ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 22

 1. అంతట యిస్రాయేలీయులు అచటినుండి కదలిపోయి మోవాబు మైదానమున విడిదిచేసిరి. ఈ తావు యోర్దానుకు తూర్పున, యెరికోకు ఎదుటివైపున కలదు.

2. యిస్రాయేలీయులు అమోరీయులను చిదుకకొట్టిరని విని సిప్పోరు కుమారుడగు బాలాకు మరియు అతని ప్రజలగు మోవాబీయులు భయపడిపోయిరి.

3. యిస్రాయేలీయుల సంఖ్యను చూచివారు మిక్కిలి జడిసిరి.

4. మోవాబీయులు మిద్యాను పెద్దలతో “ఎద్దు పొలములోని గడ్డిని మొదలంటా నాకివేసినట్లే ఈ యిస్రాయేలీయుల గుంపు మనమండలమును ధ్వంసము చేసితీరును” అనిరి. ఆ కాలమున సిప్పోరు కుమారుడగు బాలాకు మోవాబునకు రాజు.

5. అతడు బెయోరు కుమారుడగు బిలామును పిలుచుకొనివచ్చుటకై దూతలను పంపెను. బిలాము యూఫ్రటీసు నదీతీరమునగల మండలములోని తన జనులమధ్య పేతోరున వసించు చుండెను. “ఐగుప్తునుండి వచ్చినవారు నేల యీనినట్లు దేశమంతట వ్యాపించిరి. వారు నా మండలమును మ్రింగివేయ చూచుచున్నారు.

6. వారు మా కంటె బలవంతులు. కనుక నీవు వచ్చి నామేలుకోరి వీరిని శపింపవలయును. అటుల శాపముపాలయిన వారిని మేము జయించి వెడలగొట్టగలుగుదుమేమో. నీవు దీవించిన వారు దీవెనను, శపించిన వారు శాపమును పొందుదురని నేనెరుగుదును. చిత్తగించగలరు!" అని బాలాకు దూతలతో వర్తమానము పంపెను.

7. మోవాబు నాయకులు, విద్యానునాయకులు సోదె చెప్పినందుకు చెల్లింపవలసిన సొమ్ము తీసికొని పయనమై వచ్చిరి. వారు, బిలాము చెంతకు వచ్చి బాలాకు వర్తమానమును వినిపించిరి.

8. అతడు వారితో "మీరీరాత్రి ఇచటనే బసచేయుడు. ప్రభువు నాకు తెలియచేసిన విషయమును నేను మీకు తెలుపుదును” అనెను. కనుక మోవాబు అధికారులు బిలాము ఇంటనే విడిదిచేసిరి.

9. బిలామునకు దేవుడు ప్రత్యక్షమై "మీ యింటికి వచ్చిన యీ జనులు ఎవరు?” అని ప్రశ్నించెను.

10-11. బిలాము “ప్రభూ! ఐగుప్తునుండి వచ్చిన క్రొత్త ప్రజలు నేల యీనినట్లు దేశమంతటవ్యాపించిరి. నీవు వచ్చి నా మేలు గోరి వారిని శపింపవలయును. అట్లు శాపము పాలయిన వారిని మేము. జయించి వెడలగొట్ట గలుగుదుమేమో అని సిప్పోరు కుమారుడగు బాలాకు నాకు వర్తమానము పంపెను” అని చెప్పెను.

12. దేవుడు అతనితో “నీవు వీరితో పోవలదు. ఆ ప్రజలు నా వలన, దీవెనపొందిరి కావున నీవు వారిని శపింపరాదు” అని చెప్పెను.

13. కనుక మరునాటి ఉదయమున బాలాకు పంపిన అధికారులను చూచి, బిలాము “మీరు మీ దేశమునకు వెడలిపొండు. నన్ను మీ వెంటపంపుటకు ప్రభువు సమ్మతింపలేదు" అనెను.

14. కనుక మోవాబు అధికారులు బాలాకు వద్దకు తిరిగిపోయి బిలాము మా వెంటవచ్చుటకు అంగీకరింప లేదని తెలియజేసిరి.

15. బాలాకు పూర్వము కంటె గూడ గొప్పవారిని, మరి ఎక్కువమంది అధికారులను ఎన్నుకొని బిలాము నొద్దకు పంపెను.

16. వారు బిలాము ఇంటికి వచ్చి “నీవు నా వద్దకు వచ్చుటకు నిరాకరింపవలదు.

17. నేను నిన్ను ఘనముగా సన్మానించెదను. నీవేమి చేయుమన్నను చేసెదను. నీవు మాత్రము ఇచటికివచ్చి నా మేలుగోరి ఈ ప్రజలను శపింపవలయును” అని సిప్పోరు కుమారుడు బాలాకు పంపిన వర్తమానమును అతనికెరిగించిరి.

18. బిలాము వారితో “బాలాకు తన యింట నున్న వెండిబంగారములను త్రవ్వి నా నెత్తిని పెట్టినను, నేను దేవుడైన ప్రభువుమాట మీరి ఒక చిన్నపనియైనను చేయజాలను.

19. మునుపు వచ్చినవారివలె మీరును ఈ రాత్రికి ఇక్కడనే బసచేయుడు. ప్రభువు నాకేమైన తెలియజెప్పునేమో చూతము” అనెను.

