1. తనయొద్ద గుఱ్ఱములను, రథములను సమకూర్చుకొనిన ముప్పది ఇద్దరు రాజులు తోడుగా నుండ సిరియా రాజు బెన్హ్-దదు సైన్యమును ప్రోగు చేసుకొని సమరియాను ముట్టడించి వశము చేసికో పోయెను.
2. అతడు సమరియా పట్టణమందున్న యిస్రాయేలు రాజు అహాబు వద్దకు దూతనంపి “బెన్హ్-దదు ఆజ్ఞ ఇది.
3. నీ ఇంటనున్న వెండిబంగారములు, నీ భార్యలలోను, పిల్లలలోను సొగసైనవారు నా వారు” అని వార్త చెప్పించెను.
4. అందులకు అహాబు “నేను నీ ఆజ్ఞకు బద్దుడను. నేనును, నా సమస్తమును నీ సొత్తే” అని ప్రతివార్త పంపెను.
5. కాని సిరియా రాజు దూతలు ఆ ప్రతివార్తనందించి, అహాబువద్దకు మరల తిరిగివచ్చి “బెన్హ్-దదు ఆజ్ఞ ఇది. నీ వెండి బంగారములను, నీ భార్యలను బిడ్డలను నా వశము చేయవలయును.
6. రేపీపాటికి నా సేవకులు నీ వద్దకువత్తురు. వారు నీ ప్రాసాదమును, నీ ఉద్యోగుల భవనములను గాలించి నీ కంటికి విలువగల వానినెల్ల తీసికొందురు” అని చెప్పిరి.
7. అహాబు యిస్రాయేలు నాయకులనందరిని పిలిపించి “చూచితిరా! ఇతడు మనలను నాశనము చేయతలపెట్టెను. నేనితనికి వెండి బంగారములు మరియు భార్యలను, పిల్లలను వశము చేయననలేదు. ఇతడెట్లు హానిచేయ తలపెట్టుచున్నాడో తెలిసికొనుడు” అని పలికెను.
8. ఆ మాటలకు పెద్దలు, ప్రజలు “నీవు సిరియా రాజును లెక్కచేయవద్దు. అతనాజ్ఞను పాటింపవద్దు” అని సలహా ఇచ్చిరి.
9. కనుక అతడు బెన్హ్-దదు దూతలతో "మీ రాజునకిట్లు విన్నవింపుడు. నీ మొదటి ఆజ్ఞను నేనంగీకరించెదను. కాని రెండవ ఆజ్ఞనంగీకరింపజాలను” అనెను.
10. అప్పుడు బెన్హ్-దదు “నేను విస్తార సైన్యముతో వచ్చి నీ పట్టణమును నాశనము చేయుదును. నా సైనికులు నీ నగరమునందు రాళ్ళముక్కలను గూడ మిగులనీయరు. ఇట్లు చేయనేని దేవతలు నా ప్రాణములను బలిగొందురు” అని అహాబునకు ప్రతివార్త పంపెను.
11. యిస్రాయేలు రాజు “కవచమును తాల్చినవాడుకాదు, దానిని విప్పినవాడు శూరుడు” అని అతనికి మరల వార్తపంపెను.
12. బెన్హ్-దదు అతని అనుచరులగు రాజులు శిబిరములలో కూర్చుండి మద్యమును సేవించుచుండగా అహాబు పంపిన వార్త చేరెను. వెంటనే బెన్హ్-దదు తన సైనికులు శత్రుపట్టణమును ముట్టడించుటకు సిద్ధము కావలెనని ఆజ్ఞ ఇచ్చెను. సైనికులందరు యుద్ధమునకు సన్నద్ధులైరి.
13. అంతట ఒక ప్రవక్త యిస్రాయేలు రాజు నొద్దకు వచ్చి “యావే సందేశమిది. నీవు ఈ మహా సైన్యమును చూచి భయపడుచున్నావు కాబోలు. నేడే నీవు ఈ శత్రుబలమును జయింతువు. అప్పుడుగాని నేనే ప్రభుడనని నీవు గుర్తింపజాలవు” అని పలికెను.
14. అహాబు “నాకెవరి సహాయము వలన విజయము సిద్దించును?” అని ప్రశ్నించెను. ప్రవక్త “రాష్ట్రపాలకుల అధీనముననున్న యువ సైనికులు నీకు తోడ్పడుదురు” అని చెప్పెను. రాజు “ఈ యుద్ధమున సేనానాయకుడు ఎవడు?” అని అడుగగా ప్రవక్త “నీవే' అని జవాబిచ్చెను.
15. అహాబు ఆ యువ సైనికులను పరిశీలింపగా వారు రెండువందలముప్పదిఇద్దరుండిరి. అటుతరువాత అతడు యిస్రాయేలు సైన్యమును పరిశీలించి చూడగా ఏడువేలమంది తేలిరి.
