1. సిద్నియా అతని యేలుబడి తొమ్మిదవ యేడు పదియవనెల పదియవనాడు నెబుకద్నెసరు సర్వసైన్యముతో వచ్చి యెరూషలేమును ముట్టడించెను.
2. బబులోనీయులు పట్టణము వెలుపల శిబిరము పన్నిరి. నగర ప్రాకారము చుట్టు ముట్టడిదిబ్బలు పోయించిరి. సిద్కియా యేలుబడి పదకొండవయేటి వరకు ముట్టడికొనసాగెను.
3. ఆ యేడు నాలుగవ నెల, తొమ్మిదవనాడు కరువు మిక్కుటముకాగా ప్రజలకు తిండి దొరకదయ్యెను.
4. అంతట కల్దీయ శత్రువులు ప్రాకారములను కూల్చివేసిరి, బబులోనీయులు నగరమును చుట్టుముట్టియున్నను యూదారాజు, రాణువ వారు రాత్రివేళ పలాయితులైరి. వారు రాజోద్యాన వనము ప్రక్కగా రెండుప్రాకారముల మధ్యనున్న ద్వారముగుండ తప్పించుకొని యోర్దాను లోయలోనికి పారిపోయిరి.
5. కాని కల్దీయుల సైన్యము వారి వెంటబడి యెరికో మైదానమున సిద్కియాను పట్టుకొనిరి. అతని సైనికులందరు సిద్కియాను విడిచి పారిపోయిరి.
6. వారు రాజును పట్టుకొని రిబ్లా యందు విడిది చేయుచున్న నెబుకద్నెసరు వద్దకు కొనిపోయిరి. అచట బబులోనియారాజు యూదా రాజునకు శిక్ష విధించెను.
7. నెబుకద్నెసరు ఆజ్ఞపై సిద్కియా కన్నుల ఎదుటనే అతని కుమారులను వధించిరి. అటుపిమ్మట అతని కన్నులను పెకలించిరి. అతనిని ఇత్తడిగొలుసులతో బంధించి బబులోనియాకు కొనిపోయిరి.
8. నెబుకద్నెసరు పరిపాలనాకాలము పందొమ్మిదవయేట ఐదవనెల ఏడవనాడు, బబులోనియా రాజునకు అంగరక్షకుడును అధిపతియునైన నెబూసరదాను యెరూషలేమున ప్రవేశించెను.
9. అతడు దేవాలయమును, రాజప్రాసాదమును, పట్టణములోని ప్రముఖుల ఇండ్లను తగులబెట్టించెను.
10. అతనితోనున్న కల్దీయ సైనికులు పురప్రాకారములను పడగొట్టిరి.
11. నెబూసరదాను పట్టణమున మిగిలియున్న జనమును, చేతిపనివారిని, బబులోనియా పక్షమును అవలంబించిన వారిని బబులోనియాకు కొనిపోయెను.
12. కొందరు పేదవారిని మాత్రము యూదాలోని ద్రాక్ష తోటలను, పొలమును సాగుచేయుటకు వదలి వేసెను.
13. బబులోనీయులు దేవాలయములోని కంచుస్తంభములను, దిమ్మలను, కంచు సముద్రమును ముక్కలు ముక్కలు చేసిరి. ఆ కంచునంతటిని బబులోనియాకు కొనిపోయిరి.
14. మరియు వారు బలిపీఠము మీది బూడిదనెత్తు గరిటెలను, పళ్ళెములను, దీప సామగ్రిని, పశుబలులు అర్పించునపుడు నెత్తురుపట్టు పాత్రలను, సాంబ్రాణి పొగ వేయుటకు వాడు గిన్నెలను, ఇంకను దేవాలయమున వాడు రకరకముల కంచు పరికరములను బబులోనియాకు తీసికొనిపోయిరి.
15. వెండి బంగారములతో చేసిన పరికరములన్నిటిని కొని పోయిరి. నిప్పుకణికలను కొనిపోవుటకు వాడు చిన్నచిన్న గరిటెలను, పాత్రలనుగూడ తీసికొని వెళ్ళిరి.
