ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రాజులు రెండవ గ్రంధము 21

 1. మనష్షే రాజగునప్పటికి పండ్రెండేండ్లవాడు. అతడు యెరూషలేము నుండి యేబదియైదేండ్లు పరిపాలించెను. అతని తల్లి పేరు హెఫ్సీబా

2. యిస్రాయేలీయులు కనాను మండలమును ఆక్రమించుకొన్న కొలది ప్రభువు స్థానిక జాతులను అచ్చటినుండి వెడల గొట్టేనుగదా! మనష్షే ఆ జాతుల దురాచారములన్నిటిని అనుసరించెను.

3. ఆ రాజు తన తండ్రి పడగొట్టించిన ఉన్నతస్థలములమీది మందిరములను మరల నిర్మించెను. యిస్రాయేలు రాజు అహాబువలె అతడు బాలు దేవరకు బలిపీఠమును, అషేరా దేవతకు విగ్రహమును నెలకొల్పెను. నక్షత్రములకుగూడ మ్రొక్కెను.

4. యావే తన నామమునకు నివాస స్థానముగ ఎంచుకొనిన యెరూషలేము దేవళముననే మనష్షే అన్యదైవములకు బలిపీఠములు నెలకొల్పెను .

5. దేవాలయపు రెండు ప్రాంగణములందు నక్షత్రములకు బలిపీఠములు కట్టించెను.

6. అతడు తన కుమారుని దహనబలిగా సమర్పించెను. మాంత్రికులతో శకునములు చెప్పించుకొనెను. జ్యోతిష్కులను, భూతవైద్యులను సంప్రతించెను. ప్రభువునకు గిట్టని దుష్కార్యములుచేసి అతని కోపమును రెచ్చగొట్టెను.

7. అషేరా దేవత విగ్రహములను దేవాలయమున ప్రతిష్ఠించెను. గతమున ఈ దేవాలయమును గూర్చి ప్రభువు దావీదుతో, అతని కుమారుడు సొలోమోనుతో ఇట్లు నుడివియుండెను: “ఈ యెరూషలేమున, ఈ దేవాలయమున మీరు నన్ను పూజింపవలయును. యిస్రాయేలు దేశమున ఈ తావును, నేను స్వయముగా ఎన్నుకొంటిని.

8. యిస్రాయేలీయులు నా కట్టడలన్నిటిని పాటింతురేని, నా సేవకుడగు మోషే నియమించిన ఆజ్ఞలన్నిటిని అనుసరింతురేని, నేను యిస్రాయేలీయులను వారి పితరులకు ధారాదత్తము చేయబడిన నేలమీద నుండి వెడలగొట్టను.”

9. అయినను యూదావాసులు ప్రభువుమాట పాటింపలేదు. మనష్షే ప్రోద్బలమువలన యూదీయులు ప్రభువు వెడలగొట్టిన స్థానిక జాతులకంటె అధికముగా ఘోర పాపములు చేసిరి.

10. అపుడు ప్రభువు తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇట్లు నుడివెను:

11. “మనష్షే రాజు యిట్టి హేయమైన పనులు చేసెను. కనానీయుల కంటె గూడ కానిపనులు చేసెను. విగ్రహములను చేయించి యూదీయులను కూడ పాపమునకు పురికొల్పెను.

12. కనుక యిస్రాయేలు ప్రభుడనైన నేను యెరూషలేమును, యూదాను దారుణముగా శిక్షింతును. ఆ శిక్షను జూచి జనులెల్లరు విస్తుపోవుదురు.

13. సమరియాను కొలిచిన కొలత్రాడును, అహాబు వంశమును సరిచూసిన సూత్రపుగుండును యెరూషలేము మీదికి చాచుదును. యెరూషలేములోని జనులందరిని తుడిచి వేయుదును. ఆ పట్టణము తుడిచివేయబడి బోర్లించిన పళ్ళెరమువలె నగును.

14. ఇచట మిగిలియున్న జనమును చేయివిడుతును. వారిని శత్రువులవశము చేయుదును. శత్రువులు వారిని జయించి వారి దేశమును దోచు కొందురు.

15. ఈ ప్రజలు తమ పితరులు ఐగుప్తునుండి బయలుదేరి వచ్చిన నాటి నుండియు దుష్కార్యములు చేసి నా కోపమును రెచ్చగొట్టిరి గనుక నేను వారికి శాస్తి చేసి తీరుదును.”

16. మనష్షే చంపించిన నిరపరాధుల నెత్తురు యెరూషలేము వీధులలో వెల్లువలైపారెను. పైపెచ్చు అతడు యెరూషలేము ప్రజలను విగ్రహారాధనకు పురికొల్పి ప్రభువు రోషమును రెచ్చగొట్టెను.

17. మనష్షే చేసిన ఇతర కార్యములు, అతని దుష్కృత్యములు యూదా రాజులచరితమున లిఖింప బడియే ఉన్నవి.

18. మనష్షే చనిపోగా రాజోద్యాన వనమున పాతిపెట్టిరి. దానికి ఉస్సా ఉద్యానవనమని పేరు. అటు తరువాత అతని కుమారుడు ఆమోను రాజయ్యెను.

19. యూదాకు రాజగునప్పటికి ఆమోను ఇరువది రెండేండ్ల వాడు. అతడు యెరూషలేము నుండి రెండేండ్లు పరిపాలించెను. యోత్బా నగరమునకు చెందిన హారూసు పుత్రిక మెషుల్లెమెతు అతని తల్లి.

20. ఆమోను కూడ తన తండ్రివలె దుష్టుడై యావే ఒల్లని దుష్కార్యములు చేసెను.

21. తండ్రివలె అతడును విగ్రహములను పూజించెను.

22. తన పితరులు కొలిచిన యావేను అతడు కొలువలేదు. ప్రభువు ఆజ్ఞలను పాటింపలేదు.

23. కొలువుకాండ్రు ఆమోను మీద కుట్రపన్ని రాజసౌధముననే అతనిని వధించిరి.

24. కాని యూదా ప్రజలు ఆమోను హంతకులను వధించి అతని కుమారుడు యోషీయాను రాజును చేసిరి,

25. ఆమోను చేసిన ఇతర కార్యములు యూదారాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి.

26. ఆమోనును ఉస్సా ఉద్యానవనమున అతనికి కలిగిన సమాధి యందు అతనిని పూడ్చిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు యోషీయా రాజ్యమును ఏలెను.