16. ఆనాడు మధ్యాహ్నము యుద్ధము ప్రారంభమయ్యెను. అప్పుడు బెన్హ్-దదు అతని అనుచరులు ముప్పది ఇద్దరు రాజులు శిబిరములలో తప్పతాగి మత్తెక్కి ఉండిరి.
17. పోరు మొదలుకాగా, యువ సైనికులు ముందునడచిరి. సమరియానుండి కొందరు సైనికులు వచ్చుచున్నారని గూఢాచారులు బెన్హ్-దదునకు విన్నవించిరి.
18. పోరాటము కొరకొచ్చి నను, సంధికొరకొచ్చినను వారిని ప్రాణములతో పట్టి తీసుకొనిరండని బెన్హ్-దదు ఆజ్ఞ ఇచ్చెను.
19-20. యువ సైనికులు ముందునడువ యిస్రాయేలు సైన్యము వారివెంటనడచెను. వారందరు ఎవరికి ఎదురైన శత్రు సైనికులను వారు చంపివేసిరి. వారిదాడికి నిలువలేక సిరియా సైన్యము పారిపోయెను. యిస్రాయేలు సైన్యము వారిని వెన్నాడెను. బెన్హ్-దదు కొందరు రౌతులు వెంటరాగా గుఱ్ఱమునెక్కి పలాయితుడయ్యెను.
21. యిస్రాయేలు రాజు సిరియారాజు రథములను, గుఱ్ఱములను పట్టుకొనెను. సిరియారాజుకు పెద్ద ఓటమి కలిగెను.
22. అంతట ప్రవక్త అహాబునొద్దకు వచ్చి “నీవు ఇక ఇంటికి వెడలిపోయి నీ సైన్యమును బలపరచుకొ నుము. యుద్ధసన్నాహములు చేయుము. రానున్నయేడు సిరియా రాజు మరల నీపైకి దండెత్తివచ్చును” అని చెప్పెను.
23. అట సిరియారాజు బంటులు అతనితో “యిస్రాయేలు దేవుడు కొండలదేవుడు. కావుననే వారికి మనకంటె అధికబలము కలిగినది. మైదానమున పోరాడెదమేని మనము వారిని జయింపవచ్చును.
24. నీవు ఈ రాజులందరిని వదలించుకొని వీరికి బదులుగా సేనానాయకులను మన సైన్యమునకు అధిపతులుగా నియమింపుము.
25. నిన్ను వదలి పారిపోయినంత సైన్యమునే మరల ప్రోగుచేయుము. అన్ని గుఱ్ఱములను, అన్ని రథములను సమకూర్చు కొనుము. మేము యిస్రాయేలీయులతో మైదానమున పోరాడి వారిని జయింతుము” అనిరి. ఆ ఉపదేశమును విని రాజు వారు చెప్పినట్లే చేసెను.
26. మరుసటి ఏడు బెన్హ్-దదు సిరియా సైనికులను ప్రోగుచేసికొనివచ్చి ఆఫెకువద్ద యిస్రాయేలీయుల నెదిరించెను.
27. యిస్రాయేలీయులు, వారినెదుర్కొన వచ్చి శత్రుసైన్యమునెదుట రెండుదండులుగా విడిది చేసిరి. పొలమున విస్తారముగా వ్యాపించియున్న సిరియా సైన్యముతో పోల్చి చూడగా యిస్రాయేలు దండులు రెండు మేకలమందలవలె కనిపించెను.
28. అప్పుడొక ప్రవక్త అహాబునొద్దకు వచ్చి “యావే సందేశమిది. సిరియనులు నేను కొండల దేవుడననియు, మైదానము దేవుడను కాననియు పలికిరి. వారి మహాసైన్యమును నేను మీ వశము చేసెదను. అప్పుడు నీవు నీ ప్రజలు నేనే ప్రభుడనని గుర్తింతురు” అని చెప్పెను.
29. ఏడుదినములపాటు ఆ సైనికదళములు రెండు ఒకదానియెదుట ఒకటి మోహరించి యుండెను. ఏడవదినమున యుద్దము మొదలాయెను. యిస్రాయేలీయులు సిరియా బంటులను లక్షమందిని చంపిరి.
30. మిగిలినవారు ఆఫెకు పట్టణమునకు పారిపోగా అచట ప్రాకారములు కూలిపడి ఇరువది ఏడువేలమంది చనిపోయిరి. బెన్హ్-దదు పట్టణమునకు పారిపోయి అట ఒక ఇంటిలోపలి గదిలో దాగుకొనెను.
31. ఆ రాజోద్యోగులు అతనితో "అయ్యా! యిస్రాయేలు ప్రభువులు దయాపరులని వింటిమి. మేము నడుమునకు గోనె కట్టుకొని, తలమీద త్రాళ్ళు వేసికొని, యిస్రాయేలు రాజు శరణుజొచ్చెదము. అతడు నిన్ను ప్రాణములతో విడువవచ్చును” అని పలికిరి.