16. సొలోమోను చేయించిన కంచువస్తువులు అనగా రెండుస్తంభములు, దిమ్మలు, పెద్దకుంట తూకము వేయుటకు సాధ్యపడనివి.
17. ఆ రెండుస్తంభములు ఒకేరీతిగానుండెడివి. వానియెత్తు పదునెనిమిది మూరలు. వానిమీద మరల మూడుమూరల ఎత్తున దిమ్మలుండెడివి. ఆ దిమ్మలచుట్టు కంచుతో చేయ బడిన అల్లికలుండెడివి. వానిని కంచు దానిమ్మపండ్లతో అలంకరించిరి.
18. నెబూసరదాను ప్రధానయాజకుడైన సెరాయాను, ఉపయాజకుడైన సెఫన్యాను, మరి ముగ్గురు దేవాలయోద్యోగులను చెరగొనెను.
19. పట్టణములోని సైన్యాధిపతిని, నగరమున ఉన్న రాజు సలహాదారులను ఐదుగురిని, ఆయుధ స్థలములమీది అధిపతిని, కార్యదర్శిని మరియు అరువదిమంది ప్రముఖులను చెరబట్టెను.
20. వారినందరిని నెబూసరదాను బబులోనియారాజు నొద్దకు కొనిపోయెను. ఆ రాజు అప్పుడు హమాతునందలి రిబ్లా నగరమున విడిదిచేసియుండెను.
21. రాజు అట వారిని హింసించి చంపెను. ఆ రీతిగా యూదీయులు తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోబడిరి.
22. బబులోనియారాజు నెబుకద్నెసరు, షాఫాను మనుమడు, అహికాము కుమారుడునగు గెదల్యాను యూదా రాజ్యమునకు పాలకునిగా నియమించెను. యూదాసీమలో మిగిలియున్న వారికందరికి అతడు అధిపతి.
23. బబులోనీయులకు లొంగని సైనికులు, సైన్యాధిపతులు గెడల్యా యూదాకు అధికారి అయ్యెనని విని మిస్ఫాయొద్ద అతనిని కలిసికొనిరి. వీరు నెతన్యా కుమారుడగు యిష్మాయేలు, కారె కుమారుడైన యెహోనాను, తనుమెతు కుమారుడు సెరాయా, మాకతీయుడైన యసన్యా అనువారు.
24. గెదల్యా వారితో “మీరు బబులోనీయులకు వెరవనక్కరలేదు. ఈ సీమన వసించి బబులోనియా రాజునకు లొంగియుందురేని మీకు ఏ ఆపదయు వాటిల్లదు” అని శపథము చేసెను.
25. కాని ఆ యేడు ఏడవనెలలో రాజ వంశీయుడైన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడునగు యిష్మాయేలు పదిమందితో కలిసి మిస్ఫాకు వెళ్ళి గెదల్యాను సంహరించెను. అచట వసించుచున్న యూదులను మరియు కల్దీయులనుగూడ చంపెను.
26. అంతట యిస్రాయేలీయులు పేదలనక, ధనికులనక అందరు సేనాధిపతులతో సహా ఐగుప్తునకు పారిపోయిరి. వారు బబులోనీయులకు భయపడిరి.
27. యెహోయాకీను ప్రవాసకాలము ముప్పది యేడవ యేట పండ్రెండవ నెల ఇరువది యేడవనాడు ఎవీల్మెరోదకు బబులోనియాకు రాజయ్యెను. ఆ రాజు యూదారాజు యెహోయాకీనును క్షమించి అతనిని చెరనుండి విడిపించెను.
28. అతడు యెహోయాకీను మీద కరుణ జూపెను. నాడు ఆ దేశమున ప్రవాసములో నున్న రాజులందరికంటె అతనిని పెద్దచేసెను.
29. యెహోయాకీను ఖైదీ దుస్తులను తొలగించెను. నాటి నుండి యెహోయాకీను జీవితాంతమువరకు రాజ గృహముననే భుజించెను.
30. యెహోయాకీను బ్రతికియున్నంతకాలము రాజుచే నిర్ణయించబడిన అతని రోజువారి ఖర్చులకుగాను బబులోనీయులు సొమ్ము చెల్లించిరి.