1. నేను సుఖములను అనుభవించి, సౌఖ్యము గూర్చి తెలిసికొందును అనుకొంటిని. కాని ఈ సౌఖ్యమును వ్యర్థమే.
2. సుఖసంతోషములు వెట్టితనమే గాని వానివలన ఫలితమేమియు లేదు.
3. విజ్ఞానమును గడింపవలెనన్నకోరికతోనే నేను ద్రాక్షారసమును సేవించి సుఖముననుభవింపజూచితిని. నరులు ఈ భూమిమీద వసించు కొద్దికాలము ఈరీతిగా సుఖములతో గడుపుటయే మంచిది కాబోలుననుకొంటిని.
4. నేను గొప్పపనులే చేసితిని. రాజభవనములు నిర్మించితిని, ద్రాక్షతోటలు నాటించితిని.
5. తోటలు, ఉద్యానవనములు వేయించి వానిలో సకల విధములైన ఫల వృక్షములు నాటించితిని.
6. చెరువులు త్రవ్వించి ఆ తోటలకు నీళ్ళు పెట్టించితిని.
7. దాసదాసి జనమును కొనితెచ్చుకొంటిని. ఇంక మా ఇంటపుట్టిన బానిసలును కూడా కలరు. పూర్వము యెరూషలేమున జీవించి పోయిన వారికంటె ఎక్కువగనే నేను పశువుల మందలు సంపాదించితిని.
8. వెండి బంగారములను, కోశాగారములను, రాష్ట్రములను, గాయనీగాయకు లను, అనేకమంది వనితలను సంపాదించితిని.
9. నేను చాల గొప్పవాడనైతిని. నాకంటె అధికుడు యెరూషలేమున ఏనాడును వసించియుండడు. నా విజ్ఞానమునకును కొదవలేదు.
10. నేను కోరినదెల సంపాదించితిని, నా హృదయము ఆశించిన సుఖము లెల్ల అనుభవించితిని. నా కృషి నాకు ఆనందమును చేకూర్చి పెట్టెను. ఈ వైభవమంతయు నేను చేసిన కృషి ఫలితమే.
11. కాని తరువాత నేను సాధించిన కార్యములగూర్చియు, ఆ కార్యములను సాధించుటకు నేను చేసిన కృషినిగూర్చియు, ఆలోచింప మొదలిడితిని. ఏమి చెప్పుదును? ఈ శ్రమ అంతయు వ్యర్థము, గాలికై ప్రయాసపడుటయే. ఇది అంతయు సూర్యుని క్రింద ఫలితము ద
12. అటుతరువాత నేను విజ్ఞానమును గూర్చియు, వెట్టితనమునుగూర్చియు, బుద్ధిహీనతను గూర్చియు ఆలోచింపమొదలిడితిని.
13. రాజు వారసుడు ఏమి చేయును? అతడును పూర్వపురాజులు చేసిన కార్యములనే చేయునుకదా? చీకటికంటె వెలుగెంత గొప్పదో, బుద్దిహీనతకంటె విజ్ఞానమంత గొప్పదని నేనెరుగుదును.
14. విజ్ఞానికి కన్నులు తలలోనున్నవి. బుద్దిహీనుడు అంధకారమున పయనించును. అయినను వారిరువురికిని ఒకేగతి పట్టుచున్నదని నేను గ్రహించితిని.
15. "బుద్దిహీనునకు పట్టినగతియే నాకును పట్టుచున్నదిగదా? మరి నేను విజ్ఞానినైనందున ప్రయోజనమేమిటా?” అని ఆలోచించితిని. కనుక ఈ విజ్ఞానము కూడ వ్యర్థమే.
16. బుద్ధిహీనుని, విజ్ఞానిని కూడ ఎవరు జ్ఞప్తియందుంచుకొనరుగదా? రాబోవు తరములవారు ఇరువురిని విస్మరింతురు. బుద్ధిహీనుడు మృతినొందు విధమెట్టిదో, విజ్ఞాని మృతినొందు విధమును అట్టిదే.
17. ఇది చూడగా, సూర్యునిక్రింద జరుగు కార్య ములన్నియు నాకు అసహ్యము పుట్టించినవి. అంతయు వ్యర్థమే, గాలికై ప్రయాసపడుటయే.
18. నేను కృషి చేసి సాధించినవేమియు నాకు ప్రమోదము చేకూర్ప లేదు. వానినన్నిటిని నేను నా వారసునకు అప్పగింప వలసినదేగదా?
19. అతడు విజ్ఞానియగునో, అజ్ఞానియగునో ఎవ్వడెరుగును? అయినను ఈ లోకమున నేను నా విజ్ఞానమును, శ్రమను వెచ్చించి సాధించిన వానికి అన్నిటికిని అతడు అధిపతియగునుగదా? కనుక ఇదియును వ్యర్థమే.
20. కావున సూర్యుని క్రింద నేనుపడిన శ్రమను తలంచుకొని విచారింపజొచ్చితిని.
21. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించినవానిని ఎట్టి శ్రమచేయని తన వారసునికి అప్పగింప వలసినదేగదా? ఇదియును వ్యర్థమే, అక్రమమే.
22. సూర్యునిక్రింద ఇన్ని వ్యయ ప్రయాసలు అనుభవించినందులకు నరునికి కలుగు ఫలితమేమి?
23. నరుడు జీవించినంతకాలమును అతడు చేయు పనులెల్ల శ్రమతోను, దుఃఖముతోను నిండియుండును. రాత్రులలో నిద్రపట్టదు. ఇదియును వ్యర్ధమే.
24. తిని, త్రాగి తాను సాధించిన దానిని అను భవించుటకంటే, మనుష్య జీవితమునకు సార్థక్యమే మున్నది? ఈ భాగ్యమునుగూడ దేవుడే అనుగ్రహింప వలయునని నేను తెలుసుకొంటిని.
25. దేవుడు తోడ్పడనిదే నరుడేమి తినగలడు, ఏమి అనుభవింపగలడు?
26. దేవుడు తనకిష్టుడైన నరునికి విజ్ఞానము, విద్య, సంతోషము దయచేయును. కాని ఆయన పాపిని మాత్రము కృషి చేసి వస్తువులు కూడబెట్టునట్లు చేసి, ఆ వస్తువులను మరల తనకు ప్రీతిపాత్రులైన వారి వశముచేయును. ఇదియును వ్యర్థమే, గాలికై ప్రయాసపడుటయే.