ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 29

 1. హిజ్కియా తన ఇరువది ఐదవయేట రాజై యిరువదితొమ్మిది యేండ్లపాటు యెరూషలేము నుండి పరిపాలించెను. అతని తల్లి జెకర్యా కుమార్తెయైన అబీయా.

2. అతడు తన పితరుడైన దావీదువలె ప్రభువునకు ఇష్టమైన కార్యములు చేసెను.

3. హిజ్కియా తన యేలుబడి మొదటి యేడు మొదటి నెలలో ప్రభువు మందిర ద్వారములు తెరపించి వానిని మరమ్మతు చేయించెను.

4-5. యాజకులను, లేవీయులను దేవాలయము తూర్పు ప్రాంగణమున సమావేశపరచి వారితో ఇట్లు చెప్పెను: “లేవీయులారా! మీరు శుద్ధిచేసికొని మన పితరుల దేవుడైన ప్రభువు మందిరమును పవిత్రపరుపుడు. దేవళమును అమంగళముచేయు అపవిత్ర వస్తువులనెల్ల ఎత్తి బయట పడవేయుడు.

6. మన పూర్వులు ప్రభువుపట్ల విశ్వాసము చూపక అతడు ఒల్లని పనులుచేసిరి. అతనిని పరిత్యజించిరి. అతడు వసించు మందిరమును విడనాడిరి.

7. వారు ముఖమంటపమును గూడ మూసివేసిరి. యిస్రాయేలు దేవుడైన ప్రభువు పరిశుద్ధ మందిరమున దీపమును వెలిగింపరైరి. సాంబ్రాణి పొగవేయరైరి. దహనబలులు అర్పింపరైరి.

8. కనుక ప్రభువు కోపము యూదా మీదను, యెరూషలేము మీదను రగుల్కొనెను. అతడు ఈ ప్రజలను శిక్షించిన తీరు ఎల్లరికిని భయమును, ఆశ్చర్యమును కలి గించెను. ఈ ప్రజను ఎల్లరును అపహసించిరి. ఈ సంగతి మీకును తెలియును.

9. ప్రభువు ఆగ్రహము వలన మన పితరులు యుద్ధమున కత్తికి ఎరయైరి. శత్రువులు మన పత్నులను పిల్లలను చెరగొనిపోయిరి.

10. నేనిపుడు యిస్రాయేలు దేవుడైన ప్రభువుతో నిబంధనము చేయగోరుచున్నాను. అప్పుడు గాని అతని ప్రచండకోపము మన నుండి వైదొలగదు.

11. కుమారులారా! ఇకమీదట మీరు అశ్రద్ధచేయకుడు. ప్రభువు సాన్నిధ్యమున నిలిచి సాంబ్రాణిపొగ వేయుటకును, పరిచర్యలు నిర్వర్తించుటకును ఆయన మిమ్మే ఎన్నుకొనెనుగదా!”

12-14. అప్పుడు ఈ క్రింది లేవీయులు దేవాలయమును శుద్ధిచేయుటకు పూనుకొనిరి: కోహాతు వంశమునుండి అమాసయి కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మెరారి వంశము నుండి అబ్ది కుమారుడైన కీషు, యెహాల్లేలు కుమారుడైన అజర్యా, గెర్షోను వంశమునుండి సిమ్నా కుమారుడైన యోవా, యోవా కుమారుడైన ఏదేను. ఏలీషాఫాను వంశమునుండి షిమ్రీ, యెవూవేలు. ఆసాపు వంశమునుండి జెకర్యా, మత్తన్యా. హెమాను వంశమునుండి యెహూవేలు, షిమీ. యెదూతూను వంశము నుండి షేమయా, ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి.

15. వీరెల్లరును తోడి లేవీయులనుకూడ కలుపుకొని శుద్ధిచేసికొనిరి. యావే దేవుని మాటచొప్పున రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవాలయ శుద్ధికి పూనుకొనిరి.

16. యాజకులు దేవాలయమును శుద్ధిచేయుటకుగాను లోనికి వెళ్ళిరి. వారు అపవిత్రములైన వస్తువులనెల్ల దేవాలయము నుండి వెలుపలి ఆవరణములోనికి కొనివచ్చిరి. లేవీయులు వానిని కొనిపోయి పట్టణము వెలుపలి కీద్రోను లోయలో పడవేసిరి.

17. మొదటి నెల మొదటినాడు ఈ శుద్దీకరణము ప్రారంభమయ్యెను. ఎనిమిదవ దినమునకు దేవాలయమును, ముఖమంటపమునుగూడ శుద్ధిచేసి ముగించిరి. వారు ఇంకను ఎనిమిదిదినములు పని చేసి మొదటినెల పదునారవదినమున దేవాలయమును ప్రతిష్టించిరి.

18. అంతట వారు హిజ్కియాను సందర్శించి “మేము దేవాలయమునంతటిని శుద్ధిచేసితిమి. దహన బలులర్పించు బలిపీఠమును, సాన్నిధ్యపు రొట్టెల నుంచు బల్లనుగూడ వానివాని ఉపకరణములతో పాటు శుద్ధిచేసితిమి.

