1. ఆహాసు ఇరువదియేండ్ల ఈడున రాజై పదనారేండ్ల పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతడు తన పితరుడైన దావీదువలె ప్రభువు దృష్టికి యదార్ధముగ ప్రవర్తింపలేదు.
2. పై పెచ్చు యిస్రాయేలు రాజుల మార్గముననుసరించి లోహముతో బాలు విగ్రహములు చేయించెను. బెన్-హిన్నోము లోయయందు అన్యదేవతలకు సాంబ్రాణి పొగ వేసెను.
3. ప్రభువు యిస్రాయేలు ప్రజల సమక్షమునుండి తరిమివేసిన అన్యజాతులవారి జుగుప్సాకరమైన ఆచారముల ననునుసరించి తన సొంతకుమారులను గూడ దహనబలిగా సమర్పించెను.
4. ఉన్నత స్థలముల మీదను, పర్వతముమీదను, గుబురైన చెట్ల క్రిందను బలులు అర్పించి సాంబ్రాణి పొగవేసెను.
5. ఈ దుష్కార్యములకు శిక్షగా ప్రభువు ఆహాసును సిరియారాజు చేతికప్పగించెను. ఆ రాజు అతనిని ఓడించి అతని ప్రజలను చాలమందిని బందీలను చేసి దమస్కునకు కొనిపోయెను. యిస్రాయేలు రాజు, రెమల్యాకుమారుడైన పెకా చేతికి గూడ ప్రభువు ఆహాసును అప్పగించెను.
6. ఆ రాజు ఆహాసును ఓడించి ఒక్క రోజులోనే బలశాలులైన యూదీయ సైనికులను లక్ష ఇరువదివేలమందిని మట్టు పెట్టెను. యూదీయులు తమ పితరుల దేవుడైన ప్రభువును విడనాడిరి కనుక ఇట్టి శిక్షకు పాత్రులైరి.
7. ఎఫ్రాయీము యోధుడైన సిక్రి అనువాడు ఆహాసు కుమారుడైన మాసెయాను, ప్రాసాదపాలకుడైన అబ్రీకామును, రాజునకు ముఖ్యమంత్రి అయిన ఎల్కానాను వధించెను.
8. యిస్రాయేలీయులు తమ సోదరులైన యూదీయుల స్త్రీలను, పిల్లలను రెండు లక్షలమందిని బందీలనుచేసి సమరియాకు కొనిపోయిరి. ఇంకను వారు పెద్దమొత్తమున కొల్ల సొమ్మునుగూడ తీసికొనిపోయిరి.
9. ఓదెదు అను పేరుగల ప్రభువు ప్రవక్త ఒకడుండెను. అతడు యుద్ధము ముగించుకొని సమరియా నగరమును ప్రవేశించుచున్న యిస్రాయేలు సైన్యముతో “మీ పితరుల దేవుడైన ప్రభువు యూదీయుల మీద ఆగ్రహముచెంది వారిని మీ చేతికప్పగించెను. కాని మీరు ఆకాశమునంటునంత దారుణముగా వారిని వధించితిరి.
10. ఇప్పుడు మీరు యూదా యెరూషలేము నివాసులైన ఈ స్త్రీ పురుషులను మీకు బానిసలను చేసికోగోరుచున్నారు. ఇందునుబట్టి మీరు మాత్రము ప్రభువునకు ద్రోహముగా పాపము కట్టుకొనక యున్నారా?
11. కనుక ఇప్పుడు నా మాటవినుడు. సోదరప్రజలనుండి మీరు తీసికొని వచ్చిన ఈ బందీలను విడచి పెట్టుడు. ప్రభువునకు మీపై ఆగ్రహము కలిగినది” అని పలికెను.
12. అప్పుడు ఎఫ్రాయీము నాయకులు కొందరు యుద్ధము ముగించుకొని వచ్చిన సైన్యమునకు ఎదురుగా నిలబడిమాట్లాడిరి. వారు యోహానాను కుమారుడు అజర్యా, మెషిల్లెమోతు కుమారుడైన బెరెక్యా. షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హడ్లాయి కుమారుడైన అమాసా.
13. వారెల్లరును “మీరు ఈ బందీలను ఇచటకు తీసికొనిరాగూడదు. మనము ఇదివరకే ప్రభువునకు కోపము రప్పించితిమి. ఇప్పుడు ఈ కార్యముద్వారా ఇంకను అధికముగా పాపము మూటకట్టుకోనేల? మనమిదివరకే ఘోరమైన పాపములు చేసితిమికదా? ప్రభువు యిస్రాయేలీయులపై నిప్పులు క్రక్కుచున్నాడు” అని పలికిరి.
