ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 23

 1. బిలాము బాలాకుతో “ఇక్కడ నాకొరకకు ఏడు పీఠములు నిర్మించి ఏడుఎడ్లను, ఏడుపొట్టేళ్ళను కొనిరమ్ము” అనెను.

2. బాలాకు అట్లే చేసెను. బాలాకు మరియు బిలాము ఒక్కొక్క పీఠముమీద ఒక్కొక్క ఎద్దును ఒక్కొక్క పొట్టేలును దహనబలిగా సమర్పించిరి.

3. అతడు బాలాకుతో “నీవు ఈ దహనబలుల యొద్దనే యుండుము. నేను వెళ్ళి ప్రభువు దర్శనమిచ్చునేమో చూచివచ్చెదను. ప్రభువు నాతో చెప్పినమాట నేను నీకు తెలియజెప్పెదను” అని పలికి తాను చెట్టుచేమలులేని ఒక కొండమీదికి ఎక్కిపోయెను.

4. దేవుడు బిలామునకు ప్రత్యక్షముకాగా అతడు “నేను నీకు ఏడుపీఠములు కట్టి ఒక్కొక్కదానిమీద ఒక్కొక్క ఎద్దును ఒక్కొక్క పొట్టేలును బలి యిచ్చితిని” అనెను.

5. ప్రభువు తన వాక్కును బిలాము నోట ఉంచి “నీవు వెళ్ళి బాలాకుకు నా సందేశమును వినిపింపుము” అని చెప్పెను.

6. బిలాము తిరిగి పోయిచూడగా బాలాకు, మోవాబీయ అధికారులు దహనబలి చెంతనే వేచియుండిరి.

7. బిలాము వారికి దైవవాక్కును ఉపమాన రీతిగా ఇమెరిగించెను: “మోవాబురాజగు బాలాకు ఆరాము నుండి తూర్పుకొండలనుండి నన్ను పిలిపించెను. అతడు 'రమ్ము! నామేలుకోరి  యాకోబును శపింపుము.  యిస్రాయేలు ప్రజలను దూషింపుము' అనెను.

8. కాని దేవుడు శపింపనివారిని నేనెట్లు శపింతును? దేవుడు దూషింపనివారిని నేనెట్లు దూషింతును?

9. నేను కొండకొమ్మునుండి యిస్రాయేలును చూచితిని. కొండలమీదినుండి వారి పొడగంటిని. ఆ ప్రజలు ఒక ప్రత్యేక జాతిగా మనువారు. వారికి ఇతర జాతులకు సాటిలేదు.

10. యాకోబు సంతతి భూరేణువుల వంటిది. యిస్రాయేలు సంఖ్య లెక్కలకు అందనిది. నేను నీతిమంతునివలె మరణింతునుగాక! నా అంత్యము వారిఅంత్యమువలె ఉండునుగాక!”

11. బాలాకు బిలాముతో “నీవు ఎంతపని చేసి తివి! నా శత్రువులను శపించుటకై నిన్నిచటకు పిలిపించితిని. కాని నీవు వారిని దీవించితివి” అనెను.

12. బిలాము అతనితో “ప్రభువు నా నోట ఉంచిన దానినే నేను తు.చ.తప్పక పలుకవలదా?” అని ప్రత్యుత్తరమిచ్చెను.

13. బాలాకు అతనితో “ఇంకొక తావునకు వెళ్ళుదము రమ్ము. అక్కడినుండి చూచినచో యిస్రాయేలీయులు అందరు కనిపింపరు, వారి చిట్ట చివరిభాగము మాత్రమే కనబడును. అచటినుండి నా కొరకు నీవు యిస్రాయేలీయులను శపింపవచ్చును” అనెను.

14. అతడు బిలామును' పిస్గా కొండమీది సోఫీము మైదానమునకు కొనిపోయెను. అక్కడను ఏడు పీఠములను గట్టి ఎడ్లను పొట్టేళ్ళలను దహనబలిగా సమర్పించెను.

15. బిలాము బాలాకుతో “నీవు ఈ బలుల వద్ద వేచియుండుము. నేను వెళ్ళి ప్రభువును కలసికొనివచ్చెదను” అనెను.

16. బిలామునకు దేవుడు ప్రత్యక్షమై తనవాక్కును అతనినోట ఉంచి “నీవు వెళ్ళి బాలాకుకు నా సందేశము వినిపింపుము” అనెను.

17. బిలాము తిరిగివచ్చి చూడగా బాలాకు, మోవాబు అధికారులు దహనబలిచెంతనే వేచియుండిరి. బాలాకు “దేవుడు నీతో ఏమి చెప్పెను?” అని అడిగెను.

18. బిలాము దైవవాక్కును ఉపమానరీతిగా ఇట్లేరిగించెను. “సిప్పోరు కుమారుడవగు బాలాకూ! నా పలుకులు సావధానముగా వినుము.

19. దేవుడు అసత్యమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపము పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన మాటయిచ్చి పనిచేయకుండునా? చేసిన ప్రమాణము నిలబెట్టుకొనకుండునా?

20. దేవుడు వారిని దీవింపుమనెను. దేవుడు దీవెనలను నేను కాదనగలనా?

21. యిస్రాయేలీయులకు ఏ ఆపదయు కలుగదు. వారికి ఏ బాధలును సంభవింపవు. ప్రభువు వారికి బాసటయై యుండును. వారు ఆయనను రాజుగా ఎన్నుకొనిరి.

22. ప్రభువు వారిని ఐగుప్తునుండి తోడ్కొనివచ్చెను. వారికి ప్రాపును, ప్రోపును' ఆయనయే

23. వాస్తవముగా మంత్రజాలము యాకోబు మీద పనిచేయదు. శకునములు యిస్రాయేలీయుల విషయములో నిస్సహాయకములు. 'దేవుడు యిస్రాయేలీయులయెడల ఎంతటి అద్భుత కార్యములను నిర్వహించెను'  అని సమస్తజాతులును చెప్పుకొందరు.

24. ఈ జనులు ఆడుసింహమువంటివారు సింహమువలె దుముకువారు. సింహము ఎరనుపట్టి మాంసమునుతిని, రక్తము త్రాగువరకు ఎట్లు విశ్రమింపదో, వీరును అట్టివారే”.

25. ఆ పలుకులు విని బాలాకు బిలాముతో “నీవు యిస్రాయేలును శపింపనొల్లవుగదా! కనీసము వారిని దీవింపకుము” అనెను.

26. బిలాము అతనితో “నేను ప్రభువు పలికించిన పలుకు పలుకక తప్పదు” అనెను.

27. బాలాకు బిలాముతో “మనము మరియొక తావునకు వెళ్ళుదము రమ్ము. అక్కడనుండియైనను దేవుడు నీచే శాపవచనములు పలికించునేమో!” అనెను.

28. అతడు బిలామును ఎడారికి ఎదుట నున్న పెయోరుకొండ శిఖరమునకు తీసికొని వెళ్ళెను.

29. బిలాము ఇక్కడ ఏడు పీఠములుకట్టి ఏడుఎడ్లను, ఏడుపొట్టేళ్ళను తెప్పింపుమనెను.

30. బాలాకు అట్లే చేసి ప్రతిపీఠముమీద ఒక ఎద్దును ఒక పొట్టేలును దహనబలిగా అర్పించెను.