19. ఆహాసురాజు ప్రభువు ఆజ్ఞలను ధిక్కరించి పరిపాలనము నెరపిన కాలమున దేవాలయము నుండి తొలగించిన ఉపకరణములను కూడ శుద్ధిచేసి, మరల దేవాలయమున చేర్చితిమి. ఆ ఉపకరణములన్నియు ఇప్పుడు ప్రభువు బలిపీఠము ఎదుటనున్నవి” అని విన్నవించిరి.

20. హిజ్కియా వెంటనే పురప్రముఖులను పిలిపించెను. ఎల్లరును కలిసి దేవాలయములోనికి పోయిరి.

21. వారు రాజ్యము కొరకును, దేవాలయ పవిత్రతకొరకును, యూదా ప్రజలకొరకును పాప పరిహారబలినర్పించుటకై కోడెలను, పొట్టేళ్ళను, గొఱ్ఱె పిల్లలను, మేకపోతులను ఏడేసి చొప్పున కొని వచ్చిరి. అహరోను వంశజులైన యాజకులను రాజు పిలిచి బలిపీఠముమీద బలియర్పింపుడని చెప్పెను.

22. వారు కోడెలను, పొట్టేళ్ళను, గొఱ్ఱె పిల్లలను వరుసగా వధించి వాని నెత్తుటిని పీఠముపై చిలు కరించిరి.

23. అటుపిమ్మట మేకపోతులను రాజు ఎదుటికిని, ప్రజలఎదుటికిని కొనిరాగా ఎల్లరును వానిపై చేతులు చాచిరి.

24. యాజకులు ఆ పోతులను వధించి వానినెత్తుటిని బలిపీఠముమీద చిలకరించిరి. యిస్రాయేలు ప్రజలెల్లరి పాపములను తొలగించుటకు వానిని పావవరిహారబలిగా సమర్పించిరి. ప్రజలెల్లరి తరఫున దహనబలులను, పరిహారబలులను అర్పింపవలెనని రాజు యాజకులను ఆదేశించియుండెను.

25. గాదు, నాతాను ప్రవక్తలద్వారా పూర్వము ప్రభువు దావీదునకిచ్చిన ఆజ్ఞలననుసరించి లేవీయులు సితారా, స్వరమండలము, చిటితాళములతో దేవాలయమున సేవచేయవలెనని హిజ్కియా కట్టడ చేసెను.

26. కనుక లేవీయులు దావీదువాడిన వాద్యములవంటి వాద్యములను చేపట్టి దేవాలయమున నిలిచిరి. యాజకులు బూరలను చేపట్టిరి.

27. అంతట హిజ్కియా దహనబలిని అర్పింపుడని ఆజ్ఞాపించెను. ఆ బలి ప్రారంభము కాగానే ప్రజలు ప్రభుని కీర్తించుచు గానముచేసిరి. బూరలు మ్రోగెను. సంగీత కారులు దావీదువాడిన వాద్యములవంటి వాద్యములు వాయించిరి.

28. ప్రజలెల్లరును ప్రభువును ఆరాధించిరి. దహనబలి ముగియువరకును గానము, బూరలమ్రోత కొనసాగెను.

29. బలి అంతమున రాజును, ప్రజలును తలవంచి ప్రభువును ఆరాధించిరి.

30. దావీదు మరియు ఆసాపు ప్రవక్త రచించిన స్తుతిగీతములను పాడుడని రాజైన హిజ్కియాయు, ప్రజానాయకులును లేవీయులను కోరిరి. ఎల్లరు కలిసి ఆనందముతో ఆ గీతములుపాడిరి. సాగిలపడి దేవుని వందించిరి.

31. అప్పుడు హిజ్కియా ప్రజలతో “మీరిప్పుడు శుద్ధిని పొందితిరి. ఇక కృతజ్ఞతాసూచకముగా ప్రభువునకు మీ బలులర్పింపుడు” అని చెప్పెను. వారు అట్లే చేసిరి. కొందరు దహనబలులు అర్పించుటకు వారియంతట వారే పశువులనుగూడ కొనివచ్చిరి.

32. అటుల వారు కొనివచ్చిన పశువులు డెబ్బది కోడెలు, వంద పొట్టేళ్ళు, రెండువందల గొఱ్ఱెపిల్లలు.

33. ఇంకను వారు ఆరువందల కోడెలను మూడువేల పొట్టేళ్ళను ప్రతిష్టార్పణములుగా అర్పించిరి.

34. ఆ పశువులన్నిటిని వధించుటకు చాలినంతమంది యాజకులు దొరకరైరి. కనుక లేవీయులుకూడ ఆ పనిలో తోడ్పడిరి. అంతలో ఎక్కువమంది యాజకులు శుద్ధినిపొంది వచ్చిరి. యాజకులకంటె లేవీయులు శుద్ధినియమములను యదార్ధహృదయులై పాటించిరి.

35. యాజకులు దహనబలులు అర్పించుట మాత్రమే కాక సమాధానబలిగా అర్పించిన పశువుల క్రొవ్వు గూడ వేల్చిరి. దహనబలులతోపాటు అర్పింపబడిన ద్రాక్షసారాయమును బలిపీఠమునెదుట ధారగాపోసిరి. ఈ రీతిగా దేవాలయమున ఆరాధనము పునఃప్రారంభమయ్యెను.

36. ప్రభువు కృపవలన ఇంత త్వరగా కార్యములెల్లను ముగిసినవిగదాయని రాజును, ప్రజలును ఆనందభరితులైరి.