ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సంఖ్యాకాండము చాప్టర్ 21

 1. కనాను మండలము దక్షిణ భాగమును పరిపాలించు కనానీయుడైన అరాదురాజు యిస్రాయేలీయులు అతారీము మీదుగా వచ్చుచున్నారని వినెను. అతడు వారిని ఎదుర్కొని కొందరిని చెర పట్టెను.

2. యిస్రాయేలీయులు ప్రభువునకు విన్నపము చేసి “నీవు ఈ ప్రజలను మా వశము చేసెదవేని మేము వీరి పట్టణములను శాపముపాలు చేసెదము” అని మ్రొక్కుకొనిరి.

3. ప్రభువు యిస్రాయేలీయుల మొరాలించి కనానీయులను వారివశము చేసెను. యిస్రాయేలీయులు వారిని వారి పట్టణములను సర్వనాశనము గావించిరి. కనుక ఆ తావునకు 'హోర్మా'' అని పేరు వచ్చెను.

4. యిస్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమును చుట్టిపోవలెనని రెల్లు సముద్రము త్రోవవెంట పయనమైపోయిరి. కాని ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోషేమీదను, దేవునిమీదను తిరుగబడిరి.

5. "నీవు మమ్ము ఐగుప్తునుండి తరలించుకొనిరానేల? ఈ ఎడారిలో చంపుటకే గదా! ఇచట అన్నపానీయములు ఏమియు లభించుటలేదు. ఈ రుచిపచిలేని ఈ ఆహారము మాకు అసహ్యమైనది” అని గొణగుకొనిరి.

6. అపుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటువలన ప్రజలు చాలమంది మరణించిరి.

7. అంతట వారు మోషే వద్దకు వచ్చి “మేము నీకును, దేవునికిని ఎదురుమాట్లాడి తప్పుచేసితిమి. నీవు ప్రభువునకు విన్నపముచేసి ఈ పాములబెడద తొలగింపుము” అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవిచేసెను.

8. ప్రభువు మోషేతో “తాపకరమైన సర్పమువంటి రూపమునుచేసి, గడెమీద తగిలింపుము. పాము కరచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు” అని చెప్పెను.

9. కనుక మోషే కంచుసర్పముచేసి, గడె కఱ్ఱ మీద తగిలించెను. పాము కరచినవారు ఆ కంచుసర్పమును చూచి చావును తప్పించుకొనిరి.

10. యిస్రాయేలీయులు ప్రయాణము సాగించి ఓబోతు దగ్గర విడిదిచేసిరి.

11. అచటినుండి కదలి మోవాబీయుల మండలమునకు తూర్పున ఈయ్యె - అబారీము వద్ద శిబిరము పన్నిరి.

12. అచటినుండి బయలుదేరి సేరెదు లోయలో విడిదిచేసిరి.

13. అచటినుండి కదలి అర్నోను నదికి ఉత్తరమున దిగిరి. ఈ ఎడారిభాగము అమోరీయుల సీమవరకు పోవును. అర్నోను నది మోవాబీయులకు, అమోరీయులకు మధ్యనుండు సరిహద్దు.

14-15. కనుకనే “ప్రభువు యుద్ధములు" అను గ్రంథమున “సూఫా మండలము లోని వాహెబు పట్టణమును, అర్నోను లోయలోని ఆరు పట్టణము వరకును, మోవాబు సీమ వరకును వ్యాపించియున్న లోయ అంచున ప్రవహించు యేరుల మడుగులను పట్టుకొనెను” అనుమాట పేర్కొనబడి యున్నది.

16. అక్కడి నుండి కదలి యిస్రాయేలీయులు బెయేరు' కు వెళ్ళిరి. అక్కడ ప్రభువు మోషేతో "ప్రజలను ప్రోగుచేయుము. నేను వారికి జలమును ఇచ్చె దను” అని చెప్పెను.

17-18. అపుడు యిస్రాయేలీయులు ఈ విధముగా పాటపాడిరి. “బావినిగూర్చి పాటపాడుడు, ఉబికే ఊటకు గానము చేయుడు. ఆ ప్రజానాయకులు బావిని త్రవ్విరి, దొరలు నూతిని త్రవ్విరి. రాజదండముతో, చేతి కఱ్ఱలతో వారు నూతిని త్రవ్విరి”.