32. రాజు అనుమతిపై వారట్లే అహాబు వద్దకు వెళ్ళి “నీ దాసుడు బెన్హ్-దదు ప్రాణభిక్ష వేడుచున్నాడు” అని పలికిరి. అహాబు “బెన్హ్-దదు ఇంకను బ్రతికియున్నాడా? సరియే, అతడు నాకు సోదరునివంటివాడు” అనెను.
33. ఆ ఉద్యో గులు ఏదైన శుభసమాచారము విన్పించునేమో అని కనిపెట్టుకొనియున్నవారగుటచే, అహాబు ఈ మాటలు పలుకగనే “అవును, బెన్హ్-దదు నీకు సోదరునివంటి వాడు” అని బదులుపలికిరి. రాజు “మీరు పోయి బెన్హ్-దదును తోడ్కొనిరండు” అనగా వారు వెడలిపోయి అతనిని వెంటబెట్టుకొని వచ్చిరి. బెన్హ్-దదు రాగానే అహాబు అతనిని తన రథముమీదికి ఎక్కించుకొనెను.
34. అతడు అహాబుతో “మాతండ్రి మీ తండ్రి యెద్ద నుండి స్వాధీనము చేసికొనిన పట్టణములను తిరిగి నీకిచ్చివేయుదును. మా తండ్రి మీ సమరియాలో వర్తక కేంద్రమును నెలకొల్పినట్లే, నీవును మా దమస్కున వర్తకకేంద్రము నెలకొల్పుకోవచ్చును” అనెను. అహాబు “ఈ షరతులపై నిన్ను స్వేచ్ఛగా వెడలిపోనిత్తును” అనెను. ఆ రీతిగా అహాబు బెన్హ్-దదుతో సంధిచేసికొని అతనిని స్వేచ్ఛగా వెళ్ళిపోనిచ్చెను.
35. అంతట యావే ఆజ్ఞపై, ప్రవక్తల సమాజమునకు చెందిన ప్రవక్తయొకడు తోడిప్రవక్తతో “నీవు నన్నుకొట్టుము” అనెను. కాని తోడి ప్రవక్త అతనిని కొట్టడయ్యెను.
36. అపుడు మొదటి ప్రవక్త రెండవ వానితో “నీవు యావే ఆజ్ఞ మీరితివి కనుక నన్ను వీడి వెళ్ళిపోగానే సింహము నిన్ను చంపివేయును” అని చెప్పెను. ఆ రెండవప్రవక్త మొదటి ప్రవక్తను వీడి వెళ్ళిపోగానే ఒక సింహము అతనిమీదబడి వానిని చంపివేసెను.
37. మొదటి ప్రవక్త మరల వేరొకని వద్దకు వెళ్ళి “నన్ను కొట్టుము” అనెను. ఆ రెండవవాడు అతనిని కొట్టి గాయపరచెను.
38. గాయపడిన ప్రవక్త తన్ను గుర్తించుటకు వీలుకానట్లు ముఖమునకు గుడ్డతో కట్టుకట్టుకొని పోయి రాజపథమున నిలబడి రాజు రాకకై ఎదురుచూచుచుండెను.
39. అంతట అహాబు ఆ మార్గమున రాగా అతడు రాజును గొంతెత్తి పిలిచి “ప్రభూ! నేను యుద్ధమున పోరాడుచుండగా తోడి సైనికుడు శత్రు సైనికునొకనిని చెరపట్టి నా వద్దకు కొనివచ్చెను 'నీవు వీనికి కావలి కాయుము. వీడు తప్పించుకొని పోయెనేని వీని ప్రాణములకు మారుగా నీ ప్రాణము పోవును, లేదా నీవు మూడువేల వెండినాణెములైన చెల్లింపవలెను' అని చెప్పెను.
40. కాని ఈ దాసుడు ఏదో పనిలో చిక్కు కొని కొంచెము ఏమరియుండగా శత్రు సైనికుడు తప్పించుకొని పోయెను” అని చెప్పెను. అహాబు అతనితో “ఇకనేమి, నీ శిక్షను నీవే నిర్ణయించుకొంటివి. అపరాధము చెల్లింపుము” అనెను.
41. వెంటనే అతడు తన ముఖముమీది కట్టువిప్పగా రాజు అతడు ప్రవక్తయని గ్రహించెను.
42. అంతట ప్రవక్త రాజుతో “యావే సందేశమిది. నేను శాపము పాలుచేసి చంపివేయుమని చెప్పిన నరుని నీవు ప్రాణములతో పోనిచ్చితివి. కనుక అతని ప్రాణమునకు బదులుగా నీ ప్రాణము చెల్లింతువుగాక! అతని సైనికులకు మారుగా నీ సైనికులు ప్రాణములు కోల్పోవుదురు” అని పలికెను.
43. ఆ మాటలు విని రాజు విచారముతో ముఖము చిన్నపుచ్చుకొని సమరియా నగరమందలి తన మేడకు వెడలిపోయెను.