14. ఆ మాటలు విని సైనికులు తాము కొనివచ్చిన కొల్లసొమ్మును బందీలను యిస్రాయేలు ప్రజలకును, వారి నాయకులకును అప్పగించిరి.
15. అప్పుడు బందీలను పరామర్శించుటకు నియమింపబడిన నాయకులు వారికి పరిచర్యచేసిరి. కొల్లసొమ్మునుండి బట్టలు లేనివారికి బట్టలిచ్చిరి. ఇంకను ఆ నాయకులు వారికి దుస్తులును, చెప్పులును అన్నపానీయములును చేకూర్చిరి. వారి శిరములమీద నూనెపోసిరి. నడువలేనివారిని గాడిదలపై ఎక్కించిరి. బందీలనందరిని యూదయా లోని ఖర్జూరవృక్షముల నగరమైన యెరికోకు, వారి సహోదరులయొద్దకు కొనిపోయి అచట వదలిపెట్టిరి. అటుపిమ్మట యిస్రాయేలీయులు సమరియాకు తిరిగివచ్చిరి.
16. ఆహాసు తనకు సాయము చేయుమని అస్సిరియా రాజునకు కబురుపంపెను. ఏలన,
17. ఎదోమీయులు మరల యూదామీదికి దాడిచేసి చాల మందిని బందీలనుగా పట్టుకొనిపోయిరి.
18. ఫిలిస్తీయులు కూడ షెఫేలా ప్రదేశములోని పట్టణములను యూదా దేశమునకు దక్షిణ దిక్కునున్న నగరములను ఆక్రమించుకొనిరి. వారు బేత్-షేమేషు, అయ్యాలోను, గెదెరోతు పట్టణములను మరియు సొకో, తిమ్నా, గింసోను నగరములను వాని పరిసర గ్రామములను వశముచేసికొని ఆనగరములలోనే స్థిరపడిరి.
19. ఆహాసు యూదీయుల హక్కులను మన్నింపక నిరంకుశముగా పరిపాలించెను. ప్రభువును లక్ష్యపెట్టలేదు. కనుక ప్రభువు యూదాకు తిప్పలు తెచ్చెను.
20. అస్సిరియా రాజు తిగ్లత్-పీలేసరు ఆహాసునకు సాయము చేయుటకు బదులుగా అతనిని బాధించి ముప్పుతిప్పలు పెట్టెను.
21. కనుక ఆహాసు దేవాలయము నుండియు, ప్రాసాదమునుండియు, ప్రజా నాయకుల గృహముల నుండియు బంగారమును గైకొని అస్సిరియా రాజునకర్పించెను. అయినను ఆ రాజు అతనికి ఎట్టి సాయమును చేయలేదు.
22. ఇట్టి విపత్తులలోనున్నపుడు ఈ ఆహాసు ప్రభుని ఆజ్ఞలను మరి ఎక్కువగా జవదాటెను.
23. అతడు తనను ఓడించిన సిరియనుల దేవతలకు బలులర్పించెను “సిరియా దేవతలు ఆ దేశపు రాజులకు సాయపడిరి గదా! నేనును ఆ దేవతలను కొలిచినచో వారు నాకు కూడ తోడ్పడుదురు” అని అతడు భావించెను. కాని ఆ దేవతలే అతని వినాశమునకును అతని ప్రజల పతనమునకును కారకులైరి.
24. ఆహాసు ప్రభుని దేవాలయ వస్తుసామాగ్రిని ముక్కలు చేసి నాశనము చేసెను. దేవాలయపు తలుపులు మూయించెను. యెరూషలేమున మూల మూలలందు బలిపీఠములు నిర్మించెను.
25. యూదా లోని ప్రతినగరమున అన్యదేవతల ఆరాధనకుగాను మందిరములు నెలకొల్పి వానిలో సాంబ్రాణి పొగ వేయించెను. కనుక అతని పితరుల దేవుడైన ప్రభువు అతనిమీద ఆగ్రహము చెందెను.
26. ఆహాసు చేసిన ఇతర కార్యములు, అతడు అనుసరించిన పద్ధతులన్నియు మొదటినుండి తుది వరకు యూదా యిస్రాయేలు రాజుల చరితమున లభింపబడియేయున్నవి.
27. అంతట ఆహాసు తన పితరులతో నిద్రింపగా యెరూషలేముననే పాతిపెట్టిరి, గాని రాజసమాధులలో మాత్రముకాదు. అటు తరువాత అతని పుత్రుడు హిజ్కియా రాజయ్యెను.