రాను. నన్ను ఇక్కడనే చావనిమ్ము” అని పలికెను. బెనాయా రాజు వద్దకు పోయి యోవాబు బలిపీఠమును వీడి వెలుపలికి రాననుచున్నాడు” అని తెలిపెను.

31. సొలోమోను అతనితో “యోవాబు కోరినట్లే చేయుము. అతనిని వధించి పాతి పెట్టుము. అప్పుడుగాని యోవాబు నిర్దోషులను చంపుటవలన కలిగిన పాపము నన్నును నా కుటుంబమును పీడింపక వదలిపోదు.

32. యోవాబు మా తండ్రి అనుమతి లేకయే నరహత్యకు పాల్పడినందున ప్రభువు అతనిని శిక్షించును. అతడు యిస్రాయేలు సైన్యాధిపతియగు అబ్నేరును యూదా సైన్యాధిపతియగు అమాసాను కత్తితో పొడిచిచంపెను. వారిరువురు నిర్దోషులు, అతని కంటె యోగ్యులు.

33. కనుక యోవాబు, అతని సంతతివారు తరతరములదాక ఈ నరహత్యలు తెచ్చి పెట్టు శిక్ష అనుభవింతురుగాక. కాని దావీదునకు, అతని సంతతికి, అతని రాజ్యమునకు ప్రభువు కరుణ వలన యెల్లకాలము భద్రములే కలుగునుగాక!” అని పలికెను.

34. అంతట బెనాయా ప్రభు గుడారమునకు పోయి యోవాబు మీదపడి అతనిని మట్టుపెట్టెను. మైదానముననున్న యోవాబు ఇంటనే అతని శవమును పాతిపెట్టిరి.

35. రాజు యోవాబునకు బదులుగా బెనాయాను సైన్యాధిపతిని చేసెను. అబ్యాతారునకు మారుగా సాదోకును యాజకునిగా నియమించెను.

36. రాజు షిమీని పిలిపించి “యెరూషలేమున ఇల్లు కట్టుకొని యిక్కడనే వసింపుము. నీవు ఈ నగరమును వీడరాదు.

37. ఎన్నడైన ఈ పట్టణమును వీడి కీద్రోను వాగునకు ఆవల అడుగుపెట్టెదవేని ఇక ప్రాణములతో బ్రతుకవు. అప్పుడు నీ మరణమును నీవే కొని తెచ్చుకొందువు” అని చెప్పెను.

38. ప్రభువుల వారి ఆజ్ఞ ప్రకారముగనే చేసెదనని చెప్పి షిమీ వెడలి పోయెను. అతడు చాలకాలముదాక యెరూషలేమును వీడి వెలుపలికి వెళ్ళలేదు.

39. ఇట్లు మూడేండ్లు గడిచిన తరువాత ఒకనాడు షిమీ బానిసలిద్దరు పారిపోయి గాతు దేశపురాజు మాకా కుమారుడగు ఆకీషువద్ద తలదాచుకొనిరి. తన బానిసలు గాతున నున్నట్లు షమీకి తెలియవచ్చినది.

40. వెంటనే అతడు గాడిదనెక్కి తన బానిసలను కొనివచ్చుటకై గాతు దేశమునేలు ఆకీషు నొద్దకు వెళ్ళెను. ఆ బానిసలను కనుగొని వారిని ఇంటికి తీసికొనివచ్చెను.

41-42. షిమీ యెరూషలేమును వీడి గాతునకు వెళ్ళెనని విని సొలోమోను అతనిని పిలువనంపి “నీవు యెరూషలేమును వీడి వెళ్ళరాదని యావే పేర నీతో ప్రమాణము చేయింపలేదా? నా ఆజ్ఞ మీరిననాడు నీవు తప్పక చచ్చెదవని నేను నీతో చెప్పలేదా? నీవు నా మాట పాటించెదనని నాకు ప్రమాణము చేయలేదా?

43. మరి నీ ప్రమాణమును ఏల నిలుపుకోవైతివి? నా మాటనేల జవదాటితివి?

44. నీవు మా తండ్రి దావీదునకుచేసిన ద్రోహము, నీ హృదయమున మెదలు కీడంతయు నీకు ఎరుకయే. నీ నెత్తికే నీ అపరాధము చుట్టుకొనును.

45. కాని యావే నన్ను దీవించును. దావీదు రాజ్యము కలకాలము వరకు సుస్థిరముగానుండును” అని పలికెను.

46. అంతట రాజు ఆజ్ఞపై బెనాయా షిమీని మట్టుపెట్టెను. అంతటితో సొలోమోను రాజ్యము సురక్షితమయ్యెను.