ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 28

 1-2. ప్రభువు మోషేతో “యిస్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. మీరు నియమితకాలములందు నాకు బలులు సమర్పింపవలెను. అవి నాకు ప్రీతిని కలిగించును.

3. మీరు నాకు సమర్పింపవలసిన బలి అర్పణములు యివి: ప్రతిదినమును అవలక్షణములు లేని ఏడాది మగగొఱ్ఱెపిల్లలను రెండింటిని దహనబలిగా అర్పింపవలెను.

4. వానిలో ఒకదానిని ఉదయము, మరొకదానిని సాయంకాలము సమర్పింపుడు.

5. ఆ రెండింటితో పాటు రెండుకుంచముల ధాన్యపు పిండిని, రెండుబుడ్ల దంచి తీసిన శ్రేష్టమైన ఓలివు నూనెను అర్పింపవలెను.

6. ఈ ఆహారపదార్థములు అన్నియు పూర్తిగా దహనము చేయబడును. ఈ దహనబలి మొదట సీనాయి కొండ వద్ద సమర్పింప బడెను. ఆ బలిసువాసన ప్రభువునకు ప్రీతికలిగించెను.

7. మొదటి గొఱ్ఱె పిల్లతోపాటు ద్రాక్షసారాయమును ప్రభువునకు పానార్పణముగా పవిత్రస్థలమున ధారవోయవలెను.

8. ఆ రీతిగానే సాయంకాలమును నైవేద్య, ద్రాక్షసారాయమును అర్పించుచు రెండవ గొఱ్ఱెపిల్లను దహనబలిగా అర్పింపవలెను. ఈ బలుల సువాసన ప్రభువునకు ప్రీతికలిగించును.

9.. విశ్రాంతిదినమున అవలక్షణములులేని ఏడాది ప్రాయముగల రెండు మగ గొఱ్ఱె పిల్లలను అర్పింపుడు. వానితోపాటు నాలుగు కుంచముల పిండిని ఓలివు నూనెను ద్రాక్షసారాయమును అర్పింపుడు.

10. ప్రతిదిన సమర్పణలతోపాటు, ప్రతిదిన ద్రాక్షసారాయముతోపాటు ఈ దహనబలిని గూడ విశ్రాంతిదినమున ప్రత్యేకముగా సమర్పింపవలెను.

11-13. ప్రతినెల మొదటిదినమున అవలక్షణములు లేని రెండు కోడెదూడలను, ఒక పొట్టేలును, ఏడాదిప్రాయముగల ఏడు మగగొఱ్ఱె పిల్లలను ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు. ధాన్యార్పణముగా ఓలివునూనెతో కలిపిన పిండిని అర్పింపుడు. ఒక్కొక్క కోడెకు ఆరుకుంచముల పిండి, పొట్టేలుకు నాలుగు కుంచములపిండి, గొఱ్ఱెపిల్లకు రెండు కుంచముల పిండి చొప్పున అర్పింపుడు. ఈ దహనబలులు ప్రభువు నకు అర్పింపబడును. ప్రభువునకు ప్రీతి కలిగించు సువాసననిచ్చును.

14. ద్రాక్షసారాయమును ఒక్కొక్క కోడెకు నాలుగుబుడ్లు, పొట్టేలుకు మూడుబుడ్లు, గొఱ్ఱెలకు రెండుబుడ్లు అర్పింపవలెను. ఏడాది పొడుగున ప్రతినెల మొదటిరోజున సమర్పింపవలసిన దహనబలులివి.

15. ప్రతిరోజు సమర్పించు దహన బలితో పాటు పాపపరిహారబలిగా ఒక మేకపోతును గూడ సమర్పింపుడు.

16-17. మొదటినెల పదునాలుగవ దినమున పాస్క వచ్చును. పదునైదవనాడు పండుగ ప్రారంభమై ఏడురోజులవరకు కొనసాగును. ఈ ఏడురోజులు పొంగని రొట్టెలను మాత్రమే భుజింపుడు.

18. పండుగ వారము మొదటి రోజున మీరందరు దేవుని ఆరాధించు టకు సమావేశము కావలెను. ఆ దినము మీరు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

19. అవ లక్షణములులేని రెండుకోడెదూడలను, ఒక పొట్టేలును, యేడాది ఈడు గల ఏడు మగగొఱ్ఱెపిల్లలు ప్రభువునకు దహనబలిగా అర్పింపుడు.

20-21. ఓలివునూనెతో కలిపిన పిండిని ఒక్కొక్క కోడెకు ఆరుకుంచములు, పొట్టేలుకు నాలుగుకుంచములు, గొఱ్ఱె పిల్లకు రెండు కుంచముల చొప్పున అర్పింపుడు.

22. పాపపరిహారముగా ఒక మేకపోతును గూడ అర్పింపుడు. ఈ విధముగా ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరిపింపుడు.

23. ప్రతిదినమున ఉదయమర్పించు దహనబలితో పాటు వీనిని కూడ అర్పింపుడు,

24. ఈ బలులను ఏడురోజులపాటు అర్పింపవలెను. ఈ దహనబలులు ప్రభువునకు ప్రీతికలిగించు సువాసన నిచ్చి ఆయనకు భోజనమగును.

25. ఏడవనాడు ప్రభుని ఆరాధించుటకు సమావేశము కావలెను. ఆనాడు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయరాదు.

26. వారములపండుగ మొదటిదినమున మీరు ప్రథమ ఫలములను ప్రభునికి అర్పింతురుగదా! ఆ దినమున ప్రభుని ఆరాధించుటకు సమావేశము కండు. ఆరోజు మీరు మీ జీవనోపాధియైన ఏ పనియు చేయకుడు.

27. అవలక్షణములులేని రెండుకోడెలను, ఒక పొట్టేలును, ఏడాది యీడుగల ఏడు మగగొఱ్ఱె పిల్లలను దహనబలిగా అర్పింపుడు. ఈ బలి ప్రభువునకు ప్రీతికలిగించు సువాసననిచ్చును.

28-29. ఓలివు నూనెతో కలిపిన పిండిని ఒక్కొక్కకోడెకు ఆరు కుంచములు, పొట్టేలుకు నాలుగుకుంఛములు, గొఱ్ఱె పిల్లకు రెండుకుంచముల చొప్పున అర్పింపుడు. 

30. పాపపరిహారబలిగా ఒక మేకపోతునుగూడ అర్పింపుడు. ఈ రీతిగా ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తము జరిపింపుడు.

31. ప్రతిదినము అర్పించు దహనబలితో పాటు, ధాన్యార్పణముతోపాటు వీనినికూడ అర్పింపుడు.