19. అంతటవారు ఆ ఎడారినుండి మట్టానాకును, అక్కడినుండి నహాలియేలుకును, అక్కడినుండి బామోతునకును ప్రయాణము చేసిరి.

20. మోవాబీయుల సీమయందలి లోయలోనున్న బామోతునుండి ఎడారికి ఎదురుగానున్న పికొండపైకి చేరిరి.

21-22. యిస్రాయేలీయులు, అమోరీయుల రాజగు సీహోను నొద్దకు దూతలను పంపి, “మమ్ము మీ దేశముగుండ ప్రయాణము చేయనిండు. మేము మీ పొలములలోను, ద్రాక్షతోటలలోను అడుగు పెట్టము. మీ నూతులనుండి నీళ్ళు త్రాగము. మీ పొలి మేరలు దాటువరకు రాజమార్గమునుండి బెత్తెడైనను కదలము” అని వర్తమానము పంపిరి.

23. కాని సీహోను యిస్రాయేలీయులు తన దేశముగుండ ప్రయాణము చేయుటకు అంగీకరింపలేదు. అతడు తన జనమును ప్రోగుజేసికొని వచ్చి ఎడారిలోనున్న యాహాసు వద్ద యిస్రాయేలీయులను ఎదిరించెను.

24. యిస్రాయేలీయులు అమోరీయులను చాలమందిని మట్టుబెట్టిరి. అర్నోను నది నుండి యబ్బోకు వరకు, అమ్మోనీయుల సరిహద్దుననున్న యాసేరు వరకు అమోరీయుల రాష్ట్రమును ఆక్ర మించుకొనిరి. అమ్మోనీయుల సరిహద్దు కట్టుదిట్టమైనది.

25. ఈరీతిగా యిస్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నింటిని జయించిరి. హెష్బోనును దాని సమీపముననున్న నగరములను వశము చేసికొనిరి. ఆ పట్టణములందును చుట్టుప్రక్కల గ్రామములందును వసించిరి.

26. హెష్బోను అమోరీయరాజగు సీహోనునకు రాజధాని. అతడు మోవాబీయుల రాజును ఓడించి అర్నోను నది వరకు ఆ రాజు రాజ్యమును ఆక్రమించుకొనెను.

27. కనుకనే సామెతలు వల్లించు వారు ఈ క్రింది రీతిగా పాడిరి. “సీహోను రాజధాని హెష్బోనునకు రండు, దానిని మరల నిర్మింతము.

28. ఈ నగరము నుండి సీహోను సైన్యము అగ్నివలె వెడలెను. ఆ నిప్పు మోవాబులోని ఆరు పట్టణమును కాల్చివేసెను. అర్నోను కొండలను మసిచేసెను.

29. కేమోషును ఆరాధించు మోవాబీయులారా! మీకు వినాశనము దాపురించినది! మీరు కొలుచు దేవుడు మీ స్త్రీ పురుషులను అమోరీయ రాజైన సీహోనునకు చెరపట్టిన వారినిగా చేసెను.

30. హెష్బోను నుండి దీబోను వరకు నాషీము నుండి మేడెబా దాపునగల నోఫావరకు నిప్పుమంటలు వ్యాపింపగా అందరును సర్వనాశనమైరికదా!”

31. యిస్రాయేలీయులు అమోరీయుల రాష్ట్రమున స్థిరపడిరి.

32. మోషే యాసేరు. పట్టణమునకు వేగులవాండ్రను పంపెను. యిస్రాయేలీయులు ఆ పట్టణమును దాని పరిసరములందున్న పురములను జయించి అక్కడ వసించుచున్న అమోరీయులను వెడలగొట్టిరి.

33. అటుపిమ్మట యిస్రాయేలీయులు బాషాను మార్గమును పట్టిపోయిరి. బాషాను రాజు ఓగు తన జనముతో వచ్చి ఎద్రేయివద్ద యిస్రాయేలీయులను ఎదిరించెను.

34. ప్రభువు మోషేతో “భయపడకుము. ఈ రాజును, ఇతని జనమును, ఇతని దేశమును నీ వశము చేసితిని. హెష్బోనున వసించిన అమోరీయుల రాజు సీహోనును వలె ఇతనిని గూడ అణచివేయుడు” అని చెప్పెను.

35. యిస్రాయేలీయులు ఓరు. రాజును అతని కుమారులను, అతని ప్రజలను సంహరించిరి. వారి రాజ్యమును ఆక్రమించుకొనిరి.