1. యెహోయాకీము రాజుగానున్న కాలమున బబులోనియారాజైన నెబుకద్నెసరు యూదామీద దాడి చేసెను. యెహోయాకీము మూడేండ్లపాటు అతనికి లొంగియుండెను. ఆ మీదట తిరుగబడెను.
2. కాని ప్రభువు బాబిలోనియా, సిరియా, మోవాబు, అమ్మోను దేశములనుండి యూదామీదికి యుద్ధ సైన్యములను రప్పించెను. ప్రభువు తన భక్తులైన ప్రవక్తల ద్వారా నుడివినట్లే ఈ ఉపద్రవము కలిగెను.
3. ఇది అంతయు ప్రభువు ఆజ్ఞపై జరిగెను. మనష్షే పాపములకుగాను ప్రభువు యూదీయులను తన సమక్షము నుండి వెడలగొట్టనెంచెను.
4. పైగా ఆ రాజు యెరూషలేమున నిర్దోషుల నెత్తురు వరదగా పారించెనుగదా! ఆ దుష్కార్యమును ప్రభువు క్షమింపలేదు.
5. యెహోయాకీము చేసిన ఇతర కార్యములు యూదారాజుల చరితమున లిఖింపబడియేఉన్నవి.
6. అతడు చనిపోగా అతని కుమారుడు యెహోయాకీను రాజయ్యెను.
7. యూఫ్రటీసునది నుండి ఐగుప్తు నది వరకు ఐగుప్తురాజు వశమున నున్న భూభాగమంతటిని బబులోనురాజు జయించగా, ఐగుప్తురాజు మరెన్నటికిని తన దేశమునుండి బయటకు వెడలలేదు.
8. యెహోయాకీను పదునెనిమిదవ యేట రాజై యెరూషలేము నుండి మూడునెలలు మాత్రము పరిపాలించెను. యెరూషలేము నగరవాసి ఎల్నాతాను కుమార్తె నెహుష్టా అతని తల్లి.
9. ఆ రాజు గూడ తన పితరులవలె యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.
10. అతని కాలమున బబులోనియా నుండి నెబుకద్నెసరుయొక్క సైన్యాధిపతులు దండెత్తివచ్చి యెరూషలేమును ముట్టడించిరి.
11. సైన్యములు యెరూషలేమును ముట్టడించుచుండగా నెబుకద్నెసరు స్వయముగా వచ్చి నగరమును పట్టుకొనవచ్చెను.
12. యెహోయాకీను తనతల్లితో, సేవకులతో, ప్రాసాద సంరక్షకులతో, అధిపతులతో బబులోనియారాజునకు లోబడిపోయెను. ఆ రాజు తన పరిపాలనాకాలము ఎనిమిదవయేట యెహోయాకీనును బందీని చేసెను.
13. నెబుకద్నెసరు దేవాలయకోశాగారము నుండి, ప్రాసాదకోశాగారము నుండి సంపదనంతయు అపహరించుకొని బబులోనియాకు కొనిపోయెను. ప్రభువు నుడివినట్లే పూర్వము సొలోమోనురాజు దేవాలయముకొరకు చేయించిన బంగారు పాత్రలన్నిటిని పగులగొట్టించెను.
14. నెబుకద్నెసరు యెరూషలేము నగరవాసులను, రాజవంశీయులను, యుద్ధవీరులను మొత్తము పదివేలమందిని చెరగొని బబులోనియాకు కొనిపోయెను. ఇనుపపనిముట్లు తయారుచేయువారు మొదలైన చేతిపని వారినందరిని గూడ బందీలనుగా కొనిపోయెను. పేదసాదలను మాత్రమే యూదాలో ఉండనిచ్చెను.
15. యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని సేవకులను, ప్రముఖులైన పౌరులను చెరగొని తీసికొనిపోయెను.
16. ఆ రాజు యూదానుండి పరాక్రమవంతులను ఏడువేలమందిని, ఇనుప పనిముట్లు చేయు చేతిపని వారిలో వేయి మందిని బందీలుగా కొనిపోయెను. ఆ బందీలందరు కండబలము కలవారు. యుద్ధముచేయ సమర్థులు.
17. నెబుకద్నెసరు యెహోయాకీను పినతండ్రియైన మత్తాన్యాను యూదాకు రాజును చేసి అతనికి సిద్కియా అని క్రొత్త పేరు పెట్టెను.
18. సిద్కియా ఇరువది ఒకటవ యేట రాజై యెరూషలేము నుండి పదకొండు యేండ్లు పరిపాలించెను. లిబ్నా నగరవాసి యిర్మీయా కుమార్తె హమూతలు అతని తల్లి.
19. యెహోయాకీను వలెనే సిద్కియాకూడ యావే సహించని దుష్కార్యములు చేసెను.
20. యూదాప్రజలపై, యెరూషలేము నగరవాసులపై ప్రభువునకు కలిగిన కోపమునుబట్టి ఆయన తన సమక్షము నుండి వారిని గెంటివేయు వరకు బబులోనురాజుపై సిద్కియా తిరుగబడెను.