ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజుల దినచర్య రెండవ గ్రంధము 26

 1. యూదీయులెల్లరు అమస్యా కుమారుడైన ఉజ్జీయాను రాజుగా ఎన్నుకొనిరి. అప్పుడతనికి పదునారేండ్లు.

2. అమస్యా మరణానంతరము ఉజ్జీయా ఏలోతు నగరమును జయించి దానిని పునర్నిర్మాణము చేయించెను.

3. రాజగునప్పటికి ఉజ్జీయాకు పదునారేండ్లు. అతడు యెరూషలేము నుండి ఏబదిరెండేండ్లు పరిపాలించెను. అతని తల్లి యెరూషలేమునకు చెందిన యెకొల్యా.

4. ఆ రాజు తన తండ్రి అడుగుజాడలలో నడచి ప్రభువునకు ఇష్టుడయ్యెను.

5. దైవభక్తిగల జెకర్యా జీవించినంత కాలము అతడు ప్రభువును సేవించెను. ప్రభువు కూడ అతనిని ఆదరించెను.

6. ఉజ్జీయా ఫిలిస్తీయుల మీదికి యుద్ధమునకు పోయి వారి నగరములైన గాతు, యబ్నె, అష్దోదు ప్రాకారములను పడగొట్టించెను. అష్టోదు చెంతను, ఫిలిస్తీయ మండలమునందలి ఇతర స్థలమునందును సురక్షిత నగరములను నిర్మించెను.

7. ప్రభువు దీవెనతో అతడు ఫిలిస్తీయులను గూర్భాలున వసించు అరబ్బీయులను, మెయూనీయులను జయించెను.

8. అమ్మోనీయులు అతనికి కప్పముకట్టిరి. అతడు మహాబలసంపన్నుడు అయ్యెను. ఐగుప్తు సరిహద్దులలో కూడ అతని పేరు మారుమ్రోగెను.

9. ఆ రాజు యెరూషలేము నగరమున మూల ద్వారముచెంతను, లోయ ద్వారముచెంతను, ప్రాకా రము మలుపుతిరుగు తావునను ద్వారములను నిర్మించెను. వాని వలన నగరము సురక్షితమయ్యెను.

10. అతడు ఎడారియందు గూడ దుర్గములు నిర్మించెను. ఉజ్జీయాకు షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను విస్తారమైన పశువుల మందలు ఉండెడివి. కనుక అతడు చాల బావులను కూడ త్రవ్వించెను. అతనికి సేద్యమనిన ప్రీతి, కనుక అతనికి కొండలలో ద్రాక్షలను పెంచువారును మైదానములలో సారవంతమైన పొలములను సాగుచేయు వారును ఉండిరి.

11. ఉజ్జియాకు యుద్ధమునకు సిద్ధమైన సైన్యములుండెడివి. వానిని పటాలములుగా విభజించిరి. ఆ సైనికుల లెక్కలను కార్యదర్శి యెయీయేలు, అధికారి మాసెయా చూచుచుండెడివారు. రాజు సైన్యాధిపతులలో ఒకడైన హనన్యా ఆ సైన్యమునకు అధిపతి.

12. రెండువేల ఆరువందల మంది పరాక్రమశాలురు నాయకులుగా నుండిరి.

13. వారి క్రింద మూడు లక్షల ఏడు వేల ఐదువందల మంది యోధులుండిరి. వారెల్లరును రాజుపక్షమున శత్రువులతో పోరాడెడివారు.

14. ఉజ్జీయా ఈ సైనికులకు డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణములు, కవచములు, విల్లంబులు, ఒడిసెలరాళ్ళు సమకూర్చెడివాడు.

15. నిపుణులైన అతని ఉద్యోగులు యెరూషలేము ప్రాకారము మలుపులమీదను, కోట బురుజుల మీదను యంత్రములు అమర్చిరి. వానిద్వార పెద్ద రాళ్ళను బాణములను విసరవచ్చును. ఉజ్జీయా కీర్తి ఎల్లెడల వ్యాపించెను. అతడు దైవసహాయము వలన అద్భుతమైన బలమును సంపాదించెను.

16. ఆ రాజు బలవంతుడైన కొలది అతని గర్వము పెచ్చు పెరిగెను. ఆ పొగరువలననే అతడు పడిపోయెను. అతడు ప్రభువునకు భయపడక యావే మందిరములోనికి వెళ్ళి ధూపపీఠముపై ధూపము వేయుటకై తన దేవుడైన ప్రభువుమీద ద్రోహము చేయబోగా

17. యాజకుడైన అజర్యా మరియు ఎనుబది మంది ధైర్యముగల యాజకులు రాజువెంట దేవాలయము లోనికి పోయిరి.

18. వారు అతనిని వారించుచు 'రాజా! ప్రభువునకు సాంబ్రాణి పొగవేయుట నీ పని కాదు. ఇది అహరోను సంతతియై శుద్ధినిబడసిన యాజకులు చేయవలసిన కార్యము. కనుక నీవు దేవాలయము నుండి వెలుపలికి పొమ్ము. నీవు ప్రభువును ధిక్కరించితివి కనుక ఆయన అనుగ్రహమును కోల్పోయితివి” అని హెచ్చరించిరి.

19. ఉజ్జీయా ధూపకలశమును చేతబట్టుకొని దేవాలయమున ధూపపీఠము చెంత నిలుచుండియుండెను. అతడు యాజకుల మాటలు విని వారి మీద మండిపడెను. వెంటనే అతని నొసటిమీద కుష్ఠు పొటమరించెను.

20. అజర్యా మరియు ఇతర యాజకులు రాజువైపు చూడగా అతని నొసటికి కుష్ఠు సోకియుండెను. వెంటనే వారు అతనిని దేవాలయము నుండి బయటికి వెళ్ళగొట్టిరి. ప్రభువు తనను శిక్షించెను గనుక అతడే త్వరత్వరగ వెలుపలికి వెళ్ళిపోయెను.

21. ఉజ్జీయా ఆమరణాంతము కుష్ఠరోగిగా నుండెను. అతడు కుష్ఠరోగియై యావేమందిరము లోనికి పోకుండా ప్రత్యేకింపబడెను కనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంట్లో నివసించుచుండెను. అతనికి బదులుగా అతని కుమారుడు యోతాము రాజ్య వ్యవహారములను పరిశీలించుచు దేశమును ఏలెను.

22. ఉజ్జీయా చరితమున మిగిలిన అంశములు మొదటినుండి చివరివరకును ఆమోసు కుమారుడైన యెషయా లిఖించెను.

23. ఆ రాజు చనిపోగా అతనిని రాజశ్మశానభూమిలోనే పాతిపెట్టిరి. అతడు కుష్ఠరోగి కనుక పూర్వ రాజసమాధులలో మాత్రము పాతిపెట్టరైరి. అటుతర్వాత అతని పుత్రుడు యోతాము రాజయ్యెను.