1. మహ్లా, నోవా, హోగ్లా, మిల్కా, తీర్సా అనువారు సెలోఫెహాదు పుత్రికలు. సెలోఫెహాదు హెఫేరు కుమారుడు, గిలాదు మనుమడు, మాహీరు మునిమనుమడు. వీరు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్తులు.
2-3. ఆ కుమార్తెలు సమావేశపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషేను, యాజకుడగు ఎలియెజెరును యిస్రాయేలు ప్రజలను, ప్రజానాయకులను కలిసికొని “మా తండ్రి మగబిడ్డలు లేకయే ఎడారియందు చనిపోయెను గదా! ఆయన తన పాపము వలన తాను చనిపోయెనుగాని దేవునిమీద తిరుగబడిన కోరా బృందమున చేరుటవలనకాదు.
4. మా తండ్రికి మగబిడ్డలు లేరు కనుక ఆయన పేరు మాసిపోవలెనా యేమి? మా తండ్రి సహోదరులతో పాటు మమ్మును మా తండ్రి వారసులనుగా చేయుడు” అని అడిగిరి.
5-6. మోషే ఆ మాట ప్రభువునకు విన్నవింపగా ప్రభువు అతనితో
7. “సెలోఫెహాదు కుమార్తెల విన్నపము ధర్మబద్దమైనదే. వారి తండ్రి సహోదరులతో పాటు వారిని తండ్రి వారసులనుగా చేయుము.
8. ఎవడైనను పుత్రులులేక చనిపోయినచో అతని ఆస్తి అతని కుమార్తెలకు సంక్రమించునని యిస్రాయేలీయులతో చెప్పుము.
9. పుత్రికలును లేనిచో అతని ఆస్తి అతని సోదరులకు దక్కును.
10. సోదరులును లేనిచో ఆ ఆస్తి అతని తండ్రి సోదరులకు చెందును.
11. వారును లేనిచో దగ్గరి చుట్టమునకు చెందును. తరతరముల వరకు యిస్రాయేలీయులకు మోషే ద్వారా ప్రభుడనైన నేను చేసిన న్యాయమిది” అని చెప్పెను.
12. ప్రభువు మోషేతో "నీవు అబారీము కొండ నెక్కి నేను యిస్రాయేలీయులకు ఇచ్చిన భూమిని పారజూడుము.
13. ఆ దేశమును కన్నులార చూచిన పిదప అహరోనునివలె నీవును మరణింతువు.
14. మీరిరువురును సీను ఎడారిలో నా ఆజ్ఞలను జవదాటిరి గదా! నాడు మెరిబావద్ద యిస్రాయేలు సమాజము నామీద గొణగుకొనగా మీరిరువురును వారి ఎదుట నన్ను పవిత్రపరచక నామీద తిరుగబడితిరి” అనెను. (సీను ఎడారి యందలి కాదేషు వద్దనున్న చెలమయే మెరిబా.)
15-17. మోషే దేవునితో “ప్రభూ! సకల ప్రాణులకు జీవాధారము నీవే. ఈ ప్రజలకు ఒక నాయకుని నియమింపుము. అతడు యుద్ధములలో వీరిని నడిపించుచుండును. ఒక నాయకుడు లభించినచో ఈ ప్రజలకు కాపరిలేని మంద దుర్గతి పట్టదు” అనెను.
18. ప్రభువు అతనితో “నూను కుమారుడైన యెహోషువ ఆత్మశక్తి కలవాడు. నీవు అతనిపై చేతులు చాపుము.
19. యిస్రాయేలు సమాజము చూచు చుండగా అతనిని యాజకుడగు ఎలియెజెరు ముందు నిలిపి నీకు ఉత్తరాధికారినిగా ప్రకటింపుము.
20. పిమ్మట యిస్రాయేలు సమాజము అంతయు అతనిని విధేయించునట్లు నీ అధికారమును కొంత అతనికి ఇమ్ము.
21. యెహోషువ, యాజకుడగు ఎలియెజెరు మీద ఆధారపడియుండును. ఎలియెజెరు నా చిత్తమును ఊరీము తీర్పువలన అతనికి యెరుకపరుచు చుండును. ఈ రీతిగా ఎలియెజెరు యెహోషువను, యిస్రాయేలు సమాజమునంతటిని తన మాట చొప్పున సమస్త కార్యములలో నడిపించుచుండును” అని చెప్పెను.
22. మోషే ప్రభువు చెప్పినట్లే చేసెను. అతడు యిస్రాయేలు సమాజము చూచుచుండగా యెహోషువను యాజకుడగు ఎలియెజెరు ముందు నిలిపి అతనిపై చేతులు చాచెను.
23. అతనిని తనకు ఉత్తరాధికారినిగా నియమించెను.