20. ప్రభువు ఆ రాత్రి బిలామునకు ప్రత్యక్షమై "ఈ ప్రజలు నిన్ను పిలువవచ్చినచో నీవు వారివెంట వెళ్ళవచ్చును. కాని నేను నీతో చెప్పిన మాట ప్రకారమే నీవు చేయవలెను” అని చెప్పెను.

21. బిలాము ఉదయముననే లేచి తన గాడిదమీద జీను బిగించి మోవాబు అధికారులతో పయనమై వెళ్ళెను.

22. బిలాము తన గాడిదనెక్కి పోవుటను చూచి దేవుడు కోపపడెను. బిలాము తన సేవకులిద్దరిని వెంటనిడుకొని గాడిదనెక్కి పోవుచుండగా అతనిని ఆపుటకై ప్రభువుదూత త్రోవకడ్డముగా నిలిచెను.

23. ప్రభువుదూత కత్తిచాచి నిలబడి ఉండుట చూచిన ఆ గాడిద మార్గమునుండి వైదొలగి ప్రక్క పొలములోనికి పోయెను. బిలాము గాడిదను కఱ్ఱతో మోది మరల త్రోవకు మరలించెను.

24. రెండు ద్రాక్షతోటలకు నడుమ రెండు రాతిగోడలనడుమ మార్గము ఇరుకుగానున్నచోట ప్రభువుదూత గాడిదకు అడ్డముగా నిలిచెను.

25. ప్రభువుదూతను చూచి గాడిద గోడకు అదుముకొని పోగా బిలాము కాలు గోడను రాచుకొనిపోయెను. బిలాము మరల గాడిదను మోదెను.

26. ప్రభువుదూత ముందుకుకదలి మార్గము కుడి ఎడమలకు తప్పుకోలేనంత యిరుకుగా ఉన్న తావున గాడిదకు అడ్డముగా నిలబడెను.

27. గాడిద ఎదుటనున్న ప్రభువుదూతను చూచి నేలమీద చతికిలపడెను. బిలాము ఉగ్రుడై చేతికఱ్ఱతో దానిని చావ మోదెను,

28. అపుడు ప్రభువు గాడిదచే మాటలాడింపగా అది “నేను నీకేమి అపకారము చేసితిని? నన్నీరీతిని మూడుసారులు చావగొట్టనేల?” అని అడిగెను.

29. బిలాము దానితో “నీవు నన్ను గేలి చేయుచున్నావు. నా చేతిలోనే కత్తియున్న నిన్నీ పాటికి నరికివేసియుండెడి వాడను” అనెను.

30. గాడిద అతనితో “నేను నీవు ఇంతకాలమునుండి ప్రయాణమునకు వాడుకొనిన గాడిదను కానా? కాని నేనెప్పుడైనను ఈ విధముగా ప్రవర్తించితినా?” అని అడిగెను. అతడు “లేదు” అనెను.

31. అపుడు ప్రభువు బిలాము కన్నులు తెరచెను. అతడు కత్తినిదూసి త్రోవకెదురుగా నిలబడియున్న ప్రభువుదూతను జూచి నేలమీద బోరగిలపడెను.

32. ప్రభువుదూత అతనితో “నీవు గాడిదను ముమ్మారు చావమోదితివేల? నేను నీ త్రోవకు అడ్డుపడవచ్చితిని. నీ ప్రయాణము నాకు సమ్మతముకాదు.

33. నీ గాడిద నన్ను జూచి మూడుసార్లు తప్పుకొన్నది. కాదేని నేనీపాటికి నిన్నుచంపి, గాడిదను వదలివేసి యుండెడి వాడను” అనెను.

34. ప్రభువుదూతతో బిలాము “నేను తప్పుచేసితిని. నీవు నాకు అడ్డముగా నిలబడితివని నేను గుర్తింపలేదు. ఇపుడు నీవు వెళ్ళవద్దంటే నేను వెనుకకు తిరిగి పోయెదను” అనెను.

35. ప్రభువుదూత అతనితో “నీవు వీరితో వెళ్ళవచ్చును. కాని నీవు నేను చెప్పిన మాటలను మాత్రమే పలుకవలెను” అనెను. కనుక బిలాము బాలాకు పంపిన అధికారులతో సాగిపోయెను.

36. బిలాము వచ్చుచున్నాడని విని బాలాకు అతనికి ఎదురువెళ్ళెను. మోవాబు పొలిమేరలలో అర్నోను నదీతీరముననున్న ఆరు పట్టణమువద్ద అతడు బిలామును కలిసికొనెను.

37. బాలాకు అతనితో “నేను దూతలను పంపగా నీవు రానననేల? నేను నిన్ను ఘనముగా సన్మానింపలేననుకొంటివా?” అనెను.

38. బిలాము అతనితో “ఇపుడు వచ్చితిని గదా! ఏదైన చెప్పుటకు నాకు శక్తికలదా? నేను దేవుడు పలికించు పలుకులను మాత్రమే పలికెదనుసుమా!" అనెను.

39. బిలాము బాలాకుతో కలసి కిర్యతుహుజోతు చేరెను.

40. బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలి అర్పించెను. బిలామునకు అతనితోనున్న అధికారులకు బలిమాంసమును పంపెను. "

41. మరునాడు బాలాకు బిలామును బామోతు బాలు యొక్క ఎత్తైన స్థలముల మీదకు కొనివచ్చెను. అక్కడి నుండి బిలాము యిస్రాయేలు సైన్యము చిట్ట చివరి భాగము వరకునున్న జనులను చూడవలెనని అతడిని అక్కడికి ఎక్కించెను.